ఏ విధంగా మనలోనుండి వెలువడే ప్రతి కర్మా ప్రతిక్రియగా మన వద్దకే వస్తుందో, అదేవిధంగా మన పనులు ఇతరులమీద ప్రభావం చూపవచ్చు, వారివి మనపై ప్రభావం చూపవచ్చు. దుష్కార్యాలు చేసేకొద్దీ జనులు మరింత దుర్జనులవడం, సత్కార్యాలు చేసేకొద్దీ వారి బలం మెట్టుమెట్టుగా పెరగటం, సదా మంచిపనులనే చేయడం వారి కలవాటుకావడం మీరంతా గుర్తించి వుండవచ్చును. ఇలా కర్మప్రభావం బలవత్తరమవటం అనేది, మన కర్మలు ఇతరులపై, ఇతరులవి మనపై ప్రభావం చూపుతాయి అని చెప్పడం ద్వారా మనం వివరణను ఇవ్వవచ్చు. భౌతిక శాస్త్రంనుండి దీనికొక ఉదాహరణ; నేనొక పని చేస్తున్నప్పుడు నా మనస్సు ఒకానొక స్పందనస్థితిలో వుంటుందని చెప్పవచ్చును; అప్పుడు అదే స్పందన స్థితిలో ఉన్న ఇతర మనస్సులపై నా మనస్సు ప్రభావం చూపిస్తుంది. ఒకేరీతిని శృతిమేళవింపబడిన వివిధ వాద్యాలు ఒకే గదిలో వున్నప్పుడు వాటిలో ఒక దానిని ధ్వనింప చేస్తే మిగతావి మ్రోగి, ఆ స్వరాలనే పలికే ప్రవృత్తిని కలిగి ఉండటం మీరంతా గమనించి వుంటారు. కాబట్టి సమానమైన మేళవింపువున్న మనస్సులన్నీ ఒకే ఆలోచనకు సమానంగానే ప్రతిస్పందిస్తాయి. మనస్సుపై ఆలోచనల ప్రభావం దూరం మరియు ఇతర కారణాలనుబట్టి మారుతుంది గాని ఆలోచనల తాకిడికి మనఃకవాటం ఎప్పుడూ తెరవబడే వుంటుంది. నే నొక దుష్కార్యం చేస్తున్నాననుకోండి. అప్పుడు నా మనస్సు ఒకానొక స్పందన స్థితిలో వుంటుంది. లోకంలో అలాంటి స్థితిలోనే వున్న ఇతరుల మనస్సులన్నీ నా మనస్స్పందన స్థితి ప్రభావానికి లోనయ్యే అవకాశం వుంటుంది. ఇలాగే నేనొక మంచిపనిని చేస్తున్నప్పుడు నా మనస్సు మరో స్పందనస్థితిలో వుంటుంది; అప్పుడు అదే స్పందన స్థితిలో వున్న ఇతరుల మనస్సులన్నీ నా మనఃప్రభావానికి లోనయ్యే అవకాశం వుంటుంది. పరస్పరం ఒకమనస్సు మరొక మనసుపై చూపే ప్రభావం యొక్క తీవ్రత వాటి సంకల్పబల హెచ్చు తగ్గులనుబట్టి వుంటుంది.
పై దృష్టాంతాన్నే మరికొంత వివరంగా చూద్దాం – కాంతి తరంగాలు ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుగా కొన్ని లక్షల సంవత్సరాలు పయనించి వుండవచ్చును గదా. అలాగే భావతరంగాలు సమాన స్పందనలు గల లక్ష్యం (మనస్సు) వాటికి లభించడానికి ముందు వందల సంవత్సరాలు పయనించి వుండవచ్చును. కాబట్టి మన వాతావరణం మంచి, చెడ్డ భావస్పందనలు – రెంటితోనూ పూర్తిగా నిండి ఉండవచ్చును. ప్రతి మనస్సు నుండి వెలువడే ప్రతిభావమూ తనను స్వీకరించడానికి అనువైన మనస్సును కలుసుకొనే వరకూ స్పందిస్తూ పయనిస్తూనే వుంటుంది. ఇలాంటి భావాలను గైకొనడానికి కవాటాన్ని తెరిచివుంచుకొన్న ఏ మానసమైనా వెంటనే వాటిని స్వీకరిస్తుంది. కాబట్టి ఒకవ్యక్తి దుష్కార్యాలను చేస్తున్నప్పుడు అతడు తన మనస్సును ఒక స్పందనస్థాయికి, ఒక పౌనఃపున్య పరిధి లోనికి తెచ్చుకొంటాడు. అలాంటి స్థాయికి తగినట్టి, అదే పౌనఃపున్యం కలిగి వాతావరణంలో ఇదివరకే వున్న తరంగాలన్నీ అతడి మానసంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. దుష్కార్యాలను చేసే వ్యక్తి సాధారణంగా చెడుపనులను ఇంకా ఇంకా ఎక్కువగా చేయడానికి కారణం ఇదే. అతడి దుష్కార్యాలు తీవ్రంగా పెరిగిపోతుంటాయి. సత్కార్యాలు చేసే వ్యక్తి విషయంకూడా ఇలాగేవుంటుంది; చుట్టూ ఉన్న ఆవరణలోని ‘మంచి’ ఆలోచనా తరంగాలను అతడు తనలోనికి చొరబడనిస్తాడు, అతడి సత్కార్యాలు మరింత పెరిగిపోతాయి. కాబట్టి దుష్కార్యాలు చేసే పక్షంలో రెండు రకాల ఆపదలకు గురవుతున్నాం: ఒకటి మన చుట్టూవున్న దుర్భావాలన్నీ మనలోనికి ప్రవేశించడానికి అవకాశమిస్తున్నాం! రెండు కొన్ని వందల సంత్సరాల తరువాతైనా ఇతరుల మీద ప్రభావం చూపే చెడును సృష్టించటం. మన దుష్కార్యాచరణంవల్ల మనకూ, ఇతరులకూ బాధ కలుగుతుంది. మన సత్కార్యాచరణ వల్ల మనకూ, పరులకూ మంచి కలుగుతుంది. అంతేకాక మానవుడిలోని ఇతర శక్తులన్నిటిలాగా మంచి, చెడు అనే ఈ శక్తులూ బాహ్యప్రపంచం నుండి తాము బలాన్ని సంపాదించుకొంటున్నాయి.
కర్మయోగానుసారం, మనం చేసే కర్మ ఫలవంతం కానిదే నశించదు. ప్రకృతిలోని ఏ శక్తీ దానిని ఫలింపనివ్వక నిరోధించలేదు. నేనొక దుష్కార్యాన్ని చేస్తే దాని దుష్ఫలాన్ని నేను అనుభవించి తీరాలి; ఈ ప్రపంచంలోని ఏ శక్తీ దాన్ని మాన్పలేదు, ఆపలేదు. అలాగే నేనొక సత్కార్యాన్ని చేస్తే అది సత్ఫలప్రదం కాకుండా అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో లేదు. కారణముంటే కార్యం వుండితీరాలి, దాన్ని ఏదీ ఆపలేదు, అడ్డుకోలేదు. ఇక కర్మయోగాన్ని గురించి అతిచక్కని అనుపేక్ష్యమైన విషయం ఒకటి ప్రస్తావింప దగినది:– మన సత్కార్యాలు దుష్కార్యాలు అత్యంతం, అన్యోన్యసంబద్ధాలై వున్నాయి. మంచి చెడుల మధ్య ఒక గీత గీసి, ఇది పూర్తిగా మంచికార్యం, ఇది పూర్తిగా చెడ్డకార్యం అని చెప్పలేం.ఒకే సమయంలో సత్ఫలితాన్ని, దుష్ఫలితాన్ని ఇవ్వలేని కార్యం లేనేలేదు. దీనికి అతి దగ్గరి ఉదాహరణ: నేను మీతో ప్రసంగిస్తున్నాను. మీలో కొంతమంది నేను సత్కార్యాన్ని చేస్తున్నానని భావించవచ్చు. కాని ఇదే సమయంలో వాతావరణంలోని కొన్ని వేల క్రిములు నాచే చంపబడుతున్నాయేమో! ఆ విధంగా కొన్ని ప్రాణులకు చెడును చేస్తున్నానేమో. మనం చేసే పని మనకు అత్యంత ప్రియమై, మన పరిచయస్తులకు మేలు చేస్తుంటే దానిని గొప్ప సత్కార్యమంటున్నాం. ఉదాహరణకు మీరు నా ఉపన్యాసవ్యాపారం చాల మంచిదని చెప్పవచ్చును. కాని క్రిములలా చెప్పవు కదా. నేను చేసే ప్రసంగం మీ విషయంలో ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తుందో మీకు కనబడుతున్నది. కాని క్రిముల విషయంలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తోందో మీకు కనబడటం లేదు. కాబట్టి మన దుష్కార్యాలను కూడా మనం పరిశీలించి చూస్తే ఎక్కడో వాటివల్ల కొంత మేలు జరగడానికి అవకాశం వుందని మనకు తెలుస్తుంది. సత్కర్మలలో కూడా ఏదో కొంత చెడు వుందని, దుష్కర్మలలోను ఏదో ఒకమూల కొంత మేలు వున్నదని గుర్తించే వ్యక్తే కర్మరహస్యాన్ని గ్రహించినవాడు.
కాని దీనివలన తేలేదేమిటి? మనమెంత ప్రయత్నించినా పూర్తిగా పవిత్రమని చెప్పదగ్గ కర్మగాని, పూర్తిగా అపవిత్రమని చెప్పదగిన కర్మగాని – పవిత్రతాపవిత్రతలను అహింస, హింస అనే అర్థంలో తీసుకుంటే వుండబోదు. ఇతరులకు హింస కలగకుండా జీవించలేం, శ్వాసించలేం; మనం నోట పెట్టుకొనే ప్రతి అన్నపుముద్ద మరొకడి నోటినుండి లాగుకొన్నదే. మన జీవితాలే ఇతరుల జీవితాలను నెట్టివేస్తున్నాయి. మానవులనో, జంతువులనో, సూక్ష్మక్రిములనో –వీటిలో వేటినైనా నెట్టివేయక మనకు తప్పదు. కాబట్టి కర్మచేత పరిపూర్ణత సిద్ధింపదనే పర్యవసానం సహజంగా కలుగుతున్నది. అనంతకాలం మీరు కర్మచేసినా క్లిష్టమైన ఈ కర్మమ్యాహం నుండి బయటపడే మార్గం లేదు. మీరు కర్మలను ఎడతెరపిలేక చేస్తున్నా కర్మ ఫలితంలోని ఈ మేలు కీడుల కలయికకు అంతుండదు.
కర్మకు లక్ష్యమేది అనేది మనం విచారించవలసిన రెండవ విషయం. ఈ విశ్వం పరిపూర్ణస్థితికి వచ్చే సమయం – ప్రపంచంలో వ్యాధిగాని, జరామరణాలు గాని, దుఃఖదౌష్ట్యాలుగాని లేని సమయం –వస్తుందని నమ్మే అధికసంఖ్యాక జనులు ప్రతిదేశంలోను కానవస్తారు. ఇది చాలమంచి అభిప్రాయమే. అజ్ఞానులకు ఉత్సాహాన్ని, ఉన్నతిని కలుగచేసే మంచి ప్రేరకశక్తే; కాని క్షణం ఆలోచిస్తే ఇది అసంభవమని స్పష్టంగా తెలిసిపోతుంది. మంచి చెడులు ఒకే నాణెపు ఇరువైపులు అనడం స్పష్టమైనప్పుడు అది ఎలా శక్యమౌతుంది? మేలు కలుగుతూ అదే సమయంలో కీడు లేకుండటం ఎలా సాధ్యం! పరిపూర్ణత అంటే ఏమిటి? పరిపూర్ణ జీవితమనటం ‘విరోధాలంకారం’. మనకూ బాహ్యప్రపంచంలోని ప్రతివస్తువుకు నిరంతరం సాగే పోరాటమే కదా మన జీవితం. ప్రతిక్షణం బాహ్యప్రకృతితో మనం నిజంగా పోరాడుతూనే వున్నాం; ఓడిపోతే జీవితం అంతరించవలసిందే. తిండికోసం గాలికోసం ఎడతెరపిలేక చేసే పోరాటమే జీవితం. వీనిలో ఏది లేకున్నా మరణిస్తాం. జీవితం నిరాటంక సరళప్రవాహం కాదు. అదొక సమ్మిశ్రఫలితం. లోపలవున్న ఫలానా దానికీ, బాహ్య ప్రపంచానికి సంఘటిల్లే అనేక విధాలైన ఈ పోరాటాన్నే మనం జీవితమంటున్నాం. కాబట్టి అనేక విధాలైన ఈ పోరాటం అంతమైనప్పుడు జీవితమూ అంతమౌతుందనటం సుస్పష్టం.
ఈ పోరాటం అంతమైన స్థితినే ఆదర్శసౌఖ్య మంటాము. కాని అప్పుడు జీవితమూ అంతమౌతుంది. ఎందుకంటె జీవిత మంతమైనప్పుడే ఈ పోరాటమూ అంతమౌతుంది. లోకానికి తోడ్పడటంలో మనం మనకే తోడ్పడుతున్నామని ఇదివరకే గుర్తించాం. మనలను మనం పునీతులం చేసుకొనటమే పరార్థకర్మకు ముఖ్యప్రయోజనం. ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నంచే మనలను మనం మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనలను మనం మరచిపోవడమే జీవితంలో నేర్చుకోదగిన గొప్ప గుణపాఠం. అవివేకంతో మానవుడు తన్నుతాను సుఖీని చేసుకోగలనని భావిస్తాడు. కాని అనేక సంవత్సరాలు కొట్టుమిట్టాడి చివరకు స్వార్థపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని, తన సౌఖ్యం తన చేతిలో వున్నదేగాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు. ప్రతి ధార్మిక కృత్యం, ప్రతి ప్రేమ భావం, ప్రతి పరహితార్థకర్మ, ప్రతిసత్కార్యం అల్పులమైన మన స్వాతిశయ భావాన్ని తొలగించి మన నీచత్వాన్ని, అల్పత్వాన్ని తెలియజేస్తాయి కాబట్టి ఇవన్నీ మంచివే. జ్ఞాన భక్తి కర్మలు ఇక్కడ ఐక్యమవటం చూస్తున్నాం. మహోన్నత లక్ష్యమేమంటే ‘నేను’ అనేది పూర్తిగాలేక సర్వం ‘నువ్వే’ అవటం. ఆఖండము నిత్యము అయిన అహంకార త్యాగం. మనిషి తాను ఎరిగినా, ఎరగకపోయినా కర్మయోగం మానవుణ్ణి ఈ పరమావధికి చేరుస్తుంది. నిర్గుణ, నిరాకార బ్రహ్మమంటే మతధర్మ ప్రబోధకుడు భయపడవచ్చును. తన వ్యక్తిత్వాన్ని, ఉనికిని నిలుపుకొనాలనే భావంతో ‘సగుణ బ్రహ్మా’ న్నే అతడు నొక్కి పలుకవచ్చు – వ్యక్తిత్వమంటే అతడికి ఏమైనా అర్థమై ఉండవచ్చును. నీతిని గురించి ఆయన భావాలు, నిజంగా అవి యోగ్యములై వుంటే అత్యున్నత స్వాత్మత్యాగంపై ఆధారపడి వుండటం విధాయకం. సమస్త నీతికీ అహంకారత్యాగమే మూలాధారం; మానవుల విషయంలోగాని, జంతువుల విషయంలోగాని, దేవతల విషయంలోగాని, సమస్త నీతి వ్యవస్థలకు ఇదే మూలతత్త్వం, ప్రధానాశయం.
లోకంలో అనేక వర్గాల మానవులు మీకు కనిపిస్తారు. మొట్టమొదట దివ్యావతారమూర్తులున్నారు. వారి ఆత్మత్యాగం సమగ్రం. వారు తమ ప్రాణాలనైనా పరిత్యజించి ఇతరులకు మేలు చేస్తారు. మానవులలో వీరే మహోన్నతులు. ఏ దేశంలోనైనా ఇలాటి మహనీయులు ఒక వంద మంది వుంటే ఆ దేశానికి ఎన్నడూ భయం వుండదు. కాని దురదృష్టవశాత్తు వీరు అత్యల్పసంఖ్యాకులై వున్నారు. తమ ప్రయోజనాలకు హని కలగనంతవరకూ పరహిత మొనర్చే సజ్జనులు రెండవ తరగతివారు; ఇక స్వప్రయోజనాలకోసం పరులకు హాని చేసే జనులు మూడవ తరగతి వారు. పరులకు హింస కల్గించటమే ప్రవృత్తిగా నాల్గవ తరగతి ఒకటి వుందని వీరి నేమని పేర్కోవాలో తెలియదన్నాడు ఒక సంస్కృత కవి.* లోకంలో కేవలం అవ్యాజంగా పరహితమొనర్చే మహోన్నత సజ్జనులు ఒక ధ్రువం అయితే, కేవలం అకారణంగా పరహింస చేసేవారు మరొక ధ్రువం. దానివలన వారికి లేశమైనా లాభం లేకున్నా దుష్కార్యాలు చేయడమే ఈ రెండవ తరగతి వారి స్వభావం.
ఇవిగో రెండు సంస్కృత పదాలు:–ఒకటి ‘ప్రవృత్తి’ అంటే మెలగటం; రెండవది ‘నివృత్తి’ అంటే తొలగటం. సంసార మనేదే, మమతాహంకారాలే ‘ప్రవృత్తి’. ధనంచే, సంపదచే, శక్తిచే, పేరుప్రఖ్యాతులచే సమత్వ బుద్ధిని పెంచుతూ గట్టిగా పట్టుకొనే స్వభావం కలిగి, సమస్తమూ ‘నేను’ అనే కేంద్రం వద్ద ప్రోగుపరచేవన్నీ ‘ప్రవృత్తి’ లో చేరుతాయి. సమస్త ప్రాంతాల నుండి సమస్త వస్తువులను తనకు ప్రియతమమైన ‘నేను’ అనే స్థానంలో కూడబెట్టుకొనే మానవసహజ ప్రవణతే ఈ ప్రవృత్తి. ఈ ప్రవృత్తి ఆగి నివృత్తి కలిగితే అదే నీతికీ, పారమార్థికపరతకు నాంది. ప్రవృత్తి నివృత్తి రెండూ కర్మస్వరూపానికి సంబంధించినవి; దుష్కర్మే ప్రవృత్తి, సత్కర్మే నివృత్తి. సమస్త నీతికి పారమార్థపరత కంతటికీ నివృత్తే మూలాధారం. అహంకారం పూర్తిగా నశించటమే, ఇతరులకై మనస్సును, శరీరాన్ని, సర్వస్వాన్ని త్యజింప సంసిద్ధుడవటమే నివృత్తి, ధర్మపరిపూర్తి. ఈ స్థితిని ప్రాపించిన మానవుడు కర్మయోగ పరమావధిని పొందినవాడు. ఇది సత్కర్మల మహోన్నత పరిపాకం. ఒక్క తత్త్వ శాస్త్రాన్నైనా చదువకపోయినా, దేవుడిలో నమ్మకం ఇంతకుముందు లేకున్నా, ఇప్పుడూ లేకున్నా, జన్మలో ఒక్కమారైనా భగవంతుణ్ణి ప్రార్థించకపోయినా, ఒక వ్యక్తి కేవలం సత్కర్మల ప్రభావంచేతనే ‘ఇతరుల కోసం తన జీవిత సర్వస్వాన్ని సమర్పింప సంసిద్ధుడైతే, భక్తుడు ప్రార్థనలచేతను, వేదాంతి జ్ఞానం చేతను చేరుకొనే చోటికే అతడు చేరుకొంటాడు. కాబట్టి వేదాంతి, భక్తుడు, కర్మయోగి ఒకే గమ్యం వద్ద కలుసుకొంటారని మీరు గుర్తించవచ్చును. అహంకార లయమే ఆ ఏకగమ్యం. మతాలు, తత్త్వశాస్త్రాలు ఎంత విభేదించినా సమస్త మానవ కోటీ ఇతరులకై తన సర్వస్వాన్నీ త్యజింప సంసిద్ధుడైన అతణ్ణి చూసి పూజిస్తుంది, అబ్బురపడుతుంది. ఇక్కడ మతప్రసక్తి, వేదాంతప్రసక్తి లేదు – పారమార్థికాశయాలన్నిటికీ తీవ్రవిముఖులైనవారు సైతం ఇలాటి సంపూర్ణ స్వార్థత్యాగ సంజనిత కార్యాన్ని చూడగానే దానికంజలి ఘటించాలని వారికి తోస్తుంది. ఎడ్విన్ ఆర్నాల్డ్ వ్రాసిన ‘ఏషియా జ్యోతి’ ని చదివి స్వార్థత్యాగాన్ని తప్ప మరిదేనిని గూర్చీ బోధింపని – ఏ దేవుని గూర్చీ బోధింపని – బుద్ధుని పట్ల స్వమతదురభిమానపూరిత క్రైస్తవుడు కూడ ఎలాటి గౌరవ భావాన్ని చూపిస్తాడో మీరు చూడలేదా? విషయమేమంటే, తన జీవిత లక్ష్యం, గమ్యమూ తన కెవరితో భేదాభిప్రాయం వున్నదో వారి జీవిత లక్ష్యం గమ్యమూ ఒక్కటే అని స్వమతదురభిమాని ఎరుగడు, పాపం! భగవద్భావాన్ని నిరంతరం స్మరిస్తూ సత్సంగపరివేష్టితుడైన ఉపాసకుడూ చివరకు ఆ గమ్యాన్నే చేరి ‘దేవా! నీ ఇచ్ఛే నెరవేరుత’ మంటాడు. తనకోసం దేన్నీ వుంచుకోడు. అది అహంకారలయం. కాబట్టి కర్మ భక్తి జ్ఞానాలు అన్నీ ఇక్కడ కలుసుకొంటాయి. భగవంతుడంటే జగత్తు కాదనే ప్రాచీన మహాప్రబోధకుల బోధనకు అభిప్రాయమిదే. జగత్తు వేరు, భగవంతుడు వేరు – ఈ విభేదం ఎంతో యథార్థం. ఈ ప్రపంచం అంటే స్వార్థపరత్వమే, మమకార భావనే. ‘న – మమ’ (నాది కాదు) అనే భావమే భగవంతుడు. సువర్ణప్రాసాదంలో సింహపీఠాన్ని అధిష్ఠించీ ఒకడు మమకార బంధ మేమీ లేనివాడుగా నిస్సంగుడుగా వుండవచ్చును. అలా వున్నప్పుడు అతగాడు భగవద్గత జీవనుడు. మమకారం కలిగివున్నవాడికి, స్వార్థపరుడికి ఇల్లు పూరిపాక ఐనా, గుడ్డలు చింపివైనా, ‘నాది’ అని చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా అతడేమో సంసారంలో గాఢంగా మునిగివున్నవాడే.
ఇక మన ప్రధాన విషయాలలో ఒకదానికి వద్దాం – కొంతైనా చెడు లేకుండా కేవలం ‘మంచి’ ని మనం చెయ్యలేమని, అలాగే ‘మంచి’ రవ్వంతైనా లేని కేవలం ‘చెడు’ అంటూ ఏదీ లేదని చెబుతాం. ఇది తెలిసిన మనం కర్మలను ఏవిధంగా చేయాలి? మానవుడు జీవించివుంటే, పాపం క్షుద్రజంతువులను మొక్కలను చంపవలసి వస్తుందని, దేనినైనా ఎవరినైనా హింసింపవలసి వుంటుందని, కాబట్టి క్రమంగా ఆత్మహత్య చేసుకోవటం ఒక్కటే సంసార తరుణోపాయమని ఆశ్చర్యకరమైనంత అసంగతంగా బోధించే మత సంప్రదాయాలూ వున్నాయి. ఇదే తమ మహోన్నతాదర్శంగా జైనులు బోధించి వున్నారు. ఈ సిద్ధాంతం ఎంతో యుక్తియుక్తంగా వున్నట్లు కనిపిస్తుంది. కాని ఈ సమస్యకు సరైన సమాధానం భగవద్గీతలో కనబడుతుంది. ఇదే ‘నిష్కామకర్మ సిద్ధాంతం’. జీవితంలో సంగరహితంగా కర్మలను చేయడం. నీవు ఈ లోకంలో వున్నా ఈ లోకం కంటె సంపూర్ణంగా భిన్నుడవని, అందులో ఏ కర్మను నిర్వర్తిస్తున్నా నీ కోసం నీవు చేయటం లేదని గ్రహించు. నీ కోసం నీవు ఏ కర్మను చేసినా అది తన ఫలితాన్ని నీ కంటగడుతుంది. అది సత్కర్మమైతే సత్ఫలితాన్ని నీవు అనుభవించి తీరాలి, దుష్కర్మమైతే దుష్ఫలితాన్ని నీవు అనుభవించి తీరాలి; ఏ పనిగాని నీ కోసం చెయ్యబడనప్పుడు దాని ఫలితం నీకు చెందదు. ఈ ఆశయం కలిగిన భావాస్ఫోరకమైన వాక్యం మా శాస్త్రగ్రంథాలలో కానవస్తుంది. లోకా న్నంతటిని చంపినా, (తానే చంపబడ్డా) తను చేసింది తనకోసం కాదని గట్టిగా తెలిసినవాడు చంపినవాడూ కాడు, చంపబడ్డవాడు కాడు. కాబట్టి కర్మయోగం ఇలా బోధిస్తుంది: ‘లోకాన్ని విడువవద్దు. లోకంలో వర్తిస్తూ దాని ప్రభావాలను సాధ్యమైనంతవరకు జీర్ణించుకో. నీ భోగానుభవానికే అయినప్పుడు కర్మచెయ్యనే చెయ్యవద్దు.’ భోగానుభవం లక్ష్యంగా వుండ కూడదు. మొట్టమొదట అహంకారాన్ని చంపుకొని, సమస్తలోకమూ నీవే అని భావించు. ప్రాచీన క్రైస్తవులు అన్నట్లు ‘పాతమానవుడు చనిపోవాలి’. నా భోగానుభవం కోసమే ఈ సమస్త విశ్వం ఏర్పడిందనే మమకారశయమే ఈ పాతమానవుడు. అవివేకులైన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా ప్రార్థించమని బోధిస్తారు: “ప్రభూ! నా కోసం నువ్వు ఈ సూర్యుణ్ణి సృష్టించావు, ఈ చంద్రుణ్ణి సృష్టించావు…” ఈ పసిబిడ్డలకోసం అన్నిటిని సృష్టించడంకంటె భగవంతుడికి వేరే పనిలేదు కాబోలు! ఇలాంటి అర్థరహిత ప్రలాపాలను మీ పిల్లలకు ఎప్పుడూ బోధించవద్దు. ఇంకొక రకమైన అవివేకులున్నారు మనం చంపి తినడానికే జంతువులన్నీ సృష్టించబడ్డాయని, ఈ ప్రపంచమంతా మన భోగంకోసమే సృష్టించబడిందని వాళ్లు మనకు బోధిస్తారు. ఇదంతా అవివేకం. తనకోసమే మానవుడు సృష్టించబడ్డాడని పెద్దపులీ ఇలా ప్రార్థించవచ్చును. “ప్రభూ! నాకు ఆహారంగా వచ్చి తమ్ముతాము నాకు సమర్పించుకోని ఈ మనుష్యులు ఎంత దుర్మార్గులు! వీళ్లు నీ శాసనాన్ని ధిక్కరిస్తున్నారు.” లోకం మనకోసం సృష్టించబడితే మనమూ లోకం కోసమే సృష్టించబడ్డాం. మన భోగానికై ఈ లోకం సృష్టింపబడినదని అనుకోవటం మనలను అధఃపతితులను గావించే నిమ్న స్థాయిలో ఉంచే పరమ దుష్టాభిప్రాయం. లోకం వుండేది మనకోసం కాదు; ప్రతి సంవత్సరం కోట్లమంది జనులు ఇక్కడ నుండి గతిస్తున్నారు. ఇది లోకుల అనుభవానికి స్ఫురించటం లేదు; గతించిన వారి స్థానాన్ని కోట్లమంది ఇతరులు భర్తీ చేస్తున్నారు. లోకం ఎంతగా మనకోసం ఏర్పడివుందో మనమూ అంతగా లోకంకోసం ఏర్పడివున్నాం.
కాబట్టి సక్రమంగా కర్మను నిర్వర్తించడానికి నువ్వు ముందుగా కోర్కెను విడిచిపెట్టాలి. తరువాత సంసార కల్లోలంలో కలవక కేవలం సాక్షివై కర్మను కొనసాగించు. నా గురుదేవుడిలా అనేవారు: “మీ బిడ్డలపట్ల దాది చూపే భావాన్ని వహించండి.” దాది మీ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి, ఆటలాడిస్తూ అది తన స్వంతబిడ్డే అన్నంత సుతారంగా దానితో వర్తిస్తుంది; కాని ఇక ఇంటికి పోవచ్చు అని మీరు ఆమెకు చెప్పగానే తన మూటముల్లె సర్దుకుని వెంటనే బయలుదేరడానికి సిద్ధపడుతుంది. అంతకు ముందుండిన రాగమంతా అపుడు విస్మరింపబడుతోంది; మీ బిడ్డను విడిచిపెట్టినప్పుడు ఇతరుల బిడ్డలను గైకొన్నప్పుడూ సాధారణమైన దాది కెలాంటి వ్యాకులత వుండదు. ‘నాది’ అని నీవు భావించే సమస్త విషయాలలోను నీవు ఇలాగే ప్రవర్తించాలి. నీవు దాదివి, భగవంతుణ్ణి నీవు నమ్మితే ‘నాది’ అని నీవు భావించే సమస్తమూ నిజంగా ఆ భగవంతుడిదే అని నమ్ము. మహాదౌర్బల్యం తరచు మహాబలంగాను, సౌజన్యంగాను తనను చూపుకొంటుంది. నా మీద ఒక వ్యక్తి ఆధారపడి వున్నాడని నేనో వ్యక్తికి సాయం చెయ్యగలనని భావించటం కేవలం మనోదౌర్బల్యం. మన కోర్కెలన్నిటికీ ఇదే పుట్టిల్లు, కోర్కె వల్లనే బాధలన్నీ కలుగుతున్నాయి. లోకంలో ఎవ్వరూ మన మీద ఆధారపడలేదని, ఏ బిచ్చగాడూ మన దానధర్మాల మీద ఆధారపడి జీవించడం లేదని, ఏ జీవీ మన దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని, ఏ ప్రాణీ మన సహాయానికై దేవులాడడంలేదని, మన మనస్సులకు మనం చెప్పుకోవాలి. సమస్తజీవులకు ప్రకృతే తోడ్పడుతోంది. మనలాంటి వారు కోట్లమంది ఇక్కడ లేకున్నా ప్రకృతే వాటికి తోడ్పడుతుంది. నీ వంటి, నా లాంటి వ్యక్తులకోసం ప్రకృతి ప్రవాహం ఆగిపోదు; ఇంతకుమునుపే చెప్పినట్లు పరులకు సాయం అందించటం ద్వారా మన జీవితాలను సార్థకం, జ్ఞానమయం చేసుకొనే అవకాశం మీకైనా నాకైనా కలగటం వరప్రసాదం. జీవితంలో మనం నేర్చుకోవలసిన గొప్పపాఠం ఇది; దీనిని ఆసాంతం నేర్వగానే ఇక ఎన్నడూ అసౌఖ్యం కలుగదు; సంఘంతో యథేచ్ఛగా మన మపుడు కలిసి మెలగవచ్చును. మీకు భార్య లుండవచ్చు, భర్త లుండవచ్చు, దాసుల పటాలాలు వుండవచ్చు, ఏలడానికి రాజ్యాలుండవచ్చు. ప్రపంచం మీ కోసం వున్నది కాదని, ప్రపంచానికి మీ ఆవశ్యకత లేదని గుర్తించి మీరు వర్తిస్తే వాటివలన లేశమైనా హాని మీకు వాటిల్లదు. ఈ సంవత్సరంలోనే మీ మిత్రులలో కొంతమంది చనిపోయి వుండవచ్చును. వాళ్లు లేకపోవడంతో ప్రపంచం పురోగమించక వాళ్లు తిరిగి రావాలని నిరీక్షించుకొని వుందా? ప్రపంచ ప్రవాహం ఆగిందా? లేదు, ప్రపంచం కొనసాగుతూనే వుంది. కాబట్టి ప్రపంచానికి మీవల్ల నెరవేరవలసిన దేదోవున్నదనే భావాన్ని మీ మనసు నుండి తొలగించుకోండి. ప్రపంచం మీ సాయాన్ని అపేక్షించదు. ప్రపంచానికి తాను ఉపకారం చెయ్యడానికి జన్మించానని ఎవ్వరైనా అనుకోవటం అవివేకం, అహంభావం; అది సుగుణరూపంలో నటించే స్వార్థపరత్వం. మీ మీదగాని మరెవ్వరిమీదగాని ప్రపంచం ఆధారపడలేదని గ్రహించేటట్లు మీ మనస్సును మీ నరాలను తర్ఫీదు ఇచ్చి అప్పుడు మీరు నిర్వర్తించే కర్మవలన వ్యధారూపమైన ఎలాంటప్రతిక్రియా కలుగదు. మీరు ఒకవ్యక్తికి ఏదైనా ఇచ్చి ప్రతిఫలం ఆశించని పక్షంలో అతడు మీ పట్ల కృతజ్ఞుడుగా ఉండాలని భావించని పక్షంలో అతడి కృతఘ్నతవల్ల మీకు బాధ కలుగదు. కారణం మీరు దేనినీ ఆశించలేదు. బదులుగా ఏదైనా పొందడానికి మీకొక హక్కువున్నట్లు మీరు భావించలేదు; అతడికి ప్రాప్తమైన దానిని అతడికి ఇచ్చారు; అతడి కర్మే దానిని అతడికి సంపాదించింది; మీ కర్మచేత మీరు దానిని అందజేసిన వారయ్యారు. ఏదో దానం చేశానని మీరు ఎందుకు అహంకరించాలి? ఇవ్వబడ్డ ధనమో, మరే ఇతర దానమో ప్రాప్త కందచేసిన కూలివాడవు నీవు; తాను చేసిన కర్మచే లోకం దానిని పొందడానికి అర్హత పొందింది. మీ అహంకారానికి ఇందులో హేతువేముంది? లోకానికి మీరు ఇవ్వడంలో ఘనత ఏమీలేదు, నిస్సంగత్వాన్ని మీరు అలవరచు కొన్నప్పుడు మీ కింక పుణ్యమూ లేదు, పాపమూ లేదు. ‘మంచి’ ‘చెడు’ అనే తారతమ్యాన్ని కలిగించేది స్వార్థపరత్వమే. ఈ విశ్వంలోని ఏ శక్తి కూడా మీరు లోబడి అవకాశం ఇస్తే తప్ప మీపై పనిచేయలేదు. మానవుడి ఆత్మ వివేకవర్జితమై స్వాతంత్ర్యాన్ని కోల్పోతేనే తప్ప ఆత్మపై దేనికీ ప్రభావంలేదు. ఈ విషయం దుర్గ్రాహమైనా కాలక్రమంలో మీరు తెలుసుకుంటారు. నిస్సంగత్వంచే ఏ బాహ్య శక్తీ మీపై పనిచేయకుండా, ఏ బాహ్య శక్తికీ ప్రభావితులు కాకుండా ఉండగలరు. నేననుమతిస్తేగాని నా మీద ప్రభావం చూపే అధికారం దేనికీ లేదని చెప్పటం సులభమే. బైటి ప్రపంచం తన మీద చూపే ప్రభావంచే సుఖదుఃఖాలు పొందని వ్యక్తి తనపై ప్రభావం చూపకుండా నిరోధించుకోగలిగే వ్యక్తి యథార్థలక్షణ మేమిటి?సంపద ఆపదలచే మనస్సు మారకుండటమే అతడి లక్షణం. అన్ని పరిస్థితులలోను అతడు ఒకేవిధంగా ఉంటాడు.
భారతదేశంలో వ్యాసుడనే మహర్షి ఒకరుండేవారు. ఆయన బ్రహ్మసూత్రకర్తగా సుప్రసిద్ధుడు, సాధుపుంగవుడు. అఖండసిద్ధి పొందడానికి ఆయన తండ్రి ప్రయత్నించి విఫలుడైనాడు. ఆయన తాతకూడా ఇలానే ప్రయత్నించి విజయం పొందలేదు. ముత్తాతా విజయోపేతుడు కాలేదు. వ్యాసుడూ పూర్తిగా కృతార్థత నందలేదు. కాని ఆయన పుత్రుడైన శుకుడు ఆజన్మసిద్ధుడై వెలిగొందారు. వ్యాసుడు శుకుడికి జ్ఞానోపదేశం చేసి పరమార్థాన్ని గరపిన తరువాత జనకమహారాజు సభకు పంపాడు. ఆయనొక గొప్పరాజు, జనక విదేహుడని ఆయనకు పేరు. విదేహుడంటే దేహ రహితుడని అర్థం. రాజైనప్పటికి ఆయనకు దేహస్మృతి బొత్తిగాలేదు. తానొక ఆత్మననే అనుభూతే ఆయనకు ఎప్పుడూ వుండేది. ఇలాంటి జనకునివద్ద బోధోపదేశాలు పొందడానికి తన బాలశుకుణ్ణి వ్యాసుడు పంపాడు. శుకుడు తన వద్దకు తత్త్వోపదేశార్థం వస్తున్నాడనే సంగతి జనకుడికి తెలుసు. కాబట్టి ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేసివుంచాడు. శుకుడు రాజభవన ద్వారాలను సమీపించినప్పుడు ద్వారపాలకులు అతణ్ణి కొంచెంకూడా లక్ష్యపెట్టలేదు. అతడి కొక పీఠం మాత్రం ఇచ్చారు. దానిమీద అతడు మూడు పగళ్లు మూడు రాత్రులు కూర్చునేవున్నాడు. అతడితో ఎవ్వరూ మాట్లాడలేదు. నువ్వెవరు? ఎక్కడినుండి వచ్చావు అనికూడా అడగలేదు. అతడొక మహాముని పుత్రుడు. అతడి తండ్రిని లోకమంతా గౌరవిస్తుంది. అతడూ స్వయంగా అత్యంత పూజార్హుడు. కాని పామరులు, అల్పులు ఐన నగర రక్షకులు అతణ్ణి లక్ష్యపెట్టలేదు. తరువాత అకస్మాత్తుగా రాజుగారి మంత్రులు ఉన్నతోద్యోగులు అక్కడకు వచ్చారు. నిరతిశయపూజలతో స్వాగతోపచారం గావించారు. ప్రకాశమానమైన మణిమండపాలలోనికి అతణ్ణి పిలుచుకు పోయారు. పన్నీటితో స్నానం చేయించారు. దివ్యాంబరాలు కట్టబెట్టారు. ఎనిమిది రోజులు ఉంచుకుని సర్వవిధభోగాలను అనుభవింప చేశారు. ప్రసన్న గంభీరమైన శుకుడి ముఖం ఆదరనిరాదరాలచే ఎలాంటి మార్పు చెందలేదు. వాకిట్లో కాచుకొన్నప్పుడూ ఈ భోగాలు అనుభవించేటప్పుడూ అతడొకే విధంగా వున్నాడు. తరువాత అతణ్ణి రాజసభకు తీసుకునివెళ్లారు. రాజు సింహాసనాసీనుడై వున్నాడు. సంగీత నృత్యాది వినోదాలు సాగుతున్నాయి. అప్పుడు రాజు అంచువరకు పాలు నిండిన గిన్నెను శుకుని చేతికిచ్చి పాలొక్కచుక్క కూడా తొణక్కుండా సభామందిరాన్ని ఏడుమార్లు ప్రదక్షిణ గావించమన్నాడు. పాటల మధ్య, సుందరవదనాల ఆకర్షణమధ్య శుకుడు గిన్నె చేతబట్టి బయలుదేరాడు. రాజు కోరినట్లు అతడు ఏడు ప్రదక్షిణాలు చేశాడు. ఒక్కచుక్క పాలు కూడా నేలపై చిందలేదు. లోకంలో ఏదీ అతడి అనుమతిలేనిదే అతడి మనస్సు నాకర్షించలేదు. ఆ బాలుడు గిన్నెను రాజు వద్దకు తెచ్చినప్పుడు రాజు ఇలా అన్నాడు: “మీ తండ్రి నీ కేమి బోధించాడో, స్వయంగా నీవేమి నేర్చుకొన్నావో, నేను మళ్లా చెప్ప గలిగింది కూడా అదే. పరమార్థం నీకు తెలిసింది. నీవు ఇంటికి పోవచ్చు.”
ఇలా మనోనిగ్రహాన్ని సాధించిన వ్యక్తిపై బాహ్యమైనదేదీ ప్రభావం చూపలేదు. అతడికి ఇకమీద బంధం వుండదు. అతడు ముక్తుడయ్యాడు. అలాంటి వాడే సంసారంలో చక్కగా జీవించడానికి సమర్థుడు. లోకాన్ని గురించి రెండు విధాలైన అభిప్రాయాలు గల వ్యక్తులు సాధారణంగా కనిపిస్తారు. కొంతమంది నిరాశావాదులై ‘ప్రపంచం ఎంత ఘోరం! ఎంత దుష్టం !’ అంటుంటారు. మరికొంతమంది ఆశావాదులై ‘ప్రపంచం ఎంత చక్కనిది! ఆశ్చర్యకరమైనది!’ అంటుంటారు. మనోనిగ్రహాన్ని సాధించని వారికి ప్రపంచం చెడ్డదిగా తోస్తుంది లేదా మంచిచెడుల సమ్మిశ్రంగానైనా అనిపిస్తుంది. మనోనిగ్రహ సంపన్నులమైతే మనకు ఈ ప్రపంచమే ఆశాజనకమై కనబడుతుంది. ఏదీ కూడా మనపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపించదు; అంతా సముచితస్థానంలో ఉండి, సమన్వయం కలిగి ఉన్నట్లుగా గోచరిస్తుంది. మొదట్లో ప్రపంచం నరకమని చెప్పే కొంతమంది మనోనిగ్రహాన్ని సాధించగానే ప్రపంచం స్వర్గమని చెప్పి తరచు ముగిస్తారు. మనం యథార్థ కర్మయోగులమైతే పైన చెప్పిన సిద్ధిపొంది మనలను శిక్షితులుగా చేసుకోగోరినట్లయితే, మనం ఏమెట్టు నుండి ప్రారంభించినాసరే పరిపూర్ణమైన అహంకారలయంలో పర్యవసించి తీరుతాం. జీవభ్రాంతి తొలగగానే, దుఃఖమయంగా కనిపించే ఈ ప్రపంచం ఆనంద పూర్ణమైన స్వర్గమే అయినట్లు కనిపిస్తుంది. అందులోని వ్యవహారమంతా పవిత్రమవుతుంది. ప్రతివ్యక్తి ముఖంలోను మంచే కనబడుతుంది. కర్మయోగోద్దేశమూ, కర్మయోగ ప్రయోజనమూ అలాంటిది. అనుభవంలో దాని పరిపూర్తి అలాంటిది.
మనం అనుష్ఠించే వివిధ యోగాలకు ఒకదానితో మరోదానికి ఎలాంటి విరోధమూ లేదు. అన్ని యోగాలు మనను ఒకే గమ్యానికి చేర్చి పరిపూర్ణులను చేస్తాయి.ఏ యోగమైనా సరే మనం పూనికతో సాధించాలి. అంతా సాధనలోనే వుంది. ముందుగా వినాలి, తరువాత మననం చెయ్యాలి. పిమ్మట అభ్యసించాలి. ప్రతి యోగ విషయమూ ఇంతే. ఏ యోగాన్ని గురించిగాని మొదట విని, దానిని గ్రహించాలి; దురవగాహంగా వుండే అనేక విషయాలు నిరంతర శ్రవణ మననాలచే చక్కగా బోధపడుతాయి. ప్రతివిషయమూ వెంటనే గ్రహించటం కష్టం. అన్నిటికీ వివరణ నీలోనే వున్నది. నిజంగా ఇతరులచే నేర్పబడేవాడు లేడు. మనకు మనమే నేర్చుకోవాలి. వెలుపల బోధించేవాడు కేవలం మార్గసూచకుడు. అతడి సూచన మన ఆంతరంగికబోధకుణ్ణి మేల్కొలుపుతుంది. అప్పుడు మన భావనాశక్తిచేతను, గ్రహణశక్తిచేతను విషయం మనకు స్పష్టమౌతుంది. దాని అనుభవం మనకు అప్పుడు మనలోనే కలుగుతుంది; ఇలాంటి అనుభూతే ప్రగాఢ సంకల్పశక్తిగా పరిణమిస్తుంది; మొట్టమొదటిది అనుభూతి; తరువాత అదే సంకల్పంగా పరిణమిస్తుంది; అప్పుడు దానినుండి అద్భుతమైన క్రియాశక్తి ఉదయిస్తుంది; ఆ తరువాత మన యావత్తు శరీరం కర్మయోగ సాధనంగా మారేవరకు, అహంకారలయాన్ని అఖండ నిస్స్వార్థత ప్రాప్తించేవరకు, ఆ క్రియాశక్తి మన ప్రతినాళంలోకి, ప్రతి నరంలోకి, ప్రతికండరంలోకి చొచ్చుకుపోతుంది. ఈ సిద్ధికి ఏ వాదం మీదా, ఏ సిద్ధాంతం మీదా, ఏ విశ్వాసంమీదా ఆధారపడవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తి క్రైస్తవుడా, యూదుడా, హిందువా అనేది ఎంతమాత్రమూ విచారించదగ్గ విషయం కాదు. నీవు స్వార్థరహితుడవా, కాదా? ఇదే జ్ఞప్తిలో ఉంచుకోవలసిన విషయం. స్వార్థరహితుడవైతే ఒక్క పారమార్థిక గ్రంథాన్త్నెనా చదువకుండానే, ఒక్క ప్రార్థనాలయానికైనా పోకుండానే, ఒక్క దేవాలయాన్నైనా దర్శించకుండానే పరిపూర్ణుడవవుతావు. సమస్త యోగాలకు గమ్యస్థానం ఒకటే అయివుండటంతో ఇతర యోగాపేక్ష లేకుండానే ప్రతి యోగమూ స్వయంగా మానవుణ్ణి ముక్తుణ్ణి గావింప గలిగివున్నది. కర్మ జ్ఞాన భక్తి మార్గాలలో ఏదైనాసరే స్వయంగా సూటైనమార్గమే; ‘సాఙ్ఖ్య యోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి నపణ్డితాః – జ్ఞానయోగ, కర్మయోగాలు భిన్నాలని చెప్పేవారు బాలురే. పండితులలా చెప్పరు.’ పైకి వేరువేరుగా వున్నట్లు కన్పించినా ఈ రెండూ మానవుణ్ణి ఒకే పరమావధికి చేరుస్తాయని పండితులు ఎరుగుదురు.