శరత్, హేమంత, శిశిర ఋతువులు వచ్చి వెళ్ళిపోయాయి. ప్రస్తుతం ఋతురాజు వసంతుడు అరుదెంచాడు. వాతావరణంలో ఆహ్లాదం నెలకొని సృష్టి యావత్తు నూతనజీవంతో పులకరించిపోతున్నది. అంత వేడి, అంత చలి కాని ఫాల్గుణ మాసం వచ్చి ఆరు రోజులే అయింది. ప్రాణులన్నింటిలో విశేష ఉత్సాహం, ఆనందం, ప్రేమలు పెల్లుబుకుతున్నాయి. శాస్త్రాలు పేర్కొంటున్నట్లు బ్రహ్మానందంలోని ఒక్క బిందువు యావన్మందిలో నిహితమై ఆనందం కలుగ చేస్తున్నది. ఈ వసంతానికి ఆ దివ్యానందంలో ఒక పాలు ఎక్కువ లభించినట్లుందేమో! అందుకే కాబోలు ఈ సమయంలో లోకం మహోల్లాసంతో ఇంతగా పొంగిపొర్లిపోతున్నది.
1. చంద్రాదేవి భయోద్వేగాలను భర్త తొలగించడం
చంద్రాదేవికి ప్రసవ సమయం దగ్గరపడింది. శ్రీ రఘువీరునికి నైవేద్యం తయారుచేస్తున్నప్పుడు ఆమె హృదయం దివ్యానందంతో నిండిపోసాగింది. కాని శరీరం ఎంతో బడలికగా ఉన్నట్లు ఆమెకు అనిపించింది. అట్టి స్థితిలో ఎప్పుడు ఏమౌతుందో ఎవరికి తెలుసు? నొప్పులు మొదలైతే దేవుళ్ళ సేవకు ఇంట్లో ఎవ్వరూ లేరాయె? ఎలామరి? – అన్న ఆలోచన హఠాత్తుగా ఆమెలో మెదిలింది. ముందు జాగ్రత్తకోసం ఆమె తన ఆలోచనను భర్తకు తెలిపింది.
“భయపడకు. నీ గర్భంలో ఉన్న శిశువు తన జన్మకారణంగా శ్రీ రఘువీరుని సేవలకు ఎలాంటి ఆటంకమూ కల్పించడు. ఆందోళన చెందకు. నేడు భగవత్సేవను నువ్వు తప్పక నిర్వహించగలుగుతావు. రేపటినుండి వేరే ఏర్పాటు చేశాను. అంతేకాదు, ఈ రోజు రాత్రి నుండి ఇక్కడే పడుకోమని ధనికి చెప్పాను కూడా” అని క్షుదిరామ్ చెప్పి, ఆమెను నిశ్చింతురాలను చేశాడు. దానితో చంద్రాదేవి కొత్త బలాన్ని పుంజుకొన్నదై సంతోషంగా ఇంటి పనుల్లో మునిగిపోయింది. క్షుదిరామ్ అన్నట్లే జరిగింది. ఆ రోజు రఘువీరుని మధ్యాహ్న సాయంకాల నివేదనలు, సేవలు నిర్విఘ్నంగా జరిగిపోయాయి. రాత్రి భోజనం ముగించి క్షుదిరాం, రాంకుమార్ నిద్రకు ఉపక్రమించారు. ధని వచ్చి చంద్రాదేవి గదిలోనే పడుకొంది. ఆ ఇంట్లో రఘువీరుని పూజామందిరంతోపాటు రెల్లు పైకప్పుగల రెండు పడక గదులు, ఒక వంట గది ఉన్నాయి. మరో చిన్నగదిలో వడ్లు దంపడానికి రోలూ, దంపిన వడ్లను ఉడకబెట్టడానికి పొయ్యి ఉన్నాయి. మరో అనువైన చోటు లేనందున చంద్రాదేవికి రెల్లుతో కప్పిన యీ చిన్నగదే పురిటి గది అయింది.
2. గదాధర్ జననం (శ్రీరామకృష్ణ)
అరుణోదయానికి ఇంకా పది నిమిషాలు ఉందనగా చంద్రాదేవికి పురుటి నొప్పులు మొదలయ్యాయి. ధని సహాయంతో ఆమె వడ్లగదిలోకి వెళ్ళి పడుకొంది. దాదాపు వెంటనే ఆమె ఒక మగబిడ్డను ప్రసవించింది. చంద్రాదేవికి అవసరమైన సపర్యలు చేసి ధని తన దృష్టిని బిడ్డ వైపుకు సారించింది; తను బిడ్డను ఉంచినచోట బిడ్డ కనిపించలేదు. ధని భయంతో వణకిపోయి దీపం చేతపట్టుకుని గదంతా వెదకింది. రక్తసిక్తమైన నేలమీద ఉన్న బిడ్డ ఎలా దొర్లాడోగాని పొయ్యి వద్దకు దొర్లిపోయాడు. పొయ్యిలోని బూడిదలో వెల్లకిలా పడుకొని కనిపించాడు. అతడి దేహమంతా విభూతి అలదినట్లుగా ఉంది. ఇంత జరిగినప్పటికీ బిడ్డ ఏడుపు వినిపించలేదు. మెల్లగా ధని బిడ్డను లేవనెత్తి, శుభ్రంగా కడిగి ఆ దీపం వెలుగులో ఆ బిడ్డ అందాన్ని, పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆ శిశువు ఆరు నెలల బిడ్డలా ఆమెకు కనిపించాడు. చంద్రాదేవి స్నేహితురాళ్ళయిన ప్రసన్నకు, లాహా కుటుంబంలోని ఇతర స్త్రీలకు కబురు పంపారు. వాళ్ళు రాగానే జరిగింది ధని వాళ్ళతో చెప్పింది. అతిపవిత్ర బ్రహ్మముహూర్తంలో, పరమ పావనుడైన క్షుదిరాం పర్ణకుటీరం మంగళ శంఖ ధ్వానాలతో మార్మోగింది. యుగపురుషుని అవతరణాన్ని ఆ ధ్వానాలు లోకానికి చాటిచెప్పాయి.
3. గదాధర్ జనన ముహూర్తంలో గ్రహగతులు
జ్యోతిషంలో మంచి ప్రవేశమున్న క్షుదిరాం వెంటనే పుట్టిన బిడ్డ రాశిచక్రం గణించి చూశాడు. ఆ శిశువు విశేష శుభముహూర్తంలో ఈ ప్రపంచంలోకి వచ్చాడని కనుగొన్నాడు. మన్మథనామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఆరవ దినం, శుక్లపక్షం, ద్వితీయాతిథి, బుధవారం రాత్రి ముప్ఫై ఒక్క గడియలకు ఇంకా అర్ధ గడియ సమయం ఉండగా బిడ్డ జన్మించాడు. అంటే ఆంగ్లమానం ప్రకారం 1836 వ సంవత్సరం ఫిబ్రవరి 17 వ తేదీ సూర్యోదయానికి ఇంకా పన్నెండు నిమిషాలు ఉండగా శిశువు జన్మించాడు. అప్పుడు పూర్వాభాద్ర నక్షత్రంలో ద్వితీయాతిథి కలిసి సిద్ధయోగం తటస్థించింది. శిశువు జన్మలగ్నంలో రవి, చంద్రుడు, బుధుడు ఒకే స్థానంలో చేరారు. శుక్ర, శని, మంగళగ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయి. ఈ గ్రహాలు శిశువు అనుపమాన జీవితాన్ని సూచిస్తున్నాయి. పరాశర సంహిత ప్రకారం గణిస్తే రాహుకేతువులు ఉన్నతస్థానంలో ఉండడం గమనించవచ్చు. బృహస్పతి కూడ బిడ్డ భవితవ్యంపై విశేష శుభకర ప్రభావాన్ని చూపనున్నట్లు కానవస్తున్నది.
ఫిబ్రవరి 18, 1836 సం ॥ లో శ్రీరామకృష్ణులు జన్మించిన పావనస్థలం
4. జన్మరాశి రీత్యా శిశువు నామకరణం
తదనంతరం సుప్రసిద్ధ జ్యోతిష్కులు ఆ బాలుని జాతకం గణించి, “ఈ బిడ్డడు శుభలగ్నంలో జన్మించాడు. జాతకరీత్యా ఈ లగ్నంలో జన్మించిన వారు సద్గుణ సంపన్నులు, విశేష ఆధ్యాత్మిక లక్షణాలు కలవారు, సదా సత్కార్యాలు ఆచరించే వారు అవుతారని జ్యోతిషశాస్త్రం వక్కాణిస్తున్నది. ఈతడు అనేకమంది శిష్యులతో పరివేష్టితుడై ఒక దేవాలయంలో జీవిస్తాడు. ఒక నూతన మత సంప్రదాయ దృక్పథాన్ని నెలకొల్పుతాడు. నారాయణాంశ సంభూతుడైన మహాత్ముడుగా విరాజిల్లుతాడు” అని చెప్పారు.
5. గదాధరుని జాతక చక్రం
ఆ మాటలు విని క్షుదిరాం ఎంతో విస్మయం చెందాడు. గయలో తాను పొందిన దివ్యస్వప్నం నిజంగా ఫలించిందని భగవంతునిపట్ల అతడి హృదయం కృతజ్ఞతతో పొంగి పోయింది. తరువాత అతడు శాస్త్రోక్తంగా జాతకర్మలు జరిపించి జాతకరీత్యా బిడ్డకు ‘శంభుచంద్ర’ అని నామకరణం చేశాడు. కాని తన అద్భుత స్వప్నం జ్ఞాపకార్థం బిడ్డను గదాధర్ అని పిలవాలని నిర్ణయించుకొన్నాడు; బాలునికి ఆ పేరే తదనంతరం స్థిరపడిపోయింది.
కనులవిందు చేసే తమ బిడ్డ ముఖారవిందం తిలకిస్తూ, అనుపమానమైన ఆతడి భవితవ్యాన్ని తలపోస్తూ క్షుదిరామ్, చంద్రమణీదేవీలు తాము తరించినట్లు భావించుకోసాగారు. యుక్త సమయంలో శిశువుకు ‘నిష్క్రమణ’ కర్మ నిర్వర్తించారు (శిశువును ప్రప్రథమంగా ఆరుబయటకు తీసుకెళ్ళే ఆచారకర్మను ‘నిష్క్రమణ’ కర్మ అంటారు). అమిత శ్రద్ధతో బిడ్డను పెంచాలని ఆ దంపతులు సంకల్పించుకొన్నారు.
కామార్పుకూర్ ఆలయంలోని శ్రీరామకృష్ణుల చలవరాతి విగ్రహం
శ్రీరామకృష్ణులు అవతరించిన చోట 1951 వ సం ॥ లో ఆయనకు అంకితమై వెలసి