8.స పర్యాగాచ్చుక్ర మకాయవ్రణమస్నావిరగ్ం శుద్ధమపాపవిద్ధం
కవిర్మనీషీ పరిభూః స్వయం భూ ర్యాథాతథ్యతోర్థాన్ వ్వదధాచ్చాశ్వతీభ్యః సమాభ్యః
అర్థం: అతడు (అంటే ఆత్మానుభూతి పొందినవాడు) అన్నిటి అంతరార్థాన్నీ గ్రహిస్తాడు.మనసును వశం చేసుకొన్నవాడు.మొత్తం జ్ఞానాన్నీ తనలో ఉంచుకొన్నవాడు.ఎవరికీ చెందనివాడు.అన్నివేళలా అన్ని వస్తువుల నిజమైన నైజాన్ని తెలుసుకొన్నవాడు.ఉజ్వలమైన శరీరం లేని, కండలు లేని, పాపం లేని పరిపూర్ణమైన, స్వచ్ఛమైన దేవుడిని అతడు చేరుకొంటాడు.
వివరణ: ఈ శ్లోకంలో ఆత్మానుభూతి పొందిన వాడి అనుభవం చెప్పబడింది. సాధారణ మానవులమైన మనం ఏదైనా వస్తువును చూడడంతో ఆగిపోతాం. కాని అతడు ఒక వస్తువును చూడడమే కాకుండా దానికి సంబంధించిన మొత్తం జ్ఞానాన్ని తెలుసుకోగలడు. అతడు మాత్రమే నిజమైన మనీషి. మనీషి అంటే మనసును వశం చేసుకొన్నవాడు అని అర్థం. మనసు చెప్పినట్లు అతడు ఆడడు, అతడు చెప్పినట్లు అతని మనసు ఆడుతుంది. మనం ఎంత నేర్చుకొన్నా ఇంకా నేర్చుకోవాలనే కోరికతో తృప్తిలేకుండా ఉంటాము. కాని ఆత్మానుభూతి పొందినవాడికి తెలుసుకోవలసింది ఏమీ లేకపోవడం వలన అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. అందుకే ఏది తెలుసుకొంటే ఇక తెలుసుకోవలసింది ఏమీ ఉండదో అదే ఆత్మ అని “కేనోపనిషత్తు”లో కూడా చెప్పబడింది. ఎవరికీ చెందనివాడంటే అతడు కేవలం ఆత్మ లేక భగవంతుడిపైనే ఆధారపడిఉంటాడు కాబట్టి మిగతా జీవరాసులపై కాదు. అతడు వస్తువుల నిజమైన తత్వాన్ని తెలుసుకొన్నవాడు కాబట్టి దేనికీ లొంగనివాడు. భగవంతుడు నిరాకారుడు కాబట్టి కేవలం అనుభూతి ద్వారా మాత్రమే అతనిని తెలుసుకోగలం కాబట్టి అతడు కండలు లేనివాడని, శరీరం లేనివాడని చెప్పబడింది. పాపంలేకపోవడం, తేజోమయం, స్వచ్ఛమైనది అనే గుణాలు భగవంతుడి గుణాలుగా చెప్పబడినవి.