1. ప్రథమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – కేశవ్సేన్
శనివారం, జనవరి 1, 1881
బ్రహ్మసమాజ నాయకుడైన కేశవ్‌చంద్రసేన్ శ్రీరామకృష్ణులను దర్శించ డానికి దక్షిణేశ్వరం రానున్నాడు. ప్రతాప్, త్రైలోక్యుడు, జయగోపాల్ తదితర బ్రహ్మసమాజ ప్రముఖులు ముందుగానే శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఉన్నారు. బ్రహ్మసమాజ వార్షికోత్సవానికి కొన్నిరోజులే వ్యవధి ఉంది. స్టీమర్లో రానున్న కేశవ్సేన్ కోసం బ్రహ్మసమాజ భక్తులందరూ ఆతురతతో ఎదురు చూస్తున్నారు, కాస్త బిగ్గరగానే మాట్లాడుకుంటున్నారు. రామ్, మనోమోహన్ తదితర భక్తులు కూడా అక్కడ ఉన్నారు.
చివరకు కేశవ్సేన్ వచ్చాడు. చేతిలో రెండు ఫలాలు, ఒక పువ్వుల గుత్తి పట్టుకొని ఉన్నాడు. శ్రీరామకృష్ణుల పాదాలను స్పృశించి, వాటిని ఒక ప్రక్కన పెట్టాడు. తరువాత ఎంతో వినయంగా క్రిందకు వంగి శ్రీరామకృష్ణులకు నమస్కారం చేశాడు. ఆయన కూడా అదే విధంగా ఆ ప్రముఖునికి ప్రతినమస్కారం చేశారు. పిదప ఆనందాతిశయంతో చిరునవ్వులు చిందిస్తూ సంభాషణ ప్రారంభించారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, కేశవ్‌తో): కేశవ్! నీకు నేను కావాలి, కాని నీ శిష్యులకు కాదు. ఇంతకు క్రితం వారితో నేను ఇలా అన్నాను: ‘మనమందరం వ్యాకులత చెందుదాం. అప్పుడు గోవిందుడు వస్తాడు.’ (కేశవ్ శిష్యులతో) ఇదుగో మీ గోవిందుడు వచ్చాడు, చూడండి!
“నీ రాక కోసం ఇంతసేపు మేం అశాంతచిత్తులమై ఉన్నాం. గోవిందుడి దర్శనం సులభంగా లభించదు. శ్రీకృష్ణ నాటకంలో మీరు చూసే ఉంటారు. నారదుడు బృందావనానికి వచ్చి వ్యాకులచిత్తంతో ‘ఓ గోవిందా, నా ప్రాణమా! నా జీవనమా!’ అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు గోపబాలురను వెంటబెట్టుకొని శ్రీకృష్ణుడు రంగస్థలం మీదకు వస్తాడు, వెనుక గోపికలు వస్తారు. వ్యాకులత చెందకుండా భగవద్దర్శనం కలుగదు.
“అది సరే కాని, కేశవ్! ఏమైనా చెప్పు! నువ్వు చెబుతుంటే వినాలని వీరందరూ ఉవ్విళ్ళూరుతున్నారు.”
కేశవ్ (నవ్వుతూ, వినయపూర్వకంగా): అయ్యా, నే నిక్కడ మాట్లాడడం ‘కమ్మరి వద్దకు వెళ్లి మేకులు అమ్మడం’ లాంటిది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): కాని భక్తుల స్వభావం ఎలాంటిదో నీకు తెలుసా? భక్తులు గంజాయి త్రాగేవాడి స్వభావాన్ని కలిగి ఉంటారు. ‘నువ్వొకసారి పీల్చి నా కివ్వు, నేను కూడా ఒక పట్టు పడతాను’ అంటూ గంజాయి త్రాగేవారు పరస్పరం స్నేహభావం ప్రకటించుకుంటారు. (అందరూనవ్వారు)
సమయం సాయంత్రం నాలుగు గంటలు. కాళీమందిరపు నహబత్తు నుండి
సంగీతనాదం వినవచ్చింది.
శ్రీరామకృష్ణులు (కేశవ్, తదితరులతో): ఆ సంగీతం ఎంత శ్రావ్యంగా ఉందో వింటున్నావు కదా? పిల్లనగ్రోవి మీద ఒకడు ఊరకే మొహం మొత్తిపోయేలా ‘పోం’ అని ఊదుతూ ఏకస్వరం పలికిస్తున్నాడు. కాని మరొకడు పలురకాల రాగాలు, రాగిణులతో రాగమాలికను సృష్టిస్తున్నాడు. నా భావం కూడా అదే. నా వద్ద ఉన్నది ఏడు ఛిద్రాలున్న వాయిద్యం. అలాంటప్పుడు కేవలం ఏకస్వరాన్ని ఎందుకు పలికించాలి? కేవలం ‘సోఽహం, సోఽహం’ అంటూ ఉండడం ఎందుకు? శాంత, దాస్య, వాత్సల్య, సఖ్య, మధుర భావాలన్నిటి ద్వారా ఆయన్ను ప్రార్థించాలన్నదే నా భావన. ఆయనతో సంతోషదాయకంగా ఉంటాను, క్రీడిస్తాను.
కేశవ్ ఆశ్చర్యచకితుడై ఈ మాటలు వింటున్నాడు. బ్రహ్మసమాజ భక్తులతో ఇలా అన్నాడు: “భక్తి జ్ఞానాల గురించి ఇంతటి అద్భుతమైన వ్యాఖ్యానం ఇంతవరకు ఎన్నడూ నేను విన్నది లేదు.”
కేశవ్ (శ్రీరామకృష్ణులతో): మీరు ఇంకా ఎంతకాలం దాక్కొని ఉంటారు? జనం క్రమక్రమంగా ఇక్కడ పెద్దసంఖ్యలో గుమిగూడుతారని నేను జోస్యం చెబుతున్నాను.
శ్రీరామకృష్ణులు: అదేం మాట? నేనేదో ఊరకే తిని త్రాగుతూ ఉంటాను, భగవన్నామాన్ని గానం చేస్తూ ఉంటాను, అంతే. జనాన్ని కూడగట్టడం మొదలైన వాటి గురించి నాకు ఏమీ తెలియదు. హనుమంతుడు ఒకసారి ఇలా అన్నాడు: ‘తిథి వార నక్షత్రాలు ఏమిటో నేను ఎరుగను. నేను కేవలం రామచింతన చేస్తాను.’
కేశవ్: సరేనండి, జనాన్ని నేను కూడగడతాను. కాని వారందరూ మీ వద్దకే రావాలి.
శ్రీరామకృష్ణులు: నేను అందరి పాదధూళిలో ధూళిని. ఎవరైన దయతలచి వస్తే రానివ్వు.
కేశవ్: అయ్యా, మీరు ఎన్నైనా చెప్పండి. మీ ఆగమనం వృథా కాబోదు.
2. ద్వితీయ పరిచ్ఛేదం అహంకారం – వ్యాకులత
ఇంతలో భక్తులు సంకీర్తనకు ఏర్పాటు చేశారు. పలువురు అందులో పాలు పంచుకోసాగారు. సంకీర్తన బృందం పంచవటి నుండి బయలుదేరి దక్షిణ దిశగా శ్రీరామకృష్ణుల గది వైపుగా వచ్చింది. హృదయ్ బాకా ఊదుతున్నాడు, గోపీదాస్ మృదంగం వాయిస్తున్నాడు, ఇద్దరు భక్తులు కరతాళం వేస్తున్నారు.
శ్రీరామకృష్ణులు పాడడం మొదలుపెట్టారు:
ప్రభు హరినామము భజనము సేయుము
పరమ సుఖంబును బడయుట కొరకు
ఇహ జీవనమును సుఖముగ గడిపి
పరమున బడయుము పరమపదంబును
మోక్షఫలంబును సదా భుజింతువు
ప్రభు హరినామ ప్రాభవ మట్టిది
దేవదేవుడు మహామహేశుడు
అంచితముగ తన పంచముఖంబుల
సదా జపించెడు సన్మంత్రంబును (భజించెడు సన్నామంబును)
నీ కిపుడొసగెద శ్రీహరి నామము.
సింహబలంతో నాట్యం చేసి శ్రీరామకృష్ణులు సమాధిస్థితిలోకి వెళ్ళిపోయారు. బాహ్యస్పృహలోకి వచ్చాక గదిలో కూర్చుని కేశవ్ తదితరులతో మాట్లాడసాగారు.
2.1 సర్వధర్మ సమన్వయం
శ్రీరామకృష్ణులు: అన్ని మార్గాల ద్వారా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవచ్చు. మీరందరూ దక్షిణేశ్వరానికి బండిలోనో, పడవలోనో, స్టీమర్లోనో లేక నడిచో వచ్చారు కదా! ఇది కూడా అలాంటిదేనన్నమాట. మీ అనుకూలతను బట్టి, స్వభావాన్ని బట్టి మీరు మీ మార్గాన్ని ఎన్నుకున్నారు; కాని చేరవలసిన చోటు ఒక్కటే. కొందరు ముందుగా వచ్చారు, మరికొందరు తరువాత వచ్చారు. కాని అందరూ గమ్యం చేరుకున్నారు.
2.2 అహంకార త్యాగమే భగవత్సాక్షాత్కారానికి మార్గం
“ఉపాధులను ఎంతగా వదిలించుకుంటే అంతగా భగవంతుడు మనకు సమీపంగా వస్తాడు. వర్షపు నీరు మెట్టప్రదేశంలో నిలువదు, అది చేరుకొనేది పల్లపు ప్రాంతంలోనే. అదే విధంగా భగవత్కృప అనే జలం అహంకారమనే మెట్ట ప్రాంతంలో నిలువదు, ఆయన పట్ల దీన హీన భావమే మంచిది.
“అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చివరకు వస్త్రాలు కూడా అహంకారం కల్పిస్తాయి. ప్లీహ వ్యాకోచ జబ్బుతో బాధపడుతున్న రోగి కూడా నల్లంచు ధోవతి కట్టుకోగానే నిధుబాబు లలిత గీతాలను కూనిరాగాలు తీస్తూండడం నేను గమనించాను. బూట్లు వేసుకోగానే గడగడమంటూ ఆంగ్లం ముక్కలు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఆధ్యాత్మిక జీవనానికి అనర్హుడైన సామాన్యవ్యక్తి కాషాయం ధరిస్తే, అహంకారం జనిస్తుంది. ఒకింత ఉదాసీనతను ప్రదర్శించినా అతడికి కోపం తన్నుకుంటూ వస్తుంది.
2.3 భోగలాలస పరిసమాప్తితోనే వ్యాకులత – పసిబాలుని ఆటలు, తల్లి కోసం ఆరాటం
“మనోవ్యాకులత లేనిదే భగవంతుణ్ణి దర్శించలేము. భోగాలను చివరికంటా అనుభవించనిదే అటువంటి వ్యాకులత జనించదు. కామినీ కాంచనాల నడుమ జీవిస్తున్నవారు, భోగాలను తుదికంటా అనుభవించనివారూ భగవంతుని కోసం వ్యాకులత చెందరు.
“నేను కామార్పుకూర్లో వసిస్తున్నప్పుడు నాలుగు లేక ఐదు సంవత్సరాల హృదయ్ కుమారుడు రోజంతా నాతోనే గడిపేవాడు. బొమ్మలతో ఆడుకుంటూ, వాడు తక్కినదంతా మరచిపోయేవాడు. సంధ్యాకాలం కాగానే ‘అమ్మ వద్దకు వెళ్ళాలి’ అంటూ పట్టుపట్టేవాడు. ‘ఇది ఇస్తాను, అది ఇస్తాను, పావురం ఇస్తాను’ అంటూ నేను వాడిని పలురకాలుగా సముదాయింప ప్రయత్నించే వాణ్ణి. కాని వాడు మాత్రం అప్పుడు అలా మరపు నొందేవాడు కాడు. ‘అమ్మ వద్దకు వెళ్ళాలి’ అంటూ ఏడుపు లంకించుకునేవాడు. అటుపైన, ఆటలాడడం వాడికి బొత్తిగా రుచించేది కాదు. వాడిని ఆ స్థితిలో చూసి నాక్కూడా కన్నీళ్ళు వచ్చేవి.
“భగవంతుడికోసం పసిబాలుడిలా విలపించడం అంటే ఇదే, వ్యాకులత అంటే ఇదే. అటుపైన ఆటలాడడం, భుజించడం ఏవీ రుచించవు. భోగాలు అనుభవించడం పూర్తయ్యాక అలాంటి వ్యాకులత జనిస్తుంది, భగవంతుడికోసం ఆ వ్యక్తి విలపిస్తాడు.” (BG 18.66)
భక్తులందరూ నిశ్శబ్దంగా ఈ మాటలు వింటున్నారు. సంధ్యాకాల మయింది, గదిలో దీపం వెలిగించారు. కేశవ్‌కు, తదితర భక్తులకు ఉపాహారం పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కేశవ్ (నవ్వుతూ): ఏమిటి, ఇవాళకూడా మరమరాలేనా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అదేదో హృదయ్కే తెలియాలి.
ముందుగా మరమరాలు, తరువాత పూరీ, కూర వడ్డించారు. భక్తులందరూ ఆనందంతో వాటిని ఆరగించారు. అంతా అయ్యేసరికి రాత్రి పదిగంటలయింది.
కేశవ్ తదితర భక్తులతో శ్రీరామకృష్ణులు పంచవటికి వెళ్ళారు.
శ్రీరామకృష్ణులు (కేశవ్ తదితరులతో): భగవత్సాక్షాత్కారం పొందాక సంసారంలో చక్కగా జీవించవచ్చు. దాగుడుమూతల ఆటలో ముందుగా ‘బామ్మ’ ను తాకి, తరువాత మీరు ఆట ఆడండి.
“సాక్షాత్కారానంతరం భక్తుడు నిర్లిప్తుడైపోతాడు, సంసారంలో బురద చేపలా జీవిస్తాడు. అది బురదలో ఉంటున్నప్పటికీ దాని ఒంటికి బురద అంటు కోదు.
సమయం రాత్రి పదకొండు గంటలు. బ్రహ్మసమాజ భక్తులందరూ ఇంటికి వెళ్ళడానికి ఆతురపడుతున్నారు. “ఈ రాత్రికి ఇక్కడే బసచేస్తే బాగుంటుంది” అన్నాడు ప్రతాప్.
శ్రీరామకృష్ణులు (కేశవ్‌తో): ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోరాదూ?
కేశవ్ (నవ్వుతూ): లేదండి, కాస్త పని ఉంది. వెళ్ళాలి.
శ్రీరామకృష్ణులు: ఏమయ్యా, చేపలబుట్ట లేకుంటే నీకు నిద్రపట్టదా ఏమిటి? ఒకసారి బెస్త స్త్రీ ఒకతె ఒక తోటమాలి ఇంటికి అతిథిగా వెళ్ళింది. పూలతో నిండి ఉన్న గదిలో నిద్రపోవడానికి ఆమెకు చోటు ఇచ్చారు. అయితే ఆమెకు అక్కడ నిద్రపట్టనేలేదు. (అందరూ నవ్వారు) నిద్రపట్టక ఆమె అసహనంగా పక్కమీద అటూ ఇటూ పొర్లుతోంది. తోటమాలి భార్య వచ్చి, అది చూసి ‘ఏమమ్మా, నిద్రపట్టడం లేదా?’ అని అడిగింది. బెస్త స్త్రీ ‘ఏమోనమ్మా, ఈ పువ్వుల కారణంగా నాకు నిద్రపట్టడం లేదు. నువ్వొకసారి నా చేపలబుట్ట తీసుకురామా?’ అని అడిగింది. బుట్ట తెచ్చాక, దాన్లో కాస్త నీరు చల్లింది; పిదప ఆ వాసనను ఆస్వాదిస్తూ ఆమె గాఢనిద్రలోకి జారిపోయింది. (అందరూ నవ్వారు.)
శ్రీరామకృష్ణులు పాదాలను స్పృశించి ఆయనకు తాను సమర్పించిన పువ్వులు కొన్ని కేశవ్ తీసుకున్నాడు. ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసి, భక్తులందరితో కలసి “నవవిధాన్ కీ జై” అని జయజయధ్వానాలు చేశాడు. తరువాత వారందరూ సెలవు తీసుకున్నారు.
3. తృతీయ పరిచ్ఛేదం సురేంద్రుని ఇంట్లో శ్రీరామకృష్ణులు
1881 ఆషాఢ మాసంలో ఒక రోజు పలువురు భక్తులతో కలసి శ్రీరామకృష్ణులు సురేంద్ర ఇంటికి వెళ్ళారు. అప్పుడు సంధ్యాకాలం కాబోతోంది.
ఇంట్లో, రెండవ అంతస్తులోని పెద్ద గదిలోకి శ్రీరామకృష్ణులు వెళ్ళారు.అక్కడ ఇరుగుపొరుగువారు పలువురు గుమిగూడి ఉన్నారు. కేశవ్‌ను కూడా ఆహ్వానించారు కాని అతడు రాలేదు. త్రైలోక్యుడూ మరికొందరు బ్రహ్మసమాజ భక్తులు అక్కడ ఉన్నారు. తెల్లని వస్త్రం వేసిన చాప ఒకటి నేలపై పరచబడి ఉంది. దానిమీద ఒకచోట మెత్తని తివాచీ ఒకటి పరిచారు. ఆ తివాచీ మీద కూర్చోమని సురేంద్ర, శ్రీరామకృష్ణులను అభ్యర్థించాడు. కాని అతడి మాటలను ఆయన వింటే కదా! వెళ్ళి, మహేంద్ర గోస్వామి ప్రక్కన చాపమీద కూర్చున్నారు. మహేంద్ర, సురేంద్ర పొరుగు వ్యక్తి.
మహేంద్ర (భక్తులతో): అనేక నెలలు నా సమయంలో అత్యధిక పాలు ఈయన సమక్షంలో గడిపాను. ఇంతటి గొప్పవ్యక్తిని ఇంతకు మునుపు ఎన్నడూ నేను చూడలేదు. ఈయన భావస్థితులు సామాన్యమైనవి కావు.
శ్రీరామకృష్ణులు (మహేంద్రతో): అవేం మాటలు? నేను హీనాతిహీనుడను, దీనాతిదీనుడను. ఆయనకు నేను దాసానుదాసుడను. గొప్పవాడు కృష్ణుడే.
“ఎవరైతే అఖండ సచ్చిదానందుడో ఆయనే కృష్ణుడు. దూరం నుండి చూసినప్పుడు సముద్రం నీలవర్ణంలో గోచరిస్తుంది, సమీపంగా వెళితే ఏ రంగూ ఉండదు. ఆయనే సగుణుడు. నిర్గుణుడు కూడా ఆయనే. నిత్యం, లీలలు రెండూ ఒకే అస్తిత్వానికి చెందినవి.
“శ్రీకృష్ణుడు మూడుచోట్ల వంకర్లు తిరిగి త్రిభంగిగా ఎందుకు ఉన్నాడో తెలుసా? రాధాదేవి పట్ల ప్రేమ కారణంగానే అతడు అలా వంగి ఉన్నాడు.
“ఏదైతే బ్రహ్మమో అదే కాళీ కూడా, అంటే సృష్టి స్థితి లయాలను నిర్వహించే ఆద్యాశక్తి. ఎవరైతే కృష్ణుడో, కాళీ కూడా ఆయనే. మూలం ఒక్కటే – ఈ క్రీడ, లీల అంతా ఆయనదే.
3.1 భగవద్దర్శనానికి మార్గం
“భగవంతుణ్ణి చూడవచ్చు. శుద్ధమనస్సు, శుద్ధబుద్ధికి ఆయన గోచర మవుతాడు. కామినీకాంచనాలపట్ల ఆసక్తి కలిగి ఉంటే మనస్సు మలినమై పోతుంది.
“సర్వమూ మనస్సే. మనస్సనేది చలువచేసిన వస్త్రం లాంటిది. దాన్ని నువ్వు ఏ రంగులో అద్దితే ఆ రంగును సంతరించుకుంటుంది. జ్ఞానమూ మనస్సులోదే, అజ్ఞానం కూడా మనస్సులోదే. ఫలానావ్యక్తి నీచుడు అన్నావంటే – అతడి మనస్సుకు నీచమనే రంగు వేయబడిందని అర్థం.”
శ్రీరామకృష్ణులకు పువ్వులమాల వేద్దామనే ఉద్దేశంతో సురేంద్ర ఆయన్ను సమీపించాడు. కాని ఆయన, మాలను చేతిలోకి తీసుకొని ప్రక్కకు విసిరి వేశారు. దానితో సురేంద్రుడి అభిమానం దెబ్బతింది. కళ్ళనీళ్లపర్యంతమై ప్రక్క నున్న వసారాలోకి వెళ్ళి రామ్, మనోమోహన్ తదితరులతో పాటు కూర్చున్నాడు. దుఃఖంతో పూడుకుపోయిన స్వరంలో ఇలా అన్నాడు: “నిజంగానే నాకు కోపం వచ్చింది. పేద బ్రాహ్మణుడికి వీటి విలువ ఏం తెలుస్తుంది? నేను ఎంతో డబ్బు పోసి ఈ మాలను తెప్పించాను. కాని ఇప్పుడు ఆయన దాన్ని గైకోలేదు. నేను నా కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోయాను. ‘తక్కిన మాలలను భక్తులకు ఇచ్చివెయ్యండి’ అన్నాను.
“కాని నా అపరాధమేమిటో నా కిప్పుడు తెలిసింది. భగవంతుణ్ణి డబ్బుతో కొనలేము, అహంకారికి ఆయన సుదూరం. నేను అహంకారిని, నా పూజను ఆయన ఎందుకు అంగీకరించాలి? ఇక నాకు జీవించాలన్న కోరిక ఎంతమాత్రం లేదు.” అతడు ఇలా మాట్లాడుతుంటే, కన్నీరు చెక్కిళ్ళ మీదుగా ప్రవహించి అతడి ఛాతీని పూర్తిగా తడిపివేసింది.
ఈలోపు గదిలో త్రైలోక్యుడు పాడడం మొదలుపెట్టాడు. ఆనందంతో ఉన్మత్తులై శ్రీరామకృష్ణులు నాట్యం చెయ్యసాగారు. తాము విసిరికొట్టిన మాలను స్వయంగా తామే మెడలో వేసుకున్నారు. ఒక చేత్తో మాలను పట్టుకొని, మరో చేతిని అటూ ఇటూ ఊపుతూ ఆయన నృత్యం చేస్తున్నారు, పాడుతున్నారు. ఇది చూసిన సురేంద్రుడి ఆనందానికి అవధులు లేవు – అతడి మాలను శ్రీరామకృష్ణులు అంగీకరించారు. అతడు తనలో ఇలా తలపోశాడు: ‘భగవంతుడు అహంకారాన్ని చూర్ణం చేస్తాడన్నమాట నిజమే. కాని ఆయన దీనులకు, హీనులకు పెన్నిధికూడా.’
శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారు:
అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులుగార్తురు
ఆనందముతో నాడుచు జగమును హరి భజనములో నాడజేతురు…
ఆయన ఈ పాట పాడుతూంటే పలువురు భక్తులు కూడా ఆయనతో కలసి నాట్యం చేశారు.
గానం ముగిశాక అందరూ ఆయన చుట్టూ కూర్చుని, ఆహ్లాదంగా మాట్లాడసాగారు. “నాకు తినడానికి ఏమీ ఇవ్వవా?” అని ఆయన సురేంద్రను అడిగారు, తరువాత ఇంట్లోపలికి వెళ్ళారు. అక్కడ భక్తురాండ్రు ఆయనకు ప్రణామం చేశారు. భోజనానంతరం ఆయన దక్షిణేశ్వరానికి బయలుదేరారు.
4.1 చతుర్థ పరిచ్ఛేదం మనోమోహన్ ఇంట్లో శ్రీరామకృష్ణులు
శనివారం, డిసెంబర్ 3, 1881
మధ్యాహ్న సమయం. కలకత్తా సిమ్లావీథిలోని మనోమోహన్ ఇంటికి శ్రీరామకృష్ణులు విచ్చేశారు. అదొక చిన్న రెండంతస్తుల ఇల్లు. ఇంటి ముందు చిన్న ప్రాంగణం ఉంది. క్రింది అంతస్తులోని అతిథుల గదిలో శ్రీరామకృష్ణులు కూర్చుని ఉన్నారు. భవానీపూర్‌కు చెందిన ఈశాన్ ముఖర్జీ ఆయన్ను ఇలా అడిగాడు: “అయ్యా, మీరు గృహస్థాశ్రమాన్ని ఎందుకు త్యజించారు? గృహస్థాశ్రమం శ్రేష్ఠమైనదని శాస్త్రాలు పేర్కొన్నాయి కదా!”
శ్రీరామకృష్ణులు: మంచి ఏదో చెడు ఏదో నాకు అంతగా తెలియదు. భగవంతుడు నాతో ఏది చేయిస్తే అది చేస్తాను, ఏది పలికిస్తే అది పలుకుతాను.
ఈశాన్: అందరూ సంసారాన్ని త్యజించినట్లయితే, వారు భగవంతుడి సంకల్పానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారవుతారు.
శ్రీరామకృష్ణులు: అందరూ ఎందుకు త్యజిస్తారు? పైగా, అందరూ కుక్కల, నక్కల లాగా కామినీ కాంచనాలలో మునిగి ఉండాలన్నది ఆయన సంకల్పమా ఏమిటి? ఆయనకు వేరే సంకల్పం అంటూ ఏమీ లేదా? ఆయన సంకల్పం ఏమిటి, ఏది కాదు అని నీకు అంతా తెలిసిపోయిందా?
“మనమందరం గృహస్థ జీవితం గడపాలన్నది ఆయన సంకల్పమని నువ్వు అంటున్నావు. కాని నీ భార్యాబిడ్డలు మరణించినప్పుడు అది ఆయన సంకల్పంగా భావించవు ఎందుకని? పేదరికంలో మ్రగ్గుతున్నప్పుడు, పిడికెడు మెతుకులక్కూడా గతిలేనప్పుడు దాన్ని ఆయన సంకల్పంగా తలంచవెందుకని?
“భగవత్ సంకల్పం ఏమిటో మాయ మనల్ని తెలుసుకోనివ్వదు. ఆయన మాయ కారణంగా అనిత్యం నిత్యంగానూ, నిత్యం అనిత్యంగానూ తోస్తుంది. సంసారమనేది అనిత్యం. ఈ క్షణం ఉంది, మరుక్షణం లేదు. కాని ఆయన మాయ కారణంగా ఇది వాస్తవమైనదిగా తోస్తుంది. ఆయన మాయ కారణంగానే ‘నేను కర్తను’ అన్న ఎరుక ఉంటుంది; భార్యాబిడ్డలు, సోదరీ సోదరులు, తల్లి తండ్రులు, ఇళ్లువాకిళ్ళు – ఇవన్నీ నాకు చెందినవే అన్న బోధ ఉంటుంది.
“మాయలో విద్య, అవిద్య అని రెండూ ఉన్నాయి. అవిద్యామాయ మనిషిని సంసారంలో మరపింప చేస్తుంది. విద్యామాయ అంటే జ్ఞానం, భక్తి, సాధుసాంగత్యం – ఇది మనిషిని భగవంతుని వైపుగా తీసుకువెళుతుంది.
“భగవదనుగ్రహంతో మాయకు అతీతమైన వ్యక్తికి అంతా సమానమే; విద్య అవిద్యలు అన్నీ సమానమే. గృహస్థాశ్రమమనేది భోగాశ్రమం. అయినా, కామినీ కాంచనాలలో అనుభవించడానికంటూ ఏముంది? మిఠాయి గొంతులో నుండి క్రిందకు దిగిపోగానే అది తియ్యగా ఉందా లేక పుల్లగా ఉందా అనికూడా గుర్తు ఉండదు.
“కాని అందరూ ఎందుకు త్యజిస్తారు? సమయం రాకుండానే పరిత్యజించడం సాధ్యమవుతుందా ఏమిటి? భోగాలు అనుభవించడం పూర్తయినప్పుడు, త్యజించడానికి సమయం ఆసన్నమవుతుంది. బలవంతంగా ఎవరైనా త్యాగం చెయ్యగలరా ఏమిటి? ‘మర్కట వైరాగ్యం’ అని ఒకటి ఉంది. అల్పబుద్ధులే అలాంటి వైరాగ్యాన్ని కలిగి ఉంటారు. తండ్రి గతించిన ఒక కుర్రాడి సంగతి తీసుకోండి. బీదరాలైన అతడి తల్లి నూలు వడకుతూ, అతికష్టం మీద ఇల్లు గడుపుతూ ఉంటుంది. ఆ కుర్రవాడు ఏదో మామూలు పని చేస్తుంటాడు, అయితే ఆ పనికూడా పోయింది. దానితో మన వాడికి వైరాగ్యం జనించింది. కాషాయం ధరించి కాశీకి వెళ్ళిపోయాడు. కొన్నిరోజుల తరువాత, ‘ఇక్కడ నాకు పని దొరికింది. నెలకు పది రూపాయల జీతం’ అంటూ ఇంటికి ఉత్తరం వ్రాశాడు. ఆ పదిరూపాయల జీతంలోనే బంగారు ఉంగరం, ఖరీదైన వస్త్రాలు కొనడానికి ప్రయత్నిస్తాడు. భోగాలను అనుభవించాలని అతడికి ఉన్న కోర్కె ఎక్కడకు పోతుందేమిటి?
5.1 పంచమ పరిచ్ఛేదం కేశవ్ తదితర బ్రహ్మసమాజస్థులతో శ్రీరామకృష్ణులు
కొంతమంది బ్రహ్మసమాజ భక్తులతో వచ్చి కేశవ్ సభక్తికంగా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయనకు ఎడమ ప్రక్కగా కూర్చున్నాడు, కుడిప్రక్కన రామ్ ఉన్నాడు. కాసేపు భాగవత పఠనం జరిగింది. ఆయన చుట్టూ గృహస్థ భక్తులు కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): సంసార కర్మలు చేయడం అతి కష్టం. గిరగిరా వేగంగా తిరిగితే కళ్ళు తిరిగి పడిపోతావు. కాని స్తంభాన్ని పట్టుకొని తిరిగితే అలాంటి భయమేమీ లేదు. మీరు మీ కర్తవ్యాలు నిర్వర్తించండి కాని భగవంతుణ్ణి మరువవద్దు.
“ ‘సంసార జీవితమన్నది అంత కష్టమైనప్పుడు మరి మార్గం ఏమిటి’ అని మీరు అడగవచ్చు. అభ్యాసయోగమే అందుకు మార్గం. కామార్పుకూర్లో వడ్రంగ కుటుంబాల స్త్రీలను నేను చూసి ఉన్నాను. వారు ఒక వైపు అటుకులు దంచుతుంటారు. చేతి మీద రోకలి పోటు పడుతుందేమోనన్న భయం ఉండనే ఉంటుంది. అదే సమయంలో వారు తమ బిడ్డలకు పాలు పడుతుంటారు. మరోవైపు ఖాతాదారులతో కూడా మాట్లాడుతూ ఉంటారు. వారితో ‘నువ్వు చెల్లించాల్సిన బాకీ చెల్లించి మరీ వెళ్ళు’ అంటూంటారు.
“అక్రమ సంబంధం నెరపుతున్న స్త్రీ, ఇంటి పనులన్నిటినీ చేస్తూనే ఉంటుంది కాని ఆమె మనుస్సుమాత్రం ఎల్లవేళలా తన ప్రియుడి మీదనే నిలిచి ఉంటుంది.
“కాని ఇలాంటి మనోస్థితి ఏర్పడడానికి కొంత సాధన అవసరం. మధ్య మధ్యలో ఏకాంతంలోకి వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థించాలి. భక్తి జనించాక కర్మలు చెయ్యవచ్చు. పనస పండును వట్టి చేతులతో కోయాలని ప్రయత్నిస్తే చేతులకు జిగురు అంటుకుంటుంది. అయితే చేతులకు నూనె రాచుకొని కోసినట్లయితే జిగురు అంటుకోదు.”
ప్రాంగణంలో సంకీర్తన మొదలయింది. త్రైలోక్యుడు గానం చేస్తున్నాడు. ఆనందపరవశులై శ్రీరామకృష్ణులు నాట్యం చేయసాగారు. కేశవ్ తదితర భక్తులు కూడా ఆయనతో కలసి నాట్యం చేశారు. అది శీతకాలమైనప్పటికీ ఆయనకు చెమటలు పట్టాయి. కీర్తనానందం సమాప్తమయ్యాక అందరూ కూర్చున్నారు. ఏమైనా తినడానికి పట్రమ్మన్నారు శ్రీరామకృష్ణులు. ఇంట్లో నుండి ఒక పళ్ళెరంలో మిఠాయిలు వచ్చాయి. పళ్ళెరాన్ని పట్టుకుని కేశవ్ ఆయన ముందు వినయంగా నిలబడ్డాడు. ఆయన వాటిని తినసాగారు. తినడం పూర్తయ్యాక, ఆయన చేతుల మీద కేశవ్ నీళ్ళు పోశాడు; తరువాత తువ్వాలుతో ఆయన చేతులను, ముఖాన్ని తుడిచాడు. పిదప ఆయనకు విసరసాగాడు.
శ్రీరామకృష్ణులు (కేశవ్ తదితర భక్తులతో): గృహస్థులుగా ఉంటూ, భగవంతుణ్ణి ప్రార్థించేవాళ్ళు నిజంగానే వీరభక్తులు. నెత్తిమీద ఇరవై మణుగుల భారం ఉంటుంది. అయినప్పటికీ వారు భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. వారినే వీరభక్తులు అంటారు. అది ఎంతో కష్టమని మీరు చెప్పవచ్చు. కాని భగవత్కృపతో సాధ్యం కాని కఠినమైన పని అంటూ ఏదైనా ఉందా? ఆయన కృపతో అసాధ్యం కూడా సాధ్యమైపోతుంది. వెయ్యి సంవత్సరాలుగా చీకటి గుయ్యారంగా ఉన్న గదిలోకి దీపం తెస్తే, ఆ గదిలోకి వెలుగు కొద్దికొద్దిగా వస్తుందా ఏమిటి? గదంతా ఒక్కసారిగా ప్రకాశవంతమవుతుంది.
ఈ అభయ వచనాలు విని కేశవాది గృహస్థ భక్తుల హృదయాలు సంతోష భరితమయ్యాయి.
రామ్, మనోమోహన్ల బాబాయి అయిన రాజేంద్ర మిత్రతో కేశవ్ ఇలా అన్నాడు: “మీ ఇంట్లో కూడా ఇలా ఒక రోజు వేడుకలు జరిపిస్తే బాగుంటుంది.”
రాజేంద్ర: తప్పకుండా. (రామ్‌తో) రామ్, ఆ ఉత్సవం నిర్వహించే భారమంతా నీదే సుమా!
శ్రీరామకృష్ణులను ఇంట్లోపలకు తోడ్కొని వెళ్ళారు. ఆయన కోసం మనోమోహన్ తల్లి భోజనం సిద్ధం చేసి ఉంది. ఆయన ఇష్టపడే హిమానీజలం (Ice water) కూడా కంచం ప్రక్కన ఒక గ్లాసులో పెట్టారు. రకరకాల మిఠాయిలు, రుచికరమైన పదార్థాలు కూడా కంచం ప్రక్కన పెట్టారు. వాటినన్నిటినీ చూసి నవ్వుతూ “నా కోసం ఇవన్నీ తయారు చేశారా?” అన్నారాయన.
కేశవ్ తదితర భక్తులు ప్రాంగణంలో కూర్చుని విందుభోజనం ఆరగిస్తున్నారు. శ్రీరామకృష్ణులు వచ్చి వారికి వడ్డించసాగారు, ఆటపాటలతో వారిని అలరింపచేశారు.
తరువాత ఆయన దక్షిణేశ్వరానికి బయలుదేరారు. కేశవాది భక్తులు ఆయన పాదధూళి స్వీకరించి ఆయన్ను బండిలోకి ఎక్కించారు.
6.1 షష్ఠ పరిచ్ఛేదం రాజేంద్ర మిత్రా ఇంట్లో శ్రీరామకృష్ణులు
శనివారం, డిసెంబర్ 10, 1881
కేశవ్ అభ్యర్థన మేరకు శ్రీరామకృష్ణులను, భక్తులను ఆహ్వానిస్తూ రాజేంద్ర మిత్ర కలకత్తాలోని తన ఇంట్లో ఉత్సవం జరిపాడు. బ్రహ్మసమాజ భక్తులను కూడా ఆహ్వానించాడు.
రెండు రోజుల క్రితం, బ్రహ్మసమాజ ప్రముఖుడైన అఘోరనాథ్ లక్నోలో హఠాత్తుగా మరణించాడు. ఆ కారణంగా కేశవాది బ్రహ్మసమాజ భక్తులు సంతాపం ప్రకటించి ఉన్నారు. అందుచేత వారు ఉత్సవానికి హాజరు కారేమోనన్న ఉద్దేశంతో రాజేంద్ర దిగులు పడ్డాడు. శ్రీరామకృష్ణుల భక్తుడైన రామ్, అతడితో ఇలా అన్నాడు: “మీరెందుకు అలా దిగులు పడుతున్నారు? కేశవ్బాబు వచ్చినా సరే, రాకున్నా సరే – పరమహంస దేవులు వస్తున్నారు. బహుశ మీకు తెలీదేమో – ఆయన సర్వదా సమాధిమగ్నులై ఉంటారు, ఇతరులకు కూడా ఆయన భగవత్సాక్షాత్కారం పొంద చేయగలరు. ఆయన రాకతో ఉత్సవం విజయవంతమవుతుంది.”
రామ్ తదితరులతో కలసి రాజేంద్ర, అఘోరనాథ్ మరణం పట్ల సంతాపం ప్రకటించడానికి కేశవ్ వద్దకు వెళ్ళాడు. ఉత్సవానికి కేశవ్ రాడేమోనని రాజేంద్ర విచారం వ్యక్తం చెయ్యగా, అతడితో కేశవ్ ఇలా అన్నాడు: “ఎక్కడిది, ఉత్సవానికి రానని నేను చెప్పడం లేదే! శ్రీరామకృష్ణ పరమహంస దేవులే అక్కడకు వస్తున్నప్పుడు నేను రాకుండా ఉంటానా? మేము సంతాపంలో ఉన్న మాట నిజమే కాని ఉత్సవానికి నేను తప్పక హాజరవుతాను.”
సమాధిమగ్నులైన శ్రీరామకృష్ణుల పటం ఒకటి కేశవ్ గదిలో గోడకు వ్రేలాడగట్టబడి ఉంది.
ఆ పటాన్ని చూపుతూ రాజేంద్ర, కేశవ్‌తో “ఆయన చైతన్యదేవుల అవతార మని జనులు చెప్పుకొంటుంటారు” అన్నాడు. పటం వంక చూస్తూ కేశవ్ “ఇటువంటి సమాధి చాలా అరుదైనది. ఏసుక్రీస్తు, మహమ్మదు, చైతన్యులు వంటి మహానుభావులకు మాత్రమే ఈ స్థితి కలిగింది” అన్నాడు.
మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీరామకృష్ణులు మనోమోహన్ ఇంటికి వచ్చారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని, కొద్దిగా ఉపాహారం స్వీకరించారు. తరువాత సురేంద్రుడు ఆయన్ను ఒక బండిలో బెంగాల్ ఫోటోగ్రాఫర్ స్టూడియోకు తీసుకువెళ్ళాడు. ఫోటోలు ఎలా తీస్తారో ఫోటోగ్రాఫర్ ఆయనకు వివరించాడు. సిల్వర్ నైట్రేట్ ద్రావణం పూయబడిన గాజు మీద చిత్రం ముద్రింపబడుతుందని ఆయనకు చూపించాడు. తరువాత శ్రీరామకృష్ణుల ఫోటో తీస్తూండగా ఆయన సమాధి మగ్నులైపోయారు.
కాసేపటి తరువాత ఆయన రాజేంద్ర మిత్ర ఇంటికి వచ్చారు. కేశవ్ ఇంకా రాలేదు. మహేంద్ర గోస్వామి భాగవతం చదువుతున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో సంభాషించసాగారు.
శ్రీరామకృష్ణులు: గృహస్థాశ్రమంలో ఎందుకు వీలుపడదు? కాని అది ఎంతో కష్టమన్నమాట నిజమే. ఇక్కడకు వస్తున్నప్పుడు నేను బాగ్‌బజార్‌లోని వంతెన మీదుగా వచ్చాను. అది ఎన్ని గొలుసులతో కట్టబడి ఉందని! వాటిలో ఏదో ఒక గొలుసు తెగినా వంతెనకు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే దాన్ని లాగి, పటిష్ఠంగా ఉంచడానికి ఇంకా అనేక గొలుసులు ఉన్నాయి. అదేవిధంగా సంసారులకు బంధనాలు అనేకం. భగవంతుడి దయ లేకుండా బంధనాలు తొలగే ఉపాయం లేదు.
“భగవద్దర్శనం కలిగాక భయపడే పని లేదు. ఆయన మాయలో విద్య, అవిద్యలు రెండూ ఉన్నాయి. అయితే, ఆయన్ను దర్శించాక వాటిపట్ల నిర్లిప్తంగా ఉండవచ్చు. పరమహంస స్థితిని పొందాక వాటిని సరిగా అర్థం చేసుకోవచ్చు. పాలలో నీరు ఉంది, నీటిని వదిలిపెట్టి కేవలం పాలను స్వీకరించగలిగేది హంస మాత్రమే. అలా హంస చెయ్యగలదు కానీ కాకి కాదు.”
ఒక భక్తుడు: మరయితే గృహస్థులకు ఏమిటి మార్గం?
శ్రీరామకృష్ణులు: గురువాక్యాల పట్ల విశ్వాసం. ఆయన వాక్కులను అవలంబనం చేసుకొని, ఆయన ఉపదేశాలున్న స్తంభాన్ని పట్టుకొని చుట్టూ తిరుగు, గార్హస్థ్య కర్తవ్యాలు నెరవేర్చు.
“గురువును కేవలం మానవమాత్రుడని భావించరాదు. సచ్చిదానందుడే గురువు రూపంలో వస్తాడు. గురుకృపచే ఇష్టదేవత దర్శనం కలుగుతుంది, అప్పుడు గురువు ఇష్టదేవతలో లీనమైపోతాడు.
“విశ్వాసంతో సాధ్యం కానిదంటూ ఏముంది? ఒకసారి ఒక గురువు ఇంట్లో అన్నప్రాశన ఉత్సవం జరుగుతోంది. తమతమ స్తోమతలను బట్టి శిష్యులందరూ ఉత్సవానికి ధన వస్తు రూపంలో సహాయం చేస్తున్నారు. వారిలో ఒక పేద వితంతువు కూడా ఉండేది. ఆమె వద్ద ఒక ఆవు ఉంది. ఆమె ఒక చెంబుతో పాలను తీసుకువచ్చింది. కాని ఉత్సవానికి అవసరమయ్యే పాలు పెరుగుల బాధ్యతనంతా ఆమే చూసుకుంటుందని గురువు భావించాడు. ఆమె తెచ్చిన పాల చెంబును ఆగ్రహంతో విసిరికొట్టి ‘నువ్వు నీళ్ళలో మునిగి చావవెందుకని?’ అన్నాడు. దాన్ని ఆమె గుర్వాజ్ఞగా ఎంచి నదిలో మునిగిపోవడానికి వెళ్ళింది. అప్పుడు నారాయణుడు ప్రసన్నుడై ఆమెకు దర్శనమిచ్చి, ఇలా అన్నాడు: ‘ఈ పాత్రలో పెరుగు ఉంది. దీనితో నువ్వు ఎంత పోస్తే అంత పెరుగు వస్తూనే ఉంటుంది. దీనితో నీ గురువు సంతుష్టుడవుతాడు.’ ఆ పాత్రను గురువుకు ఇచ్చేసరికి అతడు నిర్ఘాంతపోయాడు. అతడు జరిగినదంతా విని, నదీ తీరం వద్దకు వచ్చి ఆ వితంతువుతో ఇలా అన్నాడు: ‘నాకు నారాయణ దర్శనం కలిగించకపోతే నేను ఇక్కడే ఈ నీళ్లలో దూకి చచ్చిపోతాను.’ నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు కాని గురువు ఆయన్ను చూడలేకపోయాడు. ఆ స్త్రీ నారాయణుడితో ‘ప్రభో! గురుదేవులకు మీరు దర్శనమివ్వకపోతే, తత్కారణంగా ఆయన ప్రాణత్యాగం చేస్తే నేను కూడా చచ్చిపోతాను’ అంది. అప్పుడు గురువుకు కూడా నారాయణుడు ఒక్కసారి దర్శనమిచ్చాడు.
“చూశారా, గురుభక్తి ఉండడం వల్ల స్వయంగానూ దర్శనం కలిగింది, గురుదేవులకు కూడా ఆ దర్శనభాగ్యం కలిగింది.
“అందుకే ‘నా గురువు కల్లు దుకాణానికి వెళ్ళినా సరే, ఆయన నిత్యానంద స్వరూపుడే’ అని నేను అంటాను.
“అందరూ గురువులై పోదామనుకుంటారు, కాని శిష్యులమవుదామనుకొనే వారు బహు అరుదు. ఎత్తుగా ఉండే మెట్టప్రదేశంలో నీరు నిలువదు. అది నిలిచేది పల్లపు ప్రాంతంలోనే, త్రవ్వి ఉన్న ప్రదేశంలోనే.
“గురువు ఇచ్చిన నామం పట్ల విశ్వాసం ఉంచి, ఆ నామంతో సాధ నానుష్ఠానాలు గావించాలి. స్వాతి నక్షత్రంలో కురిసే వర్షపు నీటికోసం ముత్యపు చిప్ప తయారై ఉంటుందని చెబుతుంటారు. ఆ వర్షపు నీటి బిందువు ఒకటి అందులో పడగానే అది వెంటనే అగాధాలలోనికి వెళ్ళిపోతుంది, ముత్యం తయారయ్యేంత వరకు అక్కడే ఉంటుంది.”
7.1 సప్తమ పరిచ్ఛేదం దక్షిణేశ్వర ఆలయాలు
అనేకమంది బ్రహ్మసమాజ భక్తులు అక్కడ సమావేశమై ఉండడం చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “బ్రహ్మసమాజ భక్తులకు ఇది సభా లేక శోభా? బ్రహ్మసమాజంలో క్రమం తప్పకుండా ఉపాసనలు జరుగుతున్నాయి, అది మంచిదే. కాని లోతులలోకి మునిగిపోవాలి. కేవలం ఉపాసనలు, లెక్చర్లవల్ల ప్రయోజనం లేదు. సంసార భోగాల పట్ల ఆసక్తి తొలగిపోయి భగవంతుడి పాదపద్మాల పట్ల శుద్ధభక్తి జనించేలా ఆయన్ను ప్రార్థించాలి.
“ఏనుగుకు వెలుపలి దంతాలతో పాటు లోపల కూడా దంతాలు ఉంటాయి. వెలుపల ఉన్న దంతాలు కేవలం అలంకారప్రాయమే. అయితే లోపల ఉన్న దంతాలతో అది ఆహారం నములుతుంది. అదేవిధంగా, అంతరంగాన కామినీకాంచనాలు అనుభవించడం వల్ల భక్తికి హాని వాటిల్లుతుంది.
“ఊరకే బయటకు లెక్చర్లు ఇవ్వడంవల్ల ఏమిటి ప్రయోజనం? రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతుంటుంది కాని దాని దృష్టి మాత్రం నేల మీద ఉన్న పీనుగుల గోతిపైనే. తారాజువ్వ ‘పుస్’ మంటూ ఆకాశంలోకి ఎగురుతుంది కాని, మరుక్షణమే అది నేలరాలిపోతుంది.
“భోగాసక్తిని త్యాగం చేసినప్పుడు మరణ సమయంలో భగవంతుడే స్మరణకు వస్తాడు.లేకుంటే భార్యాబిడ్డలు, ఇల్లు, సంపద, పేరు ప్రతిష్ఠలు మొదలైన సంసార విషయాలే జ్ఞప్తికొస్తాయి. అభ్యాసం ద్వారా చిలుక ‘రాధాకృష్ణ’ అంటూ ఉంటుంది కాని పిల్లి పట్టుకున్నప్పుడు మాత్రం అది భయంతో కఠోరంగా అరుస్తుంది.
“అందుకే సర్వదా అభ్యాసం చేయడం ఆవశ్యకం. భగవన్నామ గుణకీర్తనలు, ధ్యానం, చింతనలు అభ్యసిస్తూ ఉండాలి. ఇంకా, భోగాసక్తి వదలిపోయేలా, ఆయన పాదపద్మాల పట్ల మనస్సు నిలచేలా ఆయన్ను ప్రార్థించాలి.
“గృహస్థులైనటువంటి భక్తులు సంసారంలో ఈ విధంగా పనిమనిషిలా మెలగుతూ ఉంటారు – ఇంటి పనిమనిషి పనులన్నిటినీ చేస్తూనే ఉంటుంది కాని ఆమె మనస్సు మాత్రం తన స్వగ్రామం పైనే ఉంటుంది. అంటే, భక్తులు భగవంతునిపై మనస్సు నిలిపి తమ కర్తవ్యాలు చేసుకుంటూ ఉంటారు. గార్హస్థ్యంలో ఉంటే దేహానికి బురద అంటుకునే తీరుతుంది. కాని, యథార్థ భక్తుడైనటువంటగృహస్థుడు సంసారంలో బురదచేపలాగా జీవిస్తాడు.ఆ చేప బురదలో ఉంటుంది కాని బురద మాత్రం దానికి అంటుకోదు.
“బ్రహ్మం, శక్తిల మధ్య భేదం లేదు. భగవంతుణ్ణి ‘అమ్మా’ అంటూ పిలవడం ద్వారా భక్తి, ప్రేమలు సత్వరం జనిస్తాయి.”
ఇలా అని శ్రీరామకృష్ణులు ఈ పాటలు పాడారు:
మాయమ్మ పదస్వర్గ మం దున్నతంబుగా
పయనించె నొక గాలిపడగలా నా మది
పాపంపు సుడిగాలి బలముగా వీచుచు
వడివడిగ భువి వైపు పడద్రోసె దానిని ॥ మా ॥
ఒక వైపు క్రిందికి వంచుచు మాయయె
కలచె యా నిశ్చల గమనంబు నించుక
నేనెంత శ్రమపడి ఎగురింపజూచిన
మరి దాని నింగికి మరలింపలేనైతి ॥ మా ॥
దారాసుతాదు లందలి ప్రేమదారము
పెనవేసి విడరాని పీటముడి పడిపోవ
నా గాలిపడగలా నడిమకి రెండుగా
చిక్కుబడి దానిలో చినిగిపోయినదయ్యో ॥ మా ॥
విజ్ఞాన మను పాగ వీడి పడిపోయెను
నే దాని విడువగా నేల మీదికి దూకె
ఏ రీతి మరి ఇది ఎగురును నింగికి
తునకలై దాని తల తునిగిపోయిన పిదప ॥ మా ॥
భక్తి సూత్రముచేత బంధింపబడి కూడ
ఇటు ఆడినందున మిగిలే దుఃఖమె తనకు
అతినీచ స్థితిలోకి ఆర్వురు సమకూడి
పడత్రోసి వైచిరి బలమైన శత్రులు ॥ మా ॥
అటు నవ్వు ఇటు యేడ్పు లందించు ఆటను
ఆడినందుకు దిగులునంది నరేశ్‌చంద్ర
ఈ ఆట తా నసలు ఆడకుండిన నెంత
బాగుండునో యని భావింప సాగె ॥ మా ॥
నన్ను కన్నతండ్రి నల్లనయ్య రార ।
అనుచు మాత శ్రీ యశోద నిన్ను పిలువ ॥
ఆమె చెంతచేరి ఆటలాడు ముద్దు
మోము నెందు దాచినావు భద్రకాళి ।
కత్తి ప్రక్కబెట్టి కరము మురళి పట్టె
పుర్రెమాల దీసి పూలమాల దాల్చి
ఒక్కసారి నీవు కృష్ణుడాడినట్లు
నాట్యమాడు శ్యామ నాదు ప్రీతి కొరకు ॥
పాడుతూ శ్రీరామకృష్ణులు లేచి నృత్యం చేయసాగారు, భక్తులు కూడా లేచి నిలబడ్డారు. మధ్యమధ్యలో ఆయన సమాధి మగ్నులవుతున్నారు, భక్తులు ఆయన్ను తదేకంగా చూస్తున్నారు. ఆయన సమాధిస్థితి యథార్థమైనదేనా అని పరీక్షించ డానికిగానూ డా. దుకరి ఆయన కనుగుడ్లను స్పృశించాడు. అది భక్తులకు చిరాకు కలిగించింది.
నృత్యగానాలు ముగిశాక భక్తులందరూ కూర్చున్నారు. ఆ సమయంలో కొంతమంది బ్రహ్మభక్తులను వెంటబెట్టుకొని కేశవ్‌చంద్ర సేన్ అక్కడకు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి కూర్చున్నాడు. ఇందాక శ్రీరామకృష్ణుల సంకీర్తనతో తామందరం మహదానందం పొందిన వైనం రాజేంద్ర, కేశవ్‌కు చెప్పి త్రైలోక్యుని పాడమని అభ్యర్థించాడు. “శ్రీరామకృష్ణులు పాలుపంచుకోరు కాబట్టి కీర్తన చప్పగా ఉంటుంది” అన్నాడు కేశవ్. బ్రహ్మభక్తులతో కలసి త్రైలోక్యుడు పాడసాగాడు:
హరిహరిహరి యని హరిని భజియించుము
హరిహరిహరి యని హరిని పొగడుము
హరి యని పాడుచు ముక్తకంఠమున
తరియించుము సంసార సాగరము ॥ హ ॥
హరి వసియించును భూజలములలో
హరి వసియించును అనిలానలముల
శ్రీహరి నిలయము సూర్యచంద్రులు
హరిహరిహరి యని హరిని భజించుము ॥ హ ॥
అనంత విశ్వము గానుపించును
నిండిన శ్రీహరి నిజరూపముగా
హరిహరిహరి యని హరిని భజింపుము
హరి హరి హరి యని హరిని పాడుము ॥ హ ॥
భక్తులకు ఉపాహారం సమర్పించడానికి ఏర్పాట్లు జరుగుతూండగా శ్రీరామకృష్ణులు కేశవ్‌తో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఇవాళ, యంత్రం ద్వారా ఛాయాచిత్రం ఎలా తీస్తారో చూసి వచ్చాను. కేవలం గాజు మీద చిత్రం ముద్ర పడదన్న సంగతి గమనించాను. గాజు వెనకాల నల్లని ద్రావణం పూస్తారు, అప్పుడే చిత్రం నిలుస్తుంది. అదే విధంగా, ఆధ్యాత్మిక ప్రసంగాలను ఊరకే వింటూ ఉండడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు; జనులు వెంటనే వాటిని మరచిపోతారు. కాని అంతరంగాన చిత్తశుద్ధి, భక్తి అనే ద్రావణం పూసి ఉన్నట్లయితే వారు ఆ విషయాలను హృదయంలో పదిలపరచుకోగలరు. లేకుంటే విన్న వెంటనే వాటిని మరచిపోతారు.
శ్రీరామకృష్ణులను రెండవ అంతస్తులోకి తోడ్కొని వెళ్ళి అక్కడ ఒక చక్కటి తివాచీ మీద ఆయన్ను ఆసీనులను చేశారు. మనోమోహన్ తల్లి ఆయనకు భోజనం వడ్డించసాగింది. రామ్ తదితరులు ఆ సమయంలో అక్కడే ఉన్నారు. శ్రీరామకృష్ణులు భోజనం చేస్తున్న గదికి ఎదురుగా ఉన్న వసారాలో కేశవాది భక్తులకు భోజనం వడ్డించారు.
8.1 అష్టమ పరిచ్ఛేదం బ్రహ్మసమాజ వార్షికోత్సవంలో భక్తులతో శ్రీరామకృష్ణులు
ఆదివారం, జనవరి 1, 1882
కలకత్తాలోని సిమ్లా బ్రహ్మసమాజ వార్షికోత్సవంలో పాలుపంచుకోడానికి శ్రీరామకృష్ణులు జ్ఞాన్ చౌధురి ఇంటికి విచ్చేశారు. కేశవ్, రామ్, మనోమోహన్, బలరామ్, కేదార్, నరేంద్రుడు, రాఖాల్ తదితర భక్తులు అక్కడ ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే నరేంద్రుడు, శ్రీరామకృష్ణులను దక్షిణేశ్వర కాళి ఆలయంలో కలుసుకొని ఉన్నాడు. అతడు అప్పుడప్పుడు సిమ్లా బ్రహ్మ సమాజానికి వచ్చి అక్కడి ఉపాసనలో పాల్గొని గానం చేసేవాడు.
బ్రహ్మసమాజపు పద్ధతులను అనుసరించే ఉపాసన నిర్వహింపబడింది. తొలుత శాస్త్ర పఠనం చేశారు. తరువాత నరేంద్రుడు గానం చేశాడు.
సంధ్యాకాలం. భక్తుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. చుట్టూ కూర్చుని ఉన్న గృహస్థ భక్తులను చూస్తూ శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: సంసారంలో ఉన్న వ్యక్తికి తన మనస్సును భగవంతునికి ఇవ్వడం ఎందుకు సాధ్యం కాదు? అని నేను అడుగుతాను. విషయం ఏమిటో తెలుసా? అతడి మనస్సు అతడి వద్ద లేదు. మనస్సనేది అతడి వద్ద ఉండి ఉంటే అతడు దాన్ని భగవంతుడికి ఇవ్వగలిగి ఉండేవాడు. కాని మనస్సు తాకట్టు పెట్టబడింది. కామినీ కాంచనాల కొరకు తాకట్టు! అందుకే సర్వదా సాధుసాంగత్యంలో వసించడం సంసారికి ఎంతైనా అవసరం. మనస్సు మళ్ళీ తనకు దక్కినప్పుడే కదా అతడు సాధన భజనలు చేయడానికి దాన్ని వినియోగించుకోగలిగేది. కాని నిరంతరం గురువుతోటసాంగత్యం, గురువును సేవించడం, సాధు సాంగత్యం అవసరం. ఏకాంతంలో రాత్రింబవళ్ళు భగవచ్చింతనైనా చేయాలి, లేకుంటే సాధుసాంగత్యమైనా నెరపాలి. మనస్సును దాని మానాన దాన్ని వదలివేస్తే అది ఎండిపోతుంది. ఒక పాత్రలో నీరు తీసుకొని దాన్ని ప్రక్కన పెట్టామనుకోండి. అందులోని నీరు క్రమక్రమంగా ఎండిపోతుంది. కాని పాత్రను గంగలో ముంచిపెట్టినట్లయితే అలా కాదు.
“ఇనుమును కమ్మరి కొలిమిలో పెట్టినప్పుడు అది చాలా ఎర్రగా తయారవుతుంది. కాని బయటకు తీసినట్లయితే, అది మునుపటిలా నల్లగా అయిపోతుంది. అందుకే, మధ్యమధ్యలో ఇనుమును కొలిమిలో కాల్చాలి.
“అజ్ఞానం అంటే ఏమిటో తెలుసా? ‘ఈ ఇల్లు నాది, ఇది నా కుటుంబం, నేను కర్తను; నేను చేస్తున్నాను కాబట్టే ఇంటి వ్యవహారాలన్నీ ఇలా సక్రమంగా జరుగుతున్నాయి’ – ఈ భావనే అజ్ఞానం. కాని ‘నేను భగవంతుడి దాసుడను, ఆయన భక్తుడను, ఆయన బిడ్డను’ అన్న భావన ఉత్తమమైనది.
‘నేను’ అన్నది పూర్తిగా వదలివెళ్ళే రకం కాదు. విచారణ ద్వారా నువ్వు దాన్ని కొట్టిపడెయ్యవచ్చు కాని అంతలోనే అది నీకు తెలియకుండానే ఎక్కడి నుంచో వచ్చి ఊడిపడుతుంది. తల నరికివేసిన తరువాత కూడా ‘మే, మే’ అంటూ కాళ్ళు ఆడించే మేకలాంటిది ఈ ‘నేను’.
కాని భగవంతుణ్ణి దర్శించిన తరువాత ఆయన మనలో ఏ ‘నేను’ నైతే నిలుపుతాడో అది ‘పరిపక్వమైన నేను’. అది పరుసవేదిని స్పృశించడం ద్వారా బంగారంగా మారిపోయిన ఖడ్గం లాంటిది. దానితో ఎవ్వరినీ గాయపరచలేం.
ఉపాసన హాలులో కూర్చుని శ్రీరామకృష్ణులు ఈ విధంగా సంభాషిస్తున్నారు. కేశవ్ తదితర భక్తులు మంత్రముగ్ధులై ఆ అద్భుత వచనాలను ఆలకిస్తున్నారు. సమయం రాత్రి ఎనిమిది గంటలు కావస్తోంది. ఉపాసన కోసం మూడుసార్లు గంట మ్రోగింది.
శ్రీరామకృష్ణులు (కేశవ్ తదితరులతో): ఇదేమిటి? మీరింకా ఉపాసనను మొదలుపెట్టనే లేదు!
కేశవ్: ఇక వేరే ఉపాసన అవసరం ఏమిటి? ఉపాసన అంతా ఇక్కడే అవుతూంటేను.
శ్రీరామకృష్ణులు: లేదయ్యా, మీ ఆచారం ప్రకారం ఉపాసన జరగాలి.
కేశవ్: ఎందుకు? ఇలాగే బాగుంది.
శ్రీరామకృష్ణులు మరీమరీ చెప్పగా కేశవ్ ఉపాసన ప్రారంభించాడు. ఉపాసన జరుగుతున్నప్పుడు, శ్రీరామకృష్ణులు హఠాత్తుగా లేచి నిలబడి సమాధి మగ్నులైపోయారు. బ్రహ్మసమాజ భక్తులు ఈ పాట పాడసాగారు:
హరిహరిహరి యని హరిని భజియించుము
హరిహరిహరి యని హరిని పొగడుము….
శ్రీరామకృష్ణులు భావావస్థలో అలాగే నిలబడి ఉన్నారు. ఎంతో జాగ్రత్తగా కేశవ్ ఆయన్ను చెయ్యి పుచ్చుకొని హాలులో నుండి వసారాలోకి తీసుకువచ్చాడు. గానం కొనసాగింది. శ్రీరామకృష్ణులు ప్రస్తుతం గానానికి అనుగుణంగా నృత్యం చేయసాగారు. భక్తులు కూడా ఆయన చుట్టూ నాట్యం చేయసాగారు.
ఉపాహారం సేవించాక శ్రీరామకృష్ణులు కేశవ్‌తో మాట్లాడుతూ, పాడ నారంభించారు. కేశవ్ కూడా ఆయనతో జత కలిపాడు.
నల్లనిదౌ నా మానస మధుపము
ఉల్లాసంబుగ లాగివేయబడె
తల్లి శ్యామ పదనీరాజమునకు
ఉల్లము రంజిలజేయు విధమున
నీలకంధరుని రాణియె కాళి
నీల కమలమె కాళి పాదము
గ్రోలిన మధుకరి రుచిలేకుంటచే
వ్రాలదు వాంఛాసుమముల మీదకు
నల్లగ నుండును అమ్మ పాదములు
నల్లనిదే నా మానస మధుపము
నల్లని వొకటైయున్న మర్మము
అల్లనగని నా కన్నులు మరలెను
అంతమునందు తీరెను కమలా
కాంతుని ఆశలు సుఖదుఃఖములచే
నెంతయు కదలక వోలలాడెను
అంతములేని ఆనందాంబుధి.
మా యమ్మ పదస్వర్గ మం దున్నతంబుగా
పయనించె నొక గాలిపడగలా నా మది
పాపంపు సుడిగాలి బలముగా వీచుచు
వడివడిగ భువివైపు పడద్రోసె దానిని…..
శ్రీరామకృష్ణులు, కేశవ్ ఇద్దరూ భావపారవశ్యంలో ఉన్మత్తులై ఉన్నారు. తక్కిన భక్తులు కూడా వారితో జత కలిపి అర్ధరాత్రి వరకు నృత్యగానాలలో గడిపారు.
శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రాంతి తీసుకొని కేశవ్‌తో ఇలా అన్నారు: “నీ కుమారుడి వివాహం సందర్భంగా నా కెందుకు ఆ కానుకలన్నీ పంపించావు? వాటితో నేనేం చేసుకోను?వాటిని వెనక్కు తీసుకో.”
కేశవ్ మందహాసం చేశాడు. శ్రీరామకృష్ణులు కొనసాగించారు: “నా గురించి నువ్వు నీ పత్రికలో వ్రాస్తావెందుకు? పుస్తకాలలోనో, పత్రికలలోనో ఎవరి గురించయినా వ్రాసి వారిని గొప్పవారిని చెయ్యలేవు. ఎవరినయినా భగవంతుడు గొప్ప వాడిని చేస్తే ఆ వ్యక్తి అరణ్యంలో ఉన్నా సరే, అతడి గురించి అందరికీ తెలియ వస్తుంది. అరణ్యమధ్యంలో పువ్వులు వికసించినప్పుడు వాటిని తేనేటీగలు కనుగొంటాయి కాని సాధారణమైన ఈగలు వాటిని కనుక్కోలేవు. మనిషి ఏం చేయగలడు? అతడి వంక చూడవద్దు. అతడు కేవలం పురుగులాంటివాడు. ఈ రోజు నిన్ను పొగడిన నాలుకే రేపు నిన్ను తెగడుతుంది కూడా. పేరు ప్రతిష్ఠలు నాకు అక్కర్లేదు; నేను సదా దీనులలో దీనుడను, హీనులలో హీనుడనుగా ఉంటే చాలు.”