భారతీయ సిద్ధపురుషులను గురించి మాట్లాడేటప్పుడు, చరిత్ర రూపమైన సాక్ష్యంలేనట్టి పురాతనకాలానికి నా మనస్సు పరుగిడుతోంది. ఆ ప్రాచీనకాలపు అంధకారంలో దాగిన రహస్యాలను వెలువరించడానికి, సంప్రదాయంతో కూడిన జనశ్రుతి గాథలు వ్యర్థంగా ప్రయత్నిస్తున్నాయి. భారతీయ సిద్ధపురుషులు లెక్కలేనంతమంది ఉన్నారు. వేలకొద్దీ సంవత్సరాలుగా భారతజాతి ఈ సిద్ధులను సృష్టించడంకంటె చేసిన మహత్తర కార్యం ఇంకొకటి లేదు. యుగకర్తలై, మహాతేజస్సుతో వెలిగిన కొందరి జీవితాలను మాత్రమే తీసుకొని వారిని గురించి నా పరిశోధన ఫలితాలను మీకు చెబుతాను.
ముందుగా మన శాస్త్రగ్రంథాలను గూర్చి, మన మొకింత తెలిసికోవాలి! సత్యంయొక్క రెండు ఆదర్శాలు మన శాస్త్రాలలో ఉన్నాయి. ఇందులో ఒకదాన్ని సనాతనమనీ, రెండవదాన్ని అంతప్రామాణికమైంది కాదనీ, అయినా కొన్ని దేశకాల పరిస్థితులలో అది విధిగా అనుసరించ వలసిందే అనీ మనమంటున్నాం. జీవుడు, ఈశ్వరుడు వీరి స్వభావాలను గురించి, జీవాత్మ, పరమాత్మలకున్న సంబంధాన్నిగూర్చి, శ్రుతులు, లేక వేదాలు అనే వానివల్ల తెలుస్తోంది. రెండవరకపు సత్యాలను మనం స్మృతులని పేర్కొంటున్నాం. మనువు, యాజ్ఞవల్క్యుడు మొదలైనవారి గ్రంథాలలోను, పురాణాలు మొదలు తంత్రశాస్త్రాలవరకు ఉన్న గ్రంథాలలోను అవి తెలుపబడ్డాయి. ఈ రెండవరకం గ్రంథాలు, సిద్ధాంతాలు, శ్రుతులకు లోబడినాయి. వీనిలో ఏదైనా శ్రుతివిరుద్ధంగా ఉంటే దాన్ని త్రోసేసి శ్రుతిధర్మాన్నే పాటించాలని సిద్ధాంతం. మానవుని గతి గమ్యాల బాహ్యరూపంమాత్రం వేదాల్లో సూచింపబడినాయనీ, వాటి వివరాలు, స్మృతులలోను, పురాణాలలోను విశదం చేయబడినాయనీ దీని అభిప్రాయం. సామాన్యధర్మాలు తెలిసికోవడానికి మాత్రం శ్రుతులు చాలు. పారమార్థిక జీవనాన్ని గురించి, అంతకుమించి తెలుపగలిగింది లేదు. తెలిసికోవడమూ సాధ్యంకాదు. జీవాత్మ అఖండత్వాన్ని సాధించుకోవడానికి కావలసినదంతా పూర్తిగా శ్రుతులలో బోధించారు. వివరాలు మాత్రం లేవు. వీటిని స్మృతులు ఆయాకాలాల్లో పూరిస్తూ వచ్చాయి.
శ్రుతులను గూర్చిన మరొక విశేషమేమంటే, వానిలోని సత్యాలను పోగుచేసిన ఋషులు చాలామంది పురుషులు, కొందరు స్త్రీలు వారెటువంటివారో ఎప్పుడు పుట్టారో, ఈ మొదలైన విషయాలనుగూర్చి మనకు తెలిసింది చాలా తక్కువ. అయినా వారి ఉత్తమ భావాలు, వారు కనిపెట్టిన రహస్యాలు, వేదాల్లో సురక్షితంగా కాపాడబడి ఉన్నాయి. స్మృతులలో, దీనికి మారుగా, వ్యక్తుల విషయాలే ఎక్కువ ప్రధానంగా కనిపిస్తున్నాయి. లోకాన్నే ఉర్రూతలూగించగల పురుష సింహాలు, అద్భుతావహులు, మహామహి మాఢ్యులు, సర్వజనాకర్షకులు చాలామంది మొట్టమొదటిసారిగా, మన యెదుట నిలబడ్డారా అన్నట్లు సాక్షాత్కరిస్తారు. కొన్ని సందర్భాల్లో వారి బోధలకంటె, వారి స్వరూపాలే మహత్తరంగా కన్పిస్తాయి.
మనం గ్రహించవలసిన విచిత్ర విషయమింకొకటి ఉంది. మన మతం నిర్గుణమైన సగుణ బ్రహ్మమును బోధిస్తోంది. నిర్గుణ ధర్మాలను ఎన్నింటినో బోధిస్తూ, అనేకుల మూర్తిమత్త్వాలనుకూడ చేరుస్తుంది. కానీ, మన మతానికి మూలాధారాలైన శ్రుతులలో పూర్తిగా నిర్గుణతత్త్వమే ఉంది. గొప్ప అవతారాలు, దైవం ధరించే మానవస్వరూపాలు, ప్రవక్తలు, మొదలైన వైయక్తికభావాలన్నీ స్మృతులలోను, పురాణాలలోను గోచరిస్తూంటాయి. మన మత మొక్కటి తప్ప, ప్రపంచంలోని ఇతర మతాలన్నీ పురుషరూపుడైన ఒకానొక మతకర్త జీవితంపై ఆధారపడి ఉన్నాయి. క్రైస్తవమతం ఏసుక్రీస్తు మీద, మహమ్మదీయమతం మహమ్మదు మీద, బౌద్ధమతం బుద్దుని మీద, జైనమతం జినుల మీద, – ఇలాగే ఇతర మతాలు ఇతరులపైన ఆధారపడి నిర్మాణమై ఉన్నాయి. ఈ మతాలన్నీ తమతమ మహాపురుషులను గురించిన చారిత్రాత్మకమైన నిదర్శనాల విషయమై గొప్పపోరాటాలు జరిపి ఉంటాయని మనం ఊహించవచ్చు. ఈ మహాపురుషుల జీవితాలను గురించిన చారిత్రక నిదర్శనాల బలం ఎప్పుడైనా సడలిపోతే, వారి మత భవనమంతా నేలకూలి, విచ్ఛిన్నమైపోతుంది. మనకీ దురవస్థ తప్పింది. ఎందుకంటే, మన మతం మానవులపైకాక ధర్మ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది. మీరు మీ మత ధర్మాలకు లోబడి వర్తించడం, ఎవరో ఒక ఋషి కానీ అవతారపురుషుడుకానీ ఆ ధర్మాలను చెప్పాడని కాదు. వ్యక్తులపై ఉండే ప్రామాణ్య బుద్ధివల్ల మనం ధర్మాన్ని ఆచరించడంలేదు. వేదాల ప్రామాణ్యం కృష్ణునివల్ల రావడం లేదు. కృష్ణునికే వేదాలు పరమప్రమాణమవుతున్నాయి. వేదాలను బోధించేవారిలో ఆయన ఉత్తమోత్తముడు కావడం వల్లనే, ఆయనకు పూజ్యత కలిగింది. ఇతర అవతారాల సంగతీ అలాంటిదే! మన ఋషులందరి విషయమూ అంతే! మానవుడు పరిపూర్ణుడు కావడానికీ, మోక్షం పొందడానికీ కావలసినదంతా వేదాల్లో ఉండటమే మన ప్రాథమిక సిద్ధాంతం. అంతకు మించిన నూతన ప్రమాణాన్ని దేన్నిగానీ నీవు కనిపెట్టజాలవు. సమస్త జ్ఞానానికీ పరమావధి అయిన పరిపూర్ణ అద్వైతాన్ని దాటి నీవు పోజాలవు. ఆ గమ్యం ఇప్పటికే అందు సాధించబడి ఉంది. దాన్ని దాటిపోవడం అసంభవం. “తత్త్వమసి” అనే బోధన స్వానుభావానికి తెచ్చుకోవడంతో ఆధ్యాత్మికజ్ఞానం పరిపూర్ణమవుతోంది. అది వేదాల్లో ఉంది. ఇంక మిగిలిందంతా భిన్నభిన్నమైన దేశకాలాలను, పరిస్థితులను, సంబంధాలను అనుసరించి అప్పుడప్పుడు ప్రజలకు మార్గం చూపుతూండటానికి ఏర్పడిందే! ప్రాచీన సనాతన మార్గాన్ననుసరించి ప్రజలను నడపడం కోసమే బోధకాగ్రగణ్యులైన ఈ మహాపురుషులు అవతరించేవారు.
“యదా యదాహి ధర్మస్య గ్లాని ర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం;
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే!”
(ధర్మానికి హాని, అధర్మానికి వృద్ధి కలిగినప్పుడంతా నేను పుడుతూంటాను. సాధువులను రక్షించడంకోసం, దుష్టులను సంహరించడం కోసం, ధర్మాన్ని సంస్థాపించడంకోసం నేను ప్రతియుగంలో పుడుతూ ఉంటాను.)
శ్రీకృష్ణభగవానుని ఈ సుప్రసిద్ధ గీతావచనంకన్న ఎక్కువ విశదంగా, ఈ విషయాన్ని మరేదీ రుజువు చేయజాలదు. భారతీయులకున్న భావమిదే.
దీని ఫలితార్థమేమి? తర్కం మీదగాని, మహాపురుషుల ప్రామాణ్యం మీదగాని, చివరికి అవతారపురుషుల మీదగాని ఆధారపడక, తమ సొంతపునాదుల మీదనే స్వతంత్రంగా నిలిచి ఉండే ఈ నిత్యధర్మాలు ఒక వైపు ఉన్నాయి. ఇది భారతదేశం విశిష్ట లక్షణం కావడంవల్ల వేదాంత మతమొక్కటే విశ్వజనీనమతం కాగలదనీ, అది మానవులను గురించిగాక ధర్మసిద్ధాంతాలను గురించి బోధించేది కాబట్టి, ప్రపంచంలో ఇప్పటికి రూపొంది సిద్ధమై ఉన్న విశ్వజనీనమతం ఇదొక్కటే అనీ, మనం బాహాటంగా లోకానికంతా చాటి చెప్పవచ్చు. ఒక పురుషుని పైన ఆధారపడి నిర్మించిన ఏ మతాన్నిగానీ, ప్రపంచంలోని అన్నిజాతుల ప్రజలు ఆదర్శంగా అంగీకరించరు. మన దేశంలోనే మహాపురుషులు ఎంతోమంది వెలశారని మనకు తెలుసు. ఒక చిన్నపట్టణంలో సైతం వేర్వేరు చిత్త వృత్తులుగల ప్రజలు తమతమ చిత్తవృత్తుల ననుసరించి, వేర్వేరు వ్యక్తులను ఆదర్శమూర్తులుగా వరిస్తున్నారు. అలాంటప్పుడు ఒక మహమ్మదో, ఒక బుద్ధుడో, ఒక క్రీస్తో ప్రపంచమంతటికీ అనన్యమైన ఆదర్శంగా స్వీకరించబడటం ఎలా సాధ్యం? న్యాయమంతా, నీతి అంతా, ఆధ్యాత్మిక ధర్మమంతా, సిద్ధాంతమంతా, ఆ ఒక్క పురుషుని అంగీకారమున్నంత మాత్రంచేతనే సత్యమైనదిగా సమస్త ప్రజలు శిరసావహించడం ఎలా? ఇక వేదాంతమతానికో – అలాంటి ఏ పురుషుని ప్రామాణ్యాధికారాలూ అవసరంలేదు. దాని ప్రమాణం నరుని సనాతన ప్రకృతే! అందలి నీతులు ఇదివరకే సిద్ధమై ఉన్నట్టి సనాతనమైన మానవుని పారమార్థిక స్థైర్యం మీద ఆధారపడి ఉన్నాయి. అయినా అతిప్రాచీనకాలంనుండి, మానవజాతిలో అధికసంఖ్యాకులకు సగుణమూర్తి ఆవశ్యకమై ఉంటుందనే సంగతి మన మహాపురుషులు తెలిసికొన్నారు. ఏదో ఒక రూపంలో సగుణ దైవతం ప్రజలకు కావలసి ఉంటుంది. సగుణ దైవతం ఉండకూడదని గట్టిగా వాదించిన బుద్ధుని నిర్యాణానంతరం, యాభై సంవత్సరాలన్నా గడవకముందే, అతని శిష్యులు, అతనినే ఒక సగుణదైవతంగా ఏర్పరచి, ఆరాధించడాన్నారంభించారు. ఈ సగుణదైవతం అవసరమే! అయినా నిజమాలోచిస్తే, సగుణదైవతాలుగా భావించబడిన వారిలో నూటికి తొంభై తొమ్మిది మంది మానవపూజకు అనర్హులు. కాని ఊహాకల్పిత సగుణ దైవతాలకన్నా శ్రేష్ఠతరమైన సజీవదైవతాలు ఈ లోకంలోనే అప్పుడప్పుడు మన మధ్య మనతోపాటు నివసిస్తూ మనతో కలిసిమెలసి తిరుగుతూ ఉండటం కద్దు. మన ఊహాకల్పితమైన బూటకపు దైవానికంటె, ఇలాంటి వారిని సేవిస్తే మన జన్మలు ధన్యమౌతాయి. మన జీవితాలు చరితార్థమవుతాయి! మీరుగాని, నేనుగాని కల్పించుకోగల్గిన ఏ భగవద్భావనకంటె గూడ శ్రీకృష్ణుడు గొప్పవాడుకదా? మన మనస్సులలో మీరుగానీ, నేను గానీ కల్పన చేసుకోగలిగిన ఆదర్శమూర్తికంటె బుద్ధుడు ఎన్నోరెట్లు సజీవము, పూజనీయము అయిన ఉత్తమ భావనామూర్తికదా? అందువల్లనే ఇట్టి పురుషులు ఊహాకల్పిత దేవతలనందరినీ నెట్టివేసి, మానవజాతివల్ల ఎప్పుడూ పూజలందుకొంటున్నారు.
ఈ సత్యం మన ఋషులకు తెలుసు. కాబట్టే, అట్టి మహాపురుషులను, అవతారమూర్తులను భారత ప్రజలంతా పూజించే అవకాశాన్ని వారు కల్పించారు. ఇట్టి అవతారపురుషులలో ఉత్తమోత్తముడైన శ్రీకృష్ణుని పలుకు సర్వాతిశాయిగా ఉంది.
“యద్య ద్విభూతి మత్సత్త్వం శ్రీమ దూర్జిత మేవ వా ।
తత్త దేవావ గచ్చ త్వం మమ తేజోంశ సంభవమ్ ॥”
(ఎక్కడెక్కడ నరుని వలన బాహాటంగా అసాధారణశక్తి ప్రకటితమవుతుందో అక్కడ నేనున్నాననీ, ఆ ప్రకాశమంతా నా వల్లనే పుడుతూందనీ తెలుసుకో!) ఈ ప్రవచనము, ప్రపంచంలోని అన్ని దేశాలలోని అవతారాలను పూజించడానికి భారతీయునికి అవకాశమిస్తోంది. హిందువు ఏ దేశంలోని ఏ ఋషినైనా, ఏ సాధుపురుషునైనా పూజింపగలడు. నిజానికి మనవాళ్ళు అనేకసార్లు క్రైస్తవుల చర్చీలలోకి, మహమ్మదీయుల మసీదులలోనికి పోయి పూజలర్పించడం మనకు తెలిసిన విషయమే. అలా చేయడం మంచిదే; ఎందుకుకాదు? నేను చెప్పినట్లు మనది విశ్వజనీన మతం; సమస్తాదర్శాలను తనలో ఇముడ్చుకోగలిగినంత ఉదారం, విశాలం అయినది. ప్రపంచంలో ఇప్పటివరకుండిన మతాదర్శాల నన్నిటినీ వేదాంత మతం తనలో ఇప్పుడే ఇముడ్చుకోగలదు; ఇలాగే ఆదరించి, తన అనంత బాహువులలో ఆలింగనం చేసుకోడానికి భవిష్యత్కాలంలో రానున్న ఆదర్శాలకోసమై ఓపికతో నిరీక్షిస్తూకూడ ఉండగలదు.
భగవదవతారమూర్తులైన మహాపురుషులను గూర్చి, మన సిద్ధాంతం ఇంచుమించుగా ఇలా ఉంది. వారికంటె తక్కువ ప్రాధాన్యంగల పురుషశ్రేష్ఠులుకూడ ఉన్నారు. ‘ఋషి’ అనే మాట వేదాలలో ఎన్నోసార్లు వాడిన విషయం మనకు తెలుసు. ఇప్పుడుకూడ ఆ శబ్దం సామాన్యంగా వాడుతున్నారు. ‘ఋషి’ అంటే ఒక గొప్ప ప్రమాణపురుషుడు అని మనం గ్రహించాలి. ‘ఋషి’ అంటే ‘మంత్రద్రష్ట’ అంటే సత్యాన్ని చూసేవాడు అని నిర్వచనం. ఆధ్యాత్మిక ధర్మానికి రుజువేమి? అతిప్రాచీన కాలంలోనే ఈ ప్రశ్న తలెత్తింది. దానికి ఇంద్రియానుభవరూపమైన రుజువు లేదని ప్రవచింపబడింది.
“యతో వాచో నివర్తన్తే అప్రాప్యమనసా సహ” (ఆ పరతత్త్వాన్ని చేరలేక వాక్కులు మనస్సుతో సహా వెనక్కి వస్తున్నాయి) “న తత్ర చక్షుర్గచ్ఛతి, నవాగ్ గచ్ఛతి నో మనో!” (అక్కడికి కన్నులు చేరజాలవు. వాక్కు చేరజాలదు. మనస్సును చేరజాలదు) అని యుగయుగాంతరాల నుండి ప్రవచింపబడుతోంది. ఆత్మ ఉనికినిగూర్చి, భగవంతుని ఉనికిని గూర్చి జీవితం నిత్యత్వాన్నిగూర్చి, మానవుని పరమావధినిగూర్చి, ఇంకా ఇలాంటవిషయాలను గురించి, బాహ్యప్రకృతి మనకేమీ సమాధానం చెప్పజాలదు. మానవమనస్సు నిరంతరం మారేది, ఎప్పుడూ చంచలం. దానికి పరిమితి ఉంది. అది ఖండఖండాలుగా తెగిపోయేది. అనంతమై నిర్వికారమై, అఖండమై అభేద్యమై, శాశ్వతమైన బ్రహ్మమును గూర్చి ప్రకృతి ఎలా తెలుపగలుగుతుంది? అది దానికెన్నడూ సాధ్యంకాదు. పైగా నిర్జీవమై, జడమైవున్న ద్రవ్యరాశినుండి ఆ సమాధానాన్ని పొందడానికై మానవుడు ప్రయత్నించినపుడంతా, అతని ప్రయత్నం వ్యర్థమైందని చరిత్ర తెలుపుతోంది. అయితే వేదాలు తెలిపే జ్ఞానం ఎలా లభించింది? ‘ఋషి’ త్వాన్ని పొందడంవల్ల అది లభించింది. ఆ జ్ఞానం ఇంద్రియాల్లో ఉండేదికాదు. ఈ ఇంద్రియాలే మానవుని ఆద్యంతాలా? మానవుడంటే, ఈ ఇంద్రియాలే అని చెప్పగలవాడెవడు? మన అందరి జీవితాల్లో అత్యంత నిశ్చలత్వాన్ని అనుభవించే క్షణాలు అప్పుడప్పుడూ వస్తూంటాయి. మన కళ్ళయెదుట మనం ప్రేమించే ఒకడు మరణించినప్పుడో, ఏదైనా ఆకస్మికమైన ఆపద వచ్చినప్పుడో, అత్యంతానందం చేకూరినప్పుడో, అలా తటస్థించవచ్చు. మన మనస్సు నిశ్చలమై, ఒక క్షణకాలం తన స్వస్వరూపంతో నిలిచి, సర్వాతీతమైన అఖండ బ్రహ్మము జాడ తళుక్కుమన్నదో అన్నట్లు విశిష్టానుభవాన్ని పొందే క్షణాలు, ఇతర సమయాల్లో సైతం తటస్థించవచ్చు. మాటల కందనిది, మనస్సుకు గోచరించనిది, ఏదో మనకప్పుడు ప్రత్యక్షమవుతుంది. ఇది సామాన్య జీవితంలోకూడ జరిగేదే. కానీ, దీనికి ఔన్నత్యం కల్పించి, సాధనమూలంగా పరిపూర్ణత కలిగించాలి! యుగాంతరాలకు పూర్వమే ఆత్మ ఇంద్రియాలచేత పరిమితంకాక, ఇంద్రియాల కతీతమై, చైతన్యానికికూడ అందకుండా ఉంటుందని మహాపురుషులు కనిపెట్టారు. అంతులేని ఒక పెద్దగొలుసులో ‘ఎరుక’ అనేది ఒక కడియం మాత్రమే అని మనం గ్రహించాలి! ఎరుక, బ్రహ్మము ఒక్కటి కాదు. ఎరుక బ్రహ్మంయొక్క ఒక అంశమాత్రమే! ఈ ఎరుకనిదాటి సాహసవంతమైన అన్వేషణ సాగవలసి ఉంది. ఎరుక ఇంద్రియాలచేత పరిమితమైంది. దాన్నిదాటి ఇంద్రియాలను దాటి ఎగసిపోవాలి. అప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచపు సత్యాలు మనకు గోచరిస్తాయి. ఈ ఇంద్రియాల హద్దులను దాటిపోవడంలో సామర్థ్యాన్ని గడించిన పురుషులు ఈ కాలంలోకూడ ఉన్నారు. ఆధ్యాత్మిక సత్యాలను వారు ప్రత్యక్షంగా తెలిసికోవడంవల్ల వారిని ‘ఋషులు’ అంటారు.
వేదాలకు రుజువు, నా ఎదుట ఉన్న ఈ బల్లకు రుజువు ఎలాంటిదో, అలాంటిదే! అది ప్రత్యక్ష ప్రమాణమే; అంటే స్వయంగా గోచరించడమే! ఈ బల్లను నేను ఈ బాహ్యేంద్రియదృష్టితో చూస్తున్నాను. ఆధ్యాత్మిక సత్యాలను, జీవాత్మయొక్క అతీంద్రియావస్థలో చూడగలుగుతాం. ఈ ‘ఋషిత్వం’ కాలంవల్లగాని, స్థలంవల్లగాని, స్త్రీ పురుష భేదంవల్లగాని, జాతి భేదంవల్లగాని పరిమితం కాదు. ఆర్యుడని, అనార్యుడని, మ్లేచ్చుడని, భేదంలేక అందరికీ ఈ ‘ఋషిత్వం’ సామాన్య సంపద అని వాత్స్యాయన ఋషి ప్రకటించాడు. వేదాలలో తెలుపబడిన ‘ఋషిత్వం’ ఇలాంటిది. భారతదేశంలోని ఈ మతాదర్శాన్ని నిరంతరం మనం స్మరించుకోవాలి! దీనిని ప్రపంచంలోని ఇతర జాతుల వారు కూడ తెలిసికొని, జ్ఞాపకముంచుకోవాలని కోరుతున్నాను. అప్పుడు పోట్లాటలు తగ్గిపోతాయి; వాగ్వాదాలు తరిగిపోతాయి. ఆధ్యాత్మికధర్మం పుస్తకాల్లో లేదు. సిద్ధాంతాలలో లేదు. విధివాక్యాలలో లేదు; ఉపన్యాసాలలో లేదు; తర్కంలోలేదు; అది ‘స్థితి’ ‘సిద్ధు’ లలో ఉంది. మిత్రులారా! మీలో ప్రతివాడు ఋషియై, ఆధ్యాత్మిక సత్యాలను ప్రత్యక్షంచేసుకొనే వరకు, మీకు ఆధ్యాత్మిక జీవనం ప్రారంభంకానట్లే. అతీంద్రియ దశ మీకు కలిగే వరకు, ఆధ్యాత్మిక జీవనమనేది వట్టి అర్థంలేని మాటే! అదంతా సాధనవంటిదనవచ్చు. నీవు స్వయంగా ఎరుగని విషయాన్ని గూర్చి ఎవరో చెప్పిన దాన్ని, మరెవరి మూలంగానో విని, నీవు ప్రసంగాలు చేస్తున్నావు. బుద్ధభగవానుడు కొందరు బ్రాహ్మణులతో వాదించినప్పుడు చెప్పిన మాట, ఇక్కడ చక్కగా ప్రసక్తమై ఉంది. వారు బ్రహ్మం యొక్క స్వరూపాన్ని గూర్చి వివాదపడుతూండగా, బుద్ధదేవుడు “నీవు బ్రహ్మమును చూశావా?” అని ప్రశ్నించాడు. “లేదు” అని సమాధానం. “మీ తాత?” “ఆయన కూడ చూచినట్లు నా కనిపించదు.” “అలాగైతే మిత్రమా! మీ తండ్రి, మీ తాత ఎన్నడూ చూడని పురుషుని గూర్చి మీరు వివాదపడి, ఒకరినొకరు జయించాలనుకోవడమెందుకు?” అని బుద్ధభగవానుడు అడిగాడు. ప్రపంచమంతా చేస్తున్నదిదే! ఈ వేదాంత వాక్యాన్ని అనువదించుదాం. “నాయమాత్మా ప్రవచనేన లభ్యః నమే ధయా, బహునాశ్రుతేన!” – (పాండిత్య మార్జించడంవల్ల ఈ ఆత్మను చేరలేము; గొప్ప బుద్ధిబలం వల్లకూడ చేరలేము; వేదాలనన్నిటినీ చదవడం మూలంగా కూడ చేరలేము.)
కాబట్టి వేద ప్రమాణాన్ని అనుసరించి, ప్రపంచంలోని అన్ని జాతుల వారికీ మనం ఇలా చెప్పాలి: “మీ పోరాటాలన్నీ, మీ వాగ్వాదాలన్నీ వ్యర్థం! మీరు బోధింపపూనిన దైవాన్ని మీరు చూశారా? చూడకపోతే మీ బోధ అంతా వ్యర్థమే! మీరు చెప్పేదేమో, మీకే తెలీదు. మీరు ఆయనను చూసివుంటే వాదులాడరు; అప్పుడు మీ ముఖాల్లోనే వర్చస్సు కనిపిస్తుంది.” ఉపనిషత్తులలో పేర్కొనబడిన ఒక ప్రాచీనఋషి తన కుమారుని బ్రహ్మమును గురించి తెలిసికొనిరమ్మని పంపాడు. ఆ బాలుడు తిరిగిరాగా, “నీవేమి తెలిసుకొన్నా” వని తండ్రి అడిగాడు. “నేను చాలా శాస్త్రాలను చదివా” నని అతడు జవాబిచ్చాడు. కానీ తండ్రి “అదంతా నిష్ఫలం, తిరిగి పొమ్మ” న్నాడు. ఆ కొడుకు మళ్ళీ వెళ్ళి కొంతకాలానికి తిరిగిరాగా తండ్రి వెనకటి ప్రశ్ననే వేశాడు. బాలుడు వెనుకటి జవాబే చెప్పాడు. ఇంకొకసారి అతడు వెళ్ళివచ్చాడు. ఆ తర్వాత ఆ బాలుడు తిరిగి వచ్చినప్పుడు, వాని ముఖమంతా ప్రకాశవంతమై కనిపించింది. అప్పుడతని తండ్రి దిగ్గునలేచి, “ఓహో! కుమారా! ఈనాడు నీ ముఖం బ్రహ్మవేత్తముఖాన్ని పోలి ప్రకాశిస్తోంది” అన్నాడు. మీరు భగవంతుని తెలిసుకొన్నప్పుడు, మీ ముఖవర్చస్సు మారుతుంది; మీ కంఠస్వరం మారుతుంది. మీ ఆకారమంతా మారుతుంది. మీరు మానవజాతినే ఉద్ధరించే వారవుతారు. “ఋషి” కి ఎవరూ ఎదురై నిలువలేరు. ఋషిత్వమంటే ఇలాంటిది! ఇది, మన మతానికి పరమావధి! తక్కినవన్నీ, ఈ ప్రసంగాలు, తర్కాలు, తత్త్వసిద్ధాంతాలు, ద్వైతం, అద్వైతం, చివరికి వేదాలుకూడ – యాత్రాసన్నాహాల వంటివే! అప్రధానమైనవే! ఋషిత్వం మాత్రమే ప్రధానమైంది. వేదాలు, వ్యాకరణం, జ్యోతిషం మొదలైనవన్నీ అప్రధానమే! ఆ నిర్వికార బ్రహ్మసాక్షాత్కారాన్ని చేకూర్చేది పరావిద్య ఒక్కటే. వేదాలలోని ‘ఋషు’ లు అట్టి సాక్షాత్కారాన్ని పొందినవారే! ఈ ‘ఋషి అనే పదం, ఒక తరగతికి, ఒక దశకు పేరు. మనమంతా – నిజమైన ప్రతిహిందువు – ఆ పదానికి అర్హులమై, మన జీవితంలో ఏదో ఒకకాలంలో ‘ఋషు’ లం కావాలి! ఋషి కావడమంటే ముక్తి నార్జించడమే అని హిందువుల అభిప్రాయం. శాస్త్రధర్మాలలోని విశ్వాసం ముక్తికాదు. వేలకొద్దీ దేవస్థానాలను దర్శించడమూ కాదు; లోకంలోని నదులన్నిటిలో స్నానం చేయడమూ కాదు. కాని మంత్రద్రష్టయై, ‘ఋషి’ కావడమే బంధవిమోచనం, మోక్షం.
వేదకాలానికి తరువాతకూడ లోకాన్ని సంచలింపచేసే సామర్థ్యమున్న మహర్షులు, అవతారపుషులు ఎందరో ఉదయించారు. భాగవత ప్రమాణాన్ననుసరించి అలా ఉదయించవలసినవారి సంఖ్య అనంతం. భారతదేశంలో అత్యధికంగా పూజించబడేవారు రాముడు, కృష్ణుడు. క్షాత్రయుగంనాటి ప్రాచీన దైవతమైన రాముడు సత్యధర్మాలకు నిలయం; ఆదర్శరూపుడైన కుమారుడు; ఆదర్శరూపుడైన భర్త; ఆదర్శరూపుడైన తండ్రి; అన్నిటినీమించి, ఆదర్శరూపుడైన ప్రభువు. ఇలాంటి రాముని, వాల్మీకి మహర్షి మనకు ప్రదర్శించాడు. ఈ మహాకవి శ్రీరాముని జీవితాన్ని వర్ణించిన భాషకంటె, స్వచ్ఛం, నిర్దుష్టం, మనోహరం, సులభగ్రాహ్యం అయిన భాష ఉండజాలదు. ఇక సీతనుగూర్చి చెప్పసాధ్యమా? ప్రపంచంలోని పూర్వ గ్రంథరాశినంతా, భవిష్యత్కాలంలో రచించబడే గ్రంథరాశిని సైతం గాలించి చూచినా, మీకింకొక సీత కనబడదు. సీత అసదృశ అయినది. అంతకంటె సమగ్రతను ఊహించడం కష్టమన్నట్లు ఆమె చిత్రించబడింది. ఎందరో రాములుంటే ఉండవచ్చుకానీ, ఈ ఒక్క సీత తప్ప, మరి సీతలుండబోరు. ఆమె నిష్కళంక భారత నారీమణికి పరమాదర్శం. ఆ సీత జీవితంనుండే, స్త్రీత్వపరమావధిని నిర్ణయించే, భారతాదర్శాలన్నీ పుట్టుకొని వచ్చాయి. అనేకవేల సంవత్సరాలనుండి ఆర్యావర్త భూమిలో ఒక కొననుండి మరొక కొన వరకు, సర్వత్ర, ప్రతి పురుషుని చేత, ప్రతి స్త్రీ చేత, ప్రతి శిశువుచేత సైతం పూజలందుకొంటూ, ఆ దివ్యమూర్తి ప్రకాశిస్తోంది. ఈ దివ్యస్వరూపిణి సీత పావనతకంటే పావనమై నిలిచి ఉంటుంది. కొంచెంకూడ సణుక్కోక, విసుక్కోక ఆమె జీవన దుఃఖసముద్రాన్ని ఓపికతో ఈదింది. నిత్యసత్యవ్రతయై, పతివ్రతా తిలకమై, మానవులకు దేవతలకు పరమాదర్శమై ఆమె ప్రకాశిస్తోంది. ఆ మహాసాధ్వి సీత, మన జాతికి అధిష్ఠానదేవతై ఎప్పుడూ సుస్థిరంగా నిలిచి ఉండవలసిందే! ఆమెనుగూర్చి వర్ణించడం, ముంజేతి కంకణానికి అద్దం చూపడమే! మన పురాణాలన్నీ నశించిపోవచ్చు, మన వేదాలే నీటిలో కలిసిపోవచ్చు, మన సంస్కృతభాషే ఊరు పేరు లేకుండా మాయమై పోవచ్చు. కాని పదిమంది భారతీయులైనా బ్రతికి ఉండేంతకాలం నింద్యగ్రామ్య భాషలోనైనా, ఒక్కడైనా మాట్లాడేవాడుండేంతవరకు, ఈ సీతామహాదేవి కథ ప్రస్తావనకు రాకతప్పదు. ఈ సీత మన జాతి జీవస్థానాన్ని ఆక్రమించింది. ప్రతి భారతీయ స్త్రీ, పురుషుల రక్తంలో ఆమె ఉంది. మనమందరం సీతామహాదేవి సంతానమే! మన స్త్రీలలో నవీన సంస్కరణలు ప్రవేశపెట్టే ప్రయత్నంలో సీతయొక్క పరమాదర్శంనుండి వారిని దూరంచేయాలనే సంకల్పంవుంటే, అది తక్షణం కొరగానిదైపోతుంది. ఆ సంగతి ప్రతిరోజూ తెలుస్తూనే ఉంది. భారతదేశ స్త్రీలు, ఈ సీత అడుగుజాడల ననుసరించి వృద్ధిపొంది వికాసాన్ని పొందాలి! వారి కదొక్కటే మార్గం.
ఎన్నో రూపాలతో పూజించబడుతూ స్త్రీలకు, పురుషులకుకూడ ఒకేవిధంగా ఇష్టదైవమై, పిన్నలకు, పెద్దలకుకూడ పరమాదర్శమై వెలిగే తేజోమూర్తి దగ్గరకిప్పుడు వస్తాం. భాగవతకర్త ఈ శ్రీకృష్ణుని అవతారమని పేర్కొనుటతో తృప్తి పొందక, అవతారాలన్నీ ఎవరి అంశనుండి ఉద్భవిస్తాయో, అలాంటి శ్రీమహావిష్ణువే అని అభివర్ణించాడు. ఈ మహనీయుని బహుముఖమూర్తిమత్వం, మనల్ని ఆశ్చర్య నిమగ్నులుగా చేస్తూండగా, అతనిని ఈ విధంగా అభివర్ణించడం విచిత్రంకాదు. అతడు ఆశ్చర్యం కలిగించే సన్న్యాసి, ఆశ్చర్యం కలిగించే గృహస్థుడు! అతనిలో అగణితమైన మహాశక్తిస్వరూపమైన రజస్సు గోచరించడమేకాక, చాలా ఆశ్చర్యం కలిగించే వైరాగ్యంకూడ మూర్తీభవించి ఉంటుంది. మీరు గీతను బాగా చదివితే తప్ప శ్రీకృష్ణుని మహత్త్వం మీకు తెలియనే తెలియదు. ఎందుకంటే, అతని ఉపదేశానికి అతడే మూర్తీభావం. ఈ అవతారాలలో ప్రతివారూ తాము ఏమి బోధించారో ఆ ధర్మానికి సజీవదృష్టాంతాలై వెలశారు. గీతను బోధించిన శ్రీకృష్ణభగవానుని జీవితమంతా, దివ్యగీతా స్వరూపమే. అంటే, నిష్కామకర్మకు అతడు చక్కని దృష్టాంతం. తన సింహాసనాన్ని పరిత్యజించి, మళ్ళీ దాన్నిగూర్చి స్మరించలేదు. ఏ మహనీయుని ఆజ్ఞను శిరసావహించి, చక్రవర్తులు తమ సింహాసనాలనుండి దిగుతారో, ఆ భారతనాయకాగ్రణి ఎన్నడూ ప్రభువు కావాలనుకోలేదు. గోపికలతో కలసిమెలసి ఆటలాడిన బాలకృష్ణుడుగనే, సర్వజన సులభుడైన ఆ శ్రీకృష్ణుడుగనే ఉన్నాడు. ఆ బృందావన మనోజ్ఞలీలలలో ప్రకటితమైన మహావిచిత్ర విశాలవికసిత విశుద్ధ ప్రేమయొక్క దివ్యతత్త్వాన్ని గ్రహించడం, అలాంటి దివ్యమధుర భావరసపానంచేసి, నిష్కళంక ప్రేమోన్మత్తచిత్తుడైన వానికే సాధ్యమవుతుంది. ఆహా! గ్రహించడం చాలా కష్టమైన ఆ అద్బుత జీవితఘట్టాన్ని పరమపవిత్రుడు, పూర్ణ నిష్కళంకుడు అయ్యేంతవరకు ఎవడూ గ్రహించడానికి ప్రయత్నించరాదు. ఆ గోపికల ప్రేమస్పందనను ఎవరు గ్రహించగల్గుతారు? ఆదర్శరూపమైన ఆ ప్రేమ! ప్రతిఫలాపేక్ష ఏ కోశానాలేని ప్రేమ! స్వర్గాన్ని సైతం, లెక్కచేయని ప్రేమ! ఇహపరాల్లో దేన్నీ, స్మరణలోనైనా నిలుపజాలని వినిర్మల ప్రేమ! మిత్రులారా! ఈ గోపికా ప్రేమలోనే సగుణ, నిర్గుణ బ్రహ్మ భావాలమధ్యగల విభేదానికి పరిష్కారమార్గం లభించింది. మానవ జీవితంలోని అత్యున్నత దశ సగుణబ్రహ్మమని మనకు తెలుసు. ఎవడు ఈ విశ్వంలో సర్వాంతర్యామిగా ఉన్నాడో, ఈ సృష్టి సర్వమూ ఎవని వ్యక్తరూపంగా ఉందో, అట్టి నిర్గుణబ్రహ్మంలో విశ్వాసముంచడం తత్త్వశాస్త్ర సమ్మతమని మనకు తెలుసు. అయినప్పటికీ మన హృదయాలు ఏదైనా వ్యక్తరూపంకోసం, ఏదైనా సుగ్రాహ్యమగు దానికోసం, ఎవని పాదాలచెంత మన ఆత్మలు శరణాగతి పొందజాలుతాయో, అట్టి తత్త్వస్వరూపం కోసమై తహతహపడుతూ ఉంటాయి. కాబట్టి మానవస్వభావం అందుకోగల మహోత్కృష్ట భావన సగుణ బ్రహ్మమైనది. కాని సగుణబ్రహ్మభావం తర్కానికి వెగటుగా ఉంటుంది. ఇది తాతలనాటి పాతప్రశ్నే! దీన్నిగూర్చి ద్రౌపది యుధిష్టిరునితో అరణ్యవాసకాలంలో తర్కించింది. ఇది బ్రహ్మసూత్రాలలో తర్కించబడింది. సగుణదైవతమే ఉంటే, ఆయన “సర్వదయాళువు”, సర్వశక్తిమంతుడూ అయితే, ఈ భూలోక నరకం ఎందుకు ఏర్పడింది? అతడు ఇలాంటిదాన్ని ఎందుకు సృష్టి చేశాడు? అతడు పక్షపాతి అయివుండాలి! దీనికి సమాధానం అడిగితే, ఈ గోపికాప్రేమ ఒక్కటే తగిన సమాధానంగా లభించింది. కృష్ణునికి ఆరోపించబడిన ప్రతి విశేషణము, గోపికలకు వెగటై తోచింది. అతడు జగన్నాథుడని, సర్వశక్తిమంతుడని, పరంధాముడని, వినడంలో వాళ్ళకాసక్తిలేదు. అతడు అఖండ ప్రేమమూర్తి అని మాత్రమే వారి భావం. వాళ్ళకంతే చాలు. వారు శ్రీకృష్ణుని బృందావన కృష్ణునిగా మాత్రమే పరిగణించారు. ఆ మహా సైన్యాధిపతి, ఆ రాజాధిరాజు వారి భావనలో గోపాలుడే! ఎప్పుడూ గొల్లవాడే! “నాకు ధనంవద్దు; జనం వద్దు; పాండిత్యం అక్కర్లేదు; స్వర్గ ప్రాప్తికూడ అక్కరలేదు. నేను ఎన్ని జన్మలనైనా ఎత్తవచ్చు, కానీ, ఓ దేవా! నాకు నీ పట్ల భక్తి ఉండేలా, అది నిష్కామభక్తిగా ఉండేలా, అనుగ్రహించు–” అని వ్రజవనిత ప్రార్థించింది.
భక్తికోసమే భక్తి! కర్మకోసమే కర్మ! ధర్మం కోసమే ధర్మం! అనే ఈ భావం ఆస్తిక జీవనచరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. ఈ పరమార్థం అవతారాలలో ఉత్తమోత్తముడైన శ్రీకృష్ణభగవానుని ముఖతా ప్రప్రథమంగా వెలువడింది. మానవజాతిచరిత్రలో అది మొట్టమొదటిసారి భారత క్షేత్రంలోనే ప్రవచించబడింది. భయప్రలోభాలతో కూడిన మతాలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. నరకభీతి విజృంభిస్తున్నా, స్వర్గసుఖ ప్రలోభం తాండవిస్తున్నా, భక్తి కోసమే భక్తి, ధర్మంకోసమే ధర్మం, కర్మకోసమే కర్మ, అనే మహోత్కృష్టమైన ఆదర్శం ఉదయించింది.
ఓహో! ఎలాటి భక్తి? ఎలాంటి ప్రేమ? గోపికల ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టమని ఇంతకుముందే చెప్పాను. అద్భుతమైన ఆ ప్రేమోదంతంలోని గంభీరార్థాన్ని గ్రహించలేని మూర్ఖులు మనలో కూడ లేకపోలేదు. ఈ పవిత్రగాథకు నీచార్థాలు కల్పించి ఏవగించుకొనే మూర్ఖులు కలుషమనస్కులు, అపవిత్ర హృదయులు చాలామంది మన జాతిలోనే ఉన్నారు. “ముందు మీ మనసులను పవిత్రం చేసుకోండి; ఈ గోపికల అనురాగగాథను వివరించిన మహనీయుడు ఆ శ్రీశుకదేవుడే గాని అన్యుడు గాడని మీరు జ్ఞప్తి ఉంటుకోండి. అద్భుతావహమైన ఈ గోపికాప్రేమను గూర్చి గానంచేసిన ఐతిహాసికుడు పరమపవిత్రుడై అవతరించిన ఆ నిత్యనిర్మలమూర్తి శ్రీశుకమహాఋషి! శ్రీవ్యాసమహాముని కొడుకు!” అని మాత్రమే నేను వారికి చెబుతాను. హృదయంలో ఎక్కడైనా, ఇసుమంత స్వార్థచింతవున్నా భగవద్భక్తి కలుగదు. స్వార్థచింతతో భక్తి ప్రదర్శిస్తే అంగడి వ్యాపారం లాంటిదవుతుంది. “నేను ఇది నీకిస్తాను; ఓ స్వామీ! దీనికి మారుగా నాకు వేరొకటి ఇవ్వు” అనడమే! అప్పుడు ఆ స్వామి, ఇలా అంటాడు. “సరే, నీవు ఈ పని చేయి. చేయకపోతే నీవు మరణించిన తర్వాత నీపని పడతాను; జన్మజన్మకు, నిన్ను నిప్పులలో వేసే మలమల మాడుస్తాను; ఇంకా ఏమేమో చేస్తా.” ఇలాంటి క్షుద్రభావాలు మనలో ఉన్నంతకాలం, ఆ గోపికా ప్రేమోన్మాదస్థితి ఎలా అర్థమవుతుంది? “ఆహా! ఆ పెదవుల ముద్దు! ఒక్క ముద్దుచాలు! నీ ముద్దునందుకొన్నవానికి, నీ కోసమై తపన, ఆరాటం, క్షణక్షణం పెరిగిపోతూంటుంది. ఇతర వ్యసనాలన్నీ రూపుమాసిపోతాయి. నిన్ను తప్ప మరిదేన్నైనా అతడు ప్రేమించడమే మరచిపోతాడు! నిన్ను మాత్రమే ప్రేమతో స్మరిస్తూవుంటాడు! “ఔను! భోగాలపై మీకున్న ప్రేమను, పేరు కోసమై మీరు పడుతున్న ఆరాటాన్ని, ప్రఖ్యాతిపై మీకున్న క్షుద్రాపేక్షను ఈ జడ ప్రపంచ నీచాడంబరాలపై మీకున్న కోరికను పరిత్యజించండి; పూర్తిగా పరిత్యజించండి! అప్పుడే, అప్పుడు మాత్రమే, గోపికల ప్రేమ ఎలాటిదో మీకర్థం కాగలదు. సర్వార్పణం చేయక, అలాటి పవిత్ర ప్రేమకోసం ప్రయత్నించడం అతిసాహసమే అవుతుంది. మనస్సు పూర్తిగా పవిత్రమయ్యేవరకు, ఆ భక్తిమహత్త్వం మీకు తెలీదు. అయ్యయ్యో! స్త్రీ పురుష విభేదభావాలు, ధనకాంక్ష, కీర్తి కామం, అనుక్షణం హృదయంలో పొంగిపొర్లుతున్న ఈ నీచమానవులు గోపికల విశుద్ధప్రేమను, శ్రీకృష్ణావతార తత్త్వరహస్యాలను అర్థం చేసుకోవడానికి, అధిక్షేపించడానికి సాహసిస్తున్నారే! ఉత్తమతత్త్వ శాస్త్రమైన గీత సైతం ఈ భక్తి పారవశ్యానికి సాటికాదు. ఎందుకంటే, గీతలోని సాధకుడు, పరమావధిని చేరడానికి ఎలా నడవాలో, నెమ్మది నెమ్మదిగా నేర్చుకొంటున్నాడు. కాని, ఇక్కడనో? శిష్యులు, గురువులు, ఉపదేశాలు, గ్రంథాలు – భయం, దేవుడు, స్వర్గం సైతం – ఏకమైపోయే ప్రేమోన్మాదం! అనుభూతి పారవశ్యం!! ఆ స్థితిలో అన్నీ వదలివేయబడినాయి! మిగిలింది భక్తి ప్రమత్తత ఒక్కటే! అంతా మరచిపోయిన ఆ కాలంలో భక్తునికి ఈ ప్రపంచంలో భక్తుడు తప్ప మరేమీ కన్పించదు. ఎక్కడ చూచినా శ్రీకృష్ణుడే! ప్రతివాని ముఖమూ శ్రీకృష్ణవదనారవిందమే! తన ముఖం సైతం శ్రీకృష్ణునిదే! తన ఆత్మకూడ శ్రీకృష్ణమయమే! శ్రీకృష్ణభగవానుని మహత్త్వం అలాంటిది!
నలుసులను వెదకుతూ మీ కాలాన్ని వ్యర్థం చేసుకోకండి! జీవన సారమైన ప్రధాన ధర్మాన్ని చేపట్టండి! చారిత్రక భేదాలెన్నో ఉండొచ్చు; శ్రీకృష్ణుని జీవితకథలో అసంగత విషయాలెన్నో చొప్పించబడి ఉండవచ్చు. అయినా, వాని మూలాధారం ఏదో ఒకటివుండి తీరాలి! లేకపోతే, ఈ అత్యద్భుతమైన వినూత్నాదర్శం ఎలా ఉత్పన్నమైంది? ఇతర మహాపురుషుల, ప్రవక్తల జీవితాలను పరిశీలిస్తే ఆ మహాపురుషులు తమకు పూర్వం జరిగివున్న జ్ఞానప్రచారం యొక్క పరిణామఫలమే అనీ, వారు చేసే ఉపదేశాలు సైతం, ఆ కాలంలో దేశమంతటా వ్యాపించివున్న అజ్ఞాతభావాలు తప్ప మరేమీ కావనీ, మనకు స్పష్టపడుతుంది. “కర్మ కోసమే కర్మ; భక్తి కోసమే భక్తి; ధర్మం కోసమే ధర్మం!” అనే నవీనాదర్శాలు, శ్రీకృష్ణుని వలన ప్రభవించినవి కావని ఎవ్వరూ నిరూపించలేరని నేను ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. ఈ భావరత్నాలు ఎవరో ఒకరి వలన ప్రభవించినవే కదా? ఇంకెవరినుండి కానీ సంగ్రహించబడినవి కావు. శ్రీకృష్ణ జననకాలంలో అవి లేవు. అవి వాతావరణంలో ఎగురుతూ ఉండజాలవు కదా? శ్రీకృష్ణ భగవానుడే ప్రప్రథమంగా, వాటిని ఉపదేశించిన గురువు! వాని శిష్యుడైన వ్యాసమహర్షి, ఆ ఉపదేశాన్ని స్వీకరించి మానవులకందరికీ ప్రచారం చేశాడు. ఇది మీ మనసులలో చిత్రించుకోవలసిన పరమోత్కృష్ట భావం! మనం హృదయాల్లో నిలుపకోదగిన అత్యుత్తమ ధ్యేయమూర్తి గోపిజన వల్లభుడే! అంటే, బృందావన గోపికలకు ప్రియుడు. మీకు, ఆ అనురాగ పారవశ్యం కలిగినప్పుడు, ఆ గోపికల హృదయం నీకు అర్థమైనప్పుడు, ‘ప్రేమ’ అంటే ఏమో మీరు గ్రహించగల్గుతారు. లోకమంతా అదృశ్యమై, తదితర ఆలోచనలన్నీ సమసిపోయి, మీ మనసులు విశుద్ధమైనప్పుడు మాత్రమే – చివరకు ధర్మాన్వేషణం సైతం, మిమ్మల్ని విడిచి పోయినప్పుడు మాత్రమే – ఆ ప్రేమ పారవశ్యం, గోపికలకు లభించిన ఆ అఖండ ప్రేమ మహత్త్వం మీకు అలవడుతుంది. అదే అహేతుక ప్రేమ – “ప్రేమకోసం ప్రేమ” ; అంటే అదే గమ్యాలకంతటికీ పరమ గమ్యం! అది మీకు దొరికితే అంతా దొరికినట్లే!
అంతకంటే క్రిందికి దిగి, గీతోపదేశ కర్త అయిన కృష్ణుని దగ్గరికి వద్దాం. అయ్యో! భారతదేశంలో ఇప్పుడు గుర్రానికి ముందు బండి నుంచే వికట ప్రయత్నమొకటి సాగుతోంది! గోపికాప్రియునిగా శ్రీకృష్ణుని భావించడం, ఏదో ఒక వికృతకార్యంగా, మనవాళ్ళనేకమంది అభిప్రాయం! యూరపియన్లకు అది కొంచెం అసహ్యంగా ఉంటుందట! డాక్టర్ బిరుదు సంపాదించిన ఎవడో ఒక పిచ్చిపుల్లయ్యకు అది రోతగా ఉంటుందట! కాబట్టి గోపికల గోల విసర్జించి వేయవలసిందే! పాపం, యూరపియన్ల ఆమోదం లేకుండా కృష్ణుడు జీవించడమెలా? వానికి బ్రతుకుతెరువు లేదు! మహాభారతంలో ఒకటి రెండు చోట్లతప్ప గోపికల ప్రస్తావనేలేదు! ఆ సందర్భాలుకూడ అంత ప్రధానమైనవికావు. ద్రౌపది ప్రార్థనలలో బృందావన లీలల ప్రస్తావన ఉంది. శిశుపాలుని అధిక్షేపంలో ఈ బృందావన ప్రస్తావన ఉంది! కానీ ఇవన్నీ ప్రక్షిప్తమట! యూరపియన్లకు హితవుగానిదాన్ని దేన్నైనా, త్రోసివేయవలసిందే! గోపికల ప్రస్తావన, గోపాలకృష్ణుని ప్రశంససైతం ప్రక్షిప్తాలైపోతున్నాయి! ఆహా! వ్యాపార సంరంభంలో మునిగిపోయిన ఈ మహానుభావులు – మతధర్మాని సైతం వాణిజ్యానికొక అంగంగా చేసుకొన్న ఈ ఘనులు – ఇహంలో ఏదో చేసి, దాన్ని పట్టుకొని స్వర్గానికి ఎగబ్రాకాలని చూస్తారే? కోమటి చక్రవడ్డి – అంటే వడ్డీకి వడ్డి – రావలసిందే! ఇహంలో నిలువచేసుకొన్న దాన్ని అతడు పరంలో అనుభవించడానికి పన్నుగడ పన్నుతున్నాడు. ఆహా! అలాంటి భావక్షేత్రంలో గోపికలకు పాపం తావులేక పోవడం సత్యమేమరి!
ఆ బృందావన గోపికాప్రియుని దివ్యరూపాన్ని విడిచి, మనం క్రిందికి వచ్చి గీతాబోధకుడైన శ్రీకృష్ణుని క్షేత్రాన్ని చేరుదాం. వేదాలకు గీతను మించిన శ్రేష్ఠతర వ్యాఖ్యానం ఇంతవరకు రచించబడలేదు. రచించలేరు కూడా. భాష్యకారులు ఎందరో ఉన్నారు. ప్రతివాడూ తన మతానికి అనుకూలించే మార్గంలో అర్థాన్ని కల్పిస్తూ వస్తూండటంవల్ల శ్రుతుల యొక్క అంటే – ఉపనిషత్తులయొక్క తత్త్వసారాన్ని గ్రహించడం అత్యంత దుర్లభమైపోయింది. కాబట్టి, అప్పుడు శ్రుతులను ప్రసాదించిన, ఆ దేవదేవుడే, ఆ శ్రీహరియే గీతోపదేశకుడుగా, వాని అర్థాన్ని మనకు బోధపరచడానికి మరల అవతరించాడు. వాని వ్యాఖ్యానపద్ధతిని మించి ఏదీ భారతీయులకీనాడు అక్కర్లేదు. ప్రపంచానికికూడ అంతకుమించి ఆవశ్యకమైంది ఏదీలేదు. తర్వాతికాలంలో మన శాస్త్రాలకు అర్థం చెప్పబూనినవారు గీతకు సైతం వ్యాఖ్యానం చేయదలచి, అనేక స్థలాల్లో అర్థాన్ని గ్రహించలేక తికమకపడ్డారు. అనేక సందర్భాల్లో భావసరళిని గుర్తింపజాలకపోయారు. ఎలా అంటారా? గీతలో కనిపించేదేమి? ఈ నూత్నభాష్యకర్తలలో కనిపించేదేమి? ఒకానొక అద్వైత భాష్యకారుడు ఒక ఉపనిషత్తును తీసుకొంటాడు; అందులో ద్వైతపరమైన వాక్యాలనేకముంటాయి. అతడు వానిని మెలిపెట్టి, నలిపి, ఏదో అర్థాన్ని తీస్తాడు. అన్ని వాక్యాల్లో తనకు హితవైన అర్థాన్నే తీయడానికి బ్రహ్మప్రయత్నం చేస్తాడు. ద్వైతి అయిన భాష్యకారుడు వస్తే, అన్నిటికి ద్వైతపరంగా అర్థం చెప్పడానికై అద్వైత భావంగల అనేక వాక్యాలను నలిపి నలిపి హింసలపాలుచేస్తాడు. కాని గీతలో మాత్రం ఉపనిషద్వాక్యాన్ని ఒక్క దాన్నైనా, మెలిపెట్టి హింసించే ప్రయత్నం కానరాదు. ఆ వాక్యాలన్నీ ఉత్తమమైనవే! “నెమ్మదిగా, క్రమక్రమంగా, స్థూలంనుండి సూక్ష్మానికి, సూక్ష్మంనుండి సూక్ష్మతరానికి, మెట్టు తర్వాత మెట్టుగా, జీవాత్మ తన పరమగమ్యమైన అఖండ బ్రహ్మం చేరేవరకు, పైపైకి ఎక్కిపోతూంటాడు” అని, శ్రీకృష్ణభగవానుడు పలుకుతున్నాడు. గీతలో తెలుపబడిందిదే! ఇంకా, కర్మకాండ కూడ గీతలో అంగీకరించబడింది. అది ప్రత్యక్షఫలంగా, మోక్షం నీయజాలకున్నా, పరోక్షసాధనం కాగలదు; కాబట్టి అదికూడ యోగ్యమైనదే అని తెలుపబడింది. విగ్రహాలు పరోక్షంగా ఫలప్రదాలే. చిత్తశుద్ధి ఉంటే, క్రతువులు, ఆచారాలు, అన్నీ ఉపకారికమే! అర్చనలు యోగ్యమైనవే! గమ్యాన్ని చేర్చగల్గేవే! హృదయం పవిత్రంగా, నిష్కపటంగా మాత్రం ఉండాలి! వివిధములైన పూజావిధానాలు అవసరమే! కాకపోతే అవి పుట్టిఉండవు. ఆధునికులలో కొందరు భావించేటట్లు, ఈ మతాలు, సంప్రదాయాలు, ఏదో కొంత డబ్బు సంపాదించుకొనే నిమిత్తం మోసగాళ్ళు సృష్టించిన తంత్రజాలాలు మాత్రంకావు. వారి వాదం ఎంత యుక్తి యుక్తంగా కనిపించినా, అందులో సత్యంలేదు. ఇవి, ఆ విధంగా కల్పించబడినవి ఎంతమాత్రం కావు. ఇవి మనిషి ఆత్మయొక్క అవసరాలనుబట్టి కలిగినవే! భిన్నదశలలోవున్న మనిషి కోరికలను, పిపాసలను తృప్తిపరచడానికే ఇవి ఏర్పడ్డాయి. వీనికి విరుద్ధంగా మీరు ప్రచారాన్ని సాగించనవసరం లేదు. అవసరం తొలగిపోయినప్పుడు, దానితోపాటు ఇవికూడ తొలగిపోతాయి! కాని, ఆ అవసరమున్నంత వరకు, మీరెంతగా ప్రచారం సాగించినా, ఎంతగా విమర్శలు చేసినా, ఇవి నిలిచి ఉండవలసిందే! మీరు కత్తులతో తెగవేయండి! ఫిరంగుల్ని ప్రయోగించండి. ప్రపంచాన్నంతా నరరక్తంతో ముంచేయండి; కాని విగ్రహాలు అవసరమైనంతవరకు వుండి తీరుతాయి. ఈ ప్రతిమలు, మతంలోని ఈ అంతరాలు అన్నీ నిలిచే ఉంటాయి. అవి అలా నిలిచివుండవలసిన కారణం శ్రీకృష్ణభగవానుడు చెప్పేవున్నాడు!
భారతదేశ చరిత్రలో కొంచెం విషాదకరమైన ప్రకరణానికిప్పుడు మనం రావలసివుంది. వేర్వేరు తెగల పోరాటాల అలజడి కొంతదూరంలో గీతలోనే మనకు వినవచ్చింది. వాటికి సఖ్యత కూర్చడానికై సామరస్యాన్ని ఉపదేశించే మహాగురువుగా, సౌహార్దాన్ని ప్రచారంచేసే ప్రబోధకుడుగా, శ్రీకృష్ణభగవానుడు నిలబడుతున్నాడు. “మయి సర్వమిదం పోతం, సూత్రే మణి గణాఇవ” (ఆయా తెగలన్నీ, దారంపైని ముత్యాలలాగా నాలో కూర్చబడివున్నాయి.) అని ప్రకటిస్తున్నాడు. అవిగో, మళ్ళీ, దూరం నుండి ధ్వనులు, వివాదాల కలకలం వినబడుతున్నాయి. కొంతకాలం శాంతి సామరస్యాలున్నాయి కాబోలు! ఆ తర్వాత మత భేదాలవల్లనే కాక, కులభేదాలవల్లకూడ వైరం సాగుతున్నట్లుంది! మన సంఘంలో రాజు లొకవైపున, బ్రాహ్మణు లొకవైపున యుద్ధసన్నద్ధులై నిలిచివున్నారు. చూస్తూండగానే వారికి పోరాటంసాగి, క్షణంలో విజృంభించింది. దాదాపు వేయి సంవత్సరాలకాలం భారతదేశాన్ని ముంచేసిన, ఒక ఉత్తుంగ సముద్రతరంగ శిఖరంలో దేదీప్యమానంగా వెలుగుతూ, ఇంకోమూర్తి ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ఎవరో కాదు. మన గౌతమ శాక్యముని! ఆయన బోధలు, ఉపదేశాలు, మీకందరికీ తెలుసు! ప్రపంచంలో ఇంతవరకు అవతరించిన ధర్మప్రచారకులలో అత్యుత్తముడు, అతిసాహసికుడు అయిన ఈ కర్మయోగిని శ్రీహరి అవతారంగా, మనం పూజిస్తున్నాం. తనకుతానే శిష్యుడై అవతరించాడో అన్నట్టుగా, ఆ శ్రీకృష్ణభగవానుడే తన బోధనలను, ఆచరణలో పెట్టడమెలాగో చూపడానికో అన్నట్లు మళ్ళీ వచ్చాడు. గీతలో, ఇలా బోధించిన ఆ కంఠస్వరమే మళ్ళీ వినబడింది.
“స్వల్ప మప్యస్య ధర్మస్య
త్రాయతే మహతో భయాత్–”
(ఈ ధర్మాన్ని స్వల్పంగా నిర్వహించినా, అది మహాభయం నుండి కాపాడుతుంది.)
“స్త్రీయో, వైశ్యా స్తథా శూద్రా
స్తేఽపి యాంతి పరాంగతిమ్–”
(స్త్రీలు, వైశ్యులు, శూద్రులు సైతం, పరమపదాన్ని పొందగలరు.)
అందరి బంధాలను త్రెంచేసి, అందరి శృంఖలాలను ఛేదించి, సర్వ జనులకు, పరమపదాన్ని చేరే స్వాతంత్ర్యం ఉందని గీతావచనరూపంలో ఇలా ప్రకటించిన శ్రీకృష్ణభగవానుని ఆ కంఠస్వరమే, మేఘగంభీర ధ్వనులతో, దశదిశల్లో మళ్ళీ మారుమ్రోగింది.
“ఇహైవ తై ర్జిత స్సర్గో
యేషాం సామ్యే స్థితం మనః ।
నిర్దోషం హి సమం బ్రహ్మ
తస్మా ద్బ్రహ్మణి తే స్థితాః–”
(సమత్వంలో స్థిరంగావున్న మనసు కలవారు ఈ జన్మలోనే సంసారాన్ని జయిస్తున్నారు; అంటే మోక్షాన్ని పొందుతున్నారు. కారణమేమంటే, బ్రహ్మం నిష్కళంకం, సర్వసమం. కాబట్టి వారు బ్రహ్మమునందే స్థిరపడుతున్నారు.)
“సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం ।
న హి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిమ్ ॥”
(ఎవడు ఈశ్వరుని సర్వత్ర, సమభావంలో ఉన్నట్లు చూస్తాడో, అతడు ఆత్మను ఆత్మతో హింసించడు. కాబట్టి పరమగతిని – అంటే మోక్షాన్ని పొందుతున్నాడు.)
ఈ గీతాబోధకు సజీవ నిదర్శనాన్ని చూపడానికో అన్నట్లు అందొక అంశాన్నైనా ఆచరించి చూపడానికో అన్నట్లు, ఆ ఉపదేశకుడే వేరొక రూపంతో మళ్ళీ వచ్చాడు. దీనులను, పేదలను దరిజేర్చి, ధర్మోపదేశం చేసిన శాక్యముని అతడే! ప్రజల హృదయాలను చూరగొనడానికై ఈయన, దేవభాషను విడిచి జనసామాన్యభాషలో బోధలు చేశాడు; బిచ్చ గాండ్రతో, నిరుపేదలతో, దిక్కులేనివారితో, కలిసి జీవించడానికై తన సింహాసనాన్ని త్యాగం చేశాడు. పూర్వం శ్రీరామావతారంలో చేసినట్లు ఇంకోసారి పంచముని తన కౌగిట నిలుపుకొన్నాడు!
ఆయన చేసిన ఘనకార్యాలు, ఆయన ఉత్తమశీలం, మీకందరికీ తెలుసు. అయినా, ఆ కార్యాలలో ఒక గొప్ప లోపముంది. అందువల్లనే, ఈనాడు మనమిలా కష్టాలపాలౌతున్నాం. అందులో బుద్ధభగవానుని దోషంలేదు. ఆయన పరమ పవిత్రుడు. మహిమోన్నతుడు. కాని అప్పుడు ఆర్య సంఘంలోనికి చొరబడివచ్చిన అనాగరికులు, మూఢులు, అయిన ఆయా జాతులవారు, అలాంటి ఉత్తమాదర్శాలను జీర్ణం చేసుకోలేక పోయారు! నానావిధాలైన మూఢవిశ్వాసాలు కల్గి, తుచ్ఛదేవతారాధనలను చేసే ఈ జాతులవారు, ఆర్యసంఘంలోనికి రివ్వున ప్రవేశించారు. కొంత కాలంవరకు వీరు నాగరికులలాగే కన్పించారు. కాని, ఒక శతాబ్దమైన గడవకముందే, తమ పూర్వులు పూజించిన పాములు, భూతాలు, మొదలైన వానిని మతంలో ప్రవేశపెట్టారు. అందువల్ల భారతదేశమంతా అధోగతిలో పడి, మూర్ఖజన సంకీర్ణమైపోయింది. బౌద్ధులు జంతువధలను చూచి, ఆగ్రహంపూని వైదిక యజ్ఞాలను ఖండించారు. ఈ యజ్ఞాలు ప్రతిఇంట్లో జరిగేవి. ఇంటింటా ప్రజ్వలితాగ్ని ఉండేది. వారి పూజా కలాపమంతా ఇంతే! అలాంటి యజ్ఞాలు రూపుమాసిపోయాయి. వాటి స్థానంలో మహాశోభాయమానములైన దేవళాలు, వైభవోపేతాలైన కర్మలు, భోగపరాయణులైన అర్చకులు, ఇంకా, ఈ కాలంలో భారతదేశంలో కనిపించే సర్వాడంబరాలు వచ్చిచేరాయి. బుద్ధుడు, వైదికసాంప్రదాయకములైన విగ్రహాలను ధ్వంసం చేశాడని ఇటీవల కొందరు వ్రాసిన గ్రంథాలను చదివితే నాకు నవ్వొచ్చింది. బౌద్ధమతమే బ్రాహ్మణ సంప్రదాయాన్ని, విగ్రహారాధననుకూడ భారతదేశంలో సృష్టి చేసిందని పాపం వాళ్ళకు తెలీదు.
ఒకటి రెండు సంవత్సరాల క్రింద రష్యా దేశీయుడొకడు ఒక గ్రంథం వ్రాశాడు. ఆయన, ఏసుక్రీస్తుయొక్క అతివిచిత్రమైన జీవితకథ నొకదాన్ని తాను కనిపెట్టినట్లు ఆ పుస్తకంలో తెలిపాడు. ఆ గ్రంథంలో ఒక భాగంలో క్రీస్తు బ్రాహ్మణుల దగ్గర జ్ఞానార్జనం చేయడానికై జగన్నాథాలయానికి వెళ్లినట్లు, బ్రాహ్మణులితరులయెడ చూపే అసహన భావాన్ని, వారి విగ్రహాలను చూచి. అసహ్యించుకొని, టిబెట్టు దేశంలోని ‘లామా’ ల దగ్గరికివెళ్ళి సిద్ధిని సాధించి, ఇంటికి మరలినట్లు ఆయన అందులో వ్రాశాడు. భారతదేశచరిత్ర తెలిసిన ఏ బాలునికైనా, ఈ విషయమంతా వట్టి అబద్ధమే అని, ఆ వ్రాతలవల్లనే తెలుస్తుంది. ఎందుకంటే, జగన్నాథంలోని ఆలయం ప్రాచీన బౌద్ధాలయమే కదా? ఈ ఆలయాన్ని ఇంకా కొన్నిటిని మనం తర్వాతికాలంలో మళ్ళీ హిందూ దేవాలయాలుగా మార్చాం. ఇలాంటి కార్యాలను మనం ఇంకా చాలాచేయాలి! జగన్నాథంలో ఆ కాలంలో ఒక బ్రాహ్మణుడైనా లేడు. అయినప్పటికీ, అక్కడి బ్రాహ్మణుల దగ్గర చదువుకోడానికి ఏసుక్రీస్తు వచ్చాడని చరిత్ర పరిశోధకుడైన ఈ ఘనుడు చెబుతున్నాడు.
జీవకారుణ్యాన్ని ఎంత బోధించినా, మహోదాత్తమైన నీతి ధర్మాలను ఎంత ప్రకటించినా, నాశంలేని ఆత్మ ఒకటి ఉందా లేదా అనే సూక్ష్మ వివాదాలను ఎన్ని సాగించినా, బౌద్ధమత సౌధం ఈ విధంగా నేలకూలి, ముక్కలు ముక్కలైపోయింది. ఆ జీర్ణావస్థ చాలా బీభత్సరూపమైంది. బౌద్ధమత నాశనం నాటి బీభత్సదశను వర్ణించడానికి ఇప్పుడు వ్యవధిగాని, అభిలాషగాని నాకు లేదు. కాని, ఒక్కమాట. అతినీచమైన కర్మకలాపాలు, అసహ్యమైన దురాచారాలు ఎన్నో బౌద్ధమతం పేరిట వెలశాయి. కొన్ని బౌద్ధగ్రంథాలలో కనిపిస్తున్నంతటి బూతులు ఇంతవరకు ఏ మానవబుద్దీ ఊహించి ఉండదు; ఏ మానవహస్తమూ వ్రాసివుండదు. అవి అంత దుర్భరంగా, ఘోరంగా ఉన్నాయి. అవి శుభ్రమైపోయిన బౌద్ధధర్మంలో తల ఎత్తిన సృష్టి.
అయినప్పటికీ భారతదేశం బ్రతికి ఉండవలసింది కావడంచేత, ఈశ్వరుడు, మరొక్కసారి అవతరించాడు. ధర్మం క్షీణించినప్పుడంతా, అవతారం ధరించి వస్తానని చాటిచెప్పిన భగవానుడు మరల వచ్చాడు. ఈమారు, దక్షిణదేశంలో అవతారమెత్తాడు. తన పదహారవ యేటనే, గ్రంథాలన్నీ వ్రాసి, ప్రసిద్ధి గాంచిన ఆ బ్రాహ్మణ బాలుడు, ఆనాడు వ్రాసిన గ్రంథాలను ఈనాడు ప్రపంచమంతా, విస్మయచకితమై, అద్భుతావిష్టమై చూస్తున్నది. ఆ బాలుడు నిజంగా అలాంటి వాడే! అతడు, భారతదేశాన్ని పూర్వపు నిర్మల స్వేచ్ఛ దశకు తీసుకొనిరావాలని ప్రయత్నించాడు. ఆయన పూనిన ఈ మహోద్యమం, ఎంతటిదో మీరు ఊహించుకోండి! ఆయన అవతరించే సమయానికి, భారతదేశం ఎలాంటి కల్లోల పరిస్థితుల్లో ఉన్నదో కొంతవరకు మీకిప్పుడు చెప్పాను. మీరిప్పుడు సంస్కరించబూనిన ఘోరదోషాలన్నీ ఆ పతనావస్థ ఫలితాలే! తార్తారులు, బెలూచీలు మొదలైన ఘోరజాతులు భారతదేశానికి వచ్చి బౌద్ధులైపోయారు; మనలో కలిసిపోయారు. నెమ్మదిగా, వారి జాతీయాచారాలను, మనలో చొప్పించారు. అందువల్ల మన జాతీయ జీవనమంతా, ఘోర, బీభత్స దురాచారభూయిష్టమైపోయింది. బౌద్ధులనుండి ఆ బాలుడు సంపాదించుకొన్న పిత్రార్జిత మిది! ఆనాటినుండి ఈనాటివరకు, భారతదేశాన జరుగుతున్న కృషి అంతా, వేదాంత ధర్మసహాయంతో బౌద్ధపతానవస్థ నుండి దేశాన్ని మళ్ళీ పునరుద్ధరించడమే! అది ఇంకా జరుగుతూనే ఉంది. శ్రీ శంకరులు మహాతత్త్వవేత్తయై అవతరించి, బౌద్ధ వేదాంతమతాల సత్యతత్త్వార్థాలు అంతగా వేరుకావనీ, శిష్యులు, గురువు బోధను అర్థం చేసుకోజాలక, పతితులైపోయి, జీవుడు లేడనీ, దేవుడు లేడనీ వాదిస్తూ, నాస్తికులై పోయారనీ, రుజువుచేసి లోకానికి చాటిచెప్పారు. అప్పుడు, బౌద్ధమతస్థులంతా, వెనుకటి మతంలోనికి తిరిగి రాసాగారు. కానీ వారప్పటికే, ఈ దురాచారాలెన్నిటికో అలవాటుపడ్డారు. చేయగలిగిందేముంది?
అటు తర్వాత, తేజోవైభవమూర్తి అయిన శ్రీరామానుజులు ఉద్భవించారు. శంకరాచార్యులకు మహోజ్జ్వల బుద్ధివైభవంతో సమమైన హృదయవైశాల్యం లేదని నా భావం. రామానుజాచార్యుల హృదయం మహోదారమైంది. పీడితులకోసం ఆయన హృదయం బాధపడింది. వారి పట్ల ఆయనకు సానుభూతి కలిగింది. అప్పటికి దేశాచారాలలో కలిసిపోయి, అంతటా విజృంభిస్తున్న కర్మకలాపాలను ఆయన సాధ్యమైనంత వరకు సంస్కరించి పవిత్రం చేశాడు. ప్రజలకు అత్యవసరమైన క్రొత్త కర్మలను, పూజాకలాపాలను ఏర్పరచాడు. ఇదికాక ఉత్తమాధ్యాత్మిక పూజావకాశాన్ని బ్రాహ్మణుడు మొదలు మాలవాని వరకు, ప్రతివానికీ కల్పించాడు. ఇదే శ్రీరామానుజులవారు చేసిన గొప్పపని! ఆ ఉద్యమం ఉత్తరముఖంగా పురోగమించి, క్రమక్రమంగా, ఉత్తరభారతమంతా వ్యాపించింది. ఆ తర్వాత, మహమ్మదీయ పరిపాలనకాలంలో అక్కడి మహానాయకులు కొందరు దాన్ని చేపట్టారు. ఉత్తరదేశపు నవీన ప్రవక్తలలో, దీన్ని చేపట్టిన మహనీయులలో మహోజ్వల బుద్ధిసంపన్నుడు శ్రీ చైతన్యులవారు.
శ్రీరామానుజులవారి కాలంనుండి ఒక విశేషం మీరు గుర్తించవచ్చు. ప్రతివానికీ, ఆధ్యాత్మిక సాధనకు అవకాశం కల్పించబడింది. శంకరాచార్యులవారికి ముందున్న ప్రవక్తలందరూ, ఈ ధర్మాన్నే పాటించారు. రామానుజులకు తర్వాత వచ్చిన ప్రవక్తలకుకూడ అదే ధర్మసూత్రమై వెలసింది. శంకరాచార్యులవారు ఈ విషయంలో అంగీకారంలేనివారు, అనే ప్రతీతికి కారణమేమో నేను గ్రహించలేకున్నాను. అలాంటి ప్రాతికూల్యం వారి గ్రంథాలలో ఎక్కడా నాకు కన్పించడం లేదు. శంకరాచార్యులవారి బోధలలో లోకానికి ఇట్టి భావం ఉండటానికి కారణం చాలావరకు బుద్ధభగవానుని విషయంలో లాగే, వారి శిష్యుల అసమర్థతే అని నా భావన! ఉత్తరభారతదేశ సిద్ధపురుషుశేఖరులైన శ్రీచైతన్యులవారు, పురాణకాలంనాడు, గోపికలలో కనబడిన ప్రేమోన్మాదానికి మూర్తీభావమై వెలశారు. ఆయన బ్రాహ్మణుడు. ఆ కాలంలో తర్కానికి ప్రసిద్ధిపొందిన సద్వంశంలో జన్మించిన వాడు. తర్కశాస్త్రంలో మహావిద్వాంసుడు. తర్కశాస్త్ర బోధకుడు. జగద్విజయం సాధించిన తార్కికాగ్రగణ్యుడు. తర్కజ్ఞానమే జీవితానికి పరమ గమ్యమని బాల్యంనుండి నేర్చుకొన్నాడు. అయినా ఒక మహాత్ముని కరుణవల్ల ఆయన జీవితమంతా మారిపోయింది. వాగ్వాదాలను, తర్కవిద్యాగురుపదవులను పరిత్యజించాడు! లోకంలో భక్తి ప్రబోధం చేసిన గురువులందరిలోకి అగ్రగణ్యుడయ్యాడు! వెర్రి చైతన్యుడను పేరు పొందినాడు! వారి భక్తి వంగభూమి అంతటా వ్యాపించి, ప్రతివానికీ, భవక్లేశోపశాంతిని కలిగించింది. అతని ప్రేమకు హద్దులులేవు. పుణ్యపురుషుడుకానీ, పాతకికానీ, హిందువుకానీ, మహమ్మదీయుడుగానీ, పవిత్రుడుకానీ, అపవిత్రుడుకానీ, వీధికెక్కిన వెలయాలుకానీ, అందరూ, వారికి ప్రేమపాత్రులే! అనుగ్రహపాత్రులే! కాలక్రమాన అన్నీ భ్రష్టమై పోయినట్లే, ఇతని సంప్రదాయంసైతం, చాలా వరకు ఈనాడు, భ్రష్టమైపోయినప్పటికీ కూడ, పేదవారికి, పతితులకు, దుర్బలులకు, కులభ్రష్టులకు, సంఘబహిష్కృతులకు, అందరికీ శరణమైంది.
కాని సత్యంకోసం ఒక్క విషయాన్ని నేనిక్కడ చెప్పవలసివుంది. వేదాంత మతావలంబులలో అద్భుతమైన భావవైశాల్యం కనిపిస్తుంది. శంకరాచార్యుల వారిని బాగా అర్థంచేసుకొన్న వాడెవ్వడైనా, భారతదేశంలోని వివిధ సంప్రదాయాలన్నీ నిజంగా విభిన్నాలని చెప్పడు. అలా అయినప్పటికీ, శంకరులు, కుల తారతమ్యాలను పాటించడంలో గట్టి పట్టుదల కలవాడు. ఇక వైష్ణవగురువులో, కుల విషయక సమస్యలలో మహోదార్యం, మత విషయక సమస్యలలో అసహనభావం ప్రదర్శించారు.
వీరిలో ఒకరికి అద్భుత బుద్ధిబలం, రెండోవారికి అద్భుత హృదయ వైశాల్యం ఉన్నాయి. అలాంటి బుద్ధిని, అలాంటి హృదయాన్ని రెండూ కలిగిన ఒక మహానుభావుడు, జన్మించవలసిన కాలం వచ్చింది. ధగద్ధగితమైన శంకరుని బుద్ధి విశేషాన్ని, అద్భుతమైన చైతన్యుని అఖండ విశాలహృదయాన్ని, ఒకే శరీరంలో కూర్చుకొని ఒకరు అవతరించడానికి కాలం పరిపక్వమైంది. ప్రతి సంప్రదాయాన్ని భావించేది ఒకే ఆత్మ, ఒకే దైవం, అని అనుకొన గల్గినవాడు, ప్రతిజీవిలో భగవంతుని సాక్షాత్కరింపజేసుకొన గల్గినవాడు, పేదలకోసం, దుర్బలులకోసం, పీడితులకోసం, సంఘభ్రష్టులకోసం, ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా ప్రతివానికోసం ఆరాటపడి, సానుభూతితో తపించిపోయే హృదయం కలవాడు; ఒక్క భారతదేశంలోనే కాక, ప్రపంచమంతటా, నిరంతరం, ఒక దానితో ఒకటి పోరాడుకొంటున్నా, అన్ని మత సంప్రదాయాలకూ, అద్బుత సామరస్యం కల్గించే మహోత్కృష్టభావాలను సంకల్పించగల మహోజ్జ్వల బుద్ధివైభవం కలవాడు; బుద్ధి హృదయ సమ్మేళనంగల సార్వలౌకిక మతాన్ని కల్పించే శక్తిగలవాడు; అవతరించే సమయం వచ్చింది. అలాంటి పురుషోత్తముడొకడు ఈ లోకంలో అవతరించాడు. అలాంటి వ్యక్తి పాదారవిందాల చెంత సంవత్సరాల తరబడి కూర్చునే మహాభాగ్యం నాకు లభించింది. కాలం పరిపక్వమై, అలాంటి మహాపురుషుడు అవతరించవలసి వచ్చింది. కాబట్టి, ఆయన అవతరించాడు. ఇందులో ఒక విశేషముంది. పాశ్చాత్యుల అభిప్రాయాలతో, పాశ్చాత్య భావాలతో, నిండి కైపెక్కిపోయిన ఒక మహానగర సమీపంలో ఆయన అవతరించాడు. భారతదేశంలోని ఇతర నగరాలన్నిటినీ మించి, కరుడుగట్టిన యూరోపీయన్ సంప్రదాయాలతో, మదించిపోయిన ఆ మహానగర ప్రాంతంలోనే ఆయన జీవితకార్యం జరిగింది. పుస్తక జ్ఞానమన్నది ఎరుగక, అక్కడ ఆయన నివసించాడు. ఈ మహామేధావికి, తన పేరును వ్రాయడంకూడ చేతకాదు. అయినా, మన విశ్వవిద్యాలయాలనుండి వెలువడే, అద్భుతధీమంతులైన పట్టభద్రులు సైతం, ఆయనను మహామనీషాగ్రగణ్యునిగా తలదాల్చారు. ఈ శ్రీరామకృష్ణ పరమహంస అద్భుత చరిత్రుడు. ఆయనను గూర్చి చెప్పడానికి చాలాకాలం పడుతుంది. అంత అవకాశం నాకిప్పుడు లేదు. హైందవ మహాపురుషులలో సిద్ధమూర్తి అయి, ఆధునిక యుగప్రవక్తయై వెలసిన ఆ శ్రీరామకృష్ణుని పేరునుమాత్రం ఇపుడు స్మరిస్తాను. ఆయన ప్రబోధం ప్రస్తుతకాలంలో ఎంతైనా శ్రేయస్కరం. ఆ మహాపురుషునిలో దాగివున్న దివ్యశక్తిని గుర్తించండి. ఒక పేదపురోహితుని కుమారుడు; ఏదో ఒక మారుమూల పల్లెలో పుట్టినవాడు; ఊరు పేరులేని ఈ వ్యక్తి, ఈనాడు యూరప్‌లో, అమెరికాలో వేలకొద్దీ జనంచేత యదార్థంగా పూజించబడుతున్నాడు. రేపింకా లక్షలాదిగా, ఆయనను పూజిస్తారు. భగవత్సంకల్పం ఎలాంటిదో ఎవరికెరుక?
సోదరులారా! ఇప్పుడు, ఈశ్వర సంకల్ప ప్రచారరీతిని మీరు చూడజాలకుంటే, మీరు గుడ్డివారే, జన్మాంధులే! ఇంకో అవకాశం దొరికితే, ఈ మహాపురుషుని గురించిన వివరాలను పూర్తిగా చెబుతాను. నేనిప్పుడు ఏ సత్య వచనాన్నైనా మీకు బోధించివుంటే, అది ఆయనది, ఆయనదే అనీ; సత్యంకాని, సక్రమంకాని, లోకోపకారకంకాని, ఏ విషయం చెప్పినా, అది నాదే అనీ, దాని బాధ్యతంతా నాపైనే ఉందనీ, మాత్రం ఇప్పుడు మనవి చేస్తున్నాను.