నామదేవ్ ఐదు సంవత్సరాల ప్రాయంలో ఉండగా ఒక రోజు, తల్లి అతని పిలిచి, ‘నాయనా! నీ తండ్రి ఇంట్లో లేరు, ఈ పాలను ఆలయానికి వెళ్లి స్వామికి నివేదించు’ అని ఒక పాలపాత్రను ఇచ్చింది. పిల్లవాడు బహు జాగరూకతతో ఆ పాత్రను గ్రహించి ఆలయానికి వెళ్ళి విఠలుని ముందు ఉంచి ‘స్వామి! త్రాగవయ్యా అంటూ బ్రతిమాలాడు’. స్వామికి నివేదించి, ఆయన గ్రహించినట్లు భావించి, ప్రసాదంగా తాము గ్రహించి, అందరికీ పంచిపెడతారు అని అర్థం చేసుకోలేని పసి వయస్సు.
విఠలుడు త్రాగకపోయే సరికి ఎందుకు త్రాగవని పదే పదే అడిగాడు. బుజ్జగించాడు, బ్రతిమాలాడు. ‘నీవు త్రాగుతావని అమ్మ చెప్పింది. కాబట్టి త్రాగితీరాలి’ అని మంకుపట్టు పట్టాడు. అయినా స్వామిలో కదలిక లేదు. కన్నీరు మున్నీరుగా విలపించాడు. నువ్వు త్రాగకపోతే నా తలను నీ వాకిట ముందు బ్రద్దలుకొట్టుకుంటానని భీష్మించాడు. ఇక తలబాదుకోవడానికి సిద్ధం కాగా పాత్రలోని పాలన్నీ మాయమయ్యాయి. స్వామి చిరునవ్వు నవ్వాడు. తృప్తి పడి పాత్రను ఇంటికి తీసికువచ్చి, తల్లికి ఇచ్చాడు.
‘పాలు ఏవి?’ అని తల్లి అడిగింది. విఠలుడు త్రాగేశాడు అని జవాబిచ్చాడు. అందుకు తల్లి పిల్లవాడు ఏదైనా అల్లరి పని చేసాడనుకుని, కోపంతో ఇలా అంది – ‘అబద్ధం ఆడకు, నువ్వే త్రాగి ఉంటావు’. పిల్లవాడు ‘లేదమ్మా విఠలుడే త్రాగాడు’ అని అంటూ ఉండగా తండ్రి దామసేఠి ఇంట్లో అడుగుపెట్టాడు. తల్లికొడుకుల సంభాషణను విన్నాడు. ఇది నిజమా? అబద్ధమా? అర్థం కాలేదు. మరునాడు ఈ సంగతేమిటో విచారిద్దామని భావించాడు. తల్లి మామూలుగానే పాత్ర నిండా పాలు పోసి కొడుకును పంపింది. తండ్రి కూడా వెంట వెళ్లాడు. మళ్లీ కథ మామూలే. ఇతని పట్టుదల, మారాము చూసి స్వామి త్రాగడం; ఆ దృశ్యాన్ని తండ్రి కూడా చూడడం జరిగింది. స్వామికి సాష్టాంగ నమస్కారాలర్పించాడు. ఇటువంటి సంఘటన ఎవరూ కనీ వినీ ఎరుగరు. దామసేఠి ఆశ్చర్యానికి, ఆనందానికి అవధి లేదు.
ఇలా మళ్లీ మళ్లీ చేయవద్దని స్వామి అన్నాడు. అప్పటి నుండి నామదేవ్కి విఠలుడు రాతి విగ్రహంలా కనబడలేదు. ఒక సజీవ మూర్తిగా, ఒక సఖునిగా, తన సొంతవానిగా కనపడ్డాడు. ఆనాటి నుండి కీర్తనల వెల్లువ మొదలైంది. మళ్ళీ మళ్ళీ కనబడు అంటూ కవితా ప్రవాహం పెల్లుబికింది.