ప్రస్తావన
ఇది శ్రీరామకృష్ణ పరమహంస గ్రంథంలో మూడవ భాగం. శ్రీరామకృష్ణ తమ సాధనలు పరిపూర్తి చేసినప్పటి నుండి ఆయన ఖ్యాతి లోకవిదితం అయ్యేవరకు ఆయన జీవితంలో సంభవించిన సంఘటనలు ప్రధానంగా ఈ విభాగంలో నమోదయ్యాయి. ఆ కాలఘట్టంలో జరిగిన సంఘటనలు, ఆయన చర్యలను మాత్రమే మేం నమోదు చేయలేదు; సాధ్యమైనంత వరకు ఆ చర్యలకు పురిగొల్పిన, వాటికి దారితీసిన ఉద్దేశాలను సైతం మేం చర్చించాం. అందుకు హేతువు: మనిషి వ్యక్తిత్వం దేహం–ఆత్మల మేళనం కాబట్టి, ఒక వ్యక్తి బాహ్య జీవిత సంఘటనల అధ్యయనం మాత్రమే చేస్తే అతడి జీవిత చరిత్ర అధ్యయనం అసంపూర్ణమే అవుతుంది. స్వీయచరిత్రనో లేక ఒకరి చరిత్రనో వ్రాస్తున్నప్పుడు భౌతికవాద పాశ్చాత్యుడు తన సమర్థతను ప్రధానంగా సంఘటనలు నమోదు చేయడంలో ప్రదర్శిస్తాడు. ఆధ్యాత్మికవాద హైందవుడు మానసిక వ్యాపారాలను శ్రద్ధగా చిత్రించడంలో తన మనస్సును నిమగ్నం చేస్తాడు. యథార్థమైన స్వీయచరిత్ర లేక చరిత్ర దేహ–ఆత్మల మేళనమై ఉండాలని మన విశ్వాసం. మనస్సు యొక్క చరిత్రను ఆవిష్కరించే దృక్పథంతో మాత్రమే స్థూలశరీర చర్యలు నమోదు చేయబడాలి.
అంతేకాక శ్రీరామకృష్ణుల అపూర్వ జీవిత చరితాన్ని మేం అనేక చోట్ల శాస్త్రాల వెలుగులో చర్చించాం. శ్రీరామకృష్ణుల అనుపమాన మనోస్థితులను, అనుభవాలను, చర్యలను భారతీయ మహాత్ములైన శ్రీకృష్ణ, బుద్ధ, శంకర, చైతన్యుల వంటి వారితోను, ఏసుక్రీస్తు వంటి ఇతర దేశాల మహానుభావులతోను పోల్చి మేం అధ్యయనం చేయవలసి వచ్చింది. శ్రీరామకృష్ణులు మాతో పదే పదే విస్పష్టంగా, “పూర్వం ఎవరు రాముడిగా, కృష్ణుడిగా అవతరించారో వారే ప్రస్తుతం (తమ దేహాన్ని చూపుతూ) ఈ ఒరలో ఉన్నారు” అని చెప్పేవారు. “దీని (అంటే తమ) ఆధ్యాత్మిక అనుభవాలు వేదవేదాంతాలలో నమోదైన వాటిని అతిక్రమించిపోయాయి” అని కూడ చెప్పారు. నిజం చెప్పాలంటే, సాధ్యమైనంత వరకు నిష్పాక్షికంగా చర్చించినప్పుడు భావముఖంలో నెలకొనివున్న శ్రీరామకృష్ణుల అపూర్వ జీవితం వంటి జీవితం ఆధ్యాత్మిక ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఉండలేదని చెప్పక తప్పదు.
పూర్వ అవతార పురుషులు నెలకొల్పిన మతసాధనలను అనుష్ఠించి ఆయన కనుగొని ప్రకటించిన, “ఎన్ని మతాలో అన్ని మార్గాలు” అన్న నూతన సత్యం యొక్క అంతస్సూచనను పరికించినప్పుడు, గత యుగాలలో ఆవిర్భవించిన యావన్మంది అవతారమూర్తుల సమష్టి స్వరూపమే శ్రీరామకృష్ణులని మనం అంగీకరింపక తప్పదు. అసదృశమైన శ్రీరామకృష్ణుల పావన జీవితాన్ని మనం అధ్యయనం చేసే కొద్దీ, వేదాల సారాంశమైన విశ్వజనీన శాశ్వత ఆధ్యాత్మిక భావాల అపూర్వ ఫలంగా ఆయనను మరింతగా మనం విశ్వసిస్తాం.
శ్రీరామకృష్ణుల అంతేవాసియైన పూజ్య స్వామి వివేకానంద శ్రీరామకృష్ణుల భావాలను ప్రచారం చేసినప్పటి నుండి, ఆయన జీవితచరిత్రను తెలుసుకోవాలనే జనుల ఉత్కంఠ మేరకు అనేకులు ఆయనను గురించి అనేక విషయాలు ప్రచురించారు. కాని వారిలో ఏ ఒక్కరూ అద్వితీయమైన ఆయన జీవితానికి, సనాతన వైదిక ధర్మానికి మధ్య నెలకొనివున్న నిగూఢ సంబంధాన్ని స్పష్టంగా వ్యక్తం చేయలేకపోయారు. తత్ఫలితంగా, పై ప్రచురణలను అధ్యయనం చేసినప్పుడు, శ్రీరామకృష్ణులు సనాతన హైందవమతం నుండి విడివడ్డవారనీ, తమదే అయిన ఒక ప్రత్యేక మతశాఖను నెలకొల్పి వెళ్ళిపోయారనే ఒక దురభిప్రాయం ప్రజల మనస్సులో చోటుచేసుకొంటుంది. అంతేకాక, ఆ కథనాలలో శ్రీరామకృష్ణుల జీవితచరిత్రకు సంబంధించి పొరపాట్లు దొర్లాయి. ఆయన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల, చారిత్రకమైన పూర్వాపర పోకడల మధ్యనున్న సంబంధం వెలుగుచూడలేదు. కాబట్టి ప్రజానీకంలో ఆ కొరతను కొంతమేరకు తీర్చడానికి, తప్పుడు అభిప్రాయాలను సరిదిద్దడానికి, స్వామి వివేకానందుల అడుగుజాడలను అనుసరించి మేం ఈ పుస్తకంలో ఆ అద్వితీయ జీవితాన్ని మాకు ద్యోతకమైన రీతిలో వివరించే ప్రయత్నం చేశాం. శ్రీరామకృష్ణుల అత్యున్నత మానసిక స్థితిని (భావముఖం) చిత్రించడమే మా ఉద్దేశం. ఆ స్థితిని పిసరంత అనుభూతం చేసుకోవడం మూలంగా స్వామి వివేకానంద, తదితరులు, మేం సైతం మా జీవితాలను ఆయన పాదపద్మాల వద్ద అంకితం చేసుకోగలిగాం. సామాన్య వ్యక్తికి అగ్రాహ్యం కాని శ్రీరామకృష్ణుల జీవిత ఉదాత్త ఆశయం కించిత్తు అయినా ఈ పుస్తకంలో కచ్చితంగా అభివర్ణితమై ఉన్నదంటే, అందుకు కారణం ఆయన మహత్వమే అని పాఠకులు గుర్తిస్తారు గాక! కాని ఏ రకమైన అసంపూర్ణత, లోపం దీన్లో చోటుచేసుకొని ఉంటే, అందుకు కారణం సముచిత అవగాహన, వాఖ్యాన సమర్థత మాలో కొరవడి ఉండడమే! శ్రీరామకృష్ణుల అమూల్య జీవితపు ప్రథమ, చరమ భాగాలను పాఠకులకు తదనంతరం సమర్పించగలమని ఆశిస్తున్నాం.*
‘భావముఖం’ లో నెలకొన్న అతి గంభీరమైన శ్రీరామకృష్ణుల జీవితంతో మన సనాతన వైదిక మతానికి ఉన్న నిగూఢ సంబంధాన్ని గురించి చర్చించిన స్వామి వివేకానంద పద్యకృతిని, సూక్తిప్రదమైన వ్యాసాన్ని ముందుగా పొందపరచి ఆ తరువాత ఈ గ్రంథాన్ని ప్రారంభించాం.
– రచయిత