10.1 ప్రథమ పరిచ్ఛేదం సింథీ బ్రహ్మసమాజ భక్తులతో శ్రీరామకృష్ణులు
ఏప్రెల్ 22, 1883
పౌర్ణమి సాయంత్రం సమయం. బ్రహ్మసమాజపు అర్ధవార్షికోత్సవ సందర్భంగా శ్రీరామకృష్ణులు కలకత్తా సమీపంలోని సింథీ వద్దగల వేణీమాధవ పాల్ ఉద్యాన గృహానికి ఏతెంచారు. బ్రహ్మసమాజ భక్తులు అనేకులు వచ్చారు. వారందరూ దక్షిణ వసారాలో శ్రీరామకృష్ణులను పరివేష్టించి కూర్చున్నారు. సంధ్యానంతరం ఆది బ్రహ్మసమాజపు ఆచార్యుడైన శ్రీ బేచారం ఉపాసన ప్రారంభిస్తాడు.
బ్రహ్మసమాజ సభ్యులు మధ్యమధ్యలో శ్రీరామకృష్ణులను ప్రశ్నలు అడుగుతున్నారు.
ఒక బ్రహ్మ భక్తుడు: మహాశయా, మార్గాంతరం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: భగవంతుని పట్ల అనురాగమే మార్గాంతరం, అంటే భగవత్ అనురాగమే. ఆయనను ప్రేమించడం; ఇంకా, ఆయనను ప్రార్థించాలి.
భక్తుడు: అనురాగమా లేక ప్రార్థనా?
శ్రీరామకృష్ణులు: ప్రథమంగా అనురాగం, ఆ తరువాత ప్రార్థన.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు రాగయుక్తంగా ఒక పాట పాడారు:
అమ్మా! శ్యామా! యని నీ వార్తితో
ఆక్రోశించిన ఓ మనసా
ఆవేదన గని ఆగగల్గునా
అమ్మ శ్యామ నీ కగుపడకుండగ…………….
కొనసాగిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా పలికారు: “సర్వదా భగవన్నామ గుణకీర్తన, ప్రార్థన చేస్తూ ఉండాలి. పాత లోహపాత్రను నిత్యం తోమాలి. ఒక్క రోజు తోమినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? అంతేగాక, వివేక వైరాగ్యాలను అభ్యసించాలి. సంసారం అనిత్యం అన్న బోధకలగాలి.”
10.1.1 సంసార త్యాగం – సంసారంలో నిష్కామ కర్మ
బ్రహ్మభక్తుడు: సంసారాన్ని పరిత్యజించటం మంచిదేనంటారా?
శ్రీరామకృష్ణులు: సంసార త్యాగం అందరికీ వర్తించదు. భోగతృష్ణల అంతం చూడని వారు సంసారాన్ని త్యజించరాదు. రెండు అణాల విలువచేసే మద్యం త్రాగితే నిషా ఎక్కుతుందా ఏమిటి?
బ్రహ్మభక్తుడు: అటువంటప్పుడు వారు సంసార జీవితమే గడపాలా?
శ్రీరామకృష్ణులు: అవును. వారు అనురక్తి రహితంగా తమ విధ్యుక్త కర్తవ్యాలను నిర్వర్తించాలి. నూనె రాసుకొని పనస తొనలను వొలిస్తే చేతికి జిగట అంటుకోని రీతిలో. ధనవంతుడి ఇంట్లో దాసి తన పనులన్నీ నిర్వర్తిస్తుంది; కాని ఆమె మనస్సు గ్రామంలోని తన కుటుంబం మీదే ఉంటుంది. అనురక్తిరహితంగా కర్తవ్యాలను నిర్వర్తించడానికి ఇదొక ఉదాహరణ. ఇదే మానసిక పరిత్యాగం. మీరు సంసారాన్ని మానసికంగా పరిత్యజించాలి. కాని సన్న్యాసి ప్రపంచాన్ని బాహ్యంగాను, అంతరంగానూ – రెండిటా త్యజించాలి.
10.1.2 భోగతృష్ణల అంతం – ‘విద్యా స్త్రీ’ లక్షణం – వైరాగ్యం ఎప్పుడు వస్తుంది?
బ్రహ్మభక్తుడు: ‘భోగతృష్ణల అంతం’ అంటే అర్థం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: విషయ భోగాలంటే – కామినీ కాంచన భోగాలు. ఊరగాయ జాడీలు, నీటి బుంగలు ఉంచిన గదిలో సన్నిపాత (టైఫాయిడ్) రోగిని ఉంచటం ప్రమాదం కదా! సిరిసంపదలు, పేరుప్రతిష్ఠలు, దేహసుఖాలు ఇత్యాది భోగాలను ఒకసారి అనుభవించకుండానే, భోగతృష్ణల అంతం కాకుండానే అందరికీ భగవంతుని కోసం వ్యాకులత జనించదు.
బ్రహ్మ భక్తుడు: నిజానికి స్త్రీలు చెడ్డవారా లేక పురుషులా?
శ్రీరామకృష్ణులు: విద్యారూపిణులైన స్త్రీలూ ఉన్నారు, అవిద్యారూపిణులైన స్త్రీలూ ఉన్నారు. విద్యారూపిణులైన స్త్రీలు, పురుషుణ్ణి భగవంతుని వైపుగా తీసుకునిపోతారు. కాని అవిద్యారూపిణులు పురుషుణ్ణి, భగవంతుని మరపింపచేసి సంసార సాగరంలో ముంచివేస్తారు.
“భగవంతుని మహామాయ ద్వారా ఈ జగత్తు సృజించబడింది. మహామాయలో విద్యామాయ, అవిద్యామాయ రెండూ ఉన్నాయి. విద్యామాయను ఆశ్రయిస్తే సాధుసంగం, జ్ఞానం, భక్తి, ప్రేమ, వైరాగ్యం మొదలైన సద్గుణాలు అలవడతాయి. అవిద్యామాయ – అంటే పంచభూతాలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఐదు ఇంద్రియ విషయాలు, ఇంకా ఇతర భోగ్యవస్తువులన్నీ – ఇవి భగవంతుని మరపింప చేస్తాయి.”
బ్రహ్మభక్తుడు: అవిద్యాశక్తి అజ్ఞానానికి హేతువు అయినప్పుడు, భగవంతుడు దాన్ని ఎందుకు సృష్టించాడు?
శ్రీరామకృష్ణులు: అదే ఆయన లీల. చీకటి లేకుంటే వెలుగు మహిమను ప్రశంసించలేము. దుఃఖం లేకుంటే సుఖం విలువను గ్రహించలేము. ‘చెడు’ అన్న ఎరుక ఉన్నప్పుడే ‘మంచి’ ని కూడా ఎరుగ గలుగుతాం. మామిడి కాయ పెద్దదై పండటం దానిని ఆవరించి ఉన్న తొక్క వలననే. మామిడి పండు పూర్తిగా పండి తినటానికి తయారై ఉన్నప్పుడు దాని తొక్కను దూరంగా పారవేస్తాం. మాయ అనే తొక్క ఆవరించి ఉన్నందునే క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి వీలు కలుగుతుంది. విద్యామాయ, అవిద్యామాయలు మామిడిపండు, తొక్కతో పోల్చదగినవి. రెండూ అవసరమే.
బ్రహ్మ భక్తుడు: మహాశయా, సాకారోపాసన, మట్టితో విగ్రహం చేసి భగవంతుణ్ణి పూజించటం – ఇవన్నీ మంచివేనా?
శ్రీరామకృష్ణులు: మీరు సాకారమూర్తిని పూజించటం అంగీకరించరు. ఫరవాలేదు. మూర్తి పూజ మీకు సరిపడదు. భగవంతుని పట్ల మీ భావాన్ని తీవ్రతరం చేయడమే మీకు శ్రేష్ఠమైనది. మీరు ఆకర్షణను గ్రహించండి. రాధ, కృష్ణుని పట్ల కలిగి ఉండేదే – అటువంటి ప్రేమ, ఆకర్షణలను గ్రహించండి. సాకారోపాసకులు కాళి, దుర్గ వంటి దేవతలను ఎలా పూజిస్తున్నారో, ‘అమ్మా అమ్మా’ అంటూ హృదయం కరిగిపోయేలా వారిని ఎలా ప్రేమిస్తున్నారో – మీరు కూడా అదే భావాన్ని అలవరచుకోండి; సాకారాన్ని అంగీకరించకున్నా సరే.
బ్రహ్మభక్తుడు: వైరాగ్యాన్ని ఎలా అలవరచుకోవాలి? అందరికీ వైరాగ్యం ఎందుకు కలుగదు?
శ్రీరామకృష్ణులు: భోగాలు అనుభవించి వాటిపట్ల తనివి తీరనిదే వైరాగ్యం జనించదు. కలకండ, ఆటబొమ్మలు ఇచ్చి చిన్నబిడ్డను సులువుగా లాలించవచ్చు. కాని కలకండ తిన్న తరువాత, బొమ్మలతో ఆడుకున్న అనంతరం ఆ బిడ్డ ‘మా అమ్మ దగ్గరకు వెళ్లాలి’ అంటూ ఏడుపు లంకించుకుంటుంది. తల్లి వద్దకు బిడ్డను తీసుకు వెళ్లకుంటే బొమ్మలను విసిరివేసి తారాస్థాయిలో అరవటం మొదలుపెడుతుంది.
10.1.3 సచ్చిదానందుడే గురువు – భగవత్ప్రాప్తి తరువాత సంధ్యాది కర్మల త్యాగం
బ్రహ్మసమాజస్థులు గురుశిష్య సంప్రదాయాన్ని నిరసిస్తారు. అందుచేత బ్రహ్మభక్తుడు ఆ విషయంగా మాట్లాడసాగాడు.
బ్రహ్మభక్తుడు: మహాశయా, గురువు లేకుండా జ్ఞానం కలుగదా?
శ్రీరామకృష్ణులు: సచ్చిదానందుడే గురువు. ఒక వ్యక్తి గురువు రూపంలో వచ్చి ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్నాడంటే, ఆ సచ్చిదానందుడే ఈ రూపం ధరించాడని గ్రహించు. నిన్ను చెయ్యి పుచ్చుకొని నడిపించే సహచరుని లాంటివాడు గురువు. భగవత్సాక్షాత్కారానుభూతి కలిగిన తరువాత గురువు – శిష్యుడు అన్న తేడా ఉండదు. అదొక జటిలమైన స్థితిని కల్పిస్తుంది; ఆ స్థితిలో గురువు ఉండడు, శిష్యుడూ ఉండడు. ఈ కారణం చేతనే జనక మహారాజు, శుకునితో, ‘నీకు బ్రహ్మజ్ఞానం బోధించే మునుపు నాకు గురుదక్షిణ సమర్పించు’ అన్నాడు. బ్రహ్మజ్ఞానం పొందాక గురువు – శిష్యుడు అన్న తారతమ్యం తొలగిపోతుంది. గురువు శిష్యుల నడుమ ఉన్న సంబంధం శిష్యుడు భగవత్సాక్షాత్కారం పొందనంత వరకే.
మునిమాపు వేళ అయింది. కొందరు బ్రహ్మభక్తులు శ్రీరామకృష్ణులతో “బహుశా మీ రిప్పుడు సంధ్యవార్చుకుంటారేమో!” అన్నారు.
శ్రీరామకృష్ణులు: లేదు, అటువంటిది ఏమీ లేదు. అవన్నీ ప్రాథమిక దశలో కాస్తోకూస్తో చేయవలసి ఉంటుంది. ఆ తరువాత పంచపాత్ర ఉద్ధరిణి పుచ్చుకొని సంధ్యావందనాది కర్మలు, నియమనిష్ఠలు పాటించవలసిన అవసరం లేదు.
10.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు, ఆచార్య బేచారం – వేదాంత, బ్రహ్మతత్వాలపై ప్రసంగం
చీకటిపడ్డాక బ్రహ్మసమాజ ఆచార్యుడు బేచారం వేదికపైకి వచ్చి ఉపాసన ప్రారంభించాడు. మధ్యమధ్యలో ఉపాసనతోపాటు ఉపనిషత్ పఠనం, బ్రహ్మ సమాజ గీతాలు గానం చేయటం జరిగింది.
ఉపాసనానంతరం శ్రీరామకృష్ణులు, ఆ ఆచార్యుడు సంభాషణలోకి దిగారు.
శ్రీరామకృష్ణులు: మంచిది. నిరాకారమూ సత్యమే, సాకారమూ సత్యమే. మీరు ఏమంటారు?
10.2.1 సాకారం, నిరాకారం, చిన్మయరూపం – భక్తుడు
ఆచార్యుడు: మహాశయా, నిరాకార దైవాన్ని నేను విద్యుత్ ప్రవాహంతో పోలుస్తాను; విద్యుత్తు కంటికి అగపడదు కాని దాన్ని అనుభూతం చేసుకోవచ్చు.
శ్రీరామకృష్ణులు: అవును, రెండూ సత్యమే. సాకార నిరాకారాలు రెండూ సత్యమే. భగవంతుణ్ణి కేవలం నిరాకారుడని వర్ణించటం ఎలా ఉంటుందో తెలుసా? పిల్లనగ్రోవికి ఏడు రంధ్రాలు ఉన్నప్పటికీ, ఏకస్వరంతో పిల్లనగ్రోవిని ఊదటం వంటిది అది. కాని అదే వాయిద్యంపై మరో వ్యక్తి విభిన్న రాగాలు పలికిస్తాడు. అదే విధంగా సాకారోపాసకులు భగవంతుణ్ణి అనేక రీతుల్లో ఆరాధించి, తృప్తి చెందుతారు. వారు భగవంతుణ్ణి శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాల ద్వారా ఆరాధించి, ఆనందిస్తారు.
“విషయం ఏమిటో తెలుసా? ఏదో ఒక విధంగా అమృత కుండంలో పడటమే ప్రధానం. ఎవరైనా వ్యక్తి భగవంతుని స్తవ స్తోత్రాలతో స్తుతిస్తూ దాన్లో పడ్డాడనుకుందాం; మరో వ్యక్తి దాన్లోకి త్రోసివేయబడ్డాడనుకుందాం. రెంటి ఫలితమూ ఒక్కటే. ఆ ఇద్దరూ అమరత్వం పొందటం తథ్యం.
“బ్రహ్మసమాజస్థులకు నీరు – మంచు దృష్టాంతం సరిపోలుతుంది. సచ్చిదానందం అనంత జలరాశి వంటిది. శీతల ప్రాంతాలలో మహాసముద్ర జలం అక్కడక్కడ మంచు శకలాల ఆకారం సంతరించుకుంటుంది. అదే రీతిలో దివ్యప్రేమ యొక్క శీతల ప్రభావంతో, ఆ సచ్చిదానందుడే భక్తులకోసం సాకార రూపాలు దాలుస్తాడు. ఋషులు ఆ అతీంద్రియ చిన్మయ రూపాన్ని దర్శించారు, సంభాషించారు కూడా. కాని భక్తుడు ‘ప్రేమ శరీరం’ ‘భాగవతీ తనువు’ ద్వారా చిన్మయ రూపాన్ని దర్శించుకోగలడు.
“మరో సంగతి – బ్రహ్మం అవాఙ్మానసగోచరం. జ్ఞాన భాస్కరుని వేడిమి సాకారమనే మంచును కరిగించివేస్తుంది. బ్రహ్మజ్ఞాన సముపార్జనానంతరం, నిర్వికల్ప సమాధి పొందిన తరువాత ఆయనను మనోవాక్కులకు అతీతమైన అనంత అరూప నిరాకార బ్రహ్మంగా అనుభూతం చేసుకోవటం జరుగుతుంది.
“బ్రహ్మం యొక్క స్వరూపాన్ని వర్ణించజాలం. దాన్ని గురించి మౌనాన్నే పాటించాలి. అనంతాన్ని మాటల్లో ఎవరు వివరించగలరు? ఆకాశంలో పక్షి ఎంత ఎత్తుకు ఎగిరినప్పటికీ, అంతకంటే సమున్నత ప్రాంతాలు ఉండనే ఉంటాయి. మీ రేమంటారు?
ఆచార్యుడు: అవునండీ. వేదాంతంలో ఇలాగే వచించబడి ఉంది.
10.2.2 నిర్గుణబ్రహ్మం ‘అవాఙ్మానసగోచరమ్’ – త్రిగుణాతీతం
శ్రీరామకృష్ణులు: ఒకప్పుడు సముద్రపు లోతును కొలిచే ఉద్దేశంతో ఒక ఉప్పుబొమ్మ సముద్రంలోకి దిగింది. కాని అది తిరిగి వచ్చి ఏ సమాచారమూ అందివ్వలేకపోయింది. శుకదేవాది మహర్షులు అనంత సచ్చిదానంద సాగరాన్ని దర్శించారు, స్పృశించారు, కాని దాన్లో మునక వేయలేదని కొందరి మతం.
“ఒకసారి నేను విద్యాసాగర్‌తో ఇలా అన్నాను: ‘లోకంలోని పదార్థాలు సమస్తం ఎంగిలి అయినవి కాని బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కాలేదు.’ అంటే బ్రహ్మం అనేది ఏమిటో ఎవరూ నోటితో చెప్పలేరు. ఏదైనా వస్తువు ఉచ్చరించబడిన మాత్రం చేతనే అది ఉచ్ఛిష్టం (ఎంగిలి) అయిపోతుంది. మహాపండితుడైన విద్యాసాగర్ నా ఈ వ్యాఖ్యానానికి ఎంతో సంతోషించాడు.
“కేదార్నాథ్ శిఖరాల సమీపంలో సతతం మంచుచే కప్పబడిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయంటారు; అత్యున్నత ప్రాంతాన్ని అధిరోహించిన వ్యక్తి తిరిగి రావడం జరగదు. ఆ అత్యున్నత ప్రాంతాలలో ఏముందో లేక అక్కడ అనుభూతులు ఎలా ఉంటాయో కనుగొన ప్రయత్నించిన వారు దాన్ని గురించి మనకు తెలుపటానికి వెనక్కు మరలి రాలేదు.
“భగవద్దర్శనం కలిగితే మనిషి ఆనందపారవశ్యంలో మునిగిపోతాడు. అతడు నిరుత్తరుడవుతాడు. అలాంటప్పుడు ఆ అనుభవాన్ని మనకు ఎవరు తెలుపుతారు? ఎవరు వివరించగలరు?
“రాజుగారు ఏడు ప్రాకారాల ఆవల నివసిస్తాడు. ప్రతి ప్రాకారం వద్ద అధికారం, హోదా ఉన్న ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. రాజదర్శనార్థం గురువుతో కలిసి వచ్చిన శిష్యుడు ప్రతి ప్రాకారంవద్ద ‘వీరేనా రాజుగారు?’ అని అడుగుతాడు. గురువు ‘కాదు; నేతి, నేతి’ అని జవాబిస్తూ వస్తాడు. ఏడవ ప్రాకారం కూడా దాటిన తరువాత శిష్యుడు ఆనందంతో పరవశించిపోతాడు. అతడి నోట మాటరాదు. ఈసారి ‘రాజుగారు వీరేనా?’ అని అడగవలసిన పనిలేదు. రాజుగారి దర్శన మాత్రం చేతనే సంశయాలన్నీ తొలగిపోతాయి.”
ఆచార్యుడు: అవునండీ, వేదాంతంలో ఇలాగే వర్ణించబడి ఉంది.
శ్రీరామకృష్ణులు: సృష్టి స్థితి లయాలను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆయనను సగుణబ్రహ్మం, ఆద్యాశక్తి అంటారు. మూడు గుణాలకు అతీతుడైనప్పుడు నిర్గుణబ్రహ్మం, మనోవాక్కులకు అతీతుడుగా పేర్కొంటారు. ఆతడే పరబ్రహ్మం.
“మనిషి ఆయన మాయలోపడి స్వస్వరూపాన్ని మరచిపోతాడు. అతడు తన జనకుని అనంత ఐశ్వర్యానికి వారసుడననే సంగతినీ విస్మరిస్తాడు. ఆయన మాయ త్రిగుణాత్మికం. సత్వ రజః తమస్సులనే మూడు గుణాలే బందిపోటులు; జ్ఞానాన్ని హరించి, స్వస్వరూపాన్ని మరపింప చేస్తాయి. సత్వగుణం మాత్రమే భగవత్ మార్గాన్ని చూపుతుంది. కాని ఈ సత్వగుణం కూడా భగవంతుని వద్దకు చేర్చలేదు.
“ఒక కథ చెబుతావినండి: ఒకప్పుడు ఒక ధనికుడు ఒక అరణ్యంగుండా పోతున్నప్పుడు ముగ్గురు దొంగలు చుట్టుముట్టి, అతణ్ణి నిలువు దోపిడీ చేశారు. ఆ తరువాత ఆ దొంగలలో ఒకడు ‘ఇతణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టటంలో ప్రయోజనం ఏమిటి? చంపిపారేద్దాం’ అంటూ కత్తిదూసి అతణ్ణి వధింప ఉద్యుక్తుడైనాడు. అప్పుడు రెండవ దొంగ అడ్డుపడి, ఇలా అన్నాడు: ‘ఇతణ్ణి చంపితే మనకు ఏం ప్రయోజనం? ఇతణ్ణి కట్టిపడేసి ఇక్కడే వదలిపెట్టి మనం వెళ్లిపోదాం. ఇక అతడు పోలీసులకు ఏమీ తెలుపలేడు.’ అతడు సూచించిన విధంగా దొంగలు ఆ ధనికుని తాళ్లతో కట్టివేసి, తమ దారిన వెళ్లిపోయారు.
“కొంతసేపు గడిచాక మూడవ దొంగ వెనక్కు తిరిగి వచ్చి ఆ ధనికునితో ఇలా అన్నాడు: ‘అయ్యో పాపం! మీకు చాలా దుఃఖం కలిగింది కదా! మిమ్మల్ని బంధవిముక్తుని చేస్తాను.’ ఇలా అంటూ ఆ మూడవ దొంగ ఆ ధనికుని కట్లు విప్పి, అతణ్ణి అరణ్యం దాటించాడు. రహదారి సమీపంలోకి వచ్చాక ఆ దొంగ, ధనికునితో ‘ఈ మార్గంగుండా వెళ్లారంటే మీ ఇల్లు సులభంగా చేరుకొంటారు’ అన్నాడు. అప్పుడు ఆ ధనికుడు ‘నువ్వు కూడా నాతో రావాలి. నువ్వు నాకు ఎంతో ఉపకారం చేశావు. మా ఇంటికి నువ్వు వస్తే మేమంతా ఎంతో సంతోషిస్తాం’ అన్నాడు. అందుకు ఆ దొంగ ఇలా అన్నాడు: ‘లేదు. నేను మీ ఇంటికి రావటం కుదరదు. పోలీసులు నన్ను పట్టుకుంటారు.’ ఇలా అంటూ ఆ దొంగ ధనికునికి దారి చూపి, తన దారిన వెళ్లిపోయాడు.
“ ‘ఇతణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టటంలో ప్రయోజనం ఏమిటి? చంపి పారేద్దాం’ అన్న మొదటి దొంగ తమోగుణానికి ఉదాహరణ. తమోగుణంచే వినాశం కలుగుతుంది. సంసారంలో బంధించి, వివిధ కార్యాకలాపాలలో చిక్కువడ చేసే రజోగుణమే రెండవ దొంగ. రజస్సు భగవంతుని విస్మరింపచేస్తుంది. కేవలం సత్త్వగుణం మాత్రమే భగవంతుని చేరుకునే మార్గం చూపుతుంది. దయ, ధార్మికత, భక్తి మొదలైన సుగుణాలన్నీ సత్త్వగుణం ద్వారానే కలుగుతాయి. మెట్ల వరుసలోని ఆఖరి మెట్టు వంటిది సత్త్వగుణం. అటుపై ఉన్నది డాబాయే. పరబ్రహ్మమే మానవుని స్వధామం. త్రిగుణాతీతుడు కాకున్నంత వరకు ఎవరూ బ్రహ్మజ్ఞానాన్ని సంతరించుకోలేరు.”
ఆచార్యుడు: మీరు ఎన్నో గొప్ప విషయాలు మాకు తెలిపారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): భక్తుల స్వభావం ఎటువంటిదో తెలుసా? ఒక భక్తుడు, మరొక భక్తుని కలుసుకున్నప్పుడు ఇలా అంటాడు: ‘నేను మాట్లాడతాను, నువ్వు విను. నువ్వు మాట్లాడినప్పుడు నేను వింటాను.’ నువ్వు ఆచార్యుడివి, అనేకులకు బోధిస్తూ ఉంటావు. ఓడ వంటివాడివి; నేను చేపలుపట్టే చిన్న పడవను మాత్రమే. (అందరూ నవ్వారు)
10.3 తృతీయ పరిచ్ఛేదంనందన్బాగాన్ బ్రహ్మసమాజంలో రాఖాల్, ‘మ’ ప్రభృతులతో
బుధవారం, మే 2, 1883
10.3.1 శ్రీరాధా ప్రేమోన్మాదం
సమయం సాయంత్రం ఐదు గంటలు. నందన్బాగాన్లోని బ్రహ్మసమాజ మందిరంలో శ్రీరామకృష్ణులు భక్తులతో కూర్చుని ఉన్నారు. ఆయనతోబాటు రాఖాల్, ‘మ’ మొదలైన వారు ఉన్నారు.
కాశీశ్వర మిత్రగారి ఇల్లు అక్కడ ఉంది. ఆయన సబ్జడ్జిగా ఉండేవారు. ఆయన ఆది బ్రహ్మసమాజానికి చెందినవారు. తన ఇంటి మేడపైన ఉన్న పెద్ద గదిని ప్రార్థనామందిరంగా చేసుకున్నారు. తరచూ భక్తులను ఆహ్వానించి ఉత్సవం జరిపేవారు. ఆయన కాలధర్మం చెందిన తరువాత ఆయన కుమారులు శ్రీనాథ్, యజ్ఞనాథ్ ఇద్దరూ కొంతకాలం ఉత్సవాలు జరుపుతూ వచ్చారు. వారే ఇప్పుడు ఎంతో ప్రయాసతో శ్రీరామకృష్ణులను ఆహ్వానించి, పిలుచుకు వచ్చారు. శ్రీరామకృష్ణులు మొదట క్రిందనున్న చావడిలో ఆసీనులయ్యారు. అక్కడకు బ్రహ్మ సమాజ భక్తులు క్రమక్రమంగా వచ్చి గుమిగూడారు. రవీంద్రనాథ్ టాగూర్, ఇంకా టాగూర్ కుటుంబానికి చెందిన భక్తులు కొందరు అక్కడ ఉన్నారు. కాసేపయ్యాక పిలుపు రావడంతో శ్రీరామకృష్ణులు, భక్తులు మేడ మీద ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. మందిరపు తూర్పు వైపున ఒక వేదికను ఏర్పాటు చేశారు. నైరుతి వైపున ఒక పియానో ఉంది. ఉత్తరం వైపు కొన్ని కుర్చీలు వేసి ఉన్నాయి. వాటికి ఆవల ఇంట్లోకి వెళ్లే దారి ఉంది.
సాయంత్రం ఉత్సవం ప్రారంభమైంది. ఆది బ్రహ్మసమాజానికి చెందిన భైరవ బందోపాధ్యాయ ఒకరిద్దరు భక్తులతో వేదికపై ఆసీనుడై ఉపాసన జరిపిస్తారు.
మే నెల ఎండాకాలం. భక్తులు క్రింది చావడిలోను, వసారాలోను పచార్లు చేస్తున్నారు. జానకీఘోషాల్, కొందరు భక్తులు శ్రీరామకృష్ణుల ప్రక్కన కూర్చుని ఉన్నారు. భగవత్ విషయాలను ఆయన నుండి విన కుతూహలంగా ఉన్నారు.
శ్రీరామకృష్ణులు ఉపాసనా మందిరంలోకి ప్రవేశించగానే మొదట వేదికకు ప్రణామం చేసి కూర్చున్నారు. తరువాత శ్రీరామకృష్ణులు ‘మ’, రాఖాల్ తదితర భక్తులతో ఇలా అన్నారు: “నరేంద్రుడు ఒకసారి ‘బ్రహ్మసమాజ మందిరానికి ప్రణామం చేస్తే ఏం మేలు ఒనగూరుతుంది?’ అని నన్ను ప్రశ్నించాడు. దేవాలయం చూడగానే భగవంతుడు జ్ఞాపకానికి వస్తాడు; భగవదుద్దీపన కలుగుతుంది. భగవత్ప్రసంగాలు జరిగే చోటనే భగవంతుడు ఆవిర్భవిస్తాడు. ఆ చోట సకల తీర్థాల ఉనికి అనుభూతమవుతుంది. ఇటువంటి చోట్లను చూస్తూ ఉన్నప్పుడు మనస్సులో భగవంతుని గురించిన ఆలోచనలే వస్తాయి.
“ఒకసారి ఒక భక్తుడు ఒక తుమ్మచెట్టును చూసినంతనే భావపారవశ్యత నొందాడు. రాధాకాంతాలయం తోటలో ఉపయోగించే గొడ్డలి పిడి తుమ్మచెట్టు కలపతోనే తయారుచేసి ఉండటం అతడికి స్ఫురించింది. మరొక భక్తుడికి తన గురువు పట్ల ఎంత భక్తిప్రపత్తులు ఉండేవంటే, గురువుగారి ఇరుగుపొరుగు వారిని చూడటంతోనే అతడు దైవీభావంతో పరవశించిపోయేవాడు. నీలిమేఘాన్ని చూసినప్పుడు, నీలి వస్త్రాన్ని లేదా కృష్ణుని తైలవర్ణ చిత్రాన్ని చూసినప్పుడు రాధాదేవి మానసంలో కృష్ణుని ఉద్దీపన జ్వలించేది. తరువాత ఆమె అశాంతికి గురై ఉన్మాదినిలా ‘కృష్ణా, ఎక్కడున్నావు?’ అంటూ వ్యాకులత చెందేది.”
జానకీ ఘోషాల్: కాని ఉన్మాదం అవాంఛనీయం కదా!
శ్రీరామకృష్ణులు: ఏమంటున్నావు? ఇది విషయ చింతనలలో కూరుకుపోయి చైతన్యరహితులను గావించే ఉన్మాదం వంటిదనుకున్నావా? భగవత్ చింతన వల్ల ఏర్పడిన ఉన్మాదం ఇది. ప్రేమోన్మాదం, జ్ఞానోన్మాదం గురించి నువ్వు విని ఉండలేదా?
10.3.2 భగవంతుణ్ణి ప్రేమించడమే మార్గం – ఆరుగురు శత్రువులనూ ఆయనవైపు మరల్చాలి
బ్రహ్మసమాజ భక్తుడు: ఆయనను ప్రాప్తించుకోవడానికి మార్గం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: నీ ప్రేమను భగవంతుని వైపు మరల్చి భగవంతుడే సత్యం, జగత్తు అనిత్యం అని సదా విచారణ చేయాలి. అశ్వత్థ వృక్షం మాత్రమే శాశ్వతం, దాని పండు ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటుంది.
బ్రహ్మసమాజ భక్తుడు: మాలో కామక్రోధాది శత్రువులు ఉన్నాయి. మేం ఏం చెయ్యాలి?
శ్రీరామకృష్ణులు: ఆరుగురు శత్రువులను భగవన్ముఖం చేయండి. పరమాత్మతోనే రమించాలి. ఇదే కామం. భగవన్మార్గంలో నీకు అవాంతరం కలిగిస్తున్న వారి పట్ల క్రోధం పూనండి. ఆయనను పొందాలనే లోభాన్ని కల్పించుకో. ‘నాది, నాది’ అనాలనుకుంటే, భగవంతుణ్ణే ‘నా వాడని’ పలుకు. ఉదాహరణకు ‘నా రాముడు, నా కృష్ణుడు’ అని చెప్పు. అహంకారం ఉండాలనుకుంటే విభీషణుడిలా, ‘నేను శ్రీరాముని పాదాలను ఆశ్రయించాను. మరి ఎవరికీ తలవంచను’ అన్న అహంకారాన్ని వహించు.
బ్రహ్మ భక్తుడు: భగవంతుడే నా చేత అన్నింటినీ చేయిస్తూ ఉన్నప్పుడు, నా పాపాలకు నేను బాధ్యుడను కాను కదా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవును, దుర్యోధనుడు కూడా ఇలాగే అన్నాడు – ‘త్వయా హృషీకేశ హృది స్థితేన, యథా నియుక్తో-స్మి తథా కరోమి’ (‘ఓ హృషీకేశా! నా హృదయంలో నెలకొని ఉన్న నువ్వు నా చేత ఎలా చేయిస్తే అలా చేస్తాను’)
“భగవంతుడే సర్వానికి కర్త, నేను కేవలం నిమిత్తమాత్రుడను అనే ప్రగాఢ విశ్వాసం ఉన్న వ్యక్తి ఎన్నటికీ పాప కార్యాలకు పాల్పడడు. నృత్యంలో క్షుణ్ణంగా శిక్షణ పొందిన వ్యక్తి ఎన్నటికీ తప్పుటడుగు వెయ్యడు. అంతఃకరణం పరిశుద్ధం కానంతవరకు భగవంతుని ఉనికి గురించిన విశ్వాసం కలుగదు.”
తరువాత శ్రీరామకృష్ణులు ప్రార్థనా మందిరంలో సమావేశమై ఉన్న భక్తులను కలయచూస్తూ ఇలా అన్నారు: “అప్పుడప్పుడు ఈ విధంగా ఒక చోట సమావేశమై భగవత్ చింతన, భగవన్నామ గుణకీర్తనలు చేయటం ఎంతో మేలు ఒనగూరుస్తుంది. కాని భగవంతుడి కోసం సంసారాసక్తుడైన వ్యక్తి పొందే వ్యాకులత క్షణికం. ఎర్రగా కాల్చిన ఇనుముపై ఒక నీటి బిందువు ఎంతసేపు ఉంటుందో ఆ వ్యాకులత అంతసేపే ఉంటుంది.”
ఉపాసన ప్రారంభం కానున్నది. బ్రహ్మసమాజ భక్తులు వేదిక ప్రక్కన గుమిగూడారు. కొందరు భక్తురాండ్రు మందిర ఉత్తరభాగంలో సంగీత పుస్తకాలు చేత పుచ్చుకొని కుర్చీలలో కూర్చుని ఉన్నారు.
హార్మోనియం, పియానో పక్కవాయిద్యాలకు అనుగుణంగా బ్రహ్మ సమాజ గీతాలు ఆలాపింపబడ్డాయి. పాటలు విన్న శ్రీరామకృష్ణుల ఆనందానికి మేర లేకపోయింది. ప్రార్థనానంతరం ఉపాసన మొదలయింది. వేదికపై ఆసీనులైన ఆచార్యులు వేదమంత్ర పఠనం చేశారు.
ఓం పితా నోఽసి పితా నోబోధి ।
నమస్తేఽస్తు మా మా హింసీః ॥
[అర్థం: నువ్వు మా తండ్రివి. మాకు సద్బుద్ధి ప్రసాదించు. నీకు ప్రణామం. మమ్ములను బాధపెట్టకు.]
బ్రహ్మసమాజ భక్తులు ఆచార్యులతో గొంతు కలిపి వల్లించసాగారు:
ఓం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ।
ఆనందరూపమమృతం యద్విభాతి ॥
శాన్తం శివమద్వైతమ్ ।
శుద్ధమపాప విద్ధమ్ ॥
తదుపరి ఆచార్యులు ఇలా ప్రార్థించారు:
ఓం నమస్తే సతే తే జగత్కారణాయ ।
నమస్తే చితే సర్వలోకాశ్రయాయ ॥
ఆ తరువాత ఆచార్యులు ప్రార్థన జరిపారు:
అసతో మా సద్గమయ । తమసో మా జ్యోతిర్గమయా
మృత్యోర్మాఽమృతం గమయ । ఆవిరావిర్మ ఏధి ।
రుద్ర యత్తే దక్షిణం ముఖం తేనమాం పాహి నిత్యం ।
ఈ ప్రార్థనలు వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు భావావిష్టులైనారు. తరువాత ఆచార్యుడు ప్రబంధం పఠించాడు.
10.3.3 శ్రీరామకృష్ణుల అక్రోధం – అహేతుక దయాసింధువు
ఉపాసన ముగిసింది. భక్తులలో చాలామంది క్రింది చావడిలోకి లేదా ప్రాంగణంలోకి చల్లగాలికై వెళ్లారు. ఈలోపు ఫలహారాలు సిద్ధం కాసాగాయి.
అప్పుడు రాత్రి తొమ్మిది గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్లవలసి ఉంది. కాని ఇంటి యజమాని ఆహ్వానితులైన ఇతర అతిథులను గమనించటంలో మునిగిపోయి శ్రీరామకృష్ణుల పట్ల శ్రద్ధవహించటం మరచిపోయాడు.
శ్రీరామకృష్ణులు (రాఖాల్ తదితరులతో): ఏమిటోయ్ ఇది? ఎవరూ మనలను పట్టించుకోవడం లేదు!
రాఖాల్ (కోపంతో): మహాశయా, పదండి, దక్షిణేశ్వరానికి వెళ్లిపోదాం.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): కాస్త ఆగు! బండి బాడుగ మూడు రూపాయల రెండు అణాలు. దాన్ని ఎవరు ఇస్తారు? మొండిగా ప్రవర్తించటం వల్ల ప్రయోజనం శూన్యం. చేతిలో చిల్లిగవ్వ లేదు, పైగా ఈ నిరర్థక బెదిరింపులా? పై పెచ్చు, ఇంత రాత్రివేళ మనకు ఆహారం మాత్రం ఎక్కడ లభిస్తుంది?
చాలా సేపయ్యాక భోజనాలకు పిలుపు వచ్చింది. శ్రీరామకృష్ణులు, రాఖాల్ తదితరులతో జనం వెంట రెండవ అంతస్తుకు వెళ్లారు. కాని భోజనాల చావడిలో ఆయనకు స్థలం దొరకలేదు. చివరకు ఎంతో ప్రయాసతో ఒక మూల ఆయనను కూర్చోబెట్టారు. అయితే ఆ చోటు శుభ్రంగా లేదు. ఒక వంట బ్రాహ్మణి ఏదో కూర ఆయన విస్తరిలో వడ్డించింది; కాని ఆయనకు అది తినాలనిపించలేదు. ఉప్పుతో అద్దుకొని పూరీ, కొద్ది మిఠాయి మాత్రం తిన్నారు.
శ్రీరామకృష్ణులు దయాసింధువు. ఇంటి యజమానులు పిన్నవయస్కులు. ఆయనకు సముచిత మర్యాద ఒసగాలన్న సంగతి వారికి తెలియదు. ఆ కారణంచేత ఆయన వారి పట్ల కోపం చేసుకుంటారా, ఏమిటి? పైగా ఆయన ఆ ఇంట్లో భోజనం చేయకుండా వెళ్లిపోతే ఆ ఇంటివారికి అమంగళం చేకూరుతుంది. మీదు మిక్కిలి ఆ విందు భోజనం భగవత్ ప్రీత్యర్థం తయారుచేయబడినది కదా!
భోజనానంతరం శ్రీరామకృష్ణులు బండిలో ఎక్కారు. కాని బండి బాడుగ ఎవరు చెల్లిస్తారు? ఇంటి యజమాని ఎక్కడా కనిపించలేదు. ఇది జరిగాక ఒక రోజు శ్రీరామకృష్ణులు నవ్వుతూ భక్తులతో ఇలా చెప్పారు: “మనవారు బండి బాడుగ అడగడానికి వెళితే మొదట ‘లేదు’ పొమ్మన్నారు. తరువాత అతికష్టం మీద మూడు రూపాయలు ఇచ్చారు. తక్కిన రెండు అణాలు ఇవ్వనే లేదు. ‘దానితోనే సరిపోతుందిలే’ అన్నారు.”
10.4 చతుర్థ పరిచ్ఛేదం హరిభక్తి ప్రదాయిని సభ – హరికీర్తనానందంలో శ్రీరామకృష్ణులు
ఆదివారం, మే 13, 1883
నేడు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని కంషారీపార పేటలోని హరిభక్తి ప్రదాయిని సభకు, ఆ ఆధ్యాత్మిక సంస్థ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేశారు.
ఈ సందర్భంగా కీర్తనలు, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాటలు శ్రీకృష్ణుని జీవితంతో బృందావన వృత్తాంతాన్ని కేంద్రంగా చేసుకొన్నాయి.
చంద్రావళి అనే గోపిక ఇంటికి శ్రీకృష్ణుడు వెళ్లటం కారణంగా రాధ క్రోధం వహించటం ఆ పాటల ఇతివృత్తం. రాధ సఖీమణులు ఆమెను అనునయింప ప్రయత్నిస్తూ ఇలా అన్నారు: “నువ్వెందుకు క్రోధం పూనావు? నువ్వు శ్రీకృష్ణుని సంతోషాన్ని కాక నీ సంతోషం గురించే యోచిస్తున్నట్లుగా తోచుతోంది.” అందుకు రాధ వారితో ఇలా అంది: “శ్రీకృష్ణుడు, చంద్రావళి వద్దకు వెళ్లటం పట్ల నా కెలాంటి కోపమూ లేదు. కాని ఆతడు అక్కడకు ఎందుకు వెళ్లాలి? ఆమెకు ఆతణ్ణి సేవించటం ఎలాగో తెలియదు.”
ఆదివారం, మే 20, 1883
10.4.1 రామచంద్ర ఇంట్లో శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో ఒకరైన రామ్‌చంద్ర దత్తా ఇంట్లో కీర్తన ఏర్పాటు చేశారు. శ్రీరామకృష్ణులు ఆ సందర్భంగా అక్కడకు విచ్చేశారు. శ్రీకృష్ణుని ఎడబాటుకు రాధ అనుభవిస్తున్న విరహ వేదనను గురించి గాయకులు పాడారు.
రాధాదేవి కృష్ణుని విరహవేదన భరించలేక అనేక విషయాలను పలవరిస్తోంది: “చిన్నప్పటి నుండే కృష్ణుణ్ణి చూడాలని ఉవ్విళ్ళూరే దానిని. రోజులు లెక్కిస్తూ వేళ్ళగోళ్ళు అరిగిపోయాయి. ఇలాచూడు, అతడిచ్చిన మాల ఎండిపోయింది. కాని నేను దానిని పారవేయలేదు. అయ్యో! కృష్ణచంద్రుడు ఎక్కడ ఉదయించాడు? (నా) క్రోధమనే రాహువుకు భయపడి ఎక్కడకో వెళ్ళిపోయినట్లున్నాడు. అయ్యో, నా కృష్ణుణ్ణి నేను మళ్ళీ చూడగలనా? ఓ కృష్ణా, ఏనాడూ తనివితీరా నిన్ను చూడలేకపోయాను. ఉన్నవి రెండే కళ్ళు; అవి రెప్పలారుస్తూంటాయి; పైపెచ్చు అశ్రుధారలు స్రవిస్తూండటంతో ఆతణ్ణి తనివితీరా చూడలేకపోయాను. అతడి శిరస్సుపైని నెమలిపింఛం మెరుపుతీగెలా మిరుమిట్లు గొలిపేది. ఆ మేఘవర్ణపు కృష్ణుణ్ణి చూసి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేసేవి.
సఖీ, ఈ ప్రాణాలు నిల్వబోవు. ఈ దేహాన్ని తమాల వృక్షశాఖపై ఉంచి దీనిపై కృష్ణ నామాన్ని లిఖీంచండి.
శ్రీరామకృష్ణులు: భగవంతుడూ, ఆయన నామమూ అభిన్నాలు. అందుచేతనే రాధ ఇలా చెబుతోంది. రాముడూ, రామనామమూ ఒక్కటే.
శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితిని పొందారు. వైష్ణవ గాయకుడు పాటలు పాడుతూ ఉన్నాడు. రాబోయే ఆదివారం దక్షిణేశ్వరంలో ఈతడి సంకీర్తన జరుగనున్నది. ఆ తరువాతి శనివారం అధర్సేన్ ఇంట్లో అతడు పాడనున్నాడు.
10.5 పంచమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో భక్తులతో శ్రీరామకృష్ణులు
ఆదివారం, మే 27, 1883
ఉదయం దాదాపు తొమ్మిది గంటలు అయి ఉంటుంది. దక్షిణేశ్వర ఆలయంలో శ్రీరామకృష్ణులు తమ గదిలో భక్తులతో మాట్లాడుతున్నారు. భక్తులు ఒక్కొక్కరుగా రాసాగారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తదితరులతో): ద్వేష భావం మంచిది కాదు. శాక్తేయులు, వైష్ణవులు, వేదాంతులు కలహించుకుంటున్నారు. ఇది మంచిది కాదు. పద్మలోచన్ బర్డ్వాన్ ఆస్థాన పండితుడు. ఒక సందర్భాన సభలో శివుడు గొప్పవాడా, బ్రహ్మ గొప్పవాడా అనే వాగ్వాదం తలెత్తింది. ‘నాకు తెలియదు, నేను శివుణ్ణీ చూసింది లేదు, బ్రహ్మనూ చూసింది లేదు’ అంటూ పద్మలోచన్ చక్కగా జవాబిచ్చాడు. (అందరూ నవ్వారు)
“వ్యాకులత కలిగితే అన్ని మార్గాల ద్వారానూ భగవంతుణ్ణి పొందవచ్చు. కాని నిష్ఠ కలిగి ఉండాలి. ఈ నిష్ఠాభక్తికి అవ్యభిచారిణీ భక్తి అనికూడా ఒక పేరు ఉంది. ఒక చెట్టు కొమ్మలు లేకుండా తిన్నగా పైకి ఎదగటం లాంటిది నిష్ఠాభక్తి. చెట్టు పలు శాఖలతో ఉండటం లాంటిది వ్యభిచారిణీ భక్తి. గోపికలకు నిష్ఠాభక్తి ఉండేది. మెడలో పసుపు పచ్చని మాలను, తలపై నెమలి పింఛాన్ని ధరించిన గోప బాలుడైన బృందావన కృష్ణుణ్ణి తప్ప, వేరే దేనినీ వారు అపేక్షించరు. మథురలో తలపై కిరీటంతో రాజైన కృష్ణుణ్ణి చూడగానే గోపికలు మేలి ముసుగుతో తమ ముఖాలను కప్పుకొన్నారు. ‘ఇతడెవరు? ఇతడితో మాట్లాడి మనం మరొకరిని అపేక్షించిన వారమౌతామేమో!’ అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు.
“భర్తకు, భార్య ఒనరించే సేవ కూడా నిష్ఠాభక్తే అవుతుంది. ఆమె తన బావగారికి, మరిదికి భోజనం వడ్డిస్తుంది. చేతులు కడుక్కోవటానికి నీళ్ళు అందిస్తుంది. అయినప్పటికీ భర్తపట్ల ఆమె సంబంధం ప్రత్యేకమైనది కదా! ఇదే విధంగా ఒక వ్యక్తి తన మతధర్మం పట్ల నిష్ఠ కలిగివుండవచ్చు. అందుకై తక్కిన మతాలను ద్వేషించ వలసిన పనిలేదు. అందుకు మారుగా ఇతర మతస్థులతో కలసి మెలసి ఉండాలి.”
10.5.1 జగజ్జనని పూజ, ఆత్మ పూజ – ‘ఆపదనాశినీ’ మంత్రం, నృత్యం
తరువాత శ్రీరామకృష్ణులు గంగలో స్నానం ఆచరించి కాళికాలయానికి వెళ్లారు. ‘మ’ వెంట వెళ్లాడు. ఆలయంలోకి వెళ్లగానే పూజార్థం వేసిన ఆసనంలో కూర్చుని జగజ్జనని పాదపద్మాల వద్ద పుష్పాలు సమర్పించారు. మధ్యమధ్యలో తమ తలపైనా పువ్వులు ఉంచుకొన్నారు. తరువాత ధ్యానం చేయసాగారు.
చాలసేపయ్యాక లేచారు. భావపారవశ్యస్థితిలో ఆనందం మేరమీర నృత్యం చేయసాగారు. మధ్య మధ్యలో ‘అమ్మా! ఆపద నాశినీ! ఆపద నాశినీ’ అని అంటున్నారు.
దేహం ధరిస్తేనే దుఃఖాలు, ఆపదలు. అందుచేతనే మనం దుఃఖం నుండి విముక్తులవటానికి ‘ఆపద నాశినీ’ అనే మహామంత్రాన్ని మనస్ఫూర్తిగా ఉచ్చరించమని మనకు తెలుపుతున్నారా?
10.5.2 ఝామాపుకూర్లో నకుర్ వైష్ణవుడు
శ్రీరామకృష్ణులు తమ గదికి పశ్చిమాన ఉన్న మొగసాలలోకి వచ్చి కూర్చున్నారు. ఇంకా భావపారవశ్యస్థితిలోనే ఉన్నారు. సమీపంలో రాఖాల్, ‘మ’, నకుర్ వైష్ణవుడు మొదలైనవారు ఉన్నారు. నకుర్ వైష్ణవుడు శ్రీరామకృష్ణులకు ఇరవై ఎనిమిది, ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా తెలుసు. శ్రీరామకృష్ణులు కామార్పుకూర్ నుండి కలకత్తాకు వచ్చి ఝామాపుకూర్లో వసించి, పలు గృహాలకు వెళ్లి పూజ చేసే ప్రారంభ కాలంలో అప్పుడప్పుడు ఆతడి దుకాణానికి వెళ్లి ఆతడితో మాట్లాడి ఆనందించేవారు. ప్రతి ఏటా పానీహాటీలో జరిగే రాఘవపండితుని ఉత్సవానికి వెళ్లేటప్పుడల్లా నకుర్, శ్రీరామకృష్ణులను దర్శించుకునే వాడు. నకుర్ ఒక వైష్ణవ భక్తుడు. అతడూ తరచూ ఉత్సవాలు జరిపిస్తాడు. ‘మ’ ఇంటికి సమీపంలోనే నకుర్ నివసిస్తున్నాడు. ఝామాపుకూర్లో వసించే కాలంలో శ్రీరామకృష్ణులు, గోవింద ఛటర్జీ అనే వ్యక్తి ఇంట్లో వసించేవారు. ఆ పాత ఇంటిని నకుర్ ఒకసారి ‘మ’ కు చూపించాడు.
10.5.3 జగజ్జనని కీర్తనానందంలో శ్రీరామకృష్ణులు
భావపారవశ్యస్థితిలో శ్రీరామకృష్ణులు పాడారు:
సదానందమయీ కాళి
మహాకాళ మనోహరి
నీవె ఆడి, నీవె పాడి
కరతాళము తట్టుదీవె॥ స ॥
ఆదిభూత సనాతని
శూన్యరూపి ఫాలచంద్రి
జగత్సృష్టి నాది యందె
పుర్రెమాల దాల్తువెట్లు॥ స ॥
యంత్రములము యంత్రి వీవు
నడపినట్లు నడచెదము
ఏ పల్కులు పల్కించెదొ
ఆ పల్కులె పల్కెదము॥ స ॥
గుండె వొలకబోసి వేడు
అతి అశాంతు కమలకాంతు
ధర్మాధర్మ సువినాశి
ఖడ్గధారి సర్వనాశి॥ స ॥
నీవె ముక్తిదాయినివి
నీవె త్రిగుణాధారిణివి
హే మహితోన్నత మహితా
దయామయీ దుఃఖహరా॥ నీ ॥
నీవె సంధ్యాగాయత్రి
నీవె విశ్వాధారిణివి
గతిహీనా నాంగతివి
హే మాతా! శివురాణి॥ నీ ॥
ఉండెదవు భువిలోన
ఉండెదవు నీరమున
ఉండెదవు సర్వమున
నీవె మూలకందమవు॥ నీ ॥
నాయందు నీ గృహమె
భూతాళి నీ గృహమె
సాకారంబయి నీవు
హే మాతా! నిర్గుణవు॥ నీ ॥
శ్రీరామకృష్ణులు, జగజ్జననిపై ఇంకా కొన్ని పాటలు పాడారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): సంసారులతో కేవలం దుఃఖాలను గురించే మాట్లాడటం మంచిది కాదు. వారికి ఆనందం కావాలి. పేదలు రెండు రోజులైనా పస్తు ఉండగలరు. ఆహారం తినటంలో ఒకింత ఆలస్యం జరిగినప్పుడు బాధపడే వారితో కష్టాలు, కన్నీరు గురించి మాట్లాడటం మంచిది కాదు. ‘సర్వదా పాపం, పాపం అని చెప్పుకుంటూ ఉండటమా? ఆనందంగా ఉండు’ అని వైష్ణవచరణ్ అనేవాడు.
శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనానంతరం విశ్రమిస్తూ ఉన్నప్పుడు మనోహర్ సాయి గోస్వామి వచ్చాడు.
10.5.4 రాధాభావమైన మహాభావంలో శ్రీరామకృష్ణులు – ఈయనే గౌరాంగుడా?
గోస్వామి, చైతన్యుల భక్తి గురించీ, బృందావన లీలల గురించి గానం చేశాడు.
శ్రీరామకృష్ణులు ప్రగాఢ ఆధ్యాత్మిక భావనలో లీనమైపోయారు.
తమ చొక్కా చింపుకున్నారు. రాధాభావాన్ని ఆరోపించుకుని పాటలోని శ్రావ్యతకు యుక్తంగా ఇలా అన్నారు: “ఓ ప్రాణనాథా! హృదయ వల్లభా! నెచ్చెలులారా! నా అనుంగు కృష్ణుని తీసుకురండి. నెచ్చెలుల కర్తవ్యం అదే కదా! ఆతణ్ణి ఇక్కడకు తీసుకురండి. లేకుంటే నన్ను అక్కడకు తీసుకు వెళ్లండి. నేను మీకు సదా దాసిగా ఉంటాను.”
శ్రీరామకృష్ణుల మహాభావస్థితిని గాంచి గాయకుడు గోస్వామి మంత్రముగ్ధుడయ్యాడు. చేతులు జోడించి, “నా విషయ బుద్ధిని తొలగించండి” అంటూ ప్రార్థించాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): బస చేయటానికి చోటు చూసుకొని తరువాత నగరాన్ని పర్యటించటానికి వెళ్లిన సాధువు వంటి వాడివి నువ్వు. గొప్ప రసికుడవు. నీ పాటలో పలు మాధుర్య భావాలను వెలిబుచ్చావు.
గోస్వామి: ప్రభో, నేను చక్కెర బస్తాను మోస్తూ ఉన్న ఎద్దును. చక్కెర తియ్యదనాన్ని ఎక్కడ ఆస్వాదించాను?
పాటలు కొనసాగాయి. రాధా భావాన్ని వర్ణిస్తూ గాయకుడు పాడసాగాడు. చివరగా రాధాకృష్ణుల సంగమ గీతాన్ని పాడి సంకీర్తనను గాయకుడు ముగించాడు.
10.6 షష్ఠ పరిచ్ఛేదం బలరామ్, అధర్ ఇళ్ళల్లో శ్రీరామకృష్ణులు
శనివారం, జూన్ 2, 1883
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం నుంచి కలకత్తాకు వచ్చారు. మొదట బలరామ్ ఇంటికి తదనంతరం అధర్ ఇంటికి, చివరగా రామ్ ఇంటికి వెళ్లాలనుకున్నారు. అధర్ ఇంట్లో మనోహర్ సాయీ కీర్తనా, రామ్ ఇంట్లో పురాణ కాలక్షేపమూ జరుగనున్నాయి.
శ్రీరామకృష్ణులు బండిలో వస్తున్నప్పుడు, వెంట ఉన్న రాఖాల్, ‘మ’ మొదలైనవారితో ఇలా అన్నారు: “ఇదుగో చూడండి. భగవంతునిపట్ల ప్రేమ జనిస్తే సూర్యరశ్మిచే పొలాలలో నిలిచి ఉన్న నీరు ఎండిపోయేట్లు పాపతాపాలన్నీ పలాయన మవుతాయి.
10.6.1 సన్న్యాసి – గృహస్థుల విషయాసక్తి
“విషయ సుఖాల పట్ల, కామినీకాంచనాల పట్ల ఆకర్షణ ఉంటే భగవంతుని పట్ల ప్రేమ జనించదు. విషయానురక్తి కలిగి ఉన్నవాడు సన్న్యాసం స్వీకరించినా ఒరిగేది ఏమీ లేదు. సన్న్యాసి విషయానురక్తుడవటం ఉమ్మివేసి మరల ఆ ఉమ్మినే మ్రింగటం వంటిది.”
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు మళ్లీ మాట్లాడసాగారు: “బ్రహ్మసమాజస్థులు సాకారమూర్తిని అంగీకరించరు. (నవ్వుతూ) నరేంద్రుడు మూర్తిని చూపిస్తూ దాన్ని ‘బొమ్మ’ అంటాడు. నన్ను సూచిస్తూ ‘ఈయన ఇంకా కాళికాలయానికి పోతున్నారు’ అని చెబుతాడు.”
10.6.2 జీవజగత్తులు – శ్రీరామకృష్ణుల దర్శనం
ఇంతలో బండి బలరామ్ ఇంటి వద్దకు వచ్చింది. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా భావోన్మత్తులయ్యారు. జీవజగత్తులుగా ఉన్నది భగవంతుడే; ఆయనే మానవ రూపంలో తిరుగుచున్నట్లు శ్రీరామకృష్ణులు దర్శిస్తున్నారా? శ్రీరామకృష్ణులు జగన్మాతతో మాట్లాడారు:
“అమ్మా! నువ్వు ఏం చూపిస్తున్నావు, ఆపు. ఏమిటి ఇదంతా? రాఖాల్ ప్రభృతుల ద్వారా ఏం చూపిస్తున్నావు? రూపాలు మాయమైపోతున్నాయి! అమ్మా, మనిషి కేవలం దిండు గలీబు తప్ప మరేదీ కాదు. దాన్లోని చైతన్యం నీదే కదా!
“అమ్మా! ఈ బ్రహ్మసమాజస్థులు నీ మాధుర్యాన్ని చవిచూడలేదు. వీరి కళ్లు తడారి ఉన్నాయి. ముఖాలు వాడిపోయి ఉన్నాయి. ప్రేమభక్తి కలుగకుంటే ఏ ప్రయోజనమూ లేదు!
“అమ్మా! నాకు, నాలాంటి ఒకరిని తోడుగా ఇవ్వమని నిన్ను అడిగాను. అందుకే రాఖాల్ను ప్రసాదించావా!”
10.6.3 అధర్ ఇంట్లో హరికీర్తనానందంలో
తరువాత శ్రీరామకృష్ణులు అధర్ ఇంటికి వెళ్లారు. మనోహర్సాయీ పాడడానికి ఉద్యుక్తుడై ఉన్నాడు. పలువురు భక్తులు, ఇరుగు పొరుగులు శ్రీరామకృష్ణుల దర్శనార్థం అధర్ ఇంటి చావడిలో గుమిగూడి ఉన్నారు. శ్రీరామకృష్ణుల వచనాలు వినటానికి ఆతురతతో ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): సంసార బంధం, ముక్తి – రెండూ భగవదాధీనాలు. ఆయనే మనలను సంసారంలో అజ్ఞాన స్థితిలో ఉంచాడు. ఆయనే ఇష్టపడి మనలను పిలిచినప్పుడు ముక్తి కలుగుతుంది. పిల్లవాడు ఆడుకోవటానికి వెళ్లాడు. భోజన సమయం కాగానే తల్లి అతణ్ణి పిలుస్తుంది. భగవంతుడు మనిషికి ముక్తిని ప్రసాదించేటప్పుడు ఆతడికి సాధుసంగం కల్పిస్తాడు. తనను పొందటానికై ఆతడి మనస్సు వ్యాకులత చెందేటట్లు చేస్తాడు.
పొరుగింటి వ్యక్తి: స్వామీ, అది ఎటువంటి వ్యాకులత?
శ్రీరామకృష్ణులు: నౌకరీ పోగొట్టుకున్న గుమాస్తా మనస్సు ఎలా కొట్టుకుంటుందో అటువంటి వ్యాకులత. ‘ఏదైనా నౌకరీ ఖాళీగా ఉందా?’ అంటూ అతడు రోజూ పలు ఆఫీసులు ఎక్కి దిగుతాడు; అదే విధంగా, మనోవ్యాకులత జనించినవాడు ‘భగవంతుని ఎలా పొందగలను’ అంటూ కొట్టుమిట్టాడుతూంటాడు.
“డాబులరాయుళ్ళు మీసాలు మెలిత్రిప్పి, తాంబూలం సేవించి కాలి మీద కాలు వేసుకొని అట్టహాసంగా కూర్చుని ఉంటారు. అటువంటివారు భగవంతుణ్ణి పొందలేరు.”
పొరుగింటి వ్యక్తి: సాధుసాంగత్యం వల్ల వ్యాకులత కలుగుతుందా?
శ్రీరామకృష్ణులు: అవును, అది సాధ్యమే, కాని కరుడుగట్టిన నాస్తికుడికి మాత్రం కలగదు. సాధువుల కమండలం వారితోబాటు నాలుగు తీర్థాలకూ వెళ్లివస్తుంది కాని అది మునుపు ఎలా చేదుగా ఉండేదో ఇప్పుడూ అట్లే ఉంటుంది!
కీర్తన ఆరంభమైంది. గోస్వామి రాధ గురించి పాడ నారంభించాడు. దాని భావం:
రాధ: నెచ్చెలీ, నా ప్రాణం పోతోంది. నా కృష్ణుని నా వద్దకు తీసుకు రండి.
నెచ్చెలి: రాధా, కృష్ణుడనే మేఘం వర్షించటానికి సిద్ధంగా ఉంది. కాని నీ క్రోధమనే ప్రచండ వాయువు దాన్ని పారద్రోలివేసింది. నువ్వు కృష్ణుని సుఖంలో నీ సుఖం చూసుకునే దానవు కావు. అలా ఉంటే నువ్వు ఎందుకు క్రోధం పూనుతావు?
రాధ: చెలీ! ఆ క్రోధం నాది కాదు. అది ఎవరికి సొంతమో ఆతడితోనే వెళ్లిపోయింది. తరువాత చెలులు రాధాకుండం వద్ద కృష్ణుని అన్వేషించటం, యమునా తీరంలో కృష్ణుని గాంచటం, శ్రీదాముడు, సుదాముడు, బృందలతో కృష్ణుడు మాట్లాడటం, యోగస్థితిలో కృష్ణుడు – జటిలల సంభాషణ, రాధ భిక్ష ఇవ్వటం, రాధ చేతిని చూసి యోగులు జోస్యం చెప్పటం, కాత్యాయినీ పూజకు ఏర్పాటు – ఇలా అనేక పాటలను పాడి గాయకుడు కీర్తనను ముగించాడు.
10.6.4 అవతారుల మానవనైజం
ఆ తరువాత శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడారు.
శ్రీరామకృష్ణులు: గోపికలు కాత్యాయినీ పూజ చేశారు. అందరూ మహా మాయయైన ఆ ఆద్యాశక్తికి అధీనులైనవారే. అవతారపురుషులు కూడా మాయాశక్తిని ఆశ్రయించే తమ లీలలను నిర్వర్తిస్తారు. అందుచేతనే వారు ఆద్యాశక్తిని పూజిస్తారు. చూడండి, రాముడు సీతకై ఎంత విలపించాడు! ‘పంచభూతాలలో చిక్కుకుని బ్రహ్మమే విలపించింది.’
“హిరణ్యాక్షుని సంహరించిన పిదపకూడా వరాహమూర్తి తన పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగాడు. తన స్వస్వరూపాన్ని మరచి, పిల్లలకు పాలు పట్టించటంలో మునిగిపోయాడు. దేవతలు బాగా యోచించి శివుణ్ణి పంపించారు. శివుడు వరాహమూర్తి వద్దకు వెళ్లి, ‘నువ్వెందుకు ఆత్మస్మృతిని కోల్పోయావు?’ అని అడిగినప్పుడు, ‘నేను బాగానే ఉన్నాను’ అన్నాడు వరాహమూర్తి. శివుడు తన శూలంతో వరాహమూర్తి దేహాన్ని పొడిచాడు. అప్పుడే ఆయన స్వస్థానానికి వెళ్లాడు.”
10.7 సప్తమ పరిచ్ఛేదం కలకత్తా భక్తులతో – రామ్‌చంద్ర దత్తా ఇంట్లో
అధర్ ఇంటి నుండి శ్రీరామకృష్ణులు రామ్ ఇంటికి వెళ్లారు. రామ్ ఇల్లు సిములియా పేటలోని మధురాయ్ వీథిలో ఉంది.
రామ్ వైద్యవిద్యను అభ్యసించిన వాడు. కాలక్రమేణా అతడు వైద్య కళాశాలలో సహాయ రసాయన పరిశోధకుడు అయ్యాడు. దానితోబాటు విజ్ఞాన సంస్థలో రసాయన శాస్త్రాన్ని బోధించేవాడు. సొంత ఆర్జనతో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి శ్రీరామకృష్ణులు ఇంతకు మునుపు చాలాసార్లు వెళ్లి ఉన్నారు. ఆ కారణంగా ఆ చోటు నేడు భక్తులకు ఒక తీర్థ స్థలం అయింది.
శ్రీరామకృష్ణుల కృపాకటాక్షంతో సంసారానురక్తి రహితుడై జీవించటానికి రామ్ ప్రయత్నిస్తూ వచ్చాడు. శ్రీరామకృష్ణులు రామ్ సుగుణాలను మనసారా శ్లాఘించే వారు. ‘రామ్ తన ఇంట్లో భక్తులు బస చేయటానికి చోటిస్తాడు. వారికి సేవలు అందిస్తాడు. అతడి ఇల్లు భక్తులు సమావేశమయ్యే కేంద్రంగా మారింది’ అనేవారు.
రామ్‌చంద్ర దత్తా
నిత్యగోపాల్, లాటు, తారక్‌లు ఒక రకంగా రామ్ కుటుంబ సభ్యులే అయ్యారు. చాలా రోజులుగా అతడితో వసిస్తూ ఉన్నారు. అతడి ఇంట్లో నిత్యం నారాయణ పూజ జరిగేది.
వైశాఖ పౌర్ణమి శుభదినాన రామ్, శ్రీరామకృష్ణులను ప్రప్రథమంగా తన ఇంటికి ఆహ్వానించి తీసుకొని వచ్చాడు. దాదాపు ప్రతి ఏటా అదే రోజున శ్రీరామకృష్ణులను, మరి కొందరు భక్తులను తన ఇంటికి ఆహ్వానించి పండుగ జరిపేవాడు. రామ్ పిల్లలవంటి శిష్యులు నేటికీ ఆ రోజును వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు.
ఆ రోజు రామ్ ఇంట్లో గొప్ప పండుగ. శ్రీరామకృష్ణులు విచ్చేస్తున్నారు! శ్రీమద్భాగవత శ్రవణానికి ఏర్పాట్లు చేయించాడు రామ్. చిన్న ఆవరణ; దాన్లో ఎన్నెన్ని ఏర్పాట్లు! వేదిక ఒకటి ఏర్పాటు చేశారు. దానిమీద భాగవత పండితుడు కూర్చుని ఉన్నాడు. హరిశ్చంద్రుని కథ చెప్పనున్నాడు.
శ్రీరామకృష్ణులు రాగానే రామ్ పరుగున వెళ్లి ప్రణామం చేసి ఆయన పాదధూళిని శిరస్సున ధరించాడు. తరువాత శ్రీరామకృష్ణులను తోడ్కొని వెళ్లి వేదిక ఎదుట ఆయన కోసం ప్రత్యేకంగా వేసిన ఆసనంలో ఆసీనులను చేశాడు. చుట్టూ భక్తులు కూర్చున్నారు. ‘మ’ సమీపంలో కూర్చున్నాడు.
10.7.1 హరిశ్చంద్ర మహారాజు – శ్రీరామకృష్ణులు
భాగవత పండితుడు హరిశ్చంద్రుని కథను ప్రారంభించాడు:
విశ్వామిత్ర మహర్షి రాజు వద్దకు వెళ్లాడు; ‘రాజా! సముద్రంతో పరివేష్టితమైన యావత్తు భూమిని నువ్వు నాకు దానంగా ఇచ్చేశావు. కనుక ఈ ప్రపంచంలో ఇకపైన నీకు చోటు లేదు. కావాలంటే నువ్వు కాశీకి వెళ్లవచ్చు. అది శివునికి చెందినది. బయల్దేరు. నిన్నూ, నీ భార్య చంద్రమతినీ, కుమారుడు లోహితాస్యునీ అక్కడకే చేరుస్తాను. అక్కడకు వెళ్లి నువ్వు నాకు ఇవ్వాల్సిన దక్షిణను సంపాదించి ఇవ్వు.’ అలా చెప్పి అందరినీ పిలుచుకొని విశ్వామిత్రుడు కాశీకి బయలుదేరాడు. కాశీకి రాగానే అందరూ కాశీవిశ్వనాథుని దర్శించి, అర్చించారు.
కాశీవిశ్వనాథుని దర్శించిన ఉదంతం చెప్పగానే శ్రీరామకృష్ణులు భావపరవశులైనారు. అస్పష్టంగా ‘శివ శివ’ అంటూ ఉచ్చరించారు.
హరిశ్చంద్రుడు దక్షిణ చెల్లించలేకపోయాడు. కాబట్టి చంద్రమతిని ఒక బ్రాహ్మణుడికి విక్రయించాడు. లోహితాస్యుడు తల్లితో వెళ్లిపోయాడు.
ఆ యజమాని ఇంట్లో లోహితాస్యుడు పువ్వులు సేకరిస్తూ ఉన్నప్పుడు అతణ్ణి పాము కాటువేసిన ఉదంతం భాగవత పండితుడు చెప్పసాగాడు –
చీకటి క్రమ్ముకున్న ఆ అర్ధరాత్రి లోహితాస్యుడు మరణించాడు. అంతిమ సంస్కారాలు నిర్వర్తింప ఎవరూ లేరు. యజమానియైన వృద్ధుడు ఇంకా తన పడకనుంచి లేవలేదు. చంద్రమతి ఒంటరిగా కుమారుని మృత దేహాన్ని చేతుల్లో తీసుకుని శ్మశానం కేసి వెళ్లసాగింది. మేఘాలు గర్జిస్తున్నాయి, కారుచీకటిని ఛేదిస్తూ మెరుపులు మెరుస్తున్నాయి. ఈ భయంకర స్థితిలో చంద్రమతి పుత్రశోకంలో మునిగిపోయి శ్మశానానికి భీతితో వెళ్లింది.
విశ్వామిత్రునికి ఇవ్వవలసిన దక్షిణ మొత్తం పూర్తిగా హరిశ్చంద్రుడు సముపార్జించ లేకపోయాడు. అందుచేత అతడు కాటికాపరి ఒకడికి తాను అమ్ముడుపోయి, తానే ఒక కాటికాపరి అయ్యాడు. రుసుము పుచ్చుకొని శవాలను దాహనం చేయటం అతడి పని. శ్మశానంలో ఎన్నో శవాలు దహనమవుతున్నాయి. ఎన్నో శవాలు దగ్ధమై బూడిద అయ్యాయి. ఆ కారుచీకటిలో శ్మశానం భయంకరంగా గోచరిస్తూ ఉన్నది. చంద్రమతి ఆ చోటుకు వచ్చి రోదించసాగింది.
చంద్రమతి శ్మశానంలో రోదించే ఘట్ట వర్ణన వింటే ఎవరి హృదయం ద్రవించదు? భాగవత పండితుడు వివరణను విన్న భక్తులు ఉద్వేగం చెంది ఏడవసాగారు.
అప్పుడు శ్రీరామకృష్ణులు ఏం చేస్తున్నారు? స్థిరచిత్తంతో ప్రశాంతంగా వింటున్నారు. ఒకే ఒక సందర్భంలో ఆయన కంటి కొలకులు ద్రవించాయి. దాన్ని తుడిచివేసుకున్నారు. ఆయన ఎందుకు విలపించలేదు?
చివరికి విశ్వామిత్రుడు రావటం, లోహితాస్యుడు పునర్జీవితుడవటం, అందరూ కలిసి కాశీవిశ్వనాథుణ్ణి సేవించటం, హరిశ్చంద్రుడు మళ్లీ రాజ్యాన్ని పొందటం మొదలైన ఘట్టాలు విపులంగా చెప్పి భాగవత పండితుడు కథను పూర్తి చేశాడు.
వేదిక ఎదుట కూర్చున్న శ్రీరామకృష్ణులు భాగవత కథను ఒక్కటీ విడువకుండా వింటూ ఉన్నారు. కథ పూర్తి అయ్యాక బయట ఉన్న గదిలోకి వెళ్లి కూర్చున్నారు. ఆయన చుట్టూ భక్తులు గుమిగూడారు. భాగవత పండితుడూ వచ్చాడు. వెంటనే శ్రీరామకృష్ణులు అతడితో “ఉద్ధవుని ఉదంతం గురించి కాస్త చెప్పండి” అని అడిగారు. భాగవత పండితుడు చెప్పసాగాడు:
10.7.2 భక్తి, ముక్తి – గోపికల ప్రేమ – గోపికలు ముక్తిని కోరలేదు
ఉద్ధవుడు బృందావనానికి వచ్చినప్పుడు ఆతణ్ణి దర్శింప గోపబాలురు, గోపికలు గుంపుగా పరుగెత్తుకుంటూ వచ్చారు. అందరూ ఆతడితో ‘శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు? ఆతడు మమ్మల్ని మరచేపోయాడా? ఆతడికి మా పేర్లయినా గుర్తున్నవా?’ అంటూ ఉద్విగ్నులై ప్రశ్నల పరంపర గుప్పించారు. కొందరు ప్రశ్నిస్తూనే ఏడ్చారు. మరికొందరు ఉద్ధవుణ్ణి పిలుచుకువెళ్లి బృందావనంలో పలుచోట్లు చూపిస్తూ ‘ఈ చోటులోనే శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నాడు, ఈ స్థలంలోనే ఆతడు ధేనుకాసురుణ్ణి వధించాడు. ఇక్కడే శకటాసురుణ్ణి సంహరించాడు, ఈ పచ్చికబీడులోనే ఆవులను మేపాడు, ఇదుగో ఈ యమునానదీ తీరంలోనే ఆనందంతో క్రీడించాడు, ఈ చోట గోపబాలురతో ఆడుకున్నాడు, ఇదుగో ఇక్కడ ఉన్న పువ్వులతోటల్లో ఆతడు గోపికలతో మాట్లాడి ఆనందించాడు’ అంటూ వివరించారు.
వాళ్లు చెప్పింది విని ఉద్ధవుడు, ‘మీ రెందుకు కృష్ణునికై ఇంత వ్యాకులత చెంది మనోవేదనను అనుభవిస్తున్నారు? అతడే సకల భూతాలలోనూ ఉన్నాడు కదా! అతడు సాక్షాత్తూ భగవంతుడు. అతడు తప్ప మరేదీ లేదు!’ అన్నాడు.
అందుకు గోపికలు, ‘అవన్నీ మాకు తెలియవు. మేం నిరక్షర కుక్షులం. మాకు మా బృందావన కృష్ణుడే తెలుసు. ఈ ప్రదేశాలలో మాతో పలువిధాలుగా ఆడుకొన్న కృష్ణుడే తెలుసు’ అని చెప్పారు.
ఈ మాటలు విన్న ఉద్ధవుడు వారితో, ‘శ్రీకృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడు. ఆయనను ధ్యానిస్తే మళ్లీ ఈ సంసార చక్రంలో చిక్కుకో నక్కరలేదు. జీవన్ముక్తులు అయిపోతారు’ అని ఉపదేశించాడు.
అందుకు గోపికలు ‘ముక్తి గిక్తి మాకు తెలియదు. మేము మా ప్రాణసముడైన కృష్ణుని చూడగోరుతున్నాం’ అని చెప్పారు.
ఇదంతా అమితశ్రద్ధతో విని, దాన్లోనే లయించిపోయిన శ్రీరామకృష్ణులు, “గోపికలు సరిగ్గానే చెప్పారు” అన్నారు. తరువాత ఆయన సుమధురంగా పాడసాగారు:
ముక్తినొసగ వెరువగాని
(శుద్ధ) భక్తినొసగ వెరతు నేను
భక్తి నొంది యున్నవాడు
ఎన్నమిన్న అందరికన్న
వందనీయు డందరకును
మూడు లోకముల జయించు॥ ము ॥
వినవె చంద్రావళీ నీవు
ప్రేమ విషయమెరుగజేతు
ముక్తిపొందగలవెగాని
భక్తిబడయ దుర్లభంబు॥ ము ॥
ఒక్క శుద్ధ భక్తి కొరకే
బలికి కావలి వాడనగుచు
ఎంతో క్రింది పాతాళమున
ఆతని ఇల్లు కాచుచుంటి॥ ము ॥
దొరకదెందు శుద్ధభక్తి
బృందావనమునందెగాక
గోపగోపీ కాంతలొకరె
దాని మర్మమెరుగువారు॥ ము ॥
ఒక్క శుద్ధభక్తి కొరకె
నంద గృహమునందు నుంటి
తండ్రి యనుచు అతని భార
ములను శిరముపైన మోపి॥ ము ॥
శ్రీరామకృష్ణులు (భాగవత పండితుడితో): గోపికల భక్తి ప్రేమభక్తి, అవ్యభిచారిణీ భక్తి, నిష్ఠాభక్తి. వ్యభిచారిణీ భక్తి అంటే ఏమిటో తెలుసా? జ్ఞాన మిశ్రభక్తి – అంటే కృష్ణుడే సర్వమూ అయి ఉన్నాడు. ఆతడే పరబ్రహ్మం, ఆతడే రాముడు, ఆతడే శివుడు, ఆతడే శక్తి అన్న జ్ఞానంగల భక్తి. అయితే ఇటువంటి జ్ఞానం ప్రేమభక్తిలో లేదు.
“ఒక సందర్భంలో ద్వారకకు ఆంజనేయుడు వచ్చి ‘నేను సీతారాములను దర్శించాలి’ అన్నాడు. శ్రీకృష్ణుడు రుక్మిణితో, ‘నువ్వు సీతగా రూపు ధరించు లేకుంటే ఆంజనేయుని నుండి తప్పించుకోలేం’ అన్నాడు.
“పాండవులు రాజసూయ యాగం చేశారు. రాజులందరూ యుధిష్ఠిరుణ్ణి సింహాసనంపై ఆసీనునిజేసి, అతడికి ప్రణామాలు చేశారు. విభీషణుడు, ‘నేను నారాయణుని ఒక్కడికే ప్రణామం చేస్తాను, మరెవరికీ తలవంచను’ అని చెప్పాడు. అప్పుడు స్వయంగా కృష్ణుడే, యుధిష్ఠిరుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చూసిన తరువాతనే విభీషణుడూ కిరీటంతో సహా యుధిష్ఠిరుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు.
“ఒక ఆదర్శం పట్ల భక్తి ఎలాంటిదో తెలుసా? ఇంట్లోని కోడలు మాదిరి. ఇంట్లోని మరిది, బావగారు, మామగారు, భర్త మొదలైన అందరికీ ఆమె సేవలు అందిస్తుంది. కాళ్లు చేతులు కడుగుకొనటానికి నీళ్లు అందిస్తుంది. తువ్వాలు అందిస్తుంది. కూర్చోటానికి కుర్చీ వేస్తుంది. కాని భర్తతో ఆమెకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది.
“ఈ ప్రేమభక్తిలో రెండు విషయాలు ఉన్నాయి – అహంకారం, మమకారం. ‘నేను కాక గోపాలుణ్ణి ఎవరు చూసుకుంటారు? ఆతడికి కావలసింది నేను చేయకపోతే ఆతడి ఆరోగ్యం పాడవుతుంది’ అని యశోద భావించింది. కృష్ణుడు భగవంతుడనే భావం ఆమెలో లేదు. పైగా ‘మమకారం’, అంటే గోపాలుడు నా వాడు అనే భావం ఆమెలో ఉండేది. ఉద్ధవుడు యశోదతో ‘అమ్మా! నీ కృష్ణుడున్నాడే, అతడు సాక్షాత్తూ భగవంతుడు. అతడు సామాన్య మానవుడు కాదు, అతడు జగత్ చింతామణి* ’ అని చెప్పాడు. అందుకు యశోద, ‘అయ్యా, నేను నీ చింతామణిని గురించి అడగలేదు. నా గోపాలుడు ఎలా ఉన్నాడు అనే అడుగుతున్నాను. అవును, నేను అడుగుతూ ఉన్నది చింతామణి గురించి కాదు, నా గోపాలుని గురించే’ అని చెప్పింది.
10.7.3 గోపికల నిష్ఠ – జ్ఞానభక్తి, ప్రేమభక్తి
“కృష్ణుని పట్ల గోపికల నిష్ఠ ఎటువంటిది! మథురలో కావలివాడిని ఎంతో బ్రతిమాలి రాజసభలోకి వెళ్లారు. కావలివాడు వారిని కృష్ణుని వద్దకు తీసుకువెళ్లాడు. కాని కిరీటం ధరించిన కృష్ణుణ్ణి చూడగానే వారు తల దించుకొన్నారు. ‘కిరీటం ధరించిన ఇతడు ఎవరు? ఇతడితో మాట్లాడితే మనం పరాయివాడితో జత కలిపినవారం కామా? పీతాంబరం ధరించిన, నెమలిపింఛం అలంకరించుకున్న ఆ ప్రాణవల్లభుడు ఎక్కడ?’ అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు.
“కృష్ణుని పట్ల గోపికల నిష్ఠ ఎలాంటిదో చూశారా? బృందావన ఆదర్శమే అనుపమానమైనది. ద్వారకలో ప్రజలు అర్జునుని మిత్రుడైన కృష్ణుణ్ణే పూజిస్తారు, వారు రాధను అంగీకరించరని విని ఉన్నాను.”
ఒక భక్తుడు: జ్ఞానమిశ్ర భక్తి, ప్రేమభక్తి వీటిలో ఏది మంచిది?
శ్రీరామకృష్ణులు: భగవంతుడి పట్ల ప్రగాఢ ప్రేమ కలుగనిదే ప్రేమభక్తి ఏర్పడదు, ‘భగవంతుడు నా వాడు’ అన్న ఎరుక కలుగదు.
“ఒక కథ వినండి ముగ్గురు మిత్రులు అడవిగుండా వెళుతున్నారు. హఠాత్తుగా ఒక పులి ఎదురు వచ్చింది. వారిలో ఒకడు ‘సోదరులారా, మనం చచ్చాం!’ అన్నాడు. రెండవవాడు, ‘మనం ఎందుకు చావాలి? రండి, భగవంతుణ్ణి ప్రార్థిద్దాం’ అని అన్నాడు. మూడవవాడు, ‘వద్దు, భగవంతుణ్ణి మనం ఎందుకు శ్రమ పెట్టాలి? రండి, ఈ చెట్టుపైకి ఎక్కి కూర్చుందాం’ అన్నాడు.
“ ‘మనం చచ్చాం’ అన్నవాడు, భగవంతుడు ఉన్నాడు, ఆయన మనలను రక్షిస్తాడు అన్న నిజాన్ని తెలుసుకోలేదు. ‘రండి, భగవంతుణ్ణి ప్రార్థిద్దాం’ అని చెప్పిన వాడు జ్ఞాని. భగవంతుడే సృష్టి స్థితి లయాలు అన్నీ అన్న ఎరుక అతడికి ఉన్నది. ‘భగవంతుణ్ణి మనం ఎందుకు శ్రమపెట్టాలి? రండి. ఈ చెట్టుపైకి ఎక్కి కూర్చుందాం’ అని చెప్పినవాడి మనస్సులోనే ప్రేమ ఉద్భవించింది, అనురాగం కలిగింది. తనను పెద్దవాడిగాను, తన ప్రేమకు పాత్రుడైనవాణ్ణి చిన్నవాడిగాను ఎంచటం ప్రేమభక్తి లక్షణం. తను ప్రేమించేవాడికి కష్టం ఉండరాదు అన్న జాగ్రత్తతో ఉండే ప్రేమ అది. తను ప్రేమ చూపించే వ్యక్తికి కాలులో ముల్లుకూడా గుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలనేది అతడి ఆకాంక్ష.”
శ్రీరామకృష్ణులను, భక్తులను మేడ మీదికి పిలుచుకుని వెళ్లి రామ్ పలురకాల మధురభక్ష్యాలను ఒసగాడు. భక్తులు సంతోషంతో ప్రసాదం ఆరగించారు.