19.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో రాఖాల్, ‘మ’, మహిమా ప్రభృత భక్తులతో
శనివారం, ఫిబ్రవరి 2, 1884
19.1.1 శ్రీరామకృష్ణుల చేతికి గాయం – బాలునిలా జగజ్జననితో సంభాషణ
మధ్యాహ్నం మూడు గంటలయింది. దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చుని ఉన్నారు. ఒక రోజు ఆయన సరుగుడు తోపుకు వెళుతు న్నప్పుడు భావపారవశ్య స్థితి నొందారు. వెంట ఎవరూ లేనందున కంచె ప్రక్కన పడిపోయారు. అందుచేత ఆయన ఎడమచేతి ఎముక ఒకటి ప్రక్కకు జరిగింది. బాగా దెబ్బ తగిలింది కూడా. కలకత్తా భక్తుల నుండి కట్టుకట్టడానికి బ్యాండేజి, మందులు, గుడ్డ మొదలైన వస్తువులు ‘మ’ తీసుకు వచ్చాడు.
రాఖాల్, మహిమాచరణ్, హాజ్రా మొదలైనవారు గదిలో ఉన్నారు. ‘మ’ రాగానే శ్రీరామకృష్ణులకు సాష్టాంగ దండప్రణామం చేశాడు.
శ్రీరామకృష్ణులు: ఏమోయ్! నీకు సుస్తీ చేసిందటగా? ఇప్పుడు నయమేనా?
‘మ’ : అవునండీ, ఇప్పుడు బాగానే ఉన్నాను.
శ్రీరామకృష్ణులు (మహిమాచరణ్తో): ఏమోయ్, ‘నేను యంత్రాన్ని, అమ్మ దాన్ని నడుపుతుంది’ – మరి అటువంటప్పుడు ఇలా ఎందుకు జరిగింది?
పన్నెండు సం ॥ క్రితం తాను చేసిన తీర్థయాత్రల గురించి మహిమాచరణ్ చెబుతున్నాడు. శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చునే ఆ కథనం వింటున్నారు.
మహిమా: కాశీలో సిక్రోలిలోని ఒక తోటలో బ్రహ్మచారి ఒకరిని చూశాను. ‘ఇరవై ఏళ్లుగా ఈ తోటలో వసిస్తూ ఉన్నాను. కాని ఈ తోట సొంతదారుడెవరో నాకు తెలియదు’ అన్నాడతడు. తరువాత నాతో, ‘మీరేదైనా ఉద్యోగం చేస్తున్నారా?’ అని అడిగాడు. ‘లేదు’ అన్నాను. అందుకు ఆతడు, ‘మీరు పరివ్రాజక సన్న్యాసులా?’ అని అడిగాడు. నర్మదా నదీతీరంలో ఒక సాధువును చూశాను. అంతరంగాన గాయత్రీ మంత్రం జపిస్తూ ఉన్నాడు; అప్పుడతడికి రోమాంచితమైంది. ఆతడు ఓంకారాన్ని, గాయత్రీ మంత్రాన్ని బిగ్గరగా జపిస్తూ ఉన్నప్పుడు ప్రక్కన ఉన్న వారికి శరీరం పులకరించేది.
శ్రీరామకృష్ణులది పసిబాలుని భావం కదా! ఆకలి వేయగానే ‘మ’ తో, “ఏమిటి? ఏదన్నా తెచ్చావా?” అని అడిగారు. రాఖాల్ను చూస్తూ సమాధి మగ్నులయ్యారు. కొంతసేపటికి కాస్త బాహ్యస్మృతి కలిగినంతనే, సహజస్థితికి రావటానికై, “నేను జిలేబీ తింటాను”, “నీళ్లు త్రాగుతాను” అని అన్నారు.
ఒక పసిబాలునిలా ఏడుస్తూ జగజ్జననితో, “ఓ, బ్రహ్మమయీ! నన్ను ఎందుకు ఇలా చేశావు? చేయి బాగా నొప్పిగా ఉంది” అన్నారు.
తరువాత రాఖాల్, మహిమాచరణ్, హాజ్రా ప్రభృతులను చూసి, “నా చెయ్యి బాగవుతుందా?” అని పిల్లవాడిలా అడిగారు. భక్తులూ పిల్లవాణ్ణి బుజ్జగిస్తున్న ధోరణిలో, “నిశ్చయంగా బాగవుతుంది” అన్నారు.
శ్రీరామకృష్ణులు (రాఖాల్తో): నన్ను చూసుకోవటానికే గదా నువ్వు ఇక్కడ ఉన్నావు. అయినా నీ తప్పు లేదులే! ఎందుకంటే నువ్వు ఉన్నా కూడా రెయిలింగ్ (కంచె) వరకు వచ్చి ఉండేవాడివి కాదు కదా!
19.1.2 “బ్రహ్మజ్ఞానానికి శతకోటి దణ్ణాలు – నేను యంత్రాన్ని, నువ్వు యంత్రం నడిపేదానవు”
శ్రీరామకృష్ణులు మళ్లీ భావపారవశ్యులై మాట్లాడారు: “ఓం, ఓం, ఓం – అమ్మా, నేను ఏమంటున్నాను! అమ్మా! బ్రహ్మజ్ఞానం ద్వారా నన్ను బాహ్య స్పృహరహితుని చేయకు. అమ్మా నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించవద్దు! అమ్మా! భయంతో బెదరిపోతున్నాను! నేను నీ బిడ్డను! నాకు కావలసింది అమ్మే. బ్రహ్మజ్ఞానానికి కోటి దణ్ణాలు. దాన్ని కోరిన వారికే ఇవ్వు. ఓ ఆనందమయీ! ఆనందమయీ!”
శ్రీరామకృష్ణులు బిగ్గరగా, “ఆనందమయీ! ఆనందమయీ!” అంటూ విలపిస్తూ పాడసాగారు:
అమ్మా! అమ్మా! నన్నీ ఖేదము
వ్యధతో హృదయము పిండుచున్నదే…..
శ్రీరామకృష్ణులు మళ్లీ జగజ్జననిని ప్రార్థించసాగారు: “అమ్మా! నేను ఏం తప్పు చేశాను? అమ్మా, నేను స్వయంగా ఏదన్నా చేస్తున్నానా? నువ్వే కదా సమస్తం చేస్తూన్నావు! నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపేదానవు. (రాఖాల్తో, నవ్వుతూ) నుమ్వా ఇదేలా పడిపోకు! చూసి వెళ్ళు, తొందరపాటులో అపాయం సంభవించకుండా జాగ్రత్తగా ఉండు.” మళ్లీ జగజ్జననితో, “అమ్మా! నొప్పి కారణంగా నేను విలపిస్తున్నానా? కాదు!” –
అమ్మా! అమ్మా! నన్నీ ఖేదము….
19.2 ద్వితీయ పరిచ్ఛేదం మనోవ్యాకులతతో ప్రార్థించాలి
శ్రీరామకృష్ణులు మళ్లీ పసిబాలునిలా నవ్వారు, మాట్లాడారు. సుస్తీ చేసిన పసిపిల్ల ఎలా నవ్వుతూ ఏడుస్తూ ఉంటుందో అలా ఉంది ఆయన స్థితి. మహిమాచరణాదులతో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ఇదుగో చూడండి. సచ్చిదానందాన్ని పొందకుంటే అంతా వ్యర్థమే నాయనా! వివేక వైరాగ్యాలను మించిన వస్తువు వేరే ఏమీ లేదు. సంసారాసక్తుల భగవత్ప్రేమ క్షణభంగురం. ఎర్రగా కాలిన ఇనుప పెనం మీద నీటిచుక్క ఎంతసేపు ఉంటుంది? అదే రీతిలో ఒక పువ్వును చూస్తే చాలు, ‘ఆహా! భగవంతుడి సృష్టి మహిమ ఎంత గొప్పది!’ అంటూ విస్తుబోతారు.
“వ్యాకులత కావాలి. తన వాటా ఆస్తికై కుమారుడు గగ్గోలు పెడితే తల్లితండ్రులు సమాలోచించుకుని, నిర్ణీత కాలానికి మునుపే అతడికి వాటా పంచి ఇస్తారు. మనోవ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుడు వినే తీరుతాడు. ఆయన మనకు జన్మనిచ్చినప్పుడే ఆయన గృహంలో మనకు వాటా కూడా ఏర్పడింది. ఆయన మన సొంత తండ్రి, సొంత తల్లి. ఆయన వద్ద మనం పట్టుపట్టవచ్చు – ‘నా ముందుకు రా, లేకుంటే కత్తితో గొంతు కోసుకుంటాను!’ అంటూ ఆయనను నిలదీయవచ్చు!”
జగజ్జననిని ఎలా ప్రార్థించాలో శ్రీరామకృష్ణులు నేర్పుతున్నారు.
శ్రీరామకృష్ణులు: నేను కొన్ని సమయాల్లో ‘అమ్మా! ఆనందమయీ! నువ్వు దర్శనం ఇచ్చే తీరాలి’ అని బలవంతపెట్టేవాణ్ణి. కొన్ని సందర్భాలలో, ‘ఓ! దీననాథా, జగన్నాథా! నేను నీ జగత్తులోని వాడినే! నేను జ్ఞానహీనుడను, సాధనహీనుడను, భక్తిహీనుడను, నాకేమీ తెలియదు. దయ చూపి, నీ దర్శనం ఇచ్చి తీరవలసిందే’ అని ప్రార్థించేవాడను.
శ్రీరామకృష్ణులు భగవంతుని ఏ విధంగా ప్రార్థించారో కరుణ పొంగిపొరలే కంఠస్వరంలో భక్తులకు విశదపరుస్తున్నారు. ఆయన కరుణాపూరిత కంఠస్వరం విని భక్తుల హృదయాలు కరిగిపోయాయి. మహిమాచరణ్ కళ్లు ఆర్ద్రమైనాయి. మహిమాచరణ్ను చూసి శ్రీరామకృష్ణులు పాడారు :
అమ్మా! శ్యామా! యని నీ వార్తితొ
ఆక్రోశించిన ఓ మనసా
ఆవేదన గని ఆగగల్గునా
అమ్మ శ్యామ నీ కగుపడకుండగ…..
19.3 తృతీయ పరిచ్ఛేదం శివపూర్ భక్తులు – డా ॥ మధు
శివపూర్ నుంచి పలువురు భక్తులు వచ్చి ఉన్నారు. వారు చాలాదూరం నుంచి శ్రమపడి వచ్చినందున శ్రీరామకృష్ణులు మౌనం వహించక వారితో ఆధ్యాత్మిక జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (శివపూర్ భక్తులతో) : భగవంతుడొక్కడే సత్యం, తక్కినదంతా మిథ్య. యజమాని, అతడి తోట వలె భగవంతుడు ఆయన ఐశ్వర్యమూ. లోకులు తోటను చూస్తారేగాని యజమాని కోసం ఎందరు వెదకుతారు?
భక్తుడు: మహాశయా, మరి తరణోపాయం?
శ్రీరామకృష్ణులు: సదసత్ విచారణ, భగవంతుడే సత్యం, తక్కినదంతా మిథ్య– ఇలా సర్వదా విచారణ చేయండి. వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించాలి.
భక్తుడు: మహాశయా, వాటికంతా తీరిక ఎక్కడుంది?
శ్రీరామకృష్ణులు: తీరిక ఉన్న వారు ధ్యానం, భజనలు చేయాలి. బొత్తిగా తీరిక దొరకనివారు రోజూ రెండుసార్లు హృదయపూర్వకంగా భగవంతునికి ప్రణమిల్లాలి. ఆయన అంతర్యామి, మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. మీకు అనేక వ్యాపకాలు. ఆయనను ప్రార్థించడానికి మీకు తీరిక ఉండదు; ఆయనకు ముఖ్తార్నామా ఇచ్చివేయండి. కాని ఆయనను పొందకుంటే, ఆయన దర్శనం కాకుంటే అంతా వ్యర్థమే.
మరో భక్తుడు: మహాశయా, మిమ్మల్ని చూస్తే భగవంతుణ్ణి చూసినట్లే.
శ్రీరామకృష్ణులు: మరోసారి అలా అనవద్దు; అలలు గంగకు చెందినవి, గంగ అలలకు చెందదు. ‘నేనొక గొప్ప వ్యక్తిని’, ‘నేను ఇలాంటి వాడను’ – ఇటువంటి అహంకారం నశించకుంటే భగవంతుని దర్శించలేం. ‘నేను’ అనే మట్టి గుట్టను భక్తి అనే కన్నీళ్లతో కరిగించి నేలమట్టం చేసివేయాలి.
19.3.1 సంసారానికి కారణం ఏమిటి? – భోగవాంఛలు తీరితేనే వ్యాకులత
భక్తుడు: భగవంతుడు మమ్మల్ని సంసారంలో ఎందుకు ఉంచాడు?
శ్రీరామకృష్ణులు: సృష్టి కొనసాగటానికి. అది ఆయన సంకల్పం; ఆయన మాయ. కామినీకాంచనాల ద్వారా మనలను మైమరపిస్తూ ఉన్నాడు.
భక్తుడు: ఎందుకు మైమరపించాలి? ఆయన సంకల్పం ఎందుకు ఇలా ఉంది?
శ్రీరామకృష్ణులు: ఒక్కమారు ఆయన భగవదానందాన్ని చవిచూపితే ఆ తరువాత ఎవరూ సంసార జీవితం గడపరు, సృష్టి కూడా కొనసాగదు.
“బియ్యాన్ని పెద్ద పెద్ద బస్తాలలో గిడ్డంగిలో వ్యాపారి నిల్వచేసి ఉంటాడు. ఎలుకలు ఆ వైపుకు రాకుండా ఒక చేటలో కొంచెం చక్కెర కలిపిన పేలాలను ఉంచుతాడు. ఆ చక్కెర రుచిలో మైమరచిన ఎలుకలు రేయి అంతా ఆ పేలాలను కొరుకుతూ ఉంటాయి; బియ్యం కొరకు వెదుకవు. కాని కాస్త యోచించి చూడు, ఒక సేరు వడ్లతో పధ్నాలుగు సేరుల పేలాలు తయారవుతాయి. కామినీ కాంచన సుఖం కంటే భగవదానందం చాలా రెట్లు అధికం! భగవద్రూపాన్ని చింతన చేస్తే రంభ, తిలోత్తమాదుల సౌందర్యం కూడా చితాభస్మంలా తోస్తుంది.”
భక్తుడు: భగవంతుణ్ణి పొందాలనే వ్యాకులత ఎందుకు కలుగదు?
శ్రీరామకృష్ణులు: భోగవాంఛలు తీరనంత వరకు మనోవ్యాకులత జనించదు. కామినీకాంచనాల పట్ల ఉన్న తృష్ణ మేరకు తృప్తి కలగని పక్షంలో జగజ్జనని జ్ఞాపకమైనా రాదు. పిల్లవాడు ఆటల్లో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు తల్లికోసం వెదుకడు. ఆట పూర్తికాగానే, ‘అమ్మ వద్దకు వెళతాను’ అంటాడు.
“హృదయ్ కుమారుడు పావురాళ్లతో ఆడుకుంటూ, ‘రా, రా, దగ్గరకు రా’ అని వాటిని పిలుస్తూ, బుజ్జగిస్తూ ఉన్నాడు. పావురాళ్లతో ఆడుకోవటంలో ఆసక్తి తీరిపోవటంతో ఏడ్వసాగాడు. అప్పుడు ఎవరో అపరిచిత వ్యక్తి అతడి వద్దకొచ్చి, ‘రా! నిన్ను మీ అమ్మ వద్దకు తీసుకొనిపోతాను’ అన్నాడు. వెంటనే అతడి భుజం మీద ఎక్కి భయం లేకుండా వెళ్లాడు.
“నిత్యసిద్ధులకు గృహస్థ జీవితంలోకి అడుగు పెట్టవలసిన అవసరం లేదు. వారికి భోగాసక్తి జన్మతః తీరిపోతుంది.”
19.3.2 డా ॥ మధు – నామ మాహాత్మ్యం
సాయంత్రం ఐదు గంటలయింది. శ్రీరామకృష్ణుల చేతికి కట్టు కట్టడానికి డాక్టర్ మధు వచ్చాడు. శ్రీరామకృష్ణులు పసిబాలునిలా నవ్వుతూ డాక్టర్‌తో, “ఇహపరాలకు మధుసూదనుడే” అన్నారు.
డా ॥ మధు (నవ్వుతూ): పేరు గొప్ప, ఊరు దిబ్బ.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఎందుకు? పేరు ఏమన్నా సామాన్యమైనదా? భగవంతుడూ, ఆయన నామమూ వేరు కావు. కృష్ణుని బరువుకు సరితూగేట్లు సత్యభామ బంగారం, మణిమాణిక్యాలన్నీ వేసినప్పటికీ సరితూగలేదు. రుక్మిణి, కృష్ణుని నామాన్ని ఒక తులసీదళంపై వ్రాసి త్రాసులో వేసింది; బరువు సరితూగింది!
శ్రీరామకృష్ణుల చేతికి కట్టు కట్టడానికి నేల మీద చాప పరిచారు. ఆయన నవ్వుతూ చాప మీద పరుండి రాగయుక్తంగా ఈ అర్థం వచ్చేట్లు పాడారు: “అయ్యో! రాధ ప్రేమ స్థితులలో చివరి స్థితి ఇదా! కాదు. ఇంకా ఎన్నో లీలలున్నాయి కదా అని బృంద అంటోంది.”
భక్తులు ఆయన చుట్టూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు మళ్లీ ఈ అర్థం వచ్చేట్లు పాడారు: “గోపికలు సరోవర తీరాన రాధను చుట్టుముట్టి కూర్చున్నారు.”
శ్రీరామకృష్ణులు నవ్వారు. భక్తులూ నవ్వారు. కట్టు కట్టిన తరువాత ఆయన ఇలా అన్నారు: “నాకు కలకత్తా డాక్టర్లలో అంత నమ్మకం లేదు. ఒకసారి శంభుకు జ్వరం వచ్చి, తీవ్రమై సంధి జనించి ప్రేలాపన చేయసాగాడు. కాని డాక్టర్ సర్వాధికారి, ‘అదేం లేదు. మందు కారణంగా కాస్త వణుకు, అంతే’ అని చెప్పాడు. కాని కాసేపటికే శంభు* మరణించడం కూడా జరిగింది.”
19.4 చతుర్థ పరిచ్ఛేదం మహిమా చరణ్‌కు ఉపదేశం
కాళికాలయంలో సంధ్యాహారతులు ముగిశాయి. కొంతసేపటికి కలకత్తా నుండి అధర్సేన్ వచ్చాడు. శ్రీరామకృష్ణులకు సాష్టాంగ దండప్రణామం చేశాడు. మహిమాచరణ్, రాఖాల్, ‘మ’ ప్రభృతులు గదిలో ఉన్నారు. హాజ్రా గదిలోకి మధ్యమధ్యన వచ్చి పోతూ ఉన్నాడు.
అధర్: మీరెలా ఉన్నారు?
శ్రీరామకృష్ణులు (ఆప్యాయంగా): ఇదుగో చూడు! చేతికి దెబ్బ తగిలింది. (నవ్వుతూ) మరేం చెప్పను!
అధర్ భక్తులతో పాటు నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు అధర్తో, “ఇక్కడ కాస్త ఒత్తు” అన్నారు.
అధర్ చిన్నమంచం మీద ఉత్తరపు అంచున కూర్చుని శ్రీరామకృష్ణుల సేవలో నిమగ్నుడయ్యాడు. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో మాట్లాడసాగారు.
19.4.1 అహేతుక భక్తి – స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి
శ్రీరామకృష్ణులు (మహిమాచరణ్తో): అహేతుక భక్తిని గనుక నువ్వు సంపాదించుకోగలిగితే చాలా మంచిది. ‘ప్రభూ! నాకు ముక్తి, కీర్తి, సంపద, రోగ నివారణ – ఇవేవీ అక్కర్లేదు. కేవలం నిన్ను మాత్రమే కోరుకుంటాను’ – ఇదే అహేతుక భక్తి.
“పలువురు పలు కోర్కెలతో ధనవంతుల వద్దకు వస్తూ ఉంటారు. కాని ఎవరైనా ఒకరు ఏ స్వార్థ తలంపు లేకుండా వచ్చి, కేవలం ప్రేమతో ‘అయ్యగారిని కలవడానికి వచ్చాను’ అన్నట్లయితే అతడి పట్ల ఆ ధనవంతునికి ప్రేమ జనిస్తుంది. ప్రహ్లాదునిది అహేతుక భక్తి; అతడు భగవంతుని పట్ల శుద్ధ, నిష్కామ ప్రేమను కలిగి ఉండేవాడు.”
మహిమాచరణ్ మౌనంగా ఉండిపోయాడు.
శ్రీరామకృష్ణులు (మళ్లీ అతడితో): మంచిది! నీ స్వభావానికి తగినట్లు చెబుతాను, విను. స్వస్వరూపాన్ని తెలుసుకోవాలని వేదాంతతత్త్వం నుడువుతోంది. కాని ‘అహం’ ను త్యజింపనిదే ఇది సాధ్యం కాదు. ‘అహం’ ఒక కర్ర వంటిది. కర్రను నీటిపై ఉంచితే అది నీటిని రెండు భాగాలుగా చేసినట్లు తోస్తుంది. ఈ ‘అహం’ అనేది ‘నేను వేరు, నువ్వు వేరు’ అనే భేదబుద్ధిని కలిగిస్తుంది. సమాధి స్థితిలో ఈ ‘అహం’ నశించగానే అపరోక్షానుభూతి కలుగుతుంది.
శ్రీరామకృష్ణులకు బ్రహ్మజ్ఞానం కలిగిందా? కలిగి ఉంటే ఆయన ‘నేను’, ‘నేను’ అని ఎందుకు అంటున్నారు? ఇలా కొందరు భక్తుల మనస్సులలో సంశయం పొడసూపింది.
శ్రీరామకృష్ణులు కొనసాగించారు: “ ‘నేను మహిమా చక్రవర్తి’, ‘నేను విద్వాంసుడను’ – అనే ‘నేను’ ను త్యజించాలి. కాని ‘విద్యా నేను’ ఉండటంలో హాని లేదు. లోకుల ఉపదేశార్థం శ్రీ శంకరులు ఈ ‘విద్యా నేను’ ను నిలుపుకున్నారు.
“స్త్రీల విషయంలో బహుజాగ్రత్తగా ఉండకుంటే బ్రహ్మజ్ఞానం కలుగదు. అందుచేతనే సంసార జీవితం గడుపుతూ జ్ఞానం పొందటం ఎంతో కష్టం. మసిబారిన గదిలో నివసించినప్పుడు ఎంత జాగ్రత్తగా మసలుకున్నా ఒంటికి మసి అంటుకునే తీరుతుంది. యువతుల సాంగత్యం కామగంధం లేని వ్యక్తిలో కూడా కామం జనింపచేస్తుంది.
“కాని జ్ఞానం పొందిన గృహస్థుడు ఎప్పుడో ఒకసారి తన భార్యతో రమించటం తప్పు కాబోదు. వీర్యం విసర్జించటం మలమూత్రాలు విసర్జించినట్లే అవుతుంది. మలమూత్రాలు విసర్జించాక దాన్ని గురించి చింతిస్తూ ఉండడు. ఏదో కొన్ని సమయాలలో కాస్త పాలకోవా తినటం తప్పు కాదు. (మహిమాచరణ్ నవ్వాడు) గృహస్థుల విషయంలో ఇది అంత దోషం కాదు.
19.4.2 సన్న్యాసులకు కఠిననియమాలు
“సన్న్యాసుల విషయంలో ఇది ఘోరమైన తప్పు. సన్న్యాసి, స్త్రీల చిత్రపటాన్ని కూడా చూడకూడదు. సన్న్యాసి, స్త్రీలతో సాంగత్యం నెరపటం ఉమ్మివేసి తిరిగి ఆ ఉమ్మిని మింగినట్లే. సన్న్యాసి, స్త్రీలతో కూర్చుని మాట్లాడరాదు; ఆమె గొప్ప భక్తురాలయినా సరే. జితేంద్రియుడు అయినప్పటికీ సన్న్యాసి, స్త్రీతో మాట్లాడటం తగదు.
“కామినీ కాంచనాలు రెంటినీ సన్న్యాసి త్యజించివేయాలి. అతడు ఒక స్త్రీ చిత్తరువును కూడా కన్నెత్తి చూడరాదు, అదే విధంగా కాంచనాన్ని – ధనాన్ని – కూడా స్పృశించరాదు. తన వద్ద ధనం ఉంటే చాలు – ప్రమాదం; లెక్కించే బుద్ధి, దుష్టచింతన, డబ్బు ఉందన్న అహంకారం, లోకుల పట్ల క్రోధం మొదలైన అరిష్టాలు వచ్చి చేరుతాయి. సూర్యుణ్ణి చూస్తూ ఉన్నాం, హఠాత్తుగా మేఘం వచ్చి సూర్యుణ్ణి కప్పివేస్తుంది.
“అందుచేత మార్వాడీ ఒకరు నా కోసం హృదయ్ వద్ద ధనం ఇవ్వబోగా నేను, ‘అలా కూడా వద్దు, డబ్బు ప్రక్కన ఉంటే చాలు – మేఘం క్రమ్మివేస్తుంది’ అన్నాను.
“సన్న్యాసులకు ఇంతటి కఠోర నియమాలు ఎందుకు? అది అతడి శ్రేయస్సుకే అనటం నిజమే, పైగా అది లోకోపదేశం నిమిత్తం కూడా. అతడు స్వయంగా నిర్లిప్తుడూ, జితేంద్రియుడూ అయినప్పటికీ లోకోపదేశం నిమిత్తం కామినీ కాంచనాలను పరిత్యజించాలి. అతడి నూటికి నూరుపాళ్ల త్యాగం చూసినప్పుడే లోకులకు మనోస్థైర్యం కలుగుతుంది. అప్పుడే లోకులూ కామినీ కాంచనాలను పరిత్యజింప యత్నిస్తారు. త్యాగం గురించి ఇటువంటి ఉపదేశం సన్న్యాసి గరపనట్లయితే మరెవరు గరపగలరు?
19.4.3 భగవత్ప్రాప్తి తరువాత జనకాదుల సంసారం – ఋషులు, ఆహార నియమం
“వెన్నను చిలికి తీసి, దాన్ని నీటిలో ఉంచవచ్చు. ఆ విధంగా భగవద్దర్శనా నంతరం సంసారంలో ఉండవచ్చు. జనకుడు బ్రహ్మజ్ఞానం పొందిన తరువాతనే సంసార జీవితం గడిపాడు. అతడు జ్ఞాన కర్మలనే రెండు కత్తులతో సాము చేసే వాడు. సన్న్యాసి కర్మత్యాగం చేసినవాడు. అందుచేతనే అతడు జ్ఞానమనే ఒక కత్తినే ఉంచుకుంటాడు.
“జనకుని వంటి జ్ఞానం పొందిన గృహస్థులు చెట్టునున్న పళ్లను, నేల రాలిన పళ్లను తినవచ్చు. వారి వలన సాధుసేవ, అతిథి సత్కారాలు మొదలైనవన్నీ సాధ్యం అవుతున్నాయి. ‘అమ్మా! నన్ను శుష్క సన్న్యాసిగా చేసివేయవద్దు’ అని నేను అమ్మను ప్రార్థించాను.
“బ్రహ్మజ్ఞానం పొందిన తరువాత ఆహారం గురించిన నియమనిష్ఠలు తొలగిపోతాయి. బ్రహ్మజ్ఞానులైన ఋషులు బ్రహ్మానందం తరువాత దేనినైనా తినగలిగారు – పంది మాంసంతో సహా.
19.4.4 నాలుగు ఆశ్రమాలు – యోగసిద్ధి
“(మహిమాతో) సామాన్యంగా చూస్తే రెండు రకాల యోగాలు ఉన్నాయి. ఒకటి కర్మయోగం, మరొకటి మనోయోగం; అంటే కర్మల ద్వారా యోగం, మనస్సు ద్వారా యోగం.
“బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాసాలని ఆశ్రమాలు నాలుగు. మొదటి మూడు ఆశ్రమాలలో కర్మలు చేయవలసినదే. సన్న్యాసి దండ కమండలాలను, భిక్షాపాత్రను స్వీకరించవలసి ఉంటుంది. నిత్యకర్మలూ ఆచరిస్తాడు. కాని అతడి మనస్సు వాటిలో లగ్నం అయివుండదు. ‘నేను చేస్తున్నాను’ అనే తలంపు అతడిలో ఉండదు. కొందరు సన్న్యాసులు లోకులకు ఉదాహరణగా ఉండటం కోసం నిత్యకర్మలు కొన్ని ఆచరిస్తారు. గృహస్థులు, తక్కిన ఆశ్రమవాసులు నిష్కామకర్మలు చేయగలిగితే వారికి ఆ కర్మల ద్వారా యోగం సిద్ధిస్తుంది.
“పరమహంస స్థితిని చేరుకున్న వారికి, అంటే శుకమహర్షి వంటి వారికి పూజ, జపం, తర్పణం, సంధ్యావందనాది కర్మలన్నీ ఎగిరిపోతాయి. ఈ స్థితిలో మనోయోగం మాత్రమే. కొన్ని సమయాలలో వారు బాహ్యకర్మలు ఆచరించటం కద్దు; అది లోకులకు ఉపదేశించటానికి మాత్రమే. కాని వారి మనస్సు సర్వదా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటుంది.”
రాత్రి ఎనిమిది గంటలయింది. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్ను కొన్ని స్తోత్రాలు పఠించి వినిపించమన్నారు. మహిమాచరణ్ ‘ఉత్తరగీత’ తీసుకు వచ్చి, దాన్లోని పరబ్రహ్మ స్తోత్రాన్ని పఠించాడు:
“యదేకం నిష్కలం బ్రహ్మ వ్యోమాతీతం నిరంజనమ్ ।
అప్రతర్క్యం అవిజ్ఞేయం వినాశ ఉత్పత్తి వర్జితమ్ ॥”
క్రమంగా మూడవ అధ్యాయంలోని ఏడవ శ్లోకం చదవసాగాడు:
“అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతమ్ ।
ప్రతిమా స్వల్పబుద్ధీనాం సర్వత్ర సమదర్శినామ్ ॥”
అంటే – బ్రాహ్మణుల దేవత, అగ్నిలోను; మునుల దేవత, హృదయంలోను; అల్పబుద్ధుల దేవత, విగ్రహంలోను ఉంటాడు. కాని సమదర్శులైన యోగుల దేవత సర్వత్రా విరాజిల్లుతూంటాడు.
‘సర్వత్ర సమదర్శినామ్’ అనే మాటలు వినటంతోనే శ్రీరామకృష్ణులు హఠాత్తుగా లేచి నిలబడి సమాధిమగ్నులైనారు. చేతికి వేసిన కట్టు అట్లే ఉంది. భక్తులు ఆశ్చర్యచకితులై ఆ సమదర్శియైన మహాయోగి అద్భుతస్థితిని చూస్తూ ఉండిపోయారు.
19.5 పంచమ పరిచ్ఛేదం మహిమాచరణ్ శాస్త్ర పఠనం – శ్రీరామకృష్ణుల సమాధి
చాలాసేపటి వరకు శ్రీరామకృష్ణులు అట్లే నిలబడి ఉండిపోయారు. తరువాత మామూలు స్థితికి వచ్చి క్రింద కూర్చున్నారు.
హరిభక్తిని గురించిన శ్లోకాలు కొన్నింటిని పఠించమని మహిమాచరణ్తో చెప్పారు. మహిమాచరణ్ ‘నారద పంచరాత్రం’ లోని కొన్నిటిని పఠించాడు :
“అంతర్బహిర్యది హరిస్తపసా తతః కిమ్ ।
నాంతర్బహిర్యది హరిస్తపసా తతః కిమ్ ॥
ఆరాధితో యది హరిస్తపసా తతః కిమ్ ।
నారాధితో యది యది హరిస్తపసా తతః కిమ్ ॥
విరమ విరమ బ్రహ్మన్ కిం తపస్యాసు వత్స ।
వ్రజ వ్రజ ద్విజ శీఘ్రం శంకరం జ్ఞానసింధుమ్ ॥
లభ లభ హరిభక్తిం వైష్ణవోక్తాం సుపక్వామ్ ।
భవనిగడనిబంధచ్ఛేదనీం కర్తరీం చ ॥”
అనువాదం :
“భగవంతుని ప్రేమించుచు భజియించిన వత్సా
ఎందుకురా ఇక నెందుకురా తప మెందుకురా తనయా ॥
భగవంతుని ప్రేమించుచు భజియించిన వత్సా
పనియేమిర ఫలమేమిర తపమేలర తనయా ॥
లో వెలుపల లోకేశుని తిలకించిన వత్సా
ఎందుకురా ఇక నెందుకురా తప మెందుకురా తనయా ॥
చాలించర ఇక చాలునురా వత్సా తపము
జ్ఞానాంబుధియగు శంకరు దరిచేరర త్వరగా ॥
భవపాశములను ద్రుంచు పరభక్తిని తనయా
పరభక్తులు కీర్తించు పరభక్తిని తాతా
బడయుమురా పరమేశ్వరు ప్రార్థించి బాబూ ॥”
శ్రీరామకృష్ణులు: ఆహా! ఆహా!
శ్లోకాలను వింటూనే శ్రీరామకృష్ణులు మళ్లీ భావపారవశ్యంలో ఓలలాడబోయారు. కాని అతిప్రయత్నంతో దాన్ని నిగ్రహించుకున్నారు.
19.5.1 పిండాండం, బ్రహ్మాండం – ‘నాఽహమ్, నాఽహమ్’
తరువాత ‘యతిపంచకం’ నుండి మహిమాచరణ్ పఠించాడు:
“యస్యామిదం కల్పితమింద్రజాలం
చరాచరం భాతి మనోవిలాసమ్ ।
సచ్చిత్సుఖైకం జగదాత్మరూపం
సా కాశికాఽహం నిజబోధ రూపమ్ ॥”
‘సా కాశికాఽహం నిజబోధ రూపమ్’ అనే పదాలు వినగానే శ్రీరామకృష్ణులు నవ్వుతూ, “భాండం (అంటే పాత్ర) లోనూ, బ్రహ్మాండంలోనూ ఉన్నది ఒక్కటే (అండ పిండ బ్రహ్మాండాలలో ప్రకాశిస్తూ ఉన్నది ఒక్కటే అని భావం)” అన్నారు.
మహిమాచరణ్ ఈసారి ‘నిర్వాణషట్కమ్’ నుండి పఠించాడు:
“ఓం మనోబుద్ధ్యహంకారచిత్తాది నాహమ్
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే ।
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు –
శ్చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ ॥….
(భావం: నేను మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తమూ కాను; కర్ణం, జిహ్వ, నాసిక, నేత్రమూ కాను. నేను ఆకాశము, భూమి, అగ్ని, జలము, వాయువునూ కాను. చిదానందరూపుడైన శివుడనే నేను, శివుడనే నేను.)
ఎన్నిమార్లు మహిమాచరణ్ ‘చిదానందరూప శ్శివోఽహమ్’ అంటూ పఠించాడో అన్నిసార్లు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, “నాఽహమ్, నాఽహమ్ (నేను కాదు, నేను కాదు) నువ్వే! నువ్వే! చిదానందుడవు” అన్నారు.
తరువాత మహిమాచరణ్ ‘జీవన్ముక్తి గీత’ నుండి కొన్ని శ్లోకాలను పఠించి, షడ్చక్ర వర్ణనలు చదివి వినిపించాడు. పిదప తాను కాశీలో యోగావస్థలో ప్రాణాలు వదిలిన యోగిని చూసిన వైనం చెప్పాడు మహిమాచరణ్.
ఆపైన భూచరీ, ఖేచరీ ముద్రలను, శాంభవీ విద్యను గురించిన వర్ణనలు చదివి వినిపించాడు. శాంభవీ విద్య నేర్చిన వ్యక్తి ఇచ్ఛ వచ్చిన చోటికి పోగలడు. అయితే ఇవన్నీ అష్టసిద్ధులలో చేరినవే కాని భగవల్లాభం చేకూర్చేవి కావు.
19.5.2 రామగీత – శ్రీరామకృష్ణుల సముఖాన సాధువులు శాస్త్రాలు పఠించిన సంఘటన
మహిమా: రామగీతలో చక్కని ఉపదేశాలు ఉన్నాయి.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నువ్వు రామగీత, రామగీత అంటున్నావు, ఎందుకంటే నువ్వొక తీవ్ర వేదాంతివి. సాధువులు ఇక్కడకు వచ్చి అటువంటి పుస్తకాలు ఎన్నిటిని చదవలేదూ!
మహిమాచరణ్ ప్రణవ శబ్ద వర్ణనను గురించి చదివాడు – ‘తైలధార మవిచ్ఛిన్నం దీర్ఘ ఘంటానినాదవత్.’
పిదప సమాధి లక్షణాలను గురించి చదివాడు:
ఊర్ధ్వపూర్ణమధఃపూర్ణం మధ్యపూర్ణం యదాత్మకమ్ ।
సర్వపూర్ణం స ఆత్మేతి సమాధిస్థస్య లక్షణమ్ ॥
(భావం: సమాధి స్థితిలో మగ్నమై ఉన్న వ్యక్తి ఊర్ధ్వంలోను అధమంలోను మధ్యమంలోను – సర్వత్రా ఆత్మ నిండి ఉండటం గాంచుతాడు.)
అధర్, మహిమాచరణ్లు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు.
19.6 షష్ఠ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల సరళ స్వభావం, సత్యసంధత
ఆదివారం, ఫిబ్రవరి 3, 1884
మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. ఆయన చేతికి గాయమైన వార్త విని కలకత్తా నుంచి రామ్, సురేంద్రుడు తదితర భక్తులు ఆందోళన చెంది వచ్చారు. శ్రీరామకృష్ణుల చేతికి ఒక పెద్దకట్టు కట్టి ఉన్నారు. ‘మ’ శ్రీరామకృష్ణుల ప్రక్కన ఉన్నాడు. ఆయన భక్తులతో మాట్లాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు: దేనినీ గోప్యంగా ఉంచుకోలేని స్థితిలో అమ్మ నన్ను ఉంచింది. ఒక పసిబాలుని స్థితిలో నేను ఉన్నాను. రాఖాల్కు నా స్థితి అర్థం కాదు. నా గాయపడ్డ చేతిని చూసి ఎవరైనా హేళన చేస్తారేమో అని భయపడి దాన్ని గుడ్డతో కప్పి ఉంచుతాడు. డాక్టర్ మధును ప్రక్కకు తీసుకెళ్లి అంతా వివరించాడు. వెంటనే నేను, ‘మధుసూదన్! ఎక్కడున్నావు? ఇక్కడకు రా. నా చెయ్యి విరిగిపోయింది’ అంటూ బిగ్గరగా పిలిచాను.
“రాత్రి మథుర్, ఆతడి భార్య నిద్రించే గదిలోనే నేనూ నిద్రించేవాడిని. తమ సొంతబిడ్డలా వారు నన్ను చూసుకున్నారు. అప్పుడు నేను దైవోన్మత్త స్థితిలో ఉన్నాను. మథుర్ నాతో, ‘బాబా! మా మాటలు ఏవన్నా నువ్వు విన్నావా?’ అని అడిగేవాడు. నేను, ‘అవును’ అనేవాణ్ణి.
మథుర్నాథ్ విశ్వాస్
“ఒకప్పుడు మథుర్ భార్యకు, భర్త శీలంపట్ల సందేహం కలిగింది. అందుచేత ఆమె మథుర్‌తో, ‘నువ్వు బయటకు ఎక్కడకు వెళ్లినా సరే, భట్టాచార్య మహాశయులూ (అంటే శ్రీరామకృష్ణులు) నీతోపాటు వెంటవస్తారు’ అని చెప్పింది.
“ఒక రోజు అతడి వెంట వెళ్లినప్పుడు నన్ను క్రింద ఒకచోట కూర్చోబెట్టి మేడ మీదకు వెళ్లాడు మథుర్. అరగంట తరువాత దిగివచ్చి, ‘బాబా! రా వెళదాం. బండిలో కూర్చో’ అన్నాడు. ఇంటికి తిరిగి రాగానే మథుర్ భార్య అడిగినప్పుడు, జరిగినదంతా నేను చెప్పాను. ‘మేం ఒక ఇంటికి వెళ్లాం. మథుర్బాబు నన్ను క్రింద కూర్చోబెట్టి మేడ మీదకు వెళ్లాడు. అరగంట తరువాత దిగి వచ్చి, బాబా! రా వెళదాం అన్నాడు’ అని చెప్పాను. ఆమె ఏదో గ్రహించింది.
“మథుర్ కౌలుదారు ఒకడు ఆలయపు తోట నుండి పళ్లు, కాయగూరలు మొదలైన వాటిని బండిలో దొంగతనంగా తన ఇంటికి తీసుకుపోయేవాడు. తక్కిన కౌలుదారులు దీన్ని గురించి అడిగినప్పుడు నేను జరిగింది జరిగినట్టే చెప్పేశాను.”
19.7 సప్తమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో ‘మ’, మణిలాల్ ప్రభృతులతో
ఆదివారం, ఫిబ్రవరి 24, 1884
19.7.1 శ్రీరామకృష్ణుల అసహనం – మణిలాల్‌కు ఉపదేశం
శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనం ముగించి విశ్రమించి ఉన్నారు. మణిమల్లిక్ క్రింద కూర్చుని ఉన్నాడు. ‘మ’ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి మణిమల్లిక్ ప్రక్కన కూర్చున్నాడు. శ్రీరామకృష్ణుల చేయి ఇంకా కట్టుతోనే ఉంది.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఎలా వచ్చావు?
‘మ’ : ఆలంబజారు వరకు బండిలో వచ్చి అక్కడ నుంచి నడిచి వచ్చాను.
మణిలాల్: బాబోయ్! చెమటతో పూర్తిగా తడిసిపోయాడు!
శ్రీరామకృష్ణులు(నవ్వుతూ): నేనూ దాన్ని గురించే యోచిస్తున్నాను – ఇవన్నీ (శ్రీరామకృష్ణులకు కలిగిన దర్శనాలన్నీ) వాయుదోషం వల్ల కలిగిన అనుభవాలు కావు. లేకుంటే ఈ ఇంగ్లీష్ మేన్లు ఇంత కష్టపడి ఇక్కడకు వస్తారా ఏమిటి!
గాయపడిన తమ చేతిని గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: దీని కారణంగా నేను కొన్ని సమయాల్లో సహనం కోల్పోతున్నాను. చూసేవారందరికీ చేతిని చూపి, ‘ఏమయ్యా, నయమవుతుందా, నయమవుతుందా?’ అంటూ అడుగుతూ ఉంటాను. రాఖాల్కు కోపం వస్తోంది. నా స్థితి అతడికి అర్థంకాలేదు. అతడు ఇక్కడ నుంచి పోయినా ఫరవాలేదు అని కొన్ని సందర్భాలలో అనుకునేవాణ్ణి. తరువాత అమ్మతో, ‘అమ్మా! వాడు ఎక్కడకు పోతాడు? ఎక్కడకు పోయి ఈ సంసార దావాగ్నిలో దగ్ధమౌతాడు’ అని ప్రార్థించేవాణ్ణి.
“ఇలా పసిబాలునిలా సహనం కోల్పోవటం నాకు క్రొత్తకాదు. మథుర్కి పదేపదే నా చేతిని చూపి, ‘నా కేదన్నా సుస్తీ చేసిందా, చూసి చెప్పు’ అని అడిగేవాణ్ణి.
“పోనీ, భగవంతుని యెడ నా నిష్ఠ ఎక్కడకు పోయింది? ఒకసారి నేను ఎడ్లబండిలో కామార్పుకూర్కు పోతున్నాను. అప్పుడు దుడ్డుకర్రలతో ఒక గుంపు బండి వద్దకు వేగంగా వచ్చింది. చూడటానికి వాళ్లు దారిదోపిడీగాళ్లలా కనిపించారు. నేను దైవీనామాలను స్మరించసాగాను. కాని ఒక క్షణం రామ్ అన్నాను, మరుక్షణం దుర్గా అన్నాను, పిదప ఓం తత్సత్ అన్నాను – ఏదో ఒక మంత్రం రక్షించనీ అనుకునే. (‘మ’ తో) అవును, నేనెందుకు అంతగా అసహనం చెందాను?
‘మ’ : స్వామీ! మీరు సర్వదా సమాధిస్థితిలో లీనమై ఉంటారు. భక్తుల నిమిత్తం ఒకింత మనస్సును దేహం మీద నిలుపుకున్నారు. అందుచేతనే దేహాన్ని కాపాడుకోవటానికి కొన్ని సమయాల్లో కలత చెందుతారు.
శ్రీరామకృష్ణులు: అవును! కించిత్తు మనస్సు మాత్రం దేహం మీద ఉంది; కాని అది భక్తిని అనుభవించడానికి, భక్తుల సహచర్యం కోసమూ మాత్రమే.
19.7.2 వస్తుప్రదర్శనశాల ప్రస్తావన
వస్తుప్రదర్శనశాల (ఎగ్జిబిషన్) గురించి మణిమల్లిక్ ప్రస్తావించాడు. చిన్ని కృష్ణుణ్ణి ఒడిలో ఉంచుకున్న యశోద అందమైన విగ్రహం గురించి విన్న శ్రీరామకృష్ణుల కళ్లలో అశ్రువులు స్రవించాయి. వాత్సల్య భావంతో మూర్తీభవించిన యశోద గురించి వినగానే శ్రీరామకృష్ణులలో ప్రేమ ఉదయించింది, అందుచేతనే విలపించారు.
మణిలాల్: మీ ఆరోగ్యం సరిగా ఉండి ఉంటే గఢ్ మైదానంలో జరుగుతున్న ఈ వస్తుప్రదర్శనను మీరు తిలకించేవారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ ప్రభృతులతో): నేను అక్కడకు వెళితే అన్నిటినీ చూడలేను. ఏదో ఒకటి కళ్లబడగానే బాహ్యస్మృతిని కోల్పోతాను; ఆపైన దేన్నీ చూడటం సాధ్యం కాదు. ఒకసారి జంతు ప్రదర్శనశాల సందర్శనార్థం నన్ను తీసుకువెళ్లారు. సింహాన్ని చూడగానే సమాధిమగ్నుడనైనాను. జగజ్జనని వాహనమైన సింహాన్ని చూడగానే దైవోద్దీపన కలిగింది. పిదప తక్కిన జంతువులను ఎవరు చూస్తారు! సింహాన్ని మాత్రం చూసి తిరిగి వచ్చేశాను. అందుకే యదుమల్లిక్ తల్లి వస్తుప్రదర్శనశాలకు నన్ను తీసుకువెళ్లమని యదుమల్లిక్తో చెప్పింది, పిదప వద్దన్నది.
మణిమల్లిక్ అనేక సం ॥ లుగా బ్రహ్మసమాజ సభ్యుడుగా ఉంటున్నాడు. ఆయనకు వయస్సు అరవై ఐదేళ్లు ఉండవచ్చు. శ్రీరామకృష్ణులు అతడి మనోస్థితికి తగినట్లుగా ఉపదేశిస్తున్నారు.
19.7.3 జయనారాయణ్ పండితుడు – గౌరీ పండితుడు
శ్రీరామకృష్ణులు: జయనారాయణ్ పండితుడు బహు ఉదారుడు. ఒకసారి వెళ్లి ఆయనను చూశాను. ఆయన స్వభావం నాకెంతో నచ్చింది. కాని ఆయన కుమారులు బూట్లు ధరించి ఉన్నారు. తాను కాశీకి వెళ్లబోతున్నట్లు చెప్పాడు. చెప్పినట్లే చివరి రోజుల్లో కాశీకి వెళ్లాడు, అక్కడే గడిపాడు, అక్కడే మరణించాడు. వయస్సు పైబడ్డ తరువాత ఆయన వలె సంసారం నుండి వెళ్లిపోయి భగవచ్చింతనలో గడపటం మంచిది. ఏమంటావు?
మణిలాల్: అవునండీ, సంసారంలోని జంజాటాలు భరించలేనివి.
శ్రీరామకృష్ణులు: గౌరీపండితుడు తన భార్యను పువ్వులతో పూజించేవాడు. స్త్రీలందరూ జగజ్జనని యొక్క వేరు వేరు రూపాలు. (మణిలాల్‌తో) నీ ఆ చిన్నకథను వీరికి చెప్పు.
మణిలాల్ (నవ్వుతూ): కొందరు పడవలో గంగానదిని దాటుతున్నారు. ఒక పండితుడు తన పాండిత్యాన్ని గురించి డంబాలు కొట్టుకుంటున్నాడు; ‘నేను వేదవేదాంతాలు, షడ్దర్శనాలు అన్నీ అధ్యయనం చేశాను’ అన్నాడు. ‘ఏమిటోయ్, నీకు వేదాంతం తెలుసా?’ అని ఒక తోటిప్రయాణీకుణ్ణి అడిగాడు. అందుకు అతడు, ‘లేదండీ’ అన్నాడు. పిదప, ‘సాంఖ్యం, పాతంజలం తెలుసునా?’ అని అడిగాడు. అందుకు కూడా అతడు, ‘లేదండీ, నాకు తెలియదు’ అన్నాడు. ‘దర్శన శాస్త్రాలు ఏవీ చదవలేదా?’ అని అడిగినప్పుడు అందుకూ అతడు, ‘లేదండీ’ అనే బదులు చెప్పాడు.
“పండితుడు ఇలా డంబాలు పలుకుతూనే ఉన్నాడు. ఆ వ్యక్తి మౌనంగానే ఉండిపోయాడు. అదే సమయంలో భయంకరమైన తుపాను చెలరేగడంతో పడవ అటూ ఇటూ ఊగసాగింది. అప్పుడు ఆ వ్యక్తి పండితుడితో, ‘అయ్యా, పంతులుగారూ! మీకు ఈత వచ్చునా?’ అని అడిగాడు. అందుకు పండితుడు, ‘తెలియదు’ అని బదులిచ్చాడు. ‘నాకు సాంఖ్యం, పాతంజలం ఏవీ తెలియవు. కాని ఈత మటుకు వచ్చు’ అన్నాడా వ్యక్తి.”
19.7.4 భగవంతుడే సత్యం – లక్ష్య ఛేదన
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): పలు శాస్త్రాలు అధ్యయనం చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి? ఈ భవమనే నదిని దాటటం ఎలాగో తెలుసుకోవటమే ఆవశ్యకం. భగవంతుడు మాత్రమే సత్యం, తక్కినదంతా అసత్యమే.
“గురిని చూసి బాణం ప్రయోగించనున్న అర్జునుణ్ణి ద్రోణుడు ఇలా అడిగాడు:
‘అర్జునా! నీకు ఏం కనబడుతోంది? ఈ రాజులు నీకు కనిపిస్తూ ఉన్నారా?’
‘లేదండీ.’
‘నన్ను చూస్తున్నావా?’
‘లేదండీ.’
‘చెట్టును చూస్తున్నావా?’
‘లేదండీ.’
‘చెట్టుమీదనున్న పక్షిని చూస్తున్నావా?’
‘లేదండీ.’
‘అలా అయితే దేన్ని చూస్తున్నావు?’
‘పక్షి కంటిని మాత్రమే చూస్తున్నాను.’
పక్షి కంటిని మాత్రమే ఎవరైతే చూస్తాడో అతడు మాత్రమే లక్ష్యాన్ని ఛేదించగలడు. భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినదంతా అసత్యమే అని ఎవరు కాంచుతాడో అతడే చతురుడు. సమాచారా లన్నిటిని తెలుసుకోవటంలో ప్రయోజనం ఏం ఉంది? ‘తిథి వార నక్షత్రాలు ఏవీ నాకు తెలియవు. నేను రాముణ్ణి స్మరించటం మాత్రమే చేస్తున్నాను’ అన్నాడు ఆంజనేయుడు. (BG 10.42)
(‘మ’ తో) “ఇక్కడి కోసం ఒకటి రెండు విసనకర్రలు కొని తీసుకురా.
(మణిలాల్‌తో) “ఇదుగో చూడు, నువ్వు ఒకసారి ఇతడి (‘మ’) తండ్రి వద్దకు వెళ్ళు. భక్తుని చూస్తే చైతన్యం ఉద్దీపిస్తుంది.
19.8 అష్టమ పరిచ్ఛేదం నరలీల
(‘మ’ తో) చేతికి దెబ్బ తగిలినప్పటి నుండి నాలో ఒక గొప్ప మార్పు కలుగుతోంది. ప్రస్తుతం నరలీల మాత్రమే నాకు నచ్చుతూ ఉన్నది. నిత్యమూ, లీల. నిత్య మంటే అఖండ సచ్చిదానందం; ఈశ్వరలీల, దైవలీల, నరలీల, జగల్లీల – లీలలోని పలురకాలు.
19.8.1 వైష్ణవచరణ్ – శ్రీరామకృష్ణులు – ‘రామలీల’ నాటకం
“నరలీలలో విశ్వాసం ఏర్పడితే పూర్ణజ్ఞానం వచ్చేస్తుందని వైష్ణవచరణ్ అనేవాడు. మునుపు నేను దీన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు, ఇది నిజమేనని తోస్తోంది. ప్రేమను, కోమలత్వాన్ని వెలిబుచ్చటానికి చిత్రించబడిన మానవ చిత్తరువులు చూడగోరేవాడు వైష్ణవచరణ్.
(మణిలాల్‌తో) “భగవంతుడే మానవరూపంలో లీల జరుపుతున్నాడు. ఆయనే మణిమల్లిక్ అయి ఉన్నాడు. ‘నువ్వే సచ్చిదానందం’ అని సిక్కులు ఉపదేశిస్తారు.
“ఎప్పుడైనా తన స్వస్వరూపాన్ని (సచ్చిదానందాన్ని) గాంచి మనిషి ఆశ్చర్యపోతాడు; ఆనందంలో ఓలలాడతాడు. హఠాత్తుగా అత్యంత ఆత్మీయుణ్ణి చూస్తే కలిగే స్థితి లాంటిది. (‘మ’ తో) ఆ రోజు నేను బండిలో వస్తూ ఉన్నప్పుడు బాబురాం కళ్లబడగానే కలిగినట్టి ఆనందం లాంటిది. శివుడు తన స్వస్వరూపాన్ని గాంచినప్పుడు, ‘నే నెవరిని, నే నెవరిని?’ అని కేకలు పెడుతూ హర్షాతిరేకంలో నృత్యం చేశాడు.
‘అధ్యాత్మ రామాయణం’ లో దీన్ని గురించి పేర్కోబడి ఉంది. నారదుడు రాముడితో, ‘ఓ రామా! లోకంలోని పురుషులందరూ నువ్వే, స్త్రీలందరూ సీతయే’ అన్నాడు.
“రామలీల నాటకంలో నటించిన పాత్రధారులను చూసినప్పుడు నారాయణుడే ఈ మానవ రూపాలన్నీ ధరించి ఉన్నాడన్న బోధ నాకు కలిగింది. అసలు, నకిలీలు రెండూ ఒక్కటిలా తోచింది.
“కుమారిపూజ ఎందుకు చేయబడుతోంది? స్త్రీలందరూ జగజ్జనని పలు రూపాలు. కాని పరిశుద్ధాత్ములైన కన్యలలో జగజ్జనని అభివ్యక్తీకరణ అధికంగా ఉంటుంది.
(‘మ’ తో) “సుస్తీ చేసినప్పుడు నేనెందుకు సహనాన్ని కోల్పోతాను? అమ్మ నన్ను పసిబాలుని స్వభావంలో నిలిపి ఉంచింది. బిడ్డ సర్వదా తల్లినే ఆశ్రయించి ఉంటాడు. పనిమనిషి బిడ్డ, యజమాని బిడ్డతో దెబ్బలాట అంటూ వస్తే, ‘మా అమ్మకు చెప్పివేస్తాను’ అంటాడు.
19.8.2 1881 లో ఛాయాచిత్రం తీసిన సంఘటన
“నా ఛాయాచిత్రం తీయటానికి నన్ను రాధాబజార్కు తీసుకు వెళ్లారు. ఆ రోజు రాజేంద్ర మిత్ర ఇంటికి వెళ్లవలసి ఉంది. కేశవ్ మరి కొందరు అక్కడకు వస్తారని విన్నాను. వారికి కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను. కాని రాధాబజార్కు వెళ్లగానే అంతా మరిచిపోయాను. వెంటనే అమ్మతో ‘అమ్మా! నువ్వే మాట్లాడు. నేను ఏం మాట్లాడగలను?’ అన్నాను.
19.8.3 కుంవర్ సింగ్ – రామ్‌లాల్ తల్లి – కుమారి పూజ
“నాకు జ్ఞానుల స్వభావం లేదు. జ్ఞాని తనను గొప్పవాడిగా భావించుకుంటాడు. ‘నా కేమిటి, రోగం రావటమేమిటి’ అని చెప్పుకుంటాడతడు.
“కుంవర్ సింగ్ ఒకసారి నాతో, ‘మీకు ఇంకా దేహం గురించిన చింత ఉందే’ అన్నాడు. అమ్మకే అంతా తెలుసునన్నదే నా భావం. రాజేంద్ర మిత్ర ఇంట్లో ఆమే మాట్లాడుతుంది. ఆమె వాక్కులే వాక్కులు. సరస్వతీదేవి జ్ఞాన జ్యోతిలోని ఒక్క కిరణం వేయి మంది పండితులను కింకర్తవ్యతామూఢులను చేస్తుంది!
“అమ్మ నన్ను ఒక భక్తుని స్థితిలో, విజ్ఞాని స్థితిలో నిలిపి ఉంచింది. అందుకే రాఖాల్ మొదలైన వారితో పరిహాసాలాడుతూ ఉంటాను. జ్ఞాని స్థితిలో ఉంటే అలా జరుగదు.
“అమ్మే సర్వం అయివుండటం ఈ స్థితిలో నేను గాంచుతున్నాను! సర్వత్రా ఆమెనే దర్శిస్తూ ఉన్నాను. అమ్మే సర్వమూ అయివున్నది – దుష్టులుగానూ – భాగవత పండితుని సోదరునిగాను కూడా ఆమే అయివుండటం కాళికాలయంలో దర్శించాను.
“ఒకసారి రామ్‌లాల్ తల్లిని కసురుకోబోయాను, కాని సాధ్యం కాలేదు. ఆమె అమ్మ యొక్క ఒక రూపంగానే కానవచ్చింది. కన్యలలో అమ్మను కాంచటం చేతనే నేను ‘కుమారి పూజ’ ను చేస్తాను. భార్య నా కాళ్లు ఒత్తుతుంది, ఆ పిదప నే నామెకు నమస్కారం చేస్తాను. (BG 13.29)
“మీరందరూ నా కాళ్లు తాకి నమస్కరిస్తున్నారు, కాని హృదయ్ ఉంటే ఎవరైనా నా కాళ్లు తాకి ఉండేవారా? అతడు ఎవరినీ తాకనిచ్చేవాడు కాదు. తల్లి నన్ను ఈ స్థితిలో ఉంచినందునే తిరిగి నమస్కారం చేయవలసి వస్తోంది.
“ఇదుగో చూడు, దుష్టులను కూడా బహిష్కరించరాదు. తులసీదళం వాడిపోయి ఉన్నప్పటికీ, చిన్నదై ఉన్నప్పటికీ, భగవత్ పూజకై వినియోగపడుతూనే ఉంది కదా!”
19.9 నవమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో నరేంద్రాది భక్తులతో
ఆదివారం, మార్చ్ 2, 1884
దక్షిణేశ్వర కాళికాలయంలోని శ్రీరామకృష్ణుల గది. బ్రహ్మసమాజానికి చెందిన త్రైలోక్య సన్యాల్ పాడుతున్నాడు. నరేంద్రుడు, సురేంద్రుడు, ‘మ’, ఇంకా కొందరు భక్తులు నేల మీద కూర్చుని పాటను వింటున్నారు. శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చునే పాటను వింటున్నారు. ఆయన ఇంకా కోలుకోలేదు. చేతికి బద్దలు వేసి కట్టుకట్టి ఉన్నారు.
నరేంద్రుని తండ్రి కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా ఉండేవాడు. హఠాత్తుగా ఆయన కాలం చేయడంతో ఆ కుటుంబం ఎన్నో కష్టాల పాలయింది. కొన్ని సందర్భాలలో పస్తులు కూడా ఉండవలసి వచ్చింది. ఈ కారణంగా నరేంద్రుడు ఎంతో మనోక్లేశానికి గురై ఉన్నాడు.
త్రైలోక్యుడు జగజ్జనని గూర్చి పాడాడు :
నీ గుండెలో దాగు
కొనియుంటినమ్మ
నీ ముఖముగని ‘అమ్మ
అమ్మ’ యనుచుంటి॥ నీ ॥
ఇంద్రియంబులు యోగ
నిద్రలో విడనాడ
ఆనంద సాగరం
బున మునిగినాను ॥ నీ ॥॥ నీ ॥
నీ ఆననము కనులు
నిలచి వాల్పకజూచి
వదలిపోయెడు శక్తి
కొరతపడిపోయినది॥ నీ ॥
ఈ లోకమును జూచి
బెదిరిపోయితినమ్మ
వణికి భయమున ఆత్మ
వాపోవుచున్నది॥ నీ ॥
ఓ యమ్మ నను గుండె
లో నదిమిపెట్టి
నీ ప్రేమచెరగుతో
నను గప్పి గావుమీ॥ నీ ॥
పాటను విని శ్రీరామకృష్ణులు ప్రేమాశ్రువులను స్రవిస్తూ, “ఆహా! ఎంతటి భావం!” అన్నారు బిగ్గరగా. త్రైలోక్యుడు తిరిగి పాడసాగాడు :
పాదాశ్రయమును కోరుచు దేవా
శాశ్వతముగనే ప్రక్కకునెట్టితి
కులజాతులచే కలిగిన గర్వము
చూపితివీ పవమాన భయాలకు॥ పా ॥
జీవిత పథమున ఒంటరి పథికుడ
ఆదరమునకిపు డెందేగుదును?
నీ నిమిత్తమై నే భరియించితి,
మానవదూషణ మంతటి నో ప్రభో॥ పా ॥
నిను ప్రేమించిన కతమున రోయుచు
పాడు తిట్టులను తిట్టిరివారు
ఒకపరి మిత్రులు ఒకపరి అన్యులు
వాడుకొనిరి నను పాడుపనులకు॥ పా ॥
నాదు కీర్తికి రక్షణ కర్తవు
రక్షించెదొ నను భక్షించెదవో
దాసుని కీర్తిపై నీ ఘనకీర్తియు
నిలచియున్నది నిశ్చయముగ ప్రభూ॥ పా ॥
జీవనధనమా జీవననాథా
హృది వెల్గించెడు ప్రేమ ప్రకాశా
నీ వేవిధముగ చేయనెంతువో
ఆ విధముగ నను చేయుమురా ప్రభూ॥ పా ॥
త్రైలోక్యుడు మళ్లీ పాడాడు :
ఇంటినుండి ఈడ్చినావు
ప్రేమఖైదు పెట్టినావు
పదము నీడ పదిలపరచు
ప్రేమమయుడ, ప్రియుడ, ప్రభుడ॥ ఇం ॥
ప్రేమ సుధను పెట్టిపెంచి
రాత్రి పగలు రక్షింపుచు
దాసుడైన ప్రేమదాసు
కరుణతోడ కాపాడుము॥ ఇం ॥
కళ్లనుండి ఆనందాశ్రువులు ధారలు కట్టగా, శ్రీరామకృష్ణులు నేల మీదకు వచ్చి కూర్చున్నారు. రామప్రసాద్ పాటలో నుండి కొన్ని చరణాలను త్రైలోక్యుడు పాడాడు.
శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడితో, “ఆహా! నీ పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి! హృదయాన్ని స్పృశిస్తూ ఉన్నవి. సముద్రంలోకి వెళ్లిన వారే దాని జలాన్ని తీసుకువచ్చి చూపగలరు” అన్నారు.
త్రైలోక్యుడు మళ్లీ పాడసాగాడు:
పాటపాడు పాటకుడవు
నాట్యమాడు నర్తకుడవు
రాగతాళ గతుల రీతి
కరతాళము గావింతువు॥ పా ॥
నిలచి చూచు మానవుండు
తలచు బుద్ధిలేక తానె
కదలియాడి పాడువాడ
ననుచు తలచుచుండు నచట॥ పా ॥
కదిపినట్లు కదలు, ఆట
బొమ్మవంటి పూరుషుండు
వెంట నిన్ను అంటినడువ
మారిపోవు దేవుడుగను॥ పా ॥
యంత్రచాలి యంత్రి వీవు
రథము నడుపు రథికుడీవు
దుఃఖదళితడైన నరుడు
కర్తననుచు కలలుగాంచు॥ పా ॥
సర్వమూలకంద మీవు
జీవాత్మల కాత్మ వీవు
సర్వమానవాళి హృదయ
నేత వీవు నాథు డీవు॥ పా ॥
నీచుడైన పాపినైన
నీ యపార కరుణ వలన
మహిమోన్నత సాధువుగా
మార్చివేయుచుందు వీవు॥ పా ॥
పాటలు ముగిశాయి. శ్రీరామకృష్ణులు మాట్లాడ నారంభించారు.
19.9.1 నిత్యం, లీల – పూర్ణజ్ఞానం లేదా విజ్ఞానం
శ్రీరామకృష్ణులు (త్రైలోక్యుని, తక్కిన భక్తులను చూస్తూ): సేవించబడే వాడు హరియే, సేవకుడూ హరియే – ఈ భావం పూర్ణజ్ఞానానికి లక్షణం. తొలుత ‘నేతి, నేతి’ అంటూ విచారణ చేస్తూ హరియే సత్యం, తక్కినదంతా మిథ్య అని తెలుసుకుంటాడు. పిదప హరియే అన్నీ అయివున్నట్లు దర్శిస్తాడు. ఆ భగవంతుడు మాయ, జీవజగత్తులు అన్నీ అయివుండటం దర్శిస్తాడు. మొదట అనులోమం, ఆ తరువాత విలోమం. ఇది పురాణాల దృక్పథం.
“బిల్వఫలాన్ని ఉదాహరణగా తీసుకో. దాన్లో కండ, విత్తనాలు, పెంకు ఉన్నాయి. పెంకును, విత్తనాలను తీసివేస్తే కండ మాత్రం లభిస్తుంది. కాని బిల్వఫలం బరువు తెలుసుకోవాలంటే, పెంకును, విత్తనాలను తీసివేస్తే కుదరదు. అదే విధంగా మొదట జీవజగత్తులను త్రోసిరాజని సచ్చిదానందాన్ని పొందాలి. సచ్చిదానందాన్ని పొందాక, ఆయనే సమస్త జీవజగత్తులుగా అయివుండటం దర్శించవచ్చు. కండ ఏ వస్తువుకు చెందినదో ఆ వస్తువు నుండే విత్తనాలు, పెంకు ఉద్భవించాయి. మజ్జిగకు చెందినదే వెన్న, వెన్నకు చెందినదే మజ్జిగ అన్నట్లుగా.
“కాని సచ్చిదానంద పరబ్రహ్మం ఎలా ఇంత కాఠిన్యం వహించాడు అని ప్రశ్నించవచ్చు. ఉదాహరణకు భూమిని తాకుతున్నాం; అది ఎంత కఠినంగా ఉంది! దీనికి జవాబు ఏమిటంటే, రక్తం, వీర్యం ద్రవాలే! కాని వాటినుంచే కదా ఇంత పెద్ద జీవుడైన మనిషి ఉద్భవిస్తూ ఉన్నాడు. భగవంతుడికి అన్నీ సుసాధ్యాలే. మొదట అఖండ సచ్చిదానందాన్ని చేరుకో, పిదప క్రిందికి దిగి వచ్చి ఇదంతా చూడు.
19.9.2 సర్వమూ భగవంతుడే! – యోగి, భక్తుడు
“భగవంతుడే సర్వమూ అయివున్నాడు. ఆయనను మినహాయించి ప్రపంచం అంటూ ఏదీ లేదు. గురువు వద్ద వేదాలు అధ్యయనం చేయగానే రాముడికి వైరాగ్యం జనించింది. సంసారం స్వప్నతుల్యమైతే దాన్ని త్యజిస్తేనే మంచిది అనసాగాడతడు. దశరథుడు భీతిల్లాడు. రాముడికి నచ్చ చెప్పటానికి గురువైన వసిష్ఠుని పంపించాడు. వసిష్ఠుడు, రాముడితో ఇలా అన్నాడు: ‘రామా! నువ్వు సంసారాన్ని త్యజించాలని ఎందుకు అంటున్నావు? ఈ ప్రపంచం భగవంతుని నుండి వేరై ఉన్నదని నాకు నిరూపించు. ఈ ప్రపంచం భగవంతుని నుండే ఆవిర్భవించలేదని నువ్వు నిరూపిస్తే నువ్వు సంసారాన్ని త్యజించవచ్చు.’ రాముడు మౌనంగా ఉండిపోయాడు, అతడు ఏ జవాబు ఇవ్వలేకపోయాడు.
“తత్త్వాలు అన్నీ చివరకు ఆకాశతత్త్వంలో లీనం అవుతున్నాయి. మళ్లీ సృష్టి సమయంలో ఆకాశతత్త్వం నుంచి మహత్ తత్త్వం, మహత్ తత్త్వం నుంచి అహంకారం – ఈ క్రమంలోనే సృష్టి జరిగింది. ఇదే అనులోమ విలోమం. భక్తుడు అన్నిటినీ అంగీకరిస్తాడు. భక్తుడు అఖండ సచ్చిదానందాన్ని అంగీకరిస్తాడు, జీవజగత్తులనూ అంగీకరిస్తాడు.
“కాని యోగి మార్గం వేరు. అతడు పరమాత్మను చేరుకుంటాడు; తిరిగి రాడు. పరమాత్మతో ఐక్యమైపోతాడు.
“ఒక్క దాన్లోనే భగవంతుని దర్శించేవాడు పరిమితుడైన జ్ఞాని; దానికి అతీతంగా భగవంతుడు లేడనుకొంటాడతడు.
“భక్తులు మూడు తరగతులకు చెంది ఉన్నారు. అధమ తరగతి భక్తుడు, ‘భగవంతుడు అదుగో అక్కడున్నా’ డంటాడు ఆకాశాన్ని చూపుతూ. మధ్య తరగతి భక్తుడు, ‘భగవంతుడు హృదయ మధ్యంలో అంతర్యామి రూపంలో నెలకొని ఉన్నాడు’ అంటాడు. ఉత్తమ భక్తుడు, ‘భగవంతుడే సర్వమూ అయివున్నాడు; మనకు కానవస్తున్నదంతా భగవంతుని విభిన్న స్వరూపాలే’ అంటాడు. నరేంద్రుడు మునుపు వేళాకోళం చేసేవాడు: ‘అవును! సమస్తమూ భగవంతుడే. ఇదుగో ఈ కుండా భగవంతుడే, ఈ గ్లాసూ భగవంతుడే!’ అనేవాడు. (అందరూ నవ్వారు)
19.9.3 సంశయ నాశనం – కర్మత్యాగం – విరాట్మూర్తియే శివుడు
“భగవద్దర్శనం కలిగితే సంశయాలన్నీ సమసిపోతాయి. వినటం వేరు, ప్రత్యక్షంగా చూడటం వేరు. వినటం వలన పదహారు అణాల విశ్వాసం (అంటే, నూటికి నూరుపాళ్ళ విశ్వాసం) కలుగదు; ప్రత్యక్షంగా చూసినప్పుడు విశ్వసించకపోవటమంటూ ఉండదు.
“భగవద్దర్శనం కలిగితే కర్మత్యాగం సంభవిస్తుంది. అట్లే నా నుంచి పూజ నిలిచిపోవటం జరిగింది. కాళికాలయంలో పూజ నిర్వర్తిస్తూ వచ్చాను. ఒకనాడు హఠాత్తుగా సర్వమూ చిన్మయమై ఉన్నట్లు చూపబడింది – ఉద్ధరిణ, పంచపాత్ర, వేదిక, వాకిలి – అన్నీ చిన్మయమే. మనుష్యులు, జీవజంతువులు – అన్నీ చిన్మయం! తక్షణమే ఒక పిచ్చివాడిలా నాలుగు ప్రక్కలా పువ్వులను విరజిమ్మాను. కంటబడిన దానినల్లా పూజించ నారంభించాను.
“ఒక రోజు శివుని శిరస్సుపై బిల్వపత్రాన్ని సమర్పించబోయాను. అప్పుడు ఆ విరాట్మూర్తియే శివుడనే దర్శనం నాకు కలిగింది. నాటి నుంచి శివుణ్ణి విగ్రహరూపంలో పూజించటం ఆగిపోయింది. ఒక రోజు పువ్వులు కోస్తూ ఉన్నాను. హఠాత్తుగా పువ్వుల మొక్కలన్నీ (విరాట్ మూర్తికి అలంకరించబడిన) పువ్వుల గుత్తులుగా ఉండటం దర్శనీయమైనది.”
త్రైలోక్యుడు: ఆహా! భగవంతుని సృష్టి ఎంత అందంగా ఉంది!
శ్రీరామకృష్ణులు: అలా కాదు, అది నాకు హఠాత్తుగా చూపించబడింది; లెక్కలు వేస్తూ కాదు. ప్రతి పువ్వుల మొక్కా ఒక పువ్వుల గుత్తిగా ఆ విరాట్‌మూర్తిని అలంకరించినట్లు గాంచాను. నాటి నుంచి పువ్వులు కోయటానికి స్వస్తి చెప్పాను. మనిషినీ అట్లే నేను చూస్తూ ఉన్నాను. భగవంతుడే మానవదేహం ధరించి, అలలపై దిండు తేలుతూ ఉన్నట్లు ఇటూ అటూగా చలిస్తూ ఉన్నాడు. అల ఒకసారి దిండును పైకి తీసుకు వెళుతుంది, మరోసారి క్రిందికి తీసుకుపోతుంది.
19.9.4 దేహధారణ ఎందుకు? – శ్రీరామకృష్ణుల కోరికలు
“దేహం రెండు రోజులకే, భగవంతుడొక్కడే సత్యం. దేహం ఇదుగో ఉంది, మరుక్షణం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం నే నొకసారి ఉదర వ్యాధితో అమిత బాధ ననుభవించాను. దాన్ని నయం గావించమని జగజ్జననిని వేడుకోమని హృదయ్ చెప్పాడు. రోగం గురించి ఆమెకు విన్నవింప నేను సిగ్గుపడ్డాను. ‘అమ్మా! నేను సొసైటీలో (ఏసియాటిక్ సొసైటీ) మనిషి అస్థిపంజర మొక దానిని చూశాను. ఎముకల నన్నిటినీ తీగలతో కట్టి మనిషి ఆకృతిని తయారుచేశారు. అమ్మా! అదే విధంగా ఈ దేహాన్ని ఒకింత దృఢతరం చేయి, దానితో నీ నామగుణకీర్తనలు చేసేటట్లు’ అన్నాను.
“జీవించాలనే ఇచ్ఛ ఎందుకు? రావణుని వధించాక రామలక్ష్మణులు లంకలోకి ప్రవేశించారు. రావణుని అంతఃపురంలోకి వెళ్లారు. వారిని చూడగానే రావణుని తల్లి నికషా పారిపోయింది. ఇది చూసి లక్ష్మణుడు విస్తుబోయి రాముడితో, ‘అన్నా! నికషా వంశం పూర్తిగా అంతరించిపోయింది. ఇంత జరిగాక కూడా ప్రాణం మీద ఇంత ఆశా!’ అన్నాడు. రాముడు నికషాను తన ప్రక్కకు పిలిపించి, ‘భయపడవద్దు. అవునూ, ఎందుకు అలా పరుగెత్తావు?’ అని అడిగాడు. అందుకు నికషా, ‘రామా! నేను ప్రాణభీతితో పరుగెత్తలేదు. సజీవంగా ఉండబట్టే నీ లీలలు కొన్నిటిని చూడగలిగాను. ఇంకా బ్రతికి ఉంటే ఇంకెన్నో లీలలను చూడవచ్చునే, అందుకోసమే పరుగెత్తాను’ అంది.
“కోర్కెలు లేకుంటే దేహంలో ప్రాణం నిలువదు. (నవ్వుతూ) నాకూ ఒకటి రెండు కోర్కెలున్నాయి. ‘అమ్మా! కామినీకాంచనాలను త్యజించినవారి సాంగత్యం నాకు లభింపచేయి’ అని అమ్మను ప్రార్థించాను. మళ్లీ, ‘అమ్మా! నీ జ్ఞానుల, భక్తులతో సాంగత్యం చేస్తాను. కనుక కాస్త అటూ ఇటూ వెళ్లి వారిని చూడటానికి ఒకింత శక్తిని ఇవ్వు’ అనీ అడిగాను. కాని అలా తిరగగలిగే శక్తిని ఆమె ప్రసాదించలేదు.”
త్రైలోక్యుడు (నవ్వుతూ): కోర్కెలన్నీ ఈడేరినవా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. (అంతా నవ్వారు) దేహం రెండు రోజులకు మాత్రమే. నా చేయి విరిగినప్పుడు అమ్మతో ‘అమ్మా! చెయ్యి అమితబాధగా ఉంది’ అని మొరపెట్టుకున్నాను. అప్పుడు ఆమె నాకు ఒక బండిని, దాని చోదకుడను చూపించింది. బండిలో ఒకటి రెండు స్క్రూలు (మేకులు) వదులుగా ఉన్నాయి. చోదకుడు నడుపుతూ ఉన్నట్లే బండి పోతూ ఉంది, తనదంటూ దానికి ప్రత్యేకంగా ఏ శక్తీ లేదు.
“అలా అయినప్పుడు దేహ సంరక్షణార్థం ఎందుకింత అక్కర చూపుతున్నాను? భగవంతుని అనుభవించడానికే, ఆయన నామగుణాలను కీర్తించటానికే, ఆయన జ్ఞానుల, భక్తుల చూడబోవటానికే.”
19.10 దశమ పరిచ్ఛేదం నరేంద్రుని సుఖదుఃఖాలు – సుఖదుఃఖాలు దేహానికే !
నరేంద్రుడు శ్రీరామకృష్ణుల ముందు క్రింద కూర్చుని ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (త్రైలోక్యుడు, తక్కిన భక్తులతో): దేహానికి సుఖదుఃఖాలు ఉండనే ఉంటాయి. నరేంద్రుణ్ణే తీసుకోండి – తండ్రి మరణించాడు, ఇంట్లో అలవికానన్ని కష్టాలు; ఏ దారీ కానరాదు. భగవంతుడు కొన్ని సమయాల్లో మనలను సుఖాలలో ఓలలాడిస్తాడు, మరికొన్ని సమయాలలో దుఃఖంలో ముంచెత్తుతాడు.
త్రైలోక్యుడు: మహాశయా, భగవంతుడు నరేంద్రుని పట్ల కనికరిస్తాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అదెప్పుడు? అన్నపూర్ణాదేవి కొలువుచేసి ఉన్న కాశీలో ఎవరూ పస్తులతో గడపరు కాని కొందరు అందుకై సాయంత్రం వరకు వేచి ఉండవలసి వస్తుంది.
“హృదయ్ ఒకసారి శంభుమల్లిక్ను కొంత డబ్బు అడిగాడు. శంభుమల్లిక్ ఆంగ్లేయుల దృక్పథం కలిగినవాడు. అతడు హృదయ్‌తో, ‘నీకు నే నెందుకు డబ్బు ఇవ్వాలి? నువ్వు ఏదైనా పనిచేసుకుని పొట్టపోసుకోవచ్చు కదా! నువ్వు ఎలాగూ ఏదో ఉద్యోగం చేస్తూనే ఉన్నావు కదా! నువ్వు పేదవాడివో లేక గ్రుడ్డి, కుంటివాడుగా ఉంటే, ఆ సంగతి వేరు. వారికి ఏమైనా ఇస్తే కాస్త పుణ్యమైనా దక్కుతుంది’ అన్నాడు. అందుకు హృదయ్ ఇలా అన్నాడు: ‘మహాశయా! దయచేసి మీరు అలా అనవద్దు. నాకు మీ డబ్బు వద్దు. భగవంతుడు నన్ను గ్రుడ్డి, కుంటి, లేక అతి పేదవాడుగా కాకుండా కాపాడితే చాలు, అదే పదివేలు. మీరు ధనం ఇచ్చే అవసరమూ లేదు, నేను పుచ్చుకొనే అవసరమూ ఉండదు.’”
19.10.1 నరేంద్రుడు, నాస్తికవాదం – భగవంతుని లీల, భీష్మపితామహుడు
నరేంద్రుణ్ణి ఇంకా కరుణించలేదే అని భగవంతుని పట్ల శ్రీరామకృష్ణులు ఆక్రోశంతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంది. మధ్య మధ్యలో ఆయన నరేంద్రుని ఆప్యాయంగా చూస్తూ ఉన్నారు.
నరేంద్రుడు: ప్రస్తుతం నేను నాస్తిక వాదాల గురించి చదువుతున్నాను.
శ్రీరామకృష్ణులు: అస్తి, నాస్తి – రెండూ ఉన్నాయి; ఒకటి ఆస్తికత్వం, మరొకటి నాస్తికత్వం. మరి ఆస్తికత్వాన్నే నువ్వెందుకు అంగీకరించకూడదు?
సురేంద్రుడు: భగవంతుడు న్యాయపరాయణుడు, భక్తులను ఆయన వదలి పెట్టడు.
శ్రీరామకృష్ణులు: పూర్వజన్మలో దానధర్మాలు చేసిన వారికే సంపదలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కాని విషయం ఏమిటో తెలుసా? ఈ సంసారం ఆయన మాయ. మాయ యొక్క పనులలో పలు గందరగోళాలు, ఏమిటో అర్థం కాదు.
“భగవంతుని లీలలు వేటినీ అర్థం చేసుకోలేము. అంపశయ్యపై పరుండి ఉన్న భీష్ముణ్ణి దర్శింప పాండవులు కృష్ణుడితోబాటు వెళ్లారు. క్షణకాలం తరువాత చూసేసరికి, భీష్ముడు విలపిస్తున్నాడు. పాండవులు కృష్ణుడితో, ‘కృష్ణా! ఏమిటి ఇది? పితామహుడు అష్టవసువులలో ఒకడు. ఈయన వంటి జ్ఞానిని ఎక్కడా చూడలేము. ఈయన కూడా మాయలో చిక్కుకొని, మరణించే సమయంలో ఇలా విలపిస్తున్నారే?’ అని అడిగారు. అందుకు కృష్ణుడు, ‘భీష్ముడు అందుకై విలపించటం లేదు. ఆయన్నే అడిగి చూడండి’ అన్నాడు. కారణం అడిగినప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు: ‘కృష్ణా! భగవంతుని లీలలను వేటినీ నేను అర్థం చేసుకోలేకున్నాను. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు వెంట ఉన్నప్పటికీ పాండవుల దుఃఖాలకు అంతమే లేకున్నదే! దాన్ని తలంచే విలపిస్తున్నాను. దీన్ని గురించి యోచిస్తూ ఉన్నప్పుడు, భగవంతుని లీలలను అర్థం చేసుకోవటం అసాధ్యం అని తెలియవస్తోంది.’
19.10.2 శుద్ధ ఆత్మ అచలం
“వేదాలు శుద్ధ ఆత్మ అంటూ పేర్కొనే పరమాత్మ మాత్రమే మేరువులా అచలుడు, నిర్లిప్తుడు, సుఖదుఃఖాలకు అతీతుడు అని భగవంతుడు నాకు దర్శింపజేశాడు. ఆయన మాయ యొక్క కార్యాలలో ఎన్నో గందరగోళాలు! దీని పిదప ‘ఇది’, దీని నుండి ‘అది’ సంభవిస్తుంది అంటూ దేనినీ చెప్పలేం.’
సురేంద్రుడు (నవ్వుతూ): పూర్వజన్మలో దానధర్మాలు చేయడం వల్ల ఈ జన్మలో ధనం లభించే పక్షంలో మనం దానధర్మాలు చేయటం మంచిది.
శ్రీరామకృష్ణులు: ధనవంతుడు దానం చేయాలి. (త్రైలోక్యునితో) జయగోపాల్ సేన్ వద్ద ధనం మూలుగుతోంది, అతడు దానం చేయాలి. అలా చేయకుంటే అతడు నిందార్హుడు. కొందరి వద్ద ధనం ఉన్నప్పటికీ, వారు పిసినారులుగా ఉంటారు; ఆ ధనాన్ని ఎవరు అనుభవించబోతారో కూడా నిశ్చయంగా తెలియరాదు.
“నాడు జయగోపాల్ వచ్చి ఉన్నాడు. బండిలో వచ్చాడు. బండిలోని లాంతరు పగిలిపోయి ఉంది, గుర్రం శ్మశానం నుంచి తప్పించుకొని బ్రతికి వచ్చినట్లుగా ఉంది, బండి తోలేవాడో మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నుండి అప్పుడే బయటపడ్డ వ్యక్తిలా ఉన్నాడు. అతడు ఇక్కడికి తీసుకువచ్చినది క్రుళ్లిన రెండు దానిమ్మ పళ్లు.” (అందరూ నవ్వారు)
సురేంద్రుడు: జయగోపాల్ బాబు బ్రహ్మసమాజానికి చెందినవాడు. ప్రస్తుతం కేశవ్ బ్రహ్మసమాజంలో చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరూ లేరని అనుకుంటాను. విజయ్గోస్వామి, శివనాథ్ ప్రభృతులు దాన్లోనుంచి వైదొలగి సాధారణ బ్రహ్మసమాజాన్ని ప్రారంభించారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): గోవింద అధికారి తన నాటక బృందంలో మంచి నటులను ఉంచుకోడు, లాభంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది, అందుకని. (అందరూ నవ్వారు)
“కేశవ్ శిష్యుడొకణ్ణి నాడు చూశాను. కేశవ్ ఇంట్లో అప్పుడు నాటకం జరుగుతోంది; దాన్లో ఆ శిష్యుడు ఒక పసిబాలుని చంకనెత్తుకొని నృత్యం చేశాడు. పైగా అతగాడు లెక్చర్ కూడా ఇస్తాడట. ఇతడికే బోధ అవసరమై ఉంది, దీన్లో ఇతడు బోధిస్తూ ఉన్నాడే అనుకున్నాను.”
తరువాత త్రైలోక్యుడు పాడసాగాడు:
పరమానందపు ఎరుక సాగరో
పరిభాగంబున పైపై కెగయుచు
పరమానంద ప్రేమతరంగాల్
లేచు టెంతటి పారవశ్యమో!
పరమేశ్వరుని చిద్విలాసమో!॥ ప ॥
ఉపరితలంబున ఉద్భవించుచు
నవ్యమనోహర నిత్యనూతన
అత్యాశ్చర్యకర పద దివ్యా
నందోత్తుంగ తరంగ పంక్తులు॥ ప ॥
ఎల్లవేళల లేచెడు నిర్మల
రూపరాసు లా తరంగ పంక్తులు
దేశకాల పరిచ్ఛిన్న కుడ్యములు
ఏ విధి కరుగుచు అంతరించునో
ఆ విధి కలియును మరియొక్క పరి
సర్వోన్నత దివ్యసమైక్యమందున॥ ప ॥
అట్టి సమయమున అమితోత్సాహము
పొంగిపొరలగా పరవశత్వమున
చేతులెత్తుచు ఆడుచు మనసా
పాడుము శ్రీహరి పావన నామము॥ ప ॥
పాట ముగిశాక శ్రీరామకృష్ణులు అతడితో, “ ‘వెర్రివానిని చేయవే నీ ప్రేమలోన….’ అనే పాట పాడు” అని అడిగారు. త్రైలోక్యుడు ఆ పాడ పాడాడు.
వెర్రివానిని చేయవే । నీ ప్రేమలోన
పిచ్చివానిని చేయవే । ననుగన్న తల్లి॥ వె ॥
ఏల జ్ఞానము ఏల తర్కము
చాలుచాలివి ఏల నాకు
బాలుడను నీ ప్రేమ మద్యము
గ్రోలజేయుము కొల్లకొల్లగ॥ వె ॥
నను తప్పత్రాగింపవే । నీ ప్రేమ మధువు
నను బాగ త్రాగింపవే ।
చూడగా నీ పిచ్చి ఇల్లను
పాడులోకములోన గూడి
గోడుగోడున కొందరేడ్తురు
ఆడి కొందరు నవ్వుకొందురు॥ వె ॥
నీ ప్రేమలో ముంచవే । ఓ ప్రేమరాశీ
నీ ప్రేమలో ముంచవే ।
ప్రేమ సంద్రము నట్టనడుమన
నీమమున నను పట్టి ముంచుము
ప్రేమభక్తుల హృదయములు
కనిపెట్టి మెల్లగ బ్రోచుదానా॥ వె ॥
నను ధన్యుడను చేయవే । ఓ భాగ్యదాయీ
నను కరుణతో జూడవే ।
ఏసు బుద్ధుడు గౌరు మోసెసు
ప్రేమ మద్యము త్రాగిరందరు
వారి బ్రహ్మానంద బృందము
లోన జేరిచి ఉద్ధరింపుము॥ వె ॥