(యౌగిక ప్రాణనిరోధం)
ప్రాణాయామం లోని సాధనలను ఇప్పుడు చెప్పుకుందాం. ఊపిరితిత్తుల చలనాన్ని నిరోధించటం యోగానికి మొదటి మెట్టని యోగుల ద్వారా గ్రహించాం కదా! శరీరంలోపల జరిగే సూక్ష్మచలనానిన్ని మనము ఇకమీదట కనుగొనాలి. మన చిత్తం బహిర్ముఖమై బాహ్యవిషయాల్లో సంచరిస్తూ ఉంటుంది; కాబట్టే అది అంతర్గత సూక్ష్మచలనాలను గమనించటం లేదు. ఈ సూక్ష్మచలనాలను కనిపెడితే చాలు, ఇవి మనకు స్వాధీనం కావటం మొదలుపెడతాయి. నాడీవాహినులు శరీరమంతటా సంచరిస్తూ, ప్రతి కండరానికి జవసత్త్వాలు కలుగచేస్తూ ఉంటాయి; అయినా మనకు ఆ అనుభవం కలగటం లేదు. యోగసాధనతో ఇలాంటి అనుభవాన్ని పొందవచ్చని, యోగు లంటారు. చాలా కాలం వరకు ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తే, సూక్ష్మచలనాలను వశం చేసుకోగలం.
ఇక ప్రాణాయామ సాధనల గూర్చి తెలుసుకుందాం. శరీరాన్ని నిటారుగా నిలిపి సమంగా కూర్చోవాలి. ఇది మొదటి పని. వెన్నుపాము వెన్నెముకనంటియుండకపోయినా, అది దానిలోనే ఉంటుంది. వంకరగా కూర్చుంటే, వెన్నుపాము స్థితి చెడుతుంది. అది సమంగా ఉండాలి. కాబట్టి నిటారుగా కూర్చోవాలి. వంకరగా కూర్చుని ధ్యానించే ప్రతిసారీ, మీకు కీడే జరుగుతుంది. దేహంలోని వక్షం – మెడ – తల ఈ మూడింటిని ఎప్పుడూ నిలువుగా ఉంచాలి. ఇలా కొంతకాలం ఆసనాన్ని అభ్యాసం చేయాలి. అలా చేస్తే, శ్వాస ఎంత సులభమో, ఆసనం అంత సుళువౌతుంది.
నాడుల్ని స్వాధీనం చేసుకోవటం, రెండవ పని. శ్వాసకోశాన్ని నియంత్రించే నాడీకేంద్రానికి, ఇతర నాడులు ఒక రకంగా ఆధీనమై పనిచేస్తాయని, అందుకని శ్వాసనియంత్రణాన్ని అభ్యాసం చేయటం తప్పనిసరని చెప్పుకున్నాం కదా! మనం ఊపిరి పీలుస్తూ – వదులుతూ ఉంటాం; దీనికో నియమాన్ని అనుసరిస్తున్నామని చెప్పలేం. అంతేకాదు, స్త్రీ పురుషుల శ్వాసక్రియలో కూడా స్వాభావిక భేదాలు కొన్ని ఉన్నాయి.
ఒక పరిమితిలో ఊపిరి పీల్చి, వదలటం – ఇది ప్రాణాయామంలో మొదటి సాధన. ఈ సాధన ద్వారా శరీరంలో క్రమగతి ఏర్పడుతుంది. కొంతకాలం ఇలా సాధన చేయాలి. తర్వాత పీల్చటం – వదలటంలతో ‘ఓమ్’ లేదా ఇతర మంత్రాలను చేర్చటం మంచిది. ఒకటి, రెండు, మూడు-అంటూ లెక్కించటానికి మారుగా, భారతదేశంలో మేము కొన్ని సాంకేతిక పదాల నుపయోగిస్తాం. ఇలాంటి పవిత్రశబ్దాలను ప్రాణాయామంతో చేర్చి మానసికంగా ఉచ్చరించటం మంచిదని చెబుతూ ఉంటాను కదా, దానికి కారణం ఇదే. ఇలాంటి మంత్రోచ్చారాన్ని శ్వాసతో చేర్చి, నియమానుసారంగా క్రమగతిలో ఊపిరి పీలుస్తూ, వదులుతూ ఉండాలి. ఇలా చేస్తే, శరీరమునందు క్రమగతి మొదలవుతుంది. అప్పుడే ‘విశ్రాంతి’ అంటే ఏమిటో మీకు చక్కగా తెలుస్తుంది. ఈ విశ్రాంతితో పోల్చితే, నిద్ర విశ్రాంతిగా అన్పించదు. ఒక్కమారు ఈ విశ్రాంతిని పొందితే నాడులు, అవి ఎంత అలసియున్నా, ఉపశమనం పొందుతాయి. అంతకుక్రితం నిజమైన విశ్రాంతిని పొందనే లేదని మీ కప్పుడు తెలుస్తుంది.
సాధకుని ముఖంలో మార్పు కల్గటం ఈ సాధన మొదటి ఫలితం. ముఖంలో మొరటుదనం మాయమౌతుంది; ప్రశాంతత చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత కంఠంలో మార్పు వస్తుంది. స్వరంలో కర్కశత్వం పోయి కోమలత్వం వస్తుంది. కర్కశకంఠం ఉన్న యోగిని నే నెప్పుడూ చూడలేదు. యోగసాధన కొన్ని నెలలు చేస్తే, ఇలాంటి లక్షణాలు వస్తాయి. పైవిధంగా శ్వాసను కొన్ని దినాలు నియంత్రించాలి. ఆ తర్వాత మరింత ఉన్నత సాధనకు పూనుకోవాలి. ఇడానాడి ఉండే ఎడమముక్కు ద్వారా ఊపిరి పీలుస్తూ మెల్లగా మనసును ఆ నాడిమీద ఏకాగ్రం చేయాలి. అలా చేస్తూ, ఊపిరితిత్తుల్ని శ్వాసతో నింపాలి. ఇలా చేయటంవల్ల నాడీప్రవాహాన్ని మీరు వెన్నుపాము క్రిందికి పంపుతుంటారు; అక్కడ త్రికోణాకృతిలో నున్న నాడీ కూటాన్ని సంఘర్షణకు గురి చేస్తారు. అదే మూలాధారచక్రం; కుండలినీ స్థానం. కొంతసేపు నాడీవాహినిని అక్కడ నిలపాలి. తర్వాత నెమ్మదిగా కుడిముక్కు ద్వారా శ్వాసను వదిలిపెట్టాలి; అలా చేస్తున్నప్పుడు పింగళనాడి ద్వారా నాడీప్రవాహాన్ని పైకి లాగుకొంటున్నట్లు భావించాలి.
ఈ సాధన కాస్త కష్టంగా ఉన్నట్లనిపిస్తుంది. అందుకని ఒక సులభమార్గాన్ని చెబుతాను. ముందుగా కుడిముక్కును బొటనవ్రేలితో మూయండి; ఎడమ ముక్కుతో మెల్లగా గాలిని పీల్చండి. పీల్చిన తర్వాత బొటనవ్రేలు చిటికెన (లేదా చూపుడు) వ్రేలుతో రెండుముక్కుపుటాలను మూయండి. నాడీప్రవాహాన్ని క్రిందికి పంపుతున్నామని సుషుమ్న చివరి భాగాన్ని దాంతో తడుతున్నామని భావించండి. తర్వాత బొటనవ్రేలును తీసివేయండి. కుడిముక్కుద్వారా శ్వాసను వదలివేయండి. తర్వాత ఎడమ ముక్కును చిటికనవ్రేలితో మూసి, కుడి ముక్కుతో శ్వాస పీల్చండి. పైన చెప్పినట్లు రెండు ముక్కుపుటాలను మూయండి.
చిన్నప్పటి నుండి హిందువులు దీన్ని అభ్యాసం చేస్తుంటారు. అందుకని వారి ఊపిరితిత్తులు దీనికి తగినట్లుంటాయి. కాని ఈ దేశస్థులకు అలవాటు లేని కారణంగా, హిందువుల పద్ధతి కష్టంగా ఉంటుంది. మీరు ముందుగా పూరకాన్ని నాలుగు క్షణాలు చేయండి. తర్వాత నెమ్మదిగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. నాలుగు క్షణాలు శ్వాసపీల్చి, పదహారు క్షణాలు శ్వాసనిలిపి, ఎనిమిది క్షణాల్లో వదలాలి. (అంటే 1:4:2 నిష్పత్తిలో ఇదంతా జరగాలి.) ఇది ఒక ప్రాణాయామ మవుతుంది. ఇలా ప్రాణాయామం చేస్తూ, త్రికోణాకృతిలో మూలాధారచక్రాన్ని భావించాలి. ఈ భావన ఎంతో సహాయకారిగా ఉంటుంది.
తర్వాత ఈ క్రింది సాధన చేయాలి; పై నిష్పత్తినే పాటిస్తూ శ్వాసను మెల్లగా పీల్చి, వెంటనే నెమ్మదిగా వదలి, వెలపలనే గాలిని స్తంభింప చేయాలి. మొదటి సాధనలో శ్వాసను కుంభిస్తారు. ఈ సాధనలో స్తంభింప చేస్తారు. ఇంతే తేడా. ఈ ప్రాణాయామం, పై దానికన్నా సుళువైంది. కుంభక ప్రాణాయామాన్ని అంతగా అభ్యసింపవద్దు. ఉదయం సాయంకాలం నాల్గుసార్లు చొప్పున చేస్తే చాలు. సామర్థ్యం, ఉత్సాహం పెరుగుతుంటే, సంఖ్యను – కాలపరిమితిని కూడా పెంచుకోవచ్చు, అప్పుడైనా అతిజాగ్రత్తగా చేయాలి. నాల్గునుండి ఆరుకు ఇలా క్రమంగా పెంచుకోవాలి. క్రమం తప్పితే, కీడు కలుగుతుంది.
ఈ మూడు పద్ధతులు నాడీశుద్ధికి పనికి వస్తాయి. వీటిలో మొదటిది, చివరిది చేయటంలో అంత కష్టముండదు; ఇవి హానికరం కూడా కావు. మొదటి పద్ధతిని అభ్యాసం చేస్తుంటే, మనసు ప్రశాంతమౌతూ ఉంటుంది; కేవలం ఓంకారాన్ని భావిస్తే చాలు. మామూలుగా మీ మీ పనులు చేసుకుంటూ కూడా ఈ సాధనను అభ్యాసం చేయవచ్చు. ఓం కార భావన మీకు మరింత తోడ్పడుతుంది. ఇలా పూనికతో సాధనను చేస్తుంటే, ఒకరోజు కుండలినీ మేల్కొంటుంది. దినానికి ఒకటి రెండుసార్లు అభ్యాసం చేస్తే అంత ఎక్కువ ఫలిత ముండదు; కొంత మనశ్శాంతి, ఆరోగ్యం, మంచి కంఠధ్వని- ఇవి లభిస్తాయి. సాధనను ఎక్కువగా తీవ్రంగా చేసేవారికే కుండలినీశక్తి మేల్కొంటుంది. అది మేల్కొన్న వెంటనే ప్రకృతి అంతా మారిపోవటం మొదలవుతుంది. జ్ఞాననేత్రం వికసిస్తుంది. జ్ఞానార్జనానికి గ్రంథాలను చదవటం ఇక అవసర ముండదు. అనంత జ్ఞాననిలయ గ్రంథంగా మీ మనసే మీ ముందుంటుంది.
వెన్నెముకకు రెండువైపుల ఉండే ఇడా – పింగళ నాడుల గూర్చి, వెన్నుపాము మధ్యలో నున్న సుషుమ్న గూర్చి చెప్పుకున్నాం కదా! ప్రతి జంతువులో కూడా ఈ మూడు నాడులుంటాయి. వెన్నెముక ఉన్న ప్రతిజంతువులో ఈ మూడు రకాల నాడీక్రియలకు తావుంటుంది. అయితే సామాన్యుల్లో సుషుమ్న ద్వారం మూసుకుని క్రియారహితంగా ఉంటుందని యోగులంటారు. శరీరంలోని వివిధ భాగాలకు జవసత్త్వాలు ఇడాపింగళ నాడులవల్ల కలుగుతుంటాయని వారంటారు.
యోగుల్లో మాత్రమే సుషుమ్న తెరచుకుని ఉంటుంది. సుషుమ్నను తెరచుకుని, కుండలినీ పైకి వెళ్లటం మొదలు పెట్టగానే, మనసుకు వాక్కుకు అందని అతీంద్రియ జ్ఞానం లభిస్తుంది. కాబట్టి సుషుమ్నను తెరవటమే యోగుల ప్రధానాశయం. చక్రాలు పద్మాలు అంటూ నాడీకేంద్రాలను యోగపరిభాష సూచిస్తూ ఉంటుంది. ఇవి సుషుమ్న పొడవునా ఏర్పడి ఉన్నాయని యోగులు చెబుతారు. అన్నింటికన్నా క్రింద ఉండే చక్రం మూలాధారం. దానిపైది స్వాధిష్ఠానం. మూడవది మణిపూరకం. నాల్గవది అనాహతం. ఐదవది విశుద్ధం. ఆరవది ఆజ్ఞ. ఏడవది – చివరిది అయిన సహస్రార చక్రం మెదడులో ఉంటుంది. ఈ చక్రాన్నే సహస్రదళపద్మ మంటారు.
వీటిలో ముందుగా మూలాధారం సహస్రారం గూర్చి కొంత చెప్పుకుందాం. మూలాధారం నుండే శక్తినంతా సహస్రారం వరకూ తీసుకవెళ్ళాలి. మానవదేహంలోని శక్తులన్నింటికన్నా, ఓజశ్శక్తి మహత్తరమైందని యోగులంటారు. ఓజశ్శక్తి మెదడులో సంచితమై ఉంటుంది. ఓజశ్శక్తి ఎంత ఎక్కువగా ఉంటే, అంతగా విశేషశక్తి, సామర్థ్యాలు, బుద్ధిబలం, ఆధ్యాత్మికశక్తి మనిషి కుంటాయి.
చక్కని అలంకారికభాషలో ఒకరు మాట్లాడుతున్నా, అతని మాటలు చిత్తాన్ని ఆకర్షించకపోవచ్చు. మంచి భాషలేకున్నా, చక్కని భావాలు చెప్పకున్నా మరొకరి మాటలు జనుల్ని ముగ్ధులను చేయవచ్చు. అతని ప్రతికదలిక కూడా శక్తివంతమై ఉంటుంది. ఇదంతా మరి ఓజశ్శక్తి ప్రభావమే సుమా!
ఎక్కువో, తక్కువో ప్రతిమనిషికీ ఓజశ్శక్తి ఉంటుంది. శరీరశక్తులన్నీ, వాటి అత్యుత్తమస్థితిలో ఓజశ్శక్తిగా మారతాయి. ఇలా మారటమే ప్రధాన విషయమని మీరిక్కడ గ్రహించాలి. బాహ్యప్రపంచంలో ఆకర్షణశక్తులుగా వ్యక్తమయ్యేదే, ఆంతరిక ప్రపంచంలో మానసిక శక్తిగా మారుతోంది.కండరశక్తిగా వర్తించే శక్తులే ఓజశ్శక్తిగా అవుతాయి. సంభోగవాంఛారూపంలో వ్యక్తమయ్యేది కామశక్తి; దీన్ని నిరోధిస్తే ఈ శక్తి సులభంగా ఓజశ్శక్తిగా మారుతుందంటారు యోగులు.
ఈ శక్తులన్నీ మూలాధారానికి వశమై ఉంటాయి. అందుకే యోగి మూలాధారకేంద్రాన్ని ప్రత్యేకంగా కాపాడుకుంటాడు. కామసంబంధ శక్తినంతా సంగ్రహించి, దాన్ని ఓజస్సులోకి మార్చే ప్రయత్నం చేస్తాడు. స్త్రీలైనా, పురుషులైనాసరే, పరిశుద్ధవర్తనం కలిగియుంటేనే ఓజశ్శక్తిని మేల్కొల్పి, మెదడులో కూడబెట్టగలుగుతారు. కాబట్టే బ్రహ్మచర్యాన్ని మహోత్తమం – అని కీర్తిస్తారు. బ్రహ్మచర్యం లేకపోతే, మన పారమార్థికత అంతా చెడిపోతుంది; మనోబలం క్షీణిస్తుంది; నైతికత దూరమౌతుంది. ఆధ్యాత్మిక మహిమాన్విత లోకోత్తర వ్యక్తులను ప్రపంచానికి అందించిన మత సంప్రదాయాలన్నీ బ్రహ్మచర్యాన్ని లక్షించటానికి కారణం ఇదే. వివాహాన్ని సన్యాసులు వదిలిపెట్టటానికి కారణం ఇదే.
మనోవాక్కాయకర్మలతో బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించాలి. అప్పుడే రాజయోగసాధన సత్ఫలితాల నిస్తుంది. లేదా హాని కలిగిస్తుంది; పిచ్చికి కారణమౌతుంది.
అయోగ్యజీవితాన్ని గడుపుతూ, రాజయోగసాధన చేసేవారు తాము యోగులు కావాలన్నా, ఎలా అవుతారు?