14.1 ప్రథమ పరిచ్ఛేదం భక్తులతో దక్షిణేశ్వరంలో
ఆదివారం, సెప్టెంబర్ 23, 1883
దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు తమ గదిలో రాఖాల్, ‘మ’, రామ్ తదితర భక్తులతో కూర్చుని ఉన్నారు. హాజ్రా బయట వసారాలో కూర్చుని ఉన్నాడు.
నిత్యగోపాల్, తారక్ మొదలైన వారు రామ్ ఇంట్లో బసచేసి ఉన్నారు. రామ్ వారిని అభిమానంతో చూసుకుంటున్నాడు. రాఖాల్ కొన్ని సందర్భాలలో అధర్ సేన్ ఇంట్లో ఉండేవాడు. నిత్యగోపాల్ సర్వదా పారవశ్యంలో మునిగి ఉంటాడు. తారక్ కూడా అంతర్ముఖుడై ఉంటాడు. అతడు ఎవరితోనూ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడటం లేదు.
14.1.1 నరేంద్రుని గురించి శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (ఒక భక్తుడితో): నరేంద్రుడు నిన్ను లైక్ (ఇష్టపడటం) చేయటం లేదు. (‘మ’ తో) ఆ రోజు నరేంద్రుడు, అధర్ ఇంటికి ఎందుకు రాలేదు?
“పాట, సంగీత వాయిద్యాలను వాయించటం, చదువు, సంభాషణా చాతుర్యం మొదలైన ప్రతిభలు ఎన్నో అతడిలో ఉన్నాయి! ఆ రోజు అతడు ఇక్కడ నుంచి కెప్టెన్ బండిలో వెళ్లాడు. అతణ్ణి తన సమీపంలో కూర్చోమని కెప్టెన్ ఎంతగానో బ్రతిమాలాడు. అతడు ఒక మూలగా కూర్చున్నాడు. కెప్టెన్ వంక తిరిగి కూడా చూడలేదు.
14.1.2 గౌరీ పండితుడు – శ్రీరామకృష్ణులు
“కేవలం పాండిత్యంతో ఏం ఒనగూరుతుంది? సాధన – భజనలు చేయాలి. ఇందేష్కు చెందిన గౌరీ – పండితుడుగాను ఉండేవాడు, సాధకుడుగాను ఉండేవాడు. అతడు దేవీ ఉపాసకుడు. దేవీ భావనలో మునిగిపోయి కొన్ని సమయాలలో ఉన్మత్తుడయిపోయేవాడు. అప్పుడప్పుడు “హారేరేరే నిరాలంబ లంబోదర జననీ కం యామి శరణమ్?”* అనేవాడు. అప్పుడు తక్కిన పండితులు ఆయన ఎదుట పురుగులు లాగా కనిపించేవారు. నేనూ భావపారవశ్యంలో మునిగిపోయేవాణ్ణి. నా భోజనం చూసి ‘మీరు భైరవీ తోటి సాధన చేశారా?’ అని అడిగాడు.
“కర్తాభజా సంప్రదాయానికి చెందిన ఒక వ్యక్తి నిరాకారం అన్నదాన్ని నీర్–ఆకారం* అని విడదీసి అర్థం చెప్పాడు. ఇది విన్న గౌరీ పండితుడి కోపం తారాస్థాయికి లేచింది.
“మొదట్లో గౌరీ కాస్తంత దురభిమానియైన శాక్తేయునిగా ఉండేవాడు. తులసిదళాలను రెండు పుల్లలతో కోసేవాడు, చేతులతో స్పృశించేవాడు కాదు.* (అందరూ నవ్వారు) తరువాత ఊరుకు వెళ్ళాడు. తిరిగి వచ్చాక ఇవన్నీ ఆగిపోయాయి.
“నేను ఒక తులసి మొక్కను కాళికాలయం ముందు నాటాను. అది ఎండిపోయింది. బలిపీఠం సమీపాన తులసి మొక్క ఎదగదో ఏమో!
“గౌరీపండితుడు అన్ని విషయాలకు అద్భుతంగా అర్థ వివరణ ఇస్తాడు. ‘ఓ – ఇ’ అంటే ‘ఓ శిష్యా! ఇదుగో నీ ఇష్టదైవం’ అని అర్థ వివరణ చేస్తాడు. రావణుని పది తలలు పది ఇంద్రియాలను సూచిస్తాయని చెబుతాడు. పైగా కుంభకర్ణుడు తమో గుణానికి, రావణుడు రజో గుణానికి, విభీషణుడు సత్త్వ గుణానికి ప్రాతినిధ్యం వహిస్తారనీ, అందుచేతనే విభీషణుడు రాముని శరణుజొచ్చాడనీ చెబుతాడు.”
14.1.3 రామ్, తారక్, నిత్యగోపాల్
శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కలకత్తా నుంచి రామ్, తారక్ మొదలైనవారు వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు ప్రణామాలు ఆచరించి, నేల మీద కూర్చున్నారు. ‘మ’ కూడా నేల మీద కూర్చున్నాడు. “మేము మృదంగం వాయించటం నేర్చుకుంటున్నాం” అని రామ్ అన్నాడు.
శ్రీరామకృష్ణులు (రామ్‌తో): నిత్యగోపాల్ నేర్చుకుంటున్నాడా?
రామ్: లేదండి. అతడికి కాస్త వాయించటం తెలుసును, అంతే!
శ్రీరామకృష్ణులు: తారక్?
రామ్: అతడు బాగా వాయిస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు: అట్లా అయితే అతడి దృష్టి అంత నేలబారుగా ఉండబోదు. ఏదేని వస్తువు గురించి మనస్సు అధికంగా లగ్నం అయ్యేకొద్దీ భగవంతునిపై లగ్నం అవటం తగ్గిపోతుంది.
రామ్: సంకీర్తనకు ఉపయుక్తంగా ఉంటుందనే నేను దీన్ని నేర్చుకొంటున్నాను.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): బహుశా నువ్వు కూడా పాడటం నేర్చుకున్నావనుకుంటాను!
‘మ’ (నవ్వుతూ): లేదండీ, ఎప్పుడైనా కూనిరాగాలు తీస్తుంటాను, అంతే.
శ్రీరామకృష్ణులు: నీకు ఈ పాట పాడటం తెలుసునా – ‘పిచ్చివానిని చేయవే! ననుగన్న తల్లి’ – తెలిస్తే పాడు. ఈ పాట నా మనోస్థితికి యథాతథంగా అద్దం పడుతుంది.
14.1.4 హాజ్రాకు ఉపదేశం – ద్వేషాన్ని త్యజించాలి
(రామ్ ప్రభృతులతో) “కామార్పుకూర్లో ఉంటూ ఉన్నప్పుడు నేను ఒకరి ఇంటికి తరచూ వెళ్లేవాడిని. ఆ కుటుంబంలోని పిల్లలూ నా సమవయస్కులే. వారు కొన్ని రోజుల క్రితం ఇక్కడకు వచ్చి ఉన్నారు. రెండు మూడు రోజులు బసచేశారు. వారి తల్లి, హాజ్రా లాగా అందరినీ ద్వేషిస్తుంది. ఆమె కాలికి దెబ్బ తగిలింది. కొద్దిరోజుల్లో అది పుండుగా మారి, చీము పట్టింది. ఆ పుండు నుంచి బయల్వెడలే దుర్వాసన భరించరానిదైపోయింది. ఆమె ప్రక్కకు కూడా ఎవరూ పోలేనంత స్థితికి దిగజారింది. అందుకనే హాజ్రాకు ఈ సంగతి చెప్పి ఎవరినీ ద్వేషించవద్దని చెప్పాను.”
ప్రత్యేకంగా కొందరిని ద్వేషించడం హాజ్రాకు అలవాటు.
సాయంత్రం నాలుగు గంటలు అయింది. శ్రీరామకృష్ణులు సరుగుడు తోపుకు వెళ్లి ముఖం, కాళ్ళు చేతులు ప్రక్షాళనం చేసుకొని గదికి తిరిగి వచ్చారు. గదికి ఆగ్నేయంలో ఉన్న వసారాలో జంపఖానా పరచి ఉంది. శ్రీరామకృష్ణులు దాని మీద కూర్చున్నారు. రామ్ ప్రభృతులు అక్కడ ఉన్నారు. అధర్సేన్ స్వర్ణకారుల కులానికి చెందినవాడు. అతడి ఇంట్లో రాఖాల్ భోజనం చేయటం గురించి రాంబాబు ఏదో మాట్లాడసాగాడు. అధర్ పరమభక్తుడు. స్వర్ణకారులలో ఉన్న కొన్ని ఆచార వ్యవహారాల గురించి ఎవరో మాట్లాడనారంభించారు.
వంగదేశంలోని స్వర్ణకారులు మసాలా చపాతీలను ఎంతో ఇష్టంగా తింటారు. కాయగూరలు, పప్పు ఉన్నా, లేకపోయినా మంచి బియ్యంతో వండిన అన్నమే తింటారు. చిరుతిండిగా కొన్ని పండ్లను తినే తీరాలి. పాశ్చాత్య హామ్డా పండును ఎక్కువగా ఇష్టపడతారు. ఒక ఇంటికి చేపలో, తీపిపదార్థాలో కానుకగా లభిస్తే దాన్లో కొంత భాగాన్ని బంధువుల ఇంటికి పంపుతారు. ఆ బంధువులు దాన్లో మళ్ళీ కొంతభాగాన్ని తక్కిన బంధువులకు పంపుతారు. అది ఇలా పదిహేను ఇరవై ఇళ్లకు చేరుతుంది. ఇంటి పనులను స్త్రీలే చేసుకుంటారు. అయితే వంట మటుకు ఒరియా బ్రాహ్మణులను రప్పించి, చేయించుకుంటారు. అందుకే వంటవాళ్లు ఒక ఇంట్లో ఒక గంటసేపు, మరో ఇంట్లో రెండు గంటలసేపు అంటూ పనిచేస్తారు. ఒకే వ్యక్తి నాలుగైదు ఇళ్ళలో కూడా వంట చేస్తాడు.
శ్రీరామకృష్ణులు నవ్వారు. ఆయన ఏమీ వ్యాఖ్యానం చేయలేదు.
14.1.5 సమాధిలో శ్రీరామకృష్ణులు – జగజ్జననితో సంభాషణ
రాత్రి అవబోతోంది. వాయవ్య వసారాలో నిలబడి ఉన్న శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. చాలసేపయ్యాక ఆయన మనస్సు బాహ్యచైతన్యంలోకి వచ్చింది. ఆయన స్థితి ఎంత అద్భుతమైనది? ఈ రోజుల్లో శ్రీరామకృష్ణులు దాదాపు ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటూ ఉన్నారు. ఒకింత ఉద్దీపనతోనే బాహ్యచైతన్యం కోల్పోతున్నారు. భక్తులు వచ్చినప్పుడు, వారితో కాస్త మాట్లాడతారు. తక్కిన సమయాలలో సర్వదా అంతర్ముఖులై ఉంటారు; పూజ, జపాదులు చెయ్యలేకపోతున్నారు.
బాహ్యస్మృతిలోకి వచ్చిన శ్రీరామకృష్ణులు, నిలబడే జగజ్జననితో మాట్లాడసాగారు: “అమ్మా! పూజ చెయ్యలేకపోతున్నాను. జపం చేయలేకున్నాను. అమ్మా! నన్ను ఒక జడునిగా మార్చివేయవద్దు. సేవ్యసేవక స్థితిలో నన్ను నిలిపి ఉంచు. అమ్మా! నేను మాట్లాడేది నిలిపివెయ్యవద్దు. నన్ను మాట్లాడనివ్వు. నీ దివ్యనామగుణ కీర్తనలను నేను గానం చేస్తానమ్మా! నాకు ఒకింత శారీరక బలాన్ని అనుగ్రహించు. ఇక్కడా అక్కడా వెళ్లిరావటానికి, నిన్ను కీర్తించే చోట్లకు వెళ్లటానికి, నీ భక్తులు ఉన్న చోట్లకు పోవటానికి నాకు కాస్త శక్తి నివ్వు.”
శ్రీరామకృష్ణులు నాటి ఉదయం కాళికాలయానికి వెళ్లి జగజ్జనని పాదపద్మాలకు పుష్పాలు సమర్పించారు. దాన్ని గురించి ఆమెతో మాట్లాడసాగారు.
“అమ్మా! నేటి ఉదయం నీ పాదపద్మాలకు పుష్పాలు సమర్పించి, నమస్కరించాను. నా మనస్సు మళ్ళీ పూజలో పాల్గోవటం చూసి ‘ఇది మంచిదే’ అని తోచింది. అయితే అమ్మా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా అయిపోయింది? మరలా నన్ను ఎందుకు జడునిలా చేసివేస్తున్నావు?”
కృష్ణపక్షపు ఏడవ రోజు (సప్తమి). ఆకాశవీథిలో ఇంకా చంద్రుడు కానరాలేదు. చీకటి రాజ్యం చేస్తోంది. శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవశ్యస్థితిలోనే ఉన్నారు. గదిలో చిన్న మంచం మీద కూర్చునే జగజ్జననితో మాట్లాడుతున్నారు.
14.1.6 ఈశాన్కు ఉపదేశం – కలియుగానికి వైదికమతం చెల్లదు – మాతృభావం శ్రేష్ఠం
భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నట్లు తోస్తున్నది. ఈశాన్ గురించి మాట్లాడుతూ ఉన్నట్లున్నారేమో! ఈశాన్ భాట్పాడా వెళ్ళి గాయత్రీ పురశ్చరణం చెయ్యాలని చెప్పి ఉన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు ఆతడితో, “కలియుగానికి వైదిక మతం చెల్లదు” అని చెప్పి ఉన్నారు. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. ఆయుస్సు తక్కువ – దేహబుద్ధి, విషయబుద్ధి అడుగంటా నశించవు. అందుచేతనే ఈశాన్తో మాతృభావనతో తాంత్రిక విధానంలో సాధన చెయ్యమని ఉపదేశించారు. పైగా ఆతడితో “ఎవరు బ్రహ్మమో ఆయనే దేవి, ఆయనే ఆద్యాశక్తి” అనీ చెప్పి ఉన్నారు.
శ్రీరామకృష్ణులు భావపారవశ్యస్థితిలో మాట్లాడటం మొదలుపెట్టారు: “మళ్ళీ గాయత్రీ పురశ్చరణమా? ఈ కప్పు నుండి ఆ కప్పుకు దూకటమా?… ఆతడికి దాన్ని గురించి ఉపదేశించింది ఎవరు? ఆతడు తన పద్ధతిలో చేస్తున్నాడు…. కాస్త పురశ్చరణ చెయ్యనీ.
(‘మ’ తో) “మంచిది. నా భావనలన్నీ యథార్థాలా, భ్రమలా?”
శ్రీరామకృష్ణులు జగజ్జననితో ఈ రీతిలో మాట్లాడటం ‘మ’ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. భగవంతుడు మనకు అతి సమీపంలో ఉన్నాడు – బాహ్యంలోను అంతరంలోను ఉన్నాడు. అతి సమీపంలో లేకుంటే ఇంత మెల్లని కంఠస్వరంలో శ్రీరామకృష్ణులు ఎలా ఆయనతో మాట్లాడగలరు?
14.2 ద్వితీయ పరిచ్ఛేదం పండితులకు సాధువులకు మధ్య వ్యత్యాసం – కలియుగానికి నారదీయ భక్తే మార్గం
బుధవారం, సెప్టెంబరు 26, 1883
నేడు బుధవారం. అందుచేత భక్తులు తక్కువ సంఖ్యలోనే వచ్చి ఉన్నారు. ఆదివారాలలో పెద్ద సంఖ్యలో రావటం కద్దు.
‘మ’ కు మధ్యాహ్నం ఒంటిగంటన్నరకల్లా సెలవు దొరికింది. మూడు గంటలకు దక్షిణేశ్వరం చేరుకున్నాడు. రాఖాల్, లాటులు ఎక్కువగా శ్రీరామకృష్ణులతోనే వసిస్తూ ఉన్నారు. రెండు గంటల క్రితమే కిశోరీ కూడా వచ్చి ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీదకూర్చుని ఉన్నారు. ‘మ’ రాగానే శ్రీరామకృష్ణులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన ‘మ’ తో క్షేమసమాచారాలు విచారించి నరేంద్రుణ్ణి గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఏమోయ్, నరేంద్రుణ్ణి చూశావా? (నవ్వి) ‘ఇప్పుడు కూడా ఈయన కాళికాలయానికి పోతున్నారు! అన్నీ సరైపోతే ఆ తరువాత కాళికాలయానికి వెళ్ళరు!’ అంటాడతడు.
“అతడు తరచూ ఇక్కడకు రావటం అతడి ఇంట్లో వాళ్లకి కొంచెం కూడా ఇష్టం లేదు. అప్పుడొక రోజు బండిని కుదుర్చుకొని వచ్చాడు. సురేంద్రుడు బండి బాడుగ ఇచ్చాడు. అందుకోసం నరేంద్రుడి అత్త సురేంద్రుడి ఇంటికే వెళ్ళి దెబ్బలాడింది.”
నరేంద్రుణ్ణి గురించి మాట్లాడుతూనే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి ఈశాన్య వసారాలోకి వెళ్ళారు. అక్కడ హాజ్రా, కిశోరీ, రాఖాల్ మొదలైనవారు కూర్చుని ఉన్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం దాటింది.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అవునూ, ఇవాళ నువ్వు ఎలా వచ్చావు? ‘స్కూల్’ లేదా?
‘మ’ : ఈ రోజు ఒంటి గంటన్నరకే వదలిపెట్టేశారు.
శ్రీరామకృష్ణులు: ఎందుకు అంత త్వరగా వదలిపెట్టేశారు?
‘మ’ : పాఠశాల పర్యవేక్షణకై నేడు విద్యాసాగర్ వచ్చి ఉన్నారు. పాఠశాల ఆయన సొంతమే కదా. కనుకనే ఆయన వచ్చే రోజుల్లో పిల్లల సంతోషానికై సెలవు ఇస్తూ ఉంటారు.
14.2.1 విద్యాసాగర్ – సత్యవచనం
శ్రీరామకృష్ణులు: విద్యాసాగర్ అన్నమాట నిలబెట్టుకోలేదే? సత్యవచన్, పరస్త్రీ మాతృ సమాన్, ఐసే హరి న మిలే, తులసీ ఝూట్ జబాన్ (భావం: సత్యం పలకటం, పరాయి స్త్రీలను తల్లిగా భావించటం – వీటివల్ల హరిని పొందలేకుంటే తులసీదాసు అసత్యవాది). సత్యంలో నెలకొని ఉంటే భగవంతుణ్ణి పొందవచ్చు. ఇక్కడకు వస్తానని నాడు విద్యాసాగర్ చెప్పాడు. కానీ రాలేదు.
“పండితుడికీ సాధువుకూ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఒట్టి పండితుడి మనస్సు కామినీకాంచనాలలో మునిగి ఉంటుంది. సాధువు మనస్సు శ్రీహరి పాదపద్మాల మీదనే నెలకొని ఉంటుంది. పండితుడు చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉంటుంది. సాధువు సంగతే వేరు. అతణ్ణి (విద్యాసాగర్) వదలిపెట్టు. భగవంతుడి పాదపద్మాలపై మనస్సును లగ్నం చేసిన భక్తుల మాటలు, చేతలు అన్నీ వేరు సుమా!
“కాశీలో నానక్ సంప్రదాయానికి చెందిన ఒక యువ సన్న్యాసిని చూశాను. అతడికి నీ వయస్సే ఉంటుంది. నన్ను అతడు ‘ప్రేమీ సాధూ’ అని పేర్కొనే వాడు. వారి మఠం కాశీలో ఉంది. ఒక రోజు అతడు నన్ను అక్కడకు తోడ్కొని వెళ్లాడు. మహంతను (మఠానికి అధిపతిగా ఉన్న సాధువును మహంత అంటారు) చూశాను. అతడు ఒక గృహిణిలా కనిపించాడు. నేను ఆ యువ సన్న్యాసిని ‘తరణోపాయం ఏమిటి?’ అని అడిగాను. అందుకు అతడు ‘కలియుగంలో నారదీయ భక్తే మార్గం’ అని బదులిచ్చాడు. అతడు ఏదో పుస్తకం చదువుతున్నాడు. చదివిన తరువాత “జలేవిష్ణుః స్థలేవిష్ణుః విష్ణుః పర్వత మస్తకే । సర్వం విష్ణుమయం జగత్”* అని పలికాడు. చివరగా, ‘శాంతిః శాంతిః ప్రశాంతిః’ అన్నాడు.
14.2.2 కలియుగంలో వైదికమతం చెల్లదు – జ్ఞానమార్గం
“ఒక రోజు అతడు గీతాపారాయణం చేస్తూ ఉన్నాడు. నా వంకే చూస్తూ చదివాడు. విషయాసక్తులను చూస్తూ పారాయణం చేయడు – అంతటి కచ్చితమైన వ్యక్తి. అప్పుడు మథుర్ ఉన్నాడు. మథుర్కి వీపు చూపుతూన్నట్లు కూర్చుని చదివాడు. నానక్ సంప్రదాయానికి చెందిన ఆ సాధువే ‘నారదీయ భక్తే మార్గం’ అని చెప్పిన వ్యక్తి.”
‘మ’ : ఆ సాధువులు వేదాంతవాదులు కారా?
శ్రీరామకృష్ణులు: అవును, వేదాంతవాదులే; అయితే భక్తి మార్గాన్ని కూడా అంగీకరిస్తారు. విషయం ఏమిటో తెలుసా? ఈ కలియుగంలో వైదికమతం చెల్లదు. గాయత్రీ మంత్రం పునశ్చరణ చేయబోతూన్నట్లు ఒక వ్యక్తి నాతో చెప్పాడు. అందుకే నేను అతడితో, ‘ఎందుకు, కలియుగానికి ఒప్పినది తాంత్రిక మార్గం. తాంత్రిక పథం అనుసరించి పురశ్చరణం చేయకూడదా?’ అని అడిగాను.
“వైదిక కర్మకాండ ఎంతో కఠినమైనది. దానికి తోడు ఇప్పుడు బానిసత్వం కూడా.* పన్నెండు ఏళ్లు ఒకడు బానిసగా పనిచేస్తే అతడు బానిసే అయిపోతాడని చెప్పబడి ఉంది. అంతకాలం ఎవరి క్రింద అతడు పనిచేశాడో ఆ యజమాని స్వభావం అతడికి వస్తుంది. యజమానికి సేవలు చేసి చేసి ఆతడి రజోతమో గుణాలు, జీవహింస, భోగలాలస ఇవన్నీ ఇతడికీ అబ్బుతాయి. కేవలం బానిసత్వం మాత్రమే కాక పిదప పెన్షన్ స్వీకరించీ అనుభవిస్తున్నారు.
“ఒకప్పుడు వేదాంతవాది అయిన సాధువు ఒకరు ఇక్కడకు వచ్చాడు. మేఘాన్ని చూస్తే చాలు నృత్యం చేసేవాడు. పెనుగాలితో వర్షం కురిస్తే పరమానందం చెందేవాడు. అతడు ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా సమీపంలోకి వస్తే ఎంతో కోపగించుకునేవాడు. నేను ఒక రోజు అలా వెళ్లాను. దాంతో అతడికి ఎంతో కోపం వచ్చింది. అతడు సర్వదా ‘బ్రహ్మ సత్యం జగన్మిథ్య’ అంటూ విచారణ చేస్తూ ఉన్నట్లు ఉంటాడు. మాయ కారణంగా నానా రూపాలు గోచరిస్తున్నాయి. దాన్ని సూచిస్తూ ఉన్నట్లుగా చాందినీలోని పట్టకం ఒకదాన్ని చేతపుచ్చుకొని తిరిగేవాడు. పట్టకం గుండా చూస్తే వివిధ రంగులను చూడగలము. అయితే నిజానికి పట్టకానికి ఏ రంగూ లేదు. అదే విధంగా యథార్థానికి బ్రహ్మం తప్ప మరేదీ లేదు. అయితే మాయ కారణంగా, అహంకారం కారణంగా నానా వస్తువులు కనిపిస్తాయి. మాయ క్రమ్ముతుందేమో, ఆసక్తి కలుగుతుందేమో అని ఆ సాధువు ఏ వస్తువునూ ఒక్కసారి కంటే చూసేవాడు కాడు. స్నానం చేసేటప్పుడు పక్షి ఎగురుతూ ఉండటం చూస్తే వెంటనే విచారణ చేసేవాడు. ఇద్దరం సరుగుడు తోపుకు పోయేవాళ్లం. అక్కడున్న కొలను మహమ్మదీయులది అని తెలిశాక ఆ నీటిని స్వీకరించలేదు. హలధారి అతడితో వ్యాకరణం గురించి అడిగాడు. ఆ సాధువుకు వ్యాకరణమూ తెలుసు. వ్యంజన వర్గం గురించి చర్చ జరిగింది. అతడు ఇక్కడ మూడు రోజులు ఉన్నాడు. ఒక రోజు గంగ గట్టు సమీపంలో సన్నాయి వాయించటం విని అతడు, ‘బ్రహ్మ దర్శనం పొందిన వ్యక్తి ఇటువంటి శబ్దం వింటే సమాధిస్థితిని పొందుతాడు’ అని అన్నాడు.”
14.3 తృతీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల పరమహంస స్థితి
సాధువు గురించి చెబుతూ ఉన్న శ్రీరామకృష్ణులలోనే పరమహంస స్థితిని భక్తులు కళ్లార గాంచారు. పిల్లవాడివంటి వర్తన. మధ్యమధ్యలో వదనంలో ఒక చిరుదరహాసం వికసిస్తోంది. ఒంటిపై వస్త్రం ఏదీ లేకుండా దిగంబరునిగా అగుపించారు. కళ్లు ఆనందంతో ప్రకాశిస్తున్నాయి. చిన్నమంచం మీద మళ్లీ కూర్చుని ఆయన మాట్లాడసాగారు. భక్తుల హృదయాలను ఆకట్టుకొనే అవే మాటలు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నేను నాంగ్టా నుండి వేదాంతం గురించి విన్నాను. ‘బ్రహ్మ సత్యం జగన్మిథ్య!’ ఐంద్రజాలికుడు వచ్చి ఎన్నో ఇంద్రజాల విద్యలను ప్రదర్శిస్తాడు. మామిడి చెట్టును మొలిపిస్తాడు, మామిడి పండును కూడా చూడవచ్చు. అయితే ఇవన్నీ గారడీ విద్యలు. ఐంద్రజాలకుడు మాత్రమే వాస్తవం.
‘మ’ : జీవితమే ఒక సుదీర్ఘ నిద్రలా తోస్తున్నది. దేనినీ మనం ఉన్నది ఉన్నట్లుగా అవగాహన చేసుకోలేకపోతున్నామని తెలియవస్తోంది. ఆకాశపు తత్త్వాన్ని అవగాహన చేసుకోలేని మనస్సుతోనే మనం జగత్తును చూస్తున్నాం. అందుచేత మన గ్రహణశక్తి ఎలా సరైనది అవుతుంది?
శ్రీరామకృష్ణులు: మరో మార్గం ఉంది. ఆకాశాన్ని మనం సరిగ్గా చూడటం లేదు, నిజమే. దిగంతం వద్ద ఆకాశం భూమిని తాకుతూ ఉన్నట్లు కదా చూస్తున్నాం. అటువంటప్పుడు మనిషి ఎలా సరిగ్గా చూడగలడు? అతడికి వచ్చింది సన్నిపాత జ్వరం కదా!
శ్రీరామకృష్ణులు మధుర స్వరంలో పాడసాగారు. పాట అర్థం: ‘ఓ శంకరీ, ఇది ఎటువంటి సన్నిపాత జ్వరం? నీ కృప అనే ఔషధం లభిస్తే ఈ జ్వరం దూరమైపోతుంది!’
సంభాషణ కొనసాగిస్తూ ఇలా అన్నారు: “సన్నిపాతజ్వరం కాక మరేమిటి? సంసారంలో ఉండే వ్యక్తులు పరస్పరం దెబ్బలాడుకోవటం చూడటం లేదా? ఎందుచేత ఇలా దెబ్బలాడు కుంటున్నారో ఎవరికీ తెలియదు. ‘నువ్వు నాశనమైపో! నిన్ను ఏం చేస్తానో చూడు!’ అంటూ బెదిరిస్తారు. ఏం కేకలు! ఏం తిట్లు!”
‘మ’ : ‘ఖాళీ పెట్టె, లోపల ఏమీ లేదు. ధనం ఉన్నదనుకొని ఇద్దరు వ్యక్తులు దాన్ని అటూ ఇటూ లాగుతున్నారు’ అని నేను కిశోరీతో చెప్పాను. దేహమే అన్ని అనర్థాలకూ మూలం. జ్ఞానులు ఇవన్నీ చూసే, ఈ తొడుగును వదలివేస్తేనే ప్రశాంతత అని భావిస్తారు.
14.3.1 సంసారం ఆనంద సౌధం
తరువాత శ్రీరామకృష్ణులు, ‘మ’ కాళికాలయానికి బయలుదేరారు.
శ్రీరామకృష్ణులు: ఏం? ఈ జగత్తు మాయామందిరంలా ఉండవచ్చు. అయితే అది ఆనందసౌధమనీ చెప్పబడి ఉంది. దేహం ఉంటే ఏమిటి? జీవితాన్ని ఆనందసౌధంలాగానూ రూపొందించుకోవచ్చు.
‘మ’ : నిరవచ్ఛిన్న ఆనందం ఎక్కడ ఉంది?
శ్రీరామకృష్ణులు: అవును. నువ్వు చెప్పేది నిజమే.
శ్రీరామకృష్ణులు భవతారిణీ సన్నిధానానికి వచ్చారు. దేవి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ‘మ’ కూడా అదే విధంగా నమస్కరించాడు. శ్రీరామకృష్ణులు దేవి సన్నిధికి ఎదురుగా ఉన్న క్రింది మెట్లపై ఆమెను వీక్షిస్తూ కూర్చున్నారు. ఆయన ఎర్ర అంచు పంచెను మాత్రం ధరించి ఉన్నారు. పంచె కొంగు భుజం మీదుగా, వీపుపై వ్రేలాడుతూ ఉంది. ఆయన ప్రక్కన ‘మ’ కూర్చున్నాడు.
‘మ’ : మరి అలాంటప్పుడు దేహధారణ చేయటం ఎందుకు? ఏవో కొన్ని కర్మలు చేయటానికే దేహం ఉంది అని నాకు తోస్తున్నది. అయితే ఆ దేహం ఎప్పుడు ఏం చేస్తుంది అన్నది ఎవరికి తెలుసు? ఈలోపు మరణమూ సంభవిస్తుంది.
శ్రీరామకృష్ణులు: చిక్కుడు గింజ పేడకుప్పలో పడ్డా చిక్కుడు మొక్కే మొలుస్తుంది.
‘మ’ : కాని అష్టబంధాలు ఉన్నాయి కదా!
14.3.2 సచ్చిదానందుడే గురువు – గురుకృపతోనే ముక్తి
శ్రీరామకృష్ణులు: అష్టబంధాలు కావు, అష్టపాశాలు. అవి ఉంటే ఏం? భగవత్కృప కలిగితే క్షణమాత్రంలో ఎనిమిది పాశాలూ తొలగిపోతాయి. ఎలాగో తెలుసా? వేయి సంవత్సరాలుగా చీకటి నిండిన ఒక గదిలోకి దీపాన్ని తీసుకువెళితే, ఆ క్షణంలోనే చీకటి మటుమాయమౌతుంది. కాస్తకాస్తగా చీకటి తొలగటం అంటూ ఉండదు గదా?
“ఇంద్రజాల ప్రదర్శన చూడలేదా? ఒక తాడులో అనేక ముడులు వేసి ఆ తాడు ఒక కొసను ఎక్కడో కడతాడు. రెండో కొసను చేతిలో పట్టుకుంటాడు. చేతిలో పట్టుకున్న కొసను ఒకటి రెండుసార్లు విదిలిస్తాడు. అంతే! అన్ని ముడులు విడివడి ఉంటాయి. అయితే మరో వ్యక్తి తలక్రిందులుగా ప్రయత్నించినా ముడులు విడివడవు. గురువు కృప ఉండే పక్షంలో అన్ని ముడులు క్షణంలో విడివడిపోతాయి.
14.3.3 కేశవ్‌లో మార్పుకు కారణం శ్రీరామకృష్ణులు
“అది సరే, కేశవ్ ఎందుకు ఇంతగా మారిపోయాడు? చెప్పు చూద్దాం. తరచూ అతడు ఇక్కడకు వస్తూ ఉండేవాడు. ఎలా నమస్కరించాలో ఇక్కడ నుంచే (తమ నుంచే) నేర్చుకున్నాడు. ఒక రోజు అతడితో, సాధువులకు ఈ రీతిలో నమస్కరించరాదని చెప్పాను.* ఒక రోజు బండి ఏర్పాటు చేసుకొని ఈశాన్తో కలకత్తాకు వెళ్లాను. కేశవ్ విషయాలన్నీ ఈశాన్ అడిగి తెలుకున్నాడు. చెక్కులనన్నీ ఇక్కడ నుంచే (తమ నుంచే) పాస్* చేయించుకోవాలి, అప్పుడు మాత్రమే బ్యాంకులో డబ్బు లభిస్తుందని హరీశ్ సరిగ్గానే చెప్పాడు (నవ్వారు).”
‘మ’ ఊపిరిబిగబట్టి శ్రీరామకృష్ణులు చెబుతూన్నదంతా వింటూ ఉన్నాడు. గురువు రూపంలో సచ్చిదానందుడు చెక్కులను పాస్ చేస్తూ ఉన్నాడు అని అతడు అర్థం చేసుకున్నాడు.
14.3.4 భగవంతుణ్ణి అర్థం చేసుకోలేం! – నాంగ్టా ఉపదేశం
శ్రీరామకృష్ణులు: విచారణ చేయవద్దు. ఆయనను ఎవరు అర్థం చేసుకోగలరు? ‘ఆయన ఒక అంశ నుండే ఈ బ్రహ్మాండం యావత్తూ ఉద్భవించింది’ అని నాంగ్టా చెప్పగా విన్నాను.
“హాజ్రాలో లెక్కలుకట్టే మనస్తత్వం కాస్త ఎక్కువ. ‘భగవంతుడు ఇంత పరిమాణం జగత్తుగా అయి ఉన్నాడు, ఇంత పరిమాణం మిగిలి ఉన్నాడు’ అంటూ లెక్కలు కడతాడు. అతడి లెక్కలు చూసి నాకు తల తిరిగిపోయేది. నాకు ఏమీ తెలియదు అన్న సంగతి నాకు తెలుసు. ఒకప్పుడు భగవంతుణ్ణి మంచివాడని భావిస్తాను, మరొకప్పుడు చెడ్డవాడని భావిస్తూ ఉంటాను. ఆయనను గురించి నాకు ఏం తెలుసు?”
‘మ’ : అవునండీ. భగవంతుణ్ణి తెలుసుకోగలమా ఏమిటి? ప్రతి ఒక్కరూ తమ తెలివికి తగ్గట్లు ఏదో కాస్త తెలుసుకుని, తాము సర్వం తెలుసుకొన్నట్లు అనుకొంటున్నారు. మీరన్నట్లు చక్కెర గుట్ట వద్దకు చీమ వెళ్లింది, ఒక కణంతోనే దాని కడుపు నిండిపోయింది; మళ్లీ వచ్చినప్పుడు ఈ చక్కెర గుట్టను యావత్తు తీసుకొని వెళ్లగలను అనుకొన్న కథే ఇదీను.
14.3.5 భగవంతుణ్ణి తెలుసుకోగలమా? – శరణాగతే మార్గం
శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవటానికి నేను ప్రయత్నం కూడా చేయను. నేను కేవలం ‘అమ్మా’ అని మాత్రం పిలుస్తాను. ఆమె ఏమైనా చేసుకోనీ. ఆమె ఇష్టపడితే తెలియచేస్తుంది, ఇష్టం లేకుంటే తెలుపదు. పిల్లికూన స్వభావంలాంటిది నా స్వభావం. అది మ్యావ్, మ్యావ్ అని మాత్రమే అరుస్తుంది. తల్లి పిల్లి, దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకువెళ్లి పెడుతుంది – కొన్ని వేళల్లో చెత్తకుప్పలో, కొన్ని సందర్భాలలో యజమాని పరుపు మీద పెడుతుంది. బిడ్డ తల్లిని కావాలంటుంది. తల్లికి ఎంత ఆస్తి ఉందో బిడ్డకు తెలియదు; తెలుసుకోవాలనీ బిడ్డ ఆశించదు. ‘నా కెందుకు చింత? నాకు తల్లి ఒకామె ఉన్నది’ అని బిడ్డకు తెలుసు. పనిమనిషి బిడ్డకు కూడా తల్లి ఒకామె ఉందని తెలుసు. ఆ బిడ్డ కూడా యజమాని బిడ్డతో దెబ్బలాట వస్తే, ‘నేను మా అమ్మతో చెప్పేస్తాను. నాకు అమ్మ ఉంది’ అంటుంది. నాది కూడా సంతానభావమే!
శ్రీరామకృష్ణులు అకస్మాత్తుగా తమను చూపుకుంటూ, తమ ఛాతీపై చెయ్యి ఉంచుకుని ‘మ’ తో, “దీన్లో ఏదో ఉంది, ఏమంటావు?” అని అడిగారు.
‘మ’ నివ్వెరబోతూ శ్రీరామకృష్ణులను చూస్తూ ఉండిపోయాడు. ‘శ్రీరామకృష్ణుల హృదయంలో సాక్షాత్తూ జగన్మాతయే నెలకొని ఉందా? జీవులకు మంగళం చేకూర్ప జగన్మాతయే ఇలా దేహం ధరించి వచ్చిందా?’ అని అతడు భావించసాగాడు.
14.4 చతుర్థ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో రాఖాల్ ప్రభృతులతో
సాయంత్రం వేళ. శ్రీరామకృష్ణులు కాళికాలయం ముందు మెట్లపై కూర్చుని ఉన్నారు. సమీపాన ‘మ’ తదితర భక్తులు కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు జగజ్జననిని స్తుతించసాగారు.
“అమ్మా, నా తల్లీ, ఓంకార రూపిణీ, అమ్మా, వీరు ఏమేమో చెబుతున్నారు! నేను దేనినీ తెలుసుకోలేకపోతున్నాను. అమ్మా! నాకు ఏమీ తెలియదు. నిన్ను శరణు జొచ్చాను, నేను నీ శరణాగతుడను. నాకు నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తిని మాత్రం అనుగ్రహించు. నీ భువనమోహన మాయలో మైమరచిపోయేలా చేయవద్దు. అమ్మా, శరణం! శరణం!”
ఆలయాలలో సాయంత్రపు హారతి ముగిసింది. శ్రీరామకృష్ణులు తమ గదిలోని మంచం మీద కూర్చున్నారు. ‘మ’ నేల మీద కూర్చున్నాడు. ‘మ’ మునుపు కేశవసేన్ బ్రహ్మసమాజానికి వెళ్లేవాడు. శ్రీరామకృష్ణులను దర్శించటం ప్రారంభించాక అక్కడకు పోవటం మానేశాడు. శ్రీరామకృష్ణులు జగజ్జననితో మాట్లాడటం, ఆయన సర్వమత సమన్వయం, భగవంతుడికై ఆయన అనుభవించే మనోవ్యాకులత – వీటి నన్నిటినీ చూసి ‘మ’ ఆయనకు మరింత సన్నిహితుడైపోయాడు.
రెండేళ్లుగా ‘మ’ శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూ పోతూ ఉన్నాడు. అందుచేత ఆయన కృపకు పాత్రుడైపోయాడు. భగవంతుడు నిరాకారుడని, సాకారుడు కూడా అనీ, భక్తుల నిమిత్తమై భగవంతుడు రూపం ధరిస్తాడనీ ఆయన ‘మ’ కు, తక్కిన భక్తులకు తరచూ ఉపదేశిస్తున్నారు. నిరాకార భగవంతుణ్ణి ఆరాధించే వారితో ఆయన “మీరు దేనిని విశ్వసిస్తున్నారో దాన్నే ఆరాధించండి. అయితే భగవంతుడికి అన్నీ సుసాధ్యమే అని మాత్రం మరచిపోవద్దు. ఆయన సాకారుడు, నిరాకారుడు, ఇంకా ఎన్నో విధాలుగా కూడా ఆయన ఉండగలడు” అనేవారు.
14.4.1 సాకార నిరాకారాలు – కర్తవ్య బోధ – భక్తునికి అవిద్యా సంసారం మృత్యుతుల్యం
శ్రీరామకృష్ణులు (‘మ’)తో: నువ్వు ఒక ఆదర్శాన్ని ఎంచుకున్నావు; అది భగవంతుడు నిరాకారుడని. అంతే కదా?
‘మ’ : అవునండీ. అయితే మీరు చెబుతూన్నట్లు అన్నీ సంభవమే; ఆయన సాకారుడై కూడా ఉండవచ్చు.
శ్రీరామకృష్ణులు: మంచిది, ఆయన చైతన్యరూపాన చరాచర విశ్వంలో వ్యాపించి ఉన్నాడని గుర్తుంచుకో.
‘మ’ : ఆయన చైతన్యానికే చైతన్యాన్ని కలిగిస్తాడని నాకు తోస్తూన్నది.
శ్రీరామకృష్ణులు: ప్రస్తుతం ఆ భావనలోనే నెలకొని ఉండు. బలవంతంగా భావనను మార్చుకోవలసిన అవసరం లేదు. సమస్త చైతన్యమూ భగవంతుని చైతన్యమే అని క్రమక్రమంగా తెలుసుకుంటావు. ఆయన చైతన్య స్వరూపుడు. అది సరే – ధనం, కీర్తి వీటిలో నీకు ఆకర్షణ ఉందా?
‘మ’ : లేదండీ. అయితే నిశ్చింతగా ఉండటానికి, ప్రశాంతంగా భగవత్ చింతన చేయడానికి, దైనందిన అవసరాలకై ధనం కావలసి ఉంటుంది.
శ్రీరామకృష్ణులు: అది సబబే.
‘మ’ : అది దురాశా? కాదనే అనుకుంటున్నాను.
శ్రీరామకృష్ణులు: అది సరైనదే. లేకుంటే నీ పిల్లలను ఎవరు చూసుకుంటారు? ‘నేను అకర్తను’ అనే జ్ఞానం నీకు కలిగితే ఆ తరువాత నీ పిల్లల గతి ఏమిటి?
‘మ’ : కర్తవ్యం గురించిన ఎరుక ఉన్నప్పుడు జ్ఞానం కలుగదు అని విన్నాను. కర్తవ్యం మార్తాండుని వంటిది.
శ్రీరామకృష్ణులు: ప్రస్తుతం ఈ భావనలోనే నెలకొని ఉండు. తరువాత కర్తవ్యం గురించిన ఎరుక దానంతట అదే తొలగిపోతే అది వేరే విషయం.
వారు కాసేపు మౌనంగా ఉండిపోయారు.
‘మ’ : కాస్త జ్ఞానం సంతరించుకోగానే సంసార జీవితంలో ప్రవేశించటమా? అది స్పృహతోనే మరణించటం లాంటిది. కలరా సోకి మరణించటం వంటిది.
శ్రీరామకృష్ణులు: రాం! రాం!
కలరా సోకిన వ్కక్తికి మరణించేటప్పుడు స్పృహ ఉంటుంది. కనుకనే అంతులేని బాధను అప్పుడు అతడు అనుభవిస్తాడు. అదే విధంగా ఒకింత జ్ఞానం కలుగగానే సంసార జీవితంలో ప్రవేశించటం గొప్ప విచారాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అవిద్యా సంసారం దావానల తుల్యం. అందుకనే శ్రీరామకృష్ణులు రాం, రాం అన్నారేమో!
‘మ’ : పూర్తి అజ్ఞానంలో ఉన్న జనులు సన్నిపాత రోగులవంటి వారు. వారు స్పృహ కోల్పోతారు. కనుకనే మరణ బాధను ఎరుగరు.
శ్రీరామకృష్ణులు: నువ్వే కాస్త పరిశీలించు! ధనం ఉంటే మాత్రం ఒరిగేదేముంది? జయగోపాల్ సేన్‌కు ఎంతో ధనం ఉంది; అయినా కూడా ఎంతో మనోవ్యధ. పిల్లలు ఆతణ్ణి అంతగా ఖాతరు చెయ్యరు.
‘మ’ : జీవితంలో పేదరికపు దుఃఖం మాత్రమేనా ఉంది? ఒక వంక ఆరుగురు శత్రువులున్నారు, అందుకు తోడు రోగమూ, శోకమూ అన్నీ ఉన్నాయి.
శ్రీరామకృష్ణులు: ఇది చాలదన్నట్లు పరులు గుర్తించాలని కోరుకోవటం, కీర్తి ప్రతిష్ఠల ఆకాంక్ష కూడా ఉన్నాయి. అవునూ, నన్ను గురించి నువ్వు ఏమనుకొంటావు?
‘మ’ : నిద్ర నుండి అప్పుడే లేచిన వ్యక్తి స్థితిలో మీరు ఉన్నారు. అతడు తన గురించి ఎరుక కలిగి ఉంటాడు. మీరు సర్వదా భగవంతునిలో ఐక్యమై ఉన్నారు.
శ్రీరామకృష్ణులు: నువ్వు కలలో నన్ను ఎప్పుడైనా చూశావా?
‘మ’ : అవును, చాలాసార్లు.
శ్రీరామకృష్ణులు: ఎలా? ఏదైనా ఉపదేశం ఇస్తూ ఉన్నట్లుగానా?
‘మ’ మౌనం వహించాడు.
శ్రీరామకృష్ణులు: నేను ఉపదేశిస్తూ ఉన్నట్లు కల కంటే, సచ్చిదానందుడే ఆ విధంగా ఉపదేశిస్తున్నాడని తెలుసుకో.
తరువాత తాను కలలో గాంచినదంతా ‘మ’ వివరంగా శ్రీరామకృష్ణులకు తెలిపాడు. శ్రీరామకృష్ణులు సావధానంగా విన్నారు.
శ్రీరామకృష్ణులు: ఇది చాలా మంచిది. ఇక విచారణ చేయబోకు. నువ్వు శాక్తేయుడివి.
14.5 పంచమ పరిచ్ఛేదం అధర్ ఇంట్లో దుర్గాపూజ – శ్రీరామకృష్ణులు
బుధవారం, అక్టోబర్ 10, 1883
శుక్లపక్షపు తొమ్మిదవ రోజు(నవమి). సాయంత్ర వేళ. అధర్సేన్ తన ఇంట్లో దుర్గాపూజ జరిపించాడు. పూజకు శ్రీరామకృష్ణులను ఆహ్వానించాడు. శ్రీరామకృష్ణులు సాయంత్రపు హారతిని తిలకిస్తూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులతో పలువురు భక్తులు వచ్చి ఉన్నారు. వారిలో బలరామ్ తండ్రి, సెలవులలో వచ్చిన వాడూ పాఠశాలల పర్యవేక్షకుడూ అధర్ మిత్రుడూ అయిన శారదాబాబు మొదలైన వారు ఉన్నారు. అధర్ ఇరుగు పొరుగులను కూడా పూజకు ఆహ్వానించాడు.
దేవికి సాయంత్ర హారతి పూర్తి అయ్యాక శ్రీరామకృష్ణులు పూజా మందిరంలో పారవశ్య స్థితిలో నిలబడి ఉన్నారు. పారవశ్య స్థితిలోనే దేవిని స్తుతిస్తూ పాడసాగారు.
అధర్ ఒక గృహస్థ భక్తుడు. ప్రాపంచిక దుఃఖంతో విలవిలలాడే ఇతర గృహస్థ భక్తులలో పలువురు అక్కడ ఉన్నారు. వారందరి హితానికై శ్రీరామకృష్ణులు దేవిని ప్రార్థించి పాడుతూ ఉన్నట్లుగా ఉంది:
బెదరిపోతిని మృత్యుభీతికి
తీవ్రవేదననుండి గావుము
వదలితివా నను నాశమొందుదును
ఓ ఉద్ధారిణి! ఉద్ధరింపుమని
వేడెదనమ్మా! కావుమిపుడు నను॥ బె ॥
సర్వ చరాచర త్రిభువన మాతా!
సర్వమానవ స్థితిగతి దాతా!
సర్వప్రాణి గణ ప్రియతమ జననీ!
సర్వజీవ సమ్మోహనకారీ!॥ బె ॥
రాసవిహారీ రమ్యవధూటీ!
సంతత కృష్ణానందనచేటీ!
హిమగిరి తనయా! గోవిందప్రియ!
గోపీలలనా ప్రముఖవధూటీ!॥ బె ॥
గంగాపావని! మోక్షప్రదాయిని!
విశ్వసంస్తుత! విశ్రుతకీర్తీ! శక్తీ
ఉమామహేశుని మహారాణివి
సర్వమంగళా! సర్వమయీ!॥ బె ॥
ఒకపరి రూపము దాల్చుచు నొకపరి
నిరాకారవై యుండెద వీవు
మహాదేవు ప్రియ నిత్యమనోహరి
నీ గుణ గణనంబేరికి తరము॥ బె ॥
14.5.1 శ్రీరామకృష్ణుల భావపారవశ్యం – జగజ్జననితో సంభాషణ
తరువాత శ్రీరామకృష్ణులు అధర్ ఇంటి మేడపై నున్న అతిథుల గదిలోకి వెళ్లి కూర్చున్నారు. పూజను దర్శింప వచ్చిన భక్తులు ఆ గదిలో గుమిగూడారు. బలరామ్ తండ్రీ, శారదాబాబూ సమీపంలో కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవశ్యంలోనే ఉన్నారు. అక్కడకు వచ్చిన వారిని సంబోధిస్తూ “ప్రియతములారా! నేను భోజనం చేసేశాను. మీరు పోయి విందు ఆరగించండి” అన్నారు.
అధర్ అర్పించిన నైవేద్యం, పూజ మొదలైన వాటిని జగజ్జనని స్వీకరించిందా? అందుచేతనే శ్రీరామకృష్ణులు జగజ్జనని స్థానంలో “నేను భోజనం చేసేశాను, మీరు ప్రసాదం తినండి” అంటున్నారా?
పారవశ్యంలో శ్రీరామకృష్ణులు జగజ్జననితో “అమ్మా, నేను తిననా, లేకుంటే నువ్వు తింటావా? అమ్మా, కారణానంద రూపిణీ” అన్నారు.
శ్రీరామకృష్ణులు తనను, జగజ్జననిని ఒక్కరిగానే గాంచుతున్నారా? ఎవరు జగజ్జననియో ఆమే లోకానికి ఉపదేశింప కుమారునిగా జన్మించిందా? అందుచేతనే శ్రీరామకృష్ణులు ‘నేను భోజనం చేసేశాను’ అంటున్నారా?
పారవశ్య స్థితిలో శ్రీరామకృష్ణులు దేహంలోని షడ్చక్రాలను, వాటి మధ్యన జగజ్జననిని దర్శించారా? అందుకేనా ఆ అర్థంతో పాట పాడుతున్నారు:
గతియేకాదా కాళీమాయీ!
మదిలో కాళీమాయీ మర్మము
తలచిన మదియే నిలచిపోవగా॥ గ ॥
గతజీవులుగ కాలుడు చేయగ
కాళీనామము కాలునె తోలును
మహాకాలుడే మాయి కాళి ఘన
పద పీఠంబుగ పడియుండగ భువి॥ గ ॥
నల్లనిరూపుల నతిభీషణమగు
నల్లని నలుపే నాతికి వర్ణము
ఆ వర్ణమునే హృది ధ్యానించిన
అట వికసించెడు పద్మము వెలుగును॥ గ ॥
రూపము కాళము నామము కాళిక
కారుచీకటి కాళిని గాంచిన
మహామోహసమ్మోహితాత్ముడై
ఆనందించడు అన్యరూపమును॥ గ ॥
విభ్రమ రూపిణి ఎచ్చట నుండును?
కన్నుల నామెను గాంచకపోయిన
ఆ పేరునకే మది లీనంబౌనని
అనును రామప్రసా దతి దిగ్భ్రమచే॥ గ ॥
భయాన్ని పారద్రోలే జగజ్జనని పాదపద్మాల వద్ద శరణు జొచ్చితే భక్తుల భయం తొలగిపోతుంది అన్నట్లు శ్రీరామకృష్ణులు భక్తులకు అభయం ఇస్తూ పాడుతున్నారా?
నా కేదీ ఇక భయము
మృతియన్న నిర్భయము
నాకేదీ మృతి భయము
లేదిక నాకే భయము॥ నా ॥
కాళీమా పదపద్మము
జేసితి జీవ శరణ్యము
నిర్భయ మా పదరాజము
నాకేదీ మృత్యుభయము॥ నా ॥
శ్రీ కాళీ ఘననామము
చేకొని శిరమున బంధము
వైచితి పిలకకు మంత్రము
నా కేదీ మృత్యుభయము॥ నా ॥
గావించితిని నా దేహము
లోకసంతలో విక్రయము
చేసితి ఖర్చా ధనము
కొనుటకు దుర్గానామము॥ నా ॥
యెదలో కాళీనామము
నాటితి కల్పక భూజము
చూపెద నా అంకురము
అగుచో యమదర్శనము॥ నా ॥
గెంటితి అరిషడ్వర్గము
‘జయదుర్గా’ యని పలుకుచు
(పల్కుచు దుర్గానామము)
పయనమునకు సంసిద్ధము
దాటగ జీవసముద్రము॥ నా ॥
శారదాబాబు కుమారుని మరణ శోకంలో మునిగి ఉన్నాడు. అందుచేతనే అధర్ అతణ్ణి శ్రీరామకృష్ణుల వద్దకు తోడ్కొని వచ్చాడు. శారదాబాబు శ్రీచైతన్యుల భక్తుడు. కనుకనే అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులలో శ్రీచైతన్యోద్దీపన కలిగింది. శ్రీరామకృష్ణులు పాడసాగారు:
ఏమి చిత్రము! ఇదేమి చోద్యము!
మేలి పసిడికాంతి మించి మేను మెరసెను
యుగము లింక మారలేదు
తగిన తరుణ మరుగలేదు
ఈ జగతిన గౌరాంగుగ
ఏగుదెంచి అగుపించగ॥ ఏ ॥
ముగియలేదు ఈ ద్వాపర
యుగమున నా లీల లింక
అగుపించుట ఆశ్చర్యము
ఈలాగున మేనమార్పు॥ ఏ ॥
ఈ నెమలి బంగారము
ఆ కోయిల బంగారము
ఎందెందున పరికించిన
బంగారమె మెరయుచుండె॥ ఏ ॥
ఈ వింతల భావమేమి
ఎటుచూచిన అది యంతయు
బంగారము కన్న వేరు
గాన్పించుట లేదు నాకు॥ ఏ ॥
హా తెలిసెను మర్మమిపుడు
రాధ మధుర కేతెంచెను
భ్రమరివంటి దగుటవలన
బంగారము వంటి తన
మేనిరంగు నా కిచ్చెను॥ ఏ ॥
నాది ఇంద్రనీల చాయ
క్షణములోన పసిడియయ్యె
రాధను నే తలచి తలచి
రాధగనే మారినానె॥ ఏ ॥
ఎందుంటిని ఇపుడు నేను
మథురలోన? నవద్వీపున?
ఏలాగున ఇట్లగుట
ఊహింపగ లేకుంటిని॥ ఏ ॥
బలరాముడు నిత్తాయిగ
నారదుడు శ్రీవాసుగ
ఆ యశోద ఇంకనైన
మారలేదు మాత శచిగ*॥ ఏ ॥
వారందరు అటులుండగ
నే నొక్కడ నీలాగున
బంగారపు వదనముతో
ఏల మార్పు చెందవలెను॥ ఏ ॥
నందుడు ఆ జగన్నాథుడుగ*
ఇప్పటికిని మారలేదు
మారనేల నే నొక్కడ
ఈలాగున బంగారుగ॥ ఏ ॥
మధుమతి శ్రీరాధ మథుర
పురమందున పొడగట్టుట
నా తనువు గౌరాంగుని
పసిడిచాయ బడసియుండు॥ ఏ ॥
శ్రీచైతన్యుల గురించిన ఆలోచనల్లో మునిగి ఉండే మళ్లీ శ్రీరామకృష్ణులు పాడారు. శారదాబాబుకు ఈ పాట ఎంతో ఇష్టం:
బ్రహ్మానందపు పారవశ్యమున
పరవశించి తను మరచెను గోరా!
అమితానందాస్వాదనంబుచే
ఆడును, పాడును, నవ్వును, ఏడ్చును॥ బ్ర ॥
వనమును తలచును బృందావనముగ
పావనగంగావాహిని తలచును
నిర్మల యమునా నీటి జలములుగ
నిట్టూర్పులతో నేడ్చును భోరున॥ బ్ర ॥
పైన పసిడిగా గానుపించినను
అంతరమందున అంతా నీలమె
నీలికృష్ణుని నీలివర్ణమే
నీలమె, నీలమె, నీలివర్ణమే॥ బ్ర ॥
శ్రీచైతన్యుల ప్రేమలో మునిగిపోయిన ఒక స్త్రీ వైఖరిలో శ్రీరామకృష్ణులు పాడారు:
ఎందుకే ఈలాటి నింద నా మీద అమ్మలక్కలు వేసినారో? గౌరాంగు వల్ల నా ఇరుగుపొరుగువారు అపవాదులనేల అంటగట్టెదరు?॥ ఎం ॥
ఏలాగు నా తలపు లెరుగగలరు?
ఏలాగు నేవిప్పి చెప్పజాలుదునే?
ఏనాటికైనను చెప్పజాలుదునా?
అవమానమున నన్ను చంపుచున్నారు॥ ఎం ॥
శ్రీవాసు ఇంటి ముంగిట నొక్కసారి
పెద్దగా గౌరు కీర్తన పాడినాడె
మైమరచి నేలపై దొరలాడుచుండ
అక్కడే నిలబడి చూచుచున్నానె॥ ఎం ॥
ఏమిటో తక్షణము స్మృతి తప్పిపోయె
శ్రీవాసు నర్ధాంగి దరిచేరి నన్ను
తెప్పరిల్లగజేయు నందాక నచట
ఆలాగె స్పృహలేక పడియుండినానె॥ ఎం ॥
ఒకసారి భక్తబృందము తోడగూడి
తియ్యగా గౌరు కీర్తన పాడుచుండి
కడజాతివానిని కౌగలించుచును
భక్తిహీనుల గుండె కరగించి నాడె॥ ఎం ॥
రాజవీథులగుండ ‘నడియా’ న గౌరు
హరినామ భజనతో నరుగుచుండంగ
ఆ గుంపుతో పోయి అతి చేరువుగను
బంగారు పాదాల తొంగిచూచితినె॥ ఎం ॥
గంగగట్టున అతడు నిలువ నొకసారి
సూర్యచంద్రుల శోభతో మేనుమెరసె
ఆ అందమును జూచి ముగ్ధులగుచుండ
నీటికై కడవతో అటకేగినానె॥ ఎం ॥
ఈ గట్టునుండి అతని సొంపుజూడ
చేజారి నా కడవ పగిలిపోయినదే
అది చూచి వాచాలి, నా ఆడపడుచు
వాగినదె కనుపించు వారందరికిని॥ ఎం ॥
బలరామ్ తండ్రి ఒక వైష్ణవుడు. అందుకే శ్రీరామకృష్ణులు గోపికల ప్రేమలో మునిగిపోయి పాడారు:
కనరాడె ఓ చెలీ! నా కృష్ణుడు
కృష్ణరహితమై నా గృహము
చిన్నవోయినదే ఓ చెలియా॥ క ॥
శిరమున కురులు కృష్ణుండైతే
కృష్ణకురులతో వాల్జెడనల్లి
తురిమెదనమ్మా వకుళపుష్పములు॥ క ॥
నల్లకృష్ణుడు నల్ల కురులతో
నలుపు నలుపుతో కలసిపోవును
ఒకటేనలుపే నల్లని నలుపే॥ క ॥
ముక్కుకు ముక్కెర కృష్ణుండైతే
ముక్కుకు ముక్కెర చెక్కుదునే
వదలక నదుమును పెదవుల మీదను॥ క ॥
ఎందుకు కృష్ణుడు ముక్కెరయగును
అకటా! ఇది నా వ్యర్థాలోచన
జరుగనె జరుగదె అటు లెన్నటికీ॥ క ॥
కరముల గాజులు కృష్ణుండైతే
కరములు వదలక కదలియాడును
గలగల కరములు కదిపి చూపుదునె॥ క ॥
వయ్యారముతో చెయ్యాడించుచు
కృష్ణగాజుల గర్వము చూపుచు
రాజవీథిలో ఠీవితో నడతునే॥ క ॥
14.6 షష్ఠ పరిచ్ఛేదం సర్వధర్మ సమన్వయం – బలరామ్ తండ్రితో సంభాషణ
బలరామ్ తండ్రికి ఒరిస్సాలో భద్రక్ మొదలైన పలుచోట్ల ఆస్తిపాస్తులున్నాయి. బృందావనం, పూరీ, భద్రక్ మొదలైన తీర్థ స్థలాలలో పూజార్చనలను, ధర్మసత్రాలను నిర్వహిస్తూ వచ్చాడు. బృందావనంలోని శ్యామసుందర ఆలయంలో భగవంతుణ్ణి సేవిస్తూ తన జీవిత చరమ భాగాన్ని గడుపుతున్నాడు. ఇతడొక పరమ వైష్ణవుడు. కొందరు వైష్ణవులు శాక్తేయులతోను, శైవులతోను, వేదాంతులతోను సామరస్య భావంతో మెలగరు. పైగా వారిని ద్వేషిస్తారు కూడా. శ్రీరామకృష్ణులు ఇటువంటి సంకుచిత మనస్తత్వాన్ని గర్హిస్తారు. మనోవ్యాకులత ఉంటే, అన్ని మార్గాల ద్వారాను, అన్ని మతాల మూలంగాను భగవంతుణ్ణి పొందవచ్చు అనేవారు. అనేకమంది వైష్ణవులు జపమాల చేతబట్టుకొని జపం చేస్తూ ఉంటారు, శాస్త్రాలు అధ్యయనం చేస్తూ ఉంటారు. అయితే భగవంతుణ్ణి పొందాలనే వ్యాకులత వారిలో ఉండదు. అందుచేతనే శ్రీరామకృష్ణులు, బలరామ్ తండ్రికి పరోక్షంగా ఉపదేశిస్తున్నట్టున్నారు.
14.6.1 శ్రీరామకృష్ణుల రామమంత్రదీక్ష
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నే నెందుకు ఒకే మార్గంలో మాత్రమే పోవాలని అనుకోవాలి? అందుచేతనే బృందావనంలో ఉంటూ ఉన్నప్పుడు వైష్ణవ సన్న్యాసుల ఉడుపులు ధరించి, మూడు రోజులు ఆ భావనలోనే ఉండిపోయాను. మళ్లీ దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు రామమంత్రదీక్ష పుచ్చుకున్నాను. నుదుట పొడవైన తిలకాన్ని, కంఠంలో మాల అన్నీ ధరించి ఉన్నాను. కొన్నిరోజుల తరువాత అన్నిటినీ వదిలివేశాను.
14.6.2 బలరామ్ తండ్రికి బోధ – భగవంతుడు సగుణుడు, నిర్గుణుడు
“ఒక ఫలానా వ్యక్తి వద్ద ఒక తొట్టె ఉండేది. వస్త్రాలకు రంగు వేసుకోవటానికి పలువురు అతని వద్దకు వచ్చేవారు. ఆ తొట్టెలో అద్దకపు ద్రావణం ఉంది. అయితే దాన్లో వస్త్రాలు తడిపితే ఎవరికి ఏ రంగు కావాలో ఆ రంగు వచ్చేస్తుంది. ఈ అద్భుతాన్ని చూస్తూ ఉన్న ఒక వ్యక్తి, అద్దకం వేసే ఆ వ్యక్తిని సమీపించి ‘నీ వద్దగల ఆ అద్దకపు ద్రావణం నాకు ఇవ్వు’ అని అడిగాడు!”
విభిన్న మతాలకు చెందిన వారు తమ వద్దకు వస్తారు, ఆధ్యాత్మిక చైతన్య జాగృతి పొందుతారు అనే విషయాన్ని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నారా?
శ్రీరామకృష్ణులు కొనసాగించారు: “ఒక చెట్టు మీద ఊసరవెల్లి ఒకటి ఉంది. ఒకడు దాన్ని చూసినప్పుడు అది ఆకుపచ్చ రంగులో ఉంది, మరొకడు చూసినప్పుడు నల్లగా ఉంది, ఇంకొకడు చూసినప్పుడు పసుపుపచ్చ రంగులో ఉంది. ఈ విధంగా పలువురు పలు రంగులలో ఆ ఊసరవెల్లిని చూశారు. తరువాత అది ఆకుపచ్చ అనీ, ఎరుపు అనీ, పసుపుపచ్చ అనీ పరస్పరం వారు కలహించుకోసాగారు. చివరికి ఆ చెట్టు క్రింద వసిస్తూ ఉన్న వ్యక్తిని సమీపించి అతణ్ణి అడిగినప్పుడు అతడు, ‘నేను ఈ చెట్టు క్రిందే రేయింబవళ్లు ఉంటున్నాను. అదొక ఊసరవెల్లి. క్షణక్షణమూ అది తన రంగును మార్చుకుంటూ ఉంటుంది. కొన్ని సమయాల్లో ఏ రంగూ లేకుండానూ ఉంటుంది’ అని చెప్పాడు.”
భగవంతుడు సగుణుడు, నానారూపధారి; అదే సమయంలో నిర్గుణుడు, ఏ విధమైన రంగూ రూపం లేనివాడు, మనోవాక్కులకు అతీతుడు అయి ఉన్నాడనేనా శ్రీరామకృష్ణులు చెబుతోంది? ఆయన భక్తియోగం, జ్ఞానయోగం – అన్ని మార్గాలలో భగవంతుని మాధుర్యాన్ని గ్రోలుతున్నారా?
14.6.3 రాధాకృష్ణుల లీల – అంతరార్థం
శ్రీరామకృష్ణులు (బలరామ్ తండ్రితో): పుస్తకాలను ఇకపై చదవద్దు. అయితే చైతన్య చరితామృతం మొదలైన భక్తిగ్రంథాలను చదవండి. విషయం ఏమిటంటే భగవంతుణ్ణి ప్రేమించాలి, ఆయన మాధుర్యాన్ని గ్రోలాలి. భగవంతుడు మాధుర్య రసం, భక్తుడు గ్రోలేవాడు; ఆ రసాన్ని అతడు గ్రోలి ఆనందిస్తున్నాడు. భగవంతుడు పద్మం, భక్తుడు తుమ్మెద; ఆ పద్మంలోని తేనెను భక్తుడు గ్రోలుచున్నాడు. భగవంతుడు లేకుండా భక్తుడు ఎలాగయితే జీవించలేడో అదే విధంగా భక్తుడు లేకుండా భగవంతుడూ ఉండలేడు. అప్పుడు భక్తుడు మాధుర్యమైపోతాడు, భగవంతుడు దాన్ని గ్రోలేవాడు అవుతాడు. భక్తుడు పద్మం అవుతాడు, భగవంతుడు తుమ్మెద అవుతాడు. ఆయనే తన మాధుర్యాన్ని గ్రోల రెండుగా అయ్యాడు. అందుచేతనే రాధ కృష్ణ లీల జరిగింది.
14.6.4 తీర్థయాత్రలు, బాహ్యాచారాల ఆవశ్యకత ఎంత వరకు?
“తీర్థయాత్రలు, కంఠంలో మాల, ఆచారం మొదలైనవన్నీ ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో ఆవశ్యకాలు. సద్వస్తువును ప్రాప్తించుకుంటే, భగవద్దర్శనం కలిగితే బాహ్యాడంబరాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. తరువాత భగవన్నామ జపం, స్మరణ, చింతన మాత్రమే.
“పదహారు రూపాయలను నాణేలుగా మారిస్తే అదొక పెద్ద కుప్పలా ఉంటుంది. దాన్ని రూపాయలుగా మారిస్తే అంతపెద్దగా కనిపించదు. దాన్ని ఒక బంగారు నాణెంగా మారిస్తే మరింత చిన్నదిగా అగపడుతుంది. చిన్న వజ్రంగా మార్చు, అది ఉన్నట్లే కనిపించదు.”
కంఠంలో మాల, ఆచారాల వంటివి లేకుంటే వైష్ణవులు నిందిస్తారు. అందుచేతనే భగవద్దర్శనానంతరం మాల, బాహ్యచిహ్నాలు మొదలైన వాటి పట్ల ఉదాసీనత వహిస్తారనీ, సత్యాన్ని తెలుసుకొన్నాక బాహ్యక్రియలు క్రమంగా తగ్గిపోతాయనీ శ్రీరామకృష్ణులు చెబుతున్నారా!
శ్రీరామకృష్ణులు (బలరామ్ తండ్రితో): కర్తాభజా సంప్రదాయస్థులు సాధకులను ప్రవర్తకులు, సాధకులు, సిద్ధులు, సిద్ధసిద్ధులుగా వర్గీకరిస్తారు. ప్రవర్తకులు నుదుట తిలకం, కంఠంలో మాలను ధరిస్తారు; బాహ్యాచారాలను పాటిస్తారు. సాధకులు బాహ్యాడంబరాలకు అంత ప్రాధాన్యం ఇవ్వరు – ఉదాహరణకు బావుల్ శాఖకు చెందిన వారివలె. భగవంతుడు ఉన్నాడు అని యథార్థ విశ్వాసం గలవారు సిద్ధులు. శ్రీ చైతన్యుల వంటివారు సిద్ధసిద్ధులు. వీరు భగవంతుని దర్శించటమేగాక ఆయనతో సర్వదా మాట్లాడతారు. సిద్ధసిద్ధులను వారు సాయి అని పేర్కొంటారు. సాయి తరువాత వేరే స్థితి ఏమీ లేదు.
14.6.5 సాత్త్విక, రాజసిక సాధనలు – సర్వధర్మ సమన్వయం
“సాధకులలో పలురకాలు ఉన్నారు. సాత్త్విక సాధకులు ఇతరులకు తెలియకుండా గోప్యంగా సాధనలు చేస్తారు. చూడటానికి సామాన్యులవలె కనబడతారు. దోమ తెరలో కూర్చుని ధ్యానం చేస్తారు.
“రాజసిక సాధకులు డాబు ప్రదర్శిస్తారు; కంఠంలో జపమాల, ప్రత్యేక ఉడుపులు, కాషాయ వస్త్రాలు, పట్టుపంచె; మధ్యమధ్యలో బంగారు పూసలు గుచ్చిన జపమాల మొదలైన బాహ్యాడంబరాలు వారిలో కానవస్తాయి. ‘సైన్ బోర్డ్’* తగిలించుకొని వ్యాపారం చేసేవారి వంటివారు వీరు.”
వైష్ణవులు వేదాంతులను, శాక్తేయులను అంతగా గౌరవించరు. బలరామ్ తండ్రి ఇటువంటి సంకుచిత మనస్తత్వాన్ని విడిచిపెట్టాలనే ఉద్దేశంతోనే శ్రీరామకృష్ణులు అతడికి ఇలా ఉపదేశించారు.
శ్రీరామకృష్ణులు (బలరామ్ తండ్రి, ప్రభృతులతో): ఏ మతమైతే మాత్రం ఏమిటి, ఏ మార్గం అయితే మాత్రం ఏమిటి? అందరూ ఆ ఒకే భగవంతుణ్ణే ప్రార్థిస్తున్నారు. అందుకే ఏ మతాన్నీ, ఏ మార్గాన్నీ ద్వేషించరాదు; కించపరచరాదు. వేదాలు ఆయనను సచ్చిదానంద బ్రహ్మంగా పేర్కొంటున్నాయి, భాగవతాది పురాణాలు సచ్చిదానంద కృష్ణునిగా పిలుస్తున్నాయి, తంత్రాలు సచ్చిదానంద శివునిగా పేర్కొంటున్నాయి. అన్నీ ఆ ఒకే సచ్చిదానందమే.
“వైష్ణవులలో పలు శాఖలున్నాయి. వేదాలు పేర్కొంటూ ఉన్న బ్రహ్మాన్ని వైష్ణవులలో ఒక శాఖవారు అలఖ్ నిరంజన్ అంటారు. అలఖ్ అంటే ఫలానా అని గుర్తించి చూపెట్టలేనిది, ఇంద్రియాతీతమైనది అని అర్థం. రాధ కృష్ణులు ఈ అలఖ్ యొక్క రెండు బుడగలు మాత్రమే అని వీరు అంటారు.
“వేదాంత మతంలో అవతార భావన లేదు. రాముడు, కృష్ణుడు సచ్చిదానంద సాగరంలో రెండు అలలు అంటున్నారు వీరు. యథార్థానికి ఉన్నది ఒక్కటే, రెండు కాదు. భగవంతుణ్ణి ఎవరైనా, ఎలాగైనా పిలువవచ్చు, అయితే హృదయాంతరాళాల నుండి ఆయనను పిలిస్తే నిశ్చయంగా ఆయనను చేరుకోవచ్చు. మనోవ్యాకులత ఉంటేనే చాలు.”
శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో నెలకొని ఉండే భక్తులకు ఇవన్నీ తెలుపుతున్నారు. తరువాత కొద్దిగా బాహ్యచైతన్యం పొంది, “మీరు బలరామ్ తండ్రిగారా?” అని అడిగారు.
14.6.6 వ్యాకులతే ముఖ్యం
అందరూ మౌనంగా ఉండిపోయారు. వృద్ధాప్యం పైబడ్డ బలరామ్ తండ్రి మౌనంగా జపమాలను తిప్పుకొంటూ, హరినామ జపం చేస్తూ ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’, తదితరులతో): అది సరే, వీళ్లు ఇంత జపం చేస్తూ ఉన్నారు, తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎందుకు పురోగతి చెందడం లేదు? వీళ్లకు, ఒక ఏడాదికి పద్దెనిమిది నెలలా ఏమిటి?
“మనోవ్యాకులత లేనప్పుడు కాశీకి పోవటంలో ఏం ప్రయోజనం ఉంది అని హరీశ్‌తో అన్నాను. మనోవ్యాకులత ఉంటే, ఇదే కాశీ. ఎన్నో తీర్థయాత్రలు చేస్తూంటారు. ఎంతో జపం చేస్తారు. అయినప్పటికీ ఏదీ సాధించలేరు. ఎందుకో తెలుసా? మనోవ్యాకులత లేదు. వ్యాకులతతో పిలిస్తే భగవంతుడు దర్శనం ఇస్తాడు. నాటకం ప్రారంభ సమయంలో గుసగుసలుగా ఏవేవో మాటలు వినవస్తాయి. అప్పుడు కృష్ణుణ్ణి చూడలేరు. తరువాత నారదుడు బృందావనానికి ఏతెంచి, తంబురా మీటుతూ మనోవ్యాకులతతో, ‘కృష్ణా! గోవిందా! నా ప్రాణవల్లభా!’ అంటూ పాడతాడు. ఆ తరువాత కృష్ణుడు రాకుండా ఉండలేడు, గోపబాలురతో మన ముందు దర్శనమిస్తాడు.”
14.7 సప్తమ పరిచ్ఛేదం
మంగళవారం, అక్టోబర్ 16, 1883
14.7.1 రాఖాల్, బలరామ్ తండ్రి, వేణీపాల్, ‘మ’, మణిమల్లిక్, ఈశాన్, కిశోరీ ప్రభృతులతో
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోని తమ గదిలో బలరామ్ తండ్రి, రాఖాల్, వేణీపాల్, ‘మ’, మణిమల్లిక్, ఈశాన్, కిశోరీ మొదలైన భక్తులతో కూర్చుని ఉన్నారు.
మతదురభిమానులైన వైష్ణవులు తక్కిన మతస్థులను అంతగా ఇష్టపడరు. బలరామ్ తండ్రి శ్రీరామకృష్ణుల దర్శనార్థం అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. తక్కిన వైష్ణవుల మాదిరి అతడికి సంకుచితత్త్వం లేదు.
శ్రీరామకృష్ణులు: విశాల దృక్పథం ఉన్నవారు కృష్ణుడు, కాళి, శివుడు, రాముడు మొదలైన సమస్త దేవుళ్లను అంగీకరిస్తారు.
బలరామ్ తండ్రి: అవునండీ. భర్త పలు వేషాలలో భార్య ముందుకు వచ్చినప్పటికీ ఆమె తెలుసుకోగలదు, అదే విధంగా.
శ్రీరామకృష్ణులు: అయితే నిష్ఠాభక్తి అనేది కూడా ఒకటి ఉంది. గోపికలు మథురకు వెళ్ళినప్పుడు తలపాగా ధరించిన కృష్ణుని చూశారు. వెంటనే మేలి ముసుగులతో ముఖాలను కప్పుకొని తమలో తాము ‘ఇతడు ఎవరు? పీతాంబరాలు ధరించి, తలపై నెమలిపింఛం ఉన్న మన కృష్ణుడు ఎక్కడ?’ అంటూ ముఖముఖాలు చూసుకున్నారు.
“హనుమంతునికీ నిష్ఠాభక్తి ఉంది. ద్వాపరయుగంలో ఆతడు ద్వారకకు వచ్చినప్పుడు కృష్ణుడు, రుక్మిణితో, ‘రాముని స్వరూపం చూడకుంటే హనుమంతుడు తృప్తి చెందడు’ అంటూ రాముని స్వరూపాన్ని ధరించి కూర్చున్నాడు.
14.7.2 నిత్యం లీలలలో శ్రీరామకృష్ణులు
“నా ఈ స్థితి ఎవరికి తెలుస్తుంది? నిత్యంలో నుంచి లీలకు దిగివస్తున్నాను, మళ్లీ, లీల నుంచి నిత్యానికి పోతున్నాను.
“నిత్యాన్ని పొందటమే బ్రహ్మజ్ఞానం. ఇది ఎంతో కష్టతరం. విషయబుద్ధి సమూలంగా తొలగిపోనిదే బ్రహ్మజ్ఞానం సిద్ధించదు. హిమవంతుని గృహంలో పార్వతీదేవి కుమార్తెగా జన్మించినప్పుడు తండ్రికి పలురూపాలను దర్శింప చేసింది.* ‘అమ్మా! నేను బ్రహ్మ దర్శనం పొందగోరుతున్నాను’ అన్నాడు హిమవంతుడు. అందుకు పార్వతిదేవి, ‘తండ్రీ, అదే మీ ఆకాంక్ష అయితే అందుకు సాధుసాంగత్యం అవసరం. సంసారం నుండి వైదొలగి అప్పుడప్పుడు ఏకాంతవాసంలో సాధువులతో సహజీవనం చేయండి’ అన్నది.
“ఆ ఏకం నుండే అనేకత్వం వచ్చింది, అంటే నిత్యం నుండే లీల. ఒక స్థితిలో అనేకత్వం మటుమాయమైపోతుంది, ఏకమూ మాయమైపోతుంది. ఎందుకంటే ఒకటి ఉంటేనే, రెండు వస్తుంది. భగవంతుడు సామ్యం లేనివాడు. ఆయనను సాదృశ్యంతో వర్ణించలేము. ఈ స్థితిని చీకటి వెలుగుల మధ్యనున్న స్థితిగా చెప్పవచ్చు. ఈ వెలుగు మనం కాంచే వెలుగు కాదు, భౌతికమైన వెలుగు కాదు.
“మళ్లీ భగవంతుడు నా మనోస్థితిని మార్చేటప్పుడు, అంటే లీల స్థితికి మనస్సును క్రిందికి దింపుకొని వస్తూ ఉన్నప్పుడు భగవంతుడు, మాయ, జీవజగత్తు అంటూ ఆయనే అన్నీ అయివుండటం చూస్తూ ఉన్నాను.
14.7.3 భగవంతుడే కర్త – “నీవు, నీది”
“మరికొన్ని సమయాల్లో, ‘యజమాని – ఆతడి తోట’ వలె తానే సమస్త జీవజగత్తులను సృజించినట్లుగా భగవంతుడు నాకు దర్శింపచేస్తున్నాడు.
“భగవంతుడే కర్త. ఈ జీవజగత్తు యావత్తూ ఆయనకు చెందినదే. ఈ ఎరుకే ‘జ్ఞానం’. ‘నేను కర్తను’, ‘నేను గురువును’, ‘నేను తండ్రిని’ – ఈ ఎరుక అజ్ఞానం. ధనం, సంపద, బంధువులు, ఇల్లూ వాకిలి, భార్య, పిల్లలు అన్నీ నాకు చెందినవే అన్న ఎరుక అజ్ఞానం.”
బలరామ్ తండ్రి: నిజమేనండీ!
శ్రీరామకృష్ణులు: ‘భగవంతుడా, నువ్వే కర్తవు’ అనే ఎరుక ఏర్పడనంత వరకు తిరిగి తిరిగి రావలసిందే – మళ్ళీ జన్మనెత్తవలసిందే. ‘నువ్వే కర్తవు’ అన్న ఎరుక కలిగితే మరుజన్మ ఉండదు. ‘నువ్వే, నువ్వే’ అని చెప్పనంతవరకు మనం విముక్తులం కాము. వస్తూ పోతూ ఉన్నట్లే జనన మరణాలు కొనసాగుతూనే ఉంటాయి, ముక్తి లభించదు. ‘నాది’, ‘నాది’ అని చెప్పుకోవటంలో మనం పెద్దగా సాధించేది ఏమిటి? యజమాని యొక్క సేవకుడు, ‘ఇది మా తోట, ఇది మా మంచం, మా కుర్చీ’ అంటూ ఉంటాడు. అయితే ఆ యజమాని అతణ్ణి పనిలో నుంచి తొలగించివేస్తే, ఒక మామూలు చెక్క పెట్టెను తీసుకువెళ్లే హక్కును కూడా కోల్పోతాడు.
“ ‘నేను, నాది’ అన్నవి సత్యాన్ని కప్పివేసి ఉన్నాయి; అవి మనలను సత్యాన్ని తెలుసుకోనివ్వవు. అద్వైత జ్ఞానం ఏర్పడనంత వరకు చైతన్య దర్శనం కలుగదు. చైతన్య దర్శనం కలిగితే, తరువాత నిత్యానందమే. పరమహంస స్థితిలో ఈ నిత్యానందం అనుభూతమౌతుంది.
“వేదాంతం అవతార సిద్ధాంతాన్ని అంగీకరించదు. దాని ప్రకారం చైతన్య దేవులు అద్వైతబ్రహ్మ యొక్క ఒక నీటి బుడగ మాత్రమే. చైతన్య దర్శనం అంటే ఏమిటి? చీకటి గదిలో అగ్గిపుల్లను వెలిగించగానే హఠాత్తుగా వెలుగు వస్తుందే, అటువంటిది.
14.7.4 అవతారం – మనిషి లోపల రత్నం ఉంది
“భక్తిమార్గగాములు అవతారాలను ఒప్పుకుంటారు. కర్తాభజా సంప్రదాయానికి చెందిన ఒక స్త్రీ నా స్థితిని చూసి, ‘బాబా, మీకు అంతర్దర్శనం అయింది. ఇక, ఈ ఆడటం, పాడటం మొదలైన వాటిలో అధికంగా పాల్గోకండి. ద్రాక్షపళ్లను దూదిలో ఎంతో జాగ్రత్తగా ఉంచి భద్రపరచాలి. కోడలు గర్భవతి అయినప్పుడు అత్తగారు ఆమె నిర్వర్తించే ఇంటి పనులను క్రమక్రమంగా తగ్గించి వేస్తుంది. భగవద్దర్శనం కలిగినదనటానికి లక్షణం – మెల్లమెల్లగా కర్మత్యాగం సంభవిస్తుంది. ‘ఈ మనిషి లోపల (శ్రీరామకృష్ణులలో) రత్నం ఉంది,’ అన్నది. నేను తింటున్నప్పుడు ఆమె, ‘బాబా, మీరు తింటున్నారా, లేక మరెవరికైనా తినిపిస్తున్నారా?’ అని అడిగింది.
“ఈ ‘నేను’ అనే భావమే తెరవేసి మరుగుపరుస్తోంది. “ఈ ‘నేను’ ఎంత మేరకు తగ్గుతూ వస్తుందో ఆ మేరకు భగవంతుని ‘నేను’ మన వద్దకు వస్తుంది” అని నరేంద్రుడు అన్నాడు. “కుండలో మన్ను అధికరించేకొద్దీ నీరు తక్కువ పడుతుంది” అని కేదార్ అంటాడు.
“కృష్ణుడు అర్జునుడితో, ‘అర్జునా! అష్టసిద్ధులలో ఒక్కటి గడించినా కూడా నువ్వు నన్ను పొందలేవు’ అన్నాడు. ఇవి ఒకింత శక్తిని ఒనగూర్చవచ్చు. రోగ నివారణ, అడ్డంకులను తొలగించటం, ఔషధం ఇవ్వటం వంటి శక్తులను నువ్వు ఒకింత పొందవచ్చు – అందుచేత జనులకు కాస్త మేలు ఒనగూరుతుంది. ఏమిటి, అంతే కదా!
“కనుకనే నేను జగజ్జననిని శుద్ధభక్తినే కోరాను, సిద్ధులను కోరింది లేదు.”
బలరామ్ తండ్రి, వేణిపాల్, ‘మ’, మణిమల్లిక్ మొదలైన భక్తులతో ఈ విధంగా మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు సమాధిస్థితిని పొందారు. బాహ్యస్మృతి పూర్తిగా తొలగిపోయి చిత్తరువులా కూర్చుని ఉన్నారు. బాహ్యచైతన్యంలోకి రాగానే పాడసాగారు. ఆ పాట అర్థం: ‘సఖీ, ఎవరి కోసమైతే నేను వెర్రివాడిని అయ్యానో, ఆతడిని పొందలేదే.’
తరువాత శ్రీరామకృష్ణుల అభిలాష మేరకు రామ్‌లాల్ పాడసాగాడు. మొదట చైతన్యుల సన్న్యాసాన్ని గురించిన పాట:
ఏమాదర్శనం ఏమి దర్శనం
కేశవభారతి* ఆశ్రమంబున
అనుపమేయమగు అనుగ్రహముతో
గోరా కన్నులగారు ధారలు॥ ఏ ॥
పరవశించి తా ప్రేమపరతలో
మత్తగజమువలె తూగుచునాడును
ఆడుచుపాడుచు పాడుచునాడును
ఆడిపాడి తాపాడి చూపును॥ ఏ ॥
బాష్పవార్ధిలో ఈదులాడును
పొరలి దొరలును భూమి మీదను
ప్రభు హరినామము ప్రలాపించుచు
విలపించి గగ్గోలు గొల్పును॥ ఏ ॥
దిక్కులన్నియు పిక్కటిల్లగా
సింహగర్జనము చేసి పాడును
హరికి దాసుడను నమ్రభావమున
ప్రేమభిక్షను వేడునంతనే॥ ఏ ॥
కేశముక్తుడై కావి గట్టుచు
పరమపూజ్యమగు దివ్యప్రేమగల
నతని రూపమును గాంచినంతనె
రాతిగుండెయును మెత్తబారును॥ ఏ ॥
జీవదుఃఖభర హతస్వాంతుడై
సర్వసంగ పరిత్యాగమొనర్చి
అవిచ్ఛిన్నముగ ప్రేమామృతమును
ప్రసాదించును కుమ్మరించుచు॥ ఏ ॥
ప్రేమదాసుడు దాసుడైనచో
గడపగడపను గడచి గౌరుని
ప్రభావంబును పాడుచుండును
అవిచ్ఛిన్నముగ అనంతంబుగా॥ ఏ ॥
చైతన్యమహాప్రభువుల ఈ ప్రేమోన్మాద స్థితిని వర్ణించాక, రామ్‌లాల్‌తో గోపికల ఉన్మాద స్థితిని గురించి పాడమని శ్రీరామకృష్ణులు సైగ చేశారు. రామ్‌లాల్ పాడాడు. పాట అర్థం: ‘పట్టుకోకు, రథ చక్రాలను పట్టుకోకు. ఆ రథం, చక్రాలతో నడుస్తుందా ఏమిటి? ఆ చక్రాలకు చక్రి, హరియే. ఆయన చక్రాలతో జగత్తే నడుస్తోంది!’
14.8 అష్టమ పరిచ్ఛేదం
14.8.1 హరినామ స్మరణతో చండాలురు సైతం పవిత్రమవుతారు
హరిభక్తి జనిస్తే జాతి వివక్షత నెలకోదు అని తులసీదాసు చెప్పటం గురించి మణిమల్లిక్ను తెలుపమన్నారు శ్రీరామకృష్ణులు.
మణిమల్లిక్: చాతక పక్షి దాహంతో గొంతు ఎండిపోతున్న స్థితిలో ఉంటుంది. నలువంకలా గంగ, యమున, సరయు మొదలైన ఎన్నో నదులు, తటాకాలు ఉన్నాయి. కాని ఆ పక్షి ఏ నీటినీ త్రాగదు. స్వాతి నక్షత్రం నాడు కురిసే వాననీటికై ఎదురుచూస్తూ ఉంటుంది.
శ్రీరామకృష్ణులు: దాని అర్థం – భగవంతుని పాదపద్మాల పట్ల భక్తి కలిగి ఉండటమే సారం, తక్కినవన్నీ మిథ్యయే.
మణిమల్లిక్: తులసీదాసు మరొకటి కూడా చెప్పాడు: ‘పరుసవేది స్పర్శతో ఎనిమిది లోహాలు బంగారంగా మారిపోతున్నాయి. అదేవిధంగా చండాలుని పర్యంతం అన్ని జాతులవారు హరినామ స్మరణ చేస్తే పవిత్రులవుతారు. హరినామం ఉచ్చరించకుంటే చతుర్వర్ణాల వారూ చండాలురే.’
శ్రీరామకృష్ణులు: స్పృశింపడానికి కూడా నిషిద్ధమైన తోలును పరిశుభ్రం చేశాక ఆలయంలోకి కూడా తీసుకు వెళ్లవచ్చు.
“భగవంతుని నామంతో మనిషి పావనుడవుతున్నాడు. అందుచేతనే భగవన్నామ కీర్తనను అభ్యసించాలి. నేను యదుమల్లిక్ తల్లితో ఇలా అన్నాను: ‘మృత్యువు ఆసన్నమయినప్పుడు, మనస్సులో ఈ సంసారం గురించిన చింతయే కలుగుతుంది. కుటుంబం, పిల్లలు, వీలునామా వ్రాయటం మొదలైన లౌకిక భావనలే మనస్సులో మెదలుతాయి. భగవంతుని గురించిన చింతనే రాదు. ఆయన నామ జపం, నామ కీర్తనం అభ్యసించటం – ఇవే మార్గాలు.
“ఈ అభ్యాసం కనుక ఉంటే మరణ సమయంలో భగవంతుని నామమే నాలుకపైకి వస్తుంది. పిల్లి పట్టుకోవటానికి వస్తే చిలుక కీకీ అనే అరుస్తుంది; రామ్ రామ్, హరే కృష్ణ – అని మాత్రం పలుకదు.
“మరణానికి సిద్ధంగా ఉండటం మంచిది. శేష జీవితంలో ఏకాంతవాసం చేస్తూ కేవలం భగవత్ చింతన, ఆయన నామజపం చేయాలి. స్నానానంతరం ఏనుగును, గజశాలలో కట్టివేస్తే అది శరీరానికి మట్టిని, బురదను పులుముకోలేదు.”
బలరామ్ తండ్రి, మణి మల్లిక్, వేణిపాల్ మొదలైన వారు వయసు మళ్లిన వారు. ప్రత్యేకంగా వారి ప్రయోజనార్థమే శ్రీరామకృష్ణులు ఇన్ని ఉపదేశాలు చేస్తూ ఉన్నారా?
శ్రీరామకృష్ణులు మళ్ళీ భక్తులను ఉద్దేశిస్తూ మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ఏకాంతంలో భగవచ్చింతన చేయమనీ, నామజపం చేయమనీ ఎందుకు చెబుతున్నానో తెలుసా? రేయింబవళ్లూ సంసారంలో ఉంటున్నప్పుడు అశాంతి ఏర్పడుతుంది. చూడండి, ఒక అడుగు భూమికై సోదరులు తన్నుకుని రక్తపాతం చేసుకుంటున్నారు. ‘భూమి, స్త్రీ, ధనం – ఈ మూడిటి కోసమే ఈ కొట్లాటలూ, గందరగోళమూ, అశాంతి అంతా’ అని సిక్కులు నాతో చెప్పారు.
14.8.2 శ్రీరామచంద్రుడు, యోగవాసిష్ఠం – మాయామందిరం, ఆనందసౌధం
“మీరు సంసారంలో ఉన్నారు. సరే, అయితే అందుకు భయపడటం ఎందుకు? రాముడు సంసారాన్ని త్యజించాలనుకున్నప్పుడు దశరథుడు వసిష్ఠుని శరణుజొచ్చాడు. వసిష్ఠుడు రాముడితో, ‘రామా! నువ్వెందుకు సంసారాన్ని పరిత్యజించాలి? కాస్త తర్కించి చూద్దాం; ప్రపంచం భగవంతుని నుండి భిన్నమైనదా ఏమిటి? దేన్ని త్యజిస్తావు, దేన్ని స్వీకరిస్తావు? భగవంతుడు తప్ప మరేదీ లేదు! మాయ, జీవ జగత్తులు – అన్నిటిగా భగవంతుడే భాసిస్తూన్నాడు’ అన్నాడు.”
బలరామ్ తండ్రి: అది ఎంతో కష్టం!
శ్రీరామకృష్ణులు: సాధన కాలంలో ఈ జగత్తు ‘మాయామందిరం’. జ్ఞానం పొందాక, భగవద్దర్శనానంతరం అదే ‘ఆనందసౌధంగా’ మారిపోతుంది.
14.8.3 చైతన్యుడు అవతారపురుషుడు
“వైష్ణవశాస్త్రాలు, ‘విశ్వాసంతో కృష్ణుణ్ణి పొందవచ్చు. విచారణ ఆయన్ను చాలా దూరం చేసివేస్తుంది’ అని పేర్కొంటాయి. కావలసినదంతా విశ్వాసం ఒక్కటే.
“కృష్ణకిశోర్ది ఎంతటి విశ్వాసం! బృందావనంలో నిమ్నజాతి వ్యక్తి ఒకడు అతడికి నూతి నుండి నీరు తోడియిచ్చాడు. అతడితో శివనామాన్ని ఉచ్చరించమని చెప్పాడు. అతడు శివనామం పలికిన వెంటనే ఆ నీటిని కృష్ణకిశోర్ త్రాగాడు. ‘భగవన్నామం ఉచ్చరిస్తే ఆ పిదప ధనం వెచ్చించి ప్రాయశ్చిత్తం చేయాలా ఏమిటి?’ అంటాడతడు. రోగ నివారణార్థం జనం తులసీదళాలతో భగవంతుని అర్చించటం చూసి అతడు అవాక్కయ్యాడు. సాధు సందర్శనకై వెళ్లటం గురించి హలధారిని అడిగినప్పుడు అతడు, ‘పంచభూత సమన్వితమైన గూడు, దాన్ని సందర్శింప వెళ్లటం కూడానా!’ అన్నాడు. ఈ మాటలు విన్న కృష్ణకిశోర్ కోపంతో, ‘అలాగా అంటున్నాడు! సాధువుది చిన్మయదేహం అన్న సంగతి అతడికి తెలియదా?’ అన్నాడు. కాళీ మందిరపు గంగా స్నానఘట్టం మెట్లపై మాతో ఒకసారి అతడు ‘రాం రాం అంటూ ఉండగా నా జీవితం అంతమవాలని ఆశీర్వదించండి’ అని అడిగాడు.
“నేను కృష్ణకిశోర్ ఇంటికి వెళుతూ ఉంటాను. నన్ను చూడగానే అతడు నాట్యం చేయ నారంభించేవాడు.
“శ్రీరాముడు లక్ష్మణునితో, ‘ఎక్కడ ప్రగాఢ భక్తి ఉంటుందో అక్కడ నేను ఉంటానని తెలుసుకో’ అని చెప్పాడు. అది చైతన్యదేవులకున్న భక్తి వంటిది. ఆయన భక్తి పారవశ్యంలో నవ్వారు, విలపించారు, నృత్యంచేశారు, పాడారు. ఆయన అవతారపురుషుడు; భగవంతుడు ఆయన రూపంలో లోకాన అవతరించాడు.”
తరువాత శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారు. దాని అర్థం: ‘శ్రీ గౌరాంగులు భావనిధియే. ఆయన భావావస్థలో నవ్వుతారు, విలపిస్తారు, నృత్యం చేస్తారు.’
14.9 నవమ పరిచ్ఛేదం
బలరామ్ తండ్రి, మణిమల్లిక్, వేణిపాల్ మొదలైనవారు శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకుని వెళ్లిపోయారు. అప్పుడు సాయంత్రం అయింది. కాన్సారిటోలాపారా హరిసభకు చెందిన భక్తులు వచ్చారు. వారితో కలిసి భగవదానంద వెల్లువలో మునిగిపోయి శ్రీరామకృష్ణులు నృత్యం చేశారు, పాడారు. కాస్సేపట్లో పారవశ్య స్థితిని పొందారు. ఆ పారవశ్య స్థితిలోనే, ‘నేను ఒంటరిగా కాస్త దూరం వెళతాను’ అన్నారు. కిశోరీ ఆయన పాదాలను ఒత్తాలని ముందుకు వచ్చాడు. అయితే శ్రీరామకృష్ణులు తనను స్పృశింప ఎవరినీ అనుమతించలేదు.
సంధ్యాకాలం తరువాత ఈశాన్ వచ్చాడు. శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో కూర్చుని ఉన్నారు. కాసేపయ్యాక ఈశాన్తో మాట్లాడసాగారు. గాయత్రీ పురశ్చరణ చేయనెంచాడు ఈశాన్.
శ్రీరామకృష్ణులు (ఈశాన్తో): నీ మనస్సుకు తోచినట్లు చెయ్యి. మనస్సులో మరే సంశయాలు లేవు కదా?
14.9.1 బ్రహ్మం, శక్తి అభిన్నులు – చిత్తశుద్ధి వల్లే బోధ కలుగుతుంది
ఈశాన్: ఒక రకం ప్రాయశ్చిత్తంలా నేను దీన్ని చేయ నిశ్చయించాను.
శ్రీరామకృష్ణులు: ఈ మార్గంలో (తాంత్రిక మార్గంలో) అది సాధ్యం కాదా? ఎవరు బ్రహ్మమో ఆతడే శక్తి, ఆతడే కాళి! ‘కాళీ బ్రహ్మమూ ఒక్కరే అన్న రహస్యాన్ని తెలుసుకున్న నేను, ధర్మాధర్మాలను రెంటినీ విడిచి పెట్టేశాను’ అంటున్నాడు రామప్రసాదు.
ఈశాన్: బ్రహ్మమే ఆద్యాశక్తి అని దేవీమాహాత్మ్యంలో పేర్కోబడి ఉంది. బ్రహ్మమూ, శక్తీ అభిన్నులు.
శ్రీరామకృష్ణులు: ఊరకే నోటితో చెబితే మాత్రం సరిపోదు, ధారణ అయినప్పుడే (అంటే మనస్సులో జీర్ణించుకున్నప్పుడే) ప్రయోజనం ఉంటుంది.
“సాధనలచేత చిత్తశుద్ధి కలిగినప్పుడు భగవంతుడే కర్త; మనస్సు, బుద్ధి, ప్రాణం అన్నీ ఆయనే అని యథార్థమైన బోధ కలుగుతుంది. మనం కేవలం యంత్రాలం మాత్రమే. ‘నువ్వే ఏనుగును బురదలో చిక్కువడ చేశావు, కుంటి వాడిచేత పర్వతాన్ని అధిరోహింప చేసేదీ నువ్వే!’
“చిత్తశుద్ధి కలిగినప్పుడు పురశ్చరణాది కర్మలను మనచేత ఆయనే చేయిస్తున్నాడన్న బోధ కలుగుతుంది. ‘నీ పనులను నీ వొనరుప తాము జేసితిమని తలతురు జనులు.’
“ఆయన దర్శనం కలిగితే సంశయాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు అనుకూల పవనాలు వీస్తాయి. అలా వీచినప్పుడు, పడవ నడిపేవాడు తెరచాపను విప్పి, చుక్కానిని కేవలం పట్టుకోవటం మాత్రం చేస్తాడు, ప్రశాంతంగా పొగత్రాగుతాడు. అదే విధంగా భక్తుడు నిశ్చింతుడైపోతాడు.”
ఈశాన్ సెలవు పుచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులు ‘మ’ తో ఏకాంతంలో మాట్లాడసాగారు.
“నరేంద్రుడు, రాఖాల్, అధర్, హాజ్రా వీరి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? వీరు నిష్కపటులా? నన్ను గురించి ఏం అనుకుంటున్నావు?”
‘మ’ : మీరు నిరాడంబరులు, అదే సమయంలో ఎంతో లోతైన వారు. మిమ్మల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
శ్రీరామకృష్ణులు తనివితీర నవ్వారు.
14.10 దశమ పరిచ్ఛేదం సింధూరియాపట్టీ బ్రహ్మసమాజ వార్షికోత్సవం
నవంబర్, 26, 1883
మణిలాల్ మల్లిక్ ఇల్లు. అక్కడ సింధూరియాపట్టీ బ్రహ్మసమాజ వార్షికోత్సవం జరుగనున్నది. ఇల్లు చిత్పూర్ రోడ్డుకు ఎగువన ఉంది. తూర్పున హారిసన్ రోడ్డు కూడలి ఉంది. దానిమ్మ, పిస్తా, ఆపిల్ చెట్లు ఉన్న చోటుకు ఉత్తరాన నాలుగైదు దుకాణాలు ఉన్నాయి. రాచబాటకు సమీపంలోని ఇంటి మేడ మీద ఉత్సవం ఏర్పాటైంది. మణిలాల్ స్వయంగా ఉత్సవాన్ని జరిపిస్తున్నాడు.
పూజా మందిరంలో ఆనందం వెల్లివిరిసి ఉంది. మందిరం లోపల, వెలుపల పచ్చని తోరణాలతోను, పువ్వులతోను, మాలలతోను అలంకరించబడి ఉంది. గదిలో ఉన్నవారు ‘ప్రార్థన ఎప్పుడు ప్రారంభిస్తారో’ అనే ఆతురతతో ఉన్నారు. గదిలో కూర్చోటానికి అందరికీ చోటు సరిపోలేదు. కనుక పలువురు పశ్చిమాన ఉన్న డాబాలో పచార్లు చేస్తున్నారు. మరికొందరు అక్కడక్కడ వేసి ఉన్న అందంగా నగిషీలు చెక్కిన బల్లలపై కూర్చుని ఉన్నారు. ఇంటి యజమాని, బంధువులు ఉత్సవానికి ఏతెంచిన వారిని ఆప్యాయంగా ఆహ్వానిస్తూ ఉన్నారు.
సాయంత్రం కావటానికి మునుపే బ్రహ్మసమాజ భక్తులు రాసాగారు. ఆ రోజు వారు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కారణం, అక్కడకు శ్రీరామకృష్ణులు రాబోవటమే. బ్రహ్మసమాజ నాయకులైన కేశవసేన్, విజయకృష్ణ గోస్వామి, శివనాథ్ మొదలైన వారిని శ్రీరామకృష్ణులు ఎంతో అభిమానించేవారు. అందుచేతనే బ్రహ్మసమాజ భక్తులకు శ్రీరామకృష్ణుల పట్ల ఇంతటి ప్రేమ. శ్రీరామకృష్ణులు హరిప్రేమలో మునిగి ఉండేవారు. ఆయన ప్రేమ, సరళ స్వభావం, భగవంతునితో పిల్లవాడివలె మాట్లాడటం, భగవంతునికై వ్యాకులత చెంది విలపించటం, స్త్రీలను తల్లిలా గౌరవించి ప్రణామం చేయటం, లౌకిక సంభాషణల పట్ల విముఖత, సర్వదా భగవంతుని గురించే మాట్లాడటం, సర్వధర్మ సమన్వయ సిద్ధాంతం, ఇతర మతాలను కించిత్తు కూడా ద్వేషించకపోవటం, భక్తులకై విలపించటం వంటి చర్యల ద్వారా బ్రహ్మసమాజ భక్తుల మనస్సులను శ్రీరామకృష్ణులు చూరగొన్నారు. అందుకే ఆయనను దర్శింప చాలాదూరాల నుంచి కూడా పలువురు వచ్చి ఉన్నారు.
14.10.1 శివనాథ్ – సత్యమే కలియుగంలో తపస్సు – సమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు
ఉపాసన ప్రారంభించటానికి ముందు విజయకృష్ణ గోస్వామి మొదలైన బ్రహ్మసమాజ భక్తులతో శ్రీరామకృష్ణులు వికసిత వదనంతో మాట్లాడుతున్నారు. పూజామందిరంలో దీపాలు వెలిగించారు. కొది సేపట్లోనే ఉపాసన ప్రారంభం కానున్నది.
శ్రీరామకృష్ణులు: ఏమయ్యా, శివనాథ్ రావటం లేదా?
బ్రహ్మసమాజ భక్తుడు: రావటం లేదండి. ఈ రోజు ఆయనకు అనేక పనులు ఉన్నాయట. ఆయనకు రావటం వీలుపడదట.
శ్రీరామకృష్ణులు: శివనాథ్‌ను చూస్తున్నప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. అతడు సర్వదా భక్తిరసంలో మునిగి ఉన్నట్లుగా ఉంటాడు. ఎవరిని పలువురు కీర్తిస్తారో, గౌరవిస్తారో, ఆతడిలో నిశ్చయంగా భగవంతుని శక్తి ఒకింత అయినా ఉంటుంది. అయితే శివనాథ్లో పెద్దలోపం ఒకటి ఉంది; ఇచ్చిన మాటను అతడు నిలబెట్టుకోడు. అక్కడకు (దక్షిణేశ్వర కాళికాలయానికి) వస్తానని నాతో ఒకమారు చెప్పాడు; అయితే రానూ లేదు, ఏ కబురూ చెప్పి పంపనూ లేదు. ఇది మంచిది కాదు. సత్యం వచించటమే కలియుగంలో తపస్సు అని అంటారు. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే భగవల్లాభం కలుగుతుంది. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండకపోతే క్రమేణా సర్వం నశిస్తుంది. అందుచేతనే ‘బయలుకు’ వెళ్లాలి అని ఎప్పుడైనా చెప్పానంటే, ఆ అవసరం లేకపోయినా చేత నీటిచెంబు పుచ్చుకొని ఒకసారి సరుగుడు తోపుకేసి వెళ్లివస్తాను. సత్యం పట్ల ఉన్న పట్టు ఎక్కడ విడివడుతుందో అన్న భయమే ఇందుకు కారణం.
“నాకు ఈ స్థితి కలిగిన తరువాత చేత పువ్వులు పుచ్చుకొని జగజ్జననిని ఇలా ప్రార్థించాను: అమ్మా! ఇదుగో నీ జ్ఞానాన్ని తీసుకో; నీ అజ్ఞానాన్ని తీసుకో; నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. అమ్మా! ఇదుగో నీ శుచిని తీసుకో, నీ అశుచిని తీసుకో; నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. అమ్మా! ఇదుగో నీ మంచిని తీసుకో, నీ చెడును తీసుకో నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. అమ్మా! ఇదుగో నీ పుణ్యం తీసుకో, నీ పాపం తీసుకో నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. ఇవన్నీ చెప్పాను కాని, ‘అమ్మా! ఇదుగో నీ సత్యం తీసుకో, ఇదుగో నీ అసత్యం తీసుకో’ అని చెప్పలేకపోయాను. అన్నిటిని అమ్మకి సమర్పించగలిగాను కాని సత్యాన్ని మట్టుకు సమర్పించలేకపోయాను.”
బ్రహ్మసమాజ విధుల ననుసరించి ఉపాసన ఆరంభమైంది. వేదిక పైకి వెళ్లి ఆచార్యుడు ఆసీనుడైనాడు. అతడి ముందు దీపం వెలుగుతోంది. ప్రారంభ విధులు పూర్తయ్యాక పరబ్రహ్మం గురించిన వేదాల్లోని మహామంత్రాలను ఆచార్యుడు ఉచ్చరించసాగాడు. ప్రాచీన ఋషుల ముఖతా వెలువడిన, వారి పవిత్ర రసనాల ద్వారా ఉచ్చరింపబడిన ఆ మంత్రాలను బ్రహ్మసమాజ భక్తులు సమస్వరంలో గానం చేయసాగారు.
ఓం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ
ఆనంద రూపమమృతం యద్విభాతి,
శాంతం శివం అద్వైతం
శుద్ధమపాప – విద్ధం
ఓంకారంతో కూడిన ఈ మంత్రం భక్తుల హృదయాకాశంలో ప్రతిధ్వనిని పుట్టించింది. అందరి హృదయాలలో లౌకిక భావనలు తొలగిపోయాయి. వారి మనస్సులు ఎంతో శాంతించి ధ్యానాన్ని కోరాయి. అందరి కళ్లు మూసుకుని ఉన్నాయి! వేదాల్లో పేర్కోబడిన సగుణబ్రహ్మాన్ని ఒకింతసేపు అందరూ ధ్యానించసాగారు.
పరమహంస దేవులు పారవశ్య స్థితిలో నెలకొని ఉన్నారు. అవాక్కులై, స్పందనహీనులై, స్థిరదృష్టితో చిత్తరువులో వలె ఆసీనులై ఉన్నారు. ఆయన ఆత్మపక్షి చిదాకాశంలో విహారం చేస్తూన్నట్లు ఉంది. దేహం మాత్రం ఒంటరిగా అక్కడ కనిపించింది.
సమాధిస్థితి నుంచి బాహ్యచైతన్యంలోకి వచ్చాక శ్రీరామకృష్ణులు కళ్లు తెరచి నలువైపులా చూశారు. అక్కడ అందరూ కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నారు. ‘బ్రహ్మం, బ్రహ్మం’ అంటూ హఠాత్తుగా లేచి నిలబడ్డారు. ఉపాసన ముగిసింది. బ్రహ్మసమాజ భక్తులు తాళం, మృదంగం మొదలైన సంగీత వాయిద్యాలతో పాడసాగారు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై వారితో కలిసి పాడారు, నృత్యం చేశారు. ఆనందంలో ఓలలాడి అందరూ ఆ నృత్యాన్ని గాంచారు. విజయ్ తదితర భక్తులూ శ్రీరామకృష్ణుల చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. పలువురు ఆ అద్భుత దృశ్యాన్ని కనులార గాంచి, కీర్తనానందాన్ని అనుభవిస్తూ బాహ్యజగత్తును మరచిపోయారు. కొన్ని క్షణాలు హరిరస మాధుర్యాన్ని గ్రోలి దేహసుఖాన్ని మరచిపోయారు. దేహసుఖం వారికి, తాత్కాలికంగానైనా వెగటు పుట్టింది.
కీర్తన ముగిశాక అందరూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణుల అమృత వాక్కులను వినటానికి ఆతురతతో ఆయన చుట్టూ కూర్చున్నారు. తమను పరివేష్టించి కూర్చుని ఉన్న బ్రహ్మసమాజ భక్తుల నుద్దేశించి శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు:
14.11 ఏకాదశ పరిచ్ఛేదం గృహస్థులకు ఉపదేశం
“నిర్లిప్తతతో సంసారం చేయటం చాల కష్టం. ప్రతాప్* ఒకసారి నాతో, ‘మహాశయా, మేము జనకమహారాజు మార్గాన్ని అనుసరిస్తాం. జనకుడు నిర్లిప్తతతో సంసారం చేశాడు. మేమూ అలాగే జీవిస్తాం’ అన్నాడు. అందుకు నేను, ‘ఊరకే అనుకోగానే జనకుడు అయిపోగలవా? జనకుడు ఎంత కఠోర తపస్సు చేసి జ్ఞానం సముపార్జించాడో నీకు తెలుసా? తలక్రిందులుగా నిలబడి అనేక సంవత్సరాలు అతికఠినమైన తపస్సు చేసిన తరువాతనే సంసారంలో దిగాడు’ అని చెప్పాను.
“అలా అయితే సంసారులకు మరి గతి లేదా అంటే, ఉంది, కచ్చితంగా ఉంది. కొన్ని రోజులు ఏకాంతవాసం చేస్తూ సాధనలు చేయాలి; ఇలా చేయడం వల్ల భక్తి లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది. ఆ తరువాత సంసారంలో జీవించినా దోషం ఉండదు. ఏకాంతవాసంలో సాధన చేసేటప్పుడు సంసారం నుండి పూర్తిగా వైదొలగండి. భార్య, కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, బంధువులు ఎవరూ సమీపంలో ఉండరాదు. ఏకాంతవాసంలో సాధన చేసేటప్పుడు, ‘నాకు ఎవరూ లేరు. భగవంతుడే నా సర్వస్వమూ’ అని తలచాలి. జ్ఞానం కోసమూ, భక్తి కోసమూ విలపిస్తూ ఆయనను ప్రార్థించాలి.
“సంసారం నుండి వైదొలగి ఏకాంతవాసంలో ఎన్ని రోజులు ఉండాలి అని అంటే, కనీసం ఒక రోజు వైదొలగి ఉన్నా మంచిదే. మూడు రోజులు ఉండగలిగితే ఇంకా మంచిది. పన్నెండు రోజులు, ఒక నెల, మూడు నెలలు, ఒక సంవత్సరం – ఎవరి వీలునుబట్టి అంత కాలం ఏకాంతవాసంలో ఉండవచ్చు. జ్ఞానం, భక్తి పొందిన తరువాత సంసారం చేస్తే అంత భయం ఉండదు. చేతులకు నూనె రాచుకొని పనస పండు వొలిస్తే చేతికి జిగురు అంటుకోదు. దాగుడు మూతల ఆటలో తల్లిని తాకిన తరువాత భయం ఉండదు. ఒకసారి పరుసవేది స్పర్శతో బంగారం రూపొందించు. బంగారంగా మారిన తరువాత వెయ్యేళ్లు మట్టిలో పాతిపెట్టబడినప్పటికీ, మట్టిని త్రవ్వి చూస్తే బంగారంగానే ఉంటుంది.
“మనస్సు పాలవంటిది. ఈ మనస్సును సంసారమనే నీటిలో ఉంచితే పాలూ నీరూ కలిసిపోతాయి. అందుచేత పాలను ఒకచోట ఉంచి పెరుగు తోడుకున్నాక, చిలికి వెన్నను తీయాలి. ఏకాంతవాసంలో సాధనలు చేసి, మనస్సు అనే పాల నుంచి జ్ఞానం, భక్తి అనే వెన్నను తీసినప్పుడు, ఆ వెన్నను సంసారమనే నీటిలో సులభంగా ఉంచవచ్చు. ఆ వెన్న సంసారమనే నీటిలో ఎన్నటికీ కలిసిపోదు; సంసార జలధిపై నిర్లిప్తంగా తేలుతుంది.”
14.12 ద్వాదశ పరిచ్ఛేదం విజయకృష్ణ గోస్వామి – ఏకాంత సాధన
విజయకృష్ణ గోస్వామి కొన్ని రోజులకు మునుపే గయ నుండి తిరిగి వచ్చాడు. అక్కడ ఏకాంతంలోనూ, సాధుసాంగత్యంలోనూ గడిపాడు. ప్రస్తుతం కాషాయం ధరించిన అతడు సర్వదా అంతర్ముఖుడై కానవచ్చాడు. అద్భుతమైన స్థితి. శ్రీరామకృష్ణుల సమీపాన ఆతడు తలవంచుకుని కూర్చుని ఉన్నాడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్లు తోస్తున్నది.
విజయ్ను చూస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “విజయ్! నువ్వు ‘చోటు’ సంపాదించావా? ఇది విను. ఇద్దరు సాధువులు తమ పర్యటనలో ఒక నగరాన్ని చేరుకొన్నారు. ఒకడు వీథులు, దుకాణాలు, ఇళ్లు అన్నిటిని భ్రమించి చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో రెండవ సాధువు అతణ్ణి కలుసుకోవటం జరిగింది. అతడితో, ‘అవునూ, నువ్వు ఇలా సంభ్రమాశ్చర్యాలతో భ్రమిస్తూ నగరాన్ని చూస్తూ ఉన్నావే, నీ మూటముల్లెలు ఎక్కడ?’ అని అడిగాడు రెండవ సాధువు. అందుకు మొదటి సాధువు, “మొదట నేను ‘చోటు’ సంపాదించి, అక్కడ మూటముల్లెలు పెట్టి, గదికి తాళం వేసి నిశ్చింతగా బయలుదేరాను. ప్రస్తుతం నగర సౌందర్యాన్ని తిలకిస్తూ తిరుగుతున్నాను” అంటూ బదులిచ్చాడు. అందుకే ‘చోటు’ సంపాదించావా అని అడుగుతున్నాను.(‘మ’, తదితరులతో) ఇలా చూడండి, ఇన్ని రోజులుగా విజయ్‌లో నీటి ఊట మూసి వేయబడి ఉంది. ఇప్పుడు తెరచుకుంది.
14.12.1 అవధూత, గ్రద్ద – నిష్కామ కర్మ
(విజయ్‌తో) “చూడు, శివనాథ్ అనేక సమస్యలతో సతమతమై ఉన్నాడు. అతడు పత్రికకు వ్రాయవలసి ఉంది, పైగా అనేక పనులలో నిమగ్నుడై ఉన్నాడు. విషయ కర్మలలో పాల్గొంటేనే ప్రశాంతత పోతుంది. అనేక ఆలోచనలు, చింతలు చుట్టుముడతాయి.
“అవధూత తన ఇరవై నలుగురు గురువులలో గ్రద్దను ఒక గురువుగా పరిగణించాడు అని శ్రీమద్భాగవతం పేర్కొంటోంది. ఒకచోట బెస్తలు చేపలు పడుతున్నారు. అప్పుడు గ్రద్ద ఒకటి చటుక్కున వచ్చి ఒక చేపను నోట కరచుకొని వెళ్లిపోయింది. కాని చేపను చూడగానే వందలాది కాకులు గ్రద్దను తరుమసాగాయి; ‘కా కా’ అంటూ అరుస్తూ దాన్ని చుట్టుముట్టాయి. గ్రద్ద దక్షిణం కేసి ఎగురుతే, కాకులూ దక్షిణం కేసే వెళ్లాయి. ఉత్తరం వేపు వెళితే, ఉత్తరం వైపుకే వెళ్లాయి. గ్రద్ద తూర్పు, పడమర దిశలన్నిటా ఎగిరి చూసింది. ఇలా తిరిగి తిరిగి అలసి పోయినప్పుడు దాని నోటి నుండి చేప జారి క్రింద పడిపోయింది. అంతే! కాకులు చేప పడ్డ చోటుకేసి దూసుకుపోయాయి. గ్రద్దను వదలివేశాయి. గ్రద్ద నిశ్చింతగా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుండిపోయింది. తరువాత తనలో తాను ‘ఈ చేపయే ఇంత గందరగోళానికీ కారణం. ఇప్పుడు చేప నా వద్ద లేదు. నేను నిశ్చింతగా ఉన్నాను’ అని అనుకుంది.
“అవధూత గ్రద్ద నుండి ఈ పాఠాన్ని నేర్చుకున్నాడు. ఎంతవరకు మన వద్ద చేప ఉంటుందో, అంటే విషయ వాసనలు ఉంటాయో అంతవరకు కర్మలు ఉంటాయి; వాటివల్ల ఎదురయ్యే చింత, విచారం, అశాంతి వెన్నంటే ఉంటాయి. వాసనలను త్యజిస్తే, తక్షణమే కర్మలు మన నుండి వైదొలగుతాయి, ప్రశాంతత లభిస్తుంది.
“అందువల్లనే నిష్కామకర్మ చేయటం మంచిది. అప్పుడు మనస్సు అశాంతికి లోనుకాదు. కాని నిష్కామకర్మను ఆచరించటం ఎంతో కష్టం. నిష్కామకర్మనే చేస్తూ ఉన్నట్లు భావిస్తాం. కాని ఏ మూలనుంచో కామనలు మనకు తెలియకుండానే వచ్చివేస్తాయి. మొదట పలు సాధనలు అనుష్ఠించి ఉంటే ఆ సాధనల బలంతో ఏ కొందరో నిష్కామకర్మను చేయగలుగుతారు. భగవత్సాక్షాత్కార అనంతరం నిష్కామకర్మను అలవోకగా అనుష్ఠించగలం. అప్పుడు దానంతట అదే కర్మత్యాగం ఒనగూరుతుంది. (నారదుని వంటి) ఏ ఒకరిద్దరో జనులకు ఉపదేశం చేసే నిమిత్తం కర్మలు ఆచరిస్తారు.
14.12.2 సన్న్యాసి సంచయం చేయకూడదు – ప్రేమ జనిస్తే కర్మ త్యాగమౌతుంది
“అవధూత యొక్క మరొక గురువు తేనెటీగ. అది చాలారోజులు ఎంతో శ్రమించి తేనెను సంచయం చేసి పెడుతుంది. కాని తేనెటీగ ఆ తేనెను అనుభవించదు. ఎవరో ఒకరు వచ్చి తేనెపట్టును విచ్ఛిన్నం చేసి తేనెను తీసుకుపోతారు. అవధూత తేనెటీగ నుంచి నేర్చిన పాఠం “సంచయం చేయకూడద’ ని. సాధువులు భగవంతుని మీదనే నూటికి నూరుపాళ్ళ భారం వేసి ఉంచాలి; వారు దేన్నీ సంచయం చేయరాదు.
“సంసారుల విషయం అలా కాదు. వారు కుటుంబాన్ని పోషించాలి, అందుచేత సంచయం వారికి ఆవశ్యకం. పక్షీ, సాధుమా సంచయం చేయరు. అయితే పిల్లలు పొదగబడినప్పుడు, పక్షి వాటికోసం ముక్కుతో ఆహారాన్ని సేకరించుకుని వస్తుంది.
“విజయ్, ఇంకా విను; ఒక సాధువు వద్ద మూటముల్లెలు, గుడ్డతో ముడులు వేసిన బంగీలు ఉంటే అతణ్ణి నమ్మవద్దు. నేను పంచవటిలో మర్రిచెట్టు క్రింద ఇటువంటి సాధువులను చూసి ఉన్నాను. ఇద్దరు ముగ్గురు సాధువులు కూర్చుని ఉన్నారు. ఒకడు పప్పులో రాళ్ళేరుతున్నాడు, మరొకడు ధోవతిని కుట్టుకుంటున్నాడు. అందరూ కలిసి ఒక పెద్దమనిషి ఇంట జరిగిన విందు గురించి బాతాఖానీ చేస్తున్నారు. ‘బాబోయ్! ఆ సంపన్నుడు లక్షలకొద్దీ ధనం వెచ్చించాడు. సాధువులకు కడుపార భోజనం పెట్టాడు. పూరీ, జిలేబీ, బర్ఫీ మొదలైన అనేక మధుర భక్ష్యాలను చేయించాడు’ అంటున్నారు.” (అందరూ నవ్వారు)
విజయ్: అవునండీ. గయలో ఇటువంటి సాధువులను చూశాను. అక్కడ వారిని ‘లోటావాలా సాధువు’* లని పిలుస్తారు. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు (విజయ్‌తో): భగవంతుడి పట్ల ప్రేమ ఉదయిస్తే కర్మ తనంతట తానే వదలిపోతుంది. ఎవరిచేత భగవంతుడు కర్మలు గావిస్తాడో వారిని చెయ్యనీ. నీకు ఇప్పుడు తగిన సమయం వచ్చింది. అన్నిటినీ త్యజించి, ‘మనసా, పరులెవరిని చేరనీయకుము, మన మిరువురమే అమ్మను చూతము’ అని పలుకు.
“ఓ మనసా! నువ్వు నేను దర్శిద్దాం. పరుల నెవ్వరినీ చూడనీయవద్దు” – ఇలా అంటూ శ్రీరామకృష్ణులు శ్రావ్యకంఠంతో పాడసాగారు:
పదిల పరచవే మనసా! అమ్మ శ్యామను
అతిప్రియమగు నా అమ్మ శ్యామను
నిలుపుము నీలో అతిభద్రముగా
పరులెవ్వరిని చేరనీయకుము
మన మిరువురమే ఆమెను చూతము॥ ప ॥
ఆమె సన్నిధిని ఆనందించగ
కామవర్గమును కడకు ద్రోలుచు
‘అమ్మా! అమ్మా!’ అని పిలుచుటకై
రసనము వెంబడి తీసుకుపొమ్ము॥ ప ॥
మన ఇరువురి దరి చేరకుండగా
చెడ్డ కామముల నడ్డుపెట్టుటకు
అన్ని సమయముల నతిమెళకువగల
జ్ఞానకాపరిని కాపుపెట్టుము॥ ప ॥
14.12.3 లజ్జ, ద్వేషం, భయం ఉండకూడదు
(విజయ్‌తో) “భగవంతుని శరణుజొచ్చి లజ్జ, భయం ఇత్యాదులను త్యజించివేయి. ‘నేను హరినామం కీర్తిస్తూ నృత్యం చేస్తే జనులు నన్ను గురించి ఏమనుకుంటారు?’ – ఇటువంటి భావాల నన్నిటిని విడిచిపెట్టు. లజ్జ, ద్వేషం, భయం – ఈ మూడు ఉండకూడదు. లజ్జ, ద్వేషం, భయం, ఆభిజాత్యం, గోప్య ప్రవృత్తి ఇవన్నీ పాశాలు. ఇవి తొలగిపోతే జీవుడు ముక్తి పొందుతాడు.
“పాశబద్ధుడు జీవుడు, పాశముక్తుడే శివుడు. భగవంతుని పట్ల ప్రేమ అన్నది దుర్లభమైన వస్తువు. మొదట, ఏ విధంగా భార్య భర్తపట్ల నిష్ఠను కలిగి ఉంటుందో, అటువంటి నిష్ఠ భగవంతుని పట్ల ఏర్పడితే భక్తి జనిస్తుంది. శుద్ధభక్తి కలగటం చాలా కష్టం. భక్తిచే ప్రాణమూ, మనస్సూ భగవంతునిలో లీనం అయిపోతాయి. ఆ తరువాత భావ స్థితి కలుగుతుంది. భావ స్థితిలో మనిషి అవాక్కవుతాడు. వాయువు స్థిరమయిపోతుంది. (అంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్తంభించిపోతాయి). దానంతట అదే కుంభకం ఏర్పడుతుంది. తుపాకితో పేల్చేటప్పుడు, పేలుస్తున్న వ్యక్తి నోట మాట రాదు, అతడి వాయువు స్థిరమయిపోతుంది.
“ప్రేమ కలగడం అన్నది సుదూరమైన మాట. చైతన్యదేవులకు ఆ ప్రేమ ఏర్పడింది. భగవంతుని పట్ల ప్రేమ కలిగితే ఆ వ్యక్తి బాహ్యవస్తువులను విస్మరిస్తాడు. జగత్తుని మరచిపోతాడు. అత్యంత ప్రియమైన తన శరీరాన్ని కూడా మరచిపోతాడు.”
ఇలా చెబుతూ పరమహంస దేవులు మళ్లీ పాడ నారంభించారు:
ప్రభు హరి నామము పాడుచు కన్నుల
అశ్రులు కురిసే దెన్నటికో
హృదయము నుండీ కామవాసనలు
రయమున తొలగే దెన్నటికో॥ ప్ర ॥
పారవశ్యమున పావన నామము
భజనముచేసే దెన్నటికో
నా తనువెల్లను గగురుపాటుతో
పులకలు చెందే దెన్నటికో॥ ప్ర ॥
14.13 త్రయోదశ పరిచ్ఛేదం భావస్థితి, మహావాయువు – భగవద్దర్శనం
సంభాషణ కొనసాగింది. ఆహ్వానితులైన తక్కిన బ్రహ్మసమాజ సభ్యులు వచ్చి కూర్చున్నారు. వారిలో కొందరు పండితులు, కొందరు ప్రభుత్వ ఉన్నతోద్యోగులు. రజనీనాథ్ రాయ్ వారిలో ఒకడు.
శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు:
“భావస్థితి ఏర్పడితే వాయువు స్థిరమయిపోతుంది. అర్జునుడు లక్ష్యాన్ని గురిపెట్టినప్పుడు చేప కన్ను మాత్రమే అతడి దృష్టిలో పడింది; మరి దేనిపైనా దృష్టి లేదు.* చెప్పాలంటే అతడు చేపకన్ను తప్ప దాని శరీరంలో మరి ఏ ఇతర భాగాన్నీ చూడలేదు. ఈ స్థితిలో వాయువు స్థిరమవుతుంది. కుంభకం అనుభూత మవుతుంది.
“భగవద్దర్శనానికి ఒక లక్షణం ఉంది – లోపల మహావాయువు సరసరా ఎగబ్రాకుతూ మస్తిష్కం కేసి పోతుంది. అప్పుడు సమాధి స్థితి ఏర్పడితే భగవద్దర్శనం కలుగుతుంది.”
14.13.1 భక్తిరహిత పాండిత్యం అర్థరహితం
(అప్పుడే వచ్చిన బ్రహ్మసమాజ భక్తులతో) “కేవలం పండితులుగా ఉండి భగవంతుని పట్ల భక్తి లేనట్లయితే, అటువంటి వారి పలుకులు అర్థరహితాలు. సమాధ్యాయి అనే ఒక పండితుడు ‘భగవంతుడు రసహీనుడు, మీరు మీ ప్రేమ భక్తిరసంతో తడిపి ఆయనను సరసునిగా చేయండి’ అన్నాడు. చూశారా, వేదాలు ఎవరిని రసస్వరూపుడని పేర్కొంటున్నాయో, ఆయనను రసహీనుడని చెప్పటమా! భగవంతుడు ఎటువంటివాడో అతడు కాస్త కూడా తెలుసుకోలేదు అన్న విషయం దీన్నుండి తెలుస్తోంది కదా! అందుకే ఈ అర్థరహిత ప్రలాపం. ‘మా మామగారి ఇంట్లో గోశాల నిండా గుర్రాలు ఉన్నాయి’ అన్నాడొకడు. దీన్నుండి అతడి వద్ద గుర్రాలే లేవని తెలుసుకోవచ్చు. ఎందుకంటే గోశాలలో గుర్రాలు ఉండవు కదా! (అంతా నవ్వారు).
“ఐశ్వర్యం, కీర్తి, పదవి వీటివల్ల కొందరు అహంకారపూరితులవుతున్నారు. ఇవన్నీ కేవలం ఒకటి రెండు రోజులకు మాత్రమే. ఏదీ మన వెంట రాదు. పాట ఒకటి ఉంది:
నీ వారెవ్వరు లేరను సత్యము
మరువకు మెప్పుడు ఓ మనసా
వ్యర్థములే నీ తిప్పటలన్నియు
ఈ లోకంబున ఓ మనసా॥ నీ ॥
అతి సూక్ష్మంబౌ మాయాజాలపు
వలలో చిక్కుకుని ఓ మనసా
పావనమౌ శ్రీమాతృ నామమును
మరువకు మెన్నడు ఓ మనసా॥ నీ ॥
మానవు లిల నీ కిచ్చు గౌరవము
మాపో రేపో ఓ మనసా
ప్రభువని పతియని పిలువబడునది
త్వరలో ముగియునె ఓ మనసా॥ నీ ॥
ఇపుడే రూపము ఇంత గౌరవము
నందుచున్నదో ఆ తనువే
మృత్యువాతబడి చచ్చిన నాడు
కడకీడ్చెదరే ఓ మనసా!॥ నీ ॥
ఎవరి కోసమై జీవితమంతయు
యమయాతనలను పొందెదవో
ఆ ప్రియభార్యయె (భర్తయె) వెంటరాక ఇది
పాచిపీనుగని ఈసడించును॥ నీ ॥
14.13.2 ధనవంతులకే ధనవంతుడు
“సంపన్నుడననే గర్వం పనికిరాదు. ‘నేను ధనవంతుడను’ అని నువ్వు భావిస్తే నీ కంటే ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతడి కంటే గొప్ప ధనవంతుడు మరొకడు ఉన్నాడు. చీకటి పడగానే మిణుగురు పురుగు బయటకు వస్తుంది. ఈ ప్రపంచానికే తాను వెలుగు నిస్తున్నానని భావిస్తుంది. అయితే కాసేపట్లో నక్షత్రాలు ఉదయించగానే మిణుగురు పురుగు అహంకారం అణగిపోతుంది. మేమే ఈ ప్రపంచానికి వెలుగును ఇస్తున్నామని నక్షత్రాలు భావిస్తాయి. కొంత సేపటికి చంద్రుడు ఉదయిస్తాడు. అప్పుడు నక్షత్రాలు లజ్జతో కుంచించుకుపోతాయి. తరువాత చంద్రుడు, ‘నా వెలుగు వల్ల ఈ ప్రపంచమే ప్రకాశిస్తోంది. నేనే ఈ ప్రపంచానికి వెలుగును ప్రసాదించే వాడను’ అని తలపోస్తాడు. ఇలా తలపోస్తూ ఉన్నప్పుడే అరుణోదయం అవుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు. చంద్రుడు వెలవెలబోతాడు. కాసేపటికి చంద్రుణ్ణి చూడను కూడా లేము. సంపన్నులు వీటినన్నిటిని కాస్త యోచించి చూస్తే, ధనం ఉందన్న అహంకారం కలుగదు.”
ఉత్సవానికై మణిలాల్ నానారకాల వంటకాలతో గొప్ప విందు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎంతో శ్రద్ధతో శ్రీరామకృష్ణులను, భక్తులను తృప్తి చెందేట్లుగా సేవించాడతడు. అందరూ సెలవు పుచ్చుకునేటప్పటికి రాత్రి బాగా ప్రొద్దుపోయింది. అయినప్పటికీ ఎవరికీ ఏ శ్రమా కలుగలేదు.