జాఫ్నానగరంలోని హిందువులు
శ్రీ వివేకానంద స్వాములవారికి సమర్పించిన స్వాగతపత్రం
శ్రీమత్ వివేకానంద స్వాములవారికి –
పూజ్య స్వామీజీ!
హిందూమతాన్ని అవలంబించే జాఫ్నానివాసులమైన మేము, ఈ సింహళద్వీపంలో హిందుమతానికి ప్రధానస్థానమైన మా నగరానికి హృదయ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. లంకలోని ఈ ప్రాంతంలో దర్శనమివ్వడానికై దయతో మా ఆహ్వానాన్ని అంగీకరించినందుకు మీ పట్ల మేమెంతో కృతజ్ఞులం.
రెండువేల సంవత్సరాలకు పూర్వం మా పూర్వీకులు దక్షిణ భారతదేశం నుండి ఇక్కడికి వచ్చి నివాసాలను ఏర్పరచుకొన్నారు. వారితో వారి మతంకూడ వచ్చింది. అప్పటి జాఫ్నా నగరపు తమిళ రాజులు ఆ మతాన్ని ఆదరించారు. వారి రాజ్యంపోయి పోర్చుగీసు, డచ్చి ప్రభుత్వాలు రాగానే, మా మతధర్మాచరణానికి అవరోధం కలిగింది. బహిరంగ పూజలు నిషేధించబడినాయి. మహాప్రఖ్యాతమైన రెండు మందిరాలతో పాటు, అనేక పవిత్ర దేవాలయాలు నేలమట్టం కావించబడ్డాయి. ఆ జాతులవారు, మా పూర్వులను క్రైస్తవమతంలోకి బలాత్కారంగా మార్చాలని ఎంత పట్టుపట్టినా, వారు చలించక హిందూమత సంప్రదాయాన్ని నిలబెట్టారు. అంతేకాదు, పరమపూజ్యమైన పిత్రార్జిత సంపదగా దాన్నివారు మాకిచ్చిపోయారు. ఇప్పుడు బ్రిటీష్‌వారి పరిపాలనలో, సముచిత, సమగ్ర మత పునరుద్ధరణం జరగడమే కాక, పూర్వపు పవిత్ర దేవాలయాలు తిరిగి నిర్మించబడినాయి; ఇంకా నిర్మించబడుతున్నాయి.
వేద ప్రతిపాదితమైన సత్యతేజాన్ని, సర్వమత పరిషత్తులో ప్రపంచ జాతులకంతా ప్రదర్శించడానికి, భారతీయుల దివ్యవేదాంత ధర్మాలను, ఇంగ్లండులో ప్రచారం చేయడానికి, పశ్చిమ ప్రపంచానికి హిందూమత ధర్మంతో పరిచయం కల్గించడానికి, తద్వారా ప్రాక్పశ్చిమ ఖండాలకు సౌహార్దం కల్గించడానికి, మీరు చేసిన మహనీయమైన అవ్యాజ పరిశ్రమకు మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తున్నాం. భక్తి నశించి, పారలౌకిక చింతనపై నిరసన మేర్పడి, జడవాదంతో కూడిన ప్రస్తుతకాలంలో, మన ప్రాచీన మతాన్ని పునరుద్ధరించడానికై మీరొక మహోద్యమాన్ని బయలుదేరదీశారు. అందుకై మా వందనాలర్పిస్తున్నాం.
మన మతం విశ్వశరణ్యమని, ఉదారతాకృత ధర్మమని, మీరు పాశ్చాత్య ప్రజలకు తెలిపారు. పాశ్చాత్య తత్త్వశాస్త్రాలు, చివరకు ఊహింపనైనాజాలని అనేక గూఢరహస్యాలు హైందవ వేదాంతంలో ఉన్నాయని, పాశ్చాత్య ధర్మవిచారపరుల మనస్సులో నాటే విధంగా ఉద్ఘోషించారు. అందుకు మా కృతజ్ఞతను తగువిధంగా తెలుపజాలకున్నాం.
పశ్చిమదేశంలో మీ మహోద్యమ పురోగమనాన్ని జాగరూకులమై కనిపెడుతున్నామని, మీ ధర్మపరాయణతకు మీ నిరంతర కృషికి, మీ విజయ పరంపరలకు, మేము పరమానందాన్ని పొందుతున్నామనీ, మీకు వేరుగా చెప్పాలా? పాశ్చాత్య దేశాల్లో విద్యావ్యాసంగానికి, ధర్మప్రచారానికి, మతవిచారణకు, ప్రసిద్ధి చెందిన ప్రధాన నగరాల్లోని వార్తాపత్రికలన్నీ మిమ్మల్ని గూర్చి, మన మత వాఙ్మయ ప్రదర్శనలో మీరు చేసిన అద్భుత ప్రచారాన్నిగూర్చి వ్రాసిన స్తోత్ర వాక్యాలే, మహనీయమైన మీ ఉదాత్తకృషికి ప్రబల సాక్ష్యాలు.
మీరు మా ప్రాంతానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలర్పిస్తున్నాం. మీతోపాటు, సత్యమైన పారమార్థిక విజ్ఞానానికి, వేదాలు మూలాధారాలని విశ్వసించే మేము, మిమ్మల్ని దర్శించే అవకాశాలు మళ్ళీ మళ్ళీ లభించాలని ఆశిస్తున్నాం.
ఇంతవరకు, మీ ఘనతరమైన ఉద్యమానికి అద్భుత విజయాన్నిచ్చి ధన్యంచేసిన పరమేశ్వరుడు, మీ మహోద్యమాన్ని ఇంకా సాగించడానికై మీకు చిరాయువును, జవసత్త్వాలను సంపూర్ణంగా ఇచ్చి రక్షించుగాక! అని ప్రార్థిస్తున్నాం.
చిత్తగించండి
ఇట్లు
జాఫ్నానగర హైందవ సంఘం
శ్రీ స్వాములవారు ఈ అభినందన పత్రానికి ఉచిత రీతిగా ప్రత్యుత్తరమిస్తూ, ఆ మరుసటి దినమే సాయంకాలం “వేదాంత మతాన్ని” గూర్చి ఈ క్రింది విధంగా ఉపన్యసించారు:
విషయమా చాలపెద్దది; సమయమా చాలాకొద్ది. హిందువుల మతాన్ని గూర్చిన పూర్తివివరాలను తెలుపడానికి ఈ ఒక్క ఉపన్యాసంలో సాధ్యంకాదు. కాబట్టి, మన మతంయొక్క ప్రధాన విషయాలను మాత్రం నా చేతనైనంతలో, సరళమైన భాషలో మీకు నివేదిస్తాను. మనం హిందువులమని చెప్పుకోవడం ఆచారమైపోయింది. కాని ‘హిందువు’ అనేమాట, ఈనాడు కేవలం అర్థహీనమైంది. ఎందుకంటే “సింధునదికి ఆవలి ఒడ్డున నివసించే వారు” అని ఈ మాటకు అర్థం. “సింధు” అనే సంస్కృత పదాన్ని పాడుచేసి పారసీకులు ‘హిందు’ గా మార్చారు. వారున్న తావునుండి, సింధునదికి ఆవలి ఒడ్డులో నివసిస్తున్న ప్రజల్ని వారు ‘హిందువులు’ అని పిలిచేవారు. ఆ తర్వాత ఈ మాట పరంపరగా వాడుకలోకి వచ్చింది. మహమ్మదీయుల పరిపాలనాకాలంలో, ఈ మాట చివరికి మన వ్యవహారంలోకికూడ ప్రాకింది. ఈ పదాన్ని ఉపయోగించడం వల్ల హానిలేదు. కాని, నేను చెప్పినట్లు అది అర్థహీనమైపోయింది. ఎందుకంటారా? సింధునదికి ఈవలి ఒడ్డులో నివసించే ప్రజలంతా పూర్వకాలంలోలాగా, ఈనాడుకూడ, ఒకే ఒక్క మతాన్ని అవలంబించే వారు కారు. కాబట్టి ఈమాట కేవలం హిందువులకే కాక, ఇండియాలో నివసించే మహమ్మదీయులు, క్రైస్తవులు, జైనులు మొదలైన అన్ని మతాలవారికి చెల్లుతుంది. కాబట్టి ‘హిందువు’ అనే పదాన్ని నేను వాడను. మరి ఏ పదాన్ని వాడాలి? మనం ఉపయోగించదగిన పదాలనేకమున్నాయి. వేదధర్మాల్ని అనుసరించేవారు, అనే అర్థమిచ్చే “వైదికులు” అనే పదాన్నిగాని, లేక వేదాంతాన్ని అనుష్ఠించేవారు అనే అర్థమిచ్చే “వేదాంతులు” అనే పదాన్నిగాని ప్రయోగించవచ్చు. కొన్ని గ్రంథాలను, భగవంతుని పలుకులనో లేక ఏ మహాపురుషుని సూక్తులనో చెబుతూ, వానిని తమ మతాలకు పరమ ప్రమాణాలుగా, పునాదులుగా తలదాల్చడం సాధారణంగా ప్రపంచంలోని అన్ని మతాలవారికీ పరిపాటే. ఇలాంటి పుస్తకాలు అన్నిటిలో, నవీన పాశ్చాత్య పండితుల అభిప్రాయం ప్రకారం హిందువుల వేదాలు అత్యంత ప్రాచీనాలు. కాబట్టి వేదాలనుగూర్చి కొంత తెలుసుకోవడం అవసరం.
వేదాలు అపౌరుషేయాలు. అవి మానవ ప్రోక్తాలు కావు (మనుషులు చెప్పినవి కావు). వానికాలం ఇంతవరకు నిర్ణయించబడలేదు. ఇక ఎన్నటికీ నిర్ణయించబడజాలదు. వేదాలు అనాదులని మన నమ్మకం. ఒక్క ముఖ్యవిషయం మీరంతా జ్ఞప్తియందుంచుకోవాలని కోరుతున్నాను. ప్రపంచంలోవున్న ఇతర మతాలన్నీ ఒక సాకార దైవతమో, కొంతమంది మహాత్ములో, దేవతలో, లేక భగవంతుడు ప్రత్యేకంగా పంపిన ప్రవక్తలో అనుగ్రహించి ఎవరో కొందరు వ్యక్తులకు ప్రసాదించారనీ, ఆ ప్రసాదించిన వారి గొప్పదనాన్ని బట్టి, తమ తమ మతాలు ప్రమాణాలని వారు చెప్పుకొంటున్నారు. ఇక హిందువులకో – వేదాలే పరమ ప్రమాణం. ఆ వేదాలు, ఎవని ప్రామాణ్యంపైనా ఆధారపడటం లేదు. అవి సనాతనమై, బ్రహ్మజ్ఞాన నిలయాలైనందువల్ల వానికవే ప్రమాణాలు. అవి ఎన్నడూ, ఎవరిచేత రచింపబడలేదు. అవి అనాదికాలంనుండి ఉన్నవే. ఆద్యంతాలు లేక ఈ సృష్టి శాశ్వతమై, సనాతనమై ఉండేవిధంగా, ఈశ్వరజ్ఞానంకూడ తుది మొదలు లేనిదై ఒప్పుతోంది. వేదాలంటే ఈ జ్ఞానరాశే. “విద్” అంటే, తెలిసికోవడమని అర్థం. వేదాంతమనబడే ఈ జ్ఞాన పుంజమును మహాపురుషులైన ఋషులు ప్రకాశానికి తెచ్చారు. ‘ఋషి’ అంటే మంత్రద్రష్ట, భావం తెలిసినవాడని అర్థం. భావాన్ని గ్రహించడమే అతను చేసింది; భావంమాత్రం అతనిది కాదు. ఏదైనా ఒక వేదవాక్యం ఒకానొక ఋషివల్ల లభించిందని మీరు వినినప్పుడు, దాన్ని ఆయన వ్రాశాడనికాని, తన మనస్సులోనుండి సృష్టించాడనికాని భావించకండి; అదివరకే ఉన్న భావాన్ని ఆయన దర్శించాడు. అంతే. అనాదిగా జగత్తులో ఉండినదే. ఈ ఋషి దాన్ని కనిపెట్టాడు. పరమార్థ సత్యాలను కనిపెట్టినవారే మహర్షులు.
వేదమనే ఈ మహాగ్రంథరాశి, ముఖ్యంగా ‘కర్మకాండ’, ‘జ్ఞానకాండ’ అని రెండు భాగాలుగా విభజింపబడివుంది. కర్మకాండ కార్యకలాప సంబంధమైంది. జ్ఞానకాండ ఆధ్యాత్మిక విచార సంబంధమైంది. కర్మకాండ అనేక యజ్ఞాలనుగూర్చి తెలుపుతుంది. వానిలో అనేకం ఇప్పటి పరిస్థితులలో సాధ్యంకావని వదలివేయబడ్డాయి. అయినా తక్కినవి యేదో ఒక రూపంలో నిలిచి ఉన్నాయి. బ్రహ్మచారి (విద్యార్థి) ధర్మాలు, గృహస్థుని ధర్మాలు, సన్యాసి ధర్మాలు, ఈ వివిధ జీవిత దశల భిన్నాభిన్న ధర్మాలు కర్మకాండలో ముఖ్యంగా తెలుపబడినాయి. అవి నేటివరకు కొంచెం హెచ్చు తగ్గుగా, ఆచరణలోనే ఉన్నాయి. కాని మన మతంయొక్క ఆధ్యాత్మ భాగం జ్ఞానకాండ, లేక వేదాంతం అనే రెండవ భాగంలో ఉంది. వేదాంతమంటే, వేదాల అంతం లేక సారాంశం లేక పరమావధి అని భావం. వేదాలలోని జ్ఞానసారానికి వేదాంతమని పేరు. ఇది ఉపనిషత్తులలో ఉంది. భారతదేశంలోని అన్ని సంప్రదాయాలవాళ్ళు ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు, శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, సూర్యోపాసకులు, గాణాపత్యులు, ఇంతెందుకు? హిందూమతావరణంలోకి రావాలని సాహసించే ప్రతి సంప్రదాయమూ, వేదాల్లోని ఉపనిషత్తులను ఒప్పుకొని తీరాలి! వాటికి స్వతంత్ర వాఖ్యానం చేసికోవచ్చు; తమ తమ సంప్రదాయాలను అనుసరించి అర్థం చెప్పుకోవచ్చు. కాని వాటి అధికారానికి లోబడి తీరాలి! ఈ కారణంచేతనే హిందువు అనే మాటకు బదులుగా వేదాంతి అనే మాటను, మనం ఉపయోగించుకోవాలనుకోవడం. సనాతనులైన హైందవ తాత్త్వికులందరు వేదాంతం పరమ ప్రమాణమని అంగీకరించారు. ఈనాటి మన మతాలన్నీ అవి ఎంత మోటుగా కనబడినా, వాటి ఆదర్శాలు ఎంత గూఢంగా ఉన్నా జాగరూకతతో పరిశీలించి అర్థంచేసుకొంటే, అవి అన్నీ ఉపనిషత్ ధర్మాలపైనే ఆధారపడి ఉన్నట్లు విశిదమవుతుంది. చివరికి హిందువులలోని అతి మూర్ఖ సంప్రదాయాల ప్రతీకలను, లేదా విగ్రహాలను పరిశీలించినా, ఈ ఉపనిషత్తుల భావాలు మన జాతిలో ఎంత లోతుగా నాటుకొనిపోయాయో తెలుసుకోవచ్చు. ఈ ఉపనిషత్తులు కొంతకాలానికి విగ్రహాలు మొదలైన వాటిరూపంలో సాంకేతిక చిహ్నాలుగా ఏర్పడ్డాయి. ఉపనిషత్తులలోని పారమార్థిక తాత్త్విక మహాభావాలు, నేటి మన ఇళ్ళలోని విగ్రహపూజారూపాలుదాల్చి కనపడుతుంటాయి. ఇలా మనం ఉపయోగించుకొనే వివిధమైన సాంకేతిక చిహ్నాలన్నీ వేదాంతంనుండే వచ్చాయి. ఎందుకంటే వేదాంతంలో అవి భాషాలంకారాలుగా వాడబడ్డాయి. ఆ భావాలన్నీ జాతి అంతటా వ్యాపించి, మన ఆరాధ్య దేవతారూపాలను పొంది, నిత్య జీవితంలో కలిసిపోయాయి.
ఈ వేదాంతానికి తర్వాత స్మృతులు వస్తాయి. ఇవీ ఋషులు వ్రాసిన పుస్తకాలే, కానీ వీని ప్రామాణికత వేదాంతం ప్రామాణికతకన్నా తక్కువ! ఇతర మతస్థులకు వారి వారి మత గ్రంథాలతో ఎలాంటి సంబంధం ఉందో ఈ స్మృతులతో మనకూ అలాంటి సంబంధమే ఉంటుంది. ఈ స్మృతులు ఆయా ఋషులచేత వ్రాయబడినట్లు మనం ఒప్పుకొంటాం. ఆ అర్థంలో అవి ఇతరుల మతగ్రంథాల వంటివే; కానీ ఈ స్మృతులు పరమ ప్రమాణాలు కావు. వేదాంతానికి విరుద్ధమైనది ఏదైనా ఒక స్మృతిలో ఉంటే, ఆ స్మృతిని త్రోసివేయాల్సిందే. దాని ప్రామాణికత అంతరిస్తుంది. ఈ స్మృతులు ఆయా కాలాల్లో మారుతూ ఉంటాయని మనకు తెలుసు. కొన్నికొన్ని స్మృతులు సత్యయుగంలో, కొన్ని కొన్ని త్రేతాయుగంలో, కొన్ని ద్వాపరయుగంలో, మరికొన్ని కలియుగంలో ప్రమాణాలుగా ఉంటూ వచ్చాయని మనకు తెలుసు. కాలంమారి, కాలంతోపాటు పరిస్థితులు మారినపుడెల్లా ఆచార మర్యాదలు మారవలసి ఉంటాయి. జాతియొక్క ఈ ఆచార మర్యాదల్ని సంస్కరించే స్మృతులు కూడా ఆయా సమయాల్లో మారితీరాలి. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా జ్ఞప్తిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. వేదాంత ధర్మాలు మారేవి కావు. ఎందుకంటే, అవి ప్రకృతి పురుషులలోగల సనాతన ధర్మాలపైనే ఆధారపడినవి. జీవుడు స్వర్గానికి పోవడం మొదలైన భావాలు ఎన్నడూ మారజాలవు. వేలకొద్దీ సంవత్సరాలకు పూర్వం అవి ఎలావుండేవో, ఈనాడూ అలాగే ఉన్నాయి. కాని పూర్తిగా మన సంఘ స్థితిగతులపై ఆధారపడివుండే మతాచారాలు, సంఘాల్లో కలిగే మార్పులతో పాటు, మారవలసి ఉంటుంది. ఒక శాసనం ఒకానొక కాలంలో క్షేమకరమై, ధర్మమై ఉంటుంది. మరొక కాలంలో అది అలావుండదు. ఒక విధమైన ఆహారం ఒక కాలంలో సరిపడి, వేరొక కాలంలో సరిపడదు. ఏమంటే ఆ ఆహారం ఆ కాలానికి మాత్రమే యోగ్యమైంది. శీతోష్ణస్థితులు, ఇతర విషయాలు మారినప్పుడు, ఆయా సందర్భాన్ని అనుసరించి ఆహారమూ మారుతూ ఉంటుంది. కాబట్టి ఆహారాది విషయాల్లోకూడ, ఆయాకాలంలో స్మృతిధర్మాలు మారుతున్నాయి. ఈ విధంగా నవీనకాలంలోకూడ సంఘంలో మార్పులవసరమైతే వానిని అంగీకరించి తీరాలి! దానిని మార్చే విధానాన్ని ఋషులు ఏర్పాటుచేసి మనకు చూపుతారు. కాని మన పరమార్థధర్మాలలో ఒక్క లేశమైనా మారడానికి వీల్లేదు. ఆ ధర్మాలు చెక్కుచెదరక అలా ఉండాల్సినవే.
ఇక పురాణాలున్నాయి. ‘పురాణం పంచ లక్షణమ్’ అని పురాణాలు అయిదు లక్షణాలు కలవిగా ఉన్నాయి. చరిత్ర, సృష్టిక్రమం, వేదాంత ధర్మాలు, ఆదర్శ సంకేతాలు మొదలైన వానిని పురాణాలు తెలుపుతాయి. ఇవి వేదాలందలి మతధర్మాలను ప్రజాసామాన్యానికి బోధించడం కోసమని వ్రాయబడ్డాయి. వేదాలలోని భాష చాలా పురాతనమైంది. పండితులలోసైతం బహుకొద్దిమంది మాత్రమే వేదాలు ఎప్పుడు వెలువడ్డాయో, ఆ భాష ఎలాటిదో గ్రహించగలరు. పురాణాల్లో ఆ కాలం ప్రజల భాషలో వ్రాయబడ్డాయి. దాన్నే ఇప్పుడు సంస్కృతమంటున్నాం. కాబట్టి, ఈ పురాణాలు పండితులకోసం కాక సామాన్య ప్రజలకోసం ఉద్దేశించబడ్డాయి. ఈ ప్రజాసామాన్యానికి తత్త్వశాస్త్రం అర్థంకాదు. అలాంటి తత్త్వవిషయాలు ఋషులు, రాజులు, మహాపురుషుల జీవితాల సహాయంతోను, జాతికి సంభవించిన చారిత్రక సంఘటనల సహాయంతోను, స్థూలరూపంలో ప్రజలకు బోధింపబడుతున్నాయి. మతంయొక్క సనాతన సూత్రాలను నిదర్శనపూర్వకంగా తెలుపడానికి అలాంటి విషయాలను ఋషులు పురాణాల్లో ఉపయోగిస్తూ వచ్చారు.
తంత్రాలు అనే ఇతర గ్రంథాలు కూడ కొన్ని కలవు. కొన్ని విషయాలలో వీనికీ, పురాణాలకు చాలా పోలికుంది. కొన్ని తంత్రాలలో కర్మకాండకు సంబంధించిన యజ్ఞయాగాదుల ఆచారాలను పునరుద్ధరించాలనే ప్రయత్నం కనబడుతోంది.
ఈ గ్రంథాలన్నీ హిందువుల శాస్త్ర సముదాయం, తత్త్వవిచారణలోను, ఆత్మశోధనలోను, తమ శక్తిలో అత్యధిక భాగాన్ని వినియోగించిన జాతిలోను, ఇట్టి శాస్త్ర గ్రంథ సముదాయం పెరుగుతూ వస్తుంది. ఇలా ఎన్ని వేల సంవత్సరాలు జరిగాయో ఎవరికి తెలుసు? అట్టి హిందూ జాతిలో అనేక శాఖాసంప్రదాయాలుండటం సహజమే. ఇంకా కొన్నివేల శాఖలు బయలుదేరకుండటమే విచిత్ర విషయం! కొన్ని అంశాల్లో, ఈ శాఖలు చాలా విరుద్ధంగా ఉంటాయి. ఈ శాఖాసంప్రదాయాల్లోను, వాని ఆధ్యాత్మిక భావాల్లోను, ఉన్న భేదాలు విచారించడానికి మనకు కాలం చాలదు. కాబట్టి ఈ శాఖల వారంతా ఒప్పుకొనే సామాన్యసూత్రాలను, ప్రధాన ధర్మాలను విచారిద్దాం. దీనిని ప్రతి హిందువు తప్పక విశ్వసిస్తాడు.
మొట్టమొదట సృష్టిక్రమాన్ని తీసుకొందాం. ఈ సృష్టి లేక ప్రకృతి, మాయ, అనంతం, అనాది అయివుంది. ఈ ప్రపంచం నిన్న, మొన్న సృష్టించబడింది కాదు. దేవుడు వచ్చి ఈ లోకాన్ని సృష్టించి, పోయి పరుండి నిద్రపోతున్నాడనడం కేవలం అసంబద్ధం. సృజనశక్తి సదా పనిచేస్తూనే ఉంది. భగవంతుడు నిరంతరం సృష్టి చేస్తూనే ఉన్నాడు. ఎన్నడూ విశ్రాంతి తీసుకోడు. “నేను ఒక్కక్షణం కర్మ చేయక ఊరికే ఉంటే, ఈ జగత్తు సర్వనాశనమైపోతుంది” అని గీతలో శ్రీకృష్ణుడు పలికిన వాక్కులను జ్ఞాపకముంచుకోండి. మనచుట్టూ, రేయింబవళ్ళు పనిచేస్తున్న సృష్టిశక్తి ఒక్క నిమిషం మారికే ఉంటే, సమస్తమూ నేలకూలిపోతుంది. ఈ విశాల జగత్తులో సర్వత్ర, సర్వదా, ఈ శక్తి పనిచేస్తూనే ఉంది. కాని కల్ప, విలయ, నియమం ఉందికదా? సంస్కృత భాషలో ‘సృష్టి’ అనే మాటకు, ‘శూన్యంలోనుండి కల్పన’ అని అర్థం కాదు; ‘వ్యక్తీకరణం’ అని మాత్రమే అర్థం. ఆంగ్లభాషలో ‘క్రియేషన్’ అనే పదం ‘ఏమీ లేనిదానినుండి కల్పించడం’ అనే భయంకర మూఢభావాన్ని సూచిస్తుంది. శూన్యంనుండి కల్పన జరగడం, అభావంనుండి భావం రావడం అనేదాన్ని విశ్వసించండి అని కోరడం, మిమ్మల్ని అవమానించడమవుతుంది. ఆ పనిని నేను చేయజాలను. కాబట్టి ‘క్రియేషన్’ అనే మాటకు ‘వ్యక్తీకరణం’ అనే అర్థం చెప్పుకొందాం. ఈ జగమంతా ఎప్పుడూ ఉండేదే; కాని అది ఒకప్పుడు సూక్ష్మరూపం దాల్చి అవ్యక్తమై అణగి ఉంటుంది. విశ్రాంతి తీసుకొంటుందేమో అన్నట్లు కొంతకాలం అలా అణగి ఉంటుంది; సమస్తమూ దాన్నుండి మళ్ళీ వ్యక్తమవుతుంది; అంటే ఉబికి పైకివచ్చి గోచరిస్తుంది. పూర్వసంఘటనలే, పూర్వపరిణామాలే, పూర్వఆకృతులే మళ్ళీ కలుగుతాయి. కాని కొంతకాలం ఈ ఆటసాగి, మళ్ళీ అంతా విచ్ఛినమై, పొడిగా, ధూళిగా, సూక్ష్మదశను పొంది, అదృశ్యమై అణగిపోతుంది. ఆ అణగిపోవడం, తిరిగి మరొక్కసారి ఆవిష్కరణ పొందడానికే! ఈ విధంగా తరంగంలాగా, ఇది ముందుకు వెనక్కి అనంతకాలం నడుస్తూనే ఉంటుంది. ‘కాలం’, ‘దేశం’, ‘నిమిత్తం’ అనేవన్నీ ఈ సృష్టిలోనివే; కాబట్టి దీనికొక ఆది ఉందనడం వట్టి వెర్రిమాట. దీని ఆదిని గూర్చిగాని అంతాన్నిగూర్చిగాని ప్రశ్నించడానికి వీలులేదు. కాబట్టి మన శాస్త్రాలలో ఆది, అంతం అనే పదాలు ఉపయోగించేటప్పుడు, అవి ఒక్క ప్రత్యేకకల్పాన్ని గూర్చి వాడబడినవే అని గ్రహించాలి. అంతకు మించిన వ్యాప్తి వానికి లేదు.
సరే, సృష్టిని చేసేదెవరు? ‘గాడ్’ (ఈ ప్రసంగం ఆంగ్లంలో కదా?) ‘గాడ్’ అనే ఈ ఇంగ్లీష్ మాటను నేనే అర్థంలో వాడుతున్నాను? ఇంగ్లీష్‌లో మామూలుగా వాడే అర్థంలోకాదు. రెంటికి చాలా భేదముంది. నా భావాన్ని సరిగ్గా తెలిపే పదం ఆంగ్లభాషలో లేదు. కాబట్టి ‘బ్రహ్మం’ అనే సంస్కృతపదం వాడటం నాకు ఇష్టం. అతడు, ఈ సమస్త దృశ్య వస్తుజాలానికీ మూలకారణం. బ్రహ్మం అంటే ఎట్టివాడు? అతడు నిత్యుడు, నిత్యపవిత్రుడు, నిత్యజాగరూకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, కృపాళుడు, నిరాకారుడు, నిరవయవుడు; అతడు ఈ జగత్తును సృష్టిస్తాడు. అతడు ఈ జగత్తును, నిరంతరం సృష్టిచేస్తూ రక్షిస్తూనే ఉంటాడనడంలో రెండు చిక్కులు తటస్థిస్తాయి. ఈ ప్రపంచంలో ద్వంద్వాలున్నాయని మనకు తెలుసు. ఒకడు సుఖీస్తుంటే, వేరొకడు దుఃఖీస్తూంటాడు. ఒకడు ధనికుడు, ఇంకొకడు దరిద్రుడు. ఇది పక్షపాతాన్ని చూపుతోంది. అంతేకాక, ఇందులో క్రౌర్యమూ ఉంది. ఒకదాని బ్రతుకునకు మరొకదాని మరణం ఆధారం. ఒక జంతువు ఇంకొక జంతువును ముక్కలు ముక్కలుగా చీల్చి వేస్తుంది. ప్రతి నరుడు, తన సోదరుని అణచిపెట్టి తాను మించిపోవాలని చూస్తూంటాడు. ఇలా స్పర్ధ, క్రౌర్యం, భయం, నిట్టూర్పులు, హృదయవేదనలు, ప్రపంచంలో సర్వత్ర, అనుదినమూ కనబడుతూనే ఉన్నాయి. ఇదంతా ఒక దేవుని సృష్టి అయితే, ఆ దేవుడు క్రూరుడేకాదు, మహాక్రూరరాక్షసునికంటే అధముడు అవాలి! సరే, వేదాంతం చెప్పేదేమి? ఈ భిన్నత్వం, ఈ స్పర్థవుండటం భగవంతుని దోషం కాదు. ఇక వీనిని కల్పించేదెవరు? మనమే. మేఘం పొలాలన్నిటి మీద సమానంగా వర్షిస్తుంది. అయినా, బాగా దున్నిన పొలమే ఆ వర్షలాభాన్ని పొందుతుంది; దున్నక, నిర్లక్ష్యం చేయబడిన పొలం ఆ లాభాన్ని పొందజాలదు. అది మేఘం దోషంకాదు. భగవంతుని కరుణ నిత్యం, నిర్వికారం; మనమే భేదాన్ని కల్పిస్తున్నాం. అయితే కొందరు సుఖవంతులుగా, కొందరు దుఃఖవంతులుగా ఉండటం అనే భేదానికి సమాధానమేమి? వారు భేదాలకు ఎంతమాత్రమూ కారకులు కారే. ఏ పాపమూ ఎరుగరే అంటే ఈ జన్మలో కాదు; కాని గత జన్మలో కారకులయ్యారనాలి. పూర్వజన్మలోని కర్మలే, ఈ భేదాలకు కారణమని గ్రహించాలి.
ఇక రెండవ సూత్రాన్ని గూర్చి విచారిద్దాం. ఈ విషయంలో హిందువులే కాక బౌద్ధులు, జైనులు, అందరూ ఏకాభిప్రాయులవుతున్నారు. జీవం నిత్యమని అందరూ అంగీకరిస్తారు. అది శూన్యంనుండి కలిగిందనడం తగదు; అది అసంభవం. అటువంటి జీవం ఎందుకూ కొరగాదు. ఎందుకంటే, కాలంలో దేనికి మొదలుందో, కాలంలో దానికి తుదీవుంటుంది. జీవం నిన్న ప్రారంభమైతే, రేవు అంతరించి తీరాలి. అప్పుడు సర్వనాశనమే ఫలితార్థం. జీవం శాశ్వతమై వచ్చేదే! దీన్ని గ్రహించడానికి పెద్ద మేధాశక్తి అవసరం లేదు. ఈనాటి ప్రకృతి శాస్త్రాలన్నీ మనకు తోడ్పడుతున్నాయి. అవి మన ధర్మశాస్త్రాలకు భౌతిక ప్రపంచంలో నిదర్శనాలు చూపుతున్నాయి. మనలో ప్రతివాని స్థితి అనంతమైన పూర్వ జన్మల ఫలితార్థమే అని మీకు తెలుసు. లోకంలో ఒక బిడ్డ పుట్టాడనుకోండి అతడు ప్రకృతి చేతిలోనుండి తళుక్కుమని తటాలున ఊడిపడటంలేదు. కవులు అలా వర్ణించి ఆనందించిన, ఆనందింతురు గాక! కాని, బిడ్డ నెత్తిమీద అనంతమైన పూర్వకర్మ భారముంది. మంచో, చెడో తన పూర్వకర్మలను పరిష్కరించుకొనే నిమిత్తమే, అతడీ లోకానికి వస్తున్నాడు. ఇదే కర్మసూత్రం. మనలోని ప్రతివాడు, తన అదృష్టానికి తానే కర్త అవుతున్నాడు. ఈ సూత్రం ‘విధి వ్రాత’, ‘దైవసంకల్పం’ అనే వాదాలను ఎగురగొట్టేస్తోంది. ఈ సూత్రమే భగవంతునికీ, మానవునికీ సమాధానం కూర్చడానికి ఆధారమవుతోంది. మన దుఃఖాలకు మనమే బాధ్యులం; ఇంకెవరూ కారు. కార్యరూప ఫలం మనమే; కారణమూ మనమే. అందువల్లే, మనం స్వతంత్రులం అనడం. నేను దుఃఖీనైతే, ఆ దుఃఖం నేను తెచ్చిపెట్టుకొన్నదే. నేను తలచుకొంటే సుఖవంతుడనుగా మారగల ననడానికి అదే నిదర్శనం. నేను దుష్టుడనైతే అదీ నా కర్మఫలమే. కాబట్టి నేను తలపెట్టితే పవిత్రుడిని కాగలననడానికి రుజువుకూడ అదే. నరుని ఇచ్ఛాశక్తి పరిస్థితులన్నిటికీ అతీతమై ఒప్పుతోంది. దీని ముందు అంటే, నరునిలో ఉన్న బలిష్ఠం, మహత్తరం, అఖండం అయిన ఇచ్ఛా స్వాతంత్ర్యాల ఎదుట, ప్రకృతికూడ జోహారనవలసిందే; తలవంచి దాస్యం చేయవలసిందే. కర్మసూత్రం యొక్క మహిమ ఇలాంటిది సుమండీ!
తరువాతి ప్రశ్న: జీవుడు అంటే ఏమి? అనేది? ‘జీవు’ డనగా ఏమో గ్రహించనిదే మన శాస్త్రంలోని ‘దేవు’ డంటే ఏమో తెలుసుకోలేం. బాహ్య జగత్తును పరిశీలించే మూలంగా దానికి పరంలో ఏముందో కనిపెట్టడానికి భారతదేశంలో, ఇతర దేశాల్లో ప్రబల ప్రయత్నాలు సాగేయి. కాని, చివరికి ఆ ప్రయత్నాలన్నీ ఎలా వ్యర్థమయ్యాయో మనకందరకు తెలిసిన విషయమే. పరమార్థాన్నీ తెలుసుకోవడానికి మారుగా, మనం ఈ జడప్రపంచాన్ని పరిశీలించేకొద్దీ, మనమే జడమతులమైపోవడం తటస్థిస్తోంది. ఈ జడప్రపంచంలో విశేష జోక్యం కలిగించుకొన్నకొద్దీ, మనలో మిణుకు మిణుకుమంటున్న పారమార్థికతకూడ ఎగిరిపోవడం తటస్థిస్తోంది. కాబట్టి పారమార్థికతకు, పరమసత్యాన్ని గ్రహించడానికి అది మార్గం కాదు. అది హృదయంద్వారా, జీవాత్మద్వారా మాత్రమే లభించవలసి ఉంది. బాహ్యకర్మలు పరమార్థాన్ని గురించి, ఆ అఖండ బ్రహ్మాన్ని గూర్చి, ఏమీ బోధింపజాలవు. అంతర్య సాధనం మాత్రమే అలా చేయగలదు. ఆత్మద్వారా, అంటే, జీవాత్మ విచారణద్వారా మాత్రమే మనం దేవునిగూర్చి తెలుసుకోగలం. ఈ జీవాత్మ స్వభావాన్నిగూర్చి భారతదేశంలోని ఆయా సంప్రదాయాలమధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. కాని వారందరూ ఏకీభవించే అంశాలూ కొన్ని ఉన్నాయి. ఆత్మలు ఆద్యంతాలులేక స్వభావం చేతనే నిత్యాలని మనమందరం ఒప్పుకుంటాం. అంతేకాక సర్వశక్తులు ఆనందం, పరిశుద్ధత, సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం ప్రతి ఆత్మలోనూ నెలకొని ఉంటుందని మనం నమ్ముతాం. ఇది ఒక మహనీయమైన భావమని జ్ఞప్తి పెట్టుకోవాలి! కొద్ది, గొప్ప అనే భేదంలేక పుణ్య పాపాల భేదంలేక ప్రతిమానవునిలో, ప్రతిజీవిలో సర్వవ్యాపి, సర్వజ్ఞుడు అయిన ఒకే ఆత్మ వసిస్తూ ఉంటుంది. భిన్నత్వం ఆత్మలో లేదు. దాని బాహ్యాకారంలో ఉంటుంది. నాకూ, ఒక అత్యల్ప జీవికీ మధ్యఉండే భేదం ఆత్మప్రకాశంలోనే. మూలతత్త్వంలో ఆ జీవికూడ నా వంటిదే. అతడు నా సోదరుడే. నాలోవున్న ఆత్మే వానిలోనూ ఉంది. భారతదేశం ప్రబోధించిన మహాతత్త్వ రహస్యమిది. మానవ భ్రాతృత్వం భారతదేశంలో సర్వజీవ భ్రాతృత్వమవుతోంది. చిన్నచీమమొదలు, బ్రహ్మదేవుని వరకు, అన్ని శరీరాలు మనవే. శాస్త్రంలో ఈ భావముంది. “ఒకే ప్రభువు సమస్త శరీరాల్లోనూ అధివసిస్తాడని తెలిసి, యోగి, ప్రతి శరీరాన్ని ప్రభుమయంగా భావించి పూజిస్తాడు.” అందువల్లనే భారతదేశంలో బీదవారిని గూర్చి, పశువులను గూర్చి, ఇంతేల ప్రతిజీవిని గూర్చి, ప్రతి వస్తువును గూర్చి మహోదారభావాలు వెలుస్తున్నాయి. ఆత్మను గూర్చిన మన భావాలలో, సర్వాంగీకారం పొందింది ఇది ఒకటే.
దేవుడంటే ఎలాంటి వాడు? అనే ప్రశ్న ఇప్పుడు సహజంగా కలుగుతోంది. ఆత్మనుగూర్చి ఇంకొక విషయం చెప్పుకుందాం. ఇంగ్లీషుభాష నేర్చుకొనేవారు ‘సోల్’, ‘మైండ్’ అనే మాటల్ని అర్థం చేసుకోవడంలో తబ్బిబ్బుపడుతున్నారు. మనం అంటున్న ‘ఆత్మ’, ఇంగ్లీషులో అంటున్న ‘సోల్’ అనేది, విభిన్నములు. మనం ‘మనస్సు’ అంటున్న దాన్నే పాశ్చాత్యులు ‘సోల్’ అంటారు. సుమారు ఇరవై సంవత్సరాల క్రిందట, సంస్కృత భాషద్వారా, ‘ఆత్మ’ అనే మాటను, వారు వినేవరకు వారికి ఆ భావమే లేదు. ఇది స్థూలశరీరం. దాన్ని దాటిపోతే మనస్సు ఉంది. కాని, ఈ మనస్సు ఆత్మకాదు. సూక్ష్మశరీరం. అది జనన మరణాలను పొందుతూన్న సూక్ష్మాణువులతో ఏర్పడింది. ఈ మనస్సును దాటిన తర్వాత ఆత్మ ఉంటుంది. అదే నరునిలోగల ‘అహంత’ ; దాన్ని ‘సోల్’ అనిగాని, ‘మైండ్’ అనిగాని అనువదించతగదు. కాబట్టి మనం ఆత్మ అనే పదాన్నే వాడాలి! లేదా, పాశ్చాత్య తత్త్వవిదులు పేర్కొనే విధంగా ‘సెల్ఫ్’ అనాలి! మనం ఏ పదాన్ని ఉపయోగించినా, ‘ఆత్మ’ అంటే ‘మనస్సు’ కాదనీ, ఈ శరీరం కాదనీ, దీనినుండి అది వేరనీ జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఈ ఆత్మ సూక్ష్మశరీరమని పేర్కొనబడే మనస్సును తనవెంట తీసుకొని జనన మరణాలను పొందుతూ పోతుంది. అది సమస్త జ్ఞానాన్ని పొంది, పరిపూర్ణ వికాసం పొందిన తర్వాత, ఈ రాకపోకలు, అంటే జనన మరణాలు ఆగిపోతాయి. అట్టి దశలో, ఆత్మ తన సూక్ష్మశరీరాన్ని ఇచ్ఛానుసారం నిలుపుకోవచ్చు; లేదా, పూర్తిగా వదలివేసి స్వతంత్రమై శాశ్వతముక్తిని పొందవచ్చు. ఈ ముక్తే ఆత్మకు పరమగమ్యం. ఇది మన మతంలోని విశిష్ట లక్షణాలలో ఒకటి. మనకూ స్వర్గ నరకాలున్నాయి. కాని, అవి శాశ్వతం కావు. అవి శాశ్వతమనడానికి వీలులేదు. ఇవి అలా కాజాలవని ఈ విషయావగాహనవల్ల గ్రహిస్తాం. ఎన్ని స్వర్గాలున్నా అవీ ఈ లోకం వంటివే; కాని భూలోకంకంటే అవి చాలా పెద్దవిగా ఉండవచ్చు. అందలి భోగాలు కొంచెం ఎక్కువగానే ఉండవచ్చు. కాని ఇదంతా జీవునికి నష్టమే. స్వర్గాలెన్నో ఉన్నాయి. ప్రతిఫలాన్ని ఆశించి, ఇక్కడ సత్కర్మలు చేసే నరులు మరణించినప్పుడు, ఈ స్వర్గంలో దేవతలై పుట్టి, ఇంద్రుడు మొదలైన పదవులు పొందుతారు. ఈ దేవతానామాలు కొన్నిపదవుల పేర్లుగా ఉన్నాయి. ఇప్పటి దేవతలు ఒకప్పుడు మానవులుగా ఉండి, తమ సత్కర్మలవల్ల దేవతలయ్యారు. మనం ఇంద్రుడు మొదలైన పేర్లను గ్రంథాల్లో చూచినపుడు, అవి ఒక్కొక్క వ్యక్తి పేర్లు అని అనుకోరాదు. వేలకొద్దీ ఇంద్రులు ఉండగలరు. “నహుషుడు” అనే ఒక రాజున్నాడు అతడు మరణించినప్పుడు, ఇంద్రుడైనాడు. అది ఒక పదవి. ఒక జీవాత్మ ఉన్నతి సాధించి ఇంద్రవదవిని పొందవచ్చు. ఆ పదవిలో కొంతకాలం మాత్రమే అతడుండగలడు. ఆ గడువుకు తర్వాత, అతడు మరణించి, నరుడై పుడతాడు. కాన ఈ నరదేహమే అన్నిటికన్నా ఉత్తమమైంది. కొందరు దేవతలు ఇంకా గొప్పవారు కాగోరి స్వర్గభోగాలపైని వాంఛలనుకూడ త్యజిస్తారు. ఈ లోకంలో అనేకులు ధనం, అధికారం, భోగం మొదలైన వాని మోహానికి లోబడతారు; అట్లే దేవతలలోకూడ, అనేకులు వీని మోహంలో పడతారు. అందువల్ల తమ సత్కర్మఫలం వ్యయంకాగానే, క్రిందికి దిగివచ్చి, మళ్ళీ మానవులై పుడతారు. అందువల్లనే ఈ లోకానికి కర్మభూమి అని పేరు వచ్చింది. ఈ లోకంనందుండే మనం మోక్షాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి స్వర్గం సైతం వాంఛనీయంకాదు.
ఇక కోరదగినదేది? ముక్తి, ‘బంధరాహిత్యం’. మహోన్నత స్వర్గంలో సైతం, నీవు బద్ధుడవే, బానిసవే అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. నీవు ఇరవైవేల సంవత్సరాలు రాజుగా ఉంటే ఏం లాభం? నీకొక శరీర మున్నంతవరకు నీవు భోగాలకు దాసుడివే. నీవు కాలానికి లోబడి ఉన్నంతవరకు, దేశానికి లోబడి ఉన్నంతవరకు, నీవు బానిసవే. కాబట్టి, బాహ్యప్రకృతియొక్క, ఆంతరప్రకృతియొక్క బంధంనుండి విముక్తులం కావాలన్నది ఆదర్శం. ప్రకృతి నీ పాదాల దగ్గర పడాలి; నీవు దానికతీతుడివై, ముక్తుడివై, తేజస్వివై ప్రకాశించాలి! ఇక నీకు జన్మ ఉండదు; కాబట్టి మరణమూ ఉండదు; నీకు సుఖముండదు; కాబట్టి దుఃఖమూ ఉండదు. అది సర్వాతీతమైన, అనిర్వచనీయమైన నిత్యానంద పదవి. మనం ఈ లోకంలో సుఖం, శుభం అనేవి అట్టి నిత్యానందంయొక్క అత్యల్ప రేణువులనాలి. అలాంటి నిత్యానందమే మన పరమగమ్యం.
జీవాత్మకు లింగభేదం అంటే స్త్రీపురుషునపుంసక భేదం లేదు. ఆత్మ స్త్రీ అనిగాని, పురుషుడనిగాని చెప్పడానికి వీలులేదు. లింగభేదం కేవలం శరీరానికి సంబంధించింది. కాబట్టి, స్త్రీ పురుషుడు అనే భేదాలన్నీ ఆత్మకు సంబంధంగా చెప్పడం భ్రాంతి. అవి శరీరాన్ని గూర్చే చెప్పుకోదగినవి. అట్లే, వయస్సును గూర్చిన భావాలుకూడ; ఆత్మకు వయస్సనేది లేదు. ఆ సనాతనుడు, సర్వకాలం ఒకే తీరుగా ఉంటాడు.
ఆత్మ, భూలోకానికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు మన శాస్త్రాలు ఒక్కటే సమాధానం చెబుతున్నాయి. అజ్ఞానమే ఈ బంధనానికంతకూ హేతువు! అజ్ఞానం మూలంగా బద్ధులమయ్యాం. జ్ఞానం ఆ దోషాన్ని నివారణ చేస్తుంది; మనల్ని ఉద్ధరిస్తుంది. అలాంటి జ్ఞానం లభించడం ఎలా? అది భక్తిద్వారా లభిస్తుంది; భగవంతుని పూజించడంవల్ల, సమస్త జీవులను భగవంతుని ఆలయాలుగా భావించడంవల్ల లభిస్తుంది. భగవంతుడు సమస్త ప్రాణులలో వసిస్తున్నాడు కాబట్టి, గాఢ భక్తిద్వారా జ్ఞానం లభిస్తుంది; అజ్ఞానం అంతరిస్తుంది; బంధనాలు తెగిపోతాయి; జీవుడు ముక్తుడౌతాడు.
భగవంతుని గూర్చి రెండు భావాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. ఒకటసగుణం, రెండోది నిర్గుణం. భగవంతుడు సర్వవ్యాపి, సృష్టికర్త, రక్షకుడు, సర్వసంహారకుడు, ఈ జగత్తుకు శాశ్వత జనకుడు, జనని. అతడు మన నుండి అన్ని జీవాత్మలనుండి సదాభిన్నుడు – ఇది దేవునిగూర్చి సగుణ భావన; క్రమంగా అతనిని సమీపించి వానిలోనే వసించడం ‘మోక్షం’ అనబడుతుంది ఇక నిర్గుణ భావాన్ని విచారిద్దాం. అందులో, పై విశేషాలన్నీ అనవసరం, అసమంజసం, అని త్రోసివేయబడి, సర్వవ్యాపి, నిర్గుణుడు అయిన పురుషుడు మిగులుతున్నాడు. దేవుని జ్ఞాని అనడానికి వీలులేదు. ఎందుకంటె జ్ఞానం మనుష్య మానసానికి సంబంధించింది. అతడు హేతుశక్తి సమన్వితుడని చెప్పడానికి వీల్లేదు. అలా అనడం అతనిని చిన్నచూపుతో చూడటమవుతుంది. వితర్కం దుర్బల లక్షణం. అతడు సృష్టికర్త కాడు. ఎందుకంటే, బంధనం లేనివాడు దేనినిగానీ సృష్టించబోడు. భగవంతునికి బంధనమేముంది? వాంఛా సాఫల్యంకోసం తప్ప, ఎవడూ కర్మచేయడు. దేవునికి ఏమి వాంఛలుంటాయి? ఏవైనా కొరతలుంటే వానిని తీర్చుకొనే నిమిత్తంకాక, ఎవడూ పనులు చేయడు. పరమాత్మకు కొరతేముంది? వేదాలలో దేవుని గూర్చి, ‘అతడు’ అనే పదం ప్రయోగింప బడలేదు. ‘అది’ అనే, నిర్గుణ సూచకమైన పదమే ప్రయోగించబడింది. ‘అతడు’ అనగానే భగవంతుడు ఎవరో ఒక పురుషుడు అనే భావం కలుగుతుంది. వేదం నిర్గుణమైన పరమాత్మనే బోధిస్తోంది. ఈ సిద్ధాంతాన్ని అద్వైత సిద్ధాంతమంటారు.
ఈ నిర్గుణ తత్త్వంతో మనకున్న సంబంధమెలాంటిది? మనం ఆ తత్త్వమే; మనమూ, అతడూ ఒక్కటే. ప్రతివాడూ, ఆ నిర్గుణమూర్తి యొక్క వ్యక్తరూపమే. అదే అన్నిటికీ మూలాధారం. ఇట్టి అఖండ నిర్గుణతత్త్వం నుండి మనం వేరని భావించుకోవడం వల్లనే దుఃఖం కలుగుతోంది. ఈ అద్భుత నిర్గుణతత్త్వంలో మన ఐక్యాన్ని తెలిసికోవడమే మోక్షం. నేనిప్పుడు సంక్షేపంగా భగవంతుని గూర్చి చెప్పిన ఈ రెండు భావాలు మన శాస్త్రాలలో కనబడుతున్నాయి.
వీనిని గూర్చి ఇంకా కొంచెం వివరంగా చెప్పుకొందాం. ఈ నిర్గుణ దైవతంయొక్క భావనపైన ఆధారపడే ఏ నీతిశాస్త్రాలుగానీ నిర్మాణం కాగలవు. ప్రతిజాతిలో ‘నీ తోడి నరులను నీలాగే ప్రేమించు’ అని అత్యంత ప్రాచీనకాలంనుండి బోధించబడుతోంది. కానీ భారతదేశంలో ‘సమస్త జీవులను, నీవలె ప్రేమించు’ అని బోధించబడింది. నరులు, పశువులు అనే భేదాన్ని మనం పాటించం. అయినా మనలాగా ఇతర జీవులను ప్రేమించడం ఎందువల్ల ధర్మమో, ఎవరూ చెప్పడం లేదు; ఎవరికీ తెలీదు. కాని ఆ కారణం ‘నిర్గుణ బ్రహ్మమును’ గురించిన భావనలో ఇమిడిఉంది. ప్రపంచమంతా ఒక్కటని, సర్వ చైతన్యం ఏకంకాగా, విశ్వం అభిన్నమై భాసిస్తుందని నీవు తెలుసుకొన్నప్పుడు, మరొకనికి అపకారంచేస్తే నీకు నీవే అపకారం చేసికొన్నావనీ, మరొకనిని ప్రేమించడంవల్ల నిన్నునీవే ప్రేమించుకొన్నావనీ గ్రహిస్తావు. దీన్నిబట్టి మనం ఇతరులను ఏల హింసించరాదో తెలిసికోగలం. ఇలా ‘నిర్గుణ బ్రహ్మం’ అనే ఆదర్శమే నీతి శాస్త్రానికి ఆధారమని స్పష్టమవుతోంది. సరే అందులో సగుణ బ్రహ్మమునకు తావెక్కడ? ‘సగుణ బ్రహ్మ’ మనే భావంనుండే అద్భుత ప్రేమ ప్రవాహం ఉద్భవిల్లుతోందని నాకు తెలుసు. భక్తిమహిమ ఆయా కాలాలందలి పరిస్థితులకు అనుగుణంగా మానవులపై తన అద్భుత ప్రభావాన్ని ప్రసరింపజేయడం నాకు బాగా అనుభవమే. అయినా మనదేశంలో ఇప్పుడు అంతగా కావలసింది భక్త్యనుతాపం కాదు. మనకు పౌరుషత్వం కొరవడింది. ఆహా! ఈ నిర్గుణ బ్రహ్మభావం ఎంత వీర్యవంతమైంది? సమస్త భ్రాంతులను వెదజిమ్మివేసి “నేను ఈ విశ్వంలో అంతర్యామియై ఒప్పే నిర్గుణ బ్రహ్మమును” అనే జ్ఞానంతో, సాహసియై మానవుడు నిలబడగలడు. అతనికి భయం కలిగించేది ఇక ఏముంటుంది? ప్రకృతి శాసనాలను సైతం అతడు లెక్కచేయడు. మరణమంటే అతనికి పరిహాసంగా అనిపిస్తుంది. అతడు తన ఆత్మప్రభావంపైన ఆధారపడి నిలుస్తాడు. ఆ ఆత్మ అనంతమై, అఖండమై, అవినాశి అయి ప్రకాశిస్తోంది; ఆ ఆత్మను కత్తులు నరకజాలవు; గాలి ఆర్పజాలదు; నిప్పు కాల్పజాలదు; నీరు తడుపజాలదు; అది తుది, మొదలు లేనిది; దానికి చావు బ్రతుకులు లేవు. ఆద్యంతాలులేని ఈ ఆత్మతో పోలిస్తే, చంద్రులు, సూర్యులు, నక్షత్రమండలాలు, సముద్రంలోని నీటిచుక్కలను పోలి ఉంటాయి. ఆత్మ ప్రభావం ఎదుట, ఆకాశం శూన్యం; కాలం అవిభాజ్యమైపోతుంది. ఇట్టి మహిమాన్వితమైన ఆత్మలో మనకు విశ్వాసం కుదరాలి. అందుండి మనకెంతైనా బలం చేకూరుతుంది. నీవేది కాగోరిన అది కాగలవు. నీవు దీనుడవు అనుకుంటే దీనుడివే; బలాఢ్యుడను అనుకొంటే బలాఢ్యుడివే కాగలవు; పాపిని అనుకొంటే పాపివవుతావు; పుణ్యశాలివనుకొన్నావా, పుణ్యశాలివవుతావు. మనం దీనులమని అనుకోవడం తగదని ఇది మనకు నేర్పుతోంది. బలాఢ్యులం, సర్వశక్తిమంతులం, సర్వజ్ఞులం అని మనం సంకల్పం చేయాలి! ఆ శక్తి అంతా ఇప్పుడు నాతో వచ్చి ఉండకపోవచ్చు. కానీ అది నాలో ఉంది. సమస్త జ్ఞానం నాలో ఉంది; సర్వశక్తి నాలో ఉంది; నేను పరమ పవిత్రుడిని; నిత్యముక్తుడిని. ఈ జ్ఞానాన్ని నేను ప్రకటింపజాలకుండటం ఎందుకు? నాకు దానిలో విశ్వాసం కుదరలేదు కాబట్టే దానిలో నాకు విశ్వాసం కుదిరినతోడనే, అది ప్రకాశించగలదు. ప్రకాశానికి వచ్చి తీరుతుంది. నిర్గుణ బ్రహ్మంయొక్క భావన ప్రబోధించగలదిదే; మీ బిడ్డలను పసితనంనుండే పరాక్రమవంతులుగా చేయండి! వారికి దైన్యాన్ని నేర్పకండి. మీ ఆచారాలను నేర్పకండి. వారిని వీర్యవంతులుగా చేయండి. ధీరులై, సర్వదమనులై, సహనపరులై, సర్వస్వతంత్రులై నిలిచే విధంగా ప్రోత్సహించండి. మొట్టమొదట వారికి ఆత్మ యొక్క మహిమను తెలుపండి. అది మీకు వేదాంతంలో మాత్రమే లభించగలదు. ఇతర మతాల్లో కనిపించే భక్తి ప్రపత్తులు మొదలైన భావాలు, ఇంకా విశేష భావాలు అందుంటాయి. కాని, ఈ ఆత్మభావన ఉజ్జీవనప్రదమైన భావన; అత్యద్భుతమైంది. ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేయగల భావనాపటిమ వేదాంతంనుండే బయలుదేరగలదు. అది జడమైన భౌతిక శాస్త్రాలకు, మతానికీ సామరస్యాన్ని చేకూర్చగలదు.
ఈ విధంగా మన మతాన్ని గూర్చిన ప్రధానాంశాలను, అంటే ముఖ్యసూత్రాలను, మీకు తెలుపడానికి ప్రయత్నించాను. ఇక దాని అనుష్ఠానాన్నిగూర్చి నాలుగు మాటలు చెప్పవలసివుంది. ప్రస్తుతం భారతదేశంలోవున్న పరిస్థితుల్లో అనేక శాఖాసంప్రదాయాలు బయలుదేరడం సహజమే. నిజానికి భారతదేశంలో అనేక శాఖాసంప్రదాయాలు ఉండనే ఉన్నాయి. కాని అవి ఒకదాంతో ఒకటి పోరాటాలు చేయకుండా ఉండటం విడ్డూరం. శైవుడు, ప్రతి వైష్ణువుడు నరకం పాలబడవలసిందే అని అనడం లేదు. వైష్ణవుడూ, ప్రతి శైవుని నరకంలో కూలుదువుగాక అని శపించడమూ లేదు. “ఇది నా మార్గం; నీ మార్గంలో నీవు పో. చివరికి, మనమంతా కలిసికోగలం” అని ప్రతి దైవభక్తుడూ అంటాడు. భారతదేశంలో ఈ విషయం అందరికీ తెలుసు. ఇదే ఇష్టదేవతా సిద్ధాంతం. భగవంతుని పూజించడంలో అనేక విధానాలున్నాయని మన ప్రాచీనులు ఎప్పుడో గ్రహించారు. వివిధ స్వభావ గుణాలకు సరిపడేలా, వేర్వేరు మార్గాలుండాలని వారు తెలిసికొన్నారు. భగవంతుని చేరడంలో మీ మార్గం, నా మార్గం కాకపోవచ్చు. ఒకవేళ అది నాకు అపకారాన్ని చేయవచ్చు. కాని ప్రతివాడూ, ఒకే మార్గాన్ని అవలంబించి తీరాలనే భావనే చాలా అనర్ధకం, అర్థంలేనిది. అట్టి భావాన్ని పూర్తిగా త్యజించాలి. అందరూ ఒకే మతాభిప్రాయం కలిగి, ఒకే మార్గంలో నడువవలసి వస్తే, లోకం మునిగిపోతుంది. అప్పుడు మతాలన్నిటి బుద్ధి వికాసమంతా నాశనమైపోతుంది. వైవిధ్యమే జీవితానికి మూలాధారం. అది అంతరించినపుడు సృష్టి పూర్తిగా విలయమవుతుంది. భావంలో ఈ వైవిధ్యం కాపాడుకొనేంతవరకే మనం సజీవులమై ఉంటాం. వైవిధ్యమున్నంతమాత్రాన మనం పోట్లాడుకోనక్కర్లేదు. నీ మార్గం నీకు మంచిది. నా మార్గం నాకు మంచిది. నా మార్గానికి సంస్కృతంలో నా ‘ఇష్టదైవం’ అని పేరు. ప్రపంచంలోని, ఏ మతంతోకూడ మనకు వైరం లేదని మీరు ముఖ్యంగా జ్ఞప్తిలో ఉంచుకోవాలి. మనలో ప్రతివానికీ వాని ‘ఇష్టదైవ’ ముంది. కాని ఇతరులు వచ్చి ‘మా మార్గమే ఏకైక మార్గం’ అంటూ తన సంప్రదాయాన్ని మనకు బలాత్కారంగా అంటగట్టజూస్తే, మనం వాళ్ళను మందలించవలసి ఉంది. వారి మాటలు వింటే మనకు నవ్వొస్తుంది. భగవంతుని చేరడానికి వేరొక మార్గంలో పోతున్నారనే కారణంగా సోదరులను నాశనం చేయజూచే ఇలాంటి ప్రజలు ప్రేమనుగూర్చి బోధలు చేయబూనడం పరిహాసాస్పదం. వారి ప్రేమ అంతగా పాటించదగింది కాదు. తన మార్గానికి భిన్నమైన మార్గంలో నడిచే ఇంకొక మానవుని చూచి సహించలేనివారు ప్రేమనేమి బోధిస్తారు? వారిదే ప్రేమయితే, ఇక ద్వేషమంటే ఎలాంటిది? క్రీస్తునుగాని, బుద్ధునిగాని, మహమ్మదునుగాని, మరే ప్రవక్తనుగాని పూజించండని బోధించే, ఏ మతంతోకూడ మనకు వైరం లేదు. ‘సోదరా! స్వాగతం. నేను నీకు సహాయం చేస్తాను; కాని, నీవు నన్నుకూడ నా మార్గంలో పోనీయాలి” అది నా ‘ఇష్టం’ నీ మార్గం చాలా మంచిదే, సంశయం లేదు. కానీ, అది నాకు అపాయకరం కావచ్చు. నాకు ఏ ఆహారం సరిపడుతుందో, నా అనుభవాన్నిబట్టి నాకు తెలుస్తుంది. ఎంతమంది డాక్టర్లైనా నాకు సరిపడే ఆహారాన్ని నిర్ణయించి చెప్పజాలరు; నన్ను శాసించనూ లేరు. అట్లే “నా సొంత అనుభవంవల్ల నాకు ఏ మార్గం ఉత్తమమో నాకు తెలుసు. ఒక దేవాలయమో, ఒక ప్రతీకో, ఒక విగ్రహమో, ఏదో ఒకటి నీలోని దైవాంశను ప్రత్యక్షం చేసుకోవడానికి నీకు సహాయపడితే, నీవు దాన్ని అనుసరించడం నాకు ఇష్టమే” అని హైందవుడు చెబుతాడు. మీకిష్టమైతే, రెండువందల విగ్రహాలు పెట్టుకోండి. ఏవైనా కొన్ని రూపాలు లేదా కొన్ని మంత్రతంత్రాలు, ఆత్మ సాక్షాత్కారానికై మీకు సహకారకాలైతే, తప్పక వానిని అవలంబించండి. ఏయే విగ్రహాలు, ఏయే దేవళాలు, ఏయే కర్మకలాపాలు భగవంతుని సమీపించడానికి మీ కవసరమౌతాయో, వానిని యధేచ్ఛగా అనుసరించండి. కాని, వానిని గూర్చి వాదించవద్దు. మీరు వివాదాలకు దిగితిరా, దైవోన్ముఖంగా సాగే, మీ పయనం ఆ క్షణంలోనే ఆగిపోతుంది; అధోగతినిపొంది పశుప్రాయులవుతారు.
మన హైందవమతంలోని అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. మన మతం ప్రతి దానిని తనలో ఇముడ్చుకొంటుంది, కాని ఎవరినీ బహిష్కరించదు. మన కులాలు, మన సంప్రదాయాలు, మన మతంతో సంబంధించినట్లు కన్పించినా, వాటికి అలాంటి సంబంధం లేదు. ఈ సంప్రదాయాలు, మన జాతీయతను రక్షించడానికి ఒకప్పుడు అవసరమైనాయి. మన రక్షణకు అవసరం కానినాడు, అవి నిలువవు. స్వభావ సిద్ధంగా, అవి శిధిలమైపోతాయి కాని, నేను పెద్దవాడినైనకొద్దీ, భారతదేశంలోని ఈ ప్రాచీనాచారాలపై నాకు గౌరవభావం కలుగుతోంది. ఒకప్పుడు నేను వాటిలో చాలా ఆచారాలు నీచమని, నిష్ప్రయోజనమని అనుకొన్నాను. కాని కాలం గడిచేకొద్దీ, వాటిలో దేన్నిగానీ నిందించడానికి జంకుతున్నాను. ఎందుకంటే, వాటిలోని ప్రతిదానిలో, శతాబ్దాలకొద్దీ గడించిన అనుభవం ఇమిడి ఉంది. నిన్న మొన్న పుట్టి, రేపు చావనున్న ఒక కుర్రవాడు, నా దగ్గరికి వచ్చి నా పద్ధతులనన్నిటిని తప్పని అంటాడనుకోండి. నేను వాని మాటలను విని వాడి అభిప్రాయాల ప్రకారం, నా ఆచార వ్యవహారాలనన్నిటిని మార్చుకొంటే, నేనే మూఢుణ్ణి కావలసి ఉంటుంది. విదేశాలనుండి మనకు వస్తున్న బోధ చాలావరకు ఇలాంటిదే. ఆ పండితమ్మన్యులతో ఇలా చెపుతాం: “మీరు, మీ సంఘ నిర్మాణాన్ని సుసంబద్ధం చేసికొన్నప్పుడు, మేము మీ మాటను వింటాం. రెండు దినాలవరకైనా, ఒక్క అభిప్రాయాన్ని మీరు నిలుపుకోజాలకున్నారు; వివాదాలకు దిగుతున్నారు; ఓడిపోతున్నారు. తొలకరిలో పుట్టే మిడుతలలాగ, మీరు పుడుతున్నారు; వాటివలే అయిదు నిమిషాలలో చస్తున్నారు. నీటి బుడగలలాగా పైకి లేస్తున్నారు; ఆ బుడగలలాగానే, రెప్పపాటులో చిట్లిపోతున్నారు. మీరు మా సంఘంలాంటి, ఒక సుస్థిర సంఘాన్ని మొట్టమొదట నిర్మించుకోండి. ఇరవై శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరక, గొప్ప మహిమతో నిలిచివుండగల శాసనాలను, సంప్రదాయాలను, మొట్టమొదట మీరు నెలకొల్పుకోండి; ఆ తర్వాత, అట్టి విషయాలనుగూర్చి మీతో మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది లెండి. కాని అంతవరకు మీరు ఆలోచనలేక, పైత్యోద్రేకంతో తల తిరిగి మాట్లాడు బుడతలే, అని చెబుతున్నాను.”
నేను, మన మతాన్నిగూర్చి చెప్పవలసినదాన్ని ముగించాను. నేడు మనకు అవసరమైన ఒకటి, రెండు విషయాలను మీకు జ్ఞప్తికి తెచ్చి విరమిస్తాను. ఈ కలియుగానికి మహాభారతంలాంటి ఉత్తమగ్రంథాన్ని ప్రసాదించినందుకు శ్రీ వ్యాసమహర్షికి నమస్కరిద్దాం! పూర్వయుగాలలో ఆచరించబడిన తపస్సులు, కష్టభూయిష్టమైన యోగాలు నేడు ఉపయోగపడవు. ఈ యుగంలో ఆవశ్యకమైంది దానం; అంటే పరోపకారం. పరమార్థజ్ఞానాన్నివ్వడం అత్యుత్తమ దానం; దాని తర్వాత వ్యావహారిక జ్ఞానదానం. ఆ పిమ్మట ప్రాణరక్షణం. చివరిది ఆహారపానీయాల నివ్వడం. ఇవి దానాలు. పరమార్థ జ్ఞానాన్నిచ్చేవాడు, జాతిని, అనేక జన్మలలో పడకుండా రక్షిస్తాడు. వ్యావహారిక జ్ఞానదాతకూడ, పరమార్థజ్ఞానం వైపునకు నరుని దృష్టిని త్రిప్పగలడు. వీటి తరువాతనే ప్రాణరక్షణ మొదలైన ఇతర దానాలు లెక్కలోకి వస్తాయి. కాబట్టి పరమార్థజ్ఞానాన్ని బోధించడంకంటే, ఇతర విధాలైన కర్మలన్నీ తక్కువ అని మీరు గ్రహించడం అవసరం. ఇట్టి ఆధ్యాత్మజ్ఞానప్రచారంలో తోడ్పడటమే అత్యుత్తమ సహాయం. మన శాస్త్రాల్లో అనంతమైన పరమార్థ జ్ఞాననిధి ఉంది. ఈ త్యాగభూమిలో తప్ప, భూమిలో మరెక్కడా తత్త్వవిజ్ఞానాన్ని ఆచరణరూపంలో ప్రకటించే ఆదర్శమూర్తులను చూపజాలం. నాకు కొంచెం ప్రపంచానుభవం ఉంది. ఇతర దేశాల్లో ప్రగల్భాలు కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాని మతానుష్ఠానపరులైన, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవన చర్యలలోనికి ప్రవేశపెట్టిన పురుషశ్రేష్ఠులను ఇక్కడనే, ఈ దేశంలో మాత్రమే చూడగలం. మతమంటే మాటలు కాదు. చిలుకలుకూడా మాట్లాడగలవు. ఈ రోజుల్లో మాట్లాడే యంత్రాలుకూడా ఉన్నాయి. కాని వైరాగ్యంతో కూడిన ఆధ్యాత్మిక ధర్మసహితమైన, సహనశీలమైన, యాతనా బంధురమైన, అఖండ ప్రేమపూరితమైన జీవితం నాకు చూపించండి. అట్టి జీవనం మాత్రమే ఆత్మజ్ఞాని లక్షణం. మన దేశంలో ఇట్టి భావాలు, ఆదర్శమూర్తులైన ఇట్టి మహానుష్ఠానపరులు అసంఖ్యాకంగా ఉన్నారు. ఆ మహాయోగుల మేధలో, హృదయాల్లో కూర్చబడివున్న భాగ్యరాసుల్ని పైకితీసి, గొప్పవారనక, కొద్దివారనక, ధనికులనక, దరిద్రులనక, సర్వజనులకు సమంగా పంచిపెట్టాలి. భారతదేశంలోనే కాక, ప్రపంచమంతటా వాటిని వెదజల్లాలి!
అలా కాకపోతే, అది శోచనీయమైన విషయమవుతుంది. ఇది మన ఉత్కృష్టధర్మాల్లో ఒకటి. ఇతరులకు మీరు తోడ్పడేకొద్దీ మీకు మీరే తోడ్పడుతారు. మీరు నిజంగా మీ మతాన్ని ప్రేమిస్తే, మీరు యథార్థంగా మీ దేశాన్ని ప్రేమిస్తే, మీరు తప్పనిసరిగా నిర్వహించవలసిన ప్రధాన కర్తవ్యమిది. మూయబడిన మీ గ్రంథాల్లోని ఖజానాను వెలికితీసి, దాన్ని అందుకోవడానికి హక్కుగల వారసులకు, దాన్ని ప్రసాదించాలనే ఆశయ చరితార్థతకై, మీరు శక్తివంచనలేక కృషి చేయాలనేదే ఈ కర్తవ్యం.
అన్నిటికంటేకూడ ఒక విషయం మీకు తెలుపడం అవసరం. యుగయుగాంతరాలనుండి ఓర్వలేనితనం మన హృదయాల్లో ఇంకివుంది. మనం ఒకరిని చూచి ఒకరం అసూయపడుతున్నాం. “అతనికి ఆధిక్యం ఎందుకుండాలి? నాకే ఎందుకుండరాదు?” అంటూ ఉంటాం. దేవతా పూజల్లోకూడ “నేను ముందు; నేను ముందు” అంటూ ఉంటాం. అట్టి దౌర్భాగ్య దాస్యస్థితికి, మనం దిగాం. దీన్ని ముందు వదలించుకోవాలి! ఈ కాలంలో, భారతదేశంలో కనపడే మహానర్థకరమైన పాపం ఈ క్షుద్ర దాస్యభావమే. ప్రతివాడూ నాయకత్వం కోరుతాడు; విధేయుడై సహకరించడానికి ఎవ్వడూ ఒప్పుకోడు. పూర్వకాలపు అద్భుత బ్రహ్మచర్య ధర్మం అడుగంటి పోవడమే దీనికి కారణం. మొట్టమొదట విధేయతను నేర్చుకోండి. నాయకత్వం దానంతటదే వస్తుంది. మొట్టమొదట సేవకుడివిగా ఉండడం నేర్చుకోండి; ఆ తర్వాత స్వామిగా ఉండే అర్హత నీకు లభిస్తుంది. ఈ ఓర్వలేనితనం పోగొట్టుకోండి. ఇంకా చేయవలసివున్న మహాకార్యాలను అప్పుడు మీరు చేయగల్గుతారు. మన పూర్వులు అత్యద్భుత కార్యాలు చేశారు. వారి ఘనకార్యాలను గూర్చి, భక్తి ప్రపత్తులతో సగర్వంగా చెప్పుకొంటున్నాం. సరే మనమూ ఘనకార్యాలు చేయబోతున్నాం. ముందు రానున్నవారు వెనుదిరిగి చూచి, తమ పూర్వులైన మనల్నిగూర్చి, ధన్యవాదాలుచేస్తూ సగౌరవంగా ప్రస్తుతించనీ! మన పూర్వులు, మహాఘనులు, మహిమాఢ్యులు అయినా, వారి కీర్తి నతిక్రమించేంత మహాకార్యాలను ఇక్కడ ఉన్నవారిలో ప్రతిఒక్కరూ చేయగలిగే విధంగా పరమేశ్వరుడు అనుగ్రహించాలి!