Part One – On Siksha or Pronunciation
Chapter I: Invocation
Harih Om.
1. మిత్రుడు మనకు శుభాన్ని కలుగజేయుగాక. వరుణుడు మనకు శుభాన్ని ఇచ్చుగాక, అర్యముడు మనకు శుభాన్ని కలిగించుగాక. ఇంద్రుడూ బృహస్పతీ మనకు శుభాన్ని కలుగజేస్తారుగాక. సర్వత్రా నెలకొని ఉన్న విష్ణువు మనకు శుభాన్ని కలిగిస్తాడు గాక. బ్రహ్మమునకు నమస్కారము. వాయుదేవా, నీకు నమస్కరిస్తున్నాను. నువ్వే ప్రత్యక్ష దైవంగా ఉన్నావు. ప్రత్యక్ష దైవమని నిన్ను స్తుతిస్తున్నాను; ఋతమని స్తుతిస్తున్నాను; సత్యమని చెబుతున్నాను. ఆ పరబ్రహ్మం నన్ను రక్షించుగాక! ఆయన ఆచార్యుని రక్షించుగాక! నన్ను రక్షిస్తాడుగాక! ఆచార్యుని రక్షిస్తాడు గాక!
Om. Peace! Peace! Peace!
Chapter II: Lesson on Pronunciation
1. ఉచ్చారణ గురించి వివరిస్తున్నాం : ఓం, స్థాయి, హ్రస్వ – దీర్ఘాలు, ఉచ్చారణకైన చేసే ప్రయత్నం, సామము [modulation] ; స్పష్టంగా ఉచ్చరించడం అనేవి ఉచ్చారణ గురించిన పాఠాలు.
Chapter III: Meditation on the Combinations
1 మన ఇద్దరం అంటే [ఆచార్యుడు, విద్యార్థి] కీర్తి గాంచుదాం, మనం ఇద్దరం బ్రహ్మతేజస్సు పొందుదాం’ అని విద్యార్థులు అంటున్నారు. తరువాత అధ్యాపకుడు, ‘ఇప్పుడు మనం శిక్షణలను వివరించడానికి ప్రారంభిద్దాం’ అంటున్నాడు.
2 కలయికను [సంధిని] ప్రాతిపదికగా గైకొన్న శిక్షణ అయిదు విధాలుగా వివరింపబడుతున్నది. ప్రపంచం, తేజస్సు, విద్య, సంతతి, శరీరం – వీటిని ప్రగాఢంగా చింతన చేయడమే అయిదు ముఖ్యమైన శిక్షణలు.
3 ఇక ప్రపంచ భావనను చూద్దాం. దీన్లో భూమి దిగువ భాగం, ఆకాశం పైభాగం; రెండూ కలుసుకునే చోటు అంతరిక్షం (space) ; ఈ రెంటినీ చేర్చుతున్నది వాయువు. ఈ విధంగా ప్రపంచ భావనను చేయాలి.
4 ఇక తేజస్సు భావనను పరికిద్దాం. దీన్లో అగ్ని మొదటి రూపం, సూర్యుడు రెండవ రూపం. రెండూ కలుసుకోవడంతో నీరు ఉద్భవిస్తుంది. రెంటినీ సంధానపరిచేది మెరుపు. తేజస్సు భావన ఈ విధంగా చేయబడుతుంది.
5 ఇక, విద్య గురించిన భావనను పరికిద్దాం. దీన్లో ఆచార్యుడు మొదటి రూపం, విద్యార్థి రెండవ రూపం. ఈ ఇద్దరి కలయిక విద్యగా పరిణమిస్తుంది. వీరి కలయికకు బోధన కారణమై ఉంది. విద్యాభావన ఈ విధంగా చేయబడుతున్నది.
6 ఇక, ప్రాణుల (సంతానం) ఉత్పత్తి గురించి చూద్దాం. దీన్లో తల్లి మొదటి రూపం, తండ్రి రెండవ రూపం. ఇద్దరూ కలుసుకోవడం వలన ప్రాణం జనిస్తుంది; ఇద్దరినీ సంధానపరిచేది శారీరక సంబంధం. ప్రాణుల (సంతతి) ఉత్పత్తుల గురించిన భావన ఈ విధంగా చేయబడుతున్నది.
7 శరీరం గూర్చిన భావనను ఇక పరికిద్దాం. దీనిలో దిగువ దవడ మొదటి రూపం, పై దవడ రెండవ రూపం. రెండూ కలుసుకున్నప్పుడు వాక్కు పుడుతుంది. సంధానించే వస్తువుగా ఉన్నది నాలుక. శరీరం గురించిన భావన ఈ రకంగా చేయబడుతున్నది.
8 ఇక్కడ తెలియజేసిన ఈ ముఖ్యమైన కలయికల గురించి తెలుసుకున్న వాడు సంతతి, గోసంపద, బ్రహ్మవర్చస్సు, అన్నాదికాలు పొందుతాడు. స్వర్గాది లోకాలలో జీవించే అవకాశమూ అతడికి లభిస్తుంది.
4 ప్రార్థన
1 ఏ నాదం వేదాలలో అతిప్రధానమైనదో, సమస్తంగా ఉన్నదో, అమృతమయములైన వేదాల నుండి ఉద్భవించిందో ఆ ఓంకారం నాకు మేధస్సును ఇచ్చుగాక! ఓ దేవా, నేను బ్రహ్మజ్ఞానం సంతరించు కొందునుగాక! నా దేహం ఆరోగ్యమైనదిగా ఉండుగాక! నా నాలుక మధుర భాషణాలు ఒనరించుగాక. చెవులు విరివిగా మంచి మాటలు వినుగాక. ఓ ప్రణవమా! లౌకిక జ్ఞానంతో నువ్వు ఆచ్ఛాదింపబడి ఉన్నావు. భగవంతుని ఆవాసస్థానం నువ్వు. నేను నేర్చుకున్నవి మర్చిపోకుండా కాపాడుమా.
2 ఓ దేవా! వస్త్రాలు, గోవులు, అన్నపానీయాలు వంటివి సతతం నాకు లభించాలి; అలా లభిస్తూనే ఉండాలి. ఎన్నటికీ తరగని సంపద నాకు లభించాలి. వెంట్రుకలు గల జంతువులైన గొర్రెలు, మేకలు వంటివి నాకు లభించాలి.
3 ఓ దేవా! ఇంద్రియ నిగ్రహమూ, మనోనిగ్రహమూ, సత్ప్రవర్తనా గల విద్యార్థులు విరివిగా అన్ని దిశల నుండి నా వద్దకు వస్తారు గాక!
4 జనులలో నేను కీర్తి గాంచుతానుగాక! సంపన్నులలో నేను శ్రేష్ఠుడను అవుతాను గాక!
5 ఓ దేవా! నీలో నేను ఐక్యమౌతానుగాక. నాలో నువ్వు ఐక్యం అవుతావుగాక. వేయి శాఖలతో [ఎదుగుతున్న వృక్షంలా సర్వత్రా] వ్యాపిస్తున్న నీలో ఐక్యం కావడం మూలంగా నేను పునీతుడను అవుతాను గాక. దేవా! నీరు ఎలా దిగువకే ప్రవహిస్తుందో, నెలలు ఎలా సంవత్సరంగా పరిణమిస్తున్నవో అట్లే మంచి విద్యార్థులు మంచి చోట్ల నుండి నాకోసం వస్తారు గాక. నువ్వే నా అభయస్థానం. నాకు చైతన్య దీప్తిని ఒసగు. నన్ను స్వీకరించు.
5. చైతన్యదీప్తితన శిక్షణ: ప్రగాధ భావనలు
1. భూః, భువః, సువః అనేవి మూడు వ్యాహృతులు. నాల్గవదిగా ఒకటి ఉన్నట్లు మహాచమస్య ఋషి తెలుసుకున్నాడు. అది మహః. అదే భగవంతుడు, ఆయనే ఆత్మ. ఇతర దేవతలు ఆయనకు అంగాలుగా ఉన్నారు.
2 భూః అనేది భూమి. భువః అనేది అంతరిక్షం. సువః అనేది పరలోకం; మహః అనేది సూర్యుడు. సూర్యుని వలననే అన్ని లోకాలూ జీవిస్తున్నాయి.
3 భూః అనేది అగ్ని. భువః అనేది వాయువు. సువః అనేది సూర్యుడు. మహః అనేది చంద్రుడు. చంద్రుని వలననే సమస్త జీవరాసులు వృద్ధిగాంచుచున్నాయి.
4 భూః అనేది ఋగ్వేదం. భువః అనేది సామవేదం. సువః అనేది యజుర్వేదం. మహః అనేది ఓంకారం. ఓంకారం వలననే అన్ని వేదాలూ మహత్వాన్ని పొందుతున్నాయి.
5 భూః అనేది ప్రాణం. భువః అనేది అపానం. సువః అనేది వ్యానం. మహః అనేది ఆహారం. ఆహారం వలననే సమస్త ప్రాణాలు వర్ధిల్లుతున్నాయి.
6 ఇవే నాలుగు కలయికలు. నాలుగు వ్యాహృతులు నాలుగు రకాలుగా చింతన చేస్తున్నప్పుడు పదహారు రకాల ప్రగాఢ భావనలు అవుతున్నాయి. ఈ పదహారు రకాల భావనలను తెలుసుకున్న వాడు భగవంతుణ్ణి తెలుసుకున్న వాడవుతాడు. అతడికి దేవతలు కానుకలు అర్పిస్తారు.
6 ధ్యానం
1 హృదయంలో ఆకాశం ఒకటి ఉంది. దాన్లో ఆత్మ విరాజిల్లుతుంది. అది చైతన్యమయమైనది, అవినాశి, జ్యోతిర్మయమైనది.
2 తాలువులు అంతమయ్యే చోట స్తనాగ్రం వలె కొండనాలుక వ్రేలాడుతూ ఉంటుంది. అది భగవంతుని పొందడానికైన మార్గం. ఆ మార్గంలో వెళ్ళే నాడి ఒకటి కేశాల మొదళ్ళు విడివడి నిలబడేచోట శిరఃకపాలన్ని చొచ్చుకుని పోతుంది.
3 నాలుగు వ్యాహృతులను ధ్యానించడం వలన క్రమక్రమంగా అగ్ని, వాయువు, సూర్యుడు – వీటితో తాదాత్మ్యం పొందుతాడు; భగవంతునితో తదాత్మ్యం పొందుతాడు. అతడు తనంతట తానే అధిపతి అవుతాడు; మనస్సు, వాక్కు, కళ్ళు, తెలివి వీటికి అధిపతి అవుతాడు. ఆ తరువాత ఆకాశాన్ని శరీరంగాను, సత్యాన్ని ఆత్మగాను, ఆనందాన్ని మనస్సుగాను చేసుకుని ప్రాణంలో కార్యోన్ముఖత్వాన్ని కల్పించే, శాంతితో పరిపూర్ణమైన, అవినాశియైన బ్రహ్మంగా అవుతాడు. యోగ్యత గలవాడా! ఈ విధంగా ధ్యానం చేస్తావుగాక!
7 యాగం
1. భూమి, అంతరిక్షం, ఆకాశం, ప్రధాన దిశలు, ఉపదిశలు; అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీరు, ఓషధులు, చెట్లు, ఆకాశం, ప్రపంచం – ఈ మూడు విభాగాలు బాహ్య వస్తువుల గురించినవి.ఇక, అంతర వస్తువుల గురించిన అయిదు విభాగాలను చూద్దాం : ప్రాణం, వ్యానం, అపానం, ఉదానం, సమానం; కళ్ళు, చెవులు, మనస్సు, వాక్కు, స్పర్శేంద్రియం; చర్మం, మాంసం, నరం, ఎముక, మజ్జ.అంతర వస్తువులను బాహ్య వస్తువులను విచారణ చేసి తెలుసుకొన్న ఋషి ఒకరు ఈ విధంగా చెప్పాడు: “ఇవి అయిదు విభాగాలు. వీటిలో ఒకటి మరొక దాన్ని పరిపూర్ణం చేస్తుంది.”
8 ప్రణవ ధ్యానం
1. ఓంకారమే భగవంతుడు. ఈ సమస్తమైనదీ ఓంకారమే. సమ్మతిని సూచించడానికి ఓం అని అంటున్నారు. ‘విను’ అని చెబుతున్నప్పుడూ, ‘వింటున్నాను’ అని బదులు చెబుతున్నప్పుడూ ఓం అని అంటున్నారు. ఓం తోనే సామగానం పాడుతున్నారు. ‘ఓం శోం’ అని ప్రారంభించే ఋగ్వేద మంత్రాలు పారాయణ చేయబడుతున్నాయి. యాగ నేతృత్వం వహించే వాడు అడిగినప్పుడు యాగం చేసేవాడు ఓం అని స్పందన తెలుపుతున్నాడు. ప్రధాన పురోహితుడు ఓం అనే తన సమ్మతిని తెలుపుతున్నాడు. అగ్నిహోత్రం1 మొదలైన క్రియలకు ఓం అనే అనుమతి ఇవ్వబడుతోంది.
9 పన్నెండు ఆణిముత్యాలు
1. నేర్చుకోవడమూ నేర్పడమూ ముఖ్యమైన కర్తవ్యాలు. వాటితో ఋతం, సత్యం, తపస్సు, ఇంద్రియనిగ్రహం, ప్రశాంతత్వం అనే వాటిని పాటించాలి. యజ్ఞాలు అగ్నిహోత్రమూ నిర్వర్తించాలి. అతిథులను సమాదరించాలి. మానవాళికి మేలు కలిగించే పనులు చేయాలి. మంచి సంతానాన్ని పొందాలి. మంచి సంతానం, మనుమలు మనుమరాండ్రు అంటూ మంచి సంతతిని రూపొందించాలి.రాధీతర వంశజుడైన సత్యవచనుడనే ముని ‘సత్యమే ముఖ్యం’ అని వచించాడు. తపస్సులో నెలకొని ఉన్నవాడైన పౌరుశిష్టి మహర్షి ‘తపస్సే ముఖ్యం’ అని చెప్పాడు. ముద్గల ఋషి పుత్రుడైన నాకుడనే ముని ‘నేర్చుకోవడమూ నేర్పడమూ ముఖ్య’ మని పలికాడు; ఎందుకంటే అదే తపస్సు, అదే తపస్సు కనుక.
10 స్వయం సూచన
1. సంసారమనే వృక్షానికి బలం చేకూర్చే వాడిని నేను. పర్వతశిఖరం వలె నా కీర్తి ఘనత, పావనత వహించినది. సూర్యుని వలె నేను అమరుడిగా ఉంటున్నాను. ఆధ్యాత్మిక సంపత్తికి ఆలవాలం నేను. నేను దీప్తిమంతుడను; చైతన్యం జాగృతి చెందిన వాడిని; మరణరహితుడను; అవ్యయుడను – ఇది త్రిశంక ముని అనుభవపూర్వక వచనాలు.
11 కర్తవ్యాలు
1 వేదాలను నేర్పించిన తరువాత ఆచార్యుడు విద్యార్థులకు ఇలా ఉపదేశిస్తున్నాడు: సత్యాన్నే పలుకండి. ధర్మ మార్గంలో వెళ్ళండి. విద్యను చేజార్చుకోకండి. ఆచార్యునికి ఇష్టమైన గురుదక్షిణ సమర్పించి ఆయనకు సంతోషాన్ని కలిగించండి. సంతతి పరంపరను విచ్ఛిన్నం చేయకండి.
2 సత్యం నుండి వైదొలగకండి. ధర్మమార్గంనుండి వైదొలగకండి. మేలొనరించే వాటినుండి వైదొలగకండి. నేర్చుకోవడం నుండి నేర్పడం నుండి వైదొలగకండి. దేవతలకు పితరులకు చేయవలసిన కర్తవ్యాలనుండి వైదొలగకండి.
3 తల్లిని దైవంగా స్తుతించండి. తండ్రిని దైవంగా స్తుతించండి. ఆచార్యుని దైవంగా స్తుతించండి అతిథిని దైవంగా స్తుతించండి.
4 నింద్యరహితాలైన పనులనే మీరు చేయండి. తక్కిన వాటిని చేయకండి. సద్గుణాలను పెంపొందించే పనులనే మీరు చెయ్యాలి. తక్కిన వాటిని చెయ్యకూడదు.
5 మనకన్నా ఉన్నతులైన వారో, పునీతులైన వారో వచ్చినప్పుడు లేచి నిలబడి, వారు ఆసీనులవడానికి ఆసనం ఇచ్చి, వారి శ్రమను తొలగించి ఉపచర్యలు చేయాలి.
6 శ్రద్ధతో దానం ఇవ్వాలి. ఉదాసీన వైఖరితో దానం ఇవ్వకూడదు. శక్తి మేరకు దానం ఇవ్వాలి. వినమ్రతతోనూ, గౌరవపూర్వకంగానూ, సౌహార్దంతోనూ దానం ఇవ్వాలి.
7 మీ కర్తవ్యం ఏమిటి, ఫలానా పరిస్థితులలో ఎలా వ్యవహరించాలన్న విషయం గురించి మీకు సందేహం తలెత్తినప్పుడు మహాత్ములను అనుసరించాలి. ప్రగాఢ చింతనాశీలురు, మనో ఏకాగ్రత సంతరించుకున్న వారు, సర్వస్వతంత్రులు, అక్రూరులు, సన్మార్గగాములు అయిన ఆ బ్రాహ్మణులు ఆ విషయాలలో ఎలా వ్యవహరిస్తున్నారో అలా మీరూ వ్యవహరించండి.
8 ఇదే ఆదేశం. ఇదే ఉపదేశం. ఇదే దేవరహస్యం. ఇదే దైవాజ్ఞ. ఈ విధంగా చెయ్యాలి. ఈ విధంగానే చేయబడాలి.
12 కృతజ్ఞత చూపండి
మిత్రుడు మనకు శుభాన్ని కలుగుజేయుగాక. వరుణుడు మనకు శుభాన్ని ఇచ్చుగాక, అర్యముడు మనకు శుభాన్ని కలిగించుగాక. ఇంద్రుడూ బృహస్పతీ మనకు శుభాన్ని కలుగజేస్తారుగాక. సర్వత్రా నెలకొని ఉన్న విష్ణువు మనకు శుభాన్ని కలగిస్తాడుగాక. బ్రహ్మమునకు నమస్కారం. వాయుదేవా, నీకు నమస్కరిస్తున్నాను. నువ్వే ప్రత్యక్ష దైవంగా ఉన్నావు. ప్రత్యక్ష దైవమని నిన్ను స్తుతించాను; ఋతమని స్తుతించాను; సత్యమని చెబుతున్నాను. ఆ పరబ్రహ్మం నన్ను రక్షించారు ! ఆయన ఆచార్యుని రక్షించారు! నన్ను రక్షించారు ! ఆచార్యుని రక్షించారు !
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
Part Two: On Brahmananda or the Bliss of Brahman
Chapter I: The Sheath of Food
1 గురుశిష్యులమైన మన ఇద్దరినీ భగవంతుడు రక్షించుగాక! ఇద్దరినీ పోషించుగాక! ఇద్దరమూ ఊర్జితశక్తితో పరిశ్రమిద్దాంగాక! మన స్వాధ్యాయం ఏకాగ్రమూ ఫలవంతమూ అగుగాక! ఎన్నడూ మనం పరస్పరం ద్వేషించకొనకుందాంగాక!
2 బ్రహ్మజ్ఞాని సర్వోత్కృష్ట స్థితిని (మోక్షం) పొందుతాడు. దానిని గురించి ఈ విధంగా చెప్పబడుతున్నది: “భగవంతుడు సత్యస్వరూపుడు; చైతన్య స్వరూపుడు; అనంతుడు. సమస్తానికీ అతీతుడైన ఆయన హృద్గుహలో కొలువై ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి, సర్వజ్ఞుడైన ఆ భగవంతుని పొందుతాడు. ఆ వ్యక్తి సకల కోరికలూ నెరవేరుతాయి.”
3 మనలో ఆత్మగా విరాజిల్లుతున్న ఆ భగవంతుని నుండి ఆకాశం ఉద్భవించింది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని ఉద్భవించాయి. అగ్ని నుండి నీరు, నీరు నుండి భూమి ఉద్భవించాయి. భూమి నుండి చెట్టుచేమలు, వీటి నుండి ఆహారం ఉద్భవించింది. ఆహారం నుండి మనిషి ఉద్భవించాడు.
Chapter II: The Sheath of the Vital Breath
1 మనిషి ఆహారం వలన ఏర్పడ్డ వాడు. ఇది అతడి తల. ఇది అతడి కుడి భాగం. ఇది ఎడమ భాగం. ఇది మధ్య భాగం. ఇది దేహాన్ని భరించే దిగువ భాగం. దీనిని గురించి క్రింది శ్లోకమూ ఉన్నది.
2 ఆహారం నుండే మనుష్యులు ఉద్భవించారు. భూమ్మీద ఎవరల్లా ఉన్నారో, ఏవేవి ఉన్నాయో అవి అన్నీ ఆహారం నుండే రూపొందాయి. సమస్తమూ ఆహారం వలననే జీవిస్తున్నాయి; చివరికి ఆహారంలోనే కలసిపోతున్నాయి. ఆహారమే ప్రాణుల ఆరంభం. అందుకే ఆహారం సమస్తానికీ మందు (ఔషధం) అని చెప్పబడుతున్నది. ఎవరు ఆహారాన్ని బ్రహ్మంగా ఉపాసిస్తున్నారో వారు తప్పక ఆహారాన్ని పొందుతున్నారు. ఆహారం నుండి ప్రాణులు ఉద్భవిస్తున్నాయి. ఉద్భవించినవి ఆహారం వలననే వృద్ధిపొందుతున్నాయి. ప్రారంభంలో ప్రాణులు ఆహారాన్ని తింటున్నాయి; చివరికి ఆహారమే ప్రాణులను భక్షిస్తుంది. కనుక ఆహారం ‘అన్నం’ అని పిలువబడుతున్నది.
3 ఆహారం చేత రూపొందిన బాహ్యదేహం కాక మరొక దేహం ఉంది. అది ఈ దేహం లోపల ఉంది; ప్రాణశక్తులచే రూపొందినది. స్థూల దేహం దీనిచే పరిపూర్ణమవుతుంది. ఇది బాహ్యదేహం వంటిది; దానిలాగానే రూపం గలది. ప్రాణం దాని తల, వ్యానం కుడి భాగం, అపానం ఎడమ భాగం. ఆకాశం దీని దేహంగా ఉన్నది. భూమి దీని దిగువభాగమైన ఆధారంగా ఉంది. దీనిని గురించి క్రింది శ్లోకమూ ఉంది.
4 ఇంద్రియాలు ప్రాణాన్ని అనుసరిస్తున్నాయి. మనుష్యులే కాక, జంతువుల విషయంలో కూడా అంతే. ప్రాణమే ప్రాణుల జీవనంగా ఉన్నది (అంటే ప్రాణుల ఆయువును నిర్ణయిస్తుంది). అందువలన అది సమస్తానికీ జీవనమని చెప్పబడుతున్నది. ఎవరు ప్రాణాన్ని దైవంగా ఉపాసిస్తారో వారు పరిపూర్ణ ఆయుర్దాయాన్ని పొంది జీవిస్తారు. అందువలన అది సమస్తానికీ జీవనమని చెప్పబడుతున్నది. మునుపు చెప్పబడిన స్థూల దేహానికి ఆధారంగా ఉన్నది ఈ ప్రాణ దేహమే.
Chapter III: The Sheath of the Mind
1 ప్రాణంచే రూపొందిన దేహం కాక మరొక దేహం ఉన్నది. అది ఈ దేహం లోపల ఉన్నది; మనస్సుచే రూపొందినది. ప్రాణ దేహం దీనిచే నింపబడి ఉంది. ఇది స్థూల–దేహం లాంటిది; దాని మాదిరే ఆకారం గలది. యజుర్వేదం దీని తల. ఋగ్వేదం కుడి ప్రక్క. సామవేదం ఎడమ ప్రక్క. భగవదాజ్ఞ దీని దేహంగా ఉన్నది. అధర్వణ వేదం దీని దిగువభాగమైన ఆధారంగా ఉంది. దీనిని గూర్చి క్రింది శ్లోకం ఉంది.
2 ఎవరిని పొందలేక మనస్సు వాక్కు మరలిపోతున్నవో ఆయనే భగవంతుడు. ఆయనను అనుభూతిలో గ్రహిస్తూ భగవదానందాన్ని చవిచూసే వాడు ఎన్నటికీ భయపడడు. మునుపు చెప్పబడిన ప్రాణ దేహానికి ఆధారంగా విరాజిల్లేది ఈ మనస్సే అవుతుంది.
Chapter IV: The Sheath of the Intellect
1 మనస్సుచే రూపొందిన దేహం కాక మరొక దేహ ఉన్నది. అది ఈ దేహం లోపల ఉంది; అది బుద్ధిచే రూపొందినది. మానసిక దేహం దీనిచే నింపబడి ఉంది. ఇది బాహ్య దేహం వంటిది; దాని మాదిరే రూపం గలది. శ్రద్ధ దీని తల. ఋతం కుడి భాగం. సత్యం ఎడమ భాగం. యాగం దీని దేహంగా ఉన్నది. మహత్ దీని దిగువ భాగమైన ఆధారంగా ఉంది. దీనిని గురించి క్రింది శ్లోకం ఉంది.
2 బుద్ధే యజ్ఞాలను చేస్తున్నది. కర్మలు చేయడానికీ ప్రాతిపదికగా ఉన్నది. సకల దేవతలు బుద్ధిని ఆది బ్రహ్మంగా స్తుతిస్తున్నారు. బుద్ధిని దైవంగా తెలుసుకుని, అందుకు తగిన కార్యకలాపాలలో పాల్గొంటే, జీవిస్తున్నప్పుడే పాపాలనుండి విముక్తి పొంది, సమస్త కోరికలు నెరవేరుతాయి. మునుపు చెప్పిన మానసిక దేహానికి ఆధారంగా ఈ బుద్ధి విరాజిల్లుతున్నది.
Chapter V: The Sheath of Bliss
1 బుద్ధిచే రూపొందిన దేహం కాక మరొక దేహం ఉంది. అది ఈ దేహం లోపల ఉంది; ఆనందంచే రూపొందినది. బుద్ధి–దేహం దీనిచే నింపబడి ఉంది. ఇది బాహ్య దేహాన్ని పోలినది; దానిలాగానే రూపం గలది. ప్రియం దీని తల. మోదం కుడి భాగం. ప్రమోదం దీని ఎడమ భాగం. ఆనందం దీని దేహంగా ఉన్నది. ఆత్మ దీని దిగువ భాగమైన ఆధారంగా ఉంది. దీనిని గురించి క్రింది శ్లోకం ఉంది.
Chapter VI: Brahman: The Source of All
1 ఆత్మ లేదు అని వాదించే వాడు ఏదీ లేనివాడిగా అయిపోతాడు. ఆత్మ ఉన్నది అని తెలుసుకున్న వాడు సమస్తం ఉన్న వాడుగా అయిపోతాడు. ఇటువంటి వాడు మహాత్ముడుగా పరిగణింపబడతాడు. ఆత్మ ఆ ఆనందమయమైన దేహంలో ఆధారంగా ఉన్నది. దీన్ని గురించి క్రింది శ్లోకమూ ఉంది.
2 ఇప్పుడు క్రింది ప్రశ్నలు తలెత్తుతున్నాయి : మరణించిన తరువాత పామరుడు భగవంతుని పొందుతాడా లేక ఆత్మను గ్రహించిన వాడు పొందుతాడా?
3 ‘నేను జన్మిస్తానుగాక! నేను అనేకం అవుతానుగాక!’ అని భగవంతుడు సంకల్పించాడు. అందుకోసం తపస్సు చేశాడు. తపస్సు చేసి ఈ సమస్తాన్నీ సృష్టించాడు. సృష్టించిన తరువాత సృష్టిలో ఆయనే సర్వాంతర్యామి అయ్యాడు. రూపంగలవి – రూపరహితమైనవి, దేశకాల విశిష్టంగా ఇది అని చెప్పబడినవి – తద్విపరీతమైనవి, ఆశ్రయంగలవి – ఆశ్రయ రహితమైనవి, జ్ఞానం – అజ్ఞానం, సత్యం – అసత్యం అంటూ సమస్తంగా ఆయనే అయ్యాడు. అందువలన ఆయన సమస్తానికీ ప్రాతిపదిక అని తెలుసుకోబడుతున్నాడు. దాన్ని గురించి ఈ శ్లోకం ఉంది.
Chapter VII: Brahman as Fearlessness
1 ప్రారంభంలో ఏదీ లేదు. ఆ తరువాత సృష్టి అభివ్యక్తమైనది. భగవంతుడు తనను తానే సృజించుకొన్నాడు. అందుకే ‘స్వయం కర్తృకమని’ ఆయన పేర్కొనబడుతున్నాడు.
2 ఏది ఉన్నదో అది తానుగానే ఉద్భవించింది. ఆ భగవంతుడు ఆనందమయుడు. ఆయన నుండి ఆనందాన్ని పొందినందువల్లనే మనిషి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. హృదయాకాశంలో ఆ ఆనందం లేకుంటే ఎవరు జీవించగలరు? ఆయనే ఆనందాన్ని ఇచ్చేవాడు.
3 భగవంతుడు కనిపించని వాడు; శరీర రహితుడు; అనిర్వచనీయుడు; ఆధార రహితుడు; భయం లేనివాడు. భగవంతునిలో నెలకొని ఉన్నప్పుడు మనిషి భయరహిత స్థితిని పొందుతాడు. ఆయన నుండి కించిత్తు వైదొలగినాకూడా అతడికి భయం కలుగుతుంది. చింతన చేయని విద్వాంసునికి భగవంతుడే భయ కారణమౌతాడు.
4 భగవంతుని గురించిన భయం చేతనే వాయువు వీస్తున్నది; సూర్యుడు ఉదయిస్తున్నాడు; అగ్ని మండుతున్నది; ఇంద్రుడు తన విధులను నిర్వర్తిస్తున్నాడు; ఐదవదైన మృత్యువు సంభవిస్తున్నది.
Chapter VIII: The Supreme Bliss of Brahman
1 ఆనందపు కొలమానాన్ని ఒకింత విచారణ చేద్దాం. మంచివాడు, యౌవనంలోనివాడు, వేదాధ్యయసంపన్నుడైన, శాసించే వ్యక్తిత్వం సంతరించుకున్న, దృఢసంకల్పుడైన, బలశాలి అయిన యువకుడు ఒకడు ఉన్నాడనుకొందాం. అతడికి సర్వ సంపదలతో గూడిన ఈ భూమి చెందినదని అనుకొందాం. ఆ యువకుడు పొందే ఆనందం ఒక మానుష ఆనందం. అటువంటి నూరు మానుష ఆనందాలు చేరితే అది ఒక మానుష–గంధర్వ ఆనందం అవుతుంది. కామనారహితుడైన బ్రహ్మవేత్త ఈ ఆనందాన్ని పొందుతాడు.
2 నూరు మానుష–గంధర్వ ఆనందాలు ఒక దేవ–గంధర్వ ఆనందం అవుతుంది. కామనారహితుడైన బ్రహ్మవేత్త ఈ ఆనందాన్ని చవిచూస్తాడు.
3 నూరు దేవ–గంధర్వ ఆనందాలు దీర్ఘాయుర్దాయులైన పితరుల ఒక–ఆనందానికి సమం. కామనారహితుడైన బ్రహ్మవేత్తకు ఈ ఆనందం ప్రాప్తిస్తుంది.
4 నూరు పితృ–ఆనందాలు దేవలోకంలో జన్మించిన దేవతలు అనుభవించే ఒక దేవ–ఆనందానికి సమం. కామనారహితుడైన బ్రహ్మవేత్త ఈ ఆనందాన్ని పొందుతాడు.
5 నూరు దేవ–ఆనందాలు ఒక కర్మదేవ–ఆనందానికి సమానం. కర్మల మూలంగా దేవతల స్థితిని పొందినవారు కర్మదేవతలు. కామనారహితుడైన బ్రహ్మవేత్త ఈ ఆనందాన్ని పొందుతాడు.
6 నూరు కర్మదేవ–ఆనందాలు ఒక ముఖ్యదేవ–ఆనందానికి సమం. కామనారహితుడైన బ్రహ్మవేత్త ఈ ఆనందాన్ని సంప్రాప్తించుకొంటాడు.
7 నూరు ముఖ్యదేవ–ఆనందాలు ఒక ఇంద్ర–ఆనందంతో సమానం. కామనారహితుడైన బ్రహ్మవేత్తకు ఈ ఆనందం లభిస్తుంది.
8 నూరు ఇంద్ర–ఆనందాలు ఒక బృహస్పతి ఆనందానికి సమానం. కామనారహితుడైన బ్రహ్మవేత్త ఈ ఆనందాన్ని పొందుతాడు.
9 నూరు బృహస్పతి–ఆనందాలు ఒక ప్రజాపతి ఆనందానికి సమం. కామనారహితుడైన బ్రహ్మవేత్త ఇటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు.
10 నూరు ప్రజాపతి–ఆనందాలు ఒక బ్రహ్మానందానికి సమం. కామనారహితుడైన బ్రహ్మవేత్త అటువంటి ఆనందాన్ని పొందుతాడు.
11 ఈ మనిషిలో ఉన్నవాడూ, ఆ సూర్యునిలో ఉన్న వాడూ ఒక్కరే. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు లౌకిక చైతన్యం నుండి విడివడుతున్నప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకు (దేహాలకి) అతీతంగా వెళతాడు. దానిని గురించి ఈ శ్లోకం ఉంది.
12 ఎవరిని పొందడం సాధ్యంగాక మనస్సు, వాక్కు మరలుతున్నాయో ఆయనే భగవంతుడు. ఆయనను అనుభూతిలో గ్రహించే భగవదానందాన్ని తెలుసుకున్నవాడు దేనికీ భయపడడు. ‘నేను ఎందుకు మేలు ఒనగూర్చలేదు? నేను ఎందుకు కీడు చేశాను?’ వంటి భావాలు అతణ్ణి తపింపజేయవు. ఇటువంటి భావాలు అతణ్ణి దృఢతరం చేస్తాయి. ఈ విధంగా తెలుసుకొన్న వ్యక్తి ఆత్మజ్ఞానం రూఢి అవుతుంది. ఈ విధంగా ఉపనిషత్తు సమాప్తమౌతోంది.
The Peace Chant
Om. May Brahman protect us both! May Brahman bestow upon us both the fruit of Knowledge! May we both obtain the energy to acquire Knowledge! May what we both study reveal the Truth! May we cherish no ill-feeling toward each other!
Om. Peace! Peace! Peace!
Part Three Regarding Varuna and Bhrigu
Chapter I: Definition of Brahman
Om. May Brahman protect us both! May Brahman bestow upon us both the fruit of Knowledge! May we both obtain the energy to acquire Knowledge! May what we both study reveal the Truth! May we cherish no ill-feeling toward each other!
Om. Peace! Peace! Peace!
Harih Om.
1 వరుణ మహర్షి కుమారుడు భృగు. అతడు తండ్రిని సమీపించి, “ఓ దైవసమానుడా, భగవంతుడు అనే ఆయన ఎవరన్న విషయం నాకు ఉపదేశించు” అని అడిగాడు. అందుకు ఆయన, “ఆహారం, ప్రాణం, కన్ను, చెవి, మనస్సు, వాక్కు – ఇవే భగవంతుడు” అని జవాబిచ్చాడు.
2 వరుణ మహర్షి ఉపదేశం కొనసాగింది: “ఎవరి నుండి ఈ జీవజాలం యావత్తు పుట్టుచున్నదో, పుట్టినవి ఎవరిచే జీవిస్తున్నవో, మరణానంతరం ఎవరిలో లయం చెందుతున్నవో ఆయనే భగవంతుడు. ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నించు.” ఈ ఉపదేశాన్ని వినగానే భృగు తపస్సు ప్రారంభించాడు. తపస్సు పూర్తయ్యాక…
Chapter II: The Body as Brahman
1. “ఆహారమే భగవంతుడు. ఎందుకంటే ఆహారం నుండే జీవజాలం ఉద్భవిస్తోంది; ఉద్భవించినవి ఆహారం వలననే జీవిస్తున్నాయి; మరణానంతరం ఆహారంలోనే లీనం అవుతున్నాయి” అని తెలుసుకున్నాడు భృగు. తరువాత తండ్రియైన వరుణ మహర్షిని సమీపించి, “ఓ దైవసమానుడా! భగవంతుడనే ఆయన ఎవరు అన్న విషయం నాకు ఉపదేశించండి” అని అడిగాడు. అందుకు ఆయన “తపస్సే భగవంతుడు. తపస్సుచే ఆయనను పొందుతావుగాక!” అని జవాబిచ్చాడు. ఈ ఉపదేశాన్ని వినగానే భృగు తపస్సు ప్రారంభించాడు. తపస్సు పూర్తయ్యాక…
Chapter III: The Prana as Brahman
1. “ప్రాణమే భగవంతుడు. ఎందుకంటే ప్రాణం నుండే జీవజాలం ఉద్భవిస్తున్నది; ఉద్భవించినవి ప్రాణం వలననే జీవిస్తున్నాయి; మరణానంతరం ప్రాణంలోనే లయిస్తున్నాయి” అని భృగు తెలుసుకున్నాడు. తండ్రియైన వరుణ మహర్షిని సమీపించి భృగు, “ఓ దైవసమానుడా, భగవంతుడనే ఆయన ఎవరు అన్న విషయం నాకు ఉపదేశించండి” అని ప్రశ్నించాడు. అందుకు ఆయన, “తపస్సే భగవంతుడు. తపస్సుచే ఆయనను పొందుతావుగాక!” అని జవాబిచ్చాడు. ఈ ఉపదేశాన్ని వినగానే భృగు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. తపస్సు పూర్తయ్యాక…
Chapter IV: The Mind as Brahman
1. ‘మనస్సే భగవంతుడు. ఎందుకంటే మనస్సు నుండే జీవజాలం ఉద్భవిస్తోంది; ఉద్భవించినవి మనస్సు వలననే జీవిస్తున్నవి; మరణానంతరం మనస్సులోనే లయం చెందుతున్నవి’ అని గ్రహించాడు భృగు. తరువాత తండ్రియైన వరుణ మహర్షిని అతడు సమీపించి, “ఓ దైవసమానుడా! భగవంతుడనే ఆయన ఎవరు అన్న విషయం నాకు ఉపదేశించండి” అని అడిగాడు. అందుకు ఆయన, “తపస్సే భగవంతుడు, తపస్సు మూలంగా ఆయనను పొందుతావుగాక!” అని జవాబిచ్చాడు. ఈ ఉపదేశాన్ని వినగానే భృగు మళ్ళీ తపస్సు కొనసాగించాడు. తపస్సు పూర్తి కాగానే…
Chapter V: The Intellect as Brahman
1. “బుద్ధే భగవంతుడు. ఎందుకంటే బుద్ధినుండే జీవజాలం ఉద్భవించాయి; ఉద్భవించినవి బుద్ధి వలననే జీవిస్తున్నాయి; మరణానంతరం బుద్ధిలోనే లయిస్తున్నాయి” అని తెలుసుకున్నాడు భృగు. తండ్రియైన వరుణ మహర్షిని సమీపించి భృగు, “ఓ దైవసమానుడా! భగవంతుడనే ఆయన ఎవరన్న విషయం నాకు ఉపదేశించండి” అని అడిగాడు. అందుకు ఆయన, “తపస్సే భగవంతుడు. తపస్సు చేత ఆయనను పొందుతావు గాక!” అని జవాబిచ్చాడు. ఈ ఉపదేశాన్ని వినగానే భృగు తపస్సు చేయనారంభించాడు. తపస్సు పూర్తి కాగానే…
Chapter VI: Bliss as Brahman
1. “ఆనందమే భగవంతుడు. ఎందుకంటే ఆనందంనుండే జీవజాలం ఉద్భవిస్తోంది; ఉద్భవించినవి ఆనందం వలననే జీవిస్తున్నాయి; మరణానంతరం ఆనందంలోనో లయిస్తున్నాయి” అని భృగు తెలుసుకున్నాడు.
2 ఇది భార్గవీ–వారుణీ విద్య. ఇది శ్రేష్ఠమైన హృదయాకాశంలో నెలకొని ఉన్నది. ఎవరు ఈ విధంగా తెలుసుకుంటాడో అతడు హృదయాకాశంలో ప్రకాశించే ఆత్మలో నెలకొని ఉంటాడు. అతడు ఆహార సమృద్ధిగలవాడు అవుతున్నాడు; భుజించి ఆనందిస్తూ ఉంటాడు. సంతాన భాగ్యం, గోసంపత్తి గలవాడు అవుతాడు. బ్రహ్మతేజస్సు, కీర్తి గలవాడు అవుతాడు.
Chapter VII: The Importance of Food
ఆహారాన్ని నిందించకూడదు. ఇది మీ వ్రతం. ప్రాణమే ఆహారం. ఆహారాన్ని భుజించేది దేహం. దేహం ప్రాణంలో నెలకొని ఉంది. ప్రాణం దేహంలో నెలకొని ఉంది. కనుక ఆహారం ఆహారంలో నెలకొని ఉన్నది. ఎవరు దీనిని తెలుసుకొంటాడో అతడు ఈ సత్యంలో నెలకొని ఉంటాడు. అతడు ఆహార సమృద్ధి గలవాడు అవుతాడు; భుజించి ఆనందిస్తాడు. సంతాన భాగ్యమూ, గో సంపత్తీ గలవాడు అవుతాడు. బ్రహ్మతేజస్సు, కీర్తి సంతరించుకొన్న వాడు అవుతాడు.
Chapter VIII: The Importance of Food
ఆహారాన్ని ఉపేక్షించరాదు. ఇది మీ కర్తవ్యం. నీరే ఆహారం. ఆహారాన్ని భక్షించేది అగ్ని. అగ్ని నీటిలో నెలకొని ఉంది. నీరు అగ్నిలో నెలకొని ఉంది. కనుక ఆహారంలో నెలకొని ఉన్నది. ఎవరు దీనిని తెలుసుకొంటాడో అతడు ఈ సత్యంలో సుప్రతిష్ఠితుడై ఉంటాడు. అతడు ఆహార సమృద్ధి గలవాడు అవుతాడు. ఆహారం భుజించి ఆనందిస్తాడు. సంతాన భాగ్యమూ, గోసంపత్తీ గలవాడు అవుతాడు. బ్రహ్మ తేజస్సు, కీర్తి సంతరించుకొన్నవాడు అవుతాడు.
Chapter IX: The Importance of Food
ఆహారాన్ని విస్తారంగా ఉత్పన్నం చేయాలి. ఇది మీ కర్తవ్యం. భూమియే ఆహారం. ఆహారాన్ని భుజించేది ఆకాశం. ఆకాశం భూమిలో నెలకొని ఉంది. భూమి ఆకాశంలో నెలకొని ఉన్నది. కనుక ఆహారం ఆహారంలో నెలకొని ఉంది. ఎవరు దీనిని తెలుసుకొంటాడో అతడు ఈ సత్యంలో సుప్రతిష్ఠితుడై ఉంటాడు. అతడు ఆహార సమృద్ధి, సంతాన భాగ్యమూ, గోసంపత్తి గలవాడు అవుతాడు. బ్రహ్మ తేజస్సు, కీర్తి సంతరించుకొన్నవాడు అవుతాడు.
Chapter X: Meditation on Brahman
1 ఆహారార్థం వచ్చిన ఎవరినీ త్రిప్పి పంపించకూడదు. ఇది మీ కర్తవ్యం. కనుక అనేక మార్గాలలో విస్తారంగా ఆహారాన్ని ఉత్పన్నం చేయాలి. ఎవరు ఎప్పుడు వచ్చినప్పటికీ, ‘ఇతడికి ఆహారం సిద్ధంగా ఉన్నది’ అని చెప్పగలిగిన మేరకు ఆహారం సిద్ధంగా ఉండాలి. ఆహారాన్ని చక్కని పద్ధతిలో తయారుచేసే వ్యక్తికి ఆహారం చక్కని పద్ధతిలో లభిస్తుంది. ఏదో సామాన్యంగా తయారుచేసే వ్యక్కికి ఏదో సాధారణ పద్ధతిలో లభిస్తుంది. మరీ సాధారణంగా తయారుచేసే వ్యక్తికి అట్లే అమిత సాధారణ రీతిలో లభిస్తుంది. ఆహారపు ప్రాధాన్యాన్ని, ఆహార దానం వలన వచ్చే ఫలాన్ని తెలుసుకొని దానిని నిర్వర్తించే వాడు ఆ ఫలాన్ని పొందుతాడు.
2 భగవత్ చింతనతో జీవించడం గురించి చెప్పబడుతున్నది. వాక్కులో క్షేమకరంగాను, ప్రాణ అపానములలో యోగక్షేమములుగాను, చేతుల్లో పనులుగాను, కాళ్ళలో నడకగాను. గుదంలో విసర్జనగాను భగవంతుడు పనిచేస్తున్నాడు.
3 భగవత్ చింతన తదుపరి విభాగం ఇది. వర్షంలో తృప్తిగాను, మెరుపులో శక్తిగాను, జంతువులలో కీర్తిగాను, నక్షత్రాలలో కాంతిగాను, జననేంద్రియంలో సంతానాన్ని ఉత్పన్నం చేసే శ్రేష్ఠతమమైన ఆనందంగాను, ఆకాశంలో సమస్తంగాను భగవంతుడే ఉన్నాడు.
4 పరబ్రహ్మాన్ని సమస్తానికీ ఆధారభూతునిగా స్తుతించాలి. అలా స్తుతించే వాడు తనలో నెలకొని ఉన్న వాడుగా అవుతాడు. ఆయనను మహామహిమాన్వితునిగా స్తుతించే వాడు మహత్వం పొందుతాడు. చింతనగా స్తుతించేవాడు చింతనాశీలుడు అవుతాడు. అతడు కోరినవన్నీ వాటంతట అవే అతడికి లభిస్తాయి. ఆయనను నేతగా స్తుతించే వాడు నేత అవుతాడు. ఆయనను నాశక శక్తిగా స్తుతించే వాడిని ద్వేషించేవారు, శత్రువులు, అయిష్టులు, దుష్టులు నశిస్తారు.
5 ఈ మనిషిలో ఉన్నవారూ ఆ సూర్యునిలో ఉన్నవారూ ఒక్కరే. ఈ సత్యాన్ని తెలుసుకొన్నవాడు ప్రాపంచిక చైతన్యం నుండి విడివడుతున్నప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకు (దేహాలకు) అతీతంగా వెళతాడు. ఆ తరువాత కోరిన రూపాన్ని పొంది, కోరుకున్న లోకాలలో, కోరుకున్న ఆహారాన్ని భుజిస్తూ సంచరిస్తూ ఉంటాడు; పాడుతూ ఆడుతూ ఆనందంగా ఉంటాడు.
6 “ఆహా! ఆహా! ఆహా! నేనే ఆహారాన్ని, నేనే ఆహారాన్ని, నేనే ఆహారాన్ని! నేనే ఆహారాన్ని భుజించే వాడను, నేనే ఆహారాన్ని భుజించే వాడను, నేనే ఆహారాన్ని భుజించే వాడను! నేనే ఈ శ్లోకకృత్తుడను, నేనే ఈ శ్లోక కృత్తుడను, నేనే ఈ శ్లోక కృత్తుడను! సృష్టలో మొదట ఉద్భవించిన వాడను నేనే! దేవతలకన్నా మునుపే అమరత్వ స్థితిలో ఉన్న వాడను. నాకు ఇవ్వకుండా భుజించే వాడిని నేనే భక్షిస్తాను. సమస్త లోకాలను నేను జయిస్తాను. దేదీప్యమానంగా ప్రకాశించే దేవతను నేనే!’ ఈ విధంగా తెలుసుకొన్న వాడు సమస్త ఫలాలను పొందుతాడు. ఈ విధంగా ఈ ఉపనిషత్తు సమాప్తమౌతున్నది.
ఓం శాన్తిః॒ శాన్తిః॒ శాన్తిః ॥
గురుశిష్యులమైన మన ఇద్దరినీ భగవంతుడు రక్షించుగాక! ఇద్దరినీ పోషించుగాక! ఇద్దరమూ ఊర్జితశక్తితో పరిశ్రమిద్దాంగాక! మన స్వాధ్యాయం ఏకాగ్రమూ ఫలవంతమూ అగుగాక! ఎన్నడూ మనం పరస్పరం ద్వేషించ కొనకుందాంగాక!
“ఇతి తైత్తిరీయోపనిషది ఆనంద వల్లీ సమాప్తం”