రాజయోగంలోని మొదటి ఆరు అంగాల గూర్చి స్థూలంగా తెలుసుకున్నాం. మిగిలిన అంగాలు రెండు. వీటిలో ఏకాగ్రతను బోధించే సూక్ష్మసాధనా లుంటాయి.
రాజయోగానికి పరమలక్ష్యం ఏకాగ్రతే. మనం పొందే సహేతుక జ్ఞానమంతా, మన అంతర్గత చేతన ద్వారానే ఏర్పడుతోంది. వెలుపల ఉన్న వస్తువేమిటో, అది ఎలాంటిదో ఇదంతా కూడా మనకు ఆ చేతనమూలంగానే తెలుస్తూ ఉంటుంది. ఈ బల్ల, మీ ఉనికి నా ఎరుకలోకి రావటం మూలంగా, బల్ల, మీరూ ఇక్కడ ఉన్నారని నాకు తెలుస్తోంది. అదే సమయంలో నా ఉనికిలోని చాలాభాగం నాకు తెలియకుండా ఉంటోంది. శరీరంలో వివిధ అవయవాలున్నాయి; మెదడులో రకరకాల భాగాలున్నాయి; కాని వాటి ఎరుక ఎవరికీ లేదు.
నేను భోజనం చేస్తుంటాను; అదంతా తెలిసే చేస్తుంటాను. అయితే అది జీర్ణం అవుతున్నప్పుడు మాత్రం, ఆ విషయం నాకేమీ తెలియదు. ఆహారం రక్తంగా మారుతుంది; రక్తం దేహమంతా ప్రసరిస్తుంది; దేహానికి జవసత్త్వాలు కలుగుతాయి. అయితే ఈ చర్యలన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అయినా ఈ చర్యలన్నీ చేస్తున్నది నేనే సుమా! ఈ ఒక్కదేహంలో ఇరవైమంది ఉంటారా? ఉండరు కదా! మరి ఈ కార్యాలన్నీ నేనే చేస్తున్నాను అన్న నిజం నాకెలా తెలుస్తుందీ? “తినటం – పచనం చేసుకోవటం నీ పని, శరీరానికి పుష్టి కలిగించటం మరొకరి పని” అనివాదించవచ్చు. కాని అది జరిగేపని కాదు. మనకు తెలియకుండా జరిగిపోతున్న చర్యలన్నింటినీ ఎరుకలోకి తేవచ్చునని నిరూపించగలం. మన గుండె మననియంత్రణ లేకుండానే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడున్నవారిలో గుండెను ఆపటానికి ఎవరికీ సామర్థ్యం లేదు. అది తన పని తానే చేసుకుంటూ పోతుంది. ఈ గుండెను కూడా స్వవశం చేసుకోవచ్చు; మన ఇచ్ఛానుసారంగా దీన్ని వేగంగా లేదా నెమ్మదిగా పనిచేయించవచ్చు; అంతెందుకూ గుండెను పూర్తిగా క్రియారహితంగా కూడా చేసుకోవచ్చు. సాధన ద్వారా గుండె మనవశమౌతుంది. అలాగే దేహంలోని ఏ భాగాన్నయినా స్వవశం చేసుకోవచ్చు. అంటే మన ఎరుకలేకుండా జరిగే దేహవ్యాపారాల నన్నింటినీ కూడా మనమే చేస్తున్నామని తెలుస్తోంది కదా! అలా చేస్తున్నామన్న విషయం మనకు తెలియదు. అంతే. దీన్నిబట్టి ఒక విషయం మనకు స్పష్టమవుతున్నది; మనసు రెండు క్షేత్రాల్లో పనిచేస్తూ ఉంటుందని. ఒకటి చేతనావస్థ; ఈ అవస్థలో జరిగే పనులన్నింటిలో “అహం భావన” ఉంటుంది; అంటే ‘నేను చేస్తున్నాను’ అన్న ఎరుక ఉంటుంది. రెండవది అచేతనావస్థ; ఈ అవస్థలో జరిగే పనులన్నీ “అహంభావన” లేకుండానే జరిగిపోతుంటాయి; అంటే ‘నేను చేస్తున్నాను’ అన్న ఎరుక వీటియందు మనకుండదు. కాబట్టి మనసు రెండురకాలుగా పనిచేస్తూ ఉంటుంది. నేను అన్న భావనతో కూడిన పని; నేను అన్న భావన లేని పని. మొదటిది సచేతనక్రియ; రెండవది అచేతనక్రియ. నిమ్నజాతి జంతువుల్లో ఈ అచేతనక్రియను సహజజ్ఞానం (Instinct) అంటాం. ఉత్తమజాతి జంతువుల్లో, ఉత్తమోత్తమ జంతువైన మనిషిలో ‘సచేతనక్రియ’ అనేది ఉంటుంది.
ఈ రెండే కాదు, మనసుకు మరో అవస్థ కూడా ఉంది. అహంయుక్త సచేతనక్రియ కన్నా మించిన మరోవ్యాపారం కూడా మనసుకుంది. ‘నేను’ అన్న భావనతో కూడిన ఎరుకను కూడా అది దాటిపోతుంది. అహంయుక్త మనోవ్యాపారం, అహం రహితమనోవ్యాపారం కన్నా ఉన్నతం కదా! అలాగే అహంయుక్త మనోవ్యాపారాన్ని మించిన ఉన్నతస్థితి కూడా ఉంది. ఇది ఎరుకకు అతీతంగా ఉండే అవస్థ; ఇందులో “నేను” అన్న వృత్తి ఏర్పడదు. ఈ మూడు మానసిక స్థితుల్లో, మధ్యలో ఉండే బోధావస్థ (ఎరుక కలిగిన స్థితి) లో మాత్రమే “నేను” అనే వృత్తి ఏర్పడుతోంది. పైన ఉండే బోధాతీత అవస్థలో, క్రింద ఉండే బోధరహిత అవస్థలో ‘నేను’ అనే వృత్తి అసలుండనే ఉండదు. అయినా మనసు పనిచేస్తూనే ఉంటుంది. మనసు బోధావస్థను దాటితే, దాన్ని అతీంద్రియజ్ఞానం, లేదా సమాధి అంటారు. సమాధి పొందిన వ్యక్తి బోధావస్థను దాటకుండా క్రిందికి దిగజారి తక్కువస్థాయిలోకి వెళ్ళలేదని మనకెలా తెలుస్తుందని మీరనవచ్చు. నిజమే. క్రింది అవస్థలో- పై అవస్థలో రెంటిలోకూడా “నేను” వృత్తి ఉండదు. అయితే ఫలితాన్నిబట్టి ఏది ఉచ్ఛస్థితో, ఏది నీచస్థితో మనం నిర్ణయించవచ్చు. ఒకవ్యక్తి గాఢంగా నిద్రించాడనుకోండి. అప్పుడతను బోధావస్థకు క్రింది స్థితిని అనుభవిస్తుంటాడు. ఊపిరి పీలుస్తుంటాడు. నిద్రలో శరీరాన్ని కదిలిస్తుంటాడు. ఇదంతా అతనికి తెలియనే తెలియదు. నిద్రలో ఇలా శరీర వ్యాపారాలు చేస్తున్నా, అతనికి ఆ ఎరుకే ఉండదు. నిద్రించేముందు అతను ఏ స్థితిలో ఉంటాడో, నిద్రించి మేల్కొన్నతర్వాత కూడా అదే స్థితిలో ఉంటాడు. నిద్రించేంతవరకు అతని కెంత జ్ఞానముంటుందో, నిద్రతర్వాత కూడా అతని కంతే జ్ఞానముంటుంది. అతని జ్ఞానం ఏమాత్రం వికసించదు. అతనికెట్టి తత్త్వదర్శనం కలగదు. కాని సమాధిని పొందిన యోగి విషయం అలా కాదు; సమాధిలోకి వెళ్ళేముందు అతను మూర్ఖుడై ఉంటే, సమాధి తర్వాత అతను ఋషిగా మారిపోతాడు.
ఈ తేడా ఎందుకూ? ఒక అవస్థనుండి బయటపడితే, వ్యక్తి మొదటిలా మామూలుగానే ఉంటాడు; మరొక అవస్థనుండి బయటపడితే, అతను తత్త్వదర్శిగా, ఋషిగా, ప్రవక్తగా, పరమపవిత్రుడుగా, పరిణామం చెంది పునర్జీవితుడై అఖండజ్ఞానసంపన్నుడై ఉంటున్నాడు. ఇలా రెండురకాల ఫలితాలు చూస్తున్నాం. కార్యాలు వేరు వేరు కాబట్టి కారణాలు కూడా వేరువేరుగా ఉండాలి. సమాధి నుండి బయటికి వచ్చిన వ్యక్తికి కలిగే దివ్యానుభూతి, బోధరహితావస్థలో కలగదు. అంతేకాదు బోధావస్థలో కలిగే సహేతుకజ్ఞానం కన్నా, ఈ దివ్యానుభూతి మహత్తరమైంది. కాబట్టి ఇది తప్పక అతీంద్రియజ్ఞానమై ఉండాలి. ఆ అతీంద్రియజ్ఞానావస్థ సమాధియే.
సమాధి అంటే స్థూలంగా ఇదే. మరి ఈ సమాధివల్ల లాభమేమిటీ, అని అంటారా? చెబుతాను. హేతువాదం లేదా బోధయుక్తమనోవ్యాపారం చాలా పరిమిత జ్ఞానాన్నే కలిగిస్తుంది. ఇంద్రియజన్య జ్ఞానాన్ని హేతువాదం ఎప్పుడూ దాటిపోలేదు. మనిషికి ప్రాణప్రియమైన విషయాల జ్ఞానమంతా హేతువాద పరిధిని దాటే ఉంటుంది. శాశ్వతమైన ఆత్మ ఉందా, దేవుడున్నాడా, ఈ విశ్వాన్ని నియమించే అనంతజ్ఞానశక్తి ఏదైనా ఉందా, లేదా – ఇలాంటి ప్రశ్నలన్నీ హేతువాదానికి అందవు. హేతువాదం వీటికి జవాబు చెప్పలేదు. హేతువాదం ఏమంటుంది? “నేను అజ్ఞేయవాదిని; ఒకవిషయం ఔనో, కాదో నాకు తెలియదు.” అంటుంది. కాని మనకు మాత్రం ఈ ప్రశ్నలు చాలా ముఖ్యం. వీటికి సరైన సమాధానాలు లభించకపోతే, మానవజీవితమే వ్యర్థమైపోతుంది. మన నైతిక సిద్ధాంతాలు, ధార్మిక ప్రవృత్తులు, మానవ స్వభావంలోని అత్యున్నతాంశాలు అన్నీకూడా హేతువాదాతీత తత్త్వాల పైననే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రశ్నల కన్నింటికీ మనం తప్పక జవాబులు తెలుసుకోవాలి. ఈ జీవితం ఒక నాటకమైతే, ఈ విశ్వం ఆకస్మిక అణుసంయోగ జనితమైతే, మరి నేను మరొకరికి మేలెందుకు చేయాలి? సాటిజీవులయెడ కరుణెందుకు చూపాలి? న్యాయంగా ఎందుకుండాలి? ఒకరికొకరు సానుభూతి ఎందుకు కలిగి ఉండాలి? ఈ లోకంలో ఎవరికివారు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవచ్చుగా? ఎవరి లాభం వారు చూసుకోవచ్చుగా? మరుజన్మ ఉంది, పరలోకాలున్నాయి -అన్న ఆశ లేనప్పుడు నేను నా సాటిమనిషిని ఎందుకు ప్రేమించాలి? అతని గొంతెందుకు కోయగూడదు? మోక్షం లేదు; ఈ దృశ్యప్రపంచానికి మించి మరేమీలేదు; కేవలం కఠిన నిర్జీవ శాసనాలే ఉన్నాయి; -అన్నదే నిజమైతే, మరి నా శక్తిమేరకు ఇహలోకసుఖాలను అనుభవించే ప్రయత్నం చేయటమే మంచిది కదా! ఇహలోక ప్రయోజనంపై ఆధారపడే, నైతికవర్తనం నిర్మాణమైందని కొందరు చెబుతుంటారు. ఏమిటా ప్రయోజనం? ఎక్కువ మందికి ఎక్కువ సుఖం కల్పించటమా? ఇలా నే నెందుకు కల్పించాలి? నా ప్రయోజనం నెరవేరే పక్షంలో, చాలామందికి నేను దుఃఖమెందుకు కల్పించకూడదు? ఈ ప్రశ్నలకు ఐహిక ప్రయోజనవాదులు ఏం సమాధానం చెబుతారు?
నిజానికి ఏది న్యాయమో, ఏది అన్యాయమో మీ కెలా తెలుస్తుంది? సుఖాన్ని కోరి, ఆ ప్రేరణతో నా కోరికను నెరవేర్చు కుంటాను; ఇది నా స్వభావం; అంతే. నాకు కోరిక లున్నాయి; వాటిని తృప్తిపరచుకోవాలి; వద్దని ఎందుకంటారు? మానవ జీవితం గురించీ, నీతి గురించీ, మృత్యువులేని ఆత్మ గురించీ, భగవంతుడు, ప్రేమసానుభూతుల గురించీ, సత్ప్రవర్తన, స్వార్థరాహిత్యం గురించీ – ఈ సత్యాలు సిద్ధాంతాలు ఎక్కడ నుంచి వచ్చాయి? వీటన్నిటికీ మూలాధారం ఏది? మానవ జీవితం గురించీ, నీతి గురించీ, మృత్యువులేని ఆత్మ గురించీ, భగవంతుడు గురించీ, ప్రేమసానుభూతుల గురించీ, సత్ప్రవర్తన గురించీ, సార్థరహిత్యం గురించీ– ఈ సత్యాలు సిద్ధాంతాలు ఎక్కడనుంచి వచ్చాయి? వీటన్నిటికీ గల ఆధారం ఏది?
‘స్వార్థరాహిత్యం’ – అన్న భావనమీదే నీతిశాస్త్రం, మనిషి ప్రవర్తన, విజ్ఞానం – ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. ‘స్వార్థరాహిత్యం’ అన్న ఈ ఒక్కమాటలో మానవజీవితాశయాల నన్నింటినీ ఇమిడ్చివేయవచ్చు. అసలు స్వలాభాన్ని ఎందుకు వదలాలి? స్వార్థరహితంగా ఉండు – అని నాకెందుకు విధించారు? దీనికేమైనా గట్టి కారణముందా? స్వార్థపరునిగా నేనెందుకుండకూడదు? సహేతుకమైన కారణముందా? అయితే చూపించండి. స్వలాభం కోరకుండా జీవించండి అని చెప్పటం కవిత్వానికి రాణించవచ్చు కాని అది సరిఅయిన కారణంకాదు. స్వలాభాన్ని నేనెందుకు విడవాలో, మంచిగానే ఎందుకు ఉండాలో చెప్పండి. ఒక స్త్రీ, ఒక పురుషుడు అలా శాసిస్తేమాత్రం నేనలా ఉండాలా? దాన్ని నే నొప్పుకోను. అలా ఉండను. స్వలాభం కోరకుండా జీవిస్తే నాకేం లాభం? ఎక్కువ సుఖమే ఆ లాభ మంటారా, అలా అయితే స్వార్థపరునిగా ఉంటేనే నాకెంతో లాభం! ఐహికప్రయోజనవాదులు ఇలాంటి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పలేరు. అపారసముద్రంలో ఒక నీటిబొట్టు ఈ దృశ్యప్రపంచం; అనంత పదార్థరాశిలో ఇది ఒక అణువు అన్నదే దీనికి సరైన జవాబు. స్వార్థరాహిత్యాన్ని మానవులకు బోధించిన మహాత్ములు, ఆ భావాన్ని ఎలాగ్రహించారు? సహజజ్ఞానంతో మాత్రం కాదు. సహజజ్ఞానంతో జీవించే జంతువులకు ‘స్వార్థరాహిత్యం’ అన్నదే తెలియదు. తార్కికజ్ఞానంతో కూడా ఈ భావం కలగదు. తర్కం ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉంటుంది. మరి ఈ భావం ఎలా ఎక్కడినుండి కలుగుతోంది?
ప్రపంచంలోని గొప్పప్రవక్తలంతా ఒకవిషయంలో ఏకీభవించారని మనకు చరిత్ర చెబుతోంది. “మాకు లభించిన తత్త్వసిద్ధాంతాలన్నీ పైనుండే వచ్చాయి” అని వారంతా అంటారు. అయితే అవి వారికి నిజంగా ఎక్కడినుండి ప్రాపించాయో, వారిలో చాలామందికి తెలియదు. రెక్కలతో ఎగురుతూ, మానవరూపంలోనున్న ఒక దేవదూత ఆకాశం నుండి దిగివచ్చాడని, “ఈ సందేశాన్ని విను.” అంటూ తనకు చెప్పాడని ఒక ప్రవక్త అంటాడు. ఒకదేవత తనకు ప్రత్యక్షమైందని మరొకప్రవక్త చెబుతాడు. కొన్ని దివ్యాంశాలను తన పూర్వీకుడొకరు తనకు తెలిపాడని మరోప్రవక్త ప్రకటిస్తాడు. వీరికి ఇంతకన్నా మించి తెలియదు. అయితే ఒక విషయముంది. తర్కంతో గానీ, హేతుప్రజ్ఞతో గానీ ఈ దివ్యజ్ఞానం కలగలేదని, పైనుండి మాత్రమే లభించిందని వీరంతా ముక్తకంఠంగా చెబుతుంటారు; ఏకీభవిస్తుంటారు.
మరి ఈ విషయమై యోగశాస్త్రం ఏమంటుందో చూద్దాం. “వారికి ప్రాప్తించిన దివ్యజ్ఞానం హేతువాదానికి అతీతమనటం సమంజసమే. అయితే ఈ జ్ఞానం మరెక్కడినుండో రావటం లేదు; అంతర్గతం నుండే వస్తున్నది సుమా” అని యోగశాస్త్రం వక్కాణిస్తుంది.
హేతువాదానికి అతీతంగా, అతీంద్రియ జ్ఞానంగా ఉండే ఉన్నతావస్థ మనసులోనే ఉంది. ఆ అవస్థను పొందితే, అతీంద్రియజ్ఞానం లభిస్తుంది-అని యోగులంటారు. ఈ అవస్థ సామాన్యమానవ స్వభావానికి అతీతంగా, తార్కికజ్ఞానానికి అందకుండా ఉంటుంది; ఇలాంటి అవస్థ శాస్త్రవిధి తెలియని వ్యక్తికి దైవవశాత్తు లభించవచ్చు. ఇలా హఠాత్తుగా, తనకు తెలియకుండా దివ్యజ్ఞానం తనకు లభించే సరికి, అది పైనుండే ప్రాప్తించిందని ఆ వ్యక్తి అంటాడు. దివ్యావేశం, అతీంద్రియజ్ఞానం ఏ దేశంలోనైనా ఒకేవిధంగా ప్రాప్తిస్తూ ఉంటుంది. కాని అసలు నిజం ఎవరికీ తెలియకపోవటంవల్ల రక రకాలుగా అది తమకు వచ్చిందని చెబుతుంటారు. ఒకరు దేవదూత చెప్పిందంటారు; ఒకరు దేవత ఇచ్చిందంటారు; ఒకరు దేవుడు ప్రసాదించాడంటారు. నిజానికి మనసులోనే ఎంతో సహజంగా ఈ జ్ఞానం కలుగుతోంది. అయితే తమ విద్యాబుద్ధుల విశ్వాసాలనుబట్టి, దీనికి రకరకాల కారణాలను సృష్టించుకొంటున్నారు. అంతే. నిజం ఏమిటో తెలుసా? – ఈ దివ్యజ్ఞానం వీరికి అనుకోకుండా కాకతాళీయంగా లభిస్తోంది.
దివ్యజ్ఞానాన్ని ఇలా కాకతాళీయంగా పొందటం హానికరమంటారు యోగులు. చాలామంది దీనివల్ల పిచ్చివారయ్యే అవకాశముంది. ఈ జ్ఞానంలోని తత్త్వాన్ని తెలుసుకోకుండా హఠాత్తుగా ఈ దివ్యజ్ఞానాన్ని పొందినవారు ఎంతటి గొప్పవారైనా సరే, వారంతా చీకట్లో తడుముకునే వారుగానే కనిపిస్తారు. పైగా ఈ జ్ఞానానికి తోడుగా వారుకొన్ని విచిత్రమూఢనమ్మకాలు కూడా కల్గి ఉండేవారని తెలుస్తోంది. వారంతా మతిభ్రమకు లోనయ్యారు. గుహలోనున్న తన వద్దకు ఒకరోజు ‘గేబ్రియల్’ అనే దేవదూత వచ్చిందని, తనను ‘హరాక్’ అనే దివ్యాశ్వం మీద ఎక్కించుకుపోయిందని మహమ్మద్ చెబుతాడు. తానప్పుడు దివ్యలోకాలను చూశానని అతనంటాడు. అయినా అతను కొన్ని గొప్పసత్యాలు వెల్లడించాడు. ‘ఖురాన్’ చదువుతూ ఉంటే, గొప్పసత్యాలు మూఢ నమ్మకాలతో మేళవం చెందినట్లు తెలుస్తుంది. దీనికి ఏమిటీ కారణం? దివ్యావేశం అతనికి కల్గిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అది అనుకోకుండా కాకతాళీయంగా అతనికి లభించింది. అతను సుశిక్షితుడైన యోగికాదు; అందుకే తన కార్యాలకు కారణం అతనికి తెలియలేదు. మహమ్మదు ప్రపంచానికి చేసిన మేలుగూర్చి ఆలోచించండి; అలాగే అతని మతోన్మాదంవల్ల లోకానికి జరిగిన కీడును కూడా గ్రహించండి. అతని ఉపదేశాల కారణంగా కోట్లాదిమందిని ఊచకోత కోశారు. ఎంతోమంది తల్లులు తమ పిల్లలను కోల్పోయారు. ఎంతోమంది పిల్లలు దిక్కులేనివారయ్యారు. ఎన్నోదేశాలు సమూలంగా నాశన మయ్యాయి. ఎంతమందో చిత్రవధకు గురయ్యారు. ఈ కీడుగూర్చి ఆలోచించండి.
కాబట్టి మహమ్మదు, ఇతర గొప్పప్రవక్తల జీవితచరిత్రలను విమర్శించి చూస్తే, ఇలాంటి మతిభ్రమ అనే ప్రమాదానికి వారు ఎలా గురయ్యారో తెలుస్తుంది. అయినా వారందరికీ దివ్యజ్ఞానం ప్రాప్తించింది. ఇలా భావావేశంలో ప్రవక్త అతీంద్రియజ్ఞానాన్ని పొందినప్పుడు, కొన్ని తత్త్వాలను దర్శిస్తాడు; దానితోపాటుగా కొన్నిమూఢనమ్మకాలకు కూడా అతను గురి అవుతుంటాడు. మహమ్మద్ గొప్పఉపదేశాలతో లోకానికి ఎంతో మేలు జరిగింది; అయితే అతని మూఢనమ్మకాలతో లోకానికి అంతకు రెట్టింపు కీడు జరిగింది.
మానవజీవిత మనే అసంగత విషయ విన్యాసరాశి నుండి మనము ఏదైనా సమంజస భావాన్ని గ్రహించాలంటే, హేతువాదాన్ని అతిక్రమించాలి. దానికోసం మూఢనమ్మకాలను వదలిపెట్టాలి. శాస్త్రోక్తసాధనాన్ని ప్రశాంతంగా, సక్రమంగా చేయాలి. ఇతర శాస్త్రాల మాదిరే, రాజయోగాన్ని కూడా ఒకశాస్త్రంగా పరిశీలించాలి. హేతువిమర్శను ఆధారం చేసుకోవాలి. సత్యాన్వేషణకు దోహదం చేసేదాకా దాన్ని అవలంబించాలి. హేతువిమర్శ నిలువలేని స్థితిలో, ఉన్నతావస్థను పొందేందుకు అదే దారి చూపుతుంది. “నేను ఈశ్వర ప్రేరితుడను.” అని చెబుతూ, ఆ వెంటనే యుక్తివిరుద్ధంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, ఆ వ్యక్తి మాటలను నిరాకరించండి. ఎందుకంటే, సహజజ్ఞానం, తార్కికజ్ఞానం, అతీంద్రియజ్ఞానం లేదా బోధరహితావస్థ, బోధావస్థ, బోధాతీతావస్థ – ఈ మూడూ ఒకేమనసుకు సంబంధించినవై ఉంటాయి. ఒకే వ్యక్తిలో ఈ మూడురకాల మానసిక స్థితులుండవు. అయితే ఒక మానసికావస్థ వికసించి ఉన్నత అవస్థల్లోకి పరిణమిస్తుంది. సహజజ్ఞానం తార్కికజ్ఞానంగా మారుతుంది. తార్కికజ్ఞానం అతీంద్రియజ్ఞానంగా వికసిస్తుంది. ఈ అవస్థలు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి కావు. యథార్థదివ్యజ్ఞానం యుక్తివిరుద్ధంగా ఉండదు; పైగా యుక్తిని సిద్ధింపచేస్తుంది. “ప్రతిష్ఠించటమే నా ఆశయం, వినష్టం చేయటం కాదు.” అని గొప్పప్రవక్తలు చెబుతున్నట్లు, దివ్యజ్ఞానం హేతుజ్ఞానాని కెప్పుడూ దోహదం చేస్తూ, హేతుజ్ఞానాన్ని సిద్ధింపచేస్తూ ఉంటుంది.
శాస్త్రవిధిప్రకారం అతీంద్రియ జ్ఞానావస్థ సమాధి మనకు కలగటమే యోగాంగాలవల్ల కలిగే ప్రయోజనం. ప్రాచీన మహర్షులకు దివ్యజ్ఞానం సహజసిద్ధంగా ఉంటే, ప్రతిమనిషికీ అది సహజసిద్ధమే కావాలి. వారెవ్వరూ అద్వితీయులు కారు, వారు కూడా మనలాంటి మనుషులే. అయితే వారు గొప్పయోగులుగా మారారు. మనమూ కావచ్చు. అతీంద్రియజ్ఞానం వారికి సిద్ధిస్తే, మనకూ సిద్ధిస్తుంది. వారేమీ విచిత్రవ్యక్తులు కారు. ఒకవ్యక్తి ఆ స్థితి పొందాడంటేనే, ప్రతివ్యక్తీదాన్ని పొందవచచ్చు. పొందవచ్చని కాదు, ప్రతిమనిషీ ఆ స్థితిని పొందితీరాలి.
అతీంద్రియజ్ఞానాన్ని సాధించటమే మతం. స్వానుభూతియే మన గురువు. జీవితమంతా వాదవివాదాలు చేయండి; స్వానుభూతి కలిగేదాకా, సత్యాన్ని ఏమాత్రం గ్రహించలేము. ఒకవ్యక్తి వైద్యగ్రంథాలు ప్రోగు చేసుకుంటే, అతను వైద్యుడైపోతాడా? ఒకదేశాన్ని నేను చూడాలను కుంటాను; ఆ దేశపటాన్ని చూస్తే సరిపోతుందా? నేను ప్రత్యక్షంగా ఆ దేశానికి వెళ్ళి చూడాలి. ‘ప్రత్యక్షంగా చూడాలి’ అన్న కుతూహలాన్ని మాత్రమే ఆ పటం కలిగిస్తుంది. అంతేకాదు, కేవలం పుస్తకాలతో కుస్తీపట్టటం వల్ల, మన బుద్ధిశక్తి క్షీణిస్తుంది. ఒక పుస్తకంలో బ్రహ్మజ్ఞానమంతా ఉందనటం, ఈశ్వరుడిని నిందించటమే! భగవంతుడు అప్రమేయుడు, అనంతుడు అంటూనే, అతన్ని ఒక చిన్నపుస్తకం మధ్యలో ఇరికించటం ఎంత అవివేకం! పుస్తకాల్లోని విషయాలను నమ్మకపోవటం వల్ల, పుస్తకపుటల్లో బ్రహ్మజ్ఞానమంతా కనిపించకపోవటం వల్ల – ప్రశ్నించిన కోట్లాదిమందిని చంపివేశారు కదా! అయితే ఈ మధ్యకాలంలో ఈ హత్యలూ, చిత్రవధలూ తగ్గాయి. కాని, పుస్తకాన్ని ఈ లోకం ఇంకా ఘోరంగా నమ్ముతూనే ఉంది!
సమాధిని పొందాలంటే శాస్త్రీయంగా సాధనచేయాలి. రాజయోగంలోని ప్రతీ అంగాన్నీ సక్రమంగా అభ్యాసం చేయాలి.
ప్రత్యాహారం, ధారణ తర్వాత ధ్యానంగూర్చి వివరంగా తెలుసుకోవలసి ఉంది. వెలుపల లేదా లోపల ఒక లక్ష్యంమీద మనసును నిలిపితే, చిత్తం ఆ లక్ష్యంలో అవిచ్ఛిన్నంగా ఉండిపోతుంది; దీన్నే ధ్యానమంటాం. ప్రతీతి లేదా ఇంద్రియానుభవంలోని బాహ్యాంశాన్నితొలగించి, అంతరాంశమైన అర్థాన్ని మాత్రమే ధ్యానించగలిగే తీవ్రశక్తి మనసుకు ఏర్పడితే, అది సమాధి అవుతుంది.
‘ధారణ, ధ్యానం, సమాధి’ ఈ మూడింటి కలయికయే సంయమం. మొదట ఒకలక్ష్యంమీద చిత్తం ఏకాగ్రం కావాలి; ఆ ఏకాగ్రస్థితిలో అలాగే కొంతకాలం ఉండిపోవాలి. ఆ ధ్యానంలో లక్ష్యంలోని బాహ్యాంశాన్ని వదలి, అంతరాంశంలోనే నిమగ్నం కావాలి. ఇలాంటి చిత్తానికే అంతా వశమైపోతుంది, ఇదే అత్యున్నత సమాధి.
కోరికలు ఎంతకాలం ఉంటాయో, అంతదాకా వాస్తవ సుఖం మనకు దొరకదు. ధ్యానచిత్తులం, సాక్షీభూతులం అయితే తప్ప మనకు వాస్తవసుఖం, ఆనందం లభించదు. జంతువులు ఇంద్రియాల్లో రమిస్తాయి. మనిషి బుద్ధిలో రమిస్తాడు. దివ్యపురుషుడు ఆత్మలో రమిస్తాడు. ధ్యానంలో ఉండగలిగే వ్యక్తికే, నిజంగా ప్రపంచమంతా రమణీయంగా కనిపిస్తుంది. కోరికలు వదలి, సంగత్యాగం చేసి జీవించే వ్యక్తికి, ప్రకృతిలో జరిగే మార్పులన్నీ అందాల దృశ్యాలుగా గోచరిస్తాయి.
ధ్యానం గూర్చి కొన్నివిషయాలు తెలుసుకుందాం. మనమొక శబ్దం వింటాం. ఇందులో మొదటిక్రియ బాహ్యస్పందన. ఇంద్రియం విషయంతో కలవడం. ఈ స్పందనాన్ని మెదడుకు నాడులు చేరుస్తాయి, ఇది రెండవ క్రియ, అప్పుడు మనసు ప్రతిస్పందిస్తుంది, ఇది మూడవక్రియ. ఆకాశంలో పుట్టే స్పందనం నుండి మనసులో కలిగే ప్రతిస్పందనం వరకూ, మనం వినే శబ్దమే కారణమై ఉంటుంది. మనసులో ప్రతిస్పందన కలగ్గానే, శబ్దజ్ఞానం ఏర్పడుతుంది. ఈ చర్యను శబ్దం, అర్థం, జ్ఞానం అని యోగపరిభాషలో చెబుతారు. ఆకాశ సంబంధ స్పందనం – నాడుల్లో, మెదడులో కలిగే చలనం – మనసు ప్రతిస్పందించటం అని దీన్ని శరీర శాస్త్రపరిభాషలో వివరిస్తారు. నిజానికి ఈ మూడు కూడా వేరు వేరు పనులే. కాని, అంతా మిశ్రమంగా ఉండటంతో ఈ పనుల విశిష్ఠత తెలియటం లేదు. ఈ మూడింటి కూడికతో జరిగే కార్యాన్ని తప్ప మనం వీటిలో ప్రతీదాని పనిని గ్రహించటం లేదు. ఈ సంయుక్తకార్యాన్నే మనం బాహ్యవిషయ మంటున్నాం. ప్రతీ ఇంద్రియానుభవంలో కూడా, ఈ మూడు పనులుంటాయి వీటిని వేరుచేసి మనం ఎందుకు తెలుసుకోవటం లేదు అనటానికి కారణమేది లేదు.
యమ నియమాలను అభ్యాసం చేస్తే చిత్తస్థైర్యం కలుగుతుంది. మనోనిగ్రహ మేర్పడుతుంది. దానివల్ల సూక్ష్మగ్రహణశక్తి అలవడుతుంది. ఇలాంటి చిత్తాన్ని ధ్యానంలో లగ్నంచేయాలి.
స్థూలలక్ష్యంతో ధ్యానాన్ని ముందుగా ప్రారంభించాలి. క్రమంగా సూక్ష్మలక్ష్యాలవైపుకు వెళ్ళాలి. చివరికి ఏ లక్ష్యం లేకుండా ధ్యానంలో ఉండిపోవాలి. మొదట సుఖదుఃఖాలు మొదలైన సంవేదనాలకున్న బాహ్యకారణాలను మనసుతో పరిశీలించాలి, తర్వాత అంతర్గత చలనాలను అవలోకించాలి. చివరగా మనసు చేసే ప్రతిక్రియలను పరికించాలి. ఇంద్రియానుభవాల బాహ్యకారణాలను చక్కగా గ్రహిస్తేచాలు, సూక్ష్మ పదార్థాలను, సూక్ష్మవిషయాలను, సూక్ష్మరూపాలను కనుక్కోగలం. శరీరం లోపలి చలనాలను వాటి నిజరూపంలో గ్రహిస్తే చాలు, మనోవృత్తులు భౌతికశక్తిగా మారటానికి ముందే మనసు వాటిని నిరోధించ గలుగుతుంది. ఇంద్రియగోచర ప్రతి విషయం, ప్రతిభావం, మనసు చేసే ప్రతిక్రియ ఫలితాలే; కాబట్టి మనసు చేసే ప్రతిక్రియను పూర్తిగా గ్రహిస్తేచాలు, యోగి సర్వజ్ఞుడైపోతాడు. అతనికి మనసు స్వరూపం కట్టెదుట కనిపిస్తుంది. అతనికి సంపూర్ణమనోనిగ్రహం సిద్ధిస్తుంది; యోగసిద్ధులెన్నో లభిస్తాయి. అయితే యోగి వీటి మోహంలో చిక్కుకుంటే మాత్రం, అతని వికాసం అంతటితో ఆగిపోతుంది. భోగవాంఛలు మహా అడ్డంకులు సుమా! ఇలాంటదివ్యశక్తుల్ని కూడా యోగి త్యాగం చేయాలి. అప్పుడే సంపూర్ణచిత్తవృత్తి నిరోధమనే పరమపురుషార్థం అతనికి ప్రాప్తిస్తుంది.
ఆ స్థితిలో మనోవిక్షేపాలకు, శరీరవ్యాపారాలకు చలించని స్వయంజ్యోతి, జ్ఞానస్వరూపం, శాశ్వతం, సర్వవ్యాప్తమై దీపించే స్వస్థితిని అతను పొందుతాడు దీనినే సమాధి అంటారు.
ఈ సమాధిని ప్రతిమనిషీ పొందటానికి – మనిషే కాదు, ప్రతి జంతుమా పొందటానికి పూర్తి హక్కుంది. అతిచిన్న జంతువు నుండి ఉత్తమోత్తమ దేవతవరకూ ఉన్న ప్రతిజీవికూడా ఎప్పటికైనా సమాధిని తప్పక పొంది తీరాలి. అప్పుడే ఆ జీవి పారమార్థిక జీవితాన్ని నిజంగా మొదలుపెడుతుంది. అంతవరకూ మనం నిరంతర సాధన చేయవలసిందే. స్వానుభూతి లేకుంటే, మనకూ, నాస్తికులకూ భేదమేముంటుందీ? ఈ దివ్యానుభవాన్ని కల్గించకుంటే ఏకాగ్రత వ్యర్థమైపోతుంది. ఈ అనుభవంకోసమై ఉన్న యోగాంగాలన్నీ సహేతుకంగా, సక్రమంగా, శాస్త్రసమ్మతంగా నియమితమై ఉన్నాయి. ఈ యోగాన్ని శ్రద్ధతో సాధన చేయాలి. తప్పక సిద్ధిలభిస్తుంది, సర్వదుఃఖాలు క్షయిస్తాయి, కర్మబీజాలు దగ్ధమైపోతాయి. దానితో శాశ్వతానంద ప్రదమైన మోక్షం లభిస్తుంది.