మధురాపుర హిందువులచే శ్రీ స్వాములవారికి ఈ క్రింది స్వాగత పత్రం సమర్పించబడింది.
పరమపూజ్యులైన స్వామీ!
ఈ మధురాపుర ప్రజలమైన మేము సాంద్రభక్తి గౌరవపురస్సరంగా, శ్రీవారిని, ఈ మా పురాతన పుణ్యక్షేత్రానికి ఆవాహనం చేస్తున్నాం. ఇంద్రియభోగ లంపటాల్లో కూల్చే సమస్త సంగములను సంపూర్ణంగా త్యాగంచేసి, కేవల పరోపకార జీవనాన్ని, పరమ కారుణ్యభావంతో పూని మానవజాతియొక్క ఆధ్యాత్మికోన్నతికై పాటుపడుతున్న శ్రీవారిలో, పవిత్రమైన హిందూ సన్యాసాదర్శాన్ని మేము ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. హిందూమతంయొక్క యథార్థ సారాంశం కర్మకలాపాలతో కూడింది కాదనీ, దరిద్రులై సంకటాలలో చిక్కినవారందరికీ శాంతి, ఆనందాలను ప్రసాదించగలిగే వినిర్మల తత్త్వసిద్ధాంతాచరణమనీ మీ జీవిత సరళిలోనే ఋజువు చేశారు.
ప్రతి నరుని వాని పరిస్థితులకు అనుగుణంగా, వాని శక్తులకు అనుసారంగా ఉత్తమమార్గాన ప్రవేశపెట్టి ఉద్ధరించగల వేదాంత సిద్ధాంతాన్ని, మతధర్మాన్ని అమెరికావారికి బోధించారు. శ్రీవారి ఉపదేశాలు, గత మూడు సంవత్సరాలనుండి పరదేశాల్లోనే చేయబడినవైనా, ఈ దేశంలో కూడ విశేషాసక్తితో గ్రహించబడుతూ, పరదేశాలనుండి వచ్చిపడిన జడవాద ప్రచారాన్ని చాలావరకు అరికట్టడానికి ఉపకరించాయి.
విశ్వంలో ఆధ్యాత్మిక ధర్మాన్ని ప్రచారంచేసే కర్తవ్యం మనపై ఉంది. కాబట్టే భారతదేశం ఈనాటికీ సజీవమై ఉంది. ఈ కలియుగ కల్పాంతంలో శ్రీవారిని పోలిన మహాత్ముడుదయించటం వల్ల ఆ పవిత్ర కర్తవ్యాన్ని కొనసాగించడానికి సమర్థులైన మహాత్ములు చాలామంది అచిరకాలంలోనే ఉద్భవించమన్నారనడానికి నిదర్శనం.
పూర్వకాలంనుండి, విద్యాక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ మధురా నగరం, యోగులకు అభిమాన తీర్థమైన ఈ పావన ద్వాదశాంతక క్షేత్రం, శ్రీ సుందరేశ్వరుని ఈ ప్రియనిలయం, హిందూతత్త్వ సిద్ధాంతాన్ని ప్రకటించడంలో శ్రీవారు చూపిన దక్షతను మానవజాతికి శ్రీవారు చేసిన మహోపకారాన్ని అభినందించడంలో మరే ఇతర భారత నగరానికి తీసిపోదు.
భగవంతుడు శ్రీవారికి పూర్ణపాటవం, జవసత్వాలు, దీర్ఘాయుషు ప్రసాదించుగాక! అని ప్రార్థిస్తున్నాం.
శ్రీ స్వాములవారీ క్రింది విధంగా ప్రత్యుత్తరమిచ్చారు:
మాననీయుడైన మీ సభాధ్యక్షుడు సూచించినట్లు ఈ నాలుగేళ్ళు పాశ్చాత్యలోకంలో నేను గడించిన అనుభవం, నా పరిశ్రమ ఫలితాన్ని వివరిస్తూ మీ దగ్గర చాలాదినాలు గడపగల్గితే చాలా సంతోషించేవాడినే. కాని దురదృష్టవశాత్తు, స్వాములకుకూడ శరీరాలుంటాయి. గడిచిన మూడు వారాలనుండి, నిర్విరామంగా నేను చేసిన ప్రయాణంవల్ల ఉపన్యాసాలవల్ల ఇప్పుడు నేను దీర్ఘోపన్యాసం చేయడం సాధ్యపడకున్నది. కాబట్టి మీరు నా పట్ల చూపిన ఆదరానికి నా హృదయపూర్వక కృతజ్ఞతను తెలుపడంతో తృప్తిపడుతున్నాను. ఇప్పుడు ఈ చిన్నఅవకాశంలో అనేక విషయాలను గూర్చి ఉపన్యసించ బూనక ఎక్కువ అవకాశంకల మరొక దినానికి వానిని వాయిదావేసి ప్రస్తుతం ఏదో ఒకటి రెండు అంశాలను గూర్చిమాత్రం ప్రస్తావిస్తాను. మధురలోని పురప్రముఖులలో సుప్రసిద్ధులైన రామనాధపుర రాజాకు అతిథిగా ఉండటం మూలాన ఒక విషయం నా మనస్సులో ప్రస్ఫుటంగా తోస్తోంది. షికాగో నగరానికి వెళ్ళే సంకల్పాన్ని నా మనస్సులో మొట్టమొదట ప్రవేశపెట్టింది ఈ ‘రాజా’ గారే అని బహుశా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. తన పలుకుబడిని, ఉత్సాహాన్ని వినియోగించి, ఆ సంకల్పాన్ని పోషించినదీ వారే. ఈ స్వాగతపత్రంలో నన్ను గూర్చి చేయబడిన అభినందనలో చాలాభాగం ఈ మహనీయునికే చెందవలసి ఉంది. వసుమతీ రాజగుటకు మారుగా వీరు యతిరాజైవుంటే సముచితంగా ఉంటుందని నేననుకొంటున్నాను; నిజంగా ఈయన యతిరాజ పదవికే అర్హుడు.
ప్రపంచంలో ఏ ప్రదేశమైనా, ఒక విషయంలో వెనుకబడి ఉన్నప్పుడు ప్రకృతి శక్తులన్నీ అక్కడికి చేరి దానికి నూతనోజ్జీవం కల్పించి తీరుతాయి. ఇది స్థూల ప్రపంచంలో లాగానే ఆధ్యాత్మిక ప్రపంచంలోకూడ సత్యమే. ప్రపంచంలో ఏ భాగమందైనా ఆధ్యాత్మికధర్మం కొరవడి మరొకచోట ఆ ధర్మం వర్థిల్లుతున్నప్పుడు, మనం బుద్ధిపూర్వకంగా ప్రయత్నించినా, ప్రయత్నించకున్నా ఆ ఆధ్యాత్మికధర్మం కొరవడివున్న తావుకుపోయి, ఆ వ్యత్యాసాన్ని సవరిస్తాయి. మానవజాతి చరిత్రలో ఒకటి రెండుసార్లు మాత్రమేకాక, మాటిమాటికి ప్రపంచానికి ఆధ్యాత్మికజ్ఞానం దానం చేసే అదృష్టం ఈ భారతభూమికి చాలాకాలంగా ఉంది. సైనిక విజయం ద్వారాగాని, ప్రపంచంలోని అనేక జాతులు, ఒక్క మహాజాతిగా మిళితం చేయబడినపుడంతా, ప్రతిజాతీ రాజకీయమో, సాంఘికమో, ఆధ్యాత్మికమో ఏదో తనవంతు భాగాన్ని ఇతర జాతులకు దత్తం చేస్తూనే ఉంటుంది. ఈ మానవ విజ్ఞానరాశికి, భారతదేశం తనవంతు చేరుస్తూ వచ్చింది పారమార్థిక బలం, ఆధ్యాత్మిక విద్య. పర్ష్యా సామ్రాజ్యం ఉదయించడానికి ఎంతోముందే, భారతమాత వీనిని ఒకసారి ప్రపంచానికి ప్రసాదించి ఉంది. రెండవసారి పర్ష్యా సామ్రాజ్యం వర్థిల్లుతున్న సమయంలో జరిగింది. మూడవసారి గ్రీకులు విజృంభించిన కాలంలో జరిగింది. ఇప్పుడు ఈ ఆంగ్లేయ విజృంభణ కాలంలో నాల్గవసారి ఆ కార్యమే మరల నిర్వహింపబడనుంది. పాశ్చాత్యుల సంఘనిర్మాణ కౌశలం, ఐహిక నాగరికత మన కిష్టమున్నా, లేకున్నా మన దేశంలో చొరబడి వ్యాప్తి పొందుతున్నట్లే భారతీయుల పారమార్థికత, వేదాంతం పాశ్చాత్య భూములలో వెల్లివిరుస్తోంది. దీనికి ఎవరూ అడ్డుపడలేరు. అట్లే, పాశ్చాత్యుల నుండి ఏదో ఒకవిధమైన భౌతిక నాగరికత ఇక్కడికి రాకుండాకూడ మనం అడ్డుపడజాలం. అది కొంత లభించటంవల్ల మనకు మేలు కలుగవచ్చు. అట్లే కొంచెం పారమార్థికత్వం పాశ్చాత్యులకూ మేలు చేకూర్చవచ్చు. ఈ విధంగా పరస్పర వ్యత్యాసాలు పోయి, సమత్వం నెలకొనవచ్చు. అంటే, పాశ్చాత్యులనుండి ప్రతిదానిని మనం నేర్చుకోవాలనిగానీ, లేక వారు మననుండి ప్రతిదాన్నీ నేర్చుకోవాలనికానీ అర్థంకాదు. ప్రతివారు, తమకున్నదాన్ని భవిష్యత్సంతానానికి పిత్రార్జితంగా ఇస్తుండాలి. ఇందువల్ల యుగయుగాలుగా, లోకులు కన్న కలలు నిజమై వివిధజాతుల మధ్య సామరస్యం ఏర్పడి, భావికాలంలో ఒక ఆదర్శ ప్రపంచం రూపొందవచ్చు. ఆ ఆదర్శ ప్రపంచం ఎన్నడైనా సంభవమవుతుందో కాదో నాకు తెలీదు. అలాంటి ఆదర్శ మానవసమాజం ఎన్నడైనా నిర్మాణం అవుతుందో కాదో నా అంతకు నాకు సందేహమే. కాని అది అయినా కాకున్నా మనలోని ప్రతి వ్యక్తీ, ఆ భావం రేపే ఫలించనుందేమో అన్నట్లు అది తన ప్రయత్నం మీదనే ఆధారపడి ఉందేమో అన్నట్లు పూనికతో పనిచేయవలసి ఉంటుంది. లోకంలో ప్రతివాడు తన కర్తవ్యాన్ని నిర్వహించేవున్నాడనీ, ప్రపంచాన్ని నిర్దుష్టం చేయడానికి మనవంతు పని మాత్రమే మిగిలివుందనీ మనమంతా భావించి పని చేయాలి. ఆ బాధ్యత మనంతట మనమే తీసుకోవాలి.
ఈ లోపుగా భారతదేశంలో మహత్తరమైన మత పునరుద్దరణ జరుగుతోంది. అందులో అపాయముంది. విజయగౌరవముంది. ఎందుకంటే మత పునరుద్దరణ ఒక్కొక్కప్పుడు మూర్ఖావేశానికి దారితీస్తుంది. అది హద్దులుదాటి పొంగిపొర్లుతుంది. కొంత పరిమితి దాటిన వెనుక దాన్ని ఎవ్వరూ ఆ ఉద్యమ ప్రారంభకులు సైతం నిరోధింపజాలరు. కాబట్టి ముందుగానే హెచ్చరికను పొందడం మంచిది. ప్రాచీన మూర్ఖాచార పరాయణత్వమనే ఆరు తలల భయంకరజీవి ఒకవైపునా, పాశ్చాత్య సభ్యతా విజృంభణంలో అస్థిగతమై ఒడలు జీర్ణించిపోయిన జడవాదం, అనాత్మవాదం, కృత్రిమ సంస్కారం అనే భయంకర సుడిగుండం మరొక వైపునా ఉన్నాయి. మనమీ రెంటి నడుమ చిక్కక పురోగమించాలి! ఈ రెంటిని దృష్టిలో ఉంచుకోవాలి. మనం పాశ్చాత్యులం కాలేము అని మొదట జ్ఞాపకముంచుకోవాలి. వారిని అనుకరించపూనడం వల్ల లాభం లేదు. మీరొకవేళ పాశ్చాత్యులను అనుకరించగలిగితే, ఆ క్షణంలోనే మృత్యువు మిమ్మావేశిస్తుంది. మీకింక ప్రాణం దక్కదు. రెండవది అసలు అలా అనుకరించగలగడం అసంభవం. అనాదికాలంలో పుట్టి, లక్షలాది యుగాలుగా ప్రవహిస్తున్న ఒక మహానదికి మీరిప్పుడు అడ్డుపడి, హిమగిరి శిఖరంపై దాని ఉత్పత్తి స్థానాన్ని చేరేలా దాన్ని వెనుకకు నెట్టగలరా? అదీ సాధ్యమైనా, మీరు పాశ్చాత్యులుగా మారటం మాత్రం అసంభవం. పాశ్చాత్యులు నిన్నకాక మొన్నపుట్టిన తమ సభ్యతనే విడువజాలకపోతే, శత శతాబ్దాలనుండి నిరవధికంగా ప్రజ్వరిల్లుతూ వస్తున్న మీ సభ్యతను, మీరు త్రోసిపుచ్చగలరని తలుస్తారా? అది పొసగదు. ప్రతి చిన్న గ్రామదేవతలో, ప్రతి చిన్న మూర్ఖాచారంలో, మత ధర్మమని మనం చెప్పుకొనే తత్త్వం గూఢంగా భాసిస్తోందని జ్ఞప్తినుంచుకోవాలి. అయినా స్థానికాచారాలు అనంతాలు, పరస్పర విరుద్ధాలు. వీనిలో మనం అనువర్తించవలసినవేవి? అనువర్తించ తగనివి ఏవి? ఉదాహరణకు చూడండి దాక్షిణాత్య బ్రాహ్మణునకు మాంసం తినే వేరొక బ్రాహ్మణుడు కళ్ళబడ్డంతోడనే దేహం కంపిస్తుంది. ఉత్తర దేశపు బ్రాహ్మణుడో అది మహాపవిత్రకార్యమని భావిస్తాడు. యజ్ఞాల పేరిట వందలకొద్దీ మేకలను అతడు వధిస్తాడు. మీ ఆచారాన్ని ప్రచారం చేయడానికి మీరు పూనుకున్న తోడనే, తమ ఆచారాన్ని ప్రచారం చేయడానికి వారూ సిద్ధపడతారు. భారతదేశమంతటా ఎన్నో ఆచారాలు భిన్నభిన్నాలుగా ఉన్నాయి. కాని, అవి స్థానికమైనవి; అంటే ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క విధంగా ఉండేవి. అయినా పామరజనులు తమ స్థానికాచారమే తమ మత సారమని పొరపాటుగా తలుస్తారు.
దీనిని దాటినా మరింత కష్టతరమైన ఇంకొక ప్రతిబంధకం ఉంది. మన శాస్త్రాలలో రెండు విధాలైన ధర్మాలున్నాయి. ఒకరకం ధర్మాలు నరుని శాశ్వత స్వభావంపైన ఆధారపడినవి. అవి ఈశ్వరునికి, జీవునికి జగత్తుకువున్న పరస్పర శాశ్వత సంబంధాన్నిగూర్చి చెబుతాయి. ఇక రెండవరకం ధర్మాలు, దేశకాల పాత్రలపై ఆధారపడి ఆయా కాలపరిస్థితి, అప్పటి సంఘమర్యాదలు మొదలైన వానికి సంబంధించి ఉంటాయి. మొదటిరకం ధర్మాలు ముఖ్యంగా మన శ్రుతులలో కనిపిస్తాయి. రెండవరకం ధర్మాలు స్మృతులలో, పురాణాలలో మొదలైన వానిలో కనిపిస్తాయి. వేదాలు పరమ గమ్యాలు, త్రికాల అబాధితాలు; సార్వకాలిక ప్రమాణాలు. పురాణాలలోని ఏ భాగాలైనా వేదధర్మాలకు విరుద్ధంగా ఉంటే, ఆ పురాణభాగాలను నిర్దాక్షిణ్యంగా త్రోసివేయవచ్చు. ఇక స్మృతులలోని ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ యుగంలో ఈ ఆచారం అవలంబించాలని ఒక స్మృతి చెబుతుంది. ఇంకొక యుగంలో రచించబడిన వేరొక స్మృతి, ఇంకోదాన్ని అవలంబించాలని విధిస్తుంది. ఈ ఆచారం సత్యయుగంలో వాడుకలో ఉండాలి. ఈ ఆచారం కలియుగంలో వాడుకలో ఉండాలి అని పురాణాలు చెబుతూంటాయి. సనాతన ధర్మాలు నరుని ఆంతర స్వభావంపై ఆధారపడేవి కాబట్టి, నరజాతి జీవించి ఉండేంతకాలం అవి శాశ్వతంగా ఉండేవే. అవి సర్వకాలాలకు ఉపకరించే సర్వవ్యాపకాలైన విశ్వజనీన ధర్మాలు. కాని స్మృతులు స్థానిక పరిస్థితులకు అనుగుణమైన విధులను తెలుపుతాయి. ఆయా స్థితిగతుల్ని అనుసరించి నిర్మించడంవల్ల కాలక్రమాన అవి మార్పుచెందుతాయి. కాబట్టి ఒక్క చిన్నసాంఘికాచారం మార్పు చెందితే మతమే భ్రష్టమవుతుందని మీరనుకోరాదు. ఈ ఆచారాలు, ఇదివరకెన్నో మార్పులు చెంది చెంది, నేడు మనకీ రూపంలో కన్పిస్తున్నాయని గ్రహించాలి. ఇప్పటి స్మృతులు పోయి, కాలక్రమాన ఇతర స్మృతులు రచించబడతాయి. అవి మరల తొలగించబడి మరికొన్ని కొత్తస్మృతులు పుడతాయి. వేదాలు సనాతనాలు కావడంవల్ల ఒకేరీతిగా ఉండి, అన్ని యుగాలకు పనికి వస్తాయనీ, స్మృతులు కాలానుసారం పుడుతూ, అంతరిస్తూ ఉండవలసినవనీ మనం గమనించాలి! కాలగతిలో ఎన్నో స్మృతులు గతించిపోతాయి. ఋషులు వచ్చి ఆ యుగానికి కావలసిన అవసరాలనుబట్టి సంఘాన్ని కొత్త మార్గంలో నడుపుతారు; కొత్త విధులను, కొత్త పద్దతులను నెలకొల్పుతారు. అవి లేనిదే అప్పటి సంఘం బ్రతుకజాలదు. ఈ విధంగా మనం మనమార్గాన్ని ఎప్పటికప్పుడు సవరించుకొంటూ, పైన పేర్కొనబడిన రెండు ప్రమాదాలను తప్పించుకొని మెలగాలి! ఇందుకై మనలో ప్రతివ్యక్తీ అపారమైన హృదయవైశాల్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ప్రతిదాన్ని పరిగ్రహించడమే కానీ, విసర్జించరాదని గ్రహించాలి! మౌఢ్యభక్తుని తీవ్రతతో పాటు, జడవాది విశాలతకూడ ఉండడం అవసరం. సముద్రంలాగా లోతును, అనంతాకాశంలాగా విశాలం అయిన హృదయం మనకు కావలసివుంది. భూమిపై ఎన్నడైనా వెలసిన ఏ జాతితోనైనా సమమైనట్టి పురోభివృద్ధికాములంగా, హిందువులకు మాత్రమే సహజమై వెలసేటంతటి పూర్వాచారపరాయణులంగా కావాలి! ప్రతి విషయంలోను ప్రధానాంశాన్ని అప్రధానాంశాన్నుండి వేరుచేసి చూడటం మనం నేర్చుకోవాలి. ప్రధానమైనవంటే శాశ్వతమై నిలిచేవి; అప్రధానమైనవంటే కొంతకాలం మాత్రమే ఉపకరించగలిగేవి. ఆ తర్వాత వాటిని తొలగించి వాటి స్థానంలో ప్రధానమైన మరొక దానిని నెలకొల్పకపోతే అవి హానికరమవుతాయి. ఇలా చెప్పడంవల్ల మీరునడుములు బిగించి మీ పూర్వాచారాలను, పూర్వసంప్రదాయాలను నాశనం చేయాలని నా అభిప్రాయం ఎంతమాత్రమూ కాదు. వానిలో చాలా చెడ్డవానినికూడ మీరు తూలనాడరాదు. దేన్నికానీ తూలనాడవద్దు. ఇప్పుడు ప్రత్యక్షంగా, హానికరమై కనిపించే ఆచారాలు సైతం పూర్వం ఒకప్పుడు ప్రాణప్రదమై ఉన్నవే! ఈనాడు మీరు వానిని త్రోసివేసే అవసరం కల్గితే శాపదృష్టితో మాత్రం ఆ పనిని చేయకండి. పూర్వం ఒకప్పుడు అవే మన జాతిని నాశనంకాకుండా రక్షించి మహోపకారం చేసిన కారణంగా వాటిని దీవిస్తూ వాటిపట్ల కృతజ్ఞతను చూపిస్తూ వీడ్కోలివ్వాలి! మన సంఘాన్ని నడిపిన నాయకులు ఎన్నడుగాని సేనాధిపతులు, చక్రవర్తులు కారనీ వారు మహర్షులనీ మనం జ్ఞప్తినుంచుకోవాలి! ఈ ఋషులు ఎవరు? ఉపనిషత్తులు తెలిపినట్లు ‘ఋషి’ అంటే సామాన్య నరుడుకాడు. ఒక మంత్ర ద్రష్ట. స్వస్వరూపాన్ని దర్శించినవాడు. ఆయనకు ‘మతం’ అంటే పుస్తకపఠనంకాదు, వాగ్వాదం కూడ కాదు; ఊహారచనకూడ కాదు; ప్రసంగ ప్రాగల్భ్యం కాదు. అతనికి ‘మతం’ అంటే ప్రత్యక్షానుభవం, అపరోక్షానుభూతి. ఇంద్రియానుభవాలకు అతీతమైన సత్యాలను స్వయంగా ముఖాముఖీ దర్శించే ఒక మహానుభూతి! ‘ఋషిత్వం’ అంటే ఇది. ఈ ఋషిత్వం ఏ యుగానికీ ప్రత్యేకంగా చెందింది కాదు; ఏ కాలానికిగాని, ఏ జాతికిగాని, ఏ కులానికిగాని సంబంధించిందికాదు. “బ్రహ్మాన్ని సాక్షాత్కారం చేసుకోవలసి ఉంది” “సత్య సాక్షాత్కారం అవసరమైవుంది” అని వాత్స్యాయన ఋషి చెబుతున్నాడు. మీరు, నేను ప్రతివ్యక్తీ, అందరం ఋషులం కావలసి ఉన్నాం. మనకు నేడు ఆత్మవిశ్వాసం అత్యావశ్యకం. మనం లోక సంస్కర్తలం కావాలి! అందుకు కావలసినదంతా మనలో అజ్ఞాతంగా ఉంది. మనం ‘మతాన్ని’ ప్రత్యక్షంగా చూడాలి! స్వానుభావానికి తెచ్చుకోవాలి. ఆ మార్గంలోనే మన సంశయాలనన్నిటినీ తీర్చుకోవాలి! మహాఋషిత్వంలో తేజరిల్లుతూ, ధీరులమై నిలిచి మనమంతా మహాపురుషులం కావాలి! అప్పుడు మన పెదవులనుండి వచ్చే ప్రతి శబ్దానికి వెనుక అనంత సత్యశక్తి ఉంటుంది. పాపం మన ఎదుట నిలువలేక కాళ్ళకు బుద్ధి చెప్పుతుంది. మనం ఎవరినికాని శపించనవసరం లేకుండా, ఎవరినీ దూషించే అవసరం లేకుండా, ఈ ప్రపంచంలో ఎవరితోకూడ పోరనక్కరలేకుండా, సాన్నిధ్య మాత్రాన సమస్త పాపాలు పారిపోతాయి. మనం, ఇక్కడవున్న మనలోని ప్రతివాడు, ఋషిత్వాన్ని పొంది, ఇతరుల ముక్తిని, మన ముక్తిని సాధించుకొనగలిగేలా పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగాక!