తర్వాత పాంబన్ పట్టణానికి శ్రీ వివేకానందస్వాములవారు చేరగానే, రామనాడు రాజాగారు శ్రీవారిని కలుసుకొని భక్తిపూర్వకంగా స్వాగతమిచ్చారు. సముద్రతీరంలో శ్రీవారు పడవ దిగిన చోటనే స్వాగత సత్కారాలకోసం ప్రత్యేకంగా నిర్మించబడి, చిత్రవిచిత్రంగా అలంకరించబడిన పందిరిలో పాంబన్ పట్టణవాసుల పక్షాన ఈ క్రింది అభినందనపత్రం వారికి సమర్పించబడింది.
పరమ పూజ్యులైన యతివర్యా!
చాలాగాఢమైన కృతజ్ఞతతోను, పరమ పూజ్యభావంతోను, శ్రీవారికి స్వాగతమర్పించ గల్గినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఎన్నో ఆహ్వానాల ఒత్తిడి ఉన్నా, ఒక్కసారి మాకు దర్శనమివ్వడానికి దయతో, సంతోషంగా మీరంగీకరించినందుకు మేమెంతో కృతజ్ఞులం. మీలోని మహనీయ సద్గుణానికి, ఔదార్యంతో మీరు నిర్వహించబూనుకొని, అసమానశక్తితో, పరిపూర్ణోత్సాహంతో, అచంచలదీక్షతో కొనసాగిస్తున్న మీ పవిత్రోద్యమానికి ఇవే మా శ్రద్ధాంజలులు.
పాశ్చాత్య సభ్యజాతుల మనస్సులలో మీరు నాటిన హిందూతత్త్వ బీజాలు మొలకెత్తడం చూస్తున్నాం. అవి పెరిగి, పూర్ణసత్ఫలితాలనిచ్చే సూచనలను, ఇప్పుడిప్పుడే కనుగొని, మహానందం పొందుతున్నాం. శ్రీవారు ఆర్యావర్తంలో సంచారం చేసేటప్పుడు, పాశ్చాత్య దేశాలలో కంటె, గొప్పగా ఈ మన మాతృభూమిలోని సోదరులను పుట్టినదాదిగా, ఆవరించిన నిద్రనుండి మేల్కొలిపి, ఎంతోకాలంనుండి మరచివున్న బ్రహ్మవిద్యను వారి జ్ఞప్తికి తెచ్చి, ప్రబోధం కల్పించి, అనుగ్రహించాలని మనవి చేస్తున్నాం.
మా హృదయాలు మా సద్గురువులైన శ్రీవారిపట్ల సత్యభక్తితోను, పూజ్యభావంతోను, పవిత్రాభిమానంతోను నిండి పరవశమైపోతున్నాయి. కాబట్టి మా భావాలను తగిన రీతిలో వ్యక్తం చేయజాలకున్నాం. శ్రీవారికి దీర్ఘాయురారోగ్యాల నిచ్చి, చిరకాలంగా లోకంలో కొరవడివున్న విశ్వసోదర భావాన్ని పునరుద్ధరించడానికి కావలసిన సమస్త శక్తులను సర్వేశ్వరుడు ప్రసాదించుగాక అని పూర్ణభక్తితో మేమందరం ప్రార్థిస్తూ విరమిస్తున్నాం.
తర్వాత శ్రీ రాజాగారు, తమ పూర్ణభక్తి విశ్వాసాలు తెలుపుతూ, స్వీయస్వాగతం అర్పించారు. శ్రీవారు ఈ క్రింది విధంగా ప్రత్యుత్తరమిచ్చారు:
మన పవిత్ర మాతృభూమి మతానికి, తత్త్వశాస్త్రానికి ప్రధానక్షేత్రం; మహాఋషులకు జన్మస్థానం; తీవ్ర వైరాగ్యానికి ఆలవాలం. మానవుడు సాధించవలసిన మహోన్నత పరమాదర్శం అత్యంత ప్రాచీనకాలంనుండి, నేటివరకు విరాజిల్లుతూ వచ్చింది ఇక్కడే!
నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళివచ్చాను. అనేక జాతులవారి మధ్య అనేక దేశాలలో సంచరించాను. ప్రతిజాతి, ప్రతిసంఘం ఒక్కొక్క విశిష్టాదర్శంతో ఒప్పుతున్నట్లు నాకు కనిపించింది. ఒక ప్రధానాదర్శం వారి జీవితాన్నంతా ఆక్రమిస్తోంది. ఈ ఆదర్శం వారి జాతీయ జీవనానికి పట్టుకొమ్మ. భారతదేశానికి అలాంటి పట్టుకొమ్మ ఒకటుంది. అది రాజనీతి కాదు; మతం. మతమే మన జీవన నిధి. మనకున్న భాగ్య సర్వస్వం. మనం కోరుకునేదీ అదే. అట్టి వేదాంతం మన భారతదేశంలో సర్వదా వర్ధిల్లుతూ వచ్చింది.
కండబలం నిజానికి గొప్పదే. ప్రకృతిశాస్త్ర ప్రయోగంవల్ల నిర్మించిన యంత్రజాలంలో ప్రకటితమైన బుద్ధిమహిమ చాలా అద్భుతమైందే; అయినా ప్రపంచంమీద వేదాంతానికున్న ప్రభావం వాటికి లేదు.
భారతదేశం చిరకాలంగా కార్యదీక్ష కలిగి, మెలగుతూ ఉన్నట్లు మన జాతిచరిత్రే చెపుతోంది. ఈనాడు యదార్థాన్ని తెలియనివారు బయలుదేరి, భారతీయుడు స్తబ్దుడని, మందమతి అనీ ప్రచారం చేస్తున్నారు. ఇతర దేశ ప్రజలకు ఇదే వాడుక పదమైపోయింది. భారతదేశం ఎన్నడైనా, మందమతిగా పడివుండిందనే భావాన్ని నేనొప్పుకోలేను. మన ఈ పుణ్యభూమికంటే ఎక్కడాకూడ కార్యదీక్ష ప్రస్ఫుటంగా ప్రకాశించడం లేదు. అత్యంత ప్రాచీనం, మహామహిమాఢ్యం అయిన మనజాతి ఇంకా సజీవమై ఉండటమే మనజాతి కార్యదక్షతకు ప్రబలసాక్ష్యం, నశించక, దివ్య జీవనగతితో ప్రకాశిస్తోంది. ఈ కార్యపరత, మన దేశంలో మతంలో కనిపిస్తుంది. కాని ప్రతివాడు, తన వృత్తినే ప్రమాణంగా పెట్టుకొని, ఇతరులను విమర్శిస్తుంటాడు. ఇది మానవ స్వభావం అనే సత్యాన్ని ముఖ్యంగా గమనించాలి. ఉదాహరణకు ఒక చెప్పులుకుట్టే వానిని పరామర్శించండి. వానికి చెప్పులుకుట్టడం మాత్రం తెలుస్తుంది. అతనికి చెప్పులు తయారుచేయడాన్ని మించిన, యోగ్యమైన కార్యం కనిపించదు. ఒక తాపీ పనివాడున్నాడనుకోండి అతనికి ఆ తాపీపని మాత్రం తెలుస్తుంది. ఇతర లౌకికజ్ఞానం సున్న. ఈ మూఢత్వానికి మరోకారణంకూడ ఉంది. కాంతి చాలా తీక్షణంగా ఉన్నప్పుడు మన కళ్ళు చూడలేవు. మన దృష్టి శక్తి పరిమితిని దాటి మన కళ్ళు చూడలేవు. వాని నిర్మాణం అలా ఉంది. కాని అంతరవలోకన ప్రభావంగల యోగి అలా కాదు. పామరులను ముసుగులో కప్పివుంచే అనాత్మావరణాన్ని భేదించుకొనిపోయి అతడు చూడగల్గుతాడు.
నేడు ఆధ్యాత్మిక పుష్టినిచ్చే ఆహారంకోసం, ప్రపంచం వేయికళ్ళతో భారతదేశంవైపు చూస్తోంది. ఈ భారతదేశం సమస్త జాతులకు, ఆ భిక్షను పెట్టవలసి ఉంది. మానవకోటికి కావలసిన పరమాదర్శం, ఇక్కడ మాత్రమే లభించగలదు. పాశ్చాత్య పండితులు ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని గ్రహించగల్గుతున్నారు. ఈ ఆదర్శం, మన సంస్కృత వాఙ్మయంలోను, వేదాంతశాస్త్రంలోను సురక్షితంగా ఉంది. యుగయుగాలనుండి ఇది భారతీయుల ప్రత్యేక సంపదై విలసిల్లుతోంది.
చరిత్రదృష్టి ప్రసరించినంత వరకు హైందవ సిద్ధాంతాలను, తత్త్వ సూత్రాలను ప్రచారం చేయడానికై ఏ ప్రబోధకుడూ ఇంతవరకు భారతదేశపు పొలిమేరలు దాటిపోయినట్లు కనిపించదు. కాని ఇప్పుడు అద్భుతమైన మార్పొకటి మనలో కలుగుతోంది. “ఎప్పుడెప్పుడు ధర్మం అణగిపోయి, అధర్మం పెచ్చుపెరుగుతుందో, అప్పుడంతా లోకాన్ని రక్షించే నిమిత్తం నేను అవతరిస్తాను.” అని శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. ఏ దేశంలోనైనా శ్రేష్ఠమైన నీతిశాస్త్రం ఉంటే, అది మనదేశంనుండి పరిగ్రహించిందే అనీ, జీవుని తత్త్వాన్ని గూర్చిన ఉత్తమభావాలున్న మతం ఎక్కడున్నా అది ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగానీ మన దగ్గర నుండి గ్రహించబడిందే అనీ, మత పరిశోధకులవల్ల తెలుస్తోంది.
ఈ పందొమ్మిదవ శతాబ్దాంత భాగాన జరుగుతున్నంతగా, దుర్బలులపైబడి దోచుకోవడం, దౌర్జన్యం చేయడం, పీడించడం, ప్రపంచ చరిత్రలో ఏ కాలంలోకూడ జరగలేదు. వాంఛలను జయిస్తే తప్ప ముక్తి చేకూరదనీ, విషయభోగాలకు బానిసగా ఉండేంతకాలం, ఎవనికీ మోక్షం లభించదనీ ప్రతివాడూ గ్రహించాల్సి ఉంది. ఈ మహాసత్యాన్ని, సకల జాతులవారు నెమ్మది నెమ్మదిగా తెలుసుకొని, ఆమోదిస్తున్నారు. శిష్యుడీ సత్యాన్ని గ్రహించే అర్హతను పొందిన వెంటనే గురువుయొక్క బోధవానిని రక్షిస్తుంది. భగవంతుడు అనంత దయాసముద్రుడుగాన, తన బిడ్డలపై – వారేమతం వారైనా – కరుణ చూపుతూనే ఉంటాడు. ఈ కారుణ్యసముద్రం ఎన్నడూ ఎండిపోయేది కాదు. మన ఈశ్వరుడు, సమస్త మతాలవారి ఈశ్వరుడు ఒక్కడే. ఈ అభిప్రాయం భారతదేశంలో మాత్రమే గోచరిస్తోంది. కాని ప్రపంచంలోని మరే ఇతర మతగ్రంథంలోను కానరాదని నేను బాహాటంగా చాటిచెబుతున్నాను.
హిందువులైన మనం, ఈశ్వరేచ్ఛవల్ల బహుబాధ్యతాయుత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం. పాశ్చాత్య జాతులవారు ఆధ్యాత్మిక సహాయంకోసం మన దగ్గరికి వస్తున్నారు. మానవజన్మకు సంబంధించిన సమస్యలను గురించి ప్రపంచానికి జ్ఞానదానం చేయడానికి తగిన సామర్థ్యాన్ని సంపాదించుకోవలసిన మహాబాధ్యత, నైతికంగా, భారత పుత్రులకు ఏర్పడింది. ఒక్క విషయం చూడండి. కొండ కోనలలో నివసిస్తూ అప్పుడప్పుడు వెలువడివచ్చి, బాటసారులను దోచుకొంటూ ఉండిన ఎవడో ఒక దొంగలరాయుని సంతానమని చెప్పుకోవడానికి ఇతర దేశాల్లోని ఘనులు, మహాపురుషులు గర్వపడుతుంటారు. కాని హిందువులమో కొండల్లో, గుహల్లో ఫలమూలాలు తిని జీవిస్తూ పరమాత్మధ్యానంలో కాలం గడిపిన ఏ ఋషి సంతానమనో, లేదా ఏ సాధుపురుషుని సంతానమనో చెప్పుకొని గర్వపడుతుంటాం. కాని మన మతాన్నిగూర్చి శ్రద్ధపూని, సరైన మార్గాన పనిచేయడం ప్రారంభిస్తే మనం తిరిగి మహత్తర పీఠాన్ని అలంకరించగలం.
అత్యంతాదరంతో, హృదయపూర్వకంగా, మీరు నాకిచ్చిన స్వాగతానికి వందనాలర్పిస్తున్నాను. ఈ రామనాడు మహారాజుగారు నా పట్ల చూపుతున్న ప్రేమకు తగురీతిలో నా కృతజ్ఞతను తెలుపగలగడం నాకు సాధ్యంకాదు. నేను స్వయంగాగాని, ఇతరుల ద్వారా కానీ ఏదేని సత్కార్యం చేసివుంటే అందుకై భారతదేశం కృతజ్ఞత ఈ సత్పురుషునికే చెందవలసివుంది. ఏమంటే అసలు నేను ‘షికాగో’ నగరానికి పోవాలని మొదట సంకల్పించింది వీరే. ఆ భావాన్ని నాకు సూచించి దాన్ని నిర్వహింప పట్టుపట్టి, ప్రోత్సాహించినదీ వీరే! ఇప్పుడు నా దగ్గర నిలుచుండి, నేనింకా పనిచేయాలని, వెనుకటి ఉత్సాహంతోనే, ఆయన సదా ఆశిస్తున్నారు. మన ప్రియ మాతృభూమిపట్ల అభిమానం వహించి, ఆధ్యాత్మమార్గాన, దేశజనయిత్రిని ఉద్ధరించడానికై పాటుపడటానికి ఇట్టి రాజశ్రేష్ఠులు ఇంకా ఎందరో దొరుకుతారుగాక అని, నేను కోరుతున్నాను.