శ్రీ స్వాములవారు ఆల్మోరా చేరగానే ఆ పురవాసులు శ్రీవారికి హిందీ భాషలో సమర్పించిన స్వాగతానికి అనువాదం.
“మహాత్మా! పాశ్చాత్య ప్రపంచంలో ఆధ్యాత్మిక విజయాన్ని సాధించిన తర్వాత మీ మాతృభూమి అయిన భారతదేశానికి మరలి రావడానికై మీరు ఇంగ్లాండునుండి బయలుదేరారని విన్నప్పటినుండి మిమ్మల్ని చూచే భాగ్యంకోసం ఎదురుచూస్తూన్నాం. సర్వేశ్వరుని అనుగ్రహంవల్ల ఆ శుభలగ్నం చివరికి ఘటిల్లింది ‘దేవుని పూర్ణహృదయంతో ప్రేమించే పురుషుడు అతన్ని చూడగల్గడం నిశ్చయం’ అని భక్తవరుడైన తులసీదాస కవివరుడు చెప్పినమాట నేడు పూర్తిగా ఫలించింది. అందరం వినిర్మల భక్తితో మీకు స్వాగత మర్పించడానికై ఇక్కడ చేరాం. ఎంతో శ్రమవహించి మీరీ పట్టణానికి వచ్చి మాకు దర్శనమిచ్చినందుకు మేమెంతో ధన్యులమైనాం. అందుకు తగిన కృతజ్ఞతను తెలుపజాలకున్నాం. మీరు ధన్యులు. మిమ్మల్ని యోగారూఢుల చేసిన ఆ పూజ్య గురుదేవులు ముమ్మాటికీ ధన్యులు. ఈ ఘోర కలియుగంలో సైతం ఆర్యజాతుల్లో మీవంటి నాయకాగ్రేసురులను కన్న భారతభూమి ధన్యం. మీ జీవిత ప్రారంభదశలోనే నిరాడంబర వృత్తివల్ల, నిష్కాపట్యంవల్ల, సద్వర్తనంవల్ల, పరోపకారచింతనవల్ల, తీవ్రసాధనవల్ల, సచ్ఛీలం వల్ల, జ్ఞానబోధవల్ల, ప్రపంచమంతటా వినిర్మల కీర్తిచంద్రికలు వెలయించారు. తత్కారణంగా మేమెంతో గర్వపడుతున్నాం.
శ్రీ శంకరాచార్యులవారి కాలంనుండి ఇప్పటివరకు ఈ దేశంలో ఎవ్వరూ నిర్వహింపజాలని మహాకార్యాన్ని నిజంగా మీరు నిర్వహించగల్గారు. ప్రాచీన భారతదేశపు ఆర్యుల సంతతి వారిలో ఒకడు తన తపోబలంవల్ల భారతీయుల ప్రాచీనమతం ఇతరమతాలకన్న శ్రేష్టతరమని ఇంగ్లాండు, అమెరిగా, విద్వద్వరుల ఎదుట రుజువు చేయగలడని ఎవరం కానీ కల్లోనైనా అనుకోలేదు. షికాగో నగరంలో జరిగిన అఖీల ప్రపంచ మత మహాసభలో సమావేశమై వివిధ మతాల ప్రతినిధుల ఎదుట, వారికళ్ళు తెరుచుకొనే విధంగా, ప్రాచీన భారతదేశ మత శ్రేష్ఠత్వాన్ని అతిసమర్థతతో మీరు రుజువు చేశారు. ఆ మహాసభలో పండితులైన వక్తలు తమ తమ మార్గాల్లో తమతమ మతాలను సమర్థించుకొన్నారు. కాని, మీరందరినీ మించి ప్రకాశించారు. ఏ ఇతర మతం, వేదమతానికి సాటిరాజాలదని, పూర్తిగా నిర్ధారణ చేశారు. ఇంతేకాక, ఆ పాశ్చాత్యఖండాల్లో అనేక స్థలాలలో, ఈ ప్రాచీన జ్ఞానాన్నిగూర్చి ప్రచారంచేసి, ఎందరో విద్యాధికుల దృష్టిని ప్రాచీన ఆర్యమతం వైపునకు, తత్త్వసిద్ధాంతాల వైపునకు ఆకర్షించారు. ఇంగ్లాండులో సైతం మన ప్రాచీనమత ధ్వజాన్ని సంస్థాపించారు. ఇప్పుడు దాన్ని తొలగించడం సాధ్యంకాదు.
ఇప్పటివరకు, అమెరికా యూరప్ ఖండాల్లోని నవీన నాగరిక జాతులవారు, మన మతానికి స్వతసిద్ధమైన, సత్యస్వభావాన్ని గూర్చి పూర్తి అజ్ఞానంలో ఉన్నారు. కానీ, మీ ఆధ్యాత్మికోపదేశాలవల్ల, మీరు వారికళ్ళను తెలిపించారు. ఈ ప్రాచీన మతాన్ని ‘దురహంకారులు వ్యక్తీకరించిన దుర్బోధ్యాంశ బంధురమత’ మనీ, ‘బుద్ధివిహీనులకు పనికివచ్చే ప్రలాపరాశి’ అనీ, తమ అజ్ఞానంకొద్దీ, హేళనచేస్తూ వచ్చిన వారే, అది ఒక మహారత్నఖని అని ఇప్పుడు తెలుసుకొనేలా చేశారు. నిజంగా, మూఢులైన నూర్గురు కొడుకులకంటె, నీతిమంతుడు, విద్వాంసుడు అయిన ఒక్క పుత్రుడుండటమే శ్రేష్టతరం. “ఒక్కడైనా చంద్రుడే, తన కాంతిచేత చీకటినంతా పోద్రోలగలడు; కానీ నక్షత్రాలన్నీ కలిసికూడ, అలా చేయజాలవు. మీవంటి పుణ్యాత్ముడైన సత్పుత్రుడే నిజంగా లోకంలో ప్రయోజకుడు కాగలడు. భారతమాత తన దీనదశలో, మీలాంటి పవిత్ర పుత్రులను చూచుకొని ఊరట పొందుతోంది. ఎంతోమంది సముద్రాన్ని దాటి, విదేశాలకు వెళ్ళి, దిక్కుతెలీక ఇటు, అటు పరువులు పెడతారు. కానీ, మీ పురాకృత సత్కర్మ మహిమవల్ల దూరంగా, సముద్రాని కావలివున్న వారికి, మన మత మహిమను విశదపరిచి వచ్చారు. మనోవాక్కాయ కర్మలచేత మానవకోటికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించడమే, మీ జీవిత పరమావధిగా పెట్టుకొన్నారు. బ్రహ్మజ్ఞానబోధ చేయడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు.
మీకు ఇక్కడ ఒక మఠాన్ని స్థాపించాలనుకున్నారని విని చాలా ఆనందించాం. మీ ప్రయత్నాలు ఫలించాలని భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. శ్రీ శంకరాచార్యులు సైతం, పారమార్థిక విజయాలను సాధించిన తర్వాత, ఈ ప్రాచీన మత సంరక్షణార్థం, ఒక మఠాన్ని ఈ హిమాలయాలలో, బదరికాశ్రమంలో స్థాపించారు. అదే విధంగా, మీ కోరికకూడ సఫలమైతే, భారతదేశానికి గొప్పమేలు చేకూరుతుంది. ఈ మఠస్థాపనవల్ల, కుమావున్ ప్రజలమైన మేము, ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందగల్గుతాం. ఆ విధంగా ఈ ప్రాచీన మతం మాలో క్రమంగా, అడుగంటిపోకుండ చూచుకోగలమని ఆశిస్తున్నాం.
అతి ప్రాచీనకాలంనుండి భారతదేశంలో ఈ ప్రాంతం సన్న్యాసానికి ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా ఉంది. భారత ఋషులలో ఉత్తమోత్తములు, భక్తితో తపస్సాధనతో ఈ క్షేత్రంలో నివసించారు. కానీ, ఈ విషయం పూర్వకాలపు ముచ్చటైపోయింది. మీరు దయతో ఇక్కడ మఠాన్ని స్థాపించి ఆ పూర్వదశను మేము మళ్ళీ చూచేలా చేస్తారని ఆశిస్తున్నాం. ఈ పుణ్యక్షేత్రంలోనే సత్యమైన మతధర్మం, కర్మ, ఆత్మశిక్షణ, సద్వర్తనం విలసిల్లినట్లు, భారతదేశమంతటా పేరు మ్రోగింది. కానీ, ఇప్పుడదంతా, కాలగతికిలోనై క్షీణించింది. మీ సత్ప్రయత్నాలవల్ల, ఈ క్షేత్రం ప్రాచీన ధర్మోన్నతిని తిరిగి పొందాలని మేము ఆశిస్తున్నాం.
మీరిక్కడికి రావడం వల్ల మాకు కలిగిన ఆనందాన్ని తగు విధంగా ప్రకటింపజాలకున్నాం. పూర్ణారోగ్యాన్ని అనుభవిస్తూ, పరోపకార జీవనాన్ని గడుపుతూ, మీరు చిరంజీవులై వర్థిల్లుదురు గాక; మీ ఆధ్యాత్మికశక్తులు ఎప్పుడూ వృద్ధిపొందుతూ, మీ కృషివల్ల ఈ భారతదేశ దురవస్థను త్వరగా తొలగించాలి!”
ఇదేకాక మరి రెండు వినతి పత్రాలు సమర్పించబడిన తర్వాత శ్రీ స్వాములవారు ఈ క్రింది విధంగా సంక్షేపంగా ప్రత్యుత్తరమిచ్చారు.
మన పూర్వులు దివ్యస్వప్నాలను కాంచినట్టి క్షేత్రమిది. భారతీయులకు తల్లి అయిన పార్వతీదేవి పుట్టింది ఇక్కడే కదా! భారతదేశంలో ప్రతి భక్తుడు, చివరి దశలో వచ్చి మానవజీవిత కావ్యంలోని తుది అధ్యాయాలను పూర్తి చేయకోరుకొనేది, ఈ పవిత్ర క్షేత్రంలోనే. ఈ దివ్య భూమిలోని పర్వతశిఖరాలమీద, ఇందలి గుహాంతరాళాల్లో, వేగంగా దూకుతూ పరుగులిడే ఇక్కడిసెలయేళ్ళ తీరాల్లో, పారమార్థభావాలు సంభావితములయ్యాయి. వాటిలో, అతిస్వల్పాంశం తెలుసుకొన్న, పరదేశీయులు సైతం వాటిని చాలా ప్రవచించారు. అతిసమర్థులైన విమర్శకులు ‘ఆ భావరాజములు అసమాన మహిమాఢ్యము’ లని ప్రవచించారు. నా బాల్యం నుండి, నా జీవితాన్ని ఎక్కడ గడపాలని, ఉవ్విళ్ళూరుతూండే వాడినో, అలాంటి పుణ్యభూమి ఇదే. ఇక్కడనే ఉండిపోవడానికి అనేక పర్యాయాలు నేను ప్రయత్నించడం మీకందరికీ తెలుసు. అలాంటి సమయం రాకపోయినా, ఈ పుణ్యభూమికి దూరంగా విసరివేయబడి, ఎక్కడో పనిచేయవలసిన వాడినైనా, ఎక్కడ మహాఋషులు పవిత్రజీవితం గడిపారో, ఎక్కడ తత్త్వవిద్య ప్రభవించిందో, అలాంటి పర్వతరాజపార్శ్వాలలో ఏదో ఒకచోటనైనా, నా జీవితంలోని చివరి దినాలను గడపాలని గాఢంగా వాంఛిస్తున్నాను. పూర్వం ఉద్దేశించిన విధంగా, నేనిప్పుడు చేయలేనేమో అనిపిస్తోంది. ఆహా! ఆ నిశ్శబ్దత, ఆ అజ్ఞాతవాసం, నాకు అనుగ్రహించబడుగాక, అని ఎంతగానో కోరుకొంటున్నాను. భూలోకంలోవున్న క్షేత్రాలన్నిటిలోను, ఇక్కడే ఈ మహాక్షేత్రంలోనే నా అంత్యదినాలు గడిచిపోవాలని ఆశిస్తూ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను. పరమేశ్వరుడు నా కోరికను మన్నించి అనుగ్రహిస్తాడనే విశ్వాసం నాకుంది.
ఓ పుణ్యక్షేత్రవాసులారా!
పాశ్చాత్యదేశాల్లో, నేను నిర్వహించిన స్వల్పకార్యాన్ని గూర్చి మీరు చాలా ఉదారంగా నన్ను అభినందించినందుకు కృతజ్ఞుణ్ణి. అయినా, పాశ్చాత్యదేశాల్లో గానీ, ప్రాచ్యదేశాల్లోగానీ ఆ విషయాన్ని గూర్చి మాట్లాడే అభిలాష నాకు లేదు. శిఖరం తర్వాత శిఖరంగా, ఈ పర్వతశ్రేణులు నా కళ్ళకు కనిపించడం మొదలవగానే పనిచేయాలనే ఇచ్ఛ, అనేక సంవత్సరాలుగా, నా మెదడులో రేగుతున్న ఆ ఉద్రేకం, శాంతించి పోతున్నట్లు కన్పిస్తోంది. ఇదివరకు నిర్వర్తించినట్టి, ఇకముందు నిర్వహించనున్నట్టి దేన్నిగూర్చి అయినా ప్రసంగించడానికి మారుగా, ఈ హిమాలయాలు, సర్వదా బోధిస్తున్న ఇక్కడి వాతావరణమే ఉద్ఘోషిస్తున్నదీ అయిన, ఆ ఏకైకధర్మం, ఆ వైరాగ్యం, నా మనస్సును ఆవేశిస్తోంది. “సర్వం వస్తుభయాన్వితం భువి నృణాం వైరాగ్య మేవాభయం” (పుడమిలో సమస్తమూ భయంతో కూడివుంది. మానవుని భయరహితుని చేయగలది వైరాగ్యమొక్కటే.) నిజంగా, అలాంటి వైరాగ్యభూమి ఇదే!
ఇప్పుడు మీతో, పూర్తిగా మాట్లాడటానికి నాకు వ్యవధి లేదు; పరిస్థితులుకూడ అనుకూలంగా లేవు. కాబట్టి ఈ హిమాలయ పర్వతాలు, వైరాగ్యానికి నిదర్శనంగా ఉన్నాయనీ, మనం మానవకోటికి బోధించవలసిన ఉత్తమధర్మం వైరాగ్యమే అనీ మాత్రం తెలుపుతూ ముగిస్తున్నాను. మన పూర్వులు తమ చివరి దినాలలో ఇక్కడికి వచ్చేవారు. అదేవిధంగా దశదిశలనుండి మహాత్ములు భవిష్యత్కాలంలో ఈ పర్వత రాజంచే ఆకర్షించబడనున్నారు. అప్పుడు ఆయా సంప్రదాయాల మధ్యవున్న పోరాటాలన్నీ సిద్ధాంతాలలో వున్న విభేదాలన్నీ ఇక జ్ఞప్తికి రావు. నీ మతమనీ, నా మతమనీ సాగించే వాగ్వాదాలు అదృశ్యమైపోతాయి. అప్పుడు సనాతన మతమే నిజానికి ఏకైక మతమనీ, ఆంతర్యంలో ఉన్న పరమాత్మను దర్శించడమే దాని లక్ష్యమనీ, మిగిలిందంతా వ్యర్థప్రలాపమే అనీ అందరూ గ్రహిస్తారు. ఈ సంసారం బూటకాలలో బూటకమని తెలుసుకొని, భగవంతుడు, భగవంతుని సేవ తప్ప మిగిలిందంతా శూన్యమని గ్రహించిన తపోధనులు ఇక్కడికి రానున్నారు.
మిత్రులారా! నా మనస్సులోవున్న ఒక ఉద్దేశాన్నిగూర్చి మీరు ఔదార్యంతో ప్రస్తావించారు. ఈ హిమాలయ పర్వతంలో ఒక మఠాన్ని స్థాపించే విషయమది. అలా ఎందుకు జరగాల్సి ఉందో నేను బాగా చెప్పానని భావిస్తాను. ఈ విశ్వమతాన్ని బోధించడానికి ప్రధానస్థానాలలో ఒకటిగా నేను ఏర్పరచుకొన్న కేంద్రమిదే! ఈ పర్వతాలు మన జాతికి సంబంధించిన అత్యుత్తమ స్మరణీయాంశాలతో సంబంధం కలిగున్నాయి. భారతీయ మతచరిత్రనుండి ఈ హిమాలయాన్ని తొలగిస్తే ఇక మిగిలేది అత్యల్పం. కాబట్టి, ఆ కేంద్రాలలో ఒకటి ఇక్కడ ఉండాలి. తీవ్ర ప్రచారం కోసమే కాదు; అధిక శాంతికోసం, తపస్సుకోసం, వినిర్మలతకోసం కూడ అది ఇక్కడ నెలకొని ఉండాలి. ఎప్పుడో ఆ కోరిక సఫలం కాగలదని నా నమ్మకం. వేరే సమయాల్లో మిమ్మల్ని కలుసుకొని, మీతో మాట్లాడటానికి, ఇంతకన్నా మంచి అవకాశం కలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇప్పటికి మీరు నా పట్ల చూపిన ప్రేమనుగూర్చి మరోసారి, మీకు కృతజ్ఞతను తెలుపుతున్నాను. అది వ్యక్తిగతంగా నాపట్ల కాక, మన మతానికి ప్రతినిధిని కావడంచేత చూపించిన అభిమానమని నేను భావిస్తున్నాను. అది మన హృదయాలను ఎన్నడూ వీడిపోకుండుగాక! మనం ఈ క్షణంలో ఎంత నిర్మలంగా ఉన్నామో, అంత నిర్మలంగా, ఆధ్యాత్మిక విద్యనుగూర్చి మనమిప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నామో అంత ఉత్సాహంతో నిరంతరం ఉండాలి.