1898 వ సం ॥ మార్చి 11 వ తేదీ కలకత్తా స్టార్ థియేటర్లో, సోదరి నివేదిత (మిస్.ఎం.ఇ.నోబెల్) పై విషయాన్నిగూర్చి ఉపన్యసించారు. ఆ సభకు అధ్యక్షత వహించిన వివేకానందులవారు మిస్.నోబెల్‌ను సభ్యులకు పరిచయం చేస్తూ ఇలా ప్రసంగించారు.
నేను ఆసియాఖండపు ప్రాచ్యదేశాలలో పర్యటిస్తున్నప్పుడు ముఖ్యంగా ఒక్క విషయాన్ని చూచి చకితుడనయ్యాను. ఆ దేశాలలో భారతీయాధ్యాత్మిక భావాలు నేటికీ మిక్కిలి ప్రచారంలో ఉన్నాయి. చైనా జపాన్ దేశాలలో, దేవాలయం గోడలపై సుప్రసిద్ధమైన కొన్ని సంస్కృత మంత్రాలు లఖీంచబడి ఉండటం చూసినప్పుడు నేనెంత ఆశ్చర్యపడి ఉంటానో మీరూహించుకోవచ్చు. ఆ మంత్రాలన్నీ ప్రాచీన వంగభాషాలిపిలో ఉన్నాయి. ఈ విషయం మీకు మరింత ప్రీతిని కల్గించగలదు. మన తాత ముత్తాతల మహాశక్త్యుత్సాహాలకు స్మృతిచిహ్నాలుగా అవి నేటికీ అట్లే నిలిచివున్నాయి.
ఆసియాదేశాల్లోనే కాక, భారతీయాధ్యాత్మిక భావాలు, అంతట వ్యాపించి వుండేవనడంలో సంశయంలేదు. చివరికి పాశ్చాత్యదేశాల్లో సైతం నేటికీ వాటి ప్రభావపు జాడలు, కొంచెం తరచిచూడగా నాకు కనిపించాయి. భారతీయుల ఆధ్యాత్మిక భావాలు పూర్వకాలాన ప్రాక్పశ్చిమాలకు వ్యాపించాయనడం చారిత్రక సత్యం. ప్రపంచం భారతీయాధ్యాత్మికతకెంత రుణపడివుందో, భూత వర్తమానకాలాల్లో ఆ ఆధ్యాత్మిక శక్తులకు విశ్వమానవ సమాజంపై, ఎంతటి ప్రభావం ఉందో అందరికీ తెలుసు. ఇవన్నీ గతించిపోయిన విషయాలు. నేను మరొక విశిష్ట విషయాన్నికూడ గ్రహించాను. అది నాగరికతా మహాశక్తుల విజృంభణానికి, మానవతా వికాసానికీ, సాంఘికాభ్యుదయానికీ, ఆ ఆంగ్లోసాక్స్న్ జాతి – ఆ అద్భుత జాతి చేసిన మహాకృషి. ఆ ఆంగ్లోసాక్స్న్ జాతి అలాంటి కృషిచేయకుంటే, మనమీనాడు ఇక్కడ చేరి ఈ విషయాన్నిగూర్చి ఈ విధంగా చర్చించడమే జరిగేది కాదని నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను. మన దేశంలో సైతం ఈ ఆంగ్లోసాక్స్న్ శక్తుల ప్రభావం కనిపిస్తోంది. ఆ శక్తులలో కొన్ని లోపాలున్నా, తమ సహజ విశిష్ట లక్షణాలను అట్లే నిలుపుకొని సత్ఫలితాలనే సాధించాయి. ఆంగ్లేయుల ‘వ్యాప్తి’, ‘అభ్యుదయం’, ‘ఆత్మవ్యక్తీకరణం’ అనే భావాలు నేడు మనపై ఎక్కువగా పని చేస్తున్నాయి. ఈ సందర్భంలో మనం ఒక్క విషయాన్ని జ్ఞప్తిపెట్టుకోవాలి. పాశ్చాత్యుల నాగరికత అంతటికీ గ్రీకునాగరికతే ఆధారం. ఆ గ్రీకుల మహానాగరికత ప్రముఖ లక్షణం ‘వ్యక్తీకరణం’ భారతదేశంలో మనం ఆలోచనాపరులం. దురదృష్టవశాత్తు, ఒక్కొక్కప్పుడు, మన ఈ ఆలోచన చాలాతీవ్రమై, దాన్ని వ్యక్తీకరించే శక్తే శూన్యమైపోతుంది. ఇలా క్రమంగా లోకం ఎదుట, మన వ్యక్తీకరణశక్తి అదృశ్యమైపోయింధి. తత్ఫలితమేమో తెలుసా? మనకున్న ప్రతిదాన్నీ దాచుకోవడానికే ప్రయత్నిస్తూవచ్చాం. వ్యక్తులతో ప్రారంభమైన ఈ దాపరికం చివరికి జాతీయ లక్షణంగా పరిణమించింది. తత్ఫలితంగా నేడు మనమొక మృతజాతిగా పరిగణించబడుతున్నాం. వ్యక్తీకరణశక్తిలేక ఏ జాతిగానీ జీవించడమెలా? వ్యాప్తి, వ్యక్తీకరణం అనేవి, పాశ్చాత్య నాగరికతకు వెన్నెముక వంటివి. ఇప్పుడు ఆంగ్లోసాక్సన్ జాతి మనదేశంలో భారతజాతి స్వయం వ్యక్తమయ్యేలా చేస్తోంది. భారతదేశంలో ఇంతకాలం గుప్తమైవున్న అపార నిధులను ప్రపంచం ఎదుటికి తేవడానికై ప్రయత్నిస్తోంది. ఇందు కవసరమైన సాధన సంపత్తినికూడ ఆ జాతే, మన హిందూదేశానికొక భవిష్యత్తును సృష్టించింది. మన ప్రాచీనుల భావరాశి ఇప్పుడెక్కడ వ్యాపించి ఉందో సులభంగానే దృగ్గోచరమవుతోంది. నిజానికి మన పూర్వలు సత్యాన్ని, ముక్తినిగూర్చిన తమ సంధేశాలను దిగంతవ్యాప్తం చేసినపుడు, వారికే సౌకర్యాలుండేవి? బుద్ధభగవానుడు ఉదాత్తమైన తన విశ్వమానవ సౌభ్రాత్ర సిద్ధాంతాన్ని ఎలా బోధించగలిగాడు? ఆనాడుకూడ మన దేశంలో నిజమైన ఆనందాన్ని పొందడానికి చాలా మార్గాలుండేవి; మనం మన భావాలను వ్యాప్తిచేయడానికి అనేక సౌకర్యాలుకూడ ఉండేవి. ఇప్పుడు మనకు ఆంగ్లోసాక్స్న్ జాతితోకూడ సంబంధం ఏర్పడింది. నేడు మన సందేశాలను లోకమంతా వింటున్నది. వినడమే కాదు. విని స్పందిస్తోంది. ఇంగ్లండుదేశం తన మహామేధావులను కొందరిని మన కర్తవ్యనిర్వహణలో సాయపడటానికై అప్పుడే పంపింది. ఇప్పుడు, ఈ వేదికపై ఆసీనురాలై ఉన్న నా మిత్రురాలు, మిస్ ముల్లర్‌ను గూర్చి మీరంతా వినేవుంటారు. మీలో కొందరికి ఆమె అపరిచితురాలు కూడానేమో? ఆంగ్లదేశంలో ఒక సత్కుటుంబంలో జన్మించి, విద్యావతియైన ఈమె, మన జాతిపైవున్న అభిమానంవల్ల మనదేశాన్ని తన స్వగృహంగా, సంసారంగా చేసుకొని, తన జీవిత సర్వస్వాన్ని మనకోసం ధారపోస్తోంది. ఈ విధంగానే భారతదేశ శ్రేయస్సుకు, భారతజాతి పునరుజ్జీవనానికి తన యావజ్జీవితాన్ని అంకితం చేసిన మరొక ఉత్తమ ఆంగ్ల వనితనుగూర్చి నేను మీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. ఆమే మిసెస్ బిసెంట్. ఈ కర్తవ్య నిర్వహణకే కంకణం కట్టుకొన్న మరి ఇద్దరు అమెరికన్ మహిళామణులుకూడ ఈ సభావేదికపై కూర్చునివున్నారు. మన నిర్భాగ్యదేశానికి ఏ కొద్దిపాటి మంచినైనా చేయడానికై తమ జీవితమంతా కృషిచేయడానికి వారు సంసిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భాన ఇంగ్లండు, అమెరికా దేశాల్లో పర్యటించిన మన దేశీయునొకనిగూర్చి మీకు జ్ఞప్తిచేయవలసి ఉంది. అతనిపట్ల నాకు అపారమైన ప్రేమ, భక్తి, విశ్వాసాలున్నాయి. అతడీ సభకు వచ్చి ఉండేవాడే. వేరే పనివుండటంతో రాలేకపోయాడు. ఉన్నత, ఆధ్యాత్మికపరుడైన ఆ వ్యక్తి, మన దేశ పురోభివృద్ధికై, నిరాడంబరంగా నిరంతరం కృషిసల్పుతున్నాడు. ఆయన పేరు మోహినీమోహన ఛటర్జీ. ఆంగ్లదేశం మిస్ మార్గరెట్ నోబెల్ రూపంలో ఒక కొత్త బహుమతిని పంపింది. ఈమె పట్ల నా కెక్కువ గౌరవం ఉంది. ఇంక నేను ఎక్కువ ప్రసంగించక మిస్ నోబెల్‌ను ఉపన్యసించవలసిందిగా కోరుతూ, నా పరిచయ వాక్యాలను ముగిస్తున్నాను.
సోదరి నివేదిత తన చక్కని ఉపన్యాసాన్ని ముగించిన తర్వాత స్వాముల వారిలా చెప్పారు.
నేను చెప్పవలసింది కొంత మాత్రమే ఉంది. భారతీయులమైన మనం ఏదో కొంత సాధించగలమనే భావం మనకుంది. ఈ భావం వంగదేశీయులకు హాస్యాస్పదంగా తోచవచ్చు. కానీ నాకుమాత్రం హాస్యాస్పదంగా కనపడటం లేదు. మీలో, ఒక చలనం కలిగించటమే నా జీవిత లక్ష్యం. నీవు ద్వైతివైనా, విశిష్టాద్వైతివైనా, అద్వైతివైనా, లెక్కలోనిది కాదు. కాని ఎప్పుడూ విస్మరించబడుతున్న ఒక్కవిషయం వైపు మీ దృష్టిని మరల్చండి. – “మానవుడా! ఆత్మవిశ్వాసం కలిగివుండు!” ఆత్మవిశ్వాసం ఉన్నపుడే భగవంతునిపై మనకు విశ్వాసం ఏర్పడుతుంది. నీవు ద్వైతివి కావచ్చు, అద్వైతివి కావచ్చు. యోగసాధనపై నీకు నమ్మకముండవచ్చు. లేదా, శంకరాచార్యుల బోధనలో నమ్మకం ఉండొచ్చు. వ్యాస విశ్వామిత్రులలో ఎవరినైనా అనుసరించవచ్చు. అదంతా అప్రస్తుత విషయం. ఈ విషయంలో భారతీయ దృక్పథం ప్రపంచంలోనికంతా, విభిన్నమైందని మనం గమనించాలి. ప్రపంచంలోని ప్రతిదేశంలోను, మతంలోను, ఆత్మశక్తి నిర్లక్ష్యం చేయబడింది; ఆత్మశక్తి లేనిదిగాను, బలహీనమైదిగాను భావించబడింది. భారతీయులమైన మనం ఆత్మను శాశ్వతమైందిగా భావిస్తాం. శాశ్వతమేకాక, దోషరహితమనీ, పరిపూర్ణత్వం నందినదనీ భావిస్తాం. ఉపనిషద్వాక్యాలనే మనమెప్పుడూ ప్రమాణంగా గ్రహించాలి.
జీవితంలో మీ కర్తవ్యాన్ని విస్మరించకండి. భారతీయులు విశేషించి వంగదేశీయులు – విదేశ భావాలకు దాసులై మన మతపుటాయువుపట్లనే పెకలించి వేస్తున్నారు. ప్రస్తుతం మనమెందుకింత వెనుక బడివున్నాం? మనలో నూటికి తొంభై తొమ్మిదిమంది విదేశభావ ప్రభావాలకు ఎందుకు లోనై ఉన్నారు? మనం ఇతరజాతులతో తులతూగాలంటే, ఈ దోషాన్ని తొలగించాలి. మనం పురోభివృద్ధి చెందాలంటే పాశ్చాత్యులనుండి నేర్చుకోవలసిన విషయాలుకూడ ఎన్నో ఉన్నాయి. వారినుండి మనం, వారి కళలను, శాస్త్రాలను నేర్చుకోవాలి. భౌతిక ప్రపంచ సంబంధాలైన శాస్త్రాలను మనం వారినుండి నేర్చుకొన్నట్లే, పాశ్చాత్యులు మతాన్ని ఆధ్యాత్మికజ్ఞానాన్ని నేర్చుకొని జీర్ణం చేసుకోవాలంటే మన దగ్గరికి రావలసిందే. హిందూమతస్థులమైన మనం ప్రపంచానికి ఉపదేశకులమని విశ్వసించాలి. రాజకీయపు హక్కులు మొదలైన వానిని పొందటానికి మనం ఆందోళన చేస్తున్నాం. మంచిదే. హక్కులు అధికారాలు మొదలైన వాటిని స్నేహభావంచేత మాత్రమే పొందగలం. స్నేహభావమెప్పుడూ సమానుల మధ్యనే సాధ్యం. ఇద్దరిలో ఒకడు యాచకుడైనప్పుడు వారిమధ్య ఎలాంటి స్నేహం ఉంటుందో ఊహించండి. పరస్పర సహకారం లేకపోతే మనం గొప్పవారం కాజాలం. కాబట్టి యాచకులుగా కాక మతప్రవక్తలుగా అమెరికా ఇంగ్లండు దేశాలకు వెళ్ళండి. ఇతరులనుండి దేనినైనా గ్రహించేటప్పుడు సాధ్యమైనంతవరకు దానికి బదులుగా మీకున్నదేదో ఇవ్వండి. ఐహిక జీవితాన్ని సుఖవంతంచేసే మార్గాలను, పద్ధతులను మనం వారినుండి నేర్చుకొన్నప్పుడు శాశ్వతముక్తి పొందే మార్గాలను మనం వారికేల బోధించరాదు? అన్నిటికంటె మానవజాతి పురోభివృద్ధికై ఎప్పుడూ పాటుపడండి! సంకుచితమైన మీ సనాతనాచారాన్నిగూర్చి గర్వించకండి. ప్రతివాడూ, మృత్యుముఖం ప్రవేశించటం నిజం. ఈ చారిత్రక మహత్తరసత్యాన్ని గుర్తించుకోండి. భారతీయ వాఙ్మయంలో మూర్తీభవించివున్న శాశ్వత సత్యాలను గ్రహించడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు, భారతమాత పాదాలు ఆశ్రయించవలసిందే. భారతదేశానికి మృతిలేదు. చైనాకు మృతిలేదు. అలాగే జపాన్ దేశానికి మృతిలేదు. కాబట్టి, ఆధ్యాత్మికతయే మన వెన్నెముక అని ఎప్పుడూ జ్ఞప్తియందుంచుకోవాలి. ఇప్పుడు నేను చెపుతున్న మార్గాన పురోగమించడానికి ఒక మార్గదర్శకుడు కావాలి. ఈ విషయాన్ని మీలో ఎవరైనా నమ్మకపోతే, ఆధ్యాత్మికతే తన మతమని నమ్మని హిందూబాలుడెవడైనా మనలో ఉంటే, వానిని, నేను “హిందువు” అని అనజాలను. కాశ్మీర్దేశంలో ఒక పల్లెటూరిలో నేనొక ముసలి మహమ్మదీయ స్త్రీతో మాట్లాడినపుడు, నేను మతమని అడిగితే, ఆమె “ప్రభువుకు ధన్యవాదాలు. దేవుని కటాక్షం వల్ల నేను ఒక ముసల్మాను స్త్రీని” అని ఆమె బదులు చెప్పింది. అట్లే ఒక హిందువును ప్రశ్నించినపుడు, తాను హిందువునని చెప్పాడు. ఈ సందర్భంలో, కఠోపనిషత్తులోని ‘శ్రద్ధ’ అనే పదం నాకు జ్ఞప్తికి వస్తోంది. శ్రద్ధకు నచికేతుని జీవితం ఒక గొప్ప ఉదాహరణం. శ్రద్ధ – సంపూర్ణ విశ్వాసం – కల్గించడమే నా జీవితలక్ష్యం. మానవజాతికి, అన్నిమతాలకూ, శ్రద్ధే మూలాధారమని నేను నొక్కి చెబుతున్నాను. మొదట ఆత్మ విశ్వాసం కలిగివుండండి. ఒకటి చిన్నబుద్బుదం కావచ్చు. ఇంకొకటి పెద్ద తరంగం కావచ్చు. కానీ, ఈ రెంటి వెనుక అనంతసాగరం ఉందని గ్రహించండి. కాబట్టి, ఎవరుగానీ నిరాశ చెందవలసిన పనిలేదు. అందరికీ ముక్తి ఉంది. ప్రతివ్యక్తీ, మొదట మాయనుండి విముక్తి చెందాలి. స్థిరమైన నమ్మకం, అకుంఠిత ప్రయత్నాలకు దారితీస్తుంది. ఆ నమ్మకం మనలో ఉంటే, మానవజాతి పరమాదర్శాలన్నీ బోధించబడిన వ్యాసార్జునుల కాలంనాటి, మన జాతీయ జీవనాన్ని మనం మరల పొందగలం. ఆధ్యాత్మిక దృష్టిలో కానీ, భావంలోకానీ, మనం ప్రస్తుతం చాలా వెనుకబడివున్నాం. పూర్వం భారతదేశంలో ఆధ్యాత్మికతకు కొరతలేదు. అందుచేతనే, నాటి జాతులలో భారతజాతి గొప్పదిగా పరిగణించబడింది. సంప్రదాయాలు, ఆశలు, నమ్మదగినవే అయితే, ఆ దినాలు మరల తప్పక వస్తాయి. అది మీపై ఆధారపడివుంది. (తర్వాత వంగదేశ యువకుల్ని ఉద్దేశించి స్వాముల వారిలా చెప్పారు.) మీరు, ధనవంతుల, గొప్పవాళ్ళ, సాయాన్ని కోరకండి. ప్రపంచంలో అద్భుత కృత్యాలన్నీ చేసినవారు బీదవారే. బీదవారు ముందుకువస్తే, ఏ పనైనా చేయొచ్చు. తప్పక చేయాలి. మీరు దారి చూపితిరా, తర్వాత మిమ్మల్ని అనేకులు అనుసరిస్తారు. నిశ్చలం, నిష్కల్మషం, నిష్కపటం అయిన కార్యదీక్షను కలిగివుండండి. ఫలితాన్ని గూర్చి సంపూర్ణవిశ్వాసం ఉంచండి. వంగయువకులే, భారతదేశ ముక్తికై పాటుపడవలసి ఉంది. మీరు నమ్మినా, నమ్మకపోయినా, దీన్నే మీ లక్ష్యంగా ఉంచుకోండి. ఈ పని త్వరలో, నేడో రేపో పూర్తవుతుందనుకోకండి. నా శరీరంపైన, ఆత్మపైన నాకు నమ్మకమున్నట్లే, ఇందులోను, నాకు నమ్మకముంది. కాబట్టి, నా హృదయం ఎప్పుడూ, మీ కార్యసఫలతనే కోరుతూంటుంది. అంతా, ధనంలేని మీపై ఆధారపడివుంది. బీదవారు కాబట్టి మీరు పనిచేస్తారు; నిష్కపటంగా ఉంటారు; ఉన్నదాన్ని త్యాగం చేయడానికి వెనుదీయరు. అదే ఇదివరకు మీకు చెబుతున్న విషయం. దాన్నే మరలచెప్పి, మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఇది మన జీవిత లక్ష్యం. మీరే మతశాఖకు చెందినా, నాకు లెక్కలేదు. మానవులంతా, చివరికి సిద్ధినిపొంది తీరగలరనేహృదయపూర్వక అచంచల విశ్వాసం భారతీయులందరిలో ఉందని, నేను చెప్పగలను. ఈ విశ్వాసం నా హృదయంలోనూ ఉంది. ఈ విశ్వాసమే సర్వమానవ హృదయాల్లోనూ నెలకొనుగాక!