రాజయోగాన్ని అష్టాంగాలుగా విభజించారు. మొదటిది ‘యమం’. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే నియమాలు దీని క్రిందికి వస్తాయి. రెండవ అంగం ‘నియమం’. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం అనే విధులు నియమంలో ఉంటాయి. మూడవది ‘ఆసనం.’ ప్రాణాయామం నాల్గవది. ఐదవది ప్రత్యాహారం. బాహ్యవిషయాలైన శబ్దాదుల నుండి ఇంద్రియాలను వెనక్కి మరల్చుట ప్రత్యాహారం. ‘ధారణ’ ఆరవది. ఒకే ఒక విషయంలో మనసును నిలుపుట ధారణ. ఏడవది ‘ధ్యానం.’ ఎనిమిదవది, చివరిది అయిన అంగం ‘సమాధి.’
నైతిక వర్తనాన్ని బోధించేందుకు ఏర్పడిన విధులు యమ, నియమాలు. యోగసాధన అనే భవంతికి ఇవి రెండూ పునాదులు. యమ నియమాలను చక్కగా సిద్ధిస్తే, యోగి తన సాధనాఫలితాలను అనుభవించటం మొదలు పెడతాడు. యోగి, తన మనసు, వాక్కు, కర్మ, ఈ మూడింటిలో ఏ ఒక్కదానితో కూడా ఎవరికీ ఎలాంటి హింసను కల్గించాలని అనుకోరాదు. సాటి మనుషులయందే కాదు, అన్ని ప్రాణులందు కూడా, మొత్తం ప్రపంచమందు కూడా, యోగి దయ కలిగి ప్రవర్తించాలి.
ఇక ఆసనం. సాధకుడు కొన్ని ఉన్నత స్థితులు పొందేవరకూ, మొదట్లో శారీరకంగా, మానసికంగా ప్రతిరోజూ కొన్ని అభ్యాసాలు విధిగా చేయవలసి ఉంటుంది. ఆసనం ఈ అభ్యాసాలకు అవసరమవుతుంది.కాబట్టి సాధకుడు తనకు అనుకూలమైన ఆసనాన్ని ఎన్నుకోవాలి. ఏ ఆసనంలో తాను స్థిరంగా, సుఖంగా, చాలా కాలం కూర్చుండగలడో, ఆ ఆసనం తనకు అనుకూలం. అలాంటి సుఖ, స్థిర, సులభసాధ్య ఆసనాన్ని ఎన్నుకొని, అభ్యాసం కొనసాగించాలి. ఒకరికి సులభంగా ఉండే ఆసనం మరొకరికి కష్టంగా ఉండవచ్చు.
మానసిక విషయాల గూర్చి శ్రమించే టప్పుడు, శరీరంలో విశేష సంచలనం కలుగుతుంది; ఈ విషయం ముందు ముందు బాగా తెలుసుకుందాం. పాతబాటల్లో ఉండే నాడుల్ని, కొత్తబాటల్లోకి మరల్చవలసి ఉంటుంది. ఈ నాడుల్లో కొత్తస్పందనాలు జనిస్తాయి; అప్పుడు శరీరస్వభావం పూర్తిగా మారిపోయే అవకాశముంది. ఈ ప్రక్రియ అంతా చాలావరకు సుషుమ్నా నాడికి సంబంధించి ఉంటుంది. సుషుమ్నా వెన్నెముక మధ్యలోనుండే ప్రధాన నాడి. ఈ నాడిలో అవరోధం కలగకుండా శరీరాన్ని నిటారుగా నిలుపవలసి ఉంటుంది. కాబట్టి తల, మెడ, వక్షం, వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవటమే ఆసనంలో ముఖ్యవిషయం. వెన్నెముకను నిటారుగా నిలిపి శరీరభారాన్నంతా ప్రక్క ఎముకల మీద పడేలా కూర్చుంటే, స్వాభావిక ఆసనం మీకు సిద్ధిస్తుంది. ఎదను వంచిపెట్టినప్పుడు, మనము అంతగా ఉన్నత భావాలను భావించజాలమన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది.
హఠయోగం పూర్తిగా స్థూలశరీర సంబంధమైన సాధన. స్థూల శరీరాన్ని బాగా బలంగా, శక్తివంతంగా చేయటమే ఈ యోగ ఆశయం. అలాంటి హఠయోగానికి, రాజయోగంలోని ఈ (ఆసన) భాగం చాలా దగ్గరగా ఉంటుంది. హఠయోగంలోని సాధనలన్నీ చాలా కష్టసాధ్యంగా ఉంటాయి. చాలాకాలం వరకు వాటిని అభ్యాసం చెయ్యాల్సి ఉంటుంది. ఎలాగో కష్టపడి వాటిని సాధించినా, మన ఆధ్యాత్మిక వికాసానికి అవి అంతగా సహకరించవు. కాబట్టి మనకు ఈ హఠయోగం అవసరం లేదు. హఠయోగంలో రకరకాల ఆసనాల అభ్యాసాలున్నాయి; ‘డెల్సార్టె’ దొర, ఇతర బోధకులు కొందరు వీటిగూర్చి బోధించటం మీరు వినే ఉంటారు. అయితే ఈ ఆసనాల ముఖ్యోద్దేశం శారీరిక వికాసమే, మానసిక వికాసం ఎంతమాత్రం కాదు. హఠయోగంతో శరీరంలోని ప్రతీకండరాన్ని మన వశం చేసుకోవచ్చు. హఠయోగానికి లొంగని కండరం లేనేలేదు. అనుకున్న వెంటనే మనం గుండెను ఆపివేయవచ్చు; మరల పని చేయనివ్వవచ్చు. శరీరంలోని ప్రతీ అవయవాన్ని ఇలాగే మన ఇష్టం వచ్చినట్లు ఆడించవచ్చు.
మనిషి దీర్ఘకాలం ఆరోగ్యంగా బ్రతకటమే ఈ హఠయోగ ఫలితం. హఠయోగులకు శరీర ఆరోగ్యమే ప్రధాన ఆశయం; పరమగమ్యం. ‘నేను రోగిని కాబోను’ అని హఠయోగి ప్రతిజ్ఞ చేస్తాడు. అతనికి ఆరోగ్యం చెడిపోదు; అతను చాలాకాలం జీవిస్తాడు. వంద సంవత్సరాల ఆయువు అతనికి ఒక లెక్కలోకిరాదు. నూటాఏభయ్యవ ఏట కూడా, ఒక్క వెంట్రుక కూడా నెరవకుండా, హఠయోగి తరుణప్రాయంలో ఉండగలడు. హఠయోగిలో ఇంతకన్నా మరే విశేషం ఉండదు. ఒక మర్రిచెట్టు ఐదువేల సంవత్సరాల వరకూ జీవిస్తుంది. అయినా అంతకాలం గడిచినా అది మర్రిచెట్టుగానే ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలం ఒకరు జీవిస్తే, అతను ఆరోగ్యవంతమైన జంతువనే చెప్పాలి. ఎందుకంటే జంతువులు తక్కువగా జబ్బుపడతాయి.
అయితే హఠయోగ సాధనల్లో మనకు పనికివచ్చేవి ఒకటి రెండున్నాయి. ఉదయం లేచినవెంటనే ముక్కు రంధ్రం ద్వారా చల్లని నీరు పీలిస్తే, తలనొప్పి పోతుంది. ఆ రోజంతా మీ మెదడు చల్లగా, హాయిగా ఉంటుంది. మీకు ఎప్పటికీ జలుబు చేయదు. ఈ ప్రయోగాన్ని మీరూ చేసి చూడవచ్చు. ఇది చాలా సులభం. నీటిలో ముక్కునుంచండి; ఆ నీటిని ఒక రంధ్రంతో పీల్చండి; గొంతువరకూ ఆ నీటిని తీసుకురండి; తర్వాత రెండవ రంధ్రం ద్వారా, ఆ నీటిని బయటికి వదలండి.*
స్థిరాసనం సిద్ధించిన తర్వాత, నాడీశౌచక్రియ చేయాలని కొందరు రాజయోగులంటారు. మరికొందరు ఈ క్రియ రాజయోగానికి సంబంధించింది కాదంటూ దీన్ని నిరాకరిస్తారు. అయితే శంకరాచార్యులంతటి ప్రామాణిక భాష్యకారులే ఈ క్రియను అంగీకరించారు; కాబట్టి దాన్ని మీకు తెలపటం సముచితమని అనుకుంటున్నాను. శ్వేతాశ్వతరోపనిషత్తుకు భాష్యం రాస్తూ శంకరులు ఈ సాధనను వివరించారు. “ప్రాణాయామంతో మనసు నిర్మలం కావటంతో, అది బ్రహ్మంలో నిలుస్తుంది. కాబట్టి ప్రాణాయామం తప్పనిసరి. ముందుగా నాడీశుద్ధి చేయాలి; ఆ తర్వాతే ప్రాణాయామం చేసే సామర్థ్యం లభిస్తుంది. మొదట కుడిముక్కును బొటనవ్రేలితో మూయాలి. తర్వాత ఎడమముక్కు ద్వారా యథాశక్తిగా నిండుగా గాలిని పీల్చాలి. వెంటనే, ఆలస్యం చేయకుండా, కుడిముక్కు ద్వారా పీల్చిన గాలిని నెమ్మదిగా వదలిపెట్టాలి. అప్పుడు ఎడమ ముక్కును మూసి, కుడిముక్కు ద్వారా గాలిపీల్చి, ఎడమ ముక్కుద్వారా వదలిపెట్టాలి. ఈ క్రియను తెల్లవారుజామున, పగలు, సాయంకాలం, రాత్రి – ఈ నాల్గు సమయాల్లో చేయాలి. ప్రతీ సమయంలో ఈ క్రియను మూడునుంచి ఐదు పర్యాయాలు చేస్తుండాలి. ఇలా ఒక పక్షం లేదా ఒక నెలరోజులు చేస్తే, నాడీశౌచం సిద్ధిస్తుంది. అప్పుడు ప్రాణాయామం మొదలవుతుంది.”
సాధన తప్పకచేయాలి. ప్రతిరోజూ వేళకు వచ్చి మీరంతా నా మాటలు శ్రద్ధగా వినవచ్చు. కాని సాధన చేయకపోతే, మీ రొక్క అడుగైనా ముందుకు వేయలేరు. రాజయోగమంతా అభ్యాసంపై ఆధారపడి యుంది. అనుభవం కలగనిదే, ఈ రాజయోగ విషయాలు మనకు అర్థం కావు. ఈ యోగంలోని సత్యాసత్యాలను మనం స్వానుభవంతో కనుగొనాల్సి ఉంటుంది. కేవలం పూర్వపక్షసిద్ధాంతాలను వింటే లాభం లేదు.
సాధనలో ఎన్నో ఆటంకాలుంటాయి. అనారోగ్యశరీరం మొదటి ఆటంకం. శరీరం సరైన స్థితిలో లేకుంటే సాధన సరిగా కొనసాగదు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి; ఆహార, విహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి. సాధారణంగా ‘క్రైస్తవ విజ్ఞానం (క్రిస్టియన్ సైన్స్)’ అనే మానసిక యత్నాన్ని, శరీరారోగ్య సంరక్షణకోసం ఉపయోగించుకోవచ్చు. శరీరం విషయం ఇంతకన్నా ఎక్కువగా చెప్పుకోవటం అనవసరం. మనకు ఆరోగ్యం మాత్రమే పురుషార్థం కాదు. పురుషార్థసాధనకు ఇది ఉపయోగపడుతుంది; అంతే. ఆరోగ్యమే పరమపురుషార్థమైతే, మనమంతా మృగప్రాయులమై ఉంటాం; ఎందుకంటే, జంతువులకు ఆరోగ్యం చెడటం చాలా అరుదు.
యోగసాధనలో రెండవ ఆటంకం ‘సంశయం.’ మన మెంత ప్రయత్నించినా సరే, మనం స్వయంగా చూడని విషయాల గూర్చి, మన కెప్పటికీ సందేహంగానే ఉంటుంది. మాటలతో రాజీపడటం మనవల్ల కాదు. కాబట్టి ‘ఈ యోగవిషయాల్లో ఎంత సత్యముందీ?’ అని మనకు తప్పక సంశయం కలుగుతుంది. మనకు మాత్రమే కాదు; మనలో ఆరితేరినవారికి కూడా ఇలాంటి సందేహం అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే సాధన కొనసాగిస్తుంటే, కొన్ని దినాల్లోనే యోగంలోని సత్యం కొద్ది కొద్దిగా తెలుస్తుంది. సాధనను ధైర్యంగా, ఉత్సాహంగా ముందుకు కొనసాగించటానికి ఈ కొద్దిపాటి అనుభవం చాలు. ఒక యోగభాష్యకర్త చెప్పినట్లు, ‘ఒక్క చిన్న నిదర్శనం చాలు, మొత్తం యోగశాస్త్రంలో విశ్వాసం కలగటానికి.’ ఉదాహరణకి ఒకటి రెండు నిదర్శనాల గురించి చెప్పుకుందాం. మీరు సాధన చేస్తూ కొన్ని నెలలు గడిపారు; అప్పుడు ఇతరుల మానసిక ఆలోచనలను స్వప్నంగా చూడగల్గుతారు. ఇతరుల ఆలోచనలు, భావాలు చిత్రంలోలా మీకు కన్నులకు కట్టినట్లు కనిపిస్తాయి. మీరు ‘వినాలి’ అనే సంకల్పంతో చిత్తాన్ని ఏకాగ్రం చేస్తే, చాలాదూరంలో నున్న శబ్దాలు, ధ్వనులు మీకు వినిపిస్తాయి. ఇలాంటివి మొదట్లో చాలా అస్పష్టంగా మీకనుభవం కావచ్చు; కాని, ఈ మాత్రం అనుభవం మీకు ధైర్య, బల, విశ్వాసాలను కల్గిస్తుంది. మరో ఉదాహరణ తీసుకుందాం. మీ చిత్తాన్ని నాసికాగ్రంపై కేంద్రీకరించే సాధన చేయండి; కొద్దిరోజుల్లోనే మీకు దివ్యసువాసన వేస్తూ ఉంటుంది. దీన్నిబట్టి, భౌతిక పదార్థ సంసర్గం లేకపోయినా మనకు విషయానుభవాలు స్పష్టంగా కలిగే వీలున్నదని తెలుస్తున్నది కదా! ఒక్కమాట; రాజయోగ సాధనకు కేవలం మోక్షమే ఆదర్శం, అదే పరమగమ్యం, అదే పరమ ప్రయోజనం అన్న విషయాన్ని ఎవ్వరూ మరచిపోవద్దు. యోగసిద్ధులన్నీ సాధనామార్గంలో లభించే ఫలాలన్న విషయం కూడా మరవద్దు. నిరంకుశ ప్రకృతిని వశం చేసుకోవటమే మీ లక్ష్యం. ప్రకృతికి మనం బానిసలం కావద్దు; అధిపతులం కావాలి. మనసు, శరీరం ఈ రెంటిలో ఏదీకూడా మనమీద పెత్తనం చేయకూడదు. శరీరం మన ఆధీనంలో ఉండాలే తప్ప మనం శరీరం ఆధీనంలో ఉండకూడదని గుర్తించాలి.
ఓసారి ఒక దేవత, ఒక దానవుడు ఆత్మజ్ఞానం కోసం ఒక మహర్షి వద్దకు వెళ్ళారు. చాలాకాలం అతన్ని సేవించి, విద్య నేర్చుకున్నారు. చివరికి ఆ మహర్షి, “మీరు దేనికోసం అన్వేషిస్తున్నారో, అది మీలోనే ఉంది” అని చెప్పాడు. అది విని, ఆ ఇద్దరూ ‘అంటే శరీరమే ఆత్మ అన్న మాట’ అని భావించి, తమవారి వద్దకు వెళ్ళి పోయారు. “మా కంతా తెలిసింది. శరీరమే ఆత్మ. అంటే మనమే ఆత్మ. కాబట్టి హాయిగా తింటూ, త్రాగుతూ సుఖంగా ఉందాం. మనకు మించిన ఆత్మ లేదు కదా!” అని తమవారికి బోధించారు. దానవుడు సహజంగా మందబుద్ధి. అందుకని ‘ఆత్మ అంటే శరీరమే’ అన్న విషయం గూర్చి మరల ఆలోచించుకోలేదు. అదే వాస్తవం అని తృప్తిపడి, దాని ప్రకారం శరీరమే ఆత్మగా జీవించటం మొదలు పెట్టాడు. దేవత మందబుద్ధికాడు. అతనిది విశుద్ధ బుద్ధి. అయినా ఋషి బోధను అతను కూడా మొదట్లో పొరపాటుగా అర్థం చేసుకున్నాడు. “ఈ శరీరమే ఆత్మ. కాబట్టి శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దివ్యంగా అలంకరించుకోవాలి. ఇంద్రియవిషయ భోగాలన్నీ బాగా అనుభవించాలి” అని అనుకున్నాడు. కొన్నిరోజులు అలా గడిచాయి. ఓ రోజు దేవతకు కాస్త అనుమానం వచ్చింది. “ఋషిబోధకు అర్థం ఇది కాదేమో” అని అనుకున్నాడు. ఆలోచించాడు. “దీనికన్నా మించిన అర్థం ఉండాలి. ఋషినే అడుగుతాను” అని నిశ్చయించుకున్నాడు. మళ్ళీ మహర్షి వద్దకు వెళ్ళాడు. “భగవాన్! ఈ శరీరమే ఆత్మనా? మరి శరీరాలు నశించిపోతుంటాయి కదా! ఆత్మ అవినాశి కదా! మరి శరీరం ఆత్మ ఎలా ఔతుందీ?” అని అడిగాడు. “ఆ ఆత్మవు నువ్వే. అదేమిటో నువ్వే తెలుసుకో; తత్త్వమసి; అదే నువ్వు” అని మహర్షి చెప్పాడు.
దేవత మరల ఆలోచించాడు. “ప్రాణం ఆత్మ కావచ్చు” అనుకున్నాడు. కాని తాను తిన్నప్పుడు ప్రాణం శక్తివంతంగా ఉండటం, ఉపవాసం ఉన్నప్పుడు ప్రాణం నీరసంగా ఉండటం గమనించాడు. సందేహం కల్గింది. గురువువద్దకు మళ్ళీ వెళ్ళాడు. “ఆచార్యా! ప్రాణమే ఆత్మనా?” అని అడిగాడు.
“తత్త్వమసి – అదే నువ్వు” అంటూ ఋషి మరల అదే బోధచేశాడు. దేవత దీర్ఘంగా ఆలోచించాడు. “బహుశః మనసు ఆత్మ కావచ్చు” అని అనుకున్నాడు. “కాని మనసులో మంచి భావాలు, చెడు భావాలు వస్తూ పోతుంటాయి. మంచీ, చెడుల మిశ్రమం ఆత్మ ఎలా అవుతుందీ? కాబట్టి మనసు ఆత్మ కాజాలద” ని నిర్ణయించుకున్నాడు. మరల మహర్షిని “మనసే ఆత్మ అంటారా” అనడిగాడు. “కాదు. నువ్వే అది. తత్త్వమసి. కనుక్కో” అని మరల అదే బోధించాడు మహర్షి. దేవత మరింత దీక్షతో తత్త్వవిచారణలో మునిగాడు. అంతే! ‘తానే ఆత్మ’ నన్న సత్యం కనుగొన్నాడు. అవాక్ మానస గోచరం, అద్వితీయం, జననమరణ రహితం, కత్తులు, అగ్ని, వాయువు, జలం దేనితో కూడా ఎట్టి వికారానికి లోనుకానిది, ఆద్యంతరహితం, అచలం, అస్పృశ్యం, సర్వజ్ఞం, సర్వశక్తిమంతం అయిన ఆత్మ తానేనని తెలుసుకున్నాడు. తాను మనసుకు, శరీరానికి అన్నింటికీ అతీతుడ నన్న నిజం గ్రహించాడు. దానితో ఆ దేవతకు అవధులులేని ఆనందం కలిగింది.
అయితే, పాపం ఆ దానవునికి మాత్రం శరీరంపై ఉన్న వ్యామోహం వల్ల ఆత్మానందం లభించనే లేదు.
దానవస్వభావం కలవారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. అయితే దైవస్వభావం కలవారు కూడా ఉంటారు సుమా! ఇంద్రియ భోగాలను అనుభవించే శక్తిని పెంచుకునేందుకు ఎవరైనా ఏదైనా శాస్త్రం బోధించటానికి పూనుకుంటాడనుకుందాం. అప్పుడు ఆ శాస్త్రాన్ని గ్రహించటానికి కోట్లాది మంది సంసిద్ధమౌతారు. పోతే, పరమ పురుషార్థాన్ని సాధించే మార్గం చెప్పటానికి ఎవరైనా ప్రయత్నిస్తేమాత్రం, పట్టుమని పదిమంది కూడా అతని మాటలు వినరు. పరమార్థాన్ని గ్రహించే సమర్థులు చాలా చాలా అరుదుగా ఉంటారు. అంతేకాదు, దానికోసం శ్రద్ధకలవారు ఇంకా తక్కువగా ఉంటారు. అయితే ‘ఈ లోకంలో నూరేండ్లు బ్రతికినా, వెయ్యేండ్లు బ్రతికినా ఒకటే’ అన్న సత్యం తెలుసుకున్నవారు కూడా ఉన్నారు. శరీరాన్ని స్థిరంగా ఉంచే శక్తులు వియోగం చెందితే, శరీరం క్షయించిపోక తప్పదు. మార్పుకు లోను కాకుండా శరీరాన్ని క్షణకాలం కూడా ఉంచగలిగే వాడు ఇంతవరకూ పుట్టలేదు. ‘శరీరం’ అంటే మార్పుకు లోనుకావటమే అని అర్థం. శీర్యతే – శిథిలం కావటమే శరీరం. “నదిలో నీరు నీ ఎదుట క్షణ క్షణం మారుతున్నా, అదేరూపంలో కొత్తనీరు కూడా వస్తూ ఉంటుంది. ఈ శరీర స్థితికూడా ఇంతే.”
అయినా సరే, శరీరాన్ని మనం చక్కగా సంరక్షించుకోవాలి. ఎందుకంటే పరమార్థాన్ని పొందేందుకు మనకున్న మంచి సాధనం ఈ శరీరమే!
ఈ లోకంలో అన్నింటికన్నా ఉత్తమశరీరం, ఈ మానవ శరీరమే. మనిషే ఉత్తమోత్తమ జీవి. జంతువులన్నింటికన్నా, దేవతలందరికన్నా మనిషే గొప్ప. దేవతలు కూడా మనుషులుగా పుట్టే ముక్తిపొందవలసి ఉంటుంది. మనిషికే ముక్తి సాధ్యం. దేవతలకు కూడ ముక్తి పొందడం సాధ్యం కాదు. యూదులు, ముస్లింలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. “దేవుడు, దేవతలను ఇతర ప్రాణులనన్నింటినీ సృష్టించి, చివరగా, మనిషిని సృష్టించాడు. దేవతల నందరిని వచ్చి మనిషికి నమస్కరించమని ఆదేశించాడు. అందరూ అలాగే చేశారు; కాని ‘ఇబ్లిక్’ అనే దేవత మాత్రం అలా చేయటానికి ఒప్పుకోలేదు. దానితో దేవుడు ఆ దేవతను శపించాడు. వెంటనే ‘ఇబ్లిక్’ సైతానుగా మారిపోయాడు.”
‘మనిషి జన్మ ఎంతో ఉత్తమం’ – అని చెప్పటమే ఈ కథ ఉద్దేశం. సృష్టిలో పశువులు అధమస్థితిలో ఉంటాయి. అవన్నీ తమస్సుతో, మాంద్యంతో నిండి ఉంటాయి. జంతువులకు ఉన్నతభావాలు కలిగే అవకాశం లేదు. దేవతలకు కూడా మానవజన్మలో తప్ప ముక్తి లభించదు. మానవుల విషయంలో కూడా, గొప్ప ఐశ్వర్యం, పరమ దారిద్ర్యం, ఈ రెండూ ఉన్నవారు ముక్తిపొందలేరు. మధ్యతరగతి నుండే మహాత్ములు వస్తుంటారు. మధ్యతరగతివారిలోనే కలిమి, లేములు, శక్తియుక్తులు సమపాళ్ళలో ఉంటాయి.
సరే, మన విషయానికి వద్దాం. ప్రాణాయామానికి, చిత్త ఏకాగ్రతకు సంబంధమేమిటి? శరీరం యంత్రమైతే, శ్వాస దానికి ఆధారచక్రం. పెద్ద పెద్ద యంత్రాల్ని మీరు చూసే ఉంటారు. వాటిలో ముందుగా ఆధారచక్రం తిరుగుతుంది. ఈ కదలిక క్రమంగా చిన్న చిన్న చక్రాలను కూడా త్రిప్పుతుంది. దానితో సున్నిత యంత్రభాగాలన్నీ పనిచేయటం ప్రారంభిస్తాయి. అలాగే మన శరీరంలోని ప్రతీ అవయవాన్ని కదిలించి, పనిచేయించే ‘శ్వాస’ ఈ మూలాధారచక్రం లాంటిది.
ఒకరాజుకు తన మంత్రిపై ఎందుకో కోపం కల్గింది. అతనికి వెంటనే శిక్ష విధించాడు. చాలా ఎత్తుగా ఒక గోపురాన్ని నిర్మించి, అందులో బంధించమని ఆదేశించాడు. భటులు ఆ శిక్షను అమలు చేశారు. అప్పుడు పతివ్రత అయిన మంత్రి భార్య, రహస్యంగా మంత్రిని కలిసింది. అతన్ని విడిపించే విషయం ఆలోచించింది. మంత్రి ఆమెకో సలహా చెప్పాడు. పొడవైన ఒక పగ్గం, పురిత్రాడు, లావుపాటి దారం, పట్టుదారం, పేడపురుగు- వీటిని తీసుకుని మరునాటి రాత్రికి గోపురం వద్దకు రమ్మని భార్యకు చెప్పాడు. ఆమెకు అవి ఎందుకో అర్థం కాలేదు. అయినా భర్తకోరినట్లు వాటిని తీసుకుని వెళ్లింది.
పట్టుదారాన్ని పేడపురుగుకు అతికించమని మంత్రి ఆమెకు చెప్పాడు. ఆమె అలాగే చేసింది. తర్వాత పురుగు కొమ్ములకు తేనె రాసి, గోపురం పైకి వదలిపెట్టమన్నాడు. ఆమె వదిలిపెట్టింది. పురుగు వెంటనే తన సుదీర్ఘయాత్ర ప్రారంభించింది. తేనెను అందుకోవాలన్న ఆశతో పైపైకి ప్రాకింది. తనకు అందుబాటులోకి రాగానే, మంత్రి దాన్ని పట్టుకుని పట్టుదారాన్ని పైకిలాక్కున్నాడు. పట్టుదారానికి లావుపాటి దారాన్ని, దానికి పురిత్రాడును, దానికి పగ్గాన్ని కట్టమని భార్యకు చెప్పాడు. ఆమె అలాగే కట్టింది. మంత్రి క్రమంగా పట్టుదారాన్ని, లావుదారాన్ని, త్రాడును, పగ్గాన్ని పైకి లాక్కున్నాడు. ఇంకేం. మిగిలిన కథ చెప్పనవసరం లేదుకదా! ఆ పగ్గాన్ని గోపురానికి బిగించి, ఆ పగ్గం ద్వారా క్రిందికి దిగివచ్చి, మంత్రి తప్పించుకుని, తనను తాను రక్షించుకున్నాడు.
‘శ్వాస’ పట్టుదారం లాంటిది. దీన్ని పట్టుకుంటే, ‘నాడీవాహిను’ అనే లావుపాటి దారం చేజిక్కుతుంది. దాని సహాయంతో ‘మనోభావాలు’ అనే పురిత్రాడు వశమౌతుంది. చివరికి ‘ప్రాణం’ అనే పగ్గం మనకు స్వాధీనమౌతుంది. ప్రాణం స్వాధీనం కాగానే, ఆత్మస్వేచ్ఛ లభిస్తుంది.
మన శరీరం గూర్చి మనకేమీ తెలియదు; మనం తెలుసుకోలేము. మహా అయితే శవాన్ని ముక్కలుగా చేసి పరిక్షించగలం. కొంతమంది ప్రబుద్ధులైతే సజీవప్రాణినే ముక్కలుగా తెగనరికి, ఆ శరీరంలో ఏముందో చూసే ప్రయత్నం చేస్తుంటారు. ఏది ఏమైనా, ఈ శవపరీక్షలకూ మన శరీరానికీ ఎలాంటి సంబంధం లేదు. శరీరం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటారా? మన శరీరం లోపల సూక్ష్మకదలికలను గ్రహించేంతగా మన చిత్తం ఏకాగ్రం కాకపోవటమే. చాలా సూక్ష్మంగా మారిన చిత్తంతో శరీరతత్త్వాన్ని శోధించినప్పుడే, మనకు శరీరం లోపలి విషయాలు బోధపడతాయి. సూక్ష్మవిషయాల గూర్చి తెలుసుకునే ముందు మనం స్థూలవిషయ జ్ఞానాన్ని సంపాదించాలి. శరీరయంత్రానికి చలనాన్నిచ్చే ప్రాణశక్తిని మనం స్వాధీనం చేసుకోవాలి. ప్రాణం శ్వాసరూపంలో మనకు వ్యక్తమవుతోంది. ఈ శ్వాసతో శరీరాంతర్భాగంలోకి మనం వెళ్ళి, శరీరమంతా వ్యాపించియున్న నాడీవాహినులనే సూక్ష్మశక్తుల స్థితిగతులను గ్రహించగలుగుతాం. ఈ సూక్ష్మశక్తుల్ని కనిపెట్టి, వాటి అనుభూతిని పొందటంతో, శరీరం కూడా మన వశం కావటం మొదలవుతుంది. రక రకాలైన ఈ నాడీవాహినుల వల్లే మనసులో చలనం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ప్రాణశక్తిని వశం చేసుకుంటే చాలు, మనశ్శరీరాలు మన స్వాధీనమౌతాయి. అప్పుడు వాటిని సేవకులుగా వాడుకునే స్థితి మనకు లభిస్తుంది.
జ్ఞానమే సామర్థ్యం. ఈ సామర్థ్యాన్ని పొందాలంటే, ముందుగా యోగసాధనలతో ప్రాణాయామంతో సాధన మొదలు పెట్టాలి. ‘ప్రాణాయామం’ చాలా విస్తారమైన విషయం. దాన్ని సమగ్రంగా వివరించాలంటే, ఎన్నో పాఠాలు తీసుకోవాలి. కాబట్టి ఒక్కోభాగాన్ని తీసుకుని పరిశీలన చేద్దాం.
ప్రాణాయామంలో ఏ సాధన ఎందుకు ఏర్పడిందన్న విషయం, ఈ సాధనలతో శరీరంలో ఏ శక్తులు ఉద్దీప్తమౌతాయన్న విషయం క్రమంగా మనకు ముందు ముందు తెలుస్తుంది. ప్రాణాయామంతో మనశ్శరీర శక్తుల నన్నింటినీ మనం పొందవచ్చు. కానీ, దీనికి నిరంతర సాధన ఎంతో అవసరం. అభ్యాసం చేస్తూపోతుంటే, మీకే ఈ విషయాలు ఋజువౌతాయి. నేనెంత సహేతుకంగా నిరూపించి చెప్పినా కూడా, మీ అంతట మీరు ధ్రువపరచుకొంటే తప్ప, ఈ విషయాలు మీకు రూఢికావు.
శరీరమంతటా నాడీవాహినులు ప్రవహిస్తున్న విషయం మీరు గుర్తించటం మొదలుపెట్టగానే, మీ సంశయాలన్నీ మటుమాయమైపోతాయి. అయితే దీనికోసం ప్రతిరోజూ మీరు తీవ్రంగా సాధన చేయాల్సి ఉంటుంది. కనీసం రోజుకు రెండుసార్లయినా మీరు అభ్యాసం చేయాలి. ఉదయం, సాయంకాలం మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇతర సమయాల్లో కన్నా, సంధ్యాకాలంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రెండు సంధ్యల్లో మీ చిత్తం ప్రశాంతి చెందేందుకు సుముఖంగా ఉంటుంది. ఇలాంటి సహజప్రశాంతస్థితిలో మనం సాధన కొనసాగించటం మంచిది. “సాధన చేసిన తర్వాతే భోజనం.” అన్న నియమం పెట్టుకోండి. అలా అయితే ఆకలే మీ బద్ధకాన్ని దూరం చేస్తుంది. భారతదేశంలో “సంధ్యోపాసన చేసిన తర్వాతే భోంచేయాలి” అని పిల్లలకు చెబుతారు. కాబటకొంతకాలానికి ఆ పిల్లలకు అది స్వభావంగా మారిపోతుంది. స్నానంచేసి, ఉపాసన చేసిన తర్వాతే, ఆ పిల్లలకు ఆకలి వేస్తుంది.
మీకు వీలయితే ఈ సాధనకోసం ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఆ గదిలో నిద్రపోవద్దు; దాన్ని పవిత్రంగా ఉంచాలి; స్నానం చేసిన తర్వాతే, శరీరాన్ని, మనసును శుచి చేసుకున్న తర్వాతే ఆ గదిలోకి వెళ్ళాలి. ఆ గదిలో పూలను, పవిత్రభావాలను కలిగించే పటాలను ఉంచండి. యోగసాధకునికి ఇలాంటి పరిసర వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉదయం, సాయం సమయాల్లో సువాసనా ద్రవ్యాలతో ఆ గదిలో ధూపం వేస్తూ ఉండండి. ఆ గదిలో పోరాటాలు, కోపతాపాలు, చెడు తలపులు వంటి వికారాలేమి జరక్కూడదు. మంచి సంకల్పాలు గల వారిని మాత్రమే ఆ గదిలోకి రానివ్వాలి. ఇలా చేస్తే, క్రమంగా ఆ గది పవిత్ర వాతావరణంతో నిండిపోతుంది. మీ కెప్పుడైన దుఃఖం, తాపం, సందిగ్ధత, క్షోభ లాంటి మనోవ్యాకులత కల్గితే, వెంటనే ఆ గదిలోకి వెళ్ళి కూర్చుంటే చాలు, మీ మనసులో శాంతి ఏర్పడుతుంది. ఆలయాల, చర్చీల, ఇతర మందిరాల ఆశయం కూడా ఇదే. కొన్ని నేటికి కూడా ఈ ఆశయం ప్రకారమే నడుస్తున్నాయి; కాని చాలావాటిల్లో ఈ ఆశయం అడుగంటిపోయింది. ఒక స్థలంలో పవిత్రభావాల స్పందనలు వ్యాప్తం చేస్తే, ఆ స్థలం దివ్యధామంగా మారుతుందన్న ఆశయంతోనే ఆలయ నిర్మాణాలు జరిగాయి.
ప్రత్యేకగదిని కేటాయించుకోలేనివారు, తమకు ఎక్కడ బాగుంటే అక్కడ సాధన చేసుకోవచ్చు. ముందుగా స్థిరంగా, సుఖంగా ఆసనంలో కూర్చోవాలి. మనసులో పవిత్ర సంకల్పాలతో సృష్టిలోని చరాచర ప్రాణులన్నింటికీ శుభాన్ని కోరుకోవాలి. “ప్రాణులన్నింటికీ శుభం, శాంతి, ఆనందం కలగనీ!” అని హృదయపూర్వకంగా సంకల్పించాలి. నాలుగు దిక్కులకూ శుభాన్ని కోరాలి. ఇలా శుభాన్ని కోరుకుంటున్నకొద్దీ మీ చిత్తం ప్రసన్నం అవుతూ ఉంటుంది. ఇతరులు ఆరోగ్యంగా ఉండేందుకు మనం తోడ్పడితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇతరులు సుఖంగా జీవించేలా చేస్తేనే, మనం సుఖంగా జీవిస్తాం.
శుభాన్ని కోరుకున్నతర్వాత, దైవభక్తికలవారు భగవత్ ప్రార్థన చేయాలి. ధనం, ఆరోగ్యం, స్వర్గం ఇలాంటివాటి గురించి ప్రార్థించకూడదు. జ్ఞానం, ఆత్మవికాసం కోసం భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఇది తప్ప, ఇతర ప్రార్థనలన్నీ స్వార్థపూరితాలే.
తర్వాత శరీర దృఢత్వం, ఆరోగ్యం గూర్చి భావనచేయాలి. శరీరమే కదా మనకున్న సాధనం. శరీరం వజ్రంలా దృఢంగా ఉన్నట్లు భావించుకోవాలి. ఈ శరీరంతో భవసాగరాన్ని దాటివేస్తామని అనుకోండి. బలహీనులకు ఎప్పటికీ మోక్షం లభించదు. కాబట్టి అన్ని దౌర్బల్యాలను అవతలికి నెట్టివేయండి. “నువ్వు దృఢంగా ఉన్నావు” అని శరీరానికి చెప్పండి. “నువ్వు బలమైనదానవు” అని మనసును ప్రేరేపించండి. అనంతధైర్యాన్ని, అపారవిశ్వాసాన్ని కలిగియుండండి.