శ్రీశ్రీశ్రీ వివేకానందస్వాములవారు మద్రాసు (చెన్నై) చేరినప్పుడు శ్రీవారికొక స్వాగతపత్రం మద్రాసు సన్మానసంఘంవారు సమర్పించారు. అది ఇలా ఉంది.
పూజనీయులైన ఓ స్వామీ!
శ్రీవారు పాశ్చాత్య ప్రపంచంలో మతప్రచారం సాగించి, తిరిగి వచ్చే ఈ సమయాన మద్రాస్‌లోని మన హిందూమతస్థుల తరపున తమకు మేము హృదయపూర్వక స్వాగతాన్ని సమర్పిస్తున్నాం. ఈ స్వాగతపత్రంలో శ్రీవారి సమక్షానికి మేము రావడంలో మా ఉద్దేశం కేవలం ఔపచారిక కార్యకలాపాన్ని జరపడానికి మాత్రమే కాదు. భారతదేశంయొక్క అతిఉత్కృష్టమతాదర్శాలను ప్రచారం చేయడంద్వారా, శ్రీవారు చేసిన లోకోపకారాన్ని గురించి మా హృదయాలలో నిండివున్న భక్తిని సమర్పించడానికీ, మా కృతజ్ఞతను తెలియజేయడానికీ వచ్చాం.
అఖీల మతమహాసభ షికాగో నగరంలో ఏర్పాటైన సమయంలో పూజనీయమైన మన ప్రాచీనమతాన్ని అమెరికా జాతివారికీ, వారి ద్వారా విశాల పాశ్చాత్య ప్రపంచానికంతటికీ అర్హమార్గాన ప్రకటనం చేసే నిమిత్తం ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారా! అని మన దేశీయులలో కొందరికి సహజంగా ఆందోళన కలిగింది. అదృష్టవశాత్తు మేము మిమ్మల్ని కలుసుకోవడం అవసరం వచ్చినపుడు ధర్మసంస్థాపనలో సాయపడవలసిన పురుషుడు ప్రత్యక్షమవుతాడని, నానాజాతి చరిత్రలలో తరచుగా రుజువైన సత్యాన్ని మరొకసారి అనుభవానికి తెచ్చుకోవడమూ తటస్థించింది. అఖీల మత మహాసభలో హిందూమత ప్రబోధాన్ని చేయడానికి మీరు ఒప్పుకొన్నప్పుడు, మీ సామర్థ్యాన్ని తెలిసిన కారణాన ఆ గొప్పదైన అఖీలమత మహాసభలో తన ప్రతినిధివల్ల హిందూమతం అతిసమర్థంగా ప్రతిపాదించబడుతుందని మాలో చాలామంది అభిప్రాయపడ్డారు. హిందూమత సిద్ధాంతాలను మీరు ప్రకటించిన విధం సుస్పష్టం, నిర్దుష్టం, ప్రామాణికమై ఆ మత మహాసభలో ఉన్నవారికి చక్కగా నచ్చడమేకాక, మన హైందవ తత్త్వశాస్త్ర సముద్రంనుండి అమృత జీవరసం, ప్రేమరసాలను మాటిమాటికి చేకొనవచ్చునని పరదేశంలోని స్త్రీ పురుషులు ఎందరో గ్రహించేలా చేసింది. తత్ఫలితంగా ఈ భూమండలంలో ఇదివరకెన్నడైనా సంభవించిన దానికంటె విశాలతరం, పరిపూర్ణం, పవిత్రం అయిన మానవ పరిణామం ఏర్పడగలదు. ఆ ప్రపంచ మతమహాసభలో ప్రతినిధులై చేరినవారికి మత సమన్వయాన్నిగూర్చీ, విశ్వసౌందర్యాన్నిగూర్చీ బోధించి విశ్వజనీనమై, సర్వశరణ్యమైన హిందూమత సిద్ధాంతం దృగ్గోచరమయ్యేలాగ చేసినందుకు మేం ముఖ్యంగా శ్రీవారిపట్ల కృతజ్ఞుల మవుతున్నాం. సత్యమును, పావనత్వమును, ఏ ప్రత్యేక దేశానికిగాని, జాతికి గాని, శాస్త్ర సిద్ధాంతానికిగాని, సంప్రదాయానికిగాని, అనన్య సంపద అని పట్టుపట్టడానికీ, ఏ మతంగానీ, ఏ తత్త్వసిద్ధాంతంకానీ, తక్కిన వానినన్నిటినీ తిరస్కరించి నాశనంచేసి ప్రత్యేకంగా వర్ధిల్లగలదని అభిప్రాయపడటానికీ ఇకమీదట, విజ్ఞానవంతులు, శ్రద్ధావంతులు అయినవారికి సాధ్యపడదు. శ్రీమద్భగవద్గీతా హృదయంలో మనోహరంగా వున్న సర్వసమాదరణ భావాన్ని చక్కగా విశదం చేసిన మీ మృదుమధుర భాషణమే ఇందుకు ఆధారంగా ఉదహరించాలి: “సమస్త మతచరిత్ర – ఆయా భిన్న దశలలో, భిన్నపరిస్థితులలో ఒకే పరమగమ్యం వైపునకు మానవులు సాగించే ప్రస్థానం.”
మీకు అప్పగించిన ఉత్తమం, పవిత్రం అయిన కర్తవ్యాన్ని మాత్రం నిర్వహించి మీరు సంతృప్తులై వున్నాకూడ, మీ ఘనకార్యంలోని అమూల్య ప్రయోజనాన్నిగూర్చి, మన హిందూమతస్థులు సంతోషంతో, కృతజ్ఞతతో మిమ్మల్ని చాలా ఉత్సాహంతో అభినందించి వుంటారు. కానీ పాశ్చాత్య దేశాలలో మీరు ప్రవేశించిప్పుడు సనాతన హిందూమతంలోని ప్రాచీన బోధన నాధారంచేసికొని, అఖీల మానవజాతికీ విజ్ఞానశాంతి సందేశాలను సైతం మీరు అందించారు. వేదాంతమత పూర్ణప్రామాణికతను నిలబెట్టడానికి మీరు చేసిన మహోపకారానికై మీకు వందనాలు అర్పిస్తున్నాం. అదే సమయంలో మన మతాన్ని మన తత్త్వశాస్త్రాన్ని ప్రచారంచేసే నిమిత్తం సుస్థిరమైన కేంద్ర స్థానాలను నిర్మించే తీవ్రప్రచారం సాగించడమనే మహోద్దేశాన్ని ప్రశంసించి ఆనందిస్తున్నాం. మీ సర్వ శక్తులను సమర్పణచేయ సమకట్టిన ఉద్యమం, మీరు అభిమానించిన పవిత్ర సంప్రదాయాలకూ మీ జీవితాన్ని, మీ గమ్యార్థాన్ని ఉద్భోధించిన మీ గురుసత్తముని దివ్యసంకల్పానికీ అనుగుణంగా వుంది. ఈ పవిత్రోద్యమంలో మీతో నిలిచి, సహకరించే మహాభాగ్యం మాకు లభించాలని ఆశిస్తున్నాం. సర్వజ్ఞుడు, కరుణామయుడు అయిన సర్వేశ్వరుడు మీకు దీర్ఘాయురారోగ్యాలను ప్రసాదించి, మీ పవిత్రోద్యమమనే శిరస్సున, సనాతన ధర్మమనే శిరస్సున ప్రకాశించడానికి అర్హమైన భావ్య కిరీటాన్ని శోభామయ విజయచిహ్నంగా ధరింపజేసి అనుగ్రహించుగాక! అని ఎంతో భక్తితో ప్రార్థిస్తున్నాం.
* * *
తర్వాత ఖేత్రి మహరాజుగారు పంపిన క్రింది అభినందనపత్రం చదువబడింది.
పరమపావనమూర్తీ!
శ్రీవారు మద్రాసుచేరి స్వాగత సత్కారాలను అందుకునే ఈ సమయాన శ్రీవారు భారతదేశానికి సురక్షితంగా చేరడాన్నిగూర్చి నా సంతోషాన్ని, ఆనందాన్ని ముందుగా తెలుపుకొంటున్నాను. ప్రకృతిశాస్త్రం ఎన్నడేని సత్య మతానికి ఎదురై నిలిచివుండకపోయినా, ‘ప్రకృతిశాస్త్రం జయించిన ఒక్క అంగుళం నేలపైనా, మతం ఎన్నడూ తిరిగి జయించుకోజాలదు–’ అంటూ మేధావులైన వారు డంబాలు పలికే పాశ్చాత్యదేశాల్లో, శ్రీవారి నిష్కామప్రచారం సాధించిన అద్భుత విజయాన్నిగూర్చి, హృదయపూర్వకంగా నా అభివాదాలను సమర్పించుకొంటున్నాను. మన ఋషి సంతానానికి తగిన ప్రతినిధియై, షికాగో నగరంలో జరిగిన అఖీలమత మహాసభకు విజయం చేయజాలిన మిమ్ము కనిన కారణంచే మన భారతమాత ధన్యురాలైనది! హిందూదేశంలో ఈ కాలంలో సైతం అఖండ బ్రహ్మజ్ఞాన నిధి ఉందని పాశ్చాత్య ప్రపంచం గ్రహించగలగడం సర్వవిధాలా మీ ధీసంపదవల్ల, సాహసంవల్ల, ఉత్సాహంవల్ల సంభవమైంది. ప్రపంచంలో ఉన్న వివిధ సంప్రదాయాల పరస్పర భేదవాదాలకు విశ్వశరణ్యమైన వేదాంత విజ్ఞానంద్వారా, సమన్వయం కుదురుతుందని మీ పరిశ్రమవల్ల నిస్సందేహంగా రుజువైంది. “ఏకతత్త్వం భిన్న రూపాలను ధరించడమే” ప్రకృతియొక్క విశ్వ పరిణామ ప్రణాళిక అనే మహా సత్యాన్ని గ్రహించి, దానికి తగినట్లుగా, ప్రపంచంలోని సమస్త జాతుల వాళ్ళు ప్రవర్తించవలసి ఉన్నారు. స్నేహంవల్ల, విశ్వ సోదరభావంవల్ల, పరస్పర సహనంవల్ల, పరస్పర సహాయంవల్ల, విశ్వమానవజాతి కాంక్షించే పురుషార్థాన్నీ, పరమగమ్యాన్నీ, ఆయా మతాలు సాధించగలవని మీరు నిస్సందేహంగా నిరూపించారు. మహోన్నతం, పరమపవిత్రం అయిన శ్రీవారి ప్రాపువల్ల శ్రీవారి ఉత్కృష్ట బోధల మహిమవల్ల మూర్ఖావేశం, ద్వేషం, స్పర్థ సమసిపోయి శాంతి, సానుభూతి, ప్రేమ, మానవుల హృదయాల్లో రాజ్యంచేసే నూతనయుగం ప్రపంచచరిత్రలో ప్రారంభం కావడాన్ని చూచే మహాభాగ్యం ఈ తరంవారమయిన మాకు లభించింది. శ్రీ పరమేశ్వరుని వరప్రసాదాలు, శ్రీవారి మీద, శ్రీవారి ఉద్యమాల మీద, ఎడతెగకుండా వర్షించుగాక! అని నా ప్రజలతోపాటు, నేనూ ప్రార్థిస్తున్నాను.
* * *
ఈ అభినందన పత్రాలు చదివిన తర్వాత, శ్రీ స్వాములవారు పురమందిరం వెడలి, వెలుపల తమకై వేచివున్న బండిని ఎక్కారు. శ్రీవారికి స్వాగతం తెలుపడానికై చేరిన ఆ విశాలజనసమూహం – వ్యక్తీకరించిన అత్యంతోత్సాహంవల్ల శ్రీవారివ్వదలచిన ప్రత్యుత్తరాన్ని మరొక అవకాశం కొరకై ఆపి, సంగ్రహంగా ఈ క్రింది విధంగా సెలవిచ్చారు.
తానొకటి తలిస్తే దైవమొకటి తలచును. స్వాగతపత్ర సమర్పణం, దానికి ప్రత్యుత్తరం, ఇంగ్లీషువారి ఆచారాన్ననుసరించి జరగాలని మీరు సంకల్పించారు. కాని భగవంతుని సంకల్పం మరోవిధంగా ఉంది. నేనిప్పుడు రథంపై నిలిచి భగవద్గీత ఘట్టంలోలాగా అక్కడక్కడ చెదరి, కూర్చుండిన ఈ ప్రేక్షకులనుద్దేశించి ఉపన్యసించవలసి వచ్చింది. దైవికంగా ఇలాంటిది సంభవించడంవల్ల మనం కృతార్థులమయ్యాం. ఇందువల్ల నా ఉపన్యాసానికి రుచి, నే చెప్పబోవు దానికి బలం చేకూరుతుంది. నా కంఠధ్వని మీకందరికి వినిపిస్తుందో లేదో తెలీదు. కాని వినబడేటట్లు నా శక్తికొద్దీ ప్రయత్నిస్తాను. పెద్ద పెద్ద బహిరంగసభలలో ఉపన్యసించే అలవాటు ముందెన్నడూ నాకు లేదు.
కొలంబో మొదలు, మద్రాసు వరకు నా పట్ల చూపబడిన అద్భుతమైన ఆదరణ, గాఢమైన ఉత్సాహానందాలు, భారతదేశమందంతటా చూపబడేలాగా కనిపిస్తున్నది. అవి నా ఊహాశక్తినికూడ మించిపోవుచున్నా యనవచ్చు. అందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ప్రతి జాతికీ దాని చైతన్య సూచనగా, ఒక ఆదర్శం, దాని నడకకు ప్రత్యేకమైన ఒక పద్ధతి ఉంటాయని నేనిదివరకు చాలాసార్లు చెప్పాను. మీ ఆదరం దాన్ని రుజువు చేస్తోంది. యుగయుగాలుగా మత ధర్మమార్గాన భారతీయుల బుద్ధి వికసిస్తూ వచ్చింది. ఇతర దేశాలలో మతమనేది అనేక జీవిత వ్యావృత్తులలో ఒకటి. పైగా ఇతర వ్యావృత్తులకున్న ప్రాధాన్యం దీనికి లేదు. ఇంగ్లాండులో వారి జాతీయ రాజకీయతంత్రంలో, మతం ఒక చిన్నభాగంగా వుంది. ఆంగ్లేయుల క్రైస్తవ మతవ్యవస్థ ఎప్పుడుగాని, రాజ్యాధికార పక్షానికి చెందినదిగానే ఉంటుంది. అందువల్ల వారికి దానిలో విశ్వాసం ఉన్నా లేకున్నా ఆ వ్యవస్థ తమది అనే అభిమానంతో దాన్ని పోషిస్తారు. గౌరవంవున్న ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఆ వ్యవస్థతో సంబంధం కల్పించుకోవాలని కోరుతారు. మర్యాదకు అదొక చిహ్నం. అట్లే ఇతర దేశాల్లోను, జాతీయమైన ఒక్కొక్క మహాశక్తి ఆ జాతి లక్షణంగా ఉంటుంది. ఆ మహాశక్తి రాజకీయ తంత్రజ్ఞతగానో, రణనీతిజ్ఞతగానో, వ్యాపార కుశలతగానో ఆయా జాతులలో వ్యక్తమవుతూ ఉంటుంది. దానిలో ఆ జాతి హృదయం స్పందిస్తుంది. పాశ్చాత్య జాతులకు మతమనేది అప్రధానమై అలంకారమూల్యంకల చాలా విషయాలలో ఒకటి!
ఇక భారతదేశంలోనో మతం జాతీయ హృదయ గర్భస్థానమే! అది మన జాతీయ భవనానికి పునాది! ఆధారశిల! రాజకీయాలు, అధికార పదవులు, చివరికి బుద్ధిచాతుర్యంకూడ, ఇక్కడ అప్రధానంగానే ఎంచబడతాయి. కాబట్టి మతమొక్కటే భారతదేశంలో ప్రధాన విషయంగా భాసిస్తోంది. భారత ప్రజల్లో, ప్రపంచ వార్తాజ్ఞానం చాలా తక్కువని ఎందరో నాతో చెబుతుంటారు. అది నిజమే. నేను కొలంబో నగరంలో దిగినపుడు యూరప్‌లో జరుగుతున్న రాజకీయ విప్లవాలను గూర్చి, మంత్రి వర్గాల మార్పులు, పతనాలు మొదలైన విషయాలను గూర్చీ అక్కడివారిలో ఒక్కడైనా విని ఉండలేదని నాకు తెలిసింది. సామ్యవాదమంటే ఏమో, అరాచకత్వమంటే ఏమోకూడ వారికి తెలీదు. పాశ్చాత్య రాజకీయ వాతావరణంలో కలుగుతున్న తీవ్రపరిణామాలను వారు అర్థం చేసుకోవడంలేదు సరికదా, కనీసం వానినిగూర్చి విన్నపాపానైనా పోలేదు. కాని సర్వమత మహాసభకు భారతదేశంనుండి ఒక సన్యాసి వెళ్ళాడనీ, ఆయన ఏదోకొంత విజయం సాధించాడనీ, సింహళంలోని ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి చివరికి ప్రతి పసిబిడ్డకుకూడ తెలిసిపోయింది. దీన్ని బట్టి ఏమి రుజువవుతోంది? మన ప్రజల్లో, వార్తలు తెలిసికోవాలనే అభిలాషకు లోటులేదు కాని, ఆ వార్తలు తమ కిష్టమైనవిగా, అభిరుచికి సరిపడేవిగా ఉండాలి, అంతే. రాజకీయాది విషయాలు, జీవితావశ్యకంగా, భారతీయులకు ఎన్నడూ తోచలేదు. కాని మతం, పారమార్థిక చింతన మొదలైనవి మాత్రం ఈ జాతి జీవించడానికి, వికాశం పొందడానికి అత్యావశ్యకాలని గ్రహించబడింది.
ప్రపంచ జాతులన్నీ నేడు రెండు సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నాయి. ఇందులో భారతదేశం ఒక్కటీ ఒక పక్షం. మిగతా ప్రపంచమంతా రెండవ పక్షం. ఆ సమస్య ఇది: శాశ్వత జీవన లక్ష్యాన్ని ఎవరు సాధిస్తారు? తక్కిన జాతులన్నీ నశిస్తూండగా, ఒక్క జాతి సజీవంగా నిలవడానికి కారణమేమి? చిరస్థాయిగా నిలువదగింది ప్రేమా? ద్వేషమా? భోగలాలసతా? వైరాగ్యమా? జీవన సంగ్రామంలో పాంచభౌతిక పదార్థమా? లేక ఆత్మయా? ఏది శాశ్వతంగా నిలిచి ఉంటుంది? వెనుక, చరిత్రకు అందని పూర్వయుగాలలో ఈ సమస్యలనుగూర్చి మన పూర్వులు ఎలా భావించారో నేడుకూడ మనమట్లే భావిస్తున్నాం. అతి ప్రాచీనకాలంలోనే పూజనీయులైన మన పెద్దలు ఈ సమస్యలనుగూర్చి చర్చించి, కొన్ని నిర్ణయాలు చేసుకొని, ప్రపంచాన్నంతా ధిక్కరించి నిలబడ్డారు. మన పరిష్కారం, వైరాగ్యం, త్యాగం, నిర్భయత్వం, ప్రేమ అనే రూపాల్లో ఉంటుంది. ఇవే నశించక నిలిచి ఉండటానికి అర్హమైనవి. ఇంద్రియభోగ పరిత్యాగం జాతిని చిరస్థాయిగా చేస్తుంది. ఇందుకు నిదర్శనం చూడండి. శూన్యం నుండి పుట్టీ, నాల్గుదినాలు వెర్రి ఆటలాడి, అంతలో హరించిపోయే కుక్కగొడుగులలాంటి జాతులు, దాదాపు ప్రతి శతాబ్దంలోను తలఎత్తుతూ వెంటనే పడిపోతూ వుండటం చరిత్ర తెలుపుతూనే ఉంది. ప్రపంచంలో ఏ ఇతర జాతి నెత్తిమీదా పడని దారుణ దురవస్థలు, ఘోర ప్రమాదాలు తన నెత్తిపై పడినా చలించక, అతిక్లిష్ట సమస్యలతో యుగయుగాలుగా పెనుగులాడుతూ వచ్చిన ఈ మహాజాతి వైరాగ్యపక్షం వహించడంచేతనే ఇన్ని ముప్పులు గడచి, ఇప్పటికిలా నిలిచి ఉంది. వైరాగ్యం లేనిదే మతమెలా నిలువగలదు? ఇక యూరపు ఖండం రెండవపక్షం వహించి ఒక పురుషుడు ఎంత సంపదను ఆర్జించగలడో, అతడు ఇంక ఎంత అధికారాన్ని సవ్యమార్గంలోగానీ, అపసవ్య మార్గంలోగాని, ఏదో ఒక విధంగా కైవసం చేసికోగలడో పరిష్కారం చేయబూనుకొన్నది. స్పర్థ, క్రౌర్యం, నిర్దాక్షిణ్యత, యూరప్‌ను ఈనాడు నడుపుతున్న సూత్రాలు. పోటీలను తొలగించి, పరపీడనాన్ని అణచి, క్రౌర్యం మాపి, ఈ మాయామయ జీవితంలో నరుని జీవాత్మను సరళంగా నడపడం, మనం చేపట్టిన సూత్రం!!
(ఇప్పటికి జనసమ్మర్దం మితి మీరిపోయింది. శ్రీ స్వాములవారి మాటలు దూరానికి వినపడలేదు. అందువల్ల శ్రీవారు తమ ఉపన్యాసాన్ని ఈ క్రింది మాటలతో ముగించారు.)
మిత్రులారా! మీ ఉత్సాహం నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇది అద్భుతం! నాకు కోపం వచ్చిందని మీరెంత మాత్రం అనుకోకండి. మీరు చూపుతున్న ఈ ఉత్సాహానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆహా! ఎంతటి ఉత్సాహం? అదే కావలసింది. దాన్ని సుస్థిరం చేసుకోండి. నిప్పును ఆరనీయకండి. మనం ఎన్నో మహాకార్యాలు చేయవలసి ఉంది. అందుకై మీ సహాయం నాకు కావాలి! ఇటువంటి ఉత్సాహం ఎంతో అవసరం. ఈ సభను ఇంకా సాగించడం అసంభవం. నాకు స్వాగత మర్పించడంలో మీరు చూపిన ఆదరణకు, ఉత్సాహానికి నేను చాలా కృతజ్ఞుడను. శాంతంగా ఉన్నప్పుడు మనం పరస్పరం తెలుపుకోదగిన ఉత్తమ సంకల్పాలు, భావాలు, అనేకం కనబడుతూంటాయి. సరే, మిత్రులారా! ఇప్పటికి ఇంతటితో స్వస్తి చెబుదాం.
నాలుగు వైపుల ఈ విధంగా కూడివున్న మిమ్మల్ని ఉద్దేశించి ఉపన్యసించటం సాధ్యమైన పనికాదు. కాబట్టి మీరీ సాయంకాలం నన్ను చూడటంతోనే తృప్తి పడవలసి ఉంది. మరొక సమయానికి నా ఉపన్యాసాన్ని నిలిపివుంచుతాను. ఉత్సాహపూరితమైన మీ స్వాగత సత్కారానికి నా వందనాలు.