రామనాడు విడిచిన తర్వాత శ్రీ స్వాములవారు ఆగిన మొదటి పట్టణం పరమకుడి. అక్కడ చాలాగొప్ప ఉత్సవం జరిగింది. ఈ క్రింది స్వాగతపత్రం శ్రీవారికి అర్పించబడింది.
శ్రీమత్ వివేకానంద స్వాములవారికి
శ్రీవారు పాశ్చాత్య ప్రపంచంలో నాలుగు సంవత్సరాలకాలం జయప్రదంగా వేదాంత ప్రచారం సాగించి వచ్చిన సమయంలో పరమకుడి పట్టణవాసులమైన మేము శ్రీవారికి భక్తి, గౌరవ పురస్సరంగా స్వాగతం అర్పించుకొంటున్నాం.
షికాగో నగరంలో జరిగిన విశ్వమత మహాసభకు విజయం చేకూర్చి అతిప్రాచీనమైన మన కర్మభూమిలో నెలకొనివున్న నిగూఢ పవిత్ర జ్ఞాన రాసులను నానామత ప్రపంచ ప్రతినిధుల ముందు ప్రదర్శించిన తమ ఔదార్యం మాకందరికి ఆనందాన్ని, గర్వాన్ని కలిగించింది. వేదవాఙ్మయంలో నిగూఢమైవున్న పవిత్రధర్మాలను శ్రీవారు బాహాటంగా ప్రకటించి, మన హైందవమతంపై పాశ్చాత్య పండితులకున్న తిరస్కార భావాన్ని తొలగించారు. సర్వకాలాల్లోను, సమస్త చిత్తవృత్తులకు, వివిధ మేధాశక్తి సంపన్నులకు ఉపకరించే విధంగా అది విశ్వానుగుణ్యమై, విశ్వశరణ్యమై ఒప్పుతున్నదని వారికి నచ్చచెప్పారు.
శ్రీవారికి పాశ్చాత్య శిష్యవర్యులు ఇప్పుడిక్కడ మా మధ్య నిలవడమే, శ్రీవారి ధర్మబోధలు చక్కగా, సిద్ధాంత రూపంలో సుగ్రాహ్యమై, ఆచరణరూపాన ఫలప్రదమయ్యాయనడానికి ప్రబల నిదర్శనం.
హృదయాకర్షకమైన శ్రీవారి దివ్యదర్శన ప్రభావం పూర్ణవైరాగ్యంతో కూడుకొని, ఇంద్రియనిగ్రహపరులై, బ్రహ్మసాక్షాత్కార సిద్ధులై, మానవ జాతికంతా ఆత్మమార్గదర్శులై గురుపీఠాన్నధిష్ఠించిన మన ప్రాచీన మహా ఋషులను మీ మనోనేత్రాలకు ప్రత్యక్షం చేస్తోంది.
మానవజాతిని కనికరించి, ఆధ్యాత్మిక మార్గంలో నడపడానికి కావలసిన దీర్ఘాయురారోగ్యాలను శ్రీవారికి ఆ పరమేశ్వరుడు ప్రసాదించుగాక అని వేడుకొంటూ విరమిస్తున్నాం.
పరమభక్తి విశ్వాసాలతో ఇట్లు,
విన్నవించు శ్రీవారి శిష్యబృందం
ఈ అభినందన పత్రానికి ప్రత్యుత్తరంగా శ్రీ స్వాములవారిలా సెలవిచ్చారు.
నాకు ఈ విధంగా స్వాగతమివ్వడంలో మీరు చూపిన ఆదరణకు, ప్రేమకు నా మనస్సులోని కృతజ్ఞతను తగువిధంగా వెలువరించగల్గటం అసంభవం. మీ ఆమోదాన్ని పురస్కరించుకొని ఈ నాలుగు మాటలు మాత్రం చెబుతాను. ఈ దేశీయులు ప్రేమపూర్వకంగా నన్నాదరించినా, ద్వేషభావంతో తరిమివేసినా ఈ దేశంపైని, ఇందలి ప్రజలపైని నా హృదయంలో వెల్లివిరిసే ఈ అభిమానం, ఈ అనురాగం ఇలాగే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. “నరులు కర్మకోసమే కర్మనాచరించాలి. ప్రేమకోసమే ప్రేమించాలి” అని గీతలో శ్రీకృష్ణభగవానుడు సెలవిచ్చి ఉన్నాడు. పాశ్చాత్య ప్రపంచంలో నేను నిర్వహించిన కార్యం అత్యల్పం. నేను చేసినదానికంటే శతాధికంగా కృషి చేయగలశక్తి మీకందరికీ ఉందని నా విశ్వాసం. భారతదేశంనుండి వెలువడి, ధైర్యోత్సాహాలతో చతుర్దిశాంతాలకు వెళ్ళి, పారమార్థిక ధర్మప్రబోధం చేయాలని ఉత్సాహించే మహాధీరులు, పరమాత్మ తత్త్వవిదులు ఎప్పుడు ఉదయిస్తారా అని నేను ప్రత్యాశతో ఎదురుచూస్తున్నాను. ఆ దివ్యభావాలు, హైందవ తపోవనాల నుండి మనకు సంక్రమించాయి. అవే భారతభూమికి సహజ సంపదలు.
మానవజాతి చరిత్రలో జాతులు జాతులే ప్రాపంచిక విషయాలపై విసుగు చెందడం అప్పుడప్పుడు సంభవిస్తుంది. ఇందుకు కారణం ఆ సమయాల్లో వారి మ్యాహాలన్నీ చేజారి, ఆశలన్నీ గాలిమేడలై, ఏది చూచినా పట్టువదలిపోయినట్లు గోచరించడమే. ప్రపంచంలో సంఘజీవనాన్ని నిర్మించడానికి రెండు విధాల ప్రయత్నాలు చేయబడ్డాయి. ఒకదానికి ఆధారం మతం. రెండోదానికి ఆధారం సంఘ అవసరం. ఒకదానికి పునాది ఆధ్యాత్మిక ధర్మం. రెండోదానికి ప్రాపంచికత. ఒకదానికి మూలం పరమార్థ చింత; రెండవదానికి ప్రత్యక్ష భోగం. ఒకదాని దృష్టి ఈ క్షుద్ర ప్రపంచంయొక్క దృఙ్మండలాన్నిదాటి చాలాదూరం సారిస్తుంది. అది ప్రపంచాన్ని పూర్తిగా త్యజించి, జీవనారంభం చేయడానికికూడ సాహసిస్తుంది. ఆ రెండవదో ప్రపంచ విషయాలను ఆధారం చేసుకొని నిలుచుటతోనే తృప్తిపడి, అక్కడే శాశ్వత సుస్థిరాధారాన్ని కల్పించుకోవాలని ఆశపడుతుంది. ఒక్కొక్క సమయంలో మొదటిదైన ఆత్మపక్షం ఉన్నతి పొందుతుంది; మరొక్క సమయంలో రెండవదైన జడప్రకృతి పైకి లేస్తుంది. ఈ విధంగా తరంగాలు లాగా ఇవి ఒకదాని వెనుక ఒకటి నడుస్తూండడం విచిత్రం. ఒకేదేశంలో ఈ భిన్నదశలు కన్పిస్తూంటాయి. ఒక సమయంలో జడవాదం వెల్లివిరుస్తుంది. ఐహిక సౌఖ్యాన్ని, భోగానుభవానికి సహకరించే విద్యలు, సిద్ధాంతాలు, ప్రచండ వాయువేగంతో ప్రచారం పొందుతాయి. వెంటనే అవి క్షీణించి, నశించిపోతాయి. వైభవంతోపాటు, అసూయ, కోపాలుకూడ మానవజాతిలో కార్చిచ్చులాగా చెలరేగుతాయి. స్పర్థలు, ద్వేషం, హింస, ప్రళయతాండవం చేస్తాయి. అంత ఇంపైనది కాకున్నా, పామరులలో ప్రచారంలో ఉన్న ఇంగ్లీషు సామెత ఒకటుంది ‘ఎవరికి వారే యమునా తీరే, నష్టమంతా వెనుకపడిన వాడికే’ – ఆ కాలపు నీతి అలా ఉంటుంది. ఆ పరిస్థితులలో జీవనమే అర్థహీనమని ప్రజలు అనుకోవడం మొదలుపెడతారు. పారమార్థికధర్మం అడ్డుపడకపోతే, మునిగిపోతున్న ఈ ప్రపంచాన్ని అది చేపట్టి ఉద్దరించకపోతే, అట్టి వేళలలో జగత్తే నాశనమైపోగలదు. ఈ ధర్మాభ్యుదయంవల్ల ప్రపంచానికి మళ్ళీ ధైర్యంకలిగి, నూతన నిర్మాణానికి ఆధారమేర్పడుతుంది. కాబట్టి ఆ స్థితిలో ఒక ఆధ్యాత్మిక తరంగం వస్తుంది. అదికూడ కాలక్రమంలో అణగిపోయేదే కానీండి. ఈ పారమార్థిక ధర్మాభ్యుదయంతోపాటు, విషయ అధికారాలన్నీ తమ చేతులలోనే ఉంచుకొనేవారు కొందరు బయలుదేరడం రివాజు. ఫలితంగా ప్రజలలో, తిరిగి అనాత్మవాదం బయలుదేరుతుంది. జాతియొక్క మతాధికారాలేగాక, సమస్త భౌతికాధికారాలు, పదవులు ఏ కొద్దిమంది చేతులలోనో చిక్కిపోవడంతో వారు విజృంభించి ప్రజల నెత్తినెక్కి పిండికొట్టసాగుతారు. సర్వాధికారాలు తమవే అని వాదిస్తారు. అప్పుడు సంఘం ఈ పీడను తొలగించుకోవడానికై భౌతికవాదపు సహాయాన్ని తీసుకొంటుంది.
హిందూదేశ స్థితిని పరిశీలిస్తే ఇదే విషయం ఇప్పుడుకూడ జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈనాడు మీరిక్కడచేరి, వేదాంత ప్రచారం చేయడానికై పాశ్చాత్య దేశాలకు పోయివచ్చిన ఒక వ్యక్తికి స్వాగతమివ్వడానికి మూలకారణం యూరప్ దేశాల్లోవున్న అనాత్మవాద ప్రాబల్యమే. కాబట్టి ఒక దృష్టికోణంనుండి ఈ భౌతికవాదం భారతభూమిని రక్షింప వచ్చినట్లే అనిపిస్తుంది. అది జీవితావకాశాలను అందరికీ సమంగా కల్పిస్తోంది. కులంవల్ల లభించే ప్రత్యేకాధికారాలను, అర్హతలను ఎగురగొట్టి వేస్తోంది. తరతరాలుగా ఏ కొద్దిమంది మాత్రమో తమ చేతులలో ఇముడ్చుకొని, వినియోగం చేసుకోజాలక వ్యర్థంగా దాచిపెట్టుకొన్న అమూల్య జ్ఞాన రత్నాలను పైకిలాగి, బహిరంగచర్చకు లోనుచేసింది. ఈ సంపదలో సగం దొంగలు అపహరించడంవల్ల ఎప్పుడో నష్టమైంది; తక్కినసగం కుక్కలవంటనీచుల చేతులలో చిక్కింది. వారు దాన్ని అనుభవించజాలరు; ఇతరులను అనుభవించనీయరు. నేడు హిందూదేశంలో మనం స్థాపించాలని పెనుగులాడుతూన్న రాజకీయ విధానాలు, యూరప్‌లో తాతలనాటి నుండి నెలకొని ఉన్నవే. కొన్ని శతాబ్దాలుగా వాటిని స్వానుభవంతో పరీక్షించి చివరికవి అన్నీ పనికిమాలినవని వారు కనుగొన్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా ఆ రాజకీయ వ్యవస్థలు, విధానాలు, వ్యర్థమని వారు కనుగొన్నారు. ఇప్పుడు యూరప్ ఖండం ఎటుచూచినా, గతికానక అల్లాడుతోంది. భౌతిక వ్యాపారపీడనం, అక్కడ అతిఘోరంగా పరిణమించింది. దేశ సంపద, అధికారం ఇదంతా ఏమాత్రమూ పనిచేయని కొద్దిమంది సోమరుల చేతులలో చిక్కాయి. వీరు శ్రమపడరు; కాని లక్షలకొద్దీ జనం చేత పనులు చేయించే తంత్రాలను పన్నుతూంటారు. ఈ అధికారంతో వారు భూలోకాన్నంతా రక్తప్రవాహంలో ముంచివేయగలరు; ఆస్తిక సిద్ధాంతాలను కాలరాచి, నిరంకుశంగా ప్రభుత్వాన్ని సాగిస్తారు. నేడు పాశ్చాత్య ప్రపంచం ఏ పదిమంది ధనిక పిశాచాల చేతనో పాలింపబడుతోంది. ఆ దేశాలందలి ప్రజాస్వామ్య రాజ్యపాలనం, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, శాసన సభలు అని వారు చెప్పుకొనే ఈ గొప్పలన్నీ వట్టి బూటకాలే, పరిహాసాలే.
పాశ్చాత్య ప్రపంచం ధనిక పిశాచుల హింసలకు లోనై, బొబ్బలు పెడుతోంది. ప్రాక్ప్రపంచం, పురోహితుల పీడనకు సహించలేక బొబ్బలు పెడుతోంది. వీరిద్దరు పరస్పరం అదుపులో ఉంచాలి. ఒకరు మాత్రమే లోకాన్ని ఉద్ధరించగలరని తలచకండి. పక్షపాతం కొంచెంకూడలేని ఈశ్వరుడు సృష్టిలోని ప్రత్యణువును సమానంగానే చేశాడు. నీచాతి నీచుడైనవానిలోకూడ మహాఋషిలో కొరవడిన కొన్ని సుగుణాలు కన్పిస్తాయి. అతిక్షుద్రమైన కీటకంలోకూడ అత్యుత్తమ పురుషునిలో గోచరించని కొన్నిగుణాలు కనిపిస్తాయి. అల్పభోగి అని మీరు తలచే నిరుపేద అయిన కూలివానికి మీకుగల బుద్ధిచాకచక్యం లేకపోయినా, వేదాంత తత్త్వంవంటి విషయాలను అతడు గ్రహించలేకపోయినా మీ శరీరాన్ని వాని శరీరంతో పోల్చిచూస్తే వాని శరీరానికి, మీ కోమల శరీరంలాగా నొప్పి కలుగదనీ, వాని దేహానికి తగిలిన గాయాలు మీ గాయాలకంటే త్వరగా మానిపోతాయని, మీలాగా అతడు చీటికి మాటికీ మంచంలో పడడని తెలుసుకుంటారు. వాని ప్రాణం ఇంద్రియగతమైంది. వాని భోగం ఇంద్రియాల్లోనే; పైగా వాని జీవితం ఒడుదుడుకులులేక సమంగా నడుస్తుంది. భౌతిక క్షేత్రంలోకానీ, ఆధ్యాత్మిక క్షేత్రంలోకానీ ఎక్కడో పరిహారం కల్పించి భగవంతుడు సమత్వాన్ని నెలకొల్పుతాడు. కాబట్టి మనమే లోకోద్ధారకులమని భ్రమించరాదు! మనం లోకులకు అనేక విషయాలు నేర్పగలమనడం వాస్తవమే. కాని వారినుండి మనం అనేక విషయాలను నేర్చుకోవలసి ఉందికూడ. లోకం దేనికోసం నిరీక్షిస్తూందో, దాన్ని మాత్రమే మనం లోకానికి బోధించగలం. ఆధ్యాత్మికతా పునాది లేకపోతే పాశ్చాత్య నాగరికత అంతా, ఇంకొక ఏభై సంవత్సరాలలో ఛిన్నాభిన్నమై పోగలదు. ఖడ్గబలంతో మానవజాతిని పరిపాలించ జూడటం కేవలం వ్యర్థం; అది ఎన్నడూ పొసగదు. ఖడ్గంతో బలాత్కారంగా పరిపాలించడం వంటి భావాలు ఎక్కడినుండి పుడతాయో, మొట్టమొదట అక్కడ అవే అధోగతిని, క్షయాన్ని విచ్చిన్నతిని పొందుతాయి. అనాత్మశక్తి ప్రదర్శనకు ప్రధానక్షేత్రమైన యూరప్ ఖండం తన స్థితిని మార్చుకొని తన ప్రస్తుత సంప్రదాయాన్నికూడ మార్చుకొని తన జీవితానికి ఆధ్యాత్మిక ధర్మాన్ని పునాదిగా చేసికోవడానికై ప్రయత్నించకపోతే ఇంకో ఏభై సంవత్సరాలలో ముక్కలు ముక్కలై దుమ్ములో కలిసిపోతుంది. మన ఉపనిషత్తులు ప్రతిపాదించే ఆస్తిక ధర్మమొక్కటే యూరప్‌ను నేటి దుఃస్థితినుండి ఉద్ధరించగలదు.
మన దేశంలోని సంప్రదాయాలు, తత్త్వశాస్త్రాలు, స్మృతులు, భిన్న భిన్నంగా ఉన్నా వీటి అన్నిటికీ మూలాధారమైన సిద్ధాంతమొకటుంది. ‘జీవుడు లేక ఆత్మ అనేదొకటి ఉంది’ అనే విశ్వాసం మనలోని అన్ని సంప్రదాయాలవారికి ఉంది. ఈ భావమే ప్రపంచ చిత్తవృత్తినంతా మార్చేయగలదు. భారతదేశంలో హిందువులు, జైనులు, బౌద్ధులు మొదలైన అన్ని సంప్రదాయాలవారు ఆత్మరూపి అయిన జీవుడున్నాడనే భావాన్ని అంగీకరిస్తారు. అది సమస్త శక్తులకు నిలయం. శక్తినిగాని, పవిత్రతనుగాని, పరిపూర్ణతనుగాని వెలుపలినుండి మీరు పొందగలరని బోధించే ఒక్క సిద్ధాంతమైనా భారతదేశంలో లేదని మీకు బాగాతెలుసు కదా? ఈ లక్షణాలన్నీ మీ స్వభావ సిద్ధమని, భారతీయ సిద్ధాంతాలన్నీ చెబుతున్నాయి. ఆ పవిత్రత కేవలం ఆగంతుకంగా వచ్చి, మీపై నిలబడి మీ సత్యస్వభావాన్ని కప్పివేస్తోంది. కాని మీ స్వరూపం పవిత్రమై, శక్తిమంతమై సదా వెలుగుతూనే ఉంది. మిమ్మల్ని అదుపులోపెట్టి నడపడానికై ఏ ఇతర సహాయం మీకు అవసరంలేదు. మీరు ఆత్మనిగ్రహం కలవారే. మీకా జ్ఞానం అవగతమా? లేదా? భేదమంతా దానిలోనే ఉంది. మన సమస్యను ఒక్కమాటలో చెబుతాను. అది అవిద్య. నరునికి, భగవంతునికి, సాధువుకు ఉన్న భేదమేమి? అజ్ఞానం. మీ కాలికిందపడి, గిజగిజలాడే నికృష్టమైన పురుగునకు, మానవజాతికంతా శిరోభూషణ మనదగిన పురుషోత్తమునికీ ఉన్న భేదమేమి? అజ్ఞానమే. అదే ఈ భిన్నత్వాన్ని కల్పిస్తోంది. ఆ ప్రాకులాడే పురుగు లోపలకూడ, అఖండశక్తి, జ్ఞానం, పావనత, సర్వేశ్వరుని అనంత పరిపూర్ణత ఉన్నాయి. అది ఇప్పుడు అవ్యక్తంగా ఉంది; ఇక వ్యక్తం కావాలి.
భారతదేశం ప్రపంచానికి బోధించవలసిన మహాసత్యమిదే. ఈ ధర్మం ఇంకే దేశంలోనూ కనిపించదు. ఇదే వేదాంతం. ఆత్మశాస్త్రం. పురుషుని నిలబడి పనిచేసేలా చేసేది ఏది? బలం. బలమే యోగ్యత, దుర్బలతే పాపం. ఆగ్నేయాస్త్రంలాగా రివ్వున వచ్చిపడి, అజ్ఞానరాసులనంతా భస్మీపటలంచేసే మహాశక్తిని ఉపనిషత్తులు ‘నిర్భయత్వం’ అని పేర్కొంటున్నాయి. మీరు బాగా ప్రచారం చేయవలసిన ఏకైక మతధర్మం ఈ ‘నిర్భయత్వమే!’ వ్యావహారిక ప్రపంచంలోగాని, ఆధ్యాత్మిక ప్రపంచంలోగాని, ‘భయ’ మనేది మన పతనానికి, పాపానికి మూలకారణమనడం సత్యం. దుఃఖాన్ని కల్గించేది ‘భయం’, దౌష్ట్యాన్ని పెంచేది ‘భయం’. సరే భయానికి మూలమేది? మన సహజతత్త్వాన్ని గూర్చిన అజ్ఞానమే. మనమంతా సకల సార్వభౌములకూ సార్వభౌముడైన భగవంతుని వారసులం. మనం సాక్షాత్తు భగవదంశ సంభూతులమే. ఇంతేకాదు మనం అల్పనరులమనుకొంటూ, స్వస్వరూపాలను మరచి ఉన్నప్పటికీ మనం స్వయం బ్రహ్మమే. అలాంటి ఉన్నత భావనాస్థితినుండి, మనమిప్పుడు భ్రష్ఠులమై పోయాం. ఈ భ్రష్ఠతే విభేదాలను తెచ్చిపెట్టింది; నేను నీకంటే కొంచెం గొప్పవాణ్ణి; లేక నీవు నాకంటె కొంచెం గొప్పవాడివి, అనే ఇలాంటి విభేదాలు కల్పించింది. అద్వైత భావమే నేడు భారతదేశం నేర్పవలసిన గొప్ప పాఠం. దీన్ని మీరు గుర్తుంచుకోండి! దీన్ని గ్రహిస్తే సమస్త విషయాల స్వరూపం మారిపోతుంది. అప్పుడు మీరు మునుపటివలెగాక వేరే దృష్టితో ప్రపంచాన్ని చూస్తారు. ఆ దృష్టికి ఈ ప్రపంచం ప్రతి జీవి, ప్రతి ఇతర జీవితో పోరాడటానికే పుట్టి, బలవంతుడు విజయం పొందుతుండగా, దుర్బలులు మృత్యువువాత పడవలసిన ఘోర రణరంగంగా కన్పడదు; అప్పుడది భగవంతుని లీలాక్షేత్ర మవుతుంది; మనమందరం అతని చెలికాండ్రమై చుట్టూ గుమిగూడివుండి, లీలతో వినోదాలు చేస్తూంటే, నాట్యరంగంగా భాసిస్తుంది. ఈ లోకం మిక్కిలి ఘోరంగా, బీభత్సంగా, అపాయకరంగా కన్పడినా, అంతా ఒక నాటకమే అనే సత్యం గోచరిస్తుంది. ఆత్మస్వరూపాన్ని తెలిసికొన్నప్పుడు దుర్బలునికికూడ ఆశలు చిగిరించును. అధఃపతితునికి, ఘోరపాపికికూడ క్రొత్త ఆశలు అంకురిస్తాయి. ‘నిస్పృహ చెందకండి’ అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మీరేమి చేసినా, మీ ఆత్మస్వభావం మారదు. అది ఒకే రూపంతో నిర్మలంగా భాసిస్తూ ఉంటుంది. ప్రకృతిని, ప్రకృతే నాశనం చేస్తుందా? మీది నిర్మలతత్త్వం. కోటియుగాలది మరుగుపడి ఉండుగాక, చివరికది బయటపడి తీరుతుంది; విజయాన్ని పొంది బయటపడి తీరుతుంది. కాబట్టి అద్వైతం ప్రతివానికీ, ఆశను పురికొల్పుతుందేకానీ, నిరాశను కలిగించదు. అది భయాన్ని ఆధారం చేసుకొని బోధలు చేయదు. ఒక్క అడుగు తప్పువేశావంటే, నిన్ను పడలాగివేయడానికి, పిశాచాలు సంసిద్దంగా ఉన్నాయని అది చెప్పదు. దానికి పిశాచాలతో పనిలేదు. మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉందని అది చెబుతుంది. మీ కర్మే ఈ శరీరాన్ని మీకు సృష్టించిపెట్టింది. మరెవరూ దాన్ని మీపై పడవేయలేదు. సర్వవ్యాపి అయిన బ్రహ్మం, అజ్ఞానంవల్ల మరుగుపడి ఉన్నాడు. బాధ్యత అంతా మీ మీదనే ఉంది. మీ ఇష్టంలేకనే, మీరీ లోకానికి తీసుకొని రాబడి ఈ ఘోర ప్రదేశంలో విడిచిపెట్టబడినటుల భావించవద్దు. ప్రతి క్షణమూ, కొంచెంకొంచెంగా మీ శరీరాన్ని ఇప్పుడు మీరు పెంచుకొన్న విధంగానే, మీరే పూర్వజన్మలో దీనిని నిర్మాణం చేసికొన్నారు. మీ ఆహారాన్ని మీరే తింటున్నారు. మీ కొరకై ఎవరూ తినిపెట్టడంలేదు. మీరు తిన్నదాన్ని మీరే జీర్ణం చేసికొంటున్నారు. మీ కోసం ఎవరూ జీర్ణం చేసిపెట్టడంలేదు. ఆ ఆహారాన్నుండి రక్తాన్ని, కండరాలను, శరీరాన్ని మీరే నిర్మించుకొంటున్నారు. మీకోసం ఎవరూ నిర్మించిపెట్టడంలేదు. ఇలాగే సర్వదా మీరు ప్రవర్తిస్తున్నారు. గొలుసులోని ఒక్క ఉంగరాన్ని పరీక్షిస్తే గొలుసు స్వభావమంతా తెలుస్తుంది. మీ శరీరాన్ని మీరే నిర్మించుకొంటున్నారనడం ఒక్క క్షణమైనా సత్యమైతే, ప్రతి క్షణంలోను మీరు అలాగే పూర్వంకూడ చేశారనీ, ఇక ముందుకూడ చేయగలరనీ స్పష్టమవుతోంది. మంచికి, చెడ్డకు ఇలా బాధ్యతంతా మీ మీదనే పడుతోంది. ఇదే గొప్ప ఆశకు మూలం. నేను కూర్చుకొన్న దాన్ని నేనే విప్పగలను. ఇలా అయినప్పటికీ, దైవానుగ్రహం నరునికి అవసరమని మన మతం బోధించడంలేదు. ఈశ్వరుని కరుణ సదా ఉండనే ఉంది. అయినా ఈ భయంకర శుభాశుభ ప్రవాహానికి దూరంగానే ఈశ్వరుడు నిలిచి ఉంటాడు. అతడు నిత్యముక్తుడు. ఆ కరుణానిధి ఈ ప్రవాహాన్ని దాటించి మనల్ని, ఆవలి ఒడ్డు చేర్చడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన కరుణ అపారం. నిర్మల హృదయాలకు, అది నిరంతరం దొరకగలదు.
ఒకరీతిగా మీ ఆధ్యాత్మికతయే మీ సంఘ నవనిర్మాణానికి పునాది కావలసి ఉంది. నాకు ఇంకా కొంత అవకాశంవుంటే, పాశ్చాత్యులు, మన అద్వైత సిద్ధాంతాలనుండి ఇంక ఎలా నేర్చుకోవలసి ఉన్నారో తెలిపి ఉండేవాడిని. ఏమంటే ప్రకృతి శాస్త్రాలు ప్రబలిన ఈ దినాలలో సగుణబ్రహ్మయొక్క ఆదర్శానికి అంతగా బలంలేదు. అయినా ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాథమిక దశలో ఉన్నవానికి దేవాలయాలు, విగ్రహాలు, అవసరాలైతే అతడు కోరుకున్నవన్నీ తీసుకోనివ్వండి. వాని భక్తిసాధనకు సగుణదైవం అవసరమైతే ఆ సగుణదైవంయొక్క పరమోత్తమ భావాలుకూడ ఈ దేశంలో అపారంగా ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇంతటి వైవిధ్యంతో రూపకల్పన చేయబడి ఉండలేదు. మరొకడు తన తర్కదృష్టిని తృప్తి పరచుకొని, వివేకశీలిగా ఉండగోరితే అత్యుత్తమ తర్కసాధ్యాలైన నిర్గుణబ్రహ్మభావాలుకూడ వానికి ఇక్కడనే లభించగలవు.