యోగసూత్రాల గూర్చి చెప్పేముందు ఒక ముఖ్య విషయాన్ని వివరిస్తాను. యోగ మత సిద్ధాంతాలన్నీ దీనిపైననే ఆధారపడి ఉన్నాయి. నామరూపాత్మకమైన మన ఈ సోపాధిక స్థితి వెనుక నామరూపాతీత నిరుపాధిక స్థితి ఉంది; అదే మన ద్వైత ప్రపంచంగా వ్యక్తమవుతోంది; మనమంతా మళ్ళీ ఆ నిరుపాధికస్థితిని పొందటానికే ఆ మార్గంలోనే వెళుతున్నాం; అని ప్రపంచ మేధావులంతా ఏకీభవించారు. ప్రకృతి శాస్త్ర పరిశోధనలు కూడా ఈ విషయాన్నే చాలావరకు నిరూపిస్తున్నాయి.
మరి సోపాధిక, నిరుపాధిక స్థితుల్లో ఏది శ్రేష్ఠం అన్న సందేహం కలగవచ్చు. వ్యక్తావస్థయే మనిషి అత్యున్నత అవస్థ అని చెప్పేవారున్నారు. మన ప్రపంచం అవ్యక్తం నుండి వెలువడుతోంది; కాబట్టి వ్యక్తావస్థయే శ్రేష్ఠం అని కొందరు ధీమంతులంటారు. నిరుపాధికసత్తలో ఏ గుణమూ ఉండదు; అది అచేతనం, జడం, నిర్జీవమై ఉంటుంది; ఈ ఇహలోక జన్మలోనే మనం అన్నీ అనుభవించ గలుగుతాం; కాబట్టి ఈ జన్మనే అంటిపెట్టుకుని ప్రాకులాడుతూ ఉండాలి అని వీరంటారు.
కొన్ని ఇతర జీవిత సమస్యల గూర్చి వాటి పరిష్కారం గూర్చి కాస్త చెప్పుకుందాం. మరణించిన తర్వాత మనిషి ఎప్పటిలాగే ఉంటాడు; అతని స్వభావం దుష్టమైనా, శిష్టమైనాసరే, అది అలాగే ఉంటుంది; అని చెప్పే ప్రాచీన సిద్ధాంతం ఒకటుంది. తర్కశాస్త్రం రీత్యా ప్రపంచమే మనిషి పరమగమ్యం అని ఈ సిద్ధాంతసారం. ప్రపంచంలోని లోపాలను తొలగించి కాస్త ఉన్నతంగా మారిస్తే, ఈ ప్రపంచమే స్వర్గమౌతుందని వారి అభిప్రాయం. నిజానికి ఇది ఎప్పటికీ జరగదు. ఇదంతా పిచ్చివాదం అని ఈ సిద్ధాంతాన్ని చూసిన వారెవరైనా గ్రహిస్తారు. కీడు లేకుండా మేలు జరగదు. అలాగే మేలు లేనిదే కీడు జరగదు. దోషం లేని ప్రపంచంలో జీవించటం, సంస్కృత తార్కికులు చెప్పే ‘గగన కుసుమం’ లేదా ‘పగటికల’ లాంటిది. పరమగమ్యం అంటూ ఏదీ లేదు. ఎప్పుడూ మారుతూ ఉంటూ వికాసం కోసం పెనుగులాడుతుండాలి; ఇదే మనిషి కర్తవ్యం అంటూ అనేక సంప్రదాయాలు ఒక కొత్తసిద్ధాంతాన్ని లేవనెత్తుతున్నాయి. ఈ సిద్ధాంతం బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే బాగాపరిశీలించి చూస్తే ఇదంతా హేతువిరుద్ధంగా ఉందని తెలిసి పోతుంది. చలనం సరళరేఖలో ఉండదు. అది ఎప్పుడూ వృత్తంగానే ఉంటుంది. ఆకాశంలోకి ఒకరాయిని పూర్తివేగంతో విసరివేయండి; మధ్యలో దానిని ఏదీ అడ్డుకొనకుంటే, తిరిగి ఆ రాయి మీ చేతికే వస్తుంది. సరళరేఖను అనంతంగా పొడిగించండి. చివరికది వృత్తంగా మారిపోతుంది. కాబట్టి నిరంతరం మారుతూ ఉండటమే మనిషి కర్తవ్యం అనేది హేతువుకు సరిపోదు. ఈ విషయానికి అంతగా సంబంధం లేకపోయినా, ‘ఇతరులను ద్వేషించకు, ప్రేమించకు’ అనే నైతికసిద్ధాంతానికి ఈ వృత్తచలనమే ప్రధాన కారణం అని అంటాను. విద్యుచ్ఛక్తిలో ఒక క్రొత్త సిద్ధాంతం వచ్చింది. దాన్నిబట్టి ‘విద్యుత్తును పుట్టించే యంత్రాన్ని వదలి శక్తి, తిరిగి తిరిగి చివరికి తన ఉత్పత్తిస్థానానికే వస్తుంద’ ట. అలాగే ఒక వ్యక్తిలో పుట్టిన రాగద్వేషాలు, తిరిగి అతన్నే చేరుకుంటాయి. కాబట్టి మీరు ఎవరినీ ద్వేషించవద్దు. ఎందుకంటే కాలాంతరంలో ఆ ద్వేషం మరల మిమ్ములనే చేరుకుంటుంది. ఇతరులను ప్రేమిస్తే, ఆ ప్రేమ తిరిగి మీకే వస్తుంది. ఇలాగే మీలో పుట్టే ద్వేషం, తిరిగి దారుణాస్త్రంగా మీపైకే వస్తుంది.
ఇతర ప్రత్యక్షహేతువుల రీత్యాకూడా “ఎప్పటికీ మారుతూ ఉండే” సిద్ధాంతం నిలవదు. ఈ సృష్టిలో నష్టం కానిదేదీ లేదు. మన పోరాటాలు, దుఃఖాలు అన్నింటికీ నాశనమే పరమగమ్యం. “జాతస్య మరణం ధృవమ్.” కాబట్టి మనమంతా ఎప్పుడో ఒకప్పుడు మృత్యువు పాలపడవలసిందే. తప్పదు. కాబట్టి సరళరేఖలో చక్రగమనం అనే ఈ అనంతపరిణామ సిద్ధాంతం హేతువిరుద్ధం. అయితే సత్యగ్రహణలో ఇది కొంతదూరం వెళ్ళి, మరల వెనక్కివస్తుంది. వాయురూప సూక్ష్మ స్థితినుండి సూర్యచంద్రాది నక్షత్రాలు జనించి, ప్రళయకాలంలో మరల ఆ వాయురూపాన్నే పొందుతాయి. ప్రపంచ మంతటా ఇలాగే జరుగుతోంది. నేల నుండి సారం గ్రహించి మొక్క పెరుగుతుంది; తన పని కాగానే ఆ సారాన్ని మరల వదలి పెడుతుంది. ప్రతి ఆకారం కూడా అణు నిర్మితమే. చివరికి ఆ ఆకారం మరల అణువులుగా మారిపోతుంది. ఒక్కనియమమే, వేరు వేరు చోట్ల వేరు, వేరుగా ఉండదు. అన్నికాలాల్లో అన్ని అవస్థల్లో కూడా ఒకేవిధంగా ఉండేదే నియమం. బాహ్యప్రకృతిలోనే కాదు, ‘నియమం’ అంతర ప్రకృతిలో కూడా ఇలాగే ఉంటుంది. మనస్సు దేన్లో పుట్టిందో, తిరిగి దాన్లోనే లయిస్తుంది. మనం కోరినా, కోరకున్నాసరే ఈశ్వరుడు, పరబ్రహ్మం అనే మన సహజస్థితిని మనం పొందక తప్పదు.
మనకందరికీ మూలం ఈశ్వరుడే. కాబట్టి చివరికి మనమంతా కూడా ఈశ్వరున్ని చేరక తప్పదు. ఈ మూలకారణాన్నే భగవంతుడంటారు. పరబ్రహ్మం, ప్రకృతి అంటారు. ఏమన్నాసరే, సత్యం మాత్రం ఇదే; “యతోవా ఇమాని భూతాని జాయంతే, యేన జాతాని జీవంతి, య త్ప్రయంత్యభి సంవిశంతి…” ఈ సృష్టిజాతమంతా ఎవరిలో పుట్టి, ఎవరిలో జీవిస్తూ, తిరిగి ఎవరియందు ప్రవేశిస్తున్నదో… అంటూ వేదం చెబుతుంది. ఇది నిజం. ప్రకృతి ఒకేరీతిని వర్తిస్తూ ఉంటుంది. ఒక గోళంలో ఉన్న ప్రకృతి ధర్మాలే, కోట్లాది ఇతర గోళాల్లో ఉంటాయి. గ్రహాల్లో ఉండే ధర్మాలే, భూమిలో, మనిషిలో మొత్తం సృష్టిజాతంలో ఉంటాయి. ఎత్తయిన తరంగమంతా కోట్లాది చిన్నచిన్న అలల కూడికే. కోట్లాది జీవుల ఉత్పత్తే ప్రపంచోత్పత్తి. ఈ జీవులన్నింటి అస్తమయమే, మొత్తం ప్రపంచాస్తమయం. ఈ జీవులన్నింటి ప్రళయమే, ప్రపంచ ప్రళయం.
మరి మనిషి చివరికి భగవంతున్ని చేరటం ఉన్నత అవస్థయేనా? కాదా? అని ప్రశ్నిస్తారేమో! యోగులు అది ఉన్నత అవస్థయే అంటారు. ఆ ఉన్నతస్థితి నుండి కల్గిన పతనమే ఇప్పటి మనిషి స్థితి అని వారు చెబుతారు. మనిషి స్థితి కన్నా బ్రాహ్మీస్థితి ఉన్నతమని అన్ని మతాలు అంగీకరిస్తాయి. మొదట్లో మనిషి పరిశుద్ధంగానే ఉంటాడు; క్రమంగా పరమ నికృష్టస్థితి పొందేవరకూ అతను పతనం చెందుతూనే ఉంటాడు. అలాగే అతను మరల పూర్వపు ఉన్నతస్థితికి చేరుకుని తీరుతాడని వీటన్నింటి భావం. ఇలా ఎంత నీచస్థితిని పొందినా కూడా జీవి పరివర్తనం చెందుతూ, గమ్యం వైపు పయనిస్తూ భగవంతుని చేరుకుంటాడు; ఇది తప్పదు. మొదట మనిషి భగవంతుని నుండి వస్తాడు. మధ్యలో అతను మనిషిస్థితి పొందుతాడు. చివరికి మరల భగవంతునిలో కలుస్తాడని ద్వైతమతం చెబుతుంది. మనిషి నిజానికి భగవంతుడే, చివరికి అతను భగవంతుడే అయిపోతాడని అద్వైతం అంటుంది.
ఇప్పటి మన ఈ అవస్థయే ఉన్నతమైతే, మరి పెడబొబ్బలు, హాహాకారాలు ఎందుకంటారు? తుదకు వీటన్నింటినీ వదలటమెందుకంటారు? ఈ అవస్థయే సర్వశ్రేష్ఠమైతే, మరి ఇది ఎందుకు నశించిపోతుంది? క్షయం, నాశనం చెందే స్థితి ఉన్నతస్థితి కానేకాదు. అయితే మన ఈ అవస్థ ఇంత ఘోరంగా, అసంతృప్తికరంగా, దుర్భరంగా ఉండటానికి కారణమేమిటీ? ఇది మనకు ఉత్తమస్థితి లభించటనానికి ఆధారం; ఇది మనం దివ్యత్వం పొందటానికి సాధనం; కాబట్టి ప్రస్తుత స్థితిని మనం కాదని నెట్టివేయలేం. భూమిలో విత్తనం నాటుతాం; అది శిథిలమవుతుంది; కొంతకాలానికి దానినుండే మహావృక్షం మొలకెత్తుతుంది. అలాగే దివ్యత్వం పొందాలంటే ప్రతిజీవి తన జీవత్వాన్ని లయం చేసుకోవాలి. కాబట్టి ‘మనుష్యావస్థ’ అనే ఈ స్థితినుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఆత్మహత్య ద్వారా ఈ స్థితినుండి బయటపడవచ్చా అనంటే, అది అసంభవమంటాను. ఆత్మహత్యవల్ల మరింత కీడు కలుగుతుంది. ఆత్మహత్యతో లేదా ప్రపంచాన్ని నిందించటంవల్ల ఈ మనుష్యావస్థనుండి మనకెన్నటికీ ముక్తి లభించదు. నిస్పృహ నిస్సహాయత అనే బురదగుంటను దాటి, సంసారసాగరం నుండి మనం తరించాలి. ఎంత త్వరగా తరిస్తే అంతమంచిది. మనుష్యస్థితే అత్యున్నత స్థితి అని అనుకోవద్దు.
బ్రాహ్మీస్థితి మహోన్నతం; నిరుపాధికం. ఇది జలచరస్థితి లేదా పాషాణస్థితి కాదు. కొందరిలా తలుస్తున్నారు; అయితే అది సరికాదు. అస్తిత్వం పాషాణస్థితిగా గానీ, భావస్థితిగా గానీ ఉండాలని వీరనుకుంటారు. ఇలా తలచటం యుక్తివిరుద్ధం. భావస్థితి కన్నా మించిన కోట్లరెట్ల అతీంద్రియస్థితి లేదని మీరెలా చెబుతారూ? కాంతి తరంగాలు చాలా అల్పంగా ఉన్నా, చాలా అధికంగా ఉన్నా మనం కాంతిని చూడలేం. ఈ రెంటి మధ్యలో ఉంటేనే చూస్తాం. కాంతి అల్పంగా ఉన్నా చీకటే, అధికంగా ఉన్నా చీకటే; మరి ఈ రెండు చీకట్లు ఒకటేనా? కాదు. ఈ రెంటికీ ధృవాలకున్నంత తేడా ఉంది. రాతిలోని భావరహిత స్థితి, పరబ్రహ్మంలోని భావరహితస్థితి ఒక్కటి కాదు. రెండూ విభిన్నాలు. భగవంతుడు ఆలోచన చేయడు, తర్కం కూడా చేయడు. అతనెందుకు తర్కించాలీ? అతనెందుకు ఆలోచించాలీ? అతనికి తెలియనిదేమైనా ఉంటేకదా? అతను సర్వజ్ఞుడు; ఇక అతనికి హేతువాత మెందుకూ? రాతికి తర్కించే శక్తిలేదు; భగవంతునికి ఇచ్చలేదు. ఇంత తేడా ఉంది. భావస్థితిని దాటివేయటం ఎంతో ప్రమాదమని ఈ భావవాదుల వాదం. భావస్థితిని మించినది ఏదీలేదు అని వీరి సిద్ధాంతం.
తర్కం – హేతువాదం కన్నా మించిన మానసిక అవస్థలున్నాయి. బోధను దాటివేయటమే ఆధ్యాత్మిక జీవితానికి మొదటి మెట్టు. భావనను, బుద్ధిని, తర్కాన్ని పూర్తిగా దాటాలి; అప్పుడే ఆధ్యాత్మికసాధన మొదలవుతుంది. అదే యథార్థ జీవితారంభం. మనం సామాన్యంగా జీవితం అని పేర్కొంటున్నది, ఆధ్యాత్మిక జీవితానికి బీజావస్థ.
సరే, అతీంద్రియ స్థితే అత్యున్నతస్థితి అని ఎలా అంటారు? అనే ప్రశ్న వస్తుంది. స్వార్థరహితులు, సాటిలేని మేధావులు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మహాత్ములు అంతా సర్వాతీత, అనంత, పరిపూర్ణ స్థితిని పొందటానికి మనుష్యజన్మ మనకొక సాధనమని చాటిచెబుతున్నారు. వీరి మాటలు వదరుబోతుల ప్రలాపాలు కావు సుమా! ఇలా చెప్పి ఊరుకోలేదు. వారు అందరికీ దారి చూపుతున్నారు. తమ అడుగుజాడల్లో నడిచి అంతా భగవంతుని పొందేలా, తమ పద్ధతులను వారు వివరిస్తున్నారు. జీవిత సమస్యకు మరో పరిష్కారం ఏదీలేదు. మనుష్య స్థితే మహోన్నత స్థితి అయితే మనమంతా ఈ సంసారంలో పడి ఎందుకు తిరుగుతున్నాం? ప్రపంచవ్యాపారం ఇలా ఉండాలి అనటానికి హేతువేముందీ? ఇంద్రియగోచర ప్రపంచాన్ని దాటటం సాధ్యం కాదనుకొందాం; అతీంద్రియ జ్ఞానాన్ని పొందాలనుకోవటం వ్యర్థం అనుకుందాం; అలాంటప్పుడు ఈ దృశ్యప్రపంచమే మన జ్ఞానానికి సరిహద్దవుతుంది. ఈ వాదాన్నే అజ్ఞేయవాదమంటారు. సరే, కాని ఇంద్రియాల ద్వారా సాధ్యమయ్యే ప్రత్యక్ష ప్రమాణాన్ని ఎందుకు నమ్మాలీ? నడివీథిలో నిశ్చలంగా నిలచి ప్రాణాలు వదిలేవాడే నిజమైన అజ్ఞేయవాది. తార్కిక జ్ఞానాన్ని మించినదేదీ లేకపోతే, మనం నాస్తికులం కావటం మంచిది. ధనం, కీర్తి, గౌరవం వీటియందు తప్ప మిగతా అన్నింటియందు అజ్ఞేయవాదం అవలంబించేవాడు నిజంగా వట్టి దాంభికుడు. అంతంలేని, భేదింపరాని తార్కిక జ్ఞానావరణాన్ని మనం దాటిపోలేమని ‘కాంటు’ నిరూపించాడు. అయితే హైందవజ్ఞానానికి ఇది మొదటి మెట్టు మాత్రమే. తార్కిక జ్ఞానానికి అతీతమైన దివ్యజ్ఞానాన్ని పొందటానికి హిందువులు సాహసించారు; విజయం పొందారు కూడా.
నేటి సమస్యలకన్నింటికీ సమాధానం అతీంద్రియజ్ఞానం వల్లనే సాధ్యం. ఈ జ్ఞానంవల్ల మనకు కలిగే ప్రయోజనం, ఈ భవసాగరాన్నుండి తరించటమే. “భగవాన్, ఈ అజ్ఞానసముద్రం నుండి మమ్ములను దాటించు” అని ప్రార్థించటమే పరమ మత ధర్మం; మరేది కాదు.