(చెన్నపురి, తిరువల్లిక్కేణి సారస్వత సంఘంలో ఇచ్చిన ఉపన్యాసం)
ప్రపంచం సాగిపోతూన్నకొద్దీ, జీవన సమస్య ప్రతి దినమూ, చాలా గంభీరం, విశాలమూ అవుతోంది. వేదాంతధర్మం మొదట దర్శించబడినప్పుడే – ఆ ప్రాచీనకాలంలోనే – జీవనమంతా అభిన్నమనే మహా సత్యం ప్రబోధించబడింది. ప్రపంచాన్నంతా తనతో లాక్కొనిపోకుండా, విశ్వంలో ఒక్క అణువైనా, కదలజాలదు. ప్రపంచమంతా వెన్నంటి రాకుండా, ఏదీ పురోగమనం సాగించలేదు. సంకుచిత దృష్టితో, – అది జాతీయం కానీండి, సాంఘికం కానీండి – ఏ సమస్యా పరిష్కారం కాజాలదని అనుదినం మనకు విశదమవుతూనే ఉంది. ప్రతి సంకల్పం, ప్రపంచమంతటా వ్యాపించేంతగా విశాలం కావాలి! ప్రతి ఉద్యమం, మానవజాతినంతా – జీవకోటినంతాకూడ – తనలో ఇముడ్చుకోజాలేంత వరకు, క్రమాధిక వికాసంపొందాలి. మనదేశం ప్రాచీన కాలంలోలాగా, కొద్ది శతాబ్దాలనుండి పురోగమించకుండా ఉండటానిక్కారణం ఇందువల్ల విశదమవుతోంది. మనం ఇలా భ్రష్టులం కావడానికి కల కారణాల్లో ఒకటి, మన దృక్పథం సంకుచితం కావడంవల్ల మన కార్యాల ఫలవ్యాప్తి పరిమిత మవడం.
ఒకే మహాజాతినుండి రెండు విచిత్రమైన ఉపజాతులుద్బవించాయి. అవి వేర్వేరు పరిస్థితుల్లో, వేర్వేరు వాతావరణాల్లో పడిపోయి, దేనికది తన ప్రత్యేకమార్గంలో జీవిత సమస్యల్ని పరిష్కరించడానికి పూనుకొన్నాయి. ప్రాచీన హిందూజాతి, ప్రాచీన గ్రీకు జాతి, ఈ రెండు ఉపజాతులు. హైందవార్యుడు ఉత్తరాన తుషార కిరీటంలో ఒప్పారు హిమాలయ పర్వతాలు, చుట్టూ ప్రావాహిక సముద్రాల్ని పోలిన మధుర జలపూరితాలైన నదులు, ఎటు చూచినా, దిగంతాలవరకు వ్యాపించి నట్లున్న సాంద్రారణ్యాలు, తనకు అడ్డు నిలువగా, తన దృష్టిని అంతర్ముఖం చేశాడు. నిశిత మేధాశాలి అయిన ఇతడు, తన నాదరించిన మనోహర ప్రకృతి దృశ్యాల ప్రేరణవల్ల, ఆంతరదృష్టి కలవాడు కావడం స్వభావసిద్ధమే! ఈ విధంగా నిజమనః పరిశోధనమే హైందవార్యునికి స్వాభావికమైపోయింది. ఇక గ్రీకు ఆర్యుడైతే, సుందరమైన గ్రీకు ద్వీపరాశి మధ్య ప్రవేశించాడు. అతడాక్రమించిన భూభాగంలో గాంభీర్యానికి మించిన సౌందర్యముంది. వానిచుట్టూ వున్న ప్రకృతి నిరాడంబర సుందరమై నేత్రపర్వంగా ఉంది. కాబట్టి అతని మనస్సు సహజంగా బహిర్ముఖమై, బాహ్యప్రపంచ పరిశీలనకు పూనుకొన్నది. తత్ఫలితంగా, హిందూదేశంలో విశ్లేషణశాస్త్రాలు, గ్రీకుదేశంలో సమ్యక్కరణశాస్త్రాలు ఉద్భవించాయి. హిందువుని బుద్ధి తన విశిష్టమార్గంలో నడచి, మహాద్భుతఫలాన్ని సాధించింది. ప్రస్తుతకాలంలో సైతం, హైందవుని తార్కిక శక్తీ, మేధాశక్తీ సాటిలేనివి. ఏ ఇతరదేశ బాలురకు మన బాలురు తీసిపోరు. వారితో పోటీపడినప్పుడంతా, మనవారే విజయం పొందుతున్నారు. బహుశ భారతదేశాన్ని మహమ్మదీయులు జయించడానికి ఒకటి రెండు శతాబ్దాల పూర్వమే, మనజాతి శౌర్యం నష్టమైపోయి ఉంటుంది. తత్ఫలంగా, మన జాతి విశిష్టత హద్దులు మీరేట్లుగా పెరిగి పతితహేతువయింది. ఆ పతనం భారతదేశంలో, అన్నిటిలో – చిత్రకళలలో, గాన కళలలో గాంభీర్యం తొలగింది. కేవలం అలంకారదృష్టితో కూడిన జిలుగు కూర్పులు బయలుదేరాయి; జాతి స్వతంత్రకల్పనాశక్తి విధ్వంసమై పోయినట్లనిపించింది. గానంలో ప్రాచీన సంస్కృత గాన కళాలక్షణమైన ఆత్మోద్ధారక భావసంపద పోయింది. ప్రతి స్వరమూ, సుస్పష్టంగా, స్వతంత్రమై నిలిచి, అద్భుత సమరస భావాన్ని కల్పన చేయడం అరుదైంది. ప్రతిస్వరం, తన విశిష్ట సౌందర్యాన్ని కోల్పోయింది. ఆధునిక గానమంతా, అర్థవిహీనమైన స్వరసమ్మేళనం; గందరగోళమైన శబ్ద విన్యాసరాశి! గానకళలోని భ్రష్టత్వానికి ఇది ఒక చిహ్నం. మీ ఆదర్శాలలోకూడ స్వతంత్ర భావసంపద అడుగంటి, ఆలంకారికతే ఎక్కువగా కనిపిస్తుంది. మన అభిమాన క్షేత్రమైన మతంలోకూడ, మహాభయంకరమైన పతనమే సంభవించింది. మనం నీరు తాగేటప్పుడు చెంబును కుడిచేత్తో పట్టుకోవాలా? లేక ఎడమచేత్తో పట్టుకోవాలా? అనే ఇలాంటి అప్రధాన సమస్యల్నిగూర్చి తర్కిస్తూ, వందలకొద్దీ సంవత్సరాలు, తమ శక్తిని, బుద్ధిని, కాలాన్ని బూడిదలో పోస్తున్న ఈ చచ్చుజాతి ఇంతకంటే ఏం చేయగలదని మీరాశించగలరు? నేను మిమ్మల్ని తాకవచ్చునా? మీరు నన్ను తాకవచ్చా? అలా తాకితే చేసుకోవలసిన ప్రాయశ్చిత్తమేమి? ఇలాంటి వాదాలతోనూ, వంటింటి విషయాలను గూర్చిన చర్చలతోను, దేశంలోని మహామేధా సంపన్నులు, శతాబ్దాలకొద్దీ కాలాన్ని దుర్వ్యయం చేయడంకంటే, మించిన భ్రష్టత్వం ఇంకేముంటుంది? జీవేశ్వర సంబంధాన్ని గూర్చి ఎన్నడైనా లోకంలో ప్రచారం గావించిన సిద్ధాంతాలలోకంతా ఉత్తమోత్తమం, సూక్ష్మాతిసూక్ష్మం, మహామహిమాఢ్యం అయిన మహాసిద్ధాంతాలకు నిధి అనదగిన వేదాంతం, అడవులపాలై సగం నష్టమైంది; కొద్దిమంది సన్యాసులు ఇందులో కొంత కాపాడారు. ఈ మహాజాతిలోని తక్కినవారంతా, ఒకరినొకరు తాకడం, అన్నవస్త్రాల తీరు, మొదలైన మహాసమస్యల్ని గూర్చి నిర్విరామంగా తర్కించేవారు. మహమ్మదీయ సామ్రాజ్యం మనకు చాలా ఉపకారాలను సమకూర్చిన మాట నిజమే! ప్రపంచంలో, అత్యంత నీచమానవుడు సైతం, అత్యుత్తమ పురుషశ్రేష్ఠునికైనా, ఎప్పుడో ఒకసారి, ఏదో కొంత తాను నేర్పగలిగే ఉంటాడు. కానీ అంతమాత్రంచేత జాతికి బలం చేకూరదు. మహమ్మదీయ సామ్రాజ్య కాలానికి తర్వాత మంచికో, చెడుకో ఆంగ్లేయుల భారతదేశాక్రమణ జరిగింది. ఏ ఆక్రమణమైన అనర్థమే! ఎందుకంటే ఒకరి వశమైపోవడమే అనర్థం కదా? విదేశీయుల పరిపాలన అనర్థమనడానికి సంశయం లేదు. కాని, అనర్థంనుండికూడ ఒక్కొక్కప్పుడు మేలు చేకూరుతూ ఉంటుంది. ఇంగ్లీషువారి విజయం వల్ల గొప్పమేలే చేకూరింది. ఇంగ్లండే కాక యూరప్ నాగరికతలోనూ, సంస్కృతిలోనూ, గ్రీసుదేశ ప్రభావం ప్రకటితమవుతూ ఉంటుంది. అక్కడి ప్రతి భవనం, ప్రతివస్తువు, గ్రీసు సంప్రదాయ ముద్రను ధరించి ఉంటుంది. యూరోపియన్ శాస్త్రాలు, కళలు, గ్రీసు సంప్రదాయకాలే గానీ వేరుకాదు. నేడు, ప్రాచీన గ్రీసు దేశీయుడు, భారతభూమిమీద ప్రాచీన హిందువును కలుసుకోవడానికి వచ్చాడు. ఈ విధంగా విజాతి ప్రభావం నెమ్మదిగా, నిశ్శబ్దంగా, మనలో చొరబడింది. ఇప్పటి మన విశాల దృక్పథానికి, మన పునరుద్ధరణోద్యమాలకు, పైవాని సమష్టిబలమే కారణం. జీవితాన్ని గూర్చిన ఉదారవిశాలభావాలెన్నో మన ఎదుట నిలచాయి. మొట్టమొదట మనం కొంత దిగ్భ్రాంతి పొంది, సంకుచిత మార్గం పట్టజూచినా, క్రమక్రమంగా కొంతకాలానికి ఈ ఉదార ప్రేరణలు, ఈ విశాల జీవితోద్దేశాలు మన ప్రాచీన గ్రంథాల్లోనే ఉన్నాయనీ, అవన్నీ హైందవ మతానుసారంగా ఉన్నవే అనీ గ్రహించి సరైన దారికి వచ్చాం. మన పూర్వుల ప్రధానోద్దేశాలను గూర్చిన గాఢవిమర్శ ఫలితాన్ని ఆచరణలోనికి తేవడమే ఇప్పుడు జరుగుతున్న పని. విశాలభావాలు వహించడం, బహిరంగప్రాంతాల్లో ప్రవేశించడం ఇతరులతో సమ్మేళనం కావడం, సర్వజన సమ్మతంగా వర్తించడం మనకు గమ్యార్థాలు. ఇంతవరకు మనం రానురాను సంకుచిత హృదయులమై అన్యుల సహవాసానికి దూరులమై, మన శాస్త్రాలలో చెప్పబడిన విధానాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ వచ్చాం.
మన మార్గంలో అపాయాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలోనికంతా మనమే మానవులమని తలచే అత్యంత మూఢభావం అందొకటి. భారతదేశంపై నాకెంత ప్రేమవున్నా, నేనెంతటి దేశాభిమానినైనా, మన పూర్వులపట్ల నాకెంతటి పూజ్యభావమున్నాకూడ, ఇతరజాతుల నుండి మనం అనేక విషయాలను నేర్చుకోవలసి వున్నామని నేను చెప్పక తప్పదు. మనం, అందరి పాదాలచెంత కూర్చుండటానికి సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే, ప్రతివాడూ, మనకు గొప్ప పాఠాలను నేర్పగలిగే ఉన్నాడు. ‘నీచజాతి వానినుండీ సుజ్ఞానాన్ని స్వీకరించు. వానికి సేవచేసి పరమార్థాన్ని గ్రహించు–” అని మన స్మృతికర్త మనువు తెలుపుతున్నాడు. మనం నిజంగా మనువు యోగ్యసంతానమైతే, అతని ఆజ్ఞల ననుసరించి నడవాలి! ఐహిక ధర్మాలనుకానీ, పారమార్థిక ధర్మాలనుకానీ, మనకు బోధ చేయగల ఎవరినుండైనా సరే, నేర్చుకోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలి! అట్లయినా మనంకూడ ప్రపంచానికి ఒక మహాధర్మాన్ని బోధించవలసి ఉన్నామనడం మరువరాదు. బయటి ప్రపంచంతో సంబంధంలేకుండా మనకు జరుగదు. అలా జరుగగలదని ఇన్నాళ్ళూ మూఢులమై భావించాం. అందుకు ప్రాయశ్చిత్తంగా, వేయేళ్ళు బానిసతనం అనుభవించాం. మనం వెలుపలికిపోయి మన అనుభవాలను ఇతరుల అనుభవాలతో పోల్చి చూచుకొనకపోవడం, మన చుట్టూ ఏమి జరుగుతోందో గుర్తించకుండా ఉండడం, మన బుద్ధి భ్రష్టమై పోవడానికి గొప్పకారణం. అందుకు శిక్షననుభవించాం. ఇంక ఎన్నడూ అలా చేయమని లెంపలేసికొందాం. భారతీయులు దేశాన్ని దాటి పోగూడదనే ఇట్టి మూఢవిశ్వాసాలు తెలివిలేని చిన్నపిల్లల లక్షణాలు. నెత్తిమీద మొట్టి అలాటివాటిని తొలగించాలి! మీరు ఎంతెంతగా దేశాన్ని దాటిపోయి ప్రపంచంలోని ఇతర జాతులమధ్య సంచారం చేస్తారో, అంతంతగా మీకూ, మీ దేశానికీ క్షేమం కలుగుతుంది. కొన్ని శతాబ్దాలకు పూర్వమే ఇలా మీరు చేసి ఉంటే, మీపై రాజ్యం చేయాలని ఉబలాటపడే ప్రతి జాతికీ అడుగులకు మడుగులొత్తే దుర్గతి మీకు తప్పివుండేది! చైతన్యంయొక్క ప్రధాన చిహ్నం వికాసం. మీరు సజీవులై ఉండదలిస్తే వికాసం పొందాలి! వికాసం పొందడం మానితే మరుక్షణమే మృత్యువు మిమ్మల్ని మింగేస్తుంది. మీరు ప్రేమతో ప్రస్తావించినట్లు, నేను అమెరికాకు, యూరప్నకూ వెళ్ళాను. జాతీయజీవన పునరుద్ధరణకూ, వికాసానికీ అదే మొదటి చిహ్నం కావడంవల్ల నేను వెళ్ళవలసివచ్చింది. ఈ జాతీయజీవన పునర్వికాసం, ఆంతరంగిక వికాసం, నన్ను విదేశాలకు నెట్టుకొనిపోయాయి. ఇంకా, ఇదేవిధంగా వేలకొద్దీ మందిని నెట్టుకొనిపోతుంది. ఈ జాతి సజీవమై నిలవడానికలా జరగవలసిందే! ఈ నూతనచైతన్యం జాతీయజీవన పునరుద్దరణ చిహ్నాలలో అతి ప్రధానమైంది. ఈ నూతన చైతన్యవికాసం వల్లనే, మానవజాతి సమిష్టి జ్ఞానరాశికి, మన వంతుగా ఇవ్వవలసివున్న భాగం, సామాన్య ప్రపంచోద్ధరణకు, మనం అర్పించవలసివున్న కానుక, చెల్లించబడుతున్నాయి. ఇదొక క్రొత్త సంఘటన కాదు. యుగయుగాంతరాలనుండి భారతీయులు కూపస్థమండూకాల లాగ, ఈ దేశం నాలుగు హద్దుల లోపలనే సదా ముడుచుకొని కూర్చుని ఉన్నారని, మీలో ఎవరైనా భావిస్తే అది చాలా పొరపాటు. అలా మీరు భావిస్తే, మీ ప్రాచీనగ్రంథాలను మీరు చదవలేదన్నమాట! ఏ జాతి అయినా, సజీవమై ఉండాలంటే, తనకు కలదాన్ని ఇతరులకిచ్చి తీరాలి! నీవు ప్రాణదానం చేసినప్పుడు నీ ప్రాణాలు నిలుస్తాయి. నీవు గ్రహిస్తే, దానికి బదులుగా ఇతరులకు ఇచ్చి తీరాలి! తప్పదు. ఇన్ని వేల సంవత్సరాలనుండి మనం సజీవులమై ఉండగలిగామంటే – తెలియనివారు ఎలా అభిప్రాయపడినా, మనం ప్రపంచానికి ఎప్పుడూ ఇస్తూనేవున్నాం కనుకే!
భారతదేశం చేసేది మత దానం! తత్త్వశాస్త్ర దానం! పారమార్థిక దానం! యుద్ధభటులు తనముందు నడుస్తూ తన మార్గాన్ని నిరాటంకం చేయవలసిన ఆవశ్యకత మతానికి లేదు. జ్ఞానం, వేదాంతం, రక్తప్రవాహాలపైని తేలుతూపోయే అవసరం లేదు. జ్ఞానం, వేదాంతం నెత్తురోడుస్తున్న నరశరీరాలపై ఇనుపపాదాలతో నడిచేవి కావు. దౌర్జన్యంతో అవి గమనాన్ని సాగించవు! అవి, శాంతి ప్రేమలనే రెక్కలపై మెల్లగా, చల్లగా, తేలియాడుతూ వస్తాయి. ఎప్పుడూ అలాగే జరుగుతూ వచ్చింది. కాబట్టి మనం మరల ఇవ్వవలసి ఉన్నాం. “హిందువులైన మీరు చేసిందేముంది? ఒక్క జాతినైనా, ఎన్నడుగానీ జయించింది లేదే?” అని లండన్ నగరంలో ఒక తరుణీమణి నన్నడిగింది. శూరుడు, వీరుడు, క్షత్రియుడు అయిన ఆంగ్లేయుని దృక్పథంనుండి చూస్తే ఆ మాట నిజమే! ఒక నరుడు ఇంకొకని మీద సాధించిన విజయం మహా ఘనకార్యమే! వాని దృష్టిలో అది సత్యమే! కాని మన దృష్టికి అది అందుకు వ్యతిరేకమై కనిపిస్తుంది. హిందుదేశం గొప్పతనానికి కారణమేమి? అని నన్ను నేను ప్రశ్నించుకొన్నప్పుడు, మనమెన్నడూ ఇతరులపై పడి జయించకుండటమే అని నాకు సమాధానం తోస్తుంది. అదే మన ఘనత! మన మతం ఇతర మతాలను ఎన్నడూ లోబరచుకొనలేదని ‘వివేకవంతులు’ సైతం మన మతాన్ని నిరసిస్తూండటం మీరు రోజు వింటూవుంటారు. కానీ, ఇతర మతాలకంటె మన మతమే శ్రేష్టతరమైనదనడానికి ఇదే కారణమని నా మనస్సుకు తోస్తోంది. మన మతం ఇతర మతాలను జయించాలనుకోదు. అది రక్తపాతం చేయదు! అందరికి దీవెనలను, శాంతిని, ప్రేమను, సానుభూతిని తెలుపువాక్కులే దాని ముఖం నుండి సదా వెలువడుతూంటాయి. ఇక్కడ మాత్రమే అద్భుత పరసహనాదర్శం మొట్టమొదటగా బోధించబడింది. ఇక్కడ మాత్రమే – సహనం, సానుభూతి అనే, మహాధర్మాలు ఆచరణలో పెట్టబడ్డాయి. ఇతర దేశాలలో అవి సిద్ధాంతరూపంలో మాత్రమే నిలిచిపోయాయి. ఈ దేశంలోనే, ఈ ఒక్క దేశంలోనే, హిందువులు మహమ్మదీయులకోసం మసీదులను, క్రైస్తవులకోసం చర్చీలను నిర్మించి ఇచ్చారు. కాబట్టి మన సందేశం ఎన్నోసార్లు ప్రపంచానికి తెలియజెప్పామని మీరు తెలుసుకోగలరు. కాని ఇది నెమ్మదిగా, నిశ్శబ్దంగా, నిరాడంబరంగా జరిగింది. మన స్వభావానికి, యోగ్యతకు తగినట్లే ఈ ధర్మప్రచారంకూడ సాగింది. మన ప్రత్యేక లక్షణం శాంతం, మౌనం. వీటి వెనుక మహాద్భుత శక్తి ఉంది. కానీ అది దౌర్జన్యరూపం ధరించదు. అది ఎప్పుడూ భారతీయ సంకల్పంయొక్క వశీకరణశక్తి రూపంలో నిశ్శబ్దంగా వ్యాపిస్తుంది. విదేశీయుడు మన వాఙ్మయాన్ని చదువబూనితే, మొట్టమొదట అతనికి వెగటు కలుగుతుంది. తక్షణమే ఉఱ్ఱూతలూపి, ఉద్రేకాన్ని కల్పించి నెట్టుకొనిపోయే లక్షణాలు మన వాఙ్మయంలో కనిపించవు. యూరోపియన్ల దుఃఖాంత నాటకాలను, మన దుఃఖాంత నాటకాలతో పోల్చిచూడండి. వారివి అతిప్రవృత్తితో నిండి, క్షణకాలంలో ఉద్రేకం కలిగిస్తాయి. కానీ, ఆ ఉద్రేకం అణగిపోగానే ప్రతిక్రియ ప్రారంభమవుతుంది; మీ మనస్సులనుండి అంతా అదృశ్యమవుతుంది; అంతా కడిగి వేసినట్లవుతుంది. భారతీయుల దుఃఖాంత నాటకాలు, వశీకరణ మాంత్రికుని ప్రభావంలాగా నిశ్చలంగా, నిశ్శబ్దంగా, నిగూఢంగా పని చేస్తాయి. చదివిన కొద్దీ అవి మిమ్మల్ని సమ్మోహితుల్ని చేస్తాయి. మీరు కదలలేరు. బందీలైపోతారు! మన వాఙ్మయాన్ని తాకడానికి సాహసించిన వారంతా దానికి వశమైపోతారు. ఎప్పుడూ బందీగా ఉండిపోతారు.
కన్నులకు కనబడక, చెవులకు వినబడక, మెల్లమెల్లగా రాలుతూ, అత్యంత సుందరమైన లేతగులాబీలను పుష్పింపజేసే కోమల నీహారవర్షం లాగా, ప్రపంచ విజ్ఞానానికి భారతదేశ దానం నిరాడంబరంగా పనిచేస్తుంది; నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా, – కానీ సర్వసమర్థంగా లోక విజ్ఞానాన్నంతా మార్చేసింది. అది ఎప్పుడలా చేసిందో ఎవ్వరికీ తెలీదు. “భారతదేశంలో గ్రంథకర్తల పేర్లను తెలిసికోవడం చాలా కష్టం” అని ఒకరు నాతో అన్నారు. “అదే భారతీయుని ఉద్దేశ్యం” అని నేనన్నాను. ప్రాచీన భారతీయ గ్రంథకర్తలు ఆధునికులలాగా తాము ప్రకటించే విషయాలలో నూటికి తొంబయివంతున ఇతర గ్రంథాలనుండి దొంగలిస్తూ, పైగా సిగ్గులేక ‘ఈ భావాలన్నీ నావే’ – అని ఉపోద్ఘాతాలు వ్రాసికొంటూండేవారు కారు. ఆ మహామేధాసంపన్నులు మానవజాతి హృదయాలలో అద్భుత పరివర్తనం కల్పించే గ్రంథాలను వ్రాసి, తమ పేరునైనా అందులో ఉదాహరించక తమ పుస్తకాలను మాత్రం, భవిష్యత్సంతానానికి సంక్రమింపజేసి నిరాడంబరంగా మరణించడంతో తృప్తిపడ్డారు. మన తత్త్వశాస్త్రాలను రచించిన గ్రంథకర్త లెవ్వరో ఎవరికి తెలుసు? మన పురాణాలను వ్రాసిన వారెవ్వరో ఎవరికెరుక? వారందరూ వ్యాసుడని కానీ; కపిలుడని కానీ, ఏదో ఒక సామాన్యనామంతో వ్యవహరించారు. సత్యంగా వీరు శ్రీకృష్ణుని బిడ్డలు! వారు నిజంగా గీతానుష్ఠానపరులు! “కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన!” (కర్మ చేయడానికే నీకు అధికారముంది కానీ, దాని ఫలానికి నీకు అధికారం లేదు!) అనే సూత్రాన్ని అనుసరించి వారు వర్తించారు.
ఈ విధంగా, భారతదేశ ప్రభావం ప్రపంచంపై పనిచేస్తోంది. కాని దానికొక సదుపాయం అవసరం. వర్తకపు సంబారాలలాగానే, భావాలు కూడ ఎవరో ఒకరు సిద్ధంచేసిన మార్గాలవెంట మాత్రమే వ్యాపించగలవు. ఒకచోటి నుండి మరొకచోటికి ప్రయాణంచేయాలంటే భావాలకుకూడ మార్గాలు సిద్ధమై ఉండాలి! ప్రపంచంలోని ఒక మహాజాతి విజృంభించి, దిగ్విజయంగాంచి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను ఒక్కచోట జతకూర్చినపుడంతా, ఆ మార్గాల వెంట భారతీయతత్త్వవిద్య ప్రవహించి ప్రతి జాతి రక్తనాళాలలోనికి ప్రవేశిస్తూ వచ్చింది. బౌద్ధమతం అవతరించడానికి ముందే భారత తత్త్వవిద్య విశ్వవ్యాప్తమవుతోందనడానికి అనేక నిదర్శనాలు కన్పిస్తున్నాయి. బౌద్ధమతవ్యాప్తికి పూర్వమే చీనాలోనికి, పర్ష్యాలోకి, తూర్పుసముద్రంలోని ద్వీపగణాలలోకి, వేదాంతం వ్యాపించింది. గ్రీకుల ధీశక్తి ప్రాక్ప్రపంచాన్నంతా ఒక్కటిగా సమ్మేళనం గావించినప్పుడు, భారతీయ వేదాంతంకూడ వ్యాపించింది. తమ నాగరికతనుగూర్చి క్రైస్తవులు ఎంతగా డంబాలు కొట్టుకొన్నా, వారి మతం భారతీయ తత్త్వశాస్త్రాలలోని స్వల్పాంశాల సముదాయం మాత్రమే! బౌద్ధమతం చాలా గొప్పదేకానీ, అది మన మతంలోనుండి పుట్టి, దానికెదురు తిరిగి, విడివడిన బిడ్డ! క్రైస్తవమతం మన మతాన్ని అనుకరించే ఒక అతుకుల బొంత! ఈ చక్రగతి మళ్ళీ ప్రారంభమైంది. ప్రపంచంలోని ఆయా భాగాలను సమ్మేళనంచేస్తూ ఆంగ్ల సామ్రాజ్యాధికారం ప్రబలుతోంది. ఇంగ్లీషువారి బాటలు పూర్వపు రోమనుల బాటలలాగా, నేలమీద ప్రాకులాడటంతో తృప్తిపడక, మహాసముద్రాల్లో సైతం అన్నివైపులకు, నాగలిచాళ్ళలాగా అనుదినం వ్యాపిస్తున్నాయి. ఒక మహాసముద్రంనుండి, వేరొక మహాసముద్రానికి ఇంగ్లాండు బాటలు నిరాటంకంగా పరుగులిడుతున్నాయి. ప్రపంచంలోని ప్రతిదేశం, ప్రతి ఇతరదేశంతో లంకె పెట్టుకొంటుంది. క్రొత్త వార్తాహరునిలాగా, విద్యుచ్ఛక్తి మహాద్భుత వ్యాపారాన్ని నడుపుతోంది. ఈ పరిస్థితులన్నిటివల్ల భారతదేశం పునర్జీవాన్ని పొంది ప్రపంచ పురోభివృద్ధికీ, నాగరికతా వ్యాప్తికీ, తనవంతు దోహదం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రకృతి నన్ను నెట్టుకొని పోయిందేమో అన్నట్లుగా, నేను ఇంగ్లాండు, అమెరికాలకు పోయి మతప్రచారం సాగించడం దాని ఫలితమే! భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక నాయకత్వం వహించే సమయం వచ్చిందని మనలోని ప్రతివారూ గ్రహించాలి! చాలా అనుకూలంగా ఉండే ఈ వాతావరణంలో భారతీయభావరాశి, వేదాంతపరంగా, పారమార్థికంగా, మరొకసారి బయలుదేరి ప్రపంచాన్ని జయించవలసివుంది. కాబట్టి, మనకిప్పుడేర్పడిన సమస్య దినాలు గడిచేకొద్దీ బ్రహ్మాండాకృతిని ధరిస్తోంది. మన దేశాన్నిమాత్రం పునరుద్ధరించుకొంటే చాలనుకోవడం తగదు. అదొక చిన్న విషయం. నా బుద్ధికి ఊహాగమనం చేయడం అలవాటు. హైందవజాతి ప్రపంచాన్నంతా జయించాలని నా సంకల్పం!
ప్రపంచంలో అనేక దిగ్విజయాలు సాగించిన గొప్పగొప్ప జాతులున్నాయి. మనంకూడ ఒకప్పుడు విజయం సాధించిన వాళ్ళమే! మన విజయచరిత్ర మత విషయకంగా, ఆధ్యాత్మిక విషయకంగా, అని భారతీయ మహాచక్రవర్తి అశోకుడు అభివర్ణించాడు. మళ్ళీ ఇంకోసారి భారతభూమి ప్రపంచాన్ని జయించవలసి ఉంది. ఇదే నా జీవిత స్వప్నం! మీరు కూడ మీ మనస్సులలో అదే కలకంటూ, ఆ కలను ప్రత్యక్షానుభవానికి తెచ్చుకోవడానికై అహోరాత్రాలు నిర్విరామంగా కృషిచేయాలి! “ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి. ఆ తర్వాత రచ్చలకెక్కి ‘రాచకార్యాలు’ నిర్వహించవచ్చు–” అని ఎవరైనా మీతో అనవచ్చు. కాని, ఒక్క విషయం మీకు స్పష్టంగా చెబుతున్నాను. మీ మంచి మీరు చూసుకోవడంకంటె, ఇతరుల మంచికై కృషిచేయడం వెయ్యిరెట్లు పవిత్రకార్యం. సముద్రాలను సైతం దాటిపోయి వేదాంతభావాలను విదేశభాషలలో ప్రచారం చేస్తూ, అక్కడి ప్రజలకు సేవచేయడమే, మీకు మీరు చేసుకోగల ఉత్తమోత్తమ సాహాయ్యం. ఇతర దేశాలను మీ తత్త్వవిద్యలతో, విజ్ఞానవంతంగా చేయడానికై మీరు చేసే ప్రయత్నం, మీ దేశానికి ఎంతటి ఉపకారం చేయగలదో, ఈ సభే రుజువు చేస్తోంది. నా బోధలు భారతదేశంకోసం మాత్రమే అని హద్దు పెట్టుకొని నేను ఇంట కూర్చుంటే, నేను ఇంగ్లాండు అమెరికాలకు పోయిరావడటంవల్ల ఈ దేశానికి కలిగిన లాభాలలో, పాతిక భాగమైనా, కలిగివుండేది కాదు. మనకిప్పుడు పరమగమ్యమిదే! భారతదేశం ప్రపంచాన్నంతా జయించాలి! మీలో ప్రతివాడూ అందుకోసం సిద్ధపడాలి. ప్రపంచ విజయంతప్ప, అంతకు తక్కువ మరేదీ మనకక్కరలేదు. అందుకోసం మనమందరం సన్నద్ధులం కావాలి! నరాలు తెగేలా పెనగులాడాలి! విదేశీయులువచ్చి తమ సేనలతో మన దేశాన్ని ముంచేసినా మీరు లక్ష్యపెట్టొద్దు. భారతపుత్రులారా! లెండు! మీ ఆధ్యాత్మికతత్త్వంతో ప్రపంచాన్ని జయించండి! “ద్వేషాన్ని ప్రేమ జయించగలదు. ద్వేషమే ద్వేషాన్ని జయించజాలదు!” అనే మాట మొట్టమొదట ఈ భారతభూమిలోనే కదా ప్రకటించబడింది? నాస్తికత, దాని అనర్థాలు నాస్తికవాదం చేత ఎన్నడూ జయించబడలేవు. సేనలను సేనలతో జయించబూనితే అవి పెరిగిపోయి మానవజాతులను పశువులమందలుగా మార్చేస్తాయి. పాశ్చాత్య ప్రపంచాన్ని వేదాంతమే జయించాలి! తమ జాతులు సురక్షితంగా ఉండటానికి తమకు కావలసింది పారమార్థికతయే అని వారు నెమ్మది నెమ్మదిగా గ్రహిస్తున్నారు. వారు దాని కోసమై ఎదురుచూస్తున్నారు. ఆతురపడుతున్నారు. అది ఎక్కడినుండి వస్తుంది? భారతమహర్షుల సందేశాన్ని స్వీకరించి ప్రపంచంలోని ప్రతిదేశానికి వెళ్ళడానికి సంసిద్ధులుగా ఉన్న పురుషులెక్కడున్నారు? అలాంటి ధీరహృదయులు ధర్మప్రచారంలో తోడ్పడటానికి కావాలి! అలాంటసాహసవంతులైన ప్రచారకులు పరదేశాలకు పోయి, ఉత్తమవేదాంత ధర్మాలను వెదజల్లాలి! ప్రపంచానికి వేదాంత బోధ అత్యావశ్యకంగా ఉంది. అది లేకపోతే ప్రపంచం వినాశం చెందుతుంది. పాశ్చాత్య ప్రపంచమంతా నేడో, రేపో భగ్గుమని మంటలు వెలిగ్రక్కనున్న అగ్నిపర్వతముఖంలో ఉంది. రేపైనా అది పటాపంచలై పోగలదు. వారు ప్రపంచపు మారుమూలలకు సైతం వెళ్ళి గాలించారు. ఎక్కడా వారికి శాంతి చిక్కలేదు. సౌఖ్యాలను, భోగాలను పరిపూర్ణంగా అనుభవించి చూచి, అంతా బూటకమని చివరికి గ్రహించారు. భారతీయ వేదాంతాన్ని పాశ్చాత్య హృదయాల్లో గాఢంగా నాటుకొనేలా ప్రచారం చేయడానికి ఇదే మంచితరుణం. కాబట్టి, చెన్నపురి యువకులారా! ఈ మాటను జ్ఞాపకముంచుకోండని మిమ్మల్ని మరీమరీ కోరుతున్నాను. మనం దేశదేశాలకు వెళ్ళాలి! మన వేదాంతంతో, తత్త్వశాస్త్రంతో, లోకాన్ని జయించాలి. ఇక మార్గాంతరం లేదు. మనం ఆ పని చేసితీరాలి. లేదా చావాలి! మన జాతీయజీవనం నిలవడానికి, అది ఉజ్జీవమై, సత్త్వమయమై విరాజిల్లడానికి, భారతీయ వేదాంతంతో లోకాన్ని జయించడమే ఏకైకమార్గం!
వేదాంతవిద్యతో ప్రపంచాన్ని జయించడం అంటే, ఉజ్జీవన హేతువులైన ధర్మాలను ప్రచారం చేయడమనే నా అభిప్రాయం కానీ, అనేక శతాబ్దాలనుండి మనం పట్టుకొని ఊగులాడుతున్న మూర్ఖాచారాలన్నిటినీ ప్రచారం చేయడం అని కాదు. వీటిని ఇక్కడే పెరికేసి కట్టకట్టి ఆవల పారవేయాలి! అప్పుడుగాని వాటికి శాశ్వత వినాశం చేకూరదు. ఇవే మన జాతి పతనానికి కారణాలయ్యాయి. ఇవే మన మెదడును పాడుచేశాయి. అలాటి మెదడు ఉన్నతమైన గంభీరభావాలను సంకల్పించజాలదు; దానికి స్వతంత్ర యోచనాశక్తి ఉండదు. అది నిర్వీర్యమై, మతం పేరిట చెల్లుబడి అవుతున్న నానావిధ క్షుద్రమూర్ఖ భావాలతో కలుషితమై ఉంటుంది. ఈ మెదడును గూర్చి మనం కొంత జాగ్రత్త తీసుకోవాలి! ఇక్కడ భారత దేశంలో, అపాయాలనేకం మనకంటి ఎదుట కనిపిస్తున్నాయి. శుద్ధ నాస్తిక వాదం ఒక పక్షంలో! క్షుద్ర మూర్ఖాచారనిరతి రెండవ పక్షాన! ఈ రెండు తిరుగలి రాళ్ళమధ్య పడకుండ మనం తప్పించుకోవలసి ఉంది. పాశ్చాత్య విజ్ఞానమనే మద్యం త్రాగిన కైపుతో తనకు అంతా తెలిసిపోయిందనే ఘనుడు నేడు బయలుదేరాడు. ప్రాచీన ఋషుల పేర్లు విన్నంతనే అతనికి నవ్వొస్తుంది. హిందూవిజ్ఞానమంతా వాని దృష్టిలో పనికిరాని చెత్త! తత్త్వ సిద్ధాంతాలు పసిపిల్లల పిచ్చికూతలు! మతధర్మాలు బుద్ధిహీనుల వెర్రి అలవాట్లు. ఇక రెండవ పక్షాన అతివాదంచేస్తూ ఇతరుల పొడగిట్టని పండితుడున్నాడు. ఆయన ప్రతిశకునానికి, బండెడు వ్యాఖ్యానాలు వ్రాస్తూకూర్చుంటాడు. తన శాఖాసంప్రదాయానికి, తన ఇష్టదేవతలకు, తన గ్రామసంబంధమైన ప్రతిమూర్ఖాచారానికీ, తత్త్వసిద్ధాంతాలను, వేదాంతధర్మాలను, ఇంకా ఏవేవో క్రోడీకరిస్తూ ఉంటాడు. రామ! రామ! ప్రతి క్షుద్ర గ్రామాచారం వానికి వైదికధర్మంగానే గోచరిస్తుంది. అతని అభిప్రాయంలో దాని నిర్వహణపైనే జాతీయజీవనమంతా ఆధారపడి ఉన్నట్లుంటుంది. ఈ రెండు పక్షాలనుగూర్చి, మీరు అతిజాగరూకతతో మెలగాలి! మీరందరూ నాస్తికవాదులైపోయినా నా కిష్టమేకానీ, మూర్ఖాచారాలతో వెర్రివాళ్ళు కావడంమాత్రం తగదు. ఎందుకంటే నాస్తికునిలో చైతన్యం ఉంటుంది. వానినొక విధంగా సవరించవచ్చు. కానీ మూర్ఖావేశం పట్టుబడిందా, మెదడు ధ్వంసమైపోయినట్లే! అదిపోతే జీవితం నాశనమైనట్లే! ఈ రెండింటినుండి జాగ్రత్తగా తప్పించుకోండి. ధైర్యవంతులు, సాహసవంతులు, మనకిప్పుడవసరం. రక్తంలో జవం, నరాల్లో సత్త్వం కావాలి! ఇనుమును పోలిన కండరాలు, ఉక్కులాంటి నరాలు కావాలేకానీ, నిలకడలేక ఊర్కే జారిపోయే పిచ్చి ఊహలెందుకు, తగులబెట్టడానికా? రహస్యమనేది ఉండకూడదు. సత్యమైన మతంలో మర్మముండదు. వేదాల్లోకానీ, వేదాంతంలోగానీ, సంహితలలోకానీ, పురాణాలలోకానీ, ఏమైనా దాపరికం ఉందా? పూర్వకాలం ఋషులు తమ మతాన్ని ప్రచారం చేయడానికై ఏమైనా రహస్య సంఘాలను నెలకొల్పారా? తమ మహాధర్మాలను మానవకోటికి అందించేటప్పుడు ఎలాంటి హస్తలాఘవ మర్మాలనుకానీ ఉపయోగించినట్లు ఎక్కడైనా వ్రాశారా? రహస్యప్రచారం, మూఢవిశ్వాసం దుర్బలతకు చిహ్నాలు! పతనానికి, మరణానికి చిహ్నాలు! కాబట్టి, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి! ధీరులై మీ కాళ్ళమీద మీరు నిలబడాలి! మన వేదాంతంలో, అత్యద్భుత విషయాలు ఉన్నాయన్నమాట సత్యం! మన పరిమిత భావప్రమాణాన్నిబట్టి, వానిని అలౌకిక విషయాలని మనం అనొచ్చు. కానీ వానిలో ఒక్కదానిలోకూడ నిగూఢత, మర్మం, రహస్యం ఉన్నవని చెప్పజాలం. మతధర్మాలు రహస్యమైనవి అనికానీ, హిమాలయపర్వతశిఖరాలపై చేరిన రహస్య సంఘాల సొత్తనిగానీ, ఈ దేశంలో ముందెన్నడూ చెప్పలేదు. నేను హిమాలయపర్వతాలకు వెళ్ళాను. మీరు పోలేదు. అవి ఇక్కడికి చాలా వందల మైళ్ళ దూరం. నేను సన్న్యాసిని. గడచిన పధ్నాలుగు సంవత్సరాల నుండి కాలి నడకలో తిరుగుతున్నాను. ఈ రహస్య సంఘాలు ఎక్కడా లేవు. ఈ పిచ్చినమ్మకాలు పెట్టుకోకండి! అంతకన్న మీరు కేవలం నాస్తికులై పోవడమే మీకూ, మీ జాతికీ క్షేమం. అపుడు మీ బలం నిలిచి ఉంటుంది. కాని ఇట్టివారివల్ల మీకు లభించేది భ్రష్టత్వం, మరణం మాత్రమే! బుద్ధిపాటవం కలవారు ఈ మూఢవిశ్వాసాలతో కాలంగడపడం, అసహ్యమైన పిచ్చినమ్మకాలను సమర్థించడంకోసం, అంతరార్థాలు కల్పిస్తూ, వృథాకాలయాపన చేయడం, మానవజాతికే అవమానం! ధైర్యం వహించండి! ప్రతిదాన్నీ ఆ విధంగా సమర్థించడానికై ప్రయత్నించకండి! మనలో చాలా మూఢాచారాలున్నమాట నిజమే! మన శరీరం మీద పొడమచ్చలు పడ్డాయి; పుండ్లు ఉన్నాయి. వీటిని రూపుమాపుకోవాలి! శస్త్రచికిత్స చేసుకోవాలి! వాటిని పూర్తిగా నిర్మూలం కావించాలి. కాని, ఇవి మన మతాన్ని, మన జాతీయజీవనాన్ని, మన ఆధ్యాత్మికతను ధ్వంసం చేసేవి కావు. ప్రతి సత్యధర్మసూత్రం, సురక్షితంగానే ఉంటుంది. ఈ పొడమచ్ఛలు ఎంత త్వరగా తొలగించబడతాయో, అంతత్వరగా సత్యధర్మ సిద్ధాంతాలు, అధిక తేజస్సుతో ప్రకాశించగలవు. వాటినే అంటిపెట్టుకొని ఉండండి!
ప్రతి మతంవారు, తమ మతమే విశ్వజనీనమని వాదిస్తారు. విశ్వజనీన మతం ఎన్నటికీ కలుగదని నా భావం. ఒకవేళ అలాంటి మతం ఉంటే, మన సనాతనమతం ఒక్కటి మాత్రమే అలాటిదని చెప్పడానికి కొంత వీలుంది. మరే మతానికి అటువంటి అవకాశంలేదు. ఎందుకంటే, తక్కిన మతాలన్నీ ఎవరో ఒక పురుషుని మీదగానీ, పురుషులమీదగానీ ఆధారపడి పుట్టాయి. అవన్నీ, చారిత్రక పురుషుడని ఆ మతస్థులు చెప్పే ఒకానొక పురుషుని జీవితంచుట్టూ అల్లబడ్డాయి. వారు, తమ మతానికి ఏది బలమిస్తుందని భావిస్తున్నారో, నిజంగా అదే దాని దౌర్బల్యం! ఎందుకంటే ఆ పురుషుని గూర్చిన చారిత్రకత సత్యంకాదని మీరు రుజువు చేశారో, ఆ మత నిర్మాణమంతా నేలకూలిపోతుంది. ఈ గొప్పగొప్ప మత నిర్మాతల జీవితాంశాలలో సగమైనా చారిత్రకంగా సత్యంకావని రుజువైంది. తక్కిన సగం సంశయగ్రస్తమై ఊగులాడుతోంది. అందువల్ల, ఆ మతకర్తల పలుకులే ఆధారంగాగల, మతధర్మాలన్నీ రూపుమాసి, గాలిలో కలసిపోతున్నాయి. మనకూ పురుషవరేణ్యులెందరో ఉన్నప్పటికీ, మన మతధర్మాలు వారిపై ఆధారపడినవి కావు. శ్రీకృష్ణుని మహిమ ఆయన వేదాంతబోధ చేయడంలో గొప్పవాడు కావడంవల్లనే కలిగింది కానీ వ్యక్తిత్వాన శ్రీకృష్ణుని వ్యక్తిత్వం వల్ల కాదు. లేకపోతే, బుద్ధుని పేరులాగానే కృష్ణుని పేరుకూడ ఈ దేశంలో క్రమక్రమంగా మాసిపోయి ఉండేది. మనం భక్తి గౌరవాలు చూపేది, సదాధర్మసిద్ధాంతాలకే కానీ, నరులకు కాదు. నరులు మూర్తిమంతాలైన సిద్ధాంతాలుగా మాత్రమే, అంటే ఆ సిద్ధాంతాలకు నిదర్శనాలుగా మాత్రమే ఆదరించబడుతున్నారు. సిద్ధాంతాలు సుస్థిరంగా ఉంటే, ఇలాంటి నరులనేకులు వేలకొద్దీ, లక్షలకొద్దీ రాగలరు! ధర్మ సిద్ధాంతం సురక్షితమై నిలిస్తే, బుద్ధునిలాంటి పురుషులు వందలకొద్దీ, వేలకొద్దీ పుట్టుకొని రాగలరు! కాని సిద్ధాంతం ధ్వంసమై, మరపున పడిపోయి, జాతీయ జీవితమంతా, ఎవరో ఒక ‘చారిత్రక పురుషుని’ చుట్టూ అల్లుకొని ఉండాలని చూస్తే ఆ మతానికి వినాశం తప్పదు. మనుషులపై ఆధారపడక, సిద్ధాంతాలపై మాత్రమే ఆధారపడి ఉండే మతం, మనదొక్కటే! అలాగని పురుషులకు అవకాశం లేకపోలేదు. లక్షలకొద్దీ పురుషులకు అవకాశం ఉంది. కానీ అలాటి వారిలో, ప్రతివారూ, ఆ ధర్మసూత్రాలకు నిదర్శనరూపంగా ఉండాలి! ఈ విషయాన్ని మనం మరువతగదు. మన సిద్ధాంతాలన్నీ సురక్షితంగా ఉన్నాయి. వానిలో ప్రతిదానిని చెక్కుచెదరకుండా కాపాడి, కాలగతిలోవచ్చు దుమ్ముధూళి చేరకుండా, శ్రద్ధ తీసుకోవడం మన కర్తవ్యం. మన జాతికి మరల మరల అధోగతిపట్టినా, వేదాంతధర్మాలు ఎన్నడుగానీ కళంకితాలు కాకుండా, అలాగే నిలిచి ఉండటం అబ్బురమైన విషయమే! ఎంతటి దుష్టుడుకూడ వాటిమీద దుమ్మెత్తి పోయడానికి సాహసించలేదు. ప్రపంచం అంతటిలో చక్కగా కాపాడబడిన ధర్మశాస్త్రాలు మనవి మాత్రమే! ఇతరుల గ్రంథాలతో పోల్చిచూస్తే, మన గ్రంథాల్లోని ధర్మోపదేశాల సారాన్ని నాశనం చేయడానికి కానీ, వాక్యాలు తికమకలు చేయడంగానీ తటస్థించలేదనే చెప్పవచ్చు. మానవుని బుద్ధిని పరమప్రాప్యమైన ఆదర్శం వైపునకు నడుపుతూ మొదట ఎలా ఉండేవో అవి నేటికీ అలాగే నిలిచివున్నాయి.
వైదికసూత్రాలకు వేర్వేరు భాష్యకర్తలు, వేర్వేరు అర్థాలను వ్రాశారు. ఆ అర్థాలను గొప్పగొప్ప ప్రబోధకులు ప్రచారం చేశారు. వాటిని ఆధారంగా చేసుకొని అనేక శాఖాసంప్రదాయాలు సృజించబడ్డాయి. వేదాలలో పరస్పర విరుద్ధాలై కన్పించే భావాలనేకం ఉన్నాయి. పూర్తిగా ద్వైతభావంకల వాక్యాలు కొన్ని ఉన్నాయి. పూర్తిగా అద్వైత బోధకాలైనవీ మరికొన్ని ఉన్నాయి. ద్వైతవాది అయిన భాష్యకర్త, అంతకన్న ఏమీ చేయలేకపోవడంవల్ల, అద్వైతపరమైన వాక్యాలను చిదక్కొట్టాలని చూస్తాడు. వాటికి ద్వైతపరమైన అర్థాన్ని కల్పిస్తాడు. అద్వైతపక్షం వహించే భాష్యకర్తకూడ, ద్వైతపరమైన వాక్యాలను అదేరకంగా ఆదరిస్తాడు. ఇది వేదాల దోషంకాదు. వేదాలన్నీ సంపూర్ణంగా ద్వైతపరంగానే ఉన్నాయని రుజువు చేయబూనడం బుద్ధిలేని పని. అవన్నీ పూర్తిగా అద్వైత బోధకాలే అని రుజువుచేయబూనడమూ బుద్ధిమాలిన పనే! అవి ద్వైతపరంగా, అద్వైతపరంగాకూడ ఉన్నాయి. క్రొత్తగా లభించిన భావాలమూలంగా, మనం, ఈనాడు, వాటిని మునుపటివారికంటె సరిగా అర్థం చేసుకోగల్గుతున్నాం. బుద్ధి పరిణామానికి ద్వైతాద్వైతపరమైన భావనావిశేషాలు రెండూ అవసరమే అనీ, అందువల్లనే ఆ రెంటినీ వేదాలు ఆదరించి బోధిస్తూ ఉంటాయని నా అభిప్రాయం. అవి మానవజాతిపై కరుణించి, ఉన్నత గమ్యాన్నిచేర్చే సోపానాలనన్నిటినీ చూపిస్తున్నాయి. ఆ సోపానాలు పరస్పర విరుద్దాలు కానేకావు. అదంతా పసివారిని విభ్రాంతులను చేయడానికై ప్రయోగించబడిన వ్యర్థపదజాలం కాదు. పసివాళ్ళకోసమే కాక, వయసు వచ్చినవారికికూడ, అవి అవసరమే! మనకొక శరీరం ఉండేంతకాలం, శరీరం, మనమూ ఒకటి – అనే ధ్యాస మనల్ని పట్టుకొని ఉండేంతకాలం, ఐదు జ్ఞానేంద్రియాలు కలిగి మనం బాహ్యప్రపంచాన్ని చూస్తూండేంతకాలం, సగుణబ్రహ్మం మనకు తప్పక అవసరమే! ఇలాంటి భావాలన్నీ మనకుండేంతవరకు, శ్రీరామానుజాచార్యులవారు నిరూపించినట్లు, భగవంతుని గూర్చిన, ప్రకృతిని గూర్చిన, జీవాత్మను గూర్చిన భావాలన్నిటినీ మనం స్వీకరించవలసిందే! ఈ మూడింటిలో, ఏ ఒక్కదాన్ని తీసుకొన్నా, తక్కిన రెండింటినికూడ తీసుకొని తీరాలి, గత్యంతరం లేదు; కాబట్టి, బాహ్యప్రపంచం నీకు కనిపిస్తున్నంతకాలం, సగుణదైవతం, సగుణ జీవాత్మ, లేవనడం కేవలం ఉన్మాదం. కానీ, మానవబుద్ధి తన హద్దులనుదాటి ప్రకృతిని కూడ దాటి, “ఆ చోటును చేరజాలక, వాక్కు మనస్సుతో సహా వెనక్కి తిరిగి వస్తుంది” అని శ్రుతిలో వర్ణించబడ్డ క్షేత్రాలు చేరే సమయాలు, మహాపురుషుల జీవితాల్లో ఒక్కొక్కసారి రావచ్చు. “అక్కడికి కన్నులు చేరజాలవు; వాక్కు చేరజాలదు; మనస్సూ చేరజాలదు,” “మనం దాన్ని ఎరుగుదుమని చెప్పజాలం. ఎరుగమనీ చెప్పజాలం” మనిషి ఆత్మ ఇలా పరిమితులనన్నిటినీ అతిక్రమించిన క్షణంలోనే “నేనూ, ఈ విశ్వమూ ఒక్కటే” “నేనూ, బ్రహ్మమూ ఒక్కటే” అనే అద్వైతభావం అతని ఆత్మలో మెరుపులాగా, తళుక్కుమంటుంది. ఈ ఎరుక జ్ఞానంవల్ల తత్త్వవిచారంవల్ల మాత్రమేకాక ప్రేమ మహిమవల్ల కూడా కొంతవరకు లభిస్తుంది. శ్రీకృష్ణుడు అదృశ్యుడు కాగా గోపికలు అతనిని చూడనందువల్ల దుఃఖీతులై కొంతవడికి వారి మనస్సులలో శ్రీకృష్ణభావం బలీయంకాగా ప్రతి గోపికకూడా తన దేహాన్ని మరచి తానే శ్రీకృష్ణుడని భావించి అతనిలాగా అలంకరించుకొని అతనిలాగే లీలలు చేయనారంభించినట్లు భాగవతంలో వర్ణించబడింది. కాబట్టి భక్తి ద్వారాకూడా ఇట్టి అద్వైతభావాలు లభ్యంకాగలవని మనం తెలిసుకోవాలి! సూఫీ మతానికి చెందిన పర్ష్యాదేశ ప్రాచీనకవి ఒకడు తన కావ్య మొకదానిలో ఇలా వ్రాశాడు: “నేను నా ప్రియురాలి దగ్గరకు వెళ్ళాను. తలుపు మూసి ఉంది. తలుపు తట్టాను. ‘ఎవరక్కడ?’ అనేమాట లోపలనుండి వినబడింది. ‘నేనే’ అని మారు పల్కాను. తలుపు తీయలేదు. రెండవసారి తలుపు తట్టాను. ‘ఎవరక్కడ?’ అనే ఇందాకటి మాటే వినబడింది. నేను ఫలానా వాడనన్నాను. తలుపు తెరవలేదు. మూడవసారి తట్టాను. ‘ఎవరక్కడ?’ అనేమాట మళ్ళీ వినబడింది. “ప్రేయసీ! నేను నీవే!” అన్నాను. తలుపు తక్షణమే తెలుచుకొంది!”
అంటే ఎన్నో దశలున్నాయి. కాబట్టి మనం వాటినిగూర్చి వాదులాడ నవసరం లేదు. ప్రాచీన వ్యాఖ్యానకర్తలలో విభేదాలున్నా మనమంతా వారిని పూజించి తీరవలసిందే! ఎందుకంటే జ్ఞానానికి పరిమితి లేదు. ప్రాచీన కాలంలోకానీ, ఆధునిక కాలంలోకానీ సర్వజ్ఞత్వం ప్రత్యేకమైన ఒకరి సొమ్ముకాదు. పూర్వకాలంలో జ్ఞానసిద్ధులు, ఋషులు ఉన్నట్లే ఇప్పుడూ అలాటివారు చాలామంది ఉంటారనడం నిజం! పూర్వకాలంలో వ్యాసులు, వాల్మీకులు, శంకరాచార్యులు ఉంటే మీలో ప్రతి ఒక్కరూ ఒక శంకరాచార్యులు ఎందుకు కాకూడదు? మన మతంలో మీరు సదా జ్ఞాపకముంచుకోవలసిన మరొక విశేషాంశం ఉంది. తక్కిన మతగ్రంథాలన్నింట్లో, ఈశ్వరవాణి ప్రమాణంగా చెప్పబడుతోంది. ఆ వాణి ఏ కొద్దిమంది పురుషులకో మాత్రం వినబడింది. వారినుండి ఆ ధర్మాలు ప్రజాసామాన్యానికి వచ్చాయి. మనమంతా వాటిని శిరసావహించాలి. సత్యాన్ని ఏసుక్రీస్తు దర్శించాడు. కాబట్టి మనమందరం అతనిపట్ల విధేయత చూపవలసిందే! కాని మన మతంలో అలాకాక, పూర్వకాలంలో మంత్రద్రష్టలైన ఋషులకు లభించినట్లే తర్వాతికాలంలో ఉన్న ఋషులందరికీ కూడ సత్యజ్ఞానం లభించగలదు. ఆ సత్యం కేవలం అదేపనిగా ప్రసంగాలు చేసేవారికి కానీ గ్రంథాలకు గ్రంథాలు కంఠస్థం చేసేవారికిగానీ, పండితులకుగానీ భాషాశాస్త్రవేత్తలకుగాని లభించదు! అది మంత్రద్రష్టలకు లభిస్తుంది. అత్యధిక ప్రసంగాలచేత, అత్యున్నత బుద్ధివిశేషం చేత, చివరికి నిరంతర శాస్త్రపఠనం చేతకూడా ఆత్మను పొందలేం. శాస్త్రాలు అలాగే చెబుతున్నాయి. వేదాధ్యయనంవల్లకూడ మనం ఆత్మను చేరజాలమట! ఇలాంటి సాహసవాక్కును ఏ ఇతరుల మత గ్రంథాల్లోనైనా మీరు చూడగలరా? మీరు మీ హృదయాలను వికసింపజేసుకోవాలి! మతమంటే చర్చికి పోవడంకాదు, ముఖంపై బొట్లు పెట్టుకోవడంకాదు. వేషాలు వేసుకోవడమూకాదు. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులున్నాయో అన్నింటితోకూడ మీ శరీరాలకు రంగులు పూసికొందురుగాక! మీ హృదయం వికసించకపోతే మీకు బ్రహ్మసాక్షాత్కారం కాకపోతే, అంతా వ్యర్థమే! హృదయానికి సరైన వర్ణం లభిస్తే ఎలాంటి బాహ్యవర్ణంతోకూడ అవసరం ఉండదు. అదే నిజమైన పారమార్థిక సిద్ధి. రంగులు మొదలైనవన్నీ మనకు సహకారంగా ఉండేంతకాలం మంచివే! అంతవరకు అన్నిటికీ స్వాగతం చెపుతాం. కాని ఒక స్థితిలో అవి అనావశ్యకమైపోయి సహకార మివ్వడానికి బదులు ప్రతిబంధకాలుగా మారుతాయి. అప్పుడు మానవుడు మతాన్ని బాహ్యవిషయాలతో అభిన్నంగా భ్రమిస్తాడు. దేవాలయాలను దర్శించడమే పరమార్థ జీవనమైపోతుంది. పురోహితునికి దానం చేయడమే మతధర్మాచరణమైపోతుంది. ఇలాంటివి అపాయకరం. అవినీతికరం. ఇట్టి వాటిని తక్షణం త్యజించాలి! మన బాహ్యేంద్రియజ్ఞానం సైతం మతం కాదని శాస్త్రాలు పదేపదే ఘోషిస్తున్నాయి. ఆ నిర్వికారబ్రహ్మం సాక్షాత్కరించేలా చేసేదే మతం! దాన్నే ప్రతివాడూ అనుసరించాలి! ఎవడు సర్వాతీత సత్పదార్థాన్ని సాక్షాత్కరింపజేసికొంటాడో, ఎవడు స్వతత్త్వంలోనే ఆత్మను ప్రత్యక్షం చేసుకొంటాడో, ఎవడు భగవంతుని ముఖాముఖీ చూస్తాడో, ఎవనికి అన్నింటిలో బ్రహ్మమాత్రమే కనిపిస్తుందో, అలాంటి వాడే ఋషి. నీవు అలాంటి ఋషిగా మారేవరకు నీకు మతమనేది లేనట్లే. అప్పుడు మాత్రమే మతం ప్రారంభం కాగలదు. అంతవరకు జరిగేది మతం కోసమై సన్నాహం మాత్రమే! ఈ సన్నాహం పూర్తి అయితే కానీ మతోదయంకాదు. ఇప్పుడు నీవు బుద్ధివ్యాయామాన్ని, శారీరక వ్యాయామాన్ని మాత్రం పొందుతున్నావని అర్థం.
“మోక్షాన్ని కోరే ప్రతివాడూ, ఋషిత్వదశను సాధించాలి. మంత్రద్రష్ట కావాలి! ఈశ్వరసాక్షాత్కారాన్ని పొందాలి” అని మన మతం వివరంగా సుస్పష్టంగా విధిస్తోంది. ‘మోక్షం’ అంటే అలాంటిది. మనశాస్త్రాలు విధించే ధర్మమదే! మన శాస్త్రాలను మనం స్వయంగా పరిశోధించాలి! స్వయంగా వాటి అర్థాన్ని గ్రహించాలి! ఇదే చేయవలసిన పని. ప్రాచీన ఋషిశ్రేష్ఠులు సాధించిన మహాకార్యాలను తలచి, వారిపట్ల మనం పూజ్యభావాన్ని చూపాలి! ఈ పురాతన ఋషులు చాలా గొప్పవారు. కానీ మనం వారికంటే గొప్పవారం కావాలి! వారు పూర్వకాలంలో ఘనకార్యాలను సాధించారు. మనం వాటిని మించిన గొప్పకార్యాలను సాధిద్దాం. ప్రాచీన భారతదేశంలో వందలకొద్దీ ఋషులుండేవారు. మనకూ లక్షల కొద్దీ ఋషులు తయారవుతారు. తయారయి తీరుతారు. ఈ విషయాన్ని మీలో ప్రతివాడూ ఎంతత్వరగా ఎంతగాఢంగా విశ్వసిస్తాడో భారతదేశానికి అంత మేలు కలుగుతుంది. ప్రపంచానికి అంత శ్రేయస్సు కలుగుతుంది! మీరు దేన్ని విశ్వసిస్తారో దానిగా మీరు మారుతారు. మీరు ఋషులమని విశ్వసిస్తే రేపే మీరు ఋషులవుతారు. మిమ్మల్ని అడ్డుపెట్టేది లేనేలేదు. చూడటానికి పరస్పర విరుద్దాలుగా వుండి, ఒకదాంతో ఒకటి పోరాటాలు చేసే మన సంప్రదాయాలన్నిటికీ సమంగా వర్తించే సిద్ధాంతమేదైనా ఉంటే, అది సమస్త తేజోవైభవం, శక్తి, పవిత్రత, ఆత్మలో ఇదివరకే ఉందనే సిద్ధాంతమొక్కటే! శ్రీరామానుజాచార్యుల సిద్ధాంతం ప్రకారం, ఆ జీవాత్మ ఒక్కొక్కప్పుడు సంకోచం పొందుతూ, ఒక్కొక్కప్పుడు వికాసం పొందుతూ ఉంటుంది. ఇంతే భేదం. ఈ భేదాలుంటే ఉండనివ్వండి! వ్యక్త రూపంలోగానీ, అవ్యక్త రూపంలోగానీ, జీవాత్మలో శక్తి ఉందనే సత్యాన్ని అందరూ ఒప్పుకొంటున్నారు. మీకు దీనిలో ఎంత త్వరలో నమ్మకం కుదిరితే అంత మీకు శ్రేయస్కరం. సర్వశక్తీ మీలో ఉంది. మీరు చేయలేనిది లేదు. లేనే లేదు. ఆత్మవిశ్వాసం వహించండి! దుర్బలులమని అనుకోకండి! అవివేకులమని భావించకండి! ఎవరూ దారి చూపనక్కర్లేదు. మీ అంతట మీరే దేన్నైనా చేయగలరు. మీలో సర్వశక్తులున్నాయి. లేచి నిలబడండి! మీలో నిగూఢమైవున్న తేజం ప్రకటించండి!