మానామదుర పట్టణంలో శివగంగ, మానామదుర పట్టణాల జమీందార్లు, పురజనులు శ్రీ స్వాములవారికి ఈ క్రింది స్వాగతపత్రాన్ని సమర్పించారు.
శ్రీమత్ వివేకానంద స్వాములవారికి
పరమపూజ్యులైన స్వామీ!
శివగంగ, మానామదుర పట్టణాల జమీందార్లు, పురజనులు అయిన మేము శ్రీవారికి పూర్ణహృదయంతో స్వాగతమర్పిస్తున్నాం. మా జన్మలోని గొప్ప ఆశనిండిన సమయాల్లోగాని, మా అత్యాశ్చర్యకరమైన కలల్లోగాని హృదయానికి అత్యంత సమీపవర్తులైన శ్రీవారు ఇలా మా ఇళ్ళకు చాలా దగ్గరగా వచ్చి దర్శనమిస్తారని మేమెన్నడూ ఊహించలేదు. మీరు శివగంగకు రాలేనని తెలిపిన మొదటి తంతివార్త మా హృదయాలను చీకట్లో ముంచేసింది. తర్వాత చేరిన తంతివార్త మాలో ఆశాబీజాలను మొలకెత్తించింది. శ్రీవారు మా పట్టణంలో దర్శనభాగ్యమివ్వడానికి అంగీకరించారని మొదట విన్నప్పుడు మా ప్రత్యాశలన్నీ ఫలించినట్లు తలచాం. గంగానది పిచ్చుక గూటిపై ప్రవహించి అనుగ్రహించినట్లైంది. మా ఆనందానికి మితిలేదు. కానీ గంగాతీర్థం తన సమ్మతిని ఉపసంహరించుకోవాలని తెలిపినప్పుడు మేమైనా ఆ తీర్థం వద్దకు పోవడానికి వీలుకాలేదుకదా అని చాలా పరితపించాం. ఎలాగైతేనేమి శ్రీవారు మా ప్రార్థనలను విని మమ్మనుగ్రహించారు. సముద్ర ప్రయాణంలోగల దుర్భర సంకటాలను లక్ష్యపెట్టక, అత్యద్భుత నిస్వార్థభావంతో పాశ్చాత్య ప్రపంచానికి ప్రాచ్య ప్రపంచంయొక్క పవిత్ర దివ్యసందేశాన్ని తీసుకొనిపోయిన మీ ధైర్యాన్ని, ఆ కార్యనిర్వహణలో మీరు చూపిన అసమాన దక్షతను, మీరు పూనుకొన్న సర్వభూతహిత ధర్మానికి లభించిన అసదృశమైన అఖండవిజయం మీకు శాశ్వత వినిర్మల కీర్తిని సంపాదించిపెట్టాయి. కుక్షింభరత్వమే పరమధర్మమని బోధించే పాశ్చాత్య జడవాదం భారతీయ మతవిశ్వాసాల మీదికి భయంకరంగా దండెత్తి వస్తున్న ఈ సమయాన కూడ మన మహర్షుల సద్బోధలు, దివ్యగ్రంథాలు రూపుమాయనున్న ఈ కాలాన శ్రీవారిని పోలిన సద్గురుని ప్రభావం మత ధర్మప్రచార చరిత్రలో నూతనాధ్యాయాన్ని విప్పింది. క్రమంగా ఆర్షతత్త్వశాస్త్రమనే స్వచ్ఛమైన అపరంజి మీద కాలగతిలో వచ్చిపడిన కాలుష్యాన్నంతా కడిగివేసి తమ విచక్షణా పటిమ అనే టంకశాలలో శ్రీవారు సంస్కరించి, జగత్తులో అంతటా సుగ్రాహ్యమైన నాణెంగా దాన్ని పరివర్తనం చేయాలని మేము నిరీక్షిస్తున్నాం. హిందూవేదాంత ధ్వజాన్ని, మహామతసభలో ఆసీనులైన నానాసంప్రదాయ ప్రచారకుల సమక్షంలో విశ్వశరణ్యంగా ప్రకటించి, ప్రతిష్ఠించిన మీ సాహసం, రాజకీయ క్షేత్రంలో మీ సమకాలిక అయిన మహా రాణిలాగా సూర్యుడెన్నడూ అస్తమించని మహాసామ్రాజ్యానికి మిమ్మల్ని అచిరకాలంలో సార్వభౌముని చేయగలదని కోరుతున్నాం. కాని ఈ రెంటికి ఒక భేదముంది. ఆమె ప్రభుత్వం స్థూలప్రపంచంలో వర్థిల్లుతుండగా, శ్రీవారి ప్రభుత్వం భావప్రపంచంలో ప్రకాశించగలదు. దీర్ఘకాల పరిపాలనచేత ఉదార ధర్మప్రచారంచేత ఆమె సర్వాతీత అయి వెలసేటట్లు సాటిలేని నిష్కామంతో ప్రేమ ప్రచారాన్ని కొనసాగించి ఆధ్యాత్మిక చరిత్రలో పేరుగాంచిన పూర్వ ఋషిశ్రేష్ఠులనందరిని శ్రీవారు అతిక్రమించి ప్రకాశించాలని సర్వేశ్వరుని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తున్నాం.
పరమ పూజ్యులైన స్వామి!
భక్తి వినమ్రతలతో శ్రీవారిని అర్చించే సేవకులం
ఆ స్వాగత పత్రానికి ప్రత్యుత్తరమిస్తూ శ్రీ స్వాములవారిలా పలికారు:
మీరిప్పుడు నాకిచ్చిన సాదర స్వాగతంవల్ల ఎంతటి గొప్ప కృతజ్ఞతా భారాన్ని నాపైన పెట్టారో, నేను చెప్పలేకపోతున్నాను. నేనెంతగా ఇష్టపడినప్పటికీ, దీర్ఘోపన్యాసాన్నివ్వడానికి తగిన స్థితిలో నేనిప్పుడు లేను. మన సంస్కృత పండితమిత్రుడు పూర్ణ ప్రేమతో ఎన్ని మనోహరమైన విశేషణాలను నాకు ప్రసాదించినప్పటికీ, నాకూ ఒక దేహముంది కదా? ఈ శరీరం జడ ద్రవ్యసంబంధమైన ప్రేరణలకు, నియమాలకు, ధర్మాలకు సదా లోబడే ఉంటుంది; ఈ స్థూలశరీరానికి సంబంధించినంత వరకు అలసట, ఆయాసం అనేవి ఉండి తీరుతాయి.
నేను పాశ్చాత్య దేశాలలో చేస్తున్న అల్పకృషిని గూర్చి ఈ దేశం నలుమూలలలో కనిపిస్తున్న సంతోషం, ఆమోదం అద్భుతంగా ఉన్నాయి. నేను చేసిన చిన్నపనికే ఈ జాతి ఇంతగా ప్రశంసిస్తూండగా, మన తర్వాత రానున్న మహర్షులు, లోకసంస్కర్తలు ఈ జాతికి ఎంతగా సమ్మాన పాత్రులు కానున్నారో? భారతదేశం మతధర్మానికి జన్మభూమి. భారతీయులు మతధర్మాన్ని మాత్రమే గ్రహించగలరు. ఆ మార్గంలో వారి విద్యావిధానం నిరంతరంగా, అనేక శతాబ్దాలు నడిచింది. తత్ఫలంగా మతమొక్కటే పరమ పురుషార్థంగా వెలసింది. ఆ విషయం మీకందరికీ తెలిసిందే. ప్రతివాడు ఏ వర్తకుడో, బడిపంతులో, యుద్ధభటుడో కానక్కరలేదు. కాని ఈ లోకం భిన్నభిన్న జాతుల కావాసమై మొత్తంమీద సామరస్యభావంతో విరాజిల్లుతూ ఉంటుంది.
ఈ నానాజాతి రాగసమ్మేళనంలో మనం ఆధ్యాత్మిక స్వరాన్ని ఆలాపన చేయాలని బ్రహ్మదేవుడు వ్రాసిపెట్టాడు కాబోలు!! ఎంతో గొప్ప మహిమ కలవారైన మన పూర్వులనుండి మనకు పిత్రార్జితంగా వచ్చిన ఆ దివ్యసంప్రదాయాన్ని మనం ఇంకా కోల్పోలేదని తెలిసి నేను సంతోషిస్తున్నాను. మన పూర్వులవంటి వారిని చూచుకొని ఏ జాతివారైనా గర్వోన్నతులు కాగలరు. ఈ జాతియొక్క భవిష్యదున్నతిలో నాకు అచంచల విశ్వాసం కలుగుతోంది. ఇప్పటి మీ ఆదరభావం వ్యక్తిగతంగా నాపట్ల చూపిన మన్ననగా కాక, మన జాతీయ హృదయం, దానిలో ప్రతిబింబిస్తోన్నదని తలచి, అది ఇంకా క్షేమంగా వర్థిల్లుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాను. భారతమాత ఇంకా జీవించి ఉంది. ఆమె మరణించిందని చెప్పేదెవరు? మనం కార్యశూరులం కావడం చూడాలని పాశ్చాత్యులు కోరుతున్నారు. యుద్ధభూముల్లో మనం కార్యశూరులమై నిలువగా చూడాలని కోరితే వారికి ఆశాభంగమే కలుగుతుంది. అది మన క్షేత్రంకాదు. ఒక యోధజాతి ఆధ్యాత్మిక క్షేత్రంలో విహరించడం చూడగోరితే, మనకూ అలాగే ఆశాభంగమవుతుంది. కాని వారిక్కడికి వచ్చి చూచి, మనం వారితో సమానంగా కార్యోత్సాహులమై ఉన్నామనీ మన జాతి బ్రతికే ఉందనీ, అది ఎప్పటిలాగే సంపూర్ణచైతన్యంతో జీవిస్తోందనీ గ్రహించనీ! మనం క్షీణించి పోయామనే వారి దురభిప్రాయాన్ని పోగొట్టాలి.
కాని మీకు ఇప్పుడు అప్రియవాక్కులను కొన్నిటిని చెప్పవలసి ఉంది. వానికై మీరు కోపించరని నమ్ముతాను. యూరోపియన్ల జడవాదం వచ్చి మనల్ని దాదాపుగా ముంచివేసిందని మీరిప్పుడన్నారు. అదంతా యూరోపియన్ల తప్పుకాదు. చాలావరకు మన తప్పే. వేదాంతులమైన మనం ఎప్పుడూ అంతర్ముఖ దృష్టితో, ఆత్మపరిశీలనాపరులమై విషయాలను గ్రహించాలి. మనకు మనమే మొదట హానిచేసుకొంటే, మనకు హాని కల్గించగల్గిన శక్తి జగత్తులో ఎక్కడ ఉండజాలదు. ఇది వేదాంతులమైన మనకు స్పష్టంగా తెలుసు. భారతదేశ జనసంఖ్యలో అయిదవభాగం మహమ్మదీయులలో చేరిపోయారు. ఇంకా వెనక్కివెళ్ళిచూస్తే జనసంఖ్యలో మూడింట రెండుపాళ్ళు బౌద్ధులై పోయినట్లే, ఇప్పుడు అయిదవపాలు మహమ్మదీయులైపోయారు. ఇప్పటికే పదిలక్షలకు మించి క్రైస్తవులయ్యారు.
ఇది ఎవరి తప్పు? మన చరిత్రకారులలో ఒకరు చిరస్మరణీయమైన భాషలో దీన్ని వ్యక్తం చేశారు. అనర్గళ జీవనది తమ ప్రక్కనే ప్రవహిస్తుండగా, పాపం ఈ దీనులు ఆకలి దప్పులతో చావడమెందుకు? తమ సొంతమతాన్ని వదలిపోతున్న ఈ ప్రజలకై మనం ఏమైనా చేశామా? వారెందుకు మహమ్మదీయులు కావలసి వచ్చింది? ఇంగ్లండ్‌లో వేశ్యావృత్తి నవలంబించాలని యత్నించిన ఒక ఉత్తమ బాలికను గూర్చిన ఉదంతాన్ని నేను విన్నాను. ఆమె అలా చేయడమెందుకో అని ప్రశ్నించిన ఒక మహిళతో ఆ బాలిక “నాకు సానుభూతి లభించడానికి అది ఒక్కటే మార్గం. ఇప్పుడు నాకెవరూ దిక్కులేరు. నేను పతితతనై హింసలపాలైతే అప్పుడు బహుశా కొందరు సానుభూతిపరులైన స్త్రీలు నన్ను తమ ఇంటికి తీసుకొనివెళ్ళి నాకేదో ఉపాయాన్ని చూపుతారు.” అన్నదట!! మనం ఈ మతభ్రష్ఠులను గూర్చి ఇప్పుడేడుస్తున్నామే? మునుపు వారి కొరకు ఏమైనా చేశామా? ఇప్పుడైనా మనం ఏమి నేర్చుకొన్నాం? సత్యజ్యోతిని చేపట్టామా? చేపడితే ఎంతమేరకు దాని కాంతులు ప్రసరింపజేశాం? ఈ ప్రశ్నలను మనలో ప్రతిఒక్కరూ వేసుకొందాం! వాస్తవానికి ఇప్పుడు మతాంతరం నాశ్రయించిన మన సోదరులకు మనం ఎప్పుడూ సహాయం చేయలేదు. అది తప్పే. మన పాపమే! మనం ఎవరినీ నిందించనవసరం లేదు. మన కర్మనే నిందించుకోవలసి ఉంది.
జడవాదాన్నిగాని, మహమ్మదీయ మతాన్నిగాని, క్రైస్తవ మతాన్నిగాని ఒక్కటనడమెందుకు? ప్రపంచంలోని అన్ని మతాలూ, మీ ఉపేక్షవల్ల వర్థిల్లినవే. చెడ్డ ప్రవర్తనం, మలినమైన ఆహారం, దారిద్ర్యం, రోగం మొదలైన వానిమూలంగా చెడిపోయి క్షీణిస్తే తప్ప, ఏ క్రిమికూడ శరీరాన్ని తాకజాలదు. సంపూర్ణారోగ్యంగల పురుషుడు, నిరపాయంగా, విషక్రిముల మధ్య చరించగలడు. సరే! మన పద్ధతులను మార్చుకొనే అవకాశం ఇంకా ఉంది. వ్యర్థం, అర్థహీనం అయిన విషయాలను గూర్చి, మీ పాతపోట్లాటలను, పాత వివాదాలను మానుకోండి. బుద్ధిమంతులైన వందలు వందలు దేశీయులుకూడి “నీరు త్రాగేటప్పుడు మనం చెంబును కుడిచేతితో పట్టుకోవాలా? ఎడమ చేతితో పట్టుకోవాలా? చేతిని కడుక్కోవలసింది మూడుసార్లా? నాలుగుసార్లా? నీరు పుక్కిలించవలసింది ఐదు సార్లా? ఆరుసార్లా?” అని విషయాలను గూర్చి సంవత్సరాలకొద్దీ వాదనలు చేస్తున్నారు. ఐదారువందల సంవత్సరాలనుండి, భ్రష్ఠులైపోతున్నారు. ఇలాంటి ఘనవిషయాలనుగూర్చి తర్కవాదాలు చేస్తూ దానిపై బ్రహ్మాండమైన శాస్త్రగ్రంథాలు వ్రాస్తూ కాలం, శక్తి, జీవితం, వ్యర్థంచేసే మహానుభావులు ఉంటే ఏమి? ఊడితే ఏమి? ఇలాంటి వారి చేతులలో మన మతం సర్వనాశనమైపోతుంది. మనం వేదాంతులం కాము, పౌరాణికులం కాము, తాంత్రికులం కాము – ‘నన్ను ముట్టకోకండి’ అనే మహామతావలంబులమైపోయాం! మన మతం వంటగదిలో ప్రవేశించింది. వంటకుండ మన ‘ఇష్టదేవతై’ వెలసింది. “నేను పరిశుద్ధుడిని, నన్ను తాకకు” అనే పలుకులే మహావాక్యాలైపోయాయి. ఈ స్థితే మరొక శతాబ్దకాలం సాగితే మనలో ప్రతివాడు ‘పిచ్చి ఆసుపత్రి’ లో చేరవలసి ఉంటుంది. మన మెదడు పాసిపోయి, మన మనస్సు ఉత్తమ జీవన విషయాలను గ్రహించలేని గతి పట్టిందనడానికి ఇది స్పష్టమైన గుర్తు. నూతన కల్పనాశక్తి అంతా అడుగంటింది. మనోబలం ఉడిగిపోయింది. దాని ప్రవృత్తి పాడైంది. ఆలోచనాశక్తి ఆరిపోయింది. అది ఇప్పుడు తనకు దొరికిన చిన్న గిరిలోపడి గిరగిర తిరుగవలసిందే! ఇట్టి అల్ప విషయాలను వెంటనే గంగలో త్రొక్కి, మనం సాహసంతో నిలబడాలి! అప్పుడే మన పూర్వులు మనకు పిత్రార్జితంగా ఇచ్చివెళ్ళిన రత్నరాసులకు, లోకమంతా నిరంతరం ఆరాటపడుతున్న భాగ్యనిధులకు వారసులమని చెప్పుకొనే యోగ్యత మనకు కలుగుతుంది. ఈ ధనరాసులను మనం పంచిపెట్టకపోతే లోకం నశిస్తుంది. వానిని వెలికి తీసుకొని రండి! లోకంలో వెదజల్లండి! దానమే కలియుగంలో ప్రధాన ధర్మమని వ్యాసమహర్షులవారు చెబుతున్నారు. అన్ని దానాలలో ఆధ్యాత్మిక జ్ఞానదానమే అత్యుత్తమం. దీని తర్వాత లౌకిక జ్ఞానదానం, దాని తర్వాత ప్రాణదానం చివరికి దరిద్రులకు చేసే అన్నదానం గణనీయం. అన్నదానం చాలినంత చేస్తూనే ఉన్నాం. ఇంకే జాతిలోకూడ మనకంటే ఎక్కువగా బిచ్చం పెట్టేవాళ్ళు లేరు. గుడిసెలో గుప్పెడన్నమున్నంత వరకు బిచ్చగాడు సైతం మరొక బిచ్చగానికి దానిలో సగం పెట్టబోతాడు. ఇట్టి స్థితి భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. మనలో ఈ ధర్మం కావలసినంతుంది. ఇక పై రెంటి విషయం విచారిద్దాం. ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానదానం, లౌకిక జ్ఞానదానం మనం చేయవలసి ఉంది. ధైర్యంతో, సాహసంతో, ఆత్మ విశ్వాసంతో కార్యభారం వహించామా ఇరవై అయిదేళ్ళలో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాగలదు. మనమిక దీనికోసం కీచులాడుకోవలసిన పనివుండదు. హిందూ ప్రపంచమంతా మళ్ళీ ఆర్యావర్తమై వర్థిల్లుతుంది. ఆర్యమతం ప్రదీప్తమై వృద్ధి చెందుతుంది.
నేనిప్పుడు చెప్పవలసినదంతా ఇదే. నాకు గల పథకాలను గూర్చి మాటలాడటం నాకంతగా అలవాటు లేదు. ముందు చేసి చూపి, తర్వాత ఆ పథకాలను గూర్చి ప్రసంగించడం నా మార్గం. నాకు కొన్ని పథకాలున్నాయి. ఈశ్వరేచ్ఛ ఉంటే, నాకు ఆయువు సరిపోతే, వానిని ఆచరణలో పెట్టాలని నిశ్చయించుకొన్నాను. అలా చేయగలుగుతానో లేదో నాకు తెలీదు. జీవితంలో ఒక ఉత్తమాదర్శాన్ని లక్ష్యంలో ఉంచుకొని, దానికై జీవితాన్ని అర్పించడం ఘనకార్యం. మనం బ్రతకడంవల్ల ప్రయోజనమేమి? అల్పం, దీనం, వ్యర్థం అయిన నరజీవిత మెందుకు? ఒక గొప్ప పురుషార్థానికి జీవితాన్ని అర్పించడమే దాని ప్రయోజనం. భారతదేశంలో పూనవలసిన ఉత్తమ కర్తవ్యమిదే. ఈ కాలపు ఆధ్యాత్మిక ధర్మపునరుద్ధరణకు నేను స్వాగతం చెబుతున్నాను. అనుకూల సమయాన్ని ఉపయోగపరచుకొనకపోతే, అది నా బుద్ధిలోపమవుతుంది.