పూజ్య స్వామీజీ!
అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఈ కుంభకోణ పట్టణంలోని పురజనుల పక్షాన, మన పురాతన దేవాలయాలచేత, మహాఋషులచేత, సాధుపుంగవులచేత పవిత్రభూమియైవెలిగే, పుణ్యభూమి అయిన మన దేశానికి పాశ్చాత్య ప్రపంచంనుండి శ్రీవారు మరలివచ్చే ఈ తరుణంలో మేం భక్తి పూర్వకంగా శ్రీవారికి స్వాగత మర్పించుకోవడానికి అనుజ్ఞ కోరుతున్నాం. శ్రీవారు పూనిన మతప్రచారానికి అమెరికా, యూరప్ ఖండాలలో అద్భుత విజయం చేకూర్చినందుకూ, ప్రపంచం నలుదెసలనుండి వచ్చి షికాగో నగరంలో సమావేశమైన వివిధ మత ప్రతినిధి మహాశయులకు హిందూమతం, హిందూతత్త్వశాస్త్రం, నరునికి గల సమస్త భగవద్భావాలను, ఆధ్యాత్మిక సాధనాదర్శాలను ఉద్ధరించి వారికి సామరస్యం కలిగించేంత విశాలములు, సహేతుకములు, విశ్వశరణ్యములు అయి ఒప్పుతున్నాయని నచ్చచెప్పడానికి తగిన సమర్థతను శ్రీవారికి ప్రసాదించినందుకూ భగవంతునిపట్ల మే మత్యంత కృతజ్ఞులం.
విశ్వప్రాణుడు, విశ్వాత్మ అయిన పరమేశ్వరుని చేతులలో సత్యధర్మాలు ఎప్పుడూ సురక్షితమై ఉంటాయనే విశ్వాసం అనేక సహస్రాబ్దాలుగా మన భక్తి ప్రపత్తులలో లీనమైవుంది. శ్రీవారు క్రైస్తవ భూములలో చేసిన పవిత్రప్రచారం, ఫలితంగా పరమార్థజీవులైన హిందువుల పిత్రార్జిత సంపదైన ఆధ్యాత్మిక ధర్మంయొక్క అగణిత మహిమ భారతీయుల, విదేశీయుల దృష్టిపథంలో ప్రతిష్ఠింపబడింది. కాబట్టి మేము ఆనందాన్ని పొందుతున్నాం. శ్రీవారి ఈ ప్రచార విజయం, ఇదివరకే సుప్రసిద్ధమై వెలసిన శ్రీవారి సద్గురుదేవుని కీర్తిప్రకాశాన్ని ద్విగుణీకృతం చేసింది; నాగరిక ప్రపంచందృష్టిలో మనకొక గౌరవస్థానాన్నికూడ కల్పించింది; మన పూర్వులు చేసిన మహాకార్యాలను గురించి, జాతి గర్వపడటానికి ఆధారంవుందనీ, మన నాగరికతలో పరపీడనోజృంభణం లేకపోవడం, మన అసమర్థత, దౌర్భల్యంవల్ల కాదనీ మాకు విశదం చేసింది. శ్రీవారివంటసదసద్వివేకులు, దీక్షాపరులు, పూర్ణనిష్కాములు అయిన బోధకులు మాలో ఉండటంచేత హిందూజాతి భావిభాగ్యదశ ప్రతిభావంతం, ఆశాజనకం అయితీరుతుంది. జగత్ప్రభువు, సకల జాతులకు ఏకైక దైవతం అయిన పరమేశ్వరుడు శ్రీవారికి దీర్ఘాయురారోగ్యాల నిచ్చి, హిందూమత తత్త్వప్రచారకులుగా శ్రీవారు పూనిన మహాపవిత్రోద్యమాన్ని జయప్రదంగా నిర్వహించడానికి ఎంతో అధికంగా ధీశక్తిని, జవసత్వాలను ప్రసాదించుగాక! అని ప్రార్థిస్తున్నాం.
మరొక స్వాగత పత్రాన్ని ఆ పట్టణ హిందూవిద్యార్థులు సమర్పించారు. తర్వాత శ్రీస్వాములవారు “వేదాంత ప్రచారాన్ని” గూర్చి ఈ క్రింది రీతిగా ఉపన్యసించారు.
“ఒకింత ధర్మాచరణం సైతం గొప్ప ఫలాన్నిస్తుంది.” అనే గీతా వచనంలోని సత్యం నా జీవితంలో అనుదినం నాకు గోచరిస్తూనేవుంది. నేను నిర్వహించిన కార్యం నిజంగా లెక్కపెట్టవలసినంతటిది కాదు. కాబట్టి కొలంబో మొదలు ఈ నగరం వరకు అడుగడుగునా నాకివ్వబడిన స్వాగత సత్కారాల్లో చూసిన ఆ దయ, ఆ ప్రేమ ఇంత ఘనంగా వుంటుందని నేను ఎన్నడూ ఊహించలేదు. అయినా, ఈ ఆదరం హిందువులమైన మనకు సంప్రదాయానుగుణంగానే ఉంది. మన జాతికిది సహజమే. ఎందుకంటారా? చూడండి! మనది హిందూజాతి; మన ఆయువుపట్టు, మన జీవనిధి – ఇంతెందుకు – మన ‘ఆత్మే’ ‘మతధర్మం’ గా భాసిస్తోంది. ప్రాచ్యజాతుల మధ్య, పాశ్చాత్యజాతుల మధ్య పర్యటిస్తూ ప్రపంచమెలా ఉందో నేను కొంచెం చూశాను. ఒక్కొక్క ఆదర్శం ఒక్కొక్క జాతికి వెన్నెముకగా కనబడుతోంది. కొందరికి రాజనీతి, కొందరికి సమాజ నాగరికత, కొందరికి బుద్ధిపరిశ్రమ – అలాగే వారివారి జాతీయ భావాలను అనుసరించి ప్రాణభూతమైన జాతి లక్షణా లేర్పడుతున్నాయి. మన ఈ మాతృభూమికి ‘మతమే’ మూలాధారం; మతమే వెన్నెముక. మతమనే పెద్ద శిలపైన మన జాతీయసౌధం నిర్మించబడి ఉంది. చెన్నపురి ప్రజలు ప్రేమతో నాకు అమెరికాకు పంపిన అభినందనపత్రానికి నేనిచ్చిన ప్రత్యుత్తరంలో “హిందూదేశంలోని ఒక పేదరైతుకు, పాశ్చాత్య ప్రపంచంలోని చాలామంది విద్యాధికులకంటె ఉత్తమమైన మత సంస్కారం ఉంది.” అనే సత్యాన్ని సూచించాను. ఈనాడు నా మాటలు నిస్సందేహంగా సత్యమని నాకు ఋజువవుతోంది. మన జనసామాన్యానికి ప్రపంచజ్ఞానం తక్కువనీ, దాన్ని సంపాదించుకోవాలనే కోరికే వారికి లేదనీ, పూర్వమొకప్పుడు నేను అసంతృప్తి పొందుతూండేవాడిని. ఇప్పుడు నాకు దాని రహస్యం తెలిసింది. వారికి ఏ విషయాల్లో అనుమానముందో, ఆ విషయాలను తెలుసుకోవడానికి ఇతర దేశాల ప్రజలకంటే ఎక్కువ ఉత్సాహాన్ని వారు ప్రదర్శిస్తారు. యూరప్‌లో జరుగుతున్న గొప్పగొప్ప రాజకీయ పరివర్తనలను గూర్చిగాని యూరోపియన్ సంఘంలో జరిగే ఉద్యమాభివృద్ధులను గూర్చిగాని మన పల్లెటూరివారి నడగండి. వారికేమీ తెలిసివుండదు; తెలిసికోవాలనే కోరికావుండదు. కాని హిందూదేశంతో ఏ ప్రమేయం లేకుండా ఎక్కడో వున్న సింహళ ద్వీపంలోని పల్లెటూరి అమాయక ప్రజలుకూడ అక్కడ పొలంలో పనిపాటలు చేసే కూలివాళ్ళు సైతం అమెరికాలో ఒక మత మహాసభ జరిగిందని, ఒక హిందూసన్యాసి అక్కడికి వెళ్ళాడనీ అతనికి కొంత సాఫల్యం చేకూరిందనీ అప్పుడే తెలిసికొన్నారు.
కాబట్టి మన అభిరుచికి సంబంధించిన విషయాలను తెలిసికోవడానికి ఇతర జాతులతో సమంగా మనవారూ ఉత్సాహాన్ని చూపుతూనే ఉన్నారు. భారతదేశంలో ప్రజలకు రుచించే విషయం ‘మతం’ ఒక్కటే! ఒక జాతి అభిరుచి అంతా మతాదర్శాల్లో ఉండటం మంచిదా లేక రాజకీయాదర్శాల్లో ఉండటం మంచిదా? అని నేనిప్పుడు తర్కించబోవడంలేదు. మంచికో, చెడ్డకో మన అభిరుచులు మతంలో లగ్నమై ఉన్నాయి. మీరు దాన్నిప్పుడు మార్చలేరు. దాన్ని నాశనంచేసి, దాని స్థానంలో ఇంకొకదాన్ని తెచ్చిపెట్టనూలేరు. బాగా పెరిగిన ఒక పెద్దచెట్టును ఒకచోటునుండి తీసి వేరొక తావున నాటి వెంటనే వేరూనేలా చేయడం అసాధ్యం. మతధర్మ ప్రవాహం వేలాది సంవత్సరాలనుండి భారతదేశంలో ప్రవహిస్తోంది; మంచికో, చెడ్డకో భారత వాతావరణం అలాగే శతాబ్దాలనుండి మతాదర్శాలతోనిండి మెరుస్తూవుంది. మంచికో చెడ్డకో మనం మతాదర్శాల్లో పుట్టి అందులోనే పెరిగాం. అది మన రక్తంలోకి ఇంకిపోయింది. ప్రతి నాళంలోని జీవకణాల్లోను అది చొరబారింది. అది మన శరీరంతో సారూప్యాన్ని పొందింది. అది మన ప్రాణాలకే ఆయువుపట్టయింది. తాను మలచుకొన్న మార్గం వెంబడి యుగయుగాలుగా ప్రవహిస్తూన్న ఈ మతవాహినిని పూడ్చివేయక దానిని విడనాడటం సాధ్యమా? ఒకవేళ అలా పూడ్చినా దాని దుష్ఫలితాలను అనుభవించకుంటారా? గంగాప్రవాహం వెనుకకు మరలి, హిమగిరి శిఖరాలకు ఎగబ్రాకిపోయి క్రొత్తమార్గాన్ని అవలంబించాలని మీరు కోరుతున్నారా? అది సంభవమైనా ఈ భారతమాత తనకు సహజమైన ఆధ్యాత్మిక మార్గాన్నుండి తొలగి మరొక కొత్తమార్గాన్ని రాజకీయాది మార్గాంతరాన్ని తొక్కడంమాత్రం అసంభవం. ఎవనికి వాడు తనకు సుకరమైన ధర్మమేదో, దాన్నిమాత్రమే చేపడతాడు. భారతదేశానికి ఆధ్యాత్మికమార్గమే సుగమమార్గంగా కనిపిస్తోంది. మత మార్గాన్ని అనుసరించి నడవటమే భారతదేశ జీవన విధానం.
నిజానికి ఇతర దేశాల్లో మతమనేది అనేక ‘జీవితావసరాల్లో’ ఒకటి. దీన్ని ఒక చిన్నదృష్టాంతంతో చెబుతాను: “ఒక దొరసాని భవంతిలో చాలా వస్తువులుంటాయి. భవంతులలో ‘జపాను కూజా’ ను అందంకోసం అమర్చుకోవడం ఒక ‘ఫ్యాషను.’ అది లేకుంటే అందానికి కొరత. కాబట్టి తానుకూడ ఒక ‘జపాను కూజా’ కొనాలని ఆ దొరసాని మోజుపడింది. ఆ దొరకు, ఆ దొరసానికి ఇలాంటి మోజులెన్నో ఉంటాయి. ఆ మోజులలో ఆవంత మతావలంబనం ఒకటి. కాబట్టి వారు కొంచెం మతంకూడ చేపడతారు. వారికి ఈ లోకమే పరమగమ్యం. ఆ గమ్యాన్ని చేరడానికి సహకరించడానికి ఈ దేవుడు, మతమూ! వారికి ‘దేవు’ డనగా ఈ ప్రపంచాన్ని తమకోసం పరిశుభ్రంచేసి అమర్చిపెట్టే ఒక పరిచారకుడు. వారు దేవునికిచ్చే విలువ అంతగానే కనబడుతోంది. విద్యావంతులు కాబట్టి ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉండాలో, అలాంటి వారి పెదవులనుండి లేదా విద్యాధికులమని నటించే ఆ పెద్దల నోటినుండి ఒకటి రెండు శతాబ్దాలుగా హిందూమతధర్మాన్ని ఖండిస్తూ వెలువడుతున్న ఆక్షేపాలు ఎలాంటివో మీకు తెలుసుకదా? మన మతం ప్రాపంచిక సుఖజీవనానికి అనుకూలించదట! అది మన ఒడిలో బంగారపు రాసులు కుమ్మరించదట! ఇతర జాతులను దోచుకోవడానికి అది మనకు తోడ్పడదట! దుర్బలులనెత్తినెక్కి వారి నణగద్రొక్కే వీరులుగా మనల్ని తయారుచేయదట! దీనుల జీవరక్తాలను పీల్చే విద్యను అది మనకు నేర్పదట! నిజమే, మన మతం అలా చేయదు. జాతుల్ని దోచుకొని, ధ్వంసంచేసి, రూపుమాపుతూ భూమి అదిరిపడి దద్దరిల్లగా అన్యదేశాలపైకి దాడి వెడలే సమరయోధులను మన మతం సిద్ధంచేయదట! కాబట్టి ఈ మతంలో పస ఏముంది? అది మా కోరికలకు సానపెట్టదు; మా కండరాలకు బలం ఎక్కించదు. అలాంటి మతమెందుకు?” అని ఆ పండితమ్మన్యులు ప్రశ్నిస్తున్నారు.
కాని వారి ఆ ఆక్షేపణలే ఒక మతం యోగ్యతను రుజువు చేయడానికి ఆధారాలని వారు తెలిసికోలేకున్నారు. మన మతం ఈ ప్రపంచ భోగాల కోసమై ప్రాకులాడదు. ‘మూడునాళ్ళ ముచ్చటైన ఈ క్షుద్రభోగమయ ప్రపంచాన్ని మన సర్వస్వంగా భావించరాదు. అది జీవిత పరమగమ్యం కాదు’ అని బోధిస్తోంది కాబట్టే మన ఈ మతాన్ని సత్యమంటున్నాం. ఏ నాలుగడుగుల వ్యాప్తోవున్న ఈ చిన్ని వసుధాచక్రం మన మత దృష్టికి హద్దులు పెట్టజాలదు. మన గమ్యం చాలాదూరంగా ఉంది. ఇంద్రియాలను దాటి ఆకాశాన్నతిక్రమించి కాలానికి అతీతంగాపోయి చివరకి మన గమ్యాన్ని చేరినపుడు ఈ ప్రపంచం కొంచెంకూడ దృష్టి గోచరంకాదు. అక్కడ సర్వాతీతమై ఒప్పే ఆత్మ విభూతిమహాసముద్రంలో ఈ బ్రహ్మాండమే ఒక చిన్నచుక్కగా కనిపిస్తుంది! “బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య; మీ ఐశ్వర్యమంతా బుగ్గి, మీ బలమంతా క్షుద్రం; జీవితం దుఃఖమయం” అని మతం చెబుతుంది. కాబట్టే అది సత్యమైంది! వైరాగ్యాన్ని ఉపదేశించి యుగయుగాలనాటి దివ్యజ్ఞానాన్ని బోధిస్తుంది కాబట్టే మన మతాన్ని సత్యమనడం! మన ప్రాచీనులు సాధించిన ఆధ్యాత్మిక పరిణతికి, ప్రజ్ఞానరాశికి వారసులమైన మనతో పోల్చిచూస్తే ఇతర జాతులు నిన్నమొన్నటి పసిబిడ్డలు! వాళ్ళను చూచి “ఓ బిడ్డలారా! మీరు ఇంద్రియదాసులు. ఇంద్రియభోగాలు అశాశ్వతాలు; ఆత్మ వినాశకరాలు. వాటి మూడునాళ్ళ ముచ్చట చివరకు మిమ్మల్ని భ్రష్ఠులను చేస్తుంది. దాన్ని వదలండి; ఇంద్రియలోలులు కాకండి! ప్రపంచాన్ని పరిత్యజించండి!” అని హైందవ మతాదర్శం ఎలుగెత్తిచాటుతోంది. పరమార్థాన్ని చేరేత్రోవ వైరాగ్యమే కాని, భోగం కాజాలదు. కాబట్టి మనదొకటే నిజమైన మతం.
జాతుల తర్వాత జాతులు ఈ ప్రపంచ నాటకరంగం పైకి వచ్చి కొద్ది నిమిషాలు తమ విధిప్రకారం చక్కగానే నాట్యంచేసి చివరికి రూపుమాసిపోతున్నాయి. ఈ మహాకాలమనే సముద్రంలో తమ జాడచూపడానికై చిన్న అలను సైతం, నిలుపజాలక అవి మృతి చెందుతున్నాయి. అలాంటప్పుడు ఇదిగో మనం చిరంజీవులై మెలగుతుండటం ఒక విచిత్ర విషయం కాదా? “అర్హులైన వారే జీవిస్తారు” అని పరిణామ సిద్ధాంతాలను గూర్చి, వారు ఏమేమో అంటారు. కండరాల బలమే అర్హతనిచ్చి నిత్య జీవమిస్తుందని వారి అభిప్రాయం! ఇది నిజమే అయితే యోధాగ్రేసరమని విఖ్యాతి పొందిన ప్రాచీన జాతులలో ఒక్కటైనా ఈనాడు సజీవమై, వైభవోపేతమై ఉండవలసింది కదా? ఒక్క ఇతర జాతిని కానీ, ఉపజాతినికాని ఎన్నడు జయించి ఎరుగని దుర్బల భారతజాతి ఇప్పటికే నిర్జీవమైపోయి ఉండవలసింది కదా? కానీ మనమిప్పటికే ముప్ఫయికోట్ల జనసంఖ్య కలవారం. (ఒక ఆంగ్లయువతి నన్ను చూచి “మీ హిందువులు ఏమి ఘనకార్యాలు చేయగల్గారు? ఒక చిన్నజాతినైనా జయించలేదే?” అని ప్రశ్నించింది.) అది పోనిండు, మన జాతి బలమంతా ఉడిగి, సర్వాంగవాతంతో ఊరికే పడివుందని చెప్పడం సత్యం ఎంత మాత్రమూ కాదు. మనలో కావలసినంత చైతన్యముంది; కాలం పండి; అవసరమైనప్పుడు అది ప్రళయ సముద్రంలాగా పొంగి పొరలి జగత్తును ముంచివేయగలదు.
అతిప్రాచీనకాలం నుండికూడ, ఈ సత్యాన్ని మనం ప్రకటిస్తూనే ఉన్నాము. మనిషి ఎంత ఎక్కువ సంపదను సమకూర్చుకోగలడనే సమస్యను పాశ్చాత్యప్రపంచం పరిష్కరించాలని చూస్తూండగా ఇక్కడ భారతదేశంలో నరుడు ఎంత తక్కువతో జీవించగలడు? అనే సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాం. ఈ పోరాటంతో శతాబ్దాలు గడవవలసిందే; ఈ విభేదం సదానిలిచివుండేదే. “ఆత్మనిగ్రహ సాధనపూని మిత భోగులైనవారు చివరికి జయశీలురై జీవిస్తారు. సుఖాభిలాషులై, భోగమగ్నులు తాత్కాలికంగా ఎంత జవసత్త్వాలు కలవారుగా పైకి కనిపించినా చివరికి నశించవలసిన వారే. వారి వంశాలు త్వరలోనే అంతరిస్తాయి” అని చరిత్ర గుణపాఠం నేర్పుతోంది. వ్యక్తి జీవితంలోనూ, సంఘజీవితంలోనూకూడా ప్రాపంచిక భోగాలపై రోత కలిగే సమయాలు వస్తూనే ఉంటాయి. అలాంటభోగవిముఖత ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచంలో వ్యాప్తిచెందుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడా జిజ్ఞాసువులున్నారు; వారూ మహనీయులే. అధికారానికి, ఐశ్వర్యానికి ఆశపడి పరుగెత్తటం, వ్యర్థపు పనులలో, వ్యర్థపుపని అని వారూ కనుగొంటున్నారు. అలాంటి బుద్ధిశాలురలో చాలామంది స్త్రీలు, పురుషులుకూడ పోటీలన్నా, పోరాటాలన్నా వ్యాపార నాగరికత తెచ్చిపెట్టే ద్వేషాలన్నా వెగటు చెందుతున్నారు. వాటిని తొలగించుకొనే ఉపాయాన్ని అన్వేషిస్తున్నారు. యూరప్‌లోని అనర్థాలన్నిటినీ తొలగించడానికి రాజకీయ, సాంఘిక పరివర్తనకీ ఉపకరిస్తాయని వానినే పట్టుకొని ప్రాకులాడేవాళ్ళున్నారు. అయినా ఉత్తమాలోచనాపరులు ఇతర మార్గాలకై వెదకుతూనే ఉన్నారు. ప్రజలను రాజకీయంగా, సాంఘికంగా ఎన్ని రీతుల క్రిందుమీదులు చేసినా అనర్థాలెన్నడూ తొలగజాలవని వీరు గ్రహించారు. హృదయం మారి యోగ్యతరమైతే తప్ప, జీవితానర్థ దశలు తొలగవు. ఎంత బలాత్కరించినా ఎంతటి రాజకీయాధికారాలు చెలాయించినా, ఎన్ని క్రూరశాసనాలు చేసినా జాతి పరిస్థితి చక్కబడజాలదు. ఆధ్యాత్మిక చింతనం, నైతికశిక్షణం మాత్రమే జాతిని సన్మార్గంలో పెట్టి సంస్కరించగలుగుతాయి. అందువల్ల ఈ పాశ్చాత్య జాతులవారు ఏదేని కొత్త భావవైఖరిగాని, ఏదేని నూతన తత్త్వమార్గంకానీ దొరుకుతుందేమో అని ఆత్రపడుతున్నారు. వారు అవలంబిస్తున్న క్రైస్తవ మతం చాలావరకు శుభప్రదం, మహిమాన్వితం అయిందే. కాని దానిని వారు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఇంతవరకు వారు అర్థం చేసుకొన గల్గిన విధానాన్నిబట్టి ఆ మతం అసమర్థమైందని తేలింది. పాశ్చాత్యులలో జిజ్ఞాసువులైన బుద్ధిమంతులు, ఏ నూతన భావస్ఫురణకై పరితపిస్తున్నారో, ఆధ్యాత్మిక క్షుత్పిపాసలను (ఆకలి దప్పులు) తీర్చగల ఏ ఆహార పానీయాలకోసం ఆరాటపడుతున్నారో అవన్నీ మన ప్రాచీన తత్త్వశాస్త్రంలో, ముఖ్యంగా వేదాంత సిద్ధాంతంలో లభిస్తున్నాయి. ఇలా జరగటంలో ఆశ్చర్యమేమీ లేదు.
లోకంలో ప్రతి మతానికి నానావిధాలైన చిత్రవిచిత్ర ప్రభావాలున్నాయని ప్రచారం చేయడం నాకు తెలుసు. క్రైస్తవ మతమొక్కటమాత్రమే విశ్వశరణ్యమైనదనీ, విశ్వజనీన మతమనీ నా స్నేహితుడు, డాక్టర్ బారోస్ చాటిచెప్పడం మొన్నమొన్ననే అందరూ వినే ఉన్నారు కదా? ఈ విషయాన్ని కొంచెం విమర్శనాదృష్టితో విచారించిన తర్వాత వేదాంతమతం మాత్రమే విశ్వజనీనమతంగా వెలయగలదనీ ఇంక ఏ ఇతర మతానికీ అలాంటి యోగ్యత లేదని నాకు గట్టిగా తోచింది. దానికి కారణాలు ఏవో మీకు చెబుతాను. ఒక్క మన మతం తప్ప ప్రపంచంలోని గొప్పమతాలు ఇంచుమించుగా అన్నీ ఆయా మతస్థాపనాచార్యుల జీవితాలతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వారి మత సిద్ధాంతాలు, మతోపదేశాలు, మత బోధలు, నీతిశాస్త్రాలు అన్నీ ఆయా మతస్థాపకుని జీవితాన్ని ఆధారం చేసుకొని నిర్మించబడినవే! ఆ పురుషునిబట్టే అవి ఆమోదం పొందుతున్నాయి; ఆ మహాత్ముని వలననే వాటికి గొప్ప మహిమ కలుగుతోంది; ఆ ప్రముఖుని ఆధారం చేసుకొనే అవి ప్రమాణాలవుతున్నాయి. ఈ విధంగా మతస్థాపకుల, చారిత్రక పురుషుల అనుభవమే పునాదిగా అనేక మత భవనాలు నిర్మించబడటం చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యమవుతోంది. ఆ మతకర్తల జీవిత వృత్తాంతాలలో దాదాపు సగభాగంకూడ ఈ కాలంలో నమ్మేవారుండరు; తక్కిన సగంకూడ సందేహంతో చూస్తారు. ఆధునిక పరిశోధనలవల్ల అలాంటివారి జీవితోదంతాలు కొన్ని చారిత్రక సత్యాలు కావని సులభంగా రుజువు చేయవచ్చు. ఆ దెబ్బతో వారి ‘చారిత్రక సత్యాలన్నీ’ పుక్కిటిపురాణాలై వారి రాతి పునాదులన్నీ వట్టి ఇసుకతిప్పలై, వారు కట్టుకొన్న భవనమంతా శిథిలమై నేలకూలుతుంది; ఇక మళ్ళీ ఎన్నడూ పూర్వస్థితికి రాజాలదు.
మన మతమొక్కటి తప్ప ప్రపంచంలోని ప్రతి మతమూ అలాంటి ఒకానొక చారిత్రక పురుషునిపై ఆధారపడి పైకివచ్చిందే! ఇక మనదో ధర్మసూత్రాలపై ఆధారపడి ఉంది. వేదాలను తాను సృష్టించానని చెప్పుకోగల స్త్రీగాని, పురుషుడుగానీ లేడు. “వేదములు” అంటే సనాతన సత్యాల జ్ఞానరాశి. ఋషులు ఆ సత్యాలను చూశారు. అప్పుడప్పుడు ఈ ఋషుల పేర్లు, పేర్లు మాత్రమే పేర్కొనడం కద్దు. వారు ఎవరో ఎటువంటివారో కూడ మనకు తెలీదు. చాలామంది ఋషుల విషయంలో వారి తల్లిదండ్రులు ఎవరైందీ తెలియడంలేదు. ఏ ఋషి జన్మదినంగానీ, జన్మస్థానంగాని తెలీనే తెలీదు. ఈ ఋషులకు తమ పేరు ప్రతిష్ఠల గొడవ పట్టనేలేదు. వారు ధర్మబోధనుమాత్రం చేసివెళ్ళారు. తాము బోధించిన ధర్మాలకి తామే నిదర్శనాలుగా జీవించడానికి తమ చేతనైనంతవరకు ప్రయత్నించారు. మన భగవంతుడు నిర్గుణుడైనా, సగుణుడుగాకూడా ఉండే విధంగా మన మతంకూడా అపౌరుషేయమైనదైనా (అంటే పురుషులపై కాక, ధర్మసూత్రాలపై ఆధారపడినదైనా) పురుష ప్రచారానికికూడ అపారమైన అవకాశమిస్తోంది. ఎలాగంటే ఇన్ని అవతారాలను, ఇందరు ప్రవక్తలను, ఋషులను మనకిచ్చినా ఇంకా అలాంటివారి రాకకోసం నిరీక్షిస్తూ ఉండే మతం ఇంకొకటి ఉందా? అవతారాలు అనంతాలనీ, మీరు కోరినంతమంది రావడానికి ఇంకా అవకాశముందనీ భాగవతం చెబుతోంది. కాబట్టి మన మత చరిత్రలో పేర్కొనబడిన మహాపురుషులలో అవతారాలలో, ప్రవక్తలలో, ఎంతోమంది చరిత్ర పరిశోధనవల్ల నిజమైన వ్యక్తులుకారని రుజువైనప్పటికీ మన మతానికి ఇసుమంత హానికూడ కలుగదు. అది ధర్మాలపై ఆధారపడిందే కానీ, వ్యక్తులపై ఆధారపడింది కాకపోవడంచేత, సర్వకాలాల్లో సుస్థిరమై నిలువగలదు. ప్రపంచంలోని జనులంతా ఏ ఒక్క పురుషుణ్ణో అనుసరించేలా కృషి సలపడం కేవలం వ్యర్థం. వారినందరిని సనాతనం, విశ్వజనీనం అయిన ధర్మాలను అనుసరించేలా చేయడంకూడ దుస్సాధ్యమే. కాని ఏనాటికైనా ఈ జనులలో ఎక్కువ భాగాన్ని ఒక్క భావవైఖరికి తేగలిగితే అది ధర్మసూత్రాల మూలంగానే సంభవంకానీ పురుషుల మూలంగా కాదు. అయినా మన మతంలో వ్యక్తుల పలుకుబడికీ, అధికారానికీ చాలా అవకాశం ఉందని ఇప్పటికే చెప్పాను. ఈ మహాత్ములలోనుండి మన ఇచ్ఛానుసారం ఏర్చితీసికొనే అవకాశం కలిగించే ‘ఇష్టదైవ’ మనే అత్యద్భుత సిద్దాంతమొకటుంది. నీకు గురువుగా, నీకు పూజార్హుడుగా ఈ ప్రవక్తలలో నుండికానీ, ఉపదేశకులలో నుండికానీ, ఎవరినైనా నీ ఇష్టప్రకారం ఎన్నుకోవచ్చు. నీవు ఎన్నుకొనిన వ్యక్తే ప్రవక్తలలో అగ్రగణ్యుడనీ, అవతారాలలో పరమపూజ్యుడనీ భావించే అవకాశంకూడ నీకున్నది. దానివల్ల ఏ హానీ లేదు. కానీ దీనికంతకు వెనుక, మూలాధారంగా సనాతన సత్యధర్మ సిద్ధాంతాలను నిలుపుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఒక విచిత్రవిషయం గమనార్హం. మన వేద ధర్మాలకు నిదర్శనంగా ఉండేంతవరకే మన అవతారాలను మనం ప్రమాణాలుగా పాటిస్తున్నాం. మన సనాతన వైదిక మతధర్మాలను ఉపదేశించిన ఉత్తమ గురుడు భారతదేశంలో పుట్టిన వేదాంత వ్యాఖ్యాతలలో ప్రథమగణ్యుడు కావడంచేత శ్రీకృష్ణుని మహిమ ఇంతగా ప్రకాశిస్తోంది.
వేదాంతం అత్యధికంగా ప్రపంచదృష్టిని ఆకర్షించడానికి రెండో కారణం ఇది – బాహ్యప్రకృతి పరిశీలనకు పూనిన ఆధునికశాస్త్రాలు ఇంతవరకు కనిపెట్టిన విషయాలకు, ప్రతిపాదించిన సిద్ధాంతాలకు మన వేదాంత సూత్రాలన్నీ అనుగుణంగా ఉన్నాయి. ఇది అద్భుతమైన విషయం. ప్రపంచంలోని ఏ మతశాస్త్రంలోను, ఆధ్యాత్మిక, భౌతిక సిద్ధాంతాలకు మధ్య ఇట్టి సామరస్యం కనిపించదు. అస్పష్టమైన ప్రాచీనకాలంలో ఆకారమందు, అనుభూతిలో చిత్తాకర్షణలో అక్క చెల్లెండ్లలాగా ఉన్న రెండు భావనాసంప్రదాయాలు బయలుదేరి రెండు భిన్నమార్గాలను అవలంబించాయి. అందులో ఒకటి ప్రాచీన హైందవ సంప్రదాయం; రెండవది ప్రాచీన గ్రీకు సంప్రదాయం. ఇందులో మొదటిది ఆంతరంగిక ప్రపంచాన్ని పరిశోధించడంతో ప్రారంభమైంది. రెండవది బాహ్య ప్రపంచ పరిశోధనతో ప్రారంభమైంది. అయినా రెండూ సర్వాతీతమైన ఒక్క పరమార్థాన్నే అన్వేషించాలని బయలుదేరాయి. వీనికి వాటిల్లిన వివిధ దశాంతర చరిత్రలను పరిశీలిస్తూపోతే ఈ రెండు భావవాహినులు ఆ పరమగమ్యాన్ని గూర్చి ఒక్క విధమైన శ్రుతిలోనే గానం చేసినట్లు మనకు తెలుస్తుంది. నూతన భౌతికశాస్త్ర సిద్ధాంతాలు, హిందువుల వేదాంతమత సిద్ధాంతాలతో మాత్రమే సామరస్యాన్ని పొందగలవని స్పష్టంగా కనిపిస్తోంది. పాశ్చాత్యుల భౌతికవాదం తన ప్రత్యేకతను తాను నిలుపుకొంటూనే వేదాంత ధర్మసిద్ధాంతాలను అంగీకరించడంవల్ల పరమార్థాన్ని చేరగలుగుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ నవీన శాస్త్రసిద్ధాంతాలను యుగయుగాంతరాలకు పూర్వమే మన వేదాంతులు దర్శించారని మనకు – మనకు అనడమెందుకు – కన్నులు తెరచి సత్యాన్ని చూడగోరేవారికందరికీ తెలుస్తుంది. కాని భాషలో ఈ రెంటికి భేదముంది. నవీన శాస్త్రాలలో ఆ సిద్ధాంతాలు జడ ప్రకృతిపరంగా చెప్పబడివుండగా, వేదాంతంలో అవి ఆధ్యాత్మికపరంగా ప్రతిపాదించబడి ఉన్నాయి. వేదాంతం, పాశ్చాత్య జిజ్ఞాసువులను ఆకర్షించడానికి మరొక కారణంకూడ ఉంది. అది దాని అద్భుత తార్కికదృష్టి. వేదాంతంలోని సిద్ధాంతాలు ఎంతో యుక్తియుక్తంగా ఉన్నాయని కొందరు పాశ్చాత్య భౌతికశాస్త్ర పండితులు నాతో స్వయంగా చెప్పారు. నాకు తెలిసిన అటువంటివారిలో ఒకనికి భోజనం చేయడానికి తన పరిశోధనాలయం వదలి, వెలుపలికి పోవడానికి కూడ సరిగ్గా తీరిక దొరకదు. అయినా అతడు వేదాంతాన్ని గూర్చిన నా ఉపన్యాసాలను వినడానికై గంటలకొలదికాలం, నిలబడి వినేవాడు. దీనికి కారణం నా ఉపన్యాసాలు సమంజసంగా వుండి, ఈ యుగజనుల మహాశయాలతోను, నేటి విజ్ఞానశాస్త్ర పరిశోధనా ఫలితాలతోను చక్కగా సమన్వయపడటమే అని ఆయన నాకు చెప్పాడు.
ఇక వివిధ మతాలను తులనాత్మకంగా పరిశీలించడంవల్ల తేలిన సిద్ధాంతాలను రెంటిని మీకు ముఖ్యంగా తెలుపగోరుతున్నాను. ఒకటి, మతాలన్నీ విశ్వజనీనాలే అనే భావానికీ, రెండోది – సమస్త వస్తువులు ఒకే పదార్థం మార్పులే అనే భావానికి సంబంధించినవి. బాబిలోనుల, యూదుల చరిత్రలు పరిశీలిస్తే వారి మతానికి సంబంధించిన ఒక విషయం మనకు గోచరిస్తుంది. ఈ బాబిలోనుజాతి, యూదియాజాతి ఒక్కొక్కటి చాలా ఉపజాతులుగా విడిపోయి ఉన్నాయి. వాటి ప్రతి ఉపజాతికి ఒక ప్రత్యేక దేవత ఉంటుంది. ఈ చిన్నచిన్న ఉపజాతి దేవతలకు సామాన్యంగా ఒక్క జాతీయ నామమే వాడటం కద్దు. బాబిలోన్ జాతీయుల దేవతలను ‘బాలులు’ (బాల్స్) అంటారు. వీనిలో ‘మెరోడాక్ బాల్’ ప్రధానదైవం. కాలక్రమాన ఈ పెక్కు ఉపజాతులలో ఒకటి ఇతర ఉపజాతులను జయించి, తనలో ఇముడ్చుకొంటుంది. తత్ఫలితంగా ఈ జయశాలిని అయిన ఉపజాతి దేవత తక్కిన ఉపజాతి దేవతలందరి మీద అధికారిణి అవుతుంది. బాబిలోన్జాతి సగర్వంగా తమలో ఉందని చెప్పుకొంటున్న ఏకేశ్వరారాధన ఈ విధంగానే ఏర్పడింది. యూదుల దేవతలకు ‘మోలక్’ అనేది సామాన్య నామం. వీరిలో ‘ఇస్రాయేల్’ అనబడే ఉపజాతికి చెందిన ‘మోలోక్’ నకు ‘మోలోక్యవా’ లేదా ‘మోలోక్ యహ్వా’ అని పేరు. కాలక్రమాన ఇస్రాయేల్ అనబడే ఉపజాతి తక్కిన ఉపజాతులను జయించి వారి ‘మోలోకు’ లను నాశనం చేసి, తమ ‘మోలోక్’ ను అన్నిటిలో చాలాశ్రేష్ఠమని ప్రకటించింది. మతంపేరిట చేయబడిన ఈ యుద్ధంవల్ల ఎంతటి రక్తపాతం, ఎంతటి పరహింస, ఎంతటి ఘోరదౌర్జన్యం కలిగాయో మీరు సులభంగా ఊహించుకోవచ్చు. ఆ తర్వాత కొంతకాలానికి ‘మోలేక్ యహ్వా’ ఆధిపత్యాన్ని నాశం చేయాలని, బాబిలోన్జాతివారు ప్రయత్నించారు. కాని విజయం పొంద లేకపోయారు.
మతవిషయాలలో ఆధిక్యంకోసం ఇట్టి ఉపజాతి యుద్దాలు హిందూదేశపు సరిహద్దుల్లోకూడ జరిగివుంటాయని నాకనిపిస్తోంది. ఇక్కడకూడ ఆర్యులలోని ఆయా ఉపజాతులవారు తమ తమ దేవతలను శ్రేష్ఠులుగా ప్రకటించడంకోసం తమలో తాము యుద్ధాలు చేసే ఉంటారు. కాని హిందువుల చరిత్ర యూదుల చరిత్రవంటిది కాక వేరొక రూపం పొందవలసివుంది. అన్ని దేశాల్లో, భారతదేశమొక్కటే శాంతి భూమి, ఆధ్యాత్మికక్షేత్రం అయి భావికాలంలో ప్రకాశించవలసి ఉండటంచేత, ఆ ఉపజాతుల పోరాటాలు, వారి దేవతల యుద్దాలు చిరకాలం సాగలేదు. ఇంతవరకు ఈ భూమిమీద పుట్టిన మహర్షిశ్రేష్ఠులలో శ్రేష్ఠుడు. అతిప్రాచీనకాలంలోనే, చరిత్రకు తెలియని ఆ అజ్ఞాతయుగంలోనే, యుగయుగాలుగా వస్తున్న సంప్రదాయాలు సైతం ఊరకతొంగి చూడటానికైనా సాహసించని ఆ చీకటి ఆవరించిన కాలారంభంలోనే. ఈ కర్మభూమిపై ప్రభవించి “ఏకం సత్, విప్రాబహుధావదంతి” (ఉన్నదొక్కటే, దానిని జ్ఞానులు అనేకవిధాలుగా పేర్కొంటున్నారు) అని ప్రవచించాడు. మానవ ముఖత ఇంతవరకు బహిర్గతమైన వాక్యాలలో ఇంత ఉదాత్తమైనది మరొకటి లేదు. మన హైందవ జాతీయ జీవితానికి ఈ సత్యమే మూలాధారంగా నిలిచి ఉంది. మన జాతీయ జీవితంలో అనేక శతాబ్దాలుగా ‘ఏకం సత్ విప్రాబహుధా వదంతి’ అనే మహాభావం పరంపరగా వస్తున్నది. అది విస్తరించి మన జాతీయ జీవితాన్నంతా ఆవరించింది; మన రక్తంలో ఇంకిపోయింది; మనతో సారూప్యాన్ని పొందింది. ఆ మహాసత్యం మన ప్రతి రక్తనాళంలోను ప్రవహిస్తూ ప్రియం కలిగిస్తోంది. అందువల్లే మనదేశం మత సహనానికి పట్టుకొమ్మై లోకవిఖ్యాతి నార్జించింది; మన మతాన్ని ఖండించి నాశనం చేయడానికి వచ్చిన అన్యమతాలకు మసీదులను, చర్చీలను మన సంస్కృతి నిర్మించి ఇచ్చింది ఇక్కడే, ఈ దేశంలోనే! లోకం మననుండి నేర్చుకోవడానికి నిరీక్షిస్తున్న మహాధర్మసూత్రం ఇదే, అబ్బా! దేశాంతరాలలో ఎంతటి అసహనముందో మీకు తెలీదు! ఈ మతద్వేషం కారణంగా, నా ప్రాణాలను పరాయిదేశాల పాలు చేయవలసి వస్తుందని నా కనేక పర్యాయాలు తోచింది. మతం పేరిట సోదరుని వధించడం, వారికి చాలా చిన్న విషయం. ఈనాడు, వారొకవేళ ఇలాంటి నరహత్యలకు తలపడకున్నా రేపు పాశ్చాత్య నాగరికతా కేంద్రమైన మహాపట్టణ నడివీథుల్లోనే వారా పని చేయవచ్చు. పాశ్చాత్య దేశాలలో ఎవ్వడైనా తమదేశం అంగీకరిస్తే మతానికి విరుద్ధంగా ఒకమాట పలికాడో మహాభయంకరమైన బహిష్కారాయుధం వానినెత్తిమీద పడిందన్నమాటే! వారు మన కులాచారాలను విమర్శిస్తూ ధారాళంగా చొరవగా వానిని ఖండిస్తారు. కాని పాశ్చాత్యదేశాల్లోని మహాపండితాగ్రేసరులు సైతం ప్రజాభిప్రాయానికి భయపడి మత విషయాలలో తాము సత్యమని నమ్మేదానిలో నూరవభాగమైనా బయటపెట్టడానికి సాహసించక, వట్టి పిరికిపందలలాగా పడివుంటారు. నాలాగా ఆ దేశాలకుపోయి కొంతకాలం నివసిస్తే మీకు ఈ విషయం స్పష్టమౌతుంది.
కాబట్టి లోకవ్యాప్తంగా మతసహన ధర్మం, ప్రతిష్ఠించాలని ప్రపంచం ఆరాటపడుతోంది. అది నాగరికతకే ఒక మహావరప్రసాదం! ఈ భావాన్ని గౌరవించని నాగరికత చాలాకాలం నిలువజాలదు. మూర్ఖావేశం, రక్తపాతం, దౌర్జన్యం ఆగిపోకుంటే ఏ నాగరికతకూడ అభివృద్ధి పొందదు. మనపట్ల ఇతరులు ఔదార్యాన్ని మనం చూపకోరితే, ఇతరుల మత విశ్వాసాలపట్ల సహనం, ఔదార్యం, దాక్షిణ్యం ముందు మనం చూపాలి! ఇంతేకాదు ఇతరుల మతవిశ్వాసాలు, భావాలు ఎంత వేరుగా ఉన్నా, వారి యెడల సహనం చూపడమే కాక, ప్రత్యక్షంగా, హృదయపూర్వక సహకారాన్ని సైతం ఇవ్వాలని ప్రపంచ ప్రజలంతా గ్రహించాలి! భారతదేశంలో మనం చేస్తున్నది సరిగ్గా అదే. ఇక్కడే ఈ భారతదేశంలోనే క్రైస్తవులకు చర్చీలను, మహమ్మదీయులకు మసీదులను కట్టిపెట్టాం; ఇంకా కట్టిపెడుతున్నాం. మనం చేయవలసిందదే. వారెంతగా ద్వేషించినా, ఎంత దౌర్జన్యం చూపినా, ఎంత క్రూరులై వర్తించినా, ఎంతగా ద్రోహం చేసినా ఎంతటి దూషణవాక్యాలు పలికినా, మనంమాత్రం ప్రేమ చేతనే వారిని జయించాలి! తక్కినవన్నీ జారిపోయినా ప్రేమమాత్రం చివరి వరకు నిలిచివుంటుంది; ద్వేషం నిలువజాలదు. సాధువర్తనమే చిరకాలం జీవించి ఫలప్రదం కావడానికి తగిన శక్తికలది. దౌర్జన్యానికి, హింసకు అలాంటి శక్తిలేదు. ఈ సత్యాన్ని ప్రపంచానికి మనం రుజువుచేసి చూపేవరకు క్రైస్తవులకు చర్చీలను, మహమ్మదీయులకు మసీదులను కట్టిపెడుతూనే ఉండాలి.
ఆధ్యాత్మిక దృష్టితో చూచినా ఈ జగత్తంతా ఏకపదార్థ వికారమే అనే సనాతన దివ్యభావమే ప్రపంచం మననుండి నేర్చుకోవలసిన రెండవ భావం. ఉన్నత జాతులకంటె నిమ్నజాతులవారు సభ్యజనులకంటె, సామాన్యజనులు, చదువరులకంటె, చదువురానివారు బలశాలులకంటె, బలహీనులు ప్రపంచమందంతా, దీన్ని ఎక్కువగా కోరుతున్నారు. పాశ్చాత్యుల నూతన శాస్త్రపరిశోధనలు స్థూల సాధనలద్వారా విశ్వమంతా ఒక్కటిగా, అఖండంగా ఉందని రుజువు చేస్తున్నట్లు మదరాసు విశ్వవిద్యాలయ పట్టభద్రులకు, విద్యార్థులకు, నేనీనాడు చెప్పనక్కరలేదు కదా? స్థూలదృష్టితో మాట్లాడితే మీరు, నేను, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, జడ ద్రవ్యమనే ఒకానొక అఖండసముద్ర మధ్యంలో చిన్నచిన్న అలలనే చెప్పాలి! ఇట్లే ‘శరీరం’, ‘మనస్సు’ అనేవి సైతం ఆ సమిష్టి మహాసముద్రంలోని చిన్నఅలలకు పెట్టిన పేర్లు మాత్రమే అని భారతీయుల వేదాంతశాస్త్రం చాలాయుగాలకు పూర్వమే రుజువు చేసింది. ఈ వేదాంతం అడుగు ముందుకు వెళ్ళి ఒకటిగా కనిపించే ఈ విశ్వమంతటికి వెనుక అద్వితీయమై, సర్వాధారమైన ఒక సత్యాత్మ ఒప్పుతోందని ప్రకటించింది. ఈ జగత్తంతటా విస్తరించి ఒక్క పరమాత్మమాత్రమే ఉంది. “ఏకమే వా ద్వితీయం” – ఈ విశ్వమంతా సత్యమైన తాత్త్వికదృష్టిలో అభిన్నమే అనే మహాభావం ఈ దేశంలోకూడ చాలామందిని భయపెడుతోంది. ఈనాడు సైతం దీన్ని ఆమోదించేవాళ్ళకంటె నిరాకరించే వారే ఎక్కువమంది ఉన్నారు. అయినప్పటికీ ప్రపంచం ఈ దివ్యభావంకోసమే పరితపించిపోతోంది; భారతదేశపు నోరులేని ప్రజలు, తమ్ము ఉద్ధరిస్తారని దీనిపై ఆశాదృక్కులు ప్రసరిస్తున్నారు. ఈ సిద్ధాంతాన్ని దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టడంతప్ప ఈ దేశాన్ని పునరుద్ధరించడానికి మరొక మార్గంలేదు.
తర్కించే స్వభావం కలవారైన పాశ్చాత్యులు తమ తత్త్వసిద్ధాంతాలు, నీతిసూత్రాలు ఎంతవరకు తర్కసంబద్ధంగా, యుక్తియుక్తంగా ఉన్నాయో కనుక్కోవడానికి ఇప్పుడు గట్టిగా పూనుకొన్నారు. ఒక పురుషుడు ఎంతటి ఘనుడైనా ఎంతటి మహాత్ముడైనా వాని ఒక్కని ఆమోదం పొందిన మాత్రాన నీతిశాస్త్రానికి పరమ ప్రామాణ్యం కలుగబోదని మీకందరికీ తెలుసు. నీతిసూత్రాలకు ఏ ఒక్కని ప్రమాణంగా చూపిన మాత్రాన ప్రపంచంలోని ఉత్తమ ఆలోచనాపరులెవ్వరూ అంగీకరించజాలరు. తమ నీతిసూత్రాలకు, ధర్మశాస్త్రాలకు ప్రామాణ్యాన్ని సమకూర్చుడానికి మానవుని అంగీకారంకంటె, గొప్పదేదో ఇంకొకటి ఉండితీరాలని వారు కోరుతారు. నీతిశాస్త్రానికి ప్రమాణంగా ఏదైనా సనాతన ధర్మసూత్రం కావాలని వారు అభిలషిస్తారు. సరే! నీలోను, నాలోను, అందరిలోను, ఆత్మలోను, జీవునిలోను నిండివున్న ఆ అఖండ బ్రహ్మంకంటె సర్వోత్తమ ప్రమాణం ఇంకేముంటుంది? ఆత్మయొక్క అఖండ అద్వితీయత్వమే సమస్త నీతి ధర్మానికీ, శాశ్వతాధారమై ఒప్పుతోంది. మీరు, నేను సోదరులమని మాత్రమే భావించడం చాలదు. మీరును, నేనును వేరుకాక నిజానికి ‘ఒక్కరమే’ అని తెలుసుకోవాలి. హిందూ తత్త్వశాస్త్రం ఇదే చెబుతోంది. ఈ అద్వైతభావమే సమస్త నీతులకు, సర్వపారమార్థిక సిద్ధాంతాలకు పునాది. పరతంత్రమై కృశించిపోతున్న ఈ భారతదేశమే కాక, యూరప్ ఖండం సైతం ఈనాడు అద్వైతాన్ని కోరుకొంటోంది. ఈ దివ్యసూత్రం బాగా ప్రస్ఫుటంకాకున్నా ఇంగ్లాండు, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికాలలో తలెత్తుతున్న నూతన రాజకీయ సాంఘికోద్యమాలకు మూలకారణమై ఉంది. మిత్రులారా! నా మాటలను గమనించండి! స్వాతంత్ర్యంకోసం, సర్వమానవ విముక్తికోసం మానవజాతి చేసే తీవ్రప్రయత్నాలను వివరించే వాఙ్మయమునందంతటా, భారతీయ వేదాంతదర్శాలు ప్రస్ఫుటమై కనిపిస్తున్నాయి. కొందరు గ్రంథకర్తల విషయంలో వారి ఆంతర్య ప్రేరణకు ఆధారమేమో వారికే తెలీదు. మరికొందరు తామేదో అపూర్వకల్పన చేసినట్లు, స్వతంత్ర ప్రజ్ఞ ప్రకటించినట్లు నటించాలని చూస్తున్నారు. కాని ఆ మూలాధారాన్ని ప్రకటించి దానికి తమ కృతజ్ఞతను తెలుపుకొన్న ఉచితజ్ఞులు కొందరు లేకపోలేదు.
అమెరికాలో ఉన్నప్పుడు నేను అద్వైతాన్నే అత్యధికంగా, ద్వైతాన్ని చాలాకొంచెంగా బోధించాననే ఆక్షేపణ ఒకసారి విన్నాను. పూజా సంసేవనాపరమైన ద్వైతభక్తి సిద్ధాంతాల్లో ఎంతటి మహిమవుందో, ఎంతటి భక్తి రాసులున్నాయో అనుభవాన్నిబట్టి నేనెరుగుదును. కానీ అట్టి ఆనందంలోనైనా కన్నీళ్ళు విడువడానికి మనకిది సమయంకాదు. ఇదివరకే కావసినంత కన్నీరు కార్చాం. మెత్తదనం చూపడానికి మనకింక అవకాశం లేదు. మనం దూదిపింజలలాగా మెత్తబడి, ప్రాణాలు సైతం కోల్పోయే వరకు, ఈ మెత్తదనం మనల్ని వెంటాడి వచ్చింది. మనదేశానికి ఇప్పుడు కావలసింది అడ్డులేని ఇనుపకండరాలు, ఉక్కునరాలు, వజ్ర సంకల్పం! మహాసముద్రంలో అట్టడుగునకు మునుగవలసివచ్చినా, ముఖాముఖీ మరణంతో పోరాడవలసివచ్చినా జంకక ఏ రీతిగానైనా జగద్రహస్యాలన్నీ ఛేదించగలది దృఢసంకల్పం! మనకిప్పుడు కావసిందదే. అద్వైతాదర్శాన్ని, అంటే అంతా ఏకమనే భావాన్ని అర్థంచేసుకొని అనుభవానికి తెచ్చుకోవడం ద్వారా అభేద్యములైన దైహిక, మానసిక శక్తులను సాధించడమే మనకిప్పుడు కర్తవ్యం. విశ్వాసం! విశ్వాసం!! ఆత్మవిశ్వాసం!! ఈశ్వరునిలో విశ్వాసం!! ఈ విశ్వాసమే ఔన్నత్యానికి కీలకం పురాణాల్లో చెప్పబడిన ముప్పయిమూడు కోట్ల దేవతల్లోను, అప్పుడప్పుడు విదేశీయులు వచ్చి మీ ఎదుట నిలబెట్టిన లెక్కలేని చిల్లర దేవతలన్నిటిలోను మీరు విశ్వాసముంచినా, మీలో మీకు విశ్వాసం లేకపోతే, అంటే మీకు ఆత్మ విశ్వాసం సున్నా అయితే ఇప్పుడేకాదు, ఎప్పటికీ మీకు ముక్తి లేదు, లేదు, లేదు. మీలో మీకు గాఢవిశ్వాసం కుదరాలి! ఆత్మవిశ్వాసంతో రొమ్ము విరిచి నిలబడాలి! అదే మనకిప్పుడు కావలసింది. మనం ఇద్దరమా? ముగ్గురమా? ముఫ్పైమూడు కోట్ల ప్రజలం కదా? ఏ పదిమంది పరదేశీయులో గడచిన వేయి సంవత్సరాలుగా దౌర్జన్యంతో, రాక్షసత్వంతో మనల్ని కాలరాచి మనపై ప్రభుత్వం చలాయించడం ఎలా జరిగింది? వారికి ఆత్మవిశ్వాసముంది! మనకు లేదు. ఇదే కారణం! పాశ్చాత్యదేశాల్లో నేను కనిపెట్టిన విషయమొకటుంది; మనిషి పతితుడై, నిరాశోపహతుడై, పరమపాపి అయిపోయాడని క్రైస్తవ మతబోధకులు ఎంత ప్రచారం చేస్తున్నా, యూరప్‌లోను, అమెరికాలోను వారి జాతీయ హృదయాంతరాళంలో మాత్రం ఆత్మవిశ్వాసంయొక్క మహాద్భుతశక్తి సుప్రతిష్ఠితమై ఉంది. ఇంగ్లండులో ఒక పనివాడు సైతం “నేను ఇంగ్లీషువాడిని, నేనేమైనా చేయగలను” అని మీతో సగర్వంగా చెబుతాడు. అమెరికాలో, యూరప్‌లో ఎక్కడైనా ఇంతే; వారికి ఆ ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, ఉగ్గుపాలతో వస్తాయి. ఇక్కడ మన బాలురో? కొత్తవారితో అసలు నోరువిప్పి మాట్లాడగలరా? లేదు లేదు. పోనీ బాలుర సంగతి అటుండనివ్వండి వారి తండ్రులుసైతం అలా పలుకగలరా? మనకు ఆత్మవిశ్వాసం పూర్తిగా లోపించింది. దాన్ని మళ్ళీ చైతన్యవంతం చేయాలి. అలా చేయగలిగింది అద్వైత సిద్దాంతమొక్కటే. మానవుల హృదయాలను మేల్కొలిపి, వారి ఆత్మప్రభావాన్ని వారికి తెలుపాలంటే వేదాంతంలోని అద్వైతపక్షాన్ని వాళ్ళకు బోధించడం ముఖ్యావశ్యకం. కాబట్టి నేనీ అద్వైతాన్ని బోధించాను. నేను పాక్షికం, సంకుచితంకాక, విశ్వజనీనం, అందరికీ అంగీకారం అయిన సిద్ధాంతాలను ఆధారం చేసుకొనే నా బోధలను సాగిస్తున్నాను.
ద్వైతికిగాని, విశిష్టాద్వైతికిగాని ఆక్షేపణ ఉండని సమాధాన మార్గాన్ని కనుగొనడం సులభమే. భగవంతుని దివ్యాంశం సమస్త వస్తువుల్లో వ్యాపించి ఉంటుందనే సిద్ధాంతం అంగీకరించని సంప్రదాయం ఒక్కటైనా భారతదేశంలో కనిపించదు. ప్రతి వేదాంత సంప్రదాయమూ పవిత్రత, పరిపూర్ణత, సత్యం, జీవాత్మలో పూర్తిగా ఉన్నాయని ఒప్పుకొంటోంది. కొందరి అభిప్రాయాన్ననుసరించి ఈ పరిపూర్ణత ఒక్కొక్కపుడు ‘సంకోచం’ పొందుతూ ఇంకొకప్పుడు తిరిగి ‘వికాసం’ పొందుతూ ఉంటుంది; కానీ అది ఎప్పుడు ఉండనే ఉంటుంది. అద్వైత మతానుసారం అది సంకోచాన్నిగాని, వికాసాన్నిగాని పొందడమే లేదు. కాని మళ్ళీమళ్ళీ వ్యక్తమవుతూ అవ్యక్తమవుతూ ఉంటుంది. ఎలా అన్నా పర్యవసానం ఒక్కటే. ఒక విధంగా చెప్పడం మరొక విధంగా చెప్పడంకంటె తక్కువ సమ్మతంగా ఉండవచ్చు. కానీ పర్యవసానంలో రెందు సిద్ధాంతాలూ దాదాపుగా ఒకటే అవుతాయి. ఈ ఒక్క కేంద్రభావమే ప్రపంచానికి, ఆవశ్యకంగా ఉంది. ఇతర దేశాలన్నిటికంటె, మన మాతృభూమిలో దీని ఆవశ్యకత ఎక్కువగా కనబడుతోంది.
మిత్రులారా! ఇప్పుడు మీకు అప్రియంగా తోచే కొన్ని యథార్థ విషయాలు చెప్పవలసి ఉంది. మన దరిద్ర సోదరులలో ఎవడైనా ఒక ఆంగ్లేయునిచే అవమానించ బడినప్పుడుగాని, హత్య చేయబడినప్పుడు గాని దేశమంతా ఎలా గగ్గోలు పెడుతుందో వార్తపత్రికల్లో నేను చదువుతుంటాను. దుఃఖీస్తాను. మరుక్షణమే దీనికంతకూ బాధ్యులెవరు? అనే ప్రశ్న నా మనస్సుకు తడుతుంది. వేదాంతిని కావడంవల్ల ఆ ప్రశ్నను నాకు నేను వేసికోక తప్పదు. హిందువు అంతర్దృష్టి కలవాడు. అతడు అన్ని విషయాలను తనలోనే, తన ద్వారానే సాక్షిదృష్టితో చూడగోరుతాడు. కాబట్టి బాధ్యులెవరు అని నన్ను నేను ప్రశ్నించుకొంటాను. ‘ఆంగ్లేయులు కారు’ అనే సమాధానమే ప్రతిసారి అంతర్వాణి చెబుతూంటుంది! నిజం! వారు బాధ్యులుకారు! మన దౌర్భాగ్యానికంతకు, మన పతనానికంతకు బాధ్యత మనదే. అన్నిటికీ మనమే బాధ్యులం. మన పూర్వులలో ఉత్తమ కులీనులు ఇతర సామాన్య జనులను కాలద్రొక్కి నేలరాచేరు; వారిని దిక్కులేని వారినిగా చేశారు. ఈ హింసలవల్ల ఆ నిర్భాగ్యులు తాము మనుష్యులమనే మాటే దాదాపుగా మరచారు. ఇలా అనేక శతాబ్దాలకాలం గతిలేక వారు కట్టెలుకొట్టి, నీళ్ళుమోసి, చెప్పులుకుట్టి, కూలీనాలీ చేసుకొని ఎలాగో బ్రతుకులు కొనసాగించారు. తాము సేవకులుగా, బానిసలుగా జన్మించామని భావించి వారలాగే దుర్భర దారిద్ర్యాన్ని, అవమానాన్ని భరిస్తూ కాలంవెళ్లబుచ్చారు. ఈ కాలపు విద్యాధికతను మనమేదో గొప్పగా చెప్పుకొంటున్నాం. కానీ ఈ దౌర్భాగ్య జీవులపై దాక్షిణ్యంవహించి ఎవ్వడైనా వారినుద్దరించాలని ప్రయత్నించేటప్పుడైనా ఈ విద్యాధికులు ముందుకు వచ్చి అట్టివారితో సహకరించరు. ఇంతేకాదు ఈ దీనజనులను ఇంకా ఎక్కువగా హింసించి పీడించడానికై పాశ్చ్యాత్యులు “వంశపారంపర్య సిద్ధాంతాన్ని”, అట్టివే మరికొన్ని అసంబద్ధ సూత్రాలను ప్రోవుచేసి నానావిధ పశువాదాలను, రాక్షసతర్కాలను చేస్తూండటం నేను తెలుసుకున్నాను. అమెరికాలోని మత మహాసభకు ఒక యువకుడు నీగ్రోజాతివాడు, సాక్షాత్తు ఆఫ్రికా నీగ్రోజాతివాడు – ఇతరులతో కలిసివచ్చాడు. అతడొక దివ్యోపన్యాసంకూడ ఇచ్చాడు. ఎలాగో నాకా యువకునిపట్ల అభిమానం కలిగింది. అప్పుడప్పుడు వానితో మాట్లాడేవాడిని. ‘కాని అతడెవరో తెలుసుకోలేకపోయాను. కాని ఇంగ్లాండులో ఒక దినం కొందరు అమెరికన్లను కలుసుకొన్నాను. వారు నాతో చెప్పినదిది – ఆ కుర్రవాడు ఆఫ్రికా మధ్య భాగంలో నివసించే ఒక నీగ్రోజాతి నాయకుని కొడుకు. ఒకదినం వేరొక నాయకుడు ఈ పిల్లవాని తండ్రిపై కోపంవచ్చి వానిని చంపాడు. వానినే కాదు, తల్లినికూడ నరికేశాడు. శత్రువులు వారి కళేబరాల్ని వండుకుని తిన్నారు. విరోధినాయకుడు ఈ పిల్లవానినికూడ చంపేయాలని, వండితినాలని ఉత్తరువు చేశాడట! కాని వీడు ఎలాగో తప్పించుకొని పారిపోయాడు. అనేక కష్టాలుపడి వందలకొద్దీ మైళ్ళు ప్రయాణంచేసి సముద్రతీరం చేరాడు. ఒక అమెరికా ఓడవారు వీనిని తమ నౌకలో ఎక్కించుకొని అమెరికాకు తీసుకొని వచ్చారు. ఆ చక్కని ఉపన్యాసం ఇచ్చింది ఈ కుర్రాడే! అది తెలిసిన తర్వాత మీ వంశపారంపర్య సిద్ధాంతాన్నిగూర్చి నేనేమి అభిప్రాయపడవలసి ఉంటుందో ఆలోచించండి.
ఓ బ్రాహ్మణులారా! బ్రాహ్మణుడు పారంపర్య ధర్మంచేతనే మాలవానికంటే ఎక్కువ బుద్ధివైభవం కలవాడై ఉంటే, బ్రాహ్మణుని చదువుకోసం ఇక డబ్బు ఖర్చు చేయనక్కర్లేదు. దాన్నంతా మాలవారికోసమే ఖర్చుచేయండి. ఆ బలహీనులకే దానం చేయండి. అది వారికే కదా అవసరం? బ్రాహ్మణుడు బుద్ధికుశలత కలవాడుగానే పుడితే అతడు ఇతరుల సహాయం లేకుండా తనంతట తానే చదువుకోగలడు. ఇతరులు బుద్ధికుశలత లేనివారైతే వారి విద్యాశిక్షణకై తగిన ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేయండి. నాకు తెలిసినంత వరకు ఇది న్యాయంగానూ సహేతుకంగానూ కనిపిస్తోంది. ఈ దీనజనులు ఈ పీడిత సోదరులు, ఈ ఆజన్మ దరిద్రులు తమ యథార్థతత్త్వాన్ని తెలిసికోవలసి వుంది. బలవంతులకు, బలహీనులకు అండయై ఉత్తములకు నీచులకు ఆధారమై ప్రతివానిలోను ఒక్క అఖండాత్మే ప్రకాశిస్తోంది. యోగులు, మహర్షులు కావడానికి తగిన అనంతావకాశం అఖండశక్తి, అందరిలో ఉంది. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి బాలిక, ప్రతి బాలుడు, జాతి భేదంలేక, జన్మభేదం లేక సబల దుర్బల, తారతమ్య విచారణలేక విశ్వమానవకోటి అంతా దీనిని ఆలకించి యోచన చేయునుగాక! “ఉత్తిష్ఠత జాగ్రత, ప్రాప్యవరాన్నిబోధిత!” “లెండి మేల్కొనండి! దుర్బలతనుండి, సమ్మోహనంనుండి తెప్పరిల్లండి” నిజంగా ఎవడూ దుర్బలుడు కాడు! ఆత్మ అఖండం. సర్వశక్తిమంతం! సర్వజ్ఞం; లేచి నిలబడండి! మీ స్వస్వరూపాన్ని ప్రకటించండి, మీలో ఉన్న బ్రహ్మమును ప్రకాశింపచేయండి! వానిని నిర్లక్ష్యం చేయకండి! మితిమీరిన సోమరితనం, మితిమీరిన దౌర్భల్యం మితిమీరిన మోహజాలం శనిదేవతలాగా మన నెత్తిపైకెక్కి చిందులు తొక్కుతున్నాయి. ఓహో! నవభారత పుత్రులారా! మీ సమ్మోహం వదలండి. దానికి కావలసిన మార్గం మీ శాస్త్రాల్లోనే ఉంది. మీ సత్య స్వరూపాన్ని మీరు తెలుసుకోండి. ప్రతివానికి వాని స్వస్వరూపం బోధించండి! నిద్రలోపడివున్న జీవుని ఎలుగెత్తి పిలవండి! ఓహో! అతడెలా మేల్కొంటాడో, మీరే చూడగలరు. ఆ సుప్తజీవి మేల్కొని స్వస్వరూపజ్ఞానంతో కార్యపరుడైనపుడు అతనికి శక్తి వస్తుంది. తేజస్సు వస్తుంది; శుభం కల్గుతుంది. పవిత్రత కలుగుతుంది. ఉత్కృష్టమైనదంతా అతన్ని వరిస్తుంది. ఆహా! గీతలో నాకు చాలా ప్రియమైన శ్లోకాలు రెండున్నాయి.
అవి శ్రీకృష్ణ భగవానుని ప్రబోధానికి సారమై, ముఖ్య పర్యవసానమైనట్లు నాకు స్పష్టంగా గోచరిస్తున్నాయి.
శ్లో ॥ సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం ।
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ॥
శ్లో ॥ సమం పర్శ్య హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం ।
న హిన స్త్యాత్మనాఽత్మానం తతో యాతి పరాంగతిం ॥ ( XIII । -27-28)
అంటే సకల ప్రాణులలో సమంగా నివసించే పరమేశ్వరుని, ఆశాశ్వత పదార్థాల్లోవున్న శాశ్వత బ్రహ్మాన్ని చూచేవాడే నిజమైన “తెలిసినవాడు.” సర్వత్రా సమభావంతో ఉండే పరమేశ్వరుని చూచేవాడు ఆత్మను ఆత్మతో హింసించడు కాబట్టి అతడు పరమగతిని, అంటే మోక్షాన్ని పొందుతున్నాడు.
ఈ విధంగా చూస్తే ఇక్కడేకాక దేశదేశాంతరాలలో సైతం ధార్మిక పునరుజ్జీవనోద్యమం సాగించే అవకాశం వేదాంతానికి ఉందని స్పష్టమవుతోంది. పరమేశ్వరుడు అంతటా సమంగా వ్యాపించివున్నాడు. నేడు ఈ అద్భుతభావాన్ని మానవజాతిని ఉద్ధరించడానికై ఇక్కడా, ఇతర దేశాల్లోను ప్రచారం కావించవలసివుంది. మన శాస్త్రాలు చెప్పినట్లు ఎక్కడెక్కడ కీడువుందో, ఎక్కడెక్కడ జ్ఞానం కొరవడిందో, ఎక్కడెక్కడ అజ్ఞానం ప్రబలిందో అదంతా భేదభావాన్ని అనుసరించి కలుగుతోందనీ, ఎక్కడెక్కడ మేలువుందో అదంతా సమత్వంలోను, సర్వప్రాణుల ఏకత్వంలోను అభిన్నత్వంలోను వున్న విశ్వాసంవల్ల చేకూరుతోందనీ అనుభవపూర్వకంగా నేను తెలిసికొన్నాను. ఇదే వేదాంతం బోధించే పరమాదర్శం. ఆదర్శాన్ని గ్రహించడం ఒక విషయం; దాన్ని దైనందిన జీవితంలో సర్వత్రా అనుష్ఠించడం వేరొక విషయం. ఆదర్శాన్ని చూపడం చాలా మంచిదే. కాని దాన్ని సాధించడానికి ఆచరణయోగ్యమైన మార్గమేది?
అనేక శతాబ్దాలనుండి మన ప్రజల మనస్సులలో ప్రధానంగా కనిపిస్తున్న క్లిష్టమైన, బాధాకరమైన కులభేద సమస్య, సంఘసంస్కరణ సమస్య మనల్ని ఈ సందర్భంలో ఎదుర్కొంటున్నాయి. నేను మర్మాన్ని విడిచి చెబుతున్నాను. నేను కులవిధ్వంసకుణ్ణి కాను; కేవల సంఘసంస్కర్తను కాను. మీ కులభేదాలతోకానీ, మీ సంఘ సంస్కారంతోకాని ప్రత్యక్ష సంబంధం నాకేమీలేదు. మీరు మీ కిష్టమైన కులంలో ఉండండి. అంత మాత్రాన మీరు వేరొక వ్యక్తినిగాని, కులాన్నిగాని ద్వేషించడానికి కారణం లేదు. ప్రేమను – ప్రేమను మాత్రమే – నేను బోధిస్తాను. విశ్వాత్మ అభిన్నత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని ప్రతిపాదించే వేదాంత సత్యాన్ని ఆధారంచేసుకొని, నా ప్రబోధం సాగిస్తాను. దాదాపు నూరు సంవత్సరాల నుండి మనదేశం సంఘసంస్కర్తలతోను, నానావిధ సంఘసంస్కరణ తీర్మానాలతోను ఉర్రూతలూగిపోతోంది. ఈ సంస్కర్తలలో నా మట్టుకు నాకు, దోషాలు కన్పించడంలేదు. వారిలో చాలామంది యోగ్యులే. మంచి ఉద్దేశాలున్నవారే. కొన్ని విషయాలలో వారి లక్ష్యాలుకూడ చాలా గౌరవింపదగినవే. కాని ఈ నూరు సంవత్సరాల సంఘసంస్కరణ ప్రచారం ఈ దేశమందెక్కడా ప్రశంసనీయంగా సుస్థిరమైన, చెప్పుకోదగిన ఫలితాన్ని సాధించలేదు. ఉపన్యాస వేదికలమీద వేనవేలుగా ప్రసంగాలు చేశారు. హైందవజాతిని, హైందవ నాగరికతను తూర్పారబట్టి వాని తలపై ఖండన గ్రంథాల నెన్నిటినో కురిపించారు. అయినా చెప్పుకోదగినంతగా కార్యరూపం తాల్చిన ఫలితార్థమేదీ లేదు. దీనికి కారణం ఎక్కడుంది? ఆ కారణం తెలుసుకోవడం అంత కష్టంకాదు. ఖండనోద్రేకంలోనే ఆ కారణముంది. నేనిదివరకు చెప్పినట్లు ఒక మహాజాతిగా చరిత్ర ప్రసిద్ధులమై మనం మన శీలాన్ని, ఆత్మధర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి మున్ముందుగా ప్రయత్నించాలి! ఇతర జాతులనుండి మనం నేర్చుకోదగినవి చాలావిషయాలున్నాయనీ, ఇతరులనుండి మనం అనేక పాఠాలు నేర్చుకోవాలనీ నేను ఒప్పుకుంటాను. కానీ, మన నూతన సంఘసంస్కరణ విధానాలు, పాశ్చాత్య పద్ధతులకు, కార్యోపాయాలకు చాలావరకు అంధాను కరణంగానే సాగుతున్నాయి. అందువల్లే ఇటీవలి సంస్కరణోద్యమాలు ఫలశూన్యం కావడం తటస్థించింది.
ఇంకొక విషయమేమంటే కేవలం ఖండించడం ఎప్పుడుగానీ మంచిదికాదు. మన సంఘంలో దోషాలున్నాయని పసిపిల్లవానికికూడ తెలుసు. సరే, దోషాలు ఏ సంఘంలో లేవు? లోకంలో నేను కలసిమెలసి తిరిగి కనుగొన్న ఆయా జాతులను, ఉపజాతులను సరిపోల్చి చూడగా, మొత్తంమీద మనదేశ ప్రజలే మిక్కిలి నీతిపరులని, అత్యంత భక్తి పరాయణులనీ మన సంస్థలూ వాటి ఏర్పాటును బట్టి చూచినా వాటి గమ్యార్థాన్ని బట్టి చూచినా – మానవజాతి అభ్యుదయానికి బాగా తోడ్పడునని నేను నిర్థారణ చేసుకొన్నానని, నా దేశీయులారా! ఈ సమయంలో మీకు చాటిచెప్పుతున్నాను. కాబట్టి మన సంఘంలో ఎలాంటపునర్నిర్మాణాన్నీ నేను కోరడంలేదు. వృద్ధి, వికాసం, జాతీయ విధానాలు అనుసరించే పురోగమనం నా ఆదర్శమైవుంది. నా దేశం పూర్వచరిత్రను తడవి చూచేటప్పుడు మానవ బుద్ధివికాసానికి ఇంతగా తోడ్పడిన దేశం ఈ ప్రపంచంలో వేరొకటి నాకు కనిపించడం లేదు. కాబట్టి నా జాతిని దూషించడానికి నాకు నోరాడదు. నేను మనవారితో ‘మీరు చేసింది బాగుంది. ఇంకా బాగా చేయడానికి ప్రయత్నించండి’ అనే చెబుతాను. ఈ దేశంలో పూర్వకాలంలో ఎన్నో ఘనకార్యాలు చేయబడినాయి; ఇంకా గొప్ప పనులు చేయడానికి వ్యవధి, అవకాశమూకూడ ఉన్నాయి. మనం ఎటూ కదలక నిలిచి ఉండజాలమని మీకు తెలుసుకదా? మనమలా కదలక నిలిచివుంటే మనకు మరణమే గతి. మనం ముందుకు సాగిపోవాలి; లేకపోతే వెనుకకైనా పోవాలి. అభివృద్ధిని పొందాలి! లేదా క్షీణించాలి! మన పూర్వులు మునుపు మహాకార్యాలను చేశారు; అయినా మనమింకా నిండుజీవనాన్ని సాధించి వారి ఘనకార్యాలనన్నింటినీ దాటిపోవాలి. కాబట్టి మనం వెనక్కిపోయి క్షీణించడమెలా? అది ఎన్నటికీ పొసగదు. ఎన్నడూ అలా కాకూడదు. వెనుకకుపోతే జాతి క్షీణించి నాశనమైపోతుంది. కాబట్టి మనం ముందుకేపోయి, ఇంకా గొప్పకార్యాలను సాధించాలి! నేను మీకు చెప్పవలసిందదే!
ఎలాంటి తాత్కాలికమైన సంఘసంస్కరణనూ, నేను బోధించే వాడినికాను. నేను దోషాలను సవరించాలని ప్రయత్నించడంలేదు. మీరు ముందుకు సాగిపోతూ, మన పూర్వులచేత నిర్దుష్ట విధంగా నిర్మించబడివున్న మానవ పరిణామ పథకాన్ని ప్రత్యక్షాచరణంవల్ల పూర్తిచేయండని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాను. మానవజాతి ఏకత్వం మనుష్యునిలో అంతర్గతమై వెలిగే దివ్యాంశ; పరమగమ్యమై వెలసే వేదాంతాదర్శం. ఇంకా ఇంకా హెచ్చుగా స్వానుభవానికి తెచ్చుకోవడానికై పాటుపడండని మాత్రం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నాకు సమయమేవుంటే మన మీనాడు చేయవలసినదంతా అనేక సంవత్సరాలకు ముందే మన ప్రాచీన స్మృతికర్తలచేత ఎలా నిర్ణయించబడిందో మన జాతీయ జీవితంలో సంభవించిన, ఇంకా సంభవిస్తున్న పరిణామాలన్నిటినీ ఆనాడే వారెలా ఊహించారో వివరంగా మీకు తెలిపేవాడిని; వాళ్ళుకూడ కులవైర విధ్వంసకులే; అయితే ఆధునిక పురుషులవలె కాదు. కులభేద నిర్మూలన మనగానే ఊరివారంతా కలసి కూర్చుని గోమాంసంతోకూడిన భోజనం చేయాలని కానీ, సారాయి సేవించాలని గాని దేశంలోని పిచ్చివాళ్ళు, బుద్ధిహీనులు అందరూ తమకిష్టమైనప్పుడు, ఇష్టమైనచోట, ఇష్టమైనవారిని పెళ్ళి చేసుకొనవచ్చుననిగానీ, అలా దేశాన్ని ఒక పెద్ద పిచ్చివాళ్ళ శరణాలయంగా మార్చివేయాలనికాని మన పూర్వులు ఆశించినవారుకారు. ఇంకా ఒక దేశ సౌభాగ్యం, అందలి వితంతువులలో ఎందరికి భర్తలు దొరికారో అనే లెక్కపై ఆధారపడుతుందని నమ్మినవారూ కారు. అలాంటి వైభవంతో వెలిగిపోయే దేశం ఎన్నడైనా ఉండగలదేమో చూడవలసివుంది.
మన పూర్వుల దృష్టిలో బ్రాహ్మణుడే ఆదర్శపురుషుడు. మన గ్రంథాలన్నిటిలో ఈ బ్రాహ్మణాదర్శం ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉంటుంది. యూరప్‌లో మఠాధిపతులంతా తమ పూర్వుల ఘనతను రుజువు చేసుకోవడానికి వేలకువేలు ఖర్చుపెట్టి ఎంతో తంటాలుపడుతూంటారు. ఎక్కడనో ఒక కొండలో కాపురముండి, దారినపోయేవారిని కనిపెట్టిచూస్తూ, వీలుచిక్కినప్పుడంతా వారిపైపడి దోచుకొంటూ ‘సుప్రశస్తి’ గడించిన ఘోర చోరాగ్రేసర చక్రవర్తి వద్దకు ఎలాగో తమ వంశమూలం లాగికొనిపోయేంత వరకు వారికి నిద్రపట్టదు. కులీనతా ప్రదాతలైన ఆ మూలపురుషుల వృత్తి అంతదారుణంగా ఉండగా, నేటి పీఠాధిపతి అలాంటి వారిలో ఒకనిని తన గోత్రపురుషునిగా నిరూపించుకొనేవరకు సంతృప్తి పొందలేకున్నాడు. ఇక భారతదేశంలో నయితే మహారాజులు సైతం కౌపీనాన్ని ధరించి, కందమూలాలు తిని వేదపారాయణం చేస్తూ, అడవులలో నివసిస్తూ ఉండిన ఏ ప్రాచీన ఋషినో తమ వంశ పురుషునిగా నిర్ధారణ చేసుకోజూస్తారు. భారత రాజశ్రేష్ఠులు, తమ వంశ వృక్ష మూలం కనుగొనడానికై పోయేది, అక్కడికి. మన వంశపురుషుడు ఋషి అయితేనే మనది ఉత్తమ కులమవుతుంది. లేకుంటే కాదు.
మన ఉత్తమ కులీనతయొక్క ఆదర్శం, ఇతరుల ఆదర్శంకంటే భిన్నంగా ఉంది. ఆధ్యాత్మిక విద్యకలిగి, వైరాగ్యశీలుడైన బ్రాహ్మణోత్తముడే మనకు ఆదర్శపురుషుడు. బ్రాహ్మణాదర్శమంటే నా అభిప్రాయమేమో తెలుసా? ప్రపంచ విషయాసక్తి లేని, సత్యజ్ఞాన ప్రపూర్ణమైన బ్రాహ్మణత్వం! అదే హిందూజాతికి ఆదర్శం. బ్రాహ్మణుడు రాజశాసనానికి అతీతుడనీ, వానిని బంధించే శాసనమే లేదనీ రాజులకు అతనిపై అధికారం లేదనీ వాని శరీరాన్ని ఎన్నడూ హింసించ తగదనీ విధించే ప్రమాణాలను మీరెన్నడూ వినలేదా? అది ఎంతో సత్యం! స్వలాభపరులును, జ్ఞానహీనులును చేసే వ్యాఖ్యానాల ననుసరించికాక, సత్యం మూలానుసరణం అయిన వేదాంత భావాల ననుసరించి, మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి! బ్రాహ్మణుడనగా, స్వలాభాపేక్షను పూర్తిగా చంపుకొన్నవాడు, జ్ఞానాన్ని, భక్తిప్రపత్తులను తాను సంపాదించి, ఇతరులకు ప్రసాదించడమే వృత్తిగా పెట్టుకొని జీవించేవాడు అని భావిస్తే అలాంటి బ్రాహ్మణులతో – అంటే ఆధ్యాత్మిక విద్యాపరాయణులు, నీతిమంతులు, ధర్మశీలులు అయిన స్త్రీ పురుషులతో – నిండిన దేశం ఉంటే, అలాంటి దేశం రాజశాసనానికి అతీతమై ఉంటుందని భావించడం ఒక ఆశ్చర్యమా? అట్టి వారిని అదుపులో ఉంచడానికి రక్షక భటులు, యుద్ధ వీరులు అవసరమా? వారిని ఎవరైనా అదుపులో ఉంచవలసిన అవసరం కలుగుతుందా? వారు ఏ ప్రభుత్వం క్రిందనైనా జీవించడం ఎందుకు? వారు ఉత్తములు, పూజ్యులు, దైవాంశసంభూతులు కదా? మన ఆదర్శ బ్రాహ్మణులు అలాంటివారు. సత్యయుగంలో ఒకటే కులముండేదనీ అది బ్రాహ్మణకులమే అనీ మనం చదువుతున్నాం. సృష్టి ప్రారంభంలో ప్రపంచమంతా బ్రాహ్మణులతో నిండివుండిందని మహాభారతం తెలుపుతోంది. వారే క్రమేణ పతితులుకాగా, వేర్వేరు కులాలుగా చీలిపోయారట!! యుగచక్రం తిరిగి వచ్చేటప్పుడు సృష్ట్యాదిలోలాగా అందరు మరల బ్రాహ్మణులవుతారు. ఈ యుగచక్రం ఇప్పుడు తిరిగిపోతోంది. అందు వల్లనే ఆ విషయాలను మీ జ్ఞప్తికి తెస్తున్నాను. కాబట్టి వర్ణ సమస్యను పరిష్కారం చేయడానికై ఇదివరకు ఉన్నతిలో ఉన్నవారిని కిందికి దిగలాగ కూడదు. ఆహారపానీయాల విషయంలో హద్దుమీరి, ఇష్టంవచ్చినట్లు ప్రవర్తించరాదు. అధికాధికంగా సుఖాలను అనుభవించాలని, పరిమితులను దాటిపోకూదడు. అది మార్గంకాదు. మనలో ప్రతివాడూ వేదాంత మతాదర్శాలను అందుకోవడం వల్లనే ఆ సంస్కరణ సిద్ధించగలదు; అందుకు మనం ఆధ్యాత్మిక తేజస్సును సంపాదించి ఆదర్శ బ్రాహ్మణులమైనా, శూద్రులమైనా మనకందరికీ ఒకే శాసనం వర్తిస్తుంది. మనం ఎక్కడా ఆగక ముందుకు నిరంతరం సాగిపోతూండాలని ఆ శాసనాదేశం! అతి నికృష్టుడైన పంచముడు మొదలు, మహాపురుషుని వరకు ఈ దేశంలోని ప్రతివాడూ ప్రయత్నించి, ఆదర్శ బ్రాహ్మణుడు కావాలి! ఈ వేదాంత సిద్ధాంతం, ఈ దేశానికేకాక ప్రపంచానికంతా వర్తిస్తుంది. మానవ సంఘంలోని ప్రతివ్యక్తీ ప్రతీకార వాంఛలేనివాడు, శాంతుడు, స్థిరచిత్తుడు, భక్తి తత్పరుడు, నిర్మలుడు, ధ్యానపరాయణుడు అయి ఆదర్శ పారమార్థిక జీవిగా పరిణమించేలాగా నెమ్మదిగా జాగ్రత్తగా నడవడమే కులవ్యవస్థ పరమావధి! ఆ ఆదర్శంలో భగవంతుడు ప్రత్యక్షమై ఉంటాడు!
ఈ ఫలితార్థాలు చేకూరడమెలా? శపించడం, తిట్టడం, దూషించడం ఏమాత్రం ఉపకారం కావని నేను మళ్ళీ మళ్ళీ మీకు చెబుతున్నాను. ఎన్నో ఏళ్ళు వానిని ఉపయోగించి చూశారు. చెప్పుకోదగిన ఫలం కొంచెం కూడ చేకూరలేదు. సత్ఫలితాలు ప్రేమద్వారా, సానుభూతిద్వారా మాత్రమే చేకూరుతాయి. ఇది చాలా గొప్ప సమస్య. నా దృష్టిలో ఉన్న పరిష్కార మార్గాలన్నిటిని దినదినమూ నా మనస్సుకు తట్టుతున్న ఊహలనన్నిటినీ వివరించడానికి అనేక ఉపన్యాసాలను ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఓ హిందూ సోదరులారా! మన హైందవ ధర్మనౌక యుగయుగాంతరాలనుండి లోకోపకారంచేస్తూ యాత్ర చేస్తున్నదని మాత్రం మీకు జ్ఞాపకంచేస్తూ ఇప్పటికి నా ఉపన్యాసాన్ని ముగించాలనుకుంటున్నాను. ఈనాడు బహుశా మన నౌకకు చిల్లుపడి ఉండొచ్చు. కొంచెం ఓటిదైపోయి ఉండొచ్చు. అలా అయితే మీరు నేనూ గట్టిగా ప్రయత్నించి ఆ బెజ్ఞాన్ని, పగుళ్ళను పూడ్చివేయడం ధర్మం. రానున్న అపాయాన్నిగూర్చి మన దేశీయులను హెచ్చరింతుముగాక! చిరనిద్రలో మునిగి మృతులలాగా పడివున్న భారతీయులను నిద్రనుండి లేపి ప్రస్తుత స్థితిని, కర్తవ్యాన్ని వారికి తెలుపడానికై మనదేశంలో అంతటా ప్రచారం చేసి నా శక్తికొద్దీ ఎలుగెత్తి ప్రబోధిస్తాను. వారు, నా పలుకులను పెడచెవిని పెట్టుదురుగాక! వారిని నిందించను. ప్రాచీనకాలంలో మన పూర్వులు ఎన్నో ఘనకార్యాలను చేశారు. మనం భవిష్యత్తులో వారికంటె గొప్ప కార్యాలను సాధించకపోతే అందరం ఒకటిగా మునిగి మనశ్శాంతితో మరణించామనే తృప్తినైనా సాధింతుము గాక!! దేశంపట్ల అభిమానం పెంచుకోండి! గతకాలంలో మనకోసమై అంతటి ఘనకార్యాలు చేసిన మునుపటి మహనీయుల్ని సంస్మరించండి. సోదరులారా! నేను ఆలోచించేకొద్దీ మీపై ప్రేమ ఎక్కువవుతోంది. మీరు యోగ్యులు, పవిత్రులు, సాధువులు తరతరాలుగా మీరు హింసలపాలవుతున్నారు. ఈ మాయమయ కలియుగంలో మనగతి ఇలాగైంది. పోనివ్వండి. చివరికి ఆత్మ జయించి తీరుతుంది. ఈలోపుగా మనం నిరంతర కృషిచేద్దాం! మన దేశాన్ని మనం నిందించరాదు. కాలవైపరీత్యంచేత కృంగిపోయి నిర్విరామ కార్యపరత్వంచే అలసటపొంది మన సనాతన వ్యవస్థలన్నీ ప్రస్తుతం జడప్రాయంగా ఉన్నాయి. అంతమాత్రాన వారిని శపించి, తిరస్కారం చేయరాదు. అతిమూర్ఖం, వివేకశూన్యం అయిన సంప్రదాయాలనుకూడ నోరెత్తి నిందించకండి! పూర్వం ఒకప్పుడు అవికూడ కొంత ఉపకారం చేసేవుంటాయి. ఆదర్శంలోను, ప్రయోజనంలోను ఈ దేశ సంప్రదాయాలకంటె నిజంగా శ్రేష్ఠతర సంప్రదాయాలుగల మరొక దేశం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని మీరు జ్ఞాపకముంచుకోండి. లోకంలో దాదాపుగా ప్రతిదేశంలోను కుల విభాగాలుండటం నేను చూశాను. కాని ఇంకెక్కడా వాని గమ్యార్థం ఇక్కడున్నంత మహనీయంగా లేదు. కులవిభాగం అనివార్యమే అయితే, డబ్బువల్ల ఏర్పడే విభేదంకంటే, పవిత్రత, సభ్యత, త్యాగం మొదలైన వానినుండి ఏర్పడిన విభాగాన్నే నేను అభిమానిస్తాను. కాబట్టి దూషించకండి. పెదవులను మూసిపెట్టి మీ హృదయాలను తెరవండి. మీలో ప్రతివాడు, భారమంతా పూర్తిగా తన ఒక్కని నెత్తిమీద వున్నట్లు భావించి ఈ దేశంయొక్క, ప్రపంచమంతటియొక్క విముక్తికోసం పాటుపడాలి. వేదాంతంనుండి ప్రసరించే దివ్యతేజస్సును, చైతన్యశక్తిని ఇంటింటికి తీసికొనిపోయి పంచిపెట్టండి. ప్రతి జీవిలోను దాగివున్న దైవాంశను మేల్కొలపండి. అప్పుడు మీకు చేకూరే విజయం ఏపాటిదైనా మీరు ఒక మహోద్యమాన్ని చేపట్టి దానికోసమై పాటుపడి, దానికోసమే జీవితాన్ని అర్పణచేసిన సంతృప్తి మీకు లభిస్తుంది. ఈ ఉద్యమ విజయం ఎలా చేకూరినా దాని మీదనే ఇప్పుడుగాని, తరువాతగాని మానవజాతి మోక్షం ఆధారపడివుంది.