48.1 ప్రథమ పరిచ్ఛేదం డా. సర్కార్ ఇంట్లో ‘మ’
గురువారం, అక్టోబర్ 29, 1885
సమయం ఉదయం పదిగంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు పరిస్థితిని తెలుపడానికి శాంఖారిటోలాలోని డా ॥ సర్కార్ ఇంటికి ‘మ’ వచ్చాడు. ఇద్దరూ మాటల్లో పడ్డారు.
డాక్టరు: డా ॥ బిహారీ భాదురీది ఎప్పుడు చూసినా ఒక్కటే సోదె! తన దేహం నుండి ఆత్మ బయటకు రావడం గెథె (Goethe) చూశాడని అతడు చెబుతుంటాడు. అది ఎంత ఆశ్చర్యమో కదా!
‘మ’ : ఇలాంటి చర్చలతో ప్రయోజనం ఏమిటని శ్రీరామకృష్ణులు చెబుతుంటారు. భగవంతుడి పాదపద్మాల పట్ల భక్తిని పెంపొందించుకోవడానికే సుమా మనం ఈ భూమ్మీదకు వచ్చింది అని ఆయన వచిస్తుంటారు. మామిడి పళ్ళను తినడానికి తోటకు వెళ్ళిన వ్యక్తి కథను ఆయన మాకు చెబుతుంటారు. ఆ వ్యక్తి తోటకు వెళ్ళిన తరువాత పళ్ళు తినడానికి బదులుగా ఒక పెన్సిలు, కాగితం చేతపట్టుకొని తోటలో చెట్లు ఎన్ని, కొమ్మలు ఎన్ని, ఆకులు ఎన్ని అని లెక్కపెడుతూ వ్రాసుకోసాగాడు. తోట కాపలావాడు అది చూసి ‘నువ్వేం చేస్తున్నావు? ఇక్కడకు ఎందుకు వచ్చావు?’ అని అడిగేసరికి ఆ వ్యక్తి ‘నేను మామిడి పళ్లు తినడానికి వచ్చాను. ప్రస్తుతం చెట్లు, కొమ్మలు, ఆకులు ఎన్ని ఉన్నాయి అని లెక్క పెడుతున్నాను’ అన్నాడు. అది విని ఆ కాపలావాడు ఇలా అన్నాడు: ‘నువ్వు మామిడిపళ్లు తినడానికి వచ్చావు. పళ్ళను తినిపో. తక్కిన లెక్కలతో నీకేమిటి పని?’
డాక్టరు: శ్రీరామకృష్ణులు సారం గ్రహించారు!
ఆపైన డాక్టరు హోమియోపతి చికిత్స గురించి చెప్పసాగాడు. ప్రతిరోజు తన ఆసుపత్రికి వచ్చే రోగుల పట్టిక చూపించాడు. మొదట్లో చాలామంది పెద్ద డాక్టర్లు తనను నిరుత్సాహపరచిన వైనం, అటుపిదప కొందరు తనకు వ్యతిరేకంగా పత్రికా ప్రకటనలు ఇచ్చిన ఉదంతం ‘మ’ కు వివరించాడు.
కాసేపయ్యాక డా ॥ సర్కార్, ‘మ’ లు బండి ఎక్కారు. దారిలో పలువురు రోగుల ఇళ్ళకు వెళ్ళి డాక్టరు వారికి చికిత్స చేశాడు. పాథురియాఘాట్లో టాగూర్ వంశానికి చెందిన ఒకరి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కాస్త ఆలస్యమయింది. తిరిగి బండిలో ఎక్కి ‘మ’ తో మాట్లాడసాగాడు.
డాక్టరు: ఈ ఇంటి యజమానితో శ్రీరామకృష్ణుల గురించి మాట్లాడాను. థియోసఫీ, కర్నల్ ఆల్కాట్ గురించికూడా మాట్లాడుకున్నాం. శ్రీరామకృష్ణులకు ఈయన పట్ల కోపమట, ఎందుకో తెలుసా? తాను సర్వజ్ఞుడనని ఈయన డంబాలు పలుకుతుంటాడు.
‘మ’ : లేదు, లేదు. శ్రీరామకృష్ణులకు ఈయన పట్ల కోపం ఎందుకు ఉండాలి? వారిద్దరూ ఒకసారి కలుసుకున్నారని విన్నాను. శ్రీరామకృష్ణులు భగవత్ప్రసంగాలు కావిస్తుండగా ఈయన ‘ఓ, ఈ విషయాలన్నీ నాకు తెలుసులే’ అన్నాడట.
డాక్టరు: ఈయన ‘విజ్ఞాన సమితి’ నిమిత్తం 32, 500 రూపాయలు విరాళం ఇచ్చాడు.
బండి బయలుదేరింది. శ్రీరామకృష్ణుల వ్యాధి గురించి, అందుకు చేయవలసిన చికిత్సల గురించి డాక్టరు మాట్లాడసాగాడు.
డాక్టరు (‘మ’ తో): మీరు ఆయన్ను దక్షిణేశ్వరం తీసుకు వెళ్ళా లనుకుంటున్నారా?
‘మ’ : లేదండి. దూరాభారం కదా! కలకత్తాలోనే ఉంటే, భక్తులు తరచూ వచ్చి చూసిపోవడానికి సౌకర్యంగా ఉంటుంది.
డాక్టరు: ఇక్కడ ఖర్చులు అధికం కదా!
‘మ’ : ఖర్చుల గురించి భక్తులు ఆలోచించడం లేదు. ఆయనకు ఏ ఇబ్బందీ కలుగకుండా, సముచిత రీతిలో సేవించాలన్నదే భక్తుల తాపత్రయం. ఇక్కడైనా, అక్కడైనా ఖర్చు ఒక్కటే కదా! కాని ఆయన్ను దక్షిణేశ్వరానికి తీసుకువెళితే భక్తులు ఆయన్ను ఇప్పటిలా తరచూ దర్శించుకోలేరు.
48.2 ద్వితీయ పరిచ్ఛేదం డా. సర్కార్, డా. భాదురీ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు
డా ॥ సర్కార్, ‘మ’ ఇద్దరూ శ్యాంపుకూర్ ఇంటికి వచ్చారు. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు తమ గదిలో కూర్చుని ఉన్నారు. డా ॥ భాదురీ కూడా అక్కడ ఉన్నాడు. డా ॥ సర్కార్, శ్రీరామకృష్ణుల నాడిని పరీక్షించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగాడు. పిదప ఆధ్యాత్మిక ప్రసంగాలు ప్రారంభమయ్యాయి.
డా ॥ భాదురీ: అసలు విషయం ఏమిటో తెలుసా? సర్వం స్వప్నం లాంటిదే!
డా ॥ సర్కార్: అంతా భ్రమేనా? మరి అలాగయితే ఈ భ్రమను చూసే వారెవరు? అసలు ఎందుకు ఈ భ్రమ? మరి భ్రమ అని తెలిసీ, మళ్ళీ మాట్లాడడం ఎందుకు? భగవంతుడు సత్యం, కాని ఆతడి సృష్టి అసత్యం అన్న వాదనతో నేను ఏకీభవించను.
శ్రీరామకృష్ణులు: ఈ భావం చక్కనిది – ‘ఓ భగవంతుడా, నువ్వు ప్రభువ్వి, నేను దాసుణ్ణి’ అనేటటువంటి భావం ఇది. దేహం యథార్థమే అన్న బోధ ఉన్నంతవరకు, ‘నేను’, ‘నువ్వు’ అన్న ఎరుక ఉన్నంతవరకు సేవ్య సేవక భావమే మంచిది. ‘నేనే భగవంతుణ్ణి’ అన్న భావం మంచిది కాదు.
“మరో సంగతి చెప్పాలి. నువ్వు ఈ గదిని ఒక ప్రక్క నుండి చూసినా లేక గది మధ్యలో నిలబడి చూసినా నువ్వు చూసేది ఇదే గదిని.”
డా ॥ భాదురీ (డాక్టరుతో): ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ వేదాంతంలో ఉన్నాయి. నువ్వు శాస్త్రాలు అధ్యయనం చెయ్యి, అప్పుడు ఈ విషయాలన్నీ నీకు అవగతమవుతాయి.
డాక్టరు: అలా అంటావెందుకు? ఈయన (శ్రీరామకృష్ణులు) శాస్త్రాలు చదివి పండితులయ్యారా ఏమిటి?ఈయన కూడా నా అభిప్రాయాన్ని సమర్థిస్తారు. శాస్త్రాలు చదవకుండానే జ్ఞానం పొందలేమా?
శ్రీరామకృష్ణులు: కాని శాస్త్రాలను ఇతరులు చదువుతుండగా నేను ఎంతగానో వినేవాడిని.
డాక్టరు: ఎవరైనా వ్యక్తి, కేవలం విన్నట్లయితే విషయాన్ని అపార్థం చేసుకొనే ప్రమాదం ఉంది. అయితే మీ సంగతి వేరు.
48.2.1 శ్రీరామకృష్ణులకు పాద నమస్కారం గురించి డా.సర్కార్
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): నేను పిచ్చివాడినని నువ్వు అన్నావట కదా! అందుకే వీరు (‘మ’ తదితరులు) నీ వద్దకు రావడానికి ఇష్టపడరు.
డాక్టరు (‘మ’ వంక చూస్తూ): నేను ఆ మాట అనలేదే! కాని మీకు అహంకారం ఉందని మాత్రం చెప్పాను. వీరందరూ మీ పాదాలకు మ్రొక్కి కళ్ళకద్దుకుంటారు కదా! దాన్ని మీ రెందుకు అనుమతిస్తారు?
‘మ’ : లేకుంటే భక్తులు విలపిస్తారు.
డాక్టరు: అలా చేయడం తప్పు అని వారికి వివరించాలి.
‘మ’ : మేము అలా చేస్తే మటుకు మీ కెందుకు అభ్యంతరం? సర్వభూతాలలోనూ భగవంతుడు ఉన్నాడు కదా!
డాక్టరు: నేను కాదనను. అలాగయితే అందరి కాళ్ళకు మ్రొక్కాలి.
‘మ’ : కొందరిలో భగవంతుడి అభివ్యక్తీకరణ అధికంగా ఉంటుంది. నీరు సర్వత్రా ఉంది. కాని కొలను, నది, సముద్రం – వీటిలో ఎక్కువగా ఉంటుంది. మీరు ఫారడేకు (శాస్త్రజ్ఞుడు) ఇచ్చినంత గౌరవం కొత్తగా బి.యస్సీ. పాసయిన విద్యార్థికి ఇస్తారా?
డాక్టరు: నీ మాట నేను ఒప్పుకుంటాను. కాని మీరు ఈయన్ను భగవంతుడిగా ఎందుకు పేర్కొంటారు?
‘మ’ : మనం పరస్పరం నమస్కారాలు చేసుకుంటా మెందుకని? అందరి హృదయాలలోను భగవంతుడు ఉన్నాడనే భావనతోనే కదా! మీరు ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించినట్లు లేదు.
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): కొన్ని వస్తువుల్లో భగవంతుడి అభివ్యక్తీకరణ అధికంగా ఉంటుందన్న విషయం నీకు ఇదివరకే చెప్పాను. ఒకే సూర్యకిరణాలు నేల మీద పడినప్పుడు ఒక విధంగానూ, చెట్టుపైన మరో విధంగానూ, అద్దం మీద మరో విధంగానూ ప్రతిబింబిస్తాయి. మిగతా వాటితో పోలిస్తే అద్దం మీద ప్రతిబింబించడం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్న భక్తులను ప్రహ్లాదునితో పోల్చగలమా? ప్రహ్లాదుడు తన మనఃప్రాణాలను సంపూర్ణంగా భగవంతునికి సమర్పించాడు.
డాక్టరు ఏమీ బదులు పలుకలేదు. అందరూ మౌనంగా ఉండిపోయారు.
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): ఇలా చూడు, నీకు దీని (శ్రీరామకృష్ణుల) పట్ల ఆకర్షణ ఉంది. మీరంటే నాకు అభిమానం అని నువ్వే కదా చెప్పావు.
డాక్టరు: మీరు Child of Nature (ప్రకృతి శిశువు) లాంటి వారు. అందుకే నేను మీకు ఇలా చెబుతోంది. జనం మీ పాదాలకు నమస్కరించడం చూస్తే నాకు బాధ వేస్తుంది. ఇంత మంచి మనిషిని వీరంతా పాడు చేస్తున్నారని అనిపిస్తుంది. కేశవ్సేన్ను కూడా ఆయన భక్తులు అలాగే పాడుచేశారు. అందుకే నేను చెప్పేది వినండి.
శ్రీరామకృష్ణులు: నువ్వు చెప్పేది వినడమా! నువ్వు అత్యాశాపరుడివి, కాముకుడివి, అహంకారివి!
భాదురీ (డాక్టరుతో): అంటే మీలో జీవత్వ బుద్ధి ఉందని చెబుతున్నారు. కామం, అహంకారం, ధనం కావాలన్న ఆశ, పేరుప్రతిష్ఠలకై అత్యాశపడటం – ఇవే జీవుడి లక్షణాలు. జీవుల నైజం ఇదే.
డాక్టరు (శ్రీరామకృష్ణులతో): మీరు ఇలా అంటే నేను నా పని చూసుకొని వెళ్ళిపోతాను. తక్కిన ప్రసంగాలతో నాకు పనిలేదు. కాని చర్చకు దిగితే మాత్రం ఉన్నదున్నట్లు చెప్పివేస్తాను.
48.2.2 అనులోమం, విలోమం – ఉత్తమ, మధ్యమ, అధమ భక్తులు
అందరూ మౌనంగా ఉండిపోయారు. కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు డా ॥ భాదురీతో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (భాదురీతో): విషయం ఏమిటో తెలుసా? ఈయన (డా ॥ సర్కార్) ‘నేతి, నేతి’ అని విచారణ చేస్తూ అనులోమ క్రమంలోనే పోతున్నాడు. భగవంతుడు జీవుడు కాదు, జగత్తు కాదు; సృష్టికి అతీతుడు – ఇలాంటి విచారణ ఈయన చేస్తున్నాడు. కాని విలోమ క్రమానికి వచ్చినప్పుడు సర్వం భగవన్మయంగా అంగీకరిస్తాడు.
“అరటిచెట్టు పట్టలను తీసివేస్తూ పోయినప్పుడు దవ్వ లభ్యమవుతుంది. అరటి పట్టలు, అరటి దవ్వ అన్నవి వేర్వేరు వస్తువులు. పట్టలు దవ్వ కాదు; దవ్వ పట్టలూ కాదు. కాని చివరగా పట్టలు లేకుండా దవ్వ, దవ్వ లేకుండా పట్టలు ఉండవనీ, రెండూ కలిసి అరటిచెట్టు అనే ఒకే వస్తువుకు చెందినవనీ మనిషి తెలుసుకుంటాడు. భగవంతుడే ఇరవై నాలుగు తత్త్వాలుగా అయివున్నాడు, మానవుడిగా విరాజిల్లు తున్నాడు.
(డాక్టరుతో) “భక్తులు ఉత్తమ, మధ్యమ, అధమ భక్తులు అని మూడు రకాలుగా ఉంటారు. ‘భగవంతుడు అక్కడ ఉన్నాడు’ అని అంటాడు అధమ భక్తుడు. భగవంతుడు, సృష్టి వేర్వేరు అన్నది అతడి తలంపు. మధ్యమ భక్తుడు ‘భగవంతుడు అంతర్యామి’ అంటాడు. అతడు భగవంతుణ్ణి హృదయంలో దర్శిస్తాడు. ‘భగవంతుడే ఈ సమస్తం అయి ఉన్నాడు, ఆయనే ఇరవై నాలుగు తత్త్వాలుగా అయివున్నాడు’ అని గాంచేవాడు ఉత్తమ భక్తుడు. పైనా, క్రిందా, సర్వమూ భగవంతుడిగానే ఆతడు దర్శిస్తాడు.
“నువ్వు గీత, భాగవతం, వేదాంతం – వీటి నన్నిటినీ చదువు. అప్పుడు ఈ విషయాలన్నిటినీ అవగతం చేసుకోగలవు. భగవంతుడు సృష్టిలో లేడా ఏమిటి?”
డాక్టరు: ఆయన అన్నిచోట్లా ఉన్నాడు. అందుకే ఆయన్ను వెదుకలేము. తరువాత సంభాషణ అన్యవిషయాల వైపుకు మరలింది. శ్రీరామకృష్ణులు సర్వదా భావావస్థలకు లోనవుతుంటారు. ఇది ఆయన వ్యాధిని ప్రకోపింపచేసే ప్రమాదం ఉందని డాక్టరు చెబుతున్నాడు.
డా ॥ సర్కార్ (శ్రీరామకృష్ణులతో): మీరు మీ భావావేశాన్ని నిగ్రహించుకోండి. నాక్కూడా ఎంతగానో భావావేశం కలుగుతూ ఉంటుంది. అప్పుడు నేను మీ కంటే ఎక్కువగా నాట్యం చేయగలను.
చిన్న నరేంద్రుడు (నవ్వుతూ): భావావేశం మరికాస్త అధికరిస్తే ఏం చేస్తారు?
డాక్టరు: నిగ్రహశక్తి కూడా పెరుగుతుంది.
శ్రీరామకృష్ణులు, ‘మ’ ఇరువురూ డాక్టరుతో “ఆ, మీరు అలాగే భావించుకోవచ్చు” అన్నారు.
‘మ’ (డాక్టరుతో): యథార్థంగా భావోద్రేకం కలిగితే మీరేం చేస్తారో చెప్పగలరా?
అటుపైన సంభాషణలో డబ్బు గురించిన ప్రస్తావన వచ్చింది.
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): నాకు డబ్బు మీద ఆవగింజంతైనా ఆశ లేదు. ఆ సంగతి నీకు తెలిసినదే కదా!
డాక్టరు: నాక్కూడా డబ్బు మీద ఆశ లేదు. ఇక మీ సంగతి వేరే చెప్పాలా? మా ఇంట్లో డబ్బు పెట్టె తెరిచే ఉంటుంది.
శ్రీరామకృష్ణులు: యదుమల్లిక్ కూడా ఇలాగే పరధ్యానంగా ఉండేవాడు. భోజనానికి కూర్చున్నప్పుడు కూడా ఎంతగా అన్యమనస్కుడు అవుతాడంటే, ఆహారం రుచికరంగా ఉందా లేదా అని పట్టించుకోకుండా మొత్తం తినేస్తాడు. ఎవరైనా ‘ఏమండీ, ఇది తినవద్దు. ఇది బాగోలేదు’ అంటే ‘ఆ, అవునవును. ఇది బాగోలేదు’ అంటాడు.
భగవచ్చింతన ద్వారా అన్యమనస్కులవడం, విషయచింతన ద్వారా అన్యమనస్కులవడంలో గల వ్యత్యాసాన్ని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నట్టున్నారు.
పిదప భక్తుల వంక దృష్టిని సారించి, డాక్టరును చూపుతూ చిరునవ్వుతో ఇలా అన్నారు: “ఇలా చూడండి. ఏదైనా వస్తువు ఉడికినప్పుడు, అది మెత్తబడుతుంది. ఈయన కఠినంగా ఉండేవాడు. ప్రస్తుతం లోపల నుండి కొద్దికొద్దిగా మెత్తబడుతున్నాడు.”
డాక్టరు: ఏదైనా వస్తువును ఉడకబెట్టినప్పుడు అది బయట నుండే మెత్తబడడం ప్రారంభిస్తుంది.
కాని అది నాకు ఈ జన్మలో సాధ్యపడదేమోనని అనుమానంగా ఉంది. (అందరూ నవ్వారు)
డా ॥ సర్కార్ బయలుదేరనున్నాడు; శ్రీరామకృష్ణులతో మాట్లాడుతున్నాడు.
డాక్టరు: జనం మీ పాదాలకు మ్రొక్కేటప్పుడు వారిని మీరు వద్దని వారించలేరా?
శ్రీరామకృష్ణులు: అందరూ ఆ అఖండ సచ్చిదానందుణ్ణి పట్టుకోగలరా ఏమిటి?
డాక్టరు: అలాగని మీరు జనులకు ఏది మంచిది, ఏది కాదు అన్న విషయం చెప్పారా?
శ్రీరామకృష్ణులు: జనులలో రుచి భేదం ఉంటుంది, వారి రుచులు వేరు వేరుగా ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితానికి అందరూ ఒకే విధమైన అర్హతను కలిగి ఉండరు. వారిలో అధికారభేదం ఉంటుంది.
డాక్టరు: అదేమిటి?
శ్రీరామకృష్ణులు: రుచిభేదం అంటే ఏమిటో తెలుసా? కొందరు చేపపులుసు తింటారు, కొందరు వేయించిన చేప, కొందరు చేపఊరగాయ తింటారు. మరికొందరు చేపపులావు తింటారు. ఇంకా, అధికార భేదం అనేది కూడా ఉంది. ముందుగా అరటి చెట్టుకు గురిపెట్టడం నేర్చుకోవాలి, ఆ తరువాత దీపపు వత్తి, అటుపైన ఎగురుతున్న పక్షికి గురిపెట్టాలని నేను చెబుతుంటాను.
48.2.3 అఖండ దర్శనం – డా. సర్కార్‌కి చైతన్యం కలుగుతుంది
సంధ్యాకాలం అయింది. శ్రీరామకృష్ణులు ధ్యానమగ్నులయ్యారు. వ్యాధి కారణంగా విపరీతమైన బాధ పడుతున్నప్పటికీ ఆ బాధంతా ప్రస్తుతానికి ఒక మూలన పడిపోయింది. కొందరు ఆంతరంగిక భక్తులు సమీపంగా కూర్చుని తదేకంగా ఆయన్నే చూస్తున్నారు. చాలాసేపటి వరకు ఆయన ఆ స్థితిలోనే ఉండిపోయారు. పిదప బాహ్యస్పృహలోకి వచ్చాక ‘మ’ తో మెల్లగా ఇలా అన్నారు: “నా మనస్సు అఖండంలో లీనమైపోయింది. అటుతరువాత అనేక దృశ్యాలను గాంచాను. డాక్టరుకు ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుందన్న విషయం చూశాను. కాని అందుకు ఇంకా కొన్ని రోజులు పడుతుంది. ఇకపైన అతడికి ఎక్కువగా చెప్పే పని ఉండదు. మరొకర్ని చూశాను. ‘అతణ్ణి కూడా ఆకర్షించు’ అని మనస్సు చెప్పింది. అతడి గురించి తరువాత చెబుతాను.”
48.2.4 గృహస్థులకు వివిధ ఉపదేశాలు
శ్యాంబసు, దొకరి డాక్టరు, మరికొందరు భక్తులు వచ్చారు. శ్రీరామకృష్ణులు వారితో మాట్లాడసాగారు.
శ్యాంబసు: ఆహా, ఆ రోజు మీరు మాకు ఎన్ని అద్భుత విషయాలు చెప్పారు!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఏ విషయాలు?
శ్యాంబసు: జ్ఞానాజ్ఞానాలకు ఆవల ఏం ఉంటుందన్న విషయం!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అది విజ్ఞానం. నానాజ్ఞానం అన్నది అజ్ఞానం. సర్వభూతాలలోను భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడం జ్ఞానం. ఇకపోతే భగవంతుణ్ణి విశేషంగా తెలుసుకోవడాన్ని విజ్ఞానం అంటారు. భగవంతుడితో సంభాషించడం, ఆయన మనకు ఆత్మీయుడు అన్న బోధ – దీనినే విజ్ఞానం అంటారు.
“కట్టెలో అగ్ని ఉంది; అగ్నితత్త్వం ఉంది అని తెలుసుకోవడం జ్ఞానం. ఆ కట్టెను వెలిగించి ఆ మంటతో అన్నం వండుకొని భుజించడం, అలా భుజించి పుష్టికరంగా తయారవడాన్ని విజ్ఞానం అంటారు.”
శ్యాంబసు (నవ్వుతూ): ఇంకా, ముల్లు గురించిన విషయం కూడా చెప్పారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఆ, కాలికి ముల్లు గుచ్చుకున్నప్పుడు మరో ముల్లు కోసం వెదుకవలసి వస్తుంది. పిదప దానితో కాలికి గుచ్చుకున్న ముల్లును తీసివేయాలి, అటు తరువాత ఆ రెండు ముళ్ళనూ పారవేయవలసి ఉంటుంది. అదే విధంగా అజ్ఞానమనే ముల్లును తొలగించడానికి జ్ఞానమనే ముల్లును సేకరించవలసి వస్తుంది. అజ్ఞానం నశించినప్పుడు జ్ఞానాజ్ఞానాలు రెండింటినీ పారవేయాలి. అప్పుడు విజ్ఞానం జనిస్తుంది.
శ్యాంబసుపట్ల శ్రీరామకృష్ణులు ప్రసన్నులయ్యారు. శ్యాంబసు వయస్సు మళ్ళిన వ్యక్తి. ప్రస్తుతం కొంతకాలం భగవచ్చింతనలో గడపాలని అభిలషిస్తున్నాడు. శ్రీరామకృష్ణుల గురించి విని ఇక్కడకు వచ్చాడు.అతడు ఇక్కడకు రావడం ఇది రెండవసారి.
శ్రీరామకృష్ణులు (శ్యాంబసుతో): లౌకిక ప్రసంగాలను పూర్తిగా వదలి పెట్టు. భగత్ప్రసంగాలు తప్ప అన్య విషయాలు ఏవీ మాట్లాడవద్దు. లౌకిక వ్యక్తులను చూడగానే మెల్లగా అక్కడనుండి తప్పుకో. ఇంతకాలం సంసారం చేశాక అంతా డొల్ల అని తెలుసుకున్నావు. భగవంతుడొక్కడే వస్తువు, తక్కినదంతా అవస్తువు. భగవంతుడొక్కడే సత్యం, తక్కినదంతా కేవలం రెండు రోజులు మాత్రం ఉండేది. ఆఖరుకు సంసారం మాత్రం ఏమిటి? అది రేగిపండుతో చేసిన ఊరగాయ లాంటిది. దాన్ని తిందామన్న ఆరాటం జనిస్తుంది. కాని తినడానికి రేగిపండులో ఏముందని? తోలు, విత్తనం మాత్రమే కదా! పైగా, తిన్నప్పుడు కడుపులో నొప్పి వేస్తుంది.
శ్యాంబసు: అవునండి. మీరు చెబుతున్నదంతా వాస్తవమే.
శ్రీరామకృష్ణులు: చాలాకాలంగా నువ్వు అనేక లౌకిక వ్యవహారాలలో నిమగ్నమై ఉన్నావు. ఈ సంసార జంజాటాల మధ్య ఉంటే భగవచ్చింతన, ధ్యానం వీలుపడదు. కొంతకాలం ఏకాంతవాసం ఆవశ్యకం. ఏకాంతంలోకి వెళ్ళకుండా మనస్సు స్థిరం కాదు. అందుకే ఇంటికి కనీసం అరమైలు దూరంలో ధ్యానం కోసం స్థలం ఏర్పాటు చేసుకోవాలి.
శ్యాంబసు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. అతడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నాడు.
శ్రీరామకృష్ణులు(నవ్వుతూ): పైగా నీ పళ్ళన్నీ ఊడిపోయాయి. ఇంకా దుర్గాపూజ కోసం ఈ ఉబలాటం ఎందుకు? (అందరూ నవ్వారు.) ఒక వ్యక్తి మేక పోతులను బలియిస్తూ యథోక్తంగా దుర్గాపూజను జరిపించేవాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు పూజ జరిపించాక అతడు దాన్ని ఆపివేశాడు. ‘ప్రస్తుతం దుర్గాపూజ చేయడం లేదెందు’ కని మిత్రుడు ప్రశ్నించగా ఆ వ్యక్తి ‘తమ్ముడూ, ఇప్పుడు పళ్ళన్నీ ఊడిపోయాయి. అందువల్ల మేకపోతు మాంసం తినడం వీలుకాదు!’ అన్నాడు.
శ్యాంబసు: ఆహా, ఏం వచనాలు!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఈ సంసారంలో ఇసుక, చక్కెర రెండూ కలగలపి ఉన్నాయి. చీమలాగా ఇసుకను వదలి చక్కెరను స్వీకరించాలి. కేవలం చక్కెరను మాత్రమే తీసుకొనేవాడు తెలివైనవాడు. భగవచ్చింతనకు, ధ్యానం చేయడానికి ఏకాంతప్రదేశాన్ని ఏర్పాటు చేసుకో. దానిని నువ్వు సిద్ధం చేసుకో నేను కూడా ఒకసారి వస్తాను.
శ్యాంబసు: మహాశయా, పునర్జన్మ అనేది ఉందంటారా? మనం మళ్ళీ జన్మనెత్తవలసి ఉంటుందా?
శ్రీరామకృష్ణులు: ఆ విషయం భగవంతుణ్ణి అడుగు. మనస్ఫూర్తితో ఆయన్ను ప్రార్థించు. ఆయనే నీకు అంతా వెల్లడిస్తాడు. తప్పక వెల్లడిస్తాడు. యదుమల్లిక్తో మాట్లాడితే అతడికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఎంత ధనం ఉందో, రొక్క పత్రాలు ఎన్ని ఉన్నాయో అంతా అతడే తెలుపుతాడు. ప్రారంభంలో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది కాదు. ముందుగా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకో, పిదప నీకు ఏది కావాలంటే అది ఆయనే తెలియపరుస్తాడు.
శ్యాంబసు: మహాశయా, సంసారంలో ఉంటూ మనిషి ఎన్నో పాపకృత్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అలాంటి మనిషికి ఎన్నటికైనా భగవంతుణ్ణి పొందడం సాధ్యమేనా?
శ్రీరామకృష్ణులు: ఎవరైనా వ్యక్తి శరీరాన్ని చాలించే ముందు సాధనలు జరిపినట్లయితే, సాధనలు చేస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దేహత్యాగం చేసినట్లయితే అతడికి ఎన్నటికీ పాపం అంటదు. స్నానం చేయించాక కూడా ఒంటికి దుమ్ము ధూళి పూసుకోవడం ఏనుగు స్వభావం. కాని స్నానం అవగానే మావటివాడు దాన్ని గజశాలకు తీసుకువెళితే అది మళ్ళీ అలా దుమ్ము పూసుకోలేదు.
వ్యాధితో ఎంతగానో బాధపడుతున్నప్పటికీ పరమదయాళువు, అహేతుక కృపాసింధువు అయిన పరమహంస శ్రీరామకృష్ణులు జీవుల దుఃఖాలను చూసి చలించిపోయి వారికి హితవు చేకూరేదెలా అని రాత్రింబవళ్ళు అదే ఆలోచనలో మునిగివున్నారు. ఆయన అపార కరుణను చూసి భక్తులు నిశ్చేష్టులవుతున్నారు. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దేహాన్ని వదలినట్టయితే ఎలాంటి పాపం అంటదు అన్న ఆయన అభయ వచనం భక్తుల హృదయాలలో గాఢంగా హత్తుకుపోయింది.
48.3 తృతీయ పరిచ్ఛేదం డా.సర్కార్ – ‘మ’
శుక్రవారం, అక్టోబరు 30, 1885
సమయం ఉదయం తొమ్మిది గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదిలో ‘మ’ తో సంభాషిస్తున్నారు. అక్కడ మరెవరూ లేరు. శ్రీరామకృష్ణుల పరిస్థితిని నివేదించడానికి డా ॥ సర్కార్ వద్దకు వెళ్ళి ఆయన్ను తోడ్కొని రానున్నాడు ‘మ’.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో నవ్వుతూ): ఇవాళ ఉదయం పూర్ణుడు వచ్చాడు. అతడిది ఎంత కోమల స్వభావం! మణీంద్రుడిది ప్రకృతి స్వభావం, అతడు చైతన్యచరితామృతం చదివి గోపికల మనోగతాన్ని అర్థం చేసుకున్నాడు. భగవంతుడు పురుషుడనీ, మానవుడు ప్రకృతి అనీ, సఖీభావంతో మానవుడు భగవంతుణ్ణి ఆరాధించాలని కూడా అతడు అర్థం చేసుకున్నాడు. ఎంత అసాధారణం!
‘మ’ : అవునండి, నిజమే.
పూర్ణుడికి 15 లేక 16 సంవత్సరాలు ఉంటాయి. అతణ్ణి చూడాలని శ్రీరామకృష్ణులు ఎంతగానో ఆరాటపడుతుంటారు. కాని పూర్ణుడి ఇంట్లో వాళ్ళు శ్రీరామకృష్ణుల వద్దకు రావడానికి అతణ్ణి అనుమతించరు. వ్యాధికి మునుపు ఒకనాటి రాత్రివేళ పూర్ణుణ్ణి చూడడానికి శ్రీరామకృష్ణులు ఎంతగా పరితపించి పోయారంటే ఆయన ఉన్నపళానే దక్షిణేశ్వరం నుండి ‘మ’ ఇంటికి వచ్చేశారు. అప్పుడు ‘మ’, పూర్ణుణ్ణి అతడి ఇంటినుండి శ్రీరామకృష్ణుల వద్దకు పిలుచుకువచ్చాడు. భగవంతుణ్ణి ప్రార్థించే విషయమై ఆ కుర్రవాడికి సూచనలు ఇచ్చి ఆయన దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళిపోయారు.
మణీంద్ర వయస్సుకూడ 15 లేక 16 సంవత్సరాలు ఉంటుంది. భక్తులు అతణ్ణి ఖోకా (అంటే పసిపిల్లవాడు) అని పిలుస్తారు. భగవన్నామ సంకీర్తన విని అతడు భావావేశంలో నాట్యం చేస్తాడు.
సుమారు పదిన్నర గంటలకు ‘మ’, డా ॥ సర్కార్ ఇల్లు చేరాడు.
మేడ మీది వసారాలోని కుర్చీలలో కూర్చుని డాక్టరు, ‘మ’ లు ఇద్దరూ సంభాషించుకోసాగారు. డాక్టరుకు ఎదురుగా, ఒక గాజు తొట్టెలో బంగారురంగు చేపలు ఉన్నాయి. మధ్యమధ్యలో ఆయన ఆ చేపలకు ఏలుక తొక్కలువేస్తున్నాడు. ఇంకా, మైదాపిండిని ఉండలుగా చేసి మేడ మీద వ్రాలుతున్న పిచ్చుకల వైపుకు విసురుతున్నాడు. ‘మ’ వీటన్నిటినీ గమనిస్తున్నాడు.
డాక్టరు (‘మ’ తో నవ్వుతూ): చూశావా, ఈ చేపలు నా వంకే చూస్తున్నాయి. నేను ఏలుక తొక్కలు వేశానని అవి ఎరుగవు. అందుకే కేవలం భక్తి ఉంటే ప్రయోజనం లేదు అని నేను చెప్పడం; జ్ఞానం కూడా ఉండాలి. (‘మ’ నవ్వాడు.) ఆ పిచ్చుకలను చూడు. వాటికి ఆహారం వేశాను. అయితే అవి భయంతో ఎగిరిపోతున్నాయి. వాటికి జ్ఞానంలేదు కనుక భక్తికూడా లేదు. మైదా ఉండలు వాటికి ఆహారమని అవి ఎరుగవు.
ఇద్దరూ అతిథులు గదిలోకి వచ్చారు. డాక్టరు ఒకింతసేపు విశ్రమించాడు. గదిలో అల్మారాలనిండా పుస్తకాలు! పుస్తకాలను చూస్తూ ‘మ’ కెనాన్ ఫెరార్ (Canon Farrar) రచించిన Life of Jesus (ఏసుక్రీస్తు జీవిత చరిత్ర) అనే పుస్తకం తీసి, కొన్ని పుటలు చదివాడు. డాక్టరు మధ్యమధ్యలో మాట్లాడుతున్నాడు. హోమియోపతి ఆసుపత్రి ఏర్పరచడానికి తాను ఎన్ని అవస్థలు పడ్డాడో చెబుతున్నాడు. దానికి సంబంధించి ‘ 1876 కలకత్తా జర్నల్ ఆఫ్ మెడిసిన్’ లో ప్రచురితమైన ఉత్తర ప్రత్యుత్తరాలను చదవమని ‘మ’ తో చెప్పాడు. డా ॥ సర్కార్ హోమియోపతి వైద్యంపట్ల అంకితభావం ఉన్నవాడు.
‘మ’, Munger’s New Theology (ముంగర్ రచించిన నవీన ధర్మ శాస్త్రం) అనే పుస్తకాన్ని తీసుకున్నాడు.
డాక్టరు: ముంగర్ తన నిర్ణయాలకు యుక్తిపూర్వకమైన తర్కాలను ఆధారం చేసుకొన్నాడు. ఎవరో చైతన్యుడో, బుద్ధుడో, లేక ఏసుక్రీస్తో చెప్పాడని మీరు విశ్వసించడం వంటిది కాదు ఇది.
‘మ’ (నవ్వుతూ): అవును. మనం చైతన్యుల, బుద్ధుడి వచనాలను నమ్మరాదు. కాని ముంగర్ చెప్పిన పలుకులను మాత్రం నమ్మి తీరాలి!
డాక్టరు: నువ్వు ఏమైనా అనుకో.
‘మ’ : అది కాదండి. ఎవరో ఒకరిని ప్రమాణంగా తీసుకోవాలన్నప్పుడు ముంగర్ను తీసుకుంటే సరిపోతుందని నేను అంటున్నాను. (డాక్టరు నవ్వాడు.)
డాక్టరు, ‘మ’ తో పాటు బండిలో కూర్చున్నాడు.బండి శ్యాంపుకూర్ వైపుకు బయలుదేరింది. మిట్టమధ్యాహ్నం. ఇద్దరూ మాటల్లో పడ్డారు. డా ॥ భాదురీ గురించిన ప్రస్తావన వచ్చింది. భాదురీ కూడా అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులను సందర్శించడానికి వస్తుంటాడు.
‘మ’ (నవ్వుతూ): మీరు మళ్ళీ రాళ్ళురప్పలతో ప్రారంభించాలని భాదురీ అన్నాడు.
డాక్టరు: అంటే?
‘మ’ : మహాత్ములను, సూక్ష్మ శరీరులను మీరు అంగీకరించరు కదా! భాదురీ బహుశా థియోసఫీకి చెందినవాడై ఉంటాడు. అదీగాక మీరు అవతారవాదం, భగవంతుడి లీలలు మొదలైనవి ఒప్పుకోరు. అందుకే కాబోలు, మీ గురించి పరిహాసంగా ఇలా అన్నాడు – మీరు మరణించిన పిదప మళ్ళీ మానవజన్మ ఎత్తరట. అంతెందుకు, పశుపక్ష్యాదుల శరీరం కూడా లభించదు. చెట్టుచేమలై కూడా పుట్టరట. కాబట్టి రాళ్ళు రప్పలతో మొదలుపెట్టవలసిందే. తరువాత క్రమక్రమంగా ఉన్నతినొంది చివరకు మానవజన్మ ఎత్తవచ్చు.
డాక్టరు: బాబోయ్, అలాగా!
‘మ’ : భౌతిక శాస్త్రాలలో కూడా మీ జ్ఞానం కృత్రిమమైనదేనని భాదురీ అన్నాడు. అలాంటి జ్ఞానం తాత్కాలికం. రెండు బావులు ఉన్నాయనుకోండి. వాటిలో ఒకటి వాననీటితో నిండి ఉంది, మరొకటి ఊట నీటితో నిండి ఉంది. వాననీటితో నిండిన బావి ఎండాకాలంలో ఎండిపోతుంది. అట్లే మీ శాస్త్రజ్ఞానం కూడా సత్వరం ఎండిపోతుంది.
డాక్టరు (నవ్వుతూ): అలాగా!
బండి కార్న్వాలిస్ వీథిలో ఆగింది. డా ॥ ప్రతాప్ మజుందార్‌ను బండిలో ఎక్కించుకున్నారు. నిన్న ఆయనకూడా శ్రీరామకృష్ణులను దర్శింప వెళ్ళాడు. బండి శ్యాంపుకూర్ఇంటిని చేరుకుంది.
48.4 చతుర్థ పరిచ్ఛేదం డా. సర్కార్‌కి ఉపదేశం – జ్ఞానుల ధ్యానం
శ్రీరామకృష్ణులు పలువురు భక్తులతో తమ గదిలో కూర్చుని ఉన్నారు.
డాక్టరు (శ్రీరామకృష్ణులతో): మళ్ళీ ఖాసీ* అయిందా? కాని కాశీ వెళ్లడం మాత్రం మంచి పనే. (అందరూ నవ్వారు.)
శ్రీరామకృష్ణులు: కాశీలో మరణిస్తే, ముక్తి కలుగుతుంది. నేను కోరుకునేది ముక్తి కాదు, భక్తే (అందరూ నవ్వారు)
డా ॥ ప్రతాప్, డా ॥ భాదురీకి అల్లుడు. శ్రీరామకృష్ణులు ప్రతాప్ ముందు డా ॥ భాదురీని ప్రశంసించసాగారు.
శ్రీరామకృష్ణులు (ప్రతాప్‌తో): ఆహా! భాదురీ సౌశీల్యవంతుడు, భగవచ్చింతనాపరుడు, ఆచారనిష్ఠలు గలవాడు. సగుణ నిర్గుణ బ్రహ్మములను రెండింటినీ అంగీకరిస్తాడు.
డా ॥ సర్కార్ గురించి డా ॥ భాదురీ చెప్పిన రాళ్ళురప్పల మాట అందరి ముందూ ఒకసారి చెప్పాలని ‘మ’ ఉవ్విళ్ళూరుతున్నాడు. శ్రీరామకృష్ణులు వినేలా మెల్లగా చిన్న నరేంద్రుణ్ణి ఆ మాటలు గుర్తున్నాయా అని అడిగాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ డాక్టరుతో): నీ గురించి భాదురీ ఏమన్నాడో తెలుసా? నువ్వు వీటినన్నిటినీ ఒప్పుకోవు కాబట్టి మరుజన్మలో నువ్వు రాళ్ళు రప్పలుగా పుట్టి ప్రారంభించవలసి ఉంటుందట. (అందరూ నవ్వారు.)
డాక్టరు(నవ్వుతూ): రాళ్ళురప్పలతో ప్రారంభించి అనేక జన్మలెత్తాక, చివరికి మానవజన్మ లభిస్తుంది. మళ్ళీ ఇక్కడకు వస్తే మళ్లీ నాకు అదే గతి కదా! కాబట్టి మళ్లీ రాళ్ళురప్పలుగా జన్మించవలసి ఉంటుంది. (అందరూ నవ్వారు)
వ్యాధితో బాధ పడుతున్నప్పటికీ శ్రీరామకృష్ణులు సర్వదా భగవత్ భావంలో ఉన్మత్తులై ఉన్నారు, తరచూ భావావస్థ పొందుతుంటారు.
ప్రతాప్: నిన్న నేను మీ భావావస్థను చూశాను.
శ్రీరామకృష్ణులు: అది సామాన్యమైనది, ప్రగాఢస్థితి కాదు.
డాక్టరు: సంభాషించడం, భావావస్థ – ప్రస్తుతం ఇవి రెండూ మీకు మంచిది కాదు.
శ్రీరామకృష్ణులు(డాక్టరుతో): నిన్న భావావస్థలో నిన్ను చూశాను. నీకు జ్ఞానం ఉంది. కాని అది శుష్కజ్ఞానం. నువ్వు ఇంకా భగవదానందాన్ని చవిచూడ లేదు. (డాక్టరును చూపుతూ, ప్రతాప్‌తో) ఇతడు ఒకసారి భగవదానందాన్ని పొందితే పైనా, క్రిందా, సర్వత్రా పరిపూర్ణంగా దర్శిస్తాడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనడు, ఎవరితోను కటువుగా తీవ్రంగా కూడా మాట్లాడదు.
భక్తులందరూ మౌనంగా వింటున్నారు. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా భావావస్థను పొంది డాక్టరుతో ఇలా అన్నారు: “మహేంద్ర బాబూ, ఏమిటిది? ధనం కోసం అంత ఆరాటం ఎందుకు? భార్య పట్ల అంతటి అనురక్తి ఎందుకు? పేరుప్రతిష్ఠలకై అంతగా ప్రాకులాడుతా వెందుకు? ఇప్పటికైనావీటన్ని టినీ విదిలించి ఏకాగ్రతతో మనస్సును భగవంతుడిమీద నిలుపు, భగవదానందాన్ని అనుభవించు!”
డాక్టరుకు ఏం చెప్పాలో తోచడం లేదు. భక్తులు కూడా మౌనంగా ఉన్నారు.
శ్రీరామకృష్ణులు: జ్ఞానులు చేసే ధ్యానం గురించి నాంగ్టా చెబుతూండేవాడు. పైనా, క్రిందా, ఎక్కడ చూసినా పరిపూర్ణంగా జలమయం! జీవుడు చేపలాగ నీటిలో ఆనందంగా ఈదులాడుతున్నాడు. ధ్యానం స్థిరంగా కుదిరినప్పుడు వీటిని యథార్థంగా దర్శించగలవు.
“అనంత సాగరాన్ని ఊహించుకోండి. దానికి ఎక్కడా తీరమనేదే లేదు. అందులో ఒక కుండ ఉందనుకోండి. కుండ లోపలా, బయటా నీరే. జ్ఞాని బాహ్యాభ్యంతరాలలో ఆ పరమాత్మనే దర్శిస్తాడు. మరి కుండ అనేది ఏమిటి? అది ‘నేను’ అనే జ్ఞానం. కుండ ఉన్నందున నీరు రెండు భాగాలుగా విడిపోయినట్లు అగుపిస్తుంది. కుండ కారణంగా ‘లోపల, బయట’ అన్న జ్ఞానం ఉంటుంది. ‘నేను’ అనే కుండ ఉన్నంతవరకు అలాంటి జ్ఞానం ఉంటుంది. ఆ ‘నేను’ అన్నది వదలిపోయినప్పుడు ఏమి ఉంటుందో అదే ఉంటుంది. దానిని మాటలలో వర్ణించలేము.
“జ్ఞాని మరో విధంగా కూడా ధ్యానిస్తాడు. అనంత ఆకాశంలో పక్షి రెక్కలు విప్పి ఆనందంగా ఎగురుతోంది. అది చిదాకాశం; ఆత్మ అన్నది పక్షి, పక్షి, పంజరంలో బంధింపబడిలేదు. అది చిదాకాశంలో ఎగురుతోంది. దాని ఆనందానికి అవధులు లేవు.”
భక్తులు ఆశ్చర్యచకితులై ధ్యానయోగం గురించిన ఈ అపురూప వచనాలను విన్నారు. కాసేపటి తరువాత ప్రతాప్ సంభాషణను కొనసాగించాడు.
ప్రతాప్ (డాక్టరుతో): గాఢంగా యోచించి చూస్తే, నిస్సందేహంగా ప్రతిదీ నీడలా గోచరిస్తుంది.
డాక్టరు: నీడ గురించి చెప్పాలంటే మూడు వస్తువులు అవసరమై ఉంటాయి; సూర్యుడు,
వస్తువు, నీడ. వస్తువంటూ లేకుండా నీడ ఎలా ఏర్పడుతుంది? భగవంతుడు యథార్థమనీ, సృష్టి మిథ్య అనీ నువ్వు అంటున్నావు. సృష్టి కూడా యథార్థమని నే నంటాను.
ప్రతాప్: అద్దంలో ప్రతిబింబం చూసినట్లు ఈ ప్రపంచం కూడా మనస్సు అనే అద్దంలో ప్రతిబింబమే.
డాక్టరు: అయితే వస్తువు లేకుండా ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది?
నరేంద్రుడు: వస్తువు లేకేం? భగవంతుడే వస్తువు.
డాక్టరు బదులు పలకలేదు.
48.4.1 జగత్ చైతన్యం – సైన్సు
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): నువ్వు ఒక చక్కని మాట చెప్పావు. భావావస్థ అనేది భగవంతుడితో యోగం పొందడం ద్వారా కలుగుతుంది అన్న మాట. ఇది ఇంతకు మునుపు మరెవరూ చెప్పలేదు, నువ్వొక్కడివే చెప్పావు.
“అధికంగా భగవచ్చింతన చేస్తే బుర్ర పాడవుతుందని ఒకసారి శివనాథ్ అన్నాడు. అంటే, జగత్ చైతన్యాన్ని గురించి చింతన చేస్తూ అచైతన్యులం అయిపోతామట. భగవంతుడు బోధ స్వరూపుడు; ఆయన బోధ ద్వారానే జగత్తుబోధ ఏర్పడుతోంది. ఆయన్ను చింతన చేయడం వల్ల మనం బోధరహితులం అవుతామా?
“ఇంకా, నీ సైన్సు ఏమని చెబుతుంది? దీనిని దానికి కలిపితే అది అవుతుంది, దానికి దీనిని కలిపితే ఇది అవుతుంది అని, అంతే కదా! ఇలాంటి వాటి గురించి, ఇలాంటి జడ పదార్థాల గురించి ఆలోచించడం వల్లనే మతిపోయే అవకాశాలు ఎక్కువ.”
డాక్టరు: వీటిల్లో కూడా భగవంతుణ్ణి చూడవచ్చు.
‘మ’ : అలాంటప్పుడు భగవంతుణ్ణి మానవులలో ఇంకా స్పష్టంగా చూడవచ్చు, మహాపురుషుల్లో మరింత స్పష్టంగా చూడవచ్చు.
డాక్టరు: ఆ, మనుష్యుల్లో తప్పక చూడవచ్చు.
శ్రీరామకృష్ణులు: ఏ చైతన్యంతోనైతే జడపదార్థ పర్యంతం చైతన్యం పొందుతోందో, కాళ్ళూ చేతులూ, శరీరం కదలాడుతున్నాయో దానిని చింతన చేయడం ద్వారా చైతన్యం కోల్పోవడమా! శరీరం కదులుతోందని లోకులు అంటారు. కాని భగవంతుడే దానిని కదిలిస్తున్నాడని వారు ఎరుగరాయె. నీటితో చెయ్యి కాలిందని వారు అంటారు. అయితే, చేతిని నీరు కాల్చలేదు. నీటిలో ఉన్న వేడిమి, నీటిలో ఉన్న అగ్ని కారణంగానే చెయ్యి కాలేది.
“పాత్రలో అన్నం ఉడుకుతోంది. బంగాళాదుంపలు, వంకాయలు కూడా ఎగురుతున్నాయి. అవి తమంతట తామే నాట్యం చేస్తున్నాయని చిన్న పిల్లలు అంటారు. క్రింద మంట ఉందన్న సంగతి వారికి తెలియదు. ఇంద్రియాలు తమంతట తామే పని చేస్తున్నాయని మనిషి అంటాడు. కాని అంతరంగాన చైతన్యస్వరూపుడే ఉన్నట్లు అతడికి తెలియదు.”
డాక్టరు లేచి నిలబడ్డాడు, బయలుదేరనున్నాడు. శ్రీరామకృష్ణులు కూడా లేచి నిలబడ్డారు.
డాక్టరు: జనులు కష్టాలలో ఉన్నప్పుడే భగవంతుణ్ణి తలుస్తారు, ‘తుహు, తుహు’ (నువ్వు, నువ్వు) అంటారు. మీకు గొంతులో వ్రణం లేచింది కాబట్టే మీరు కూడా భగవంతుడి గురించి మాట్లాడుతుంటారు. మీరిప్పుడు దూదేకుల వాని చేతుల్లో పడ్డారు. అతడితో చెప్పుకోవడమే ప్రస్తుతం మీకు తగును. నేను మీ మాటలనే ఉదహరిస్తున్నాను.
శ్రీరామకృష్ణులు: నాకు చెప్పుకోవలసింది అంటూ ఏమీ లేదు.
డాక్టరు: ఎందుకు చెప్పరు? మనం భగవంతుడి ఒడిలో కూర్చుంటాము. ఆయన ఒడిని అశుద్ధపరుస్తాం కూడా. మరి అలాంటప్పుడు మన జబ్బు గురించి ఆయనకు కాకపోతే మరెవరికి చెప్పాలి?
శ్రీరామకృష్ణులు: ఆ, ఆ మాట నిజమే. ఒక్కోసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను. కాని చెప్పలేకపోతాను.
డాక్టరు: అయినా, ఆయనకు చెప్పవలసిన అవసరం కూడా ఏముంది? ఈ సంగతి ఆయనకు తెలియదా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): మహమ్మదీయుడు ఒకడు నమాజు చదువుతూ ‘హే అల్లా, హే అల్లా’ అంటూ కేకలు పెడుతూండేవాడు. అది విని అతడితో ఒక వ్యక్తి ఇలా అన్నాడు: ‘నువ్వు అల్లాను పిలుస్తున్నావు, అది బాగానే ఉంది. కాని అంతగా కేకలు పెట్టడమెందుకు? చీమ చిటుక్కుమన్నా ఆయన వినగలడు.’
48.4.2 బిల్వ మంగళుడు, యోగి
“భగవంతుడితో మనస్సు యోగం చెందినప్పుడు ఆయన్ను అతి సమీపంగా చూడవచ్చు, హృదయ మధ్యంలో చూడవచ్చు. కాని ఒక ముఖ్య విషయం – ఈ యోగం ఎంత గాఢతరం అవుతుందో అంతగా మనస్సు బాహ్యవస్తువుల నుండి వైదొలగుతుంది. భక్తమాలలో బిల్వమంగళుడి కథ ఉండి. అతడు ఒక వేశ్య వద్దకు వెళుతుండేవాడు. ఒక రోజు రాత్రి, వెళ్లేసరికి చాలా ఆలస్యమయింది. ఆ రోజు, ఇంట్లో తల్లిదండ్రుల శ్రాద్ధకర్మ చేసినందున ఆలస్యమయింది. వేశ్య కోసం శ్రాద్ధభోజనాన్ని చేతిలో పట్టుకొని వెళుతున్నాడు. అతడి మనస్సంతా ఆ వేశ్య మీదనే మగ్నమై ఉంది. ఎలా వెళ్తున్నాడో, దేని మీద అడుగులు వేస్తున్నాడో కూడా అతడికి ఎరుక లేదు. దారిలో ఒక యోగి కళ్ళుమూసుకుని భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాడు. బిల్వమంగళుడు ఆయన్ను త్రొక్కుకుంటూ వెళ్ళాడు. యోగి కోపంతో ‘కళ్ళు కనిపించడం లేదా? నేను భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాను. నువ్వు నన్ను త్రొక్కుతూ వెళ్తావా?’ అని అరిచాడు. అందుకు బిల్వమంగళుడు ఇలా అన్నాడు: ‘స్వామీ, నన్ను మన్నించండి. కాని మిమ్మల్ని ఒక విషయం అడగాలి. వేశ్యను గురించి ఆలోచిస్తుండడం వల్ల నాకు స్పృహ లేకపోయింది. మరి మీరో! భగవంతుడి గురించి ఆలోచిస్తూ కూడా మీకు బాహ్య ప్రపంచపు స్పృహ ఉందే! ఇదేం ధ్యానం?’ చివరికి బిల్వమంగళుడు సంసారం వదలిపెట్టి కేవలం భగవదారాధనకై వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు అతడు వేశ్యతో ఇలా అన్నాడు: ‘నువ్వు నా గురువ్వి. భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో నువ్వు నాకు నేర్పావు.’ వేశ్యను అమ్మా అని సంబోధిస్తూ అతడు ఆమెను వదలిపెట్టేశాడు.”
డాక్టరు: స్త్రీలను తల్లిలా ఉపాసించడం తాంత్రికోపాసన.
48.4.3 లోకశిక్షణకు సంసారి అనధికారి – రాజు, భాగవత పండితుడు కథ
శ్రీరామకృష్ణులు: ఒక కథ విను. ఒక రాజు ఉండేవాడు. ప్రతిరోజూ అతడు ఒక పండితుడి వద్ద భాగవతం చదివించుకొని వినేవాడు. ప్రతిరోజూ భాగవతం చదవడం పూర్తయ్యాక పండితుడు రాజును ‘రాజా’ ! నేను చెప్పింది అర్థమయిందా?’ అని అడిగేవాడు. అందుకు రాజు కూడా ప్రతి రోజూ, ‘పండితులవారూ, ముందుగా మీరు అర్థం చేసుకోండి’ అనేవాడు. పండితుడు రోజూ ఇంటికి వెళ్ళి ఇలా తలపోసేవాడు: ‘రాజుగారు అనునిత్యం అలా ఎందుకు అంటున్నారు? నేను రోజూ ఇంత విపులంగా అర్థం చెబుతున్నాను. కాని ఆయన మాత్రం “ముందుగా మీరు అర్థం చేసుకోండి” అని ఎందుకు అంటున్నారు?’ పండితుడు సాధనానుష్ఠానాలు చేసే వ్యక్తి. కొన్ని రోజుల తరువాత భగవంతుడే సత్యం; ఇల్లు, కుటుంబం, సంపద, బంధువులు, పేరు ప్రతిష్ఠలు – సర్వస్వం మిథ్యేనని అతడికి బోధపడింది. సంసారంలో సమస్తం మిథ్యే అన్న బోధ కలగడంతో అతడు ఇల్లు వదలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు ఒక వ్యక్తితో రాజుగారికి ‘రాజుగారూ, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను’ అని కబురు పంపాడు.
48.4.4 అత్యుత్తమ భాగవత పండితుడు
“మరో కథ విను: ఒక వ్యక్తి తనకు అనునిత్యం భాగవతం చదివి వినిపించగల పండితుడికోసం వెదకుతుండేవాడు. కాని అలాంటి పండితుడు దొరకలేదు. అతడు అలా ఎంతగానో వెదికాక మరో వ్యక్తి వచ్చి ‘మహాశయా, ఒక అత్యుత్తమ భాగవత పండితుడు దొరికాడండి’ అన్నాడు. మొదటి వ్యక్తి ‘చాలా మంచిది. ఆయన్ను తోడ్కొనిరా’ అన్నాడు. రెండవ వ్యక్తి ఇలా అన్నాడు: ‘అంతా బాగానే ఉంది కాని ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. ఆ పండితుడికి కొన్ని నాగళ్ళు, కొన్ని ఎద్దులు ఉన్నాయి. వాటితోనే ఆయన రోజంతా తలమునకలై ఉంటాడు. ఆయనకు తన సేద్యం పనులు చూడవలసి ఉంటుంది. కాస్తయినా తీరుబడి లేదు.’ అప్పుడు భాగవత పండితుడి అవసరం ఉన్న మొదటి వ్యక్తి ఇలా అన్నాడు: ‘తమ్ముడూ! నాగళ్ళు, ఎద్దులతో సతమతమయ్యే భాగవత పండితుడు నాకు అక్కర్లేదు. నాకు కావలసింది తీరుబడిగా కూర్చుని శ్రీహరి కథలను వినిపించే పండితుడు.’ (డాక్టరుతో) అర్థమయిందా?”
డాక్టరు మారు మాట్లాడలేదు.
48.4.5 వివేక వైరాగ్యాలు – గీత సారం
శ్రీరామకృష్ణులు: నిజం చెప్పమంటావా? కేవలం పాండిత్యం వల్ల ఏం ఒరుగుతుంది? పండితులకు ఎన్నో విషయాలు తెలుసు. వారు వేదాలు, పురాణాలు, తంత్రాలు అన్ని శ్రవణం చేస్తూ ఉంటారు. కాని వట్టి పాండిత్యం వల్ల ఏమిటి ప్రయోజనం? కావలసింది వివేక వైరాగ్యాలు. వివేక వైరాగ్యాలు ఉన్నప్పుడే ఆ వ్యక్తి పలుకులు వినవచ్చు. కాని సంసారాన్నే సారపదార్థంగా భావించే వ్యక్తి పలుకులను వినడం వల్ల ఏమిటి ప్రయోజనం?
“గీత నేర్పే పాఠం ఏమిటో తెలుసా? ‘గీతా, గీతా’ అంటే ఏమవుతుందో అదే. ‘గీతా, గీతా’ అంటూంటే క్రమక్రమంగా అది ‘తాగీ’ అయిపోతుంది. సంసారంపట్ల, కామినీ కాంచనాలపట్ల ఆసక్తిని త్యజించి వేసి తన అనురాగాన్నంతా నూటికి నూరుపాళ్ళు భగవంతుడికి సమర్పించిన వాడే గీత మర్మాన్ని అర్థం చేసుకున్నవాడు. గీతను పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. త్యాగి అయిపోయినట్లయితే ఆ పుస్తకం చదవడంలోని ఉద్దేశం నెరవేరినట్లే.
డాక్టర్: ‘గీతా’ ను త్రిప్పితే ‘తాగీ’ అవుతుంది. దానికి ‘య’ వత్తు చేర్చినప్పుడే కదా అది ‘త్యాగీ’ అయ్యేది.
‘మ’ : ‘య’ వత్తు చేర్చకున్నా ఫరవాలేదు. ఈయన (శ్రీరామకృష్ణులు) పానీహాటీ మహోత్సవానికి వెళ్ళినప్పుడు నవద్వీప్ గోస్వామికి ఇలాగే గీతలోని గూఢార్థాన్ని చెప్పారు. అక్కడ ఉన్నవారిలో ఒకరు ‘య’ వత్తు చేర్చాలి కదా అన్నప్పుడు నవద్వీప్ గోస్వామి ‘తగ్’ ధాతువు ‘ఘఇ్’ తో ‘తాగ్’ అవుతుంది. దానికి ‘ఇన్’ అనే ప్రత్యయం చేర్చినప్పుడు ‘తాగీ’ అవుతుంది. ‘తాగీ’ అన్నా, ‘త్యాగీ’ అన్నా అర్థం ఒక్కటే.
డాక్టరు: ఒక వ్యక్తి నాకు ‘రాధా’ అర్థాన్ని వివరించాడు. రాధా అర్థం ఏమిటో తెలుసా? పదాన్ని త్రిప్పి వల్లించు, అప్పుడు అది ‘ధారా’ అవుతుంది. (అందరూ నవ్వారు.)
“ఇవాళ ‘ధారా’ తోనే చాలిద్దాం” అని చెప్పి డాక్టరు వెళ్ళిపోయాడు.
48.4.6 శ్రీరామకృష్ణులతో డా.సర్కార్ గురించి ‘మ’
‘మ’ శ్రీరామకృష్ణుల వద్ద కూర్చుని డా. సర్కార్ ఇంట్లో ఆయనతో జరిగిన సంభాషణను తిరిగి చెబుతున్నాడు.
‘మ’ (శ్రీరామకృష్ణులతో): బంగారు రంగు చేపలకు ఏలక తొక్కలు, పిచ్చుకలకు మైదా ఉండలు వేస్తూ డాక్టరు నాతో ఇలా అన్నాడు: ‘నువ్వు ఈ సంగతి గమనించావా? చేపలు ఏలుక తొక్కలు చూడలేదు కాబట్టి వెళ్ళిపోయాయి. ప్రథమంగా మనకు కావలసింది జ్ఞానం, తరువాత భక్తి. ఆ పిచ్చుకలను చూశావు కదా! నేను మైదా ఉండలు విసిరినప్పుడు అవి ఎగిరిపోయాయి. వాటికి జ్ఞానం లేదు, కనుకనే భక్తి కూడా లేదు’.
శ్రీరామకృష్ణులు(నవ్వుతూ): అక్కడ జ్ఞానం అంటే అర్థం ఐహిక జ్ఞానం, అంటే సైన్సు జ్ఞానం.
‘మ’ : ఆయన ఇంకా ఇలా అన్నాడు: “చైతన్యులో లేక బుద్ధుడో చెప్పినంత మాత్రాన నేను నమ్మేయాలా? అది మంచిది కాదు. ఆయనకు మనవడు పుట్టాడని చెప్పాడు. తన కోడలు గురించి చాలా ప్రశంసిస్తూ మాట్లాడాడు. ‘ఆమె ఇంట్లో ఎక్కడా కానరాదు. ఎంతటి అణకువ, ఎంతటి సౌశీల్యం!’ అన్నాడు.”
శ్రీరామకృష్ణులు: అతడు ఇక్కడి (శ్రీరామకృష్ణుల) విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. అతడి విశ్వాసం కూడా ఇనుమడిస్తోంది. ఒక్కసారిగా అహంకారాన్ని త్యజించడం సాధ్యమయ్యే పనేనా? అంతటి విద్యావంతుడు, పేరు ప్రతిష్ఠలు ఉన్నవాడు! ఐశ్వర్యవంతుడు కూడా. అయినప్పటికీ నా మాటల పట్ల అగౌరవం లేదు.
48.5 పంచమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – ‘మ’
సమయం సాయంత్రం ఐదు గంటలు అవుతోంది. భక్తులు గదిలో మౌనంగా కూర్చుని ఉన్నారు. వారిలో పలువురు బయటి వ్యక్తులు కూడా ఉన్నారు; శ్రీరామకృష్ణులను చూడడానికి వచ్చారు.
‘మ’ ఆయనకు సమీపంలో కూర్చుని ఉన్నాడు. ఆయన ఆదేశం మేరకు ‘మ’ ఆయనకు జుబ్బా తొడిగించాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ప్రస్తుతం నాకు ఎక్కువగా ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ఒక్కసారిగా అఖండ బ్రహ్మం యొక్క చైతన్యం కలుగుతుంది. ప్రస్తుతం నిరంతరాయంగా ఆ దర్శనం కలుగుతూవుంది.
‘మ’ ఏమీ పలుకలేదు. గదంతా నిశ్శబ్దంగా ఉంది.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అది సరే, వీరందరూ ఇక్కడ ఉలుకూపలుకూ లేకుండా కూర్చుని ఉన్నారే! వీరి దృష్టి అంతా నా మీదనే కేంద్రీకృతమై ఉంది. మాటలు లేవు, పాటలూ లేవు. వీరు నాలో ఏం చూస్తున్నారు?
‘మ’ : అయ్యా, వీరందరూ మీ వచనాలు అనేకం ఇదివరకే విని ఉన్నారు. ప్రపంచంలో ఎన్నడూ చూడని, ఇకమీదట చూడజాలని ఇట్టి మహాపురుషుణ్ణి ప్రస్తుతం వీరు చూస్తున్నారు. సదానందమయుడు, శిశుస్వభావి, నిరహంకారి, భగవత్ప్రేమామృత పానోన్మత్తుడైన దుర్లభమూర్తిని మైమరచి ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఒకసారి మీరు ఈశాన్ ఇంటికి వెళ్ళినప్పుడు అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. అప్పుడు మేము కూడా అక్కడే ఉన్నాము. ఒక అపరిచిత వ్యక్తి నా వద్దకు వచ్చి ఇట్టి సదానంద పురుషుణ్ణి, ఆనందమయుణ్ణి ఇంతవరకు చూసింది లేదన్నాడు.
మళ్ళీ గదిలో నిశ్శబ్దం నెలకొంది. ‘మ’ కూడా మౌనంగా ఉన్నాడు. కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు ‘మ’ తో మృదుల స్వరంలో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: అది సరే కాని డాక్టరులో ఏమైనా మార్పు కలుగుతోందా?
ఇక్కడి మాటలపైన శ్రద్ధ జనిస్తోందా?
‘మ’ : సారవంతమైన విత్తనం నాటాక అది నశించదు; సకాలంలో మొలకెత్తుతుంది. ఆనాడు మీరు చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చి నవ్వు వస్తోంది.
శ్రీరామకృష్ణులు: ఏ మాట?
‘మ’ : ఎప్పుడు చూసినా యదుమల్లిక్ అన్యమనస్కుడై ఉంటాడు. భోజనం చేసేటప్పుడు కూరలో ఉప్పు వేసుందో లేదో కూడా అతడికి తెలియరాదు. ప్రక్కనున్న వ్యక్తి ‘కూరలో ఉప్పు లేదే’ అనేసరికి వెంటనే యదు ‘అవునవును ఇందులో ఉప్పు లేదు’ అంటాడు. ‘నేనూ సర్వదా అన్యమనస్కుడనై ఉంటాను’ అని డాక్టరు అనేసరికి అది విషయచింతన కారణంగానే కాని భగవచ్చింతన కారణంగా కాదు అని మీరు వివరించారు.
శ్రీరామకృష్ణులు: ఇక్కడి మాటలను అతడు పట్టించుకోడా?
‘మ’ : ఎందుకు పట్టించుకోడు? కాని అనేక పనులలో సతమతమై మరచిపోతుంటాడు. ఇవాళకూడా ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ‘స్త్రీలను తల్లిగా ఉపాసించడం తాంత్రిక సాధనలలోనిది’ అన్నాడు.
శ్రీరామకృష్ణులు: అందుకు నే నేమన్నాను?
‘మ’ : నాగళ్ళు, ఎద్దులతో సేద్యం చేస్తూ తీరికలేని భాగవత పండితుడి కథ, పండితుడితో రాజు ‘ముందుగా మీరు అర్థం చేసుకోండి’ అన్న కథ – ఈ రెండు కథలు చెప్పారు. (శ్రీరామకృష్ణులు నవ్వారు) అటుపైన మీరు గీత గురించి చెప్పారు. కామినీకాంచన త్యాగమే గీతాసారం. ‘సర్వసంగ పరిత్యాగం చేయని సంసారి లోకశిక్షణ ఎలా గరపగలడు’ అని మీరు స్పష్టంగా చెప్పారు. ఇందులోని అంతరార్థాన్ని ఆయన బహుశా సరిగా అర్థం చేసుకున్నట్లు లేదు. తరువాత ‘ధారా, ధారా’ అని చెప్పి అక్కడ నుండి తప్పుకున్నాడు.
శ్రీరామకృష్ణులు భక్తుల శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నారు. పూర్ణ మణీంద్రులు ఇరువురూ బాలభక్తులు. పూర్ణుడితో మాట్లాడమని మణీంద్రను ఆతడి వద్దకు పంపారు.
48.6 షష్ఠ పరిచ్ఛేదం రాధాకృష్ణుల తత్త్వం
సాయంకాలమయింది. సంజె దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు అంతర్ముఖులై ఉన్నారు. భక్తులు కూడా ధ్యానంలో ఉన్నారు.
కాసేపటి తరువాత నరేంద్రుడు తన స్నేహితుణ్ణి వెంటబెట్టుకొని గదిలోకి వచ్చాడు. “ఇతడు నా స్నేహితుడు, కిరణ్మయి తదితర గ్రంథాలు వ్రాశాడు” అని ఆతణ్ణి శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు. ఆ రచయిత శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు.
నరేంద్రుడు: ఇతడు రాధాకృష్ణుల గురించి కూడా వ్రాశాడు.
శ్రీరామకృష్ణులు (రచయితతో): ఏం వ్రాశావో కాస్త చెప్పు నాయనా.
రచయిత: రాధాకృష్ణులే పరబ్రహ్మం. ఓంకారపు బిందుస్వరూపాలు. వారి నుండే మహావిష్ణువు, ఆయన నుండి శివుడు, దుర్గలు ఉద్భవించారు.
శ్రీరామకృష్ణులు: భేష్! నందుడు నిత్యరాధను సందర్శించాడు. బృందావనంలో లీలలు నిర్వర్తించింది ప్రేమరాధ. చంద్రావళి కామరాధ.
“మొదట కామరాధ, తరువాత ప్రేమరాధ ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు నిత్యరాధ. ఉల్లిపాయ పై పొర ఎరుపు. అటుపిదప ఉన్న పొరలో ఎరుపు రంగు కాస్త తగ్గుతుంది. ఇంకా ఒలిచేకొద్దీ తెలుపు రంగు పొర వస్తుంది. అటుపైన పొరలు ఏమీ ఉండవు. ఇదే నిత్యరాధ స్వరూపం. ‘నేతి, నేతి’ విచారణ అంత మయ్యేది ఇక్కడే.
“నిత్య రాధాకృష్ణ, లీలా రాధాకృష్ణ అని ఉన్నవి. ఇవి సూర్యుడు, సూర్యరశ్మి లాంటివి. నిత్యం సూర్యుడిలాంటిది, లీల రశ్మిలాంటిది.
“శుద్ధభక్తుడు ఒక్కోసారి నిత్యంలో, మరోసారి లీలలో నెలకొని ఉంటాడు. నిత్యం, లీలలు రెండూ ఒకే అస్తిత్వానికి చెందినవి. అవి ఒక్కటే! రెండూ కాదు, అనేకమూ కాదు.
రచయిత: అయ్యా, ‘బృందావన కృష్ణుడు’, ‘మథురా కృష్ణుడు’ అని రెండుగా ఎందుకు చెబుతారు?
శ్రీరామకృష్ణులు: అది గోస్వాముల దృక్పథం. కాని పశ్చిమ ప్రాంతాల పండితులు అలా అనరు. వారికి కృష్ణుడు ఒక్కడే, రాధ అన్నది లేదు. ద్వారకా కృష్ణుడు కూడా అంతే; రాధాదేవి ప్రసక్తి లేదు.
రచయిత: రాధకృష్ణులే పరబ్రహ్మం.
శ్రీరామకృష్ణులు: భేష్! కాని ఆయనకు అంతా సాధ్యమే. నిరాకారుడూ ఆయనే, సాకారుడుకూడా ఆయనే. స్వరాట్, విరాట్లు రెండూ ఆయనే. బ్రహ్మమూ ఆయనే, శక్తికూడా ఆయనే. ఆయనకు అంతం లేదు. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. గ్రద్ద ఎంత ఎత్తుగా ఎగిరినా అది ఆకాశాన్ని తాకలేదు. బ్రహ్మం అన్నది ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తే ‘దానిని మాటల ద్వారా చెప్పలేము’ అని మాత్రమే చెప్పగలను. బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు కూడా దాన్ని వర్ణించలేము. నెయ్యి అన్నది ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే నువ్వు ఏమని చెబుతావు? ‘నెయ్యి, నెయ్యిలా ఉంటుం’ దనే కదా! బ్రహ్మానికి పోలిక బ్రహ్మమే, వేరే ఏమీ లేదు.
48.7 సప్తమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – హరివల్లభ్
శనివారం, అక్టోబర్ 31, 1885
హరివల్లభ్ బోసు బలరామ్బోసు దాయాది. శ్రీరామకృష్ణులను దర్శింప వచ్చాడు. సగౌరవంగా నమస్కారం చేశాడు.
హరివల్లభ్ కటక్ న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది. బలరామ్ తరచూ శ్రీరామకృష్ణులను దర్శించడం, ముఖ్యంగా కుటుంబ స్త్రీలతో పాటు వెళ్ళడం హరివల్లభ్కు రుచించలేదు. ఆ విషయమై బలరామ్ ఆయనతో ఇలా అన్నాడు: “మీరు ఒకసారి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించండి. తరువాత మీరేం చెబుతారో మీ ఇష్టం.”
ప్రస్తుతం హరివల్లభ్, శ్రీరామకృష్ణులు ఇద్దరూ సంభాషించుకోసాగారు.
శ్రీరామకృష్ణులు: ఈ రోగం ఎలా నయమవుతుందో చెబుతారా? ఇంతకూ ఇది నయమయ్యేదే నంటారా?
హరివల్లభ్: మహాశయా, ఆ విషయం నాకంటే బాగా డాక్టర్లు చెప్పగలరు.
శ్రీరామకృష్ణులు: స్త్రీలు నా పాదధూళిని స్వీకరించేటప్పుడు వారు లోపల ఉన్న భగవంతునికి నమస్కరిస్తున్నారని భావిస్తాను – ఇదే నా వైఖరి.
హరివల్లభ్: మీరు సాధువులు, అందరూ మీకు ప్రణామం చెయ్యాలి. ఇందులో తప్పేముంది?
శ్రీరామకృష్ణులు: ధ్రువుడు, ప్రహ్లాదుడు, నారదుడు, కపిలుడు మొదలైన వారి గురించి మీరు అలా అనవచ్చు. కాని నేనెవర్ని?
“మీరు దయచేసి మళ్ళీ రండి.”
హరివల్లభ్: తప్పక వస్తాను. ఎందుకంటే మీరు నన్ను ఆకర్షిస్తున్నారు. మీరు మళ్ళీ నాకు చెప్పే అవసరం లేదు.
హరివల్లభ్ బయలుదేరనున్నాడు. శ్రీరామకృష్ణులకు నమస్కారం చేసి ఆయన పాదాలకు మ్రొక్కబోయాడు. కాని శ్రీరామకృష్ణులు తమ పాదాలను ప్రక్కకు తీసుకున్నారు. హరివల్లభ్ మాత్రం వదల్లేదు. శ్రీరామకృష్ణులు వారిస్తున్నా వినకుండా పట్టుపట్టి ఆయన పాదధూళి స్వీకరించాడు.
హరివల్లభ్ లేచి నిలబడేసరికి శ్రీరామకృష్ణులు కూడా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. హరివల్లభ్తో ఇలా అన్నారు: “బలరామ్ ఇంటికి వెళ్ళడం లేదని అతడు ఎంతో విచారిస్తుంటాడు. ఒక రోజు అక్కడకు వచ్చి మిమ్మల్నందరినీ చూద్దామని అనుకుంటున్నాను. కాని మీరు బలరామ్‌తో ‘ఈయన్ను ఇక్కడకు ఎవరు రమ్మన్నారు?’ అని అడుగుతారేమోనని భయం వేస్తుంది.”
హరివల్లభ్: ఇలాంటి మాటలన్నీ మీకు ఎవరు చెప్పారండి? మీరు మనస్సులో అలాంటి ఆలోచనలు రానివ్వనే వద్దు.
హరివల్లభ్ వెళ్ళిపోయాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఈయన భక్తిపరుడు. లేకుంటే నేను వద్దని వారిస్తున్నా వినకుండా పాదధూళి ఎందుకు తీసుకుంటాడు? ఒక రోజు భావావస్థలో డాక్టరుతో పాటు మరో వ్యక్తిని కూడా చూశానని చెప్పాను కదా! ఈయనే ఆ మరో వ్యక్తి, అందుకే వచ్చాడు చూడు.
‘మ’ : అవునండి. ఈయన భక్తుడనడంలో అనుమానానికి తావులేదు.
శ్రీరామకృష్ణులు: ఎంత సరళ స్వభావం!
డాక్టరు ఇంటికి వెళ్ళి ‘మ’ శ్రీరామకృష్ణుల పరిస్థితిని తెలియపరిచాడు. శ్రీరామకృష్ణులు, మహిమాచరణ్ మొదలైన వారి గురించి డాక్టరు ‘మ’ తో మాట్లాడసాగాడు.
డాక్టరు: తను తెస్తానన్న పుస్తకం మహిమాచరణ్ తీసుకు రాలేదే! మరిచిపోయానని చెప్పాడతడు. అది సంభవమే, నాక్కూడా మతిమరుపు ఉంది.
‘మ’ : ఆయన బాగా చదివిన వ్యక్తి.
డాక్టరు: మరయితే ఇలాంటి దుఃస్థితిలో ఎందుకు ఉన్నాడు?
శ్రీరామకృష్ణుల గురించి చెబుతూ డాక్టరు “కేవలం భక్తి ఉంటే ఏమిటి ప్రయోజనం? జ్ఞానంకూడా ఉండాలి” అన్నాడు.
‘మ’ : ఎందుకు? జ్ఞానం తరువాత భక్తి జనిస్తుందని ఆయన చెబుతుంటారు. కాని ఆయన చెప్పే భక్తి జ్ఞానాలు, మీరు చెప్పే భక్తి జ్ఞానాలలో తేడా ఉంది. జ్ఞానం తరువాత భక్తి జనిస్తుందని ఆయన చెప్పినప్పుడు దానికి అర్థం తత్త్వజ్ఞానం తరువాత భక్తి, బ్రహ్మజ్ఞానం తరువాత భక్తి, భగవత్సాక్షాత్కారం తరువాత భక్తి అనే. మీరు చెప్పే జ్ఞానం ‘సైన్సు’ జ్ఞానం, ఇంద్రియాలద్వారా ప్రాప్తించే జ్ఞానం. ఆయన చెప్పే జ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా నిర్ధారించలేము, తత్త్వజ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా నిశ్చయించలేము. కాని మీరు చెప్పే ‘సైన్సు’ జ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా నిర్ధారించవచ్చు.
డాక్టరు ఏమీ బదులు చెప్పకుండా కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత అవతారవాదం గురించిన ప్రస్తావన తెచ్చాడు.
డాక్టరు: ఏమిటి ఈ అవతార సిద్ధాంతం? ఇతరుల పాదధూళిని స్వీకరించడం ఏమిటి?
‘మ’ : ప్రయోగశాలలో ప్రయోగాలు చేసేటప్పుడు, భగవంతుడి అద్భుత సృష్టి గురించి ఆలోచిస్తూ భావపారవశ్యత చెందుతుంటానని మీరే చెబుతుంటారు కదా! పైగా, మనిషి గురించి ఆలోచించినప్పుడు కూడా మీరు అదే భావాన్ని పొందుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు భగవంతుడి ఎదుట మనం ఎందుకు తల వంచకూడదు? భగవంతుడు మనిషి హృదయంలో వసిస్తున్నాడు.
“హిందూమతం ప్రకారం భగవంతుడు సర్వభూతాలలోనూ విరాజిల్లు తున్నాడు. మీరు ఈ విషయమై ఎక్కువగా చదివినట్లు లేదు. సర్వభూతాలలోనూ భగవంతుడు వసిస్తున్నప్పుడు మనిషికి ప్రణామం చేయడంలో ఏమిటి తప్పు?
“మిగతావాటితో పోలిస్తే కొన్నిటిలో భగవంతుడి అభి వ్యక్తీకరణ అధికంగా ఉంటుందని శ్రీరామకృష్ణులు చెబుతుంటారు. ఇతర వస్తువులలో కంటే నీటిలో, అద్దంలో సూర్యుడు అధికంగా ప్రతిబింబించడం లాంటిది ఇది. నీరు సర్వత్రా ఉంది. కాని నది, జలాశయాలలో అది ఇంకా స్పష్టంగా ఉంది. మనం మ్రొక్కేది భగవంతుడికే కాని మనిషికి కాదు. భగవంతుడే భగవంతుడు, మనిషి భగవంతుడు కాదు.
“తర్కం ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోలేము. అంతా విశ్వాసంపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెబుతున్నవన్నీ శ్రీరామకృష్ణులు చెప్పిన మాటలే.”
తాను రచించిన The Physiological Basis of psycology అనే పుస్తకాన్ని డాక్టరు, ‘మ’ కు బహూకరించాడు. మొదటి పేజీలో “సోదరుడు ‘మ’ కు, ప్రేమతో డా ॥ సర్కార్” అని వ్రాసి ఇచ్చాడు.
48.8 అష్టమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – ఏసుక్రీస్తు
సమయం ఉదయం పదకొండు గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో భక్తులతోపాటు కూర్చుని ఉన్నారు. మిశ్ర అనే క్రైస్తవ భక్తునితో ఆయన సంభాషిస్తున్నారు. మిశ్ర, ఉత్తరభారతంలో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. క్వేకర్ సంప్రదాయానికి చెందినవాడు. వయస్సు 35 సంవత్సరాలు ఉంటుంది. బయటకు ఆంగ్లేయ దుస్తులు ధరించినా అతడు లోపల మటుకు కాషాయవస్త్రాలు ధరించి ఉంటాడు. అతడి సోదరుడి వివాహం రోజున ఆ సోదరుడితో పాటు మరో సోదరుడు కూడా మరణించాడు. అదే రోజున మిశ్ర, సంసారాన్ని త్యజించివేశాడు.
మిశ్ర: ‘సకల జీవులలోను వెలసినది రాముడే.’
మిశ్ర కూడా వినేలా శ్రీరామకృష్ణులు, చిన్న నరేంద్రుడితో మెల్లగా ఇలా అన్నారు: “రాముడు ఒక్కడే. కాని ఆయన పేర్లు మాత్రం వెయ్యి. క్రైస్తవులు ‘గాడ్’ అని ఎవరినైతే అంటారో ఆయన్నే హిందువులు రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు మొదలైన పేర్లతో పిలుస్తుంటారు. ఒక జలాశయానికి అనేక ఘట్టాలో ఉన్నాయి. ఒక ఘట్టం నుండి హిందువులు నీరు త్రాగుతారు, దాన్ని ‘జలం’ అంటారు. మరో ఘట్టం నుండి క్రైస్తవులు త్రాగుతారు, ‘వాటర్’ అంటారు. మహమ్మదీయులు మరో ఘట్టం వద్దకు వెళతారు, వారు ‘పానీ’ అంటారు. అదే విధంగా క్రైస్తవుల ‘గాడ్’, మహమ్మదీయుల ‘అల్లా’ ఒక్కరే.”
మిశ్ర: ఏసుక్రీస్తు, మేరీ పుత్రుడు కాడు. ఆయనే స్వయంగా భగవంతుడు. (శ్రీరామకృష్ణులను చూపిస్తూ భక్తులతో) ప్రస్తుతం ఈయన మీరు చూస్తున్నట్లే ఉంటారు. మళ్ళీ, మరో సమయంలో సాక్షాత్తూ భగవంతుడిగా ఉంటారు. మీరు ఈయన్ను గుర్తించలేకపోతున్నారు. నేను ఈయన్ను ఇదివరకే దైవీ దర్శనాలలో చూశాను. ప్రస్తుతం నా ఎదుటే చూస్తున్నాను. ఒక తోటలో ఈయన ఒక ఉన్నతాసనంలో కూర్చుని ఉండడం చూశాను. నేలపైన మరో వ్యక్తి కూర్చుని ఉన్నాడు. కాని ఆ వ్యక్తి అంతగా పురోగమించలేదు.
“భగవంతుడికి ఈ దేశంలో నలుగురు ద్వారపాలకులు ఉన్నారు. బొంబాయి ప్రాంతంలో తుకారాం, కాశ్మీర్ ప్రాంతంలో రాబర్ట్ మైకేల్, ఈ ప్రాంతంలో ఈయన, తూర్పు బెంగాల్ ప్రాంతంలో మరో వ్యక్తి ఉన్నారు.
శ్రీరామకృష్ణులు: నువ్వేమైనా దర్శనాలు చూస్తుంటావా?
మిశ్ర: అయ్యా, నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా జ్యోతి దర్శనం కలుగుతుండేది. అటుపిదప ఏసుక్రీస్తు దర్శనం కలిగింది. ఆ రూపాన్ని నేను ఎలా వర్ణించగలను! ఆ సౌందర్యం ముందు స్త్రీ సౌందర్యం ఎంత అల్పమైనదని!
కాసేపటి తరువాత మిశ్ర తాను వేసుకున్న కోటు తీసివేసి లోపల ఉన్న కాషాయ కౌపీనాన్ని భక్తులకు చూపించాడు.
శ్రీరామకృష్ణులు వసారాలోకి వెళ్ళారు. గదిలోకి తిరిగి వస్తూ భక్తులతో “అతణ్ణి (మిశ్ర) వీరభంగిమలో నిలబడి ఉండడం చూశాను” అన్నారు. ఇలా పలుకుతూ ఆయన సమాధిస్థితి పొందారు. పశ్చిమాభిముఖులై నిలబడి ఉన్నారు.
కొద్దిగా బాహ్యచైతన్యంలోకి వచ్చాక మిశ్ర మీదనే దృష్టి నిలిపి నవ్వసాగారు. భావావస్థలోనే అతడితో కరచాలనం చేసి నవ్వారు. అతడి చేతులు పుచ్చుకొని “నువ్వు కోరుకున్నది నీకు లభిస్తుంది” అన్నారు.
మిశ్ (చేతులు జోడించి): ఆ రోజునుండి నా మనస్సు, ప్రాణం, శరీరం సర్వస్వం మీకే సమర్పించాను.
శ్రీరామకృష్ణులు భావావస్థలోనే చిరునవ్వు నవ్వారు. తరువాత ఆసనం స్వీకరించారు. తన పూర్వాశ్రమ జీవితాన్ని మిశ్ర, భక్తులకు వివరిస్తున్నాడు. వివాహ సమయంలో, పైకప్పు కూలిపోవడంతో తన సోదరులిద్దరూ చనిపోయిన ఉదంతాన్ని అతడు భక్తులకు చెబుతున్నాడు.
మిశ్ర అవసరాలు చూసుకోమని శ్రీరామకృష్ణులు భక్తులకు చెప్పారు.
48.8.1 సమాధి స్థితి – భజనానందం
ఇంతలో డా ॥ సర్కార్ వచ్చాడు. ఆయన్ను చూడగానే శ్రీరామకృష్ణులు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. భావపారవశ్యం కొద్దిగా తగ్గిన తరువాత “కారణానందం తరువాత సచ్చిదానందం! కారణానికే కారణం” అన్నారు.
డాక్టరు: అవునండి.
శ్రీరామకృష్ణులు: నేను స్పృహలోనే ఉన్నాను.
శ్రీరామకృష్ణులు భగవదావేశంలో ఉన్నారని డాక్టరు అర్థం చేసుకున్నాడు. అందువల్ల “అవునండి. మీరు స్పృహలోనే ఉన్నారు” అన్నాడు.
శ్రీరామకృష్ణులు నవ్వి ఇలా అన్నారు:
నేను గ్రోలెడి మద్య మెట్టిదొ
ఎరుగ గోరుదురె నరులారా?
అమ్మ కాళి ఘన నామజపముతో
గ్రోలెద నిత్యానంద మధువును ॥ నే ॥
ఎంత మత్తు నా కెక్కునప్పుడన
త్రాగుబోతునని తలతురెల్లరును ॥ నే ॥
మద్యము చేయుట కొరకై గురువే
ఇచ్చును బెల్లపు నీరు మొదటనే ॥ నే ॥
నే నిటుపడు పరితాపము దానిని
పులియబెట్టు సామగ్రి యగునుగా ॥ నే ॥
జ్ఞానమనెడు ఆ మద్య కారకుడు
నాకై మద్యము తయారుచేయును ॥ నే ॥
మాయి నామమున శుద్ధిచేసి నే
మంత్రమనెడి సీసాలో త్రాగుదును ॥ నే ॥
ఒక్క గుక్కకే ధర్మాది చతుర్విధ
పురుషార్థ మబ్బునని ప్రసాదు పల్కును ॥ నే ॥
ఈ పలుకులు విని డాక్టరు దాదాపుగా భావపారవశ్యుడయ్యాడనే చెప్పవచ్చు. శ్రీరామకృష్ణులు మళ్ళీ ప్రగాఢ ఆధ్యాత్మిక భావంలోకి వెళ్ళి, ఆ స్థితిలోనే డాక్టరు ఒడిలో తమ పాదం మోపారు. కాసేపటి తరువాత బాహ్య చైతన్యంలోకి వచ్చి తమ పాదాన్ని వెనక్కు తీసుకున్నారు. డాక్టరుతో ఇలా అన్నారు: “ఆహా, ఆ రోజు నువ్వు ఎంత చక్కని మాట చెప్పావు! ‘మనమంతా భగవంతుడి ఒడిలో ఉన్నాం. ఆయనకు కాకపోతే మరెవరికి చెప్పుకోవాలి మన కష్టాలు?’ అని. ప్రార్థన అంటూ చేయాలనుకుంటే ఆ భగవంతుడినే ప్రార్థిస్తాను.” ఇలా మాట్లాడుతుండగా ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. మళ్ళీ భావావస్థలోకి వెళ్ళి డాక్టరుతో ఇలా అన్నారు: “నువ్వు చాలా పరిశుద్ధుడివి. లేకుంటే నీ ఒడిలో నా పాదం నిలిపి ఉండగలిగేవాడిని కాను.” మళ్ళీ ఇలా అన్నారు: “ ‘రామరసాన్ని చవిచూసినవాడే శాంతి పొందినవాడు.’ అసలు విషయం ఏమిటో తెలుసా? ఈ ప్రపంచంలో ఏముందని? ధనం, పేరుప్రతిష్ఠలు, దేహసుఖాలు – వీటిలో మాత్రం ఏముందని? ‘ఓ మనసా, రాముణ్ణి తెలుసుకోనివాడు మరి తెలుసుకున్న దేమిటి?’”
శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక స్థితులు చూసి ఆయన వ్యాధి విషమిస్తుందేమోనని భక్తులు ఆదుర్దా పడసాగారు. ఆయన ఇలా అన్నారు: “ఎవరైనా ‘బ్రహ్మానందపు మధుమత్తతలో’ అన్న పాట పాడితే నేను ప్రశాంతంగా ఉంటాను.”
మరొక గదిలో ఉన్న నరేంద్రుణ్ణి పిలిపించారు. ఆతడు తన దేవదుర్లభ కంఠంతో పాడసాగాడు.
బ్రహ్మానందపు మధుమత్తతలో
మత్తిలుచుండవె ఓ మనసా ।
భువిపై దొరలుచు పొరలుచు నేడ్చుచు
హరిని భుజింపవె ఓ మనసా! ॥ బ్ర ॥
ఆకసమంతయు నీ గర్జనలచే
మార్మోగింపవె ఓ మనసా!
చేతులెత్తుచు హరిని పాడుచు
నృత్యము చేయవె ఓ మనసా! ॥ బ్ర ॥
మధురమైన ఆ మాధవు నామము
మనుజుల కీయవె ఓ మనసా!
పగలు రాత్రి ఆ పరమానందము
నందు నీదవె ఓ మనసా! ॥ బ్ర ॥
హరిప్రేమామృత మందు మునుగుచు
ఖండన సేయవె కామమును
దానిచేత నీ జీవితమంతయు
ధన్యత గాంచునె ఓ మనసా! ॥ బ్ర ॥
శ్రీరామకృష్ణులు: ఆ పాట – ‘పరమానందపు ఎరుక సాగరోపరిభాగంబున…’
నరేంద్రుడు ఆ పాట పాడసాగాడు. తరువాత నరేంద్రుడు ఈ పాట పాడాడు.
మనసా చేయుము మాధవు ధ్యానము
నిత్యనిరంజని నిర్మలాత్ముని ॥ మ ॥
ఎంత నిరుపమం బాతని తేజము
ఎంత మోహనం బాతని రూపము
ఎంత చేరువో ఎల్ల భక్తులకు
ఎంత ప్రియతముండతడు వారికి ॥ మ ॥
విమల వికాసము చెందు ప్రేమలో
కోటిచంద్ర నిభ తేరుగేరుచు
మెరపు తీగవలె మెరయు రూపప్రభ
గగురుపాటుతో గూర్చు సౌఖ్యమును ॥ మ ॥
హృదయ పద్మమున నతని పాదముల
నర్చన చేయుము దివ్యప్రేమతో
శాంతచిత్తమున కాంతికనులతో
గాంచుమెందు గనరాని దృశ్యమును ॥ మ ॥
అతని ప్రేమలో మంత్రముగ్ధవై
పారవశ్యమున బద్ధచిత్తవై
సదా మానస మునుగు మతనిలో
శుద్ధ బుద్ధ పరిశుద్ధ బ్రహ్మమున ॥ మ ॥
డాక్టరు ఈ పాటలను సావధానంగా విన్నాడు. పాటలు పూర్తయ్యాక “ ‘పరమానందపు ఎరుక సాగరోపరి భాగంబున’ పాట బాగుంది” అన్నాడు.
డాక్టరు ఆనందాన్ని చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ఒక కుమారుడు తన తండ్రితో ఇలా అన్నాడు: ‘తండ్రీ, మీరు మద్యాన్ని కొద్దిగా రుచి చూడండి. ఆ తరువాత మీరు మానివెయ్యమంటే నేను మానివేస్తాను.’ మద్యం త్రాగాక తండ్రి ఇలా అన్నాడు: ‘నాయనా, కావాలంటే నువ్వు మానుకో. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాని నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను మానను.’” (డాక్టరుతో పాటు అందరూ నవ్వారు.)
“ఆ రోజు అమ్మ ఇద్దరు వ్యక్తులను చూపించింది. వారిలో ఇతడు(డాక్టరు) ఒకడు. ఇతడికి ఎంతో జ్ఞానం కలుగనున్నదని వెల్లడించింది. కాని అది శుష్కజ్ఞానం. (నవ్వుతూ, డాక్టరుతో) కాని నువ్వు రసభరితుడివి కాగలవు.
డాక్టరు మౌనంగా ఉండిపోయాడు.
48.9 నవమ పరిచ్ఛేదం శ్యాంపుకూర్లో శ్రీరామకృష్ణులు – కాళీపూజ పర్వదినం
శుక్రవారం, నవంబర్ 6, 1885
నేడు దీపావళి అమావాస్య. వంగదేశంలో నేటి రాత్రి కాళీపూజ చేయడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్ ఇంట్లో మేడ మీద తమ గదిలో నూతన వస్త్రాలు ధరించి, నొసట గంధంతో నిలబడి ఉన్నారు. కలకత్తా నగరంలో ఠన్ఠనియాలోని సిద్ధేశ్వరీ దేవి ఆలయానికి వెళ్ళి దేవిని పువ్వులు, కొబ్బరి బొండాం, చక్కెర మిఠాయిలతో ఆర్చించమని ‘మ’ తో చెప్పివున్నా రాయన. ప్రాతఃకాలానే గంగాస్నానం ఆచరించాక ‘మ’ దేవికి అర్చన చేశాడు. తరువాత ప్రసాదం పుచ్చుకుని చెప్పులు లేకుండా కాలినడకన శ్యాంపుకూర్‌కు వచ్చాడు.
శ్రీరామకృష్ణులు కోరడంతో డా ॥ సర్కార్ కోసం ‘మ’ రాంప్రసాద్, కమలా కాంత్‌ల పాటల పుస్తకాలు రెండు కొనితెచ్చాడు.
‘మ’ : ఇవిగోనండి. రాంప్రసాద్, కమలాకాంత్ల పాటల పుస్తకాలు.
శ్రీరామకృష్ణులు: ఇలాంటి పాటలు డాక్టరు తలలోకి ఎక్కించు.
దేవదేవు తత్త్వమేమొ
తెలియ కెట్లు పాటుపడెదు….
ఎరుగగ తరమె ఏరికినైన
తల్లి కాళి నిజతత్వ మించుక….
పొలము దున్నుట తెలియదు నీకు
బీడువారినది జీవిత క్షేత్రము….
రావే మనసా షికారు పోదము
కాళీకల్ప ద్రుమంబునకు….
‘మ’ : అలాగేనండి.
శ్రీరామకృష్ణులు జోళ్ళు తొడుక్కొని ‘మ’ తో పాటు గదిలో పచార్లు చేస్తున్నారు. వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆయన వదనం దివ్యానందంతో వెలిగిపోతోంది.
శ్రీరామకృష్ణులు: ఈ పాట కూడా బాగుంది కదూ – ఈ లోకం ఒక భ్రమరూపక చట్రం.
‘మ’ : అవునండి.
శ్రీరామకృష్ణులు ఉన్నట్టుండి త్రుళ్ళిపడ్డారు. జోళ్ళు వదలిపెట్టి అలాగే నిలబడిపోయారు. ప్రగాఢ సమాధిలోకి వెళ్ళారు. నేడు కాళీపూజ జరుగుతుంది కదా! అందుకేనా ఆయన అలా తరచూ సమాధి స్థితి పొందుతున్నారు? చాలా సేపటి తరువాత గాఢంగా నిట్టూర్చి అతి కష్టంమీద తమ భావాన్ని నిగ్రహించుకున్నారు.
సమయం పదిగంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు దిండును ఆనుకొని మంచం మీద కూర్చుని ఉన్నారు. భక్తులు ఆయన చుట్టూ కూర్చుని ఉన్నారు. రామ్, రాఖాల్, నిరంజన్, కాళీపదుడు, ‘మ’ తదితర భక్తులు పలువురు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు, హృదయ్ గురించి మాట్లాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు: హృదయ్ పొలం కోసం ఇప్పటికీ బొబ్బలుపెడుతూనే ఉన్నాడు. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ఒకసారి నాతో ఇలా అన్నాడు: ‘నాకు ఒక శాలువా ఇవ్వు – లేకుంటే దావా వేస్తాను.’ అమ్మ అతణ్ణి అక్కడ నుండి ప్రక్కకు తప్పించింది. అక్కడకు వచ్చేవారిని అతడు ధనం కోసం పీడించేవాడు. అతడు కనుక ఉన్నట్లయితే వీరందరూ రాగలిగి ఉండేవారే కాదు. అందుకే అమ్మ అతణ్ణి అక్కడనుండి తొలగించివేసింది. ‘గో’ కూడా అలాగే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గొణుగుతూండేవాడు. కలకత్తాకు నాతో పాటు బండిలో వెళ్ళేటప్పుడు కావాలనే ఆలస్యం చేసేవాడు. బాలభక్తులు ఎవరైనా నా వద్దకు వచ్చినట్లయితే అతడు ఎంతగానో చికాకు పడిపోయేవాడు. వారిని చూడడానికి నేను కలకత్తా వెళితే, ‘వారి గురించి అంతగా చింతించడం ఎందుకు? వారేమైనా సంసారం త్యజిస్తారా?’ అనేవాడు. ఈ కుర్రవాళ్ళకు తినుబండారాలు ఏమైనా ఇవ్వాలంటే నేను జంకేవాడిని. వాటిని ‘గో’ కే ఇచ్చి ‘కొన్ని నువ్వు తీసుకొని మిగిలినవి వారి కివ్వు’ అనేవాడిని. అతడు నాతో ఉండబోడని తెలిసింది. అప్పుడు నేను అమ్మతో ‘అమ్మా, హృదయ్ మాదిరే అతణ్ణి కూడా ఇక్కడ నుండి పూర్తిగా తొలగించవద్దు’ అన్నాను. అటుపిమ్మట అతడు బృందావనం వెళ్లబోతున్నాడని విన్నాను. అతడు కనుక నాతోటే ఉండి ఉంటే ఈ కుర్రవాళ్ళెవరూ వచ్చివుండేవారు కాదు. అతడు బృందావనం వెళ్ళిపోయాక ఈ కుర్ర వాళ్ళందరూ నా వద్దకు తరచూ రాసాగారు.
‘గో’ (వినయంతో): అయ్యా, అలాంటి ఉద్దేశం నాకు ఏకోశానా ఉండేది కాదు.
రామ్ (‘గో’ తో): నువ్వు నీ మనస్సును ఈయన కంటే ఎక్కువగా అర్థం చేసుకోగలనని అనుకుంటున్నావా?
‘గో’ మౌనంగా ఉండిపోయాడు.
శ్రీరామకృష్ణులు (‘గో’ తో): నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? నిన్ను నేను తండ్రి బిడ్డను ప్రేమించేదాని కంటే ఎక్కువగా ప్రేమిస్తాను…. నువ్విక బాధ పడవద్దు….. ఇప్పుడు నీకు ఆ భావం లేదులే.
కాసేపటి తరువాత భక్తులు మరో గదిలోకి వెళ్ళారు. శ్రీరామకృష్ణులు ‘గో’ ను పిలిపించి “నేను చెప్పినదానికి నువ్వేమైనా నొచ్చుకున్నావా?” అని అడిగారు.
‘గో’ : లేదండి.
శ్రీరామకృష్ణులు, ‘మ’ తో ఇలా అన్నారు: “ఇవాళ కాళీ పూజ కదా! పూజ కొరకు ఏమైనా ఏర్పాట్లు చేయడం మంచిది. ఈ విషయమై వారితో (భక్తులతో) మాట్లాడు.”
‘మ’, భక్తుల వద్దకు వెళ్ళి శ్రీరామకృష్ణుల ఇచ్ఛను తెలియజేశాడు. కాళీపదుడు మొదలైన వారు వెంటనే పూజాద్రవ్యాలు సమకూర్చడంలో నిమగ్నమైపోయారు.
మధ్యాహ్నం రెండు గంటలకు డా ॥ సర్కార్, అధ్యాపకుడైన నీలమణిని వెంటబెట్టుకొని వచ్చాడు. శ్రీరామకృష్ణుల పరిస్థితిని విచారించిన పిదప డాక్టరు ఔషధం ఇచ్చాడు.
శ్రీరామకృష్ణులు డాక్టరుతో “నీ కోసం ఈ పుస్తకాలు తెప్పించాను” అన్నారు. ‘మ’, డాక్టరుకు ఆ రెండు పుస్తకాలు ఇచ్చాడు.
డాక్టరు ఆ పాటలు వినగోరాడు. శ్రీరామకృష్ణుల ఆదేశం మేరకు ‘మ’, మరో భక్తుడూ కలసి పాడారు.
దేవదేవు తత్వమేమొ
తెలియకెట్లు పాటుపడెదు
చీకటింట చిక్కు పిచ్చి
వాని వలెను వెదకె దీవు….
ఎరుగగ తరమె ఏరికినైనా
తల్లి కాళి నిజతత్వ మించుక
షడ్దర్శనములె శక్తిహీనములు
తల్లి విషయము తెలియజేయుటకు….
పొలము దున్నుట తెలియదు నీకు
బీడువారినది జీవిత క్షేత్రము….
రావే మనసా షికారు పోదము
కాళీకల్ప ద్రుమంబునకు….
డాక్టరు, గిరీశ్‌తో ఇలా అన్నాడు: “బుద్ధ చరిత్రలో నువ్వు వ్రాసిన ఆ వీణ పాట చాలా బాగుంది.” శ్రీరామకృష్ణులు సైగ చేసేసరికి గిరీశ్, కాళీపదుడు ఇద్దరూ కలసి పాడసాగారు:
నా వీణ ఇది ప్రియా
నా వీణ ఇదుగో!
నా ప్రాణపద వీణ
ప్రియతమంబగు వీణ….
విశ్రాంతికై మేము విలపించినాము
అకట ఆ విశ్రాంతి లభ్యమే కాదు
ఎటనుండి వచ్చితిమొ ఎరుకయే లేదు
ఎటుకొట్టుకొని మేము ఏగెదము కూడ….
గట్టిగా పట్టుకో నిత్తాయి
కొట్టుకొని చను నన్ను గట్టిగా పట్టుకో
పోవు నా ప్రాణము అనిపించుచున్నది ॥ గ ॥
శ్రీ మాధవుని నామ మీ మానవులకిచ్చి
ప్రేమ నదిలో పెద్ద ప్రేమఅలను లేపి
ఆ మహాఘోర గంభీర వేగమున
ఏమి సాయములేక కొట్టుకొని పోయితిని ॥ గ ॥
పరిపూర్ణమై దుఃఖభారమునపడె గుండె
ఏరికీ విషయంబు నెరిగింతు నిత్తాయి?
పారమెరుగని తీవ్ర జనవ్యధావాహిని
పరికింపున నీడ్చికొని వడిగ జనుచుండు ॥ గ ॥
రండి రండిరా! రండి ఆడగా!
రార జగాయ్! రార మథాయ్
రండి రండి రా….
రండు రండూ రండు రండందరూ రండు
రండు రాధా ప్రేమ రండు గైకొన రండు….
పాటలు వింటూండగా మణీంద్ర, లాటూలకు భావావేశం కలిగింది. లాటూ, నిరంజన్ ప్రక్కన కూర్చుని ఉన్నాడు. గానం పూర్తయ్యాక శ్రీరామకృష్ణులు, డాక్టరుతో మాట్లాడసాగారు. నిన్నటిరోజు డా ॥ ప్రతాప్ మజుందార్, శ్రీరామకృష్ణులకు ‘నక్స్ వామికా’ అనే ఔషధం ఇచ్చాడు. అది విని డాక్టరుకు కోపం వచ్చింది.
డాక్టరు: ఈయనకు ‘నక్స్ వామికా’ ఇవ్వడమా! నేను చచ్చాననుకున్నారా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నువ్వెందుకు చావాలి? అలా అనవద్దు. నీ అవిద్య చావనివ్వు.
డాక్టరు: నాకు ‘అవిద్య’ అన్నది ఎన్నడూ లేనే లేదు.
అవిద్య అంటే డాక్టరు ఉంపుడుగత్తె అని తప్పుగా అర్థం చేసుకున్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఊహూ, అదికాదు నేను చెప్పేది. సన్న్యాసి విషయంలో అవిద్య అనే తల్లి చనిపోయి వివేకం అనే సంతానం జనిస్తుంది. అవిద్య తల్లి చనిపోయినందున అశౌచం అవుతుంది, అందుకనే సన్న్యాసిని తాకరాదు అంటారు.
ఇంతలో హరివల్లభ్ వచ్చాడు. “మిమ్మల్ని చూడగానే ఆనందం వేస్తోంది” అన్నారు శ్రీరామకృష్ణులు. హరివల్లభ్ ఎంతో వినయశీలి. చాప మీద కూర్చోక కటికనేలపైనే కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులకు విసనకర్రతో వీయసాగాడు. ఆయన కటక్‌లో ప్రముఖ న్యాయవాది. అధ్యాపకుడు నీలమణి ఆయనకు సమీపంలో కూర్చున్నాడు. నీలమణి నొచ్చుకుంటాడేమోననే ఉద్దేశంతో శ్రీరామకృష్ణులు ఆయనవంక చూస్తూ, “ఆహా! ఇవాళ ఎంత సుదినం! మీరందరు వచ్చారు” అన్నారు.
కాసేపటి తరువాత డాక్టరు, నీలమణి వెళ్ళిపోయారు. హరివల్లభ్ కూడా “నేను మళ్ళీ వస్తానండి” అని చెప్పి సెలవు తీసుకున్నాడు.
48.10 దశమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులకు జగజ్జనని పూజ
సమయం రాత్రి ఏడుగంటలు కావస్తోంది. రెండవ అంతస్తులో ఉన్న శ్రీరామకృష్ణుల గదిలోనే భక్తులు కాళీపూజకు ఏర్పాట్లు చేశారు. పలురకాల పువ్వులు, చందనం, బిల్వపత్రాలు, పాయసం, పలురకాల మిఠాయిలు శ్రీరామకృష్ణుల ఎదుట అమర్చారు. భక్తజన పరివేష్టితులై పరమహంస శ్రీరామకృష్ణులు ఆసీనులయ్యారు. శరత్, శశి, రామ్, గిరీశ్, ఛునీలాల్, ‘మ’, రాఖాల్, నిరంజన్, చిన్ననరేంద్రుడు మొదలైన వారు అక్కడ ఉన్నారు.
సాంబ్రాణి తీసుకురమ్మని శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో చెప్పారు. కాసేపటి తరువాత ఆయన పూజాద్రవ్యాలన్నీ జగజ్జననికి సమర్పించారు. ‘మ’ ఆయనకు దగ్గరగా కూర్చుని ఉన్నాడు. ‘మ’ వంక చూస్తూ శ్రీరామకృష్ణులు భక్తులతో “అందరూ కాసేపు ధ్యానించండి” అన్నారు. భక్తులందరూ ధ్యానం చేయసాగారు.
కాసేపటి తరువాత గిరీశ్ లేచి శ్రీరామకృష్ణుల పాదాలవద్ద పువ్వులమాలను సమర్పించాడు. ‘మ’ కూడా గంధపుష్పాలను ఒసగాడు. రాఖాల్, రామ్ తదితర భక్తులు ఆతణ్ణి అనుసరించారు.
శ్రీరామకృష్ణులు పాదాలవద్ద నిరంజన్ పువ్వులు సమర్పించి “బ్రహ్మమయీ, బ్రహ్మమయీ” అంటూ ఆయన పాదాలకు శిరస్సు మోకరించి సాష్టాంగ ప్రణామం చేశాడు. భక్తులందరూ కూడా “జై మా” అంటూ నివాదాలు చేశారు.
చూస్తూండగానే శ్రీరామకృష్ణులు సమాధిస్థితి పాందారు. ఆయనలో అద్భుతమైన రూపాంతరాన్ని భక్తులు దర్శిస్తున్నారు. ఆయన ముఖమండలం ఉజ్జ్వల జ్యోతిలా ప్రకాశిస్తోంది, వరాభయ హస్తాలతో ఉత్తరాభిముఖులై కూర్చుని ఉన్నారు. దేహం నిశ్చలం! బాహ్యచైతన్యం శూన్యం! సాక్షాత్తూ జగజ్జననియే ఆయనలో ఆవిర్భవించినట్లు భక్తులకు తోస్తోంది.
కోరిన వరాలనన్నిటినీ అనుగ్రహిస్తూ అభయప్రదానం చేసే మూర్తీభవించిన జగజ్జననిలా తోస్తూన్న ఈ అద్భుతమూర్తిని భక్తులందరూ తనివితీరా నోటమాటరాక దర్శిస్తున్నారు. వారి హృదయాలు పరమానందంతో నిండిపోయాయి.
భక్తులు స్తోత్రపఠనం చేయసాగారు. పాటలు కొనసాగాయి. ఆనంద సాగరంలో ఉవ్వెత్తున కెరటాలు చెలరేగుతున్నాయి.భక్తులు రెండు గంటలసేపు పాటలు పాడారు.
గిరీశ్ పాడసాగాడు:
ఎవరమ్మా ఈ కృష్ణకేశిని
వెల్గుచున్నదీ దేవ కూటమున
అరుణ కనులవంటి పాదములు
శివుని గుండెపై చిందులాడును ॥ ఎ ॥
పూర్ణచంద్రువలె ప్రకాశించును
పాదనఖములా బొటన వ్రేళ్ళవి ॥ ఎ ॥
సూర్యదీధితుల వలెను వెల్గును
ఎవరి పాదము ఇంత దీప్తితో ॥ ఎ ॥
ఇపుడు మందముగ మాటలాడును
మందహాసము మనపై బరపును ॥ ఎ ॥
అంతరిక్ష మిపుడదుర అరచుచు
భీతిగొల్పు తన వికటహాసమున ॥ ఎ ॥
దీనరక్షణివి, పాపహారిణివి, త్రిగుణధారిణివి జననీ
లోకకర్తవు, లోకభర్తవు, లోకహర్తవు జననీ….
పిదప బిహారీ పాడాడు:
మనవి వినగదే
శవాసనీ, శ్యామకేశినీ, శ్యామా
తీవ్రవేదన తెలుపుకొనెడు నా ॥ మ ॥
అతి దీనుడనై నమ్రభావమున
అర్థించెడు నా హృదయ ప్రార్థన ॥ మ ॥
ప్రాణవాయువు లీ ప్రాకృత దేహము
వదలునపుడు నీ హృది కనుపడుమను ॥ మ ॥
అడవులనుండీ వనములనుండీ
జబాకుసుమములు సంతరించినా
మానస మందిరమందున నపుడే
భక్తి చందనంబలది సుమాంజలి
పాదకమలములపై యర్పించెదనే ॥ మ ॥
తరువాత ‘మ’ ఇతర భక్తులతో కలిసి పాడాడు:
సకలము నీ తలపే
జరిగింతువు అటువలెనె
నీ పనులను నీ వొనరుప
తాజేసితిమని తలతురు….
సాధ్యము కానిది గలదే మాతా!
సర్వము సాధ్యము నీ దయయున్న
దండిగ పెరిగిన కొండలవంటి
గండము లన్నిటి కరిగించెదవు ॥ సా ॥
ఆనందామృత ధామయైన నీ
వందరికిచ్చుచు శాంతిసౌఖ్యముల
ఎందుకు నన్నిటు లేడిపించెదవు
చేసిన పనులనె చింతిలజేయుచు ॥ సా ॥
ఆనందమయి మాతా వెనుకాడకే నీ
నిర్భాగ్య శిశువునకు ఆనందమీయగ…
రూపులేని నీ అందము
దట్టమైన చీకటిలో
మెరయుచు స్పందించుచుండె….
శ్రీరామకృష్ణులు క్రమంగా బాహ్యచైతన్యంలోకి వచ్చారు. ఆయన భక్తులను, “మాతా శ్యామా! మంగళనామా!” అనే పాటను పాడమన్నారు.
భక్తులు పాడారు:
మాతా శ్యామా! మంగళ నామా!
మదిరా దివ్యతరంగితమత్తా!
భువి నీ లీలలు ఎవరికి తెలుసు
ఏఏ కళల యేమి యొనర్తువో….
భక్తులు ఈ పాట పాడిన తరువాత శ్రీరామకృష్ణులు వారిని, ‘అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో’ అనే పాట పాడమన్నారు.
భక్తులు పాడారు:
అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో
పారవశ్యమున ఒడలు మరచి తా
పరమేశ్వరుతో నాడుచున్నది
త్రాగి గుక్కెడు దేవ మద్యము….
భక్తుల ఆనందం కోసం శ్రీరామకృష్ణులు కొద్దిగా పాయసం రుచి చూశారు. కాని లిప్తలోనే మళ్ళీ సమాధి గతులయ్యారు.
కాసేపటి తరువాత భక్తులందరూ ఆయనకు ప్రణమిల్లి ఆ ప్రసాదాన్ని పుచ్చుకున్నారు. అతిథుల గదిలోకి వెళ్ళి ఆ ప్రసాదాన్ని అమిత శ్రద్ధాభక్తులతో భుజించారు.
రాత్రి తొమ్మిది గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు, భక్తులను సురేంద్రుడి ఇంట్లో కాళీపూజను చూడడానికి వెళ్ళమని చెప్పారు.
భక్తులు సిమ్లా వీథిలో ఉన్న సురేంద్రుడి ఇంటికి వెళ్లారు. సురేంద్రుడు ఆదరాభిమానాలతో వారికి స్వాగతం పలికి రెండవ అంతస్తులో ఉన్న అతిథుల గదిలో ఆసీనులను చేశాడు. ఇల్లంతా పండుగ సందడితో నిండి ఉంది. పాటలతో, సంగీతంతో అదొక ఆనందపు సంతలా తోస్తోంది. సురేంద్రుడి ఇంట్లో విందు భోజనం ఆరగించాక భక్తులందరూ తమ ఇళ్ళకు బయలుదేరేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది.