ఏకాగ్రత – దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలు
1. అథ యోగానుశాసనమ్.
ఇక యోగస్వరూప లక్షణాల గూర్చి చెప్పుకుందాం.
2. యోగః చిత్తవృత్తి నిరోధః.
చిత్తవృత్తులను నిగ్రహించటమే యోగం (చిత్తం = అంతఃకరణం). చిత్తం, వృత్తులు అంటే ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. నాకు కన్నులున్నాయి. కాని అవి తమంత తామే చూడలేవు. మెదడులో నేత్రనాడీకేంద్రముంటుంది; దాన్ని తీసివేయండి. కన్నులు మామూలుగానే ఉంటాయి. రెటీనా (నేత్రాంతఃపటలం) కూడా చక్కగానే ఉంటుంది. దానిపై ప్రతిబింబాలు పడుతూనే ఉంటాయి. అయినా సరే, కన్నులు రూపాలను చూడలేవు. కాబట్టి కన్నులు అప్రధాన సాధనాలు; అవి చూచే ఇంద్రియాలు కావని తేలుతోంది కదా! మెదడులోని ఒక నాడీ కేంద్రంలో ఈ చూచే ఇంద్రియముంటుంది. కన్నులున్నంత మాత్రాన చూపుంటుందని చెప్పలేం. ఒక వ్యక్తి కన్నులు తెరచుకుని పడుకున్నాడు. చుట్టూతా మంచి వెలుతురుంది. వెలుపలి వస్తువుల నుండి ప్రతిబింబాలు కూడా ఏర్పడుతున్నాయి. అయినా వస్తువు కనిపించదు. కారణమేమంటే వీటికి తోడుగా మరొకటి ఉండాలి. అదే మనస్సు. ఇంద్రియంతో మనస్సు సంయోగం చెందాలి. అప్పుడే వస్తువు కనిపిస్తుంది.
కన్ను వెలుపలి ఉపకరణం. దీనికి మెదడులోని కేంద్రం మనోనియంత్రణం సహాయపడాలి. అప్పుడే కన్ను గ్రహించే రూపం కనిపిస్తుంది. దారివెంట వాహనాలు వెళుతున్నాయి. అయినా వాటి చప్పుడు మనకు విన్పించటం లేదు. ఎందుకంటారూ? మన మనస్సు, ‘చెవి’ అనే ఇంద్రియ పరికరంతో సంయోగం చెందటం లేదు. ఉపకరణం, ఇంద్రియం ఈ రెంటితో కలిసే మనస్సు అనే మూడు విషయాలు ఈ క్రియలో ఉన్నాయి. వీటి మూలంగా వచ్చే స్పర్శ (వార్త) మనస్సులోని బుద్ధికి చేరుతుంది. ‘నిశ్చయం’ చేసే పని బుద్ధిది. బుద్ధి నిశ్చయం చేస్తుంది. అదే బుద్ధి ప్రతిక్రియ. ఈ ప్రతిక్రియను వెన్నంటి అహంభావం ఉంటుంది. ఈ క్రియ ప్రతిక్రియల సంయోగం పురుషునికి అందుతుంది; పురుషుడు మన నిజాత్మ. దానితో పురుషుడు విషయాన్ని అనుభవిస్తాడు.
ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం వీటిని అంతఃకరణ చతుష్టయమంటారు. నిజానికి ఇవన్నీ చిత్తం చేసే వేరు వేరు వ్యాపారాలే. చిత్తంలోని సంకల్పాలే వృత్తులు. (వృత్తి = సుడిగుండం). మరి సంకల్పమంటే ఏమిటీ? అదొక శక్తి. భూమ్యాకర్షణశక్తి లాంటిదే. ప్రకృతిలో అనంతశక్తిరాశి ఉంది. దాన్నుండి చిత్తం కొంత శక్తిని గ్రహిస్తుంది. ఆ శక్తినే సంకల్పరూపంగా బయటికి పంపుతూ ఉంటుంది. ఆహారం వల్లే ఈ శక్తి మనకు లభిస్తుంది. ఆహారం ద్వారానే శరీరం కదలికలు చేసే శక్తిని పొందుతుంది. ఇతర సూక్ష్మ శక్తులు కూడా సంకల్పరూపంలో ఆహారం ద్వారా వెలువడుతున్నాయి. కాబట్టి చిత్తం కూడా ఒక పదార్థమే. అది స్వయంగా చైతన్యవంతం కాదు. మరది చైతన్యవంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది కదా! అంటారా? చిత్తం వెనుక చైతన్యవంతుడైన పురుషుడున్నాడు సుమా! అందుకే చిత్తం అలా కనిపిస్తుంది.
నువ్వే అసలు చైతన్యం. చిత్తం నీకు ఒక ఉపకరణం మాత్రమే; దాని ద్వారా నువ్వు ప్రపంచాన్ని గ్రహిస్తావు. ఈ పుస్తకముంది కదా; బాహ్య ప్రపంచంలో ఇది పుస్తకరూపంలో లేదు. బాహ్యంలో మరది ఏమై ఉందో అది మనకు తెలియదు; తెలియబోదు. ఈ అజ్ఞాతవస్తువు వల్ల చిత్తానికి ఘర్షణ ఏర్పడుతుంది. రాతిని నీటిలో వేస్తే, నీటిపై తరంగాలు బయలు దేరుతాయి. అలాగే వస్తువుతో చిత్తానికి సంఘర్షణ కలగగానే, చిత్తంలో పుస్తకరూప ప్రతిక్రియ కలుగుతుంది. నిజంగా ప్రపంచమంటే ఏమిటీ? బాహ్యవిషయాలతో చిత్తం చేసే ప్రతిక్రియరూపమైన సంఘటనలే. పుస్తకరూపం ఏనుగు రూపం మనిషి రూపం అంటూ బాహ్య ప్రపంచంలో ఏ రూపాలూ లేవు. బాహ్యస్పర్శతో చిత్తంలో కలిగే ప్రతి క్రియలనే మనం గ్రహిస్తుంటాం. జాన్ స్టూవర్ట్మిల్, “స్పర్శాది ఇంద్రియానుభూతుల శాశ్వత సంభవనీయతయే భౌతిక ప్రకృతి” అని అంటాడు. బాహ్యప్రపంచంలో శబ్దాది విషయాలు మాత్రమే ఉన్నాయి. ఒక ముత్తెపుచిప్పను తీసుకోండి; మంచి ముత్యం ఎలా తయారౌతుందో మీకు తెలుసు కదా! పరాన్నభుక్కు అయిన క్రిమి ఒకటి ముత్తెపు చిప్పలో ప్రవేశిస్తుంది. చిప్పకు గుల గుల కలిగిస్తుంది. దానితో చిప్ప పింగాణి వంటి పదార్థాన్ని ఆ క్రిమి చుట్టూ వెదజల్లుతుంది. అదే ముత్యమవుతుంది. ఈ దృశ్యప్రపంచం కూడా మనం వెదజల్లే పింగాణి అనే చెప్పాలి. యథార్థప్రపంచం ఆ క్రిమి లాంటిది. ఈ యథార్థ ప్రపంచాన్ని సామాన్యులు ఎప్పుడూ గుర్తించలేరు. తెలుసుకునే ప్రయత్నం చేసినా, తాము కల్పించే భావనాప్రపంచమే వారికి కనిపిస్తుంది.
చిత్తవృత్తులంటే ఏమిటో ఇప్పుడు మనకు తెలిసింది కదా! మనస్సుకు పురుషుడు ఆధారం. అతని చేతిలో మనస్సు ఒక పరికరం. అతని చైతన్యమే మనస్సు ద్వారా వెలువడుతోంది. నీవు మనస్సుకు ఆధారం, కాబట్టి మనస్సు చైతన్యవంతమవుతోంది. పురుషుడు మనస్సును త్యాగం చేస్తే, వెంటనే అది నశించి పోతుంది. చిత్తం అంటే ఇదే. చిత్తం మనస్సనే పదార్థం. బాహ్య విషయాలతో చిత్తానికి సంయోగం కలగటంతో, వృత్తులనే తరంగాలు చిత్తంలో లేస్తాయి. ఈ వృత్తులే సుమా, మన ప్రపంచం.
అలలతో నున్న కొలను అడుగుభాగాన్ని మనం చూడలేం. అలలు అణిగిపోయి, నిశ్చలమైనప్పుడే అడుగుభాగం క్షణకాలం మనకు కనిపిస్తుంది. నీరు మలినంగా ఉన్నా, కదలుతున్నా నీటి అడుగుభాగం మనకు కనిపించదు. చిత్తమనే సరస్సులో మన నిజస్వరూపం, ఆత్మయే అడుగు భాగం. చిత్తంలో చెలరేగే వృత్తులే తరంగాలు. చిత్తానికి మూడుస్థితులున్నాయి; సాత్త్వికం, రాజసం, తామసం అని. పశువుల్లో పశుతుల్యుల్లో తామసం విశేషంగా ఉంటుంది. ఈ స్థితి హానికరం. ఈ స్థితిలోని చిత్తానికి ఇతరులకు హాని చేయటమే స్వభావమై ఉంటుంది. విషయభోగాలను అధికారాన్ని కోరటం రాజసిక చిత్త ముఖ్యలక్షణం. ఇలాంటి చిత్తస్థితి, “శక్తిమంతుడినై అందరిపై అధికారం చూపిస్తాను.” అన్న ప్రేరేపణకు గురిచేస్తుంది. శాంతం, ప్రసన్నం సాత్త్వికస్థితి లక్షణం. ఈ స్థితిలో మనస్సులో ఎలాంటి తరంగాలుండవు; నిర్మలంగా ఉంటుంది. జడత్వం మనస్సు సాత్త్వికస్థితి కాదు. సాత్త్విక మనస్సు ధృతి ఉత్సాహంతో కూడి ఉంటుంది. శాంతంగా ఉండటమంటే ఎక్కువ శక్తిని ప్రదర్శించటం, అన్నమాట. పని చేస్తుండటం (చపలంగా ఉండటం) చాలా సులభం. కళ్ళెం వదిలిపెడితే, గుఱ్ఱాలు ఇష్టం వచ్చినట్లు పరుగులు పెడతాయి. ఇది అందరికీ సాధ్యమే. కాని గొప్పవేగంతో పరిగెత్తే గుఱ్ఱాలను అదుపు చేయగలవాడే నిజంగా బలవంతుడు. అదుపు చేయటానికి మాత్రమే చాలా బలం కావలసి ఉంటుంది. వదిలిపెట్టటానికి బలమెందుకూ? కాబట్టి శాంతచిత్తుడంటే, పనిపాటలు లేక మందుడై, అలసుడై ఉండేవాడు కాదు. సత్త్వమంటే అలసత్త్వం, సోమరితనం అని అనుకోవద్దు. చిత్తవృత్తుల్ని నిరోధించేవాడే సుమా, ప్రశాంతచిత్తుడు! నికృష్టబలాన్ని ప్రకటిస్తే అది ప్రవృత్తి; ఉత్కృష్టబలాన్ని ప్రకటిస్తే, అది ప్రశాంతత.
తన సహజ శుద్ధావస్థను చేరటానికే మనసెప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఇంద్రియాలు మాత్రం మనస్సును బయటికి లాగుతూ ఉంటాయి. ఇలా మనస్సు వెలుపలికి వెళ్ళకుండా అరికట్టటమే మనోనిగ్రహం; మనస్సును నిగ్రహించి, దాన్ని ప్రజ్ఞాన ఘన ఆత్మలో లయం చేయటానికి దాన్ని అంతర్ముఖం చేయటమే యోగానికి మొదటి మెట్టు. మనోనిగ్రహానికి ఇదే సరైన దారి.
క్రిమికీటకాలు మొదలు పశుపక్ష్యాదులదాకా అన్ని జంతువుల్లోనూ మనోవ్యాపారం కనిపిస్తూ ఉంటుంది. మనిషిలో మాత్రమే మనస్సు బుద్ధి రూపాన్ని ధరిస్తుంది. చిత్తం బుద్ధిరూపం పొందాలి; అప్పుడే నివృత్తి మార్గం అవలంబించటం సాధ్యమౌతుంది; అనేక సాధనలు చేసి ఆత్మ ముక్తి పొందటానికి వీలవుతుంది. ఆవు, కుక్క మొదలైన జంతువులకు మనస్సుంది; నిజమే కాని వాటి మనస్సు, బుద్ధి అనే రూపాన్ని పొందలేదు. కాబట్టి సత్వరం ముక్తి పొందటం వాటికి సాధ్యంకాదు.
చిత్తానికి రకరకాల అవస్థలున్నాయి; క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం మొదలైనవి. ప్రవృత్తి క్షిప్తావస్థకు లక్షణం. సుఖదుఃఖాల్లో ఇలాంటి మనస్థితి వ్యక్తమౌతూ ఉంటుంది. ప్రమాదాన్ని కల్గించే సోమరితనం మూఢావస్థకు లక్షణం. దేవతలకు క్షిప్తావస్థ; రాక్షసులకు మూఢావస్థ సహజమని యోగసూత్ర వ్యాఖ్యాత చెబుతాడు. నివృత్తి విక్షిప్తావస్థకు లక్షణం. చిత్తం ఏకాగ్రం కావటానికి ప్రయత్నించే సమయంలో ఏకాగ్రస్థితి ఏర్పడుతుంది. ఏకాగ్రస్థితి నుండి సమాధిస్థితికి కొనిపోయే స్థితే నిరుద్ధావస్థ.
3. తదా ద్రష్టుః స్వరూపేఽవస్థానమ్.
అప్పుడు (యోగావస్థలో ఉండే కాలంలో) సాక్షి అయిన పురుషుడు, తన స్వరూపంలో నెలకొని ఉంటాడు.
అలలన్నీ ఆగిపోయి, సరస్సు నిర్మలంగా ఉన్నప్పుడు అడుగు భాగాన్ని మనం స్పష్టంగా చూస్తాం. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనం మన స్వరూపాన్ని తెలుసుకోగలం. ఆ స్థితిలో మనస్సుతో తాదాత్మ్యం చెందకుండా ఆత్మస్వరూపులమై ఉంటాం.
4. వృత్తి సారూప్య మితరత్ర.
ఇతర సమయాల్లో (యోగంలో లేని సమయాల్లో) పురుషుడు వృత్తులతో సమాన స్వరూపాన్ని పొంది ఉంటాడు.
ఎలా అంటారా? ఒకరు నన్ను తిట్టారనుకోండి. ఆ తిట్టువల్ల నా మనస్సులో ఒక వృత్తి కలుగుతుంది. ఆ వృత్తితో నేను ఏకమైపోతాను. దాని ఫలితం నాకు దుఃఖం.
5. వృత్తయఃపంచతయ్యఃక్లిష్టాఽక్లిష్టాః.
వృత్తులు ఐదు రకాలు; క్లేశయుక్తాలు, క్లేశరహితాలు అని.
6. ప్రమాణ – విపర్యయ – వికల్ప – నిద్రా – స్మృతయః.
ఆ ఐదు వృత్తులు ఇవి: ప్రమాణం, విపర్యం, వికల్పం, నిద్ర, స్మృతి.
7. ప్రత్యక్ష అనుమాన ఆగమాః ప్రమాణాని.
ప్రమాణవృత్తి మూడు రకాలు: ప్రత్యక్షం, అనుమానం, ఆగమం (శబ్దం).
శబ్దాది విషయాలతో మనకు కలిగే రెండు ప్రత్యక్షానుభవాలు పరస్పరం విరుద్ధంగా లేకుంటే, దాన్ని ‘ప్రమాణ’ మంటాం. నాకో శబ్దం వినిపించింది. వెనుకటి నా అనుభవానికి ఇది విరుద్ధంగా ఉంటే, దీన్ని నేను నమ్మను; నిరాకరిస్తాను.
ప్రమాణాలు మూడు రకాలు: ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవాక్యం అని. మనకు కలిగే అనుభవంలో ఎలాంటి భ్రమకు తావులేకుంటే అది ప్రత్యక్ష ప్రమాణం. ప్రపంచం ఉంది అనటానికి నాకు ప్రపంచం కనిపించటమే ప్రమాణం. లక్షణం ద్వారా లక్ష్యవస్తువును గ్రహించటం అనుమానప్రమాణం. తత్త్వదర్శులైన యోగుల ప్రత్యక్షానుభవమే ఆప్తవాక్యం. జ్ఞానం పొందటానికి మనం ప్రయత్నిస్తున్నాం; అయితే దానికోసం ఎంతో ఆయాసంతో కూడిన హేతువాదాన్ని మనం అవలంబించాలి; చాలాకాలం వరకూ ఓర్పుతో కృషిచేయాలి. ఋషులకు, యోగులకు ఇంత శ్రమ అవసరముండదు. ఈ సామాన్యపద్ధతులను వారు దాటివేశారు. భూత భవిష్యత్ వర్తమానాలు వారికి సమానంగా, ఏకగ్రంథంగా ఉంటాయని చెప్పవచ్చు. జ్ఞానం పొందటానికి క్లేశంతో కూడిన మన పద్ధతుల్ని వారవలంబించనక్కరలేదు. సర్వవిజ్ఞానం వారికి తమలోనే గోచరిస్తూ ఉంటుంది; కాబట్టి వారి పలుకులు మనకు ఆప్తవాక్యంగా ప్రమాణమౌతాయి. వారి ద్వారానే శృతి, స్మృతులు వస్తున్నాయి. కాబట్టి వేదశాస్త్రాలు మనకు ప్రమాణాలు. ఇలాంటి మహర్షులు నేడున్నా, వారి మాటలు మనకు పరమ ప్రమాణాలే. ఈ ఆప్తవాక్య ప్రమాణం గూర్చి ఇతర తాత్త్వికులు సుదీర్ఘవాదాలు చేస్తుంటారు. “సరే, మరి వారి మాటలకు ప్రమాణమేమిటీ?” అని ప్రశ్నిస్తుంటారు. వారి ప్రత్యక్షానుభవమే ప్రమాణం. ఎందుకంటారా? మీ వెనుకటి అనుభవానికి ఇప్పటి మీ ప్రస్తుత ప్రత్యక్షానుభవం విరుద్ధం కాకుంటే, అది మీకు ప్రమాణమే అవుతుంది. మన తార్కికజ్ఞానానికి, వెనుకటి అనుభవానికి అతీంద్రియజ్ఞానం విరుద్ధం కాకుంటే, ఆ జ్ఞానం ఎప్పటికీ ప్రమాణమే. ఈ గదిలోకి ఒక పిచ్చివాడు వచ్చాడనుకొందాం. అతని మాటలు మనకు ప్రమాణం కాలేవు. జ్ఞానం యథార్థమై ఉండాలి. అంతేకాదు, అది వెనుకటి అనుభవానికి విరుద్ధంగా ఉండకూడదు. ఇక్కడ వ్యక్తిశీలం కూడా ప్రధానం వహిస్తుంది; తన అనుభవాన్ని చెప్పే వ్యక్తి శీలంపైన అతని అనుభవం ఆధారపడియుంటుంది. వ్యక్తిశీలం ముఖ్యంకాదు, అతని మాటలే ప్రధానం; కాబట్టి అతని మాటలు గ్రహిస్తే సరిపోతుంది అని కొందరంటారు. ఇది వ్యవహారంలో పనికిరావచ్చు. ఒక దుష్టుడు, జ్యోతిష్యశాస్త్రంలో క్రొత్త విషయాన్ని కనుగొనవచ్చు. అయితే పారమార్థిక విషయంలో పై సూత్రం వర్తించదు. ఎందుకంటారా, దుష్టుడు ఎన్నటికీ తత్త్వజ్ఞానాన్ని పొందలేడు. కాబట్టి ఒకవ్యక్తి ఆప్తుడన్నప్పుడు, అతను స్వార్థరహితుడా, కాదా? పవిత్రుడా, కాడా? జితేంద్రియుడా, కాడా? అతని మాటలు ఇంతవరకు లభించిన విజ్ఞానానికి అనుగుణంగా ఉన్నాయా, లేవా? అన్న విషయాలను మనం ముందుగా నిశ్చయం చేసుకోవాలి. ఎలాంటి నూతనధర్మమైనా, సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉండక, దానికి అనుగుణంగా ఉంటుంది. ఆ నూతనధర్మం పరీక్షకు నిలుస్తుంది. ఒక వ్యక్తి “నేనొక దివ్యదృశ్యాన్ని చూశాను” అని నాతో అంటాడనుకోండి; “ఆ దృశ్యం చూసేందుకు నీకు అర్హత లేదంటా” డనుకోండి. అతని మాటలు నేను నమ్మను. ఎవరైనాసరే ఆ దృశ్యాన్ని స్వయంగా చూడగల్గాలి.
మరొక్క విషయం తన జ్ఞానాన్ని అమ్మేవాడు ఆప్తుడెప్పటికీ కాడు. ఆప్తుడు పరిశుద్ధచిత్తుడై ఉండాలి. స్వలాభమందు ఆపేక్ష లేనివాడై ఉండాలి. కీర్తి ప్రతిష్ఠలను అతను ఆశించకూడదు. అతను అతీంద్రియ జ్ఞాని అని మనకు స్పష్టం కావాలి. అతను చెప్పే విషయాలు అతీంద్రియ విషయాలై ఉండాలి; అవి ఇతర పారమార్థిక తత్త్వాలకు అనుగుణంగా ఉండాలి; అంతేకాదు అవి లోకకళ్యాణం చేసేవిగా ఉండాలి.
అతని తత్త్వజ్ఞానం, ఇతర ప్రకృతి శాస్త్రసిద్ధాంతాలకు విరుద్ధంగా ఉండకూడదు. అలా ఉంటే, ఆ జ్ఞానాన్ని వెంటనే వదలివేయండి. అతని తత్త్వజ్ఞానం అతనికి మాత్రమే కాదు; అందరికీ సాధ్యమై ఉండాలి.
ఈ నియమాలన్నీ సరిపడితే తప్ప ఒకవ్యక్తి ఆప్తుడు కాలేడు.
ఇలా ప్రమాణాలు ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవాక్యం అని మూడు రకాలుగా ఉంటాయి.
‘ఆప్తుడు’ అనే పదానికి ఆంగ్లంలో సరైన పదం లేదు. ఆప్తుడంటే ‘దివ్యావేశం పొందినవాడు’ అంటే, ఆ ఆవేశం పైనుండి వస్తుందనుకోవాలి. కాని దివ్యజ్ఞానం అలా కాదు. అది పురుషునిలో నుండే వ్యక్తమవుతుంది. ‘ఆప్త’ అంటే ‘పొందిన’ అని అర్థం.
8. విపర్యయో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్ఠమ్.
లేనివస్తువు రూపంలో ఆ వస్తువు ఉంది అనే మిథ్యాజ్ఞానమే విపర్యయ వృత్తి.
ముత్యపుచిప్పను చూసి, అది వెండి అని భ్రాంతి పడుతుంటాం; ఇలా ఒక వస్తువును చూసి, మరొక వస్తువని భ్రాంతి పడటమే విపర్యయ వృత్తి.
9. శబ్దజ్ఞానాను పాతీ వస్తుశూన్యో వికల్పః.
శబ్దానికి సంబంధించిన వస్తువు లేకున్నా, శబ్దజ్ఞానంతో అనుసరించే వృత్తి వికల్పవృత్తి.
వికల్పమనే మరోవృత్తి ఉంది. ఒక శబ్దం వినిపించిందనుకుందాం. ఆ శబ్దార్థం ఏమై ఉంటుందా అని కూడా ఆలోచించక మనం వెంటనే నిర్థారించి వేస్తుంటాం. ఇది చిత్తదౌర్బల్య లక్షణం. దీనివల్ల మనోనిగ్రహాన్ని ప్రతిపాదించే సిద్ధాంతం మనకు చక్కగా అర్థమవుతుంది. దుర్బలత్వం పెరుగుతున్న కొద్దీ, మనిషిలో మనోనిగ్రహం క్షీణిస్తూ ఉంటుంది. ఆత్మ పరీక్ష కోసం ఈ ప్రమాణాన్ని మనం అనుసరిస్తుండాలి. కోపం, దుఃఖం ఇలాంటివి కలిగే సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోండి. “ఏదో ఒకవార్త వినగానే నాకీ కోపవృత్తి, దుఃఖవృత్తి తప్పకుండా ఎందుకు కలగాలీ?” అని ఆలోచించుకోండి.
10. అభావ – ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా.
అభావాన్ని ఆశ్రయించి ఉండే వృత్తి, నిద్రావృత్తి.
నిద్రావృత్తి, స్వప్నవృతి అనే వృత్తులున్నాయి. నిద్రనుండి మేలుకొన్న తర్వాత ‘నేను నిద్రించాను’ అన్న జ్ఞానం మనకుంటుంది. అయినా ఆ నిద్రానుభవం మనకు కేవలం ‘స్మరణ’ మాత్రమే. అనుభవించని విషయం గూర్చిన ‘స్మృతి’ మనకెప్పుడూ ఉండదు. ప్రతి చిత్తవృత్తికూడా సరస్సులో అలలాంటిదే. నిద్రించే సమయంలో చిత్తంలో ఎలాంటి వృత్తులు లేకుంటే, అనుకూల లేదా ప్రతికూల అనుభవాలు ఏవీ కలగవు. కలగని అనుభవాలను స్మరించటం కూడా జరగదు. కాని “నిద్రించాను” అన్న స్మృతి మనకుంటున్నది. కాబట్టి నిద్రావస్థలో చిత్తంలో తప్పకుండా వృత్తులుంటున్నాయని స్పష్టమవుతున్నది కదా! ఈ స్మృతి అనేది కూడా మరో చిత్తవృత్తి.
11. అనుభూత విషయా సంప్రయోషః స్మృతిః.
(ప్రమాణాది వృత్తులతో) అనుభవించిన విషయాలు జ్ఞాపకం రావటమే స్మృతి వృత్తి.
ప్రత్యక్షానుభవం, మిథ్యాజ్ఞానం, వికల్పం, నిద్ర వీటిద్వారా స్మృతి కలగవచ్చు. సరస్సులోకి రాయి వేస్తే ఏ విధంగానైతే దానిలో అలలు పుడతాయో, అదే విధంగా మీరొక శబ్దం విన్నప్పుడు ఆ శబ్దం వల్ల చిత్తంలో ఒక అల పుడుతుంది. ఆ అలవల్ల మరిన్ని చిన్న చిన్న అలలు జనిస్తాయి. ఇదే స్మృతి. నిద్రలో కూడా ఇలాగే జరుగుతుంది. నిద్ర అనే విచిత్ర వృత్తివల్ల, చిత్తంలో స్మృతి వృత్తి బయలుదేరుతుంది. అదే స్వప్నం. జాగ్రత్తలోని స్మృతి వృత్తే నిద్రలో స్వప్నంగా రూపుదాలుస్తుంది.
12. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః.
పై వృత్తులను అభ్యాసం, వైరాగ్యం ద్వారా నిరోధించగలం.
వైరాగ్యం కలగాలంటే, మనసు నిర్మలంగా, సాధనాయోగ్యంగా, విచారణాయుక్తంగా ఉండాలి. సాధన అసలు ఎందుకు చేయాలో ఆలోచిద్దాం. మనం చేసే ప్రతికార్యం కూడా సరస్సు పైభాగంలో చలించే అల లాంటిది. శబ్దాది విషయాల అనుభవాలు అదృశ్యం కాగానే, వాటి వల్ల ఏర్పడే సంస్కారాలు నిలచిపోతాయి. అనేక సంస్కారాలు కలసి ‘అభ్యాసం’ అనేది ఏర్పడుతుంది. అభ్యాసాన్ని అపరస్వభావం అంటారు. సాక్షాత్ స్వభావం, సంపూర్ణ స్వభావం ఇవి కూడా అభ్యాసములే. మనం సజ్జనులుగా ఉన్నా, దుర్జనులుగా ఉన్నా అంతా అభ్యాస ఫలితమే. కాబట్టి ఒక అభ్యాసాన్ని అలవాటు చేసుకోవటానికి, లేదా వదలిపెట్టటానికి మనం సమర్థులమై ఉన్నాం. అందుకని ప్రస్తుతమున్న మన స్వభావం గూర్చి మనం నిరాశ చెందనవసరం లేదు. సుఖ దుఃఖాది అనుభవాలు మనస్సులో సంస్కారాలను ఏర్పరుస్తాయి. ఈ సంస్కారాల ఫలమే మన శీలం. ఎలాంటి సంస్కారాలు మనలో బలంగా ఉంటే, మనకలాంటి శీలం ఏర్పడుతుంది. సత్సంస్కారాలు విశేషంగా ఉంటే, సత్ప్రవర్తన అలవడుతుంది. దుష్టసంస్కారాలు ప్రబలంగా ఉంటే, దుష్ప్రవర్తనం అలవడుతుంది. ఇలాగే, సంతోషకర సంస్కారాలతో మనం సంతోషంగా ఉంటాం. దురభ్యాసాలను మానాలంటే, వాటికి వ్యతిరేకమైన మనోవృత్తులను అవలంబించటమే ఉపాయం. దుష్టసంస్కార జనిత దురభ్యాసాలను, మంచి అభ్యాసాలతో నిరోధించాలి. అందుకని, మీరు ఎప్పుడూ మంచే చేస్తూండండి; ఎప్పుడూ మంచి భావాలనే ఆలోచిస్తూ ఉండండి. దుష్టసంస్కారాలను నిరోధించటానికి ఇదే మార్గం.
ఒకవ్యక్తి ఎంత దుర్జనుడైనాసరే, ‘అతనిక మంచివాడు కాజాలడు’ అని చెప్పవద్దు. ఎందుకంటే, అతని ప్రస్తుత వర్తనం అతని అభ్యాస ఫలితమే కదా! నూతన సదభ్యాసాలతో, తన పూర్వాభ్యాసాలను అతడు నిగ్రహింపవచ్చు. అభ్యాసఫలితమే శీలం. కాబట్టి మంచి అలవాట్లను అలవరచుకోవటమే, శీలాన్ని చక్కగా చేసుకోవటానికి మార్గం.
13. తత్ర స్థితా యత్నోఽభ్యాసః.
చిత్తవృత్తులను సంపూర్ణంగా నిరోధించటానికి చేసే నిరంతర ప్రయత్నమే అభ్యాసం.
సాధన అంటే ఏమిటీ? చిత్తాన్ని వృత్తిరూపం పొందకుండా చేయుట చిత్తవృత్తినిరోధం. దీన్నే సాధన అంటారు.
14. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమిః.
ఆ అభ్యాసాన్ని చాలాకాలం వరకూ, ఎడతెగకుండా, ఆదరాతిశయంతో కొనసాగిస్తే, అప్పుడు స్థిరమైన స్థితి కలుగుతుంది.
మనోనిగ్రహం ఒక్కరోజు కృషిచేసినంత మాత్రాన లభించేదికాదు. చిరకాలం నిరంతర సాధన చేయాలి. అప్పుడే అది సిద్ధిస్తుంది.
15. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యమ్.
ఇహపరాల్లో అనుభవించదగ్గ విషయాల్లో ఆశలేనివానికి, విషయాలు తనకు వశమైనాయని తెలియటమే వైరాగ్యం.
మనం రెండు రకాల ప్రేరణలతో పనులు చేస్తుంటాం. ఒకటి, ప్రత్యక్ష స్వానుభవం; రెండు ఇతరుల అనుభవం. వీటి ప్రాబల్యంతో చిత్తంలో రకరకాల వృత్తితరంగాలు కలుగుతాయి. ఈ శక్తులతో పోరాడి, మనస్సును నిగ్రహించే సామర్థ్యమే వైరాగ్యం. చిత్తవృత్తుల్ని త్యాగం చేయాలి. నేనొక వీథిలో వెళుతున్నాననుకోండి. అంతలో ఒకవ్యక్తి వచ్చి, నా గడియారాన్ని దొంగలించి పారిపోతుంటాడనుకోండి. ఇది నా ప్రత్యక్షానుభవం. దానితో వెంటనే నా మనస్సులో ‘క్రోధం’ అనే వృత్తి పుడుతుంది. ఇలాంటి వృత్తుల్ని అసలు పుట్టనివ్వవద్దు. దీనికి నువ్వు అసమర్థుడవైతే, నువెందుకూ పనికిరావు. చిత్తవృత్తుల్ని నిరోధించగలిగితే, నీకు వైరాగ్యం అలవడుతుంది. ఇహలోకంలో రమించేవారికి, భోగాలను అనుభవించటమే పరమాదర్శం. విషయభోగాలు మనల్ని భ్రమింప చేస్తుంటాయి. కాబట్టి భోగాలను త్యాగం చేసి, చిత్తవృత్తుల్ని నిగ్రహించాలి. ఇదే త్యాగం. స్వానుభవం వల్లా, పరుల అనుభవం వల్లా గుణపాఠాలు గ్రహించి, విషయాసక్తిని గ్రహించి, మనస్సును ఆ విషయాలబారిన పడకుండా చేయటమే వైరాగ్యం. విషయాల కోరికలు నీకు వశమై ఉండాలి కానీ, నువ్వు వాటికి వశమై ఉండకూడదు. ఇలాంటి మనోబలమే వైరాగ్యం. వైరాగ్యాన్ని మించిన మోక్షసాధనం మరొకటి ఏదీ లేదు.
16. తత్పరం పురుష ఖ్యాతేర్గుణ వైతృష్ణ్యమ్.
త్రిగుణా (సత్త్వ, రజః, తమోగుణా)లను కూడా పరిత్యాగం చేసేటంతటి అత్యంత వైరాగ్యం, పురుషుని (నిజస్వభావాన్ని) చూపుతుంది.
తీవ్రవైరాగ్య ప్రభావంవల్ల మనల్ని గుణాలు ఆకర్షింపలేవు. పురుష స్వరూపం గూర్చి, గుణాల గూర్చి ముందు తెలుసుకుందాం. యోగదర్శనం ప్రకారం, ప్రకృతి అంతా త్రిగుణాత్మకం. సత్త్వం, రజస్సు, తమస్సు అనేవి త్రిగుణాలు. భౌతిక ప్రపంచంలో తమోగుణం అంధకారంగా లేదా జడత్వంగా వ్యక్తమవుతుంది; రజోగుణం ఆకర్షణ శక్తిగా లేదా ప్రతిరోధక శక్తిగా కనిపిస్తుంది; సత్త్వగుణం ఈ రెంటి సమత్త్వంగా ప్రకటితమవుతుంది. సృష్టిజాతమంతా ఈ మూడుశక్తుల సంయోగ, పునస్సంయోగాలవల్ల ఉత్పన్నమవుతున్నది. ప్రకృతి తత్త్వాన్ని సాంఖ్యులు అనేక విధాలుగా విభజించారు. పురుషుడు, ప్రకృతికి అతీతుడుగా సర్వాతీతుడుగా, నిత్యశుద్ధబుద్ధ ముక్తుడై ఉంటాడు. ప్రకృతిలో మనకు కనిపించే జ్ఞానశక్తి అంతా ప్రకృతిలోని పురుషుని ప్రతిబింబమే కానీ, మరొకటి కాదు. ప్రకృతి స్వయంగా జడం అచేతనం. మనస్సు అనే తత్త్వం కూడా ప్రకృతి తత్త్వం లోనిదైనని మనం గుర్తించాలి. సంకల్పం మొదలు అత్యంత స్థూలభూతాల వరకూ అంతా ప్రకృతి తత్త్వం లోనివే ప్రకృతి వ్యక్తీకరణాలే. ప్రకృతి పురుషుని ఆవరించి ఉంది. ఈ ఆవరణాన్ని తొలగించుకుంటే చాలు, సహజతేజస్సుతో పురుషుడు ప్రకాశిస్తాడు. పదిహేనవ సూత్రంలో చెప్పినట్లు, వైరాగ్యం పురుషుని వ్యక్తీకరణానికి తోడ్పడుతుంది.
తర్వాతి సూత్రంలో యోగపరమావధి అయిన సమాధిస్థితిని నిర్వహిస్తారు.
17. వితర్క విచారానందాస్మితాను గమాత్ సంప్రజ్ఞాతః.
వితర్కం, విచారణం (యుక్తాయుక్త విచక్షణ) ఆనందం, అస్మితం అనే స్థితులతో కూడుకున్న సమాధిస్థితి, సంప్రజ్ఞాత సమాధి.
సమాధి స్థితి రెండు విధాలు; సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధి వల్ల ప్రకృతిని వశంచేసుకోవటానికి కావలసిన సిద్ధులన్నీ లభిస్తాయి. ఈ సంప్రజ్ఞాతసమాధి నాలుగు రకాలుగా ఉంటుంది. మొదటిది సవితర్క సమాధి; ఈ సమాధిస్థితిలో మనస్సు ఒకానొక విషయాన్ని, తదితర విషయాల నుండి వేరుచేసి, దాన్నే పదే పదే ధ్యానిస్తూ ఉంటుంది.
సాంఖ్యులు ఇరువదిఐదు తత్త్వాలను నిర్వచిస్తారు. వాటిలో (1) ఇరువదినాల్గు జడప్రకృతి తత్త్వాలు, (2) చేతన పురుషుడు అని రెండు రకాల ధ్యేయాలున్నాయి. యోగంలో ఈ (ప్రకృతి పురుష) భాగం మొత్తం సాంఖ్యదర్శనం పైన ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందే సాంఖ్యదర్శనం గూర్చి చెప్పాను కదా! మనస్సు, బుద్ధి, అహంకారం చిత్తం నుండే నిర్మాణమై, చిత్తంపైననే ఆధారపడి ఉంటాయి. చిత్తం ప్రకృతి శక్తులను గ్రహించి, వాటిని సంకల్పరూపంలో వెలివరుస్తూ ఉంటుంది. జడత్వం, శక్తి ఏకమయ్యే స్థితి ఒకటి తప్పక ఉండాలి. అదే సృష్టికి పూర్వం ఉండే అవ్యక్తావస్థ. కల్పాంతంలో ప్రకృతి అవ్యక్తావస్థను పొందుతుంది; తిరిగి కల్పారంభంలో వ్యక్తమవుతుంది. పురుషుడు వ్యక్త, అవ్యక్త స్థితులకు అతీతుడై, జ్ఞానస్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. జ్ఞానమే శక్తి. మనం ఒక విషయాన్ని గ్రహించటం ప్రారంభించగానే, అది మనకు వశమౌతూ ఉంటుంది. అలాగే వివిధ ప్రకృతి తత్త్వాలను చిత్తంలో సంయమనం చేయటం ప్రారంభించగానే, చిత్తానికి అవి వశమైపోతుంటాయి.
ప్రకృతిలోని స్థూలతత్త్వాలను ధ్యేయంగా గ్రహించే ధ్యానాన్ని, సవితర్కధ్యానమంటారు. వితర్కమంటే ప్రశ్న. సవితర్కం అంటే ప్రశ్నతో కూడినదని అర్థం. ప్రకృతి తత్త్వాలను ధ్యానించటమంటే, ప్రకృతిశక్తులను, ప్రకృతి రహస్యాలను వశంచేసుకొనటానికి విచారణ చేయటం, అని చెప్పవచ్చు. యోగసిద్ధులను పొందటం, ముక్తి కానేకాదు. వాటికోసం ప్రయత్నించటం, ఐహికసుఖాన్వేషణమే తప్ప మరేమీ కాదు. సుఖమనేది ఐహికజీవితంలో లేనే లేదు. కాబట్టి సుఖాన్వేషణం నిరర్థకం. పురాతనమైన ఈ గుణపాఠాన్ని నేర్చుకోవటం, మనిషికి దుస్సాధ్యంగా ఉంది. ఏలాగైనా గ్రహిస్తేమాత్రం, ఆ మనిషి ప్రపంచాతీతుడై ముక్తుడై పోతాడు.
యోగసిద్ధులను పొందితే కలిగే ఫలమేమిటీ? సంసార బంధాలు మరింత బలీయమైపోతాయి; అంతే. దుఃఖాలు రెండింతలు కావటమే వాటి ఫలితం! శాస్త్రవేత్తగా, పతంజలి యోగసిద్ధులను తెలియపరిచాడు; అయినా వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మాటి మాటికి అతను మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు.
దేశకాలాల నుండి పృథివ్యాది భూతాలను వేరుచేసి, వాటిని వాస్తవరూపంలో చింతన చేస్తే ఆ ధ్యానాన్ని నిర్వితర్కమంటారు. ధ్యానం అభివృద్ధి చెందగానే, తన్మాత్రలను ధ్యేయాలుగా గ్రహించి, దేశకాలాల్లో అవి ఉన్నట్లు వాటిని చింతన చేస్తే, ఆ ధ్యానాన్ని సవిచారమంటారు. ఆ ధ్యానంలోనే దేశకాలాలను తొలగించి, సూక్ష్మభూతాలను వాటి వాస్తవ రూపంలో చింతన చేస్తే, ఆ ధ్యానాన్ని నిర్విచారమంటారు. స్థూల, సూక్ష్మ భూతాలను రెంటిని కూడా వదలివేసి, అంతరింద్రియమైన మనస్సు మాత్రమే ధ్యేయమైతే, నిర్విచారధ్యానం కన్నా అది ఉన్నత ధ్యానమవుతుంది. అంతఃకరణం రజస్తమోగుణరహితమై ఉందని భావిస్తే, ఆ స్థితిని సానందసమాధి అంటారు. అస్మిత సమాధిలో మనసే ధ్యేయమై, ధ్యానం అత్యంత పరిపక్వమై, స్థిరమై ఉంటుంది. ఈ సమాధిస్థితిలో, స్థూల, సూక్ష్మభూతాల గూర్చిన భావనలన్నీ తొలగిపోతాయి. అహంకారం, ధ్యేయేతర విషయాలనుండి దూరమై సాత్త్వికస్థితిలో మాత్రమే నిలచి ఉంటుంది. ఇలాంటి సమాధిని పొందిన వ్యక్తి, వేదాలు చెప్పే విదేహస్థితిని పొందినవాడౌతాడు. ఆ వ్యక్తి, తాను స్థూలశరీర రహితుడనని భావించగల్గినా, అతనికింకా సూక్ష్మశరీర భావన ఉంటుంది. పరమావధి (ముక్తి)ని పొందకుండానే లయమయ్యే విదేహులను, ప్రకృతి లయులంటారు. విదేహస్థితితో ఆగక, గమ్యస్థానం వైపు సాధనను కొనసాగించే యోగులు, ముక్తులౌతారు.
18. విరామ ప్రత్యయాభ్యాస పూర్వః సంస్కార శేషోఽన్యః.
చిత్తవృత్తులను నిరంతరాభ్యాసంతో అరికట్టడం ద్వారా లభించే మరొక సమాధి ఉంది. దీనిలో అవ్యక్త సంస్కారాలు మాత్రమే చిత్తంలో మిగిలి ఉంటాయి.
ఈ అవస్థనే అతీంద్రియ జ్ఞానావస్థ అయిన అసంప్రజ్ఞాత సమాధి అంటారు. దీనివల్ల మోక్షం లభిస్తుంది. సంప్రజ్ఞాత సమాధి మోక్షప్రదం కాజాలదు. సర్వ సిద్ధులను పొందినా, యోగసాధకుడు కూడా పతనం కావచ్చు. ప్రకృతిని దాటివేస్తే తప్ప మనకు ప్రకృతి భయం తొలగదు. ప్రకృతి వశీకరణం అనేది సులభంగా కనిపించినా, అది ఎంతో కష్టసాధ్యం. అయినా మనస్సులో సంకల్పాలు కలగనీయక, మనస్సునే ధ్యానిస్తూ, సంకల్పం ఉదయించగానే దాన్ని నిరోధిస్తూ, మనస్సును శూన్యం చేయటమే ప్రకృతి వశీకరణానికి ఉపాయం. ఈ మహాకార్యాన్ని సాధించిన వ్యక్తికి మోక్షం కరతలామలకం అవుతుంది. అభ్యాస, వైరాగ్యాలను అవలంబించకుండా, మనస్సును సంకల్పశూన్యం చేసే వ్యక్తి వట్టి మూర్ఖుడు. తమస్సుతో నిండి వారు మనస్సును శూన్యం చేస్తున్నామని భావిస్తారు. మనస్సును వృత్తిశూన్యం చేయాలంటే, ఉత్క్రుష్టబలం అత్యున్నత నిగ్రహం కావాలి. అతీంద్రియ జ్ఞానావస్థ అయిన ఈ అసంప్రజ్ఞాత సమాధిని పొందటం వల్ల సమాధి నిర్భీజమవుతుంది. సంప్రజ్ఞాత సమాధిస్థితిలో ‘నేను’ అన్న జ్ఞానం ఇంకా భాసిస్తూ ఉంటుంది; మనస్సు చిత్తవృత్తులను శాంతింపచేసి వాటిని నిరోధించేందుకు మాత్రమే సమర్థమై ఉంటుంది; అయితే ఈ సంప్రజ్ఞాత సమాధిలో చిత్తవృత్తులు ఇంకా సంస్కార రూపంలో నిలచియుంటాయి. ఈ సంస్కారాలు లేదా బీజాలు, తగిన సమయం రాగానే వృత్తిరూపంలో అంకురిస్తాయి. అయితే వీటిని నిర్మూలనం చేసి, దాదాపు మనస్సును నాశనం చేయటంతో నిర్భీజసమాధి సిద్ధిస్తుంది. దానితో నిరంతర జనన మరణ ప్రవాహరూప సంసారవృక్ష కారణమైన కర్మబీజాలు నశిస్తాయి.
మనస్సు, ఎరుకలేని స్థితి ఎలా ఉంటుందని మీరడుగుతారేమో! ‘నేను’ అనే జ్ఞానం భాసించే బోధావస్థ, బోధాతీతావస్థ కన్నా క్రింది స్థితి. అత్యంత స్థితులు చాలావరకు ఒకేవిధంగా ఉంటాయని మనం గుర్తించాలి. అత్యల్పస్పందన స్థితిలోనున్న ఆకాశాన్ని చీకటి అని, మధ్యస్థితిలోనున్న దాన్ని వెలుతురని అనుకుంటే, అత్యధిక స్పందన స్థితిలో నున్నప్పుడు ఆకాశం మరల చీకటిగా ఉంటుంది. ఇలాగే, అజ్ఞానం క్రిందిస్థితి జ్ఞానం మధ్యస్థితి జ్ఞానాతీతస్థితి మహోన్నత స్థితి. అత్యంతాలైన జ్ఞాన, అజ్ఞానాలు రెండూ ఒకేవిధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. స్వతస్సిద్ధంగా జ్ఞానావస్థ కృత్రిమం; కల్పితం; యథార్థమైనది కాదు.
సదా ధ్యానాభ్యాసం చేస్తే లాభమేమిటీ? చిత్తవిక్షేప కారకాలైన పూర్వసంస్కారాలు, తామసిక చిత్తవృత్తులు మాత్రమే కాకుండా, సాత్త్విక సంస్కారాలు కూడా నశిస్తాయి. గనినుండి తీసిన ముడిబంగారాన్ని శుద్ధిచేయటానికి, దానిలోనున్న ఇతర లోహాలను వేరుచేయటానికి రసాయనాలను ఉపయోగిస్తారు. ఆ బంగారాన్ని కరిగించే సమయంలో, రసాయనాలతోపాటుగా, లోహపు చిట్టెం కూడా కాలిపోతుంది. అలాగే సదా మనోనిగ్రహాన్ని అభ్యసిస్తే, పూర్వపు దుష్టసంస్కారాలన్నీ పరస్పరం నిరోధించుకోగానే, ద్వంద్వాతీతం సర్వవ్యాప్తం సర్వశక్తిమంతం స్వయంజ్యోతియై వెలిగే ప్రత్యగాత్మ శేషించి ఉంటుంది. దానితో యోగి తాను జనన మరణరహితుడనని, సర్వలోకాతీతుడనని, గమనాగమన రహితుడనని గ్రహిస్తాడు. కేవలం ప్రకృతే వికారం చెందుచున్నదని, ఆ వికారం పురుషునిలో ప్రతిబింబిస్తున్నదని అతను కనుగొంటాడు. అద్దపుకాంతి తనమీద ప్రతిఫలించేటప్పుడు, ప్రతిబింబం చలించటం చూసి, తానే చలిస్తున్నాని గోడ అనుకొంటుంది. అలాగే వివిధరూపాలు పొందుతూ, చిత్తం సదా చలిస్తూ ఉంటే, ఆ రూపాలన్నీ మనమే అని మనం భ్రమిస్తూ ఉంటాం. అతీంద్రియ జ్ఞానం పొందిన వెంటనే, ఇలాంటి భ్రమలన్నీ పటాపంచలైపోతాయి. ముక్తపురుషుడు, తన సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి, ఒకర్ని వినమ్రతతో ప్రాధేయపడనక్కరలేదు; దీనుడై ప్రార్థింప నక్కరలేదు. అతను ఆజ్ఞాపించగానే, ఎలాంటి కోరిక అయినా సఫలమవుతుంది. ముక్తపురుషుడు, ఇచ్ఛామయుడు. అతను ఏం సంకల్పించినా అది నెరవేరుతుంది.
సాంఖ్యులు నిరీశ్వరవాదులు. ఈశ్వరుడనేవాడు ఒకడుంటే, అతడు ఒక పురుషుడై ఉండాలని, పురుషుడు ముక్తుడుగా గానీ, బద్ధుడుగా గానీ ఉంటాడని, అందుకని ఈశ్వరుడు ఉన్నాడనటానికి ప్రమాణమేమీ లేదని వారంటారు. ప్రకృతిబద్ధుడు, అస్వతంత్రుడు అయిన పురుషుడు ఎలా సృష్టిస్తాడు? అలాగే, ముక్తపురుషుడు సృష్టించటానికి, ప్రపంచ నియంతృత్వాన్ని వహించటానికి కారణమేమిటీ? ముక్తపురుషునికి కోరికలుండవు. కాబట్టి సృష్టించవలసిన అవసరం అతనికేమీ లేదు. అంతేకాదు, ఈశ్వర సిద్ధాంతాన్ని కూడా మనం ప్రతిపాదింప నక్కర్లేదని, అన్నింటికీ ప్రకృతే కారణమని సాంఖ్యులంటారు.
అయితే మరి భగవంతుడున్నాడు అనటంలో ప్రయోజనమేముందీ? కపిలుడు బహుపురుషులున్నారని, దాదాపు వారంతా పరిపూర్ణులైనా, సిద్ధులను మాత్రం పూర్తిగా వదలలేకపోవటం వల్ల, వారు పరమావధిని పొందటం లేదని అంటాడు. అలాంటి వారి చిత్తం ప్రకృతిలో కొంతకాలం లయిస్తుంది. మళ్ళీవారు ప్రకృతికి అధిపతులౌతారు. ఇలాంటి దేవతలున్నారు. మనమంతా ఇలాంటి దేవతలం కావచ్చు. సాంఖ్యుల ప్రకారం, వేదాలు చెప్పే పరమాత్మ పైన చెప్పుకున్న ముక్తపురుషుల్లో ఒకడే; స్వతంత్రుడు, శాశ్వతుడు అయిన సృష్టికర్త మరొకరు లేరు. యోగులు, “అది సరికాదు; భగవంతుడున్నాడు; అతడే సృష్టికర్త; అతను సదా ముక్తుడు; గురువులందరికీ గురువు” అంటూ చెబుతారు. సాంఖ్యుల ప్రకృతి లయులను కూడా యోగులంగీకరిస్తారు. పరిపూర్ణులు కావటానికి కొంచెం కొరతగల యోగులే ప్రకృతిలయలంటారు. కొంతకాలం వరకూ వారు పరమావధిని పొందటానికి అర్హులై ఉన్నా, వారు లోకపాలకులై ఉంటారని యోగులు భావిస్తారు.
19. భవ – ప్రత్యయో విదేహ – ప్రకృతిలయానామ్.
(తీవ్రవైరాగ్యం లేకుంటే ఈ సమాధి) విదేహు (దేవత) లకూ, ప్రకృతి లయులకూ పునర్జన్మ హేతువు అవుతుంది.
“పంచభూతాలూ, ఇంద్రియాలూ అనే వికృతి తత్త్వాలు; అవ్యక్తం, మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు అనే ప్రకృతి తత్త్వాలు ఇవన్నీ (ఆత్మతత్త్వాలు కాకున్నా) ఆత్మ అనే భావాన్ని, దానివల్ల కలిగే యోగాన్ని భవప్రత్యయం అంటారు.”
కొన్ని ఉన్నత పదవులను అలంకరించేవారు దేవతలని హిందూ తాత్త్వికులంటారు. జీవులు ఒకరి తర్వాత మరొకరు ఈ పదవులను ఆక్రమిస్తుంటారు. కాని వీరిలో ఎవ్వరు కూడా పరిపూర్ణులుగాని, ముక్తులుగాని అయి ఉండరు.
20. శ్రద్ధా – వీర్య – స్మృతి – సమాధి – ప్రజ్ఞా – పూర్వక ఇతిరేషామ్.
ఇతరులకు (విదేహప్రకృతి లయులు కానివారికి), శ్రద్ధ, వీర్య, స్మృతి, ఏకాగ్రత, ప్రజ్ఞ (తత్త్వవిచారణ) అనేవాటివల్ల ఈ సమాధి కలుగుతుంది.
వీరు దివ్యత్వాన్నిగానీ, కల్పాధిపత్యాన్ని గానీ కోరేవారు కారు. ఇలాంటివారు ముక్తులౌతారు.
21. తీవ్ర సంవేగానామాసన్నః.
తీవ్రకార్యదీక్ష ఉండేవారికి త్వరగా ఫలం లభిస్తుంది.
22. మృదు మధ్యాదిమాత్రత్వాత్తతోఽపి విశేషః.
మందం, సామాన్యం, తీవ్రం అనే సాధనాభేదాలను బట్టి, యోగులకు సిద్ధిలో తారతమ్యాలుంటాయి.
23. ఈశ్వర ప్రణిధానాద్వా.
ఈశ్వర ప్రణిధానం (కర్మఫలాలను ఈశ్వరునికి అర్పించుట) వలన యోగం సిద్ధిస్తుంది.
24. క్లేశ కర్మవిపాకాశయై రపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః.
క్లేశం, కర్మ, కర్మఫలం, కామం అనే వాటితో బాధితుడు కాని ఒకానొక పురుషుడిని, ఈశ్వరుడంటారు.
యోగుల మాదిరి సాంఖ్యులు భగవంతుడిని అంగీకరించకున్నా, పాతంజల యోగం మాత్రం సాంఖ్యంపై ఆధారపడియుందన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు. అయితే భగవంతుని సృష్ట్యాది ధర్మాలను యోగులు అంతగా చెప్పరు; ఈశ్వరుడంటే సృష్టికర్త అని కూడా వారు భావించరు. కానీ, శృతిప్రమాణం రీత్యా, ఈశ్వరుడే జగత్కర్త. విశ్వంలో ఏకత్వం ఉండటం వల్ల, ఒకే సంకల్పశక్తి విశ్వాన్ని సృష్టించి ఉండాలి. ఈశ్వరుడున్నాడని నిరూపించటానికి, యోగులు విచిత్ర హేతువులను చూపుతూ, ఇలా అంటారు…
25. తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వబీజమ్.
ఇతరుల్లో బీజమాత్రంగా ఉండే సర్వజ్ఞత్వం, అతని (ఈశ్వరుని)లో అనంతంగా ఉంటుంది.
మనసెప్పుడూ ద్వంద్వాల మధ్య తిరుగాడుతూ ఉంటుంది. పరిమిత దేశాన్ని మనం భావించగల్గితే, అపరిమిత మహాకాశం ఉందని దానివల్లే మనకు తెలుస్తుంది. కన్నులు మూసుకుని, పరిమిత దేశాన్ని లేదా స్థలాన్ని భావించండి. అప్పుడు మీకో ఆవరణ కనిపిస్తుంది. దాని చుట్టూతా అపరిమిత ఆవరణం మరొకటి ఏర్పడి ఉంటుంది. ఇలాగే, ఒక ‘క్షణాన్ని’ భావించండి. వెంటనే ‘అనంత కాలం’ ఉన్నట్లు అనిపిస్తుంది. మనిషిలో జ్ఞానం బీజమాత్రంగా ఉంది. అయితే ఈ కించిజ్ఞత్వం వల్లే సర్వజ్ఞత్వం ఉందని అనుకోవలసివస్తుంది. ఇలా మన మనస్తత్వంవల్లే, అనంతజ్ఞానం ఉందని మనకు తెలుస్తున్నది. యోగులు ఈ అనంత జ్ఞానాన్నే భగవంతుడని అంటారు.
26. స పూర్వేషామపి గురుః కాలేనాన వచ్చేదాత్.
అతడు త్రికాలాబాధితుడు కావటంవల్ల సనాతనాచార్యులకు కూడా గురువై ఉన్నాడు.
జ్ఞానమంతా మనలోనే ఉందనటం నిజం. అయితే ఈ జ్ఞానాన్ని మరొక జ్ఞానంతో వ్యక్తం చేయవలసి ఉంది. గ్రహణశక్తి మనలోనే ఉన్నా, దాన్ని ప్రకటించవలసి ఉంది. దీనికోసం మరొక రకమైన జ్ఞానం కావాలని యోగులంటారు. అచేతన ప్రకృతి జ్ఞానాన్ని ఎప్పుడుకూడా ప్రకటించలేదు. జ్ఞానం, జ్ఞానం వల్లే వ్యక్తం కావాలి. జ్ఞానులతోడి సంసర్గం వల్ల మనలోని జ్ఞానం వెలువడుతుంది. అందుకే గురుజనుల అవసరముంది. లోకంలో సద్గురువులు ఎప్పుడూ ఉన్నారు. గురువు లేనిదే జ్ఞానం కలగదు. భగవంతుడు గురువులకు గురువు. ఎందుకంటారా? మన గురువులు ఎంత మహనీయులైనా, ఎంత దేవతలైనా, భగవంతునిలా అప్రమేయులు కారు; అపరిచ్ఛిన్నులు కారు; దేశకాలాతీతులు కారు. ఈ విషయంలో యోగులు రెండు విచిత్రసిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు. పరిమిత వస్తువును భావించే సమయంలో, మనసు అపరిమితమైన దాన్ని భావించవలసి ఉంటుంది. ఈ రెండుకూడా ఒకే మనసుకు కనిపించే విషయంలో రెండు భాగాలు అవటంవల్ల, వాటి విలువ కూడా సమానంగా ఉంటుందని; కాబట్టి ఈ రెంటిలో ఒకటి యథార్థమైతే, రెండవది కూడా యథార్థమై ఉండాలని యోగుల మొదటి సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. మనిషి కించిజ్ఞుడవటంవల్ల, భగవంతుడు సర్వజ్ఞుడని ఏర్పడుతున్నది. ఈ రెంటిలో ఒకభావాన్ని అంగీకరిస్తే, మరి రెండవ భాగాన్ని ఎందుకంగీకరించకూడదు? అంగీకరిస్తే, రెంటినీ అంగీకరించాలి. లేదా, త్యాగం చేస్తే, రెంటినీ పరిత్యాగం చేయాలని హేతువాదమంటుంది. మనిషి కించిజ్ఞుడని నేను నమ్మితే, అతని వెనకాల సర్వజ్ఞుడొకడు ఉన్నాడని అంగీకరించవలసి ఉంటుంది.
గురువు లేనిదే జ్ఞానం కలగదని యోగుల రెండవ సిద్దాంతం. ఆధునిక తాత్త్వికులు చెప్పేవిధంగా, క్రమంగా వికసించే ఒక తత్త్వం మనిషిలో ఉందనటం వాస్తవం. సమస్త జ్ఞానం కూడా మనిషిలోనే ఉంది. అయితే అది ప్రదర్శితం కావటానికి కొన్ని పరిస్థితులు కావాలి. మానవ గురువులైనా, దేవతాగురువులైనా అంతా దేశకాలబద్ధులే. మరి పరమగురువెవ్వరూ? కాబట్టి త్రికాలాబాధితుడైన గురువు ఒకరున్నారని మనం అంగీకరించక తప్పదు. అఖండ జ్ఞానస్వరూపుడైన ఆ పరమగురువే, భగవంతుడు.
27. తస్య వాచకః ప్రణవః.
ఓంకారమే అతని నామధేయం.
మనస్సులో కలిగే ప్రతిభావానికీ ప్రతిరూపం అనతగిన పదమొకటి ఉంటుంది. పదం, అర్థం రెండూ అవిభాజ్యాలై ఉంటాయి. ఒకే విషయానికి చెందిన బాహ్యరూపాన్ని పదమని, అంతర్భాగాన్ని అర్థమని అంటాం. అర్థాన్నుండి పదాన్ని ఎవ్వరూ విడదీయలేరు. జనులు, కొందరు జనులు ఒకచోట చేరి, కూర్చుని, పదాలను నిర్ణయించి, భాషను నిర్మించారన్న సిద్ధాంతం కేవలం హేతువిరుద్ధమని నిశ్చయించారు. సృష్టిలో మనుషులున్నంతకాలం, మాటలూ, భాష కూడా ఉన్నాయి.
అర్థానికి, పదానికి ఉన్న సంబంధమేమిటీ? భావాన్ని అనుసరించి, పదాలు ఏర్పడ్డాయని మనమూహించినా, ఒకానొక భావాన్ని తెలుపటానికి, ఒకానొక మాటే కావాలన్న నియమమేమీలేదు. ఒకే భావాన్ని తెలుపటానికి, ఇరువది దేశాల్లో ఇరువది వేరు వేరు భాషలుండవచ్చు. ఒక్కొక్క భావాన్ని తెలుపటానికి మనకొక్కొక్క మాట కావాలి. అయితే వీటికి ఒకే విధమైన శబ్దాలుండనక్కరలేదు. వివిధ దేశాల్లో శబ్దాలు వివిధంగా ఉంటాయి. “భావానికి, పదానికి సంపూర్ణంగా స్వాభావిక సంబంధమున్నా, ఒకానొక శబ్దానికి అవినాభావ సంబంధముండాలని ఊహింపరాదు” అని వ్యాఖ్యాత చెబుతున్నాడు. శబ్దాలు వేరు వేరై ఉన్నా, శబ్దాలకు, భావాలకు సహజసంబంధ మేర్పడి ఉంటుంది. సంజ్ఞకు, అది తెలిపే వస్తువు లేదా విషయానికి సరి అయిన సంబంధముంటేగానీ, శబ్దాలకు భావాలకు సమంజస సంబంధమేర్పడదు. అంతవరకూ ఆ సంజ్ఞ వాడుకలోకి రాదు. సంజ్ఞ అంటే, నిర్దేశిత వస్తువును లేదా విషయాన్ని తెలిపే పదం. నిర్దిష్టవస్తువుకు ఇదివరకే ఒక సంజ్ఞ ఏర్పడియుంటే, ఆ సంజ్ఞతో ఆ వస్తువు అనేక పర్యాయాలు వెల్లడి అయినట్లు అనుభవ పూర్వకంగా మనకు తెలిస్తే, ఆ రెంటికీ అన్యోన్యసంబంధముందని మనం నిశ్చయింపవచ్చు. వస్తువులు తమ ఎదుట లేకున్నా, వాటిని గ్రహించే జనులు వేలకొలది ఉంటారు. సంజ్ఞకూ అది నిర్దేశించే వస్తువుకూ స్వాభావిక సంబంధముండాలి. అప్పుడే, మనం సంజ్ఞనుచ్చరించగానే, అది నిర్దేశించే వస్తువు మనకు స్ఫురిస్తుంది.
ఓంకారం భగవంతుని తెలిపే సంజ్ఞ అని వ్యాఖ్యాత అంటాడు. వ్యాఖ్యాత ఓంకారాన్ని అంత ప్రధానంగా పరిగణించటానికి కారణమేమిటీ? భగవంతుని తెలుపటానికి వందల కొలది పదాలున్నాయి. ఒకేభావం, వేయి పదాలతో సంబంధం కలిగి ఉండవచ్చు. భగవంతుడనే భావం వందలకొలది పదాలతో సంబంధం కలిగియుంది. వీటిలో ప్రతిపదం కూడా భగవంతునికి ఒక సంజ్ఞగా ఉంది.
సరే, ఈ సంజ్ఞల నన్నింటినీ సమీకరిస్తూ, వీటికి మూలాధారంగా సంజ్ఞ ఒకటి ఉంటే, ఆ సంజ్ఞ వీటి భావాల నన్నింటినీ తెలుపుతూ ఉంటుంది. కాబట్టి అది ఉత్తమోత్తమ సంజ్ఞ అవుతుంది. శబ్దోచ్చారణంలో మనం కంఠంలోని స్వరపేటికను, అంగిలిని, శబ్దఫలకాన్ని ఉపయోగిస్తాం. ఏ శబ్దం నుండి, ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో, అలాంటి అత్యంత స్వాభావిక శబ్దం ఏదైనా ఉందా? అన్ని శబ్దాలకు మూలమైన ప్రణవం లేదా ఓంకారమే ఆ శబ్దం. దీనిలో మొదటి భాగం ‘అ’ కారం. నాలుకలోని, అంగిలిలోని ఏ భాగం కూడా ‘అ’ కార ఉచ్చారానికి తోడ్పడదు. ఇది ఓంకారానికి బీజంగా ఉంది. చివరిది ‘మ’ కారం. పెదవులను మూసి దీన్ని ఉచ్చరిస్తారు. నోటిలోని మూలభాగం నుండీ, అంత్యభాగం వరకు కూడా ‘ఉ’ కారం ఉచ్ఛారణ సమయంలో దొర్లుతూ ఉంటుంది. ఇలా శబ్ద ఉచ్ఛారణా ప్రక్రియనంతా ఓంకారం తెలియచేస్తున్నది. కాబట్టి ఇదే శబ్దాలన్నింటికీ మూలమైన స్వాభావిక సంజ్ఞయై ఉండాలి. సమస్త శబ్దజాలం కూడా ఓంకారంలో ఇమిడి ఉంది. అంతేకాదు; భారతదేశంలోని వివిధ మతాభిప్రాయాలు అన్నీ కూడా ఓంకారం మీద ఆధారపడే ఉన్నాయి. దీనివల్ల ఆంగ్లేయులుగానీ, ఇతర విదేశీయులు కానీ ఏం గ్రహించాలీ? భారతదేశంలో మతాభివృద్ధి కలిగినప్పుడెల్లా, ఓంకారాన్ని ప్రధానంగా పరిగణించారు; అంతేకాదు, భగవంతుని గూర్చిన సాకార, నిరాకార భావాలన్నీ ఓంకారం ద్వారానే అన్వయించారు. వేదంలోని వివిధ మతాశయాలన్నింటికీ ఓంకారమే పట్టుకొమ్మ. ద్వైతులూ, అద్వైతులూ, విశిష్టాద్వైతులూ, శైవ, శాక్తేయాది స్వతంత్ర మతస్థులు; చివరికి నాస్తికులు కూడా ఓంకారాన్ని స్వీకరించి ఉన్నారు. జన బాహుళ్యానికి ఓంకారం మత పరమావధిని తెలిపే చిహ్నంగా ఏర్పడి ఉంది. ఉదాహరణకు: భగవంతుడు అనే అర్థం గల ‘గాడ్’ అనే ఆంగ్లపదాన్ని తీసుకుందాం. ‘గాడ్’ అనే పదం భగవంతుని సమగ్రభావాన్ని తెలుపజాలదు. సాకార నిరాకారాలను సూచించటానికి ‘గాడ్’ అనే పదానికి (పర్సనల్ – ఇంపర్సనల్ – అబ్సల్యూట్ అనే) విశేషణాలు చేర్చవలసి ఉంటుంది. ఇతర భాషలన్నింట్లో కూడా, భగవంతుని తెలిపే పదాలన్నీ కూడా ఇలాంటివే. అవన్నీ అతిపరిమిత భావాన్ని మాత్రమే వ్యక్తం చేస్తుంటాయి. ఓంకారం అలాకాదు. భగవంతుని గూర్చిన వివిధ భావాలన్నీ దీనిలో కేంద్రీకృతమై ఉన్నాయి. కాబట్టి అందరూ ఓంకారాన్ని స్వీకరింపవచ్చు.
28. తజ్జప స్తదర్థ భావనమ్.
ఈ ఓంకారాన్ని జపించటం, దాన్ని అర్థాన్ని భావించటం (మోక్ష సాధనం).
మంత్రాలను జపించాలీ అనటానికి కారణమేమిటి? సంస్కారాలన్నీ చిత్తంలో నిలచియుంటాయన్న సంస్కారసిద్ధాంతాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చిత్తంలో ఇవి సూక్ష్మస్థితిని పొందియుంటాయి. తగిన ప్రేరణ కలగగానే మరల ఇవి వెలువడతాయి. పరమాణువులెప్పుడూ స్పందిస్తూనే ఉంటాయి. ప్రపంచ ప్రళయంలో స్థూలస్పందనాలన్నీ అదృశ్యమౌతాయి; అందుకని భూ సూర్య చంద్ర నక్షత్రాలు విలయం చెందినా, అణువుల్లో స్పందన మాత్రం నిలచియుంటుంది. ప్రతి అణువులో కూడా బ్రహ్మాండంలోని వ్యాపారం కనిపిస్తూ ఉంటుంది. ఇలాగే చిత్తంలోని స్పందనలు శాంతించినా, దానిలోని పరమాణు స్పందనలు సాగుతూనే ఉంటాయి. తగిన ప్రేరణ కలిగిన వెంటనే, ఈ స్పందనలు మరల వెలువడతాయి.
కాబట్టి జపం వల్ల కలిగే ప్రయోజనాన్ని మనం గ్రహించవచ్చు. జపం వల్లే ఆధ్యాత్మిక సంస్కారాలు ఉద్దీప్తమౌతాయి. “క్షణమపి సజ్జన సంగతి రేకా భవతి భవార్ణవ తరణే నౌకా” అన్నట్లు, క్షణకాలమైనా సరే, సజ్జన సాంగత్యం చేస్తే, సంసార సముద్రాన్ని తరింపవచ్చు. సంసర్గానికి అంత ప్రభావముంది. ఓంకార జపం వల్ల, దాని అర్ధభావన వల్ల, మనసులోనే సత్ సాంగత్యాన్ని నిర్మించుకుంటున్నాం. తత్త్వాన్ని చింతించండి; చింతితాంశాన్ని ధ్యానించండి. తత్త్వదర్శనానికి ఇదే విధానం.
ఓంకారాన్ని జపించటమే కాదు, దాని అర్థాన్ని కూడా భావిస్తూ ఉండాలి. దుస్సాంగత్యం, నీలోని దుష్టసంస్కారాలను ఉద్దీపింపచేస్తుంది. కాబట్టి దుస్సాంగత్యాన్ని విసర్జించు. సత్సాంగత్యం కన్నా పవిత్రమైంది మరొకటి ఏదీలేదు. సత్సాంగత్యం వల్ల సద్వాసనలు వెలువడతాయి.
29. తతః ప్రత్యక్చేతనాధిగమోఽప్యంతరాయాభావశ్చ.
దాని (ఓంకార జపం) వల్ల అంతర్దృష్టి (జ్ఞానం), విఘ్న వినాశం కలుగుతాయి.
ఓంకార జపం వల్ల, ధ్యానం వల్ల అంతరవలోకన శక్తి క్రమంగా వృద్ధి పొందనారంభిస్తుంది. కాయిక మానసిక విఘ్నాలు తొలగిపోతాయి. యోగ విఘ్నాలు ఏవీ?
30. వ్యాధి – స్త్యాన – సంశయ – ప్రమాదాలస్యా విరతి – భ్రాంతి దర్శన అలబ్ద – భూమికత్వానవస్థితత్వాని చిత్తవిక్షేపాస్తేఽన్తరాయాః.
రోగం, మానసిక, జడత్వం, సంశయం, అజాగ్రత్త, మత్తత, అతృప్తి, భ్రమ, చిత్తస్థెర్యం నిలువకుండుట అనేవి (యోగానికి) అంతరాయాలు.
రోగం: ఈ శరీరం మనలను సంసార సముద్రాన్నుండి తరింపచేసే నౌక. కాబట్టి శరీరాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యహీనులు యోగులు కాలేరు. మానసిక జడత్వం వల్ల మనకు యోగంలో అభిరుచి కలగదు. అభిరుచి కలిగితే తప్ప సాధన చేయాలన్న దృఢ సంకల్పం గానీ, దానికి తగిన సామర్థ్యంగానీ కలగదు. మనోనిశ్చయం ఎంత దృఢంగా ఉన్నా, దూరదృష్టి దూరశ్రవణం మొదలైన కొన్ని విచిత్ర యోగానుభవాలు కలిగితే తప్ప, యోగశాస్త్రంలోని నిజానిజాల గూర్చి సందేహం కలుగుతూనే ఉంటుంది. కనీసం చూచాయగానైనా, ఈ శక్తులు కలిగితే, అప్పుడు మనోబలం, పూనిక అలవడతాయి.
చిత్తస్థెర్యం నిలువకుండుట: సాధన చేయు కాలంలో కొన్ని దినాల వరకూ, లేదా కొన్ని వారాల వరకూ మనస్సు ప్రశాంతంగా ఉండి సులభంగా ఏకాగ్రతను పొందుతూ శీఘ్రంగా యోగంలో అభివృద్ధి కలుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ అభివృద్ధి హఠాత్తుగా ఒకనాడు నిలచిపోవచ్చు. దానివల్ల దిగ్భ్రమ కలగవచ్చు. ఇలాంటి సమయాల్లో పూనిక నిడువక సాధన చేస్తుండాలి. వృద్ధిక్షయంతోనే అభివృద్ధి కలుగుతూ ఉంటుంది.
31. దుఃఖ – దౌర్మనస్యాంగమేజయత్వ – శ్వాసప్రశ్వాసా విక్షేపసహభువః.
దుఃఖం, చిత్తక్షోభం, శరీరంలో కంపనం, క్రమరహితశ్వాస అన్నవి చిత్తవిక్షేపానికి (సహకారులు) తోబుట్టువులు.
చిత్త ఏకాగ్రతను అభ్యాసం చేసినప్పుడల్లా, మనశ్శరీరాలకు పూర్తి విశ్రాంతి కలుగుతుంది. సక్రమంగా సాధన చేయకపోవటం వల్ల గానీ, తగినంత మనోనిగ్రహం లేకపోవటం వల్ల గానీ పై బాధలు కలుగుతుంటాయి. ప్రణవ జపం వల్ల గానీ, భగవంతుని శరణు పొందటం వల్ల గానీ, మనోస్థైర్యం కలగటమే కాక, నూత్నశక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. సాధారణంగా యోగసాధకులకంతా, ఇలాంటి నాడీకంపనాలు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి వాటిని ఎంతమాత్రం కూడా లెక్కచేయక, పూనికతో సాధనచేయాలి. సాధనవల్ల ఇలాంటి బాధలన్నీ తొలగిపోతాయి. స్థెర్యం కలుగుతుంది.
32. తత్ప్రతిషేధార్థమేక తత్త్వాభ్యాసః.
దాన్ని (చిత్త చాంచల్యాన్ని) నివారించటానికి ఏకతత్త్వాన్ని అభ్యసించాలి.
క్రమం తప్పక కొంతకాలం వరకూ మనస్సునొకే విషయంలో నిలిపి ధ్యేయాకారం పొందేలా చేయాలి. అలా చేస్తే పై విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇది సాధారణ ఉపాయం. రాబోయే సూత్రాల్లో ప్రత్యేక సందర్భాలను బట్టి విషయాన్ని విపులీకరిస్తారు. ఒకేమార్గం అందరికీ సరిపడదు. కాబట్టి వివిధ మార్గాలను తెలియచేస్తారు. వాటిలో తనకు బాగా పనికివచ్చే దాన్ని సాధకుడు తన స్వానుభవంతో కనుగొనవచ్చు.
33. మైత్రీ కరుణాముదితోపేక్షాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం భావనా తశ్చిత్త ప్రసాదనమ్.
సుఖదుఃఖ పుణ్యపాప విషయాల గూర్చి మైత్రీ (స్నేహం), కరుణ (దయ), ముదిత (సంతోషం), ఉపేక్షా (ఉదాసీనత) అనే ఈ వృత్తులను క్రమానుసారంగా భావనచేస్తే చిత్తప్రసన్నత కలుగుతుంది. (చిత్తచాంచల్యం నశిస్తుంది).
విషయాల యెడ మనం నాలుగు రకాల మనోభావాలను అవలంబించాలి. అందరిలో స్నేహం కలిగి వర్తించాలి. దుస్థితిలో ఉన్నవారి యందు కరుణ, సుఖీంచేవారి యందు సంతోషం, దుర్మార్గుల యడ ఉదాసీనత కలిగి ఉండటం మంచిది. మనకు కనిపించే అన్ని విషయాల్లో కూడా ఇలాగే వర్తించాలి. మంచి విషయాల్లో స్నేహభావం, దుఃఖ విషయాల్లో కరుణ, పుణ్యకార్యాల యడ సంతోషం, పాపకార్యాల్లో ఉదాసీనత కలిగియుండాలి. ఇలా చేస్తే, మనకు మనశ్శాంతి కలుగుతుంది. ఇలా మనస్సును నియమించకపోవటం వల్లే, జీవితంలో మనం అనేక బాధలను పొందుతూ ఉంటాం. ఒకరు మనకు చెడు చేస్తే, వెంటనే మనం ప్రతీకారం చేయబోతాం. మనోనిగ్రహ సామర్థ్యం తక్కువగా ఉందన్న విషయాన్ని ప్రతీకారం తెలియచేస్తుంటుంది. ఒకరిని ద్వేషించటం ద్వారా, అతనికి హాని కలగచేయటం ద్వారా మనం ప్రతీకారం తీర్చుకున్నప్పుడల్లా మనసుకు ఎంతో అనర్థం వాటిల్లుతూ ఉంటుంది. దుష్ప్రవృత్తిని ద్వేషప్రేరిత కార్యాన్ని ప్రతీకారం చేయాలన్న సంకల్పాన్ని నిగ్రహించినప్పుడల్లా, మన కది ఎంతో ప్రయోజనకారి అవుతుంటుంది. మనోనిగ్రహం వల్ల అపారశక్తి లభిస్తుంది. నిగ్రహం వల్ల మనకెప్పుడూ నష్టం కలగదు. ద్వేషాన్ని, లేదా క్రోధాన్ని నిగ్రహించినప్పుడల్లా, మనకెంతో మేలు చేసే సత్త్వశక్తి వీర్యం ప్రాణశక్తి మనకు చేకూరుతాయి. ఇలాంటి సత్త్వశక్తి నుండే ఉన్నత మానసిక శక్తులు వెలువడతాయి.
34. ప్రచ్చర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య.
ప్రాణాన్ని (శ్వాసను) విడవటం, నిలపటం (ప్రాణాయామం) ద్వారాకూడా (మనఃప్రసన్నత కలుగుతుంది.)
‘ప్రాణ’ మనే పదాన్ని గమనించండి. ప్రాణమంటే శ్వాస అనుకోవద్దు. విశ్వంలోని శక్తే ప్రాణం. చరాచర ప్రపంచమంతా ప్రాణస్వరూపమై ఉంది. సాముదాయికంగా విశ్వంలోని శక్తిని ప్రాణమంటారు. కల్పారంభంలో ప్రాణశక్తి దాదాపు చలనరహితస్థితిలో ఉంటుంది. సృష్టికాలంలో అది వ్యక్తం కావటం ప్రారంభిస్తుంది. భౌతిక చలనరూపంలో, మనుష్యుల్లో జంతువుల్లో నాడీచలనరూపంలో వ్యక్తమయ్యే శక్తి ప్రాణమే. మన సంకల్ప వికల్పాలుగా ప్రాణమే వ్యక్తమవుతున్నది. విశ్వమంతా ప్రాణాకాశాల సంయోగమై ఉంది. మానవశరీరం కూడా ఇలాంటిదే. ఇంద్రియ గోచరమైనదంతా ఆకాశం నుండే వెలువడుతూ ఉంటుంది. సర్వశక్తులూ ప్రాణం నుండే వెలువడుతున్నాయి.
ప్రాణాన్ని వదులుట, నిలుపుటయే ప్రాణాయామం. యోగ దర్శనానికి పితలాంటి పతంజలి మహర్షి ప్రాణాయామం గూర్చి ప్రత్యేక పద్ధతులను అంతగా సూచించడు. కాని ఇతర యోగులు ప్రాణాయామం గూర్చి అనేక విషయాలు కనుగొన్నారు; దాన్ని ఒక గొప్పశాస్త్రంగా నిర్మించారు. పతంజలి మహర్షి ప్రాణాయామాన్ని యోగసాధనలో ఒక సాధనగా మాత్రమే పరిగణిస్తాడు. అంతేతప్ప ప్రాణాయామమే అన్నింటికన్నా ప్రధానమని చెప్పడు. రేచక పూరక కుంభకాలను కొంత అభ్యాసం చేస్తే చాలునంటాడు. దానివల్ల మనసు ప్రసన్నంగా మారుతుందని పతంజలి అభిప్రాయం. కాలక్రమంలో ప్రాణాయామం ఒకశాస్త్రంగా రూపుదాల్చింది. ప్రాణాయామం గూర్చి ఇతర యోగులు చెప్పే విషయాలను కొంతవరకు తెలుసుకుందాం.
ఇంతకుముందే నేనీ విషయంలో కొంత చెప్పాను. అయినా మరల చెబుతాను. అది మీకు తోడ్పడుతుంది. ప్రాణమంటే శ్వాస కాదన్న విషయం మీరు ముందుగా గ్రహించాలి. శ్వాసకు చలనాన్ని కలిగిస్తూ, శ్వాసకు మూలమైన శక్తే ప్రాణం. ఇంద్రియాలను సూచించటానికి ‘ప్రాణ’ శబ్దాన్ని ఉపయోగిస్తుంటారు. ఇంద్రియాలను ప్రాణాలంటారు. మనస్సును ప్రాణమంటారు. కాబట్టి ప్రాణమంటే శక్తి అని మనం గ్రహించాలి. అయితే శక్తికూడా ప్రాణరూపం కావటంవల్ల, ‘ప్రాణమే శక్తి’ అని చెప్పలేము. ప్రాణం శక్తిరూపంలో – చలన రూపంలో వ్యక్తమవుతున్నది. చిత్తం, తన చుట్టూ ఉన్న ప్రాణశక్తిని లోనికి లాక్కొని, దాన్నుండి శరీర పోషణానికి కావలసిన భౌతిక శక్తులనే కాక, ఇచ్ఛాజ్ఞానాది వివిధ మానసిక శక్తులను కూడా నిర్మాణం చేసే యంత్రం అని చెప్పవచ్చు. శ్వాసనియమాన్ని అభ్యాసం చేస్తే, శరీరంలోని వివిధ చలనాలను, నాడీవాహినులను మన స్వాధీనం చేసుకోవచ్చు. మునుపువాటి స్థితి గతులను కనుగొనుటవల్ల క్రమంగా వాటిని వశం చేసుకోగలం.
మన శరీరంలో ఇడా, పింగళ, సుషుమ్నా అనే మూడు నాడులున్నాయి, వెన్నముకకు కుడివైపు పింగళ, ఎడమవైపు ఇడా, మధ్యలో సుషుమ్నా నాడులు ఉంటాయి. సుషుమ్న బోలుగా ఉండే కాలువగా ఉంటుంది. ఇడా పింగళనాడులు ప్రతిమనిషిలో క్రియాశీలంగా ఉండే నాడులు. వీటిద్వారానే శరీరవ్యాపారాన్నీ జరుగుతుంటాయి. ఈ విషయాలన్నింటినీ యోగులు చెబుతుంటారు. సాధ్యావస్థలో జనులందరిలో సుషుమ్నా నాడి ఉంది. కాని యోగుల్లో మాత్రమే సుషుమ్న క్రియాశీలమై ఉంటుంది. యోగాభ్యాసం వల్ల శరీరం మార్పుకు లోనవుతుందని మనం గ్రహించాలి. యోగాన్ని అభ్యాసం చేస్తున్న కొద్దీ, శరీరంలో మార్పుకలుగుతూ ఉంటుంది. క్రమంగా నూతన శరీరం ఏర్పడుతుంది. ఎలాగంటే, మనకు కలిగే ప్రతినూత్నభావం కూడా, మేధస్సులో నాగటి చాలు లాంటి ఒక రేఖను నిర్మిస్తుంది. పూర్వాభ్యాసాలను వదలలేక వాటిని పట్టుకుని వ్రేలాడటానికి కారణం ఇదే. పూర్వాభ్యాసాలను అనుసరించటం సులభం కావటంవల్ల, మానవస్వభావం పాతదారుల్లోనే వెళ్ళటానికి పూనుకుంటుంది. ఉదాహరణ రీత్యా; మనస్సు ఒకసూదివంటిదని, మేదఃపదార్థం దానిముందున్న ఒక మెత్తని ముద్ద అని భావిస్తే, మనకు కలిగే ప్రతిభావం కూడా మెదడులో నాగటిచాలు లాంటి ఒక మార్గాన్ని నిర్మిస్తుందని చెప్పవచ్చు. మెదడులోని శ్వేతధాతువు (గ్రేమేటర్), ఈ మార్గాన్ని ప్రత్యేకంగా ఉంచటం కోసం దానిపై ఒక పొరగా ఏర్పడి, ఆ మార్గాన్ని మూసివేస్తుంది. మెదడులో ఈ శ్వేతధాతువు లేకుంటే, స్మృతి అనేది కలగజాలదు. ఎందుకంటే, స్మృతి అంటే, ఒకానొక భావాన్ని వెదకిపట్టుకోవటానికి ఈ పాదదారులను పట్టిపోవుటే. ప్రతి మనిషికి బాగా తెలిసిన భావాలను కొన్నింటిని తీసికొని వాటిని పరస్పరం సమన్వయిస్తూ ఎవరైనా మాట్లాడితే, ఆ విషయం అందరికీ సుబోధకంగా ఉంటుంది. ఎందుకంటే, ప్రతిమనిషి మెదడులో అలాంటి మార్గాలు ఏర్పడి ఉంటాయని, తిరిగి వాటిని కనుగొనటమే అతను చేయవలసిన పని అని మనం గ్రహించాలి. అయితే కొత్తవిషయాలను గ్రహించవలసి వచ్చినప్పుడల్లా, నూత్నమార్గాలను నిర్మాణం చేసుకోవలసి వస్తుంది. కాబట్టి వెంటనే విషయాలను గ్రహింపజాలం. అజ్ఞాతంగా మెదడు జనులు కాదు నూత్నభావాలకు తావివ్వ నిరాకరించటానికి ఇదే కారణం. మెదడు నూత్నభావాలను ప్రతిఘటిస్తూ ఉంటుంది. ప్రాణం మాత్రం నూత్నమార్గాలను నిర్మింప చూస్తూ ఉంటుంది. పూర్వాభ్యాసాల యడ మనకుండే పట్టుదలలోని రహస్యమిదే. మెదడులో ఈ రేఖలు తక్కువగా ఉండేకొద్దీ, ప్రాణమనే సూది వీటిని తక్కువగా నిర్మించేకొద్దీ, మెదడు నూత్నభావాలను ప్రతిఘటిస్తూ వాటితో పోరాడుతూ ఉంటుంది. మనిషి విచారశీలుడైన కొద్దీ, అతని మెదడులో మార్గాలు సమిశ్రితమై ఉంటాయి. అందుకే అతను నూత్న భావాలను సులభంగా గ్రహిస్తుంటాడు. ప్రతి నూత్నభావం విషయంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది. మెదడులో మనం నూత్న సంస్కారాలను నిర్మించుకొని, నూత్నమార్గాలను ఏర్పరచుకుంటాం. యోగమంటే నూత్నభావాలూ, నూత్న ఆశయాలే. కాబట్టి యోగాభ్యాసంలో మొదట దైహిక ప్రాతికూల్యం విశేషంగా కనిపించటానికి ఇదే కారణం. అందుకే, బాహ్యప్రకృతిలో సంబంధముండే మత విషయాలను జనులు ఎక్కువగా ఆమోదిస్తుంటారు; అంతరప్రకృతితో సంబంధముండే, వేదాంత మానసిక శాస్త్రాది మత విషయాలను ఎక్కువగా గమనించరు.
మనం నివసించే ఈ ప్రపంచం ఎలాంటిదో, మనం గ్రహించాలి. బోధావస్థను పొందిన అనంత సచ్చిదానంద స్వరూపమే, ఇంద్రియ గోచరమయ్యే మన ఈ ప్రపంచం. అనంత సచ్చిదానంద స్వరూపంలో ఒక స్వల్పాంశం బోధావస్థను పొంది ఉంది. దాన్నే మనం ప్రపంచమంటున్నాం. ప్రపంచాతీతమైన అనంతవస్తువొకటుంది. మతం ఈ రెంటితో సంబంధం కలిగి ఉండాలి. అంటే, ప్రపంచం అనే మట్టి ముద్ధతో ప్రపంచాతీత అనంతవస్తువుతో సంబంధం కలిగి ఉండాలి. లేకపోతే అలాంటి మతం సమగ్రం కాజాలదు. దేశకాల నిర్మిత, బోధావస్థ అనే పంజరంలో, అనంత సచ్చిదానందస్వరూపం బంధితమై ఉంది. ఇప్పటివరకూ మనం ఈ బాహ్యప్రపంచంలోనే ఉన్నాం. అనాది కాలం నుండి కూడా, బాహ్యప్రపంచానికి సంబంధించిన భావాలే మనలను ఆశ్రయించి ఉన్నాయి. కాబట్టి బాహ్యప్రకృతితో సంబంధముండే మత విషయాలు మనకు క్రొత్తగా ఉండవు. అంతరప్రకృతికి సంబంధించిన పారమార్థిక విషయాలు మాత్రం, అన్ని క్రొత్తవై ఉండటంవల్ల, మెదడులో క్రొత్తతోవల నేర్పరుస్తాయి. అందుకని శరీర ప్రకృతి పూర్తిగా మారుతుంది. సామాన్యులు యోగాభ్యాసం చేయ మొదలుపెట్టగానే, వారి శారీరక, మానసిక పరిస్థితులు తారుమారు కావటానికి ఇదే కారణం. సాధ్యమైనంతవరకూ ఇలాంటి బాధలను నివారించుకొనటానికి, మన కనుకూలపద్దతి ననుసరించి సాధన చేయటానికి పతంజలి రకరకాల ఉపాయాలను కనుగొన్నాడు.
35. విషయవతీ వా ప్రవృత్తిరుత్పన్నా మనసః స్థితి నిబంధినీ.
అప్రాకృత విషయానుభవం వల్ల కలిగే మనః ప్రవృత్తియైనా చిత్త స్థెర్యాన్ని కలగచేస్తుంధి.
సహజంగా ఇది ధారణవల్ల కలుగుతుంది. నాసికాగ్రంలో చిత్తాన్ని ఏకాగ్రం చేస్తుంటే, కొన్ని దినాలకు సాధకుడు దివ్యపరిమళాలను ఆఘ్రాణిస్తాడని యోగులంటారు. జిహ్వమూలంలో చిత్తాన్ని ఏకాగ్రం చేస్తే, నాదాలు వినవస్తాయి. జిహ్వాగ్రంలో ఏకాగ్రం చేస్తే, అద్భుత రుచులు కలుగుతాయి. నాలుక మధ్యభాగంలో ధారణ చేస్తే, ఆశ్చర్య విషయాలు గోచరిస్తాయి. తాళువులో ధారణ చేస్తే, అపూర్వదృశ్యమేదో కనిపిస్తుంది. స్థిరచిత్తత కలుగనివారు ఇలాంటి సాధనాలను అభ్యాసం చేయాలనుకుంటారు; కాని వాటిలోని సత్యాన్ని గూర్చి శంకిస్తుంటారు. అలాంటి వారు కొంతకాలం సాధన చేస్తే, ఇలాంటి యోగానుభవాలు కలుగుతాయి. దానితో వారు పూనికతో సాధన చేస్తారు.
36. విశోకా వా జ్యోతిష్మతీ.
సర్వదుఃఖాతీత దివ్యజ్యోతిని (ధ్యానిస్తే చిత్తస్థెర్యం కలుగుతుంది).
ఇదొక రకమైన ధారణ. హృదయ కమలాన్ని భావించాలి; దాని దళాలు క్రిందివైపు తిరిగి ఉంటాయి. దాని నాళం సుషుమ్నా అని భావించాలి. ఊపిరి పీల్చి, వదిలే సమయంలో ఆ కమలం పైవైపుకి తిరిగి పోతున్నట్లు దానిలో దేదీప్యంగా వెలిగే జ్యోతి ఉన్నట్లు భావించాలి. ఆ జ్యోతిని ధ్యానించాలి.
37. వీతరాగ విషయం వా చిత్తమ్.
విషయావాసనలను త్యాగం చేసిన చిత్తాన్ని (ధ్యానించటంవల్ల) గాని (చిత్తస్థెర్యం ఏర్పడుతుంది).
పరమపూజ్యుడు, నిస్సంగుడు అని నువ్వు భావించే ఒక పుణ్య పురుషుని హృదయాన్ని భావించాలి. రాగరహితహృదయాన్ని ధ్యానంచటం వల్ల మనస్సు ప్రసన్నమౌతుంది. ఇదీ సాధ్యం కాకపోతే మరో ఉపాయం ఉంది.
38. స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా.
స్వప్నంలో లేదా నిద్రలో కలిగే జ్ఞానాన్ని భావించటం వల్ల (మనః ప్రసన్నత కలుగుతుంది).
కొన్ని సమయాల్లో సాధకుడు దేవతలను కలలో చూస్తాడు. వారు తనవద్దకు వచ్చి, తనతో మాట్లాడినట్లు, తనకు దివ్యానందం కలిగినట్లు కలగంటాడు. వాతావరణంలో తేలియాడే దివ్యగానాన్ని తాను వింటున్నట్లు చూస్తాడు. ఇలాంటి కలలో అతను దివ్యానందం పొంది యుండటం వల్ల, జాగ్రత్తులో ఆ అనుభవం అతని మనస్సులో నాటుకుని ఉంటుంది. ఇలాంటస్వప్నం కలిగితే, అది నిజమేనని భావించి, ధ్యానించాలి. ఇది కూడా నీకు సాధ్యం కాకపోతే, నీకిష్టమైన మంచి విషయాన్ని దేనినైనా ధ్యానింపవచ్చు.
39. యథాభిమత ధ్యానా ద్వా.
తన కభిమతమైన ఏ విషయాన్నయినా ధ్యానించుటవల్ల స్థిరచిత్తత కలుగుతుంది.
అంటే దుర్విషయాల గూర్చి చింతింపవచ్చని అనుకోవద్దు సుమా! నీ కిష్టమైన సద్విషయం చక్కని స్థలం ప్రకృతిరమ్య దేశం సద్భావం లేదా చిత్తఏకాగ్రతను కల్గించే ఏ విషయమైనా అని ఈ సూత్ర అభిప్రాయం.
40. పరమాణు పరమ మహత్త్వాంతోఽస్య వశీకారః.
ఇలా ధ్యానించే యోగి చిత్తానికి పరమాణువు మొదలుకొని అనంతత్వం వరకూ (ధ్యాన) వశీకారమై ఉంటాయి.
ఇలాంటి సాధనవల్ల చిత్తం అత్యంత సూక్ష్మవిషయాలనే కాక, అతి స్థూలవిషయాలను కూడా సులభంగా ధ్యానించగలుగుతుంది. ఇలా మనోవృత్తులు క్రమంగా క్షీణిస్తాయి.
41. క్షీణ వృత్తే రభిజాత స్యేవ మణే ర్గృహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్స్థతదంజనతా సమాపత్తిః.
క్షీణ (నిగృహీత) వృత్తులు గల యోగి గృహితలో, గ్రహణ (సాధన)లో గ్రాహ్యంలో (అంటే ఆత్మలేక పురుషునిలో, మనస్సులో, బాహ్య విషయాల్లో) వివిధ వర్ణయుక్త వస్తువులు ఎదుట ఉన్న స్ఫటికం (మణి) వలే ఏకాగ్రతను, తాదాత్మ్యాన్ని పొందుతాడు.
నిరంతర ధ్యానంవల్ల లాభమేమిటీ? ఇంతకు ముందొక సూత్రంలో ధ్యానంలోని వివిధావస్థలను నిరూపిస్తూ, పతంజలి మొదట్లో స్థూల అవలంబనాలను, తర్వాత సూక్ష్మ అవలంబనాలను, చివరికి అతి సూక్ష్మ అవలంబనాలను గ్రహిస్తూ ధ్యానంలో అభివృద్ధి పొందాలని సూచించి ఉన్నాడు. స్థూలవిషయాల వలే, సూక్ష్మవిషయాలను కూడా సులభంగా ధ్యానించగలగటమే ఇలాంటి ధ్యానం వల్ల కలిగే లాభం. దానితో యోగికి గృహీత అయిన పురుషుడు, గ్రాహ్యమగు బాహ్యవిషయం, గ్రహణసాధనమైన చిత్తం గోచరిస్తాయి. శరీరం లేదా భౌతికవస్తువులను పోలే స్థూలావలంబనాలు, మనశ్చిత్తం లాంటి సూక్ష్మావలంబనాలు, అహంకార విశిష్టుడైన పురుషుడని మూడు రకాల ధ్యేయాలున్నాయి. ఇలాంటి ధ్యానాలన్నీ సాధన ద్వారా యోగికి సిద్ధిస్తాయి. ధ్యానించే సమయంలో ధ్యేయేతర విషయాలను మనసులోకి రానివ్వకుంటే, ధ్యేయవస్తువుతో యోగి తాదాత్మ్యం లేదా ఏకత్వాన్ని పొందుతాడు. ధ్యాన స్థితయోగి పువ్వు ముందున్న స్ఫటికం వంటివాడు. పువ్వు ఎర్రగా ఉంటే, దాని దగ్గర ఉండే స్ఫటికం కూడా ఎర్రగా ఉన్నట్లు కనిపిస్తుంది. పువ్వు నీలంగా ఉంటే స్ఫటికం నీలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
42. తత్ర శబ్దార్థజ్ఞాత వికల్పైః సంకీర్ణా సవితర్కా సమపత్తిః.
శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలసి ఉన్నప్పుడు సవితర్క సమాధి అంటారు.
ఇక్కడ శబ్దం అంటే స్పందనం, అర్థం అంటే దాన్ని మెదడుకు తీసుకువెళ్ళే నాడులు, జ్ఞానమంటే మనసులో కలిగే ప్రక్రియ, అని చెప్పాలి. పై చెప్పిన ధ్యానాలన్నింటినీ సవితర్కధ్యానాలని చెబుతూ, క్రమంగా పతంజలి ఉన్నత ధ్యానాలను తెలియచేస్తాడు. శబ్దార్థజ్ఞాన సంయోగంవల్ల కలిగే సవతర్క సమాధిలో విషయి, విషయాల ద్వైతం భాసిస్తూ ఉంటుంది. బాహ్యస్పందన అయిన శబ్దాన్ని జ్ఞాననాడులలోనికి తీసుకవెళ్ళినప్పుడు అదే అర్థమౌతుంది. దానితో చిత్తంలో ప్రతి క్రియాత్మక వృత్తి కలుగుతుంది. అదే జ్ఞానం. అయితే మనం జ్ఞానం అని పేర్కొనే సంఘటన, శబ్దార్థజ్ఞానాలనే మూడింటి సంయోగమై ఉంటుంది. ఇంతవరకూ చెప్పిన ధ్యానాల్లో ఇలాంటి మిశ్రిత విషయాన్నే ధ్యేయంగా గ్రహిస్తున్నాం. క్రింద చెప్పబోయే సమాధి, ఇంతకన్నా ఉన్నత సమాధి.
43. స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవార్థమాత్ర నిర్భాసా నిర్వితర్కా.
స్మృతి పరిశుద్ధమై లేదా స్వరూపశూన్యమై (గుణరహితమై) ధ్యేయపు అర్థాన్ని మాత్రమే భాసింప చేస్తున్నప్పుడు నిర్వితర్కసమాధి కలుగుతుంది.
శబ్దార్థజ్ఞానాలనే త్రిపుటియుక్త సవితర్క ధ్యానసాధన వల్లే, ఈ మూడూ కలియని నిర్వితర్కసమాధి స్థితి లభిస్తుంది. ఇవి మిశ్రితం కాకుండా చేయగలం. ముందుగా ఈ శబ్దార్థజ్ఞానాలంటే ఏమిటో తెలుసుకుందాం. చిత్తం సరస్సు వంటిది; శబ్దమనే స్పందనం, ఈ సరస్సులో లేచే అల వంటిది అని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మీలో చిత్తం అనే ప్రశాంత సరస్సు ఉంది. నేనిప్పుడు “ఆవు” అనే శబ్దం పలుకుతాను. ఈ శబ్దం మీ చెవుల్లో ప్రవేశించగానే, మీ చిత్తంలో ఒక వృత్తి కలుగుతుంది. ఈ వృత్తే ‘ఆవు’ అనే భావం. దీన్నే ‘ఆవు’ అనే రూపమని, ‘ఆవు’ శబ్దపు అర్థమని అంటాం. బాహ్యాంతర శబ్దస్పందనాలకు, ప్రతిక్రియారూపంలో, చిత్తంలో కలిగే వృత్తే మీరు చూచే ఆవు. ఈ వృత్తినే మీరు ‘ఆవు’ అని గ్రహిస్తుంటారు. శబ్దంతో వృత్తి లయిస్తున్నది. శబ్దం లేనిదే వృత్తి ఎప్పుడూ కలగదు. ఆవును గూర్చి భావిస్తున్నాం తప్ప ‘ఆవు’ అనే శబ్దాన్ని వినటం లేదు. ఇది ఎలా సాధ్యం అని అంటారేమో, ‘ఆవు’ అని మీ మనస్సులో మీరే ఆ శబ్దాన్ని నెమ్మదిగా ఉచ్ఛరిస్తున్నారు. దానితో ఆవు అనే వృత్తి కలుగుతున్నది. బాహ్యంగానైనా, అంతరంగానైనా ఇలాంటి శబ్దప్రేరణ లేనిదే వృత్తి ఎన్నడూ కలగదు. శబ్దమంతరించగానే వృత్తికూడా లయిస్తుంది. ఇక మిగిలేదేమిటీ? చిత్తంలో కలిగే ప్రతిక్రియాఫలమే. అదే జ్ఞానం. శబ్దార్థ జ్ఞానాలనే ఈ మూడూ సమిశ్రితమై ఉండటం వల్ల మనం వాటిని విభజించలేకున్నాం. శబ్దం వెల్వడగానే ఇంద్రియాల్లో స్పందనం కలుగుతుంది. దానితో చిత్తంలో ప్రతిక్రియాత్మక వృత్తి జనిస్తుంది. ఇవి ఒకదాని వెంట మరొకటి అతివేగంగా వెలువడటం వల్ల వీటిని విభజించి తెలుసుకోలేక పోతున్నాం. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే, సమస్తవృత్తులకు ఆశ్రయమైన స్మృతి పరిశుద్ధమౌతుంది. అప్పుడు శబ్దార్థ జ్ఞానాలను వేరు, వేరుగా గ్రహింపగలం. దీన్నే ‘నిర్వికల్ప సమాధి’ అంటారు.
44. ఏతయైవ సవిచారా నిర్విచారాచ సూక్ష్మవిషయా వ్యాఖ్యాతా.
ఈ పద్ధతిని అనుసరించే సూక్ష్మవిషయాలతో కూడిన సవిచార నిర్విచార సమాధులను తెలియపరుస్తున్నారు.
పైన చెప్పిన విధానాన్నే ఇక్కడా అవలంబిస్తున్నారు. కాని పైన చెప్పిన ధ్యానాల్లో గ్రహించిన అవలంబనాలు స్థూలాలు. ఇవే సూక్ష్మాలు.
45. సూక్ష్మవిషయ త్వంచాలింగ – పర్యవసానమ్.
సూక్ష్మవిషయాలు ప్రధానతత్త్వం (ఆలింగం)తో అంతమవుతున్నాయి.
పృథ్వి మొదలైన భూతాలూ, వాటితో నిర్మాణమయ్యేవన్నీ స్థూల విషయాలై ఉన్నాయి. సూక్ష్మవిషయాలు తన్మాత్రలనే పరమాణువులతో ప్రారంభమౌతాయి. పురుషుడు ఒక్కడు తప్ప మిగిలిన తత్త్వాలన్నీ – అంటే ఇంద్రియాలు, మనస్సు, అహంకారం (నామరూప జగత్తుకు కారణమైన) చిత్తం, సత్త్వరజస్తమాల సామ్యావస్థయైన ప్రధానం అవ్యక్తం అనే ప్రకృతి, అన్నీ కూడా సూక్ష్మవిషయాల్లో చేరతాయి.
46. తా ఏవ సబీజః సమాధిః.
ఇవి బీజసమాధులై ఉన్నాయి.
సబీజసమాధులు పూర్వకర్మ బీజాలను నిర్మూలించజాలవు. కాబట్టి వీటివల్ల మోక్షం సిద్ధింపదు. అయినా యోగికి వీటివల్ల కలిగే ప్రయోజనాలను క్రింది సూత్రాల్లో తెలియజేస్తున్నారు.
47. నిర్విచార వైశారద్యేఽధ్యాత్మ ప్రసాదః.
నిర్విచార సమాధి పరిశుద్ధం అవటంవల్ల అధ్యాత్మప్రసాదం లేదా స్థిర చిత్తత కలుగుతుంది.
48. ఋతంభరా తత్ర ప్రజ్ఞా.
దానియందలి ప్రజ్ఞ సత్యపరిపూర్ణమైనదంటారు. క్రింది సూత్రంలో ఈ విషయాన్ని వివరిస్తారు.
49. శృతానుమాన ప్రజ్ఞాభ్యామన్య విషయా విశేషార్థత్వాత్.
ప్రత్యక్షానుమానాలతో, లభించే జ్ఞానం సామాన్య విషయాలను తెలుపుతుంది. ఇక్కడ వివరించిన సమాధివల్ల కలిగే ప్రజ్ఞ, ప్రత్యక్షానుమానాలతో గ్రహించలేని విషయాలను ప్రకాశింపచేస్తుంది; కాబట్టి ఇది విలక్షణమైనట్టిది.
మన జ్ఞానం ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యం అనే ప్రమాణాల వల్ల కలుగుతుందని ఇక్కడ భావం. యోగులు ఎప్పుడూ కూడా ‘ఆప్తులు’ అంటే, ఋషులు లేదా తత్త్వదర్శులని భావిస్తారు. ఆప్తవాక్యాలు కాబట్టే వేదాలు మనకు పరమప్రమాణాలై ఉన్నాయి. అయినా స్వయంగా వేదాలు మనకు సాక్షాత్కారాన్ని కల్గింపలేవని యోగులు చెబుతారు. వేదాలనన్నింటినీ పఠించినా, మనకెట్టి సాక్షాత్కారం కలగదు. అయితే వేద విధులను అనుసరించి సాధనచేయటం వల్ల అవాక్మానసగోచర అఖండ సచ్చిదానంద స్థితిని పొందగలం అనే ఈ సూత్ర అభిప్రాయం.
ఆత్మదర్శనమే – భగవత్ సాక్షాత్కారమే నిజమైన మతం. మిగిలినదంతా మత సన్నాహం మాత్రమే; అది మతం కాజాలదు. ఉపన్యాసాలను వినటం, గ్రంథాలను చదవటం, తర్కించటం ఇవన్నీ మత సాధనాలే తప్ప మతం కావు. యుక్తివాదాన్ని అనుసరించి భగవంతుడున్నాడని అంగీకరించటం– నిరాకరించటం మతం కాదు. ప్రత్యక్షాలైన శబ్దాది విషయాల కన్నా, విస్పష్టంగా పారమార్థిక సత్యాలను దర్శింపగలం అన్నదే యోగుల ప్రధానాశయం. ఆత్మ–పరమాత్మల వంటి తత్త్వాలు, బాహ్యేంద్రియగోచరాలు కాజాలవు. పరమాత్మను నా కన్నులతో చూడలేను. నా చేతులతో తాకలేను. హేతువాదంతో అతీంద్రియజ్ఞానం ఎప్పుడూ కలగదని మనకు తెలుసు. సంశయాత్మక జ్ఞానమే హేతువాదానికి ఫలం. యుగయుగాలనుండీ జనులు తర్కిస్తూనే ఉన్నారు. జీవితకాలమంతా తర్కించినా మత తత్త్వాలు సత్యాలని లేదా అసత్యాలని నిరూపించలేము. ప్రత్యక్షానుభవమే హేతువాదానికి ఆధారభూతమై ఉంది. హేతువాదం, ఇంద్రియోపలబ్ధ జ్ఞానాన్ని దాటజాలదు. ఇంద్రియ జన్య జ్ఞానాన్ని దాటితే తప్ప సాక్షాత్కారం అనేది ఎప్పటికీ కలగదు. మనిషి ప్రత్యక్ష అనుభవాన్నే కాక, తార్కిక జ్ఞానాన్ని కూడా అతిక్రమించగలడని యోగులు చెబుతారు. తార్కిక జ్ఞానాతీతుడు కాదగ్గ శక్తి మనిషికి ఉంది. యోగాభ్యాసంతో ఈ శక్తి వికసించగానే, మనిషి తార్కిక జ్ఞానాతీతుడై అతీంద్రియ విషయాలను ప్రత్యక్షంగా అవలోకిస్తాడు.
50. తజ్జః సంస్కారోఽన్య సంస్కార ప్రతిబంధీ.
ఈ సమాధివల్ల కలిగే సంస్కారం ఇతర సంస్కారాలనన్నింటినీ నిరోధిస్తుంది.
పై సూత్రంలో ధారణావస్థను అతిక్రమించుటే అతీంద్రియ జ్ఞానాన్ని పొందటానికి ఉపాయం అనీ, చిత్తానికి ధారణను కలగకుండా చేసేవి పూర్వసంస్కారాలనీ గమనించాము. ఏకాగ్రం చేయటానికి ప్రయత్నించగానే, చిత్తం నలుదిశలకు పరుగులు పెట్టటం మీకు తెలుసు. భగవంతుని ధ్యానించటానికి ప్రయత్నించగానే, చిత్తవృత్తులు విజృంభిస్తాయి. ఇతర సమయాల్లో అవంతగా ప్రబలంగా ఉండవు. ‘వద్దూ’ అన్నప్పుడే అవి చిత్తాన్ని ఆక్రమించ ప్రయత్నిస్తుంటాయి. దీనికి కారణమేమిటీ? ధ్యానసమయంలో చిత్తవృత్తులంత ప్రబలంగా ఎందుకుంటాయి? వాటిని నువ్వు నిరోధించే ప్రయత్నం చేస్తావు; కాబట్టి అవి తమ పూర్తిశక్తితో ప్రతిఘటిస్తాయి. చిత్తంలో ఎక్కడో దాగియుండే, సమయం రాగానే పులుల మాదిరి దాడి చేసేందుకు సిద్ధంగా ఉండే ఈ పూర్వసంస్కారాలు ఎన్ని కోట్లుంటాయో! ఇతర వృత్తులను వదలి, మనకు కావలసిన ధ్యేయాకార వృత్తి ఒకటి మాత్రమే వెలువడటానికి ఈ వృత్తులనన్నింటినీ నిరోధించాలి. అయితే, నిరోధించే సమయంలోనే చిత్తవృత్తులన్నీ ఒక్కమారుగా వెలువడటానికి ప్రబల ప్రయత్నం చేస్తాయి. సంస్కారాలు ఇంత బలంగా ఉంటాయి కాబట్టే, అవి చిత్తానికి ఏకాగ్రతను లభించనీయవు. ఇక్కడ తెలిపిన సమాధి సంస్కారాలను నిరోధింపగలది. కాబట్టి దీన్ని తప్పక అభ్యసించాలి. ఈ రకమైన చిత్త ఏకాగ్రతవల్ల కలిగే సంస్కారాలు, ఇతర సంస్కార వ్యాపారాలను నిరోధించగలిగేంత బలీయంగా ఉంటాయి.
51. తస్యాపి నిరోధే సర్వనిరోధాన్నిర్బీజః సమాధిః.
ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించటంవల్ల సర్వం నిరోధితమై నిర్బీజసమాధి ఏర్పడుతుంది.
సాక్షాత్కారమే మన పరమావధి అని మనం గ్రహించాము. ప్రకృతి, మనస్సు, శరీరాలతో మనం తాదాత్మ్యం పొందియుండటం వల్ల మనం పురుషుడిని సందర్శించలేకున్నాం. పామరుడు, తన శరీరమే ఆత్మ లేదా పురుషుడని అనుకొంటాడు. పండితుడు తన మనసే ఆత్మ అనుకొంటాడు. ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు. శరీరాదులతో పురుషునికి ఇలా తాదాత్మ్యాన్ని కల్గించేదేదీ? వివిధ చిత్తవృత్తులు పురుషుని ఆవరించి ఉండటంవల్ల, ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబం మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి ‘కోపం’ అనే చిత్తవృత్తి కల్గిన వెంటనే, “నాకు కోపం వచ్చింది” అంటూ, పురుషునికి లేదా ఆత్మకు కోపం వచ్చిందనుకుంటాం. ‘ప్రేమ’ అనే చిత్తవృత్తి కల్గిన వెంటనే, మన ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి, “మాకు ప్రేమ ఉంది” అని చెబుతాం. పురుషునిలో ‘దౌర్బల్యం’ అనే వృత్తి ప్రతిబింబిస్తే, మనం దుర్బలులం అనుకొంటాం. రకరకాలైన ఈ మనోభావాలన్నీ పురుషుని ఆవరించియున్న సంస్కారాలవల్ల కలుగుతుంటాయి. ‘చిత్తం’ అనే సరస్సును, ‘వృత్తులు’ అనే తరంగాలు ఆవరించియున్నంత కాలం, పురుషుడిని మనం దర్శించలేము. చిత్తవృత్తులన్నీ శాంతిస్తే తప్ప, పురుషస్వరూపం మనకు గోచరం కాదు. కాబట్టి మొదటగా చిత్తవృత్తుల స్వభావస్థితుల గూర్చి, తర్వాత చిత్తవృత్తులన్నీ నిరోధించే ఉత్తమ ఉపాయాల గూర్చి, అగ్నిని అగ్నియే దహిస్తుంది అన్నరీతిలో ఒక్క వృత్తియే, ఇతర వృత్తులను అన్నింటినీ నిరోధించగలిగేంతగా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని గూర్చి పతంజలి మనకు బోధిస్తాడు. ఒకే చిత్తవృత్తి నిలచి యున్నప్పుడు, ఆ వృత్తిని కూడా నిరోధించటం సులభం. అప్పుడు కలిగే సమాధినే నిర్భీజసమాధి అంటారు. ఇలా సర్వవృత్తి నిరోధం సిద్ధించగానే, అద్వితీయ కేవల జనన మరణరహిత నిత్య నిర్వికార, స్వయంజ్యోతి అయిన పురుషుడు సహజవైభవంతో ప్రకాశించటం మనం దర్శిస్తాం.