1. నరేంద్రుని మహత్వం గురించిన శ్రీరామకృష్ణుల వచనాలు
ఎప్పుడు ఏ పనిలో నిమగ్నుడై ఉన్నప్పటికీ నరేంద్రుని పావనమైన మనస్సు, హృదయమూ సదా ఉన్నత ఆదర్శాలతో ప్రేరేపింపబడి ఉండడాన్ని ప్రారంభం నుండి శ్రీరామకృష్ణులు తమ అంతర్దృష్టితో కనిపెట్టే ఉన్నారు. అందుకే నరేంద్రునితోటి శ్రీరామకృష్ణుల దైనందిన ప్రవర్తన అరుదైన కోమలత్వాన్ని కలిగి ఉండేది. తినడం, త్రాగడం, నిద్రించడం, ధ్యానించడం, ప్రార్థించడం మొదలైన విషయాలలో శ్రీరామకృష్ణులు నియమనిష్ఠలను స్వయంగా తాము పాటించేవారు. అలా చేయడం చూసి భక్తులు స్ఫూర్తిపొంది తామూ అలాగే చేస్తారనీ, లేకుంటే వారు కష్టపడవలసి వస్తుందనీ ఆయన ఎరుగకపోలేదు. కాని నరేంద్రుడు ఆ నియమాలను పాటించకపోయినా అతడికి ఏ హాని వాటిల్లదని ఆయన నిస్సంకోచంగా అందరి సమక్షంలో పదే పదే చెప్పేవారు. ఆయన ఇలా చెప్పేవారు : “నరేంద్రుడు నిత్యసిద్ధుడు, ధ్యానసిద్ధుడు. అతడిలో సతతం ప్రజ్వరిల్లే జ్ఞానాగ్ని, ఆహార నియమాదులను పాటించకపోవడం లోని దోషాలను దగ్ధం చేసివేస్తుంది. ఏ వ్యక్తి నుండి గాని, ఏ చోటు నుండిగాని, తన ఇచ్ఛమేరకు ఏం తీసుకొన్నప్పటికీ అతడి మనస్సు కళంకం కాదు. తన జ్ఞానఖడ్గంతో అతడు మాయాబంధనాలను నిత్యం ముక్కలు ముక్కలు చేసివేస్తుంటాడు. కాబట్టి మహామాయ అతణ్ణి తన అదుపులో ఉంచుకోవడంలో విఫలతను చవి చూస్తుంది.” ఆహా! ఇలా ఎన్ని విధాలలో శ్రీరామకృష్ణులు మేం విస్మయం చెందే రీతిలో నరేంద్రుణ్ణి శ్లాఘించేవారో కదా!
2. మార్వాడీ భక్తులు నివేదించి తెచ్చిన ఆహారపదార్థాలు
ఒకసారి మార్వాడీ భక్తులు శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చి, ఆయనకు ప్రణామాలు చేసి పటికబెల్లం, సీమబాదం పప్పులు మొదలైన వివిధ ఆహార పదార్థాలను ఆయనకు అర్పించారు. వాటిలో ఏ ఒక్కటీ ఆయన స్వీకరించలేదు సరికదా అక్కడ హాజరైవున్న ఏ భక్తునికి కూడా ఇవ్వలేదు. ఆయన “వారు (మార్వాడీలు) ఉద్దేశరహితంగా దేనిని సమర్పించరు; ఒక సాధువుకు కేవలం తమలపాకులు సమర్పిస్తున్నప్పుడు సైతం దానితో అనేక కోర్కెలను ఈడేర్చమనే ప్రార్థనను జోడిస్తారు. అటువంటి వ్యక్తులు సమర్పించే ఆహారాన్ని పుచ్చుకొన్న వ్యక్తి భక్తి పతనం చెందుతుంది” అని అన్నారు. కాబట్టి ఆ మార్వాడీలు సమర్పించిన ఆహార పదార్థాలను ఏం చేయాలో అన్న ప్రశ్న తలెత్తింది. అప్పుడు శ్రీరామకృష్ణులు, “వెళ్ళి ఆ పదార్థాలను నరేంద్రుడికి ఇచ్చిరండి. వాటిని ఆరగించినా అతడికి ఎలాంటి చెరపూ జరగదు” అని అన్నారు.
3. నరేంద్రుని భక్తిపై ఆహార దోషం ఎటువంటి ప్రభావం చూపలేదు
ఒక రోజు నరేంద్రుడు భోజనశాలలో (hotel) భోజనం చేసి తిన్నగా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి, “మహాశయా, జనం నిషిద్ధ ఆహారంగా ఎంచే భోజనశాలలో భోజనం చేశాను” అని చెప్పాడు. గొప్పలకు పోయి నరేంద్రుడు అలా చెప్పలేదని ఆయనకు తెలుసు. తమను తాకకుండా ఉండడానికి లేదా తాము ఉపయోగించే కూజా, పాత్రలు మొదలైనవాటిని తనను తాకనివ్వకుండా ఉండడానికి శ్రీరామకృష్ణులు ముందుజాగ్రత్త తీసుకొంటారనే కారణంగానే నరేంద్రుడు ఆ విషయం చెప్పాడని ఆయన గ్రహించారు. ఆ మాట విన్న తక్షణమే శ్రీరామకృష్ణులు “అలా చేసినందున నీ కెలాంటి దోషమూ అంటదు. నిషిద్ధ ఆహారం తిని కూడా ఒకరు భగవంతునిపైనే తన మనస్సును నిమగ్నం చేసే పక్షంలో, ఆ వ్యక్తి హవిష్యాన్నం తిన్నట్లే లెక్క. కాని ఒకరు కేవలం ఆకులూ అలములూ తింటూ లౌకిక కోర్కెలలో పూర్తిగా మునిగిపోయి ఉంటే, ఆ వ్యక్తి నిషిద్ధ ఆహారం తిన్నట్లే లెక్క. ఆ నిషిద్ధ ఆహారం తినడంలో నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తున్నాను. కాని వీరిలో ఎవరైనా (ఇతరుల నందరినీ చూపుతూ) నా వద్దకు వచ్చి అలా చెప్పివుంటే, అతణ్ణి నేను కనీసం తాకనైనా తాకి ఉండేవాణ్ణి కాను” అని అన్నారు.
4. శ్రీరామకృష్ణుల నిస్వార్థ ప్రేమ – నరేంద్రుడి ఆధ్యాత్మిక పురోగతిలో తోడ్పాటు
మొట్టమొదట వారు కలుసుకొన్నప్పటి నుండి శ్రీరామకృష్ణులు, నరేంద్రుని పట్ల అన్ని విషయాలలో చూపిన ఆప్యాయత, అతణ్ణి ప్రశంసించిన తీరు, అతడికి ఇచ్చిన స్వేచ్ఛ – వీటిని కచ్చితంగా వర్ణించి పాఠకులకు చెప్పడం దాదాపు మాకు అసాధ్యమే. విశాల మనస్కుడైన శిష్యుని స్వతస్సిద్ధమైన సామర్థ్యాల పట్ల ఆదరణ వహించి గురువు ప్రవర్తించిన ఈ తీరు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో మరొకటి కానరావడం సందేహాస్పదమే. తమ అంతరాంతరాళాల్లోని ఆలోచనలను నరేంద్రునికి వెలిబుచ్చకుండా శ్రీరామకృష్ణులు సంతృప్తి చెందేవారు కారు. అన్ని విషయాలలోను అతణ్ణి సంప్రతించాలని ఆశించేవారు. ఇతర భక్తుల విశ్వాసాన్ని, తెలివితేటలను పరీక్షించడానికి కొన్ని సమయాల్లో శ్రీరామకృష్ణులు వారిని నరేంద్రునితో వాదించమనేవారు. దేన్నీ సునిశితంగా పరీక్షించకుండా సత్యంగా అంగీకరించమని ఆయన నరేంద్రుణ్ణి ఎన్నడూ కోరిందిలేదు. నరేంద్రుని భక్తిప్రపత్తులు, ఆత్మస్థైర్యం, వ్యక్తిగత ప్రయత్నాలలో అతడి సామర్థ్యం, సత్యసంధతను చూసి నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణుల ఈ ప్రవర్తన నూరు రెట్లు అధికరించిందని చెప్పనవసరం లేదు. శ్రీరామకృష్ణుల అనంత ప్రేమ విశ్వాసాలు నరేంద్రుని చుట్టూ అన్ని వైపులా దుర్భేద్యమైన గోడలా ఆవరించి, అతణ్ణి అన్ని రకాల దురాకర్షణల నుండి, దుర్వర్తనల నుండి రక్షించింది. ఇందుమూలంగా నరేంద్రుడు స్వతఃసిద్ధమైన అపార స్వేచ్ఛను అనుభవించాడు. ఒక్క సంవత్సరం తిరిగే లోపు శ్రీరామకృష్ణుల పట్ల గల నరేంద్రుని ప్రేమ ఎంత ప్రగాఢమైనదంటే, శాశ్వతంగా అతడు ఆయనకు శరణాగతుడయ్యాడంటే అతిశయోక్తి కాబోదు. కాని శ్రీరామకృష్ణుల నిస్వార్థ ప్రేమవాహిని తన జీవిత లక్ష్యం వైపుగా ఎంత ముందుకు తీసుకొనిపోయిందో అప్పుడు నరేంద్రుడికి తెలుసా? బహుశా తెలిసి ఉండదు. ఇంతకు మునుపు ఏనాడు అనుభవించని పరమానందాన్ని సంతృప్తిగా అనుభవించిన నరేంద్రుడు, దేవతలు సైతం అపేక్షించే అనుపమాన, అలభ్యమైన వస్తువే అది అని ఇంకా తెలుసుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే, అప్పటికి తనకు స్వార్థ, కఠోర ప్రపంచంలో పరిచయం లేనందున ఈ అరుదైన ప్రేమను పోల్చడానికి అతడికి ఏ వస్తుమా కానరాలేదు. ఈ విషయాన్ని స్పష్టంగా పాఠకులు గ్రహించడానికి కొన్ని ఉదాహరణలు పొందుపరచడం ఇక్కడ అసంగతం కాబోదు.
5. శ్రీ ‘మ’ ను నరేంద్రునితో వాదించమని శ్రీరామకృష్ణులు కోరడం
నరేంద్రుడు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిన కొన్ని నెలల తరువాత ‘శ్రీరామకృష్ణ కథామృత’ రచయితయైన శ్రీ ‘మ’ కు మార్చ్ 1882 వ సం ॥ లో శ్రీరామకృష్ణులను దర్శించుకొనే భాగ్యం కలిగింది. ఆ పుస్తకంలో శ్రీ ‘మ’ యే స్వయంగా తాను అప్పట్లో బారానగర్‌లో వసించడం వలన ఎలా శ్రీరామకృష్ణులను పలుమార్లు దర్శించుకొన్నదీ, ఎలా శ్రీరామకృష్ణులు వ్యంగ్య హేళనలతో తన పాండిత్యాహంకారాన్ని నిర్మూలించి తనను వినమ్ర పండితునిగా తీర్చిదిద్దారో మొదలైన విషయాలు పొందుపరిచి ఉన్నారు. నరేంద్రుడు ఇలా చెప్పాడు : “ఆ సమయంలో ఒక రోజు రాత్రి నేను దక్షిణేశ్వరంలోనే శ్రీరామకృష్ణులతో గడపడం తటస్థించింది. నేను ప్రశాంతంగా పంచవటి క్రింద కూర్చుని ఉండగా హఠాత్తుగా శ్రీరామకృష్ణులు అక్కడకు వచ్చి నా చేయి పుచ్చుకొని, నవ్వుతూ ‘నీ తెలివి, పాండిత్యాలకు నేడొక పరీక్ష. నువ్వు రెండున్నర పరీక్షలలో మాత్రమే ఉత్తీర్ణుడవైనావు; మూడున్నర పరీక్షలలో* ఉత్తీర్ణుడైన ఉపాధ్యాయుడు నేడు ఇక్కడకు వచ్చాడు. నాతో రా, అతడితో నువ్వు ఎలా సంభాషించగలవో చూడాలి’ అని అన్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయనతో పాటు వెళ్ళవలసి వచ్చింది. శ్రీరామకృష్ణుల గదిలో ‘మ’ తో పరిచయమైన తరువాత, వివిధ అంశాల మీద ఆయనతో మాట్లాడ నారంభించాను. మమ్మల్ని అలా సంభాషణలో నిమగ్నులను చేసి శ్రీరామకృష్ణులు, నిశ్శబ్దంగా కూర్చుని మా మాటలు వింటూ, మమ్మల్ని గమనించసాగారు. శ్రీ ‘మ’ ఆయన వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయిన తరువాత శ్రీరామకృష్ణులు, ‘ఆ పరీక్షలలో అతడు ఉత్తీర్ణుడైతే మాత్రం ఏమిటి? ఉపాధ్యాయుడు స్త్రీలా సిగ్గుపడే స్వభావం గలవాడు. ఉద్ఘాటిస్తూ మాట్లాడలేడు’ అని అన్నారు. ఆ విధంగా ఇతరులతో నన్ను పోటీకి నిలబెట్టి శ్రీరామకృష్ణులు వినోదించేవారు.”
6. భక్తుడైన కేదారనాథ్ ఛట్టోపాధ్యాయ
శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో కేదారనాథ్ ఛట్టోపాధ్యాయ ఒకరు. నరేంద్రుడు రాక ముందునుండే అతడు శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూవున్నట్లు తెలియవస్తోంది. ఇతడు తూర్పు బెంగాల్‌లోని ఢాకాలో ఉద్యోగం చేస్తున్నందువలన, శరన్నవరాత్రుల వంటి ఉత్సవ సెలవులలో మాత్రమే శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూవుండేవాడు. కేదార్ సాధక భక్తుడు; వైష్ణవశాస్త్రాలలో వర్ణించబడి ఉన్న ఆధ్యాత్మిక భావాల వైఖరులను అనుష్ఠిస్తూ ఉంటాడు. భక్తిగీతాలు వింటున్నప్పుడు అతడి కళ్ళవెంట అశ్రువులు స్రవించడం కద్దు. అందుకే శ్రీరామకృష్ణులు బహిరంగంగా అతణ్ణి ప్రశంసిస్తూ ఉండేవారు. కేదార్ భక్తివిశ్వాసాలను చూసి ఢాకాలో అనేకులు అతడి పట్ల ఎంతో మర్యాదమన్ననలు చెల్లిస్తుండేవారు. అతడి ఉపదేశాల ననుసరించి పలువురు తమ ఆధ్యాత్మిక జీవితాలను మలచుకోవడానికి ప్రయత్నించారనడం అతిశయోక్తి కాదు.
శ్రీరామకృష్ణుల వద్దకు తండోపతండాలుగా జనం రాసాగినప్పుడు, వారందరితో ధార్మిక విషయాలు చర్చించి ఆయన అలసిపోయే వారు; ఒక రోజు భావపారవశ్యంలో ఆయన జగజ్జననిని, “అమ్మా, నేను అంతగా మాట్లాడలేకపోతున్నాను; కేదార్, రామ్, గిరీష్, విజయ్‌లకు* కాస్త శక్తిని ప్రసాదించు; దాంతో జనం ముందుగా వారి వద్దకెళ్ళి, కొంత గ్రహించి, చివరగా ఇక్కడకు (తమ వద్దకు) వచ్చి ఒకటి రెండు మాటల్లో ఆధ్యాత్మిక జాగృతం పొందగలుగుతారు” అని ప్రార్థించినట్లు మేం విన్నాం. కాని ఇది చాలాకాలం తరువాత జరిగిన విషయం.
7. కేదార్ వాదనా పటిమ మరియు నరేంద్రునితో మొదటి సమావేశం
తన కర్తవ్యాల నుండి ఒకింత కాలం సెలవు పుచ్చుకొని కేదార్ కలకత్తాకు వచ్చి అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులను దర్శించుకోసాగాడు. భక్తిసాధకుడైన అతడు తన ప్రక్కన ఉండడం శ్రీరామకృష్ణులకు ఆనందాన్ని కలిగించింది; అతడితో ధార్మిక విషయాల గురించి ముచ్చటిస్తూ ఇతర భక్తులను ఆయన, అతడికి పరిచయం చేశారు. ఆ సమయంలో ఒక రోజు నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చాడు. శ్రీరామకృష్ణులతో కేదార్ ఉండడం చూశాడు. శ్రీరామకృష్ణుల కోర్కె మేరకు భక్తిగీతాలు పాడుతూవుంటే, కేదార్ భావపారవశ్యం పొందుతూ ఉండడం నరేంద్రుడు గమనించాడు. ఆ తరువాత గురుదేవులు కేదార్‌తో వాదించమన్నారు నరేంద్రుణ్ణి. తన ధోరణిలో కేదార్ బాగానే వాదించగలడు; హేతుయుక్తం కాని ప్రత్యర్థి వచనాలను వ్యంగ్యాత్మకంగా అప్పుడప్పుడు అతడు ఎత్తిచూపడం కద్దు. ఏ మాటలతో ఒక రోజు ప్రత్యర్థి నోటిని అతడు మూయించాడో, ఆ మాటలు శ్రీరామకృష్ణులకు ఎంతో నచ్చాయి. ఎవరైనా అటువంటి ప్రశ్నలు తమను అడిగితే, శ్రీరామకృష్ణులు తరచు ఆ ఫలానా ఫలానా ప్రశ్నకు కేదార్ ఇలా ఇలా జవాబిచ్చాడని ఆ జవాబులను ఏకరువు పెట్టేవారు. ఆ రోజు ప్రత్యర్థి, “భగవంతుడు నిజంగా కరుణామయుడే అయితే, ఎందుకు ఆయన ఇంత బాధలను, కష్టాలను, అత్యాచారాలను కల్పించాడు. వేలాదిమంది కరవు కాటకాల వాతబడి మరణిస్తున్నారు?” అనే ప్రశ్నను లేవ దీశాడు. అందుకు కేదార్ ఇలా జవాబిచ్చాడు : “భగవంతుడు దయామయుడే అయినప్పటికీ, బాధలు, కష్టాలు, అత్యాచారాదులు ఇట్లే కొనసాగాలని ఆయన నిర్ణయం తీసుకొన్న సమావేశానికి దురదృష్టవశాత్తు నన్ను ఆహ్వానించ లేదు. అటువంటప్పుడు అందుకు కారణమేమిటో నాకెలా తెలుస్తుంది?” అని తన ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొన్నాడు. కాని ఈ రోజు అందరి సమక్షంలో నరేంద్రుని కుశాగ్రబుద్ధి ముందు కేదార్ తలవంచక తప్పలేదు.
8. కేదార్ గురించి నరేంద్రుడు
కేదార్ సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు “మంచిది, అతణ్ణి గురించి ఏమనుకొంటున్నావు? అతడి గొప్ప దైవభక్తిని గుర్తించావా? భగవన్నామం చెవిని పడగానే అతడి కళ్ళు ఎలా స్రవించాయో చూశావా? హరి నామం వినగానే ఎవరి కళ్ళ నుండి అశ్రుధారలు వర్షిస్తాయో, ఆ వ్యక్తి ముక్తుడని గ్రహించాలి. కేదార్ ఉత్కృష్టమైన వ్యక్తి కాడా?” అని నరేంద్రుణ్ణి అడిగారు. ధార్మికత నిమిత్తమైనా లేదా మరే కారణంగానైనా పురుషదేహాన్ని ధరించి స్త్రీ వైఖరిని అవలంబించే వ్యక్తులను నరేంద్రుడు తన హృదయం అట్టడుగు నుండి ద్వేషించేవాడు. తన సంకల్పాన్ని, పట్టుదలను దృఢతరం చేసుకోవడానికి బదులుగా, భగవంతుణ్ణి సమీపించి విలపించడంలో ఉపశమనం పొందడం పురుషత్వానికి అవమానమని నరేంద్రుడు భావించేవాడు. పరిపూర్ణంగా భగవంతునికి పరాధీనుడైనప్పటికీ, మనిషి సదా మనిషిగానే వ్యవహరించాలనీ, మనిషిగానే ఆయనను శరణువేడాలనీ నరేంద్రుడు అభిప్రాయ పడేవాడు. కాబట్టి శ్రీరామకృష్ణుల ఆ వచనాలను హృదయపూర్వకంగా ఆమోదించ లేకపోయినప్పటికీ ఆయనతో ఇలా చెప్పాడు: “కాని మహాశయా, ఆ విషయం నాకెలా తెలుసు? వ్యక్తుల నైజం మీరు బాగా గ్రహించగలరు; మీరే ఆ విషయం నిశ్చయంగా చెప్పగలరు. లేకుంటే ఊరకనే విలపిస్తున్న వ్యక్తిని చూసి అతడు సజ్జనుడో లేదా దుర్జనుడో ఎవరూ చెప్పలేరు. కొంతసేపు ఏకాగ్రంగా ఒక దానినే చూస్తూవుంటే కళ్ళలోని అశ్రుకారకాలైన గ్రంధులు అలసిపోయి కన్నీళ్ళు స్రవిస్తాయి. శ్రీకృష్ణుని విరహ వేదనను అనుభవిస్తున్న శ్రీమతిని (రాధ) అభివర్ణిస్తున్న పాటలు వింటూ లేదా ఆ పాటలు పాడుతూ విలపించే వారిలో అత్యధికులు తమ భార్యల ఎడబాటును తలచుకొని లేదా తమనే ఆ స్థితిలో ఊహించుకొని అలా విలపిస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అటువంటి పరిస్థితితో బొత్తిగా పరిచయంలేని నా వంటి వ్యక్తులకు కరుణరసం ఉట్టిపడే మధుర కీర్తన* విన్నప్పుడు సైతం కళ్ళు ఆర్ద్రం కావు.” తనను ప్రశ్నించినప్పుడు సదా ఆ విధంగా నరేంద్రుడు తనకు నిజమని తెలిసిన విషయాన్ని శ్రీరామకృష్ణులతో నిర్భయంగా చెప్పేవాడు. శ్రీరామకృష్ణులు కూడా అలా నరేంద్రుడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినందుకు సదా ప్రసన్నులయ్యేవారు. ఎందుకంటే, వ్యక్తుల హృదయాలను చదవగలిగే శ్రీరామకృష్ణులకు సత్యమే జీవితంగా బ్రతికే నరేంద్రుని మనస్సులో కించిత్తు కూడా బడాయి లేదని తెలియకపోలేదు. లేదా అతడు తన అంతరాంతరాళాలను ‘సందిగ్ధతకు ఏమాత్రం తావీయకుండా స్పష్టంగా ఉంచుకొంటాడు’ అని ఆయన మాటల్లోనే చెప్పవచ్చు.
9. నరేంద్రుడు – రాఖాల్
శ్రీరామకృష్ణులను కలుసుకోవడానికి కొద్దికాలం ముందే నరేంద్రుడు బ్రహ్మసమాజంలో చేరాడు. ఒక్క నిరాకార భగవంతుణ్ణి మాత్రమే విశ్వసిస్తాను, ఆయననే ఉపాసిస్తాను, ఆయననే ధ్యానిస్తాననే బ్రహ్మసమాజ దీక్షను నరేంద్రుడు చేగొన్నాడు. కాని బ్రహ్మ సమాజస్థులు ప్రచారం చేసే సామాజిక ఆచార సంప్రదాయాలను పాటించి బ్రహ్మసమాజస్థునిగా మారిపోవాలనే ఆలోచన ఎన్నడూ అతడిలో జనించలేదు. రాఖాల్కు అంతకు ముందు నుండే నరేంద్రుడు తెలుసు; ఎంతో సమయం వారిద్దరూ కలిసి గడిపేవారు. నరేంద్రుని ఆప్యాయత ఉట్టిపడే ప్రవర్తనకు ముగ్ధుడై బాలక స్వభావుడైన రాఖాల్, నరేంద్రుని పట్ల ప్రగాఢ నమ్మకం కలిగి ఉండడమే కాక, నరేంద్రుడి సంకల్పశక్తి ద్వారా అన్ని విషయాలలో క్రమబద్ధతను సంతరించుకొన్నాడనడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. కాబట్టి నరేంద్రుని సలహా మేరకు బ్రహ్మసమాజ దీక్షను తానూ చేగొన్నాడు. ఇది జరిగిన కొద్దికాలంలోనే రాఖాల్, శ్రీరామకృష్ణులను కలుసుకొన్నాడు. శ్రీరామకృష్ణుల ఉపదేశంతో రాఖాల్లో నిద్రాణమై ఉన్న సాకార ఉపాసన మళ్ళీ జాగృతమైంది. ఆ తరువాత కొద్దికాలంలోనే నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చాడు; అక్కడ రాఖాల్ ఉండడం చూసి ఎంతో సంతోషించాడు. కొన్ని రోజులు గడిచాక శ్రీరామకృష్ణులతో బాటు కాళికాలయానికి వెళ్ళి రాఖాల్ విగ్రహారాధన చేయడం నరేంద్రుడు చూశాడు. అది చూసి సత్యసంధుడైన నరేంద్రుడు నిరాశచెందాడు. రాఖాల్కు పూర్వం పుచ్చుకొన్న బ్రహ్మసమాజ దీక్షను గుర్తుచేసి, “ఆలయానికి వెళ్ళి విగ్రహాలకు ప్రణామం చేయడం వలన నువ్వు దీక్షాభంగ అపరాధానికి గురియైనావు” అంటూ సుతిమెత్తగా చీవాట్లు పెట్టాడు. రాఖాల్ ఆ మాటలు విని మౌనం వహించాడు. అప్పటి నుండి నరేంద్రుణ్ణి కలుసుకోవాలంటే రాఖాల్కు భయమూ, జంకూ ఏర్పడ్డాయి. ఆ తరువాత రాఖాల్ ఎందుకు అలా ప్రవర్తించాడో తెలుసుకొని శ్రీరామకృష్ణులు నచ్చచెప్పే ధోరణిలో ఆప్యాయంగా నరేంద్రుడితో ఇలా చెప్పారు : “ఇలా చూడు. రాఖాల్ను ఇకపై నిందించవద్దు. నిన్ను చూసి కుంచించుకుపోతున్నాడు. ఇప్పుడు అతడికి సాకార భగవంతునిలో విశ్వాసం ఏర్పడింది. అందుకు అతడు ఏం చేయగలడు? ఆది నుండే ప్రతి ఒక్కరికీ నిరాకార భగవంతుని భావన కలుగుతుందా ఏమిటి?” అలా గురుదేవులు చెప్పిన నాటి నుండి రాఖాల్ను నిరసించడం నరేంద్రుడు మానుకొన్నాడు.
10. అద్వైతతత్త్వాన్ని నరేంద్రుడు నిరసించడం
ఆధ్యాత్మిక జగత్తులో నరేంద్రుడు ఎంతో విశిష్టార్హతలు ఉన్న వ్యక్తి అని శ్రీరామకృష్ణులు గ్రహించారు. మొట్టమొదటిరోజు తాము కలుసుకొన్నప్పటి నుండి అతడిలో అద్వైతతత్త్వ సత్యం పట్ల విశ్వాసాన్ని పాదుగొలపాలని ఆయన ప్రయత్నించారు. దక్షిణేశ్వరానికి రాగానే అష్టావక్ర సంహిత మొదలైన పుస్తకాలను చదవమని అతడికిచ్చారు. కాని సగుణ నిరాకారబ్రహ్మాన్ని ఆరాధిస్తున్న నరేంద్రుడికి ఇటువంటి పుస్తకాలు నాస్తికతకు, దైవదూషణకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అనిపించాయి. శ్రీరామకృష్ణుల విన్నపం మేరకు అష్టావక్ర సంహితను ఒకింత చదవగానే అతడు ఇలా విరుచుకుపడ్డాడు : “దీనికీ నాస్తికతకూ భేదం ఏముంది? సృష్టింపబడిన జీవుడు తానే సృష్టికర్తనని భావించవచ్చా? ఇంతకంటే పాపం మరేముంటుంది? ‘నేను దేవుణ్ణి, నువ్వు దేవుడవు, పుట్టిగిట్టేవన్ని దేవుళ్ళే’ అన్న భావన కంటే తర్కరహిత సూక్తి మరొకటి ఉందా? ఇటువంటి గ్రంథాలను వచించిన ఋషుల, మునుల మతులు చెడి ఉంటాయి. లేకుంటే అటువంటి విషయాలు ఎలా వ్రాసివుంటారు?” ఇలా నిర్మొహమాటంగా మాట్లాడిన నరేంద్రుని ఆ వచనాలు విని, అతడి ఆధ్యాత్మిక వైఖరిని హఠాత్తుగా ఎదుర్కోకుండా శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఇలా అన్నారు : “ఇప్పుడు నువ్వు ఆ భావాలను అంగీకరించకపోవచ్చు. అందువలన ఋషులను, మునులను గర్హించడం ఎందుకు? భగవంతుని స్వభావానికి పరిమితులను ఎందుకు నిర్ణయిస్తావు? మూర్తీభవించిన సత్యము అయిన ఆయనను సదా ప్రార్థిస్తూ ఉండు. తనను నీకు ఏ విధంగా వ్యక్తపరుస్తాడో, అదే ఆయన నిజమైన స్వభావం అని విశ్వసించు.” కాని నరేంద్రుడు, శ్రీరామకృష్ణుల ఈ వచనాలకు చెవి ఒగ్గలేదు. ఎందుకంటే, హేతువాదంతో సుస్థాపితంకాని దేనినీ అతడు సత్యంగా అంగీకరించడు. నిజానిజాలు తెలుసుకోవడంలో అతడు అవలంబించే తీరు ఇదే. కాబట్టి అద్వైత సిద్ధాంతానికి విరుద్ధంగా హేతువాదాన్ని లేవదీయడానికి అతడు ఎన్నడూ, శ్రీరామకృష్ణులతో సహా ఎవరివద్దా సంకోచించడు. అద్వైత తత్త్వానికి విరుద్ధంగా వ్యంగ్యాత్మక వచనాలు కూడా అతడు అప్పుడప్పుడు ప్రయోగించడం కద్దు.
11. ప్రతాపచంద్ర హాజ్రా
ఆ సమయంలో దక్షిణేశ్వర ఉద్యానంలో ప్రతాపచంద్ర హాజ్రా అనే వ్యక్తి వసిస్తూవుండేవాడు. హాజ్రా కుటుంబ, ఆర్థిక పరిస్థితులు అప్పుడు అంతంత మాత్రంగానే ఉండేవి. అందువలన ఆధ్యాత్మిక సాఫల్య సిద్ధికై అతడు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, అతడి మనస్సులో ధనం పట్ల గల ఆకాంక్షదే పైచేయి అయ్యేది. కాని ఆ ఆకాంక్షను మనస్సులోనే దాచుకొని, బయటకు భగవంతుని పట్ల నిస్వార్థసేవను గురించి గొప్పగా మాట్లాడి, తద్ద్వారా ప్రశంస పొందాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. లాభనష్టాలను బేరీజు వేయడం అతడికి ఎంత స్వభావసిద్ధమైనదంటే, ఆధ్యాత్మిక సాధన సమయంలో సైతం అతడు దానిని విస్మరించడు. జపసాధనలు అనుష్ఠించి ఏదో అద్భుతశక్తిని గడించి, దాంతో ధనం పట్ల గల ఆకాంక్షను తీర్చుకోవాలనే యోచన కొన్ని సమయాలలో అతడి మనస్సులో మెదలడం కద్దు. మొట్టమొదటి నుండి హాజ్రా వైఖరిని శ్రీరామకృష్ణులు గమనించకపోలేదు. ఆ దురుద్దేశాన్ని విడిచిపెట్టి, భగవంతుని ప్రార్థిస్తూ ఉండమని ఆయన ఉపదేశించారు కూడా. కాని దుర్బల మనస్కుడైన హాజ్రా ఆ ఉపదేశాన్ని పాటించకపోగా, అహం, భ్రాంతి, స్వార్థపరత్వ ప్రేరణలతో శ్రీరామకృష్ణులను దర్శింపగోరి వచ్చిన వారితో, తానూ తక్కువపాటి సాధువును కానని ప్రచారం చేసుకొనేవాడు. దాంతోపాటు నిజాయితీగా ఉండాలనే నిజమైన కించిత్తు కోర్కె కూడా అతడి మనస్సులో లేకపోలేదు. హాజ్రా ప్రవర్తన గురించి శ్రీరామకృష్ణులకు తెలిసే ఉన్నప్పటికీ, అతణ్ణి కొన్ని సమయాలలో తీవ్రంగా చీవాట్లు పెట్టినప్పటికీ, అక్కడ నుండి శాశ్వతంగా అతణ్ణి ఆయన పంపించి వేయకపోవడమే పై విషయానికి తార్కాణం. కాని అతడితో కలసిమెలసి ఉండవద్దని మాలో కొందరిని శ్రీరామకృష్ణులు హెచ్చరిస్తూ, “ఆ హాజ్రా లెక్కలు గట్టే మనస్తత్వం ఉన్నవాడు. అతడి మాటలకు చెవి ఒగ్గకండి” అని చెప్పేవారు.
12. హాజ్రా తెలివి తేటలకు నరేంద్రుని ప్రశంస
పైన వర్ణించిన సద్గుణ దుర్గుణాలతో పాటు హాజ్రాకు సంశయాత్మక మనస్తత్వం కూడా ఉంది. అతడితో సమానమైన విద్యార్హతలు గల ఇతరులతో పోల్చి చూస్తే హాజ్రా ఎంతో తెలివితేటలు ఉన్నవాడనే అంగీకరించాలి. కాబట్టి ఆంగ్ల విద్యను అభ్యసించిన నరేంద్రుని వంటి వ్యక్తులు పాశ్చాత్య అజ్ఞేయతావాద తత్త్వవేత్తల సిద్ధాంతాలను చర్చించుకోవడం విని కించిత్తు అర్థం చేసుకోగలిగేవాడు హాజ్రా. అందుచేత నరేంద్రుడు దక్షిణేశ్వరం వచ్చినప్పుడు, తీరిక దొరికితే ఒక గంటో లేక రెండు గంటలో హాజ్రాతో సంభాషిస్తూ గడిపేవాడు. నరేంద్రుని కుశాగ్రబుద్ధి ముందు హాజ్రా తలవంచక తప్పేది కాదు. నరేంద్రుని వచనాలను హాజ్రా అమిత శ్రద్ధతో వినేవాడు. కొన్ని సమయాలలో అతడి కోసం హుక్కా సిద్ధం చేసి ఇవ్వడం కూడా కద్దు. హాజ్రా పట్ల నరేంద్రుని ఆ వైఖరిని చూసి మేం, ‘హాజ్రా నరేంద్రుని నేస్తం’ అంటూ పరిహసించేవాళ్ళం.
13. నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు శ్రీరామకృష్ణుల ప్రవర్తన
నరేంద్రుణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు తరచు భావపారవశ్యంలో మగ్నులయ్యేవారు. పాక్షికంగా బాహ్యచైతన్యంలోకి వచ్చిన తరువాత అతడితో చాలా సేపు ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటిస్తూ ఆనందించే వారు. అటువంటి సమయాలలో వచనాల, చేతల ద్వారా అతడి మనస్సులో ఉన్నత ఆధ్యాత్మిక సత్యాలను పాదుగొల్ప ప్రయత్నించే వారు. అప్పుడప్పుడు ఆయన భక్తిగీతాలు వినగోరేవారు; కాని నరేంద్రుని సుమధుర కంఠస్వరం వింటూవుండగానే మళ్ళీ ఆయన భావపారవశ్య మగ్నులయ్యేవారు. ఆ కారణంగా నరేంద్రుని గానం ఆగేపోయేది కాదు సుమా! కొన్ని గంటలసేపు ఆ భావంలో లీనమైపోయిన నరేంద్రుడు పాట తరువాత పాట పాడేవాడు. బాహ్యచైతన్యంలోకి వచ్చిన తరువాత శ్రీరామకృష్ణులు అతణ్ణి ప్రత్యేకంగా ఒక ఫలానా పాటను పాడమనేవారు. నరేంద్రుడు ఆ పాట పాడేవరకు వారు సంతృప్తి చెందేవారు కాదు. ఆ తరువాత జీవేశ్వరుల మధ్యనున్న భేదం, బ్రహ్మం జీవుల యథార్థ స్వభావం మొదలైన అద్వైత సిద్ధాంతంలోని సూక్ష్మతర సత్యాలను ముచ్చటించడంలో కొంత సమయం గడిచిపోయేది. ఆ విధంగా నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడల్లా అక్కడ పరమానందం వెల్లివిరిసేది.
14. ఆధ్యాత్మిక భావోద్వేగంలో శ్రీరామకృష్ణులు, నరేంద్రుణ్ణి స్పృశించడం
ఒక రోజు శ్రీరామకృష్ణులు అద్వైతతత్త్వం ప్రకారం జీవేశ్వరుల అభిన్నతను సూచించే అనేక విషయాలు నరేంద్రునికి చెప్పారు. నరేంద్రుడు ఆ వచనాలను శ్రద్ధతోనే ఆలకించాడుగాని, వాటిని అవగతం చేసుకోలేకపోయాడు. ఆ తరువాత అతడు హాజ్రా వద్దకు వెళ్ళాడు. పొగత్రాగుతూ, ఆ విషయాలను మళ్ళీ హాజ్రాతో చర్చిస్తూ, “నీళ్ళ కూజా భగవంతుడవడం, ఆ పాత్ర భగవంతుడవడం, మనం చూస్తూన్న ప్రతి వస్తుమా భగవంతుడవడం ఎన్నటికైనా సాధ్యమేనా?” అని అడిగాడు. ఆ భావాన్ని నరేంద్రునితో కలిసి హాజ్రా కూడా ఎగతాళి చేస్తూ, ఇద్దరూ పకపకా నవ్వుకోసాగారు. అప్పటి వరకు శ్రీరామకృష్ణులు పాక్షిక బాహ్యచైతన్య స్థితిలోనే ఉన్నారు. నరేంద్రుడు బిగ్గరగా నవ్వడం విని ఆయన తమ వస్త్రాన్ని బాలునిలా చంకలో పెట్టుకొని గది నుండి బయటకు నవ్వుతూ వచ్చారు. ఆప్యాయంగా, “మీరిద్దరూ ఏం మాట్లాడుకొంటున్నారు?” అని అడిగారు. పిదప ఆయన నరేంద్రుణ్ణి స్పృశించి, భావపారవశ్యంలో మగ్నులైపోయారు.
15. నరేంద్రుని అద్భుత అనుభవం
తదనంతరం నరేంద్రుడు మాతో ఇలా చెప్పాడు : “శ్రీరామకృష్ణుల అద్భుత స్పర్శతో క్షణంలో నా మనోస్థితిలో సంపూర్ణ విప్లవాత్మక మార్పు జనించింది. ఈ యావత్తు విశ్వంలో ఒక్క భగవంతుడు తప్ప మరేదీ నాకు కనిపించకపోవడంతో నేను దిగ్భ్రాంతుడనయ్యాను. ఆ స్థితి ఎంతసేపు అలా కొనసాగుతుందోనని విస్మయం చెందుతూ మౌనంగా ఉండిపోయాను. కాని ఆ ఉన్మాదావస్థ ఆ రోజంతా అట్లే ఉండిపోయింది. ఇంటికి తిరిగి వచ్చినా, ఆ స్థితి అలాగే కొనసాగింది. నేను చూస్తున్నదంతా ఆయనగానే కనిపిస్తోంది. భోజనానికి కూర్చున్నాను. అన్నం, కంచం, వడ్డిస్తూన్న వ్యక్తి, చివరికి నేనూ యావత్తు ఆయనగానే కనిపించసాగాయి. ఒకటి రెండు ముద్దలు నోట్లో వేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాను. ‘ఎందుకు ప్రశాంతంగా కూర్చున్నావు? ఎందుకు తినడం లేదు?’ అన్న మా అమ్మ ఆప్యాయవచనాలతో బాహ్యస్మృతిలోకి వచ్చి, మళ్ళీ తినడం మొదలుపెట్టాను. ఆ విధంగా తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకొన్నప్పుడు, కళాశాలకు పోతున్నప్పుడు, పచార్లు చేస్తున్నప్పుడు అదే అనుభవం కొనసాగింది. వర్ణనాతీతమైన ఒక రకం మత్తు సదా నన్ను ఆవహించింది. వీథిలో నడుస్తున్నప్పుడు ఒక బండి ఎదురుగా వస్తున్నప్పటికీ ప్రక్కకు జరిగిపోవాలనే ధ్యాస నాకు కలగలేదు. ‘నేను కూడా అదే కదా’ అనే తలంపే అందుకు కారణం. ఆ సమయంలో నా చేతులూ, కాళ్ళూ సదా అచేతనంగా ఉండిపోయేవి. అన్నం తింటున్నప్పుడు, తింటున్నాననే స్ఫురణే ఉండేది కాదు. మరెవరో తింటున్నారని అనిపించేది. కొన్ని సమయాల్లో తింటూ పడుకొనేవాణ్ణి; కాసేపట్లో లేచి తినడం కొనసాగించేవాణ్ణి. కొన్ని రోజుల్లో మామూలుకంటే ఎంతో ఎక్కువ తినేవాణ్ణి. కాని అలా తిన్నందు వలన ఎలాంటి ఇబ్బందికీ నేను గురికాలేదు. ‘నీకేదో తీవ్రమైన రుగ్మత దాపురించినట్లు భయం వేస్తోంది’ అంది మా అమ్మ కంగారుపడుతూ.
“కొన్ని సమయాలలో, ‘వీడు ఇక ఎక్కువ కాలం బ్రతకడు’ అని ఆమె కలతపడేది. నన్ను ఆవరించిన ఆ మత్తు కాస్త తగ్గాక ప్రపంచం నాకు కలలా అనిపించింది. హెడువా చెరువుగట్టు మీద పచార్లు చేస్తూ తలను, చెరువు చుట్టూ వేసిన ఇనుపకమ్మీల కంచెకు గుద్దుకొన్నాను. ఆ కంచె నిజమైనదో లేదా అదీ కలలో కనిపిస్తూన్నదో తెలుసుకోగోరి అలా చేశాను. చేతులూ కాళ్ళూ అచేతనావస్థలో ఉండడం చేత, పక్షవాతం వాతపడతానేమోనని భయపడ్డాను. కొంతకాలం ఆ తీవ్రమత్తు వంటి అవస్థ నుండి విడివడలేకపోయాను. మామూలు స్థితిలోకి వచ్చి ఊపిరిపీల్చుకొన్నాక, అది అద్వైతజ్ఞాన సూచనగా గ్రహించాను. కాబట్టి శాస్త్రాలలో దానిని గురించి వ్రాయబడింది అసత్యం కాదని తేలింది. అప్పటి నుండి నేనెన్నడూ అద్వైత సత్యాన్ని సందేహించింది లేదు.”
మరొక సందర్భంలో నరేంద్రుడి నుండి మరో అద్భుత సంఘటన గురించి విన్నాం. మేం బాగా పరిచయస్థులమైనాక 1884 వ సం ॥ శీతాకాలంలో ఆ సంఘటన గురించి నరేంద్రుడు మాతో ప్రస్తావించాడు. ఆ సమయంలోనే ఆ సంఘటన జరిగిందని మేం ఊహించాం. ఆ సంఘటనను ఇక్కడ పొందుపరుస్తున్నాం:
16. ఒక సందర్భంలో రచయిత, నరేంద్రునితో సంభాషించడం
సిమ్లాపేటలోని గౌర్ మోహన్ ముఖర్జీ వీథిలోని నరేంద్రుని ఇంటికి మధ్యాహ్నం కాబోతుండగా వెళ్ళి, అతడితో అక్కడే రాత్రి పదకొండు గంటలదాకా ఉన్నట్లు మాకు బాగా గుర్తు. ఆ రోజు శశి (స్వామి రామకృష్ణానంద) కూడా మాతోనే ఉన్నాడు. మొదటి రోజు నరేంద్రుణ్ణి చూసినప్పటి నుండి మాకు అతడి పట్ల కలిగిన అలౌకిక ఆకర్షణ, ఆ రోజు భగవత్సంకల్పంతో వేయిరెట్లు అధికరించింది. ఇంతకు ముందు శ్రీరామకృష్ణులను సిద్ధులని, అంటే భగవత్సాక్షాత్కారం పొందిన వ్యక్తి అని మాత్రమే మేం భావించాం. కాని ఆ రోజు శ్రీరామకృష్ణుల గురించిన నరేంద్రుని వచనాలు మా హృదయాలలోకి చొచ్చుకొనిపోయి, మా మనస్సులపై నూతన వెలుగును ప్రసరింపచేశాయి. ఏసుక్రీస్తు, చైతన్యులు వంటి మహాపురుషుల, జగద్గురువుల జీవిత చరిత్రలో నమోదైన అసాధారణ సంఘటనలను మేం అప్పటి వరకు నమ్మేవారం కాం. కాని అటువంటి అసాధారణ సంఘటనలు శ్రీరామకృష్ణుల జీవితంలో నిత్యం జరుగుతున్నాయని నరేంద్రుని వచనాలను బట్టి మేం గ్రహించాం. తమను ఆశ్రయించిన వారికి స్పర్శామాత్రంగా భక్తిని ప్రసాదించారు. సంకల్పమాత్రాన హృదయ బంధనాలను త్రెంచివేసి, గత సంస్కారాలను చెరిపివేశారు. తమను శరణుజొచ్చిన వారిని భావపారవశ్యంలో ముంచివేసి, దివ్యానందాన్ని చూపించారు. వారి జీవిత గమనాన్ని ఆధ్యాత్మిక పథంలోకి త్రిప్పి సత్వరమే వారు భగవత్సాక్షాత్కారం పొంది, తద్ద్వారా శాశ్వతంగా తరించేలా చేయడమూ కద్దు. ఆనాటి మునిమాపు వేళ నరేంద్రుడు మమ్మల్ని హెడువా చెరువు గట్టువద్దకు తోడ్కొని వెళ్ళి శ్రీరామకృష్ణుల అనుగ్రహం వలన తాను పొందిన దివ్యానుభూతులను వివరించి చెప్పడం మాకు బాగా గుర్తు. తన్మయుడై కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత తన హృదయం పొందుతూన్న పరమానందాన్ని, సుమధుర కంఠంతో ఈ పాట రూపంలో వ్యక్తం చేశాడు –
ప్రేమ సంపదను పంపిణీ చేస్తున్నాడు చైతన్యుడు
దానిని పొంద ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాడు నితాయ్
అసంఖ్యాక కలశాలలో ఆ ప్రేమసంపదను
పంపిణీ చేసినప్పటికీ అది తరగదు
శాంతిపూర్ నదియాలు ఆ ప్రేమ వెల్లువలో
మునిగి తేలుతున్నాయి
అవును, ఆ అద్భుత చైతన్యుల ప్రేమామృతంలో
అవి మునిగి ఆనందిస్తున్నాయి.
17. ఒక అద్భుత సంఘటన గురించి నరేంద్రుని ప్రస్తావన
పాట ముగిసింది. స్వగతంలోలా నరేంద్రుడు మెల్లగా ఇలా అన్నాడు: “నిజానికి ఆయన ప్రేమను పంచిపెడుతున్నారు. చైతన్యులు ప్రేమ, భక్తి, దివ్యజ్ఞానం, ముక్తి, ఏది ఎవరు కోరితే దాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఏమా అద్భుత శక్తి! (అతడు నిశ్చలంగా ఒకింతసేపు కూర్చుండిపోయాడు) మళ్ళా ఇలా చెప్పనారంభించాడు. తలుపు గడియపెట్టి నా పరుపు మీద రాత్రి పడుకొనే ఉన్నాను. అప్పుడు హఠాత్తుగా ఆయన నన్ను – ఈ దేహంలో జీవిస్తున్న వ్యక్తిని – ఆకర్షించి దక్షిణేశ్వరానికి తోడ్కొని వెళ్ళారు. అక్కడ నాకు మహోపదేశాలు చేశారు, నాతో అనేక విషయాల గురించి ముచ్చటించారు; వెనక్కు తిరిగి వెళ్ళడానికి అనుమతించారు. తాము ఇష్టపడింది దేనినైనా ఆయన చేయగలరు; ఈ దక్షిణేశ్వర చైతన్యులు ఏదైనా చేయగలరు” అని ఈ అత్యద్భుత అనుభవాన్ని మాతో పంచుకున్నాడు.
18. రచయిత ఇంట్లో నరేంద్రుని అపూర్వ అనుభవం
మునిమాపు వేళ గడిచి క్రమంగా అంతటా గాఢాంధకారం క్రమ్ముకొంది. మేం ఒకరి నొకరం చూసుకోలేక పోతున్నాం; ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే, నరేంద్రుని ఆధ్యాత్మిక భావోద్వేగ రాశి మా హృదయ సీమలలో గాఢంగా చొచ్చుకుని, మా శరీరాలు తూలిపోతూ, ఈ ప్రపంచం కాల్పనిక జగత్తులోకి తిరోగమిస్తున్నంత ఉన్మత్తతను మా మనస్సులలో ఉత్పన్నం చేసింది. పైగా వేలాది జీవుల గత సంస్కారాల బంధనాలను దగ్ధం చేసే అనంతమయుడైన భగవంతుడు పరిమిత మానవమూర్తిగా, తేజోవిరాజమానుడుగా వ్యక్తమౌతాడనే వాస్తవం మాకు అప్పుడు వెల్లడయింది. కాలం ఎలా గడిచిపోయిందో మాకు తెలియలేదు. కాని హఠాత్తుగా తొమ్మిది గంటలు అయినట్లు తెలియవచ్చింది. “రండి వెళదాం, కాస్తదూరం దాకా మీ కూడా వస్తాను” అన్న నరేంద్రుని మాటలు విన్నప్పుడు, అతడి వద్ద నుండి సెలవు పుచ్చుకోవడానికి నా మనస్సు విముఖత చూపింది. మేం వెళుతూ కూడా ఆసక్తికరమైన చర్చలలో మునిగిపోయాం. మేం చంపాతల సమీపంలోని ఇంటి వద్దకు రాగానే, నరేంద్రుణ్ణి అంతదూరం వరకు నడిపించి తీసుకురావడం మా మూర్ఖత్వంగా భావించాం. కాబట్టి అతణ్ణి ఇంట్లోకి ఆహ్వానించి, ఫలహారం సమర్పించి, తరువాత ఇంటిదాకా తోడ్కొనివెళ్ళి దింపివచ్చాం.
ఆ రోజు జరిగిన మరొక సంఘటన స్పష్టంగా నాకు గుర్తుంది. మా ఇంట్లోకి ప్రవేశించగానే నరేంద్రుడు నిశ్చలంగా నిలబడిపోయి, “ఇంతకు ముందు ఎప్పుడో ఈ ఇంటిని చూసినట్లుగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కటీ నాకు బాగా తెలిసినట్లుగా కనిపిస్తున్నది. అన్ని గదులు, ఆ గదులకు దారితీసే మార్గాలు నాకు చిరపరిచితమైనట్లు తోస్తున్నది. ఎంత విచిత్రం, అద్భుతం!” అని వెల్లడి చేశాడు. ఈ పుస్తకంలో మరో చోట తన జీవితంలో అప్పుడప్పుడు నరేంద్రుడు ఇటువంటి అనుభవాలను ఎలా పొందివున్నాడో ఆ వైనమూ, ఇటువంటి అసాధారణ ఘటనలకు అతడిచ్చిన హేతువులూ మేం పొందుపరచి ఉండడం పాఠకులకు జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి వాటిని మళ్ళీ ఇక్కడ ప్రస్తావించడం లేదు.