ఒకనాడు జ్ఞానేశ్వర్, అతని సోదరులు, సోదరి మొదటిసారిగా పాండురంగాలయాన్ని దర్శించుకోడానికి బయలుదేరారు. వారు ముందుగా నామదేవ్కి నమస్కరించకుండా విఠలునకే ప్రణమిల్లారు. ఇది చూసి ‘అహర్నిశలు పాండురంగ సేవలో మునిగి ఉన్న నన్ను పట్టించుకోకుండా, వారు తిరస్కరిస్తున్నారేమిటి? అని బాధపడి, వారిపై కోపపడ్డాడట.
నివృత్తినాథుడు, జ్ఞానదేవ్, సోపాన్లు నమస్కరించినా తిరిగి నామదేవ్ నమస్కరించ లేదనీ కొందరంటారు. ఇలా ఇతని ప్రవర్తన చూసి చాలా చిన్న పిల్లైన ముక్తాబాయి ఆశ్చర్యపడి, ఒక భక్తుడిలా బాధ పడడమేమిటి? తనను నమస్కరించని వారిని తూలనాడడమేమిటి? వీడేమి భక్తుడని వేళాకోళమాడింది. సోదరులు ఆపడానికి ప్రయత్నిం చినా, ఆమె వారి మాట వినకుండా ఇతని గర్వం ఆత్మసాక్షాత్కారానికి భంగకరం అంటూ తీవ్రంగా మందలించింది. వినయం లేని భక్తులను నిందిస్తూ అక్కడి కక్కడే పాటలు వ్రాసి పాడిందట.
నామదేవ్ గోరాకుంభార్ చేత కూడా పరీక్షించబడ్డాడు. ఒకసారి భక్తులందరూ ఉన్న సందర్భంలో గోరా, భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ భక్తుల నుదుటన మట్టి ముద్దలనద్దేడట. వారి నుదిటిని స్పృశిస్తూ కాలిన కుండయో లేక పచ్చికుండయో నిర్ధారణ చేశాడట. అంటే భక్తిలో పరిపక్వత చెందినవాడా కాదా అని ఒక పరీక్ష. జ్ఞానేశ్వర్ సోదరులు, సోదరి కాలిన కుండలు వంటి వారని; నామదేవ్ పచ్చికుండ వంటివాడని అన్నాడట. ఇంకా ఇతనిలో నిష్కామభక్తి లేదని తేల్చాడట. నామదేవ్ ఇది విని, విఠలునితో మొఱపెట్టుకున్నాడు. అప్పుడు విఠలుడు, గురువును ఆశ్రయించమని ఆదేశించాడు. ఈ గురువే జ్ఞానేశ్వర్ శిష్యుడైన విసోబా.
నామదేవ్ అమ్వంధ్య అనే గ్రామానికి వెళ్లాడు. అక్కడున్న ఆలయంలో గురువును చూశాడు. నేల మీద పడుకుని తన కాళ్లను శివలింగంపై పెట్టిన వ్యక్తిని చూశాడు. ఇతడేమి గురువనుకున్నాడు. ఈశ్వరలింగంపై నుండి కాలు తొలగించమని అన్నాడు. అందుకు గురువు ‘నేను వృద్ధుణ్ణి, కాళ్లు కదపలేని స్థితిలో ఉన్నాను, ఈశ్వర లింగం లేని చోట నా కాళ్ళను పెట్టు’ అని విసోబా అన్నాడు. నామదేవ్ విసోబా కాళ్ళను మరొక చోట పెట్టగా అక్కడా ఈశ్వర లింగం ప్రత్యక్ష మైంది. ఇలా అన్నివైపులా పెట్టి చూశాడు, పెట్టిన ప్రతిచోటా శివలింగం ప్రత్యక్షమౌతోంది. (నానక్ జీవితంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది) నామదేవ్కు అప్పుడు అర్థమయ్యింది. చర-అచర వస్తు ప్రపంచంలో దృశ్య-అదృశ్య పదార్థాలలో అన్నింటా, అంతటా ఆ పరమేశ్వరుడే ఉన్నట్లు, ఆ విరాట్మూర్తిని ఆరాధించాలనే జ్ఞానం అతనికి కలిగింది. అప్పుడు విసోబా, తాను జ్ఞానదేవ్ నుండి అధ్యాత్మ విద్యోపదేశం పొందానని చెప్పి, నామదేవ్ శిరస్సుపై చేతులుంచి ఆశీర్వదించాడు.
కేవలం రాతి విగ్రహాన్నే దేవుడంటున్నారు, కాని ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కదా అని విసోబా అనేవాడు. నామదేవ్ అభంగాలలో ఈ ప్రభావం కనిపిస్తుంది. ఒక పాటలో ‘సూర్యుడుదయించినా, మేఘాలు వర్షించినా, గాలివీచినా అంతటికీ నీవే కారణం పాండురంగా! నీ ప్రభావం వల్లనే జగత్తు అంతా నడుస్తోంది పాండురంగా!’ అని పలికాడు. విగ్రహాన్ని పూజించినప్పటికీ, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడనే జ్ఞానం నామదేవ్లో పొటమరించింది. చివరికి ఒక పాటలో ‘వ్రతాలు, ఉపవాసాలు, తీర్థయాత్రలు చేయనవసరం లేదు, హృదయ పూర్వకంగా హరినామ సంకీర్తనం చేస్తే చాలు. యజ్ఞయాగాదులు, యోగాభ్యాసాలతో పని లేదు. నిర్గుణారాధనే చేయనవసరం లేదు. రంగణ్ణి స్మరిస్తేచాలు’ అని అంటాడు. హిందీలో వ్రాసిన ఈ పాట సిక్కుల మతగ్రంథమైన గురుగ్రంథ సాహెబ్లో చోటుచేసుకుంది.
“కుండ నిండా నీళ్లు పోసి నీకు అభిషేకం చేద్దామంటే అందులో జీవాలు లేవా? మరల నీకు అభిషేకమేల? నీళ్లనవి ఎంగిలి చేయలేదా? పువ్వులు తెచ్చి నీకు పూలమాలను కూరుద్దామంటే, తుమ్మెద అంతకు ముందే దానిని వాసన చూడలేదా? తుమ్మెదలో భగవానుడు లేడా? పాలు తెచ్చి బియ్యంవేసి పరమాన్నం చేసి నీకు నివేదన చేద్దా మంటే దూడలు ఆ పాలను ఎంగిలి చేయలేదా?దూడలో దేవుడు లేడా? అతడు మనలోనూ ఉన్నాడు, మనకు అతీతుడుగానూ ఉన్నాడు. అతడు లేని చోటెక్కడ? ఆ సర్వవ్యాపికి తల వంచి నమస్కరిస్తున్నాను” అని వ్రాశాడు.
గురుకృప కలిగిన తరువాత నామదేవ్, జ్ఞానేశ్వర్లు తరచూ కలుసుకుంటూ ఉండేవారు. కొంతకాలం పోయిన తర్వాత గోరాకుంభార్ అతని పరిపక్వ దశను గుర్తించి, భేదాలకు అతీతుడవయ్యావని నామదేవ్ని కొనియాడాడు. నామదేవ్ యొక్క నిజమైన భక్తిని చూసి జ్ఞానదేవ్ కొనియాడేవాడు. వీరిద్దరి సమాగమం భక్తి, జ్ఞానాల సమాగమంలా ఉండేది. ఒకరిని ఒకరు విడదీయ లేనంతగా మెలుగుతూ ఉండేవారు. వీరిద్దరూ సామూహిక నామ సంకీర్తనలను ఏర్పాటు చేసి పండరీపురాన్ని నామఘోషలో ముంచెత్తేవారు.