‘ప్రాణాయామ మంటే ‘శ్వాస’ విషయం’ అని చాలామంది అనుకుంటారు. కాని ఇది సరికాదు. ప్రాణాయామానికి శ్వాసకు సంబంధం ఉన్నా, అది చాలా అల్పం. నిజమైన ప్రాణాయామానికి శ్వాసనియమం కేవలం ఒక సాధన మాత్రమే; అంతకన్నా విశిష్ఠత దానికి లేదు.
ప్రాణాయామం అంటే ప్రాణనిరోధమని అర్థం. ఈ విశ్వమంతా రెండు తత్త్వాలతో నిర్మితమైందని హైందవ తాత్త్వికులంటారు. ఆ రెంటిలో ఒకటి ఆకాశం. ఆకాశం సర్వవ్యాపి, సర్వాంతర్గత పదార్థం. రూపమున్న ప్రతివస్తుమా, సంయోగజనిత ప్రతీ పదార్థం కూడా ఆకాశం నుండే వస్తున్నాయి. ఆకాశమే వాయువుగా మారుతోంది. ఆకాశమే ద్రవ, ఘన పదార్థాలుగా పరిణమిస్తోంది. ఆకాశమే భూ, సూర్య, చంద్ర, నక్షత్ర, ధూమకేతువులుగా అవుతోంది. ఆకాశమే మానవ, జంతు శరీరాలుగా, చెట్టూచేమలుగా రూపొందుతోంది. మనకు కనిపించే ప్రతి రూపం, ఇంద్రియగోచరమైన ప్రతి విషయం, అస్తిత్వం గల ప్రతివస్తుమా అన్నీ ఆకాశం నుండే ఉత్పన్నమౌతున్నాయి. ఆకాశం సూక్ష్మాతి సూక్ష్మం; అందుకని అది ఇంద్రియగోచరం కాదు. ఏదైనా స్థూలరూపం ధరిస్తేనే, దాని ఆకారాన్ని మనం చూడగల్గుతాం. ఆకాశం ఒక్కటే సృష్టి ప్రారంభంలో ఉన్న పదార్థం. కల్పాంతంలో ఘన, ద్రవ, వాయు పదార్థాలన్నీ మరల ఆకాశంలో లయించి పోతాయి. అలాగే ఆకాశం నుండి మరల ఈ సృష్టి అంతా బయటికి వస్తుంది.
ఆకాశం విశ్వంగా రూపొందటానికి ఏ శక్తి కారణం? అది ప్రాణశక్తి. ఆకాశం అనంతం, సర్వవ్యాపకం. అది జగత్తుసృష్టికి మూలపదార్థమైనట్లుగానే, ప్రాణం కూడా అనంతం, సర్వవ్యాపకం, జగత్తు యొక్క సృజనశక్తియై ఉంది. కల్పారంభంలో, కల్పాంతంలో అంతా ఆకాశమే ఉంటుంది, విశ్వంలోని శక్తులన్నీ ప్రాణం నుండే ఉత్పన్నమౌతుంటాయి. ‘గతి’ రూపంలో ప్రాణమే వ్యక్తమౌతోంది. అయస్కాంత, గురుత్వాకర్షణ శక్తుల రూపంలో ప్రాణమే ఉంది. శరీర కదలికలు, నాడీప్రవాహాలు, ఆలోచనలు అన్నీ ప్రాణ స్వరూపమే. మానసిక సంకల్పం నుండి అతిచిన్న కదలికకూ ప్రాణశక్తి వ్యక్తీకరణం జరుగుతుంది. మానసికశక్తులూ, భౌతికశక్తులూ, ప్రపంచంలోని ఇతర శక్తులూ – ఈ శక్తులన్నీ వాటి వాటి మూలస్థితిలోకి వెళ్తే అవన్నీ ప్రాణమే అవుతాయి.
“వస్తుమాలేని, శూన్యమూ కాని అంధకారంతో అంధకారం ఆవరితమైన ఆ సమయంలో అక్కడ మరి ఏముందీ? చలనం లేని ఆకాశమే సుమా!” ఆ దశలో ప్రాణంలో భౌతికచలనం ఉండదు; కానీ, ప్రాణం ఉంటుంది. విశ్వంలో ఇప్పుడు వ్యక్తమౌతున్న శక్తులన్నీ, కల్పాంతంలో సామ్యస్థితిని పొంది నిద్రాణమై ఉంటాయి. తర్వాతి కల్పారంభంలో అవి జాగృతమై ఆకాశంతో సంఘర్షిస్తాయి. అలా సంఘర్షించినప్పుడే రకరకాల రూపాలన్నీ బయటపడి, విశ్వంగా కనిపిస్తాయి. ఆకాశంలో మార్పు కలుగగానే, ప్రాణంలోనూ కదలిక ఏర్పడి, అది విశ్వశక్తుల రూపంలో వ్యక్తమవుతుంది. ఈ ప్రాణం గూర్చిన జ్ఞానం – ఈ ప్రాణవశీకరణమే సుమా, నిజంగా ప్రాణాయామము!
ప్రాణాయామం ద్వారా మనకు అపారశక్తి వశమౌతుంది.ప్రాణతత్త్వాన్ని దాని నిగ్రహాన్ని ఎవరైన సమగ్రంగా గ్రహించారనుకొందాం. ఇక అతనికి లభ్యంకాని శక్తులుంటాయా? అతనికి ప్రాణశక్తి స్వాధీనం కావటంవల్ల, అతను సూర్య చంద్ర నక్షత్రాలను కూడా క్రిందుమీదులు చేయగలడు. అణువు నుండి బ్రహ్మాండం వరకూ అన్నింటినీ అతను నిరోధించగలడు. ప్రాణాయామానికి పరమావధి ఇదే. పరిపూర్ణసిద్ధావస్థలో యోగికి వశం కానిదంటూ ప్రకృతిలో ఏదీ ఉండదు. అతను “ఇటు రండి” అని ఆజ్ఞాపిస్తే చాలు, దేవతలైనా, ప్రేతాలైనా వచ్చి తీరాల్సిందే. అతనికి ప్రకృతి శక్తులన్నీ బానిసలై పని చేస్తాయి. ఇలాంటి యోగశక్తులను చూసి అజ్ఞానులు ‘మహిమ’ అంటూ వీటిని పేర్కొంటారు. హైందవ మనసుకు ప్రత్యేకత ఒకటుంది; అది తనకు సాధ్యమైనంతవరకూ చిట్టచివరి సిద్ధాంతీకరణం కోసమే నిరంతరం పరిశోధన చేస్తూ ఉంటుంది. వివరాల గూర్చి తర్వాత పట్టించుకుంటుంది. “ఏది తెలిస్తే, అన్నీ తెలుస్తాయి?” అని వేదంలో ప్రశ్న వచ్చింది. గ్రంథాలన్నీ, తత్త్వశాస్త్రాలన్నీ కూడా జ్ఞానాలన్నీ ఏ ఒక్కదానివల్ల కలుగుతున్నాయో ఆ జ్ఞానాన్ని నిరూపించటానికే వెలువడ్డాయి. కొద్ది కొద్దిగా ఈ జగత్తును తెలుసుకోవాలనుకుంటే, ప్రతీ ఇసుక రేణువును గూర్చి తెలుసుకోవలసి ఉంటుంది. ఇది సాధ్యమయ్యేపని కాదు. మరి విశ్వం గూర్చిన విజ్ఞానం ఎలా లభిస్తుందీ? ప్రత్యేకాంశాలపై దృష్టిపెట్టి, విశ్వవ్యాప్త అంశాలన్నింటి పరిజ్ఞానాన్ని మనిషి ఎలా పొందగలడు? ప్రత్యేకభావం వెనక ఒక సిద్ధాంత ముంటుందని యోగులంటారు. దాన్ని తెలుసుకుంటే చాలు, అన్నీ తెలుస్తాయి. నామరూపాల కతీతమైన అద్వితీయ తత్త్వంగా ఈ విశ్వాన్ని వేదంలో సమీకరించారు. అలాగే శక్తులనన్నింటినీ ప్రాణంలోకి సమీకరించారు. ఆ అద్వితీయ వస్తువును గ్రహిస్తే, విశ్వమంతా గ్రాహ్యమవుతుంది. అలాగే ప్రాణతత్త్వాన్ని గ్రహిస్తేచాలు, విశ్వంలోని భౌతిక, మానసిక శక్తులన్నీ గ్రాహ్యమవుతాయి. ప్రాణశక్తిని వశం చేసుకున్న వ్యక్తి, తన మనసునే కాదు – అన్ని మనసులను స్వాధీనం చేసుకుంటాడు. అలాగే ప్రాణాన్ని వశం చేసుకున్న వ్యక్తి తన శరీరాన్నేకాదు, అన్ని శరీరాలను వశం చేసుకుంటాడు. ఎందుకంటే ప్రాణం శక్తి వ్యక్తీకరణకు మూలం.
ప్రాణాన్ని ఎలా వశం చేసుకోవాలి? అన్నదే ప్రాణాయామ పరమాశయం. ఈ ఆశయాన్ని సాధించటానికే సాధనలు, శిక్షణలన్నీ ఉన్నాయి. ప్రతివ్యక్తీ తానున్నచోటు నుండే మొదలుపెట్టాలి; తనకు చాలా దగ్గరిలో నున్నవాటిని స్వాధీనం చేసుకోవటానికి క్రమంగా పూనుకోవాలి. బయటి ప్రపంచంలో మనచుట్టూ ఎన్నో వస్తువులున్నాయి. అయితే వాటన్నింటికన్నా ఈ శరీరమే మనకు చాలా దగ్గర. శరీరంకన్నా ఈ మనసు మనకు ఇంకా ఎంతో దగ్గర. మనశ్శరీరాలకు ఆధారం ప్రాణం; ప్రపంచంలోని ప్రాణం కన్నా, మనలోని ప్రాణం మనకు మరింత దగ్గర. మన శారీరక, మానసిక శక్తుల సంపుటమే ఈ ప్రాణతరంగం. విశ్వంలోని ప్రాణమంతా అపారసముద్రం లాంటిది; ఉపాధిగత ప్రాణాలన్నీ అలల లాంటివి; ఆ అలలన్నింటికన్నా మనలోని ప్రాణతరంగం మనకు చాలా చాలా దగ్గర. ఈ ప్రాణ తరంగాన్ని వశం చేసుకుంటే తప్ప మొత్తం ప్రాణశక్తిని వశం చేసుకోలేము. ప్రాణాన్ని వశపరచుకున్న యోగి పరిపూర్ణుడౌతాడు. అతన్ని ఏ శక్తీ వశం చేసుకోలేదు. అతను సర్వశక్తి మంతుడౌతాడు. సర్వజ్ఞుడని కూడా చెప్పవచ్చు.
ప్రతి దేశంలో కూడా ప్రాణాన్ని వశం చేసుకునే సాధనాసంఘాలున్నాయి. ఈ దేశంలో, మానసిక చికిత్సకులు, విశ్వాస చికిత్సకులు, అధ్యాత్మవాదులు, క్రైస్తవ వైజ్ఞానికులు, సమ్మోహన శాస్త్రజ్ఞులు – ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. బాగా పరిశీలించి చూస్తే, వారికి తెలిసినా, తెలియకపోయినా ఈ సంఘాలన్నింటికీ మూలాధార శక్తి ప్రాణవశీకరణమే అని తెలుస్తుంది. వారి సిద్ధాంతాలన్నింటి సారాంశం ఈ ప్రాణవశీకరణమే. తమకు తెలియకుండా వీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. వారికి ఈ ప్రాణవశీకరణం యాదృచ్ఛికంగానే లభించింది, యోగి ప్రయోగించేది కూడా ఈ ప్రాణశక్తినే.
ప్రాణమే జీవశక్తి. అతిసూక్ష్మ అత్యున్నత ప్రాణ వ్యాపారమే మనోవృత్తి. మనకు సాధారణంగా అనుభవంలో నున్న మనోవ్యాపారమే కాక, ఇతర మనోవ్యాపారాలు కూడా ఉన్నాయి. సహజజ్ఞానం, బోధ లేకుండానే కలిగే జ్ఞానం అనేది ఇతర మనోవ్యాపారమే. ఈ మనోవ్యాపారం, మన మనోవృత్తులకు బీజావస్థ. మనలను ఒకదోమ కుడితే, వెంటనే చేయి సహజంగా ఆ ప్రదేశంపైకి వెళుతుంది. ఇది కూడా ఒక మనోవ్యాపార వ్యక్తీకరణమే. అసంకల్ప శారీరక క్రియలన్నీ, ఈ మనోవ్యాపారం క్రిందికి వస్తాయి. జ్ఞానయుక్త మనోవ్యాపారం మరొకటి. మనం కొన్నింటిని సహేతుకంగా విమర్శించి, ఆలోచించి, నిర్ణయిస్తూ లోతుగా పరిశీలిస్తుంటాం. ఇది సంకల్పయుక్త మనోవ్యాపారం.
హేతువిమర్శ కూడ పరిమితమే. ఇదికూడా మనకు తెలుసు. హేతువాదం తాత్త్వికవిచారణలో కొంతవరకు తోడ్పడుతుంది. ఆ మీద అది పనికిరాదు. దానికీ హద్దు ఉంది. అది పరిపూర్ణ ఆత్మజ్ఞానం కల్గించదు. నిజం ఏమిటంటే, హేతువాదం ఒక పరిధిలోనే తిరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సత్యాంశాలు ఈ హేతువాద పరిధిలోకి తోకచుక్కల్లా దూసుకు వస్తుంటాయి, హేతువాదం తన పరిధిని దాటదు; అయినా ఈ సత్యాంశాలు పరిధి అవతల వైపునుండి వస్తుంటాయి. తమంత తామే ఈ హేతువాద పరిధిలోకి వచ్చే ఈ సంఘటనలకు కారణం తెలియదు. అది హేతువాదానికి అందని కారణమై ఉంటుంది.
హేతువుకు మించిన ఉన్నత, అతీంద్రియ జ్ఞానావస్థను కూడా ఈ మనసు పొందుతుంది. ఈ అవస్థలో చిత్తం పూర్తిగా ఏకీకృతమై ఉంటుంది; అతీంద్రియ అనుభవంలో ఉంటుంది; దీన్ని సమాధి అంటారు. ఈ ‘సమాధి’ లో చిత్తం హేతువాదపరిధిని దాటుతుంది. తర్కంతోకూడా, సహజ పాండిత్యంతో కూడా తెలియని సత్యాన్ని, చిత్తం ఈ సమాధిలో దర్శిస్తుంది; ప్రత్యక్షంగా అనుభవిస్తుంది. శారీరక, మానసిక సూక్ష్మశక్తులన్నీ ప్రాణ రూపాలే; సాధనవల్ల, నియంత్రణవల్ల ఈ శక్తులు మనసును వికసింప చేస్తాయి; అతీంద్రియ జ్ఞానాన్ని దానికి కల్గిస్తాయి.
ఈ చరాచరాత్మక ప్రపంచంలో ఎక్కడ చూచినా అవిచ్ఛిన్న ఏక పదార్థమే కనిపిస్తుంది. ఈ విశ్వమంతా భౌతికంగా ఏకమై ఉంది; నీకూ, సూర్యునికి భేదమే లేదు. భేదముందని ఎవరైనా అంటే, అది కేవలం కల్పన అని చెబుతాడు ప్రకృతిశాస్త్రవేత్త. నిజంగా ఈ బల్లకూ, నాకూ భేదం లేదు. పదార్థ రాశిలో ఈ బల్ల ఒక బిందువు; నేను మరొక బిందువును. అనంత జడ జగత్సాగరంలో ప్రతిరూపం కూడా ఒక్కొక్క సుడిగుండమని చెప్పవచ్చు. ఈ రూపాల్లో ఏదీ స్థిరమైంది కాదు. నదీప్రవాహంలో కోట్లకొద్దీ సుడిగుండా లుండవచ్చును. అవి కొన్ని క్షణాలు వేగంగా సుడితిరిగి, అంతరించిపోతాయి. వాటి స్థానాన్ని కొత్తనీరు ఆక్రమిస్తుంది. ఇలా ప్రతి సుడిగుండంలో ఉన్న నీరు క్షణ క్షణం మారిపోతూ ఉంటుంది. జగత్తుకూడా ఇలాగే ఎప్పుడూ వికారం పొందే ఏకపదార్థంలో పుట్టినదే. దీనిలో ఉన్న రూపాలన్నీ అనేక సుడిగుండాలు. పదార్థం మానవశరీరం అనే సుడిలో ప్రవేశిస్తుంది; కొంతకాలం ఉంటుంది; మరల అదే జంతు శరీరం అనే మరొక సుడిలోకి వస్తుంది; అక్కడా కొంత కాలం ఉంటుంది; తర్వాత లోహం అనే సుడిలో చేరుతుంది. ఇలా నిరంతరం అది పరిభ్రమిస్తూనే ఉంటుంది, ఏ శరీరమైనా అస్థిరమే. ఊరికే అనుకోవటమే తప్ప నీ శరీరం – నా శరీరం అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. ఒకే బ్రహ్మాండ పదార్థ రాశిలో, ఒక బిందువును చంద్రు డంటున్నాం; అలాగే సూర్యుడని, భూమి అనీ, మనిషనీ, చెట్టనీ, పుట్టనీ ఇతర బిందువుల్ని పేర్కొంటున్నాం. పదార్థ రాశి శాశ్వతంగా ఏకత్వ – భిన్నత్త్వాల్ని పొందుతోంది. ఇలాంటి దశలో ‘స్థిర పదార్థం’ అన్నది ఏదీ ఉండే అవకాశం లేదు. ప్రతీది వికారం చెందుతోంది. మనసు కూడా పరిణతి చెందుతోంది. ఆకాశమే పదార్థమై ఉంది. ప్రాణం ఎంతో సూక్ష్మంగా చలిస్తున్నప్పుడు, చాలా అల్ప స్పందనం కలుగుతుంది; అలాంటి స్పందన స్థితిలో ఆకాశం మనసుగా మారుతుంది. ఆ స్థితిలో కూడా ఆకాశం అవిభాజ్యంగానే ఉంటుంది. మీరీ సూక్ష్మ స్పందన స్థితిని పొందగలిగితే, బ్రహ్మాండమంతా సూక్ష్మస్పందనలతో ఉన్నట్లు మీకు తెలుస్తుంది. కొన్ని మూలికల ప్రభావంతో కూడా జాగ్రత్తులోనే మన మీ అవస్థకు వెళ్ళవచ్చు. సర్ హంఫ్రీడేవీ అనే శాస్త్రవేత్త లాఫింగ్ గ్యాస్ అనే నవ్వు పుట్టించే వాయువును కనిపెట్టాడు; ఒకమారు దానిగూర్చి ఉపన్యాసం చేస్తూ, దాన్ని ఎక్కువగా పీల్చివేశాడు. దానితో అతను కొంతసేపు అలాగే స్తంభీభూతుడై నిలచిపోయాడు. దాని ప్రభావం నశించిన తర్వాత స్పృహలోకి వచ్చాడు. ఆ స్థితిలో తనకు జగత్తంతా భావాలతో నిండి ఉన్నట్లు తోచిందని చెప్పాడు. ఈ విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అతనికా స్థితి ఉన్నంతవరకూ, స్థూలస్పందనాలు ఆగిపోయి, భావాలనే సూక్ష్మస్పందనలే అతనికి అనుభూతమయ్యాయని కూడ మనం చెప్పవచ్చు. తనచుట్టూ ఉన్న సూక్ష్మస్పందనలనే అతను చూడగల్గాడు; అతని కంతా భావనామయంగానే కనిపించింది. ఈ ప్రపంచమంతా కూడా అతనికి ఒక భావనాసముద్రంగా తోచింది. ఆ సముద్రంలో తానేకాదు, సాటివారంతా, అన్నీకూడా భావాలనే చిన్న – చిన్న సుడిగుండాలైపోయారు.
కాబట్టి భావనాప్రపంచంలో కూడా మనకంతా ఏకత్త్వమే. ‘ఆత్మ’ స్థితికి వెళ్తే, ‘ఆత్మ ఎప్పటికీ ఒక్కటే’ – అని అప్పుడు తెలుస్తుంది. స్థూల, సూక్ష్మావస్థల్లో పదార్థరాశికి కలిగే చలనాల, స్పందనల కవతల ఒకే తత్త్వముంది. వ్యక్తమౌతున్న చలనంలో కూడా ఏకత్త్వమే ఉంది. కాబట్టి ఈ సత్యాలను మనం మిథ్య అని చెప్పలేము. విశ్వశక్తుల నన్నింటినీ సమీకరించి చూస్తే, వాటి ఫలితం ఎప్పుడూ ఒకేవిధంగా ఉంటుందని నేటి శాస్త్రవేత్తలు నిరూపించి వున్నారు. విశ్వశక్తి అంతా రెండవస్థల్లో ఉంటుందని వారు ధృవపరిచారు. అవ్యక్తమూలశక్తి, సామ్యావస్థను పొందుతుంది; తిరిగి రకరకాల శక్తులుగా వ్యక్తమవుతుంది; చివరికి మళ్ళీ అవ్యక్తస్థితిలోకి వెళుతుంది. మళ్ళీ వ్యక్త స్థితిలోకి వస్తుంది. ఇలా ఎప్పుడూ సంకోచ – వ్యాకోచాలకు లోనవుతూ ఉంటుంది. ఈ ప్రాణశక్తిని వశం చేసుకోవటమే, ప్రాణాయామం.
మనిషి దేహంలో ప్రాణచలనం, ఊపిరితిత్తుల కదలికలో స్పష్టంగాకనిపిస్తుంది. ఈ కదలిక ఆగిపోతే చాలు, శరీరంలోని ఇతర శక్తుల కదలికలన్నీ తప్పనిసరిగా ఆగిపోతాయి. అయితే, ఊపిరితిత్తులు పనిచేయటం మానివేసినా జీవించి ఉండగలిగే విధానం తెలిసినవారున్నారు. భూ గర్భంలో శ్వాసపీల్చకుండా చాలారోజులవరకూ బ్రతికి ఉండే వారున్నారు. సూక్ష్మావస్థను పొందటానికి మనం స్థూలావస్థసహాయం తీసుకోవాలి. అతిసూక్ష్మపరమార్థాన్ని సాధించేవరకూ మనం చాలాజాగ్రత్తగా ఉంటూ, వికాసం పొందాలి.
ఊపిరి తిత్తుల చలనాన్ని నిరోధించటమే ప్రాణాయామం. ఈ చలనం శ్వాసతో సంబంధం కలిగి ఉంటుంది; శ్వాస ఈ చలనాన్ని కలిగించదు. ఈ చలనం శ్వాసను కలిగిస్తుంది. ఊపిరితిత్తుల చలనమే శ్వాసకు కారణం. జలయంత్రంలా ఈ చలనం గాలిని లోనికి పీలుస్తూ, బయటికి వదులుతూ ఉంటుంది. ప్రాణమే ఊపిరి తిత్తులను కదిలిస్తూ ఉంటుంది. ఆ కదలిక ద్వారానే గాలి లోనికీ, బయటికీ వస్తూ పోతూ ఉంటుంది. కాబట్టి ఊపిరి పీల్చటం, వదలటం ప్రాణాయామం కాదని తెలుసుకోవాలి. ప్రాణశక్తి కండరశక్తిరూపంలో ఊపిరితిత్తుల్ని కదిలిస్తూ ఉంటుంది. ఈ ప్రాణశక్తిని వశం చేసుకోవటమే ప్రాణాయామం. నాడులనుండి కండరాల్లోకి వెళ్ళి, కండరాలనుండి ఊపిరితిత్తులను చేరి వాటిని కదిల్చే స్నాయుశక్తే ప్రాణశక్తి. ఈ ప్రాణాన్నే మనం ప్రాణాయామంలో నిరోధించాలి. ప్రాణం వశమైతే చాలు, మనోవ్యాపారాలన్నీ క్రమంగా స్వాధీనమౌతాయి. శరీరంలోని ప్రతి కండరాన్ని వశం చేసుకున్నవారిని నేను చూశాను. ఇది మనకు కూడా సాధ్యమే. కొన్ని కండరాలు మన స్వాధీనంలో ఉంటున్నాయి కదా, అలాంటిస్థితిలో శరీరంలోని కండరాలన్నీ, నాడులన్నీ మన కెందుకు స్వాధీనం కామా? మనకిప్పుడు ఈ స్వాధీనత లేకపోవటం వల్లనే, అవయవాలు స్వేచ్ఛాచలనానికి లోనయ్యాయి. మనం మన చెవుల్ని యథేచ్ఛగా కదల్చగలమా? జంతువులు ఈ పని చేస్తున్నాయి మరి. మనం వాడుకోవటం లేదు కాబట్టే, మనకీ శక్తి లోపించిపోయింది. ఇదే ‘ఎటవిజమ్’ అనే నూత్నశాస్త్రసిద్ధాంతం.
అవ్యక్తస్థితిలోని చలనాన్ని తిరిగి వ్యక్తావస్థకు తీసుకరావచ్చు; ఈ విషయం మనకు తెలుసు. కఠిన సాధన, పరిశ్రమలతో కొన్ని నిద్రాణశరీర వ్యాపారాలను తిరిగి పూర్తిగా మనం స్వాధీనం చేసుకోవచ్చు. బాగా పరిశీలించి చూస్తే, ఈ కార్యం మనకు అసాధ్యం కాదని తెలుస్తుంది. ప్రతీ అవయవాన్ని వశం చేసుకునేందుకు వీలుంది. ఈ కార్యాన్ని ప్రాణాయామంతో యోగులు సాధిస్తారు. ఊపిరిని పీల్చుకొన్నప్పుడు, శరీరాన్నంతా ప్రాణంతో పూరించాలని ప్రాణాయామ సాధనలో మీరు చదివే ఉంటారు. ఎలా పూరించటం? అని మీరు అడుగుతారేమో! ఆంగ్లానువాదంలో ప్రాణ మంటే ‘శ్వాస’ అని ఉంది. అది సరికాదు. శరీరంలోని ప్రతిభాగాన్ని కూడా ప్రాణశక్తితో నింపవచ్చు. అప్పుడు శరీరమంతా మీకు వశమౌతుంది. మీరు అన్ని వ్యాధులను, అన్ని బాధలను నివారించుకోగల్గుతారు. అంతేకాదు, ఇతరుల శరీరాల్ని కూడా స్వాధీనం చేసుకుంటారు.
ఈ ప్రపంచంలో మంచైనా, చెడైనా అంతా పరస్పరాశ్రయంతో కలుగుతోంది. తన స్థితిని ఇతరులకు కలుగచేయుట శరీర స్వభావం. మీరు బలంగా, ఆరోగ్యంగా ఉంటే, మీ సన్నిహితులు కూడా బలంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశముంది; అలాగే మీరు రోగగ్రస్థులై, బలహీనులై ఉంటే, వారు కూడా అలాగే మారే అవకాశం ఉంది. ఆరోగ్యవంతుడైన ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని మరొకరికి ఇవ్వటమే రోగనివారణలో మొదటి ఉపాయం. ముందుగా చేయవలసిన చికిత్స ఇదే. ప్రయత్నపూర్వకంగానో, అప్రయత్నం గానో మరొకరికి మనం ఆరోగ్యాన్ని బదిలీ చేయవచ్చు. ఒక బలవంతుని వద్ద ఒక బలహీనుడుంటే, తెలిసో తెలియకో ఆ బలవంతుడు, ఆ బలహీనునికి కొంత బలాన్ని చేకూరుస్తాడు. ఇలా ప్రయత్నపూర్వకంగా చేస్తే త్వరగా ఫలితం కలుగుతుంది. తాము స్వయంగా మంచి ఆరోగ్యంలో ఉండకపోయినా, ఇతరులకు ఆరోగ్యాన్ని కల్గించే సమర్థ వైద్యులు కూడా ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఇతరులకన్నా, చికిత్సకునికి ప్రాణశక్తి కాస్త ఎక్కువగా వశమై ఉంటుంది. ఆ ప్రాణాన్ని అతను ఒకానొక స్పందన స్థితికి తెచ్చి, దాన్ని మరొకరికి సంక్రమింపచేస్తాడు.
ఎదురుగా ఉండే రోగుల పైననేకాదు, సుదూరంగా ఉన్న రోగులపైన కూడా ఈ చికిత్సావిధానాన్ని ప్రయోగించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే నిజంగా దూరం అనేది ‘అంతరం’ అనే అర్థంలో ఎక్కడా లేదు. నీకూ సూర్యునికి మధ్య ఏమైన ఆంతరముందా? విశ్వమంతా అఖండ ఏకపదార్థ జనితమే కదా! దీన్లో సూర్యుడు ఒక అంశం, నుమ్వా ఒక అంశం. నదిలో ఒక అంశానికి, మరొక అంశానికి మధ్య విభజన అనేది ఉంటుందా? ఉండదని ఒప్పుకుంటే, మరి విద్యుచ్ఛక్తి ఒకచోటి నుండి మరోచోటికి వెళ్ళటానికి అభ్యంతర మేమిటీ? వెళ్ళదనటానికి తగిన కారణమేది లేదు. కాబట్టి దూరప్రదేశం నుండి రోగాన్ని తగ్గించటం యథార్థమే. సుదూర ప్రాంతం నుండి కూడా ప్రాణశక్తిని పంపవచ్చు. అయితే ఇలాంటి సంఘటనల్లో చాలావరకు మోసాలై ఉంటాయి. నూటికి ఒకటి నిజం కావచ్చు; మిగతావన్ని వంచనలే. అంతేకాదు ఇలాంటి చికిత్స మనమనుకొన్నంత సులభం కూడా కాదు. సర్వసాధారణంగా మానవదేహానికి సహజంగా ఉన్న ఆరోగ్యస్థితినే, చికిత్సకారులు ఇలాంటి విషయాల్లో రోగనివారణ సాధనంగా గ్రహిస్తుంటారు. అలోపతి డాక్టరు కలరా రోగికి తన మందిస్తాడు. హోమియో వైద్యుడు తన చికిత్స చేస్తాడు. హోమియో వైద్యుడు రోగికి ఎలాంటి అలజడి కల్గించడు; చికిత్సను ప్రకృతి కప్పగిస్తాడు. అందుకని అలోపతి వైద్యునికన్నా హోమియోపతి వైద్యుడు రోగాన్ని చక్కగా నివారించవచ్చు. విశ్యాసచికిత్సకుడు చికిత్స చేస్తే, అతను తన మనోబలాన్ని ఉపయోగిస్తాడు. రోగిలో విశ్యాసం పూరిస్తాడు; అతనిలోని నిద్రాణప్రాణశక్తిని జాగృతం చేస్తాడు. కాబట్టి హోమియో కన్నా మరింత సునాయాసంగా రోగాన్ని ఇతను నివారించగల్గుతాడు.
విశ్యాసచికిత్సకులు చాలాసార్లు ఒక ప్రమాదానికి లోనవుతుంటారు. విశ్యాసమే రోగాన్ని నయం చేస్తుందని వారనుకొంటారు. అయితే రోగం నయం కావటానికి విశ్యాస మొక్కటే కారణం కాదు. తనకు రోగమున్న విషయంకూడా తెలియని చావురోగాలు చాలా ఉన్నాయి. అప్పుడు “నాకు రోగం లేదు” అన్న అపారవిశ్యాసమే ఒక రోగలక్షణంగా మారి, రోగి మరణించే అవకాశముంది. ఇలాటి సందర్భాల్లో ‘విశ్వాసంతో రోగనివారణ’ అన్న సిద్ధాంతం పనిచేయదు. విశ్యాసమే రోగాన్నినయం చేస్తుందన్నదే నిజమైతే పై రోగికూడా రోగరహితు డయ్యేవాడు. నిజానికి ‘ప్రాణం’ వల్లే రోగనివారణ జరుగుతోంది. ప్రాణాన్ని వశం చేసుకున్న సాతత్త్యిక మనసుగల వా రెవరైనా ముందుగా ప్రాణాన్ని ఒక స్పందనస్థాయికి తెస్తాడు; తర్వాత దాన్ని ఇతరుల పైకి పంపుతాడు; వారిలో కూడా అలాంటి స్పందననే కలిగిస్తాడు. ఇది మనకందరికీ అనుభవంలోనున్న విషయమే. మీతో నేను మాట్లాడుతున్నప్పుడు, నేనేం చేస్తుంటానూ? నా మనసును ఒక స్పందనస్థాయికి తెస్తాను. అలా చేస్తున్నంతవరకూ, నా మాటలు మీ హృదయాన్ని చేరుతుంటాయి. నేను చాలా ఉత్సాహంగా చెప్పే రోజు, నా ఉపన్యాసం మీకెంతో నచ్చుతుంది. అంతగా ఉత్సాహం లేకుండా చెబుతుంటే, ఆ ఉపన్యాసం మీకంతగా రుచించదు. ఇది మీ కందరికీ అనుభవమే కదా!
మహాపురుషులు తమ తీవ్రసంకల్పశక్తితో ప్రపంచంలో మార్పులు తెస్తుంటారు. తమ ప్రాణశక్తిని ఉన్నతస్పందన స్థాయికి తెచ్చేందుకు వారికి సామర్థ్యముంటుంది. వారి సంకల్పం, క్షణమాత్రంలో ఇతరులకు సంక్రమించే సామర్థ్యం కలిగియుంటుంది. అందుకే వేలాదిమంది వారివైపు ఆకర్షితులౌతారు. ప్రపంచంలోని సగభాగం, వారెలా ఆలోచిస్తుంటారో అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప ప్రవక్తల కందరికీ అద్భుతప్రాణవశీకరణ ముంటుంది. దానివల్లే వారికి అద్వితీయ సంకల్పశక్తి ప్రాప్తించింది. తమ ప్రాణశక్తిని ఎంతో ఉన్నత స్పందనస్థాయికి తెచ్చేవారు కాబట్టే, వారు ప్రపంచాన్నంతా ఉర్రూతలూగించారు. ప్రాణవశీకరణం వల్లే రకరకాల శక్తులు వ్యక్తమౌతున్నాయి. జనులకీ రహస్యం తెలిసినా, తెలియకపోయినా, ఒకరి శక్తిసామర్థ్యాలకు కారణం ప్రాణాన్ని వశం చేసుకోవటమే.
మన దేహంలో ఒక్కొక్కసారి, ప్రాణశక్తి ఒకభాగానికి ఎక్కువో, తక్కువో ప్రసరిస్తుంది; దాంతో దేహసామ్యావస్థ చెడుతుంది. అలా చెడటమే రోగం. ఇక ఎక్కువగానున్న ప్రాణాన్ని తొలగించటమో, లేదా తక్కువుంటే పూరించటమో చేయటమే రోగనివారణ. ఇదే ప్రాణాయామం. దేహంలో ఒకభాగంలో ప్రాణశక్తి ఉండవలసినదానికన్నా ఎక్కువగా ఉందో, తక్కువగా ఉందో తెలుసుకోవటమే ప్రాణాయామం. కాలివ్రేలిలో కానీ, చేతివ్రేలిలో కానీ ప్రాణం తక్కువగా ఉంది – అని గ్రహించే సూక్ష్మదృక్శక్తి మనసుకు ఏర్పడటం; అవసరమైనంతమేరకు ప్రాణాన్ని సమకూర్చే సామర్థ్యం కలగటం; – ఇవి ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాల్లో కొన్ని.
ప్రాణాయామ సాధనలను క్రమంగా అభ్యాసం చేయాలి. ప్రాణశక్తిని వశం చేసుకోవటం; వివిధ మనోస్థాయిల్లో దాన్ని ప్రసరింపచేయటం; ఇదే రాజయోగ ప్రధానాశయమని చెప్పవచ్చు. మనిషి తన శక్తుల నన్నింటినీ ఏకాగ్రం చేస్తే, శరీరంలోని ప్రాణశక్తి అతనికి వశమౌతుంది. ధ్యానంలో మనం ప్రాణాన్నే కేంద్రీకరిస్తుంటాం.
సముద్రంలో పెద్ద పెద్ద కెరటాలూ, మామూలు తరంగాలూ, చిన్న చిన్న అలలూ, బుడగలూ ఎన్నో ఉంటాయి. అయితే వీటన్నింటికీ సువిశాల సముద్రమే ఆధారం. బుడగలూ, ఎతైన కెరటాలూ రెండూ ఒకే సముద్రంతో సంబంధం కలిగియుంటాయి. అలాగే ఒక వ్యక్తి గొప్పశక్తియుతుడై ఉండవచ్చు; మరో వ్యక్తి అల్పశక్తిమంతుడై ఉండవచ్చు; అయితే ఇద్దరూ అనంతశక్తిసాగరానికి సంబంధించినవారే. ఆ అనంతశక్తిసాగరమే ఈశ్వరుడు. ఈ ఈశ్వరుణ్ణి పొందేందుకు ప్రతి జీవికీ హక్కుంది. చైతన్యం ఎక్కడ ప్రకాశిస్తున్నా, దాని వెనుక అనంతశక్తి తప్పక ఉంటుంది. ఒక సూక్ష్మాతిసూక్ష్మ క్రిమి ఉంది. అది ఈ అనంతశక్తి నుండే జీవశక్తిని గ్రహిస్తుంది. క్రమంగా రూపాన్ని మార్చుకుంటుంది. మొక్క అవుతుంది; తర్వాత జంతువౌతుంది; చివరికి మనిషిగా పరిణమిస్తుంది. ఆ తర్వాత అది భగవంతుడే అయిపోతుంది. ఇంత పెద్దకార్యం జరగటానికి కోట్లాది యుగాలు పట్టవచ్చు. అయితే కాలం మనకో లెక్కకాదు. తీవ్రసాధనవల్ల కాలాన్ని తగ్గించుకోవచ్చు. కార్యదీక్ష ఉంటే, ఎంతో కాలానికిగాని నెరవేరని కార్యాన్ని, నిముషాల్లో సాధించవచ్చని యోగులంటారు. ఒకవ్యక్తి ఈ అనంతశక్తిని చాలా కొద్ది కొద్దిగా గ్రహిస్తూ వచ్చాడనుకుందాం; అప్పుడతను దేవత్వం పొందటానికి అతనికి లక్ష సంవత్సరాలు పడతాయి. ఇంద్రత్వానికి ఐదులక్షల సం. లు పట్టవచ్చు. చివరికి అఖండ పరిపూర్ణ సచ్చిదానంద స్థితిని పొందటానికి అతనికి ఐదుకోట్ల సంవత్సరాలు పట్టినా పట్టవచ్చు. త్వరితగతిలో అభివృద్ధి జరిగితే, కాలపరిమితి తగ్గుతుంది. తీవ్రదీక్షతో సాధన చేస్తే, ఆరేండ్లకు లేదా ఆర్నెల్లకే ఈ పరిపూర్ణస్థితిని ఎందుకు పొందలేం? పరిశీలిస్తే దీనికి ‘ఇంతకాలం’ అంటూ లేదని తెలుస్తుంది. ఒక యంత్రం కొంతబొగ్గుతో గంటకు రెండు మైళ్ళు పోతుంది; అంతకన్నా ఎక్కువ బొగ్గుతో అది ఆ దూరాన్ని మరింత తక్కువ సమయంలో వెళ్ళగలదు కదా! కాబట్టి తీవ్రాతితీవ్రంగా సాధన చేస్తే, మనిషి ఈ జన్మలోనే పరిపూర్ణుడౌతాడు. చిట్టచివరికి ప్రతి జీవి ఆ పరిపూర్ణస్థితిని పొందుతుంది; నిజమే. కాని దీనికోసం యుగాల పర్యంతం ఎందుకు కాచుకుని ఉండాలి? ఈ జన్మలోనే, ఇప్పుడే ఎందుకు ఆ పరిపూర్ణతను పొందకూడదూ? ఆ అనంత జ్ఞాన – శక్తుల్ని ఎందుకు కైవసం చేసుకోకూడదూ?
నత్తనడకతో అడుగులో అడుగువేస్తూ, మానవజాతికి అంతా ముక్తి లభించేంతవరకూ వేచియుండటం కన్నా, తీక్షణ గ్రహణశక్తితో వేగంగా కొద్దిసమయంలోనే ఆ పరిపూర్ణతను సాధించే అవకాశము ఉన్నది. ఆ విధానాన్ని బోధించటమే యోగుల మరియు యోగశాస్త్ర ఆశయం. ఈ ప్రపంచంలో మహాప్రవక్తలు, మహర్షులు, తత్త్వదర్శులు చేసిందేమిటి? మానవకోటి ఆయుః ప్రమాణాన్నంతా ఒకే జీవితకాలంలో జీవించారు; ఒకే జీవితకాలంలో వారు పరిపూర్ణులయ్యారు. కారణం మోక్షేచ్ఛను మించి మరో చింత ఉండదు వారికి. ఒక్క క్షణాన్ని కూడా మరోచింతకోసం ఖర్చుపెట్టరు, అందుకే శీఘ్రంగా మోక్షం వారి కందుతుంది.
ఏకాగ్రత అంటే ఏమిటీ? గ్రహణశక్తిని తీక్షణం చేయటం. కార్యసాధనకు కావలసిన కాలపరిమితిని తగ్గించటం. ఇలాంటి చిత్త ఏకాగ్రతను ఎలా పొందాలో చెప్పేదే రాజయోగం.
ప్రాణాయామానికి అధ్యాత్మవాదానికి సంబంధ మేమిటీ? అధ్యాత్మవాదం కూడా ప్రాణాయామ వ్యక్తీకరణమే. పితరులు (ప్రేతాలు) ఉండటం నిజమైతే, మనం వారిని చూడకపోయినా, మన చుట్టూతా వేల -లక్షల సంఖ్యలో వారుండే అవకాశ ముంది. మనం వారిని చూడలేం, ముట్టుకోలేం – అంతే. ఇది అసంభవం అనటానికి కారణమేదీలేదు. వారి శరీరాల నుండి మనం అనుక్షణం వస్తూ పోతూ తిరుగుతూ ఉండవచ్చు. వారు కూడా మనల్ని చూడరు, ముట్టరు. ఒక వలయంలో మరోవలయం ఉండడంలాంటి స్థితి ఇది; విశ్వంలో మరోవిశ్వం ఉండడం లాంటిది. పంచేంద్రియాలున్న మనకు ప్రాణం ఒక స్పందనస్థాయిలో ఉంది. ఈ స్థాయిలో ఉండే జీవులన్నీ పరస్పరం చూసుకొంటాయి, స్పర్శించు కొంటాయి. అయితే ఈ స్థాయికన్నా మించిన స్థాయిలో ఉండే జీవుల్ని ఇవి చూడలేవు. ఒక దీపం ఉంది. దాని కాంతిని పెంచుతూ వెడితే, మన మిక చూడజాలనంత స్థాయికి ఆ కాంతిని పెంచితే, అప్పుడు ఆ కాంతిని మనం చూడలేం. కాని అంత తీక్షణ కాంతిని కూడా చూసే జీవులు ఉంటాయి. అలాగే చాలా చాలా తక్కువ కాంతిని కూడా మనం చూడలేం. అయితే గుడ్లగూబలు – పిల్లులు లాంటి నిశాచరాలు ఆ కాంతిని చూడగల్గుతాయి. ఒక పరిమితిలోని ప్రాణ స్పందనాలనే మనం గుర్తించగలం. వాతావరణ విషయమే చూద్దాం. వాతావరణంలో అనేక పొరలున్నాయి. భూమికి చేరువలో నుండే పొరల సాంద్రత, దూరంగా ఉండే వాటికన్నా ఎక్కువ. పైకిపోయిన కొద్దీ అంటే భూమికి దూరమవుతున్న కొద్దీ, వాతావరణం తేలికగా మారిపోతూ ఉంటుంది. సముద్రం విషయం కూడా ఇంతే. లోపలికి పోతున్నకొద్దీ నీటి సాంద్రత పెరిగి, ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. సముద్రపుటడుగున ఉండే జలచరాలు, ఉపరితలానికి ఎప్పుడూ రావు. వస్తే చనిపోతాయి.
విశ్వాన్ని ఆకాశసాగరంగా భావించండి. ఈ ఆకాశంలో ప్రాణవ్యాపారం కారణంగా వివిధ స్పందనస్థాయిల్లో పొరలున్నాయను కోండి. ఆ దశలో, కేంద్రానికి దూరంగా ఉండే స్పందనలు మందంగా ఉంటాయి. దగ్గరిగా ఉండేవి ఒకదానికన్నా మరొకటి తీవ్రంగా ఉంటాయి. ఒకే రకం స్పందనాలు ఒక మండలంగా ఏర్పడతాయి. ఇక కొన్ని కోట్ల మైళ్ళవరకూ ఒకరకం స్పందనాలుంటాయని, ఆ తర్వాత మరికొన్ని కోట్లమైళ్ళ వరకూ మరోరకం ఉన్నత స్పందనాలుంటాయని భావించండి. ఇలా రకరకాల మండలాలున్నాయనుకోండి. ఒకే మండలంలోనున్న జీవులు పరస్పరం గుర్తించుకుంటాయి. అయితే తమకు పైనున్న మండల జీవులను అవి గుర్తించలేవు. కాని దూరదర్శిని – సూక్ష్మదర్శిని యంత్రాలతో మన చూపును పెంచుకోవచ్చు; మామూలు కంటితో చూడలేనివాటిని ఈ యంత్రసహాయంతో చూడవచ్చు. అలాగే యోగశక్తితో మరోమండలంలోని స్పందనస్థాయిని మనం పొందవచ్చు; అక్కడ జరిగే సంఘటనలను చూడవచ్చు.
మనకు కనిపించని జీవులతో ఈ గది నిండి ఉందనుకోండి. అప్పుడు మనం ఒక స్పందనస్థాయిలో, అవి మరో స్పందనస్థాయిలో ఉంటాయి. వాటి స్పందనస్థాయి సూక్ష్మం, మనది స్థూలం అనుకుందాం. అవీ, మనం కూడా ఒకే ప్రాణతత్త్వంతో నిర్మితమై ఉన్నాం. అంతా ఒకే ప్రాణసాగరంలోనివారే. స్పందనస్థాయిల్లో మాత్రమే వాటికీ మనకూ తేడాలున్నాయి. నేను సూక్ష్మమండల స్థాయిని పొందగల్గితే, నా కీ మండలం కనిపించదు. నేను మిమ్మల్ని చూడలేను. మీరు కనిపించరు; పై మండల జీవులు నాకు కనిపిస్తాయి. ఇది సత్యమే అని మీలో కొందరికైనా తెలిసే ఉంటుంది. మనసుకు ఉన్నతస్పందనస్థాయిని కల్గించే ప్రక్రియ అంతా “సమాధి” అనే మాటలో, యోగంలో ఇమిడి ఉంది. ఉన్నతస్పందనస్థాయిలన్నీ – అతీంద్రియ జ్ఞాన స్పందనలన్నీ ‘సమాధి’ అనే మాటలో చేరిపోతాయి. సామాన్య సమాధిస్థితుల్లో దివ్యదర్శనాలు కలుగుతాయి. విశ్వంలోని చరాచరజీవులన్నీ దేనినుండి వస్తున్నాయో, దేన్ని కనుగొంటే సర్వం తెలుస్తుందో, ఆ సచ్చిదానందతత్త్వ సాక్షాత్కారాన్ని కలిగించేదే అత్యున్నత సమాధి.
కాబట్టి అధ్యాత్మవాదంలోని సత్యాలన్నీ ప్రాణాయామంలో ఇమిడి ఉన్నాయి. ఒక సమాజం లేదా ఒక సంఘం ఒక రహస్యాన్ని తెలుసుకోవటానికై ప్రయత్నిస్తుంటే, ఆ ప్రయత్నమంతా యోగమే; ప్రాణవశీకరణమే. అసాధారణశక్తి ఎక్కడ వ్యక్తమైనా, అది ప్రాణశక్తే. భౌతిక విజ్ఞానాన్ని కూడా ప్రాణాయామంలో చేర్చవచ్చు. ఆవిరియంత్రం దేనితోనడుస్తోంది? ప్రాణశక్తివల్లే. విద్యుత్తులాంటి ప్రకృతిశక్తులన్నీ ప్రాణశక్తి రూపాలే. భౌతికవిజ్ఞానము అంటే ఏమిటీ? బాహ్యసాధనలతో వ్యక్తమయ్యే ప్రాణాయామమే. మానసిక శక్తిరూపంలో వ్యక్తమయ్యే ప్రాణాన్ని, మానసిక సాధనతోనే నిరోధించాలి. భౌతికశక్తిరూపంలో వ్యక్తమయ్యే ప్రాణాన్ని, భౌతిక సాధనలతో నిరోధించే ప్రాణాయామ భాగాన్ని భౌతికశాస్త్రము అని అంటాము. మానసికశక్తిరూపంలో వ్యక్తమయ్యే ప్రాణాన్ని మానసిక సాధనతో నిరోధించే ప్రాణాయామ భాగాన్ని రాజయోగము అంటాము.