నేను ప్రప్రథమంగా మాతృదేవిని దర్శించినప్పుడు నా వయస్సు 13/14 ఏళ్లు ఉండవచ్చు. మపేతీ షేక్, హమేతీ షేక్‌లు నా మామలు. వీరే నన్ను జయరాం బాటికి తీసుకువెళ్లారు. సిహోర్కు సమీపంలోని శిరోమణిపూర్ మా స్వగ్రామం. దీనికి దగ్గరలోని పరమానందపూర్లో నా మామలు ఉండేవారు. ఈ రెండు ఊళ్ల లోని స్త్రీపురుషులు అనేకులు మాతృదేవి విశేష అనుగ్రహాన్ని పొందివున్నారు. శిరోమణిపూర్లోని అంజద్, ఆయన భార్య మతిజాన్ బీబీ, తల్లి ఫాతిమా బీబీ తదితరులను మాతృదేవి ఎంతో ఆప్యాయంగా చూసేవారు. ఆప్యాయత చూపడమే కాదు, వారి కుటుంబాలను పోషించింది కూడా మాతృదేవియే అని చెప్పవచ్చు.
సామాన్యంగా అంజద్ ఊళ్లో ఉండడు. ఇంట్లో తిండికే దారిలేనప్పుడు ఆతడి భార్య, తల్లి మాతృదేవి ఇంటికి వెళ్లడం కద్దు. వారి దీనావస్థను చూసి భరించలేక కడుపార భోజనం పెట్టడంతోపాటు, నూనె బియ్యం గుడ్డలు వంటివి ఇచ్చి పంపేవారు.
రెండు ఊళ్లలోను అప్పుడు నీలిమందు వ్యవసాయం* చేసేవారు. ఆంగ్లేయులు జమీందారుల ద్వారా ఈ పంటనే పండించమని ఒత్తిడి చేసేవారు. అందువలన మరే వృత్తిని గ్రామస్థులు చేపట్టలేని దుస్థితికి లోనైనారు. అన్నిటికీ వారు జమీం దారుల, ఆంగ్లేయుల మీదే ఆధారపడి జీవించవలసి వచ్చేది. వారి అరాజకాన్నీ, నిర్బంధాన్నీ సహించాల్సి వచ్చేది. రెండు గ్రామాలలోను మహమ్మదీయులు అధిక సంఖ్యాకులు. వారు ఏ వృత్తీ చేపట్టలేక నిరుపేద జీవితాలను గడిపారు. వీరి దుఃఖాలూ, క్లేశాలూ సిహోర్, జయరాంబాటి, పులూయ్ వంటి పొరుగు గ్రామాల ధనుకుల, మధ్యతరగతి వారి ఎవరి కంటా పడలేదు. వారి దుఃఖాలలోను, కష్టాలలోను పాలుపంచుకొన్న వ్యక్తి కరుణామూర్తియైన మాతృదేవి ఒక్కరే! కులమత వివక్షత లన్నింటిని నేలరాచి, తమ ఒళ్లో చోటిచ్చి మమ్మల్ని కాపాడింది మాతృదేవియే!
నా మామ లిద్దరికీ ఎడ్లబళ్లు ఉండేవి. ఆ బళ్ల మీద ప్రయాణీకులను వాళ్లు తీసుకువెళ్లెవారు. మాతృదేవినీ, ఆమె కుటుంబ సభ్యులనూ నా మామలు అనేకసార్లు తమ బళ్లలో తీసుకువెళ్లడం స్వయంగా నేను చూశాను.
సిహోర్కు సమీపంలో మాతృదేవి తమ్ముళ్లకు కొంత పొలం ఉండేది. ఆ పొలాన్ని మపేతీ షేక్ సేద్యం చేసేవాడు. ఆయన భార్య మజిరన్ బీబీ, హమేతీ షేక్ భార్యయైన నబిజాన్ బీబీ తరచు మాతృదేవి వద్దకు వెళ్ళేది. వారిని మాతృదేవి ఎంతగానో ఆదరించేవారు. ‘బీబీ కుమార్తెలు’ అని వారిని సంబోధించేవారు. వారి కష్టాలు గ్రహించి, అవసరమైనది చేసిపెట్టేవారు.
జయరాంబాటిలో మాతృదేవి కోసం కటన్టి కొత్త ఇంటి నిర్మాణంలో పనిచేసిన వారిలో ఎక్కువమంది ఈ రెండు గ్రామాలకు చెందిన మహమ్మదీయులే! ఇల్లు కడుతున్నప్పుడు శరత్ మహరాజ్ వచ్చారు. మా గ్రామాలను కూడా సందర్శించారు. మహమ్మదీయులను హిందువుల ఇళ్ళకే అనుమతించని ఆ రోజుల్లో, మహమ్మ దీయులు మాతృదేవి ఇంటి నిర్మాణంలో పాల్గొనడం అక్కడి హిందువులకు గిట్టలేదు. మాతృదేవిని ‘మ్లేచ్ఛురాలు’ అని పేర్కొనడానికి కూడా వారు సంకోచించలేదు. మాతృదేవి బంధువులు సైతం అక్కడ పనిచేయకూడదని మమ్మల్ని అడ్డుకొన్నారు. మాతృదేవి మేలిముసుగు లేకుండా బయటకు రారు, ఎంతో మృదువుగా మాట్లాడతారు. కాని అన్యాయాన్ని ఎదుర్కొనడంలో ఆమె ఎన్నడూ తటపటాయించ లేదు. తమ గృహనిర్మాణ విషయంలో కూడా ఎంతో సుస్థిరంగా నిలబడ్డారు. గ్రామస్థుల వ్యతిరేకత మూలంగా ఒకటి రెండు రోజులు పని జరగలేదు. కాని మాతృదేవి మేమే పని చేయాలని పట్టుబట్టారు. చివరకు గ్రామస్థులే వెనక్కుతగ్గారు. ఈ సంఫుటన తరువాత మేం తరచు మాతృదేవి ఇంటికి వెళ్లిరావడం ప్రారంభించాం.
మా గ్రామంలో ఈత చెట్లు ఎక్కువ. వాటి నుండి ఈతనీరు సేకరించి, ఆ నీటినుండి బెల్లం తయారుచేయడాన్ని పలువురు తమ వృత్తిగా చేసుకొన్నారు. ఈత నీరు, ఈత బెల్లం అంటే మాతృదేవికి ఎంతో ఇష్టం. నేను వాటిని తీసుకు వెళ్లేవాడను. మాతృదేవి వాటికి తగిన ధరకట్టి ఇచ్చేవారు. వద్దంటే, “నాయనా, నువ్వు కష్టపడి తయారుచేసింది కనుక తప్పకుండా డబ్బు తీసుకోవాల్సిందే” అని కచ్చితంగా చెప్పేవారు. డబ్బుతోపాటు ప్రసాదమూ, మరమరాలు ఇచ్చేవారు.
శిరోమణిపూర్లో వసిస్తూన్న తూతూ ఫకీర్, సేలిం ఫకీర్లు మాతృదేవి వద్దకు వెళ్లేవారు. నవాన్న కాలంలో* వారు ఇంటింటికీ వెళ్లడం పరిపాటి.* మాతృదేవి వారిని ఎంతగానో అభిమానించేవారు. శిరోమణిపూర్ మసీదులో మట్టిగుర్రం, పిండి ఉండలు మొదలైనవి సమర్పిస్తానని మాతృదేవి మొక్కుకోవడమూ కద్దు.* హమేతీ, మపేతీ మామయ్యలు ఇలా అనేవారు: “మాతృదేవికి ఎంత భక్తి. మా పండుగలలో కూడా మొక్కుకొని, నివేదనానికి తీపిపదార్థాలు సైతం పంపేవారు.”
ఒకసారి మపేతీ మామయ్య మాతృదేవితో, “అమ్మా మీరు హిందువులు. మహమ్మదీయ పండుగలలో ఎందుకు మొక్కుకొంటారు? నివేదనానికి ఎందుకు తీపిపదార్థాలు పంపుతారు?” అని అడిగాడు. అందుకు మాతృదేవి ఇలా జవా బిచ్చారట: “హిందువులకూ, మహమ్మదీయులకూ దేవుళ్లు విడివిడిగా ఉన్నారా ఏమిటి? అందరికీ దేవుడు ఒక్కడే కదా! మీ గురుదేవులు ఇస్లాం మత సాధనలు అనుష్ఠించారు. నమాజ్ చేశారు. అంతా ఒక్కటే నాయనా! పేరులోనే తేడా!”
మేం గురుదేవులను, మాతృదేవిని భగవంతుని దూతలుగానే పరిగణిస్తాం. హమేతీ, మపేతీ మామయ్యలను మేం చూశాం. వారుకూడా వీరిని దేవుని దూతలు గానే భావించారు. వీరిని పోలిన వ్యక్తులు మళ్లీ వస్తారా ఏమిటి? వారు అల్లా దూతలు, స్వర్గంలోని దేవతలు!