శ్రీ వివేకానందస్వాములవారు, కలకత్తా చేరగానే ప్రజలు అత్యుత్సాహంతో శ్రీవారి కెదురేగి గౌరవించారు. శ్రీవారు, చక్కగా అలంకరించబడిన ఆ నగర వీధులగుండా వెళ్ళేటప్పుడు శ్రీవారి నొక్కసారి కనులారా చూస్తే చాలని ఆత్రపడే ఆబాలగోపాలంతో మార్గమంతా కిక్కిరిసిపోయింది. వారం రోజులు గడచిన తర్వాత శోభా బజారులోని కీ.శే.రాజారాధాకాంత దేవబహదూరువారి నివాసంలో శ్రీవారికి బహిరంగ స్వాగతసత్కారం చేశారు. అప్పుడు రాజా వినయ కృష్ణదేవ బహదూరుగారు అధ్యక్షత వహించారు. అధ్యక్షులు కొద్ది పరిచయవాక్కులు పలికిన తర్వాత, ఈ క్రింది స్వాగతపత్రాన్ని చదివి ఒక రజతపేటికలో అమర్చి శ్రీవారి కర్పించారు.
శ్రీమత్ వివేకానందస్వాములవారికి
ప్రియసోదరా!
మీ జన్మభూమికి మీరు తిరిగి విజయం చేసే సమయంలో, కలకత్తా నగరానికి, వంగదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన హిందువులమైన మేము కృతజ్ఞతతోను, గర్వంతోను ప్రేమపూర్వకంగా స్వాగతమర్పిస్తున్నాం. ప్రపంచంలోని అనేక ప్రదేశాల్లో, మీరు చేసిన ఘనకార్యాలవలన మీ ఉత్తమాదర్శాలవలన, మన మతానికి, మన దేశానికీ, అందునా, ముఖ్యంగా మన రాష్ట్రానికి మహాగౌరవం కలిగింది.
1893 వ సంవత్సరంలో, షికాగో నగరంలో విశ్వప్రదర్శన సందర్భంగా జరిగిన అఖీలమత మహాసభలో మన ఆర్యుల మతధర్మాలను మీరు విశదీకరించారు. మీరు చేసిన వివరణ సారాంశం, శ్రోతలలో అత్యధిక సంఖ్యాకులకు దివ్యాదేశమైంది. శైలివల్ల అయితేనేం, భావపటుత్వంవల్ల నైతేనేం, ఆ సందేశసరళి వారిని తన్మయులను చేసింది. కొందరు సంశయాత్ములై విని ఉండవచ్చు. అయినా దానివల్ల విజ్ఞానవంతులైన అమెరికన్లలో చాలామంది మతభావాల విషయంలో పూర్తిగా మారిపోయారు. వారి హృదయాకాశాన నూతన తేజస్సు ఉదయించింది. తమ సహజ శ్రద్ధతో, సత్యపరాయణతతో, మీ సందేశ పూర్ణఫలాన్ని పొందాలని వారు నిశ్చయించుకొన్నారు. దానితో, మీ ప్రబోధావకాశాలు, విశాలతరమయ్యాయి; మీ కార్యక్రమం వ్యాప్తిచెందింది. అనేక రాష్ట్రాలనుండి, నగరాలనుండి వచ్చే ఆహ్వానాలను మీరు అంగీకరించవలసి వచ్చింది. అనేక ప్రశ్నలకు సమాధానాలనిస్తూ, అనేక సంశయాలను తీరుస్తూ, అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ వచ్చారు. ఈ కార్యమంతా మీరు మహత్తర శక్తితో, సామర్థ్యంతో, నిష్కాపట్యంతో నిర్వహించారు. అందువల్ల శాశ్వతఫలం చేకూరింది. మీ బోధ అమెరికన్ కామన్వెల్తులోని అనేక విద్వత్సంఘాల మనస్సులో గాఢంగా నాటి, వారి జిజ్ఞాసను, పరిశోధనాభిలాషను పురికొల్పింది. అనేక సందర్భాల్లో వారి మతభావాలు, స్పష్టమైన పరివర్తన చెందాయి. భారతీయుల ఆదర్శాలయెడ వారికి గౌరవం అతిశయించింది. మతాలను, పరస్పరం పోల్చి పరిశీలించడానికీ, ఆధ్యాత్మిక ధర్మాలను పరిశోధించడానికీ, ఎన్నో క్లబ్బులు, సమాజాలు నెలకొల్పబడి, త్వరగా వృద్ధిచెందాయి. ఆ దూర పాశ్చాత్య భూమిలో, మీరు చేసిన కృషికి అవన్నీ సాక్షులు. లండన్ నగరంలో, వేదాంతతత్త్వశాస్త్ర బోధనకై ఏర్పడిన ఒక కళాశాలను నిజానికి మీరే స్థాపించారనవచ్చు. అక్కడ మీరు పరంపరగా ఇచ్చిన ఉపన్యాసాలను వినడానికై ఎందరో ఆత్రపడుతూ వచ్చి విని మిమ్మల్ని ఎంతగానో అభినందించారు. వాటి మహిమ ఆ ఉపన్యాస భవనాల ఆవరణను దాటి, చాలాదూరం వ్యాపించింది. మీరు లండన్ నగరం వదలే సమయంలో, ఆ నగరంలోని వేదాంతశాస్త్ర పాఠకులు మీకు సమర్పించిన వినతి పత్రాలలో చూపిన ప్రగాఢ కృతజ్ఞతవల్ల వారి మనస్సుల్లో మీ బోధ ఎలాంటి ప్రేమను, గౌరవాన్ని కలిగించిందో స్పష్టమౌతోంది.
ఆర్యుల ధర్మసూత్రాలతో మీకున్న గాఢమైన పరిచయాన్ని, వాగ్రూపంలోను గ్రంథరచనా మూలంగానూ భావప్రకటన చేయడంలో మీకున్న సామర్థ్యాన్ని, ముఖ్యంగా మీ శీల మహిమ, మత బోధకులుగా మీరు సాధించిన విజయానికి కారణాలు. మీ ఉపన్యాసాలు, మీ వ్యాసాలు, మీ గ్రంథాలు, ఆధ్యాత్మికంగా, సాహితీ విషయకంగా, అద్భుతప్రభావం కలవి. అవి ఇక మహాఫలితాలను ఇవ్వకుండా ఉంటాయా? అయినా నిరాడంబరం, నిష్కపటం, త్యాగపూరితం అయిన మీ శీలం, మీ జీవితాదర్శం, మీ వినయసంపద, మీ భక్తి, మీ దీక్షాపరాయణత, ఆ మహిమకు, వాక్కుతో వర్ణించలేని విధంగా వన్నెతెచ్చాయి.
మన మతంలోని సూక్ష్మధర్మాలను ఉపదేశించి, మీరు చేసిన లోకోపకారానికి, మా కృతజ్ఞతను తెలిపే ఈ సమయాన, మీ గురుదేవుడైన శ్రీరామకృష్ణ పరమహంసలవారిని సంస్మరించి, భక్తితో సంభావిస్తున్నాం. మిమ్మల్ని మాకు ప్రసాదించిందీ వారే! మీలోని దివ్యతేజాన్ని అసాధారణమైన అద్భుత సూక్ష్మదృష్టితో ముందుగానే కనిపెట్టి, వారు మీ భవ్యజీవిత విశేషాన్నిగూర్చి జోస్యం చెప్పారు. ఓహో! అది ఇప్పుడు అందరికీ తెలిసేలా ప్రకటితం కావడం ఎంతో ఆనందదాయకం. భగవంతుడు మీకు ప్రసాదించిన ఆత్మదృష్టిని, దివ్యశక్తిని వెలికితెచ్చిన మహనీయుడు ఆయనే! మీ సంకల్పాలకు, ఆశయాలకు, క్రమగతిని ప్రసాదించి, అదృశ్య ప్రపంచంలో మీ పరిశోధనలలో తోడుగా నిలిచి, దారిచూపినదికూడ ఆ మహాపురుషుడే! భావి సంతానానికి, ఆయన ఇచ్చిన దివ్యప్రసాదమే శ్రీవారుగా మూర్తీభవించింది!
మహాత్మా! సుస్థిరంగా, మీ నిర్ణీత దివ్యమార్గాన ధీరతతో సాగిపోండి! మీరు జయించవలసివున్న ప్రపంచ మొకటుంది. అజ్ఞానులకు, సంశయాత్ములకు, బుద్ధిపూర్వకంగా కళ్ళు మూసుకొనేవారికి, భారతీయుల మతధర్మాన్ని విప్పి చెప్పి, దాని గౌరవాన్ని మీరు నిలబెట్టవలసి ఉంది. మా అభిమాన గౌరవాలను చూరగొనే విధంగా, ధీరులై పనిచేయనారంభించారు. మీరిప్పటికే సంపాదించిన విజయాలకు, అనేక దేశాలు సాక్ష్యం పలుకుతున్నాయి. కాని చేయవలసింది ఇంకా చాలాఉంది. మన మాతృదేశమైన ఈ భారతభూమి మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది. హిందువుల మతధర్మాన్ని, హిందువుల్లోనే ఎందరికో విప్పి చెప్పి బోధించవలసివుంది. అలాంటి గురుతర కార్యానికి మీరు సంసిద్ధతతో పూనిక వహించండి. మీలోను, మన ఉద్యమ అద్భుత మహిమలోను, మాకు సంపూర్ణ విశ్వాసముంది. మన జాతీయమతం, భౌతిక విజయాన్ని సాధింపచూడటం లేదు. దాని గమ్యస్థానం పారమార్థికం. జడమతుల కళ్ళకు కానరాక, జిజ్ఞాసువులకు ప్రత్యక్షమైన సత్వతత్త్వమే మన మతం దివ్యాయుధం. ప్రపంచాన్ని, అవసరమైతే భారతీయులను సైతం, తమ అంతరంగిక నేత్రం తెరిచి, ఇంద్రియానుభవాలకు అతీతంగా నిలిచి, పవిత్ర శాస్త్రగ్రంథాలను విధ్యుక్తమార్గంలో పఠించి, పరమార్థాన్ని ప్రత్యక్షం చేసుకొని, మానవులై పుట్టిన తమ స్థితిని, తమ పరమావధిని తెలుసుకోండని, మీరు హెచ్చరించవచ్చు గాక! అలాంటి ప్రబోధం చేయడానికి, అలాంటి హెచ్చరికను కల్పించడానికి, మీకంటె అర్హులు ఇతరులు లేరు. భగవన్నిర్ణీతమై కనిపించే ఈ మీ మహోద్యమంలో హృదయ పూర్వకంగా సానుభూతిని చూపడానికీ, కార్యసాధనలో నిష్కపటంగా తోడ్పడటానికీ, సిద్ధంగావున్నామని ప్రియసోదరా, ఇలా మనవి చేసుకుంటున్నాం.
ఇట్లు
తమ ప్రియమిత్రులు, భక్తులు.
శ్రీ స్వాములవారు ఈ క్రింది విధంగా ప్రత్యుత్తరమిచ్చారు:
మానవుడు వ్యక్తిత్వం వదలి, సమష్టితత్త్వంలో కలిసిపోవాలని కాంక్షిస్తాడు. అతడు సర్వసంగ పరిత్యాగంచేసి, పరుగెత్తి పోవాలనుకుంటాడు. శారీరక సంబంధాలనన్నిటినీ ఒక్కుమ్మడిగా తెంచేయాలనుకుంటాడు. గతాన్ని మరచి, తానొక మానవుడననే మాటునుసైతం విస్మరించడానికి ప్రయత్నిస్తాడు. అయినా, అతని హృదయాంతరాళంలో, ఒక సూక్ష్మధ్వని, ఒక విచిత్ర తంత్రీస్పందనం, ఒక రహస్యవాణి, పాశ్చాత్య ప్రపంచంలోగానీ, ప్రాచ్య ప్రపంచంలోగానీ, ‘స్వస్థానం స్వర్గతుల్య’ మని ఘోషిస్తూంటుంది. సామ్రాజ్య ప్రధాన నగరవాసులారా! నేనిప్పుడు మీ ఎదుట నిలబడ్డది ఒక సన్న్యాసిగా కాదు; మత బోధకుడనుగాకూడ కాదు. ముందు, మీతో ముచ్చట్లాడుతూ తిరిగిన కలకత్తా బాలుడుగానే మీ ఎదుటికి వస్తున్నాను. ఓహో, నా చిన్ననాటిలాగానే స్వేచ్ఛగా, ఈ నగర వీథుల్లో దుమ్ములో కూర్చుని, నా మనసులోవున్న దాన్ని మీకు విప్పి చెప్పడం నాకెంతో ఆనందకరం. మీరు ‘సోదరా!’ అనే సాటిలేని ప్రేమలొల్కే పదంతో నన్ను సంబోధించినందుకు హృదయపూర్వక వందనాలను మీ కర్పిస్తున్నాను. నిజంగా, నేను మీ సోదరుడినే కదా? అలాగే మీరూ నాకు సోదరులు! నేను ఇక్కడికి బయలుదేరి వస్తున్నప్పుడు ఆంగ్ల మిత్రుడొకడు “స్వామీ! సర్వభోగ సమన్వితం, మహాతేజోవిరాజితం, అసదృశశక్తిమంతం అయిన ఈ పాశ్చాత్యప్రపంచంలో గత నాలుగేళ్ళ అనుభవంతో, మీ మాతృదేశానికి మరలడం మీకెలాగుంది?” – అని ప్రశ్నించాడు. “ఇక్కడికి రావడానికి ముందు నేను భారతదేశాన్ని ప్రేమించాను. ఇప్పుడు ఆ భారతదేశ ధూళిసైతం పరమపావనమై నాకు కనిపిస్తోంది. ఆ దేశమిప్పుడు ప్రియతమ యాత్రాస్థానంగా, తీర్థక్షేత్రంగా కనిపిస్తోంది” అని జవాబిచ్చాను. కలకత్తా నగరవాసులారా! నా సోదరులారా! మీరు నాపట్ల చూపుతున్న ప్రేమకు తగిన రీతిగా నా కృతజ్ఞతను మాటలలో తెలుపలేను. ఇంతెందుకు? మీ పట్ల నా కృతజ్ఞతను తెలపాలని ప్రయత్నమే చేయకూడదేమో? ఎందుకంటే, మీరు నా సోదరులు కదా? మీరు విధిగా నిర్వహించతగిన సోదరధర్మాన్ని నిర్వహిస్తున్నారు. ఔను, ఇది భారతీయులకు సహజమైన ధర్మమే కదా? ఇలాంటి కుటుంబ బాంధవ్యాలు, బంధుత్వాలు, అనురాగం, మన మాతృదేశపు సరిహద్దులను దాటితే మరెక్కడా కానరావు.
అఖీల మతమహాసభ బ్రహ్మాండ కార్యమనడానికి సందేహం లేదు. ఆ సభను ఏర్పాటుచేసిన పెద్దమనుషులను ఈ దేశంలోని వివిధ నగరాల నుండి మనం అభినందించాం. వాళ్ళు, మనపట్ల చూపిన ఆదరణనుబట్టి మనకు వందనీయులే; కాని ఆ మతమహాసభ చరిత్రను కొంచెం మీకు చెబుతాను, వినండి. వాళ్ళు ఒక గుర్రాన్ని తెచ్చి దానిపై స్వారిచేయమని కోరారు. క్రైస్తవేతర మూఢజనులను చేర్చి ఒక విధమైన ప్రదర్శన చేయడానికి ఉబలాటపడ్డారు. కానీ, వారు కోరుకొన్న దొకటి, జరిగింది మరొకటి! విధివ్రాత. వాళ్ళలో చాలామంది మంచివారే; అందుకై వాళ్ళకు కావలసినన్ని నమస్కారాలను మనం సమర్పించాం.
అమెరికాలోని నా కర్తవ్యం అఖీలమత మహాసభకు సంబంధించిందే కాదు. అది ఆనుషంగికం. అంటే, నా మార్గంలో సంఘటిల్లిన ఒకానొక విషయం. అది నాకొక అవకాశాన్ని కల్పించింది. అందుకు ఆ సర్వమత పరిషత్ సభ్యులపట్ల మనం సదా కృతజ్ఞులం! కాని నిజంగా, మనం నమస్కరించవలసింది ఆ అమెరికను మహాజాతికి! తక్కిన చోట్లకంటె అక్కడ సోదరభావం పూర్ణవికాసాన్ని పొందింది. మీరు రైలుబండిలో ఒక అమెరికా దేశీయుని ఐదునిమిషాలపాటు కలుసుకోండి, చాలు. అతడు మీ స్నేహితుడైపోతాడు. మరుక్షణమే అతిథిగా తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. అక్కడ దాపరికంలేని తన జీవితసరళినంతా నీకు చెబుతాడు. అమెరికన్ జాతి శీలలక్షణం ఆ విధంగా ఉంది. అది మనకు చాలా మనోహరంగా ఉంటుంది. వారు నాపట్ల చూపిన ప్రేమను నేను వర్ణించి చెప్పజాలను. ఎంతటి అద్భుతాదరంతో వారు నన్ను చూశారో చెప్పడానికి నాకు కొన్ని సంవత్సరాలకాలం పడుతుంది. అట్లే అట్లాంటిక్‌కు ఆవలవున్న ఇంగ్లండుకు మన ధన్యవాదాలు. నాకంటె ఇంగ్లీషువారి పట్ల జాతిని బట్టి ఎక్కువ ద్వేషంతో, నిండిన హృదయంతో మరెవ్వరూ ఆంగ్ల భూమిపై అడుగుపెట్టివుండరు. ఇదిగో, ఈ ఉన్నతాసనంపై కూర్చున్న ఆంగ్లమిత్రులు ఆ విషయాన్నిగూర్చి సాక్ష్యం చెప్పగలరు. నేను వారిమధ్య నివసించినకొద్దీ, ఆంగ్లజాతీయ జీవనమనే ఆ మహాయంత్రం ఎలా పనిచేస్తుందో నేను చూచినకొద్దీ, నేను వారితో కలిసిపోయినకొద్దీ, ఆ జాతి హృదయనాడి ఎక్కడుందో నేను కనుక్కోగలిగాను! వారిపట్ల నా ప్రేమ ద్విగుణీకృతమయింది. సోదరులారా! ఇక్కడవున్న మీలో ఎవరూ, నా కంటె ఎక్కువగా ఇప్పుడు ఇంగ్లీషువారిని ప్రేమింపజాలరనుకొంటాను. అక్కడ ఏమి జరుగుతోందో మీరు చూడాలి! మీరు వారితో కలిసి మెలిసి తిరగాలి. తత్త్వశాస్త్రం, ముఖ్యంగా మన జాతీయ వేదాంతతత్త్వశాస్త్రం, సూక్ష్మంగా చెప్పే విధంగా, మన సర్వదుఃఖాలకు, మన పరితాపాలకు కారణం, ఏకైకకారణం, అజ్ఞానమే! ఇక్కడ మనకూ, ఆంగ్లేయులకూ మధ్య కలిగే కష్టాల కన్నిటికీ ముఖ్యంగా, అజ్ఞానమే కారణమని గ్రహించాలి! మనం వారి నెరుగం; వారికి మనం తెలీదు.
దురదృష్టవశాత్తూ పారమార్థికత, ఇంతేల, నీతివర్తనంకూడ, లౌకికసంపదతో ముడివేయబడి ఉంటుందని పాశ్చాత్యుల భావం. కాబట్టి ఆంగ్లేయుడుకాని, లేక ఇతర పాశ్చాత్య దేశీయుడుకానీ, మన దేశంలో అడుగుపెట్టిన తక్షణమే, దారిద్ర్యంతో, దుఃఖంతో నిండిన దేశం వాని కంటపడుతుంది. అంతట, ఇక్కడ మతమనేదే లేదనీ, నీతివర్తనం సైతం ఉండజాలదనీ అతడు వెంటనే నిశ్చయించుకొంటాడు. నిజంగా, వాని అనుభవం అలా ఉంటుంది. యూరప్‌లో, దుర్భరమైన శీతోష్ణస్థితిని బట్టి, ఇంకా అనేక కారణాలచేత, దారిద్ర్యం, దుర్మార్గం, వెనవేసుకొని పోయాయి. భారతదేశంలో అలా లేదు. అందుకు మారుగా, ఈ దేశంలో మనుష్యుడు దరిద్రుడవుతున్నకొద్దీ నీతిప్రవర్తనంలో గొప్పవాడు కావడం నాకు తెలుసు. ఈ విషయం గ్రహించడానికి చాలాకాలం పడుతుంది. విదేశప్రజలలో ఎందరు దీన్ని అర్థం చేసుకోవడానికి, భారతదేశ జాతీయ జీవన రహస్యమైన ఈ విషయాన్ని గుర్తించడానికి ఓపికపట్టగలరు? ఈ జాతిని పరిశీలించి, అర్థం చేసుకోవడానికై అంతటి ఓపిక పూనగలవారు చాలా కొద్దిమందే ఉంటారు. ఇక్కడ మాత్రమే, ఈ జాతిలో మాత్రమే, దారిద్ర్యమంటే దోషవర్తనం కాదు. దారిద్ర్యమంటే పాప జీవనం కాదు. దారిద్ర్యమంటే దుష్టవర్తన కాకపోవడమే కాకుండా, ఆ దారిద్ర్యమే దివ్యలక్షణమై పోయింది. దరిద్రుడు ధరించే కౌపీనాన్ని దేశంలోని పరమశ్రేష్ఠుడు ధరించే దివ్యాంబరంగా భావించే ఏకైక జాతి ఇక్కడ మాత్రమే ఉంది. ఇదే విధంగా మనంకూడ, పాశ్చాత్యుల సాంఘికాచారాలను, ఓపికతో పరిశీలించ వలసివుంది. మనం, వాళ్ళను గురించి త్వరగా, పిచ్చిపిచ్చి అభిప్రాయాలను వెలిబుచ్చడం తగదు. వారిని పరిశీలించడానికి తగిన ఓపిక మీకుంటే, వారిలో స్త్రీ పురుషులు కలిసి మెలగటం, భిన్నభిన్నమైన వారి ఆచార మర్యాదలన్నీ సార్థకాలే అనీ, వాటి అన్నిటిలోను ఒక ఉత్తమపక్షమున్నదనీ మీకు తెలిసొస్తుంది. అయినా, వారి ఆచార మర్యాదలను మనం అవలంబించాలని కానీ, మన వాటిని వారు అవలంబించాలని కానీ నా అభిప్రాయం కాదు. జాతి ఆచారమర్యాదలు ఆ జాతిలో శతాబ్దాల తరబడి క్రమంగా పెరిగి వస్తూంటాయి. ప్రతిదానికీ వెనుక ఒక గొప్ప ప్రయోజనం ఉంటుంది. కాబట్టి, వారు మన ఆచార మర్యాదలను గాని, మనం వారి ఆచార మర్యాదలను గాని హేళనచేయడం తగదు.
ఈ సభ ఎదుట ఇంకో విషయం తెలుపగోరుతున్నాను. ఇంగ్లాండులో నేను చేసిన పని అమెరికాలో చేసిన దానికన్నా నాకు ఎక్కువ తృప్తికరంగా ఉంది. ఇతరజాతులవారి మేధాశక్తికన్నా, ఆంగ్లేయుని మేధాశక్తి అధికమైంది. ధైర్యశాలి, సాహసికుడు, దీక్షాపరుడు అయిన ఆంగ్లేయుని మెదడులో ఒక సంకల్పం ఏదైనా ఒకసారి నాటుకొనిపోతే తిరిగి అది ఎన్నడూ జారిపోదు. అత్యంత కార్యపరతంత్రమైన ఆ జాతి సమర్థత దాన్ని పెంపొందజేసి, సత్వరఫలమిచ్చేలా చేస్తుంది. ఇతరదేశాలలో అలా కాదు. అలాంటి తీవ్రకార్యపరత్వం, సునిశితమైన జాతీయచైతన్యం మరెక్కడా కన్పించదు. వాళ్ళలో ఊహారచన తక్కువగా, కార్యధురీణత ఎక్కువగా ఉన్నాయి. ఆంగ్లపురుషుని హృదయం యొక్క జీవధార ఎవరికి గోచరమవుతుంది? ఎంతటి భావనాశక్తి ఉందో, ఎంతటి అనుభూతి ఉందో ఎవరికెరుక? వారిది వీరులజాతి, వారు నిజమైన క్షత్రియులు. తమ భావాలను రహస్యంగా ఉంచి, ఎన్నడూ వెలువరించకుండటం వారి అలవాటు; వారు బాల్యంనుండి, అటువంటి శిక్షణనే పొందుతారు. ఆంగ్ల పురుషుడు భావోద్రేకాన్ని వెలువరించగా చూడటం అరుదు. ఆంగ్ల స్త్రీ కూడ అలాటిదే; ఆంగ్ల స్త్రీ పనులకు వెళ్ళేసమయంలో, మహాసాహసులైన వంగ దేశీయులుకూడ అనుకరింప జంకేంత వీరకార్యాలు చేయగా నేను చూశాను. అయినా, శౌర్యసూచకమైన ఈ బాహ్యాకారం ఎంతటిదిగా ఉన్నా, ఈ యోధాకృతికి వెనుక, ఆంగ్లజాతి హృదయంలో గొప్ప దాక్షిణ్య భావనిధి మరుగుపడి ఉంది. నీ వొకసారి దాన్ని చేరడానికి మార్గం తెలుసుకొని అక్కడకు చేరావో, ఆంగ్లేయునితో నీవు స్నేహంచేసి స్వయంగా వానితో కలిసిపోగలిగితివో అతడు తన మనసు విప్పుతాడు. ఇక నీకతడు శాశ్వత మిత్రుడే! నీ దాసుడే అయిపోతాడు! కాబట్టి ఇంగ్లాండులో నేను చేసిన పని, తక్కిన చోట్లలోకంటె ఎక్కువ తృప్తికరమైందని నా అభిప్రాయం. రేపు నేను మరణించనున్నా, ఇంగ్లాండులో నేను ప్రారంభించిన పని నాశమందక నిరంతరం వృద్ధిపొందుతూనే ఉంటుంది.
సోదరులారా! మీరు నా మనస్సులో మరొకభావాన్ని, అత్యంత గంభీరభావాన్ని మేల్కొల్పారు. మీరు నా గురువు, నా స్వామి, నా నాయకుడు, నా పరమాదర్శం, నా సజీవదైవతం, శ్రీ శ్రీ శ్రీరామకృష్ణపరమహంస నామం సంస్మరించారు. ఆలోచనలతోగాని, మాటలతోగాని, చేతలతోగాని, నేను ఏమైనా సాధించివుంటే, ప్రపంచానికి ఉపయోగకరమైన ఒక్కమాటైనా నా పెదవులనుండి వెలువడివుంటే, అదంతా వారిదే; నాదనలేను. కానీ నా పెదవులనుండి శాపాలు వెలువడితే, నా హృదయం నుండి ద్వేషం పొర్లితే, అదంతా నాదే, శ్రీవారిది కాదు. దుర్బలమైన సమస్తమూ నాదే. ఉజ్జీవకరం, బలవర్ధకం, నిర్మలం, పావనం అయిన సర్వమూ శ్రీవారి ప్రేరణమే; శ్రీవారి భాషణమే. అంతా శ్రీవారిదే. మిత్రులారా! ప్రపంచం ఆ మహాపురుషుని ఇంకా తెలుసుకోవలసి ఉందనడం నిజం. ప్రపంచ చరిత్రలో మహాత్ములను గూర్చి, వారి జీవితాలను గూర్చి కథలను చదువుతున్నాం. ఇవన్నీ శతాబ్దాల తరబడి, వారివారి శిష్యుల వ్రాతలను, చేతలను ఆధారం చేసుకొని మనకు చేరుతున్నాయి. వేలకొద్దీ సంవత్సరాలుగా, చెక్కి చెక్కి ఆకారం కల్పించిన ఈ ప్రాచీన మహాప్రవక్తల జీవితాలు మనకు లభిస్తున్నాయి. అయినా, నేను స్వయంగా ఎవరిని నా కళ్ళతో చూశానో, ఎవరి నీడలో నేను జీవించివున్నానో, ఎవరి పాదాలదగ్గర నేను సమస్తమూ నేర్చుకొన్నానో, అట్టి శ్రీరామకృష్ణ పరమహంసలవారి జీవితంతో సాటి రాదగినంతటి దివ్యతేజోమయ జీవితం ఒక్కటైనా లేదని నా అభిప్రాయం. ఓహో! మిత్రులారా! గీతలోని ఈ సుప్రసిద్ధ వాక్యం మీకందరికీ తెలిసే ఉంటుంది.
యదా యదాహి ధర్మస్యగ్లాని ర్భవతి భారత ।
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ॥
“అధర్మానికి వృద్ధి, ధర్మానికి హాని, ఎప్పుడెప్పుడు కలుగుతుందో, అప్పుడప్పుడు నేను అవతరిస్తూంటాను. సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి, ప్రతి యుగంలో నేను పుడుతూవుంటాను.”
దీంతోపాటు మీరు ఇంకో విషయాన్ని గ్రహించాల్సి ఉంది. అలాంటవిషయమొకటి నేడు మన కళ్ళ ఎదుట కనిపిస్తోంది. ఆధ్యాత్మిక సాగరాన మహాతరంగ మొకటి బయలువెడలి. రావటానికి పూర్వం, సుఖంలో అంతటా చిన్నచిన్న సుడులు కనిపిస్తూంటాయి. అలాంటి వానిలో ఒకటి లేచి మొదట ఎవరికీ తెలియరాక, ఎవరికి కన్పించక, ఎవరి ఊహకు చిక్కకుండానే విజృంభించి తక్కిన చిన్న చిన్న సుడులనన్నిటినీ మ్రింగేసి తనలో జీర్ణం చేసుకొందేమో అన్నట్లు పెరిగి పెద్దదై, మహాతరంగ రూపం దాల్చి, ఎవరికీ ఆపడానికి సాధ్యంకానంతటి మహాశక్తితో సంఘంపై పడుతుంది. అలాటిది మన కళ్ళ ఎదుట జరుగుతోంది. కళ్ళుంటే మీకది కనిపిస్తుంది. మీ హృదయం వికసించివుంటే దాన్ని స్వీకరిస్తారు. మీరు సత్వాన్వేషులైతే మీకది దొరుకుతుంది. సూర్యోదయపు జాడలను చూడజాలని వాడు గుడ్డివాడే; నిజంగా కళ్ళులేని వాడే. ఓహో మీరెన్నడూ విని అయినా ఉండని ఒక దూరపు పల్లెలో ఒక బీదబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈ బాలుడు, అనేక శతాబ్దాలనుండి, ‘మూర్ఖపు పూజలను’ ఖండిస్తూ ప్రేలుతున్న విదేశాలలో ఈనాడు యథార్థంగా అర్చనలను పొందుతున్నాడు. అది ఎవరి శక్తి? అది మీదా? నాదా? అది శ్రీరామకృష్ణ పరమహంస రూపంలో అవతరించిన దివ్యశక్తి తప్ప మరొకటి కాదు. ఎందుకంటే, మీరూ, నేను, మహాఋషులు, ప్రవక్తలు, ఇంతేల, అవతారాలు సైతం, చివరికి ఈ బ్రహ్మాండమంతా కూడ ఘనీభూతమై మానవరూపం దాల్చిన ఆ మహాశక్తి అంశమూర్తులే! ఇక్కడ నేడొక మహాశక్తి అభివ్యక్తమవుతోంది. దాని ప్రారంభకార్యాలను మాత్రమే మనం చూడగలుగుతున్నాం. ఈ తరం గడిచిపోకముందే ఆ శక్తి విచిత్ర కార్యాలను ఇతోధికంగా మీరు చూడగల్గుతారు. భారతదేశంలో సదా పనిచేస్తూ ఉండవలసిన ఆ చైతన్యశక్తిని మనం మరిచిపోతూ వస్తున్న కారణంగా, భారతదేశాన్ని ఉద్దరించడానికై ఈ సమయంలో ఆ మహాశక్తి అవతరించింది.
ప్రతిజాతికి, దాని ప్రత్యేక లక్షణమైన ఒక కార్యవిధానం ఉంటుంది. కొందరు రాజ్యతంత్రం ద్వారాను, కొందరు సంఘసంస్కరణల ద్వారాను, మరికొందరు వేరే విధానాలతోను పనిచేస్తారు. మనమో మతాన్ని మాత్రమే ఆధారం చేసుకొని కదలగలం. ఆంగ్లేయుడు రాజనీతి ద్వారానే మతధర్మాన్ని సైతం గ్రహించగల్గుతాడు. అమెరికా దేశీయుడు సంఘసంస్కరణ ద్వారా మతధర్మాన్ని సైతం తెలుసుకోగల్గుతాడు. కాని హిందువైతే, రాజనీతిని సైతం మతం ద్వారా గ్రహించగల్గుతాడు. సంఘధర్మం సైతం మతం ద్వారా రావలసివుంటుంది. ఎందుకంటే, అది వాని గానానికి పల్లవి. వాని జాతీయ జీవితగానంలో తక్కినవన్నీ రాగభేదాలుగా ఉంటాయి. దానికిప్పుడు ఆపద వాటిల్లింది. మన జాతీయ జీవితంలోని ఈ పల్లవిని మార్చబోతున్నట్లు కనబడుతోంది. మన శరీరానికి ఆధారమైన వెన్నెముకను మార్చాలనుకొంటున్నట్లున్నాం. ఆధ్యాత్మిక దండం తొలగించి, దాని స్థానంలో రాజకీయమైన బ్రహ్మదండం నిలపడానికి ప్రయత్నిస్తున్నాం. అందులో మనం కృతకృత్యులమైతే దాని మూలాన మనకు వినాశమే చేకూరి ఉండేది. కానీ అలా కాలేదు. కాబట్టే ఈ దివ్యశక్తి అవతరించింది. ఈ మహాపురుషుని మీరెలాంటి దృష్టితో గ్రహింపచూచినా నేను లక్ష్యపెట్టను. మీరు ఆయనపట్ల ఎంతటి గౌరవాన్ని చూపుతారో అనే విషయం లెక్కలోనిది కాదు. భారతదేశంలో అనేక శతాబ్దాల తర్వాత నేడు, ఈ మహాద్భుత దివ్యశక్తి అవతరించి వచ్చిందని నేను యథార్థంగా, ముఖాముఖీని ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. హిందువులు కావడం చేత మీరాశక్తిని పరిశీలించి తెలుసుకొని భారతదేశ క్షేమంకోసం, పునరుద్ధరణకోసం, దాని మూలంగా అఖీలమానవకోటి శుభం కోసం ఏమి జరుగుతుందో తెలుసుకోవడం మీ విధి. ఓహో! ప్రపంచంలోని ఏ దేశంలోగాని, విశ్వమతభావాలను గూర్చి, విశ్వమానవ సౌభ్రాత్రం గూర్చి, వాదోపవాదాలు జరగడానికి చాలాముందుగానే, ఇక్కడ, ఈ నగర సమీపంలో తన జీవితమంతా ఒక నానామత మహాసభగా, ఈ మహాపురుషుడు గడిపాడు సుమండీ!
మన శాస్త్రాలలో చెప్పబడిన పరమోత్తమ గమ్యం నిర్గుణ పరబ్రహ్మం. ఆ నిర్గుణ పరబ్రహ్మ దర్శనాన్ని పొందగలిగే ఉత్తమార్హత మనలో ప్రతివానికీ, భగవదనుగ్రహంవల్ల లభించాలని నేను ఆశిస్తున్నాను. కానీ, అది అసంభవం కావడం చేత మానవజాతిలో అత్యధిక సంఖ్యాకులకు సగుణ దైవతం అత్యవసరంగా ఉంది. తన జీవితంలో పరమాదర్శాలను కూర్చుకొని, ఒక ధ్వజంకింద చేరనిదే, ఏ జాతీ ఏర్పడజాలదు; ఘనత నొందలేదు; ఎంతమాత్రమూ కార్యసాధనం చేసుకోజాలదు. రాజకీయాదర్శాలు కానీ, రాజకీయాదర్శాలకు ప్రతినిధులై నిలిచే మహాపురుషులుకానీ, చివరికి, సాంఘికాదర్శాలుకానీ, వాణిజ్యాదర్శాలుకానీ, భారతదేశంలో ప్రబలం కాజాలవు. ఆధ్యాత్మికాదర్శాలు మన ఎదుట సుప్రతిష్ఠితం కావాలి! ఉత్తమ పారమార్థిక వ్యక్తులను ఎదుట ఉంచుకొని, వారి చుట్టూ ఉత్సాహంతో గుమికూడాలి! మన వీరులు పారమార్థిక పురుషులుగానే ఉండాలి! శ్రీరామకృష్ణ పరమహంస రూపంలో అలాంటి వీరుడొకడు మనకై మూర్తీభవించాడు. మన ఈ జాతి అభ్యుదయం పొందాలంటే ఈ నామంచుట్టూ ఉత్సాహంతో చేరి నిలవాలి! నా మాట నమ్మండి; శ్రీరామకృష్ణ పరమహంసలవారిని గూర్చి బోధించేది ఎవరా అనే విషయం ముఖ్యంకాదు. నీవో, నేనో, ఇంకొకరో ఎవరైనా కావచ్చు. వారి ఆదర్శాన్ని నేను మీ ఎదుట పెడుతున్నాను. ఏమి చేయడమో నిర్ణయించుకోవలసింది మీరు. ఈ జీవిత దివ్యాదర్శాన్ని గూర్చి మీరేమి చేయమన్నారో ఇప్పుడే నిర్ణయించుకోవడం భారతదేశ క్షేమానికి, భారతజాతి క్షేమానికి అత్యంత అవసరం. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం చూసిన వానిలోకంతా పరమపవిత్రమైన జీవితమిది. అంతేకాదు. మనం గ్రంథాలలో చదివిన జీవితాలన్నిట్లోకి కూడ ఇది పరమ పావనమైందని నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను. ఈ యథార్థ విషయం మీ ఎదుటే జరిగింది. మహాద్భుతమైన ఇట్టి ఆత్మశక్తి సాక్షాత్కారాన్ని మీరు గ్రంథాలలో చూడలేరు. అంతకన్నా, కళ్ళారా చూడగలమని ఆశించలేరు. ఆ మహానుభావుడు నిర్యాణం చెందిన పది సంవత్సరాల లోపలనే, అతని మహిమ భూగోళాన్నంతటిని ఆవరించింది. ఇది మీ ఎదుట జరుగుతున్న ప్రత్యక్ష విషయమే కదా! కాబట్టి మన జాతి కల్యాణంకోసం, మన మత క్షేమంకోసం, ఈ ఉత్తమ పారమార్థికాదర్శం మీ ఎదుట ఉంచడం నా విధి. నన్ను బట్టి, ఆయన ఎట్టివాడో నిర్ణయించకండి! నేను అందుకు తగని దుర్బలమైన ఉపకరణాన్ని. నా ఆధారంతో, ఆయన స్వరూపమెట్టిదో మీరు నిర్ణయించాలని చూడకండి! ఆయన శిష్యులలో నేనుగాని, మరొకరుగానీ, మీరు గాని, ఎన్ని జన్మలెత్తినా, ఆయన సత్యస్వరూపంలో కోట్యాంశాన్నైనా సమర్థతతో నిరూపించజాలం. అంతటి మహాత్ముడాయన! మీకు మీరే స్వతంత్రంగా జిజ్ఞాస చేసుకోండి! మీ హృదయాంతరాళాలలో ఆ అఖండసాక్షి వెలుగుతున్నాడు. ఆయన, శ్రీరామకృష్ణ పరమహంసే, మన జాతి క్షేమంకోసం, మన దేశాభ్యుదయంకోసం, మానవకోటి కల్యాణంకోసం, మీ హృదయాలను వికసింపజేసి, మీరు బుద్ధిపూర్వకంగా ప్రయత్నించినా, ప్రయత్నింపకున్నా, తప్పక రానున్న అద్భుత పరివర్తనకు మిమ్మల్ని పాత్రులుగాచేసి, మీరు స్థిరచిత్తంతో పనిచేసేలాగున అనుగ్రహించాలి! ఎందుకంటే, ఆ ప్రభువు సంకల్పించిన కార్యం, మీ, నా ఆమోదంకోసం ఆగివుండేది కాదు. ఆ ధూళినుండి వందలకొద్దీ, వేలకొద్దీ, తన సేవకులను ఆయన నిర్మించుకోగలడు. ఆ మహాపురుషుని ఆశ్రయించుకొని, ఏమాత్రమైనా పనిచేసే భాగ్యం లభిస్తే అది మన అదృష్టం. మన ధన్యత!
దీన్ని ఆధారం చేసుకొని ఈ భావన విశాలవ్యాప్తిని పొందింది. మీరిప్పుడు నాకు తెలిపినట్లు, మనం ప్రపంచాన్నే జయించవలసివుంది. మనం జయించి తీరాలి! భారతదేశం లోకాన్ని జయించాలి. నా గమ్యార్థం అంతకు తగ్గేది కాదు. ఇది చాలా గొప్పదిగా కనిపించవచ్చు. మీలో చాలా మందికి ఇది అబ్బురంగాకూడ కనిపించవచ్చు. నిజంగా అది అంతటిదే. మనం ప్రపంచాన్ని జయించి తీరాలి; గత్యంతరం లేదు. జీవనానికి లక్షణం వికాసం. మనం వికాసాన్ని పొందాలి; చైతన్యాన్ని ప్రకటించాలి; లేదా పతితులమై మురిగి చావాలి. ఇంతకంటె మార్గాంతరం లేదు. బ్రతుకుటో, లేక చచ్చుటో – ఈ రెంటిలో ఒకదాన్ని నిర్ణయించుకోండి. ఇప్పుడు మన దేశంలో మనకున్న క్షుద్రమైన మత్సరాలు, వివాదాలను గూర్చి విచారించుదాం. ప్రతిచోట ఇలాంటివి ఉన్నాయి. నా మాట నమ్మండి. రాజకీయ జీవితాలతో వర్దిల్లే ఇతర జాతులవారికి వారి విదేశాంగ తంత్రాలు ఉన్నాయి. వారికి స్వదేశంలో పోరాటాలు పెచ్చు పెరిగినప్పుడు, దేశాంతరాలలో ఎవరితోనో పోరాటం పెట్టుకొంటారు. అంతటితో వారి ఇంటిపోరు ఆగిపోతుంది. మనకూ ఇలాంటి పోరాటాలే ఉన్నాయి; కానీ వాని నాపడానికి విదేశీ రాజకీయ తంత్రాలు మనకు లేవు. ప్రపంచంలోని ఇతర జాతులవారికి మనశాస్త్ర ధర్మాలను బోధించడమనే సనాతన విదేశాంగ తంత్రం మనం చేపట్టవలసివుంది. జాతీయంగా మనకిది ఐకమత్యాన్ని చేకూరుస్తుందనటానికి వేరొక రుజువు కావాలా అని, మీలో రాజకీయ తంత్రజ్ఞులైన వారిని అడుగుతున్నాను. ఈ మహాసభే కావలసినంత సాక్ష్యమిస్తోంది.
రెండో విషయం. ఈ స్వార్థపరత్వం అలా ఉండగా, స్వార్థత్యాగులు, ఉత్తములు, సజీవులు అయిన ఆదర్శమూర్తులు మన వెనుక ఉన్నారు. భారతదేశ దౌర్భాగ్యానికీ, పతనానికీ, ముఖ్యహేతువులలో ఒకటి దీని సంకుచితత్త్వం. ఈ జాతి సంకుచితమై ముత్యపుచిప్పలాగా ముడుచుకొని తన చిప్పలోనికి దూరిపోయింది. తన ముత్యాలను, రత్నాలను మానవకోటిలోని ఇతరజాతులకు పంచి ఇవ్వడానికి నిరాకరించింది. ఆర్యేతర జాతులవారు, చైతన్య ప్రదమైన మన ధర్మాలకోసం దప్పిగొని ఉండగా, వారిని నిరాకరించింది. ఇది ఒక గొప్పకారణం. మనం దేశాంతరాలకు వెళ్ళి ఇతరజాతుల అనుభవాలతో, మన అనుభవాలను పోల్చిచూసుకోకపోవడం మన పతనానికి ముఖ్యకారణం. ఈ కొద్దిపాటి చలనం, భారతదేశంలో మీరిప్పుడు చూసే కొద్దిపాటి జీవచిహ్నం, శ్రీరాజారామమోహనరాయలు, మన బహిష్కరణావరపు గోడలను పగులతన్ని, వెలుపలికి వచ్చిన నాటినుండే ప్రారంభమైందని మీకు తెలుసు. ఆనాటినుండి భారతచరిత్ర క్రొత్తమార్గాన్ని పట్టింది. మరి, ఇప్పుడు, అతిశయించిన వేగంతో సాగిపోతోంది. పూర్వకాలంలో ఉన్నవి చిన్న చిన్న నదీప్రవాహాలు; ఇకమీదట పెద్దపెద్ద వరదలు రానున్నవి. వాటినెవ్వరూ ఆపజాలరు. కాబట్టి మనమిప్పుడు బయటికిపోవాలి. ఇచ్చిపుచ్చుకోవడం జీవశక్తికి లక్షణం. మనం ఎప్పుడూ పుచ్చుకొనే వాళ్ళగానే ఉండాలా? ప్రతిదానికీ, చివరకు మన మతాన్నికూడ, పాశ్చాత్యుల పాదాలచెంత కూర్చుని నేర్చుకోవలసిందేనా? మనం వారినుండి యంత్ర రహస్యాలను నేర్చుకోవచ్చు. ఇంకా, ఇతర విషయాలనేకం నేర్చుకొందాం. కాని, మనమూ కొంత నేర్పవలసివుంది. వారికి, మనం నేర్పవలసింది మన మతం, మన పరమార్థతత్త్వం. ప్రపంచం తన నాగరికతను పూర్తిచేసుకోవడానికి వేచివుంది; భారతదేశంనుండి వెలువడనున్న రత్నరాసులకోసం నిరీక్షిస్తూ ఉంది; అనేక శతాబ్దాలుగా, పతితమై దైన్యంతో క్రుంగివున్నా, ఈ భారతజాతి తన హృదయానికి హత్తుకొని కౌగిట్లో ఉంచుకొన్న పిత్రార్జిత మహాద్భుత పరమార్థతత్త్వాన్ని ప్రపంచానికి పంచి ఇవ్వాలి. ప్రపంచం ఆ నిధికోసం నిరీక్షిస్తోంది.
మన పూర్వులు సంపాదించిపెట్టిన ఈ విచిత్ర రత్నరాసుల కోసం, భారతేతరదేశాల్లో, ఎంతమంది ఆకలిగొని కృశించిపోతున్నారో, ఎంత మంది దప్పిగొని పరితపిస్తున్నారో, మీకేమీ తెలీడంలేదు. మనమిక్కడ వ్యర్థప్రసంగాలు చేస్తున్నాం. ఒకరితో ఒకరు వాదులాడుకొంటున్నాం. ప్రతి పవిత్రవిషయాన్నిగూర్చీ పకపక నవ్వుతున్నాం; వేళాకోళం చేసుకొంటున్నాం. దైవీసంబంధమైన ప్రతిదాన్నిగూర్చి హేళనచేయడం మన జాతికొక దురభ్యాసమైపోయింది. ఈ భారతక్షేత్రంలో, మన పూర్వులు భద్రపరచివుంచిన అమృతపు ఒక చుక్కను గ్రోలడానికి చేతులు చాస్తూ, ఆరాటంతో, గోడల బైట, ఎన్ని లక్షలమంది హృదయావేదనతో నిరీక్షిస్తున్నారో మనకు తెలియడంలేదు. కాబట్టి, మనం వెలుపలికిపోయి, మన ఆధ్యాత్మికతను వాళ్ళకిచ్చి, దానికి బదులుగా, వారివ్వగల దాన్ని దేనినైనా గ్రహించాలి! ఆత్మప్రపంచ విచిత్రాలను వాళ్ళకిచ్చి, జడప్రపంచ విచిత్రాలను కొనుగోలుచేద్దాం. మనం ఎప్పుడూ విద్యార్థులుగానే ఉండతగదు. ఉపాధ్యాయులుగాకూడ ఉండవలసివుంది. సమత్వం లేనిది మైత్రి కలుగజాలదు. ఒక పక్షంవాడు సదా ఉపాధ్యాయుడుగానే ఉండి, రెండవ పక్షంవాడు సదా వాని పాదాల దగ్గరే కూర్చుంటే, సమత్వమెలా ఉంటుంది? ఆంగ్లేయునితోగానీ, అమెరికావానితోగానీ, నీవు సమానంగా ఉండగోరితే, వారినుండి నేర్చుకోవడమేగాక, వారికి నేర్పగలిగీ ఉండాలి. శతాబ్దాల తరబడి ప్రపంచానికి నేర్పగలది, నీ దగ్గర కావలసినంత ఉంది; ఈ పని జరగాలి. మన రక్తంలో సాహసం, ఉత్సాహం ఉండాలి! మనం వంగదేశీయులం. ఊహాశక్తిమంతులమని మనకు ప్రసిద్ధి ఉంది. మనలో అది ఉందనే నా నమ్మకం. ఊహాశీలురమనీ, విశేషమైన ఉద్రేకం కలవారమనీ, మనల్ని వెక్కిరిస్తూంటారు. మిత్రులారా! నా మాట వినండి! బుద్ధిశక్తి గొప్పదనడం నిజమే. కానీ, అది కొన్ని హద్దులలోపల ఆగిపోవలసి ఉంటుంది. ఒక్క హృదయద్వారంలో మాత్రమే దివ్యస్ఫూర్తి పుడుతుంది. హృదయ సముద్భవ ఆవేశం వలననే అత్యుత్తమ రహస్య విషయాలను అందుకోవడానికి వీలవుతుంది. కాబట్టి భావోద్రేకంగల వంగదేశీయుడే, ఈ పనిని నిర్వహించాలి.
“ఉత్తిష్ఠత! జాగ్రత! ప్రాప్య వరాన్నిబోధత! – “లెండి, మేల్కొనండి! మీ గమ్యాన్ని చేరేవరకు ఆగకండి!” (కఠోపనిషత్తు) కలకత్తా యువజనులారా! లెండి, మేలుకోండి! సమయం శుభకరంగా ఉంది. అదిగో, అప్పుడే అంతా మన ఎదుట సిద్ధమవుతోంది. ధైర్యం వహించండి; భయపడకండి; మన ఎదుట సిద్ధమవుతోంది. ధైర్యం వహించండి; భయపడకండి; మన గ్రంథాల్లో మాత్రమే “అభయః” అనే విశేషణాన్ని భగవంతుని గూర్చి ప్రయోగించివున్నారు. మనం ‘అభయః’ భయంలేనివారం కావాలి! అప్పుడు మనం పూనేకార్యం నెరవేరినట్లే లెండి! మేల్కొనండి! మీ దేశం ఈ మహాయజ్ఞాన్ని కోరుతోంది. యువకులే దాన్ని నిర్వహించవలసివుంది. యువకులు, బలయుతులు, సత్త్వవంతులు, దృఢశరీరులు, బుద్ధిశాలులు అయినవారు నిర్వహించవలసిందే ఈ కార్యం. ఈ కలకత్తా నగరంలో వందలకొద్దీ, వేలకొద్దీ, అటువంటి యువకులున్నారు. మీరు చెప్పినట్లు, ఇప్పుడు నేను ఏమైనా సాధించివుండినా, పూర్వం ఈ కలకత్తానగర వీథుల్లో ఆటలాడుతూ, కొరగాని కుర్రవాడని అనిపించుకొన్న వాడినే నేను అని జ్ఞాపకముంచుకోండి! నేనే, అంతపనిని చేయగలిగితే, మీరు ఇంకా, ఎంత ఎక్కువ పని చేయగల్గుతారో? లెండి! మేల్కొనండి! ప్రపంచం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. భారతదేశంలోని ఇతరప్రాంతాలలో, బుద్ధిశక్తి ఉంది; ధనముంది; కాని ఉత్సాహంమాత్రం, నా జన్మభూమిలోనే ఉంది. అది ఇప్పుడు బయటపడాలి! కాబట్టి, కలకత్తా నగర యువజనులారా! మీ రక్తంలోని ఉత్సాహశక్తితో లేచి నిలబడండి! మీరు దరిద్రులనీ, మీకు స్నేహితులు లేరనీ అనుకోకండి! ఓహో! ధనం ఎన్నడైనా, మనుష్యుని సృష్టించగా చూసినవారున్నారా? మనుష్యుడే సదా ధనాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచమంతా సత్త్వసంపన్నుడైన మానవునిచేత, ఉత్సాహశక్తి మూలంగా విశ్వాసబలంతో నిర్మాణమవుతోంది.
ఉపనిషత్తులలో కంతటికీ అత్యంత మనోహరమైన కఠోపనిషత్తును మీలో చదివిన వారికి, ఆ రాజు, మహాయజ్ఞం చేయబోతూ, శ్రేష్ఠమైన వస్తువులను దానం చేయడానికి బదులు, ఎందుకు పనికిరాని ఆవులను, గుర్రాలను ఎలా దానం చేయనారంభించాడో జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ సమయంలో, అతని కుమారుడైన నచికేతుని హృదయంలోకి ‘శ్రద్ధ’ ప్రవేశించినట్లు ఆ గ్రంథంలో ఉంది. ఈ ‘శ్రద్ధ’ అనే మాటకు బదులుగా, వేరొకమాటను ఉపయోగించడం నాకిష్టం లేదు! అది నిరర్థకం. ఇది ఒక అద్భుత శబ్దం. దీన్ని బాగా అర్థం చేసుకొని, దీన్నే వాడుతూండాలి. దీని మహిమను కొంచెం చూద్దాం. నచికేతుడు వెంటనే తనలో తానిలా అనుకొన్నాడు. “నేను చాలామంది కంటె, గొప్పవాడిని; కొందరికంటె తక్కువవాడిని. కాని, ఎందునా నేను చివరివాడిని కానేకాను. నేనుకూడ ఏమైనా చేయగలను” – అతని ధైర్యం పెంపొందింది. అంతట ఆ అబ్బాయి తన మనస్సులోవున్న సమస్యను, అంటే మృత్యురహస్యాన్ని తేల్చాలని పూనుకొన్నాడు. ఆ పరిష్కారం మృత్యుదేవత అయిన యముని ఇంటికి పోతే తప్ప తేలేది కాదు. అక్కడికే అతడు వెళ్ళాడు. అక్కడ ధీరుడైన నచికేతుడు యముని గృహంవద్ద మూడు దినాలు వేచివున్నాడు. తర్వాత అతడు కోరుకొన్న దాన్ని ఎలా సాధించగల్గాడో మీకు తెలుసుకదా? ఈ శ్రద్ధే మనకు కావాలి! దురదృష్టవశాత్తూ, శ్రద్ధ అనేది, భారతదేశం నుండి దాదాపుగా అదృశ్యమైపోయింది. ఆ కారణం చేతనే మన మీ ప్రస్తుత దుస్థితికి వచ్చాం. మనిషికి, మనిషికి మధ్యగల భేదం శ్రద్ధలోవున్న భేదమే తప్ప వేరుకాదు. ఒక పురుషుని ఘనునిగాను, వేరొకని దీనునిగాను, అధమునిగాను చేసేది ఈ శ్రద్దే! హీనుడి ననుకొనేవాడు హీనుడై పోతాడని నా గురువర్యుడు చెబుతూండేవాడు. ఆ మాట నిజం. ఈ శ్రద్ధ మీలో ప్రవేశించాలి. పాశ్చాత్యజాతులలో ఎలాంటి జడశక్తి ప్రకటితమై మీకు కనిపిస్తోందో చూడండి. అదంతా శ్రద్ధ మహిమే. వాళ్ళు తమ శరీరబలాన్ని నమ్ముకొంటారు. మీరు మీ ఆత్మబలాన్ని నమ్ముకొంటే, ఇంకా ఎంత అతిశయంగా అది పనిచేయగలదో? ఆ అఖండాత్మను, అఖండ శక్తిమయుని నమ్ముకోండి. మీ గ్రంథాలు, మీ ఋషి శ్రేష్ఠులు, ఏకాభిప్రాయంతో బోధించింది దీన్నే. ఏదీ వినాశం చేయజాలని ఆ ఆత్మలో అనంతశక్తి ఉంది. మీ ఆవాహనకోసం అది ఎదురుచూస్తోంది. భారతీయ వేదాంతానికి, తక్కిన తత్త్వశాస్త్రాలన్నిటికి మధ్యవున్న గొప్పభేదం ఇక్కడే. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు అందరూ అన్నీ ఆత్మలోనే ఉన్నాయని దృఢంగా విశ్వసిస్తారు. అది వెలుపలికి వచ్చి సువ్యక్తం కావాలి. కాబట్టి, నేను కోరుకొనేది ఈ శ్రద్ధే. మన అందరికీ కావలసిందీ ఈ శ్రద్ధే. ఈ విశ్వాసాన్ని మీ అనుభవానికి తెచ్చుకోవడమనే మహాకార్యాన్ని నిర్వహించండి. గాంభీర్యాన్ని గంగపాలుచేసి ప్రతిదాన్నీ వేళాకోళంచేసే బుద్ధి ఈ జాతి రక్తంలోనికి చొచ్చుకొనిపోతోంది. ఈ ఘోరవ్యాధిని తొలగించుకోండి. ఈ పెద్దరోగాన్ని తప్పించుకోండి. సాహసం పూనండి. శ్రద్ధ సంపాదించుకోండి; తక్కిందంతా వచ్చి తీరుతుంది.
ఇంతవరకు నేను చేసింది అత్యల్పం మాత్రమే. ఆ పనిని మీరు చేయాలి. రేపు నేను మరణించినా ఈ కార్యం ఆగిపోదు. వేలకొద్దీ ముందుకువచ్చి, ఈ కార్యాన్ని చేపట్టి, నేను ఊహతో కల్పనచేసుకొన్న ప్రత్యాశలనన్నిటినీ మించి, ఈ మహాకార్యాన్ని ముందుకు సాగించుకొని పోతారని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. నా మాతృదేశంలో, ముఖ్యంగా నా మాతృదేశ యువకులలో, నాకు విశ్వాసముంది. యువకుల భుజాలపై ఇంతవరకు ఉంచబడిన కార్యభారాలన్నిటికంటె గొప్పభారం, ఈ వంగదేశ యువకుల మీద ఇప్పుడు పడింది. దాదాపు పది సంవత్సరాలనుండి భారతదేశమంతటా నేను సంచారం చేశాను. భారతమాతను ఉద్ధరించి, ఆధ్యాత్మికంగా ఆమెకు అర్హమైన స్థానాన్ని మరొకసారి సంపాదించి పెట్టగల శక్తి వంగదేశ యువకులనుండి ప్రభవించనున్నదని నా నిశ్చిత విశ్వాసం. ఆహా! మన పితరులు దర్శించిన అఖండ పరమార్థ సత్యాలను బోధిస్తూ, ఉపదేశాలు చేస్తూ, ప్రపంచం మూలమూలలకు, ప్రచారం సాగించే, వీరవరులు, ఈ వంగదేశపు యువకులనుండే అద్భుత భావస్పూర్తి, ఉత్సాహపూరిత రక్తంగల ఈ నా యువకసోదరుల నుండే ఉదయించనున్నారు. మీ ఎదుటవున్న గొప్పకర్తవ్యమిదే! కాబట్టి, “లెండి! మేల్కొండి! కోరిక నెరవేరే వరకు నిలవకండి!” అంటూ మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ, నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. భయపడకండి. మానవచరిత్రలో అంతటా, మహాశక్తి ప్రజలనుండే ప్రభవిస్తూ వచ్చింది! అలాంటి ప్రజాశ్రేణులనుండే ప్రపంచంలోని మహా మనీషులంతా వచ్చారు. చరిత్రలో ఒక్కసారి సంఘటిల్లిందే. మరల సంఘటిల్లుతుంది. దేనికీ మీరు భయపడవద్దు. మీరు అద్భుత కార్యాలను చేయగలరు. భయపడిన తక్షణమే మీరెందుకూ కొరగాకుండా పోతారు. లోకంలోని దుఃఖానికంతకూ, ముఖ్యకారణం ఈ భయమే. మూఢ విశ్వాసాలలోకంతా అత్యధికమైంది ఈ భయమే. మన దుఃఖాలకంతకూ, ప్రధానకారణం ఈ భయమే! నిర్భయత, ఒక్కక్షణంలో స్వర్గాన్ని సైతం తెచ్చిపెట్టగలదు; కాబట్టి “ఉత్తిష్ఠత జాగ్రతః ప్రాప్యవరాన్ నిబోధతః” – లెండి, మేల్కొనండి, గమ్యస్థానం చేరేవరకు ఆగకండి.
మహాశయులారా! మీరు నా పట్ల చూపిన ఆదరణకంతకూ మరోసారి మీకు నమస్కారాలర్పిస్తున్నాను. ఏ కొంచెమైనా, ప్రపంచానికి, ముఖ్యంగా, నా దేశానికి, నా దేశ ప్రజలకు సేవలందించాలని నా కోరిక. అదే నిశ్చయమైన నా దృఢాభిలాష!