అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ।
పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ ॥ 11
అవజానంతి, మామ్, మూఢాః, మానుషీమ్, తనుమ్, ఆశ్రితమ్,
పరమ్, భావమ్, అజానంతః, మమ, భూత మహా ఈశ్వరమ్.
భూత మహా ఈశ్వరమ్ = సర్వభూతే శ్వరుడనైన; మమ = నా; పరంభావమ్ = పరమతత్త్వాన్ని; అజానంతః = ఎరుగకుండా; మూఢాః = మూఢులు; మానుషీం తనుమ్ = మానవదేహాన్ని; ఆశ్రితమ్ = ధరించిన; మామ్ = నన్ను; అవజానంతి = అవజ్ఞను చూపుతున్నారు.
తా ॥ నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడనూ, సర్వాత్మ స్వరూపుడనూ, సర్వేశ్వరుడనూ; అయినప్పటికీ (భక్తానుగ్రహార్థం శుద్ధసత్త్వమయమైన) మనుష్య దేహాన్ని ధరిస్తున్నాను. నా పరమస్వరూపాన్ని ఎరుగని మూఢులు* నన్ను తిరస్కరిస్తున్నారు.
అందరూ అర్థం చేసుకోలేరు
కానీ శ్రీ శారదాదేవి దివ్యత్వాన్ని అందరూ అర్థం చేసుకోలేకపోయారు. మాతృదేవితోనే ఒకరు, “అమ్మా! మేము మిమ్మల్ని దేవిగా చూడలేకపోతున్నామే!” అని అన్నారు. అందుకు మాతృదేవి, “నాయనా! అందరూ దానిని గ్రహించగలరా? కొలను మెట్లమీద ఒక రత్నం పడివుంది. స్నానానికి వెళ్లే ప్రతి వ్యక్తి పాదమూ దానిమీద పడింది. అందరూ దానిని మామూలు రాయిగా భావించి పాదాలను తోము కోవడానికే వాడుకున్నారు. చివరకు ఒక రత్నాల వ్యాపారి వచ్చినప్పుడు ఆ రాయిని చూడగానే రత్నం అని తెలుసుకుంటాడు” అన్నారు. దాని నిజాన్ని తెలుసుకున్న వారికీ, తెలుసుకోనివారికీ కూడా అది ఉపయోగపడింది. ఉపయోగ పడిన తీరులోనే భేదమంతా! అదేలా ఎవరికి దివ్యనేత్రాలుంటాయో వారు మాత్రమే దివ్యత్వాన్ని చూడగలరు. కానీ మాతృదేవి తమ దివ్యత్వాన్ని గురించి తెలుసుకున్న వారికీ, తెలుసుకోనివారికీ సొంతంగానే ఉన్నారు. కానీ ఇరుతరఫుల వారు పొందిన ఫలితంలోనే భేదముంది. (Chandogya Upanishad 1.1.10) (Source: శ్రీ శారదాదేవి చరితామృతం)