కర్మమనే మాటకు క్రియ, ఇంద్రియ వ్యాపారమనే అర్థం వుండటమే కాకుండా శాస్త్రీయంగా అది కార్యకారణ నియతిని కూడా సూచిస్తుందని ఇదివరకే చెప్పాం. ఏదో ఒక ఫలాన్నిచ్చే ఏ వ్యాపారమైనా, ఏ క్రియ ఐనా, ఆలోచనైనా కర్మ అనబడుతోంది. ఇలా కర్మసిద్ధాంత మంటే, అనివార్యమైన కార్యకారణ నియతే. దీనిని ప్రతిఘటించటం శక్యంకాదు. కార్యముంటే కారణం వుండితీరాలి; మన తత్త్వశాస్త్రాన్ననుసరించి ఈ నియమం సమస్త ప్రపంచానికీ వర్తిస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడగాని మనం చూసేదంతా, చేసేదంతా, అనుభవించేదంతా ఒకవైపు పూర్వకర్మకు ఫలమై(కార్యం) వుండటమే గాక మరోవైపు భవిష్యత్ఫలానికి కారణమౌతోంది. ఈ కార్యకారణ భావంతోపాటు, ‘నియతి’ అంటే ఏమిటో మనం ఆలోచించవలసివుంది. ఒక క్రమం తిరిగి ఆవృత్తమయ్యే స్వభావానికే ‘నియతి’ అని పేరు. ఒక కార్యం వెన్నంటి మరోకార్యం జరగటం కాని, లేదా ఒకొక్కప్పుడు ఈ కార్యం, మరొక కార్యం రెండూ ఏకకాలంలో జరగటంగాని మనం చూసేటప్పుడు ఈ క్రమం లేక ఈ ఏకకాల సంభవత్వం (co-existence) గాని ఈ నియమాన్ని ‘వ్యాప్తి’ అంటారు. నియమాన్ని గురించినట్టి మన భావాలన్నీ ‘సంసర్గం’ వలన కలుగుతున్నాయని వీరి అభిప్రాయం. బాహ్యాంతర ప్రపంచాలలో జరిగే సంఘటనల పరంపర ఒకవిధమైన నిత్యక్రమాన మన మనస్సులోని విషయాలతో సంయుక్తమౌతోంది; దాంతో మనం దేన్ని చూసినా వెంటనే అది మనస్సులోని ఇతర విషయాలతో (ఇదివరకటి సంస్కారాలు లేదా ముద్రల రూపంలో నిక్షిప్తమై ఉన్న విషయ సంబంధిత జ్ఞానంతో) అన్వయింప బడుతోంది. మనస్సులో జనించే ప్రతి ఆలోచనా కెరటమూ స్వసదృశాలైన అనేక కెరటాలను ఉత్పాదిస్తుంది. మానసికశాస్త్రాన్ని బట్టి ఇదే ‘సంసర్గ’ (అసోసియేషన్) సూత్రం. విశ్వవ్యాప్తమూ గంభీరమూ అయిన సంసర్గసూత్ర రూపాంతరాలలో ఈ కార్యకారణ నియతి ఒకటి. ఈ సంబంధ సార్వత్రికతకే సంస్కృతంలో ‘వ్యాప్తి’ అని పేరు. ‘దీని వెనుక ఇది వస్తుంది. ఈ క్రమం ఇలాగే ఆవృత్తమౌతుంది’ అనే నియతి అంతరప్రపంచంలో ఎలాంటిదో బాహ్యప్రపంచంలోను అలాంటిదే. కాబట్టి నియతి అనేది నిజంగా ప్రకృతిలో లేదు. గురుత్వాకర్షణశక్తి భూమిలో వున్నదని కాని, మరోనియతి ప్రకృతిలో మరోచోట వున్నదనికాని చెప్పటం పొరపాటు. వరుసగా జరిగే కొన్ని సంఘటనల క్రమాన్ని మనస్సు గ్రహించే విధానమే నియతి; ఇది అంతా మనస్సులో వున్నది. కొన్ని సంఘటనలు వరుసగాగాని ఏకకాలంలో గాని జరగటం, అవి ఎప్పుడూ అలాగే జరుగుతాయనే భావం ఉదయించటం, దానినిబట్టి సంఘటన క్రమాన్ని మనస్సు గ్రహించడం – దీనినే మనం నియతి అంటున్నాం.
నియమం విశ్వనియమమనేటప్పుడు మన భావమేమిటి అనేది ఇక మనం ఆలోచించాల్సిన విషయం. ‘సత్త’ (existence) లోని ఒక అంశానికే మన స్తత్త్వశాస్త్రకారులు చెప్పే దేశకాల నిమిత్తాలనేవి లక్షణాలై వున్నాయి. సత్తలోని ఈ అంశమే మన ప్రపంచం. అనంత సత్తలో (infinite existence) కేవలం ఒక అంశం దేశకాల నిమిత్తాలవల్ల ఏర్పడి ఒక విచిత్రరూపం పొందివుంది. ఇదే మన ప్రపంచం. కాబట్టి సోపాధికమైన (Conditioned -దేశకాల నిమిత్తాలచే నియంత్రించబడ్డ) ఈ ప్రపంచంలోనే ‘శాసన నియతి’ (law) సాధ్యమౌతుంది. దీని అవతల ఎలాంటి శాసనమూ వుండబోదు. విశ్వం అని మనం నిర్దేశించేది సత్తలోని మనోగోచరమైన అంశాన్నే – మనం చూడగలిగిన, అనుభవించగలిగిన, తాకగలిగిన, వినగలిగిన, భావింపగలిగిన, ఊహింపగలిగిన ఇంద్రియగోచర ప్రపంచాన్నే; నియమబద్ధమైన ప్రపంచమిదే. దీని కతీతమైన సత్తను నియమానికి కట్టుబడచేయటం శక్యంకాదు; ఎందుకంటే మనోగోచరప్రపంచం అవతల కార్యకారణ నియమం వర్తింపబోదు. మన మనస్సు సంచరించే ప్రపంచానికి ఆవలి దేదీ కార్యకారణ నియమబద్ధం కాదు. ఎందుకంటే, ఇంద్రియాతీతమైన చోట విషయాలను అన్వయించే మనోవ్యాపారం వుండబోదు. అది లేనిచోట కార్యకారణ నియతి ఉండదు. సత్త కార్యకారణ నియతికి కట్టుబడటం, శాసనబద్ధమని చెప్పబడటం నామరూపాలు దాల్చినప్పుడే. కాబట్టి ‘స్వతంత్రసంకల్పం’ అనేదొకటి వుండటం (ఈ సాపేక్ష ప్రపంచంలో) అసంగతమని మనం గుర్తిస్తున్నాం. అసలు ఆ మాటలే పరస్పర విరుద్ధాలు; ఎందుకంటే సంకల్పమనేది మన మెరిగినదికదా; ఇక మన మెరుగబోయేది సర్వం మన ప్రపంచంలోనిదే. మన ప్రపంచంలోని సర్వం దేశకాలనిమిత్తాలనే ఉపాధులచే రూపుదాల్చేది. మనం గ్రహించేది, గ్రహింపగలిగేది, సమస్తం కార్యకారణనియమబద్ధమై వుండాలి. నియమ బద్ధమైనది స్వతంత్రమై వుండటం ఎలా పొసగుతుంది? అన్యముల ప్రభావానికి తానధీనమై తిరిగి తానొక కారణమౌతోంది. కాని ఏది సంకల్ప రూపమైన మార్పుచెందినదో, ఏది ఇంతకుమునుపు సంకల్పంకాదో, ఏది దేశకాలనిమిత్తాలలో తగులుకొని మానవసంకల్పరూపం చెందినదో, అది స్వతంత్రం; ఈ సంకల్పం దేశకాలనిమిత్తాలనే పంజరంనుండి వెలువడగానే తిరిగి స్వతంత్రమౌతుంది. ఇది ముక్తి నుండి జనిస్తుంది, బంధాలకు కట్టుబడుతుంది, తిరిగి అందులోనుండి వెలువడి ముక్తిని పొందుతూంది.
ఈ విశ్వం ఎవరినుండి ఉద్భవిస్తోంది? ఎవరిలో నిలిచివుంది? తిరిగి ఎవరిలో లీనమౌతోంది అనే ప్రశ్న లేవనెత్తబడినది. ఇది ముక్తి నుండి ఉద్భవించి, బంధంలో నిలిచి, మరల ముక్తిలో లీనమౌతోందని జవాబు చెప్పబడినది. మానవుడు ఆ అనంతతత్త్వం యొక్క అభివ్యక్తీకరణే అని మనం చెప్పేటప్పుడు అందులో కేవలం ఒక సూక్ష్మాంశమే మానవుడని మన తాత్పర్యం; మనకు కనిపించే ఈ మనశ్శరీరాలు అఖండతత్త్వంలో ఒక అంశం, అనంతతత్త్వంలో కేవలం ఒక బిందువు. ఈ సమస్త ప్రపంచం ఆ అనంతతత్త్వంలో ఒక లవం; ఇక మన నియమాలు, నిర్బంధాలు, ఆనందాలు, దుఃఖాలు, సుఖాలు, ఆశలు సర్వం ఈ చిన్నప్రపంచంలోనివే; మన పురోగమన తిరోగమనాలు కూడా ఈ చిన్న ఆవరణలోనివే. కేవలం మన మనఃకల్పితమైన ఈ ప్రపంచం ఇలాగే సాగుతుండాలని, మనకు తెలిసిన ఈ లోకపు రూపాంతరమే ఐన స్వర్గానికి పోవాలని కోరటం ఎంత పిల్లచేష్టలో మీకు స్పష్టమే. అఖండమైన అనంతమైన సత్త మనం ఎరిగిన పరిమిత సోపాధికసత్తకు సరిపోవాలనే కోరిక కేవలం శిశువుకు తగినదని, అది అసాధ్యమని వెంటనే మనకు విస్పష్టమౌతుంది. ఇప్పుడున్నదే ఎల్లప్పుడూ తనకుండాలని కోరేవ్యక్తి – నేను ఒక్కొక్కప్పుడు చెప్పేట్లు ‘హాయి నిచ్చే మతం కావా’ లని కోరేవ్యక్తి, తన ప్రస్తుతస్థితికంటె పైమెట్టు ఊహించుకోలేనంత పతనం చెందినవాడని మీరు గుర్తించవచ్చును; తన ప్రస్తుత సంకుచిత పరిసరాలతో అతడు తాదాత్మ్యం పొందుతున్నాడు. అంతకుమించి లేదు. తాను అనంతుడననే సంగతి అతడు మరిచిపోయాడు. అతడి ఆశయమంతా ఈ నిమిషంలోని క్షుద్రసంతోషాలచే, అల్ప దుఃఖాలచే, అసూయలచే పరిమితమైవుంది. ఈ పరిమితమైన వాటినే అతడు అనంతమని భ్రమిస్తున్నాడు. ఇంతేకాదు, ఈ భ్రాంతి మాసిపోవడానికి అతడు ఇష్టపడటంలేదు. బౌద్ధులు ‘తన్హ’ ‘తిస్స’ అని చెప్పే జీవిత తృష్ణను అతడు గట్టిగా అంటిపట్టుకుని వున్నాడు. సుఖాలు, ప్రాణులు, చట్టాలు, పురోగతులు, కార్యకారణ నియతులు కాక అనేక లక్షల రకాలు మనకు తెలిసిన ఈ చిన్నవిశ్వానికి ఆవల ఉండి ఉండవచ్చు. మనమెరిగిన ఈ దృశ్య ప్రపంచమంతా మన నిజ స్వరూపమైన అనంతాత్మ తత్త్వంలో కేవలం ఒక అంశమాత్రమే.
విముక్తిని పొందడానికి ఈ ప్రపంచావధులను మనం అతిక్రమించాలి. ఇక్కడ విముక్తిని చూడలేం. పరిపూర్ణమైన సమత, క్రైస్తవులు చెప్పే ‘మన అవగాహనకు అందని ప్రశాంతత’ (Peace that passeth our understanding) ఈ లోకంలోగాని, స్వర్గంలోగాని, మన మనస్సులు, తలపులు సంచరించగల మరేప్రదేశంలోగాని, మన ఇంద్రియాల అనుభవానికి, ఊహకు అందే మరే ప్రదేశంలోగాని లభించదు. ఇలాంటి ఏ చోటూ మనకు ఆ విముక్తిని ఇవ్వలేదు. ఎందుకంటే, ఆ ప్రదేశాలన్నీ ఈ విశ్వంలోనివే కాబట్టి. ఈ విశ్వం చూద్దామంటే దేశకాల నిమిత్తబద్ధమై వుంది. మన భూమికంటె దివ్యాలైన ప్రదేశాలు వుండవచ్చును. అక్కడి సుఖాలు ఇక్కడి సుఖాలకంటె విశిష్టాలై వుండవచ్చును. కాని అవీ విశ్వంలోనివే కాబట్టి నియమబద్ధాలే. కాబట్టి మనం వాటిని కూడా అతిక్రమించిపోవాలి. ఈ పరిమితమైన ఇంద్రియ జగత్తు అంతమయ్యేచోట పారమార్థిక ధర్మం మొదలవుతుంది. ఈ అల్పసుఖాలు, దుఃఖాలు, ఈ క్షుద్రవిషయ జ్ఞానం అక్కడ అంతమౌతుంది. అక్కడ పరమార్థం ప్రారంభ మౌతుంది. త్రిగుణాత్మికమైన, పంచభూతాత్మికమైన ఈ విశ్వంతో దృఢ సంగాన్ని మనం విడిచిపెట్టే వరకు ఆవలవుండే నిరవధిక విముక్తిని జాడగా నైనా చూసే ఆశ మనకుండదు. కాబట్టి మానవుల మహోదాత్తాభిలాషలకు పరమగమ్యమైన ఆ విముక్తిని పొందడానికి ఒక్కటే మార్గముంది. అదేమంటే, ఈ క్షుద్రజీవితాన్ని విడిచిపెట్టడమే. ఈ క్షుద్ర జగత్తును విడిచిపెట్టడం, భూమిని విడిచి పెట్టడం, స్వర్గాన్ని విడిచిపెట్టడం, దేహాన్ని విడిచిపెట్టడం, మనస్సును విడిచిపెట్టడం, పరిమితమైన సోపాధికమైన వాటినన్నింటినీ విడిచిపెట్టడం. క్షుద్రమైన ఈ ఇంద్రియజగత్తులో, మనోజగత్తులో మనం మోహాన్ని త్యజిస్తే తక్షణమే విముక్తులమౌతాం. సంసారబంధం నుండి బైటపడడానికి నియమబంధాలను, కార్యకారణనియతిని అతిక్రమించటం ఒక్కటే మార్గం.
కాని ఈ సంసారమోహాన్ని త్యజించటం ఎంతోకష్టం; ఏ కొద్ది మందికో ఇది సాధ్యం. మన శాస్త్రాలలో దీనికి రెండు మార్గాలు చెప్పబడ్డాయి. ఒకటి ‘నేతి నేతి – ఇదికాదు, ఇదికాదు’ అనే మార్గం. రెండవది, ‘ఇతి, ఇతి – ఇది, ఇది’ అనే మార్గం. మొదటిది వ్యతిరేకమార్గం, రెండవది అన్వయమార్గం. ఇందులో వ్యతిరేకమార్గం అన్నిటికంటే కష్టం. మహోన్నత లోకోత్తరమనస్కులు, మహానంతసంకల్పశక్తిమంతులు అయినవారు, కేవలం ‘వద్దు, నా కిది వద్దు’ అనగానే వారి నిశ్చయానికి వారి మనశ్శరీరాలు విధేయాలై వుంటాయి. అలాంటివారికే ‘నేతి నేతి’ మార్గం సాధ్యం. వారే ఆ మార్గంలో విజయం పొందగలరు. అలాంటి వారు ఎంతో అరుదు. మానవులలో అత్యధికులు అన్వయమార్గాన్ని, సంసార మార్గాన్ని ఎన్నుకొంటారు. బంధాలను బంధవిమోచన సాధనాలుగా వినియోగించు కొంటారు. ఇదీ ఒకవిధమైన త్యాగమే. కాని విషయాలను తెలుసుకొని, విషయాలను అనుభవించి, ఆ విధంగా అనుభవాన్ని గడించి, వస్తువుల స్వరూపం తెలుసుకొని, మనస్సు వాటిని విడిచిపెట్టి సంగరహితమయ్యే వరకు ఈ త్యాగం క్రమంగా పెంపొందుతుంది. మొదటిమార్గం వివేకంతో సంగరాహిత్యాన్ని అలవరచుకొనటం, రెండవమార్గం కర్మచే, అనుభవంచే సంగరాహిత్యాన్ని సాధించటం. మొదటిది కర్మను చేయడానికి నిరాకరించే జ్ఞానయోగం. రెండవది కర్మను విడిచిపెట్టక ఆచరించే కర్మయోగం. ప్రపంచంలో ప్రతిజీవీ కర్మను నిర్వర్తించవలసే వుంది. ఎవరు ఆత్మలో పూర్తిగా సంతుష్టులై ఉన్నారో, ఎవరి కోర్కెలు ఆత్మను దాటిపోవో, ఎవరి మనస్సు ఎప్పుడూ ఆత్మపరాఙ్మఖంగా ఉంటుందో, ఆత్మే ఎవరికి సర్వస్వమో, అలాంటివారు మాత్రమే కర్మను నిర్వర్తింపరు; ఇతరులు కర్మను ఆచరించే తీరాలి. పైనుండి పడే నీటివెల్లువ స్వాభావికంగానే లోతైన ప్రదేశంలోపడి సుడిగుండాన్ని నిర్మిస్తుంది; ఆ సుడిగుండంలో కాసేపు పరిభ్రమించి తిరిగి నిరాటంకంగా సాగిపోవడానికి నిర్నిరోధ ప్రవాహరూపంలో వెలువడుతుంది. ప్రతిమానవజీవితమూ ఈ వెల్లువ వంటిదే. అది సంసారావర్తంలోబడి దేశకాలనిమిత్తబద్ధమై, ‘నా తండ్రి, నా తల్లి, నా ఖ్యాతి’ అని పలవరిస్తూ ఈ సుడిగుండంలో కొంతకాలం పరిభ్రమించి, చివరి కెలాగో బైటపడి, మునుపటి స్వేచ్ఛను తిరిగి పొందుతుంది. లోకం సమస్తమూ ఇలాగే చేస్తూంది. మనకు కనబడినా కనబడకపోయినా, మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఈ సంసారస్వప్నం నుండి బైటపడడానికే మన మందరం ప్రయత్నిస్తున్నాం. ఈ జగదావర్తం నుండి బయటపడటానికి తోడ్పడేదే మానవుడి లోకానుభవం.
కర్మయోగ మంటే ఏమిటి? కర్మరహస్యాన్ని గురించిన జ్ఞానం. ప్రపంచం సమస్తమూ కర్మను చేస్తూనేఉంది. ఎందుకు? స్వతంత్రంకోసం, మోక్షం కోసం; మనస్స్వతంత్రం, శరీరస్స్వతంత్రం, ఆత్మస్స్వతంత్రం అనే ఒకే లక్ష్యానికై అణువు మొదలు మహోన్నత జీవి వరకు కర్మను చేస్తున్నారు. సమస్త వస్తువులూ స్వాతంత్ర్యం కోసమే సదా ప్రయత్నిస్తున్నాయి. బంధాన్ని తెంపుకొని పరుగులెత్తాలని చూస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు, సమస్తమూ బంధాన్ని విదిలించుకొని పరుగెత్తడానికే ప్రయత్నిస్తు న్నాయి. ప్రకృతిలోని కేంద్రం నుంచి దూరంగా లాగే (సెంట్రిప్యూగల్) శక్తులు, ‘కేంద్రం కేసి ఆకర్షించే’ (సెంట్రిపెటల్) శక్తులు మన విశ్వానికి సంబంధించిన ముఖ్య ధర్మాలై ఉన్నాయి. ప్రహారాలకు సుదీర్ఘ విలంబాలకు లోనై త్రిప్పటచెంది, తర్వాత విషయాలను తెలుసుకోవడానికి బదులు, కర్మయోగావలంబనచే కర్మరహస్యాన్ని, కర్మాచరణవిధానాన్ని, కర్మలోని అఖండ నిర్మాణశక్తిని గ్రహిస్తాం. ముందుగానే శక్తిని వినియోగించే విధానం తెలియకపోతే దానిలో ఎక్కువభాగం వ్యర్థంగా ఖర్చవుతుంది. కర్మయోగం కర్మాచరణానికై శాస్త్రాన్ని ఏర్పరుస్తున్నది; ప్రపంచ నడవడినంతా వినియోగించుకొనే పద్ధతిని కర్మయోగం మనకు బోధిస్తుంది. కర్మ అనివార్యం. అది అలా వుండవలసిందే. కాని మనం కృషిచేయవలసినది పరమపురుషార్థంకోసం. ఈ సంసారం మూడు నాళ్ల ముచ్చట అని, మోక్షానికిది సాధనం కాబట్టి ఇందులో ఉంటూ మనం తరించాలని, విముక్తి ఈ ప్రపంచంలో లేదని, విముక్తిని కనుక్కోవడానికి మన మీ సంసారాన్ని అతిక్రమించాలని, కర్మయోగం మనకు తెలియజేస్తుంది. సంసార తరణానికి తప్పకుండా మనం సంసారంద్వారానే మెల్లగా పురోగమించాలి. కుబుసాన్ని విడిచి దాన్నిచూసే పాములా, సంసారాన్ని విడిచి తటస్థసాక్షులుగా వుండే అసాధారణపురుషులు లోకంలో కొందరుంటారు; వారిని గురించి నే నిదివరకే చెప్పాను. లోకంలో ఇలాంటి అలౌకిక పురుషు లున్నమాట నిజం; కాని మిగిలిన మానవకోటి నెమ్మదిగా కర్మానుభవం పొందాలి. వీరంతా కర్మప్రపంచం ద్వారా నడవవలసినవారే. మనకు అత్యధికలాభకరమైన పద్ధతిలో కర్మరహస్యాన్ని, కర్మాచరణ విధానాన్ని కర్మయోగం మనకు తెలుపుతుంది.
కర్మయోగం ఏం బోధిస్తుంది? ‘అసక్త స్సతతం కార్యం కర్మ సమాచార’ (‘ఫలాపేక్షరహితుడవై విహితమైన కర్మను ఎప్పుడూ చేస్తూండు.) దేనితోనూ తాదాత్మ్యం పొందవద్దు. మీ మనస్సును స్వతంత్రంగా వుంచుకోండి. లోకంలో మీకు కనబడే ఈ దుఃఖాలన్నీ, ఈ బాధలన్నీ సంసారంలో అనివార్యాలైన పరిస్థితులు; దారిద్ర్యం, సంపదలు, సౌఖ్యం అన్నీ క్షణికాలు, ఇవి మన యథార్థస్వరూపంలోనివి కావు. యథార్థస్వరూపం సుఖదుఃఖాతీతం, ఇంద్రియాతీతం, భావనాతీతం. ఐనా మనమెప్పుడూ కర్మను నిర్వర్తిస్తూనే వుండాలి. ‘కర్మచేతగాదు, సంగంచేత దుఃఖం కలుగు తోంది.’ మనం చేసే కర్మతో తాదాత్మ్యం పొందగానే దుఃఖమనుభవిస్తాం. తాదాత్మ్యం పొందకపోతే దుఃఖ మనుభవించం. ఎవరైనా తనదికాక మరొకరి చిత్రపటం తగులబెట్టబడితే సాధారణంగా బాధపడడు; కాని తన చిత్రపటమే తగులబెట్టబడితే తనెంతో బాధపడతాడు. ఎందువల్ల? రెండూ చక్కని పటాలేగదా, రెండూ ఒకే ప్రకృతికే నకళ్లు కాబోలు. కాని దుఃఖం ఒకదానికై కలిగినంతకంటే ఎంతో ఎక్కువగా మరొకదానికై కలుగుతుంది. ఎందుకంటే ఒక పటం పట్ల అతడు తాదాత్మ్యం పొందుతున్నాడు; రెండవదాని విషయంలో పొందటంలేదు. ఈ ‘నేను, నాది’ అనే అహంకార మమకారాలే సర్వదుఃఖాలకు కారణాలు. మనసొమ్ము అనుకోవడంతోనే మమకారం పుడుతుంది. మమకారంచేత దుఃఖం కలుగుతుంది. మమకారంతో గూడిన ప్రతికార్యమూ, ప్రతిభావమూ దేనిలోనో ఒకదానిలో సంగం కలిగించి వెంటనే దానికి మనలను దాసులను చేస్తుంది. మనస్సులో పుట్టే ‘నేను, నాది’ అనే ప్రతివృత్తీ వెంటనే మనచుట్టూ ఒక గొలుసును తగిలిస్తుంది, మనలను బానిసలుగా చేస్తుంది. నేను, నాది అని చెప్పుకొనేకొద్దీ బానిసతనం పెరుగుతుంది. బానిసతనంతో దుఃఖమూ పెరుగుతుంది. కాబట్టి ‘లోకంలో వున్న అన్ని పటాల సౌందర్యాన్ని అనుభవించు, కాని వాటిలో వేటితోనూ మమేకం చెందవద్దు’ అని కర్మయోగం మనకు బోధిస్తుంది. ఏదీ ‘నాది’ అనుకోవద్దు. ‘నాది’ అని అనుకోగానే దుఃఖం మనలను ఆవరిస్తుంది. ‘నా బిడ్డ’ అనికూడా మనసులో అనుకోవద్దు, బిడ్డ ఉండనీ, కాని అది ‘నాది’ అనుకోకు. ‘నా దేహం’ అనుకోకు. ఉన్న చిక్కంతా ఇందులో వున్నది. ఈ శరీరం నీది కాదు, నాది కాదు, మరెవ్వరిదీ కాదు. ప్రకృతి నియమాలచే ఈ శరీరాలు వస్తూ పోతున్నాయి; కాని మనకు బంధం లేదు, మనం సాక్షులం. పటానికి ఎంత స్వాతంత్ర్యం వుందో, గోడ కెంత స్వాతంత్ర్యం వుందో ఈ శరీరానికీ అంతే స్వాతంత్ర్యం వుంది. అలాంటప్పుడు ఈ శరీరం పట్ల మన కెందుకింత వ్యామోహం? చిత్రకారుడు చిత్రాన్నొకదాన్ని గీసి వెళ్లిపోతున్నాడు. ‘ఇది నా అధీనంలో వుండాలి’ అనే మమకారాన్ని పొందవద్దు. పొందితే, మీకు దుఃఖం మొదలైనట్లే!
కాబట్టి కర్మయోగం ఇలా బోధిస్తుంది: “స్వార్థ చింతను మమకారాన్ని తల ఎత్తనియ్యవద్దు; వీటిని మీరు అణచగలిగినప్పుడు అణచివెయ్యండి, మనస్సులో దానికి సంబంధించిన వృత్తినికూడా కలుగనియ్యవద్దు. ఆ తరువాత మీరు సంసారంలో ప్రవేశించి యథాశక్తి కర్మను నిర్వర్తించవచ్చును. అప్పుడు లోకంలో మీ ఇష్టంవచ్చినవారితో సంచరించండి, ఇష్టంవచ్చిన చోటుకు వెళ్ళండి, దానివలన లేశమైనా మీకు దోషం అంటదు. నీళ్లలో వున్నా తామరాకును నీళ్లంటటంలేదు, మీరూ అలాగే సంసారంలో వర్తింపవచ్చును. ఇదే వైరాగ్యం.” వైరాగ్యం లేనిదే ఏ యోగాన్ని సాధింపలేమని మీకు చెప్పినట్లు నాకు జ్ఞాపకం. అన్ని యోగాలకు వైరాగ్యమే మూలాధారం. ఇళ్లలో వుండటం, మంచి దుస్తులు ధరించటం, మధుర భక్ష్యాలను తినటం మానేసి, ఏ ఎడారికో వెళ్లి నివసించేవాడు పరమరక్తుడై వుండవచ్చును. అతడికున్నదంతా అతడి శరీరమే. శరీరమే తన సర్వస్వంగా అతడు గణింపవచ్చును. జీవించినంత కాలం శరీరం కోసమే బాధలు పడతాడు. శరీరానికై మనం చేసేదేదీ వైరాగ్యం కాదు. వైరాగ్యమంతా మనోగతం. ‘నేను, నాది’ అనేవి మానసిక పాశాలు. ఈ పాశాలతో, శరీరంతో, ఇంద్రియ విషయాలతో బంధింపబడని పక్షంలో మనం ఎక్కడవున్నా, ఏమిగావున్నా విరక్తులమే. ఒకడు సింహాసనాసీనుడై వుండీ పరమవిరక్తుడుగాను, మరొకడు చింపిగుడ్డలు ధరించే పరమ రక్తుడుగాను వుండవచ్చును. మొట్టమొదట మనం వైరాగ్యాన్ని సంపాదించి తరువాత నిర్విరామ కర్మాచరణ దక్షులం కావాలి. వైరాగ్యం కష్టసాధ్యమనటం నిజమే. ఐనా కర్మయోగం మనకు ఆ సాధనకు అనువైన మార్గాన్ని చూపుతుంది.
వైరాగ్యసాధనకు రెండుమార్గాలు వున్నాయి. దీనిలో ఒకటి భగవంతునిలో గాని, మరెలాంటి బాహ్యసాహాయ్యంలోగాని నమ్మకంలేని మార్గం. వారి ఉపాయాలు స్వంత ఉపాయాలు. ‘నేను విరక్తుడను కావాలి’ అనే దృఢనిశ్చయాన్ని పూని వాళ్లు తమ మనోబలంతో, వివేకబలంతో కృషిచేయాలి. భగవంతునిలో విశ్వాసం గలవాళ్ల మార్గ మింతకంటె ఎంతో సులభం. వాళ్లు తమ కర్మఫలాలను భగవంతుడికి సమర్పించి, సంగరహితులై కర్మను చేస్తారు. దేన్ని చూసినా, దేన్ని అనుభవించినా, దేన్ని విన్నా, దేన్ని చేసినా సర్వం వాళ్లు భగవదర్పిత మనస్సుతోనే చేస్తారు. మనం ఏ కర్మను చేసినా దానివలన స్వలాభాన్నిగాని, పరులచే పొగడ్తనుగాని ఆశించరాదు. సర్వం భగవంతుడిదే, కర్మఫలాన్ని భగవంతుడికే సమర్పించండి. మనం జగన్నాథుని సేవకులమనీ, అతడి ఆజ్ఞలను నిర్వర్తిస్తున్నామనీ, కర్మను చేసే ప్రతిక్షణమూ అతడే మనలను ప్రేరేపిస్తున్నాడనీ భావించి కర్మఫలాల పట్ల నిర్లిప్తులమై ఉందాం. మీరు ఆరాధించేదంతా, చూసేదంతా, చేసేదంతా భగవంతునికి సమర్పించి శాంతచిత్తులై ఉండండి. మనం పరిపూర్ణ ప్రసన్నచిత్తులమై మన మనశ్శరీరాలను సర్వాన్నీ భగవంతుడికి శాశ్వత సమర్పణంగా, యజ్ఞంగా అర్పిద్దాం. అగ్నిలో హవిస్సులను వ్రేల్చడానికి బదులు అహోరాత్రాలు యజ్ఞనారాయణుడికి అహంకార సమర్పణమనే ఈ మహాయజ్ఞాన్ని, ఈ ఏకైక యజ్ఞాన్ని ఒనర్చండి. “ఈ ప్రపంచంలో నిధినిక్షేపాలను అన్వేషిస్తూ నీవే నా పెన్నిధివని కనుగొన్నాను; నన్ను నీకు సమర్పించుకొంటున్నాను. ఈ సంసారంలో ప్రియుణ్ణి అన్వేషిస్తూ నీవే నా ప్రాణప్రియుడివని కనుగొన్నాను; నన్ను నీకు సమర్పించుకొంటున్నాను.” భగవంతుడికి రేయింబవళ్లు ఇలా ఆత్మనివేదన చేసుకొంటూ ఇలా వక్కాణిద్దాం: “ఏదీ నా కోసం కాదు. మంచిదైనా, చెడ్డదైనా, ఆ రెండూ కానిదైనా నేను లక్ష్యపెట్టను; నా సర్వస్వం నీకే సమర్పిస్తాను.” మన ఆభాస వ్యక్తిత్వాన్ని రాత్రింబవళ్లు ఇలా త్యజిద్దాం. దానినలా వదులుకోవడం మనకొక అలవాటు అయ్యేవరకు, అది మన రక్తంలోనికి, నరాలలోనికి, మెదడులోనికి చొచ్చుకొనేవరకు, అహంకారత్యాగ సంకల్పానికి మన శరీరం యావత్తు ప్రతిక్షణమూ విధేయమయ్యేవరకు – రేయింబవళ్లు భగవంతుడికి మనలను మనం సమర్పించుకొందాం. రణభేరీ నినాదాలతో, ఫిరంగుల మోతలతో అఖండ కోలాహలంతో నిండిన రణరంగ మధ్యానికి వెళ్లినా మీరప్పుడు ప్రశాంతచిత్తులై, నిర్లిప్తులై ఉంటారు.
‘కర్తవ్యం (duty) అనే సామాన్యాశయం కింది భూమికలోనిదని కర్మయోగం మనకు బోధిస్తుంది; అయినా మనమంతా మన కర్తవ్యాన్ని ఆచరించాల్సినవారమే. కాని వింతైనా ఈ కర్తవ్యబుద్ధి తరచు మహాదుఃఖ కారణమవటం మీరు గుర్తించవచ్చును. కర్తవ్యం మనలో ఒక రుగ్మతగా పరిణమించి వుంది; ఇదే మనలను కర్మరంగానికి లాగుతోంది. ఇది మనల నావహించి మన జీవితాన్ని దుఃఖమయం చేస్తూంది. ఇదే మానవ జీవిత వృక్షానికి వేరు పురుగు. ఈ కర్తవ్యం – ఈ కర్తవ్యచింత మానవ మనః కమలాన్ని దహించి వేస్తూన్న గ్రీష్మసూర్యుడు. పాపం, కర్తవ్యదాసులను అలా చూడండి! కర్తవ్యాలచే వారికి స్నానంచేయడానికి తీరికలేదు, భగవంతుని ప్రార్థించడానికి తీరికలేదు. సదా ‘కర్తవ్యం’ వారిని ఆవహించి వుంది. ఇంటినుండి వెళ్లి వాళ్లు కార్యనిమగ్నులై ఉంటారు. ‘కర్తవ్యం’ వారినావహించి వుంది! ఇంటికి వచ్చి, తిరిగి మరునాటి కార్యాలను గురించి ఆలోచిస్తారు. ‘కర్తవ్యం’ వారి నావహించివుంది! బండికి పూన్పబడిన గుర్రం మాదిరి చివరకు ఏ నడివీథిలోనో ప్రాణాలు విడువవలసివచ్చే ఇలాంటి జీవితం కేవలం బానిసజీవితం గాదా! కర్తవ్య మంటే అందరికీ వర్తించే అర్థం ఇదే. సంగరహితులమై, స్వేచ్ఛామయులమై కర్మఫలాన్ని భగవంతుడికి సమర్పించి కర్మలను నిర్వర్తించటం ఒక్కటే యథార్థ కర్తవ్యం. మనవిధులన్నీ భగవంతునివి. ఆయన కార్యాలను ఒనర్చడానికి నిమిత్తమాత్రులమైనందుకు మనం ధన్యులం. మన నియమితకాలం మనం సేవచెయ్యాలి; అది బాగా చేస్తామో లేదో ఎవరికి తెలుసు? బాగా చేస్తే ఫలం మనది కాదు; బాగా చెయ్యకపోయినా బాధ్యత మనది కాదు. కాబట్టి శాంతచిత్తుడవై, బంధరహితుడవై కార్యాలను ఒనర్చు. ఇలాంటి స్వాతంత్ర్యాన్ని పొందటం ఎంతో కష్టం. దాస్యాన్ని కర్తవ్యమనుకోవటం ఎంత సులభం? – రక్త మాంస కల్పిత శరీరంపై వ్యామోహానికి కర్తవ్యం అని పేరిడటం! జనం లౌకిక జీవితంలోకి దిగి, ధనంకోసమో, తమకు మోహమున్న మరి దేని కోసమో పెనుగులాడుతుంటారు, కలహిస్తుంటారు. “ఎందుకీ గందరగోళం?” అని వారిని అడగండి. “ఇది మా విధి కదా” అని జవాబిస్తారు. కాని నిజానికిది విపరీతమైన కాంచన వ్యామోహం, స్వలాభాపేక్ష. అయినా వాళ్లు దీన్ని పువ్వులతో కప్పిపుచ్చుతారు.
ఇంతకూ విహితకర్తవ్యమంటే ఏమిటి? మాంసఖండమైన ఈ శరీరానికి వేరొక శరీరంపై గల ఆకర్షణ, మమకారం; మమకారం స్థిరపడగానే దానికి మనం కర్తవ్యమని నామకరణ చేస్తాం. ఉదాహరణకు, వివాహాచారం లేని దేశాలలో భార్యభర్తల మధ్య కర్తవ్యాలు లేవు. వివాహమైనప్పుడు పరస్పర మోహానికి కట్టుబడి వాళ్లు కలిసి జీవిస్తారు. కొన్ని తరాలైన పిదప ఆ విధమైన జీవనం స్థిరపడుతుంది; స్థిరపడగానే అది విధి అవుతున్నది. ఇదొక విధమైన దీర్ఘరోగమని చెప్పవచ్చును. అది తీవ్రమైనప్పుడు దానిని రోగ మంటున్నాం; ఆ రోగమే జీర్ణించినప్పుడు దానిని స్వభావమంటున్నాం. అది రోగం. అది తీరనిదవగానే దానికే ధర్మమనే పెద్దపేరు పెడుతున్నాం. దానిపై పువ్వులు చల్లుతున్నాం; వాద్యాలు మోగిస్తున్నాం. మంత్రాలు పఠిస్తున్నాం; ఇక ఈ ధర్మం నిమిత్తం లోకామంతా నడుంబిగించి యుద్ధానికి దిగుతుంది; ఇక లోకులు ధర్మదీక్షాబద్ధులై ఒకరినొకరు దోచుకోబోతారు. మానవుడిలోని పశుస్వభావాన్ని నిరోధించే వరకు కర్తవ్యబుద్ధి మంచిదే. మరే ఇతర ఆదర్శమూ లేని నిమ్నస్థాయి వ్యక్తులకు ఇది కొంతదాకా శ్రేయస్కరమే. కాని కర్మయోగులు కావాలనుకొనేవారు ఈ కర్తవ్యబుద్ధిని త్రోసిరాజనాలి. మీకూ నాకూ ఏ విధీ లేదు. లోకానికి నీవు ఇవ్వాలనుకున్న దాన్ని అన్ని విధాలా ఇవ్వు, కాని ‘విధి’ గా మాత్రం కాదు. లోకానికి దీన్ని నేనిచ్చాను అని కలలో కూడా తలంచవద్దు. కర్మాచరణంలో బందీవిగాకు. నువ్వెందుకు బందీవి కావాలి? నిర్బంధంచేత ఏ కార్యాన్ని చేసినా అది సంగాన్ని కలిగిస్తుంది. ఏ విధికూడా నీకెందుకుండాలి? సమస్తం భగవంతుడికి సమర్పించు. అందరినీ దహించే కర్తవ్యవహ్ని రగులుతున్న ఈ భీకరాగ్ని కుండంలో ఈ అమృతాన్ని గ్రోలిసుఖీంచు. పరమేశ్వర సంకల్పాన్నే మనం నెరవేరుస్తున్నాం. పాపపుణ్యఫలాలతో మనకు పనేమిటి? నీకు పుణ్యం కావాలనుకుంటే పాపానికి సిద్ధపడాలి. పాప ఫలం నుండి తప్పించు కోవడానికి ఏకైకమార్గం పుణ్యఫలాన్ని కూడా విడిచిపెట్టటమే. దుఃఖం నుండి విముక్తి పొందాలనుకుంటే సుఖాసక్తిని విడువటమే ఏకైకమార్గం. సుఖదుఃఖాలు పరస్పరం అంటుకొని వుంటాయి. ఒకవైపు సుఖముంటే మరోవైపు దుఃఖం వుంటుంది. ఒకవైపు జన్మముంటే మరోవైపు మృత్యువు వుంటుంది. మరణాతీతుల మవాలంటే జీవితాభినివేశాన్ని విడువడమే ఏకైక మార్గం. జనన మరణాలు ఒక్కటే; రెండు వేరువేరు కోణాలనుంచి చూడబడే ఒకే సత్యము. కాబట్టి ‘దుఃఖరహితమైన సుఖం’ – ‘మృత్యురహితమైన జన్మ’ అనే ఆశయాలు పసిపిల్లలకు, బడిపిల్లలకు చాలా బాగుంటాయి. కాని వివేకి ఇది కేవలం విరుద్ధార్థాలనిచ్చే పదగుంభనమని గుర్తించి రెండింటిని విడిచిపెడతాడు. కాబట్టి మీరేపని చేసినా, దానివల్ల మీకు పొగడ్తగాని బహుమానంగాని రావాలని కోరవద్దు. మన మొక సత్కార్యాన్ని చేశామో లేదో వెంటనే జనులు మనలను శ్లాఘించాలని కోరుకొంటాం. ఏ ధర్మకార్యానికో కొంత ధనం ఇవ్వగానే మన పేర్లు పత్రికలలో రావాలని వాంఛిస్తాం. దుఃఖమే కదా ఇలాంటి వాంఛలకు ఫలం. ప్రపంచంలోని మహామహులు ఎవరికీ తెలియకుండానే గతించారు. వారిని గురించి లోకానికి కాస్తకూడా తెలియదు. ఈ మహామహులతో పోలిస్తే మనకు తెలిసిన బుద్ధులు, క్రైస్తులు రెండవ తరగతివారే. నిశ్శబ్దంగా పాటుబడ్డ అలాటి అజ్ఞాతమహానుభావులు వందలమంది ప్రతిదేశంలోనూ జీవించారు. నిశ్శబ్దంగా జీవించి, నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. కాలక్రమాన వారి భావాలు, ఆలోచనలు బుద్ధుల, క్రైస్తుల మాటలలో వెలువడతాయి.మనకు తెలిసినది ఈ బుద్ధులు, క్రైస్తులే. ఉత్తమోత్తములు ఎన్నడూ తమ జ్ఞానంచేత పేరు ప్రతిష్ఠలను పొందాలని ఆశించరు. వాళ్లు తమ ఆశయాలను లోకానికి విడిచిపెడతారు; అవి తమవని చెప్పరు, తమ పేర సంప్రదాయాలను, సిద్ధాంతాలను నెలకొల్పరు. అలా చేయడానికి వారి ప్రకృతి సమస్తం వెనుదీస్తుంది. వాళ్లు శుద్ధసాత్త్వికులు. వారెలాంటి సంచలనాన్ని కలిగింప ఇష్టపడరు. తమ ప్రేమలో తామే కరిగిపోతారు. భారతదేశంలో ఒక గుహలో నివసించే ఇలాంటి యోగిపుంగవుణ్ణి* ఒకరిని నేను దర్శించాను. నేను చూసిన అత్యద్భుతవ్యక్తులలో ఈయనొకరు. ఈయన తన వ్యక్తిత్వాన్నే మరిచిపోయాడు, అహంకారం ఆయనలో మచ్చుకైనా కనబడదు. సర్వాన్ని తనలో ఇముడ్చుకొన్న దివ్యత మాత్రమే ఆయనలో వున్నది. జంతు వేదైనా ఆయన చేతిని కరిస్తే రెండవ చేతిని కూడా దాని కివ్వడానికి సంసిద్ధుడై, సర్వం పరమేశ్వరేచ్ఛ అంటారు; తన కేమి ప్రాప్తించినా పరమేశ్వర సంకల్పమే. లోకుల కాయన తనను చూపుకోడు, ఐనా ఆయన దివ్యాశ్రయ ప్రపూర్ణుడు, ప్రేమామృత సింధువు.
ఇలాంటి యోగిపుంగవులకు పిదప ఎన్నదగినవారు రజో గుణాధికులు, కార్యదక్షులు, ధర్మరక్షణకై నడుంబిగించి పోరాడేవారు. పరిపూర్ణుల భావాలను గ్రహించి వీళ్లు వాటిని లోకానికి బోధిస్తారు. ఉత్తమోత్తములైనవాళ్లు నిశ్శబ్దంగా మహోదార పారమార్థికాశయాలను సేకరిస్తారు; ఇతరులు– బుద్ధులూ, క్రైస్తులూ ఊరూరా తిరిగి ధర్మప్రబోధం చేస్తూ పాటుపడతారు. గౌతమబుద్ధుడు తను ఇరవై ఐదవ బుద్ధుణ్ణని చెప్పుకొన్నట్లు అతడి జీవిత చరిత్రలో కనిపిస్తుంది. ఇతడి ముందు జీవించిన ఇరవైనాలుగుమందీ చరిత్రకు అందలేదు, అయినా వాళ్లు వేసిన పునాదుల మీదనే ఈ చారిత్రకబుద్ధుడు తన ధర్మసౌధాన్ని నిర్మించాడు. ఉత్తమోత్తము లెప్పుడూ మౌనులుగా, ప్రశాంతులుగా, అజ్ఞాతులుగా వుంటారు. వాళ్లే బుద్ధిప్రభావాన్ని నిజంగా గ్రహించినవాళ్లు. తామొక గుహలో కెళ్లి, ద్వారాన్ని బంధించి, యథార్థాలైన ఐదు భావాలను భావించి దానితో గతించినా, ఆ ఐదు భావాలూ ఆచంద్రార్కం వెలుగొందుతాయని వారికి బాగా తెలుసు. నిజంగా అలాంటి భావాలు పర్వతాలను చీల్చుకొని, సాగరాలను లంఘించి, ప్రపంచవ్యాప్తిని గాంచుతాయి. అవి మానవ హృదయాంతరాళంలో ప్రవేశించి, మెదడులోకి వ్యాపించి. జీవిత ప్రవర్తనలలో వ్యవహారాలలో తమను అభివ్యక్తం చేసే స్త్రీ పురుషులను తయారుచేస్తాయి. ఇలాటి సత్త్వస్వరూపులు సదా సర్వేశ్వరుడికి అత్యంత సన్నిహితులై వుండటంచేత కార్యనిరతులు కాలేరు; పోరాడలేరు, పాటుపడలేరు, పెనుగులాడలేరు, బోధించలేరు, లోకహితాన్ని ఒనరించలేరు. ఎంత మంచివారైనా తీవ్ర కార్యనిమగ్నులైన వారిలో, ఏ కొంచెమో అజ్ఞానం ఇంకా నిలిచి వుంటుంది. మన స్వభావంలో కొంతమాలిన్యం వుంటేనేగాని కర్మచెయ్యలేం. సాధారణంగా రాగంచేత, ప్రయోజనేచ్ఛచేత ప్రేరేపించబడటం కర్మ స్వభావంలోనే వుంది. చీమ చిటుక్కుమంటే గ్రహించే జగద్రక్షకుని ముందు మానవుడు తన కర్మలకు ఎలాంటి ప్రాముఖ్యాన్ని ఆరోపించుకోగలడు. జగన్నాథుడే జగత్తులోని ప్రతి అల్పవస్తువును గూర్చీ శ్రద్ధ వహిస్తున్నాడని గ్రహించీ మన చేష్టలకు ప్రాముఖ్యాన్ని కల్పించుకోవటం దైవనిందకదా? మనం ఆదరాద్భుతాలతో నిలబడి కరాలుమోడ్చి ‘నీ ఇచ్ఛనే నెరవేరుస్తాం’ అని ప్రార్థింపవలసినవారమే! మహోన్నతులు పూర్తిగా సంగవిరహితులై వుండటంచేత కర్మ చేయలేరు. ఎవరి మనసు ఆత్మలీనమై వుందో, ఎవరి కోర్కెలు పరమాత్మైకనిష్ఠ్ఠలో, ఎవరు పరమాత్మతో నిత్యయోగం పొందివున్నారో అలాటివారికి కర్మలేదు. వారే నిజంగా మానవోత్తములు. వారుతప్ప మిగిలినవారంతా కర్మను నిర్వర్తించే తీరాలి. అలా చేసేటప్పుడు లోకంలో ఎంత అల్పవస్తువుకైనాసరే మనం సహాయపడగలమని ఎన్నడూ భావించకుండా వుందాం. మేలు చేయటం మనవల్లకాదు. ప్రపంచమనే ఈ గొప్ప వ్యాయామశాలలో మనం చేసే మేలు మనకే. ఇదే కర్మాచరణంలో మనకుండవలసిన సరైన మనోవైఖరి. ఈ విధంగా కర్మను చేస్తే, ఇలా కర్మాచరణ మనకు భగవంతుడు ప్రసాదించిన గొప్ప అవకాశమని ఎప్పుడూ మనం గుర్తించి ప్రవర్తిస్తే, మనకు దేనిలోను ఎప్పుడూ సంగం కలుగదు. మీలాటి నాలాటి లక్షలమంది తాము ఈ లోకంలో ఘనులమని భావిస్తుంటారు. కాని మనమందరం మరణిస్తాం. మరణించిన ఐదు నిమిషాలకే ప్రపంచం మనలను మరిచిపోతుంది. కాని భగవంతుడు శాశ్వతుడు. ‘సర్వశక్తిమంతుడు సంకల్పించకపోతే ఎవడైనా ఒక్కక్షణం జీవించగలడా? ఒక్కక్షణం శ్వాసించగలడా?’ అతడే సదా జగద్వాపార పరాయణుడైన దేవుడు. సమస్త శక్తీ అతడిది, అతడి అధీనంలోనిది. అతడి ఆజ్ఞచేత గాలులు వీస్తున్నాయి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, పుడమి జీవిస్తున్నది, భూమిలో మృత్యువు తాండవిస్తూంది. అతడే సర్వనిర్వాహకుడు, సర్వం ఆయనే, సర్వంలోను వున్నవాడు ఆయనే. మనచేతనైనది ఆయన్ను ఉపాసించటం మాత్రమే. సర్వకర్మఫలత్యాగంచెయ్యి. లోకం మేలుకోసమే లోకహిత మొనర్పండి; అప్పుడే అఖండ వైరాగ్యం కలుగుతుంది. ఇలా హృదయగ్రంథులు తెగి అఖండ మోక్షం ఫలిస్తుంది. నిజానికి ఇలాంటి మోక్షమే కర్మయోగ లక్ష్యం, గమ్యమూనూ.