1. జన్మౌషధి – మంత్ర – తపః – సమాధిజాః సిద్ధయః.
జన్మతో, మూలికతో, మంత్రాలతో, తపస్సుతో, సమాధితో సిద్ధులు కలుగుతాయి.
కొందరు పుట్టుకతోనే సిద్ధపురుషులై ఉంటారు. అయితే ఈ సిద్ధులను వీరు తమ పూర్వజన్మల్లో సంపాదించుకుని యుంటారు. తమ పూర్వజన్మ కృషీ ఫలాన్ననుభవించటానికన్నట్లుగా, ఈ మారు జన్మిస్తారు. సాంఖ్య తత్త్వజ్ఞాన జనకుడైన కపిలముని సిద్ధుడై జన్మించాడని అంటారు. సిద్ధుడంటే, విజయం పొందినవాడని అర్థం.
రసాయనాలవల్ల కూడా ఇలాంటి సిద్ధులను పొందవచ్చంటారు. ఇనుము మొదలైన లోహాలను – వెండిబంగారాలుగా మార్చటానికి రసవాద ముత్పత్తయిందని, అదే రసాయనశాస్త్రంగా పరిణమించిందని అందరికీ తెలుసు. హిందూదేశంలో సిద్ధసంప్రదాయమని ఒక తెగ ఉండేది. మతం, వేదాంతం జ్ఞానం పరమార్థం అన్నీ సమంజసాలే. వీటిని పొందాలంటే శరీరమొక్కటే సాధనం అని ఈ తెగవారంటారు. ప్రతిసారీ శరీరం పతనం చెందుతూ ఉంటే, గమ్యం చేరటానికి అనంతకాలం పడుతుంది. ఎలా అంటే, ఒక వ్యక్తి యోగాభ్యాసం చేయాలని, పరమార్థాన్ని సాధించాలని ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో విశేష అభివృద్ధి సాధించకుండానే అతను మరణిస్తాడనుకుందాం. అప్పుడతను మరొక జన్మఎత్తాలి. మరల చనిపోవాలి. ఇలా జన్మపరంపరలను పొందుతూనే ఉంటాడు. ఈ జనన మరణాలతో అతనికి ఎంతోకాలం నష్టమవుతుంది. అలాకాక, సుస్థిర శరీరదార్డ్యాన్ని సంపాదించి, ఆ కాయసిద్ధివల్ల జన్మ మరణాలను తొలగించుకుంటే, పరమార్థాన్ని సాధించటానికి మనకు కావలసినంత వ్యవధి లభిస్తుంది. కాబట్టి ఈ రసాయనవాదులు, ముందుగా శరీరదార్డ్యాన్ని కల్గించుకోవాలని చెబుతారు. ఈ శరీరాన్ని మరణరహితంగా ఉండేలా చేయటం మనకు సాధ్యమేనని వీరు అంటారు.
మనస్సు శరీరాన్ని నిర్మించటం; అపారశక్తిసాగరం నుండి వెలువడే ప్రవాహంలో ప్రతిమనస్సు ఏకమై ఉండటం సత్యమైతే, ప్రతిమనస్సుకూడా (బాహ్యంనుండి) పొందేశక్తికి పరిమితి ఉండదని వీరంటారు. శరీరాన్ని శాశ్వతంగా ఉంచేలా చేయటం మనకు సాధ్యం కాదు అనటానికి ఎలాంటి కారణం లేదు. మనస్సును, శరీరాలను అన్నింటినీ మనమే నిర్మాణం చేసుకోవలసి ఉంది. ఈ శరీరం నశించగానే, మనం మరొక శరీరాన్ని నిర్మించుకోవలసి ఉంటుంది. ఇలా నిర్మించుకుంటే, ఇప్పటి ఈ శరీరాన్నుండి బయటపడకుండానే, ఇప్పుడు ఇక్కడ ఉండగానే, అలాంటి శరీరాన్ని ఎందుకు నిర్మించుకోలేము? ఈ వాదం నిరాపేక్షణీయమైంది. మరణించిన తర్వాత మనం జీవించి యుండటం, ఇతర శరీరాలను ఏర్పరచుకోవటం సాధ్యమే అని అంగీకరిస్తారా? అలా అయితే, శరీరాన్ని పూర్తిగా లయింపచేయకుండానే, దాన్ని నిరంతరం మార్చుకొంటూ, ఇక్కడే ఆ శరీరాలను ఎందుకు ఉత్పత్తి చేసుకోలేము? పాదరసంలో గంధకంలో అద్భుతశక్తి ఉందని, వీటితో సిద్ధంచేసిన ఘుటికలవల్ల మనిషి తన ఇష్టంవచ్చినంతకాలం జీవించవచ్చని, వారు భావించారు. మరికొందరు కొన్నిమూలికలతో, ఆకాశగమనం మొదలైన సిద్ధులను పొందవచ్చని విశ్వసించారు. నేటి ఔషధాల్లో అత్యద్భుతమైనవి అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా వైద్యంలో లోహాలను ఉపయోగించే ప్రక్రియ మనకు ఈ రసాయనాల మూలంగానే లభించింది. యోగుల్లో కొన్నిసంప్రదాయాలవారు, తమ ప్రధానాచార్యుల్లో అనేకమంది, ఇంకా పూర్వశరీరాలతోనే సజీవులై ఉన్నారని చెబుతుంటారు. యోగ శాస్త్ర ప్రామాణికాచార్యుడు పతంజలి, ఈ విషయాన్ని నిరాకరించటం లేదు.
మంత్రశక్తి: హిత పరిస్థితుల్లో మంత్రోచ్ఛారణం వల్ల అద్భుత శక్తులు కలుగుతాయి. అహోరాత్రాలు మనం ఇలాంటి మహిమల మధ్యలో ఉండటం వల్ల, వాటి స్పృహకూడా మనకు కలగటం లేదు. మానవ, మంత్ర, మానసిక శక్తులకు పరిమితం లేదు.
తపస్సు: (శారీరక పీడనం) తపశ్చర్యలు – ఇంద్రియనిగ్రహ సాధనలూ ప్రతిమతంలో కూడా ఉన్నాయి. పారమార్థిక విషయాల్లో హిందువులు ఎప్పుడూ తుదిదాకా వెళతారు. కొంతమంది చేతులు పైకెత్తి, అవి ఎండిపోయేదాకా జీవితాంతం వాటిని అలాగే ఉంచుతారు. పాదాలు ఉబ్బిపోయేదాకా, మరికొంతమంది దివారాత్రాలు నిలచియుంటారు. కర్మంచాలక వీరు బ్రతికియుంటే, జీవితకాలమంతా ఈ స్థితిలోనే నిలచియుండవలసి ఉంటుంది; ఎందుకంటే కాళ్ళు వంచటానికి వీలు లేనంతగా బిగిసికొనిపోయి ఉంటాయి. ఇలా చేతులు పైకి ఉంచుకున్న వ్యక్తిని ఒకర్ని నేను చూశాను. “మొదట్లో అభ్యాసం చేస్తున్నప్పుడు నీకెలా ఉండేది?” అని అతన్ని అడిగాను. “చాలా ఘోరంగా ఉండేది. ఎంతో నరకాన్ని అనుభవించాను” అని అతను చెప్పాడు. ఆ బాధకు తట్టుకోలేక, ఉపశాంతికోసం నదిలో ఉండేవాడట! ఒక నెలరోజుల అభ్యాసం తర్వాత బాధ తగ్గటం మొదలుపెట్టిందట. ఇలాంటి సాధనలతో సిద్ధులను పొందవచ్చు.
సమాధి: యోగానికి శరీరం లాంటిది సమాధి. ఇది యోగంలో ప్రధానాంశం. అత్యున్నత యోగసాధన. పై సాధనలన్నీ అప్రధానాలు. వాటితో పరమావధి ప్రాప్తించదు. నైతిక మానసిక, ఆధ్యాత్మిక విషయాల్లో ఏదైనాసరే, అంతా మనకు సమాధివల్లే ప్రాప్తిస్తుంది.
2. జాత్యంతరపరిణామః ప్రకృత్యాపూరాత్.
మరొక జాతిగా పరిణమించుట (అన్నది) ప్రకృతిపరిణామ సమాప్తివల్ల కలుగుతుంది.
ఇలాంటి సిద్ధులు జన్మంవల్ల, కొన్ని సమయాల్లో రసాయనిక సాధనలవల్ల, తపస్సువల్ల ప్రాప్తిస్తాయని పతంజలి ప్రతిపాదిస్తాడు. ఈ శరీరాన్ని ఎంతకాలమైన నిలిపియుంచటం మనకు సాధ్యమేనంటాడు. శరీరం మరొక జాతిగా పరిణమించటానికి కారణం ప్రకృతిపరిణామ సమాప్తే అని అంటూ, ఆ విషయాన్ని రాబోయే సూత్రాల్లో వివరిస్తాడు.
3. నిమిత్తమప్రయోజనం ప్రకృతీనాం వరణభేదస్తు తతః క్షేత్రికవత్.
సత్కర్మలు, దుష్కర్మలు స్వయంగా ప్రకృతి మార్పులకు కారణాలు కాజాలవు. అయితే అవి ప్రకృతిమార్పుల ఆటంకాలను తొలగిస్తాయి. రైతు కాలవకు అడ్డుతొలగిస్తేచాలు, సహజరీతిలో నీరు పొలంలోకి ప్రవహిస్తుంది కదా!
కాలువలో నీరుంది. అయితే కాలువ ద్వారాలు మూసి ఉంచారు. రైతు, ఈ తలుపులను తెరచివేస్తాడు. వెంటనే ప్రకృతిశక్తి అయిన గురుత్వాకర్షణ నియమాన్నిబట్టి, నీరు సహజంగా పల్లంలోకి – తద్వారా పొలంలోకి పారుతుంది. మనిషిలో సర్వశక్తులూ ఉన్నాయి. పరిపూర్ణత మనిషి స్వభావం. ఇది సహజంగా వ్యక్తం కాకుండా మనమే దీన్ని బంధించియుంచాం. ఈ బంధనాన్ని తొలగిస్తేచాలు, ప్రకృతిశక్తులు మనలోకి పొరలి ప్రవహిస్తాయి. అప్పుడు మనకు మన సహజశక్తులు ప్రాప్తిస్తాయి. ఇలా ప్రకృతివాహిని తనలో ప్రవహించగానే, దురాత్ముడు – మహాత్ముడౌతాడు. ప్రకృతిప్రేరణం వల్లే మనం మోక్షమార్గంలో చరిస్తున్నాం. అందరినీ చివరికి ఆమెయే గమ్యస్థానానికి చేరుస్తుంది.
పరమార్థాన్ని సాధించటానికి మనం చేస్తున్న ఈ సాధనలన్నీ ఈ విశ్వప్రయత్నాలన్నీ, ఇంతకుముందే మనకు సహజమై, జన్మస్వాతంత్ర్యమై ఉన్న కైవల్యాన్ని పొందటానికి అడ్డంకులను తొలగించి, ద్వారాలను తెరవటానికే వినియోగిస్తుంటాయి.
నేడు ప్రాచీన యోగుల పరిణామవాదాన్ని, నవీనప్రకృతి శాస్త్రపరిశోధనా దృష్టితో చూస్తే, అది సువ్యక్తమవుతుంది. అయినా ప్రకృతి శాస్త్ర సిద్ధాంతాలకన్నా యోగసిద్ధాంతాలే ఎక్కువ సమంజసమైనవి.
ఆధునికశాస్త్రం పరిణామవిషయంలో రెండు హేతువులను ప్రతిపాదిస్తుంది: ‘మిథున వరణం’ లేదా సమాగమ ఇచ్ఛతో జంటను ఎన్నుకొనుట జీవనపోరాటంలో అర్హతగల ప్రాణులే నశించక నిలచివుండుట, అన్న ఈ రెండు హేతువులు పరిణామానికి పూర్తివికాసాన్ని ఇవ్వలేవు. జీవనాధారాన్ని సంపాదించుకోవటంలో జతను కూర్చుకోవటంలో మనకు ఏర్పడే పరస్పర సంఘర్షణని తొలగించేటంత విజ్ఞానాభివృద్ధి కలిగితే, ఆధునిక శాస్త్రవేత్తల రీత్యా, మానవకోటి పురోభివృద్ధి అంతటితో నిలచిపోవటమే కాదు, మానవ సమాజం నశించటం కూడా సంభవిస్తుంది. ఒక లోకకంఠకుడు తాను చేసే దౌర్జన్యమంతా ప్రకృతి నియమానుసారంగానే ఉందని మనస్సును సమాధానపరచుకోవటానికి ఈ సిద్దాంతం తోడ్పడుతుంది. తత్త్వవేత్తలమని అంటూ, ప్రపంచంలోని దుర్మార్గులను, అనర్హులను సమూలంగా నష్టంచేసి మానవజాతిని ఉద్ధరింపదలిచేవారు చాలామంది ఉన్నారు. అర్హత, అనర్హతలను నిర్ణయించే వారు వీరే కాబోలు! స్వతస్సిద్ధంగా ప్రతిజీవిలో ఉన్న పరిపూర్ణతా ప్రకటనమే నిజమైన పరిణామ రహస్యమని, ఈ పరిపూర్ణత నిరోధితం కావటం వల్ల, ఆత్మప్రభావ తరంగాలు ఉబికి బయటపడటానికి విశేషకల్లోలాన్ని చేస్తున్నాయని ప్రాచీన పరిణామ తత్త్వవేత్త పతంజలి ఘోషిస్తున్నాడు.
ఈ స్పర్థలూ, ఈ పోరాటాలూ మన అజ్ఞాన ఫలితాలే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే, ద్వారాన్ని తెరచి నీటిని ప్రవహింప చేయటానికి సరైన మార్గం మనకు తెలియటం లేదు. అంతర్గతంగా ఉన్న ఈ అపారశక్తి తరంగం వెలువడి తీరాలి. దృశ్యప్రపంచానికి ఇదే మూలకారణం. జీవనాధారాన్ని సంపాదించుకోవటం, సమాగమేచ్ఛను తృప్తిపరచుకోవటం, ఏదైనా ఈ పోటి అంతా తాత్కాలికమే. అనవసరం కూడా. ఇదంతా అజ్ఞానసంజనిత అట్టహాసం. ఈ సంఘర్షణంతాసమసిపోయినా, అంతర్గత ఆత్మపరిపూర్ణతే మనలను ముక్తిమార్గంలో చరింపచేస్తుంది. కాబట్టి ఆత్మవికాసానికి సంఘర్షణ తప్పనిసరని నమ్మటానికి సరి అయిన హేతువేదీ కనిపించదు. పశుత్వంలో మానవత్వం అణగియుంది. అయితే ద్వారం తెలిస్తేనే, తటాలున ఆ మానవత్వం బయటపడుతుంది. అలాగే మనిషిలో అజ్ఞానపాశబద్ధ దివ్యత్వం గర్భితంగా ఉంది. ఈ పాశాలను జ్ఞానఖడ్గం ఛేదించగానే దివ్యత్వం వెలువడుతుంది.
4. నిర్మాణచిత్తాన్యస్మితామాత్రాత్.
(యోగి) నిర్మించిన చిత్తాలు అస్మిత (అహంకారం) వల్లనే కలుగుతాయి.
మనం చేసే సత్కర్మల, దుష్కర్మల ఫలం మనమే అనుభవిస్తామన్నది కర్మసిద్ధాంతం. అయితే, ఆత్మవైభవాన్ని పొందటమే తత్త్వజ్ఞానానికి పరమావధి. శృతిస్మృతులన్నీ ఆత్మ వైభవాన్ని స్తుతిస్తూ, ఆ వెంటనే కర్మను బోధిస్తుంటాయి. సత్కర్మవల్ల సత్ఫలం – దుష్కర్మవల్ల దుష్ఫలం ప్రాప్తిస్తూ, సుకృత దుష్కృతాల వల్ల ఆత్మవికారాన్ని పొందుతూ ఉంటే, ఆత్మప్రభావం నిరర్థకం కావలసి వస్తుంది. దుష్కర్మలు పురుష స్వభావాన్ని వ్యక్తం కాకుండా చేస్తున్నాయి. సత్కర్మలు ఈ ప్రతిబంధకాన్ని తొలగించగానే, ఆత్మవైభవం వ్యక్తమవుతుంది. స్వయంగా ఆత్మ ఎన్నడూ వికారం పొందదు. నువ్వెలాంటి కర్మచేసినా, నీ సహజ ఆత్మప్రభావాన్ని, స్వతస్సిద్ధ నీ స్వభావాన్ని ఎన్నడూ నష్టం చేయలేవు. ఎందుకంటే, అవిద్యావరణం, ఆత్మపరిపూర్ణతను మరుగు పరుస్తుందే కానీ, ఆత్మకు దేనివల్ల కూడా వికారం కలగదు. శీఘ్రంగా కర్మపరిపాకం పొందటానికి, యోగులు కాయమ్యాహాలను లేదా శరీరసమూహాలను నిర్మించుకొని, వాటిలో కర్మానుభవాన్ని పొందుతారు. ఈ శరీరాలన్నింటికీ వారు అస్మిత లేదా అహంతత్త్వాన్నుండి చిత్తాలను నిర్మించుకొంటారు. వారి స్వతస్సిద్ధ చిత్తాలకూ వీటికీ భేదాన్ని చెప్పటానికి, వీటిని ‘కల్పితచిత్తా’ లంటారు.
5. ప్రవృత్తిభేదే ప్రయోజకం చిత్తమేకమనేకేషామ్.
రకరకాల ఈ కల్పితచిత్తాల ప్రవృత్తులు వేరు వేరుగా ఉన్నా, మూల చిత్తం వీటన్నింటినీ స్వాధీనం చేసుకుంటుంది.
వేరు, వేరు శరీరాల్లో, వ్యాపారాలను నిర్వర్తించే, ఈ చిత్తాలను, కల్పిత చిత్తాలని, ఈ శరీరాలను కల్పితశరీరాలని అంటారు. మనస్సు – ప్రకృతి ఈ రెండూ అక్షయ నిధులు. యోగంతో ఈ నిధులను వశం చేసుకునే రహస్యం నీకు తెలుస్తుంది. ఈ జ్ఞానం సదా నీలోనే ఉన్నా, నువ్వు దాన్ని మరిచిపోయావు. యోగివి కాగానే నీకది జ్ఞాపకం వస్తుంది. అప్పుడు నువ్వుదాన్ని యథేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. అది నీ చేతిలో కీలుబొమ్మ అవుతుంది. జగన్నిర్మాణహేతువైన తత్త్వంవల్లే కల్పితమనస్సు కూడా ఏర్పడుతుంది. మనస్సు ఒక వస్తుమా, ప్రకృతి మరొకవస్తుమా కాదు. అవి రెండూ ఒకేదాని భిన్నస్థితులు. సూక్ష్మస్థితి అయిన అస్మిత లేదా అహంకారం అనే తత్త్వాన్నుండి ఈ కల్పితశరీరాలను – కల్పిత చిత్తాలను యోగి నిర్మించుకొంటాడు. కాబట్టి ప్రకృతిశక్తుల రహస్యం యోగికి తెలియగానే, అహంతత్త్వాన్నుండి యోగి తనకు కావలసినన్ని శరీరాలను చిత్తాలను సృష్టించుకొంటాడు.
6. తత్ర ధ్యానజమనాశయమ్.
వివిధ చిత్తాలన్నింట్లో సమాధి నిర్మితచిత్తం కర్మవాసనారహితమైంది.
సమస్తచిత్తాల్లో సమాధిస్థితి పొందిన చిత్తం అత్యుత్తమం. మూలికలు, మంత్రాలు, తపస్సాధనలు – వీటివల్ల ఏవో కొన్ని సిద్ధులు సంపాదించిన వ్యక్తికి ఇంకా వాసనలుంటాయి. అయితే యోగంతో సమాధిస్థితి పొందిన వ్యక్తి సంపూర్ణంగా వాంఛారహితుడౌతాడు.
7. కర్మాశుక్లాకృష్ణం యోగినస్త్రివిధమితరేషమ్.
యోగులకు కర్మలు తెలుపు, నలుపుగా ఉండవు. ఇతరులకు అవి తెలుపు, నలుపు, మిశ్రమం అని మూడు విధాలుగా ఉంటాయి.
యోగి పరిపూర్ణుడైతే, అతను చేసే కర్మలు వాటిఫలాలు అతన్ని బంధించలేవు. ఎందుకంటే, అతనా కర్మలను కోరి చేయడు. ఫలవాంఛా రహితంగా అతను తన కర్మలను చేస్తూనే ఉంటాడు. లోకకళ్యాణం కోసం అతను ప్రవర్తిస్తూ, సత్కర్మలు చేస్తున్నా, వాటి ఫలాలను అతడు ఎన్నడూ ఆశించడు. అందుకని, అతన్ని అవి అంటవు. ఇలాంటి ఉత్తమస్థితి పొందని సామాన్యులకు, నలుపు (దుష్కర్మలు) తెలుపు (సత్కర్మలు), మిశ్రమాలు అని కర్మలు మూడు రకాలుగా ఉంటాయి.
8. తతస్తద్విపాకానుగుణానామేవాభివ్యక్తిర్వాసనానామ్.
ఈ త్రివిధ కర్మలనుండి, ఆయాస్థితులకు అనుకూలించే వాసనలే వ్యక్తమవుతుంటాయి. (మిగిలినవి తాత్కాలికంగా అణగియుంటాయి.)
నేను సత్కర్మలు దుష్కర్మలు మిశ్రమ కర్మలు అని ఈ మూడు రకాల కర్మలను చేసి, మరణించిన తర్వాత స్వర్గంలో ఒక దేవతగా అవుతాననుకోండి. దేవతా శరీరంలో కలిగే వాంఛలు – మానవశరీరంలోని వాంఛలు ఒకేరకంగా ఉండవు. దేవతా శరీరానికి అన్నపానాదులు అక్కర్లేదు. అలాంటి స్థితిలో క్షుత్పిపాసలను కలిగించే, ఇంకా అనుభవించని, నా పూర్వకర్మలు ఏం కావాలి? నేనొక దేవతనైనప్పుడు, ఈ కర్మలు ఏమైపోతున్నాయి? కర్మవాసనలెప్పుడూ తగిన పరిస్థితుల్లో మాత్రమే వ్యక్తమవుతుంటాయి అని చెప్పటమే దీనికి తగిన సమాధానం. పరిస్థితులు ఎలాంటి వాసనలకు అనుకూలమై ఉంటాయో, అలాంటి వాసనలు మాత్రమే వెలువడుతుంటాయి. మిగతావి సంచితమై ఉంటాయి.
ఈ జన్మలో మనకు ఎన్నో దేవత మానవ పశు వాంఛలున్నాయి. నేను ఒక దేవతా శరీరాన్ని ధరిస్తే, సద్వాసనలు మాత్రమే వెలువడతాయి. ఎందుకంటే, పరిస్థితులు అలాంటి వాసనలకే యోగ్యమై ఉంటాయి. మరి నేను ఒక జంతుశరీరాన్ని ధరిస్తే, జంతువాసనలు మాత్రమే వెలువడతాయి; సద్వాసనలు వెనక నిలచియుంటాయి. అంటే ఏమిటీ? పరిస్థితుల మూలంగా వాసనలను నిరోధించివచ్చన్న మాట! పరిస్థితులకు యుక్తమైన అనుకూలమైన కర్మ మాత్రమే వెలువడుతుంటుంది. కాబట్టి జాతి – దేశాది పరిస్థితులు కర్మానుభవాన్ని సహితం నిరోధిస్తాయని తెలుస్తున్నది.
9. జాతి – దేశ – కాల – వ్యవహితానామప్యానంతర్యం స్మృతిసంస్కారయోరేకరూపత్వాత్.
స్మృతి సంస్కారం ఏకరూపాన్ని పొందియుండటంవల్ల జాతి, దేశ, కాలాలతో వేరుచేసిన వాసనలకు అనంతర్యం కలుగుతుంది.
కర్మానుభవాలు, సూక్ష్మస్థితిని పొంది సంస్కారాలవుతాయి. సంస్కారాలు తిరిగి ప్రాణవంతాలై స్మృతిరూపం దాలుస్తాయి. సంస్కార రూపంలోనున్న పూర్వానుభవాలను, ఇప్పుడు మనం ఎరుకతో చేస్తున్న వ్యాపారాలతో, సరిగ్గా అలాంటి శరీరంలోనే అంతకుముందు పొందిన సంస్కార సముదాయం మాత్రమే కర్మకు హేతువవుతుంది. వేరొక జాతి శరీరంలో పొందిన అనుభవాలు తాత్కాలికంగా ఆగియుంటాయి. ప్రతిశరీరం కూడా, ఆ జాతి శరీర పరంపరకు మాత్రమే సంతతియై ఉందా అన్నట్లు వర్తిస్తుంది. ఇలా వాసనల పౌర్యాపర్యం విచ్ఛేదం కాదు.
10. తాసామనాదిత్వం చాశిషో నిత్యత్వాత్.
సుఖపిపాస (సుఖంకోసం తీవ్రవాంఛ) అనాది కావటంవల్ల వాంఛలకు ‘ఆది’ అన్నది లేదు.
మన అనుభవమంతా సుఖాన్ని పొందాలన్న కోరికను వెన్నంటి యుంటుంది. క్రొత్తగా కలిగే ప్రతీ అనుభవంకూడా పూర్వానుభవ సంజనిత ప్రవృత్తిమీద ఆధారపడి యుంటుంది. కాబట్టే, అనుభవానికి ‘ఆది’ అన్నది లేదు. అందుకని వాసనలు అనాదిగా ఉంటున్నాయి.
11. హేతుఫలాప్రశయాలంబనైః సంగృహీతత్వాదేషామభావే తదభావః.
కారణం, కార్యం, ఆశ్రయం (ఆధారం), శబ్దాది విషయాలతో కూడుకుని ఉండటంవల్ల, ఇవన్నీ లేకుండా పోయినప్పుడు అది (వాంఛ) కూడా లేకుండా పోతుంది.
కోరికలు కార్యకారణాలతో బంధితమై ఉన్నాయి. కోరిక కలగగానే, తన ఫలితాన్ని కలిగింపకుండా, అది ఎన్నడూ నశించదు. సంస్కార రూపాన్ని పొందిన పూర్వవాంఛలన్నింటికీ చిత్తం నిలయమై ఉంటుంది. ఈ సంస్కారాలు పూర్తిగా కార్యరూపం పొందనిదే నశించవు. అంతే కాదు, ఇంద్రియాలు బాహ్యవిషయాలను గ్రహిస్తున్నంత కాలం, నూతన వాంఛలు కలుగుతూనే ఉంటాయి. కారణం – కార్యం – ఆశ్రయం – ఇంద్రియవిషయాలు – వీటినన్నింటినీ తొలగించుకో. మనకు సాధ్యమైతే, వాంఛలంతరిస్తాయి.
12. అతీతానాగతం స్వరూపతోఽస్త్యధ్వభేదాద్ధర్మాణామ్.
భూత భవిష్యత్తులు తమ స్వభావంలోనే నెలకొని యుంటాయి. ఇక గుణాలు అనేకం ఉంటాయి.
అస్తిత్వం ఎన్నడూ అభావం నుండి కలగజాలదని భావం. భూత భవిష్యత్తులు వ్యక్తస్థితిలో కాకున్నా, సూక్ష్మావస్థలో నిలిచియుంటాయి.
13. తే వ్యక్త – సూక్ష్మా గుణాత్మానః.
అవి గుణాల స్వభావాన్ని బట్టి వ్యక్తంగా గానీ, సూక్ష్మంగా గానీ ఉంటాయి.
సత్త్వం రజస్సు తమస్సు అన్నవి త్రిగుణాలు. వీటిని గుణాలనటం కన్నా, తత్త్వాలు అనటమే సమంజసం. ఈ మూడింటి స్థూలావస్థయే ఈ దృశ్యప్రపంచం. వీటి వివిధ వ్యక్తస్థితుల నుండి భూత భవిష్యత్తులు వెలువడుతుంటాయి.
14. పరిణామైకత్వాద్వస్తుతత్త్వమ్.
పరిణామంలోని ఏకత్వం నుండి వస్తువుల్లోని ఏకత్వం ఏర్పడుతుంది.
(సత్వరజస్తమస్సులు) వేరు – వేరై ఉన్నా పరిణామంలో సామరస్యం ఏర్పడియుండటం వల్ల సర్వవిషయాలకు సామరస్యం ఏర్పడుతుంది.
15. వస్తుసామ్యే చిత్తభేదాత్తయోర్విభక్తః పన్థాః.
ఇంద్రియానుభవం, కోరిక ఒకేవిషయంలో వేరు వేరుగా ఉండటం వల్ల మనస్సు, విషయం రెండూ భిన్నస్వభావాన్ని కలిగియుంటాయి.
మన మనస్సులమీద ఆధారపడని స్వతంత్రబాహ్యప్రపంచం ఒకటి ఉండి. బౌద్ధుల విజ్ఞానవాదానికి ఇది ఒక నిరసనం. ఒకేవస్తువును వేరు వేరు జనులు వేరు వేరుగా చూడటంవల్ల, అది ఒకేవ్యక్తి భావనమాత్రం కాదు.*
వస్తువు మనకు గోచరించుటే, దాని అస్తిత్వానికి ప్రమాణమై ఉంటే, మనస్సు ఏ విషయంలోనైనా తన్మయమై ఉన్నప్పుడు లేదా సమాధిస్థితిలో ఉన్నప్పుడు ఆ మనస్సును ఎవరుకూడా చూడటం జరగదు, కదా! కాబట్టి ఆ మనస్సు లేదని చెప్పవలసి వస్తుంది. ఈ సిద్ధాంతం మనకు సమ్మతం కాజాలదు.
16. తదుపరాగాపేక్షిత్వాచ్చిత్తస్య వస్తు జ్ఞాతాజ్ఞాతమ్.
వస్తువులు చిత్తంమీద ప్రతిబింబించే విధానాన్ని బట్టి అవి జ్ఞాతాలు (తెలిసేవి) అజ్ఞాతాలు (తెలిసేవికానివి) అని ఉంటాయి.
17. సదా జ్ఞాతాశ్చిత్తవృత్తయస్తత్ప్రభోః పురుషస్యా పరిణామిత్వాత్.
చిత్తానికి అధిపతి అయిన పురుషునికి పరిణామం లేనందువల్ల, చిత్తవృత్తులు నిరంతరం తెలుస్తున్నాయి.
జగత్తు మనస్సుకూ – ప్రకృతికి కూడా సంబంధించి ఉందని ఈ సిద్ధాంతం సారాంశం. మనఃప్రకృతులు రెండూ సదా మారిపోతుంటాయి. ఈ పుస్తకమంటే ఏమిటీ? నిరంతరం వికారం పొందే పరమాణువుల కూడిక. ఈ పరమాణువుల్లో కొన్నింటి సముదాయం పైకి వెళుతుంటే, మరికొన్నింటసముదాయం లోనికి వస్తూ ఉంటుంది. ఇది ఒక సుడిగుండం లాంటిది. అయితే వీటికి దేనివల్ల ఏకత్వం ఏర్పడుతున్నదీ? వీటిని ఒకే పుస్తకంగా ఏది ఏర్పడచేస్తున్నది? క్రమవిధానాన్ననుసరించి ఈ మార్పులు కలుగుతుంటాయి. దీనిలోని భాగాలు నిరంతరం మారుతున్నా, ఏకవిధంగా ఇవి నా మనస్సుకు స్పర్శలను కలిగించటం వల్ల, ఈ స్పర్శలన్నీ ఒకదానితో ఒకటి చేరి స్థిరరూపాన్ని ఏర్పాటుచేస్తున్నాయి. నా మనస్సు కూడా సదా మారిపోతూనే ఉంది. మనస్సు, శరీరం ఒకే పదార్థంలో ఉండే రెండు పొరలలాంటివి.
ఇవి వేరు – వేరు గతులతో కదులుతూ ఉంటాయి. సాపేక్షంగా చూస్తే, ఒకటి మందగమనాన్ని, మరొకటి తీవ్రగమనాన్ని కలిగి యుండటం వల్ల, ఈ రెంటినీ వేరుచేసి తెలుసుకోగలం. ఎలా అంటే, ఒక రైలు వెళుతుంటే, దాని ప్రక్కనే ఒక (గుర్రపు) బండి వెళుతున్నదనుకొందాం. కొంతవరకు ఈ రెంటి గమనాన్ని మనం కనుక్కోవచ్చు. అయినా వీటికి తోడు మరొక విషయాన్ని గమనించాల్సి ఉంది. చలించని వస్తువు వేరొకటి ఉంటే తప్ప, చలనాన్ని కనుక్కోలేము. అయితే రెండు మూడు వస్తువులు వివిధ గతులతో కదలుతూ ఉంటే, త్వరితంగా కదిలేదాని గమనాన్ని మొదట కనుగొంటాం. తర్వాత నెమ్మదిగా కదులుతున్నదాని గమనం మనకు గోచరిస్తుంది. మరి మనస్సుకు ఇంద్రియానుభవాలు ఎలా కలుగుతున్నాయి? మనస్సు సదా మార్పుచెందుతూనే ఉంది. కాబట్టి మనస్సుకన్నా తక్కువ వేగం ఉన్నదొగటి, దానికన్నా మరింత తక్కువ వేగం ఉన్నదొకటి; ఈ విధంగా పోను పోనూ అంతం కనిపించదు. ఇలా అనవస్థ ఏర్పడటం మూలంగా, ఎక్కడో ఓ చోట మనం నిలవాలి. ఎన్నటికీ మార్పుచెందని ఒక వస్తువును కనుగొని, ఈ పరంపరను మనం సమాప్తి చేయాలి. ఈ అనంతపరిణామ ప్రవాహానికి ఆధారభూతుడు, నిర్వికార నిర్మల నిత్యశుద్ధ పురుషుడు ఉన్నాడు. చిత్రదీపం (మేజిక్ లాంతరు) తెరమీద ప్రతిమలు పడేలా చేస్తున్నా, తెరకెలాంటి వికారం కలిగించదు. అలాగే ఈ స్పర్శలన్నీ పురుషునిలో కేవలం ప్రతిఫలిస్తున్నాయి.
18. న తత్ స్వాభాసం దృశ్యత్వాత్.
ఆ చిత్తం పురుషునికి (దృశ్య) విషయమై ఉండటంవల్ల, స్వయం ప్రకాశకం కాదు.
ప్రకృతిలో అంతటా అద్భుతశక్తి వ్యక్తమవుతున్నా, ఆ శక్తి స్వప్రకాశవంతం, జ్ఞానవంతం కాదు. పురుషుడు మాత్రమే స్వయంప్రకాశుడె, సర్వాన్ని భాసింపచేస్తున్నాడు. సమస్త ప్రకృతి నుండీ సర్వశక్తుల నుండీ పురుషుని శక్తే ప్రకాశిస్తున్నది.
19. ఏకసమయే చోభయానధారణమ్.
ఏకకాలంలోనే రెంటిని గ్రహించుట చిత్తానికి సాధ్యం కానందువల్ల చిత్తం స్వయంప్రకాశమై ఉంటే, ఏకకాలంలో తనను, తన విషయాలను అవలోకింపగ్లుగుతుంది. కాని అలా చూడలకేపోతున్నది. విషయాన్ని చూచే సమయంలో తనను తాను చూసుకోలేదు. అందుకని పురుషుడే స్వయంప్రకాశవంతుడు. చిత్తానికి అలాంటి స్వప్రకాశశక్తి లేదు.
20. చిత్తాంతరదృశ్యే బుద్ధిబుద్ధేరతిప్రసంజ్గః స్మృతిసంకరశ్చ.
మరొక చిత్తం వల్ల దర్మనయోగ్యత కలుగుతున్నదని ఊహిస్తే అలాంటి ఊహలకు అంతం లేకుండుట – స్మృతి సంకరమగుట సంభవిస్తుంది.
సాధారణ మనస్సును అవలోకించే మనస్సు మరొకటి ఉందనుకుందాం. దాన్ని అవలోకించటానికి మరొక మనస్సు ఉండాలి. ఈ విధంగా అంతం ఎన్నటికీ ఉండదు. దీనివల్ల స్మృతి తారుమారగుట, నిరాధారమగుట సంభవిస్తుంది.
21. చితేరప్రతి సంక్రమాయాస్తదాకారాపత్తౌ స్వబుద్ధిసంవేదనమ్.
జ్ఞానస్వరూపం (పురుషుడు) నిర్వికారమై ఉండటంవల్ల, చిత్తం పురుషుని స్వరూపాన్ని పొందినప్పుడు జ్ఞానమంతమవుతుంది.
జ్ఞానం అనేది పురుషుని గుణం కాదని స్పష్టం చేయటానికి పతంజలి ఇలా చెబుతున్నాడు. చిత్తం పురుషుని సాన్నిధ్యం పొందగానే, పురుషుడు దానిమీద ప్రతిఫలిస్తాడు. దానితో తాత్కాలికంగా చిత్తం జ్ఞానవంతమై తానే పురుషుడై ఉన్నట్లు కనిపిస్తుంది.
22. ద్రష్టృదృశ్యోపరక్తం చిత్తం సర్వార్థమ్.
ద్రష్ట – దృశ్య (పురుషుడు – విషయం) ప్రతిఫలిత చిత్తం సర్వ విషయాలను గ్రహిస్తుంది.
చిత్తానికి ఒకవైపు దృశ్యప్రపంచం ప్రతిఫలిస్తుంటుంది; మరొక వైపు ద్రష్ట అయిన పురుషుడు ప్రతిఫలిస్తుంటాడు. ఇలా చిత్తానికి సర్వ విషయాలను గ్రహించే శక్తి కలుగుతుంటుంది.
23. తదసంఖ్యేయవాసనాభిశ్చిత్రమపి పరార్థం సంహత్యకారిత్వాత్.
లెక్కలేనన్ని వాంఛలతో చిత్తం విచిత్రంగా ఉన్నా, మరొకని (పురుషుని) కోసం వర్తిస్తుంది. ఎందుకంటే, చిత్తం సంయోగ రూపంలో వర్తిస్తుంది.
చిత్తం అనేక విషయాల సంయోగం. అందుకని తన కోసం తాను అది వర్తించలేదు. లోకంలో సంయోగజనిత వస్తువులన్నీ, మరొక వస్తువు కోసం ఏర్పడుతుంటాయి. అందువల్ల, చిత్తమనే ఈ సంయోగం పురుషుని కోసం ఏర్పడింది.
24. విశేష దర్శిన ఆత్మభావ భావనానివృత్తిః.
వివేకికి చిత్తమే ఆత్మ అనే భావన నివర్తిస్తుంది.
పురుషుడు చిత్తం కాడు – అన్న విషయాన్ని వివేకంవల్ల యోగి గ్రహిస్తాడు.
25. తదా వివేకనిమ్నం కైవల్యప్రాగ్భావం చిత్తమ్.
అప్పుడు వివేకంలో నిమగ్నమై ఉన్న చిత్తం, పూర్వావస్థ అయిన కైవల్యాన్ని పొందుతూంది.
ఇలా యోగాభ్యాసం వినిర్మలదృష్టి అనే వివేకాన్ని కలిగిస్తుంది. మన కండ్లను కప్పిన తెర వదలగానే వస్తుతత్త్వం మనకు గోచరిస్తుంది. ప్రకృతి అన్నది సంయోగంవల్ల ఏర్పడుతుందని, సాక్షిపురుషుని కోసం చిత్ర – విచిత్ర ప్రదర్శనాన్ని చూపుతుందని, ప్రకృతి ఎన్నడూ ప్రభుస్థానం ఆక్రమించలేదని మనం గ్రహిస్తాం. హృదయ సింహాసనాసీన పురుషుని వినోదం కోసం ప్రకృతి ఈ రూపాలను పొందుతున్నదని మనకు వెల్లడౌతుంది. చిరకాలానుగత సాధనవల్ల, వివేకం కలగగానే భయమన్నది మనవద్ద ఉండటానికి భయపడి పారిపోతుంది. అంతట చిత్తాలకు కైవల్యమబ్బుతుంది.
26. తచ్చిద్రేషు ప్రత్యయాన్తరాణి సంస్కారేభ్యః.
దానికి (ఆ కైవల్యానికి) ప్రతిబంధకాలుగ వెలువడే భాగాలు సంస్కారాలవల్ల కలుగుతున్నాయి.
సుఖప్రాప్తికి బాహ్యవిషయమేదో ఒకటి అవసరమని మన విశ్వాసం. ఇలాంటి విశ్వాసహేతువు గల భావాలన్నీ కైవల్యప్రాప్తికి ప్రతిబంధకాలు. స్వయంగా పురుషుడు సుఖస్వరూపుడు. పూర్ణానందమయుడు. కానీ, పూర్వసంస్కారాలతో ఈ జ్ఞానం ఆవరితమై ఉంది. ఈ సంస్కారాలన్నీ క్రియారూపాన్ని పొందితీరాలి.
27. హానమేషాం క్లేశవదుక్తమ్.
ఇదివరకూ చెప్పిన విధంగా (210) అవిద్య అస్మితాది క్లేశాలను నిగ్రహించిన విధంగానే, ఈ సంస్కారాలను నిగ్రహించాలి.
28. ప్రసంఖ్యానేఽప్యకుసీదస్య సర్వధా వివేకఖ్యాతేర్ధర్మ మేఘః సమాధి.
సర్వతత్త్వాలను చక్కగా వివేకించే జ్ఞానాన్ని పొంది, ఫలాపేక్షలేక ఉండేవానికి అలాంటి పరిపూర్ణవివేక ఫలితంగా ‘ధర్మమేఘం’ అనే సమాధి కలుగుతుంది.
ఇలాంటి వివేకాన్ని పొందిన యోగికి, పూర్వాధ్యాయంలో చెప్పిన సిద్ధులన్నీ కలుగుతాయి. కాని నిజమైన యోగి వాటినెల్లా పరిత్యజిస్తాడు. అలాంటివానికి ‘ధర్మమేఘం’ అనే విచిత్ర వికాస అపూర్వజ్ఞానం కలుగుతుంది. చరిత్రకెక్కిన ప్రపంచం మహాప్రవక్తలంతా, ఇలాంటి వికాసాన్ని పొందినవారే. సమస్తజ్ఞానం మనలోనుండే కలుగుతుందని వారు గ్రహించారు. తత్త్వాన్ని వారు ప్రత్యక్షంగా దర్శించారు. అప్రాకృత శక్తులను ఈ ఆడంబరాన్ని వదిలిపెట్టగానే, ప్రశాంతి – పరిపూర్ణ విశుద్ధత వారికి సహజలక్షణాలై ఒప్పాయి.
29. తతః క్లేశ కర్మనివృత్తిః.
దానివల్ల (అవిద్యాది) క్లేశాలు కర్మలు నివృత్తమవుతాయి.
ధర్మమేఘమనే సమాధి కలిగితే, యోగికి పతనమనేది ఇక కలగదు. అతన్ని ఏది కూడా చ్యుతున్ని చేయలేదు. కాబట్టి అతనికి క్లేశాలంటూ ఉండవు; అతను సర్వదుఃఖాలకు అతీతుడై పోతాడు.
30. తదా సర్వావరణమలాపేతస్య జ్ఞానస్యాఽనంత్యాత్ జ్ఞేయమల్పమ్.
అప్పుడు జ్ఞానం, ఆవరణ – సర్వమాలిన్యముక్తమై ఉండటంవల్ల, జ్ఞేయం అల్పమవుతుంది.
జ్ఞానావరణం తొలగిపోగానే, జ్ఞానం ప్రకాశిస్తుంది. బుద్ధుడంటే, ‘ఆకాశంలా అనంతజ్ఞానం’ – అని ఒక బౌద్ధగ్రంథం బుద్ధత్వాన్ని నిర్వచిస్తుంది. బుద్ధుడన్నది ఒక స్థితినామం అని మనం గుర్తించాలి. జీసస్ మహాశయుడు ఈ స్థితి పొంది, క్రీస్తు అయ్యాడు. మీరంతా ఈ స్థితిని పొందుతారు. జ్ఞానం అనంతం కాగానే, తెలియవలసిన విషయం అల్పమై పోతుంది. అనంత జ్ఞేయవిషయాలతో కూడిన ఈ బ్రహ్మాండమంతా, పురుషుని ముందు సముద్రంలో నీటిబొట్టు లాంటిది. సామాన్యుడు తాను అత్యల్పుడనుకొంటాడు. ఎందుకంటే, తాను గ్రహించవలసింది అనంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
31. తతః కృతార్థానాం పరిణామక్రమసమాప్తిర్గుణానామ్.
అప్పుడు (సత్త్వాది) గుణాలు కార్యసాఫల్యాన్ని పొందటంవల్ల, వాటి పరిణామక్రమం పరిసమాప్తమవుతుంది.
వేరు వేరు జాతుల్లో వేరు వేరు రీతులుగా ఉండే సత్త్వాదిగుణాల వివిధ పరిణామాలన్నీ శాశ్వతంగా పరిసమాప్తమవుతాయి.
32. క్షణప్రతియోగీ పరిణామాపరాన్తనిర్గ్రాహ్యః క్రమః.
క్షణాలనుబట్టి కలిగే, వలుసగా కొన్ని (మార్పులు కలిగి తర్వాత తెలిపే మార్పులే పరిణామంలో) క్రమమై ఉంటాయి.
ఇక్కడ పతంజలి క్షణాలను (కాలాన్ని) బట్టి కలిగే పరిణామమైన ‘క్రమం’ అనే పదాన్ని నిర్వహిస్తున్నాడు. నేను (ఒక విషయాన్ని గూర్చి) ఆలోచన చేసేటప్పుడు, అనేక క్షణాలు గడిచిపోతాయి. వీటిలో ప్రతి క్షణం (రెప్పపాటుకాలం)లో కూడా భావంలో ఒక మార్పు కలుగుతుంది. అయినా వరుసగా ఇలాంటి మార్పులు కొన్ని జరిగితే తప్ప, ఈ మార్పులను నేను గ్రహించలేను. దీన్నే (పరిణామ) క్రమమంటారు. కాని, సర్వగతత్త్వాన్ని పొందిన చిత్తానికి క్రమమంటూ ఉండదు. సర్వం అలాంటి చిత్తానికి ప్రస్తుత (వర్తమాన) విషయంగా పరిణమిస్తుంది. భూత భవిష్యత్లనేవి నశించి, అలాంటి చిత్తానికి వర్తమానమన్నది మాత్రమే నిలుస్తుంది. కాలం ఆ చిత్తానికి వశమవుతుంది. సమస్తజ్ఞానం తృటిలో కట్టెదుట నిలుస్తుంది. సర్వం మెరుపు మెరసినట్లు గోచరిస్తుంది.
33. పురుషార్థశూన్యానాం గుణానాం ప్రతిప్రసవః కైవల్యం స్వరూపప్రతిష్ఠా వా చితిశక్తే రితి.
పురుషుని ప్రయోజనం కన్నా వేరే ఫలాపేక్ష లేని (సత్త్వాది) గుణాలను విలోమక్రమంలో లయింపచేయటాన్నిగానీ, చిత్ప్రకాశాన్ని స్వస్వరూపంలో నెలకొల్పటాన్నిగానీ కైవల్యమంటారు.
ప్రకృతి వహించిన కార్యం సమాప్తమైంది. ప్రేమపాత్రురాలైన ప్రకృతి అనేదాని పరోపకారార్థం తన భుజాలపై వేసుకొన్న ఈ మహాకార్యం పరిసమాప్తమైంది. తన్ను తాను మరచిన పురుషునికి ఆమె మెల్లగా చేయూతనిచ్చి, ప్రపంచానుభవాలనన్నింటినీ దృశ్యాలనన్నింటినీ చూపి, అతను తన విగత వైభవాన్ని పొంది స్వస్వరూప జ్ఞానాన్ని ప్రాప్తించే వరకూ క్రమ క్రమంగా వివిధ శరీరాల మూలంగా అతన్ని ఉన్నతస్థితికి తెచ్చింది. దయాస్వరూపిణి అయిన ప్రకృతిమాత దుర్గమ జీవితారణ్యంలో త్రోవ తప్పి చరించే ఇతరుల కోసం తాను వచ్చిన మార్గంలోనే మరలిపోతున్నది. నిరంతరం ఇలా ఆమె కృషిచేస్తూనే ఉంది.
ఇలా సుఖ దుఃఖానుభవాల మూలంగా, పుణ్య పాపానుభవాల మూలంగా అనంత జీవప్రవాహం, ఆత్మసాక్షాత్కార సాగరంలో సంగమిస్తున్నది.
స్వస్వరూపాన్ని పొందిన మహనీయులందరికీ జయమగు గాక!
వారి ఆశీస్సులు మనకందరికీ లభించునుగాక!