ప్రతి జీవిలో దివ్యత్యం గర్భితంగా ఉంది.
బాహ్యాంతర ప్రకృతినంతా నిరోధించి అంతర్గతమై ఉన్న ఆ దివ్యత్యాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి.
దీనికై కర్మ, ఉపాసన, యోగ జ్ఞానమార్గాలలో ఒక్కటి గాని, రెండుగాని, అన్నిటినిగాని అవలంబించి ముక్తులవండి.
మతానికంతా ఇదే సారాంశం. వాదాలు, సిద్ధాంతాలు, కర్మకలాపాలు, గ్రంథాలు, దేవాలయాలు, విధులు – ఇవన్ని అప్రధాన విషయాలు.
– స్వామి వివేకానంద
ముందుమాట
రాజయోగం తంత్రాలకు సంబంధించింది. స్వామీజీ తంత్రాల పరంగానే కాకుండా, అద్వైతసిద్ధాంతాన్ని దీనితో మేళవించి రాజయోగం మీద న్యూయార్క్లో ఇచ్చిన ఏడు ఉపన్యాసాలు ఈ పుస్తకంలో చోటు చేసుకొన్నాయి. దీని ద్వారా స్వామీజీ ప్రపంచానికి వినూత్నమైన అలోచనలిచ్చారు. యోగం ద్వారా కుండలినీశక్తి సహస్రారానికి చేరితే, శివ- శక్తి ఒకటే అనే అనుభూతి కలుగుతుంది. ఇదే వేదాంతానుభూతి కూడా.
ఈ ఉపన్యాసాల్లో స్వామీజీ విశ్వనిర్మాణాన్ని సాంఖ్యశాస్త్రాను గుణంగా విశదీకరించారు. ఈ విశ్వనిర్మాణ సత్యాలను ఆధునిక భౌతిక శాస్త్రం ఋజువుచేస్తోంది.
ప్రపంచాన్ని విప్లవాత్మకంగా ఒనరించే స్వామీజీ శక్తి గురించి, స్వామి తురీయానంద ఇలా చెప్పారు: “స్వామీజీ మాకు ఇలా చెప్పేవారు: నేను ఉపన్యాసమే ఇస్తున్నాననుకొంటున్నారా? నేను నిశ్చితమైన, సజీవమైన ఆధ్యాత్మికశక్తినిస్తానని నాకు తెలుసు. వినేవారు దాన్ని పొందుతున్నారని వారికీ తెలుసు.” “స్వామీజీ ఉపన్యాసాలు ఆలకించినప్పుడు ఒక గొప్ప శక్తి ధ్యానావస్థలోమాదిరి కుండలినీని జాగృతం చేస్తున్నదని నాకు అనుభవమయ్యేది” అని స్వామి అభేదానంద చెప్పేవారు.
స్వామీజీ ప్రసంగించి ఇప్పటికి వంద సంవత్సరాలపైగా అయినా వాటి శక్తి, స్ఫూర్తి, ప్రేరణ ఏమాత్రమూ తగ్గలేదు. ఎన్నో హృదయాలు జాగృతీకరణమయ్యాయి, ఎన్నో జీవితాలు మలచబడ్డాయి.
ఈ పుస్తకం తెలుగు పాఠకులలో మేల్కొలుపు కల్గిస్తుందని మా ఆకాంక్ష.
-ప్రకాశకులు