24.1 ప్రథమ పరిచ్ఛేదం
బుధవారం, జూన్ 25, 1884
రథయాత్ర పర్వదినం. కలకత్తాలోని ఈశాన్ ఆహ్వానం పురస్కరించుకుని శ్రీరామకృష్ణులు ఉదయం అతడి ఇంటికి వెళ్లారు. అతడి ఇల్లు ఠన్ఠనియాలో ఉంది. అక్కడకు వెళ్లినప్పుడు, సమీపంలోని కళాశాల వీథిలోని ఛటర్జీ ఇంట్లో పండిట్ శశధర్ తర్కచూడామణి బసచేసి ఉన్నట్లు విన్నారు. అతణ్ణి చూడగోరారు. సాయంకాలం ఆతణ్ణి చూడటానికి వెళ్ళ నిశ్చయించారు.
సమయం ఉదయం పదిగంటలు అయివుంటుంది. ఈశాన్ ఇంట్లో క్రిందనున్న ముంగిటి గదిలో శ్రీరామకృష్ణులు భక్తులతో ఆసీనులై ఉన్నారు. ఈశాన్కు తెలిసిన ఒకరిద్దరు భాట్పాడా బ్రాహ్మణులూ వచ్చి ఉన్నారు. వారిలో ఒకరు భాగవతంలో మంచి పాండిత్యం కలవాడు. శ్రీరామకృష్ణులతో హాజ్రా, ఒకరిద్దరు భక్తులూ వచ్చి ఉన్నారు. ఈశాన్ కుమారులైన శ్రీశ్ తదితరులు అక్కడ ఉన్నారు. ఒక తాంత్రిక భక్తుడు వచ్చి ఉన్నాడు, అతడు నొసట కుంకుమ బొట్టు పెట్టుకుని ఉన్నాడు. దాన్ని చూసి శ్రీరామకృష్ణులు నవ్వుతూ, “ఏమిటి ఇతడికి ముద్ర వేయబడి ఉందే!” అన్నారు.
కాసేపయ్యాక ‘మ’, నరేంద్రుడు వచ్చారు. ఇద్దరూ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సమీపంలో కూర్చున్నారు. తాము ఈశాన్ ఇంటికి వెళ్లబోతూ ఉన్నట్లు, నరేంద్రుని తోడ్కొని అక్కడకు రమ్మని శ్రీరామకృష్ణులు ఇంతకు మునుపే ‘మ’ కు చెప్పి ఉన్నారు. ‘మ’ ను చూడగానే ఆయన అతడితో, “ఆ రోజు నీ ఇంటికి రావాలనుకున్నాను. అవును, నువ్వు ఉండేది ఎక్కడ?” అని అడిగారు.
‘మ’ : మహాశయా, ప్రస్తుతం శ్యాంపుకూర్లోని తేలీపాడాలో పాఠశాలకు సమీపంగా ఉన్నాను.
శ్రీరామకృష్ణులు: ఈ రోజు స్కూలుకు పోలేదా?
‘మ’ : లేదండీ. రథయాత్ర కారణంగా నేడు సెలవు దినం.
నరేంద్రుని తండ్రి మరణానంతరం అతడి ఇంట్లో పేదరికం తాండవిస్తోంది. అతడు ఇంటికి పెద్దకుమారుడు. చిన్న పిల్లలైన చెల్లెళ్లు తమ్ములు ఒక రిద్దరున్నారు. తండ్రి వకీలుగా ఉండేవాడు, అతడు ఆస్తి ఏదీ వదలిపెట్టిపోలేదు. కుటుంబాన్ని పోషింప నరేంద్రుడు పని కోసం వెదకుతున్నాడు. అతడి పనికై శ్రీరామకృష్ణులు ఈశాన్ మొదలైన భక్తులతో చెప్పి ఉన్నారు. ఈశాన్ కంట్రోలర్ జనరల్ ఆఫీసులో ఒక అధికారిగా ఉండేవాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడి గురించి ఎంతో కలత చెంది ఉన్నారు; అతడితో “నేను నిన్ను గురించి ఈశాన్కు చెప్పి ఉన్నాను. ఆ రోజు ఈశాన్ దక్షిణేశ్వరానికి వచ్చి ఉన్నాడు కదా! అప్పుడే చెప్పాను. ఆతడికి పలువురు తెలుసు” అన్నారు.
పాట ప్రారంభం కాబోతోంది. తంబురా, తబలా మొదలైన ప్రక్క వాయిద్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇంటి వ్యక్తి ఒకరు మృదంగానికి రాయటానికి మైదాపిండి తీసుకొచ్చి పెట్టాడు. సమయం పదకొండు గంటలైంది. నరేంద్రుణ్ణి పాడమని ఈశాన్ కోరాడు.
శ్రీరామకృష్ణులు (ఈశాన్తో): ఇప్పుడేనా మైదా వచ్చింది! అలా అయితే భోజనాలకు చాల ఆలస్యం అవటం తథ్యం.
ఈశాన్ (నవ్వుతూ): లేదండీ, అంతసేపు పట్టదు.
పలువురు భక్తులు నవ్వారు. భాగవత పండితుడు కూడా నవ్వుతూ ఒక శ్లోకం వల్లించాడు:
‘కావ్యేన దర్శనం హంతి, కావ్యం గీతేన హన్యతే ।
గీతంచ స్త్రీ విలాసేన, సర్వం హంతి బుభుక్షుతా ।
తరువాత దానికి అర్థం వివరించాడు:
“తత్త్వశాస్త్రాలకంటే కావ్యాలు మనస్సును ఆకట్టుకొంటాయి. కావ్యాలను చదివేటప్పుడో, వినేటప్పుడో వేదాంతం, సాంఖ్యం, న్యాయం, పాతంజలం మొదలైన తత్త్వశాస్త్రాలన్నీ నిస్సారంగా తోస్తాయి. కావ్యాల కంటే మనస్సును ఆకట్టుకొనేవి పాటలు. సంగీతంతో పాషాణ హృదయం కూడా కరిగిపోతుంది. సంగీతానికి ఇంత ఆకర్షణ ఉన్నప్పటికీ, ఒక అందమైన స్త్రీ అలా ప్రక్క నుండి వెళ్ళినట్లయితే కావ్యం సంగతి అలా ఉంచండి, సంగీతం కూడా చప్పగా తోస్తుంది. మనస్సంతా సంపూర్ణంగా ఆ స్త్రీ వైపే మరలి ఉంటుంది. కాని ఆకలి వేస్తేనో కావ్యం, సంగీతం, స్త్రీ ఏవీ రుచించవు. అన్నం గురించిన చింతన నిర్నిరోధమైనది.”
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఇతడు మంచి రసికుడు.
వాయిద్యాలను శ్రుతి చేశాక నరేంద్రుడు పాడ నారంభించాడు. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు విశ్రాంతికై మేడ మీది అతిథుల గదిలోకి వెళ్లారు. ఆయనతో పాటు ‘మ’, శ్రీశ్లు కూడా వెళ్లారు. అతిథుల గది వీథిని ఆనుకుని ఉంది.
శ్రీశ్ను శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు ‘మ’ : “ఇతడు విద్యాధికుడు, శాంతస్వభావి. చిన్ననాటి నుంచీ మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ప్రస్తుతం వకీలుగా ఉంటున్నాడు.”
శ్రీరామకృష్ణులు: ఇట్టి స్వభావం గలవాడు వకీలుగా ఉండటమా?
‘మ’ : పొరపాటుగా ఆ దారిలో వెళ్లాల్సి వచ్చింది.
శ్రీరామకృష్ణులు: నేను గణేశ్ అనే వకీలును చూసి ఉన్నాను. అప్పుడప్పుడు దక్షిణేశ్వర కాళికాలయానికి పెద్దమనుషులతో బాటు వస్తాడు. పన్నా కూడా వస్తాడు, చూడటానికి గొప్పగా ఉండడు, కాని చక్కగా పాడతాడు. నా పట్ల అతడికి ఎంతో గౌరవం ఉంది; సరళ హృదయుడు. (శ్రీశ్ను చూస్తూ) జీవితంలో మీరు దేన్ని సారభూతంగా భావిస్తారు?
శ్రీశ్: భగవంతు డొకడు ఉన్నాడు, ఆయనే సర్వానికి కర్త. కాని ఆయన గుణాలను గురించి మనం ఏం ఊహిస్తున్నామో అది సరి కాదు. ఆయనను గురించి మనిషి ఏం అర్థం చేసుకోగలడు? అది అనంతమైన విషయం కదా?
శ్రీరామకృష్ణులు: తోటలో ఎన్ని చెట్లు, ఎన్ని కొమ్మలు అంటూ లెక్కించటంలో ఏం ప్రయోజనం? మామిడి పండు తినటానికి నువ్వు తోటలోకి వచ్చావు, పండు తిని వెళ్లిపో. భగవంతుని పట్ల భక్తి ప్రేమలు సంపాదించడమే మానవజన్మ ఉద్దేశం. నువ్వు పండు తిని వెళ్లిపో.
“నువ్వు కల్లు త్రాగటానికి వచ్చావనుకో. అంగడిలో ఎన్ని ముంతల కల్లు నిల్వ ఉందో అన్న విషయంతో నీకు ఏం ప్రయోజనం? ఒక ముంత కల్లు తోటే నీ పని అయిపోతుంది. భగవంతుడి అనంత గుణ విశేషాలను తెలుసుకోవలసిన అవసరం ఏమిటి? భగవంతుని గుణాలను గురించి లక్షలాది సంవత్సరాల పాటు విచారణ చేసినప్పటికీ, వాటిని ఒకింతయినా తెలుసుకోలేము.”
శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయి మళ్ళీ మాట్లాడసాగారు. భాట్పాడాకు చెందిన ఒక బ్రాహ్మణుడు అక్కడ కూర్చుని ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): సంసార జీవితంలో సారం ఏమీ లేదు. ఈశాన్ కుటుంబం ఫరవాలేదు, అందుచేత కొంత ప్రశాంతత. అలా కాకుండా, కొడుకులు పరస్త్రీ వ్యామోహితులుగా, గంజాయి త్రాగేవారుగా, త్రాగుబోతులుగా, అవిధేయులుగా ఉంటే కష్టాలకు అంతమే ఉండదు. అందరూ భగవత్ప్రీతి గలవారుగా, సంస్కారవంతులుగా ఉన్న కుటుంబాలను చూడటం అరుదు. అటువంటి కుటుంబాలను నేను ఏదో ఒకటి లేక రెండిటిని మాత్రమే చూశాను. కలహాలు, అపార్థాలు, ఈర్ష్య; దానికి తోడు రోగం, శోకం, దారిద్ర్యం – వీటినే సాధారణంగా చూస్తాం. వీటిని చూసి నేను అమ్మతో, ‘అమ్మా, తక్షణమే నా మనస్సును త్రిప్పివెయ్యి’ అని ప్రార్థించాను. చూడు! నరేంద్రుడు ఎటువంటి కష్టాల్లో చిక్కువడి ఉన్నాడు! అతడి తండ్రి మరణించాడు. ఇంట్లో వారు పస్తులుంటున్నారు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదు. ఎలా శ్రమకోర్చి తిరుగుతున్నాడో?
(‘మ’ తో) “నువ్వు మునుపు తరచూ వచ్చేవాడివి. ఇప్పుడు అలా ఎందుకు రావటం లేదు? భార్యతో చనువు అధికరించినదా ఏం? నిన్ను తప్పుబట్టి ఏం లాభం? ఎక్కడ చూసినా కామినీ కాంచనాలే! అందుకే నేను అమ్మతో, ‘అమ్మా, నేను ఎప్పుడు జన్మను ఎత్తవలసి వచ్చినా నన్ను సంసారిని మాత్రం చేయకు’ అని ప్రార్థిస్తాను.”
భాట్పాడా బ్రాహ్మణుడు: ఎందుకు ఇలా అంటున్నారు? గృహస్థ ధర్మాలను శాస్త్రాలు ప్రశంసిస్తున్నాయి కదా?
శ్రీరామకృష్ణులు: నిజమే, కాని అదెంతో కష్టం.
శ్రీరామకృష్ణులు వేరే విషయాలను గురించి మాట్లాడారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఎంత పెద్ద తప్పు చేశాం. చూడు, అక్కడ వాళ్లు పాడుతున్నారు, అందులోనూ నరేంద్రుడు పాడుతున్నాడు. మనం ఇక్కడికి వచ్చేశామే!
24.2 ద్వితీయ పరిచ్ఛేదం కలియుగంలో నారదీయభక్తే తగినది
సాయంత్రం దాదాపు నాలుగు గంటలకు శ్రీరామకృష్ణులు శశధర్ పండితుని ఇంటికి వెళ్లటానికి బండిలో కూర్చున్నారు. అతి కోమలమైన ఆయన దేహాన్ని ఎంతో జాగ్రత్తగా పరిరక్షించవలసి ఉంది. నడిచిపోవటమే ఆయనకు చాలా కష్టంగా ఉంది. సామాన్యంగా బండి లేకుండా కాస్త దూరం కూడా ఆయన వెళ్లలేకున్నారు. బండిలో ఎక్కగానే భావసమాధిలో మునిగిపోయారు. సన్నగా చినుకులు పడసాగాయి. వానాకాలం; ఆకాశం మేఘావృతమై ఉంది, దారంతా బురదమయంగా ఉంది. భక్తులు బండి ప్రక్కగా నడిచి వస్తున్నారు. రథయాత్ర సంతోషంలో పిల్లలు తాటాకులతో చేసిన ఈలలు ఊదుతూ పోవటం వాళ్లు చూశారు.
బండి ఇంటి వాకిలి ముందు ఆగగానే ద్వారం వద్దకు ఇంటి యజమాని, బంధువులు వచ్చి శ్రీరామకృష్ణులను ఆహ్వానించారు. మేడ మెట్లకు ప్రక్కన అతిథుల గది ఉంది. మేడ మీదికి వెళుతున్నప్పుడు శశధర్ పండితుడు శ్రీరామకృష్ణులను ఆహ్వానింప వచ్చాడు. అతడు మధ్యవయస్కుడు, దేహం ధవళ వర్ణంలో ప్రకాశిస్తోంది. మెడలో రుద్రాక్షమాలను ధరించి ఉన్నాడు. భక్తి ప్రపత్తులతో శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి, ఆయనను తోడ్కొని గదిలో ఆసీనులను చేశాడు. భక్తులు వారి వెంట వెళ్లి కూర్చున్నారు.
అందరూ శ్రీరామకృష్ణుల సమీపంలో కూర్చున్నారు. ఆయన ముఖతా జాలువారే అమృత వచనాలను ఆలకింప ఆతురతతో ఉన్నారు. నరేంద్రుడు, రాఖాల్, రామ్, ‘మ’, పలువురు భక్తులు ఉన్నారు. శ్రీరామకృష్ణులతో పాటు దక్షిణేశ్వరం నుండి హాజ్రా కూడా వచ్చి ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు పండితుణ్ణి చూస్తూనే భావపారవశ్యంలో మునిగిపోయారు. కాసేపయ్యాక అదే స్థితిలో నవ్వుతూ పండితుడి కేసి చూసి, “భేష్, భేష్!” అన్నారు. తరువాత, “అది సరే, మీరు ఎలా లెక్చరు ఇస్తారు?” అని అడిగారు.
శశధర్: మహాశయా! శాస్త్రాలలోని విషయాలను బోధింప ప్రయత్నిస్తూంటాను.
శ్రీరామకృష్ణులు: కలియుగానికి తగినది నారదీయభక్తే. శాస్త్రాలు విధించిన కర్మలు అనుష్ఠింప సమయం ఎక్కడ ఉంది? ప్రస్తుత కాలపు జ్వరాలకు దశమూల కషాయం పనికిరాదు. ఈ కషాయం పనిచేసే లోపలే రోగి కాస్తా వైకుంఠయాత్ర కట్టేస్తాడు. ఇప్పుడు కావలసింది సత్వరం పనిచేసే ఫీవర్ మిక్స్చెరే. కర్మలు అనుష్ఠించమని చెప్పే పక్షంలో తల, తోకను తొలగించి వేయండి.* ‘ఆపోధన్యన్యా (సంధ్యోపాసన మంత్రం) వంటి వాటినన్నీ చెప్పనవసరం లేదు. గాయత్రీ జపం చేస్తేనే చాలు!’ అని నేను చెబుతూ ఉంటాను. కర్మల గురించి చెప్పాలనుకుంటే ఈశాన్ లాంటి ఒకరిద్దరికి మాత్రం చెప్పవచ్చు.
24.2.1 విషయాసక్తులు – లెక్చర్లు
“వెయ్యి లెక్చర్లు ఇవ్వు, అయినప్పటికీ విషయాసక్తులపైన అవి ఏ ప్రభావాన్నీ చూపవు. రాతి గోడలో మేకు కొట్టగలమా? మేకు విరుగుతుందే గాని గోడలోకి అది పోదు. మొసలి వీపు మీద కత్తి వేటు వేస్తే ఏం జరుగుతుంది? సాధువు కమండలువు నాలుగు పుణ్యతీర్థాలకు వెళ్లివస్తుంది, అయినప్పటికీ దాని చేదుగుణం అట్లే ఉంటుంది. మీ లెక్చర్ విషయాసక్తులను అంతగా ప్రభావితం చేయలేదని క్రమంగా అర్థం చేసుకుంటారు. లేగదూడ మొదట్లోనే నిలబడలేదు, పడి లేస్తూ ఉంటుంది. అట్లే అది నిలబడటం, నడవటం నేర్చుకుంటుంది!
24.2.2 భగవత్సాక్షాత్కారం తరువాతే కర్మత్యాగం – యోగం, సమాధి
“భక్తుడెవరో, విషయాసక్తు డెవరో మీరు గుర్తించలేరు. అది మీ తప్పు కాదు. పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు ఏది చింతచెట్టో, ఏది మామిడి చెట్టో ఎవరూ మొదట్లో గుర్తించలేరు.
“భగవత్సాక్షాత్కారం కానిదే ఎవరూ పూర్తిగా కర్మత్యాగం చేయలేరు. సంధ్యాది కర్మలు ఎంత కాలం? భగవన్నామాన్ని ఉచ్చరించగానే కళ్ల వెంట అశ్రువులు స్రవించక, రోమాంచితం కానంత వరకే. ‘ఓం రామ్’ అంటూ ఒక్కమారు ఉచ్చరించగానే కళ్లు స్రవిస్తే మీకు కర్మలు ఏవీ మిగల్లేదని తెలుసుకోండి. ఆ పిదప సంధ్యాది కర్మలు అనుష్ఠింప పనిలేదు.
“పండు కానరాగానే పువ్వు రాలిపోతుంది. భక్తి అనేది పండు; కర్మలే పువ్వు. ఇంటి కోడలు గర్భం ధరిస్తే ఆమె అధికంగా పనిపాట్లు చేయలేదు. వెంటనే అత్తగారు ఆమె పనులను రోజురోజుకూ తగ్గించివేస్తుంది. నెలలు నిండాక ఆమెను పనిచెయ్య నివ్వదు. బిడ్డ పుట్టాక, బిడ్డను చూసుకోవటమే కోడలి పని. ఇతర పనులను ఆమె చేయనక్కర్లేదు. సంధ్య గాయత్రిలో లీనం అవుతుంది, గాయత్రి ప్రణవంలో లయిస్తుంది, ప్రణవం సమాధిలో లయిస్తుంది. ఇది గంటల నాదం టం–ట–అ–మ్ లాంటిది. యోగి నాదాన్ని అనుగమించి పరబ్రహ్మంలో లయిస్తాడు. సమాధిలో సంధ్యాది కర్మలు లయిస్తాయి. జ్ఞానులకు కర్మ త్యాగం సంభవించేది ఈ విధంగానే.”
24.3 తృతీయ పరిచ్ఛేదం పాండిత్యం – సాధన – వివేక వైరాగ్యాలు
సమాధి గురించి మాట్లాడుతూ ఉండగానే శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితి నొందారు. ఆయన ముఖారవిందం దివ్యప్రకాశంతో తేజరిల్లింది. ఆయనలో బాహ్యస్మృతి లేదు. నోట మాటలేదు, కళ్లు స్థిరంగా ఉన్నాయి. ఆయన నిశ్చయంగా జగన్నాథుని దర్శిస్తూ ఉన్నారు! చాలాసేపు గడిచాక బాహ్యస్మృతి కలుగగానే ఒక చిన్నపిల్లవాడి మాదిరి, “నేను మంచినీళ్లు త్రాగుతాను” అన్నారు. సమాధి స్థితి పిదప ఆయన ఇలా పలికితే, క్రమక్రమంగా బాహ్యస్మృతిని పొందుతున్నారని భక్తులకు తెలుసు.
శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలోనే మాట్లాడసాగారు: “అమ్మా! నాడు విద్యాసాగర్‌ను నాకు చూపించావు. అటుపిమ్మట ‘నేను మరో పండితుణ్ణి చూడగోరుతున్నాను’ అని నిన్ను అడిగాను. అందుకేనా నన్ను ఇక్కడకు తోడ్కొని వచ్చావు!”
తరువాత శశధర్ వైపు తిరిగి అతడితో, “ఇంకా ఒకింత బలాన్ని పుంజుకోండి. ఇంకా కొన్ని రోజులు సాధనలు అనుష్ఠించండి. చెట్టు ఎక్కటానికి ముందే ఒక గుత్తి పళ్లను కోసుకోవాలను కుంటున్నారే! కాని వీటి నన్నిటిని లోకుల మేలు కోసం చేస్తున్నారులే” అని అన్నారు. ఇలా పలికి శ్రీరామకృష్ణులు తల వంచి పండితుడికి నమస్కరించారు.
తరువాత ఇలా అన్నారు: “మీ గురించి మొదట విన్నప్పుడు, ‘ఆ పండితుడు కేవలం పండితుడేనా లేక వివేక వైరాగ్యాలు ఉన్నాయా?’ అని అడిగాను. వివేకం లేని పండితుడు పండితుడే కాదు.
24.3.1 భగవదాదేశం పొందనిదే బోధకులు కాలేరు
“భగవదాదేశం పొందిన వ్యక్తి లోకులకు బోధించటంలో తప్పు లేదు. అలా ఆదేశం పొందిన వ్యక్తి లోకులకు బోధిస్తే అతణ్ణి ఎవరూ ఓడించలేరు. సరస్వతీదేవి కటాక్ష వీక్షణం ఒక్కటి చాలు, ఆ శక్తి ముందు ఉద్దండ పండితులూ వానపాములే అవుతారు.
“దీపాన్ని వెలిగిస్తే దీపపు పురుగులు గుంపులు గుంపులుగా వాటంతట అవే వస్తాయి; వాటిని పిలువ నవసరం లేదు. అదే విధంగా భగవదాదేశం పొందిన వ్యక్తి జనులను పిలువ నక్కరలేదు; ఫలానా సమయంలో లెక్చర్ ఇవ్వబడుతుందని ప్రకటించ నవసరం లేదు. ఆతడి వశీకరణ శక్తితో జనం వారంతట వారుగానే ఆతడి వద్దకు వచ్చి చేరుకుంటారు! రాజులు, సంపన్నులతో సహా అందరూ తండోపతండాలుగా వస్తారు; ‘మీరు ఏం స్వీకరిస్తారు? మామిడిపళ్లు, మిఠాయిలు, ధనం, శాలువలు అన్నీ తీసుకువచ్చాం. మీరు దేన్ని స్వీకరిస్తారు?’ అని అడుగుతారు. నేను ఇటువంటి వ్యక్తులను చూసి, ‘వెళ్లిపోండి, నాకు ఇవేవీ నచ్చవు; నాకేమీ వద్దు’ అని చెబుతాను.
“అయస్కాంతం ఇనుముతో, ‘నువ్వు నా దగ్గరకు రా’ అని చెబుతుందా? రమ్మని పిలువ నవసరమే లేదు. అయస్కాంత ఆకర్షణ కారణంగా ఇనుము తానుగా పరుగెత్తి వస్తుంది.
“అటువంటి వారు పండితులు కాకపోవచ్చు, నిజమే. అందుచేత వీరికి జ్ఞానం తక్కువ అని ఎంచరాదు. పుస్తక పాండిత్యంతో జ్ఞానం లభిస్తుందా ఏమిటి? భగవదాదేశం పొందిన వ్యక్తి జ్ఞానానికి కొరత ఉండదు. ఆ జ్ఞానం భగవంతుని నుండి ప్రసాదింపబడుతోంది, అది ఎన్నటికీ తరగదు. గ్రామాలలో వడ్లు కొలిచేటప్పుడు ఒకడు కొలుస్తాడు; మరొకడు కుప్పను త్రోసి ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా, భగవదాదేశం పొందిన వ్యక్తి ఎంత ఉపదేశించినా, అమ్మ వెనుక ఉండి జ్ఞానరాశిని త్రోసి ఇస్తూనే ఉంటుంది. ఆ జ్ఞానం ఎన్నటికీ తరగదు.
“అమ్మ కటాక్ష వీక్షణం ఒకమారు ప్రసరిస్తే ఆ పిదప జ్ఞానానికి కొదువ అంటూ ఉంటుందా ఏమిటి? భగవదాదేశం పొంది ఉన్నావా అని అందుకే అడుగుతున్నాను.”
హాజ్రా: అవును, కచ్చితంగా ఆదేశం పొంది ఉన్నారు. (శశధర్తో) మీరు ఏమంటారండీ?
శశధర్: ఆదేశమా? లేదు, అటువంటిది ఏమీ పొందలేదు.
ఇంటి యజమాని: ఆదేశం పొందలేదు గాని, దీన్ని తన కర్తవ్యంగా ఎంచి లెక్చర్ ఇస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: ఆదేశం పొందని వ్యక్తి లెక్చర్తో ఏం ప్రయోజనం? బ్రహ్మసమాజానికి చెందిన ఒక వ్యక్తి తన లెక్చర్‌లో, ‘సోదరులారా! నే నెంతో మద్యపానం చేసేవాడిని, నేను అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది విని అక్కడ సమావేశమైన జనులు, ‘వెధవ! మద్యపానం చేశాడట, ఏమేమి చేశాడో చూశావా?’ అంటూ తమలో తాము మాట్లాడుకో సాగారు. అంటే ఆ వ్యక్తి ఇచ్చిన లెక్చర్ పర్యవసానం విపరీతమే. కనుక మంచివాడు కాకుంటే, అతడు లెక్చర్ చేయటంలో ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.
“బరిశాల్కు చెందిన సబ్ జడ్జి ఒకరు, ‘స్వామీ, మీరు ప్రచారం ప్రారంభించండి. నేనూ నడుంకట్టి దిగుతాను’ అని చెప్పాడు. అందుకు నేనతడితో ఇలా అన్నాను: ‘నాయనా, కాస్త ఆగి, ఇది విను. కామార్పుకూర్లో హల్దార్పుకూర్ అనే చెరువు ఉంది. దాని తీరంలో పలువురు బయలుకు పోయేవారు. ఉదయం పూట చెరువుకు వచ్చేవారు వాళ్లను తిట్టే తిట్లకు భూతం కూడా పలాయనం చేస్తుంది. కాని ఏ తిట్లకూ, మాటలకూ ఫలితం కనిపించలేదు; మర్నాడూ అదే కథ. కొన్ని రోజుల తరువాత కంపెనీ నుండి ఒక బంట్రోతు వచ్చి చెరువు వద్ద ఒక నోటీసు (హెచ్చరిక ఫలకం) పెట్టాడు. ఏం ఆశ్చర్యం! అక్కడ బయలుకు పోవటం పూర్తిగా ఆగిపోయింది.
“అందుకే చెబుతున్నాను. అయోగ్యులు లెక్చర్ ఇవ్వటం వల్ల ఏమీ జరుగబోదు. అధికార ముద్రను చేకొన్నప్పుడే జనులు వింటారు. భగవదనుజ్ఞ లేకుంటే జనులకు బోధించటం జరగని పని. జనులకు బోధించే వ్యక్తికి గొప్ప శక్తి ఉండాలి. కలకత్తాలో అనేకమంది హనుమాన్ పురిలు* ఉన్నారు. మీరు వారితో కలియబడాలి. (అక్కడ ఉన్న వారిని చూపుతూ) వీరంతా కేవలం గొర్రెలు.
“చైతన్యులు ఒక అవతారమూర్తి. అంత చేసిపెట్టి వెళ్లాడే, దాన్లో ఏదైనా నేడు మిగిలి ఉందా, చెప్పండి చూద్దాం. అటువంటప్పుడు ఆదేశం పొందని వ్యక్తి లెక్చర్ వల్ల ఏదైనా ప్రయోజనం ఒనగూరుతుందా?
“అందుకే భగవంతుని పాదపద్మాల వద్ద మనస్సును ఏకాగ్రం చేసుకోండి.” ఇలా చెబుతూ, శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై పాడసాగారు:
మునుగవే లోతుకు మునుగవే మనసా
సర్వేశు సౌందర్య సంద్రంబు నందు….
24.3.2 నరేంద్రునితో శ్రీరామకృష్ణులు – ‘అమృతసాగరం’
“ఈ సాగరంలో మునిగితే మరణం ఉండదు, ఇది అమృత సాగరం. నేను నరేంద్రునితో ఇలా అన్నాను: ‘భగవంతుడు రససముద్రం. ఈ సముద్రంలో నువ్వు మునుగుతావా లేదా చెప్పు! ఒక గిన్నె నిండా పానకం ఉందనుకో. నువ్వు ఈగవై ఉన్నావనుకో. ఎక్కడ కూర్చుని దాన్ని గ్రోలుతావు? చెప్పు చూద్దాం!’ అందుకు అతడు, ‘గిన్నె అంచుపై కూర్చుని తల చాపి గ్రోలుతాను. మరింత లోపలకు పోతే మునిగిపోతానే’ అన్నాడు. వెంటనే నేను ఇలా అన్నాను: ‘నాయనా ఇది సచ్చిదానంద సాగరం, దీన్లో మరణ భీతి లేదు. ఇది అమృత సాగరం.’
“భక్తి దివ్యప్రేమలలో హద్దులు దాటి పోకూడదని అజ్ఞానులే చెబుతారు. భగవత్ప్రేమకు హద్దులంటూ ఏవైనా ఉన్నాయా ఏమిటి? అందుకే, సచ్చిదానంద సాగరంలో మునిగిపోండి అని మీకు చెబుతున్నాను. భగవత్సాక్షాత్కారం లభిస్తే మరి చింత దేనికి? అప్పుడు ఆదేశం కూడా లభిస్తుంది, లోకులకు ఉపదేశమూ చేయవచ్చు.”
24.4 చతుర్థ పరిచ్ఛేదం భగవత్ప్రాప్తికి అనేకమార్గాలు – భక్తియోగమే ఈ యుగధర్మం
శ్రీరామకృష్ణులు: “ఇలా చూడు, అమృతసాగరాన్ని చేరటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎలాగైనా ఈ సాగరంలో పడిపోతే చాలు! ఒక అమృత తటాకం ఉందనుకోండి. ఎలాగైనా ఈ అమృతం ఒక చుక్క నోట పడితేనే నువ్వు అమరుడివైపోతావు. నువ్వే స్వయంగా దూకినా సరే, మెట్లగుండా మెల్లగా దిగి ఒక చుక్క త్రాగినా సరే, లేక ఎవరైనా నిన్ను త్రోసి వేసినా సరే – ఫలితం ఒక్కటే. అమృతం ఒక చుక్క రుచిచూసినా అమరత్వం సిద్ధిస్తుంది.
“అనేక మార్గాలున్నాయి. జ్ఞాన, భక్తి, కర్మ – అన్నీ వాటికి చెందినవే. ఏ మార్గంలో వెళ్లినా సరే, మనస్ఫూర్తిగా అనుసరిస్తే భగవంతుని పొందవచ్చు. సామాన్యంగా యోగం మూడు విధాలు: జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం.
“జ్ఞానయోగం: జ్ఞాని బ్రహ్మజ్ఞానం పొందగోరతాడు. ‘ఇది కాదు, ఇది కాదు’ అంటూ విచారణ చేస్తాడు. బ్రహ్మసత్యం, జగన్మిథ్య అని విచారణ చేస్తాడు; సదసద్విచారణ చేస్తాడు. విచారణ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ సమాధిస్థితి ఏర్పడుతుంది; బ్రహ్మజ్ఞానం లభిస్తుంది.
“కర్మయోగం: కర్మల ద్వారా మనస్సును భగవంతునిపై లగ్నం చేయటం. నువ్వు ఉపదేశిస్తుంటావే, అదే ఇది. ప్రాణాయామం, ధ్యానం, ధారణ మొదలైన వాటిని అనాసక్తతతో చేయటం కర్మయోగం. గృహస్థులు నిర్లిప్తతతో, ఫలాన్ని భగవంతునికి సమర్పించి, ఆయన పట్ల భక్తితో తమ విధ్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తే అది కూడా కర్మయోగమే అవుతుంది. భగవంతునికి ఫలితాన్ని సమర్పించి పూజ, జపాది కర్మలు అనుష్ఠించటమూ కర్మయోగమే అనబడుతుంది. భగవంతుని పొందటమే కర్మయోగ ధ్యేయం.
“భక్తియోగం: భగవంతుని నామ గుణకీర్తనలు మొదలైనవి చేస్తూ ఆయనపై మనస్సును లగ్నం చేయటం. కలియుగానికి భక్తియోగం సులభమైన మార్గం. భక్తియోగమే ఈ యుగధర్మం.
“కర్మయోగం ఎంతో కష్టం. నేను మునుపు చెప్పినట్లు, ప్రస్తుత కాలంలో తీరుబడి ఎక్కడ? శాస్త్రాలు పేర్కొనే కర్మల నన్నిటినీ నిర్వర్తింప సమయం ఎక్కడ ఉన్నది? కలియుగంలో మనిషి ఆయుఃప్రమాణం తక్కువ. దానికి తోడు, అనురక్తిరహితంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చేయటం బహుకష్టం. భగవత్ ప్రాప్తి కలుగకుంటే సరిగ్గా అనాసక్తతను పొందలేవు. నీకు తెలియకుండానే, ఎక్కడ నుంచో ఈ అనురక్తి వచ్చి పడుతుంది.
“జ్ఞానయోగమూ ఈ యుగానికి చాలా కష్టమైనది. ముందుగా, జీవుడు అన్న గత ప్రాణి; దానికి తోడు ఆయుస్సు తక్కువ. పైగా ఏం చేసినా దేహబుద్ధి తొలగిపోదు. దేహబుద్ధి నిర్మూలం కాకుండా జ్ఞానం పొందడం అసాధ్యం. ‘నేను బ్రహ్మాన్ని, నేను దేహాన్ని కాను; ఆకలి దప్పులు, వ్యాధి, శోకం, పుట్టుక, చావు, సుఖదుఃఖాల కన్నిటికీ నేను అతీతుడను’ అంటాడు జ్ఞాని. వ్యాధి, శోకం, సుఖం, దుఃఖంలాంటి భావనల గురించి ఎరుక ఉన్నంత వరకు నువ్వు జ్ఞానివి ఎలా అవగలవు? చేతిలో ముల్లు గుచ్చుకుంది, ధారగా రక్తం స్రవిస్తూ ఉంది, బాగా నొప్పి పెడుతోంది. ఆ స్థితిలోను, ‘చేతిలో ముల్లు గుచ్చుకోలేదు! నాకేమీ జరుగలేదే!’ అని చెప్పాలి జ్ఞాని.
24.4.1 జ్ఞాన, కర్మ మార్గాలు కలియుగంలో కష్టమైనవి
“కాబట్టి ఈ యుగానికి తగినది భక్తియోగమే. మిగిలిన మార్గాల కంటే దీని ద్వారా భగవంతుని సులభంగా చేరుకోవచ్చు. జ్ఞానయోగం, కర్మయోగం, ఇంకా అన్యమార్గాల ద్వారా కూడా భగవంతుని చేరుకోవచ్చును, కాని అవి చాలా కష్టమైనవి.
“భక్తియోగమే యుగధర్మం అని చెప్పటం వల్ల భక్తుడు ఒక గమ్యాన్ని, జ్ఞానీ లేక కర్మయోగీ మరొక గమ్యాన్ని చేరుతున్నారని అర్థం చేసుకోరాదు. బ్రహ్మజ్ఞానాన్ని పొందగోరే వ్యక్తి భక్తి మార్గాన్ని చేకొన్నప్పటికీ అదే జ్ఞానాన్ని పొందుతాడు అనే దాని అర్థం. భక్తవత్సలుడైన భగవంతుడు తలచుకుంటే బ్రహ్మజ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
24.4.2 భక్తుడు, బ్రహ్మజ్ఞానం – భక్తుని ప్రార్థన, కర్మలు
“భక్తుడు భగవంతుణ్ణి సాకారరూపంలో దర్శింపగోరతాడు, ఆయనతో మాట్లాడగోరతాడు. సామాన్యంగా అతడు బ్రహ్మజ్ఞానాన్ని కోరడు. కాని తన ఇచ్ఛమేరకు చేసేవాడు భగవంతుడు. ఆయన ఇష్టపడితే భక్తుణ్ణి సకల ఐశ్వర్యాలకూ అధిపతిని చేస్తాడు. భక్తినీ ప్రసాదిస్తాడు, జ్ఞానాన్నీ అనుగ్రహిస్తాడు. ఎలాగైనా కలకత్తా చేరుకుంటే చాలు, పిదప గఢ్ మైదానం, సొసైటీ (ఏసియాటిక్ సొసైటీ మ్యూజియం) మొదలైన అన్నిటిని సందర్శించవచ్చు. కలకత్తాను ఎలా చేరుకోవాలన్నదే ఇప్పటి సమస్య!
“జగజ్జననిని ప్రాప్తించుకున్నట్లయితే భక్తీ లభిస్తుంది, జ్ఞానమూ లభిస్తుంది. భావసమాధిలో రూపదర్శనం కలుగుతుంది, నిర్వికల్ప సమాధిలో అఖండసచ్చిదానంద దర్శనం అవుతుంది. అక్కడ ‘నేను’ అనే భావన, నామరూపాలు ఏవీ ఉండవు.
“భక్తుడు ఇలా ప్రార్థిస్తాడు: ‘అమ్మా, సకామ కర్మల పట్ల నాకు ఎంతో భయం కలుగుతోంది. ఆ కర్మలతో పాటు ఆకాంక్ష కూడా ఉన్నది, అది చేస్తే ఫలాన్ని అనుభవించ వలసి వస్తుంది. పైగా, ఉదాసీనుడనై కర్మ చేయడం ఎంతో కష్టం. సకామ కర్మలు అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు నిన్ను మరచిపోతాను, అట్టి కర్మల వలన ప్రయోజనం ఏమిటి? నిన్ను నేను పొందనంత వరకు నా కర్మలను తగ్గించు. నేను చేయవలసిన వాటినీ అనాసక్తుడనై చేసేట్లు అనుగ్రహించు. ఇందుకు తోడు ప్రగాఢ భక్తీ కలగాలి. నిన్ను పొందనంత వరకు ఏలాంటి క్రొత్త కర్మలలోను నా మనస్సు చిక్కువడకుండా ఉండాలి. కాని నువ్వు ఎప్పుడు ఆజ్ఞాపించినా నీ పనులను నిర్వర్తిస్తాను, లేకుంటే లేదు.’”
24.5 పంచమ పరిచ్ఛేదం తీర్థయాత్రలు, శ్రీరామకృష్ణులు – మూడురకాల ఆచార్యులు
శశధర్: మహాశయా! మీరు ఎక్కడి వరకు తీర్థయాత్రలు చేశారు?
శ్రీరామకృష్ణులు: కొన్ని తీర్థాలను దర్శించాను. (నవ్వుతూ) హాజ్రా చాలా దూరం వెళ్లాడు, చాలా పైకి కూడా అధిరోహించాడు. హృషీకేశ్కు వెళ్లి ఉన్నాడు (అందరూ నవ్వారు). నేను అంతదూరం వెళ్లలేదు, అంత ఎత్తూ అధిరోహించనూ లేదు.
“గ్రద్దలు, రాబందులు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయి, కాని వాటి దృష్టి శవాల గొయ్యిపైనే ఉంటుంది. (అందరూ నవ్వారు) శవాల గొయ్యి అంటే ఏమిటో తెలుసా? కామినీ కాంచనాలే.
“ఇక్కడ కూర్చునే భక్తిని పొందగలిగితే తీర్థయాత్రలకు వెళ్లవలసిన అవసరం ఏముంది? నేను కాశీ వెళ్ళి చూశాను – ఇటువంటివే చెట్లు! చింతచెట్టు ఆకులూ ఇటువంటివే!
“తీర్థయాత్రలు చేసి భక్తి కలుగకపోతే యాత్రాఫలం దక్కనట్లే. భక్తియే సారం, అదొక్కటే ప్రయోజనకరమైనది. గ్రద్దలు, రాబందులు అంటే ఎవరో తెలుసా? అనేకులు పెద్దపెద్ద విషయాలు మాట్లాడతారు; ‘శాస్త్రాలు పేర్కొంటున్న కర్మలలో అనేకమైన వాటిని మేము అనుష్ఠించాం!’ అంటూంటారు. కాని వారి మనస్సు విషయ లోలత్వంలో మునిగి ఉంటుంది. డబ్బు దస్కం, పేరు ప్రతిష్ఠలు, శారీరక సుఖాలలో నిమగ్నమై ఉంటుంది.”
శశధర్: అవునండీ. తీర్థయాత్రలు చేయడం కౌస్తుభమణిని వదలిపెట్టి తక్కిన వజ్రాలను వెదకటం లాంటిది.
శ్రీరామకృష్ణులు: మీరు ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఉపదేశాలు ఇచ్చినప్పటికీ తగిన సమయం రాకుండా ఏదీ జరగదు. బిడ్డ పడుకోబోయేటప్పుడు తల్లితో, ‘అమ్మా, నాకు బయలుకు వచ్చేటప్పుడు నన్ను లేపు’ అన్నాడు. అందుకు తల్లి, ‘నాయనా, ఆ భావనే నిన్ను లేపుతుంది, అందుకోసం ఆదుర్దా పడవద్దు’ అని చెప్పింది. (నవ్వులు) అదే విధంగా, భగవంతుని కొరకు వ్యాకులత చెందటమన్నది తగిన సమయం ఏతెంచినప్పుడు తానుగానే ఏర్పడుతుంది.
24.5.1 యోగ్యతను బట్టి ఉపదేశం – భగవంతుడు దయామయుడా?
“మూడు రకాల వైద్యులున్నారు: ఒక రకంవారు నాడి పరీక్షిస్తారు, ఔషధం వ్రాసి ఇస్తారు, తమపాటికి తాము వెళ్లిపోతారు. రోగితో, ‘ఔషధం పుచ్చుకో, అర్థమైందా?’ అని మాత్రం చెబుతారు. వీరు అధమరకం వైద్యులు. ఇదే విధంగా కొందరు ఆచార్యులు ఉపదేశం చేసి వెళ్లిపోతారు. ఉపదేశం వల్ల ఆ వ్యక్తికి మేలు ఒనగూరుతూ ఉన్నదా, కీడు వాటిల్లుతూ ఉందా అని కూడా చూడరు; అతడి గురించి తరువాత యోచించనే యోచించరు.
“మరికొంతమంది వైద్యులు ఉన్నారు. వారు ఔషధం వ్రాసి ఇచ్చి రోగిని పుచ్చుకోమంటారు. అందుకు రోగి తిరస్కరిస్తే అతడికి నానారకాలుగా చెప్పి చూస్తారు. వీరు మధ్యరకం వైద్యులు. ఇట్లే మధ్యరకం ఆచార్యులు ఉన్నారు. వీరు ఉపదేశం చేస్తారు. దానితోబాటు, జనులు వాటిని అనుసరించేటట్లు పలురకాలుగా చెప్పి చూస్తారు.
“ఉత్తమ తరగతి వైద్యులు తీయని మాటలతో రోగి ఔషధం పుచ్చుకోకుంటే అతణ్ణి బలవంతపెడతారు. అవసరమైతే, రోగి రొమ్ముపై మోకాలు ఉంచి ఔషధం నోట్లో పోస్తారు. ఈ విధంగానే ఉత్తమ తరగతి ఆచార్యులు ఉన్నారు. వారు శిష్యులను భగవన్మార్గగాములను చేసే ప్రయత్నంలో బలప్రయోగమూ చేస్తారు.”
శశధర్: మహాశయా! ఉత్తమ తరగతి ఆచార్యులు ఉన్నప్పుడు తగిన సమయం రానిదే జ్ఞానం కలుగదని ఎందుకు అంటున్నారు?
శ్రీరామకృష్ణులు: అది నిజమే. కాని ఔషధం కడుపులోకి పోకపోతే, అంటే నోటి గుండా బయటకు కారిపోతే వైద్యుడు ఏం చేయగలడు? ఉత్తమ తరగతి వైద్యుడైనా ఏమీ చేయలేడే! యోగ్యతను బట్టి ఉపదేశించాలి. మీరు యోగ్యత నెరిగి ఉపదేశం చేయటం లేదు. నా వద్దకు ఎవరైనా యువకుడు వచ్చినప్పుడు మొదట, ‘నీకు ఎవరెవరు ఉన్నారు?’ అని అతణ్ణి అడుగుతాను. ఒకవేళ అతడికి తండ్రి లేడు, లేక తండ్రికి ఋణాలు ఉన్నాయనుకో. అటువంటి వ్యక్తి భగవంతునిపై మనస్సును ఎలా నిలుపగలడు? నేను చెబుతూన్నది వింటున్నారా?
శశధర్: అవునండీ. అంతా శ్రద్ధగా వింటున్నాను.
శ్రీరామకృష్ణులు: ఒక రోజు కాళికాలయానికి కొందరు సిక్కు సైనికులు రావటం జరిగింది. ఆలయం ముందు వారిని కలుసుకున్నాను. వారిలో ఒకడు, ‘భగవంతుడు దయామయుడు’ అన్నాడు. అందుకు నేను, ‘అలాగా? నిజంగానా? నువ్వా విషయం ఎలా తెలుసుకున్నావు?’ అని అడిగాను. అందుకు అతడు, ‘స్వామీ, భగవంతుడు మనకు ఆహారం అందిస్తున్నాడు, మనలను సంరక్షిస్తున్నాడు!’ అని చెప్పాడు. ‘దీన్లో ఆశ్చర్యపోవలసిన దేముంది? భగవంతుడు సర్వులకూ తండ్రి కదా! పిల్లలను తండ్రి పోషించక మరెవరు పోషిస్తారు? ఊళ్లోవాళ్లు పోషిస్తారా?’ అని అడిగాను.
నరేంద్రుడు: అలా అయితే భగవంతుణ్ణి దయా మయుడని చెప్పకూడదా?
శ్రీరామకృష్ణులు: ఆయనను దయామయుడు అని చెప్పటాన్ని ఎవరు కాదంటారు? నేను చెప్పట మేమంటే భగవంతుడు మనకు సొంతమైనవాడు, పరాయివాడు కాదనే. (BG 2.59, Brihadaranyaka Upanishad 2.4.5)
శశధర్: అమూల్య వచనాలు!
శశధర్ పండితుడు
శ్రీరామకృష్ణులు (నరేంద్రునితో): నీ పాట విన్నాను, నాకు నచ్చలేదు. అందుకే లేచి వెళ్లిపోయాను. నీ మనస్సు ఉద్యోగాన్వేషణలో ఉంది, అందుచేతనే పాట రక్తికట్టలేదు.
నరేంద్రుని ముఖం సిగ్గుచే ఎర్రబారింది. అతడు మౌనం వహించాడు.
24.6 షష్ఠ పరిచ్ఛేదం ‘విదియ చంద్రుడు’
శ్రీరామకృష్ణులు మంచినీళ్లు త్రాగగోరారు. ఆయన ప్రక్కన ఒక గ్లాసులో నీరు ఉంది. కాని ఆయన త్రాగలేకపోయారు. తాజానీరు తెమ్మన్నారు. ఇంద్రియ వాంఛలలో మునిగివున్న వ్యక్తి ఒకడు ఆ నీటిని తాకి ఉన్నాడని తరువాత తెలిసింది.
శశధర్ (హాజ్రాతో): మీరందరూ వీరితో రేయింబవళ్లు వసిస్తూ ఉన్నారు. పరమానందంలో ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నేడు నాకు సుదినం, నేడు విదియ చంద్రుని గాంచాను. (అందరూ నవ్వారు) విదియ చంద్రుడని ఎందుకు అన్నానో తెలుసా? ‘నువ్వు పున్నమి చంద్రుడివి, రాముడు విదియ చంద్రుడు’ అని సీత రావణునితో చెప్పింది. దీన్ని అర్థం చేసుకోకుండా రావణుడు ఎంతో సంబరపడిపోయాడు. సీత చెప్పిన దాన్లోని అర్థం ఏమిటో తెలుసా? రావణుని గొప్పతనం ఎంత పెరగాలో అంత పెరిగింది, ఇక పున్నమి చంద్రునిలా నానాటికీ క్షీణించిపోతుంది. రాముడు విదియ చంద్రుడు, అతడి గొప్పతనం దినదినప్రవర్ధమాన మవుతుంది.
శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. శశధర్ పండితుడు తన మిత్రులతో పాటు ఆయనకు ప్రణమిల్లాడు. ఆయన, భక్తులతో పాటు బయలుదేరి ఈశాన్ ఇంటికి తిరిగి వచ్చేశారు.
24.7 సప్తమ పరిచ్ఛేదం
మునిమాపు వేళ. ఈశాన్ ఇంట్లో తూర్పు వైపున ఉన్న అతిథుల గదిలోకి వెళ్లి శ్రీరామకృష్ణులు కూర్చున్నారు. ఒకరిద్దరు భక్తులు ఉన్నారు. భాగవత పండితుడు, ఈశాన్, అతడి కుమారులూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ‘చెట్టును ఎక్కక మునుపే పళ్లు కోసుకోవాలని ఆశిస్తున్నావే, ఇంకొన్ని సాధనలు చెయ్యి, తరువాత జనానికి ఉపదేశించు’ అని శశధర్తో చెప్పాను.
ఈశాన్: ప్రతి ప్రబోధకుడూ తాను జనానికి ఉపదేశిస్తూ ఉన్నట్లే భావిస్తున్నాడు. తానే లోకానికి వెలుగును ఇస్తూ ఉన్నట్లుగా మిణుగురు పురుగు భావిస్తుంది. దాన్ని చూసిన ఒకడు, ‘ఓ మిణుగురు పురుగా! నువ్వు ఏం వెలుగును ఇవ్వగలవు? నువ్వు చీకటిని కారుచీకటిగా చేస్తూ ఉన్నావు’ అని అన్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): కాని శశధర్ కేవలం పండితుడు మాత్రమే కాదు; ఒకింత వివేక వైరాగ్యాలూ అతడిలో ఉన్నాయి.
భాట్పాడాకు చెందిన భాగవత పండితుడు ఇంకా కూర్చునే ఉన్నాడు. అతడికి డెబ్భై లేక డెబ్భై ఐదేళ్లు ఉండవచ్చు. అతడు శ్రీరామకృష్ణులను తదేకదృష్టితో చూస్తూ ఉన్నాడు.
భాగవత పండితుడు (శ్రీరామకృష్ణులతో): మీరు మహాత్ములు!
శ్రీరామకృష్ణులు: నారదుడు, ప్రహ్లాదుడు, శుకదేవులను మీరు అలా పేర్కోవచ్చు. నేను మీ కుమారుని వంటివాణ్ణి. కాని ఒక రీతిలో అలా చెప్పవచ్చు. ఎలాగంటే – భక్తుడు గొప్పవాడు, కారణం భక్తుడు భగవంతుని తన హృదయంలో మోస్తూ తిరుగుతున్నాడు. (అందరూ ఆనందించారు) ‘భక్తుడు తనను పెద్దవాడిగాను భగవంతుణ్ణి చిన్నవాడిగాను ఎంచుతాడు’ అని వైష్ణవ గ్రంథాలలో చెప్పబడి ఉంది. యశోద కృష్ణుని కట్టివేయబోయింది. నేను అతణ్ణి చూసుకోకుంటే ఎవరు చూసుకుంటారు అనేదే ఆమె విశ్వాసం. కొన్ని సందర్భాలలో భగవంతుడు అయస్కాంతంగాను భక్తుడు సూదిగాను ఉంటాడు. భగవంతుడు భక్తుని ఆకర్షించి తన వద్దకు లాక్కొంటాడు. మరో సమయంలో భక్తుడు అయస్కాంతంగా మారతాడు, భగవంతుడు సూదిగా మారతాడు. భక్తుని ప్రేమకు వశుడై భగవంతుడు అతడికి పట్టుబడతాడు; భక్తుని వశీకరణం అంత మేరకు ఉంది!
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ల ఉద్యుక్తులైనారు. అతిథుల గదికి దక్షిణంగా ఉన్న వసారాలోకి వచ్చి నిలబడ్డారు. ఈశాన్ తదితరులూ వచ్చి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు ఈశాన్కు పలు ఉపదేశాలు చేశారు.
శ్రీరామకృష్ణులు (ఈశాన్తో): గృహస్థుగా ఉంటూ భగవంతుని ప్రార్థించే వ్యక్తి నిజంగానే వీరభక్తుడు. ‘సంసారాన్ని త్యజించిన వ్యక్తి నన్ను తప్పక ప్రార్థిస్తాడు, నాకు తప్పక సేవలు చేస్తాడు. దాన్లో ఏం గొప్పతనం ఉంది! అతడు నన్ను ప్రార్థింపకుంటే అందరూ అతణ్ణి ఛీకొడతారు. కాని ఎవడు సంసారంలో ఉంటూ నన్ను ప్రార్థిస్తాడో, అడ్డంకిగా ఉన్న పెద్ద బండరాయిలాంటి అవరోధాలను వైదొలగిస్తూ నన్ను ప్రార్థిస్తాడో అతడే ధన్యుడు. అతడే ఘనుడు, అతడే వీరపురుషుడు’ అని భగవంతుడు భావిస్తాడు.
భాగవత పండితుడు: శాస్త్రాలు అట్లే పేర్కొంటున్నాయి. ధర్మవ్యాథుడు – పతివ్రత కథ ఉంది కదా! ‘నేను కాకిని దగ్ధం చేసి వేశాను, కొంగను బూడిద చేసివేశాను. అందుకే నేను ఉన్నతగతిని పొంది ఉన్నాను’ అని తపస్వి భావించాడు. అతడు పతివ్రత ఇంటికి వెళ్లాడు. ఆమెకు భర్త పట్ల అపార భక్తిశ్రద్ధలు. రేయింబవళ్లు భర్తకు సేవలు చేస్తూ ఉంటుంది. అతడు ఇంటికి వస్తే కాళ్లు చేతులు కడుగుకోటానికి నీళ్లు అందిస్తుంది, తన జడతో అతడి కాళ్లు తుడుస్తుంది! తపస్వికి భిక్ష లభించటంలో జాప్యం జరిగింది. ‘ఇది మీకు మంచిదికాదు’ అన్నాడతడు బిగ్గరగా. పతివ్రత లోపలనుండే, ‘ఇది కాకిని, కొంగను దగ్ధం చేయటం లాంటిది కాదు! కాస్త ఓపికపట్టండి. నా భర్తను సేవించటం పూర్తిచేశాక మిమ్మల్ని పూజిస్తాను’ అని బదులు పలికింది.
“తరువాత ఆ పతివ్రత సూచన మేరకు, ఆ తపస్వి బ్రహ్మజ్ఞానం పొందే నిమిత్తం ధర్మవ్యాథుని వద్దకు వెళ్లాడు. అతడో మాంసం విక్రయిస్తూ ఉన్నాడు, కాని తల్లితండ్రులను సాక్షాత్తూ భగవంతునిగా భావించి రేయింబవళ్లు వారిని సేవించుకొంటున్నాడు. బ్రహ్మజ్ఞానార్థం అతడి వద్దకు వెళ్లిన తపస్వి ఆశ్చర్యపోయాడు. ‘ఈ వ్యాథుడు మాంసం విక్రయిస్తున్నాడు. ఇతడు సంసారంలో ఉన్నవాడు. నాకు ఇతడేం బ్రహ్మజ్ఞానం ఇవ్వగలడు!’ అని తలపోయసాగాడు. కాని ఆ వ్యాథుడు పూర్ణబ్రహ్మజ్ఞాని.”
తరువాత శ్రీరామకృష్ణులు బండిలో ఎక్కారు. ప్రక్కింటి వారు (ఈశాన్ మామగారింటివారు) వాకిలి వద్ద నిలబడి ఉన్నారు. ఈశాన్, తక్కిన భక్తులు శ్రీరామకృష్ణులను సాగనంప ప్రక్కన నిలబడి ఉన్నారు. ఆయన మళ్లీ ఈశాన్కు ఇలా ఉపదేశించారు: “సంసారంలో చీమలా ఉండు. ఈ ప్రపంచంలో నిత్యానిత్యాలు కలగలసి ఉన్నాయి; ఇసుక, చక్కెర కలిసిపోయి ఉన్నవి. చీమలా చక్కెరను మాత్రం ఏరుకో. పాలూ నీరూ కలిసి ఉన్నాయి; సచ్చిదానంద రసము, విషయ సుఖాల రసమూ కలిసి ఉన్నాయి. హంసలా కేవలం పాలు స్వీకరించి నీటిని వదిలివేయి. బాతులా ఉండు. నీరు దాని వంటిమీద పడుతుంది. వెంటనే అది నీటిని విదిలించి వేస్తుంది. బురద చేపలా ఉండు. బురదలో అది వసిస్తుంది; కాని దాని దేహం శుద్ధంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. గోల్‌మాల్‌లో మాల్ (కావలసిన వస్తువు) ఉంది; గోల్ (అవాస్తవమైనది) వదలిపెట్టి మాల్ తీసుకో.”
శ్రీరామకృష్ణులు బండిలో దక్షిణేశ్వరానికి బయలుదేరారు.