నేను ఎవరిని? ఆసియా వాసినా? ఐరోపా వాసినా? అమెరికా వాసినా? ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందు తున్నాను.
– స్వామి వివేకానంద
బయలుదేరారు — ఇటలీలో — క్రీస్తు మార్గమా? — క్రీస్తు జన్మించలేదా? — భారతీయ భావన — హిందూమతాన్ని కించపరిస్తే….. — శ్రీలంక కానవస్తూన్నది!
బయలుదేరారు
మూడున్నర సంవత్సరాల క్రితం భారతదేశం నుండి స్వామీజీ బయలుదేరారు. జగజ్జనని అనుగ్రహమూ, గురుదేవుల ఆదేశమూ, మాతృదేవి ఆశీస్సులూ – వీటిని తోడు చేసుకొని ఒంటరిగా సుదూర దేశానికి వెళ్లి ఒక మహాకార్యాన్ని నిర్వహించి నేడు ఆయన మరలివస్తున్నారు. బహుశా ఆనాడు ఆ కార్యాన్ని కేవలం స్వామీజీ విజయమనే మేరకే భావించి ఉండవచ్చు. కాని ఆ విజయం భారతదేశ ఆధ్యాత్మికతకు విజయం, లోకం పోకడలో ఒక క్రొత్త మలుపును తీసుకువచ్చిన మహత్కార్యమని నేటి చరిత్ర ధ్రువీకరిస్తూన్నది. భవిష్యత్తులో అది ఇంకా స్పష్టంగా అవగతమవుతుందనడంలో ఎలాంటి సంశయమూ లేదు. స్వామీజీకి ఈ విషయం తెలియకపోలేదు. గురుదేవులు అందించిన కార్యాన్ని తన శక్తి మేరకు చక్కగా నెరవేర్చిన సంతృప్తితో ఆయన బయలుదేరారు.
లండన్ నుండి రైలు ద్వారా 1896 డిసెంబర్ 16 వ తేదీ స్వామీజీ భారత దేశానికి తిరుగు పయనమయ్యారు. ఆంగ్లేయ మిత్రులు పలువురు రైలు నిలయా నికి వచ్చి ఆయనకు వీడ్కోలు తెలిపారు. స్వామీజీతోబాటు సేవియర్ దంపతులు కూడా బయలుదేరారు. భారతదేశానికి రాదలచుకొన్న గుడ్విన్, మార్గమధ్యంలో వారిని కలుసుకొంటానని చెప్పాడు. స్వామీజీ, సేవియర్ దంపతుల భారతదేశ పయనం ప్రారంభమయింది.
ఇటలీలో
ఆల్ప్స్ పర్వతాలను దాటి ఫ్రాన్స్ గుండా రైలు ఇటలీ చేరింది. సుదీర్ఘ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొన్న ఇటలీ భవన నిర్మాణమూ, తక్కిన అందాలూ స్వామీజీని ఆకట్టుకొన్నాయి. మిలాన్‌లోని చర్చ్, పిసా నగరం లోని వాలిన గోపురమూ, లియొనార్డో డావిన్సీ విశ్వవిఖ్యాత ‘చివరి విందు’ (Last Supper) తైలవర్ణ చిత్రమూ, ఫ్లారెన్స్లోని చరిత్రాత్మకమైన ప్రదేశాలూ, చిత్రశాలలూ మొదలైనవి తిలకించి స్వామీజీ పరవశం చెందారు.
క్రీస్తు మార్గమా?
రోమ్ నగరంలో స్వామీజీ ఒక వారం గడిపారు. అక్కడ పర్యటిస్తున్న హేల్ దంపతులను ఆయన కలుసుకొన్నారు. వారంతా కలిసి రోమ్‌లోని చరిత్రాత్మక ప్రాంతాలను సందర్శించారు. స్వామీజీ చారిత్రక అవగాహన అందరినీ ఆశ్చర్యపరచింది. ప్రతి ప్రాంతం గురించీ, వాటి చారిత్రక ప్రాధాన్యం గురించీ, రోమ్ నాగరకత గురించీ స్వామీజీ అనర్గళంగా మాట్లాడడం విని, ఆ బృందంలోని ఒకరు ఆశ్చర్యచకితుడై, “స్వామీజీ! రోమ్ నగరంలోని ప్రతి రాయి గురించీ మీకు ఇంతకు మునుపే తెలిసినట్టుందే!” అని వ్యాఖ్యానించాడు.
అది క్రిస్మస్ సమయం. దేశమంతా పండుగ ఉత్సాహమూ, వేడుకల మయంగా ఉంది. బాలక్రీస్తును ఒడిలో ఉంచుకొన్న మేరీ ప్రతిమలను ప్రతిచోటా విక్రయిస్తున్నారు. దుకాణాలూ, వ్యాపారమూ భారతదేశపు పండుగ సందడిని స్వామీజీకి గుర్తు చేసింది.
వాటికన్లోని సెయింట్ పీటర్ చర్చ్ చూసి స్వామీజీ ముగ్ధులయ్యారు. సెయింట్ పాల్, సెయింట్ పీటర్ లాంటి సాధుసత్తములు ఉపదేశించిన ఆ పావన స్థలంలో స్వామీజీ ప్రశాంతచిత్తులై ధ్యానమగ్నులయ్యారు. తరువాత ఆ చర్చ్ నిర్మాణంలోని కళాత్మకతను స్వామీజీ తదేకంగా చూస్తున్నప్పుడు ఒకరు, “స్వామీజీ! ఒక చర్చ్‌కి ఇంత ఆడంబరం, డాబూ అవసరమా? లక్షలాది పేద వారు ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఇక్కడ ధనం ఇలా వెచ్చిస్తున్నారే!” అంటూ వాపోయారు. అందుకు స్వామీజీ ఇలా జవాబిచ్చారు:
“ఏమిటి? భగవంతునికి ఎంతయినా ఇవ్వవచ్చు. ఈ ఆడంబరాల మూలంగా క్రీస్తు జీవిత మహత్త్వాన్ని జనులు అవగతం చేసుకొంటారు. తన కంటూ ఏమీ లేని నిరుపేద అయినప్పటికీ, తన సర్వోన్నత వ్యక్తిత్వ శీలంచే కళా త్మక భావనా స్ఫూర్తిని ఈ మేరకు మానవాళికి ప్రసాదించాడు. కాని ఒక విష యం గుర్తుంచుకోవాలి. ఆంతరిక పవిత్రత పెంపొందడానికి సహాయకారులుగా మాత్రమే బాహ్య కార్యకలాపాలకు విలువ ఉంటుంది. అవి మీ ఆంతరిక జీవితాన్ని వ్యక్తం చేయని మరుక్షణమే వాటిని నిర్దాక్షిణ్యంగా నలిపివేయండి.”
కాని స్వామీజీ ఈ మనఃస్థితి మర్నాడు కొనసాగలేదు. చర్చ్ ఆడంబరం ఆయనను ఒకింత ఆందోళనకు గురిచేసింది. నాడు క్రిస్మస్ పర్వదినం. ఆయన పీటర్స్ చర్చ్ ముఖ్య ప్రార్థనలో సేవియర్ దంపతులతో కలిసి పాల్గొన్నారు. చర్చ్ ఆడంబరాన్ని, అతి వ్యయాన్ని చూసి, “ఇది క్రీస్తు మార్గమా? తలదాచుకోవడానికి సైతం చోటులేక జీవించిన ఆ నిరాడంబర వ్యక్తి అనుయాయులా వీరు?” అని సేవియర్ దంపతులతో గుసగుసగా చెప్పారు.
క్రీస్తు జన్మించలేదా?
1896 డిసెంబర్ 30 వ తేదీ నేపిల్స్ నుండి నౌకలో స్వామీజీ బృందం బయలుదేరింది. నౌక సైద్ నౌకాశ్రయాన్ని సమీపిస్తూన్న సమయంలో స్వామీజీకి ఒక విచిత్రమైన కల వచ్చింది. గడ్డం ఉన్న ఒక వృద్ధుడు ఆయన కలలో కనిపించాడు. ఆ కల గురించి స్వామీజీ తరచు చెప్పేవారు: “ఇంగ్లండు నుండి తిరిగి వస్తున్నప్పుడు ఒక విచిత్రమైన కల కన్నాను. మధ్యధరా సముద్రం మీదుగా మా నౌక పయనిస్తున్నప్పుడు నేను నిద్రిస్తున్నాను. అప్పుడు వృద్ధుడైన ఋషి లాంటి ఒక వ్యక్తి నా కలలో కనిపిం చాడు. ఆయన నాతో, ‘మా ప్రాచీన స్థితిని మాకు మళ్లీ పునరుద్ధరించి ఇవ్వండి. మేం భారతదేశ ప్రాచీన ఋషిసత్తములైన థేరాపుత్ర* సంప్రదాయానికి చెందిన వారం. మేం బోధించిన సత్యాలనూ, ఆదర్శాలనూ క్రైస్తవులు, క్రీస్తు అనే వ్యక్తి బోధించినట్లుగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి క్రీస్తు అని పేర్కొనబడే వ్యక్తి ఎవరూ అసలు జన్మించలేదు. ఈ ప్రాంతాన్ని త్రవ్వి చూస్తే నేను చెప్పిన దానికి అనేక నిదర్శనాలు బయటపడతాయి’ అన్నాడు. వెంటనే నేను, ‘ఏ చోట త్రవ్వాలి?’ అని అడిగాను. అందుకు ఆయన టర్కీకి సమీపంలోని ఒక ప్రాంతాన్ని చూపి, ‘ఇదిగో, ఇక్కడే’ అన్నాడు. ఆ క్షణంలో నా కల చెదరిపోయింది. వెంటనే నౌక పైభాగానికి పోయి కెప్టెన్‌తో, ‘ఇప్పుడు సమయం ఎంత?’ అని అడిగాను. అందుకు అతడు, ‘అర్ధరాత్రి’ అన్నాడు. పిదప, ‘మనం ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నాం?’ అని అడిగాను. నా ప్రశ్నకు అతడు, ‘క్రీట్ ద్వీప సమీపంలో! అదిగో చూడండి! అక్కడే టర్కీ, క్రీట్ ద్వీపమూ ఉన్నాయి’ అని జవాబిచ్చాడు. ఇది కేవలం కలా! లేదా దీన్లో కొంతైనా నిజం ఉందా? ఎవరి కెరుక?” (లేవండి, మేల్కొనండి!, సంపుటం. 8, పుట 291)
ఏసుక్రీస్తు చరిత్రాత్మకతను స్వామీజీ ఇంతదాకా సంశయించింది లేదు. కాని ఈ కల ఆయన మనస్సులో క్రైస్తవమతం గూర్చి పలు ప్రశ్నలను లేవ దీసింది. క్రైస్తవ మతారంభమని బైబిల్ పేర్కొన్నది కాక ఇంకా అనేక విషయాలు ఉన్నాయని ఆయన నమ్మారు. థేరాపుత్రులు జీవించినట్లు తెలిపే ప్రాంతమైన అలెగ్జాండ్రియాలో భారతీయ, గ్రీకు, ఈజిప్షియన్ భావనల సంగమం నెలకొన్న విషయం స్వామీజీకి తెలియకపోలేదు. స్వామీజీ అంతటితో ఆగిపోలేదు. పురాతత్త్వ శాస్త్రజ్ఞుడైన తన ఆంగ్లేయ మిత్రుడు ఒకరికి దీన్లోని నిజానిజాలు పరిశోధించి కనుగొనమని వ్రాశారు.*
కాని చారిత్రక సత్యాలు స్వామీజీ భక్తిభావనను ఎన్నడూ ఆటంకపరచలేదు. క్రీస్తు పట్ల ఆయనకు గల భక్తిప్రపత్తులు ఎన్నటికీ చెక్కుచెదరలేదు. “నేను కూడా పాలస్తీనాలో క్రీస్తుతో కలసి జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు, నా హృదయ రుధిరంతో కదా కడిగి ఉండేవాణ్ణి!” అని ఒకసారి భావోద్వేగంలో పలికిన ఆ భావనలో కించిత్తయినా మార్పు కలుగలేదు.
భారతీయ భావన
నౌక సూయజ్ కాలువ గుండా పయనించసాగింది. భౌతికంగానే కాక, మానసికంగా కూడా ఐరోపాను వదలి వచ్చేస్తున్నారు స్వామీజీ. భారతీయ భావ నలు ఆయనను క్రమ్ముకోసాగాయి. “సూయజ్ నుండి ఆసియా ప్రారంభమవుతోంది. మళ్లీ ఆసియాకు వచ్చేశాను. నే నెవ రిని? ఆసియావాసినా? ఐరోపావాసినా? అమెరికావాసినా? నాలో ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని అనుభూతి చెందుతున్నాను”* అని ఆయన వ్రాశారు.
కాని ఆయనలో భారతదేశం గురించిన తలంపులు తలెత్తుతున్నాయన్నదే నిజం. నౌక ఏడెన్‌ను సమీపించింది. నౌక నుండి దిగి పలు చోట్లు తిరిగి చూస్తూవున్నప్పుడు, అక్కడ వీథిలో తమలపాకులు అమ్మే వ్యక్తి ఒకడు హుక్కా త్రాగుతూ ఉండడం స్వామీజీ కంటబడింది. అంతే, తనతో వచ్చిన ఆంగ్లేయ మిత్రులను మరచిపోయారు, సమస్తం మరచిపోయారు. ఒక సగటు భారతీయునిలా ఆ వ్యక్తి వైపుగా పరుగుతీశారు. అతణ్ణి సమీపించి, “సోదరా! ఆ హుక్కా కాస్త ఇస్తావా? నేనూ ఒకసారి పొగ పీలుస్తాను” అని అడిగారు. అతడు హుక్కాను అందివ్వగానే ఆనందంగా స్వామీజీ పీల్చసాగారు. ఆయనతో వచ్చిన మిత్రులు స్వామీజీ భారతీయ భావనను అవగతం చేసుకొన్నారు. “తమలపాకులు అమ్మే వ్యక్తి నుండి హుక్కా కోసం ఆయన బ్రతిమలాడినప్పుడు ఆయన ముఖాన ద్యోతక మైన భారతీయ భావనను నేను మరచిపోలేను” అని శ్రీమతి సేవియర్ కాలాంత రంలో చెప్పారు. స్వామీజీ ఎవరో తెలుసుకొన్న ఆ తమలపాకులు అమ్మే వ్యక్తి ఆయనకు పాదాభివందనం చేశాడు.
హిందూమతాన్ని కించపరిస్తే…..
స్వామీజీ వస్తున్న నౌకలో ఇద్దరు క్రైస్తవ మత ప్రచారకులు కూడా పయ నిస్తున్నారు. స్వామీజీతో వాదించి, క్రైస్తవ మత ఔన్నత్యాన్ని నెలకొల్పాలని వారు అభిలషించారు. కాని స్వామీజీతో మాట్లాడినప్పుడు పరిస్థితి విషమించింది; వారు పరాజయం చవిచూడసాగారు. ఆయ నతో వాదించి జయించలేమని గ్రహించిన వారు హిందూ మతాన్ని నిందిస్తూ, అగౌరవపరుస్తూ మాట్లాడనారంభించారు. స్వామీజీ సహ నంతో అంతా విన్నారు. వారి దుర్భాష, పరిహాసం హద్దుమీరినప్పుడు ఆయన మెల్లగా లేచి, తిన్నగా ఒక ప్రచారకుని ముందుకు వెళ్లారు. హఠాత్తుగా ఆతడి చొక్కా పుచ్చుకొని, తమాషాగా, అదే సమయంలో తీవ్రంగా, “ఇంకా ఏదైనా మాట్లాడావంటే అట్లే సముద్రంలోకి విసిరివేస్తాను” అన్నారు. ఆ క్రైస్తవ ప్రచార కులు గడగడలాడిపోయారు. స్వామీజీ పిడికిలిలో చిక్కిన వ్యక్తి భయపడిపోయి, “వదలిపెట్టండి. ఇక ఏమీ మాట్లాడను” అన్నాడు. ఆ ప్రచారకుడు తదనంతరం స్వామీజీ పట్ల ఎంతో మర్యాదతో మెలగాడు.
ఈ సంఘటనను కాలాంతరంలో ప్రియనాథ్ సిన్హాతో ప్రస్తావించి అతడితో, “నాయనా! ఎవరైనా నీ తల్లిని దూషిస్తే నువ్వు ఏం చేస్తావు?” అని అడిగారు. అందుకు ప్రియనాథ్, “వాణ్ణి వదలిపెట్టను. అతడికి ఒక చక్కని గుణపాఠం నేర్పుతాను” అని జవాబిచ్చాడు. “బాగా చెప్పావు. అదే భావన మన పవిత్ర దేశపు నిజమైన తల్లియైన నీ సొంత మతం పట్లా ఉన్నట్లయితే, ఒక హైందవ సోదరుడు క్రైస్తవునిగా మతం మార్చుకోవడం అనే విషయాన్ని నువ్వు ఎన్నడూ జీర్ణించుకో లేవు. కాని నీ కళ్ల ముందే మత మార్పిడి నిత్యం జరుగుతూనే ఉంది. నువ్వు దానిని గురించి ఉదాసీనంగా ఉన్నావు. నీ విశ్వాసం ఎక్కడుంది? ఎక్కడుంది నీ దేశభక్తి? నీ కళ్ల ముందే క్రైస్తవ మత ప్రచారకులు హిందూమతాన్ని అవహేళన చేస్తూ, మతమార్పిడి చేస్తున్నారు. దీనిని నిరోధించడానికి మీలో ఎందరు ప్రయత్నిస్తున్నారు? ఈ ఘోరం చూసి ఎందరి రక్తం ఉడికిపోతూన్నది?” అని స్వామీజీ అడిగారు.
శ్రీలంక కానవస్తూన్నది!
జనవరి 15 వ తేదీ ఉదయం. నాటి సూర్యోదయం స్వామీజీకి భారత భూభాగాన్ని చూపించింది – సుదూరంలో శ్రీలంక కానవచ్చింది.* బాలభానుని లేత ఎరుపు రంగు నేపథ్యంలో భారత భూభాగంలోని దృశ్యం స్వామీజీని ఉత్తేజపరచింది. క్రమంగా ఎత్తైన తాటి చెట్లూ, పసుపుపచ్చ రంగు ఇసుకను సంతరించుకొన్న సముద్రతీరమూ కానరాసాగాయి. స్వామీజీ నౌక నుండి దిగడానికి తయారయ్యారు.