వేరు వేరు మార్గాలలో ఒకే గమ్యాన్ని చేరగలమనేది వేదాంత మతంలోని మహోదాత్తాశయం; కర్మ, భక్తి, యోగం, జ్ఞానం అని వీటిని నేను స్థూలంగా నాలుగని నిర్దేశించాను. అయినా ఈ విభజన పరిపూర్ణం కాదు; ఈ నాలుగు యోగాలు పరస్పర సంబంధం లేనివి కావు అని గుర్తుంచుకోండి. ఒక యోగం మరోయోగంలో కలిసిపోతుంది. కాని ఎందులో ఏది ప్రధానంగా వుందో దానికి ఆ పేరు పెడతారు. కర్మయోగానికి తప్ప ఇతర యోగాలకు కేవలం అసమర్థులైన వారు కొందరు, భక్తియోగం మినహ ఇతర యోగాలపై అవగాహన లేనివారు కొందరు, జ్ఞానాన్య విహీనులైనవారు కొందరు వున్నారని కాదు. ఎవరిలో ఏ విధం, ఏ పథం ప్రధానంగా వుందో అనేదాన్ని అనుసరించి ఈ విభాగాలు ఏర్పరుపబడ్డాయి. చివరికివి అన్నీ ఒక్క గమ్యాన్నే పొందుతాయని, దానిలోనే ఐక్యమౌతాయని మనం గ్రహించాం. సర్వమతాలు, అన్ని కర్మోపాసనలు మనలను ఒక్క గమ్యానికే తీసుకువెళుతున్నాయి.
ఆ గమ్యాన్ని చూపడానికి నే నిదివరకే ప్రయత్నించాను. నేను గ్రహించిన రీతిలో మోక్షమే ఆ గమ్యం. నిర్జీవమైన, జడమైన భౌతిక పరమాణువు మొదలుకొని జీవలోకంలో మహోన్నతసత్తయైన మానవాత్మ పర్యంతం, అణువు మొదలుకొని మానవుడి వరకు, మన చుట్టూ మనకు కనిపించే సమస్తం మోక్షం వద్దకే దారిచేసుకొని పోతోంది. ప్రపంచమంతా నిజంగా విముక్తికై సాగే ఈ పోరాటపు ఫలితమే. సమస్త సంయోగాలలో ప్రతి అణువు స్వీయమార్గంలో సంచరించడానికి ఇతర అణువుల నుండి విడివడ యత్నిస్తూంది; కాని ఇతర అణువులు దానిని నిరోధిస్తున్నాయి. సూర్యమండలం నుండి భూమండలం తొలగిపోవడానికి యత్నిస్తూంది, ఇలాగే భూమండలం నుండి చంద్రమండలం ఎడంగా పోవడానికి ప్రయత్నిస్తూంది.ప్రతిదీ అనంతంలో సంలీనమవటానికి ప్రయత్నిస్తుంది. మనం ప్రపంచంలో చూసే ప్రతి విషయానికి విముక్తి కోసం జరిగే ఈ పోరాటమే అధారభూతమై ఉన్నది. దీని ప్రేరణచేతనే యోగి ప్రార్థిస్తున్నాడు, దొంగ దొంగిలిస్తున్నాడు. అవలంబించే కార్యవిధానం సరైనది కాకపోతే ఆ కార్యాన్ని మనం పాప మంటున్నాం. అది సక్రమమైతే, ఉత్తమమార్గమైతే ఆ కార్యాన్ని మనం పుణ్యమంటున్నాం. కాని స్వేఛ్ఛకోసం, బంధరహిత స్థితికోసం జరిగే పోరాటమే దీనికీ ప్రేరకమై ఉన్నది. బద్ధదశలో వున్నాననే ఎరుకచేత బాధితుడై యోగి దానిని బాపుకొనడానికి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. తనకేవో కొన్ని వస్తువులు లేవనే తలపు దొంగను బాధించి, ఆ లేమిని బాపుకోవడానికి, దానినుండి విముక్తి పొందడానికి అతడు ప్రయత్నిస్తాడు. దానికై దొంగిలిస్తున్నాడు. చేతనాచేతన సమస్త ప్రకృతికి మోక్షమే ఏకైక గమ్యం: తెలిసినా తెలియకపోయినా సర్వం ఆ గమ్యం కేసే దారిచేసుకొని పోతోంది. యోగి వెదకుతూన్న విమోచనానికి, దొంగ వెదకే విమోచనానికి ఎంతో వ్యత్యాసం వుంది; యోగికి ప్రియమైన విమోచనం అనిర్వచనీయ బ్రహ్మానందప్రదమౌతూంది. దొంగ కోరుకొన్నదో, అతగాడికి మరింత బంధాన్ని కల్పిస్తూంది.
ప్రతి మతంలోను అవిష్కృతమై కనబడేది విముక్తికోసం సాగే యీ ప్రయాసే. క్షుద్ర శరీరాభిమానాన్ని విడనాడటమనే స్వార్థరాహిత్యానికీ, సమస్త నీతికి యిదే పట్టుగొమ్మ. ఎవరైనా పరహితమొనరుస్తూ, సత్కర్మలను నిర్వర్తిస్తుంటే ‘నేను’, నాది’ అనే సంకుచితావధులకు లోబడి అతడుండ లేకున్నాడని అర్థం. నిస్వార్థతకు పరిమితి ఏదీలేదు. సమస్త నీతిశాస్త్రాలు సంపూర్ణస్వార్థత్యాగమే పరమావధి అని బోధిస్తున్నాయి. కేవల నిస్వార్థతను సాధిస్తాడనుకోండి, అప్పు డతడేమౌతాడు? అతడిక మునుపటి ‘ఫలానా’ ఎల్లయ్యగాని, పుల్లయగాని కాడు. అతడనంతవ్యాప్తిని గడించాడు. మునపటి అల్పవ్యక్తిత్వం శాశ్వతంగా నశించింది. అతడు అనంతుడైనాడు. ఈ అనంత తత్త్వప్రాప్తే సమస్త మతాలకు, నీతి వేదాంత బోధనలకు పరమావధి. ఈ ఆశయాన్నే తాత్వికభాషలో చెప్పినప్పుడు విని వ్యక్తివాది (personalist) భయపడతాడు. అయినా నీతిని బోధించేటప్పుడు తాను తెలిపేదీ ఈ ఆశయాన్నే. స్వార్థరాహిత్యానికి అతడు హద్దు లేదంటాడు. వ్యక్తిత్వ సిద్ధాంతాన్ని అనుసరించి ఒకవ్యక్తి పూర్తిగా స్వార్థరహితుడైనా డనుకోండి; ఇతర సిద్ధాంతాలు తెలిపే ముక్తులకు అతడికి వ్యత్యాసం ఏమిటి? విశ్వంతో అతడు తాదాత్మ్యం పొందివున్నాడు.ఇలాటి ఐక్యాన్ని పొందటమే అన్నిటికీ పరమావధి. పాపం వ్యక్తివాదికి తనవాదం సుసిద్ధాంత మయ్యేవరకు దానిని అనుసరించే ధైర్యం లేదు. మానవప్రకృతి కంతటికీ ఏది గమ్యమో ఆ మోక్షాన్ని స్వార్థరహిత కర్మమూలంగా పొందటమే కర్మ యోగం. స్వార్ప్రతిపనీ గమ్యాన్ని చేరనివ్వక మనలను ఆటంక పరుస్తుంది, నిస్స్వార్థమైన ప్రతిపనీ మనలను గమ్యంకేసి తీసుకుపోతుంది. కాబట్టే ఈ ఏకైక రీతిలో నీతిని నిర్వచింపవచ్చు – “ఏది స్వార్థపరమో అదే అవినీతి; స్వార్థ రహితమైన దేదో అదే నీతి.”
కాని వివరాలను గమనిస్తే విషయమంత సరళంగా కనిపించదు. ఉదాహరణకు, పరిసరాలననుసరించి వివరాలు మారుతాయని నే నిదివరకే చెప్పాను. ఒకే కార్యం ఒకవిధమైన పరిస్థితులలో స్వార్థరహితంగాను, మరో విధమైన పరిస్థితులలో పూర్తిగా స్వార్థపరంగాను ఉండవచ్చును. కాబట్టి సర్వసాధారణ నిర్వచనాన్ని మాత్రమే తెల్పుతూ వివరాలను విభిన్న దేశకాల పరిస్థితుల కనుగుణంగా నిర్ణయించుకోడానికి వదలివేయటం మనకు సాధ్యం. ఒక దేశంలో ఒకవిధమైన ప్రవర్తన ధర్మచోదితంగా పరిగణింప బడుతుండగా, అదే మరోదేశంలో అధర్మయుక్తమని పరిగణింపబడుతోంది; ఎందుకంటే రెంటిలోను పరిస్థితులు భిన్నంగా వున్నాయి. బంధవిమోచనమే సమస్త ప్రకృతికీ పరమావధి; పూర్ణమైన స్వార్థరాహిత్యమే తత్ప్రాప్తికి ఉపాయం. స్వార్థరహితమైన ప్రతి భావం, ప్రతి శబ్దం, ప్రతి కార్యం మనలను గమ్యం వైపుకు తీసుకుపోవటంతో ధార్మిక మనబడుతోంది. ఈ నిర్వచనమే సర్వమతాలలోను, నీతి వ్యవస్థలలోను చెల్లుతుంది. కొన్ని మతాలలో పరమోత్కృష్టంగా వారు పిలుచుకునే దైవమే నైతికతకు ఆధారం. ఒక వ్యక్తి ఒక కర్మను చేయాలనుకోవడానికి, చేయరాదనుకోవడానికి హేతువేమిటని అడిగితే ‘అది భగవదాజ్ఞ’ అని సమాధానం చెబుతాడు. కాని వారి ధార్మిక నియమాలకు మూలమేమైనా, వారి ధర్మశాస్త్రాల ముఖ్యోద్దేశం మాత్రం స్వార్థచింతను విడిచిపెట్టాలనటమే. ధర్మాన్ని గూర్చి ఇలాంటి ఉత్తమాశయం కలిగినవారైవుండీ తమ అల్పవ్యక్తిత్వాన్ని విడిచిపెట్టాలనగానే కొందరు భయపడతారు. పూర్తిగా స్వార్థరహితులు, స్వార్థచిర్తనే విడిచిపెట్టినవారు, స్వార్థంతో ఎలాంటి పనీ చెయ్యనివారు, తమకోసం ఒక్కమాటను మాట్లాడనివారు – ఇలాంటివారి స్థితిని గురించి పర్యాలోచించి, వారిలో ‘తాను’ అనేది ఎక్కడున్నదో చెప్పమని వ్యక్తిత్వాన్ని పట్టుకొని ప్రాకులాడేవారిని మనం అడగవచ్చును. తామెంతవరకు స్వలాభార్థం ఆలోచిస్తారో, సంభాషిస్తారో, ప్రవర్తిస్తారో, అంతవరకే ఆ ‘తాను’ అనేది వారి ఎరుకలో ఉంటుంది. పరుల తలపే, ప్రపంచాన్ని గురించిన తలపే, అందరిని గురించిన తలపే వున్నవారివద్ద ‘తాను’ అనేది ఎక్కడుంది? శాశ్వతంగా అంతరించింది.
కాబట్టి స్వార్థరహిత సత్కర్మాచరణ మూలంగా మోక్షాన్ని పొందడానికి ఏర్పడ్డ నైతిక మత వ్యవస్థే కర్మయోగం. కర్మయోగి అయేవ్యక్తి ఏ సిద్ధాంతాన్నీ విశ్వసించనక్కరలేదు. భగవంతుడి అస్తిత్వాన్ని కూడా అతడు నమ్మనవసరం లేదు. ఆత్మ ఇలాటిదని కాని, పరతత్వ మిలాటి దనికాని విచారింప నవసరంలేదు. స్వార్థరాహిత్యాన్ని సాధించటమే అతడి ముఖ్యాశయం; అతడు దాన్ని స్వయంగా సాధించుకోవాలి. అతడి జీవితంలో ప్రతిక్షణం ఈ స్వార్థరాహిత్య ‘అనుభూతి’ కలుగుతూ ఉండాలి. ఎందుకంటే, దేన్ని జ్ఞాని తన వివేకంచేత్, అ దివ్యజ్ఞానంచేత, భక్తుడు తన ప్రేమచేత సాధింపచూస్తాడో, దానినే ఎట్టి వాదాలను సిద్ధాంతాలను అపేక్షింపక కర్మయోగి తన కార్యాచరణచేతనే సాధించుకోవలసి వుంటుంది.
ఇక తర్వాత ప్రశ్న: ఈ కర్మ ఎలాంటిది? లోకహితాచరణం ఎలాటిది? లోకానికి మనం మంచి చెయ్యగలమా? వ్యావహారికంగా చూస్తే ‘చెయ్యగలం’, పారమార్థికంగా చూస్తే చెయ్యలేం. శాశ్వతమైన ఎలాంటి మంచినీ లోకానికి మనం సమకూర్పలేం; సమకూర్పగలిగితే లోకం ఈ విధంగా వుండదు. ఐదు నిమిషాలు ఒకవ్యక్తి ఆకలిని మనం తీర్చగలం; కాని అతడికి తిరిగి ఆకలి వేస్తుంది. మనం ఇతరులకు ఇవ్వగలిగిన ఏ సౌఖ్యమైనా క్షణికమే అనడం స్పష్టం. మాటిమాటికీ ఆవృత్తమయ్యే సుఖ దుఃఖ జ్వరాన్ని తిరిగి రానివ్వకుండా మాన్పగలవాడు లేడు. లోకానికి శాశ్వతానందాన్ని దేనినైనా కలిగింపగలమా? సముద్రంలో ఒకచోట పల్లం చెయ్యకుండా వేరొకచోట కెరటాన్ని లేపటం శక్యంకాదు. మానవుని ఆశలను అక్కరలను బట్టి చూస్తే కావలసిన సద్వస్తునిచయం లోకంలో ఎల్లప్పుడూ ఒకంతగానే వుంది. దానిని మనం వృద్ధిచేయలేం, తగ్గింపనూలేం. ఇంతవరకు తెలిసిన మానవచరిత్రను తీసుకుని చూడండి. ఒకే విధమైన సుఖాలు, ఒకే విధమైనా దుఃఖాలు, స్థితిగతులలో ఒకే విధమైన తారతమ్యాలే కనిపించటంలేదా? కొందరు ధనవంతులుగాను, కొందరు దరిద్రులుగాను, కొందరు అధికులుగాను, కొందరు అల్పులుగాను, కొందరు ఆరోగ్య వంతులుగాను, కొందరు అనారోగ్యవంతులుగాను లేరా? ఈ పరిస్థితులన్నీ నేటి అమెరికా దేశస్థుల పట్లా ఎలా ఉన్నవో ప్రాచీనకాలంలో ఈజిప్టు, గ్రీసు, రోము దేశస్థుల పట్ల సరిగా అలాగే ఉండినవి. మానవచరిత్ర మనకు తెలిసినంతవరకు ఇవన్నీ ఎప్పుడూ ఒక్క విధంగానే ఉన్నవి; ఐనా అనివార్యాలైన ఈ సుఖాదుఃఖాల వెంట పరిగెత్తుతూనే, వీనిని మాన్పడానికి పోరాటం సదా సాగుతుండటం విస్పష్టమే. లోకుల జీవయాత్రను సుగమం చెయ్యడానికి అఖండమైన కృషి చేసిన వేలమంది స్త్రీపురుషులు చరిత్రలో ప్రతియుగంలోను ప్రభవించి వున్నారు. కాని, వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయి? ఆటబంతిని ఒకచోటు నుండి మరొక చోటుకు త్రోయటమే మనం చెయ్యగలిగిన పని. ఇది ‘డాన్టె’ కవి తన కావ్యంలో వర్ణించిన నరకంలోని లోభుల విషయాన్ని తలపుకు తెస్తూంది. బంగారుబంతిని ఆ లోభులు కొండమీదికి దొర్లింప ఆజ్ఞాపింపబడ్డారు. కొంచెం దొర్లించగానే ప్రతిసారీ అది మరల క్రిందికి వచ్చేది. భగవంతుని రాజ్యాన్ని గురించిన మన ప్రసంగాలు బడిపిల్లల కథలలాగా మనోహరాలేగాని ఆ కథల కంటే అవి గొప్పగా లేవు. భగవద్రాజ్యం రాబోతుందని కలలుగనే ప్రతిదేశస్థుడికీ, ఆ రాజ్యం వచ్చినప్పుడు అందులోని శ్రేష్ఠమైన భాగం ప్రపంచంలోని ప్రజలందరికంటే తమకే దక్కుతుందనే నమ్మకం కూడా ఉంటుంది. ఇది భగవద్రాజ్యాన్ని గురించిన నిస్వార్థమైన, అద్భుతమైన ఆశయం!
లోకులకు ఈ లోకంలో మనం సుఖాన్ని పెంపొందించలేం, అలాగే దుఃఖాన్ని కూడా పెంచలేం. భూమి మీద ప్రదర్శితాలైన సుఖ దుః ఖ శక్తులమొత్తం ఎప్పుడూ ఒక్కటే. ఆ వైపునుండి ఈ వైపుకు, ఈ వైపునుండి ఆ వైపుకు దానిని తోస్తాం. అంతేగాని అదేమో అలాగే వుంటుంది. ఎందుకంటె అలా వుండటం దాని స్వరూపం. ఇంతలో పోటును, అంతలో పాటును, ఇప్పుడు ఉవ్వెత్తున మీది కెగరటం, అప్పుడు భళ్లున క్రింద పడటం లోకస్వభావంలోనే వుంది. అవి అలా ఉండవనుకోవటం, పుట్టిన వారికి చావు ఉండదనుకోవటం వంటి యుక్తియుక్తమే! అది వట్టి పిచ్చిమాట. ఎందుకంటే జీవితమనే ఆశయంలోనే ‘మరణం’ ఇమిడి వుంది. సుఖం అనే ఆశయంలోనే దుఃఖం ఇమిడి వుంది. దీపం సదా తగలబడి పోతుంటుంది. అదే దాని జీవన స్వభావం. నీకు జీవనం కావాలంటే ప్రతిక్షణం దానికై మరణించాలి. ఒకే తత్త్వాన్ని భిన్నదృక్పథాలతో చూసినప్పుడు అది వ్యక్తపరిచే భిన్నరీతులే జీవనం, మరణం కూడా. ఒక్క అలకు కలిగే పోటుపాటులే అవి. ఆ రెండిటి కలయికే సమగ్రస్వరూపం. ఒకడు ‘పాటు’ వైపు మాత్రమే చూసి నిరాశావాది అవుతాడు. మరొకడు పోటువైపు మాత్రం చూసి ఆశావాది అవుతాడు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో వుండి బడికి వెళ్లే బాలుడికి ప్రతిదీ మహానందకరంగానే కనిపిస్తుంది. అతడి అక్కరలు సరళాలు. అతడు గొప్ప ఆశావాది. అనేక అనుభవాలను పొందిన వృద్ధుడిలో ప్రశాంతత ఎక్కువగా వుంటుంది. అతడిలోని ఉడుకు చాలవరకు తప్పకుండా చల్లారే వుంటుంది. కాబట్టి వినాశలక్షణాలు కన్పడుతున్న పురాతన దేశాలవారిలో, నూతన దేశాలవారిలో వున్నదానికంటె ఆశ తక్కువగా వుండటం సబబే. భారతదేశంలో ఒక సామెతవుంది! ‘వెయ్యేళ్లు పట్టణం’ – ‘వెయ్యేళ్లు అరణ్యం’. అరణ్యం పట్టణంగాను, పట్టణం అరణ్యంగాను మారే మార్పు సర్వత్రా సాగిపోతూంది. జనులను వారివారి దృక్పథాలనుబట్టి ఆశావాదులుగనో, నిరాశావాదులుగనో చేసేది అదే. ఇక సమత్వభావాన్ని గురించి విచారిద్దాం. ఈ ‘భగవద్రాజ్య ఆశయాలు’ (‘మిలెనియమ్’ కు సంబంధించే భావాలు) జనులను కార్యాచరణానికి పురికొల్పే ప్రబల శక్తులు. భగవంతుడీ లోకాన్ని పరిపాలింప వస్తున్నాడనీ, అప్పుడు పరిస్థితులలో ఎలాంటి భేదాలు వుండవనీ, జీవితం సాఫీగా సాగుతుందని అనడం అనేక మతాల బోధనలలో ప్రధానంగా వుంది. ఈ సిద్ధాంతాన్ని బోధించేవారు కేవలం స్వమతదురభిమానపూరితులు (fanatics). కాని నిజంగా మానవకోటిలో వీరెప్పుడూ అత్యంత నిష్కపట చిత్తులు. దురభిమానం మీది ఈ మోజు ఊతగా తీసుకొనే క్రైస్తవమతం బోధింపబడింది; గ్రీకు, రోము దేశాలలోని బానిసలను క్రైస్తవమతం పట్ల ఆకర్షింపచేసినదదే. భగవద్రాజ్యాన్ని తెలిపే మతాన్ని అవలంబిస్తే ఆనాటితో తమ బానిసతనం నిర్మూలమౌతుందని, తినడానికి త్రాగడానికి కావలసినంత లభిస్తుందనీ నమ్మి ఆ బానిసలు క్రైస్తవపతాకం చుట్టూ మూగినారు. మొట్టమొదట ఈ ఆశయాన్ని బోధించినవారు అజ్ఞులు, దురభిమానులేగాని నిజంగా వారు చాలా నిష్కపటచిత్తులు. ఈ ‘మిలెనియమ్’ (భగవద్రాజ్యం)కు
సంబంధించి ఆశ ఈనాడు సమత్వరూపాన్ని, స్యాతంత్ర్య, సమత్య, సౌభ్రాతృ రూపాన్ని దాల్చింది. ఇదీ దురభిమానమే. నిజమైన సమత్యం ప్రపంచంలో ఇదివర కెప్పుడూ వుండలేదు, ఇక ముందూ ఉండటం అసాధ్యమే. ఇక్కడ మనమంతా సమానులమై ఎలా వుండగలం? అసాధ్యమైన ఇలాంటి సమత్యమంటే సంఘమరణమే. లోకం లేదా ఈ ప్రపంచం అంటే ఏమిటి? సమత్యం కోల్పోయిన స్థితే. సృష్టి పూర్యమైనదైన ప్రళయమనే దశలో సంపూర్ణమైన సమత్యం ఉంటుంది. అప్పుడు విశ్వసృజనశక్తులన్నీ ఎలా కలుగుతాయి? పెనకువచేత కలుగుతాయి, పోటీచేత కలుగుతాయి, పోరాటంచేత కలుగుతాయి. స్థూలద్రవ్యంలోని అణువులన్నీ సర్యసమత్యం పొందివున్నాయని అనుకోండి. అప్పుడెలాటి సృష్టిక్రమమైనా ఉంటుందా! ఉండటం అసాధ్యమని శాస్త్రం నుండి మనకు తెలుస్తుంది. నిశ్చలమైన నీళ్లను కదపండి; నీటిలోని ప్రతి అణుమా ఒకదాని కెదురుగా ఒకటి ఉరవడిస్తూ, తిరిగి నిశ్చలత్యం పొందడానికి ప్రయత్నించటం కనబడుతుంది, విశ్య మనబడే ఈ దృశ్యమంతా, దానిలోని వస్తువులన్నీ – అదే విధంగా తిరిగి సంపూర్ణ సామ్యస్థితి పొందడానికే కొట్టుకొంటున్నాయి, మరల ఒక కదలిక కలుగుతుంది. తిరిగి సంయోగం సృష్టి ఏర్పడుతున్నాయి. అసమత్యమే సృష్టికి పరమమూలం. ఐనా సమత్యాన్ని మాపే శక్తులు సృష్టి కెంత ఆవశ్యకాలో సమత్యాన్ని పొందప్రయత్నించే శక్తులూ అంత ఆవశ్యకాలే.
కేవల సమత్యం, అంటే అన్ని రంగాలలోను ఒకదానితో ఒకటి పోరాడే అన్ని శక్తుల పరిపూర్ణ సామ్యస్థితి, ప్రపంచంలో ఎప్పుడు సాధ్యంకాదు. ఆ స్థితిని మీరు చేరేటప్పటికే ఈ ప్రపంచం ఏ ప్రాణీ నివసించడానికి అర్హమై వుండదు. అప్పుడే ప్రాణీ వుండబోదు. కాబట్టి ‘భగవద్రాజ్యం’ (మిలెనియమ్) అనే ఈ ఆశయాలన్నీ అసాధ్యాలవడం అలా వుంచి, వాటిని మనం సాధించ ప్రయత్నిస్తే, అవి తప్పక మనలను నాశనం చేస్తాయి. మానవుడికీ మానవుడికీ వ్యత్యాసం ఎందులో వుంది? అది విశేషంగా ధీశక్తిలో వున్నది. మనమందరం సమాన ధీశక్తితో జన్మించామని మతిహీనుడు తప్ప నేడు మరెవ్వరూ చెప్పరు. మనమందరం అసమాన శక్తులతో ఈ లోకంలోకి వస్తున్నాం; అధికులుగానో, అల్పులుగానో జన్మిస్తున్నాం. పుట్టుక పూర్వమే నిర్ణీతమైన స్థితినుండి తప్పించుకొనడం కుదరదు. అమెరికన్ ఇండియన్లు ఈ దేశంలో (అమెరికాలో) వేల సంవత్సరాలుగా వున్నారు; మీ పూర్వులే అల్పసంఖ్యలో వారి దేశంలోకి వచ్చారు, వచ్చి దేశస్థితిలో వారెలాంటి మార్పు కలిగించారో చూడండి; అంతా సమానమైతే అమెరికన్ ఇండియన్లు ఎందుకు పట్టణాలను నిర్మించకపోయారు? బహువిధాల దేశాన్ని ఎందుకు అభివృద్ధి చెయ్యలేదు? మీ పూర్వులతో వేరేవిధమైన ధీశక్తి ఈ దేశానికి వచ్చింది. వేరువిధాలైన మనోసంస్కారాలు తండాలుగా వచ్చాయి. అవి పనివడి తమను ఆవిష్కరించు కొన్నాయి. వైవిధ్య లేమి అంటే మృత్యువే. ప్రపంచం ఉన్నంతదాకా వ్యత్యాసాలుంటాయి, ఉండితీరాలి. పరిపూర్ణ సమత్వమున్న ‘భగవద్రాజ్యం’ (మిలెనియమ్) – కల్పాంత మప్పుడే వస్తుంది. అంతకుముందు సిద్ధించదు. ఐనా భగవద్రాజ్యాన్ని నెలకొల్పాలనే ఆశయం గొప్పప్రేరణశక్తి. సృష్టికి అసమత్వ మెలా ఆవశ్యకమో అసమత్వాన్ని పరిమితం చెయ్యాలనే ప్రయత్నమూ అలాగే ఆవశ్యకమై వుంది. ముక్తులమై తిరిగి భగవంతుణ్ణి ప్రాపించడానికి ఈ పోరాటం లేకపోతే సృష్టీ వుండదు. ఈ శక్తుల రెంటికిని గల భేదమే మానవుల ఉద్దేశాల సంకల్పాల స్వరూపాన్ని నిర్ణయిస్తుంది. కర్మాచరణానికి ఈ ఉద్దేశాలు సదా వుంటాయి. వీటిలో కొన్ని బంధాన్ని కలిగించడానికి, కొన్ని మోక్ష ప్రాప్తికి ఉపయోగపడతాయి.
చక్రం లోపల చక్రంగా వున్న ఈ జగద్యంత్రం భయంకరమైనది. అందులో చెయ్యిపెట్టి ఇరుక్కుంటే మనం వినాశనమైనవారమే అవుతాం. ఫలానా కర్తవ్యాన్ని పూర్తిచేస్తే ఇక మనకు విశ్రాంతే అని మనమంతా అనుకొంటాం. కాని ఆ పనిలో ఒక లేశం పూర్తికాకముందే, మరొక పని కాచుకొని వుంటుంది. చిక్కైన ఈ జగన్మహాయంత్రం మనలను ఈడ్చుకొని పోతూంది. దీనినుండి వెలువడడానికి రెండే మార్గాలున్నాయి. మన కోర్కెలన్నీ విడిచి, తటస్థులమై జగద్యంత్రం జోలికి పోకుండా దాని దారిన దాన్ని సాగనివ్వటం ఒకదారి. ఇది చెప్పడానికి చాల సులభమే గాని ఆచరణలో పెట్టడానికి దాదాపు అసాధ్యమే. చేయగలవాడు కోటిలో ఒక్కడైనా వుంటాడో ఏమో నాకు తెలియదు. సంసారంలోకి దూకి కర్మరహస్యాన్ని గ్రహించటం రెండవ మార్గం, ఇదే కర్మయోగ మార్గం. జగద్యంత్ర చక్రాల నుండి తొలగిపోవద్దు, దానిలోనే తిరుగుతూ రహస్యాన్ని తెలుసుకోండి. సంసారంలోనుండే సరైన కర్మమాచరిస్తే అందులోనుండి తరించవచ్చును. ఆ యంత్రంద్వారానే మనం బయటపడటానికి మార్గం ఉంది.
మన మిప్పుడు కర్మమంటే ఎలాంటిదో గుర్తించాం. ప్రకృతి కాధారమైనవాటిలో ఒక భాగమైన ఈ కర్మ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. భగవద్విశ్వాసం వున్నవారికి ఇది ఎక్కువగా బోధపడుతుంది. ఎందుకంటే, భగవంతుడు మనసాయానికై దేవులాడటం లేదని, భగవంతుడు అంతటి అసమర్థుడు కాడని వారికి తెలుసు. ప్రపంచం సదా సాగుతూనే వుంటుంది. కాని మన పరమావధి మోక్షమే; నిరహంకారతా, నిర్మమతలే. కర్మయోగాన్ని అనుసరించి కర్మే మోక్షసాధనం. ప్రపంచాన్ని సుఖమయంగా చేయాలనే ఆశయాలన్నీ స్వమతదురభిమానులకు కర్మాచరణ ప్రేరకాలు కావచ్చు గానీ స్వమత దురభిమానం వలన ఎంతటి మేలు కలుగుతుందో అంతటి కీడూ కలుగుతుందని మనం తెలుసుకోవాలి.విముక్తుల మవ్వాలన్న సంకల్పం కంటే కర్మాచరణానికి వేరొక ప్రేరణ ఎందుకని కర్మయోగి ప్రశ్నిస్తాడు. సామాన్య లౌకికోద్దేశాలకు అతీతులై వుండండి. “కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన”* – కర్మ చేయడానికే గాని ఫలవిషయమై మీ కెన్నడూ అధికారం లేదు. ఈ తత్త్వాన్ని గ్రహించడానికి, ఆచరించడానికి మానవుడు తనను తాను తీర్చిదిద్దుకోవాలని కర్మయోగి వక్కాణిస్తాడు. సత్కర్మ నిర్వర్తించాలనే భావం స్వాభావికమైనంతనే కర్మయోగికి బైటినుండి ఇక ఎలాంటి ప్రేరకాలూ అక్కరలేదు. మంచి చేయటం మంచిది కాబట్టే మంచి చేద్దాం. స్వర్గాభిలాషతో సత్కర్మ చేసేవాడు సహితం బద్ధుడౌతాడని కర్మయోగి వచిస్తాడు. స్వార్థచింత అణుమాత్రమున్నా అలాంటి కర్మ మనలను ముక్తులను చేయటానికి బదులు మరింత బద్ధులను చేస్తుంది.
కాబట్టి సర్వకర్మ ఫలత్యాగం చెయ్యటమే, ఫలాలపట్ల అనాసక్తులమై వుండటమే మనకు ఏకైక తరుణోపాయం. ఈ జగత్తు మనం కాదు, మనం ఈ జగత్తుకాము, నిజానికి మనం శరీరులం కాము, నిజంగా మనం కర్మ చెయ్యటం లేదని తెలుసుకోండి. అచలం, శాశ్వత శాంతి స్వరూపమైన ఆత్మే మనం. దేనిచేతనైనా మనం ఎందుకు బద్ధులం కావాలి? పరిపూర్ణంగా మనం అనాసక్తులమై ఉండాలని చెప్పటం చాలా మంచిదే, కాని అలా ఉండటానికి ఉపాయం ఏమిటి? ఫలాపేక్షారహితంగా చేసే ప్రతి సత్కర్మా కొత్త బంధాన్ని కల్పించకుండటమేకాక, ఉన్న సంకెళ్లలో ఒక కొలికిని తెంపుతుంది. ఫలాపేక్షను విడగొట్టి మనం లోకంలో వ్యాపింపచేసే ప్రతి సద్భావమూ లోకంలో నిలిచి, కర్మబంధాన్ని సడలించి, మనం మానవులలో కెల్లా పవిత్రుల మయ్యేవరకు మనలను ఇంకా పవిత్రులనుగా చేస్తూపోతుంది. ఐనా ఇదంతా విపరీతంగాను, అనుష్ఠానానికి శక్యంకాని మహావేదాంతం గాను అనిపించవచ్చును. భగవద్గీతను గురించి నేననేక పూర్వపక్షాలను చదివాను. ప్రయోజనాన్ని ఉద్దేశింపక మనం కర్మచెయ్యలేమని అనేకమంది వక్కాణించి వున్నారు. వారలా చెప్పడానికి కారణం స్వమత దురభిమాన ప్రేరణమూలంగా కాక మరొక విధంగా స్వార్థరహితకర్మ చేయబడటం వారేనాడు చూడకపోవటమే!
కర్మయోగ బోధనలను నిజంగా అనుష్ఠించిన ఒక మహనీయుణ్ణి గురించి కొన్ని మాటలను చెప్పి విరమిస్తాను. ఆయనే బుద్ధుడు. కర్మయోగాన్ని పూర్తిగా ఆచరణలో చూపించిన మహనీయు డాయన ఒక్కడే. ప్రపంచంలో బుద్ధుడు తప్ప మిగిలిన ప్రవక్త లందరికీ తమను స్వార్థరహిత కర్మాచరణానికి పురికొల్పే బాహ్యాశయా లుండినవి. బుద్ధుని విడిచిపెట్టి మిగిలిన ప్రవక్తలందరినీ రెండు వర్గముల వారీగా విభజించవచ్చును. ఒక వర్గం వారు తాము భూమి మీదకు దిగివచ్చిన భగవంతుని అవతార మూర్తులమని పలుకగా, రెండవ వర్గంవారు తాము కేవలం భగవంతుని దూతలమని చెప్పి వున్నారు; ఎలాంటి ఉన్నత పారమార్థిక భాషలో మాట్లాడినా ఉభయపక్షాలవారూ కర్మాచరణానికి బాహ్యంనుండే ప్రేరణను పొందారు, బాహ్యలోకాల నుండి ఫలాలను ఆశించారు. కాని బుద్ధు డొక్కడే ఇలా వక్కాణించిన మహాప్రవక్త: “దేవుని గురించిన బహువిధాలైన మీ సిద్ధాంతాలతో నాకు పనిలేదు. ఆత్మను గురించి సిద్ధాంతరాద్ధాంతాల చర్చల వలన ప్రయోజనం ఏమిటి? సత్కర్మను చేస్తూ సజ్జనులై ఉండండి. ఇదే మిమ్మలిన్న సత్యానికి చేరువగా తీసుకెళుతుంది; మోక్షాన్ని ప్రసాదిస్తుంది. లౌకిక జీవనంలో బుద్ధుడికి స్వలాభోధ్దేశం లేనేలేదు. అతనికంటే ఎక్కువగా శ్రమపడ్డ వారేరి? మానవచరిత్రలో ఆయన ఎత్తుకు ఎదిగిన మరొక మహనీయుని చూపండి. అలాటి మహోనన్నత తత్యజ్ఞానాన్ని, బోధించి, అపార దయార్ద్రహృదయుడై జంతువులపైకూడా తన కరుణామృతవృష్టిని కురిపించిన సద్గుణ గరిష్ఠుడు, తత్యజ్ఞ శిఖామణి బుద్ధుడు. ఐనా తనను గురించి అత డెలాటి గొప్పలనూ చెప్పుకోలేదు. అతడాదర్శ కర్మయోగి, కేవలం నిస్స్యార్థంగా కర్మను ఆచరించినవాడు. అలాంటి మహోన్నత మానవుడు మరొకడు జన్మించి వుండలేదని మానవచరిత్ర చూపుతోంది. కరుణా ప్రతిభల మేళనం రూపుదాల్చిన అటువంటి మహాశక్తి మరొకటి లేదు. ప్రపంచ మహాసంస్కర్తలలో అతడే ప్రథముడు. అంతేగాక ధైర్యంగా ఇలా వక్కాణించిన వారిలో అతడే ప్రథముడు: “పాత వ్రాతప్రతులను చూపగానే నమ్మవద్దు, దేశీయులంతా నమ్మినా నమ్మవద్దు, చిన్నప్పటి నుండి నిన్ను నమ్మించారని నమ్మవద్దు. కాని ఆలోచించి చూడు. బాగా పరిశీలించిన పిదప అది విశ్వశ్రేయస్కరమని నీకు తోస్తే దానిని నమ్ము. అదే లక్ష్యంగా బ్రతుకు, అదే లక్ష్యంగా బ్రతకడానికి ఇతరులకు సహాయపడు. “ధనాన్ని, కీర్తిని మరిదేన్నీ వాంఛించవద్దు, నిర్య్వాజకర్మపరాయణుడైన వాడే గొప్ప కర్మయోగి. మానవుడు అలా ఆచరిస్తే అతడు బుద్ధుడౌతాడు. ప్రపంచ పరివర్తన కలిగించే శక్తి అతడి నుండి వెలువడుతుంది. కర్మయోగాని కతడే మహోన్నతాదర్శం.
ఓం తత్ సత్
శ్రీ రామకృష్ణార్పణమస్తు !