కర్తవ్యనిష్ఠ ఆధ్యాత్మిక పురోగతిలో మన కెలా తోడ్పడుతుందో అనే విషయాన్ని విచారించడానికి ముందు మరొక దృక్పథం నుండి కర్మానికి భారతీయులమైన మేము గ్రహించే అర్థం సూక్ష్మంగా తెలుపుతాను. ప్రతి మతానికి తత్త్యవిచారం, పురాణాలు, క్రతుకలాపాలు అనే మూడు భాగాలుంటాయి. తత్త్యవిచారమే నిస్సంశయంగా ప్రతిమతం యొక్క సారాంశం; మహాపురుష చరిత్రలలోని ఐతిహాసాల చేతను, అద్భుత విషయాలను గురించిన గాథలచేతను, కథలచేతను పురాణాలు తత్త్యాన్ని సోదాహరణంగా విశదీకరిస్తాయి; క్రతుకలాపాలు దానికి సర్యజనగ్రాహ్యమైన రూపాన్నిస్తాయి.అంటే తత్త్యశాస్త్రం యొక్క మూర్తీభవించిన రూపమే క్రతు కలాపాలు; తత్యశాస్త్ర స్థూలరూపమే క్రతుకలాపాలు. ఈ క్రతువులే కర్మ. ప్రతిమతంలోను ఇది అవసరమైవున్నది. ఎందుకంటే విశేషమైన ఆధ్యాత్మిక అభివృద్ధి పొందనిదే గ్రహింపవీలుగాని పారమార్థిక విషయాలను మనలో అనేకమంది తెలుసుకోలేరు. సమస్తం తమకు బోధపడుతుందని మానవులు అనుకోవటం తేలికేగాని అనుష్ఠానానుభవానికి వచ్చేసరికి ఆధ్యాత్మిక విషయాలను గ్రహించటం ఎంతో కష్టమని తెలుస్తుంది. సంకేతాలు మనకు చాలా తోడ్పడతాయి. సంకేతాల ద్యారా తత్త్యాన్ని బోధించే విధానాన్ని మానుకోలేము. అతిప్రాచీనకాలం నుండి సంకేతాలు అన్ని మతాలలోను వినియోగింపబడుచుండేవి. ఒక విధంగా చూస్తే సంజ్ఞల ద్యారానే మనం ఆలోచించగలం, అసలు శబ్దాలు భావాల సంజ్ఞలే. పక్షాంతరంలో జగత్తులోని ప్రతిదీ సంజ్ఞ అనే భావింపనగును. జగత్తంతా ఒక సంజ్ఞ. ఈ సంజ్ఞకు (symbol) మరుగున వుండే తత్యం భగవంతుడు. ఈ విధమైన సంజ్ఞాశాస్త్రం కేవలం మానవకల్పితం కాదు; ఫలానా మతానికి చెందిన కొంతమంది జనులు ఒకచోట చేరి, కొన్నిసంజ్ఞలను ఊహించి వాటిని తమ మనస్సుల నుండి వెలువరిస్తున్నారని భావింపకూడదు. ఈ పారమార్థిక సంజ్ఞలకు ఒక సహజాభివృద్ధి ఉంది. లేకపోతే దాదాపుగా ప్రతి వ్యక్తి మనస్సులోను కొన్ని సంజ్ఞలు పత్ర్యేకంగా కొన్ని భావాలకే స్ఫురణను కలిగించడానికి కారణం ఏమిటి? ‘సిలువ’ అనే ‘✝’ ఈ చిహ్నం మొట్టమొదట క్రైస్తవమతం నుండి ఉద్భవించినదని మీలో అనేకమంది భావించవచ్చును. కాని నిజానికి ఇది క్రైస్తవ మతానికి పూర్వం, మోసెస్ పుట్టడానికి ముందు, వేదాలకు ముందు, మానవులను గురించిన విషయాలకు ప్రమాణగ్రంథాలు ఏర్పడడానికి పూర్వమే వుండేది. ‘ఏజ్టెక్’, ‘ఫానిషియను’ జాతులలో ఈ చిహ్నాన్ని చూడవచ్చును. ప్రతిజాతిలోను సిలువ అనే ఈ చిహ్నమున్నట్లు కనిపిస్తుంది. అలాగే సిలువ వేయబడిన మానవుని ప్రతిమ కూడా ప్రతి జాతివారికీ పరిచితమైనదిగానే కనిపిస్తుంది. వృత్తం లోకమంతటా వ్యాప్తిగాంచిన ఒక మహాసంజ్ఞ. అన్ని సంజ్ఞలకంటే అధిక విశ్వవ్యాప్తి వున్న సంజ్ఞ ‘స్వస్తిక’. బౌద్ధులు దీన్ని లోకమంతటా వ్యాపింపచేశారనే నానుడి ఒకప్పుడుండేది. కాని బౌద్ధమతానికి అనేక యుగాలకు ముందే ఇది వివిధ జాతుల వాడుకలో వుండేదని తెలియవస్తూంది. ప్రాచీన బాబిలోనులోను, ఈజిప్టులోను ఇది కానవస్తుంది. దీనివలన తేలేదేమిటి? ఈ సంజ్ఞలన్నీ కేవలం ఆచారాన్ని అనుసరించి ఏర్పడినవి కావు. వీటి కేదో ఒక కారణం వుండి వుండాలి. మనిషి మనస్సుకు ఈ సంజ్ఞలకు సహజ సంబంధం వుండివుండాలి. భాష ఎప్పుడూ ఒక ఒడంబడిక ద్వారా ఏర్పడదు. ఈ భావాలను ఈ మాటతో తెలుపుదామని ప్రజలు తమలో తామే ఒడంబడిక చేసుకోలేదు. భావానికి సరిపడే శబ్దం – శబ్దానికి సరిపడే భావం లేకుండటం ఎన్నడూ లేదు; భావాలకు మాటలకు అవినాభావ సంబంధం సహజం. ఇలా భావాన్ని తెలిపే సంజ్ఞలు శబ్దరూపంలోగాని, వర్ణరూపంలోగాని వుండవచ్చును. చెవిటివారు, మూగవారు శబ్దేతరాలైన సంజ్ఞలతో ఆలోచించాలి. మనస్సులోని ప్రతిభావానికీ జతపడే రూపంవుంది; సంస్కృత వేదాంతంలో ఇవే నామరూపాలని చెప్పబడుతున్నాయి. ఏర్పాటుచేత (ముందుగా అనుకొని) భాషను సృష్టించటం ఎంత అసాధ్యమో సంజ్ఞా శాస్త్రాన్ని సృష్టించటం కూడా అంతే అసాధ్యం. కర్మ కలాపంలోని సంకేతాలలో మానవుల పారమార్థికాశయాలు ప్రకటితాలవుతున్నాయి. కర్మ కలాపాలు, దేవాలయాలు మొదలైన ఉపకరణాలు నిష్ప్రయోజనాలని చాలా తేలికగా చెపుతుంటారు. ఆధునిక కాలంలో ప్రతి శిశువు ఇలా చెబుతున్నాడు. కాని దేవాలయంలో దేవుణ్ణి అర్చించేవారు, అలా అర్చించని వారికంటె అనేక విషయాలలో మెరుగ్గా వున్నారనటం జనం సులభంగా గుర్తించగల సంగతే. కాబట్టి కొన్ని ఆలయాలకు, క్రతుకలాపాలకు, ఇతర బాహ్య విధులకు కొన్ని మతధర్మాలతో వున్న సంబంధంచేత, ఆయా మతధర్మాలను అవలంబించేవారికి, ఆ రూపాలు వేటికి సంజ్ఞలై వున్నాయో ఆ ఆశయాలను స్ఫురింపచేస్తాయి. కాబట్టి క్రతుకలాపాలను, సంజ్ఞలను పూర్తిగా ఉపేక్షించటం వివేకం అనిపించుకోదు. వీటిని గురించిన వివేచన, అనుష్ఠానం కూడా కర్మయోగంలో భాగమే.
కర్మశాస్త్రానికి రూపాంతరాలు అనేకం వున్నాయి. శబ్దార్థాల అన్యోన్యసంబంధ పరిశీలనాన్ని, శబ్దశక్తితో ఏం సాధించగలమో పరిశీలించడమూ దీనిలో ఒకటి. ప్రతిమతమూ శబ్దశక్తిని అంగీకరిస్తుంది. కొన్ని మతాలలో శబ్దంనుండే సృష్టి సమస్తమూ ఉత్పన్నమైనదని చెప్పబడివుంది. భగవత్సంకల్ప బాహ్యరూపమే శబ్దం. ముందుగా తాను అనుకొన్న విధంగా, సంకల్పించిన విధంగా భగవంతుడు సృష్టించాడు. శబ్దంనుండి సృష్టి వెలువడింది. మన ఐహిక జీవిత వేగపు ఒత్తిడిలో నాడీమండలం గ్రహణశక్తిని కోల్పోయి మొద్దుబారుతోంది. వయస్సు పైబడినదంటే అధికంగా ఈ లోకంలో ఆటుపోట్లకు గురై ఉన్నాము అనీ, అంటే మరింత స్తబ్ధత మనల్ని ఆవరించి ఉంటుంది. మన చుట్టూ నిత్యమూ జరిగే ప్రక్రియలపై కూడా శ్రద్ధ పెట్టము. అయినా మానవస్వభావం ఒకొక్కప్పుడు తన ఔన్నత్యాన్ని ప్రకటింప చూస్తుంది. అప్పుడీ సామాన్య జీవిత సంఘటనలను చూసి అబ్బురపడి వాటి తత్త్వాన్ని గ్రహించడానికి ప్రేరితులమౌతాము; ఇలా అబ్బురపడటమే జ్ఞానార్జనకు తొలిమెట్టు. మతంలో వేదాంతంలో శబ్దానికి వున్న అధిక ప్రాముఖ్యాన్ని అలావుంచి, మానవజీవిత నాటకరంగంలో శబ్దసంజ్ఞలు ప్రధానపాత్ర నిర్వహిస్తుండటాన్ని గుర్తించ వచ్చు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని నేను తాకటంలేదు. నా మాటలవల్ల పుట్టే వాయుస్పందనాలు మీ చెవులలో ప్రవేశించి, నాడులను స్పృశించి మీ మనస్సులలో ప్రతిస్పందనను కలుగ చేస్తున్నాయి. దీనిని మీరు నిరోధించలేరు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన దేమిటంటే – ఒకవ్యక్తి మరొకణ్ణి ‘మూర్ఖుడా’ అనగానే అతడు లేచినిలబడి పిడికిలిబిగించి తనను తిట్టినవాడి ముక్కుమీద గుద్దుతున్నాడు. శబ్దశక్తి ఎలాంటిదో చూడండి! అతిదీనురాలైన ఒక స్త్రీ విలపిస్తోంది; మరొకామె ఆమెను సమీపించి మారటగా కొన్ని శాంతి వచనాలు పలుకుతుంది. క్రుంగిపోయిన ఆ దీనురాలు ఊరడిల్లి దుఃఖవిరహితయై నవ్వుతుంది. శబ్ద ప్రభావం ఎలాంటిదో చూడండి! వేదాంతంలో శబ్దం శక్తిమంతమే, సామాన్య జీవితంలోనూ అది శక్తిమంతమే. ఎలాంటి ఆలోచన, విమర్శన లేకుండానే రేయింబవళ్లు ఈ శబ్దశక్తిని మనం వినియోగిస్తున్నాము. శబ్దశక్తి ప్రభావాన్ని గ్రహించటం దానిని వినియోగించటంకూడా కర్మయోగాంశమే.
ఇతరులకు సహాయపడటం, పరహితమొనర్చటం లోకంపట్ల మనధర్మం. మన మెందుకు లోకహితం జరపాలి? పైకి లోకానికి తోడ్పడుతున్నట్లు కనిపిస్తుందిగాని నిజంగా అది మనకు మనం చేసుకునే సహాయమే అవుతుంది. పరోపకారం చెయ్యడానికి మనం ఎల్లప్పుడు ప్రయత్నించాలి. అదే మన ముఖ్యోద్దేశంగా వుండాలి. మనం బాగా ఆలోచించి చూస్తే మన సహయావశ్యకత ప్రపంచానికి లేదు. నీ చేత నా చేత ఉపకారం పొందడానికి ఈ లోకం సృష్టింపబడలేదు. ఒక క్రైస్తవ ధర్మోపదేశంలో ఇలా చదివాను: “సుందరమైన ఈ ప్రపంచమంతా చాలా మంచిది, ఎందుకంటె పరోపకారం చెయ్యడానికి మన కిది సమయాన్ని, అవకాశాన్ని కల్పిస్తున్నది.” పైకి చూడడానికి చక్కని ఆశయమేగాని లోకానికి మన సహాయం కావలసి వున్నదనటం దైవదూషణం కాదా? ప్రపంచం దుఃఖభూయిష్ట మనటం కాదనలేం; అందువల్ల పరులకు ఉపకారం చెయ్యటమే మనం చెయ్యగల ఘనకార్యం; ఐనా పరులకు ఉపకార మొనర్చటమంటే కేవలం మనకు మనం ఉపకారం చేసుకోవటం అని కాలక్రమంలో గ్రహిస్తాము. నా చిన్నతనంలో నా వద్ద కొన్ని తెల్లని ఎలుకలుండేవి. చిన్న చక్రాలున్న ఒక చిన్న పెట్టెలో వాటిని వుంచేవాడిని. ఎలుకలు ఆ చక్రాలను దాటడానికి ప్రయత్నించినప్పుడల్లా చక్రాలు గిరగిర తిరుగుతుండటంచేత అవి యథాస్థానంలోనే వుండేవి. లోక విషయమూ, లోకానికి మనం ఉపకారం చేసే విషయమూ కూడా ఇలాంటిదే. జరిగే ఉపకారమంతా మనకు నైతిక శిక్షణ లభించటమే. ఈ ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కాదు. ప్రతివ్యక్తీ తనకు తానే ఒక లోకాన్ని నిర్మించుకొంటాడు. గుడ్డివాడు ప్రపంచాన్ని గురించి భావించడానికి ప్రయత్నిస్తే అది గట్టిదిగానో, మెత్తనిదిగానో, వెచ్చనిదిగానో, చల్లనిదిగానో భావిస్తాడు గదా. సర్వసాధారణంగా యువకులు ఆశాపూరితులుగాను వృద్ధులు నిరాశా జనితులుగాను వుంటారు. యువకులకు జీవితం ముందువున్నది. వృద్ధులు తమ కాలం దాటిపోయిందని మొరపెట్టుకొంటారు; తీర్చుకోలేని అనేక కోర్కెల వలన వారి మనస్సులో సంఘర్షణ జరుగుతుంటుంది. ఏమైనా, వీరిద్దరూ అవివేకులే. మన మనోస్ధితినిబట్టి, మన దృక్పథాన్నిబట్టి జీవితం మంచిదిగా గాని చెడ్డదిగా గాని కన్పిస్తుంది; స్వతస్సిద్ధంగా అది వీటిలో ఏదీకాదు. అగ్ని స్వతస్సిద్ధంగా మంచిదిగాని, చెడ్డదిగాని కాదు. శీతాకాలంలో మనం చలికాచుకొంటున్నప్పుడు ‘నిప్పెంత బాగుంది!’ అనుకొంటాం. నిప్పుచే మన చేతులు కాలినప్పుడు దాన్ని తిడతాము. ఐనా దాని పరంగా అది మంచిదీ కాదు చెడ్డదీ కాదు. మనకు కలిగే ఉపయోగాన్ని అనుసరించి ‘మంచిది’ ‘చెడ్డది’ అనే తలపులు కలుగుతాయి; ప్రపంచవిషయంకూడా ఇలాంటిదే. ప్రపంచం పరిపూర్ణమే. ఇక్కడ పరిపూర్ణ మంటే తన ప్రయోజనాలను నెరవేర్చుకోడానికి ఇది సమర్థమై వుండటమే. మన ప్రమేయమేమీ లేకుండానే ప్రపంచ వ్యవహరం సాగుతుందని మనమంతా దృఢంగా నమ్మవచ్చును. ప్రపంచానికి సహయపడటానికి అమందా నందులంగానో, అత్యంతదుఃఖభరితులంగానో తాపత్రయ పడనవసరం లేదు.ఐనా మనం లోకానికి హితం చెయ్యాలి; లోకోపకారం చెయ్యడం మన భాగ్యమనే జ్ఞానం సదా వుంటే మనలోని పరోపకార ఇచ్ఛయే మహోన్నత ప్రేరకశక్తి అవుతుంది. ఏదో పై మెట్టెక్కి కూర్చున్నవాడవై నాలుగు పైసలను చేతబుచ్చుకుని ‘ఏమోయ్ పేదవాడా, ఇదుగో’ అనవద్దు. అతడికి దానమిచ్చి నువ్వు మేలుబొందడానికి అతడొక డున్నందుకు అతడిపట్ల కృతజ్ఞుడవై వుండు. ధన్యత దాతకేకాని దానం పుచ్చుకున్నవాడికి కాదు.నీ ఔదార్యాన్ని, నీ దయాస్వభావాన్ని లోకంలో అమలుపరచి, దానిమూలంగా నువ్వు పవిత్రుడవై, పరిపూర్ణుడగుటకు నీకు అవకాశం లభించినదని కృతజ్ఞుడవవు. సత్కార్యాలన్నీ మనను పునీతులుగాను, పరిపూర్ణులుగాను చేస్తాయి. మన శక్తినంతా వినియోగించినా మనం చెయ్యగలిగినదెంత? ఒక ఆసుపత్రిని కట్టిస్తాం, కొన్ని బాటలను వేయిస్తాం, ఒక ధర్మశాలను నిర్మిస్తాం! ధర్మకార్యానికి చందారూపంలో లోకులనుండి ఇరవై, ముఫై లక్షల రూపాయలు పోగు చేయగలం.ఒక పది లక్షలతో ఆసుపత్రి నొకదాన్ని కట్టించవచ్చును. రెండో పది లక్షలతో నాట్యప్రదర్శనలు, మద్యపాన పార్టీలు జరుపవచ్చును. మిగిలిన పది లక్షలలో సగం ప్రభుత్వ ఉద్యోగులు హరిస్తారు, సగం పేదలకు చేరుతుంది. మంచిదే; ఇవన్నీ ఎంతమాత్రం. ఒకేఒక్క ఝంఝామారుతం మీరు కట్టించిన భవనాలను క్షణంలో నేలమట్టం చేయవచ్చును. అప్పుడు మనమేం చెయ్యగలం? ఒక్క అగ్నిపర్వతం పగిలి మనం నిర్మించిన బాటలను, ఆసుపత్రులను, నగరాలను, భవనాలను నాశనం చేస్తుంది! కాబట్టి మనం లోకోపకారమనే ఈ మూర్ఖప్రలాపాన్ని విరమిద్దాం; లోకం నీ సాయంకోసం నా సహాయం నిమిత్తం పడిగాపులు పడివుండలేదు. అయినా ఎప్పుడూ కార్యనిమగ్నులమై సత్కార్యాలనే చేస్తూండాలి. ఎందుకంటె దానివల్ల మేలు మనకే. పరిపూర్ణుల మవడానికి ఇదొక్కటే మనకు మార్గం. మనం సాయంచేసిన ఏ యాచకుడూ మన కేనాడూ ఒక గవ్వకూడా ఋణపడినవాడు కాడు. అతడికే మనం సమస్తం ఋణపడినాము. ఎందుకంటే అతడు దానం ఇచ్చే అవకాశాన్ని మనకు కల్పించాడు. లోకోపకారం చేశామనిగాని, చేయగల మనిగాని, ఏదో కొంతమందికి మనం సహాయం చేశామనిగాని అనుకోవటం పూర్తిగా తప్పు. అది మూర్ఖాలోచనం; మూర్ఖాలోచన దుఃఖహేతువు. మనం ఎవరికో సహాయం చేశామని అతడు మనపట్ల కృతజ్ఞత చూపాలని ఆశిస్తాం; ఆతడలా చేయకపోతే బాధపడతాం. మన కార్యాలకు మన మెందుకు ప్రతిఫలం ఆశించాలి? నీ సహాయం పొందిన వాని పట్ల కృతజ్ఞుడవై వుండు. అతడిని దేవుడుగా భావించు. సోదరమానవ సహాయరూపంలో భగవదారాధన అవకాశం పొందటం మహాభాగ్యం కాదా! మనం నిజంగా నిస్సంగులమై వుంటే ఈ ఆశావైఫల్యవ్యధలులేక సంతోషంతో సత్కార్యాలు నిర్వర్తించ గలము. నిస్సంగబుద్ధితో ఆచరించే కర్మవలన ఎన్నటికీ దుఃఖం కలుగదు, దుఃఖస్థితీ కలుగదు. లోకం తన సుఖదుఃఖాలతో నిరంతరం సాగిపోతూనే వుంటుంది.
ఒకప్పుడు బీదవా డొకడుండేవాడు. అతడికి కొంత డబ్బు కావలసి వచ్చింది. ఒక భూతాన్ని వశపర్చుకుంటే డబ్బు తెమ్మనిగాని, మన ఇష్టమొచ్చిన పనులను చెయ్యమనిగాని దాన్ని ఆజ్ఞాపింపవచ్చునని వినివున్నాడు. అందుచే భూతాన్ని వశపరచుకోవాలనే ఆతురతతో భూతాన్ని తనకు వశపరచగల వ్యక్తికోసం వెతుకుతూన్నాడు. చివరకు మహాశక్తి సంపన్నుడైన ఒక ఋషిని కలుసుకుని తనకు సాయం చెయ్యమని ప్రార్థించాడు. “భూతం నీ కెందుకు?” అని ఆ ఋషి అడిగాడు. దానికి ఈ వ్యక్తి. “నా పనులు చేసిపెట్టడానికి నాకొక భూతం కావాలి; ఆ భూతాన్ని సంపాదించే విధానాన్ని తెలుపండి; స్వామీ నాకా భూతం అత్యవసరం” అన్నాడు. అందుకు ఋషి “నీ ప్రశాంతతను చెడగొట్టుకోకు, ఇంటికి వెళ్లిపో!” అన్నాడు. మర్నాడు తిరిగి అతడు ఋషి వద్దకెళ్లి విలపిస్తూ ఇలా ప్రార్థించాడు: “నాకో భూతాన్ని ప్రసాదించండి స్వామీ! నాకు సాయపడడానికి ఒక భూతం కావాలి.” చిట్టచివరకు విసుగుపుట్టి ఋషి ఇలా అన్నాడు. “ఇదిగో మంత్రం. దీనిని జపించు, భూతమే నీ వద్దకు వస్తుంది; ఏ పని చెప్పినా చేస్తుంది. కాని జాగ్రత్తగా వుండు! భూతాలు మహాభయంకరమైనవి. వాటికి సదా పని కల్పించాలి. లేకపోతే అవి నీ ప్రాణాలు తీస్తాయి.” పేదవాడు అందుకు ఇలా అన్నాడు. “స్వామీ! అదెంతపని ! యావజ్జీవం దానికి నేను పని ఇవ్వగలను.” తరువాత అతడు ఒక అరణ్యానికి వెళ్లి చాలాసేపు ఆ మంత్రాన్ని జపించగానే ఒక పెద్ద భూతం ప్రత్యక్షమై ఇలా అంది: “నేనో భూతాన్ని. నీ మంత్రం నన్ను వశపరచుకొంది; కాని నువ్వు నిరంతరం నాకు పని కల్పించాలి సుమా; నాకు నువ్వు పని ఇవ్వని మరుక్షణం నిన్ను చంపేస్తాను.” అప్పుడు అతడు తనకొక మహాభవనాన్ని నిర్మించమన్నాడు. “అయిపోయింది, నిర్మించాను చూసుకో” అందా భూతం. వెంటనే అతడు “నాకు డబ్బు తీసుకురా” అన్నాడు. “ఇదుగో నువ్వు కోరిన డబ్బు” అంది భూతం. “ఈ అరణ్యాన్ని నరికి ఒక నగరాన్ని నిర్మించి ఇవ్వు.” ఆ మాట పూర్తికాకుండానే “ఇదిగో పూర్తయింది. ఇంకేదన్నా చేసిపెట్టాలా?” అని కాస్తగట్టిగా అడిగింది భూతం. అతడికి భయం పట్టుకుంది. ‘దీనికి చెప్పడానికి ఏ పనీ లేదే, ఏం చెప్పినా క్షణంలో చేసిపారవేస్తూందే’ అనుకున్నాడు. “నా కేమైనా పని చెప్పు, లేకపోతే నిన్ను మింగేస్తాను” అని గద్దించింది భూతం. పాపం అతడు ఆ భూతానికి ఏ పనీ చూపలేకపోయాడు. భయభ్రాంతుడయ్యాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఋషి కాళ్లమీద పడ్డాడు. “స్వామీ! నా ప్రాణాలు కాపాడండి” అని మొరపెట్టుకున్నాడు. సంగతేమిటని ఋషి అడగగా ఆ వ్యక్తి ఇలా చెప్పాడు: “భూతానికి ఇవ్వడానికి నా వద్ద ఏ పనీ లేదు. ఏ పని చెప్పినా క్షణంలో చేసివేస్తూంది. పని చూపకపోతే నన్ను మింగేస్తానని బెదిరిస్తూంది.” అప్పుడే భూతం అక్కడకు వచ్చి “నిన్నిప్పుడే మింగేస్తాను” అని గద్దించింది. అతడు గడగడ వణకసాగాడు. తనను కాపాడమని ఋషిని ప్రార్థించాడు. ఆయన ఒక క్షణం ఏదో యోచించి, ఇలా అన్నాడు: “నువ్వు ఈ అపాయం నుండి బైటపడే దారి కనుక్కుంటాను. వంకర తోక కలిగిన ఆ కుక్కను చూశావా? కత్తితో ఆ తోకను కోసి దాని వంకరను సరిచేయమని ఆ భూతాని కివ్వు.” వెంటనే అతడు ఆ కుక్క తోకను ఖండించి భూతాని కిచ్చి ఋషి చెప్పినట్లు దాని వంకరను సరిచెయ్యమన్నాడు. భూతం ఆత్రంతో దానిని తీసుకుని జాగ్రత్తగా సరిచేసింది. కాని పట్టు వదలినంతనే అది తిరిగి ముడుచుకుపోయింది. భూతం దానిని తిరిగి కష్టపడి సరిచేసింది. కాని చెయ్యివదలగానే తోక యథాప్రకారం ముడుచుకుపోయింది. రోజుల తరబడి భూతం అదే విధంగా చేస్తూనేవుంది. ఫలితం మాత్రం శూన్యం. చివరికి అది విసిగిపోయి తనలో ఇలా అనుకొంది: ‘ఇంతవరకు నా జన్మలో ఇలాంటి బాధపడలేదు. ఆరితేరిన ముసలిభూతాన్ని అయివుండీ ఎన్నడూ ఇన్ని తిప్పలు పడలేదు.’ ఇలా ఆలోచించి ఆ భూతం అతడితో నమ్రతతో ఇలా అంది: “అయ్యా ! నీతో నే నొక ఒడంబడిక చేసుకొంటాను. నన్ను వదిలిపెట్టు. ఇప్పటిదాకా నేను నీకిచ్చినవన్నీ నువ్వే వుంచుకో. నీ జోలికి ఇక నేను రాను.” దానికి అతడు సంతోషంగా అంగీకరించాడు.
ఈ ప్రపంచం వక్రతలో కుక్కతోక వంటిది. వేలకొద్దీ సంవత్సరాల నుండి దీనిని సరిదిద్దడానికి అనేకమంది విశ్వప్రయత్నం చేస్తూనే వున్నారు; కాని వారి పట్టు సడలగానే ఇది యథాప్రకారం వక్రమైపోతూంది; అలాకాక అది ఎలావుంటుంది? నిష్కామంగా ఎలా కర్మను ఆచరించాలో మానవుడు మొదట తెలుసుకోవాలి, తెలుసుకొంటే దురభిమాని కాబోడు. లోకం కుక్కతోక వంటిదని ఎన్నటికీ తిన్నబడదని గ్రహిస్తే మనం మూర్ఖాభినివేశ గ్రస్తులం కాకుండా వుంటాం. మూర్ఖాభినివేశమే లేకుంటే లోకం ఇప్పుడు పురోగమించిన దానికంటే ఎక్కువగా పురోగమించి వుండేది. దురభిమానం మానవుల పురోభివృద్ధికి తోడ్పడుతుందని భావించటం పెద్దపొరపాటు. పురోభివృద్ధికి తోడ్పడకపోవడమేగాక దానివలన ద్వేషం, క్రోధం బయలుదేరి జనులలో సానుభూతి లోపించి కలహాలు ఏర్పడి తిరోగమనం కలుగుతుంది. మనం ఏ పని చేసినా, మన వద్ద ఏమున్నా అదే లోకంలో శ్రేష్ఠమైనదని; మనం చెయ్యని పనికి, మనవద్ద లేని వస్తువుకు విలువలేదని తలుస్తాము. కాబట్టి దురభిమానం పొందే ప్రవృత్తి మీలో ఎప్పుడు కనిపించినా కుక్కతోక వంకర దృష్టాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచాన్ని గురించి మీరు బాధపడ నవసరంలేదు, మీ నిద్రను పాడుచేసుకోనక్కరలేదు. మీరు లేకపోయినా అది సాగుతూనే వుంటుంది. దురభిమాన రహితులైనప్పుడే మీరు బాగా పని చెయ్యగలరు. సమచిత్తత, ప్రశాంతత, వివేకం, ఆర్ధ్రభావం, మహాసానుభూతి, ప్రేమ గల వ్యక్తే లోకాభ్యుదయ కర్మను నిర్వర్తించి తానూ అభ్యున్నతి బడయగలడు. దురభిమాని మూర్ఖుడు. అతనికి పరులపట్ల సానుభూతి వుండదు; లోకాన్ని అతడెన్నడూ సరిచేయలేడు, తానూ పునీతుడు కాలేడు, పరిపూర్ణుడూ కాలేడు.
నేటి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలను సింహావలోకనం చేద్దాం
1. లోకం మన కేమీ ఋణపడి ఉండలేదనేది, మనమే లోకానికి ఋణపడి వున్నామనేది మొదటి విషయం. ఇసుమంత లోకహితం ఒనర్చడానికి అవకాశం కలగటం మన భాగ్యం. లోకోపకార మొనరించటం నిజానికి మనకు మనం ఉపకారం చేసుకోవడమే.
2. లోకానికి ఒక భగవంతు డున్నాడనటం రెండవ విషయం. ప్రపంచం కొట్టుకొని పోతూందని, మీరు, నేను దానిని రక్షించాలని అనుకోవడం నిజం కాదు. భగవంతుడు సదా జగదంతరాత్ముడై వున్నాడు. అతడు అవినాశి, అప్రమత్తుడు అనంతజాగరూకుడు. విశ్వమంతా నిద్రిస్తూన్నప్పుడు అతడు నిద్రించడు; అతడు నిరంతరం కర్మ మొనరిస్తూనే వున్నాడు. విశ్వంలోని సమస్త రూపాలూ పరిణామాలూ అతడివే.
3. మన మెవ్వరిని ద్వేషింపరాదనేది మూడవ విషయం. ప్రపంచం సదా మంచిచెడుల సమ్మిశ్రమే అయివుంటుంది. దుర్బలులపట్ల సానుభూతి చూపటం. దురాచారుణ్ణి కూడా ప్రేమించటం మన ధర్మం. ఈ లోకం ఒక గొప్ప నైతిక వ్యాయామశాల. ఈ ధార్మిక వ్యాయమశాలలో మనందరం ప్రయత్నశీలురమై, నిరంతర కృషీవలులమై ఆధ్యాత్మికంగా ఉన్నతా శిఖరాలనధిరోహించాలి.
4. దురభిమానం ప్రేమకు విరుద్ధం. కాబట్టి మనం ఎలాంటి దురభిమానులుగాను కాకూడదనేది నాల్గవ విషయం. ‘పాపాన్ని ద్వేషిస్తానే గాని పాపిని ద్వేషించను’ అనే దురభిమానుల జారుడు మాటలు మీరు వినే వుంటారు. కాని నిజానికి పాపానికి పాపికి వ్యత్యాసం ఏర్పరుపగలిగిన వ్యక్తి మొహాన్ని చూడడానికి ఎంతదూరమైనా పోవడానికి నేను సిద్ధం. పై విధంగా చెప్పడం సులభం. గుణ గుణి విభేదాన్ని చక్కగా గుర్తింపగలిగితే మనం పరిపూర్ణ మానవులమే కావచ్చు. కాని అలా గుర్తించటం అంత తేలికకాదు. అంతేగాక మనలో సంక్షోభం తగ్గితే, ప్రశాంతత ఎంత హెచ్చితే, ప్రేమ కూడా అంత పెరుగుతుంది. మన పనులూ అంత శ్రేష్ఠములుగా వుంటాయి.