కర్మయోగ విశ్లేషణలో కర్తవ్యమంటే ఏమిటో గ్రహించటం అత్యవసరం. నేనొక పనిని చెయ్యవలసి వున్నప్పుడు అది నా ధర్మమని మొట్టమొదట నేను గ్రహించాలి. తరువాతే ఆ పనిని నిర్వర్తించడానికి నేను సమర్థుడనౌతాను. ధర్మాన్ని గురించి వివిధ దేశాలలో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. మహమ్మదీయుడు ఖురానులో చెప్పబడిందే తన ధర్మమంటాడు; క్రైస్తవుడు బైబిల్లో చెప్పబడిందే తన ధర్మమని బల్లగుద్ది చెబుతాడు. భిన్నజీవిత పరిస్థితులను, విభిన్న చారిత్రక యుగాలను, వివిధ దేశాలు అనుసరించే ధర్మాన్ని గూర్చిన అభిప్రాయాలు వ్యతిరిక్తంగా వుండటం మనం చూస్తున్నాం. సర్వజనసామాన్యాలు గ్రహించడానికి కష్టమైన ఇతర శబ్దాలను నిర్వచించటం ఎలా అసాధ్యమో అలాగే ధర్మం ఇలాంటిదని నిర్వచించటం అసాధ్యం. ఆచరణలో ధర్మరీతిని, ధర్మానుష్టానం వల్ల కలిగే ఫలాలను గమనిస్తే ధర్మమంటే ఎలాంటిదో కాస్త మనకు బోధపడుతుంది. కొన్ని సంఘటనలు మన కళ్ల ఎదుట జరిగేటప్పుడు సహజంగానో, శిక్షణచేతనో ఒక విధంగా ప్రతిస్పందించే అంతఃప్రేరణ మనందరకు వుంది; ఇలాంటి ప్రేరణ కలుగగానే ఆ అవస్థను గూర్చి మనస్సు ఆలోచన సాగిస్తుంది; ఒక్కొక్కప్పుడు కొన్ని పరిస్థితులలో ఫలానా విధంగా వర్తించటం సబబని మనస్సు తలుస్తుంది; మరొకప్పుడు ఆ పరిస్థితులలోనే ఆ విధంగా వర్తించటం మంచిదికాదని తలుస్తుంది. యోగ్యుడైన ప్రతిమానవుడూ తన అంతఃకరణ ప్రవృత్తిని అనుసరిస్తాడని ధర్మాన్ని గూర్చి సర్వత్రావున్న జనాభిప్రాయం. కాని ఒక కార్యాన్ని ధర్మమని ఎలా నిర్ణయించటం? కళ్లముందు గోమాంసం వుంటే క్రైస్తవుడు ప్రాణరక్షణార్థం దానిని తాను తినకున్నా, మరొకడికి పెట్టకున్నా తన ధర్మాన్ని తాను నిర్వర్తించలేదని అతడు తప్పకుండా భావిస్తాడు. కాని హిందువు గోమాంసాన్ని తాను తినటంగాని ఇతరులకు పెట్టడంగాని సాహసిస్తే తన ధర్మాన్ని తాను నిర్వర్తించలేదని నిశ్చయంగా భావిస్తాడు. హిందువు చదివిన చదువు, గరిపిన శిక్షణ అతణ్ణి అలా భావింపచేస్తాయి. గత శతాబ్దంలో భారతదేశంలో పేరుమోసిన థగ్గులనే బందిపోటు దొంగలుండేవారు. తమ పాలబడ్డ వారినంతా చంపి వారి ధనాన్ని దోచుకోవటమే తమ ధర్మమని వారు భావించేవారు; ఎంతమందిని చంపితే తమకు అంతమేలు చేకూరుతుందని వారు తలిచేవారు. వీధిలో కెళ్లి ఒకవ్యక్తి మరొకణ్ణి తుపాకితో కాల్చిచంపితే మామూలుగా అలాంటివాడు తన కృత్యాన్ని గూర్చి పశ్చాత్తాప పడవచ్చు. పాపంచేశానే అనుకోవచ్చును. కాని అతడే పటాలంలో సైనికుడై ఒకణ్ణి కాదు ఇరవైమందిని చంపినా ఆ పనికి ఆనందించి తన ధర్మాన్ని తాను చక్కగా నిర్వహించానని తప్పక భావిస్తాడు. కాబట్టి చేయబడ్డ పనినిబట్టి ధర్మనిర్ణయం జరగబోదని సుస్పష్టం; ధర్మాన్ని ధర్మాన్నిబట్టే నిర్ణయించటం కేవలం అసాధ్యం. కాని కర్తను బట్టి చూస్తే ధర్మమనేది వుంటుంది. మనలను భగవంతుని వద్దకు చేర్చే ఏ కార్యమైనా సత్కార్యమే, అదే మన ధర్మం; మనలను అధోగతి నొందించేది ఏదైనా దుష్కార్యమే, అది మన ధర్మం కాదు. ఇలా కర్మమొనర్చే మన మనఃస్థితి ననుసరించి కొన్ని కార్యాలు మనను ఉద్ధరించి మనకు ఉదాత్తత కల్పింప గలిగినవై వుండగా మరికొన్ని మనను పశుప్రాయులుగా చేసి అధోగతి నొందిస్తాయని గ్రహించాలి. కాని అన్ని పరిస్థితులలో నుండే సర్వజనులను బట్టి ఏ కార్యానికి ఎలాటి ప్రవృత్తి వుందో నిర్ణయించటం కష్టం. అయినా ధర్మాన్నిగూర్చి సర్వకాలాలలోను, సర్వదేశాలలోను, సర్వవర్గాలవారూ ఆమోదించిన ఆదర్శం ఒకటి వుంది. అది ‘పరోపకారః పుణ్యాయ, పాపాయ పరపీడనమ్,* – ‘పరులకు ఉపకారం చెయ్యడమే పుణ్యం, పరులను పీడించటమే పాపం’ అనే సంస్కృత వాక్యంలో సూచించబడింది.
పుట్టుకచేత, సంఘంలోని స్థానంచేత నిర్వర్తింపవలసి వచ్చే ధర్మాలను భగవద్గీత తరచూ వెలిబుచ్చుతుంది. జీవితంలోని వివిధ కార్యకలాపాల పట్ల మానవుడి మానసిక నైతిక వైఖరి, వారి జన్మ, సంఘంలోని వారి స్థానాన్ని చాలావరకు నిర్ణయిస్తుంది కాబట్టి మనం ఏ సంఘంలో జన్మించామో దాని ఆదర్శాలకు ఆచారాలకు అనుగుణమైన ఉన్నతిని ఉదాత్తతను కలిగించే కర్మను నిర్వర్తించటమే మన ధర్మం. కాని అన్ని సంఘాలలోను, అన్ని దేశాలలోను ఒకే విధమైన ఆదర్శాలుగాని ఆచారాలుగాని వుండవని మనం ముఖ్యంగా గమనించాలి; ఇలా మనం గమనించకపోవటమే ఒక దేశం ఇంకొక దేశంపై విద్వేషభావాలను పెంచుకోవడానికి గల మూలకారణం. అమెరికా దేశస్థుడు దేశాచారాన్ని అనుసరించి తన దేశస్థుడు ఏమి చేస్తాడో అదే ఉత్తమోత్తమ ధర్మమని, తన ఆచారాన్ని అనుసరించని ప్రతిఒక్కడూ పరమదుర్మార్గుడని భావిస్తాడు. హిందువు తన ఆచారాలు మాత్రమే సరైనవని ప్రపంచంలోనే ఉత్తమోత్తమాలని అనుకుంటూ వాటిని అనుసరించని వాడు పరమ దుర్మార్గుడని తలుస్తాడు. సహజంగా మనమందరం ఈ పొరపాటే పడుతుంటాం. కాని ఇది చాలా హానికరం; లోకంలోని దయారాహిత్యానికి, క్రూరతకు సగందాకా ఇదే కారణం. నేనీ దేశానికి వచ్చి చికాగో నగర బజారుగుండా పోతూవుంటే వెనుక నుండి ఎవరో నా తలపాగాను లాగారు. వెనక్కి తిరిగి చూస్తే, నీటైన దుస్తులతో, ఒక పెద్దమనిషి కనబడ్డాడు. నేనతడితో మాట్లడేసరికి నాకు ఇంగ్లీషు వచ్చని గ్రహించి అతడు చాలా సిగ్గుపడ్డాడు. ఆ బజారులోనే మరొకప్పుడు ఒక వ్యక్తి నన్కొక్క తోపుతోసాడు. కారణమేమని నేనడిగితే అతడు సిగ్గుపడి ఆ విధమైన దుస్తులు ఎందుకు ధరించారని అడిగి క్షమాపణ వేడుకొన్నాడు. వీరి సానుభూతి అంతా తమ వేషభాషలనే సరిహద్దులలో బంధింపబడి వుంది. లోకంలో శక్తిమంతమైన దేశాలు బలహీన దేశాలను అణచివేసి బాధించటానికి చాలవరకు ఈ దురభిమానమే కారణం. దీనివల్ల సోదరమానవకోటిపట్ల వారి సోదరభావం ఇంకిపోతోంది. తనలాగా నేనెందుకు దుస్తులను ధరించలేదని నా (కాషాయ) వస్త్రాలను చూసి నన్ను అవమానించాలని చూసిన ఆ వ్యక్తే సజ్జనుడై, సజ్జనకుడై, సత్పౌరుడై వుండి వుండవచ్చును; కాని తన కంటె విభిన్నరీతిలో వస్త్రధారణ మొనర్చిన వ్యక్తిని చూడగానే అతడి సహజమార్దవం సమసి పోయింది. అన్ని దేశాలలోను పరాయి దేశస్థులు కొల్లగొట్టబడతారు. ఎందుకంటే తమనుతాము ఎలా కాపాడుకోవాలో వారికి తెలియదు. అందుచేత తాము చూసిన వ్యక్తులను గురించి తప్పుడు అభిప్రాయాలను గొనిపోతారు. నావికులు, సైనికులు, వర్తకులు విదేశాలలో ఎంతో వింతగా ప్రవర్తిస్తారు. స్వదేశంలో ఉన్నప్పుడు కలలోకూడా అలా ప్రవర్తింప తలంపరు. ఇందుకే కాబోలు యూరోపియనులను, అమెరికనులను చైనా వారు ‘విదేశీ దయ్యాలు’ (foreign devils) అంటారు. పాశ్చాత్య జీవన విధానంలో దయాసౌజన్యాలను చూసి వుంటే వాళ్లు ఇలా పలుకరు.
కాబట్టి ఇతరుల ధర్మాన్ని వారి దృష్టికోణం నుంచే చూడడానికి ప్రయత్నించాలిగాని మన ధర్మమే ప్రమాణంగా ఎన్నడూ ఇతరుల ఆచారవ్యవహారాలను పరిశీలింపకూడదనే ముఖ్య విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. లోకానికి కొలబద్దను నేను కాను; లోకాన్ని నేను అనుసరించాలే గాని లోకం నన్ను అనుసరించనక్కరలేదు. కాబట్టి పరిసరాలననుసరించి మన ధర్మస్వరూపం మారుతుంది. ఏ సమయంలో ఏది ధర్మమౌతుందో దాన్ని ఆచరించటమే ఈ లోకంలో మనం చెయ్యదగ్గ ఉత్తమమైన పని. ముందు పరంపరానుగతంగా వచ్చే వర్ణధర్మాన్ని ఆచరిద్దాం. అటుపిమ్మట జీవితంలోను, సమాజంలోను గడించిన స్థితిగతులను బట్టి ప్రాప్తించిన ధర్మాన్ని ఆచరిద్దాం. కాని మానవస్వభావంలో ఒకగొప్ప దోషం వుంది. మానవుడెప్పుడూ ఆత్మపరీక్ష చేసుకోడు. సింహాసనాన్ని అధిష్ఠించడానికి చక్రవర్తి కెంత యోగ్యత వుందో తనకూ అంత యోగ్యత వుందని తలుస్తాడు. ఒకవేళ అతడికి అంతటి యోగ్యత వున్నప్పటికీ తన విధ్యుక్త ధర్మాన్ని మొదట తాను నెరవేర్చి చూపించాలి; తరువాత అంతకంటే ఉన్నతమైన ధర్మాలు అతడి కేర్పడతాయి. మనఃపూర్వకంగా మనం కర్మాచరణానికి దిగగానే ప్రకృతి మనకు ప్రహరణాలు కలిగించి నిజంగా మన ‘తాహతు’ ఎలాటిదో తెలుసుకోడానికి మనకు తోడ్పడుతుంది. తనకు అర్హతలేని స్థానాన్ని ఎవ్వరూ దీర్ఘకాలం అధిష్ఠించి వుండలేరు. ప్రకృతిలో సాగే సర్దుబాట్లకు గొణగడం వలన ప్రయోజనం లేదు. క్రింది స్థాయి (సాధారణంగా మనం భావించే) పనులను చేయటం వల్ల ఏ వ్యక్తి కూడా అధముడు కాడు. ఏ వ్యక్తి గుణదోషాలనుగాని అతడి చర్యల స్వరూపాన్నిబట్ట నిర్ణయించకూడదు. ఏ దృష్టితో, ఏ విధంగా అతడు తన కర్మలను నిర్వర్తిస్తాడో దానినిబట్టి మానవుడి న్యూనతాధిక్యాలను నిర్ణయించవచ్చును.
కర్తవ్యాన్ని గురించిన ఈ ఆశయంకూడా మార్పుచెందుతుందనీ, స్వార్థప్రేరణ లేనప్పుడే అత్యంత ఘనకార్యాలు నెరవేర్చ బడతాయని ముందుముందు మనం గుర్తిస్తాము. ఐనా కర్తవ్యతాబుద్ధితో కూడుకొన్న కర్మాచరణమే కేవల నిష్కామ కర్మాచరణానికి మనకు దారి చూపుతుంది. కర్తవ్యతా బుద్ధి తొలగినప్పుడు కర్మ ఆరాధనమౌతుంది, ఇంకా ఉత్కృష్టమైనదిగా అవుతుంది. అప్పుడు కర్మ కర్మకొరకే ఆచరింపబడుతుంది. ఫలాపేక్షరహిత కర్మ, ప్రేమ సంజనిత కర్మ – నీతి రూపకమైన లేదా ప్రేమరూపంగా ఏ విధంగా అభివ్యక్తమైన కర్మతత్త్వానికైనా మిగతా యోగాలలాగా ఒకటే గమ్యం – ఉన్నత యథార్థాత్మ ప్రకాశించడానికి అనువుగా, అలౌకిక పారమార్థిక దిశల్లో ఆత్మ ఆవిష్కృతమవడానికి అనువుగా జీవిత జఘన్యరంగాలలో శక్తులను వ్యర్థపరచకుండటం, క్షుద్రతృష్ణలను సదా నివారించుకొనటం – వీటిచే ఇది సిద్ధిస్తుంది. వాటిని నివారించుకోమని ధర్మం ఖచ్చితంగా కోరుతుంది. సమాజవ్యవస్థ అంతా, ఎఱుక కలిగో లేకో, కర్మ, కర్మ ఫలానుభవం అనే రెండింటిపై అధారపడి పెంపొందింది. వీటిని నియంత్రించి, స్యార్థపరతను అణచుకొంటే మానవుడి పారమార్థిక తత్త్యరినిరవధిక వికాసానికి దారి తెరిచినవారమౌతాం.
కర్తవ్య మెప్పుడూ రుచించదు. ఆ చక్రం ప్రేమస్నిగ్ధమైనప్పుడే చక్కగా నడుస్తుంది; కాకపోతే నిరంతర సంఘర్షణ ఏర్పడుతుంది. ప్రేమార్ధ్ర హృదయులు కానిచో తల్లిదండ్రులు తమ బిడ్డలపట్ల, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల, భార్యాభర్త లొకరిపట్ల ఒకరు తమ కర్తవ్యాన్ని ఎలా నిర్వహిస్తారు? మన జీవితంలో సంఘర్షణ నిత్యం కానరావడం లేదా? ప్రేమమూలాననే ధర్మం రుచిస్తోంది. స్యేచ్ఛ ఉన్న చోట ప్రేమ ప్రకాశిస్తుంది. అయినా ఇంద్రియ బానిసలమై, మానవ జీవితంలో నిత్యం తటస్థించే కామక్రోధాదులకు నూరింటికి దాసాను దాసులమై ఉండటమా స్వాతంత్ర్యం? ఈ అల్ప సంఘర్షణలన్నిటిలోనూ సహనమే మహోన్నతమైన స్యాతంత్ర్య ప్రకటనం. స్త్రీలు తమ కోప స్యభావానికి, అసహనానికి లోనై భర్తలను నిందించి తమ స్యాతంత్ర్యాన్ని నిలుపుకొంటున్నామని భావిస్తారు – కాని దాని మూలంగా కేవలం తమ దాస్యాన్ని ప్రకటించుకొంటున్నామని పాపం వారు తెలుసుకోలేరు. ఎప్పుడూ భార్యలను దూషించే భర్తల విషయంకూడా ఇలాంటిదే.
స్త్రీకిగాని, పురుషుడికి గాని పవిత్రతే మొదటి సుగుణం. ఎలాంటి దుష్ప్రవర్తనుడైనా సరే, పరమసాధ్వీ ప్రేమస్వరూపిణీ ఐన భార్యవలన సత్పథగామి కాలేని వ్యక్తి ఎక్కడా వుండడు. ప్రపంచమింకా అంత చెడిపోలేదు. ఘాతుకులైన భర్తలను గురించి పురుషుల మలినవర్తనను గురించి లోకంలో అలజడి చేస్తుంటారు కాని క్రూరాత్ములు, కళంకితులూ ఐన స్త్రీల సంఖ్యా అలాంటి పురుషుల సంఖ్యకు తీసిపోదనటం యథార్థం. స్త్రీలందరూ తామనుకునే టంతటి యోగ్యురాండ్రు, పవిత్ర హృదయులు అవటం వాస్తవమే అయితే; అయోగ్యుడు, అపవిత్రహృదయుడు ఐన పురుషు డొక్కడుకూడా లోకంలో వుండివుండడని దృఢంగా చెప్పగలను. విశుద్ధత, పవిత్రత నిర్జింపలేని దౌర్జన్యమేమైనా వుందా? తన భర్తను తప్ప ఇతరులందరినీ తన బిడ్డలుగా భావిస్తూ, అందరిపట్లా మాతృభావం చూపే సచ్ఛీల పతివ్రత ఐన ఇల్లాలి పవిత్రతా ప్రభావం ఎంతగా వర్థిల్లుతుందంటే – ఎంతటి ఘాతకమానవుడైనా ఆమె సాన్నిధ్యంలో వున్నప్పుడు పవిత్రత పొందకుండా ఉండడం అసంభవం. భర్తకూడా ఇదే విధంగా తన భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ తల్లులుగా, కుమార్తెలుగా, సోదరీమణులుగా భావించాలి. ఎవడు ధర్మ ప్రబోధకుడు కావాలనుకుంటాడో అలాటి వ్యక్తి స్త్రీలందరినీ తన తల్లులుగా భావించి వారిపట్ల మాతృభావం కలిగి మెలగాలి.
లోకంలో మాతృస్థానమే గొప్పది. అఖండమైన స్వార్థరాహిత్యాన్ని నేర్పి దైనందిన జీవితంలో ఆచరించి చూపించేది ఆ స్థానమే. భగవత్ప్రేమ ఒక్కటే మాతృప్రేమను మించేది; ఇతరమైన ప్రేమలన్నీ జడాలే. తన యోగక్షేమాలకంటే ముందు తన పిల్లల యోగక్షేమాలను చూసుకోవటమే మాతృధర్మం. కాని దీనికి బదులు తల్లిదండ్రులు తమ యోగక్షేమాలనే ముందు చూసుకోసాగితే పిల్లలకు, తల్లిదండ్రులకు వున్న సంబంధం, రెక్కలు రాగానే తల్లిదండ్రులను త్రోసిరాజనే పక్షిపిల్లలకు, పక్షులకు గల సంబంధంతో సమమవుతుంది. స్త్రీని జగన్మాత ప్రతిరూపిణిగా సాక్షాత్కరించుకోగల మగవాడు నిజంగా ధన్యుడు. పురుషుణ్ణి జగత్పితృ ప్రతిరూపుడిగా సాక్షాత్కరించుకోగల స్త్రీ నిశ్చయంగా ధన్యురాలు. తమ తల్లిదండ్రులను ప్రత్యక్షదైవాలుగా చూసుకొనే బిడ్డలు ధన్యులు.
విహితకర్మలను కర్తవ్యబుద్ధితో ఆచరించటం ఒక్కటే ఉన్నతిని బడయడానికి మార్గం. ఇలాటి కర్మాచరణచే బలం గడిస్తూ క్రమంగా మహోన్నతస్థితి పొందండి. ఒకప్పుడు బాలసన్యాసి ఒకడు అరణ్యానికిపోయి ధ్యానోపాసనలను ఆచరిస్తూ చిరకాలం యోగాభ్యాసం చేశాడు. అలా అనేక సంవత్సరాలు కఠోరతపస్సు చేశాక ఒకనాడతడొక చెట్టుకిందకూర్చుని వుండగా కొన్ని ఎండుటాకులు అతడి తలమీద పడ్డాయి. తలపైకెత్తి చూసేసరికి ఒక కాకికి, కొంగకు చెట్టుమీద దెబ్బలాట జరుగుతోంది. అది చూసి అతడు కోపించి ఇలా అన్నాడు: “ఏమిటేమిటి! ఎండుటాకులను నా తలమీద పడేట్లు సాహసించారా!” ఇలా అంటూ వాటిని కోపంతో చూశాడు. ఆ చూపునుండి వెలువడ్డ అగ్నిజ్వాల ఆ పక్షులను దహించివేసింది. అతడి యోగశక్తి అలాంటిది. కేవలం చూపుతోనే కాకిని, కొంగను దగ్ధం చెయ్యగల తన యోగశక్తిని తలచుకొని అతడు పరమానందభరితుడు అయ్యాడు. కొంతసేపయ్యాక భిక్షాటనకై అతడు దగ్గరున్న ఊరికి వెళ్లాడు. అలా వెళ్లి ఒక ఇంటి ముందు నిలబడి “భవతి భిక్షాం దేహి” అంటూ నిలబడ్డాడు. లోపలినుండి ఒక స్త్రీకంఠం “నాయనా! క్షణం ఆగు” అంటూ పలికింది. ఆ యువసన్న్యాసి తనలో ఇలా అనుకొన్నాడు: “ఓసీ, దౌర్భాగ్యురాలా, నన్నిక్కడ వేచి ఉండమని చెప్పేంత సాహసమా నీకు! కానివ్వు. నా శక్తి నీకు తెలియదులే.” అతడిలా అనుకొంటుండగా లోపలి నుండి మరల ఇలా వినవచ్చింది: “అబ్బాయి, గర్వపడకు. నేను కొంగనూ కాను, కాకినీ కాను.” ఆ మాటలు విని అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు; ఏమైనప్పటికీ అతడు నిరీక్షించవలసి వచ్చింది. చివరకు ఆమె భిక్షం వెయ్యడానికి వచ్చింది. తక్షణమే ఆ యువసన్యాసి ఆమె పాదాలమీద పడిపోయి ఇలా అన్నాడు: “అమ్మా!ఆ సంగతి మీ కెలా తెలిసింది?” దానికి ఆమె యిలా బదులిచ్చింది: “నాయనా ! నీ యోగం కాని, సాధనలు కాని నాకు తెలియవు. నేను సామాన్యురాలిని. నా భర్తకు జబ్బుగా వుండటంచేత ఆయనను సేవిస్తూ నిన్ను వేచివుంచాను. యావజ్జీవితం నా ధర్మాన్ని నిర్వహించడానికే శ్రమించాను. అవివాహితనై వున్నప్పుడు నా తలిదండ్రుల పట్ల నా ధర్మాన్ని నిర్వర్తించాను; వివాహం జరిగాక నా భర్తయందు నా ధర్మాన్ని నిర్వహిస్తున్నాను; ఇదే నేను చేసే యోగసాధన. కాని స్వధర్మాచరణ వల్లనే నాకు జ్ఞానోదయమైనది. ఈ విధంగా నీ మనోభావాన్ని గ్రహించి, అడవిలో నువ్వు చేసిన పని తెలిసికోగలిగాను. ఇంతకంటె ఎక్కువగా తెలుసుకోవాలంటే నేను చెప్పే నగరానికి వెళ్లు. అక్కడి అంగడి వీథిలో ఒక ఫలానా వ్యాథుడు (butcher) నీకు ఎదురుపడతాడు. అతడు నీకు కొన్ని విషయాలు చెబుతాడు. అవి తెలుసుకొంటే నువ్వెంతో సంతోషపడతావు.” ‘ఆ నగరానికి, ఆ వ్యాధుడి వద్దకు నే నెందుకు వెళ్లాలి?’ అని సన్న్యాసి ముందుగా ఆలోచించాడు. కాని తను కళ్లారా చూసిన సంఘటన అతడిలో కొంత తెలివి కలిగించింది. కాబట్టి అతడు ఆ నగరానికి వెళ్లాడు. నగరంలో బజారువీథి కనబడింది. కాస్త దూరంలో స్థూలకాయుడైన ఒక వ్యాధుడు పెద్దపెద్ద కత్తులతో మాంసాన్ని ఖండిస్తూ, కొనడానికి వచ్చిన వాళ్లతో బేరాలాడుతూ, సంభాషించటం కనబడింది. అప్పుడు ఆ యువ సన్యాసి ఇలా తలపోశాడు. ‘శ్రీరామరక్ష! ఇతడి వద్దా నేను ధర్మాన్ని నేర్చుకోబోయేది! చూడబోతే ఇతడు రాక్షసావతారం, అంతకంటే మరేంకాదు.’ ఇంతలో ఆ వ్యాధుడు తల ఎత్తి చూసి, ఇలా అన్నాడు: “స్వామీ! రండి, ఆ సాధ్వి మిమ్మల్ని పంపినదా? నా పని పూర్తి అయ్యేదాకా కాస్త ఈ ఆసనం మీద కూర్చోండి.” “ఇక్కడ ఏం జరుగబోతుందో!” అనుకుంటూ ఆ సన్యాసి ఆసనం మీద కూర్చున్నాడు. వ్యాధుడు తన బేరసారాలు చూసుకుని, సన్యాసితో “అయ్యా! రండి మా ఇంటికి దయచేయండి” అని పిలిచాడు. ఇల్లు చేరగానే సన్యాసికి ఒక ఆసనాన్ని చూపించి “ఇక్కడ కూర్చుని వేచివుండండి” అంటూ వ్యాధుడు లోపలికి వెళ్లిపోయాడు. తరువాత అతడు వృద్ధులైన తన తల్లిదండ్రులకు స్నానం చేయించి, భోజనం తినిపించి వారిని సేవించాక సన్న్యాసివద్దకు వచ్చి ఇలా అన్నాడు: “నన్ను చూడడానికి మీరు వచ్చారు. నేను మీకు చెయ్యగల పనేమిటో సెలవివ్వండి.” సన్న్యాసి అప్పుడు ఆ వ్యాధుణ్ణి, జీవుని గురించి, దేవుణ్ణి గురించి కొన్ని ప్రశ్నలడిగాడు. ఆ విషయాల మీద వ్యాధుడు గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు. ‘వ్యాధగీత’ అనే పేరిట ఇది మహాభారతంలో ఒక భాగమై, వేదాంత మహోన్నత తత్త్యరాశిగా విరాజిల్లుతోంది. వ్యాధుడు తన బోధనను పూర్తిచేసేసరికి సన్యాసి ఆశ్చర్యచకితుడై ఇలా ప్రశ్నించాడు. “మీరెందుకు ఇలాంటి శరీరాన్ని ధరించి వున్నారు? ఇంతటి విజ్ఞానులైన మీరు ఇలాంటి ఏహ్యకర్మలను చేస్తూ ఎందుకు ఈ వ్యాధ శరీరాన్ని ధరించారు?” దానికి వ్యాధుడు ఇలా జవాబిచ్చాడు: “నాయనా! ఏ కర్మా ఏహ్యం కాదు; ఏ కర్మా మలినం కాదు. జన్మచేత నేనిలాటి పరిసరాల, పరిస్థితుల మధ్య వున్నాను. బాల్యంలో ఈ వృత్తి నేర్చుకున్నాను. నాకు సంగం లేదు. నా విధిని చక్కగా నిర్వర్తింప ప్రయత్నిస్తున్నాను. గృహస్థుడైన నేను నా ధర్మాలను నిర్వర్తించ ప్రయత్నిస్తున్నాను. నా తల్లిదండ్రుల సుఖానికై నా శక్తివంచన లేకుండా పాటుపడుతున్నాను. మీ యోగం గురించి నాకు తెలుసు. నేను సన్న్యాస స్వీకరణ చెయ్యలేదు; సంసారాన్ని వదలి అరణ్యానికి పోలేదు. అయినా మీరు నావద్ద విన్నట్టి, చూసినట్టి, విశేషాలన్నీ స్వవర్ణాశ్రమ ధర్మాన్ని నిస్సంగత్వంతో నిర్వర్తించటంతో నాకు లభించాయి.”
భారతదేశంలో ఈ జన్మలో నేను చూసిన అత్యద్భుత వ్యక్తులలో ఒకరనదగ్గ ఒక మహర్షి, ఒక మహాయోగి ఉన్నారు. ఆయనొక వింతవ్యక్తి. ఆయన ఎవ్వరికీ బోధించడు; మీ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడు. ఆచార్య పదవిని అలంకరింపబోవ ఇష్టపడడు. మీరొక ప్రశ్న అడిగి, కొన్ని రోజులు అక్కడే కనిపెట్టుకుని వుంటే ప్రసంగవశాత్తు ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించి అద్భుతమైన తన బోధనతేజాన్ని దానిపై పరపిస్తాడు. కర్మరహస్యాన్ని గురించి ఒకప్పుడు ఆయన నాకిలా చెప్పాడు. “ప్రాప్యము ప్రాపకము ఒక్కటి కావాలి.” నువ్వొక కర్మను నిర్వర్తిస్తున్నప్పుడు ఇతరమైన దేనినీ లక్ష్యపెట్టవద్దు. దాన్ని ఆరాధనగా, మహోన్నతారాధనగా ఒనర్చుతూ, ఒనర్చుచున్నంతసేపు నీ జీవితాన్ని దానికే అర్పించు. ఈ విధంగా కథలో వ్యాధుడూ, పతివ్రతా మనఃపూర్వకంగా, మహానందంతో తమ ధర్మాన్ని నిర్వర్తించారు. దాని ఫలంగా వారికి జ్ఞానోదయమైనది; దీనివల్ల ఏ ఆశ్రమ ధర్మాన్నైనా సక్రమంగా, ఫలాపేక్ష లేకుండా నిర్వహిస్తే మహోన్నతమైన ఆత్మానుభవం లభిస్తుందని తెలుస్తూంది.
ఫల సంగం వున్నప్పుడే తనకు ప్రాప్తమైన కర్తవ్యం ‘ఇలావుంది’, ‘అలావుంది’ అంటూ మానవుడు గొణుక్కుంటాడు. ఫలాపేక్ష లేని వ్యక్తికి సమస్తకర్మలూ సమానయోగ్యాలై కనబడతాయి; స్వార్ధపరతను, కామాన్ని జయించి, ఆత్మస్వాతంత్ర్యాన్ని పొందడానికి అవన్నీ వారికి పటుతర సాధనాలుగానే అగపడతాయి. తరచు మనమంతా విశేషమైన అహంకారానికి వశులమవుతాము. మన అంగీకారాన్ని మించి మన కర్తవ్యాలు మన అర్హతను బట్టే నిర్ణీతాలవుతుంటాయి. స్పర్థ అసహనాన్ని పెంచుతుంది, దానిచే దయాళుత్వం నశిస్తుంది. నసపెట్టేవాడికి అన్ని కర్తవ్యాలు రుచించనివే, ఏ కర్మలూ అతడి కెన్నడూ తృప్తిని కలిగించలేవు; అతడి జీవితమంతా తప్పకుండా వ్యర్థమైపోతుంది. కాబట్టి పని చేస్తూనే వుందాం, మన కర్తవ్యం ఏదైనాకాని చేస్తూనే ముందుకు సాగుదాం. చక్రానికి మన భుజాన్ని తగిలింప సర్వదా సంసిద్ధులమై వుందాము. అప్పుడు మనం వెలుగును తప్పక సాక్షాత్కరించుకొంటాం.