అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ ।
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ॥ 13
సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః ।
మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తస్స మే ప్రియః ॥ 14
అద్వేష్టా, సర్వభూతానామ్, మైత్రః, కరుణ, ఏవ, చ,
నిర్మమః, నిరహంకారః, సమ దుఃఖ సుఖః, క్షమీ.
సంతుష్టః, సతతమ్, యోగీ, యతాత్మా, దృఢనిశ్చయః,
మయి, అర్పిత మనోబుద్ధిః, యః, మద్భక్తః, సః, మే, ప్రియః.
సర్వ భూతానాం = సకల ప్రాణుల యందూ; అద్వేష్టా = ద్వేష భావం లేనివాడూ; మైత్రః = మిత్ర భావం కలవాడూ; కరుణః = దయ కలవాడూ; నిర్మమః ఏవ చ = మమకారం లేనివాడూ; నిరహంకారః = అహంకారం లేనివాడూ; సమ దుఃఖ సుఖః = సుఖదుఃఖాల పట్ల సమానబుద్ధి కలవాడూ; క్షమీ = క్షమాశీలుడూ; సతతమ్ = ఎల్లప్పుడూ; సంతుష్టః = సంతోషం కలవాడూ; యోగీ = సమాహిత చిత్తుడూ; యతాత్మ = సంయత స్వభావుడూ; దృఢ నిశ్చయః = దృఢ సంకల్పం కలవాడూ; మయి అర్పిత మనః బుద్ధిః = నా యందు మనస్సును, బుద్ధిని అర్పించినవాడూ; మద్భక్తః = నా భక్తుడైన వాడు; యః = ఎవడో; సః = అతడు; మే = నాకు; ప్రియః = ఇష్టుడు;
తా ॥ ఏ ప్రాణిపైనా ద్వేషం లేనివాడూ, మిత్ర భావసంపన్నుడూ, దయాళుమా, మమత్వబుద్ధి శూన్యుడూ, క్షమాశీలుడూ, సర్వదా సంతోషం కలిగి ఉండేవాడూ, సమాహిత చిత్తుడూ, సంయతస్వభావుడూ, తత్త్వవిషయాలలో దృఢ నిశ్చయం గలవాడూ, మనోబుద్ధులను నాకు అర్పించినవాడూ అయిన భక్తుడు నాకు ప్రియతముడు.