కూర్మపురాణంలో ఉన్న రాజయోగ సంగ్రహాన్ని స్వేచ్ఛగా అనువదించి క్రింద ఇస్తున్నాను.
మనిషిని చుట్టుముట్టిన పాప పంజరాన్ని యోగాగ్ని భస్మం చేస్తుంది. జ్ఞానం పరిశుద్ధం కాగానే నిర్వాణం సిద్ధిస్తుంది. యోగంవల్ల జ్ఞానం కలుగుతుంది. తిరిగి జ్ఞానం యోగికి తోడ్పడుతుంది. యోగ జ్ఞానాలను రెంటినీ అవలంబించే వ్యక్తి పరమేశ్వరునికి ప్రీతిపాత్రుడౌతాడు. రోజూ ఒకమారు, రెండుమార్లు, మూడుమార్లు లేదా సర్వవేళలా మహాయోగాన్ని అవలంబించేవారు దేవతలు. యోగం రెండు రకాలు; అభావయోగం మహాయోగం. ఆత్మను శూన్యంగా, నిర్గుణంగా ధ్యానిస్తే అది అభావయోగం. ఆత్మను నిష్కళంకం, ఆనందస్వరూపం, పరమాత్మ తుల్యం అని ధ్యానిస్తే అది మహాయోగం. యోగి ఈ రెండింటిలో దేన్ని సాధన చేసినా, ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. తానూ, సమస్త విశ్వం కూడా బ్రహ్మమే – అన్న అనుభూతి యోగి పొందినప్పుడు, మహాయోగానికి సాటి మరే యోగమూ రాదు.
రాజయోగ అంగాలు ఎనిమిది; యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. సత్యం, అహింస, అస్తేయం* , బ్రహ్మచర్యం, అపరిగ్రహం* – ఇవన్నీ యమం. యమం సాధన చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. మనోవాక్కాయకర్మలతో ఎవరికీ -ఏ జీవికి బాధ కలిగించకుండుట అహింస. అహింస కన్నా మించిన ధర్మం వేరే లేదు. తనవల్ల సృష్టిలో ఏ జీవికి ఎలాంటి హాని కలగదు అనే ఇలాంటి చిత్తవృత్తివల్ల మనిషికి దివ్యానందం ఏర్పడుతుంది. సత్యం వల్ల కర్మఫలాలను పొందుతాం, సత్యం వల్లే సర్వం లభిస్తుంది, సత్యంలోనే సర్వం ఉంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుపటమే సత్యం. దొంగతనంతో, బలాత్కారంతో ఇతరుల సొత్తు గ్రహించకూడదు; అదే అస్తేయం. మనోవాక్కాయ కర్మల్లో సర్వవేళలా, సర్వావస్థల్లో పరిశుద్ధంగా ఉండటమే బ్రహ్మచర్యం. ఎంత గొప్ప కష్టంలో ఉన్నా, ఎవరి వద్దా ఎలాంటి కానుక గ్రహించకుండా ఉండటమే అపరిగ్రహం. పరిగ్రహంతో మనిషి తన హృదయశుద్ధిని కోల్పోతాడు, అల్పుడౌతాడు.
ఈ క్రింది సాధనలు యోగసిద్ధికి తోడ్పడతాయి – శాస్త్రోక్తప్రవర్తన, తపస్సు, స్వాధ్యాయం, సంతోషం, శౌచం, ఈశ్వర ప్రణిధానం (ఆరాధనం).
ఉపవాసాలు మొదలైనవాటితో కలిగే ఇంద్రియనిగ్రహం శారీరక తపస్సు. వేదాధ్యయనం, మంత్రజపం వల్ల శరీరంలో సత్త్వశుద్ధి ఏర్పడుతుంది. ఇదే స్వాధ్యాయం. మంత్రజపం మూడు రకాలు – మంత్రాన్ని వినబడేలా ఉచ్చరించుట, పెదవులతో వినబడకుండా ఉచ్చరించుట, మంత్రార్థాన్ని భావిస్తూ మనసులోనే జపించుట. ఇందులో మొదటిరకం అధమం. అయితే, మానసిక జపం ఉత్తమం. శౌచం రెండు రకాలు: బాహ్యం, ఆంతరికం. నీరు, మట్టి మొదలైనవాటితో స్నానం చేయటం బాహ్యశౌచం. సత్యాది సద్గుణాలు అలవరచుకోవటం అంతః శౌచం. ఈ రెండూ కావాలి. బాహ్యంగా అపరిశుద్ధంగా ఉంటూ, మానసికశుద్ధి కలిగి ఉందనుకున్నంత మాత్రాన చాలదు. బాహ్యం, ఆంతరికం రెండూ చేయటం సాధ్యంకాని పక్షంలో, రెంటిలో ఆంతరికశౌచం శ్రేష్ఠం. అయితే యోగి కాదలిచే వ్యక్తి, రెండు శౌచాలను తప్పక పాటించాలి.
భగవంతుని సంకీర్తన, భావం, భక్తితో ఆరాధించటం ఈశ్వర ప్రణిధానం. యమ నియమాలను ఇదివరకే తెలుసుకున్నాం. ఇక ఆసనం: వక్షం, భుజాలు, తల – వీటిని నిటారుగా స్థిరంగా నిలపటమే ఆసనంలోని ముఖ్యాంశం. ఇక ప్రాణాయామం; ప్రాణమంటే శరీరంలోని రకరకాల జీవశక్తులు. ‘ఆయామ’ అంటే నిరోధించుట అని అర్థం. ప్రాణాయామ మంటే ప్రాణవ్యాపార నిరోధం. ప్రాణాయామం మూడు రకాలు: సామాన్యం, మధ్యమం, ఉత్తమం. ప్రాణాయామంలో పూరక, రేచక, కుంభకాలని మూడు భాగాలుంటాయి. పన్నెండు క్షణాలతో మొదలుపెట్టే ప్రాణాయామం సామాన్యం, ఇరవైనాల్గు క్షణాలతో మొదలయ్యేది మధ్యమం, ముప్ఫయిఆరు క్షణాలతో మొదలయ్యేది ఉత్తమం.
సామాన్య ప్రాణాయామంలో చెమట పడుతుంది. మధ్యమంలో శరీరం వణుకుతుంది. ఉత్తమంలో శరీరం భూమిని వదలి పైకి లేస్తుంది; దివ్యానందం కూడా యోగికి లభిస్తుంది.
గాయత్రి పరమపవిత్ర వేదమంత్రం. “ఈ విశ్వాన్ని సృజించిన పరమపురుషుని ఐశ్వర్యాన్ని ధ్యానిస్తాం; అతను మాకు జ్ఞానోదయాన్ని కలిగించుగాక” అనేది గాయత్రి మంత్రార్థం. ఈ గాయత్రీ మంత్రాన్ని
ఓం తో ప్రారంభించి, ఓం తో ముగించాలి. ఒక్క ప్రాణాయామంలోగాయత్రిని మూడుసార్లు జపించాలి. శ్వాసవదలుట రేచకం; శ్వాస పీల్చుట పూరకం; శ్వాసను నిలుపుట కుంభకం. ప్రాణాయామం ఈ మూడింటితో కూడియుంటుందని గ్రంథాలన్నీ చెబుతుంటాయి.
ఇంద్రియాలు బహిర్ముఖాలై, బాహ్యవిషయాలతో సంయోగం చెందుతుంటాయి. ఇంద్రియాలను విషయాలనుండి మరల్చి, వాటిని స్వవశం చేసుకోవటమే ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఉపసంహరించుకోవడం, తనలో చేర్చుకొనుట అని అర్థం. మనసును హృదయకమలంలో గానీ, శిరస్సులోని సహస్రారంలోగాని నిలుపుట ధారణ. మనసు ఒక ఆలంబనాన్ని ఆశ్రయించి దాన్లో లగ్నమై ఉన్నప్పుడు, ఒకరకమైన వృత్తులు మనసులో కలుగుతాయి. ఈ వృత్తులను, ఇతరవృత్తులు బాధించవు. ఈ ప్రత్యేకవృత్తులు స్పష్టపడుతున్నకొద్దీ, ఇతరవృత్తులన్నీ క్షీణిస్తూ అంతరించి పోతాయి. తర్వాత ఈ ప్రత్యేకవృత్తులన్నీ ఏకవృత్తిదాల్చి, ధ్యేయాకారవృత్తిగా మారి చిత్తంలో నిలచిపోతాయి. ఇలా ధ్యేయాకారవృత్తి నిలవటమే ధ్యానం. ఏ ఆలంబన లేకుండా, చిత్తం ఏకప్రత్యయ ప్రవాహంగా మారితే, అది సమాధి. ఈ స్థితిలో ధ్యేయ సహాయముండదు, స్థల కేంద్రాల సహాయముండదు. అయినా భావార్థం భాసిస్తూ ఉంటుంది. ధ్యేయంలో పన్నెండు క్షణాలు మనసును నిలిపితే అది ధారణ. పన్నెండు ధారణలు ఒక ధ్యానం. పన్నెండు ధ్యానాలు సమాధి. (12 × 12 × 12 = 1728 క్షణాలు = 4 గం. 48 ని.)
అగ్నిభయమున్న చోట, నీటిలో, ఎండుటాకులు రాలిన ప్రాంతంలో, చీమల పుట్టలుండే ప్రదేశంలో, క్రూరజంతువు లుండే చోట, ప్రమాదకరమైన స్థలాల్లో, నాలుగు బాటలు కలిసేచోట, పెద్దపెద్ద ధ్వనులు వినివచ్చేచోట యోగాభ్యాసం చేయవద్దు. (ఈ విషయాలు ముఖ్యంగా భారతీయులకు వర్తిస్తాయి.) దేహం నీరసంగా, అనారోగ్యంగా ఉన్నప్పుడు, మనసులో దుఃఖం, దైన్యం ఉన్నప్పుడు యోగసాధన చేయవద్దు. ఇతరుల వల్ల బాధకలగని రహస్య ప్రదేశానికి వెళ్ళాలి. అపరిశుద్ధ స్థలాన్ని ఎన్నుకోవద్దు. రమణీయ స్థలాన్ని ఎన్నుకోవాలి. లేదా ఇంట్లోనే చక్కని గదిని సాధనకు ఉపయోగించాలి. మొదట ప్రాచీన యోగులకు నమస్కరించాలి. గురువుకు, దైవానికి మ్రొక్కాలి. ఆ తర్వాత యోగసాధన మొదలుపెట్టాలి.
ఇదంతా ధ్యాన విషయం, ఇక ధ్యేయం గూర్చి చెప్పుకుందాం. దాన్ని కొన్ని ఉదాహరణలతో వివరించుకుందాం. సుఖంగా కూర్చుని; నాసికాగ్రంపై లక్ష్యం పెట్టాలి. ఇలా చేస్తే మనసు ఏకాగ్రమౌతుంది; నేత్రనాడులు వశమై చిత్తవృత్తులు ఆగిపోతాయి; దానితో సంకల్ప నిరోధం జరుగుతుంది. ఇదంతా ఎలా జరుగుతుందో ముందు ముందు తెలుసుకుంటాం. ఇప్పుడు కొన్ని ధ్యానవిధానాల గూర్చి చెప్పుకుందాం.
తలపైన కొన్ని అంగుళాల ఎత్తున ఒక పద్మాన్ని ఊహించుకోండి. జ్ఞానం దాని తంతువని, ధర్మం దాని కర్ణిక అని తలచండి. అష్టదళాలు అష్టసిద్ధులని, పరాగం త్యాగమని భావించండి. సిద్ధులను త్యాగం చేసి, పరిపూర్ణ త్యాగాన్ని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుంది. ఓంకార స్వరూపుడు, వాక్మానసగోచరుడు, సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుని ఆ పద్మం మధ్యలో ధ్యానించండి.
మరొకరకమైన ధ్యానంగూర్చి వినండి. నీ హృదయాకాశం మధ్యలో ఒకజ్యోతి ప్రకాశిస్తూ ఉన్నట్లు భావించు. ఆ జ్యోతి నీ ఆత్మ అనుకో. ఆ జ్యోతి మధ్యలో దివ్యతేజస్సుతో వెలిగే కాంతిని ఊహించుకో, అది పరమాత్మ అనుకో. ఆ పరంజ్యోతిని ధ్యానించు.
బ్రహ్మచర్యం, అహింస, ఘోరశత్రువునందైనా దయ చూపే క్షమ, సత్యం, ఆస్తికభావం ఇవన్నీ రకరకాల చిత్తవృత్తులు. ఈ సద్గుణాలన్నింటిని పూర్ణంగా అలవరచుకోవాలి. అలవడకపోయినా భయపడనవసరం లేదు, సాధనను కొనసాగిస్తూ ఉంటే క్రమంగా ఇవన్నీ సిద్ధిస్తాయి. నిస్సంగుడు, క్రోధరహితుడు, భయరహితుడు, భగవదాయత్తచిత్తుడు, శరణాగతుడు, పవిత్రహృదయుడైన భక్తుని అభీష్టాన్ని భగవంతుడు నెరవేరుస్తాడు, కాబట్టి జ్ఞాన భక్తి వైరాగ్యంతో పరమాత్మను ఆరాధించాలి.
“ద్వేషం లేనివాడు, సర్వభూతహితుడు, దయామయుడు, తనది అన్నది ఏదీ లేనివాడు, అహం మమతలు త్యజించినవాడు, సుఖదుఃఖాల్లో సమచిత్తుడు, క్షమాశీలి, సంతుష్టుడు, యోగనిరతుడు, సంయమం కలవాడు, దృఢసంకల్పుడు, ధృతిమంతుడు తన మనోబుద్ధులను నాయందుంచినవాడు – ఇలాంటి భక్తుడే నాకు ఎంతో ప్రియమైనవాడు. దేనిమీదను ఆధారపడనివాడు, పవిత్రచిత్తుడు, కర్తవ్యనిర్వహణంలో బద్ధదీక్షితుడు, బాగోగులను లెక్కచేయనివాడు, లోకులకు వెరపు కల్గించని వాడు, లోకుల వల్ల భయం పొందనివాడు, హర్షం, క్రోధం, భయం, విషాదం అనేవాటితో వికారం చెందనివాడు, ఇలాంటి భక్తుడు నాకెంతో ప్రియమైనవాడు. అపేక్షారహితుడు, శుచిమంతుడు, దక్షుడు (ఏ కార్యాన్నయినా ఆలసింపక చేయువాడు), ఫలవిషయంలో ఉదాసీనుడు, శోకరహితుడు, మానావమానాల్లో సముడు, ప్రశాంతచిత్తుడు, ప్రాప్తమైన దానితో సంతుష్టి పడువాడు, ప్రపంచమే తన ఇల్లుగా భావించేవాడు, స్థిరచిత్తుడు – ఇలాంటి భక్తుడే నాకెంతో ప్రియుడు.” ఇలాంటివారే యోగులు కాగలరు.
నారదుడు దేవర్షి, సర్వలోక సంచారి. ఒకరోజు అరణ్యం గుండా వెళుతున్నాడతను. దారిలో ఒక వ్యక్తి కనిపించాడు. అతను ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. అతని చుట్టూ పుట్టలు పెరిగిపోయి ఉన్నాయి. ఆ వ్యక్తి నారదుని చూశాడు. “దేవర్షి, మీరెటు వెళుతున్నారు” అని అడిగాడు. “కైలాసానికి” అంటూ నారదుడు చెప్పాడు. “అయితే, ఒక చిన్నపని చేసిపెట్టండి స్వామీ! ఆ పరమేశ్వరునికి నాపై ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో, నాకు ముక్తి ఎప్పుడు లభిస్తుందో కనుక్కొని రండి స్వామీ!” అంటూ అతను ప్రార్థించాడు. సరే అని చెప్పి నారదుడు ముందుకు వెళ్ళాడు. కొంతదూరంలో మరొకవ్యక్తి కనిపించాడు. అతను ఆడుతూ, పాడుతూ ఎగిరి గంతులు వేస్తున్నాడు. నారదుని చూసి, “మునీంద్రా! మీరెటు వెళుతున్నారు?” అని అడిగాడు. అతని కంఠం, చేష్టలు చాలా విచిత్రంగా ఉన్నాయి. “కైలాసానికి” అని నారదుడు చెప్పాడు. “అయితే నా కెప్పుడు మోక్షం లభిస్తుందో కాస్త తెలుసుకుని రండి” అని అతను ప్రార్థించాడు. నారదుడు సరేనని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు.
* * *
కొంతకాలం తర్వాత నారదుడు ఆ మార్గంలోనే తిరిగివచ్చాడు. ధ్యానం చేస్తున్న తాపసి “నా విషయం ఏమయిందీ?” అని కుతూహలంగా ప్రశ్నించాడు. “ఇంకా నాలుగు జన్మల్లో నీకు ముక్తి కలుగుతుందని పరమేశ్వరుడు చెప్పాడు” అంటూ నారదుడు జవాబిచ్చాడు. “నా చుట్టూపుట్టలు పెరిగేదాకా ధ్యానించాను కదా, ఇంతసాధన చేసిన నాకు ఇంకా నాలుగు జన్మలకు గాని మోక్షంరాదా?” అని ఆ తాపసి వాపోయాడు. నారదుడు రెండవ వ్యక్తి వద్దకు వెళ్ళి, “ఈ చింతచెట్టు ఉంది కదా! దీనికి ఎన్ని ఆకులున్నాయో, అన్ని జన్మలు నువ్వింకా ఎత్తాలి. అప్పుడే నీకు ముక్తి.” అంటూ చెప్పాడు. “ఓహో! ఇంత త్వరగా నాకు ముక్తి లభిస్తుందా!” అంటూ ఆ వ్యక్తి ఆనందంతో పరవశించిపోయాడు. “నా ప్రియభక్తుడా! నీకీ క్షణంలోనే మోక్షం ఇస్తున్నాను” అంటూ దివ్యవాణి అతనికి వినిపించింది.
అతని దీక్షకు, శ్రద్ధకు, విశ్వాసానికి అది ఫలం. ఎన్ని జన్మలైనా సాధన చేయటానికి అతను సంసిద్ధంగా ఉన్నాడు. అయితే మొదటి వ్యక్తి మాత్రం మరి నాలుగు జన్మలు సాధన చేయాలనగానే క్రుంగిపోయాడు. యుగాలపర్యంతం కూడా వేచియుండగలిగే కార్యదీక్షాపరునికే, ఫలితం లభిస్తుంది సుమా!