శ్రీ వివేకానందస్వాములవారు రెండోసారి (19 వ తేదీ జూన్ 1899) పాశ్చాత్యదేశాలకు వెళ్ళే సందర్బంలో, బేలూరు మఠ సన్న్యాసులలో, పిన్నలు శ్రీవారికి వీడ్కోలుపత్రం సమర్పించారు. ఆ పత్రానికి శ్రీవారిచ్చిన సమాధానానికి ఈ క్రిందిది సంగ్రహరూపం. మఠానికి సంబంధించిన దినచర్య గ్రంథంలో ఇది వివరించబడింది.
దీర్ఘోపన్యాసానికిది సమయం కాదు. కాని, కొన్ని విషయాలను గూర్చి మీకు క్లుప్తంగా చెబుతాను. వాటిని మీరాచరణలో పెట్టాలని నా కోరిక. మొదట, మనం లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత దాన్ని ఆచరణలో పెట్టే మార్గాలను అన్వేషించాలి. సన్యాసులైన మీరు, ఇతరులకు సదా మేలు చేయ యత్నించాలి. సన్న్యాసమంటే అదే అర్థం. సన్న్యాసాన్నిగూర్చి దీర్ఘోపన్యాస మివ్వడానికి వ్యవధిలేదు. కానీ, మృత్యుప్రేమే సన్న్యాసం యొక్క ప్రధాన లక్షణమని క్లుప్తంగా చెప్పగలను. లౌకికులు జీవితాన్ని అభిలషిస్తారు. సన్న్యాసి మృత్యువును అభిలషించాలి. అయితే మనం ఆత్మహత్య చేసుకోవాలా? కాదు, కాదు. ఆత్మహత్య చేసుకొనే వారంతా మృత్యువును ప్రేమించేవారు కారు. ఏలంటే, ఆత్మహత్య ప్రయత్నం ఒకసారి విఫలమయిందో, తిరిగివారు ఆ ప్రయత్నాన్ని చేయరు. లౌకికానుభవం వల్ల మనకీ విషయం తెలుస్తోంది. అయితే, మృత్యువును ప్రేమించడం అంటే ఏమి? మనమెప్పుడో ఒకప్పుడు చావాలి! ఇది తప్పదు. అలాంటప్పుడు మనం సత్కార్యానికై ప్రాణాల్ని అర్పిద్దాం. మనం చేసే ప్రతిపనీ, తినడం, తాగడం, మొదలైనవన్నీ ఆత్మత్యాగానికి దారి తీయుగాక! తినడంవల్ల శరీరం పెరుగుతుంది. ఇతరుల మేలుకోసం, ఆ శరీరాన్ని త్యాగం చేయకపోతే, దానివల్ల ఫలమేమి? పుస్తకాలను చదివి జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. లోకానికి వినియోగించకపోతే, లోకం మేలుకోసం నీవు త్యాగం చేయకపోతే, ఆ జ్ఞానంవల్లకూడ ప్రయోజనం లేదు. సమస్త వసుంధర ఒక్కటే! అందులో అంతగా ప్రాముఖ్యంలేని అంశం నీవు సుమా! కాబట్టి స్వార్థానికై పాటుపడటంకంటె కోట్లకొద్దీ సోదరప్రజానీకానికి సేవచేయడం మంచిది.
“సర్వతః పాణిపాదం తత్ సర్వతోఽక్షి శిరోముఖమ్ ।
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్యా తిష్ఠతిః ॥”
(సర్వత్ర విస్తరించిన హస్తాలతోను, పాదాలతోను, ఎల్లెడలగల కన్నులతోను, శిరస్సులతోను, నోళ్ళతోను, సమస్త విశ్వంలో విస్తరించిన వీనులతోను, అది అన్నిటిలో పరిఢవిల్లుతోంది – గీత: 13–13)
ఇలా మీరు క్రమంగా మృత్యుముఖం సమీపించాలి. అలాంటి చావులోనే స్వర్గముంది. అందులోనే మంచి అంతా సంకుచితమైవుంది. దానికి వ్యతిరేకమైంది అంతా దుష్టమే. పైశాచమే.
ఇక లక్ష్యాలను ఆచరణలో ఉంచే మార్గాలగూర్చి ఆలోచిద్దాం. ఆచరణ సాధ్యంకాని, ఆదర్శాన్ని మనం గ్రహించరాదు. అసాధ్యమైన అత్యున్నతాదర్శం జాతిని బలహీనంగా, పతితంగా చేస్తుంది. బౌద్ధజైన మతాలు, వచ్చిన తర్వాత ఈ గతే పట్టింది. అలాగని సులభసాధ్యమైన ఆదర్శాన్ని గ్రహించడంకూడ దోషమే. మీకు కొంచెమైనా ఆలోచనా శక్తి లేకుంటే, మార్గదర్శకమైన ఆదర్శం లేకుంటే, మీరు కేవలం పశుతుల్యులే. కాబట్టి, మీ ఆదర్శాన్ని తగ్గించుకోరాదు. అలాగని అసాధ్యానికై ప్రయత్నించరాదు. ఈ రెండూ విసర్జనీయాలే. మన దేశంలో పూర్వం నుండి, ఏదో ఒక గుహలో కూర్చుని ధ్యానం చేస్తూ, ప్రాణాలను త్యజించాలనే భావం ఉంది. ఇతరుల విముక్తికై పాటుపడక, ఒక్కడు మాత్రమే విముక్తిపొందటం మంచిదికాదు. సోదరమానవుల ముక్తికై పాటుపడనిదే, తనకు ముక్తిలేదని మానవుడు గ్రహించే రోజులు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. ఉన్నతాదర్శంలో ఉత్తమాచరణను మీ జీవితంలో సమన్వయపరచడానికి ప్రయత్నించండి. ఈ క్షణంలో మీరు నిశ్చల సమాధిగతులు కావడానికి సిద్ధంగా ఉండాలి; మరుక్షణమే, ఇదిగో ఈ పొలాలకు పోయి అందులో పనిచేయడానికి కూడ సిద్ధపడాలి. (అక్కడి పొలాలను చూపుతూ స్వామి వారీమాట చెప్పారు.) ఈ క్షణంలో మీరు శాస్త్రాలలోని గూఢార్థాలను విప్పి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి; ఆ మరుక్షణమే పండించిన ఈ ధాన్యాన్ని సంతకు తీసుకొనిపోయి అమ్మడానికి సిద్ధపడాలి. ఇక్కడనే కాదు. ఎక్కడైనా, మీరు ప్రతి చిన్నపనికీ సంసిద్ధులై ఉండాలి.
జ్ఞాపకముంచుకోవలసిన విషయం మరొకటి ఉంది. నిజమైన మానవులను తయారుచేయడమే ఈ మఠం ఉద్దేశం. మీరు కేవలం ఋషులు చెప్పినదాన్ని నేర్చుకోవడంతో తృప్తిపడరాదు. ఆ ఋషులు గతించారు. వారితో వారి అభిప్రాయాలూ పోయాయి. ఇప్పుడు, మీరే ఋషులు కావాలి. మీరుకూడ ఇదివరకు జన్మించిన మహాపురుషుల లాంటివారే. అంతేకాదు, మీరు అవతారపురుషులవంటి వారుకూడ. కేవల పుస్తక జ్ఞానమేమి చేయగలదు? తపస్సుమాత్రం ఏమి సాధించగలదు? మంత్రతంత్రాలు ఏమి చేయగలవు? మీ పాదాలపై మీరు నిలవాలి. నిజమైన మానవులు తయారయ్యే ఈ కొత్తమార్గాన్ని మీరనుసరించాలి. మూర్తీభవించిన బలం, స్త్రీ సహజమైన కోమల హృదయం కలవాడే నిజమైన మానవుడు. మీ చుట్టుపట్లగల ప్రజలయెడ సానుభూతి కలిగి ఉండాలి. దాంతోపాటు, పరిసరాలకు లొంగని ధైర్యం, బలం ఉండాలి. విధేయతకూడ ఉండాలి. ఇది, అసంబద్ధంగా కనబడుతున్నప్పటికీ, పరస్పరవిరుద్ధమైన ఈ సుగుణాలన్నీ మీకుండాలి. నదిలో దూకి, మొసలిని పట్టుకొనిరమ్మని యజమాని ఆజ్ఞాపించాడనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? మొదట, అతని ఆజ్ఞను శిరసావహించాలి. తర్వాతనే అతనితో వాదించటం. ఆ ఆజ్ఞ చెడ్డదే కావచ్చు. కాని మొదట శిరసావహించండి. తర్వాత వాదించి పూర్వపక్షం చేయవచ్చు. సంఘాలలో, ఒకపెద్ద దోషముంది. ఎవరికైన ఒకరికి భేదాభిప్రాయం కలిగితే, తగిన అదనుకై వేచి ఉండక వెన్వెంటనే ఒక కొత్తశాఖను లేవదీస్తారు. ఇది వంగదేశంలో ఎక్కువగా ఉంది. కాబట్టి, మీకు సంఘంపట్ల గాఢమైన భక్తి గౌరవాలు ఉండాలి. అవిధేయతకు ఇందులో చోటులేదు. నిర్దయతో దాన్ని నిర్మూలించండి. అవిధేయులైన సభ్యులిందుండరాదు. ఉంటే, వారిని వెంటనే వెళ్ళగొట్టండి. సంఘవిద్రోహులు ఇందుండరాదు. మీరు గాలిలాగా స్వేచ్ఛగాను, ఈ మొక్కలాగా వినమ్రంగాను, కుక్కలాగా విశ్వాసంతోను ఉండాలి.