ప్రాచ్యభూమిలో శ్రీ వివేకానందస్వాముల వారిచ్చిన
మొట్టమొదటి ఉపన్యాసం
పాశ్చాత్యఖండాల్లో మతప్రచారం చేసి ఖ్యాతి గడించిన తర్వాత శ్రీ వివేకానందస్వాములవారు 1897 వ సంవత్సరం, జనవరి 15 వ తేదీ మధ్యాహ్నవేళ కొలంబో నగరం చేరారు. ఆ సందర్భంగా, ఆ నగర హిందువులు శ్రీవారికి ఘనమైన స్వాగతమిచ్చారు. ఆ సందర్భంలో ఈ క్రింది స్వాగతపత్రం శ్రీవారికర్పించారు.
శ్రీమత్ వివేకానంద స్వాములవారికి –
పూజ్య స్వామీజీ!
ఈ కొలంబో నగర హిందువులు బహిరంగసభలో చేసిన తీర్మానాన్ని అనుసరించి, మీకు హృదయపూర్వకంగా ఈ ద్వీపంలో స్వాగతమిస్తున్నాం. పాశ్చాత్యదేశాల్లో గొప్ప ప్రచారంచేసి, స్వదేశానికి తిరిగి వస్తున్న సమయంలో మీకు స్వాగతమివ్వడంలో మొదటి అవకాశం మాకు లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం.
మీ పాశ్చాత్య పర్యాటనా కార్యం ఈశ్వరానుగ్రహంవల్ల ఎంతగా విజయవంత మయిందో మేము ఆనందంతో, కృతజ్ఞతతో కనిపెట్టి చూశాం. సమస్త మత సంప్రదాయాలకు సామరస్యాన్ని సమకూరుస్తూ, ప్రతి జీవికీ, వాని అవసరాలనుబట్టి ఆధ్యాత్మికాహారం పెడుతూ, వాత్సల్యపూర్వకంగా, భగవంతుని సమీపానికి నడిపేటటువంటి విశ్వ, విస్తృత హిందూ విశ్వమతాదర్శాన్ని, యూరప్, అమెరికా ఖండాలవారికి ప్రకటించి తెలిపారు. చాలా ప్రాచీనకాలంనుండి, ఋషిపరంపరలు వారి పావన పదస్పర్శతో, భారతభూమిని పవిత్రం చేశారు. వాళ్ళు తమ దర్శనంచేత, ప్రబోధంచేత సమస్త దశలలో భారతభూమిని లోకానికి జ్ఞానదాయినిగా చేశారు. ఆ గురుపరంపరనుండి ప్రసరించిన ప్రభావంవల్ల భారత ధరిత్రి విశ్వజ్యోతి అయింది. ఆ మహనీయులు ఉపదేశించిన సత్యధర్మాన్ని మోక్షమార్గాన్ని మీరు ప్రచారం చేశారు.
శ్రీశ్రీశ్రీ రామకృష్ణ పరమహంస దేవునిలాంటి సద్గురుని దివ్యాదేశం మూలంగా, స్వార్థత్యాగంవలన కలిగిన మహోత్సాహంవలన, ప్రబోధంవలన, పాశ్చాత్య జాతులు భారతదేశపు ఆధ్యాత్మిక ప్రతిభతో అనుసంధానాన్ని పొందగలిగిన అమూల్య వరప్రసాదానికి పాత్రులు కాగలిగారు. మన దేశీయులలో పాశ్చాత్య నాగరికతా వ్యామోహంలోపడి, తేరుకున్న ఎంతోమంది, మన ప్రాచీన సంప్రదాయాల మహిమను గ్రహించారు.
మహనీయమైన మీ కృషివలన, మార్గదర్శకత్వంవలన, మానవజాతిని తీర్చరాని కృతజ్ఞతాబద్ధులను చేశారు; మన మాతృభూమిని అపూర్వ తేజోవిరాజమానంగా చేశారు. భగవదనుగ్రహం వల్ల మీరు ఇలాగే శ్రేయస్సులు పొందుతూ మీరు పూనిన మహోద్యమాన్ని కొనసాగించగల్గుదురు గాక! అని ప్రార్థిస్తున్నాం.
ఇట్లు మీ కృపాపాత్రమైన
కొలంబో హిందూసంఘం పక్షాన,
పి. కుమారస్వామి,
కొలంబో, జనవరి 1897
సింహళ శాసన సభ్యుడు,
సమావేశాధ్యక్షుడు
ఎ. కులవీరసింహము, కార్యదర్శి.
శ్రీ స్వాములవారు తమకర్పించిన ఈ స్వాగతం గూర్చి సంతోషాన్ని వెలిబుచ్చుతూ, సంగ్రహంగా ప్రత్యుత్తరమిచ్చారు. నాటి ఉత్సాహమంతా, ఒక రాజకీయ పండితునిగాని, ఒక మహా యుద్ధవీరునిగాని, ఒక కోటీశ్వరునిగాని కీర్తించడానికిగాక, బిచ్చమెత్తుకొనే ఒక సన్యాసిని గౌరవించడం కోసం కాబట్టి, అది హిందువుల మనస్సులో మతంపట్ల ఎలాంటి ఆదరణవుందో తెలుపుతోందని చాటడానికి శ్రీవారు ఈ అవకాశాన్ని వినియోగించుకొన్నారు. హిందూజాతి సజీవమై నిలిచివుండ గోరితే, ఆ జాతి జీవనానికి, మతం బ్రహ్మదండమై నిలవడం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. తాము అందుకొన్న స్వాగతానికి వ్యక్తిగతంగా తమకర్హత ఏమీ లేదని, అది ఒక ఆదర్శం, కృతజ్ఞత చూపడమే అని గ్రహించాలనీ చెప్పారు.
16 వ తేదీ సాయంత్రం ఫ్లోరల్ హాల్లో, శ్రీ స్వాములవారీ బహిరంగోపన్యాసం ఇచ్చారు.
నేను చేసిన ఈ అల్పకార్యం నాలో స్వతస్సిద్ధంగావున్న శక్తివల్ల జరిగింది కాదు. ఈనా ప్రియతమము, పరమ పవిత్రము అయిన మాతృభూమి నుండి వెడలి, పాశ్చాత్యదేశాల్లో నన్ను సదా అనుసరిస్తూ వచ్చిన ప్రోత్సాహ, అభిమాన, ఆశీస్సుల కారణంగా జరిగిందే! ఈ పర్యటన ద్వారా పాశ్చాత్యంలో కొంత మంచిపని జరిగింది నిజమే! కానీ, దానివల్ల విశేషంగా నాకే ఉపకారం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే, ఇదివరకు బహుశా, నాకు సహజమైన చిత్తోద్రేకంవల్ల కలిగిన అభిమానం, ఇప్పుడు నిశ్చితాభిప్రాయంయొక్క స్థిరత్వాన్ని, ప్రామాణికత్వంయొక్క పటుత్వాన్ని, బలాన్ని పొందింది.
గౌరవనీయుడైన ఈ అధ్యక్షుడు చెప్పినట్లే – ప్రతి హైందవుడూ భావించే విధంగానే – ఈ దేశం కర్మక్షేత్రం, పుణ్యభూమి అని పూర్వం నుండి నేనుకూడ భావిస్తున్నాను. ఈనాడు, ఇక్కడ నిలిచి, ఆ మాట ఎంతో నిజమని, యదార్థమైన నిశ్చితాభిప్రాయంతో, దృఢవిశ్వాసంతో చాటుతున్నాను. ధన్య పుణ్యభూమి అని పిలవడానికి అర్హతవున్న దేశమేదైనా భూలోకంలో ఉంటే, భగవత్సాన్నిధ్యాన్ని పొందడానికై యాత్రలు చేస్తూ, ఆ పరమపదాన్ని పొందే సమయంలో, ప్రతి జీవాత్మ విధిగా చేరవలసిన స్థలం భూమిలో ఎక్కడైనా ఉంటే, మానవసంఘం సాధుశీలాన్ని, ఔదార్యాన్ని, పవిత్రతను, శాంతి జీవనాన్ని అలవరచుకొనడంలో పరమోన్నత మార్గాన్ని అందుకోజాలిన దివ్యక్షేత్రం ఎక్కడైనా ఉంటే, హృదయ పరిశీలనాన్ని పురికొల్పి, సమున్నత ఆధ్యాత్మిక పీఠంపై చేర్చే మేలిసీమ ఎక్కడైనా ఉంటే – అది మన భారతదేశమే! అంతేకాదు, అన్నిటికంటే దివ్యదృష్టిని, ఆధ్యాత్మిక సిద్ధిని ప్రసాదించే పుణ్యతీర్థం ఈ భారతదేశమేనని అనకతప్పదు. ఇక్కడ అత్యంత పురాణకాలం నుండి, మహామతకర్తలు బయలుదేరారు. ఎన్నోసార్లు, వారు ఈ భూలోకాన్నంతా, వినిర్మలం, శాశ్వతం అయిన ఆధ్యాత్మిక ధర్మప్రవాహ జలాలతో నింపి పవిత్రీకరించారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ప్రపంచం మొత్తాన్ని ముంచేసిన వేదాంత సాగర తరంగరాశి ఈ దేశంనుండే వెలువడింది. భౌతికం, భగవద్విముఖం అయిన నేటి ప్రపంచిక నాగరికతను, మళ్ళీ ఈశ్వరోన్ముఖం కావించనున్న ఆధ్యాత్మిక మహాప్రవాహం ఇక్కడనుండే ఉద్భవం కావలసి ఉంది. ఇతర దేశాల్లో, వేలకొద్దీ మానవ హృదయాలను కాల్చినాశనం చేస్తున్న జడవాద భీకరజ్వాలలను చల్లార్చవలసిన జీవసముద్రం ఇక్కడేవుంది. మిత్రులారా! నా మాట నమ్మండి! ఇది జరిగి తీరుతుంది!
ఇదంతా నేను స్పష్టంగా గ్రహించాను. మీలో వివిధ జాతి చరిత్రలను చదివినవారుకూడ, ఈ విషయాన్ని గ్రహించే ఉంటారు. ఈ ఉపకారానికై లోకం, మన మాతృభూమికి చాలా ఋణపడివుంది. వేరు వేరుగా, ఒక్కొక్క దేశాన్ని తీసుకొని విచారిస్తే లోకం ఈ క్షమాస్వరూపుడైన హిందువుకు ఋణపడివున్నంతగా, మరే జాతికీ ఋణపడి ఉండలేదు. హైందవుని ఈ కోమలత్వాన్ని దోషంగా భావించి, కొన్ని సమయాల్లో హేళన చేయడమూ ఉంది. కాని హేళనలోకూడ మహాద్భుత సత్యమేదైనా గర్భితమైవుంటే, అది సదా ఆశీర్వాదపాత్రుడైన, ఈశ్వరపుత్రుడైన, ఆతనిని “శాంతస్వభావ విశిష్టుడైన హిందువు” అనడంలోనే ఉంది. ప్రపంచంలోని ఇతర భాగాల్లో కూడ నాగరికతలు వెలిసాయి. ప్రాచీన కాలంలోకూడ, శక్తిమంతాలైన గొప్పగొప్ప జాతుల్లో మహాద్భుతభావాలు వెలువడ్డాయి. నాడు, నేడుకూడ అద్భుత భావరాశి, ఒక జాతినుండి మరొక జాతికి ప్రసరించే ఉంది. పురాతనకాలాల్లోనూ, ఈ రోజుల్లోనూ కూడ పరదేశాలపై దాడులు వెడలే బలవంతాలైన జాతులు, మహా ధర్మాలు, దివ్యమహిమల మొలకలను దూరప్రదేశాల్లో నాటుతూ వచ్చిన మాట వాస్తవమే! కాని ప్రియమిత్రులారా! నా మాటలు గుర్తుపెట్టుకోండి! ఈ ప్రపంచమంతా, యుద్ధభేరుల ఘోషతోను, యుద్ధభటమ్యాహాల, అట్టహాసాలతోను సాగింది. ప్రతి ధర్మభావం, నెత్తుటి వెల్లువలో ముంచబడింది. ప్రతి దివ్యసంకల్పం లక్షలకొద్దీ సోదరుల రక్తప్రవాహాలపై తేలియాడుతూ నడచింది. ప్రతి మహావాక్కు కోట్లకొలది ప్రజల ఆర్తనాదాలు, పసిబిడ్డల ఏడ్పులు, వితంతువుల కన్నీటి వెల్లువలను వెల్లడించింది. దాదాపుగా, ఇతర జాతుల ధర్మప్రచారమంతా ఇలాగే జరిగింది. కాని భారతభూమే యుగయుగాలనుండి శాంతిమయ జీవనాన్ని సాగిస్తోంది. గ్రీకుదేశం తలెత్తడానికి ముందే, రోమ్ నగరం ఊహాక్షేత్రంలో పొడచూపడానికి ముందే, నేటి యూరప్ జాతుల పూర్వపురుషులు, శరీరమంతా పచ్చలు పొడిపించుకొని అడవులలో తిరుగుతున్న కాలంలోనే, ఈ భారతదేశంనుండి ధర్మప్రచారాలు సాగాయి. అంతకు పూర్వంనుండి – అంటే, చారిత్రక గ్రంథయోచనేలేని కాలం నుండి – దురవగాహమైన ప్రాచీనాంధకారంలోనికి పురాణగాధలు తొంగిచూడటానికి సాహసించలేని కాలంనుండి – నేటివరకు, దివ్యభావ పరంపరలెన్నో ఈ దేశంనుండి ప్రచారమై వెడలినాయి. కాని ఈ ప్రతిపలుకుకు ముందు శాంతి, వెనుక దీవెన, సహచరులుగా ప్రవర్తిల్లాయి. ప్రపంచంలోని అన్నిజాతులలోను మనం మాత్రం ఎప్పుడూ పరులమీదికి దాడి వెడలి ఎరుగం! అలాంటి మహాభాగ్యం ఉండడంవల్లే మనం సజీవులమై ఉన్నాం.
గ్రీసుదేశ సేనాదళాల దాడివల్ల భూమివణకిపోయిన కాలం ఉంది. ఆ పురాతన గ్రీకుల సామ్రాజ్యం – అలాంటి వీరభూమి – నేడు నామ రూపాలు లేకుండా తుడిచిపెట్టుకొని పోయింది. చివరికి దాన్ని గూర్చి చెప్పుకోవడానికి నేటికొక పిట్టకథకూడ మిగలలేదు. లోకంలో కొంచెం పచ్చపచ్చగా ఉన్న ప్రాంతంపై అంతా రోమన్ జండా ఎగిరినకాలం ఉంది. చతుస్సముద్రపర్యంతం వారు, తమ కబంధహస్తాలు చాచారు. వారి అధికార దుర్మదాంధత మానవజాతి శిరస్సుపై తాండవమాడింది. కాని, ఇప్పుడో! ఒకప్పుడు రాజప్రాసాదాలతో కళకళలాడిన క్యాపిటోలీన్ పర్వతం ఇప్పుడు జాడతెలియకుండా పాడుపడివుంది. వారి సీజర్ బిరుదాంకిత ప్రభువులు రాజ్యమేలినచోట్ల, సాలెపురుగులు బూజుపెట్టి గూళ్ళు అల్లుతున్నాయి. ఇట్లే తళుక్కుమని మెరసి మాయమైన ఇతర విఖ్యాత జాతులుకూడ కొన్ని ఉండేవి. కాని ఏదో కొన్నాళ్ళపాటు విజయగర్వంతో ఒళ్ళుతెలీక మిడిసిపడి నీటిపైన చెరలాడు చిన్న అలలలాగా, అవన్నీ మటుమాయమైపోయాయి. ఆ జాతులు ఈ విధంగా, నరలోకంలో తమ జాడలను మాత్రం చూచాయగా నిలుపుకొన్నాయి. కానీ మనమో, సజీవులమైవున్నాం. మనువు మళ్ళీ ఈనాడు తిరిగొస్తే, అతనికాశ్చర్యం కలుగదు. తానొక కొత్త ప్రదేశానికి వచ్చినట్లు అనుకోడు. వేలాది సంవత్సరాల అనుభవంవల్ల కూర్చిన ఆ శాసనాలే ఈనాడూ ఉన్నాయి. తరతరాలనుండి ఆచారంగా వచ్చిన వివేక ఫలితంగా, అనేక శతాబ్దాల అనుభవసారం తమలో జీర్ణించుకొని నిత్యం, సనాతనాలై కనిపించే ఆ సిద్ధాంతాలే, నేటికి ఉన్నాయి. దినాలు గడిచేకొద్దీ, అడ్డు తగిలేకొద్దీ, అవన్నీ ఒకే ఉద్దేశం నెరవేర్చడానికే అన్నట్టు – అంటే ఆ ఆచారమర్యాదలనే మరింత పటుతరంగా, సుస్థిరంగా చేసేలా తోస్తోంది. దీనికంతకూ కేంద్రమేదో, సమస్త రక్తనాళాలకు మూలమైన హృదయమేదో, మన జాతీయ జీవితానికి మూలాధారమేదో కనుక్కోవడం ఈ దేశంలోనే సాధ్యమవుతుందని స్వానుభవంతో చెబుతున్నాను; నా మాట నమ్మండి.
ప్రపంచంలో, ఇతర జాతులవారికి, మతం అనేక జీవన వ్యావృత్తులలో ఒకానొకటి. వారికి రాజకీయాలున్నాయి. సాంఘిక సౌభాగ్యాలున్నాయి. ఐశ్వర్యం సమకూర్చిపెట్టేవన్నీ, అధికారంతో సాధించుకోగలిగేవన్నీకూడ ఉన్నాయి. ఇక ఇంద్రియభోగాలకు కొదువలేదు. ఈ రకరకాలైన జీవన వ్యావృత్తుల లోలతచే పరవశించిన, మత్తెక్కిన తమ ఇంద్రియాలకు మరికొంత ఉద్రేకం కలిగించేదేదైనావుందా అనే దేవులాటల మధ్య, బహుశా మతం అనేదికూడ ఒక స్వల్పాంశమై ఉండొచ్చు. కానీ, ఇక్కడ, హిందూదేశంలోనే – మతం విశిష్టమైన ఏకైక పురుషార్థమై ఒప్పుతోంది. చైనా, జపాన్ యుద్ధం జరిగిందని మీలో ఎంతమందికి తెలుసు? తెలిసినవాళ్ళున్నా ఏ కొద్దిమందో ఉంటారు. పాశ్చాత్య ఖండాల్లో సంఘాన్ని మార్చాలని చూచే భయంకర రాజకీయ ప్రచారాలు, సాంఘికోద్యమాలు చాలావున్నాయి. అవి మీలో ఎంతమందికి తెలుసు? ‘చాలా తక్కువ’ మందికే తెలిసివుంటుంది. అయినా, అమెరికాలో సర్వమతమహాసభ ఒకటి జరిగిందని, అక్కడికి ఒక హిందూసన్యాసిని పంపారనీ, ఇక్కడి కూలివానికిసైతం తెలిసిపోవడం చూచి, నేను ఆశ్చర్యపడ్డాను. మన సహజ వాసనలు ఎలా నడుస్తాయో, మన జాతీయ జీవనగతి ఎలాఉందో ఇందువల్ల గుర్తింపవచ్చు. ప్రాచ్యఖండవాసుల అజ్ఞానాన్నిగూర్చి జాలిపడే లోకసంచారులు – అందునా ముఖ్యంగా విదేశీయులు – వ్రాసిన పుస్తకాలు నేను చదువుతూండేవాడిని. ఒక దృష్టితోచూస్తే వారి వ్రాతలు కొంతవరకు సత్యాలైనా, వేరొక దృష్టితో చూస్తే అవి వట్టి అసత్యమని నాకనిపించింది. ఇంగ్లాండులోగాని, అమెరికాలోగాని, ఫ్రాన్స్లోగాని, జర్మనీలోగాని, మామూలు రైతును పిలిచి “నీది ఏ పార్టీ?” అని అడిగిన వెంటనే తనది ‘రాడికల్ పార్టీ’ అనో లేక ‘కన్సర్వేటివ్ పార్టీ’ అనో చెప్పి, తాను ఆ పార్టీ వారికే ‘ఓటు’ వేస్తానని చెబుతాడు. అమెరికాలోని రైతు తాను రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీలలో దేనికి చెందింది చెబుతాడు. వ్యాపార సమస్యలు మొదలైనవానిని గూర్చికూడ కొంత వివరించి చెప్పగలుగుతాడు. కాని వాని మతమేదో అడిగిచూడండి. తాను చర్చికి పోతాననీ, ఏదో సంప్రదాయానికి చెందినవాడిననీ మాత్రం చెబుతాడు. వానికి తెలిసిందంతా అంతే. అంతేచాలు అని అతడనుకొంటాడు.
ఇక, మన రైతును పిలిచి “నీకు రాజకీయాలేమైనా తెలుసా?” అంటే అతడు “రాజకీయాలా? అవేమిటి బాబు?” అని తిరిగి మనల్నే ప్రశ్నిస్తాడు. వానికి సామ్యవాదమేమో తెలీదు. పెట్టుబడికి, పరిశ్రమకువున్న సంబంధం తెలీదు. అతడు అలాంటి విషయాలను గూర్చి తన జన్మలో ఎన్నడూ వినివుండడు. అతనికి పొట్టకూటికై చెమటోడ్చి కష్టించడం మాత్రం తెలుసు. అయినా “నీ మతమేమి?” అని వానినడగండి. అతడు “బాబూ! ఇదిగో, ఇటుచూడు! దాన్ని నా ముఖంమీదనే ముద్రించాను” అని చూపుతాడు. మత విషయాన్నిగూర్చి, అతడు ఒకటి రెండు ధర్మవాక్కులనుకూడ చెప్పగలడు. ఇది, నా అనుభవ విషయం. మన జాతీయజీవనం ఆ విధంగా నడుస్తోంది.
మనకు కర్మసిద్ధాంతంపై గాఢమైన విశ్వాసముంది. మానవుల చిత్తవృత్తులను చూడండి. ఎవని తీరు వానిది. అట్లే, ఎవని ఆత్మపరిణతి మార్గం వానిది. అనంతమైన పూర్వజన్మ పరంపరవలన, పురాకృత కర్మ విశేషంవలన, మానవుని ప్రస్తుత వైఖరి నిర్ణయించబడి ఉంటుంది. ప్రతివాడూ, తన పూర్వజన్మ ఫలితాన్ని తలదాల్చి ఈ లోకంలోకి వస్తాడనీ, అనంతమైన తన పూర్వజన్మలు ఇప్పటి జన్మకు మూలమనీ, ఈ జన్మను తాను వినియోగించుకొనే విధానాన్ననుసరించే రాబోవు జన్మ నిర్ణయించబడుననీ ప్రతిహిందుమా భావిస్తాడు. ఈ విధంగా ఈ ప్రపంచంలో పుట్టే ప్రతిమానవుడూ నిర్వహించవలసిన ధర్మం, జీవితంలో అనుసరించవలసిన నిర్ణీతమార్గమూ ఉంటుంది. ఈ సూత్రం, వ్యక్తుల విషయంలో ఎలా నిజమో, జాతి విషయంలోనూ అంతే. ప్రతి జాతికీ ఒక విభిన్న జీవనవైఖరి, ఒక ప్రత్యేక జీవన సాధన, ప్రపంచ జీవనంలో అది నిర్వహించవలసిన ఒక విశిష్ట కర్తవ్యమూ ఉంటుంది. ప్రతిజాతీ, దాని జీవన ఫలితార్థాన్ని అనుభవిస్తుంది. అది, తన నిర్ణీత కర్మను నిర్వహించి తీరాలి! రాజకీయోద్దతి కానీ, సైనిక బలోన్నతికానీ సాధించడం, మన జాతికి సహజధర్మం కాదు. ఎన్నడూ అది అలా ఉండదు. నా మాట మనస్సులో పెట్టుకోండి. అలాంటిది మనకెన్నడూ సహజం కాబోదు. అయినా విశిష్ట కర్తవ్యం మన పాలిట ఉంటుంది. మనలోని ఆధ్యాత్మికశక్తినంతా చక్కగా సంఘటితపరచి, సంరక్షించి, పోషించి, భారతజాతిని, ఒక ఆధ్యాత్మిక మహాశక్తి స్వరూపంగా తీర్చిదిద్దవలసి ఉంది. అలాంటి వారించరాని మహాశక్తి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడంతా ప్రపంచాన్ని ముంచెత్తివేయాలి. పర్ష్యనులో, గ్రీకులో, రోమన్లో, అరబ్బులో, ఆంగ్లేయులో ఎవరైనా సరే, తమ సేనలతో దండెత్తి ప్రపంచాన్ని జయించి, వివిధ జాతులను ఏకం చేయనీ – హైందవుల వేదాంతం, ఆధ్యాత్మిక విద్య, అప్పుడీ నూతనావకాశాన్ని పురస్కరించుకొని ప్రపంచ జాతుల రక్తనాళాలలోనికి ప్రవేశించడానికి సిద్ధం. సమష్టి మానవజాతి అభ్యున్నతికై భారతీయుని శాంతిమయ ధీశక్తి, తనవంతు తాను సమర్పించాలి. భారతదేశం ప్రపంచానికివ్వనున్న కానుక ఈ ఆధ్యాత్మిక తేజమే.
ఈ విధంగా పూర్వం ఒక్కొక్క జాతి, మహోధృతంగా విజృంభించి, ప్రపంచంలోని వివిధ జాతుల్ని ఏకంచేస్తూ వచ్చింది. సహజంగా ఏకాంతవాసాన్ని ఇష్టపడే భారతదేశానికి ఆయా సందర్భాల్లో అంతా ఇతర జాతులతో కలయిక కలిగింది. అయినా, ఈ భారతజాతి మళ్ళీ, ఇతర ప్రపంచ జాతులనుండి విడివడి, ఏకాంతంలోనికి పోతూండడమే చాలా మార్లు జరిగింది. కానీ భారతీయులకు, ఇతర జాతులతో సంసర్గం కలిగినప్పుడు మాత్రం తత్ఫలితంగా భారతీయుల ఆధ్యాత్మిక ధర్మప్రవాహాలు ప్రపంచమంతటా వ్యాపిస్తూ వచ్చాయి. వేదాలకు పురాతనమైన పారశీక భాషానువాద మొకటుంది. అది అంత నిర్దుష్టమైంది కాదు. దాన్నే మళ్ళీ ఒక ఫ్రెంచి యువకుడు లాటిన్ భాషలోని కనువదించాడు. జర్మనీ దేశపు మహాతత్త్వవేత్తలలో ఒకడైన ‘స్కోపెన్హారు’ దాన్ని ఈ శతాబ్దారంభ కాలాన (అంటే క్రీ.శ. 1800 సం ॥ ప్రాంతాన) చదివి “ఉపనిషత్తుల అధ్యయనంవంటి ఉదాత్తవిద్య, ఆత్మవికాసాన్ని కల్గించే సాధనం ఈ లోకంలో మరొకటి లేదు. అది నా జీవితంలో చిత్తశాంతిని ప్రసాదించింది. నా మరణకాలంలోకూడ అది నిరవధికమైన శాంతినే ప్రసాదించగల” దని చెప్పాడు. అంతేకాదు “పూర్వపు గ్రీకుల విజ్ఞాన పునరుద్ధరణ మహోద్యమంలో కన్నా, నూరురెట్లు శక్తిమంతమై, మానవుని వ్యాపారాన్ని పూర్తిగా మార్చే అత్యద్భుత మార్పులను ప్రపంచం చూడనుంది” అని ఆ జర్మన్ తత్త్వవేత్త భవిష్యద్వాణినికూడ చెప్పాడు. ఈనాడు అతని జోస్యం ఫలిస్తోంది. నెమ్మది నెమ్మదిగా ఎప్పుడూ వ్యాప్తి పొందుతున్న హైందవ తత్త్వంవల్ల ప్రపంచ జీవకళలో, గమనంలో, ఆచారాల్లో, సారస్వతంలో ఎంతటి గొప్పమార్పు జరుగుతోందో, యోచనాపరులైన ప్రపంచ చరిత్ర పరిశీలకులకు, కళ్ళు తెరిచి ఆయా పాశ్చాత్య జాతులవారి మనస్సులలో జరిగే సంచలనం చూసేవారికీ తెలుస్తుంది.
నేనిదివరకే సూచించినట్లు, ఇంకో విశేషంకూడ ఉంది. మనమెన్నడూ అగ్నిని ప్రయోగించి, ఖడ్గాన్ని ఝళిపించి ధర్మప్రచారం చేయలేదు. భారతదేశం ప్రపంచానికిచ్చిన ఈ వరప్రసాదాన్ని వర్ణించడానికి ఆంగ్లభాషలో ఏదైనా శబ్దముంటే భారత వాఙ్మయం మానవజాతిలో కల్పించిన పరివర్తనాన్ని తెలుపడానికి ఆంగ్లభాషలో తగిన పదంవుంటే అది “మోహినీశక్తి లేక, ఆకర్షణశక్తి” అనేదే. దీని అర్థం, ఆకస్మికంగా మీపైన ఏదైనా వచ్చిపడి భ్రాంతుని చేయడం అనికాదు. “మీకు తెలీకుండా మెల్లమెల్లగా మిమ్మల్ని ఆకర్షించడం” అని దానికర్థం. చాలామందికి మొట్టమొదట భారతీయుల భావాలన్నా, భారతీయుల మర్యాదలన్నా, భారతీయుల ఆచారాలన్నా, భారతీయుల వేదాంతమన్నా, భారతీయుల వాఙ్మయమన్నా వెగటుగానే ఉంటుంది. కానీ, వారు ఓపికపట్టి, మన గ్రంథాలు చదవాలి; మన భావాలకు మూలాధారాలైన మహాసూత్రాలను పరిచయం చేసుకోవాలి! అప్పుడు, నూటికి తొంభైతొమ్మిదిమంది మీద, ఈ సమ్మోహనశక్తి చక్కగా ప్రసరిస్తుంది. దాని ఫలితార్థమో, పారవశ్యమే. వేకువజాములో కంటికి కనిపించకుండా, చెవికి వినిపించకుండా వర్షించి, తెల్లవారేసరికి, మెల్లమెల్లగారోదసినంతా ఆవరించే కోమల శిశిరంలాగా, పరమశాంతం, నిరాడంబరం, సహనశీలం, ఆధ్యాత్మపరాయణం అయిన భారతజాతి ప్రపంచ ప్రజల భావ వసుంధరపై తన ప్రభావాన్ని ప్రసరింపజేసింది.
చరిత్రలో ఇదివరకు జరిగిందే మళ్ళీమళ్ళీ జరుగనుంది. ఈనాటి ఆధునిక శాస్త్రంవల్ల గాఢం, సుస్థిరం అనుకొన్న పురాతన విశ్వాసాలు పూర్తిగా హతమైపోతున్నాయి. మానవజాతి అంతా, లొంగి మన్నన చేసి తీరాలని ఆశించిన సాంప్రదాయక గౌరవాధిక్యాలు నలినలిగా చితుకకొట్టబడి, గాలిలో కనిపించకుండా ఎగిరిపోతున్నాయి. ఈనాటి, ప్రాచీన వస్తుపరిశోధనలనే పెద్ద సమ్మెటపోటులకు తాళజాలక, పురాతనాచార విశ్వాసాలు గాజుముక్కల్లాగ పొడిపొడైపోతున్నాయి. మతం పాశ్చాత్యదేశాల్లో పామరుల చేతుల్లో చిక్కుకొనిపోయింది. పండితులు మత సంబంధమైన ప్రతిదాన్నీ చీదరించుకొంటున్నారు. ఈ పరిస్థితుల్లో భారతీయుల వేదాంతంలోని ఆధ్యాత్మిక మహాశయాలు, భారత హృదయము ముందుకు సాగివస్తున్నాయి. అత్యున్నత వేదాంతధర్మాలు, సామాన్య భారత ప్రజలకు, నిత్యానుష్ఠాన మర్యాదలు. ఇదంతా ఒకే పదార్థం అనే అద్వైతమార్గం, వేదాంతం బోధించే నిర్గుణతత్త్వభావం, నరుని ఆత్మ నశించదనే అద్భుత సిద్ధాంతం, జీవయాత్ర తెగిపోక సర్వకాలం సాగివచ్చే మహాప్రస్తానమనే తలంపు, ఈ జగత్తు అనంతమనే విశ్వాసం – ఇవి నేటి ప్రపంచాన్ని గొప్ప ఆపదనుండి రక్షించబూనాయి. ఈ ప్రపంచం ఒక మురికి కూపమని, కాలమన్నది నిన్ననో, మొన్ననో ప్రారంభమైందనీ, ప్రాచీన, విదేశ సంప్రదాయులు భావించారు. మన గ్రంథాల్లో మాత్రమే దేశ, కాల నిమిత్తాలు అనంతాలనే భావన కన్పిస్తోంది. మన గ్రంథాలలో మాత్రమే నరుని ఆత్మయొక్క అఖండ విభూతి మతాన్వేషణమంతటికీ, పరమగమ్యమని ప్రకటితమవుతోంది. ఆధునిక కాలంలో పరిణామ సిద్ధాంతం, అక్షయశక్తి, ఇత్యాది సిద్ధాంతాలు బయలుదేరి, నానావిధ తుచ్ఛమతభావనలను రూపుమాపుతున్న ఈ సమయాన – విజ్ఞులకు ఆదరణీయమై, వారిలో భక్తిని పురికొల్పేదేముంది? వేదాంతం మాత్రమే! చిరకాలాన్వేషణ ఫలితంగా, మానవాత్మనుండి బయల్వెడలిన అద్భుతాలు, ప్రామాణికాలు, అత్యంత విశాలం, మహోన్నతం అయిన వేదాంతభావాలే; భగవద్వాణి అయిన ఒక్క వేదాంతం మాత్రమే నేటి విజ్ఞులకు ఆరాధ్యం కాగలదు.
ఇక్కడ నేనొక విషయాన్ని వివరించి చెప్పవలసి ఉంది. ఇతర దేశాలపై అంతప్రభావం ప్రసరించని మతం ‘మన మతం’ అని నేనన్నపుడు, మన హైందవ మతానికి పునాదులైన మూలసిద్ధాంతాలనే నా అభిప్రాయం. అనేక శతాబ్దాలుగా, సంఘ అవసరాలను పురస్కరించుకొని, ఈ మతంలో వచ్చి చేరిన ఆచారాలకు, ఇతర స్వల్పవిషయాలకు, మతం యొక్క మూలసూత్రాలతోపాటు, తగిన స్థానమిచ్చి గౌరవింపజాలం. అది న్యాయమే కదా! మన గ్రంథాల్లో రెండువిధాలైన ధర్మాలు ప్రతిపాదించబడ్డాయి. వాని విభేదంకూడ స్పష్టీకరించబడి ఉంది. అందులో కొన్ని ధర్మాలు సనాతనం; అవి నరుని గుణాలను అనుసరించి, ఆత్మస్వరూపాన్ని అనుసరించి, జీవపరమాత్మల సంబంధాన్ని అనుసరించి, భగవంతుని స్వరూపాన్ని అనుసరించి, జీవుని పరమగమ్యాన్ని అనుసరించీ గుర్తించబడ్డాయి. సృష్టిక్రమం, సృష్టియొక్క ఆద్యంతరహితత్వం (అంటే శూన్యంనుండి ఈ ప్రపంచం సృష్టించబడలేదని, నిరాకార, నిర్గుణ బ్రహ్మంనుండి ఆవిష్కరించ బడిందని చెప్పే సిద్ధాంతం) మొదలైనవి ఈ మొదటిరకపు ధర్మాలలో చేరుతాయి. ఇవి, ప్రకృతిలోని సనాతన ధర్మాలపైన ఆధారపడి నిర్మించబడిన శాశ్వత సూత్రాలు. ఇక రెండవ వర్గానికి చెందినవి, జీవుని దైనందిన జీవితానికి సంబంధించిన సాధారణ సూత్రాలు. ఇవి పురాణాలకు, స్మృతులకు సంబంధించినవి. వీటికి మొదటిరకపు సిద్ధాంతాలతో సంబంధంలేదు. మన జాతిలోకూడ ఇవి, ఆయాకాలాల్లో మారుతూ వచ్చాయి. ఒక యుగం ఆచారాలు, మరొక యుగానికి సరిపడవు. యుగాలు మారేకొద్దీ, అవీ మారుతూంటాయి. మహర్షులు పుట్టి, కొత్త పరిస్థితులకు అనుకూలమైన ఆచార మర్యాదలు నెలకొలిపి మనల్ని నడుపుతూంటారు.
జీవుడు, బ్రహ్మం, జగత్తు; వీనిని గూర్చి అద్భుతం, అనంతం, ఉదాత్తం, ఉదారం అయిన ధర్మసూత్రాలు ఈ పవిత్ర భారతదేశంలోనే ఉద్భవించాయి. “నా దేవుడు సత్యం; నీ దేవుడు వట్టి బూటకం. కాదంటావా, రా! సవాల్ చేస్తున్నా. కత్తిదూసి నిలబడు. నీవో, నేనో ఒక్కరే మిగలాలి!” అంటూ ఆయా కులదేవతలపైని దురభిమానంపూని దెబ్బలాటలకై తగవులాడాలనే ఉద్రేకం ప్రబలనిది, ఈ ఒక్క దేశంలోనే; మానవుని పరాప్రకృతిమీద ఆధారపడి రూపొందించిన ఈ మహాధర్మసిద్దాంతాలు, విశ్వమానవ శ్రేయస్సుకు వెయ్యేండ్ల క్రింద ఎలా ఉపయోగపడ్డాయో, నేడూ అలాగే ఉపయోగపడుతున్నాయి. నేడే కాదు, ఈ పుడమి నిలిచేంతకాలం అవి అట్లే ఉండగలవు. కర్మసిద్ధాంతం పాటించబడేంతకాలం, మనం వ్యష్టి జీవులమై పుడుతూ, స్వశక్తిపైన ఆధారపడి మన తరుణోపాయాన్ని మనం చూచుకొంటూ ఉన్నంతకాలం, అవి చెక్కుచెదరక అలాగే నిలిచి ఉండగలవు.
అన్నిటికంటె ఎక్కువగా భారతదేశం లోకానికి ముఖ్యంగా ప్రసాదించవలసింది ఇది; ఆయా జాతుల మతాల ఉత్పత్తి, వృద్ధి పరిణామాలను కనిపెట్టిచూస్తే, ప్రతిశాఖకూ మొట్టమొదట ఒక్కొక్క దేవత ఉంటుందని తెలుస్తుంది. ఈ మతశాఖలు ఒకదానితో ఒకటి స్నేహంచేస్తే, ఈ దేవతలందరూ ఒక్క సామాన్య జాతీయనామంతో వ్యవహరించబడతారు. ఉదాహరణకు బాబిలోనియనుల దేవతల పేర్లను చూడండి. బాబిలోనియన్ జాతివారు వేర్వేరు ఉపజాతులుగా, అంటే వేర్వేరు శాఖలుగా విడివడివున్నా వారి దేవతలకు ‘బాల్’ అనే సామాన్య జాతీయ నామం వాడబడుతూండేది. యూదియా జాతిలోని ఉపజాతులవారి దేవతలకుకూడ “మోలక్” అనే సామాన్య నామముండేది. ఇలావుండగా ఆ ఉపజాతులలో ఏదో ఒకటి, తక్కినవానిపై ఆధిపత్యాన్ని సాధించి, తమ రాజే అందరికీ రారాజని చాటుతుంది. అప్పుడు అది సహజంగా తమ దేవుడే తక్కిన ఉపజాతుల దేవుడనీ వాదిస్తుంది. ‘బాల్ – మెరొడాక్’ అత్యధిక మహిమోన్నతుడనీ, తక్కిన దేవతలంతా వానికంటే తక్కువవారనీ, బాబిలోనియన్లలో ఒక శాఖవారు చెబుతారు. అన్ని ‘మోల్కు’ లలో కూడ, ‘మోల్క్యావా’ అత్యధికుడని యూదులలో ఒక తెగవారు వాదిస్తారు. ఎవరి దేవుడు అధికుడు అనేది యుద్ధంచేసి తేల్చుకొంటారు. ఇలాంటి తగవులు పూర్వం మనదేశంలోకూడ ఉండేవే. ఇక్కడకూడ దేవతలు పోటీపడి ఆధిక్యతకోసం పోరాటాలు సాగించారు. కాని, ఈ దేశపు అదృష్టంవల్లా, ప్రపంచపు అదృష్టంవల్లా, ఈ రణగొణధ్వనినుండే, ఈ గందరగోళంనుండే – “ఏకం సత్, విప్రాః బహుధావదన్తి” (ఉన్నది ఒక్కడే, వానిని ప్రాజ్ఞులు అనేక పేర్లతో పిలుస్తారు) అనే దివ్యవాణి వెలువడింది. “శివుడు విష్ణువుకన్నా ఘనుడు” అనడంకాదు “విష్ణువే మహాఘనుడు, శివుడు కొరగానివాడు” అనడమూకాదు. ఉన్నది ఒక్కడే దేవుడు. వానిని శివుడనండి, విష్ణువనండి, లేక లక్షపేర్లు పెట్టి పిలుచుకోండి. పేర్లు రకరకాలుగా ఉండొచ్చు. ఉన్నది ఒక్క దేవుడే. భారతదేశ చరిత్రయొక్క పర్యవసానమంతా ఈ రెండు ముక్కలలో ఇమిడివుంది. మనచరిత్ర అంతా, ఈ ఒక్క ప్రధానసూత్రాన్నే, అద్భుత శక్తితో – గంభీర భాషతో – పలుమార్లు పల్కుతోంది. దేశమంతటా, ఈ కథనం సాగింది. ఫలితార్థమేమి? ఈ భావం భారతీయుల రక్తనాళాల్లో ప్రవహించే ప్రతి నెత్తుటిబొట్టులో నిండింది; వారి ప్రతి రక్త కణంలో జీర్ణించిపోయింది; వారి జీవితంలో కలిసిపోయింది. వారి స్వరూప ఉపాధిలో ఏకమై ఇమిడిపోయింది. అందువల్ల ఈ దేశం సహనానికి పెట్టినపేరై వివిధ మతాలను, వివిధ జాతులను ఆహ్వానించి, తల్లిలాగా కౌగిటచేర్చి, తన హృదయానికి హత్తుకొన్నది.
పరస్పర విరుద్ధంగా, అత్యంత భిన్నంగా గోచరించే అనేక జాతులు, అనేక మతాలు, పరస్పర సౌహార్దంతో, భారతదేశాన కలిసిమెలసి జీవించడం ఎలా సాధ్యమయిందో, ఇందువల్ల తెలియగలదు. ఇలాంటి అద్భుత దృశ్యం భారతదేశంలోనే కనిపిస్తున్నది. “నీవు ద్వైతివి కావచ్చు; నేను అద్వైతిని కావచ్చు; నీవు దేవుని నిత్యసేవకుడవని విశ్వసించవచ్చు. నేను భగవంతునితో అభిన్నుడనని చెప్పుకోవచ్చు. అయినా ఇద్దరమూ ఉత్తమ హిందువులమే!” ఇదెలా సాధ్యం? “ఏకం సత్ – విప్రా బహుధావదన్తి” (దేవుడు ఒక్కడే. వానిని ఋషులు చాలా పేర్లతో పేర్కొంటారు.) అనే వేదవాక్యాన్ని చదివితే తెలుస్తుంది. భారతీయ సోదరులారా! అన్నిటికంటె ముఖ్యంగా ఈ దివ్యభావాన్నే మనం లోకానికి ఉపదేశించవలసి ఉంది. ఇతర దేశాలలో, మహావిద్యాధికులు సైతం, ముఖాలు చిట్లించుకొని, మన మతం వట్టి ‘రాళ్ళ పూజ’ అని వెక్కసంగా మాట్లాడుతుంటారు. నేనది చూశాను. కానీ, తమ తలలలో ఎలాంటి మూఢభావాలు పేరుకొని ఉన్నాయో వారు తెలిసికోవడమే లేదు. ప్రతిచోటా ఇదే కథ. స్వమత దురభిమానం! క్షుద్ర సంకుచిత భావన! అయ్యో!! తనకున్న వస్తువే మహావస్తువు! ధనదేవతను పూజించే అతని వ్యర్థజీవనమే అత్యుత్తమ జీవనమట!! వానికున్న సంపదే గడింపదగిన సంపదట! తక్కినదంతా పనికిమాలినదే! అతడేదైనా ఒక పిచ్చి మట్టిబొమ్మను చేసినా, ఒక యంత్రాన్ని నిర్మించినా, మహోత్తమ సంపదల్ని మించి అదే చాలా గొప్పదవుతోంది. ఎంత చదువున్నా, ఎంత విద్యవున్నా, ప్రపంచమంతా ఇదే స్థితి కనిపిస్తోంది. కాని, సత్యమైన విద్య ఇంకా తలచూపలేదు; నాగరికత అంటామా నిజమైన నాగరికత ఇంకా ప్రారంభం కావలసివుంది. మానవజాతిలో వేయింటికి తొమ్మిది వందల తొంభై తొమ్మిదిమంది, ఈ నాటికీ పశువులుగానే ఉన్నారు. ధర్మాలను మనం పుస్తకాల్లో చదువవచ్చు. సహనాన్నిగూర్చి మతబోధలలో విని వుండవచ్చు. కాని, లోకంలో ఈ ధర్మంగాని, సహనంగాని ఉన్నది అత్యల్పమే. ఇది నా అనుభవం. నూటికి తొంభై తొమ్మిదిమంది దానిని తలపెట్టనైన తలపెట్టరు. నేను వెళ్ళి వచ్చిన ప్రతిదేశంలో, మతంపేర ఇంకా ఘోరహింసలు జరుగుతూనే ఉన్నాయి. కొత్తవిషయాలను నేర్చుకోవడానికి పురాతనపు తాతలనాటి ఆక్షేపణలను ఇప్పటికీ వారు లేపుతున్నారు. అన్యమతాలపట్ల సహనం, పారలౌకిక చింతనపై ఆసక్తి అంతో, ఇంతో ఈ ప్రపంచంలోకంటే మన ఆర్య భూమిలోనే కనిపిస్తుంది. ఇంకెక్కడా లేదు. మహమ్మదీయుల కొరకు, క్రైస్తవుల కొరకు, హైందవుల ప్రార్థనాలయాలు కట్టడం ఇక్కడనే; మరెక్కడా కానరాదు. మీరు ఇతర దేశాలకుపోయి, మహమ్మదీయులనుగాని, మరే ఇతర మతస్థులనుగాని, మీకొక దేవాలయాన్ని నిర్మించిపెట్టమని కోరిచూడండి. సాయంచేయడమటుంచి వారు మీకున్న దేవళాలతోసహా మిమ్మల్నిసైతం మ్రింగివేయజూస్తారు. కాబట్టి హిందూదేశంవల్ల ప్రపంచం నేడు నేర్చుకోవలసిన గొప్పగుణపాఠం కేవలం సహనభావమే కాదు, సానుభూతికూడ. మహిమ్నస్తోత్రంలోని, ఈ భావాన్ని గమనించండి – “ఆయా పర్వతాలనుండి బయలుదేరి నదులన్నీ, తిన్నగానో, వంకరగానో పోయిపోయి, చివరికి సముద్రంలోనే కలిసే విధంగా, శంభో! తమ తమ సంస్కారాల ననుసరించి నరులు అవలంబించే సాధనలు భిన్నభిన్నాలుగా కన్పించినా, వక్రంగానో, నిర్వక్రంగానో సాగిసాగి, చివరికి నిన్నే పొందుతాయి. వేర్వేరు త్రోవల నడచినా అందరూ మంచిమార్గంలోనే ఉన్నారు.” కొందరు కొంచెం చుట్టు తిరిగిపోతారు. మరికొందరు సూటిగా పరుగెత్తుతారు. కాని, తుదకు అందరూ ఒక్క సదాశివుని దగ్గరికే చేరుతారు. ఆ దేవదేవుని నీవు లింగంలో దర్శించడానికేకాక, సర్వత్ర చూడగల్గినప్పుడే అప్పుడు మాత్రమే. నీ ఈశ్వరభక్తి ధన్యంకాగలదు! శ్రీహరిని అన్నిచోట్లా, అందరిలోనూ చూడజాలినవాడే హరిభక్తుడు! అతడే నిజమైన ఋషి! నీవు నిజంగా శివభక్తుడవైతే, ప్రతిదానిలో, ప్రతివానిలో, నీకు శివుడు ప్రత్యక్షమై గోచరించాలి! నామములు, రూపాలు, ఎలాంటివైనా సరే, సమస్త పూజలు, శివునికే చెల్లుతాయని నీవు గ్రహించాలి! ‘కాబా’ వైపు తిరిగిచేసే నమాజులు, క్రైస్తవ చర్చిలోని మోకరింపులు, బౌద్ధాలయమందలి ప్రణతులు దేవునిగూర్చే; వారికా విషయం తెలియవచ్చు, తెలియకపోవచ్చు; వారికా భావం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఏ రూపంపెట్టి, ఏ నామంచెప్పి అర్చించినా ఆ పువ్వులన్నీ ఈశ్వరుని పాదాలకు అంకితమైనవే. ఎందుకంటావా? ఆయనే సర్వేశ్వరుడు. ఆయనే పరమాత్మ. నీకంటె, నాకంటె బాగా, ఈ లోకానికి ఏది అవసరమో ఆయనకు తెలుసు. భిన్నత్వమంతా అంతరించిపోవడం అసంభవం. ఈ సంఘర్షణమే, ఈ భిన్నభిన్న భావనే, సమగ్ర విజ్ఞానానికి, సమస్త సంచలనానికి, సర్వశ్రేయస్సుకు దారిచూపుతున్నది. పరస్పర విరుద్ధములైన భిన్నభావనలు ఉండితీరాలి! కానీ, అంతమాత్రాన, మనం ఒకరినొకరం ద్వేషించుకోవలసిన పనిలేదు.
ఈ ఏకైక సత్యాన్ని మనమందరం మళ్ళీ గ్రహించాలి. ఈ మహా సత్యం ఇక్కడనే – మన మాతృదేశంలో మాత్రమే – అనుష్టింపబడి ప్రచారం పొందింది. అది ఇంకొకసారి ఈ భారతదేశంనుండే, ప్రపంచానికంతా ప్రచారం కావలసి ఉంది. ఈ మహాకార్యాన్ని చేయగల్గింది ఒక్క భారతదేశమే. ఆ ధర్మరహస్యమంతా మన వేదాల్లో ఉంది. మన వాఙ్మయంలో ఉంది. మన జాతీయ జీవనమందంతా నిండివుంది. ఇక్కడనే – ఇక్కడ మాత్రమే అది అనుదినం ఆచరింపబడుతోంది. కన్నులుండి చూస్తున్న ప్రతివానికి, ఈ విషయం రుజువు కాగలదు. కాబట్టి లోకానికి మనం మతధర్మాలను బోధించవలసి ఉంది. మనం బోధించవలసినవి, ఇంతకంటె మించిన ఉత్తమ ధర్మాలుకూడ ఉన్నాయి. కాని అవి విద్యావంతులకు మాత్రమే అక్కరకు వస్తాయి. పురుషుడు కాని, స్త్రీగాని, పసిబిడ్డగాని, చదువువచ్చినా, చదువురాకున్నా, జాతి వర్ణ సంప్రదాయ భేదాలులేక, సౌజన్యం, నమ్రత, ఓరిమి సహనం, సానుభూతి, సోదరభావం మొదలైన ధర్మాలు మాత్రం, ప్రతివాళ్ళూ నేర్చుకొనవచ్చు. “తత్త్వజ్ఞులు నిన్ను అనేక నామములతో సంబోధిస్తారు. కాని నీవు ఒక్కడివే!”