(1897 సం ॥ నవంబరు 9 వ తేదీ లాహోర్లో ఇచ్చిన ఉపన్యాసం)
గురుగంభీర శబ్దాలతో వడివడిగా ప్రవహించే ఉపనిషద్వారం నుండి ఒక ప్రతిధ్వని దూరం నుండి వస్తున్నదా అన్నట్లు వినబడుతోంది. ఒక్కొక్కప్పుడది చాలా అధికమై, సాంద్రమై, విజృంభిస్తోంది. వేదాంత వాఙ్మయమందంతట దాని ధ్వని విస్పష్టంగా ఉన్నా, అంత శక్తిమంతంగా మాత్రంలేదు. ఉపనిషత్తుల ప్రధాన ధర్మం పరతత్త్వ భావాన్ని, స్వరూపాన్ని, మనకూ ప్రత్యక్షం చేయడమే అని తోస్తోంది. అయినా ఈ అద్భుత గాంభీర్యానికి వెనుక అక్కడక్కడ కావ్యచమత్కృతి కనిపిస్తుంది. దీన్ని చదివి చూడండి – “న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం నే మా విద్యుతో భాంతి కుతో-యమగ్నిః” (అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు ప్రకాశించడు. నక్షత్రాలు ప్రకాశించవు. ఇక అగ్నిని గూర్చి చెప్పేదేమి?) ఇలాంటి మనోహర కవిత్వాన్ని విన్నప్పుడు, ఇంద్రియ గోచరమైన ప్రపంచంనుండే కాక బుద్ధిగోచరమైన ప్రపంచానికి సైతం, అతీతమై ఊహించడానికి వీలుకానిదీ, అయినా సదా మనల్ని ఆవరించి ఉండేది, అయిన వేరొక ప్రపంచానికి చేరుతూంటాం. ఈ గాంభీర్యానికంతకు వెనుక వేరొక ఆదర్శం దాని ఛాయలాగా అంటివస్తోంది. అది మానవజీవితం యొక్క ప్రత్యంశంలోను ప్రవేశిస్తోంది. రాను రాను, విశాలమై మహాకారాన్ని ధరిస్తోంది. అది పూర్ణం, విస్పష్టం అయిన భాషలో పురాణాల్లో వివరించబడింది. అదే భక్త్యాదర్శం. భక్తి బీజాలు ఇది వరకే ఉన్నాయి. ఆ బీజాలు సంహితలో సైతం ఉన్నాయి. ఉపనిషత్తులలో ఆ బీజాలు కొంత పరిణామాన్ని పొందాయి. అవి పురాణాల్లో వివరాలతో నిరూపించబడ్డాయి.
భక్తిని అర్థం చేసుకోవడానికి మన పురాణాల భావాన్ని గ్రహించాలి. పురాణాలు యథార్థమా? కాదా? అనే గొప్ప వివాదం ఇటీవల బయలుదేరింది. సందిగ్దార్థాలున్న అనేక వాక్యాలను తీసుకొని చాలామంది విమర్శించసాగారు. చాలాచోట్ల ఆ వాక్యాలు ఆధునిక శాస్త్రపరిశోధనకు ఆగజాలవని నిరూపించబడ్డాయి. ఈ వివాదాలెలా ఉన్నా, పురాణవాక్యాలు శాస్త్రరీత్యా సమర్థించ తగినవా? కావా? అనే విషయమెట్లున్నా, వాటిలో భూగోళ వర్ణన అంగీకరించతగిందా? తగనిదా? అనే విచారణ ఎలావున్నా వాటిలోని ఖగోళ వివరణలు నమ్మదగినవా? తగనివా? అనే ప్రశ్న ఎలావున్నా, ఈ పురాణ సంపుటాలలో ప్రతిదానిలో కొంచెం కొంచెంగా భక్తి సిద్ధాంతపు జాడలుమాత్రం విస్పష్టంగా గోచరిస్తాయి. ఈ భక్తి సిద్ధాంతమే ఋషుల జీవితాల్లో, రాజుల జీవితాల్లో, సాదృశ్యాలతో, దృష్టాంతాలతో, వివరించబడి, మళ్ళీ మళ్ళీ సవ్యాఖ్యానంగా ప్రవచించబడి, మళ్ళీ మళ్ళీ, పునరావృత్తి చేయబడుతూ వచ్చింది. మహామనోహరమైన భక్త్యాదర్శానికి సాదృశ్యం చూపడమే పురాణాల ఉద్దేశంగా కనబడుతోంది. ఈ ఆదర్శం నేను చెప్పినట్లు సామాన్య మానవునికి చాలా హితవుగా ఉంటుంది. వేదాంతజ్యోతియొక్క పూర్ణప్రకాశంలోని గాంభీర్యాన్ని అర్థం చేసుకోగలవారు, ఆమోదించగలవారు చాలా కొద్దిమందే ఉంటారు. ఇక ఆ గాంభీర్యంలో మెలగుతూ దాన్ని అనువర్తించి జీవించగలవారు ఇంకా తక్కువగా ఉంటారు. ఏలంటే, శుద్ధవేదాంతి అడుగుపెట్టవలసిన మొట్ట మొదటి మెట్టే “అభయః” (భయరాహిత్యం) అనేది. మనుష్యుడు తాను వేదాంతినని అనుకొన సాహసించడానికి ముందు సమస్త దౌర్బల్యాలు రూపుమాసిపోవాలి. అది ఎంత కష్టమో, మనకు తెలుసుకదా! ప్రపంచంతో అన్ని సంబంధాలనూ త్యజించిన వారుకూడ, తమ్ము పిరికివారినిగా చేసే బంధాలు ఏవీ లేనివారు సైతం, ఒక్కొక్క క్షణంలో తామెంత దుర్బలులవుతారో ఒక్కొక్కపుడు ఎంతగా మెత్తబడిపోతారో, ఎంత భయపడుతారో మనస్సులో వారికే తెలుస్తుంది. ఇక అనేక బంధాలు కలిగి, అసంఖ్యాకమైన బాహ్య విషయాలకు, ఆంతర విషయాలకు, దాసులై వర్తించవలసినవారు కూడ ఎంత ఎక్కువ జంకాలో కదా? అలాంటి వారికి పురాణాలు చాలా రమణీయమైన భక్తి సందేశాన్ని అందిస్తున్నాయి.
అలాంటి వారికి మృదు కవిత్వాన్ని ఉపశాంతికరంగా ప్రసాదిస్తున్నాయి. ధ్రువుడు, ప్రహ్లాదుడు మొదలైన వేలకొద్దీ సాధుసత్తముల అద్భుత విచిత్రకథలను అవి చెబుతున్నాయి. ఈ ఉదాహరణలు ఆ భక్తి సందేశాన్ని ఆచరణయోగ్యంగా చేస్తాయి. శాస్త్రదృష్టిలో పురాణాలు నిర్దుష్టమని మీరు నమ్మినా నమ్మకపోయినా, ప్రహ్లాదుడు, ధ్రువుడు మొదలైన పౌరాణిక సాధుసత్తముల కథల ప్రభావంవల్ల పరివర్తనం చెందనివారు మీలో ఒక్కరూ ఉండరు. మన తరాలవారిపై కూడ, పురాణాల మహిమ వ్యాపించిందని మనం అంగీకరించాలి! ఇటీవల భ్రష్టమైన బౌద్ధమత సిద్ధాంతం మనకు నేర్పినదానికన్నా, విశాలతరమై, ప్రజాసామాన్యానికి ఉపకరించే మతాన్ని మనకు ప్రసాదించినందుకు, ఈ పురాణాలపట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. సులభం కోమలం అయిన ఈ భక్తిభావం, ఎలా క్రమంగా ప్రేమగా పరిణమిస్తుందో పురాణాలు వివరిస్తున్నాయి. అనుదినం ప్రత్యక్షజీవితంలో మనం దానిని అనుష్ఠించాలి. నిజానికి భక్తి ప్రేమ యొక్క సారమే సగుణం, జడం అయిన ప్రేమ ఉండేంతకాలం పురాణ బోధలనుదాటి ఎవడూ ముందుకు పోజాలడు. ఇంకొకరిని అండచేసుకొని నిలిచే దౌర్బల్యం, మానవస్వభావంలో ఉండేంతవరకు ఈ పురాణాలు ఏదోరూపంగా ఉండి తీరవలసిందే! నీవు వాటి పేర్లను మార్చవచ్చు. ఇదివరకువున్న వానిని నిరసించవచ్చు. కానీ, అలా నిరసించిన తక్షణమే, ఇంకొక పురాణం వ్రాయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ పాత పురాణాలు, అనవసరం అనే మహానుభావుడెవడైనా మనలో ఉద్భవిస్తే అతడు మరణించిన ఇరవై సంవత్సరాలలోపలే ఆయన శిష్యులు అతని జీవితాన్ని ఆధారం చేసుకొని ఇంకొక పురాణం వ్రాసి తీరుతారు. ఇదే భేదం. మనుజుని స్వభావాన్ననుసరించి అది అవసరమే. అన్ని దోషాలను, మాయాబంధాలను, చివరికి ప్రకృతి సిద్ధమైన అవసరాలను సైతం అతిక్రమించి ధైర్యసాహసోపేతులై, సర్వవిజేతలై, పరమహంసలుగా మారిన, ‘సాక్షాద్దేవత’ లకు మాత్రమే పురాణాలతో పనిలేదు. సగుణ దైవతంలేక సామాన్యుడు పూజించలేడు. ఒకవేళ సృష్టిలోని దేవతలను పూజించకపోతే, భార్య రూపంలోనో, బిడ్డ రూపంలోనో, తండ్రి రూపంలోనో, మిత్రుని రూపంలోనో, గురుని రూపంలోనో, ఏదైనా మరొక రూపంలోనో, మరొక దేవతను కల్పించుకొని పూజించవలసిందే! పురుషులకన్నా, స్త్రీల విషయంలో ఈ అవసరం ఎక్కువగా ఉంది. వెలుగు సర్వత్ర ఉండవచ్చు. అది చీకటి స్థలాల్లో కూడవుంది. పిల్లులు, మొదలైన జంతువులు చీకటిలో ఆ తేజస్సును చూడగలుగుతున్నాయి కదా? కాని, మన క్షేత్రంలో మన కనుకూలమైన స్థితిలో ఉన్నప్పుడే ఆ ప్రకాశం మనకు కనబడుతుంది. నిర్గుణబ్రహ్మం మొదలైన తత్త్వ విషయాలను గూర్చి, మనం మాటలు చెప్పొచ్చు. కానీ, సామాన్య మానవులంగా ఉన్నంతకాలం కేవల నరరూపంలో మాత్రమే మనం భగవంతుని చూడగలం. భగవంతుని గూర్చిన మన భావన, మన పూజా విధానం, సహజంగా మానవ లక్షణంతో కూడివుంటుంది. “ఈ శరీరం నిజమైన భగవదాలయం” కాబట్టే, అన్ని యుగాల్లో మహాత్ములు పూజించబడుతూ వచ్చారు! ఇలాంటి పూజాపద్దతిలో కొన్ని ఆడంబరాలు సహజంగా వచ్చిచేరుతూంటాయి. వాటిని మనం ఖండించవచ్చు లేదా విమర్శించవచ్చు. కాని ఇలాంటి అత్యాచారాలెన్నివున్నా అవి ఎంతగా మితిమీరిపోతున్నా, ఈ భక్తిసూత్రానికి సత్యం, సుస్థిరం అయిన ఒక ఆధారం, ఒక జీవం ఉందనీ అదిమాత్రం నిర్దుష్టంగానే ఉందనీ, సూక్ష్మంగా పరిశీలిస్తే స్పష్టపడుతుంది. ఎలాంటి ప్రాచీన కథలనైనా సరే గుణదోష విమర్శ చేయకుండా, ఊరికే దిగమింగండని నేను మిమ్మల్ని కోరడంలేదు. దురదృష్టవశాత్తు, కొన్ని పురాణాలలోకి, నానావిధాలైన వామాచార సమర్థనలు ఎగబ్రాకాయి. వానినన్నిటినీ నమ్మండని నేను మీకు బోధించడంలేదు. కాని మనం పోగొట్టుకొన తగని సారభూత విషయం ఒకటి ఉందనీ, ఈ పురాణాలు నిలిచి ఉండటానికి తగినంత కారణం ఉందనీ, నా అభిప్రాయం. అత్యున్నతమైన తత్త్వసిద్ధాంతాలను, సామాన్య మానవుల అనుదిన జీవితాలలోకి తేవడానికి మతాన్ని అనుష్ఠానానికి అనుకూలపరచడానికి ఏర్పడిన భక్తిబోధ పురాణాల్లోనే ఉందని నా నిశ్చితాభిప్రాయం.
తర్వాత భక్తిసాధనలో భౌతిక పదార్థాల వినియోగాన్ని సమర్థిస్తూ, శ్రీవారిలా చెప్పసాగారు: నరుడు, తానున్నచోటనే నిలిచిపోక భగవదనుగ్రహం వల్ల ప్రగతిని పొందుతూంటే బాగానే ఉండేది. అయినా ఉన్నవిషయాలు లేవనుకొని, తగవులాడటం వ్యర్థం. ఇప్పుడు మానవుడు భౌతిక జీవిగా ఉన్నాడు. ఆధ్యాత్మిక తత్త్వాన్నిగూర్చి ఎంతగా మాటలు చెప్పినా అతడు భౌతికజీవిగా ఉన్నాడనడం తప్పదు. కాబట్టి, ఈ భౌతిక నరుని ఆధ్యాత్మికజీవిగా చేయడానికై క్రమక్రమంగా, పైకితీసి కొనిపోవాలి. ఈ దినాలలో, నూటికి తొంభైతొమ్మిది మందికి ఆధ్యాత్మికత అంటే ఏమో, అర్థం కావడం లేదు. దాన్ని గూర్చి బోధించగలశక్తి ఇంకా తక్కువ. మనల్ని ముందుకు తీసుకొనిపోయే క్రియాశక్తులు, మనం కోరుకొనే ఫలితాలు, అన్నీ భౌతికమే! హెర్బర్ట్ స్పెన్సర్ మహాశయుడు చెప్పినట్లు అత్యల్ప ప్రతిరోధంగల మార్గంలో మాత్రమే మనం పనిచేయగలం. మన పురాణాలు ఇలాంటి మార్గాన్నే మనకు చూపిస్తున్నాయి. ఈ పురాణాలవల్ల లభించిన ఫలితాలు అద్భుతాలు, అనన్యసామాన్యాలు. భక్త్యాదర్శం యథార్థానికి ఆధ్యాత్మికమైనది. కానీ దాన్ని పొందేమార్గం జడవస్తుమార్గంలో నడుస్తోంది. మనకు గత్యంతరంలేదు. కాబట్టి, ఈ భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక తత్త్వాన్ని సాధించడానికి అనుకూలించే ప్రతిదాన్నీ చేపట్టాలి. నరుడు, ఆధ్యాత్మికజీవిగా, పరిణామాన్ని పొందడానికై ప్రతిదాన్నీ వినియోగించుకోవాలి. (ఈ సందర్భంలో శ్రీస్వాములవారు, కులభేదంకానీ, మతభేదంకానీ, లింగభేదంకానీ పాటించక ప్రతివ్యక్తికీ వేదాలను చదివే అధికారాన్ని శాస్త్రాలు ప్రాథమికధర్మంగా అంగీకరించాయని వివరించిన తర్వాత వారిలా నొక్కిచెప్పారు.) భగవంతునిపట్ల భక్తిసాధన చేసుకోవడానికి జడవస్తుమయమైన దేవాలయం నరునికి ఎక్కువగా ఉపయోగపడితే అలాగే జరగనీ! ఒక విగ్రహం భక్త్యాదర్శాన్ని చేరడంలో మానవునికి సహాయపడితే, భగవంతుడు వానిని దీవించి వానికి ఇష్టమైతే అలాంటి విగ్రహాలను ఇంకా ఇరవై ప్రసాదించుగాక! పారమార్థిక గమ్యం పొందడంలో ఏదైనా నరునికి సాయపడితే అది నీతిమార్గానికి అడ్డురానంతవరకు దానికి స్వాగతమే! కానీ, అవినీతికరమైన ఏదీ తోడ్పడజాలదు; పైగా వెనుకకు కూడ లాగిపడుతుంది. (ఈ సందర్భంలో భారతదేశంలో విగ్రహాలను పూజార్థం వినియోగించటంలో కలిగిన ఆక్షేపణ కొంతవరకైనా కబీరు వల్ల సంభవించిందని తెలిపారు.) సగుణదైవంలో విశ్వాసంలేని గొప్ప తత్త్వవేత్తలు, మతకర్తలు, భారతదేశంలో ఉండేవారు. వారు తమ మతాన్ని ధైర్యంగా ప్రజలకు బోధించారు. అయినా విగ్రహారాధనను వారు ఖండించలేదు. విగ్రహపూజ, భగవత్పూజలో అత్యుత్తమ విధానం కాదని మాత్రం వారన్నారు. అది చాలామంచి పద్ధతని చెప్పే పురాణం ఒక్కటైనా లేదు. (యూదులు తమ యోహోవా, ఒక పెట్టెలో నివసిస్తాడనే విశ్వాసంతో విగ్రహపూజను చేశారని, చారిత్రక నిదర్శనలను చూసి ఇతరులు చెడ్డదన్నంత మాత్రాన, విగ్రహారాధనను దూషించే అభ్యాసాన్ని శ్రీవారు ఖండించారు. ఆ తర్వాత ఇలా చెప్పసాగారు.) విగ్రహం కాని, మరే భౌతికరూపం కానీ, నరుని ఆధ్యాత్మికపరాయణునిగా చేయడానికి ఉపకరించినా, విగ్రహారాధనం జడపదార్థం ద్వారా చేయబడే పూజ కాబట్టి, అధమాధమమని, మన మతగ్రంథాలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. (భారతదేశంలో అంతటా బలాత్కారంగా విగ్రహారాధనను, ప్రతివానిచేత చేయించాలనే పట్టుదలను శ్రీస్వాములవారు పూర్తిగా ఖండించారు.) దేన్ని పూజించాలో, దేనిద్వారా పూజించాలో నిర్ణయించి, శాసించడానికి ఎవనికేమి హక్కుంది? ఎవరెలా పురోగమనం సాగించవలసి ఉంటుందో, వారి వారి ఆధ్యాత్మిక వికాసం విగ్రహాన్ని పూజించడంచేత సాధ్యమవుతుందో, లేక స్తంభాన్ని పూజించడంవల్ల సాధ్యమవుతుందో, వారికే తెలుస్తుంది కానీ, ఇతరులకెలా తెలుస్తుంది? ఆ విషయం సొంత గురువులవల్ల గురుశిష్య సంబంధంవల్ల నిర్ణయమై శాసించబడాలి. “ఇష్టం” అనే దాన్నిగూర్చి భక్తిగ్రంథాలు నిర్ణయించిన సూత్రం చాలా సహేతుకమైంది. ప్రతివాడూ, తన ప్రత్యేక పూజావిధానాన్ని భగవంతుని చేరే తన ప్రత్యేకమార్గాన్ని, తానే నిర్ణయించుకోవాలి! అది వాని ఇష్టం. ఆ నిర్ణీతాదర్శం వాని ఇష్టదేవత అనబడుతుంది. అతడు ఇతర పూజావిధానాలపట్ల సానుభూతితో గౌరవం చూపాలి, అయినా తన గమ్యాన్ని తాను చేరేవరకు, తనకిక జడమయ సహాయోపకరణాలు అవసరంలేని దశ సిద్ధించేవరకు తన ప్రత్యేక విధానాన్నే అనుసరిస్తూ సాధనను సాగించాలి. ఈ సందర్భంలో భారతదేశపు కొన్ని ప్రాంతాల్లో ఆచరణలోవున్న కులగురువు పద్ధతిగూర్చి కొంచెం హెచ్చరించవలసివుంది. ఇది, ఒక విధమైన పరంపరాగతమైన గురుత్వం. మన శాస్త్రాలు “వేదసారాన్ని తెలుసుకొన్నవాడు, పాపరహితుడు అయిన గురువు బంగారం ఆపేక్షించికానీ, మరి దేన్ని వాంఛించికానీ శిష్యులకు బోధలు చేయడు. వాని కరుణ నిర్హేతుకం. తరులతానికుంజాల నుండి వసంతఋతువు ప్రతిఫలాన్ని కోరదు. పరోపకారం చేయడం, దాని స్వభావం. వాటిని మరల ఉజ్జీవింపచేసి, మొగ్గలను, పువ్వులను, ఆకులను ప్రసాదిస్తుంది. అలాగే గురువుకూడ ప్రతిఫలమాశించక విద్యాదానం చేస్తాడు. వాని జీవితమంతా పరోపకారార్థమే,” అని చెబుతున్నాయి. అలాంటి వాడే గురువు కాగలడు. ఇతరులకు, అలాంటి అర్హత లేదు. ఇంకొక అపాయంకూడ ఉంది. గురువంటే కేవలం బోధకుడు కాడు. బోధకత్వం చాలా స్వల్పాంశం. హిందువుల విశ్వాసం ప్రకారం గురువు తన శిష్యులకు ఆధ్యాత్మికతను దానం చేస్తాడు. కాబట్టి సద్గురు ప్రసాదరక్షణ లేకపోతే దుష్టత్వానికి, కీడుకు లోనై నరుడు హానిపొందవచ్చు. అందువల్ల దుష్ట గురువువల్ల ఉపదేశం పొందినవాడు, దుష్టత్వాన్ని నేర్చుకోవడం, అనే అపాయం పాలుకావచ్చు. కాబట్టి ఈ కులగురు సిద్ధాంతాన్ని భారతదేశం నుండి బహిష్కరించడం చాలా అవసరం. గురుత్వం ఒక వృత్తిగా ఏర్పడకూడదు. అది తుదముట్టాలి. అది శాస్త్ర విరుద్ధమైన పద్ధతి. గురుశబ్ద వాచ్యుడెవ్వడూ, కులగురు పద్ధతి ననుసరించి, ప్రస్తుత దుఃస్థితికి సాయపడరాదు.
శ్రీవారు, ఆహార సమస్యనుగూర్చి మాట్లాడుతూ, తిండి విషయంలో ఈనాడు పట్టుదలతో అనుసరిస్తున్న ఆచారాలు, చాలావరకు పై పై మెరుగులైపోయి, ప్రారంభంలో అవి ఎందుకోసం ఏర్పడ్డాయో, ఆ లక్ష్యంనుండి దూరమైపోయెనన్నారు. ఎవరు ఆహారాన్ని తాకడానికి అర్హులో అనే విషయాన్నిగూర్చి జాగ్రత్త తీసుకోవాలనే భావాన్ని విమర్శించారు. దానిలో తత్త్వసంబంధమైన గొప్ప రహస్యముందనీ, సామాన్యులు తమ అనుదిన జీవితంలో అలాంటి జాగ్రత్తను తీసుకోవడం, కష్టం, అసాధ్యం, అసంభవం అనీ చెప్పారు. ప్రత్యేకంగా ఒక్క తరగతి వారికే ఆ సాధ్యమగు ఆదర్శాన్ని సామాన్యంగా అందరూ ఆచరించాలని పట్టుపట్టడం పొరపాటని తెల్పారు. తమ జీవితాలను పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలకు వినియోగించే వారికి మాత్రమే అది సాధ్యమవుతుందనీ, మానవులలో అత్యధిక సంఖ్యాకులు భౌతిక సుఖాలతో ఇంకా తృప్తిపడకున్నారనీ, ఆధ్యాత్మిక జీవనాన్ని బలాత్కారంగా వారిపైని పడవేయచూడటం వ్యర్థమనీ చెప్పారు. భక్తునికి నిర్ణయించబడిన శ్రేష్ఠతమ పూజమానవపూజే! నిజంగా ఏదేని పూజను ఆచరించాలనుకుంటే, తమ స్థితి ననుసరించి ఒకనినో, ఇద్దరినో, పదిమందినో దరిద్రులను ప్రతిదినం తమ ఇళ్ళకు తీసుకొనివచ్చి వారిని నారాయణులుగా భావించి, సేవించాలని శ్రీవారు సూచించారు. అనేక దేశాలలో దానం చేయడం నేను చూశాను. అది ఫలప్రదం కాకపోవడానికి కారణం, అది సత్సంకల్పంతో జరగకుండటమే! “ఇదిగో ఇది తీసుకొని వెళ్ళిపో!” అంటారు. అది యోగ్యమైన దానం కాదు. హృదయంలో ఉన్న గర్వాన్ని, లోకం తమను పొగడాలనే కాంక్షను, తాము దానశీలురని లోకం తెలుసుకోవాలనే కోరికను ఇది వెలువరిస్తోంది. హిందూశాస్త్రాల ప్రకారం దానాన్ని గ్రహించే వానికన్నా దానమిచ్చేవాడు తక్కువ. ఎందుకంటే పుచ్చుకొనేవాడు ఆ సమయంలో భగవంతుడన్నమాటే! కాబట్టి కొంతమంది దరిద్రనారాయణులనుగానీ, అంధనారాయణులనుగానీ, ఆకొన్న నారాయణులనుగానీ, ప్రతిగృహానికి ప్రతిదినం తీసుకొనివచ్చి దేవతావిగ్రహాన్ని పూజించే విధంగా వారికి చక్కగా భోజనం పెట్టి, బట్టలు కట్టబెట్టడం, ఉత్తమపూజ. ప్రతిదినం ఇలా చేస్తూండాలని శ్రీవారు చెప్పారు. వారెలాంటి పూజలనుగాని ఖండించలేదు. కానీ, ఉత్తమవిధమైన పూజ ప్రస్తుతం భారతదేశంలో అత్యవసరమైన పూజ. ఇలాంటి నారాయణుల ఆరాధనే అని తమ అభిప్రాయాన్ని చెప్పారు.
ఉపన్యాసం ముగిస్తూ శ్రీస్వామీజీ భక్తిని ఒక త్రికోణాకృతితో పోల్చారు. ఇందులో ఒక కోణం కామరహిత భక్తి. రెండవ కోణం భయాన్ని ఎరుగనిది, ప్రతిఫలంగానీ, మరేవిధమైన ఉపకారాన్నిగానీ ఆశించే భక్తి యాచకుని మతమో, బేరగాని మతమో అవుతుంది. దానిలో యథార్థమైన మతం అతిస్వల్పం. మీరు యాచకులుగా కారాదు. ఎందుకంటే యాచన ఒక విధమగు నాస్తికతే! అది, “గంగ ఒడ్డున కాపురముండే నరుడు త్రాగడానికి నీటిని కోరి చిన్నబావిని త్రవ్వడం” వంటిది. భగవంతుని భౌతికవిషయాలకోసం ప్రార్థన చేసేవాడు, ఇలాంటివాడే అనవచ్చు. భక్తుడైనవాడు, సాహసంతో నిలబడి, “దేవా! నీ నుండి నేనేమీకోరను. కానీ నా వల్ల నీకేమైనా కావలిస్తే ఇదిగో, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను” అనడానికి సంసిద్ధంగా ఉండాలి. ప్రేమ భయాన్నెరుగదు. అబలయై, బక్కచిక్కిన స్త్రీ, దారిలోపాతూ, కుక్క మొరిగిన మాత్రాన పరుగునపోయి ప్రక్క ఇంటిలోనికి దూరడం చూడలేదా? మరుసటి దినం, ఆమె అదే త్రోవలోపోతూ ఉంటుంది. ఆమె ఒడిలో బిడ్డవున్నాడు. సింహ మొకటి ఆమెపై పడుతుంది. అప్పుడామె ఏం చేస్తుంది? ఆహా? తన బిడ్డను రక్షించడంకోసం, సింహం నోటపడుతుంది. ప్రేమకోసం ఒప్పే ప్రేమ ఉత్తమోత్తమైంది. చివరికి భక్తుడీదశకు వస్తాడు. అప్పుడు ప్రేమే దైవం! ఇతర మేమీ కాదు. దేవుడున్నాడని రుజువు చేయడానికి మానవుడెక్కడికి వెళ్ళాలి? దృశ్యమానవ వస్తుజాలంలోనికెల్లా మరింత దృశ్యమానం ప్రేమ. సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, ఆకాశంలో తిప్పుతున్న శక్తి ఆ ప్రేమే! పురుషుల్లోను, స్త్రీలలోను, పశువులలోను, ప్రతి ప్రదేశంలోని ప్రతిదానిలోను, దాని మహిమ ప్రకటితమవుతోంది. జడశక్తులలోని భూమ్యాకర్షణం మొదలైన రూపాలతో అది వ్యక్తమవుతోంది. అది అంతటా ఉంది. ప్రతి పరమాణువులోను, ప్రతి ప్రదేశంలోను, వ్యక్తమవుతూనే ఉంది. ఈ విశ్వాన్నంతటినీ నడిపే శక్తి, అంతటా కనిపించే శక్తి, ఆ అఖండప్రేమే! అది సాక్షాత్ పరబ్రహ్మమే!