ఏకాగ్రత – దాని అభ్యాసం
1. తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః.
తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం (కర్మఫలాలను ఈశ్వరునికి అర్పించటం) అన్నవాటిని క్రియాయోగమంటారు.
మొదటి అధ్యాయంలో చెప్పుకున్న సాధనాలు కష్టసాధ్యాలు. వాటిని సావధానంగా అభ్యాసం చేయాలి. దానికి క్రియాయోగం ప్రథమ సోపానం. క్రియా యోగమంటే కర్మాచరణం యోగసాధనం అని భావం. ఇంద్రియాలే గుర్రాలు; మనస్సే కళ్ళెం. బుద్ధియే సారథి; ఆత్మయే రథికుడు; శరీరమే రథం. గృహయజమాని రాజు, మనుష్యాత్మ ఈ రథంలో అధివసించి యుంటాడు. గుర్రాలు బలిష్ఠాలై, పగ్గాలకు వశం కాకుండా ఉంటే, సారథికి వాటిని నిరోధించే ఉపాయం తెలియకపోతే, రథం దుర్గతి పాలవుతుంది. అలా కాకుండా, ఇంద్రియాలనే గుర్రాలను చక్కగా వశం చేసుకుని, బుద్ధి అనే సారథి, మనస్సు అనే కళ్ళేన్ని హస్తగతం చేసుకుంటే, ఆ రథం గమ్యస్థానం చేరుతుంది. తపస్సంటే ఏమిటీ? మనశ్శరీరాలను స్వవశం చేసుకుని వాటిని యథేచ్చగా సంచరించనీయకుండా ఉచితరీతిని నిరోధించటమే తపస్సు.
స్వాధ్యాయం: స్వాధ్యాయమంటే ఏమిటీ? నవలలు కథల పుస్తకాలను వల్లించటం కాదు. ముక్తిమార్గాన్ని లభింపచేసే సద్గ్రంథ పఠనమే స్వాధ్యాయం. తార్కిక గ్రంథ పఠనం కూడా స్వాధ్యాయం కాదు. యోగి తార్కిక దశను దాటివేసియుంటాడనే భావిస్తాము. కావలసినంత కాలం అతను పూర్వపక్ష సిద్ధాంతాల్లో గడిపి తృప్తిచెందియుంటాడు. తన సిద్ధాంతాలను దృఢం చేసుకోవటమే, అధ్యయనం వల్ల అతనికి కలిగే ప్రయోజనం.
పూర్వపక్షం, సిద్ధాంతం అని వైదికజ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. అజ్ఞానదశలో సాధకుడు వీటిలో మొదటిదైన పూర్వపక్షాన్ని అవలంబించి, యుక్తి ప్రయుక్తులను వినియోగిస్తుంటాడు. తార్కికదశ ముగియగానే, సిద్ధాంత దశ వస్తుంది. ఇలా సిద్ధాంతానికి రావటంతో సరికాదు; ఆ సిద్ధాంతాన్ని దృఢం చేసుకోవాలి. పఠించాల్సిన గ్రంథాలు అనంతం; సమయం అతి పరిమితం. కాబట్టి సారభూత విషయాన్ని గ్రహించటమే జ్ఞానార్జనకు ఉపాయం. పరమార్థాన్ని గ్రహించి, తదనుగుణంగా జీవితాన్ని గడిపేందుకు యత్నించాలి. నీటిని పాలను కలిపి, రాజహంస ఎదుట పెడితే, అది నీటిని వదలి పాలను మాత్రమే గ్రహిస్తుందని ఆర్యుల విశ్వాసం. అలాగే, సర్వశాస్త్రాల్లోని సారాంశాన్ని గ్రహించి, మిగిలిన అప్రధాన విషయాలను విసర్జించాలి. వాద ప్రతివాదాలతో కూడిన తార్కిక వ్యాయామం మొదట్లో అవసరమే. దేనిని గూడా గ్రుడ్డిగా అవలంబించకూడదు. యోగి తార్కికదశను అతిక్రమించి, శిలాసదృశ సిద్దాంత దశకు వచ్చియుంటాడు. సిద్ధాంతాన్ని ధృడం చేసుకోవటమే అతను చేయవలసిన పని. “వాదించకు. ఇతరులు నీతో వాదింపచూస్తే, మౌనం వహించు” అని యోగి చెబుతాడు. ఏ వాదానికీ బదులు చెప్పక ఆ ప్రదేశాన్ని నిశ్శబ్దంగా వదలిపెట్టి వెళ్ళిపోవాలి. వాద ప్రతివాదాల వల్ల మనశ్శాంతి చెడుతుంది. మనస్సును బలవంతం చేసుకోవటం మనకవసరం. అనవసరంగా మనస్సును కలవరపరచుకోవటం వల్ల ప్రయోజనమేముంటుంది? దుర్బల ధీశక్తితో అతీంద్రియ జ్ఞానాన్ని పొందలేము. యోగి, అతీంద్రియ జ్ఞానాన్ని పొందాలనుకుంటాడు కాబట్టి అతనికి తార్కిక జ్ఞానం వ్యర్థం. ఇదే అతను నిశ్చయం చేసుకుంటాడు. కాబట్టి అతను వాద ప్రతివాదాలు చేయడు; మౌనంగా ఉంటాడు. వాగ్వాదాలు అతని మనశ్శాంతిని చెడగొడతాయి; మనస్సును కలవరపెడతాయి. హేతువాదాలూ, యుక్తిప్రయుక్తులూ అన్నీ అప్రధానాలు. హేతువాదాతీత మహోన్నతాంశాలెన్నో ఉన్నాయి. బడి పిల్లల వాగ్వాదాల కోసం, తార్కిక సంఘాల కోసం జీవితం ఏర్పడియుందని అనుకోవద్దు.
ఈశ్వర ప్రణిధానం అంటే కర్మలను ఈశ్వరునికి అర్పించటం. అంటే, కార్యం ఫలిస్తే ఆ ప్రతిష్ఠను గానీ, కార్యం భగ్నమైతే ఆ నిందను గానీ మనమీద పెట్టుకోవద్దు; ఆ రెంటినీ ఈశ్వరునికే అర్పించి స్వస్థచిత్తులమై ఉండాలి.
2. సమాధి – భావనార్థః క్లేశ – తనూకరణార్థశ్చ.
సమాధిని సిద్ధింప చేయటానికి, (అవిద్యాది) క్లేశాలను క్షీణింప చేయటానికి (క్రియాయోగం ఏర్పడింది.)
మనోనిగ్రహం అనేదే మనలో చాలామందికి ఉండదు; వారు మనస్సును యథేచ్ఛగా వదిలివేస్తారు; చివరికి వారు ఎందుకూ కొరగారు. కాబట్టి మనోనిగ్రహం సాధించాలి; దానికోసం నిరంతరం క్రియాయోగం అభ్యసించాలి. మనోనిగ్రహం లేకపోవటం వల్ల, యోగానికి ఆటంకాలు కలుగుతాయి; ఆ ఆటంకాలు మనకు క్షేశకారణాలౌతాయి. క్రియాయోగం వల్ల మనోనిగ్రహం కలిగి, క్లేశాలు నివారితమౌతాయి.
3. అవిద్యాస్మితా – రాగ – ద్వేషాభినివేశాః క్లేశాః.
అవిద్య, అస్మిత (అహంకారం), రాగం, ద్వేషం, అభినివేశం (ప్రాణంపై తీపి) అనేవి ఐదు క్లేశాలు.
ఐదు క్లేశాల్లో కూడా అవిద్యా లేదా అజ్ఞానం కారణం; మిగిలిన నాలుగు కార్యాలు, ఈ క్లేశాలు మనకు సంసారబంధాన్ని కల్పించే పంచ పాశాలు. అజ్ఞానం కన్నా దుఃఖ కారణం మరొకటి లేదు. సహజంగా పురుషుడు ఆనందస్వరూపుడు. మాయకన్నా, భ్రాంతికన్నా, అజ్ఞానం కన్నా పురుషునికి దుఃఖహేతువేముంటుందీ? పురుషుని దుఃఖమంతా భ్రాంతే తప్ప మరొకటి కాదు.
4. విద్యాక్షేత్రముత్తరేషాం ప్రస్తుప్త – తను – విచ్చిన్నోదారాణామ్.
ఇవి (క్లేశాలు) నిద్రాణాలై ఉన్నా, మందస్థితిలో ఉన్నా, అణగి ఉన్నా, విజృంభించి ఉన్నా, అహంకారానికి, రాగద్వేషాలకూ, ప్రాణంపైని తీపికి అవిద్యయే మూలకారణం.
అహంకారానికి, రాగానికి, ద్వేషానికి, అభినివేశానికి (ప్రాణంపై తీపికి) అవిద్యయే కారణం. ఈ సంస్కారాలు వివిధ అవస్థల్లో ఉంటాయి. కొన్ని సమయాల్లో ఇవి పైకి కనిపించక నిద్రాణాలై ఉంటాయి. ‘పసివానిలా అమాయకుడ’ న్న మాటను మనం తరచూ వింటూ ఉంటాం. అయితే పసివానిలో రాక్షసస్వభావమో – దేవతా స్వభావమో గర్భితమై ఉండవచ్చు; అది క్రమంగా వ్యక్తం కావచ్చు. యోగుల్లో ఈ సంస్కారాలు అతిసూక్ష్మస్థితిలో ఉంటాయి; కాబట్టి వారు వాటిని నిర్మూలించుకుంటారు. అణగియుండుట అంటే, ఒకజాతి ప్రబల సంస్కారాలు, మరోజాతి బలహీన సంస్కారాలను తాత్కాలికంగా నిరోధించటం; ప్రతిబంధం తొలగిపోగానే, ఆ బలహీన సంస్కారాలు మరల వ్యక్తమవటమన్నమాట. అనుకూల పరిస్థితులు ఏర్పడినంతనే సంస్కారాలు సద్వృత్తులుగానో, దుర్వృత్తులుగానో విజృంభిస్తాయి.
5. అనిత్యాశుచి – దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతిరవిద్యా.
అనిత్యాలను నిత్యంగా, అశుద్ధాలను శుద్ధంగా దుఃఖాత్మకాలను సుఖాత్మకంగా, అనాత్మలను ఆత్మగా భావించుటే అవిద్య.
రకరకాలైన ఈ సంస్కారాలన్నింటికీ అవిద్యయే మూలకారణం. అవిద్య అంటే ఏమిటీ? “శరీరమే నేను” అని, “శుద్ధమై స్వయం జ్యోతియై సచ్చిదానందమై ఉన్న ఆత్మ నేను కాన” ని మనం భావిస్తుంటాం. ఇదే అవిద్య. (భగవంతుని వదలి) మనిషి గూర్చి భావిస్తూ, శరీరమే మనిషని తలుస్తుంటాం. ఇదే మహామాయ.
6. దృగ్ధర్శన శక్త్యో రేకాత్మ తైవాస్మితా.
సాక్షిత్వానికి సాధనభూతమైన అంతఃకరణంతో పురుషుడు తాదాత్మ్యం చెందుటే అస్మిత అనే క్లేశం.
సాక్షీపురుషుడు నిజంగా నిత్యశుద్ధబుద్ధముక్త ఆత్మ తప్ప మరేమీ కాదు. మనస్సు, బుద్ధి, చిత్తం, ఇంద్రియాలు ఇవన్నీ పురుషునికి బాహ్యప్రపంచానుభవం పొందటానికి సాధనాలై ఉన్నాయి. పురుషుడు ఈ సాధనాలతో తాదాత్మ్యం పొందుటే ‘అస్మిత’ లేదా అహంకారం. “నేను మనస్సు, నేను సంకల్పం, నాకు కోపం వచ్చింది, నేను సుఖీని” అని మనం అంటుంటాం. ఆత్మస్వరూపులమైన మనకు రాగద్వేషాలెలా కలుగుతాయి? ఆత్మతో ఏకత్వాన్ని పొందాలి. ఆత్మనిర్వికారం. కాబట్టి ఆత్మకు సుఖం గానీ, దుఃఖం గానీ ఎప్పుడూ కలగవు. నిర్వికార నిత్య సర్వగత ఆత్మకు ఏదీకూడా వికారాన్ని కలిగించజాలదు. ఆత్మ సర్వాతీతం; ప్రకృతినియమాలకు బద్ధం కాదు. అయితే మనం అంతఃకరణంతో తాదాత్మ్యం పొంది “సుఖీస్తున్నాం” అని అనుకొంటాం.
7. సుఖానుశయీ రాగః.
సుఖాన్ని అనుసరించి యుండేది రాగం.
శబ్దాది విషయాలు కొన్ని మనకు సుఖహేతువులై ఉంటాయి. అందుకే ప్రవాహరూపంలో మనస్సు వాటివైపు వెళుతూ ఉంటుంది. ఇలా సుఖహేతువును అనుసరించటాన్నే రాగమంటారు. దుఃఖకర విషయాల్లో మనకెప్పుడు కూడా రాగం కలగదు. విపరీత విషయాలు, కొన్ని సమయాల్లో మనకు సుఖకరంగా తోచినా, సుఖహేతువులైన విషయాల్లోనే రాగం జనిస్తుందన్న ధర్మమే వాటిలో వర్తిస్తుంది.
8. దుఃఖానుశయీ ద్వేషః.
దుఃఖాన్ని అనుసరించి ఉండేదే ద్వేషం.
దేనివల్ల మనకు బాధ కలుగుతుందో, వెంటనే దాన్నుండి తొలగిపోయే ప్రయత్నం చేస్తాం.
9. స్వరసవాహీ విదుషాషోపి తథారూఢోఽభినివేశః.
పండితులకు కూడా ప్రాణంమీద తీపి దృఢంగా ఉంటుంది.
ప్రతి జంతువుకూ ప్రాణభీతి ఉంటుంది. ప్రాణం మీది తీపి కారణంగానే జనులు పునర్జన్మను కూడా కోరుకుంటుంటారు. దీన్ని ఆధారంగా గ్రహించి, పునర్జన్మ సిద్ధాంతాన్ని స్థాపించటానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఈ వాదం నిలువజాలదు అని వేరుగా చెప్పనవసరం లేదు; అయితే ఇందులో ఒక విచిత్రం ఉంది. ప్రాణభీతి జన్మాంతరాన్ని సూచిస్తుంది అన్న విషయం మనుషులకే తప్ప, జంతువులకు వర్తించదని పాశ్చాత్యుల భావం. హిందువులు పూర్వానుభవం, పూర్వజన్మ ఉన్నాయని నిరూపించటానికి ఈ ప్రాణభీతిని ఒక హేతువుగా పరిగణించారు. అనుభవమే మన జ్ఞానానికంతా మూలాధారమై ఉందనటం వాస్తవమైతే, మనమెప్పుడూ అనుభవించని విషయం గూర్చి ఊహించటం, గ్రహించటం మనకసాధ్యమై ఉండాలి. కోడి తన గ్రుడ్లను పొదిగి, పిల్లలను చేసినవెంటనే, అవి ఆహారాన్ని ఏరుకుని తినటం మొదలుపెడతాయి. ఆ కోడిపెట్టే బాతుగ్రుడ్లను పొదిగితే, బాతుపిల్లలు మాత్రం వెంటనే నీటివైపు పరుగెడుతాయి. అవి నీటిలో మునిగిపోతాయేమోనని కోడితల్లి భయపడటం కూడా మనం చూస్తుంటాం. ప్రత్యక్షానుభవం ఒక్కటే జ్ఞానానికి మూలకారణమై ఉంటే, మరి కోడి పిల్లలు ఆహారం తినటం, బాతుపిల్లలు నీటిని తమ వాసస్థానమని తెలుసుకోవటం ఎక్కడ నేర్చుకున్నాయి? అది సహజ జ్ఞానమంటారా? ఆ మాటలు అర్థరహితాలు. ‘సహజ జ్ఞాన’ మన్న పదాన్ని చూపటం, వివరణ ఎంతమాత్రం కాదు. సహజ జ్ఞానం ఎలాంటిదీ? మనలో ఇలాంటి సహజ జ్ఞాన ప్రవృత్తులనేకం ఉన్నాయి. మీలో ఎంతోమంది యువతులు పియానో వాయిస్తారు. మొదట్లో నేర్చుకునేటప్పుడు, తెలుపు నలుపు శృతుల మీద ఎంతో జాగ్రత్తగా మీ వ్రేళ్ళను పెట్టవలసి వచ్చేది కదా! దాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. అయితే నేడు మీరు, మీ ప్రక్క స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నా మీ చేతివ్రేళ్ళు మాత్రం తమంత తామే శృతులను వాయిస్తుంటాయి. ఇలా వాయించటం, మీ చేతివ్రేళ్ళకు సహజగుణంగా మారిపోయింది. ఇలాగే, మనం చేసే ప్రతి కార్యం కూడా అభ్యాసంతో సహజమై దానంతట అదే జరిగిపోతూ ఉంటుంది. అయితే, మనకు తెలిసినంతవరకూ, సహజవ్యాపారాలనే క్రియలన్నీ సూక్షావస్థను పొందిన తార్కికజ్ఞాన ఫలితాలే. యోగ పరిభాషలో చెప్పాలంటే, అవ్యక్త తార్కికజ్ఞానమే సహజ జ్ఞానం అని చెప్పాలి. తార్కికజ్ఞానం సూక్ష్మస్థితిలో సంస్కారరూపం పొందుతుంది. కాబట్టి సహజ జ్ఞానమనేదంతా అవ్యక్త తార్కిక జ్ఞానమే అని అనుకోవటం హేతువిరుద్ధం కాదు. అనుభవం వల్లనే తార్కికజ్ఞానం కలుగుతుంది; కాబట్టి సహజ జ్ఞానమంతా పూర్వానుభవ ఫలితమే. కోడిపిల్లలు గుడ్ల గూబను చూసి భయపడుట, బాతుపిల్లలు నీరంటే ప్రీతి చూపుట పూర్వానుభవం వల్లనే సంభవిస్తున్నాయి. మరి ఈ అనుభవం జీవునిదా, శరీరానిదా? బాతుపిల్లల అనుభవం వాటి మార్వానుభవమా, స్వానుభవమా? అన్నది మనం విచారణ చేయాలి. ఆధునిక శాస్త్రజ్ఞులు, ఈ అనుభవం శరీరానిదంటారు; శరీరద్వారం నుండి వ్యక్తమయ్యే మానసిక అనుభవమని యోగులంటారు. ఇదే పునర్జన్మ సిద్ధాంతం.
ప్రత్యక్షజ్ఞానమన్నా, తార్కికజ్ఞానమన్నా, సహజప్రవృత్తి అన్నా మన జ్ఞానమంతా అనుభవం ద్వారానే కలుగుతున్నది; అవ్యక్తపూర్వానుభవ ఫలితమే సహజప్రవృత్తి; సహజప్రవృత్తే తిరిగి తార్కికజ్ఞానంగా మారుతున్నది అని మనం గ్రహించాం. అనుభవాన్ని ప్రధానహేతువుగా గ్రహించి, హిందువులు పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. జన్మపరంపరల్లో రకరకాల భయాలను అనుభవించటమే, కాలక్రమంలో అది ప్రాణభీతికి కారణమవుతున్నది. పూర్వదుఃఖానుభవం వల్లనే ప్రాణంపై తీపి జనిస్తుంది. శరీరం ఎప్పటికైనా నశించేదే అని గ్రహించి, “వేలాది జన్మలెత్తాం; ఆత్మ మృత్యురహితం; కాబట్టి ఎందుకు భయపడాలి” అని చేప్పే మేధావులైన పండితులకు కూడా ప్రాణభీతి ఉంది. ప్రాణంపై తీపి కలగటానికి కారణమేమిటీ? మనకిది సహజప్రవృత్తియై యోగులు చెప్పేలా, సంస్కారరూపాన్ని పొంది ఉందని మనం గ్రహించాం. సూక్ష్మాలైన ఈ సంస్కారాలు, నిద్రాణమై చిత్తంలో అణగి ఉంటాయి. ఇంతదాకా కలిగిన మరణానుభవాలన్నీ సహజప్రవృత్తి అనేదంతా అసంప్రజ్ఞాత స్థితిని పొందిన అనుభవం. ఈ సంస్కారాలు చిత్తంలో అణగియుండి చిత్తవృత్తులను కలగచేస్తుంటాయి.
స్థూలచిత్తవృత్తులను (మానసిక తరంగాలను) చక్కగా గ్రహించగలం. వాటిని నిరోధించటం కూడా సులభమే. కాని సూక్ష్మసంస్కారాలను ఎలా నిరోధించాలీ? నాకు కోపం వస్తే, నా చిత్తమంతా కోపమనే తరంగరూపం దాలుస్తుంది. కోపం వచ్చినట్లు అప్పుడు గ్రహిస్తాను. దాన్ని సులభంగా నిగ్రహింపవచ్చు; మరల్చుకోవచ్చు; ప్రతిఘటింపవచ్చు. అయితే కోపకారణాన్ని సమూలంగా గ్రహిస్తే కానీ, కోపాన్ని పూర్తిగా నిగ్రహించలేము. నాతో ఎవరైన తీవ్రంగా మాట్లాడితే, నాకు కోపం వస్తున్న విషయాన్ని తెలుసుకుంటాను. నేను పూర్తిగా కోపావేశంతో నిండిపోయి, నన్ను నేను మరిచేంతవరకూ ఆ వ్యక్తి అలా పరుషంగా మాట్లాడుతూనే ఉంటాడనుకుందాం. మొదట్లో ఆ వ్యక్తి నన్ను దూషించ మొదలు పెట్టగానే, “నాకు కోపం వస్తున్నది” అని అనుకుంటాను. అంటే, అప్పుడు నేను కోపం వేరు వేరుగా ఉంటాం. కానీ నాకు కోపం రాగానే, కోపమే నేనైపోతాను. ఈ చిత్తవృత్తులు మొలకెత్తటానికి ముందే, సూక్ష్మాలై బీజావస్థలో ఉండగానే, వాటి ప్రాబల్యాన్ని మనం గుర్తించటానికి ముందే, వాటిని మనం నిరోధించాలి. బోధరహితావస్థ నుండి కామక్రోధాదులు ఎట్టి సూక్ష్మస్థితుల్లో వెలువడతాయో, చాలామందికి తెలియనే తెలియదు. సరస్సులో నీటి అడుగుభాగం నుండి పైకి ఒక బుడగ వస్తున్నప్పుడు దాన్ని మనం చూడలేము. అది ఉపరితలం దాకా వచ్చేవరకు కూడా ఆ బుడగను గమనించలేము. బుడగ నశించి, అక్కడ అల ఏర్పడినప్పుడే, అక్కడ బుడగ ఉందన్న విషయాన్ని మనం గ్రహిస్తాము. బీజావస్థలో నున్నప్పుడే, కామక్రోధాదులను కనుగొంటే, మనం వాటిని ప్రతిఘటించగలం. స్థూలరూపం ధరించకముందే, వాటిని నిరోధింపకుంటే, మనం కామక్రోధాదులను ఇక ఎప్పుడూ నిర్జించలేము. సూక్ష్మావస్థలో ఈ చిత్తవృత్తులను నిరోధిస్తే, వాటిని నిర్మూలించగలం. దగ్ధబీజాల మాదిరి అవి ఇక మరల మొలకెత్తవు.
10. తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః.
సూక్ష్మసంస్కారాలను ప్రతిలోమ పరిణామంతో నిరాకరించాలి.
సూక్ష్మసంస్కారాలు క్రమంగా స్థూలరూపాల్లో వ్యక్తమౌతాయి. సూక్ష్మసంస్కారాలను ఎలా నిరోధించాలి? మొదట స్థూల మనోవికారాలను నిగ్రహించాలి; తర్వాత క్రమంగా సూక్ష్మవికారాల వైపుకు వెళ్ళాలి. ఒక వ్యక్తి కోపావేశపరుడయ్యాడనుకుందాం. అప్పుడు ఆ కోపాన్ని ఎలా నిరోధించాలి? దానికి వ్యతిరేకమైన మనోభావాన్ని కలగచేసుకోవాలి; అదే ఉపాయం. ‘ప్రేమ’ భావాన్నే తీసుకుందాం. భర్తమీద భార్యకు కోపం వచ్చిందనుకోండి. అప్పుడు భార్య ఆ కోపాన్ని వెంటనే ప్రదర్శించవద్దు; ఆ క్షణంలో తన బిడ్డను ప్రేమతో ముద్దుపెట్టుకుంటే చాలు; ఆ కోపచిత్తవృత్తి అదృశ్యమై పోతుంది. బిడ్డమీద ప్రేమ అనే చిత్తవృత్తి కలుగుతుంది. కోపానికి, ప్రేమే వ్యతిరేక మనోభావం. కాబట్టి మనం ఏ చిత్తవృత్తులను నిరోధించాలనుకుంటున్నామో, వాటికి వ్యతిరేక మనోభావాల్ని కలగచేసుకుంటే చాలు, ఆ చిత్తవృత్తుల్ని నిరోధించగలం. సూక్ష్మాలైన ఈ వ్యతిరేక మనోభావాలను సూక్ష్మమనస్థితిలో కలగచేసుకుంటే, అవి అంతర్గతంలో ఉండే సూక్ష్మకోపవృత్తిని నిరోధిస్తాయి. సహజప్రవృత్తులు మొదట బోధపూర్వకాలై ఉండి, క్రమంగా సూక్ష్మస్థితిని పొందుతుంటాయని గ్రహించాము కదా! కాబట్టి సదా సద్వృత్తులను కలగచేసుకుంటూ ఉంటే, అవి సూక్ష్మస్థితిని పొంది దుష్టసంస్కారాలను నిరోధిస్తాయి. ధ్యానంవల్ల ఇవి నశించవు.
11. ధ్యానహేయా స్తద్వృత్తయః.
ధ్యానంవల్ల వృత్తుల వికారాలను నిరాకరించాలి.
చిత్తవృత్తులను నిరోధించటానికి ధ్యానం గొప్పసాధనం. ధ్యానంవల్ల మనస్సు, తన వృత్తులను నిరోధించేలా చేయవచ్చు. ధ్యానం మీకు అలవాటుగా అయ్యేంతవరకూ, వద్దన్నా కూడా ధ్యానస్థితి స్వయంగా కలిగేంత వరకూ, నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ ధ్యానాన్ని అభ్యాసం చేస్తూవస్తే రాగద్వేషాలు స్వాధీనాలై నిగృహీతాలౌతాయి.
12. క్లేశమూలః కర్మాశయో దృష్టాదృష్ట జన్మవేదనీయః.
(అవిద్యాది) క్లేశాలు కర్మలకు మూలకారణాలు. దృష్టమైన ఈ జన్మలోగానీ, అదృష్టమైన జన్మాంతరాల్లో గానీ, కర్మానుభవాలు కలుగుతాయి.
కర్మాశయమంటే, సంస్కారసముదాయం. మనం ఏ పని చేసినా, చిత్తం వృత్తిరూపాన్ని దాలుస్తుంది. కార్యం అయిపోగానే, వృత్తి నశిస్తుందనుకుంటాం. కాని అలా నశించదు. అది సూక్ష్మరూపంలో అక్కడే ఉంటుంది. ఆ కార్యాన్ని స్మరిస్తే చాలు, అది తిరిగి వృత్తిరూపం ధరిస్తుంది. లేకపోతే, ‘స్మృతి’ అనేదే కలగజాలదు. ఇలా ప్రతికర్మా, ప్రతిభావం సూక్ష్మస్థితిని పొంది చిత్తంలో అణగియుంటుంది. సుఖదుఃఖ కారకాలైన సద్భావ, దుర్భావాలు కూడా క్లేశాలే. ఎందుకంటే, కాలాంతరంలో అవి క్లేశకరాలౌతాయి. ఇంద్రియజన్య సుఖమంతా చివరికి దుఃఖహేతువే అవుతుంది. భోగానుభవాలు కామరాగాలకు కారణమై, దుః ఖదాయకాలౌతాయి. మనిషి కోరికలకు అంతులేదు. విధివిరామం లేకుండా మనిషి విషయభోగాలు కోరుకుంటూ, ఆ కోరికలు నెరవేరకుంటే దుః ఖీస్తుంటాడు. కాబట్టి సద్వృత్తులైనా, దుర్వృత్తులైనా వృత్తులన్నీ క్లేశాలే అని యోగులు పరిగణిస్తారు. ఆత్మస్వాతంత్ర్యానికి క్లేశాలు ప్రతిబంధకాలు.
కర్మలకు మూలం అయిన సంస్కారాలు కూడా ఇలాంటివే. కర్మఫలాలు ప్రస్తుత జన్మలోగానీ, జన్మాంతరంలో గానీ ఫలిస్తుంటాయి. అతితీవ్రసంస్కారాలు వెంటనే ఫలిస్తాయి. ప్రబల దుష్కార్యాలు లేదా సత్కార్యాలు ఈ జన్మలోనే ఫలిస్తాయి. సత్సంస్కారాలవల్ల మహాశక్తి సంపన్నులైనవారు చనిపోనక్కరలేదని, ఈ జన్మలోనే తమ శరీరాన్ని దేవతాశరీరంగా మార్చుకోగలరని యోగులు చెబుతారు. యోగశాస్త్ర గ్రంథాల్లో ఇలాంటి నిదర్శనాలు అనేకం ఉన్నాయి. తమ శరీర పరమాణువులకు నూతన గతిని నిర్మించుకుని సంపూర్ణంగా నూతన శరీరాన్ని ఏర్పరచుకొనుటచే వారికిక మరణమనేది సంభవింపదు. ఎందుకు సంభవించాలీ? శారీరశాస్త్రాన్ని అనుసరించి, సూర్యుని నుండి శక్తిని చేకూర్చుకొనుటే ఆహారమని చెప్పవచ్చు. ఈ శక్తి ఒక మొక్కను చేరుతుంది. దాన్ని ఒక పశువు తింటున్నది. ఆ పశువును మనిషి తింటున్నాడు. అంటే మనం సూర్యుని నుండి కొంత శక్తి గ్రహించి, మన శరీరంలో చేర్చుకుంటున్నాం. శక్తి సముపార్జనానికి ఒకే మార్గముండాలన్న నియమమేమీ లేదు. దీనికోసం మొక్క అనుసరించే విధానం, మన మనుసరించే విధానం ఒక్కటికాదు. అలాగే భూమి అనుసరించే విధానం, మన మనుసరించే విధానం వేరు వేరుగా ఉంటాయి. అయితే, ఏదో ఒక విధానంలో చరాచర ప్రపంచమంతా శక్తిని ఆర్చిస్తూనే ఉంది. మనశ్శక్తి వల్ల యోగులు తామీ కార్యం చేయగలమని, సాధారణ పద్ధతులను అవలంబించకుండానే, కావలసిన శక్తిని ఆకర్షించుకొనగలమని చెబుతారు. తనలోనుండి వెలువడే పదార్థంతోనే సాలెపురుగు గూటి నల్లుకొంటుంది. దానితో బద్ధమై, ఆ గూటపోచల ననుసరింపకుండా అది మరొక మార్గంలో ఎక్కడికీ పోజాలదు. అలాగే మనలోనుండే మనమీ నాడీమండలాన్ని నిర్మించుకుంటాం. నాడుల మూలంగానే తప్ప మరొక విధంగా ప్రవర్తింపజాలం. మనమిలా బద్ధులం కానక్కరలేదని యోగులంటారు.
ఇలాగే విద్యుత్తును మనం ప్రపంచంలో ఎక్కడికంటె అక్కడికి పంపగలుగుతున్నాం. అయినా తంతిమార్గంలో తప్ప దాన్ని పంపలేము. ప్రకృతి ఏ తంతీ సహాయం లేకుండానే అపారవిద్యుత్తును పంపగలుగుతున్నది. మనం కూడా అలా ఎందుకు చేయలేము? మానసిక విద్యుత్తును ఇలా పంపవచ్చు. ‘మనస్సు’ అనేశక్తి, విద్యుచ్చక్తి చాలావరకు ఒక్కటే. నాడీద్రవం ధృవాభిముఖంగా ఉండటంవల్ల, విద్యుత్ ప్రేరణ కనుగుణంగా వర్తించటం వల్ల, దీనిలో కొంత విద్యుత్తు ఉండాలని స్పష్టమవుతున్నది. మన విద్యుత్తును మనం ఈ నాడీమార్గంలోనే పంపగలుగుతున్నాము. నాడీ సహాయం సంపూర్ణంగా సాధ్యమని, అనుభవసిద్ధమని చెబుతారు. ఇలా చేస్తే, ప్రపంచమంతటా మనకిది సాధ్యమవుతుందంటారు. నీ ఇష్టానుసారంగా, ఎవరితోనైనా ఎక్కడైనా నాడీకోశసహాయం లేకుండానే నువ్వు వర్తింపవచ్చు నాడీమార్గంలో ఆత్మ వర్తిస్తున్నప్పుడు, మనిషి జీవించి ఉన్నాడని, నాడీవ్యాపారం నిలచిపోగానే, అతను చనిపోయాడని చెబుతాము. నాడీమార్గాలున్నా, లేకున్నా వర్తింపగలిగేవారికి, జనన మరణాలన్నవి అర్థరహితాలు. భౌతికశరీరాలన్నీ తన్మాత్రలతో నిర్మితమై ఉంటాయి. వివిధ శరీరాల్లోని భేదమంతా, తన్మాత్రల నిర్మాణక్రమాన్ననుసరించే కలుగుతున్నది. శరీరాన్ని నిర్మించుకొనేవాడవు నువ్వే. కాబట్టి నీ ఇష్టం వచ్చిన శరీరాన్ని నువ్వు ఏర్పరచుకోవచ్చు. శరీర నిర్మాణకర్త నువ్వుకాక మరెవ్వరూ? ఆహారం తినేదెవ్వరు? నీ కోసం మరొకరు తింటుంటే, నువ్వెంతకాలం జీవిస్తావు? శరీరంలో రక్తాన్ని నిర్మించుకునే వారెవ్వరూ? నువ్వే కదా! రక్తాన్ని శుభ్రం చేసుకుని, నాడుల మూలంగా దాన్ని పంపేదెవ్వరూ? నువ్వే. శరీరాధిపతులమై మనం శరీరంలో నివసిస్తున్నాం. అయినా శరీరాన్ని పునర్జీవింప చేసుకునే విధానాన్ని మరిచాం. చైతన్య విరహితులమై క్షీణించాం. శరీర పరమాణువుల్ని ఏర్పరచుకొనే విధానాన్ని మరిచాం. అస్వతంత్రులమై యంత్రంలా చేస్తున్న పనినే మనమిప్పుడు ఎరుకతో చేయవలసి ఉంది. శరీరాధిపతులమై ఉండటంవల్ల, శరీర క్రమాన్ని మనమే ఏర్పరచుకోవలసి ఉంది. ఈ కార్యాన్ని నెరవేర్చినంతనే మన ఇష్టానుసారంగా, శరీరాన్ని పునర్జీవింప చేసికౌనగల్గుతాం. దాంతో జనన మరణాలు వ్యాధులు మనల్ని సమీపించలేవు.
13. సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః.
కర్మ పరిపాకంవల్ల, జాతి, ఆయువు, భోగం (సుఖ దుఃఖానుభవం) అనేవి కలుగుతాయి.
కారణాలైన సంస్కారాలు, కర్మానుభవం అనే కార్యరూపంలో వ్యక్తమవుతుంటాయి. కారణం అంతరించి, కార్యరూపాన్ని దాలుస్తుంది. కార్యం రాను రాను సూక్ష్మమై మరొక కార్యానికి కారణమవుతుంటుంది. విత్తనం వృక్షానికి, వృక్షం విత్తనానికి కారణమవుతుంటాయి. మన ప్రస్తుత కర్మలన్నీ పూర్వసంస్కార ఫలితాలై ఉంటాయి. మరల ఈ కర్మలు రానున్న కర్మలకు కారణమవుతుంటాయి. సంస్కారాలు కారణాలై ఉండటంవల్ల, వాటి పరిపాకం వల్ల జీవకోటిలో ఒకటి మనిషిగా, మరొకటి దేవతగా, వేరొకటి జంతువుగా, ఇంకొకటి రాక్షసుడుగా వ్యక్తమవుతుంటాయని భావం. కర్మఫలాలు ఒకేవిధంగా ఉండవు. ఒకడు ఏబది ఏండ్లు బ్రతుకుతాడు; మరొకడు నూరేండ్ల్రు జీవిస్తాడు. మరొకడు పుట్టిన రెండేండ్లకే చస్తాడు. ఈ భేదాలన్నీ వారి వారి పూర్వకర్మానుగుణంగా కలగుతుంటాయి. ఒకడు సుఖీంచటానికే జన్మించాడా అన్నట్లుగా ఆజన్మాంతం సుఖాలను అనుభ్విస్తూ ఉంటాడు. అలాంటివాన్ని, నట్టడవిలో ఒక చెట్టుకు కట్టివేసినా, సుఖాలు వెదుక్కుంటూ అతని వద్దకు వస్తాయి. మరొకడు ఎక్కడికి వెళ్ళినా, దుఃఖాలు అతన్ని వెన్నాడుతూనే ఉంటాయి. సర్వం అతనికి దుఃఖకరంగానే పరిణమిస్తుంది. ఇదంతా వారి వారి పూర్వకర్మల ఫలం. సత్కర్మలెప్పుడూ సుఖహేతువులని, దుష్కర్మలు సదా దుఃఖదాయకాలని యోగులు భావిస్తారు. దుష్కర్మలు చేసినవాడు, దుఃఖరూపంలో వాటి ఫలం అనుభవించక తప్పదు.
14. తే హ్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్యహేతుత్వాత్.
పుణ్యపాప కర్మలవల్ల సుఖదుఃఖ ఫలాలు కలుగుతున్నాయి.
15. పరిణామతాప సంస్కార దుఃఖైర్గుణవృత్తి విరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకినః.
పర్యవసానంలో దుఃఖహేతువులవటంవల్ల, సుఖం పోతుందేమో అన్న చింతారూపంలో గానీ, సుఖానుభవజన్యాలైన సంస్కారాల వల్ల తిరిగి ఫలం అనుభవించాలనే వాంఛతోగానీ, సత్త్వాది గుణాల ప్రతిక్రియావృత్తి రూపంలో గానీ వివేకికి సర్వం దుఃఖకరమే అవుతుంది.
సర్వవిషయాల్లో వివేకికి దుఃఖమే గోచరిస్తుంది. సుఖదుఃఖాలు అందరికీ కలుగుతుంటాయి. సుఖమే దుఃఖంగా, దుఃఖమే సుఖంగా పరిణమిస్తుంది. తమ కోరికలెన్నటికీ తీరక, జనులు ఎండమావుల్లో నీరు త్రాగాలనుకుంటారు. యోగుల అభిప్రాయం ఇదే. ప్రతి నిముషం మన చుట్టూతా జనులు చనిపోతూనే ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. అయినా మనం మాత్రం ఎప్పటికీ చావమని తలుస్తుంటాం. ఇదే జీవితంలో అద్భుత విషయమని యుధిష్టిరుడంటాడు.
మన చుట్టూతా మూర్ఖులే ఉన్నారని, మనం మాత్రమే పండితులమని మనం తలుస్తూ ఉంటాం. ప్రేమానురాగాల చంచల స్వభావం మన చుట్టూ మూర్తీభవించి ఉన్నా, మన ప్రేమానురాగాలు మాత్రం సుస్థిరమైనవని మనం భావిస్తుంటాం. ఇది అసంభవం. ప్రేమానురాగాలు, స్వార్థభూయిష్టాలే. పతీ పత్నుల అనురాగం, బిడ్డలయందలి వాత్సల్యం, స్నేహితుల పరస్పర ప్రేమ, సర్వం చివరికి నశించేవే అని యోగులు చాటుతారు. ఈ జీవితంలో నశించనిది ఏదీలేదు. సర్వం నిష్ప్రయోజనమై, ప్రేమకూడా నిరర్థకమైనప్పుడు, అప్పుడు మాత్రమే ఈ ప్రపంచం ఎంత మిథ్యయో, ఎంత స్వప్నతుల్యమో, మనిషికి ఒక్క తృటికాలం బోధపడుతుంది. దానితో వైరాగ్య కిరణాలు తనమీద ప్రసరించగానే, ప్రపంచాతీత సచ్చిదానంద స్వరూపాన్ని అతను క్షణకాలం దర్శిస్తాడు. ఈ లోకాన్ని వదలిపెట్టటం ద్వారానే లోకాంతరం ప్రాప్తిస్తుంది. దీన్ని అంటి పెట్టుకొని ఉండటంవల్ల పరమార్థం ఎన్నటికీ ప్రాప్తించదు. ఇంద్రియ సుఖాలను వదలనిదే, ఉన్నతిని పొందిన వ్యక్తి ఇంతవరకూ పుట్టలేదు. పరస్పరం సంఘర్షణం వల్ల, ప్రకృతిలోని వివిధ శక్తులు ప్రపంచంలో శాశ్వతానందాన్ని స్వప్నతుల్యంగా చేస్తున్నాయి. ఇదే మన దుఃస్థితికి కారణం.
16. హేయం దుఃఖమనాగతమ్.
ఇంతవరకూ కలగియుండని (అనాగత) దుఃఖాన్ని వదలివేయాలి.
కొంత కర్మానుభవం ఇదివరకే మనకు పూర్తయింది. ప్రస్తుతం కొంత కర్మను అనుభవిస్తున్నాం. ఇకముందు ఫలించటానికి మరికొంత శేషించి ఉంది. మొదటిది సంచితకర్మ గతించినది; రెండవది ప్రారబ్ధం – మనం అనుభవిస్తున్నాం; ఫలించబోయేది ఆగామి కర్మ. దీన్ని మాత్రమే మనం నిరోధించగలం; నిర్జించగలం. సంస్కారాలను తద్వ్యతిరేక మనోభావాలతో నిరోధించాలని చెప్పటంలో పతంజలి అభిప్రాయం ఇదే. (210)
17. ద్రష్టృదృశ్యయోః సంయోగో హేయహేతుః.
దృగ్దృశ్యాల సంయోగమే వదలవలసిన దుఃఖానికి హేతువు.
చూచే వాడెవడూ? పురుషుడు దేన్ని చూస్తాడు? మనస్సు మొదలు స్థూలభూతాల వరకున్న ప్రకృతిని – ఇవే దృగ్ దృశ్యాలు. మనస్సుకు పురుషునితో సంయోగం కలగటం వల్లనే సర్వదుఃఖాలు కలుగుతుంటాయి. సాంఖ్యాన్ని అనుసరించి, పురుషుడు స్వయంగా శుద్ధుడని మనం గుర్తించాలి. ప్రకృతి పురుష సంయోగంతో సుఖదుఃఖాలు తనమీద ప్రతిబింబించే సమయంలో వాటిని తా ననుభవిస్తున్నట్లు పురుషుడు భావిస్తాడు.
18. ప్రకాశ – క్రియా – స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యమ్.
ప్రకాశం, క్రియ, స్థితి అన్నవి స్వభావంగా కలిగినదాన్ని; (పృథివ్యాది) భూతాలతో ఇంద్రియాలతో కూడినదాన్ని; పురుషుని భోగమోక్షాలను ప్రయోజనంగా కలిగినదాన్ని దృశ్యం అంటారు.
పృథివ్యాది భూతాలను ఇంద్రియాలను కూడా దృశ్యమైన ప్రకృతే అంటారు. ప్రకృతి అంతా స్థూల సూక్ష్మభూతాలతో, మనస్సు మొదలైన ఇంద్రియాలతో కూడినదై త్రిగుణాత్మకమై ఉంది. సత్త్వం వల్ల ప్రకాశం; రజస్సువల్ల ప్రవృత్తి; తమస్సువల్ల స్థితి కలుగుతుంటాయి. పురుషునికి అనుభవాన్ని కూర్చుటే ఈ ప్రకృతి ప్రయోజనం. పురుషుడు తన దివ్యత్వాన్ని మరచి ఉన్నాడు. దేవతల రాజు ఇంద్రుడు ఒకప్పుడు పందిజన్మ ఎత్తి బురదగుంటలోనే పొర్లాడుతూ ఉండేవాడన్న కథ ఒకటుంది. ఆ దశలో అతను ఒక ఆడపందితో ఎంతోమంది పిల్లల్ని కన్నాడు. వారితో హాయిగా కాలం గడుపుతున్నాడు. అతని దురవస్థ చూసి దేవతలు ఖీన్నులయ్యారు. వారంతా దేవేంద్రుని వద్దకు వెళ్ళి, “దేవా! నువ్వు దేవేంద్రుడవు. దేవతలంతా నీ ఆజ్ఞావర్తనులై ఉన్నారు. అలాంటి నువ్వు ఈ బురదగుంటలో పొర్లాడుతున్నావేమిటీ?” అని అడిగారు. ఆ మాటలు విని దేవేంద్రుడు “మీరేం బాధపడకండి. ఈ ఆడపంది, ఈ పిల్లలు నా వద్ద ఉన్నంతకాలం, నాకే స్వర్గం వద్దు” అని జవాబిచ్చాడు. ఆ దేవతలకు పాపం ఏమీ పాలుపోలేదు, ఈ పందులను చంపివేస్తే, ఫలితముంటుందనుకొన్నారు. అలాగే అన్నింటిని చంపివేశారు. అవి చనిపోవటం చూసి దేవేంద్రుడు దీనంగా విలపించటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవతలు ఇంద్రుడిని ఆవరించి ఉన్న సూకరశరీరాన్ని విడదీశారు. వెంటనే ఇంద్రుడు బయటపడ్డాడు. దేవేంద్రుడనైన తాను, పంది అగుట; పందిజన్మే జన్మగా తలచుట; తెలుసుకుని తనకు కలిగిన వింతస్వప్నానికి విడ్డూరం చెందాడు.
పురుషుడు ప్రకృతితో తాదాత్మ్యం చెందటంవల్ల, తాను శుద్ధుడను అనంతుడను అని గ్రహించలేకున్నాడు. స్వతస్సిద్ధంగా పురుషుడు ఆనంద స్వరూపుడు; అస్తిత్వానికి పట్టుకొమ్మ. సచ్చిదానందాలు పురుషుని స్వరూప లక్షణాలు కానీ, గుణాలు కావు. పరమాత్మగా – పరమ పురుషునిగా, పరంజ్యోతిగా వెలిగే పురుషుని స్వరూపమే కానీ అవి అతని గుణాలు కావు. అతని వద్దకు వెళ్ళి, “నువ్వు పందివి కావు” అని చెప్పగానే, ఘుర్రుమని కరవబోయేంతగా ఇంద్రుడు పతనం చెందాడని తెలుస్తున్నది.
ఈ మాయలో ఈ స్వప్నప్రపంచంలో భ్రమించే మనస్థితి కూడా ఇంతే. దురంత సంతాపాలతో దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కొన్ని బంగారు బంతులు దొర్లుతూ ఉంటే, లోకం వాటి వెంటపడి వాడిని కైవసం చేసుకోవాలనుకుంటుంది. నువ్వు ప్రకృతి శాసనాలకు ఎప్పుడూ బద్ధుడవు కావు. ప్రకృతి నీకెప్పుడు కూడా బంధనం కల్పించలేదు. యోగులు నీకు చేసే ఉపదేశం ఇదే. దాన్ని గ్రహించటానికి సావధానుడవు కా. ప్రకృతితో సంయోగం పొందటంవల్ల మనస్సుతో, సంసారంతో తాదాత్మ్యం పొందటం వల్ల, పురుషుడు తాను దీనుడనని, పరమ నికృష్టుడనని భావించుకొంటున్నాడు. స్వానుభవమే సంసార తరుణోపాయం అని యోగులు చాటుతున్నారు. శీఘ్రంగా మనమీ అనుభవాన్ని పొందాలి. మనంతట మనమే ఈ వలలో చిక్కుకున్నాం. దీన్ని తప్పించుకుని మనం బయటపడాలి. కాబట్టి భార్యాభర్తల స్వల్పానురాగాన్ని స్నేహితుల సంకుచిత ప్రేమను పొందుతూ ప్రపంచానుభవాన్ని సంపాదించండి. స్వస్వరూపాన్ని మరవకుంటే, సమస్తబంధాలు తొలగిపోతాయి. ఐహిక జీవితం క్షణభంగురం అనీ, సంసారాన్నుండి తరించాలనీ, గుర్తించండి. స్వానుభవమే, సుఖదుః ఖానుభవమే మనకు పరమ గురువు. ఐహిక జీవితం తాత్కాలిక అనుభవం మాత్రమే అని గ్రహించండి. ఎవరి ముందు ఈ చరాచర ప్రపంచమంతా సముద్రంలో నీటిబొట్టులా అత్యల్పంగా కనిపిస్తుందో, ఆ పరమపురుషుని పొందుటే, సమస్త అనుభవాలవల్ల మనకు కలిగే పరమ ప్రయోజనం ఎన్ని అనుభవాలు పొందినా, పొందవలసి ఉన్నా, పరమావధిని మాత్రం మరచిపోవద్దు సుమా!
19. విశేషావిశేష లింగమాత్రాలింగాని గుణపర్వాణి.
గుణాల స్థితులు నిర్దేశితాలు, అనిర్దేశితాలు, కేవల సూచితాలు, అసూచితాలు అని నాలుగు విధాలు.
యోగదర్శనం పూర్తిగా సాంఖ్యదర్శనంపై ఆధారపడియుంది అని చెప్పుకున్నాం కదా! ఇక్కడ మళ్ళీ సాంఖ్యుల సృష్టిక్రమాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సాంఖ్యుల ననుసరించి, నిమిత్తకారణం ఉపాదాన కారణం కూడా ప్రకృతే. ప్రకృతిలో సత్త్వరజస్తమస్సులనే మూడు తత్త్వాలున్నాయి. అంధకారం అజ్ఞానం భారం తామస లక్షణం. ప్రవృత్తి రాజస లక్షణం. ప్రకాశం ప్రశాంతి సాత్త్విక లక్షణం. సృష్టికి పూర్వం ప్రకృతి అవ్యక్తావస్థలో నామరూపభేదరహిత అవస్థలో ఉన్నప్పుడు, సత్త్వరజస్తమస్సులు పూర్తిగా సామ్యావస్థలో ఉంటాయని సాంఖ్యులంటారు. ఆ సామ్యావస్థ చెడి, సత్త్వరజస్తమస్సులు పరస్పరం రకరకాలుగా సంయోగం చెందటం వల్ల ప్రపంచం ఏర్పడుతుంది. ప్రతిమనిషిలో ఈ మూడు తత్త్వాలుంటాయి. సత్త్వప్రాబల్యం వల్ల జ్ఞానం, రజఃప్రాబల్యం వల్ల ప్రవృత్తి, తమః ప్రాబల్యం వల్ల అంధకారం మాంద్యం అలసత అజ్ఞానం కలుగుతాయి. సాంఖ్యసిద్ధాంతాన్ని బట్టి, సత్త్వరజస్తమస్సులతో కూడిన ప్రకృతినే, ఉన్నత అవ్యక్తావస్థలో “మహత్” అంటారు. ఈ మహత్, లేదా సమిష్టి బుద్ధితత్త్వంలో ఒక అంశం మనలోని బుద్ధితత్త్వం. సాంఖ్యుల మనశ్శాస్త్రాన్ని అనుసరించి, మనసుకు బుద్ధికి సూక్ష్మభేదముంది. శబ్దాది విషయాలను గ్రహించి వాటిని మనస్సు బుద్ధికి నివేదిస్తుంది. వ్యక్తిగత మహత్ అయిన బుద్ధి వాటిని ‘ఇదమిత్థ’ మని నిశ్చయిస్తుంది. మహత్ నుండి అహంకారం, దానినుండి సూక్ష్మతన్మాత్రలు, జనిస్తాయి. సూక్ష్మ తన్మాత్రలు పరస్పరం సంయోగం చెంది పృథివి మొదలైన స్థూల భూతాలుగా మారతాయి. బుద్ధితత్త్వం నుండి పాషాణం వరకూ ఉన్న సృష్టిజాతమంతా ఒకే తత్త్వంనుండి ఉత్పత్తి అవుతున్నాయని సాంఖ్యులు అంటారు. స్థూల సూక్ష్మ స్థితుల్లో మాత్రమే, ఆ తత్త్వాలకు భేదముంది. సూక్ష్మావస్థ కారణం, స్థూలావస్థ కార్యం. సాంఖ్యులను అనుసరించి పురుషుడు, ప్రకృతికి అతీతుడు ప్రకృతి తత్త్వానికి భిన్నుడు బుద్ధికన్నా మనసుకన్నా, తన్మాత్రలకన్నా, స్థూలభూతాలకన్నా వేరుగా ఉంటాడు. వీటిలో ఏదికూడా పురుషుని వంటిది కాదు. పురుషుడు పూర్ణంగా భిన్నుడు; భిన్నస్వభావుడు. పురుషుడు కేవలుడై ఉండటం వల్ల శాశ్వతుడని సాంఖ్యుల సిద్ధాంతం. సంయోగజనితం కాని వస్తువునకెట్టి వికారం కలుగదు. ఇలాంటి పురుషులు లేదా ఆత్మలు అనేకంగా ఉన్నాయి.
ఇక, “గుణాల స్థితులు నిర్దేశితాలు అనిర్దేశితాలు, కేవల సూచితాలు సంజ్ఞారహితాలు” అన్న సూత్రార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. నిర్దేశితాలంటే, ప్రత్యక్ష స్థూలభూతాలని అర్థం. అనిర్దేశితాలు అంటే ఇంద్రియాలకు గోచరించని తన్మాత్రలని అర్థం.
అయితే యోగాభ్యాసం ద్వారా కొంతకాలానికి మన ఇంద్రియాలు తన్మాత్రలని ప్రత్యక్షంగా చూడగలిగే సూక్ష్మస్థితిని పొందుతాయని పతంజలి చెబుతాడు. ప్రతిమనిషీ, తనచుట్టూ ఒక రకమైన కాంతిని కలిగి యుంటాడని మీరు వినే ఉంటారు. ప్రతిజీవి ఇలాంటి కాంతిని ప్రసరింపచేస్తూ ఉంటుంది. యోగులు ఈ కాంతిని చూడగల్గుతారని పతంజలి అంటాడు. మనం ఈ కాంతిని చూడకపోయినా, పువ్వులు వాసనాకణాలను తమనలో నుండి ఎప్పుడూ వదలి పెడుతున్నట్లుగా, మనం కూడా ఈ తన్మాత్రలను మనలోనుండి వెలిపరుస్తూ నిరంతరం మంచీ చెడులను బయటికి త్రోసివేస్తున్నాము. మనమెక్కడికి పోయినా, మన చుట్టూ ఉన్న వాతావరణం సూక్ష్మమైన ఈ అణువులతో నిండియుంటుంది. దేవాలయాలను, ప్రార్థనాలయాలను నిర్మించాలన్న భావం అజ్ఞాతంగా మనకిలాగే కలుగుతూ ఉంటుంది. భగవంతుని ఆరాధించటానికి మనిషి ఆలయాలెందుకు కట్టాలి? భగవంతుని మరెక్కడైనా ఎందుకు పూజించరాదు? జనులకు దీనికి కారణం తెలియక పోయినా, భజనస్థలాలు పవిత్ర పరమాణువులతో నిండి ఉంటాయని గ్రహించటంవల్ల, అనుదినం వారు అక్కడికి వెళుతుంటారు. అలా వెళుతున్నకొద్దీ తాము పవిత్రులౌతూ, ఆ స్థలాలను పవిత్రం చేస్తుంటారు. విశేష సత్త్వసంపన్నులు కానివారు ఆ స్థలాలకు వెళితే, అవి వారిమీద తమ ప్రభావాన్ని చూపుతాయి; వారిలోని సత్త్వగుణాన్ని ఉద్దీపింప చేస్తాయి. అందుకే దేవాలయాలు, పుణ్యస్థలాల అవసరం ఉంది. అయితే వాటి పవిత్రత, అక్కడికి చేరేవారి పవిత్రతపై ఆధారపడి ఉంటుందని మనం గుర్తించాలి. మూలంలోని భావాన్ని మరచి, మనం గురువును శిష్యునివద్దకు తీసుకుని వస్తాం. ఇది ఒక పెద్దచిక్కు. పుణ్యస్థలాలు మనవల్లే పుణ్యస్థలాలుగా మారతాయి. కార్యం, తిరిగి కారణమై పుణ్యస్థలాలు మనలను పునీతులను చేస్తాయి. నిరంతరం పాపాత్ములే అక్కడికి వెళుతూ ఉంటే, ఆ స్థలాలు పాపభూయిష్టాలౌతాయి. ఆలయమన్నది మనవల్ల ఏర్పడుతుందే తప్ప, మందిరం వల్ల ఏర్పడటం లేదు. తరచూ మనమీ విషయాన్ని మరచిపోతూ ఉంటాం. సమధిక సత్త్వ సంపన్నులైన మహర్షులు, మహాపురుషులు అహోరాత్రాలు అద్భుత ప్రభావాన్ని తమ పరిసరాలపై చూపుతుంటారు. మనం పవిత్రతా మూర్తులం అయ్యేంత పవిత్రులం కాగలం. దానితో మన సంసర్గం వల్ల ఎంతటి పాపి అయినా పావనుడౌతాడు.
‘కేవల నిర్దేశితాలు’ అంటే బుద్ధి అని భావం. బుద్ధి తత్త్వమే ప్రకృతి నుండి ముందుగా వెలువడుతుంది. దాన్నుండే ఇతర తత్త్వాలన్నీ వ్యక్తమవుతుంటాయి. ఇక ‘సంజ్ఞారహితాలు’ ; ఆధునిక భౌతికశాస్త్రజ్ఞులకు తత్త్వశాస్త్రవేత్తలకూ ఈ విషయంలో భేదాభిప్రాయాలున్నాయి. చిత్స్వరూపం నుండి ప్రపంచం ఉత్పన్నమౌతుందని, ప్రతిమతం కూడా భావిస్తుంది. సాకార నిరాకార దైవభావాలను ప్రక్కన పెట్టినా, సృష్టి క్రమంలో బుద్ధితత్త్వమే మొట్టమొదటిదని, దృశ్యప్రపంచం దానిలోనుండే నిర్మాణమవుతున్నదని, మానసిక శాస్త్రానుసారంగా ఈశ్వర సిద్ధాంతాభిప్రాయం. ఆధునిక తత్త్వజ్ఞుల సృష్టిక్రమంలో బుద్ధితత్త్వం చివరిదని అంటారు. జ్ఞానవంతులైన జీవులు జంతువులుగా పరిణమిస్తున్నాయి; జంతుస్థితి నుండి క్రమంగా మనుషులుగా మారుతున్నాయని వారంటారు. సమస్తం బుద్ధితత్త్వం నుండే కలగటానికి మారుగా, బుద్ధితత్త్వమే చివరిదని వారి సిద్ధాంతం. ఆధ్యాత్మిక సిద్ధాంతం ఆధునిక ప్రకృతి శాస్త్రసిద్దాంతం పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు కనిపించినా, నిజానికి రెండూ యథార్థాలే. ‘రామరామరామ’ అనే వరుసను తీసుకోండి. ‘మ’ ముందని మీరంటారు. మనం ఏ దృష్టితో చూస్తామో, ‘క్రమం’ దానిపై ఆధారపడి ఉంటుంది. బుద్ధితత్త్వం వికారం చెంది, స్థూలభూతాలుగా మారుతుంది. ఈ స్థూలభూతాలు తిరిగి బుద్ధితత్త్వంలో లయిస్తాయి. సాంఖ్యులు ఇతర మతస్థులు బుద్ధితత్త్వాన్ని ‘ముందు’ పెడతారు. దానితో మొదట బుద్ధి, తర్వాత స్థూలభూతాలు అన్న క్రమం ఏర్పడుతుంది. ఈ గొలుసులో ప్రకృతి శాస్త్రవేత్త, ‘స్థూలభూతాలు’ అన్న కంకణంమీద వ్రేలు పెట్టి, స్థూలభూతాల వెనుకే బుద్ధితత్త్వం ఏర్పడి ఉందని అంటాడు; అయినా ఇద్దరూ ఒకే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. పోతే, వేదాంతశాస్త్రం బుద్ధిని, స్థూలభూతాలను కూడా దాటి బుద్ధికి అతీతమైన ఆత్మను ప్రతిపాదిస్తుంది. బుద్ధితత్త్వం స్వప్రకాశం కాదు; ఆత్మవల్లే బుద్ధి ప్రకాశవంతం అవుతున్నదని అంటుంది.
20. ద్రష్టా దృశిమాత్రః శుద్ధోఽపి ప్రత్యయానుపశ్యః.
సాక్షి అయిన పురుషుడు, చైతన్యమాత్రుడై శుద్ధుడై ఉన్నా, బుద్ధిలో భాసించే వృత్తుల ననుసరించి చూస్తుంటాడు.
మళ్ళీ ఇది సాంఖ్యతత్త్వమే. పృథివ్యాది స్థూలభూతాలు మొదలుకొని, బుద్ధితత్త్వం వరకూ సమస్తం ప్రకృతే అని సాంఖ్యతత్త్వాన్ని అనుసరించి మనం గ్రహించాం. నిర్గుణుడైన పురుషుడు (ఆత్మ) ప్రకృతికి అతీతుడుగా ఉంటాడు. అలాంటప్పుడు మరి పురుషుడు సుఖదుఃఖాల నెట్లనుభవిస్తుంటాడు? అనే ప్రశ్న వస్తుంది. స్వచ్ఛస్పటికం ఎదుట ఎర్రని పువ్వును పెడితే, స్పటికం ఎర్రగా కనిపిస్తుంది కదా! అలాగే పురుషునిలో కనిపించే సుఖదుఃఖాలు కూడా కేవలం ప్రతిబింబాలు మాత్రమే. స్వయంగా పురుషుడు నిర్వికారుడు. ప్రకృతి పురుషులు సదా భిన్నతత్త్వాలు. బుద్ధి, సంయోగజనితం వృద్ధిక్షయ యుక్తం వికారవంతం కావటంవల్ల చాలావరకూ శరీరం వంటిదేనని సాంఖ్యులంటారు. గోళ్ళు శరీరానికి ఎలాంటివో, శరీరం బుద్ధికి అలాంటిది. శరీరంలోని గోరును వందమార్లు కత్తిరించినా, శరీరానికి ఎలాంటి హాని జరగదు. అలాగే ఈ శరీరాన్ని నరికినా, వదిలిపెట్టినా బుద్ధితత్త్వం నశించదు; అది కల్పాంతం వరకూ ఉంటుంది. అయినా అది వృద్ధిక్షయాలను పొందుతూ, వికారవంతమై ఉండటంవల్ల బుద్ధితత్త్వం శాశ్వతం కాదు. వికారాన్ని పొందేవన్నీ అశాశ్వతాలే. బుద్ధి కల్పితం అవటంవల్ల, బుద్ధ్యాతీత వస్తువు మరొకటి ఉండాలని మనకు తెలుస్తున్నది. మెదడులో అంటారా, అయితే ఇంద్రియాలన్నింటికీ ఒకే కేంద్రముండాలి. కాని, మనిషి ఏకకాలంలో చూస్తూ, వింటున్నాడు. కాబట్టి బుద్ధితత్త్వానికి ఆధారభూతమైన ఏకత్వమెక్కడో ఏర్పడియుండాలి. బుద్ధి మెదడుకు సంబంధించి ఉంది. అయితే వివిధ ఇంద్రియానుభవాలూ, సుఖదుఃఖ సంవేదనలూ పరస్పరం సంయోగమై దేనిలో ఏకత్వం పొందుచున్నాయో, ఆ పురుష తత్త్వం బుద్ధ్యాతీతంగా ఉంది. ఇంద్రియాలన్నింటికీ పురుషుడే కేంద్రస్థానం. అనుక్షణం నువ్వు స్వతంత్రుడవు అని నీకు చెప్పేది ఈ పురుష స్వాతంత్ర్యమే. ఈ స్వాతంత్ర్యం బుద్ధిలక్షణం మనుకుంటే, వెంటనే బుద్ధి పరాధీనమై ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఇది శరీర లక్షణమనుకోవటం భ్రాంతే అని ప్రకృతి మనకు చెబుతుంది. ఏది స్వతంత్రమో, ఏది అస్వతంత్రమో యోగి రెంటిని విభజించి తెలుసుకుంటాడు. పురుషుడు స్వతంత్రుడని, చైతన్య స్వరూపుడని, ఈ చైతన్యమే బుద్ధితత్త్వం నుండి భాసించే సమయంలో జ్ఞానరూపం దాల్చి దేశకాల నిమిత్తాలవల్ల బద్దమవుతున్నదని యోగులు గ్రహిస్తారు.
21. తదర్థ ఏవ దృశ్యస్యాత్మా.
దృశ్యం లేదా ప్రకృతి స్వభావం పురుషుని కోసం ఏర్పడియుంది.
ప్రకృతికి స్వతస్సిద్ధప్రకాశం లేదు. పురుషుడు ప్రకృతిలో సంసర్గం కల్గియున్నంతకాలం, ప్రకృతి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రకాశం చంద్రకాంతిలా ప్రతిబింబితమే తప్ప స్వతంత్రం కాదు. ప్రకృతి దాల్చే రూపాలన్నీ తన వల్లే కలుగుతున్నా, పురుషుని మోక్షం కన్నా ప్రకృతికి స్వప్రయోజనమన్నది వేరే ఏదీలేదని యోగులంటారు.
22. కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్.
కృతార్థుడైనవానికి నివర్తించినా, ఇతరులకు మాత్రం సాధారణమై ఉండటం వల్ల, ప్రకృతి నశించదు.
తాను పూర్తిగా ప్రకృతికి అతీతుడను అన్న నిజాన్ని పురుషుడు గ్రహించటమే ప్రకృతి ఆశించే ప్రయోజనం. పురుషునికి ఈ జ్ఞానం కలగగానే, ప్రకృతి అతన్నిక మోహింపచేయదు. అయితే ప్రకృతి ముక్తుని మాత్రమే నివర్తిస్తుంది; బద్ధజీవులను కాదు; వారికి ప్రకృతి మామూలుగానే వర్తిస్తూ ఉంటుంది.
23. స్వస్వామిశక్త్యోః స్వరూపోపలబ్ధిహేతుః సంయోగం.
ప్రకృతి, ప్రకృతికి ప్రభువైన పురుషుడు – ఈ రెండు శక్తుల స్వరూపానుభావానికి కారణం సంయోగమే.
ఈ సూత్రాన్ననుసరించి ప్రకృతి పురుషసంయోగంతో, వాటి శక్తులు రెండూ వ్యక్తమౌతాయని, వాటినుండే నామరూపాలు వెలువడుతాయని, తెలుస్తుంది. ఈ సంయోగానికి కారణం అవిద్యయే. శరీరమే నేనని తలుస్తూ ఉండటమే మన సుఖదుఃఖాలకు కారణం అన్న విషయం మనకు నిత్యం తెలుస్తూనే ఉంది. నేనీ శరీరాన్ని కాను అన్న దృఢనిశ్చయాన్ని కల్గియుంటే, నేను సుఖదుఃఖాలను లక్షించకూడదు. శరీరం సంయోగజనితం. నాకో శరీరం, నీకో శరీరం, సూర్యునికో శరీరం ఉందనటం మిథ్యతప్ప మరేమీ కాదు. జగత్తంతా ఏకపదార్థరాశి. దానిలో నువ్వొక కణం, నేనొక కణం; సూర్యుడొక కణం. జగత్తు సదా మార్పు చెందుతూ ఉందని మనకు తెలుసు. ఏ పదార్థం సూర్యుడిని నిర్మాణం చేస్తున్నదో, అదే రేపు మన శరీర పదార్థంగా ఏర్పడవచ్చును.
24. తస్య హేతురవిద్యా.
అవిద్యయే దానికి (సంయోగానికి) కారణం.
అవిద్యవల్లే మనమొక శరీరాన్ని అంటిపెట్టుకుని దురవస్థల పాలవుతున్నాం. శరీరంలో మనకున్న ఈ మమత కేవలం భ్రాంతి. భ్రాంతియే మనకు సుఖదుఃఖాలను కలగచేస్తున్నది. అవిద్యాసంజనిత ఈ భ్రాంతే మనకు శీతోష్ణ సుఖదుఃఖాలను ప్రాప్తింపచేస్తున్నది. ఈ భ్రాంతిని మనం తొలగించుకోవాలి. దీనికోసం యోగులు మనకు మార్గదర్శులుగా ఉన్నారు. కొన్ని మానసిక పరిస్థితుల్లో మనిషిని అగ్నిలో పడవేసినా, అతనికి ఎలాంటి బాధకలగదని నిరూపించారు. అయితే ఇలాంటి మానసిక ఉన్నతి సుడిగాలిలా హఠాత్తుగా ఒక నిముషం కనిపించి, మరుక్షణం మాయమవుతుంటుంది. అయితే యోగంవల్ల మనకిలాంటి స్థితి కలిగితే, అది చివరిస్థాయిగా ఉంటుంది. దానితో శరీరాభిమానం తొలగిపోతుంది.
25. తదభావాత్సంయోగాభావో హానం తద్దృశేః కైవల్యమ్.
అది (అవిద్య) నివర్తించటంవల్ల (ప్రకృతిపురుష) సంయోగం నివర్తిస్తుంది; అదే సాక్షి (పురుషుని) కైవల్యం.
యోగతత్త్వాన్ననుసరించి, పురుషుడు ప్రకృతితో సంయోగం చెందియుండుటే అవిద్యకు హేతువు. ప్రకృతికి అధీనులం కాకుండ ఉండటమే యోగానికి ప్రధానాశయం. సర్వమతాలకు ఇదే పరమావధి. ప్రతిజీవిలో దివ్యత్వం గర్భితమై ఉంది. బాహ్యాంతర ప్రకృతినంతా నిరోధించి, అంతర్గతమైన ఈ దివ్యత్వాన్ని వ్యక్తం చేయటమే జీవితానికి పరమావధి. దీనికోసం కర్మ ఉపాసన యోగ జ్ఞాన మార్గాల్లో ఒక్కటి గానీ, కొన్నింటిని గానీ, లేదా అన్నింటిని గానీ అవలంబించి ముక్తులు కండి. మతానికంతా ఇదే సారాంశం. వాదాలూ, సిద్ధాంతాలూ, కర్మకలాపాలూ, గ్రంథాలు, దేవాలయాలు, విధులు ఇవన్నీ అప్రధానాంశాలు. ఆత్మసంయమ మార్గంలో ఈ పరమావధిని పొందటానికి యోగులు ప్రయత్నిస్తారు. ప్రకృతి బంధ విముక్తులం కానంతకాలం, మనం ప్రకృతిదాసులమై ప్రకృతిశాసన బద్ధులమై ఉంటాం. మనస్సును నిరోధించేవాడే, ప్రకృతిని నిరోధిస్తాడని యోగులంటారు. బాహ్య ప్రకృతి కన్నా, ఆంతర ప్రకృతి మహత్తరమై నిగ్రహించటానికి కష్టసాధ్యమై ఉంటుంది. కాబట్టి ఆంతర ప్రకృతిని జయించేవాడు, ప్రపంచాన్నంతా జయిస్తాడు. అప్పుడు ప్రపంచమే అతనికి సేవ చేస్తుంది. ఇలాంటి వశీకరణాన్ని ప్రతిపాదించేది రాజయోగం. మనకు కనిపించే, ప్రకృతి శక్తులకన్నా, మహత్తరమైన వాటిని మనం నిరోధించాల్సి ఉంది. శరీరం మనస్సుపైనున్న ఒక కోశంలాంటిది. అయినా మనశ్శరీరాలు భిన్నాలు కావు. ముతైపుచేపకు చిప్ప ఎలాంటిదో, మనస్సుకు శరీరం అలాంటిది. మనశ్శరీరాలన్నవి కేవలం స్థితిభేదాలు, ముతైపుచేపలో ఉన్న జీవపదార్థం, బాహ్యపదార్థాన్ని గ్రహించి, దానిలోనుండి చిప్పను నిర్మించుకొంటుంది. అలాగే అంతఃకరణం లేదా మనస్సు అనే అంతర్గత సూక్ష్మశక్తులు బాహ్యమైన స్థూలప్రకృతిని గ్రహించి దాన్నుండి శరీరమనే ఈ గుల్లను నిర్మాణం చేసుకుంటాయి. కాబట్టి అంతరప్రకృతిని నిరోధిస్తే, బాహ్యప్రకృతిని నిరోధించటం చాలా సులభం. బాహ్యాంతరశక్తులు భిన్నాలు కావు. కొన్ని భౌతికశక్తులుగా, మరికొన్ని మానసిక శక్తులుగా లేవు. దృశ్యప్రపంచం, సూక్ష్మప్రపంచపు స్థూలవ్యక్తీకరణమై ఉంటే, భౌతకశక్తులు కేవలం సూక్ష్మశక్తుల స్థూలవ్యక్తీకరణాలై ఉంటాయి.
26. వివేకశ్యాతిరవిప్లవా హానోపాయః.
నిరంతరంగా సాగే వివేకాభ్యాసమే అవిద్యానాశనానికి ఉపాయం.
నిత్యానిత్య వస్తువివేకం, అంటే జడప్రకృతిగానీ, మనసుగానీ పురుషుడు కాడు కాబట్టి అతను ఎట్టి వికారాలు పొందడని గ్రహించటమే మన పరమావధి. ఉత్పత్తిప్రళయాలను పొందుతూ, నిరంతరం మార్పుచెందేది ప్రకృతి తప్ప పురుషుడు కాడు. నిశ్చలదీక్షతో నిత్యానిత్య వివేకాన్ని చేయటం మొదలుపెట్టగానే అజ్ఞానం అంతరిస్తుంది. దానితో, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వగతుడు అయిన పురుషుడు స్వయం జ్యోతియై ప్రకాశిస్తాడు.
27. తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రజ్ఞా.
అతని ప్రజ్ఞ సప్తజ్ఞానసోపానాల (అవస్థల)తో కూడి మహోన్నతమై ఒప్పుతుంది.
ఈ జ్ఞానం కలిగే స్థితిలో, ఇది ఏడుస్థాయిల్లో కలుగుతుందని చెప్పవచ్చు. మొదట మనకు జ్ఞానం లభిస్తున్నదని గ్రహిస్తాం. అంతవరకూ ఉన్న ఆసంతుష్టి తొలగి, గ్రహించవలసిన దాన్ని గ్రహించామన్న తృప్తి కలుగుటే దీనిలోని ప్రథమావస్థ. గ్రహించాలి అన్న తపన ఉన్నంతకాలం, జ్ఞానాన్వేషణ చేస్తూ, ప్రయత్నం విఫలమైతే అసంతృప్తి చెంది నూతన మార్గాన్ని అవలంబిస్తూ ఉంటాం. జ్ఞానమంతా మనలోనే ఉందని, ఇతరులు మనలను ఉద్ధరింపలేరని గ్రహించాలి. లేకపోతే, మనమెంత కాలం అన్వేషించినా లాభ ముండదు. నిత్యానిత్య వస్తువివేకం కల్గటం మొదలైనంతనే, అంతవరకున్న అసంతృప్తి తొలగిపోతుంది. జ్ఞానోదయం కానున్నది, అనటానికి ఇదే మొదటి లక్షణం. దానితో తత్త్వజ్ఞులమయ్యామన్న దృఢనిశ్చయం కలుగుతుంది. జ్ఞానోదయం కలుగుతున్నదని గ్రహించగానే, ధైర్యోత్సాహాలతో పరమావధిని పొందేంతదాకా కార్యదీక్షను పూనాలి. ఇందలి రెండవ అవస్థ లక్షణం సమస్తదుఃఖనివారణ. బాహ్యాంతర ప్రపంచాల్లో ఏదీకూడా మనలనిక బాధించజాలదు. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటమే మూడవ అవస్థకు లక్షణం. సర్వజ్ఞత్వం మన వశమౌతుంది. వివేకం వల్ల సమస్తకర్మలు నశిస్తాయి. కర్తవ్యతాబుద్ధి తొలగటం నాల్గవ అవస్థకు, మన స్వాతంత్ర్యం ఐదవ అవస్థకు లక్షణాలు. మనస్స్వాతంత్ర్యం లభించగానే, పర్వతం పైనుండి క్రిందికి దొరలిన రాయి మరల పైకి పోనట్లుగానే, సమస్త కష్టాలు మనస్సు నుండి తొలగిపోతాయి. సంకల్పించినంతనే చిత్తం తన మూలకారణంలో లయించటం ఆరవ అవస్థ లక్షణం. చివరికి మనం ఆత్మస్థితులం అనీ మనశ్శరీరాలకెన్నటికీ ఎట్టి సంసర్గం గానీ, సంబంధం గానీ కల్గలేదని కనుగొంటాం. మనశ్శరీరాలు తమంత తామే వర్తిస్తుంటాయి. అవిద్య అజ్ఞానంతో మనం వాటితో సంసర్గం పొందుతుంటాం. స్వతస్సిద్ధంగా మనం నిరాశ్రయులం; సర్వగతులం; సర్వశక్తిమంతులం; శాశ్వతానందమయులం; నిత్యశుద్ధబుద్ధముక్తమై మన ఆత్మ వెలుగుతూ ఉంటే, మనం మరొకదాన్ని ఎందుకాశ్రయించాలి? ఆనంద స్వరూపులమైన మనం ఆనందం కోసం ఒక వస్తువును ఎందుకు అపేక్షించాలి? ఇలాంటి జ్ఞానం నిరాశ్రయమై ఉండటంవల్ల, సర్వవిషయాలు జ్ఞానతేజం వల్లే భాసిస్తుంటాయి. ఇదే చరమావస్థ. ఈ స్థితిని పొందటం వల్ల యోగి భ్రాంతిరహితుడై, సర్వదుః ఖాతీతుడై, ప్రశాంతచిత్తుడై ఒప్పుతూ, సదా తాను ధన్యుడనని, పరిపూర్ణుడనని, సర్వశక్తిమంతుడనని గ్రహిస్తాడు.
28. యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే జ్ఞానదీప్తిరావివేకఖ్యాతేః.
యోగాంగాలను అనుష్ఠిస్తే, చిత్తమాలిన్యం తొలగి వివేకఖ్యాతి కలుగుతుంది.
ఇక అనుభవసిద్ధజ్ఞానం అంటే యోగానుష్ఠానం గూర్చి చెప్పబోతున్నారు. ఇంతకుముందు తెలిపిన జ్ఞానం కష్టసాధ్యమై ఉన్నా, పరమావధి మాత్రం అదే, అని తెలుసుకోవాలి. మొదట మనస్సును శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే మన అనుభవం లక్ష్యంలో కుదురుతుంది. లక్ష్యాన్ని గుర్తించినప్పుడు ఇక చేయవలసిన కార్యం ఒక్కటే; దాన్ని పొందేంతుకు సాధనా విధానాన్ని అవలంబించటమే.
29. యమ – నియమాసన – ప్రాణాయామ – ప్రత్యాహార, ధారణా – ధ్యాన – సమాధయోఽష్టావంగాని.
యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అనే ఈ ఎనిమిది యోగాంగాలు.
30. అహింసా – సత్యాస్తేయ – బ్రహ్మచర్యాపరిగ్రహా యమాః.
అహింస, సత్యం, దొంగతనం చేయకుండుట, బ్రహ్మచర్యం, పరిగ్రహింపకుండుట అన్నవి యమం.
నిశ్చలయోగి కావాలని కోరుకునే వ్యక్తి, స్త్రీ పురుషాభిమానాన్ని వదలివేయాలి. ఆత్మకు స్త్రీ పురుష భేదాలు లేవు. ఆత్మ తాను స్త్రీనని, పురుషుడనని భావిస్తూ ఎందుకు పతనం చెందాలీ? ఇలాంటి భావాలను ఎందుకు వదలిపెట్టాలో క్రమంగా మనకు తెలుస్తుంది. దానధర్మాలను గ్రహించే పురుషుడు దాతకువశుడై, అవనతి నొందటానికి అవకాశం ఉంది. ప్రతిగ్రహం వల్ల మన స్స్వాతంత్ర్యం భగ్నమై పరాధీనత కలుగుతుంది. కాబట్టి పరిగ్రహింపవద్దు.
31. ఏతే జాతి – దేశ – కాల – సమయానవచ్చిన్నాః సార్వభౌమా మహావ్రతమ్.
ఇవి (విధులు) దేశకాల నిమిత్తాలచే, జాతి (నియమాల)చే తెంపులేనివై (సార్వజనీనములై) మహావ్రతాలవుతాయి.
అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అనే ఈ విధులను, దేశకాలాది వివక్షతలు లేక స్త్రీ పురుష బాలబాలికలంతా అనుష్ఠించాలి.
32. శౌచ – సంతోష – తపః – స్వాధ్యాయేశ్వరప్రణిధానాని నియమాః.
(బాహ్యాంతర) శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరారాధనం అన్నవి నియమాలు.
బాహ్యశౌచమంటే శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచటం. అపరిశుద్ధుడు ఎన్నడూ యోగి కాలేడు. అంతశ్శాచం తప్పనిసరి. 133 సూత్రంలో చెప్పిన సద్గుణాలను అలవరచుకుంటే, అంతశ్శౌచం ప్రాప్తిస్తుంది. నిజానికి బాహ్యశౌచం కన్నా, అంతశ్శౌచం విశేషించి కావాలి. అయినా యోగానికి రెండూ అవసరాలే. అంతశ్శుద్ధిలేని బాహ్యశుద్ధి వ్యర్థం.
33. వితర్కబాధనే ప్రతిపక్షభావనమ్.
యోగ ప్రతిబంధకాలైన భావాలను నిరోధించటానికి తద్వ్యతిరేక భావాలను అవలంబించాలి.
సద్గుణాలను అలవరచుకొనటానికి ఇదే మార్గం. పరుల సొత్తు అపహరించాలి అన్న భావం కలగగానే, అపహరింపకుండుట అన్న సద్గుణాన్ని చింతించాలి. దానధర్మాలను గ్రహించాలన్న తలంపు పుట్టిన వెంటనే, దానికి వ్యతిరేకమైన భావాన్ని గూర్చి చింతించాలి.
34. వితర్కా హింసాదయః కృతకారితాను మోదితా లోభక్రోధమోహపూర్వకా మృదుమధ్యాధిమాత్రా దుఃఖాజ్ఞానంతఫలా ఇతి ప్రతిపక్షభావనమ్.
లోభం (దురాశ) తోగానీ, క్రోధంతోగానీ, మోహం (అజ్ఞానం) తోగానీ, మందంగానో సామాన్యంగానో ప్రబలంగానో, అసత్యం, హింస మొదలైనవి (తాను) చేసినా, (ఇతరులతో) చేయించినా, (ఇతరులు చేస్తే) ఆమోదించినా, అవి యోగప్రతిబంధకాలై అనంత దుఃఖంగా, అజ్ఞానంగా పరిణమిస్తాయి. ఇదే ప్రతిపక్ష భావనా విధానం.
నేను అసత్యమాడినా, మరొకరితో చెప్పించినా, ఇతరులు అసత్యమాడినప్పుడు ఆమోదించినా, అవన్నీ సమానంగా పాపకార్యాలే అవుతాయి. అతిమృదు అనృతం కూడా అసత్యమే. ప్రతి దుర్భావం ద్వేషపుటాలోచన అతిరహస్యంగా కొండగుహలో కూర్చుని తలచినా, అది నిక్షిప్తమై, ఎప్పుడో ఒకప్పుడు అప్రతిహతశక్తితో, ఏదో ఒక దుఃఖ రూపంలో నిన్ను తప్పకుండా పొందుతుంది. అసూయాద్వేషాలు నీ యందుండి వెలువడితే వడ్డీకివడ్డీతోసహా అవి నిన్ను కట్టి కుడుపకమానవు. హరి బ్రహ్మాదులు కూడా దాన్ని అడ్డగించలేరు. ఈర్ష్యాద్వేషాలకు నువ్వొక్కమారు తావిస్తే చాలు, ప్రతిఫలాన్ని నువ్వనుభవించక తప్పదు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే, నువ్వు దుష్కార్యాలు చేయలేవు.
35. అహింసాప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః.
అహింసలో నెలకొనియున్నవాని సాన్నిధ్యంలో (ఇతరుల) వైరాలు తొలగిపోతాయి.
అహింసాధర్మంలో సుస్థిరంగా ఉండే వాని సాన్నిధ్యంలో, స్వభావంతో క్రూరమైన సింహ వ్యాఘ్రాది జంతువులు కూడా శాంతం కలిగి వర్తిస్తాయి. అలాంటి యోగి ఎదుట పులి, మేకపిల్ల కలసి ఆటలాడుకొంటాయి. ఈ స్థితిని పొందినప్పుడు మాత్రమే యోగి అహింసలో సుస్థిరుడని గ్రహించాలి.
36. సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్.
సత్యంలో నెలకొని యుండటంవల్ల యోగి (తన కొరకూ ఇతరుల కొరకు కూడా) కర్మలను చేయకుండానే కర్మఫలాలను పొందే శక్తి సంపన్నుడౌతాడు.
సత్యశక్తి నీలో నెలకొని ఉంటే, కలలో కూడా నువ్వు కల్లలాడవు; మనోవాక్కాయ కర్మల్లో సత్యవంతుడవై ఉంటావు. నువ్వేమన్నా అది సత్యమై తీరుతుంది. “ధన్యుడవు కా” అని ఒకరియడల నువ్వంటే, ఆ వ్యక్తి ధన్యుడౌతాడు. రోగిని చూచి, “నీకారోగ్యం కలగనీ” అంటే చాలు, అతను స్వస్థుడౌతాడు.
37. అస్తేయప్రతిష్ఠాయాం సర్వరత్నోపస్థానమ్.
ఆస్తేయం (దొంగతనం చేయకుండుట)లో నెలకొనియుంటే, యోగికి సర్వసంపదలు కలుగుతాయి.
ప్రకృతి నుండి నువ్వెంతగా దూరంగా వెళతావో, ప్రకృతి నిన్నంతగా వెంబడిస్తూ ఉంటుంది. ప్రకృతి కాంతను క్రీగంట కూడా చూడకపోతే, ఆమె నీకు దాసురాలవుతుంది.
38. బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం వీర్యలాభః.
బ్రహ్మచర్య ప్రతిష్ఠచే శక్తిసామర్థ్యాలు కలుగుతాయి.
బ్రహ్మచర్యం వల్ల అద్భుత సామర్థ్యం, బ్రహ్మాండమైన సంకల్పశక్తి కలుగుతాయి. బ్రహ్మచర్యం లేకుంటే, ఎలాంటి ఆధ్యాత్మిక శక్తికూడా కలగదు. ఇంద్రియ నిగ్రహంవల్ల మానవకోటిమీద అద్భుత వశీకరణ శక్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక మార్గదర్శకులంతా ప్రబల జితేంద్రియులై ఉన్నవారే. వారిని బ్రహ్మచర్యం మహాశక్తివంతులుగా చేస్తూ ఉంటుంది. కాబట్టి యోగి తప్పక జితేంద్రియుడై ఉండాలి.
39. అపరిగ్రహస్థైర్యే జన్మకథంతాసంబోధః.
అపరిగ్రహంలో సుస్థిరుడై ఉండే వ్యక్తికి పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది.
దానధర్మాలు గ్రహించని వ్యక్తి, ఇతరులకు బద్ధుడు కాడు; స్వతంత్రుడై ఉంటాడు. అలాంటి వ్యక్తి మనస్సు నిర్మలంగా ఉంటుంది. పరిగ్రహం వల్ల దాత పాపాలను కూడా గ్రహించే అవకాశముంది. పరిగ్రహింపకున్నందువల్ల మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. దానివల్ల కాలక్రమంలో పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. దానితో యోగి తన లక్ష్యంలో సుస్థిరుడౌతాడు. అంతవరకూ తాను జన్మపరంపరలను పొందియున్నానన్న విషయం గ్రహిస్తాడు. “ఈసారి ఇక ఈ జన్మ మరణ ప్రవాహంలో పడి, ప్రకృతికి బద్ధుడను అవను; ముక్కుడనౌతానూ” అని నిశ్చయించుకుంటాడు.
40. శౌచాత్స్వాంగజుగుప్సా పరైరసంసర్గః.
(బ్రహ్యాంతర) శౌచం స్థిరంగా ఏర్పడగానే శరీరంపై అసహ్యం, ఇతరులతో సంసర్గరాహిత్యం కలుగుతాయి.
బాహ్యాంతర శౌచం ఏర్పడగానే, శరీరంపై నిర్లక్ష్యం పుడుతుంది. శరీరాన్ని సొగసుగా ఉంచాలన్న భావం తొలగిపోతుంది. ఇతరులు అందంగా భావించే ముఖం, జ్ఞానహీనమైతే యోగికది మృగప్రాయంగా కనిపిస్తుంది. లోకులు అతిసామాన్యం అని తలచే ముఖం, ఆత్మప్రభతో తేజరిల్లుతుంటే, యోగికది దివ్యసుందరవదనంగా గోచరిస్తుంది. మానవ జీవితానికి శరీరాభిమానమే మహోపద్రవకరం. కాబట్టి శరీరాభిమానం క్షీణించటమే శౌచానికి ప్రథమ లక్షణం. శుచిత్వం కలగనిదే, శరీరంపైన మమకారం తొలగదు.
41. సత్త్వశుద్ధి సౌమనస్యైకాగ్ర్యేంద్రియజయాత్మదర్శన యోగ్యత్వానిచ.
(శుచిత్వంవల్ల) సత్త్వశుద్ధి, ఉల్లాసం, ఏకాగ్రత, జితేంద్రియత్వం, ఆత్మదర్శన యోగ్యత కూడా కలగుతాయి.
శుచిత్వం వల్ల సత్త్వం బ్రలమౌతుంది. దానితో మనసుకు ఏకాగ్రత ఉల్లాసం కలుగుతాయి. ఉల్లాసమే పారమార్థికతకు ప్రథమ లక్షణం. మనోవ్యాకులత్వం అజీర్ణవ్యాధి లక్షణం; అది పారమార్థికతకు చిహ్నం కాదు. సంతోషదాయకమైన మనోభావమే సత్త్వగుణ స్వభావం. సాత్త్వికునికి అన్నీ ఆనందకరంగానే ఉంటాయి. ఇలాంటి మనఃప్రసన్నత నీకు చేకూరితే, యోగంలో వృద్ధి కలుగుతున్నదని గ్రహించాలి. దుఃఖమంతా తమోగుణ ఫలితం. కాబట్టి దుఃఖాన్ని వదలాలి. చిరచిరలాడుతూ ముఖం ముడుచుకుని ఉండటం తామస లక్షణం. బలవంతులు – దృఢకాయులు యౌవనవంతులు ఆరోగ్యసంపన్నులు సాహసాపేతులై అలరారే వారే యోగులు కావటానికి అర్హులు. యోగికి సర్వం ఆనందమయమై, ప్రతి మానవముఖం సంతోషజనకమై ఒప్పుతుంది. ఇదే గుణవంతుని లక్షణం. పాపం కన్నా దుఃఖహేతువు మరొకటి లేదు. ముఖం ముడుచుకుని ఉండేవారితో మనకేం పని! అది ఒక ఘోరదృశ్యం. నీ ముఖంలో మనోవ్యాకులత మూర్తీభవించి ఉంటే, అప్పుడు నువ్వు బయటికి రావద్దు; తలుపులు మూసుకుని గదిలో కూర్చో. ఆ వ్యాధిని ప్రపంచంలో వ్యాప్తం చేయటానికి నీకేమి హక్కుందీ? మనస్సును నువ్వు వశం చేసుకుంటే, శరీరమంతా నీకు వశమౌతుంది. నీ శరీర యంత్రానికి నువ్వు బానిసవు కావటానికి బదులుగా, ఈ శరీరం నీకే బానిస అవుతుంది. ఆత్మను ఈ యంత్రం అధోగతికి చేర్చటానికి బదులుగా, అది ఆత్మకు ఎంతో సహాయకారి అవుతుంది.
42. సంతోషాదనుత్తమః సుఖలాభః.
సంతోషం వల్ల పరమానందం లభిస్తుంది.
43. కాయేంద్రియసిద్ధిరశుద్ధి క్షయాత్తవసః.
తపస్సువల్ల మాలిన్యం నశిస్తుంది; దానితో శరీరానికి ఇంద్రియాలకు సిద్ధులు కలుగుతాయి. తపస్సువల్ల కొన్ని సమయాల్లో దూరశ్రవణం దూరదృష్టి మొదలైన సిద్ధులు వెంటనే గోచరిస్తాయి.
44. స్వాధ్యాయాదిష్టదేవతా సంప్రయోగః.
స్వాధ్యాయం (మంత్రజపం) వల్ల ఇష్టదేవత ప్రత్యక్షమవుతుంది.
ఉత్తమ దేవతల సాక్షాత్కారం పొందదలచిన కొద్దీ, సాధన తీవ్రతరమవుతూ ఉంటుంది.
45. సమాధిసిద్ధిరీశ్వర ప్రణిధానాత్.
సర్వస్వాన్ని ఈశ్వరార్పణం చేయటంవల్ల సమాధి సిద్ధిస్తుంది. భగవంతుని శరణుపొందటం వల్ల స్థిరమైన సమాధి కలుగుతుంది.
46. స్థిరసుఖమాసనమ్.
స్థిరంగా సుఖంగా ఉండేదే ఆసనం.
ఆసనం గూర్చి చెబుతున్నారు. స్థిరాసనం ఏర్పడనిదే, నువ్వు ప్రాణాయామ సాధనలను అభ్యసించలేవు. స్థిరాసనమంటే, శరీరభావం బొత్తిగా కలగకుండుట అని భావం. సాధారణంగా మనం కూర్చునే పద్ధతినిబట్టి కూర్చుంటే, కొన్ని నిముషాలకు అన్నిరకాల కలతలు శరీరానికి కలుగుతాయి. ఈ శరీరం గూర్చి తలచకుంటే, అప్పుడు శరీరస్పృహ మనకు సమూలంగా నశించిందని గ్రహించాలి. ఆ స్థితిలో శరీరసుఖం గానీ, కష్టంగానీ నీకు కలగదు. మరల శరీరస్పృహ కలిగినంతనే శరీరమెంతో విశ్రాంతి పొందినట్లు తోస్తుంది. పూర్ణమైన ఇలాంటి విశ్రాంతి శరీరానికి మరొకవిధంగా కలగదు. శరీరాన్ని జయించి, స్థిరంగా ఉంచగలిగితే సాధన స్థిరపడుతుంది. శరీరంవల్ల నీకు బాధ కలుగుతున్నంతకాలం, నాడులకు ఒత్తిడి కలగటం మూలంగా చిత్త ఏకాగ్రతను పొందలేవు.
47. ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యామ్.
శరీరానికి స్వాభావిక చలనాన్ని నిరోధించటం వల్ల, అనంతం గూర్చి ధ్యానించటం వల్ల, ఆసనం స్థిరమై సుఖకరమౌతుంది.
అనంతవస్తువును గూర్చి భావించుటవల్ల ఆసనం స్థిరమడుతుంది. అనంత పరమాత్మను భావింపజాలకుంటే, అనంతాకాశాన్ని భావించవచ్చు.
48. తతో ద్వంద్వానభిఘాతః.
ఆసనం సిద్ధించిన తర్వాత (శీతోష్ణాది) ద్వంద్వాలు బాధించవు.
అప్పుడు శీతోష్ణాలు సుఖదుఃఖాలు మానవమానాలు మొదలైన ద్వంద్వాలేవీ నిన్ను బాధించవు.
49. తస్మిన్ సతి శ్వాసప్రశ్వాసయోర్గతివిచ్చేదః ప్రాణాయామః.
(ఆసనం సిద్ధించిన) తర్వాత ఉచ్చ్వాస నిశ్వాసాల గతి నిరోధమైన ప్రాణాయామం సిద్ధిస్తుంది.
ఆసనసిద్ధి కలిగిన వెంటనే, ప్రాణచలనాన్ని నిరోధించాలి. శరీరంలోని ప్రాణశక్తుల్ని వశం చేసుకోవటం అనే ప్రాణాయామాన్ని గూర్చి మనం విచారణ చేయాల్సి ఉంది. సాధారణంగా, ప్రాణం శ్వాస అని ఆంగ్లంలో అనువదిస్తుంటారు. అయితే ప్రాణమంటే శ్వాసకాదు. సమస్త విశ్వంలోని సాముదాయిక శక్తే ప్రాణం. ఇదే ప్రతిశరీరంలోని శక్తియై ఊపిరితిత్తుల చలనంలో మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ప్రాణం, శ్వాసను లోనికి లాగుకోవటం వల్ల చలనం ఏర్పడుతుంది. ప్రాణాయామంలో మనం నిరోధించేది ఈ ప్రాణమే. ప్రాణాన్ని అతిసులభంగా వశం చేసుకోవటానికి ముందుగా మనం శ్వాసను వశం చేసుకునే ప్రయత్నం చేయాలి.
50. బాహ్యాభ్యంతరస్తంభవృత్తిః దేశకాలసంఖ్యాభిః పరిదృష్టో దీర్ఘసూక్ష్మః.
ప్రాణాయామ క్రియ, బాహ్యంగా ఆంతరంగా చలనరహితంగా ఏ విధంగానైనా, దేశం కాలం సంఖ్యవల్ల నియమితమౌతూ, దీర్ఘంగా గానీ, సూక్ష్మంగా గానీ ఏర్పడియుంటుంది.
ప్రాణాయామంలో ప్రాణాన్ని లోపలికి పీల్చుకోవటం, బయటికి వదలటం, ఊహిరితితుల్త్లో నిలపటం లేదా శ్వాసను ఊపిరితితుల్త్లో చొరనీయ కుండటం, అనే మూడు రకాల వ్యాపారాలున్నాయి. ఇవి దేశకాలాలనుబట్టి మళ్ళీ మారుతూ ఉంటాయి. దేశ్వుంటే, శరీరంలో ప్రత్యే క సల్థంలో ప్రాణాన్ని నిలపటం. కాలమంటే, ఆ స్థలంలో ప్రాణాన్ని ఎంతకాలం నిలపాలో ఆ సమయం. అంటే ఒక ఆవృత్తిలో ఎన్ని క్షణాలు శ్వాసను నిలపాలీ, మరొక ఆవృత్తిలో మరెన్ని క్షణాలు నిలపాలీ అన్నది సూచితమవుతున్నది. ప్రాణాయామానికి ఫలితం కుండలినీశక్తిని మేలు కొలపటం.
51. బాహ్యాభ్యంతరవిషయాక్షేపీ చతుర్థః.
బాహ్యవిషయాల్లో గానీ, అంతర విషయాల్లో గానీ, ప్రాణాన్ని వర్తింపచేసి, దాన్ని నిరోధించటం నాల్గవ ప్రాణాయామం.
ఇది నాల్గవ రకమైన ప్రాణాయామం. ప్రాణాన్ని బాహ్యంలో గానీ, ఆంతరంలో గానీ నడపవచ్చు.
52. తతః క్షీయతే ప్రకాశావరణమ్.
దానివల్ల (ప్రాణాయామం వల్ల) చిత్తప్రకాశ ఆవరణం క్షీణిస్తుంది.
చిత్తం సహజంగా సమస్తజ్ఞానాన్ని తనలోనే కలిగియుంది. చిత్తం సాత్త్విక పరమాణువులతో నిర్మితమైయున్నా, రజోరేణువులు తమోరేణువులు దాన్ని కప్పి ఉంటాయి. ప్రాణాయామం వల్ల ఈ ఆవరణ తొలగిపోతుంది.
53. ధారణాసు చ యోగ్యతా మనసః.
మనస్సు ధారణ పొందటానికి యోగ్యమౌతుంది.
ఈ ఆవరణం తొలగిన తర్వాత మనస్సును ఏకాగ్రం చేసి, ధారణకు దాన్ని యోగ్యం చేయగలుగుతాం.
54. స్వవిషయాసంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవేంద్రియాణాం ప్రత్యాహారః.
ఇంద్రియాలు తమ విషయాలను విసర్జించి, చిత్తస్వరూపాన్ని పొందటమే ప్రత్యాహారం.
చిత్తపు వివిధావస్థలే ఇంద్రియాలు. నేనొక పుస్తకాన్ని చూస్తున్నాననుకోండి. నాకు కనిపించే పుస్తకరూపం, ఆ పుస్తకంలో లేదు; నా మనస్సులో ఉంది. బాహ్యంలోని ఒకానొక వస్తువు ఈ రూపాన్ని బయటికి తీసుకువస్తుంది. నిజమైన రూపం చిత్తంలో ఉంది. ఇంద్రియాలు ఏ విషయంతో సంయోగిస్తాయో, వాటితో ఏకత్వం పొందటంవల్ల అవి వాటి రూపాలను పొందుతుంటాయి. ఈ రూపాలను పొందకుండా చిత్తాన్ని నిరోధిస్తే, మనస్సు శాంతిస్తుంది. దీన్నే ప్రత్యాహారమంటారు.
55. తతః పరమా వశ్యతేంద్రియాణామ్.
దానివల్ల ఉత్కృష్ట ఇంద్రియ వశీకరణం కలుగుతుంది.
యోగి తన ఇంద్రియాలను బాహ్యవిషయరూపాలను పొందకుండా నిరోధించి, మనస్సుతో ఐక్యం చేయగలిగితే, సంపూర్ణ ఇంద్రియ నిగ్రహం పొందుతాడు. ఇంద్రియాలు పూర్ణంగా వశమైతే, ప్రతిస్నాయువుకూడా, ప్రతినాడీ కూడా స్వాధీనమవుతుంది. ఎందుకంటే, సమస్త ఇంద్రియానుభవాలకూ సమస్తవ్యాపారాలకూ ఇంద్రియాలే కేంద్రాలు కదా! జ్ఞాన కర్మ ఇంద్రియాలని ఇంద్రియాలు రెండు రకాలు. ఇంద్రియాలను నిరోధిస్తే చాలు, యోగి సమస్త మనోవ్యాపారాలను భావాలను నిగ్రహింపగలుగుతాడు. అప్పుడు శరీరం సంపూర్ణంగా యోగికి వశమవుతుంది. తాను జన్మించినందుకు, ఆ రోజే మనిషికి ఆనందం కలుగుతుంది. ఆ రోజే, “నేను పుట్టినందుకు ధన్యుడనయ్యాను” అని అతను చెప్పగలుగుతాడు. ఇలాంటి జితేంద్రియత్వం లభిస్తే, నిజంగా ఈ శరీరం ఎంత అద్భుతమైనదో మనకు గోచరిస్తుంది.