‘శ్రీరామకృష్ణ పరమహంస’ (జీవితగాథ) రెండవ సంపుటంలో భగవాన్ శ్రీరామకృష్ణులు తమ అవతారకార్యంలో దోహదం చేయడానికి జన్మించిన నరేంద్రుణ్ణి ఆ కార్యనిర్వహణకు అనువుగా తీర్చిదిద్ది, మలచి, ఆ కార్యభారాన్ని అప్పగించిన వైనం ప్రధానంగా చోటుచేసుకొన్నది. గురుదేవుల ప్రత్యక్ష శిష్యులలో ఒకరూ, శ్రీరామకృష్ణ మఠ మిషన్ల ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి ఎనలేని సేవలు అందించిన వారూ అయిన స్వామి శారదానంద ఈ గ్రంథ వంగమూలాన్ని రచించారు. స్వామి శారదానంద ఈ గ్రంథాన్ని కల్పతరువు నాటితో (1.1.1886) ముగించారు. ఆపైన శ్రీరామకృష్ణులు జీవించిన ఎనిమిది నెలల పైబడ్డ కాల జీవితాన్ని అనూహ్య కారణాల వలన ఆయన రచించలేదు. ఈ గ్రంథానికి సమగ్రతను చేకూర్చాలనే ఉద్దేశంతోనూ, పాఠకులకు గురుదేవుల జీవితగాథను ఆమూలాగ్రం అందించాలనే ఆకాంక్షతోను ఆ ఎనిమిది నెలల గురుదేవుల జీవిత కాలాన్ని ఈ గ్రంథం అనుబంధంలో ‘కాళీమాత ఒడిలో…’ అనే అధ్యాయంలో మేం పొందుపరిచాం. ఇందుకు మహాత్మాగాంధీగారు ముందుమాట రాసిన ‘Life of Sri Ramakrishna’ అనే అద్వైత ఆశ్రమం వారి ఆంగ్లపుస్తకం మాకు ఎంతగానో తోడ్పడింది.
వంగమూలం నుండి తెలుగులోనికి అనువదించడం సులభమైన పని కాదు. ఈ గ్రంథ అనువాదాన్ని నిర్దిష్టంగా పూర్తిచేసి ఇచ్చినవారు లండన్లోని శ్రీరామకృష్ణ వేదాంత సెంటర్ మినిష్టర్ (అధ్యక్షులు) స్వామి దయాత్మానందగారు. ఆయనకు కృతజ్ఞతాభివందనాలు.
ఈ బృహత్ గ్రంథం మొట్టమొదటిగా శ్రీరామకృష్ణ పరమహంస పేరిట రెండు భాగాలుగా చాలా సంవత్సరాల క్రిందట విడుదల అయ్యింది. అప్పటినుంచి ఎన్నో ముద్రణలకు నోచుకొని విశేష ప్రజాదరణ పొందిన ఈ అసామాన్య గ్రంథాన్ని మరింత సంస్కరించి మరొక్కసారి బెంగాలీ గ్రంథంతోనూ, ఈ మధ్యనే విడుదలైన, స్వామి చేతనానంద రాసిన SRI RAMAKRISHNA and His Divine Play పుస్తకంతో సరిపోల్చి స్పష్టంగా అర్థమయ్యే భాషలో, పెద్ద పుస్తకం (Royal Size) రూపంలో మీ ముందుంచుతున్నాం. పాఠక ప్రజానీకం ఎప్పటిలాగే సమాదరించగలరు.
ఈ గ్రంథం చదివే పాఠకులలో భక్తిజ్ఞానాలు ఇనుమడిస్తాయనీ, మానవ జీవిత పరమసత్యాన్ని అవగాహన చేసుకొనే పథంలో వారు పురోగమిస్తారనీ, వారి హృదయాలు శాంత్యానందాలతో ఉప్పొంగుతాయనీ మేం ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం.
జూలై 3, 2012
గురుపూర్ణిమ పర్వదినం
– ప్రకాశకులు