9.1 ప్రథమ పరిచ్ఛేదం నరేంద్రుడు, రాఖాల్ ప్రభృత భక్తబృందంతో బలరామ్ ఇంట్లో
శనివారం, ఏప్రెల్ 7, 1883
9.1.1 నరేంద్రాదులతో భజనానందంలో శ్రీరామకృష్ణులు
నేడు అమావాస్య. సమయం మధ్యాహ్నం ఒంటి గంట కావస్తోంది. కలకత్తాలోని బలరామ్ ఇంట్లో వసారాకు ఆనుకొని ఉన్న గదిలో శ్రీరామకృష్ణులు కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, భవనాథ్, రాఖాల్, ‘మ’, బలరామ్ తదితరులూ ఉన్నారు. ఉదయమే బలరామ్ ఇంటికి వచ్చిన శ్రీరామకృష్ణులు అక్కడే ఉండి మధ్యాహ్నం భోజనం చేశారు. “వీరికి భోజనం పెట్టు. అది అనేకమంది సాధువులకు అన్నం పెట్టిన దానికి సమానం” అని శ్రీరామకృష్ణులు, బలరామ్‌తో చెప్పటం కద్దు.
కొన్నిరోజుల క్రితం శ్రీరామకృష్ణులు, ‘నవ బృందావన’ మనే నాటక ప్రదర్శన తిలకించటానికి కేశవసేన్ ఇంటికి వెళ్లారు. ఆయనతోబాటు నరేంద్రుడు, రాఖాల్ కూడా వెళ్లారు. నరేంద్రుడు ఆ నాటకంలో ఒక పాత్రను పోషించాడు; కేశవ్ ‘పవహారి బాబా’ పాత్రను ధరించాడు.
శ్రీరామకృష్ణులు (నరేంద్రాదులతో): కేశవ్ ఒక సాధువు పాత్రలో రంగస్థలం మీదికి వచ్చి శాంతి జలాన్ని సంప్రోక్షించాడు. అయితే నాకది నచ్చలేదు. వేషం కట్టి శాంతి జలాన్ని సంప్రోక్షించటమా?
“మరో వ్యక్తి పాపపురుషుని పాత్రలో నటించాడు. అటువంటి వేషం వేయటం కూడా మంచిది కాదు. పాపం చేయటం తప్పు, అలా నటించటమూ తప్పే!”
నరేంద్రుడి పాట వినగోరారు శ్రీరామకృష్ణులు. కాని నరేంద్రుడికి ఒంట్లో నలతగా ఉంది. అయినప్పటికీ ఆయన నరేంద్రుడితో “నరేన్! వీళ్ళు ఆశపడుతున్నారు, పాడు” అన్నారు.
నరేంద్రుడు తంబురా మీటుతూ పాడసాగాడు:
పాడవే కోయిలా పాడవే గీతి!
పాడవే భగవంతు భవ్య ప్రశస్తి…
తెలిపింపవా నాకు నీ తత్త్వము
రాజాధిరాజ! రాజరాజేశ॥ తె ॥
ప్రసరింపవా కరుణ లొలికించు చూపుతో
నీ కరుణ కాంక్షించి కలవరించెడు నాకు॥ తె ॥
సంసార వహ్నిలో సమసిపోయిన నేను
అర్పింతు నా బ్రతుకు నీ పాదముల మ్రోల॥ తె ॥
పాపమున నా గుండె మరకపడిపోయినది
మాయలో చిక్కి నే మరణించుచుంటి॥ తె ॥
స్పృహతప్పి మృతినొందు నా యాత్మ బ్రతికింపు
నీ దయాపూర్ణ సంజీవితో తాకి॥ తె ॥
హే! దయామయ ప్రభో! రాజాధిరాజ!॥ తె ॥
నీలి గగన పళ్ళెమందు నిలచి జ్యోతులూ
కాంతులీని వెలుగుచుండె సూర్యచంద్రులూ॥ నీ ॥
మిణుకు మిణుకు మనుచు వెలుగు రత్నతారలూ
నీదు చకిత రూపమునకు తొడుగు ఉడుపులూ॥ నీ ॥
మంద గమనమునను వీచు మలయ పవనమూ
పరిమళంబు గొలుపు, మధుర ధూప ధూమమూ॥ నీ ॥
ఇందు నందు సోకుచున్న పిల్లగాలులూ
నీదు దివ్య ముఖమునకును చామరంబులూ॥ నీ ॥
శుభ్రమైన పూలతోట కానుపించునూ
పర్వమునను వెలుగు దీపశిఖల వోలెనూ॥ నీ ॥
జనన మరణములను తొలగద్రోయు ఓ ప్రభూ
ఎంత అద్భుతంబు నీకు జరుగు అర్చనా॥ నీ ॥
వ్యోమమందు ఉద్భవించు ప్రణవనాదమూ
మరల మరల మారుమ్రోగు భేరి వాద్యమూ॥ నీ ॥
నాదు మనసు పగలు రాత్రి సుధను గ్రోలునూ
వాసుదేవు దివ్యచరణ కమల మందునూ॥ నీ ॥
కురియు మయ్య నీదు పరమ కరుణ వర్షమూ
దప్పిగొన్న నానకుపై పూరుషోత్తమా॥ నీ ॥
పరమ పూజ్యమైన నీదు పుణ్యనామమూ
అగును గాక నిత్యమైన అతని గేహమూ॥ నీ ॥
విజ్ఞాన గగనమున ప్రేమ చంద్రుడు పూర్ణ
బింబమున ఉదయించెను ।
ప్రేమపోటున అలలు పొంగి పొరలుచు లేచి
అన్ని దిక్కుల పారెను
దేవ జయమగు నీకు దేవాధి దేవుడవు
జయమహో జయము, జయము…….
తరువాత శ్రీరామకృష్ణుల ఆదేశం మేరకు భవనాథ్ పాడ సాగాడు:
నా కెచట నున్నారురా
నీకు సమమగు సఖుడు
ఓ దయామయరాశీ
ఓ ప్రేమమూర్తీ ॥॥ నా ॥
సుఖ దుఃఖముల యందు
సుస్థిరంబుగ నిలచి
అండగా నాకుండు వే
రొండు మిత్రుండు॥ నా ॥
నా తప్పులను సైచి
నా యాపదలు బాపి
భీతాత్ముడగు నాకు
శాంతి గూర్చెడు సఖుడు॥ నా ॥
నా జీవిత నౌకను
ఘోర సంసారాబ్ధి
తరియింపగాజేయు
కర్ణధారుడ వీవు॥ నా ॥
గాలివానగ లోన
చెలరేగు కామముల
నీ కరుణ మాత్రమే
జాలు శాంతిలజేయ॥ నా ॥
పరితాపమున రగిలి
పరితపించెడు ఆత్మ
పై శాంతి జలముల
కురిపింతు ఓ ప్రభూ॥ నా ॥
మిత్రులందరు వదలు
నా మరణ సమయమున
నీ హృదయమే గదా
నా కొసగు ఆశ్రయము॥ నా ॥
నరేంద్రుడు నవ్వుతూ భవనాథ్ను ఉద్దేశిస్తూ శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: “అతడు చేపలు తినటం, తాంబూల సేవనం మానివేశాడు.”
శ్రీరామకృష్ణులు (భవనాథ్ వైపు చూసి, నవ్వుతూ): ఎందుచేత? చేపలు తినటం, తాంబూల సేవనంలో తప్పు ఏం ఉంది? వాటిలో దోషం ఏమీ లేదు. కామినీ కాంచన త్యాగమే నిజమైన త్యాగం. రాఖాల్ ఎక్కడ?
ఒక భక్తుడు: రాఖాల్ నిద్రపోతున్నాడండీ.
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో): ఒకప్పుడు ఒక వ్యక్తి వీథి నాటక ప్రదర్శన చూడగోరి చంకలో ఒక చాపను చుట్టుకొని ప్రదర్శన జరిగే చోటుకు వెళ్లాడు. నాటకం ప్రారంభించటానికి ఇంకా కొంత వ్యవధి ఉందని ఎరిగి, నేల మీద చాప పరచుకొని నిద్రపోయాడు. అతడు నిద్రనుండి మేలుకొనేసరికి నాటకం అయిపోయింది. (అందరూ నవ్వారు) తరువాత చంక క్రింద చాపను చుట్టుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. (నవ్వులు)
రామ్దయాళ్కు బాగా సుస్తీ చేసి, ఒక గదిలో పడుకొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఆ గదిలోకి వెళ్లి అతడి ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
9.1.2 పంచదశి, వేదాంత శాస్త్రాలు – సంసారులు
సాయంత్రం నాలుగు గంటలు అయివుంటుంది. అతిథుల గదిలో నరేంద్రుడు, రాఖాల్, ‘మ’, భవనాథ్ తదితర భక్తులతో శ్రీరామకృష్ణులు కూర్చుని ఉన్నారు. అప్పుడు కొందరు బ్రహ్మసమాజ భక్తులు వచ్చారు. వారితో శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు.
ఒక బ్రహ్మసమాజ భక్తుడు: అయ్యా, మీరు వేదాంత పంచదశి చదివారా?
శ్రీరామకృష్ణులు: ప్రారంభంలో అలాంటి వేదాంత గ్రంథాల శ్రవణం చేయాలి. ప్రారంభంలో విచారణా చేయాలి. ఆ తరువాత –
పదిల పరచవే మనసా! అమ్మ శ్యామను
అతిప్రియమగు నా అమ్మ శ్యామను
నిలుపుము నీలో అతిభద్రముగా
పరులెవ్వరిని చేరనీయకుము
మన మిరువురమే ఆమెను చూతము॥ ప ॥
ఆమె సన్నిధిని ఆనందించగ
కామవర్గమును కడకు ద్రోలుచు
‘అమ్మా! అమ్మా’ అని పిలచుటకై
రసనము వెంబడి తీసుకుపొమ్ము॥ ప ॥
మన ఇరువురి దరి చేరకుండగా
చెడ్డ కామముల నడ్డుపెట్టుటకు
అన్ని సమయముల నతిమెళకువగల
జ్ఞానకాపరిని కాపుపెట్టుము॥ ప ॥
“సాధన దశలో శాస్త్రగ్రంథాల శ్రవణం చేయవలసిందే. భగవత్సాక్షాత్కారానంతరం జ్ఞానానికి లోటు ఉండదు. అమ్మ జ్ఞానరాశిని తరగకుండా అందిస్తూనే ఉంటుంది.
“అక్షరాభ్యాసం చేసే కొత్తలో పిల్లవాడు ప్రతి అక్షరాన్నీ పలుకుతూ, దిద్దుతాడు. క్రమేణా ధారాళంగా వ్రాయగలుగుతాడు.
“బంగారాన్ని కరిగించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మూసలోని బంగారం కరిగేటంత వరకు ఒక చేత్తో కొలిమి తిత్తిని సరిచేస్తూ మరో చేత్తో విసనకర్రను విసురుతూ, నోటితో గొట్టం ద్వారా ఊదుతూ ఉండాలి. కాని బంగారం కరిగి మూసలో పోసిన తరువాత నిశ్చింతగా ఉండవచ్చు.
“కేవలం శాస్త్రాధ్యయనం సరిపోదు. కామినీ కాంచనాల నడుమ నివసిస్తే శాస్త్రమర్మాల్ని తెలుసుకోలేం. సంసారానురక్తి జ్ఞానాన్ని మరుగు పరచుతుంది.
అతికష్టంతో నేర్చితిని నా కిష్టమైన కావ్యరసాన్ని
అయితే ఆ కావ్యం మునిగిపోయింది కృష్ణ ప్రేమరసంలో
(అందరూ నవ్వారు)
కేశవ్ గురించి బ్రహ్మసమాజభక్తులతో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “కేశవ్‌లో యోగమూ ఉంది, భోగమూ ఉంది. సంసారంలో ఉంటూ అతడు తన మనస్సును భగవంతుడి దిశగానే తిప్పి ఉంచాడు.’
ఒక భక్తుడు కలకత్తా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని వర్ణిస్తూ “బాబోయ్! సభలో ఇసుక వేసినా రాలనంతటి జనసమూహం!” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: జనసమూహాన్ని చూసినప్పుడు భగవదుద్దీపన కలుగుతుంది. ఆ సమావేశాన్ని చూసివుంటే నేను పారవశ్యంలో బాహ్యస్పృహను కోల్పోయేవాణ్ణి.”
9.2 ద్వితీయ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో భక్తులతో శ్రీరామకృష్ణులు – మణిలాల్, కాశీదర్శనం
ఆదివారం, ఏప్రిల్ 8, 1883
రండి సోదరులారా! రండి! మళ్లీ నేడు దక్షిణేశ్వర ఆలయానికి శ్రీరామకృష్ణుల దర్శనార్థం వెళదాం. ఆయన భక్తుల సాంగత్యంలో ఏ రీతిలో ఆనందిస్తున్నారో, సర్వదా భగవద్భావంలో ఎలా సమాధిమగ్నులై ఉంటారో తిలకిద్దాం.
ఒకమారు సమాధిస్థితిలోనూ, మరొకసారి కీర్తనానందంలోనూ ఉన్మత్తులై ఉంటారు. మరొకసారి సామాన్యునివలె భక్తులతో సంభాషిస్తూ ఉంటారు.
ఆయన ముఖతా సదా భగవత్ ప్రసంగాలు తప్ప అన్యం ఏవీ వెలువడవు. ఆయన మనస్సు ఎల్లప్పుడూ అంతర్ముఖమై ఉంటుంది. ఐదు సంవత్సరాల బాలునివలె వర్తిస్తూ ఉంటారు. ప్రతి నిశ్వాసంలోను జగజ్జనని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. అభిమానం కించిత్తూ కానరాదు. ఐదేళ్ల బాలుని వలె ఆసక్తిరహితుడు, సదానందుడు; సరళ, ఉదార స్వభావం గలవాడు. ఒక్క విషయం గుర్తుంచుకోండి – భగవంతుడే సత్యం, తక్కినదంతా అనిత్యం; కేవలం మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. సోదరులారా, రండి! ఆ ప్రేమోన్మత్త బాలుని దర్శింప వెళదాం. ఆయన మహాయోగి! అనంత సాగర తీరాన ఏకాంతంలో పచార్లు చేస్తూ ఉన్నారు. ఆ అనంత సచ్చిదానంద సాగరంలో ఆయన ఏదో తిలకిస్తున్నారు. భక్తి భావనలో మగ్నులై ఉన్నారు.
నిన్న అమావాస్య రోజు. ఆయన బలరామ్బోసు ఇంటికి వెళ్ళి ఉన్నారు. అమావాస్య రేయి గాఢాంధకారంలో మహాకాళి ఒంటరిగా మహాకాళునితో లీలావినోదాలలో మునిగి ఉంటుంది. అందుకే శ్రీరామకృష్ణులు అమావాస్య రోజున సామాన్య మనోస్థితిలో ఉండలేకపోయేవారు. ఆయన స్థితి పసిబాలుని స్థితిని పొందేది. ఎవరు రేయింబవళ్ళు జగజ్జననిని దర్శిస్తూ ఉన్నారో, ఎవరు ఆమెను ఒక్క క్షణంకూడా విడిచి ఉండలేరో, అతడు పసిబాలుడే కదా!
నాటి ఉదయం శ్రీరామకృష్ణులు గదిలో పసిబాలునిలా కూర్చుని ఉన్నారు. సమీపాన రాఖాల్ కూడా ఉన్నాడు.
‘మ’ గదిలో ప్రవేశించి, శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణుల అన్నగారి కుమారుడు రామ్‌లాల్ కూడా అక్కడ ఉన్నాడు. కిశోరీ, మరికొందరు భక్తులు చేరుకున్నారు. ప్రధాన బ్రహ్మసమాజస్థుడైన మణిలాల్ మల్లిక్ కూడా వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రొద్దు ఎక్కేకొద్దీ పలువురు భక్తులు రాసాగారు.
మణిలాల్ మల్లిక్ కాశీకి వెళ్ళి వచ్చాడు. అతడొక వ్యాపారస్థుడు. కాశీలో అతడికి ఒక భవంతి ఉంది.
శ్రీరామకృష్ణులు: నువ్వు కాశీకి వెళ్లావు గదా! అక్కడ సాధుపుంగవుల నెవరినైనా దర్శించావా?
మణిలాల్: అవునండీ. త్రైలింగస్వామి, భాస్కరానందస్వామి మొదలైన సాధుపుంగవులను దర్శించుకున్నాను.
శ్రీరామకృష్ణులు: వారి గురించి చెప్పు, విందాం.
మణిలాల్: త్రైలింగస్వామి మణికర్ణికా ఘట్టంలో వేణీమాధవ్ గోపుర సమీపంలో ఆయన ఇదివరకు బసచేసిన ఆలయంలోనే వసిస్తున్నారు. ఇదివరలో ఆయన అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉండేవారని ప్రజలు చెప్పుకొంటారు. అప్పుడు అనేక మహిమలు చూపే శక్తి ఆయనకు ఉండేదట. ఇప్పుడు ఆయనలో ఆ శక్తి సన్నగిల్లింది.
శ్రీరామకృష్ణులు: అది లౌకికుల విమర్శ.
మణిలాల్: భాస్కరానందస్వామి అందరితోను కలసిమెలసి మాట్లాడతారు. అయితే త్రైలింగస్వామి ఎవరితోనూ మాట్లాడకుండా మౌనవ్రతంలో ఉన్నారు.
9.2.1 సిద్ధులకు మాత్రమే ‘ఈశ్వరుడే కర్త’ అనే భావం – ఇతరులకు పాపపుణ్యాలు – ఫ్రీవిల్
శ్రీరామకృష్ణులు: భాస్కరానంద స్వామితో ఏమైనా మాట్లాడావా?
మణిలాల్: అవునండీ. అనేక విషయాలు మాట్లాడాం. మా మాటల్లో పాపపుణ్యాల గురించీ ప్రస్తావన వచ్చింది. ఆయన నాతో ఇలా అన్నారు: ‘పాప మార్గంలో వెళ్ళకు. పాపచింతనను విడిచిపెట్టు. పుణ్యం చేకూర్చే కర్మలనే చేస్తూ ఉండు. భగవంతుడు కోరుకునేది ఇదే సుమా!’
శ్రీరామకృష్ణులు: అవును! అదికూడా ఒక మార్గమే; అది సంసారులకోసం ఉద్దేశింపబడింది. కాని ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమైన వారి, బ్రహ్మసత్యం జగన్మిథ్య అని తెలుసుకొన్న వారి భావం వేరే విధంగా ఉంటుంది. వారికి ‘భగవంతుడే కర్త, తక్కిన వారందరూ అకర్తలే’ అనే ఎరుక ఉంటుంది.
“ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమైన వారు ఎన్నడూ తప్పుటడుగు వెయ్యరు. విచారణ చేసి పాపకార్యాలను త్యజించే అవసరం వారికి ఉండదు. భగవంతుడిపై వారు అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అందుచేత వారు ఒనరించే కర్మలన్నీ సత్కర్మలుగానే పరిణమిస్తాయి. తాము ఒనరించే కర్మలకు తాము కర్తలు కామనీ, కేవలం తాము భగవంతుని సేవకులమనీ వారికి పూర్తి ఎరుక ఉంటుంది. వారు సర్వదా ఇలా భావిస్తారు: ‘నేను యంత్రాన్ని; ఆయన యంత్రాన్ని నడిపించే వాడు. ఆయన ఎలా చేయిస్తే నేను అలా చేస్తాను. ఏ విధంగా పలికిస్తే ఆ విధంగా పలుకుతాను. ఎలా కదలమంటే అలా కదలుతాను.’
“ఆత్మజ్ఞానులు పాపపుణ్యాలకు అతీతులు. భగవంతుడే సకలమూ నిర్వర్తిస్తున్నాడనే జ్ఞానం వారికి ఉంటుంది.
“ఒకానొక ప్రాంతంలో ఒక మఠం ఉండేది. మఠంలో నివసించే సాధువులు ప్రతిరోజూ భిక్షార్థం బయటకు వెళ్ళేవారు. ఇలా ఉండగా ఒక రోజు భిక్షార్థం బయటకు వెళ్ళిన ఒక సాధువు, ఒక వ్యక్తిని జమీందారు చితకబాదుతూండటం చూశాడు. దయాళువైన ఆ సాధువు అక్కడకు వెళ్ళి జమీందారును కొట్టటం ఆపమన్నాడు. కాని ఆగ్రహంతో దహించుకుపోతున్న ఆ జమీందారు క్రోధం అంతా ఆ అమాయక సాధువు పైకి మళ్లింది. స్పృహ తప్పిపోయేటంత వరకు ఆ సాధువును చావగొట్టాడు. ఇంతలో ఎవరో ఈ సమాచారాన్ని మఠంలో తెలిపారు. సాధువులు అక్కడకు పరుగున వచ్చి తమ సోదర సాధువు నేల మీద పడివుండటం చూశారు. నలుగురైదుగురు కలిసి ఈ గాయపడిన సాధువును ఎత్తుకొని మఠానికి తీసుకువెళ్ళి ఒక గదిలో పడుకోబెట్టారు. అతడికి ఇంకా స్పృహ రాలేదు. వారంతా అతడి చుట్టూ విషణ్ణ హృదయులై కూర్చున్నారు. కొందరు అతడికి విసురుతున్నారు. చివరకు ఎవరో అతడికి కొంచెం పాలు ఇవ్వమని సూచించారు. పాలు నోట్లో పోయగానే అతడు స్పృహలోకి వచ్చాడు. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. ‘ఇతడు పూర్తిగా స్పృహలోకి వచ్చాడో లేదో, మనలను గుర్తించగలడో లేదో చూద్దాం’ అన్నాడు ఒక సాధువు. అతడికి దగ్గరగా వెళ్ళి బిగ్గరగా ‘ఓ స్వామీ! మీకు పాలు త్రాగిస్తున్న దెవరు?’ అని అరిచాడు. ఈ సాధువు క్షీణస్వరంలో ఆ సాధువుతో ‘సోదరా! అప్పుడు నన్ను చావబాదిన వ్యక్తే ఇప్పుడు పాలు త్రాగిస్తున్నాడు’ అన్నాడు.
“కాని భగవత్సాక్షాత్కారం కానిదే అటువంటి మనోస్థితి ఎవరికీ కలుగదు.
మణిలాల్: అవును! ఇప్పుడు మీరు చెప్పింది ఉత్కృష్ట ఆధ్యాత్మిక స్థితి సంతరించుకున్న వ్యక్తికే వర్తిస్తుంది. ఇటువంటి విషయాలను గురించి నేను భాస్కరానంద స్వామితో మాట్లాడాను.
శ్రీరామకృష్ణులు: ఆయన ఏ ఇంట్లోనైనా నివసిస్తున్నారా?
మణిలాల్: అవునండీ. ఒక భక్తుని ఇంట్లో వసిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: ఆయనకు వయస్సు ఎంత ఉంటుంది?
మణిలాల్: యాభై ఐదు సంవత్సరాలుండవచ్చు.
శ్రీరామకృష్ణులు: మరేదైనా మాట్లాడావా?
మణిలాల్: భక్తిని అలవరచుకోవటం ఎలా అని అడిగాను. అందుకు ఆయన భగవన్నామ సంకీర్తన చెయ్యమనీ, రామనామం ఉచ్చరించమనీ చెప్పారు.
శ్రీరామకృష్ణులు: ఇవి భేషైన మాటలు.
9.3 తృతీయ పరిచ్ఛేదం గృహస్థుడు – కర్మయోగం
భవతారిణీ, రాధాకాంత, ద్వాదశ శివాలయాలలో పూజలు ముగిశాయి; నైవేద్య నివేదన జరుగుతున్నట్లు గంటలు మ్రోగాయి. వేసవి కాలం మధ్యాహ్నం కావటంతో ఎండ తీవ్రంగా ఉంది. గంగానదిలో పోటు ప్రారంభమైంది. గంగానది ఉత్తర దిశగా ప్రవహించసాగింది; దక్షిణపు గాలి వీచసాగింది. శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనం చేసి తమ గదిలో విశ్రమించారు.
బసిర్హాట్ సమీపంలో రాఖాల్ జన్మస్థలం ఉంది. అక్కడ వేసవి కాలంలో నీటి ఎద్దడి అత్యధికం.
శ్రీరామకృష్ణులు (మణిలాల్‌తో): తన స్వగ్రామంలో తీవ్ర నీటి కొరత ఉన్నట్లు రాఖాల్ చెప్పాడు. అక్కడ నువ్వొక చెరువు నెందుకు తవ్వించకూడదు? అలాచేస్తే ఎందరికో ఉపకారం చేసినట్లవుతుంది. (చిరునవ్వుతో) నీ వద్ద చాలా ధనం ఉంది కదా! అంత ధనం ఏం చేసుకుంటావు? కాని నూనె వ్యాపారస్థులు అమిత పిసినారులని విని ఉన్నాను.* (అందరూ నవ్వారు)
మణిలాల్ మల్లిక్ గృహం కలకత్తాలోని సిందూరియాపట్టీలో ఉంది. బ్రహ్మ సమాజపు సిందూరియాపట్టీ శాఖ సమావేశాలన్నీ అతడి ఇంట్లోనే నిర్వహించబడతాయి. ఆ ఉత్సవాల సందర్భంగా అతడు అనేకులను తన ఇంటికి ఆహ్వానించటం పరిపాటి. శ్రీరామకృష్ణులను కూడా ఆహ్వానిస్తాడు.
మణిలాల్‌కు బారానగర్‌లో ఒక ఉద్యానగృహం ఉంది. అతడు అప్పుడప్పుడు అక్కడికి వచ్చి ఏకాంతవాసం చేసేవాడు. అప్పుడల్లా దక్షిణేశ్వరం వెళ్ళి శ్రీరామకృష్ణులను దర్శించేవాడు.
మణిలాల్ డబ్బు విషయంలో చాలా లెక్కలు కడతాడు. అతడు బారానగర్‌కు వచ్చేటప్పుడు సాధారణంగా పూర్తి దూరానికి బండి ఏర్పాటు చేసుకుని రాడు. మొదట ట్రామ్‌లో శోభా బజార్ వస్తాడు. అక్కడి నుండి షేర్టాక్సీలో బారానగర్‌కు వస్తాడు. అయితే డబ్బుకు మాత్రం కొదువ లేదు. తదనంతర కాలంలో పేద విద్యార్థుల పోషణార్థం అతడు ఒక్కసారిగా ఇరవై ఐదు వేల రూపాయల ధర్మాదాయం కల్పించాడు.
మణిలాల్ బదులేమీ పలుకక కూర్చుని ఉన్నాడు. కాసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నారు. మధ్యలో అతడు శ్రీరామకృష్ణులతో “మహాశయా! చెరువు త్రవ్వించటం గురించి ప్రస్తావించారు సరే. అదిమట్టుకు చెప్పి ఉంటే సరి పోయేది. నూనె వ్యాపారి వగైరా చెప్పటం ఎందుకు?” అని అడిగాడు.
కొందరు భక్తులు నోటిని మూసుకొని వచ్చే నవ్వును ఆపుకో ప్రయత్నించారు. శ్రీరామకృష్ణులు నవ్వేశారు.
9.4 చతుర్థ పరిచ్ఛేదం బ్రహ్మసమాజస్థులు – ప్రేమతత్త్వం
కాసేపు గడిచింది. ప్రధాన బ్రహ్మసమాజానికి చెందిన కొందరు భక్తులు కలకత్తా నుండి వచ్చారు. గదిలో భక్తులు పలువురు ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఉత్తరాభిముఖంగా చిన్నమంచంపై కూర్చుని ఉన్నారు. ఆయన మందహాసం చేస్తూ ఒక బాలునివలె బ్రహ్మసమాజ భక్తులతో ఆనందంగా మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: మీరు పేమ, పేమ* అంటూ ఉంటారు కదా! కాని అది అంతటి సామాన్య వస్తువా? చైతన్య దేవులకు ఈ ప్రేమ కలిగింది.
“ప్రేమకు రెండు లక్షణాలు ఉన్నాయి. మొదటిది: అది ప్రపంచాన్నే మరపింప చేస్తుంది. భగవత్ ప్రేమ ఎంత తీవ్రమైనదంటే, అది కలిగిన వారికి బాహ్య ప్రపంచ స్పృహే ఉండదు. చైతన్య దేవులు వనాన్ని చూసి బృందావనంగానూ, సముద్రాన్ని చూసి యమునా నదిగానూ భావించేవారు.
“రెండవది: అత్యంత ప్రియమైన తన దేహం పట్ల ధ్యాస ఉండకపోవటం. దేహాత్మబుద్ధి సమూలంగా నశిస్తుంది.
“భగవదనుభూతికి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఎవనిలోనైతే అనురాగ సంపత్తి విశేషంగా వ్యక్తమవుతుందో, అతడు భగవత్సాక్షాత్కారానికి అతి చేరువలో ఉన్నాడని గ్రహించవచ్చు. అనురాగ సంపత్తి అంటే ఏమిటి? అవి: వివేకం, వైరాగ్యం, భూతదయ, సాధుసేవ, సాధు సాంగత్యం, భగవంతుని నామ గుణ కీర్తనం, సత్యసంధత మొదలైనవి. అనురాగం యొక్క ఈ లక్షణాలను చూసినప్పుడు భగవద్దర్శనం అయ్యే కాలం ఎంతో దూరంలో లేదని నిశ్చయంగా చెప్పవచ్చు.
“సేవకుడి ఇంట్లో జరుగుతూన్న ఏర్పాట్లను చూడగానే యజమాని అక్కడకు రాబోతున్నాడని కచ్చితంగా చెప్పవచ్చు. ముందుగా చెత్తా చెదారం, ఇంటి చుట్టూ పెరిగిన అడవిలాంటి పిచ్చిమొక్కలూ తొలగిస్తారు. తదుపరి గదులలో బూజు, దుమ్ము దులుపబడతాయి. తదనంతరం పెరడు, గచ్చు, ఇతర ప్రదేశాలు శుభ్రంగా చిమ్మబడి, కడగబడతాయి. చివరగా యజమానే ఆ ఇంటికి తివాచీ, హుక్కా మొదలైన సామగ్రిని పంపుతాడు. ఈ సరంజామా దిగుతూవుంటే, యజమాని సత్వరమే రాబోతున్నాడని నిశ్చయంగా తెలుస్తుంది.
ఒక భక్తుడు: అయ్యా, ముందుగా విచారణ చేసి ఇంద్రియ నిగ్రహం సాధించాలా?
శ్రీరామకృష్ణులు: అదీ ఒక మార్గమే. దీనినే విచారణ మార్గం అంటారు. కాని భక్తి మార్గం అవలంబించటం ద్వారా అంతఃకరణాలు* వాటంతట అవే నియంత్రించబడతాయి. అది సులభమైన మార్గం. భగవంతుడి పట్ల ప్రేమ అధికరించే కొద్దీ ఇంద్రియసుఖాలు చప్పగా, రుచిహీనంగా గోచరిస్తాయి. తమ పిల్లవాడు మరణించిన రోజు దంపతులకు శారీరక సుఖం మీద మనస్సు పోతుందా?
భక్తుడు: భగవంతుడి పట్ల భక్తిని నేనెలా పెంపొందించుకోవాలి?
9.4.1 నామ మాహత్మ్యం – జగజ్జనని నామం
శ్రీరామకృష్ణులు: భగవన్నామాన్ని జపించడం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి. కామక్రోధాదులు, ఇంద్రియ సుఖాలపట్ల ఆసక్తీ అన్నీ తొలగిపోతాయి.
భక్తుడు: భగవన్నామం పట్ల రుచి ఎలా కలుగుతుంది?
శ్రీరామకృష్ణులు: ఆయన నామం పట్ల రుచి జనించాలని భగవంతుణ్ణి వ్యాకుల హృదయంతో ప్రార్థించండి. ఆయన తప్పక నీ మనోవాంఛితాన్ని నెరవేరుస్తాడు.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు సుమధుర స్వరంలో పాడసాగారు. జీవుల శోకంలో కరిగిపోయి తమ హృదయ వేదనను జగజ్జననితో తెలుపుతూ ఉన్నట్లూ, జీవుల దుఃఖ భారాన్ని తమపై వేసుకొని దాన్ని జగజ్జననికి తెలుపుతూ ఉన్నట్లూ ఉంది ఆ పాట.
ఎవరిని దూషింపగలను । నే
నెవరిని తప్పెంచగలను
నేనె త్రవ్విన నూతి లోపల మునుగంగ॥ ఎ ॥
ఆరు వికారంబుల పార చేబూని
నేరుగా నొక గుంట నేలపై త్రవ్విన
ఘోరమగు నల్లని మృత్యు జలములు లేచె
నేరను బ్రతికెడు దారి ఉద్ధారిణి॥ ఎ ॥
చూడగా శత్రువు నాకు నేనె సుమ్ము
జాడ గనుపింప దీ మృత్యు జలముల నాప
చూడు! గుండెల దాక నిండుచుండెను నీరు
వేడెద నిక నేను బ్రతుకంగజాలను॥ ఎ ॥
నీ కన్న గతి నాకు వేరెవ్వరును లేరు
ప్రాకటంబుగ నాకు రక్షణ మొసగుము
శోకపూరితమైన లోకంబులోనుండి
ఏకముగా దాటించి చేర్పు మావలి గట్టు॥ ఎ ॥
మనుష్యులకు ప్రాపంచికత అనే సన్నిపాత జ్వరం వచ్చింది. భగవన్నామం పట్ల రుచి ఏర్పడితే ఆ జ్వరం పోతుంది. శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడారు:
ఇది యేమి విషజ్వరమొ మది నెరుగకున్నాను
వదలకుండగ నన్ను వేధించుచున్నది॥ ఇ ॥
ఒక్క నీ కరుణయే తగ్గించు
చక్కని ఔషధము నిక్కముగ మాతా॥ ఇ ॥
పాడుగర్వము కడు శల్యగతమగుచు
పడియున్న నా మేను పీడించు ఈ జ్వరము॥ ఇ ॥
వింతగా ‘నేను’ ‘నా’ దను భ్రాంతి ప్రబలతచేత
వింతగా వాగుట ఎంత చాపల్యమో॥ ఇ ॥
ధనమందు సఖులందు తనివితీరని దాహ
మున నెండు నా ప్రాణమును నెట్లు నిలుపుదును॥ ఇ ॥
అసలు నా సంధి కిది సిసలైన కారణము
నశియించు వానినే వ్యసనముగ వదరుట॥ ఇ ॥
మగతలో కన్నులు సగము మూతలు వారె
క్రౌర్యమను క్రిములు నా పొట్టనిండుగ నిండె
పనిలేని పనులలో మునిగి తేలుచునుండె
ఘనమైన నీ నామమున కూడ రుచి తప్పె॥ ఇ ॥
ఓ భాగ్యదేవతా! ఓ దివ్యమాతా!
ఈ వ్యాధి తగ్గునను ఆశ సైతము తీరె॥ ఇ ॥
తరువాత శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ ‘సర్వేశ్వరీ! నీ పావననామం పట్ల అరుచియా!’ సన్నిపాత జ్వరం సోకిన వ్యక్తి ఆహారం పట్ల రుచిని కోల్పోతే అతడు కోలుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాని అతడికి ఆహారం పట్ల ఒకింత రుచి ఉన్నా, అతడు బతికి బయటపడే అవకాశాలు ఎక్కువ. అందుచేతనే భగవన్నామం పట్ల అభిరుచిని అలవరచుకోవాలి. భగవన్నామాన్ని జపించాలి. దుర్గ, కృష్ణ లేక శివ – ఏదో ఒక నామం. తరువాత భగవన్నామ స్మరణ ద్వారా భగవంతుడి పట్ల అనురాగం దినదినాభివృద్ధి చెంది, హృదయం ఆనందంతో నిండిపోయినట్లయితే ఇక దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. సన్నిపాతం తప్పకుండా అదృశ్యమౌతుంది; భగవంతుడి కృప తప్పక వర్షిస్తుంది.
9.4.2 ఆంతరంగిక భక్తి – దాంభిక భక్తి – భగవంతుడు ‘భావగ్రాహి’
“ ‘భావానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది.’ ఒకప్పుడు ఇద్దరు మిత్రులు దారిన పోతూవుండగా ఒకచోట కొందరు భాగవత పురాణశ్రవణం చేస్తూ కనిపించారు. ‘రా మిత్రమా! పవిత్ర గ్రంథ శ్రవణం చేద్దాం’ అన్నాడు మిత్రులలో ఒకడు. అలా అంటూ అతడు లోపలికి వెళ్లి కూర్చున్నాడు. రెండవ వ్యక్తి లోపలికి తొంగిచూసి వెళ్లిపోయాడు. అతడలా వెళ్లి ఒక వేశ్య ఇంట ప్రవేశించాడు. కాని కాసేపటికే ఆ వాతావరణం అతడికి రోత కలిగించింది. అతడు తనలో ఇలా అనుకున్నాడు: ‘ఎంత సిగ్గుచేటు. నా మిత్రుడు ఎంత శ్రద్ధగా శ్రీహరి పవిత్ర వచనామృతాన్ని గ్రోలుతున్నాడు; నేను ఎక్కడున్నాను!’ అక్కడ భాగవత పురాణాన్ని వింటున్న ఆ మిత్రుడూ విసుగు చెందాడు. అతడు తన్ను తాను ఇలా నిందించుకున్నాడు: ‘నేనెంత మూర్ఖుణ్ణి! ఈ వ్యక్తి చెబుతున్న పుక్కిటి పురాణాన్ని వింటూ ఇక్కడ కూర్చున్నాను. నా మిత్రుడు అక్కడ సుఖంగా గడుపుతున్నాడు.’ కొంతకాలానికి ఈ ఇద్దరూ మరణించారు. భాగవతపురాణాన్ని వింటూ కూర్చున్న వాణ్ణి యమభటులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి నరకంలో పారేశారు. వేశ్య ఇంటికి వెళ్ళిన వ్యక్తిని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకువెళ్ళారు.
“వాస్తవానికి భగవంతుడు మనస్సునే చూస్తాడు; అతడు ఎక్కడ నివసిస్తున్నాడో లేదా ఏం చేస్తున్నాడో అన్నదాన్ని బట్టి భగవంతుడు నిర్ణయించడు. అందుకే అంటారు – ‘భావగ్రాహి జనార్దన’ అని.
“కర్తాభజా శాఖలో, గురువు మంత్రోపదేశం ఇస్తూ శిష్యుడితో ఇలా పలుకుతాడు: ‘మన్తోర్’ – అంటే ఇప్పుడు ప్రతిదీ నీ మనస్సుపై ఆధారపడి ఉందని అర్థం. ఈ సంప్రదాయం ప్రకారం ఎవరికైతే సరియైన మనస్సు ఉంటుందో అతని మార్గం సరైనదీ, అతనికి దక్కే ఫలమూ సరైనదే అవుతుంది.
“హనుమంతుడు మనోబలం ద్వారానే సముద్రాన్ని లంఘించగలిగాడు. ‘నేను రాముడి బంటును; నేను రామనామాన్ని జపిస్తాను. అటువంటప్పుడు నాకు సాధ్యం కానిది ఏమిటి?’ – ఇదే హనుమంతుడి ప్రగాఢ విశ్వాసం.
9.4.3 భగవద్దర్శనం ఎందుకు కాదు? – అహంకారం వల్లే
“అహంకారం ఉన్నంత కాలం అజ్ఞానం ఉండే తీరుతుంది. అహంకారం ఉన్నంత వరకు ముక్తి ప్రసక్తే లేదు. ఎద్దు ‘హంబా, హంబా’ అంటూ అరుస్తుంది. మేక ‘మే మే’ అని అరుస్తుంది. ఆ కారణంగా వాటికి ఎంత దుఃఖం. కసాయి వాడి చేతుల్లో నరకబడుతున్నాయి. వాటి తోలుతో చెప్పులు, మృదంగం మొదలైన వాటిని తయారుచేస్తున్నారు. అంతటితో దుఃఖాలు అంతం కావటం లేదు. హిందీ భాషలో ‘హమ్’ అంటె ‘నేను’ అని అర్థం. ‘మే’ అంటేనూ ‘నేను’ అనే అర్థం. ‘నేను, నేను’ అని చెప్పటం వల్ల అవి ఎన్ని దుఃఖాలు అనుభవించవలసి వస్తోంది. చివరికి వాటి నరాలతో దూది ఏకే వింటి నారిని చేస్తున్నారు. దూది ఏకేవాడి చేతుల్లో అది ‘తుహి తుహి’ – అంటే ‘నువ్వు, నువ్వు’ అని ధ్వనిస్తుంది. ‘నువ్వు నువ్వు’ అని చెప్పసాగిన తరువాతనే విముక్తి. ఆ తరువాత దుఃఖం ఉండదు.
“ఓ భగవంతుడా! నువ్వే కర్తవు; నేను అకర్తను – జ్ఞానం అంటే ఇదే.
“దిగువన ఉండటం వల్లనే పైకి వెళ్ళగలిగేది. చాతకపక్షి గూడును దిగువ ప్రదేశంలో నిర్మిస్తుంది; కాని అది ఆకాశంలో అత్యున్నత ఎత్తుల్లో విహరిస్తుంది. మెట్టభూమిలో వ్యవసాయం సాధ్యం కాదు; కాని పల్లపు భూములలో నీరు నిలువ ఉండి వ్యవసాయానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
9.4.4 గృహస్థులకు సాధుసాంగత్యం ఆవశ్యకం – దేహ ‘గృహం’ లో జ్ఞాన ‘దీపం’
“కాస్త శ్రమకోర్చియైనా సత్సాంగత్యం చేయాలి. ఇంటిలో సంసారాన్ని గురించే సంభాషణ సాగుతుంది; ప్రాపంచికత అనే రోగం అతడిపట్ల దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమిస్తుంది. గూటిలోని చిలుక ‘రామా! రామా!’ అంటూ పలుకుతుంది. కాని ఆ చిలుకను అడవిలోకి వదలివేస్తే దాని సహజ రీతిలో ‘కీ, కీ’ అంటూ కూతలు పెడుతుంది.
“కేవలం ధనం ఉండగానే ఎవరూ పెద్దమనిషి కాబోడు. దీపాలతో గృహం కళకళలాడటమే పెద్దమనిషి గృహానికి సంకేతం. పేదలకు ఎక్కువ చమురును కొనుక్కొనే స్థోమత ఉండదు కనుక వారి ఇళ్లలో ఎక్కువ సంఖ్యలో దీపాలు ఉండవు. ఈ దేహమనే దేవాలయాన్ని చీకటిలో ఉంచుకోరాదు; దాన్ని జ్ఞానమనే దీపం చేత ప్రకాశవంతం చేసుకోవాలి.
జ్ఞానజ్యోతిని వెలిగించి
హృదయ కుహరమున నుంచి
బ్రహ్మమయి అమ్మ శ్యామ
ముఖవీక్షణ మొనరింపు”
9.4.5 ప్రార్థన – చైతన్య జాగృతి
“ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చు. జీవాత్మ పరమాత్మ అని రెండు ఉన్నాయి. ప్రార్థనల ద్వారా ఈ జీవాత్మలు, పరమాత్మతో ఐక్యం కాగలవు. గ్యాసు సరఫరా గొట్టం ప్రతి ఇంట్లోనూ అమర్చబడి ఉంటుంది. గ్యాసు కంపెనీ నుండి గ్యాసు పొందవచ్చు. కంపెనీవారికి గ్యాసు నిమిత్తం అర్జీ పెట్టుకుంటే, వారు మీకు గ్యాసు సరఫరా చేస్తారు. తరువాత మీ గృహంలో దీపాలు వెలుగుతాయి. సియాల్దాలో గ్యాసు కంపెనీవారి ఆఫీసు ఉంది (అందరూ నవ్వారు).
“కొందరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఇదివరకే జాగృతమై ఉంటుంది; కాని వారిలో ప్రత్యేక గుర్తులుంటాయి. వారు భగవంతుని గురించి తప్ప ఏ ఇతర విషయాల గురించి వినటానికీ ఇష్టపడరు, మాట్లాడటానికీ ఇష్టపడరు. వీరు చాతక పక్షి వంటివారు. సప్తసముద్రాలు, గంగానది, యమునానది, సమీపంలోని ఇతర నదులు పొంగిపొరలుతున్నా వర్షధారకే ఈ చాతకపక్షి నోరు తెరచుకుంటుంది. గొంతు ఎండిపోతూన్నప్పటికీ అది ఏ నీటినీ త్రాగదు, వర్షధారను తప్ప.”
9.5 పంచమ పరిచ్ఛేదం రామ్‌లాల్ ప్రభృతుల పాటలు – శ్రీరామకృష్ణుల సమాధి
శ్రీరామకృష్ణులు కొన్ని పాటలు వినగోరారు. రామ్‌లాల్, ఆలయపు బ్రాహ్మణ ఉద్యోగి ఒకరు కలిసి పాడసాగారు:
(హే) భక్తిప్రియా! (హే) మాధవా!
హృదయంబను నా బృందావనిలో
విహరించుమురా విచ్చలవిడిగా
నీ ప్రియ రమణీ రాధారాణీ
నీకై నే పడు భక్తియెగదా!……..
మళ్ళీ ఇలా పాడసాగారు:
మురళి కరమున మోమున నగవు
గలిగి అందమున వెలుగజేయు భువి
గ్రీష్మ వర్షభర నీల నీరదము
మాసి శూన్యమున సమసిపోవును
నీలకృష్ణుడు నిలచినప్పుడు॥ ము ॥
కాంచన చేలపు కాంతి మెరపులను
వెలవెలబార్చుచు వెక్కిరించును
బాల వక్షమున నోలలాడు వన
మాల పాదముల మరిమరి ముద్దిడు॥ ము ॥
నందకులాన్వయ చంద్రుడాత్మపతి
దివ్యచంద్రుల దీప్తి మించుచు
కిరణ శోభచే వరద యమునలో
కలుగజేసి అట నిలచె చూడుము॥ ము ॥
కన్నెల హృదయములన్ని దొంగిలి
ఇల్లు వాకిలి వెడలలాగి నా
మానస మందిరమందుజేరి నా
తను మన విజ్ఞాన ధనములను
మురళి రవళిచే దోచి నిలచెనట॥ ము ॥
ఎవరి ముందు తన విషాదగాథను
గంగానారాయణు డెరుక పరచును?
నీటికి సఖుడా! యమునా తటికి
ఏగియున్నచో యెరిగియుందువు॥ ము ॥
తిరిగి వారు ఇలా పాడసాగారు:
మాయమ్మ పదస్వర్గ మం దున్నతంబుగా
పయనించె నొక గాలి పడగలా నా మది
పాపంపు నుడిగాలి బలముగా వీచుచు
వడివడిగ భువి వైపు పడద్రోసె దానిని…………..
9.5.1 ‘అనురాగ అంజనం’ – ప్రేమ ‘పులి’
శ్రీరామకృష్ణులు: పులి, జంతువులను ఆవురావుమంటూ కబళించివేసే రీతిలో భగవత్ ప్రేమ అనే పులి కామక్రోధాదులనే శత్రువులను కబళించివేస్తుంది. ఒకసారి హృదయంలో భగవత్ ప్రేమ కలిగితే కామక్రోధాదులు అంతర్ధానమౌతాయి. కృష్ణుని పట్ల అంతటి అనురాగం ఉండబట్టే బృందావన గోపికలకు అటువంటి స్థితి కలిగింది; శ్రీకృష్ణుని పట్ల ప్రేమ జనించింది.
“మరో విషయం ఒకటి ఉంది – ‘అనురాగ అంజనం’ – అంటే ప్రేమ కాటుక. రాధ తన సఖీమణులతో ‘నేను సర్వత్రా కృష్ణుని చూస్తున్నాను’ అన్నది. అందుకు వారు ఇలా అన్నారు: ‘సఖీ! నువ్వు ‘ప్రేమ కాటుక’ ను కళ్ళకు రాసుకొన్నావు కదా! అందుచేతనే నువ్వు కృష్ణుణ్ణి సర్వత్రా చూడగలుగుతున్నావు.’
“కప్ప తలను తగులబెట్టగా వచ్చిన బూడిద నుండి తయారైన కాటుకను కళ్ళకు పెట్టుకొంటే కళ్ళ ముందు పాములే మెదలుతూ ఉంటాయని చెబుతారు.
“క్షణం కూడా భగవంతుని స్మరించని బద్ధజీవులు సర్వదా కామినీ కాంచనాలలోనే వాసం చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు వారి నుండి మహత్కార్యాలు ఎలా ఆశించగలం? వారు కాకులు కొట్టిన మామిడి పండు లాంటివారు. అటువంటి పండు దేవుని నైవేద్యానికి పనికిరాదు; తినటానికి కూడా సంకోచిస్తారు.
“బద్ధజీవులు, అంటే సంసారంలో బంధింపబడినవారు, పట్టుపురుగు లాంటివారు. ఈ పురుగు తాను కట్టుకున్న గూటిని తెగతెంచుకొని బయటకు రాగలదు; కాని తాను స్వయంగా కట్టుకున్న గూటిపట్ల అమిత అపేక్ష కారణంగా ఈ పురుగు గూటిని వదలి రాదు. చివరకు అది అక్కడే మరణిస్తుంది.
“ముక్తజీవులు కామినీ కాంచనాలకు వశులు కారు. కొన్ని పట్టుపురుగులు తాము ఎంతో శ్రమపడి కట్టుకున్న గూళ్ళను తెంచుకొని బయట పడతాయి. కాని అవి కేవలం ఏ ఒకటో రెండో.
“మాయ, జీవులను మోహంలో పడవేస్తుంది. ఏదో ఒకరిద్దరికి మాత్రమే జ్ఞానోదయం కలుగుతుంది. వారు మాయ యొక్క ఇంద్రజాలంలో చిక్కుకోరు; కామినీ కాంచనాల ప్రలోభంలో పడరు. ప్రసూతి గదిలోని దుమ్ముధూళితో నింపిన కుండయొక్క మూతి పెంకును కాలికి కట్టుకున్న వారిని ఐంద్రజాలికుని ట్యాంట్యాం శబ్దాలు భ్రమింపచేయవు. ఐంద్రజాలకుని గారడీలు అన్నీ వారికి బాగా తెలుసు.
“సిద్ధులు రెండు కోవలకు చెందుతారు – సాధన సిద్ధులు, కృపాసిద్ధులు. ఆధ్యాత్మిక సాధనల ద్వారా సిద్ధులైనవారు సాధన సిద్ధులు. భగవంతుని కటాక్షంతో సిద్ధులైనవారు కృపాసిద్ధులు. కొంతమంది రైతులు ఎంతో శ్రమించి తమ పొలాలకు నీరు పారించుకుంటారు. అప్పుడు మాత్రమే వారు పంటలు పండించుకోగలుగుతారు. కాని కొందరికి నీటి పారుదల సమస్యే ఉండదు; వారి పొలాలు వర్షపు నీటితో సమృద్ధ మవుతాయి. వారికి నీరు పారించుకునే శ్రమే ఉండదు. మాయామోహపు పిడికిలి నుంచి తప్పించుకోవటానికై ఎంతో శ్రమకోర్చి ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. భగవత్కృపతో ముక్తజీవులైనవారు శ్రమించనక్కరలేదు. కాని ఆ కోవకు చెందినవారు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు.
“మరొక కోవకు చెందినవారు నిత్యసిద్ధులు. వీరు ప్రతి జన్మలోను జన్మతః జ్ఞానవంతులు. వీరు నిరోధించబడ్డ నీటి బుగ్గల లాంటివారు. తోటమాలి తోట పనులను చూసుకుంటూ యాదృచ్ఛికంగా బుగ్గకు అడ్డుపడ్డ నిరోధాన్ని తొలగించగానే నీరు అందుండి ఎగజిమ్ముకు వస్తుంది. భగవంతునికై నిత్యసిద్ధుల ప్రథమానురాగపు వ్యక్తీకరణలను గాంచి జనులు దిగ్భ్రమ చెందుతారు. ‘ఈ భక్తి, ప్రేమ, వైరాగ్యం – ఇవన్నీ ఇంతవరకు ఎక్కడ ఉండేవి?’ అంటారు వారు.”
సంభాషణ ఇప్పుడు బృందావన గోపికలలో వ్యక్తమైన భగవత్ప్రేమ వైపుకు మళ్లింది. రామ్‌లాల్ పాడసాగాడు:
సర్వము నీవే సర్వేశా
నా సర్వము నీవే సర్వేశా
నా ఉనికీ మనికీ నీలోనే
నా యనువారలు లేరెవరూ॥ స ॥
నా శాంతి సౌఖ్యములు నీవే
నా అండదండలు నీవే
కలిమీ బలిమీ నీవే
నా జ్ఞాన విజ్ఞానము నీవే॥ స ॥
నా హాయీ స్థాయీ నీవే
నా బంధుమిత్రులు నీవే
నా నాడూ రేపూ నీవే
నా స్వర్గము గమ్యము నీవే॥ స ॥
నా విధులూ నీవే శాస్త్రము నీవే
నా తోడూ నీవే నీడయు నీవే
నాదగు అవ్యయానందము నీవే॥ స ॥
నా మార్గము నీవే గమ్యము నీవే
నా కర్తవు భర్తవు దైవము నీవే॥ స ॥
శిక్షణ సేయు తండ్రివి నీవే
లాలన చేయు తల్లివి నీవే
ప్రపంచమను నీ సాగరమందున
నా నావను నడపెడు ప్రభుడవు నీవే॥ స ॥
శ్రీరామకృష్ణులు (భక్తులతో): ఆహా! ఎంత అందమైన పాట! – ‘సర్వము నీవే సర్వేశా’ – ఎంత అద్భుతమైన అర్థం. అక్రూరుడు వచ్చాక గోపికలు రాధతో, ‘రాధా, నీ సర్వస్వాన్ని అపహరింప ఇతడు వచ్చాడు’ అని తెలిపారు. ఆహా! ఎటువంటి ప్రేమ! భగవంతుడికై ఎంతటి వ్యాకులత!
పాట కొనసాగింది:
వదలండి వదలండి ఓ వెర్రులారా
రథ చక్రముల నేల లాగిపట్టెదరు?
చలియింప జేయునది చక్రంబులా – దాని॥ వ ॥
ఎవ్వాని తలపుచే యెల్ల భువనములు
కదలుచున్నవి వాని గతి తప్పకుండ
ఆ కృష్ణుడే వాని నడిపించువాడు॥ వ ॥
పాట వింటూ శ్రీరామకృష్ణులు ప్రగాఢ సమాధి స్థితిలోకి వెళ్లారు. భక్తులు రెప్పవాల్చకుండా ఆయనను చూస్తున్నారు. ఆయన దేహం నిశ్చలమైంది; తమ ఛాయాచిత్రంలోలాగా ముకుళించిన చేతులతో ఆయన కూర్చుండిపోయారు. ఆయన కనుకొలకుల నుండి ఆనందబాష్పాలు స్రవిస్తున్నాయి.
9.5.2 భగవంతునితో మాటలు – సర్వత్రా కృష్ణ దర్శనం
చాలాసేపయ్యాక ఆయన మనస్సు క్రిందికి, బాహ్యచైతన్యంలోకి దిగి వచ్చింది. ఏదో అస్పష్టంగా పలికారు – ఏ పరమాత్మను దర్శిస్తూ ఉన్నారో, ఆయనతో మాట్లాడుతున్నారా ఏమిటి? గదిలో కూర్చున్న భక్తులకు మధ్య మధ్యలో కొన్ని పదాలు మాత్రం వినవచ్చాయి. ఆయన ఇలా పలుకుతున్నారు: “నువ్వే నేను, నేనే నువ్వు – నువ్వు తిను – నువ్వు నేను తిను… ఏం గందరగోళం నువ్వు కల్పించావు.”
కొనసాగిస్తూ, శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ఇదేమిటి నాకు పచ్చ కామెర్లు సోకిందా? సర్వత్రా నేను నిన్నే చూస్తున్నాను. ఓ కృష్ణా! దీనబంధో! హే ప్రాణవల్లభా! ఓ గోవిందా!”
‘ప్రాణవల్లభా! గోవిందా’ అంటూ పలుకుతూ ఉండగానే శ్రీరామకృష్ణులు మళ్లీ సమాధిమగ్నులైనారు. గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. ఉత్కంఠ, తృప్తి నొందని భక్తుల నేత్రాలు మహాభావమయులైన శ్రీరామకృష్ణుల వైపే కేంద్రీకృతమైనాయి.
9.6 షష్ఠ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల భగవదావేశం – ఆయన భగవద్వాణి
9.6.1 అధర్ సేన్ ద్వితీయ దర్శనం – గృహస్థులకు ఉపదేశం
సమాధిమగ్నులైన శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చుని ఉన్నారు. చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు.
ఆ సమయంలో అధర్సేన్ కొందరు మిత్రులతో అక్కడకు వచ్చాడు. అతడు డిప్యూటీ మేజిస్ట్రేటు పదవిలో ఉన్నాడు. వయస్సు సుమారు ముప్ఫై ఏళ్ళు. శ్రీరామకృష్ణుల దర్శనంకోసం అతడు రావటం ఇది రెండవసారి. అధర్ సేన్‌తో అతడి మిత్రుడు శారదాచరణ్ కూడా వచ్చాడు. పెద్దకుమారుని మరణంతో శారదాచరణ్ తీవ్ర ఆవేదనను అనుభవిస్తున్నాడు. పాఠశాలల డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పదవీ విరమణ చేసిన శారదాచరణ్ గతంలో ధ్యాన ప్రార్థనలూ అనుష్ఠించాడు. కుమారుని మరణానంతరం ఏ విధంగానూ అతడికి మనోపశమనం కలుగలేదు. అందుచేతనే అధర్ అతడికి శ్రీరామకృష్ణులను గురించి తెలియజేసి ఆయన వద్దకు తోడ్కొని వచ్చాడు. అధర్సేన్కూ శ్రీరామకృష్ణులను దర్శించాలనే కోర్కె చాలారోజుల నుండి ఉంది.
సమాధిస్థితి నుండి దిగి వచ్చిన శ్రీరామకృష్ణులు భక్తుల దృష్టి తనవైపే కేంద్రీకృతమై ఉండటం గమనించారు. ఇంకా తనలో తానే మాట్లాడుకుంటున్నారు.
భగవంతుడే శ్రీరామకృష్ణుల ద్వారా మాట్లాడుతున్నాడా, ఉపదేశం ఇస్తున్నాడా?
తరువాత భక్తుల నుద్దేశించి శ్రీరామకృష్ణులు ఇలా పలికారు: “అరుదైన సందర్భాలలో మాత్రమే లౌకికులలో జ్ఞానం చూడగలం. అది దీపశిఖ వంటిది. కాదు, కాదు. అది గోడలోని బీటగుండా ప్రసరించే ఏకైక సూర్యకిరణం లాంటిది.
“లౌకికులు భగవన్నామ స్మరణ చేస్తారు; కాని దాన్లో అనురాగం లుప్తం. పిల్లలు దేవుని మీద ప్రమాణం చేస్తుంటారే – అటువంటిదే ఇది. ఇంట్లో అత్తలు, పిన్నమ్మలు కలహించుకునేటప్పుడు దేవుడి మీద ఒట్టు అంటూ ఉంటారు. వారినుంచి నేర్చినవే ఈ మాటలు.
“లౌకికులకు గట్టిపట్టుదల ఉండదు. జరిగితే జరగనీ, జరగకుంటె పోనివ్వు – ఇదే వారి వ్యవహారం. మంచినీరు అవసరమైనప్పుడు బావి త్రవ్వటం ప్రారంభిస్తారు. కాని త్రవ్వకంలో బండరాయి అడ్డుపడ్డప్పుడు అక్కడ త్రవ్వకం ఆపుచేసి, మరో చోట త్రవ్వటం మొదలుపెడతారు. బహుశా అక్కడ ఇసుక పొరపడితే, ఆ స్థలం కూడా వదలిపెట్టి ఇంకో చోటుకు వెళతారు. మొదలుపెట్టిన స్థలంలోనే గట్టిపట్టుదలతో త్రవ్వకం కొనసాగిస్తేనే కదా నీరు లభిస్తుంది.
“కర్మకు తగినట్టు ఫలితం ఉంటుంది. అందుకే ఈ గీతంలో ఇలా ఉంది:
ఎవరిని దూషింపగలను నే
నెవరిని తప్పెంచగలను
నేనె త్రవ్విన నూతి లోపల మునుగంగ……………..
“ ‘నేను’, ‘నాది’ అనుకోవటం అజ్ఞానం. వివేచనతో పరికించినప్పుడు, నువ్వు దేనినయితే ‘నేను’, ‘నేను’ అంటున్నావో, అది వాస్తవానికి ఆ ‘ఆత్మే’ అని గ్రహిస్తావు. వివేచన చేసి చూడు. ‘నువ్వు’ దేహమా లేక రక్తమాంసాలా లేక మరొకటా? చివరకు ఇవేవీ ‘నువ్వు’ కావని గ్రహిస్తావు. నీకు ఉపాధి అంటూ ఏమీ లేదు. అప్పుడు తెలుస్తుంది. – ‘నేను’ ఏమీ చెయ్యలేదు. మంచి లేదు, చెడూ లేదు; పాపం లేదు, పుణ్యమూ లేదు అని.
“అజ్ఞానంతో మనిషి ‘ఇది బంగారం, ఇది ఇత్తడి’ అంటాడు. కాని జ్ఞాని అయిన వ్యక్తి ‘ఇదంతా బంగారమే’ అంటాడు.
9.6.2 భగవద్దర్శన లక్షణాలు – శ్రీరామకృష్ణులు అవతారమా?
“భగవద్దర్శనానంతరం విచారణ సమసిపోతుంది. కాని ఆ తరువాత కూడా విచారణ కొనసాగించే వ్యక్తులు కొందరుంటారు. సభక్తికంగా భగవన్నామ గుణసంకీర్తన చేసేవారు మరి కొందరు.
“పిల్లవాడు ఎంతవరకు ఏడుస్తాడు? తల్లి రొమ్ములు అందించనంత వరకే. తల్లిపాలు త్రాగగానే ఏడుపు ఆగిపోతుంది. తరువాత పిల్లవాడు ఉల్లాసంగా ఉంటాడు. కేవలం ఆనందంగా ఉంటాడు. ఆనందంగా తల్లిపాలు త్రాగుతాడు. పాలు త్రాగేటప్పుడు కొన్ని సందర్భాలలో పిల్లవాడు ఆడటం, నవ్వటం కూడా చేస్తాడు.
“భగవంతుడు మాత్రమే సమస్తమూను. కాని మనిషిలో ఆయన అధికంగా ప్రకాశిస్తాడు. ఎక్కడ శుద్ధ సత్వగుణం ఉండి, నవ్వుతూ, విలపిస్తూ, నృత్యం చేస్తూ, పాడుతూ ఉండే బాలుడి స్వభావం ఉంటుందో అక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా భాసిస్తూ ఉంటాడు.”
శ్రీరామకృష్ణులు, అధర్సేన్ క్షేమసమాచారాలు విచారించారు. అధర్సేన్ తన మిత్రుని పుత్రశోకం గురించి ఆయనకు నివేదించాడు. అది విన్న శ్రీరామకృష్ణులు పాడసాగారు:
యుద్ధానికి యుద్ధానికి సిద్ధపడుము యుద్ధానికి
ముందు ముందు కురకవోయి లేచి ఉరుకు యుద్ధానికి॥ యు ॥
సిద్ధమయ్యె మృత్యువిదె, మ్యాహబద్ధమగుచు నెత్తి
చుట్టుముట్టి పోరుసలుప వచ్చె చూడు! మానవా!॥ యు ॥
మేనదాల్చు జ్ఞానతూణి ఎక్కువేగ భక్తిరథము
ప్రేమ నరము నాల్కవింటి గట్టిపట్టు పట్టివంచు
కాళి నామ వాడిశరము ఎక్కుపెట్టు సూటిగాను॥ యు ॥
కాలుదువ్వి పోరుతెచ్చు సులభ తంత్ర మిచట గలదు
వద్దు రథము వద్దు సారథి గంగగట్టు చేరి గట్టి
దెబ్బ కొట్టు శత్రువంత లీలగాను నేలగూలు॥ యు ॥
తరువాత ఆయన ఇలా పలికారు: “నువ్వేం చేయగలవు? మృత్యువును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. మృత్యుదేవత ఇంట్లో ప్రవేశించింది. భగవంతుని నామరూపాలనే అస్త్రాలతో అతడితో యుద్ధం సాగించు. భగవంతుడొక్కడే కర్త. నేను అంటాను: ‘అమ్మా! నువ్వు ఎలా చేయిస్తే అలా చేస్తాను. నువ్వు ఎలా పలికిస్తే అలా పలుకుతాను. నేను యంత్రాన్ని, నువ్వు యంత్రం నడిపేదానవు. నేను గృహాన్ని; నువ్వు గృహిణివి. నేను బండిని, నువ్వు బండిని నడిపే దానవు.’ నీ ముక్త్యారునామాను భగవంతుని కివ్వు. మంచి వ్యక్తిపై నీ భారం మోపినప్పుడు నీకు దుఃఖం వాటిల్లదు. ఆయన ఇచ్ఛే జరుగనివ్వు.
“అరే బాబూ! పుత్రుడు మరణిస్తే దుఃఖం కలుగదా ఏమిటి? ఎంతైనా ఆత్మజుడు* కదా! యుద్ధభూమిలో రావణుడు నిహతుడైనప్పుడు లక్ష్మణుడు అతడి వద్దకు పరుగెత్తాడు. రావణుడి దేహంలోని ప్రతి ఎముకలోను రంధ్రాలు ఉండటం లక్ష్మణుడు గమనించాడు.తరువాత లక్ష్మణుడు, తన అన్న రాముడితో ఇలా చెప్పాడు: ‘ఓ రామా! నీ అమ్ములకు జోహార్లు! రావణుడి దేహంలో నీ బాణాలు తొలిచి వేయని స్థలం అంటూ ఏదీ లేదు.’ అందుకు రాముడు ఇలా పలికాడు: ‘తమ్ముడూ! రావణుని ఎముకలలో పడ్డ రంధ్రాలు నా బాణ ప్రయోగం వలన ఏర్పడినవి కావు. పుత్రశోకం అతడి ఎముకలను తూట్లు తూట్లు చేసివేసింది సుమా! ఈ రంధ్రాలు రావణుడి పుత్రశోకానికి చిహ్నాలు. ఆ దుఃఖం అతడి ప్రతి ఎముకనూ తొలచివేసింది.’
“అయితే ఇవన్నీ అనిత్యమే. ఇల్లు, భార్య, పిల్లలు – ఇవన్నీ రెండు రోజులు మాత్రం ఉంటాయి. తాటి చెట్టే వాస్తవం. దాని నుండి రాలి పడిపోయే ఒకటి రెండు తాటికాయలకోసం విలపించటం ఎందుకు?
“భగవంతుడు మూడు రకాల కార్యాలలో నిమగ్నుడై ఉంటాడు. అవి: సృష్టి స్థితి లయాలు. మరణం అనివార్యం. ప్రళయ కాలంలో సృష్టి యావత్తూ నశిస్తుంది. ఏమీ మిగలదు. ఆ సమయంలో జగన్మాత సృష్టిబీజాలను సేకరించి దాచుతుంది, నూతన సృష్ట్యారంభంలో ఆ బీజాలను బయటకు తీస్తుంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే: పల్లెల్లో ముసలమ్మ వద్ద ఒక ముంత ఉంటుంది. దాన్లో గుమ్మడి విత్తనాలు, నీలిగింజలు తదితరమైనవి చిన్నచిన్న పొట్లాలలో దాచి ఉంచుతుంది. (అందరూ నవ్వారు).”
9.7 సప్తమ పరిచ్ఛేదం అధర్కు ఉపదేశం – కర్తవ్యాలను సత్వరం పూర్తి చేసుకోవాలి
శ్రీరామకృష్ణులు తమ గదికి ఉత్తరం వైపు ఉన్న వసారాలో అధర్సేన్తో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (అధర్తో): నువ్వు డిప్టీవి (డిప్యూటీ మేజిస్ట్రేటు). భగవత్కృపతో నీకు ఈ పదవి లభించింది. ఆయనను మరచిపోవద్దు; కాని మానవులంతా ఏదో ఒకనాడు ఒకే బాట మీదుగా నడచిపోవలసి ఉంది. మనం ఈ ప్రపంచంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండబోతాం.*
“సంసారం ఒక కర్మభూమి. కర్మలు చేయడానికి ఇక్కడకు వచ్చాం. గ్రామసీమలో కొందరికి ఇల్లు ఉంటుంది; కాని వారు కలకత్తాకు ఉద్యోగార్థం వస్తారు.
“కొంతపని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇదీ ఒక సాధనే. ఆ కర్తవ్యాలను సత్వరం పూర్తి చేసుకోవాలి. స్వర్ణకారుడు బంగారాన్ని కరిగించేటప్పుడు మూసను నిప్పులో పెట్టగానే, ఒక చేత్తో కొలిమితిత్తి కొడుతూంటాడు, రెండో చేత్తో విసనకర్రతో వీస్తూవుంటాడు, నోట్లో ఊదుడుగొట్టం ఉంచుకొని ఊపిరి తిప్పుకోకుండా గాలి ఊదుతాడు. ఇలా అన్ని పనులూ ఏకకాలంలో చేస్తేనే నిప్పురాజుకొని బంగారం కరుగుతుంది. తరువాత అతడు సేద తీర్చుకొని తన పరిచారకుణ్ణి ధూమపానంకోసం హుక్కా సిద్ధం చేయమంటాడు. ఇంతవరకు అతడి ముఖం ఎర్రబారి, చమటలు పట్టి ఉంటుంది; కాని ఇప్పుడు అతడు ధూమపానం చేయగలడు.
“గట్టి పట్టుదల ఉండాలి; అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక సాధనలు సాధ్యపడతాయి. దృఢ సంకల్పం చేసుకోవాలి.
“భగవన్నామ బీజాక్షరాలలో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి అవిద్యను నశింపచేస్తుంది. బీజం మృదువైనది, అంకురం లేతగా ఉంటుంది; అయినప్పటికీ అది కఠినమైన నేలను చీలుస్తుంది. నేల బీటలువారి అంకురానికి దారి ఇస్తుంది.
“కామినీ కాంచనాల నడుమ నివసిస్తే, అవి మనస్సును లాగివేస్తాయి కాబట్టి బహుజాగ్రత్త వహించాలి. కాని సన్న్యాసులు భయపడవలసిన పనిలేదు. యథార్థమైన సన్న్యాసి కామినీకాంచనాలకు దూరంగా జీవిస్తాడు. అప్పుడే అతడు సాధనానుష్ఠానాల ద్వారా మనస్సును భగవంతుడి వైపు ఏకాగ్రం చేయగలడు.
“తేనెటీగ పువ్వులపైన మాత్రమే వ్రాలి, మకరందాన్ని గ్రోలే రీతిలో సర్వదా తన మనస్సును భగవంతుడిపైనే లగ్నం చేస్తాడు యథార్థ సన్న్యాసి. కామినీ కాంచనాల నడుమ జీవించే సంసారులు కూడా భగవద్ధ్యాన పరాయణులై మనస్సును ఆయనపై నిలుపుకోవచ్చు; కాని అప్పుడప్పుడు వారి మనస్సు కామినీ కాంచనాలలో నెలకొంటుంది. వారు ఈగల వంటివారు; ఈగ తినుబండారంపై వ్రాలుతుంది, తరువాత పుండు మీద లేదా కుళ్లిన వస్తువుపైన వ్రాలుతుంది.
అధర్సేన్
“సర్వదా భగవంతుడి మీదనే మనస్సును నిలుపుకోవాలి. ప్రారంభంలో కాస్త పరిశ్రమ చేయవలసి ఉంటుంది; తదనంతరం నీ పెన్షన్‌ను అనుభవించవచ్చు.”
9.8 అష్టమ పరిచ్ఛేదం సురేంద్రుని ఇంట్లో అన్నపూర్ణ పూజ
ఆదివారం, ఏప్రెల్ 15, 1883
సురేంద్రుని ఇంటి చావడిలో శ్రీరామకృష్ణులు భక్తులతో కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణుల రాకతో ఆ స్థలం శోభాయమానంగా భాసిల్లింది. సమయం సాయంత్రం ఆరు గంటలు అయి ఉంటుంది.
చావడి నుండి తూర్పు వైపుగా వెళితే మెట్లు ఎక్కి పూజామందిరానికి వెళ్లవచ్చు. పూజామందిరంలో దేవి సుందర ప్రతిమ ప్రతిష్ఠితమై ఉంది. ఆమె పాదపద్మాలవద్ద మందార పువ్వులు, బిల్వదళాలు అర్పింపబడి ఉన్నాయి. కంఠసీమన పువ్వులమాల వ్రేలాడుతోంది. ఆ ప్రతిమ పూజామందిరాన్ని శోభాయమానం చేస్తోంది.
నాడు అన్నపూర్ణాదేవి పూజ. సురేంద్రుడు దేవీ పూజను జరిపిస్తున్నాడు. అందుకోసమే శ్రీరామకృష్ణులను ఆహ్వానించాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో వచ్చి ఉన్నారు. పూజామందిరంలోకి వెళ్ళి దేవిని దర్శించారు. దేవికి సాష్టాంగ నమస్కారం చేశాక ఆమెను తదేకంగా వీక్షిస్తూ, చేతివ్రేళ్ళను లెక్కిస్తూ జపం చేశారు. భక్తులూ దేవికి నమస్కరించి శ్రీరామకృష్ణుల సమీపంలో నిలబడ్డారు.
తరువాత శ్రీరామకృష్ణులు భక్తులతో చావడిలోకి వచ్చారు. అక్కడ ఒక జంపఖానా వేసి ఉన్నారు. దానిమీద కొన్ని దిండ్లను అమర్చారు. ఒక ప్రక్క మృదంగం, కంజీరా మొదలైన సంగీత వాయిద్యాలతో కొందరు వైష్ణవులు కూర్చుని ఉన్నారు. సంకీర్తన ప్రారంభం కానున్నది.
శ్రీరామకృష్ణులను పరివేష్టించి భక్తులు కూర్చున్నారు. సౌకర్యంగా ఒక దిండును ఆనుకొని కూర్చోమని శ్రీరామకృష్ణులను కోరారు. కాని ఆయన దిండును ఉపయోగించుకోక దాన్ని ప్రక్కకు త్రోసి, కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): దిండును ఆనుకొని కూర్చోవటమా! చూడండి, అహంకారాన్ని వదలించుకోవటం చాలా కష్టం. అహంకారం అంటూ ఏమీ లేదని నువ్వు విచారణ చేయవచ్చు; కాని అంతలోనే అది ఎక్కడనుంచో ఊడిపడుతుంది. మేక తలను ఖండించిన తరువాత కూడా దాని శరీరం కొన్ని క్షణాలు కొట్టుకుంటుంది. లేక బహుశా నువ్వు కలలో భయపడి ఉంటావు; నిద్రనుంచి మేల్కొని జాగ్రదవస్థకు వస్తావు. అయినప్పటికీ నీ గుండె తీవ్రంగా కంపించటం గమనించవచ్చు. అహంకారం అచ్చం అలాంటిదే. నువ్వు దాన్ని పారద్రోలవచ్చు. కాని అది ఎక్కడ నుంచో ప్రత్యక్షమౌతుంది. అప్పుడు నువ్వు విచారం వెలిబుచ్చుతూ ‘ఏమిటి! నాకు సరైన మర్యాద చూపలేదు!’ అంటావు.
కేదార్: తృణాదపి సునీచేన, తరోరివ సహిష్ణునా! (గడ్డిపోచ కంటే అణకువనూ, చెట్టులా ఓర్పును కలిగి ఉండాలి!)
శ్రీరామకృష్ణులు: భక్తుల పాదరేణువుల్లో ఒక రేణువుగా నన్ను నేను పరిగణించుకుంటాను.
ఇంతలో వైద్యనాథ్ వచ్చాడు. ఇతడు మంచి విద్యావంతుడు, కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాది. రెండు చేతులు జోడించి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి, ఒక ప్రక్కగా కూర్చున్నాడు.
సురేంద్ర (శ్రీరామకృష్ణులతో): ఈయన మా బంధువు.
శ్రీరామకృష్ణులు: అలాగా! మంచి వ్యక్తిలా కనిపిస్తున్నాడు.
సురేంద్ర: మిమ్మల్ని ఏదో ఒకటి రెండు ప్రశ్నలు అడగాలని వచ్చారు.
శ్రీరామకృష్ణులు (వైద్యనాథ్‌తో): మీరు చూస్తూ ఉన్న సమస్తం భగవంతుడి శక్తి అభివ్యక్తీకరణే. ఈ శక్తి తోడులేనిదే ఎవరూ ఏమీ చేయలేరు. కాని అందరిలోను ఆయన శక్తి అభివ్యక్తీకరణ సమానంగా ఉండదని గుర్తుంచుకోవాలి. విద్యాసాగర్ ఒకసారి ‘భగవంతుడు కొందరికి ఇతరుల కంటే అధిక శక్తిని ఒసగాడా?’ అని నన్ను ప్రశ్నించారు. అందుకు నేనిలా అన్నాను: ‘ఆయన శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యాలు లేకుంటే శ్రమపడి మేమంతా మిమ్మల్ని చూడ్డానికి ఎందుకు వస్తాం? మీకేమన్నా రెండు కొమ్ములు మొలిచాయా?’ కాబట్టి భగవంతుడు విభుని రూపంలో సకల భూతకోటిలోనూ నెలకొని ఉన్నాడన్నది నిశ్చితమే; అయితే ఆయన శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యాలు ఉన్నాయి.
9.8.1 స్వతంత్రేచ్ఛ – భగవదేచ్ఛ
వైద్యనాథ్: అయ్యా, నాకొక సందేహం ఉంది. ‘ free will’ అంటే ‘స్వతంత్రేచ్ఛ’ గురించి జనం మాట్లాడతారు గదా! ఒక వ్యక్తి తన ఇచ్ఛ మేరకు మంచి లేక చెడు చేయగలడని వారంటారు. అది నిజమా? నిజానికి మనం ఏది చేయటానికైనా స్వతంత్రులమా?
శ్రీరామకృష్ణులు: సమస్తం ఆయన ఇచ్ఛ మీదనే ఆధారపడి ఉంది. అంతా ఆయన లీలయే. ఆయన ఈ అన్ని విభిన్న వస్తువులను – చిన్న, పెద్ద – బలవంతులను, దుర్బలులను – మంచి, చెడ్డ – నీతిమంతులను, అవినీతిపరులను – సృష్టించాడు. ఇదంతా ఆయన మాయ, ఆయన ఆడుతున్న ఆట. తోటలోని చెట్లన్నీ ఒకే రకంగా ఉండవు కదా!
“భగవత్ ప్రాప్తి కానంత వరకు మనిషి తాను స్వతంత్రుడనని భావిస్తాడు. భగవంతుడే స్వయంగా ఈ భ్రమను మనిషిలో కల్పిస్తాడు. లేకుంటే పాపం పెరిగిపోతుంది. మనిషికి పాపభీతి ఉండదు. పాపానికి శిక్ష కూడా ఉండదు.
“కాని భగవత్సాక్షాత్కారం పొందిన వ్యక్తి మనోస్థితి ఎటువంటిదో నీకు తెలుసా? అతడు ఇలా భావిస్తాడు; ‘నేను యంత్రాన్ని, ఓ దేవా, నువ్వు నడిపే వాడవు. నేను గృహాన్ని, నువ్వు దాన్లో వసించేవాడవు. నేను రథాన్ని, నువ్వు సారథివి. నువ్వు ఎలా కదిలిస్తే అలా కదలుతాను, నువ్వు ఎలా పలికిస్తే అలా పలుకుతాను.’
9.8.2 భగవద్దర్శనం ఒక్క రోజులో అవుతుందా? – సాధుసాంగత్య ప్రయోజనం
(వైద్యనాథ్‌తో) “తర్కించటం మంచిది కాదు. మీరేమంటారు?
వైద్యనాథ్: అవునండి. జ్ఞానం కలిగితే ఆ వ్యక్తిలోని తర్కించే స్వభావం సమసిపోతుంది.
శ్రీరామకృష్ణులు: థ్యాంక్యూ. (అందరూ నవ్వారు) నువ్వు ఆధ్యాత్మిక ప్రగతిని గాంచుతావు. భగవద్విషయాల గురించి మాట్లాడే వ్యక్తి పట్ల జనానికి విశ్వాసం ఉండదు. ఒక మహాత్ముడు తాను భగవద్దర్శనం పొందానని ధ్రువీకరించినా, సగటు మనిషి ఆయన మాటలు నమ్మడు. అతడిలా అనుకుంటాడు: నిజంగానే ఈయన భగవంతుని దర్శించివుంటే, నాకూ భగవద్దర్శనం చేయించమను, చూద్దాం.’ కాని ఒక వ్యక్తి నాడిని పరీక్షించడం ఎలాగో తెలుసుకోవటం ఒక రోజులో జరిగే పనా? వైద్యుడితోపాటు రోజుల తరబడి తిరగాలి; అప్పుడు మాత్రమే అతడు ఏది కఫనాడి, ఏది పిత్తనాడి, ఏది వాతనాడి అని గుర్తించగలుగుతాడు. నాడీ పరీక్షలో నిష్ణాతుడైన వ్యక్తి సాహచర్యం అతడు చేయాలి. (అందరూ నవ్వారు)
“ఒక ప్రత్యేక సంఖ్య నూలును ఎవరు పడితేవారు గుర్తించగలరా? నువ్వు కనుక ఆ వ్యాపారం చేస్తూ ఉంటే ఒక్క క్షణంలో నలభై సంఖ్య నూలును నలభై ఒకటవ సంఖ్య నూలునుంచి కూడా ఠక్కున గుర్తించగలుగుతావు.”
9.9 నవమ పరిచ్ఛేదం భక్తులతో భజనానందంలో – సమాధిలో
సంకీర్తన ప్రారంభించబోతున్నారు. కొందరు వైష్ణవులు మృదంగ తాళాలతో ఒక ప్రక్కన కూర్చుని ఉన్నారు. ఒక మృదంగ వాయిద్యగాడు పాటకు ఆలాపనగా మృదంగం వాయించసాగాడు. సుమధుర మృదంగ వాయిద్య ఘోషతో ప్రాంగణం యావత్తు నిండిపోయి, మనస్సుకు గౌరాంగుల పారవశ్య కీర్తనను జ్ఞప్తికి తెస్తోంది. శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిని పొందారు. మధ్యమధ్యలో ఆయన మృదంగ వాయిద్యగాణ్ణి చూస్తూ “ఆహా! ఆహా! నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి” అన్నారు.
“ఏ పాట పాడమంటారు” అని గాయకులు శ్రీరామకృష్ణులను అడిగారు. వినమ్రంగా శ్రీరామకృష్ణులు “దయచేసి గౌరాంగ మహాప్రభువు గురించి గానం చేయండి” అన్నారు.
సంకీర్తన మొదలయింది. గాయకులు శ్రీ గౌరాంగుల అలౌకిక సౌందర్యాన్ని వర్ణిస్తూ పాడసాగారు.
మేలు బంగరు కాంతి మించు – కాంతితో వెల్గు
గౌరాంగు ముఖ సోయగపు శోభతో వెలుగు॥ మే ॥
గౌరాంగు దరహాస మీ లోకమంతటి
వెల్గించు నాహ్లాద సందోహములు జిమ్ము॥ మే ॥
శుభ్రమగు శరదాభ్రమున వెలుగు శతకోటి
లక్ష చంద్రులు జూచి లక్ష్యపెట్టున దెవరు?॥ మే ॥
ప్రధాన గాయకుడు మధ్య మధ్యలో కొన్ని చరణాలను జోడిస్తూ పాడసాగాడు: “ఓ నేస్తమా! ఆయన ముఖారవిందం పున్నమి చంద్రుడిలా ప్రకాశిస్తోంది.” “కాని అది క్షయించదు మరక పడదు.” “అది భక్తుల హృదయాలను ప్రకాశింప చేయును.” మళ్ళీ ఇలా పాడాడు: “అతడి ముఖారవిందం లక్షలాది చంద్రుల కాంతిలో స్నానం చేసింది.”
ఈ పదాలు వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు గాఢ సమాధిమగ్నులైనారు. సంకీర్తన కొనసాగుతోంది. ఒకింత సేపట్లో ఆయన బాహ్యచైతన్యంలోకి వచ్చారు. తరువాత ఆయన హఠాత్తుగా నిలబడి, భావోన్మత్తులై, తనను శ్రీకృష్ణరూప సౌందర్యంలో పిచ్చిదైన బృందావన గోపికగా భావించి గాయకులతో కలిసి పాడసాగారు: “ఎవరి తప్పిదమిది – నా మనస్సుదా లేక అతడి సౌందర్యానిదా?”
“ముల్లోకాలలో నా ప్రియతమ కృష్ణుని తప్ప మరేదీ గాంచకున్నాను.”
శ్రీరామకృష్ణులు నృత్యం చేస్తూ పాడారు. ఈ దృశ్యం చూస్తూ అందరూ అవాక్కయిపోయారు. ప్రధాన గాయకుడు ఒక గోపిక పలుకులను గానం చేశాడు: “ఓ వేణుమా, అర్థిస్తున్నాను ఆపమని. నువ్వు నిద్రకు ఉపక్రమించవా?” గాయకులలో ఒకరు ఒక క్రొత్త పంక్తిని చేర్చాడు: “అది ఎలా నిదురిస్తుంది? అది కృష్ణుని పెదవులపై విశ్రమించినది కదా!”
శ్రీరామకృష్ణులు కూర్చున్నారు. సంకీర్తన సాగుతోంది. రాధా భావనను ఆరోపించుకుని వారు పాడుతున్నారు: “నా కన్నులు గ్రుడ్డివైనాయి. నా చెవులు చెవిటివైనాయి. ఆఘ్రాణశక్తి నాలో నశించింది. నా సకల ఇంద్రియాలు చచ్చువడ్డాయి. కాని, అయ్యో, నేనెందుకు ఒంటరినైతిని?”
చివరకు గాయకులు రాధాకృష్ణులు సంగమం గురించి పాడారు.
కృష్ణుని కంఠంలో అలంకరింప రాధ మాల కడుతోంది. అప్పుడు ఆమె ఎదుట కృష్ణుడు వస్తున్నాడు.
బృందావనిలో రాధాకృష్ణులు
నిధు నికుంజమున కలసిపోయిరి
మేరలేనిది వారి యందము
పార మెరుగనిది వారల ప్రేమ॥ బృం ॥
పసుపు మిసిమితో మిసమిసలాడెడు
మేలి బంగరు మేను యీ యెడ
ఇంద్రనీల నిభలీను శోభతో
కాంతి చిమ్మెడు తనువు ఆ యెడ॥ బృం ॥
మెడకు చుట్టును ఒక్క ప్రక్కన
అడవి పూవుల మాల ఊగును
రెండవ ప్రక్కన జాతిరత్నముల
కంఠహారము కదలుచుండును॥ బృం ॥
బంగారు వలయం ఒక చెవిన కదలగా
శంఖాల చక్ర మొక చెవిన ఊగును॥ బృం ॥
సగము నొసలుపై చల్లచల్లని
ఉదయచంద్ర నిభ మెరయుచుండగా
సగము నొసలుపై మండుచుండెడు
చండభాను భవి తేజరిల్లును॥ బృం ॥
సగము శిరముపై బర్హిబర్హము
ఠీవితోడ నడయాడుచుండగా
సగము శిరముపై అందమైన కురు
లల్లియున్న జడ వ్రేలియాడుచు॥ బృం ॥
సంకీర్తన పూర్తి కాబోతూండగా శ్రీరామకృష్ణులు “భాగవతం – భక్తుడు – భగవంతుడు” అంటూ చుట్టూ కూర్చున్న భక్తులకు వంగి ప్రణామాలు చేశారు.
9.10 దశమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – సాకార నిరాకారాలు
అప్పుడు రాత్రి దాదాపు తొమ్మిదిన్నర అయి ఉంటుంది. అన్నపూర్ణాదేవి శోభాయమానంగా ప్రకాశిస్తోంది. దేవి ముందు శ్రీరామకృష్ణులు భక్తులతో నిలబడి ఉన్నారు. సురేంద్ర, రాఖాల్, కేదార్, ‘మ’, రామ్, మనోమోహన్ తదితర భక్తులు అక్కడ ఉన్నారు. అందరూ శ్రీరామకృష్ణులతో కలసి ప్రసాదం స్వీకరించారు. అందరూ తృప్తిచెందేట్లు సురేంద్రుడు విందు చేశాడు.
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యారు. భక్తులూ తమ ఇళ్ళకు బయలుదేర సిద్ధమయ్యారు. అందరూ పూజామందిరంలోకి వెళ్లారు.
సురేంద్రుడు (శ్రీరామకృష్ణులతో): నేడు ఎవరూ జగన్మాతను గురించి గానం చేయలేదు.
శ్రీరామకృష్ణులు (శ్రీ అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని చూపుతూ): ఆహా! పూజామందిర సోయగం చూడు. జగన్మాత దివ్యప్రకాశం ఈ ప్రాంతాన్ని యావత్తు కాంతివంతం చేస్తూ ఉన్నట్లుంది. ఇటువంటి దృశ్యం హృదయాలను ఆనందాబ్ధిలో ముంచివేస్తుంది. దుఃఖం, సుఖాలపట్ల వాంఛ అదృశ్యమౌతుంది.
“కాని నిరాకారవాదులకు భగవద్దర్శనం కాదంటావా? తప్పక దర్శన మవుతుంది. కాని జాడమాత్రంగానైనా విషయబుద్ధి ఉంటే అది సాధ్యపడదు. పూర్వకాలంలో ఋషులు సర్వసంగ పరిత్యాగం చేసి అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ ధ్యానంలో నెలకొని ఉండేవారు.
“ఆధునిక బ్రహ్మజ్ఞానులు (అంటే బ్రహ్మసమాజ సభ్యులు) భగవంతుని ‘అచల ఘనుని’ గా గానం చేస్తారు. అది నాకు ఎంతో నీరసంగా అనిపిస్తుంది. భగవదానందంలోని మాధుర్యాన్ని గాయకులు చవిచూడనట్లుగా తోచుతోంది. బెల్లపు పానకంతో తృప్తి చెందే వ్యక్తి అలుపును తీర్చే కలకండ పానకం ఇష్టపడడు.
“ఈ దేవీ ప్రతిమను తిలకిస్తూ మీరెంత ఆనందిస్తున్నారో కాస్త చూసుకోండి. కాని నిరాకారవాదులకు ఏదీ దక్కదు. వారు బాహ్యంలోను, అంతరంలోను దేనినీ అనుభూతం చేసుకోలేరు.”
శ్రీరామకృష్ణులు జగజ్జననిపై పాడసాగారు:
ఆనందమయి మాతా వెనుకాడకే నీ
నిర్భాగ్య శిశువు నాకు ఆనందమీయగ॥ ఆ ॥
(నీ) పదములు తప్ప మది అన్యమెరుగదు
వెనుకాడకే! ఆనందమయి మాత! వెనుకాడకే॥ ఆ ॥
భయముగా మృత్యువు పండ్లు కొరుకుచునుండ
బదులు నేనేమని పలుకవలె చెప్పవే॥ ఆ ॥
నా పడవ నీదు నామమును నాల్క ధరియించి
భవ మీదవలెనని యెద కోరుచున్నది॥ ఆ ॥
నన్నిచట ఈ జలధి నట్టనడుమన ద్రోసి
కలనైన ముంతువని తలచియుండగ లేదు॥ ఆ ॥
తరియింపజేయు నీ నామంబు తలచుచు
ఈ అలల రేబవలు ఈదులాడుచునుంటి॥ ఆ ॥
దుఃఖాంత మెరుగును దుర్గార్తి నాశి
నన్నిట్లు ముంచిన నిన్నెవరు తలచరు॥ ఆ ॥
నీ నామ భజనంబు నిక నెవరు చేయరు
ఓ దుర్గార్తి నాశీ! వెనుకాడకే! మాతా! వెనుకాడకే॥ ఆ ॥
స్మరణ సేయవే మనసా!
భజన సేయవే మనసా!
దుర్గామాయీ పావన నామము॥ స్మ ॥
వందన మమ్మా ఓ నారాయణి
ఓ గౌరీ నా వందన మిదుగో
నీవే పగలు, నీవే రాత్రి
సంధ్యారాగము సైతము నీవే॥ స్మ ॥
శ్రీరాముడవై ధను వెక్కిడితివి
శ్రీకృష్ణుడవై మురళి పాడితివి
భద్రకాళిగా నీ పతి శివుని
నిశ్చేష్టితుగా నొనరించితివి॥ స్మ ॥
దశ విధ మహావిద్యలు నీవే
పది యవతారంబులు నీవే
నన్ను గాచుట తప్పదు నీకు
ఓ దుర్గా నా వందన మమ్మా॥ స్మ ॥
పుష్పదామముల బిల్వపత్రముల
పూజచేసి నీ అనుగ్రహమునకు
పాత్రమైన యా యశోద కరముల
కృష్ణకిశోరుని కనికరించితివి॥ స్మ ॥
కాననముననో ఉపవనముననో
నెచ్చట యుండుట సంభవించినా
పగలు రాత్రి నీ పాదపద్మముల
మరువక నా మది మనియెడు గావుత॥ స్మ ॥
సహజ మృత్యువో అకాల మరణమొ
ఏ విధి నా కది సంభవించినా
దుర్గానామము వీడకుండగా
రసనము భజనము చేయుగావుత॥ స్మ ॥
తరిమి వేయగా తలచెదవేమో! నే
నెచ్చటి కేగగ గలనే తల్లీ? నీ
మధుర నామము వినబడు నెచ్చట
అదియును నీవే చెప్పవే మాతా॥ స్మ ॥
‘పోరా పొ’ మ్మని పల్కెదవేమో
వదలను నీ పదయుగళము వదలను
గలగల మను నీ గాజుల వలెనే
సవ్వడి చేయుచు వ్రేలాడుదునే॥ స్మ ॥
నీ పతి ప్రక్కన సుఖాసీనమున
ఆనందముగా కూరుచుండగా
‘జయ మహాదేవా’ యని నీ పదముల
ప్రక్కనుండియే చేయుదు భజనము॥ స్మ ॥
గరుడపక్షిగా గగనంబున నీ
వెగురుచుండగా దుర్గామాయీ
అడుగున నీటిలో ఈదెద నే నొక
చేపపిల్లవలె అటునిటు తిరుగుచు॥ స్మ ॥
గ్రక్కున నాపై వ్రాలి గోళ్లతో
నన్ను చీల్చుచు తన్నుకు పోదువు
నీదు గోళ్లలో చిక్కి నా ప్రాణము
పోవుచుండగా నీ పదసన్నిధి
ఆశ్రయ మీయక నిరాకరింపకుము॥ స్మ ॥
దివి భువి పాతాళంబు లాదిగా
అన్నియు నీవై వెల్గుచుందువు
బ్రహ్మ, ద్వాదశ గోపాలురు, హరి
ఉద్భవ మందిరి నీ యందుననే॥ స్మ ॥
దుర్గా దుర్గా యని నీ నామము
భజన చేయుచు నడచెడు వారిని
మహామహేశుడు స్వయముగ తానే
రక్షణ సేయును శూలము త్రిప్పుచు॥ స్మ ॥
తరువాత శ్రీరామకృష్ణులు దేవి పాదాలను మ్రొక్కారు. వాకిట మెట్లు దిగుతూ “ఓ రా – చె – ఉ – పో” (ఓ రాఖాల్! చెప్పులు ఉన్నాయా, పోయినాయా?)” అన్నారు.
శ్రీరామకృష్ణులు బండి ఎక్కగానే సురేంద్ర, తక్కిన భక్తులు ఆయనకు ప్రణామాలు చేశారు. తరువాత బండి దక్షిణేశ్వరాభిముఖంగా బయలుదేరింది. వీథులను వెన్నెల వెలుగుతో నింపుతోంది.