(3–11–1896 నాడు లండన్లో ఉపన్యసించింది)
“స్వయంభువు (బ్రహ్మ) ఇంద్రియాలను బహిర్గతములయ్యేలా చేశాడు. కాన, మానవుడు బాహ్యలోకాన్ని చూస్తాడు కానీ, అంతరాత్మను చూడడు. అమృతత్వాన్ని (మోక్షాన్ని) అభిలషించని ధీరుడొకడు, అంతర్ముఖుడై (తన చూపును లోనికి త్రిప్పి) ప్రత్యగాత్మను (తనలోని ఆత్మను) దర్శించాడు.” వేదాలలో మొదట కనిపించేది బాహ్యవస్తు విచారమే అని ఇప్పటికే తెలిపివున్నాను. ‘వస్తువుయొక్క తత్త్వం (సత్యం) బాహ్యలోకంలో (బహిరవ లోకమున) కానరాదు. అందుకు అంతరవలోకనం (ఆత్మ విచారం) ఆవశ్యకం’ అనే నూతన భావం తర్వాత గోచరించింది. ఆత్మను సూచించుటకు ఇక్కడ ఉపయోగించబడిన శబ్దం మిక్కిలి భావపూరితమైనది. “లోపలికి వెళ్లినవాడు; మనలోగల అగాధ సత్యం; హృదయ కేంద్రం; బహిర్గతమైన అన్నిటికి ఉత్పత్తి స్థానమనదగిన మూలగర్భం; మనోబుద్ధులు, ఇంద్రియాలు మున్నగునవన్నీ దేనినుండి వెడలిన కిరణాల వంటివో, ఆ మధ్యగత సూర్య మండలం;” “అల్పబుద్ధులు, మూఢులు, బాహ్య కామముల ననుసరిస్తూ మిక్కిలి వ్యాప్తిగల మృత్యు పాశంలో చిక్కుపడిపోతారు.” ఇందు, ఆ పైభావమే అనిత్య వస్తుమయమైన, ఈ బాహ్యాలోకంలో నిత్యుని చూడటం, కన్గొనడం, అసంభవం – అనుభావమే – స్పష్టపరుపబడింది. నిత్యమైన పదార్థమందే నిత్యునికోసం అన్వేషించాలి. మనకున్న నిత్యపదార్థం మనలో వుండే ఆత్మ ఒక్కటే. శరీరం, మనస్సు, భావాలు, మన చుట్టూ కనిపించే ప్రపంచం – అవన్నీ అనిత్యాలే. ఈ అన్నిటికీ స్వామి; హృదయాంతరాళంలో ఉండే, నిత్య జాగరూకుడు; సర్వసాక్షి; మానవుని ఆత్మ అయిన అతడొక్కడే నిత్యుడు. కాబట్టి ఈ అఖీల విశ్వానికీ, కారణభూతుడైన ఆ నిత్యునన్వేషించే వారక్కడికే పోవాలి. అక్కడ కానీ అతడు కనిపించడు. “ఇక్కడ వున్నదే అక్కడా వుంది. నానాత్వాన్ని చూసేవాడు మాటిమాటికి మృత్యువు వాత పడుతుంటాడు.” ఆదిమకాలంలో జనులు స్వర్గానికి వెళ్లాలనుకునేవారని మనకు తెలుసు. తాము నివసిస్తూన్న జగత్తు వారికి అసంతృప్తికరంగా తోచింది. అందువల్ల “మరణానంతరం శోకరహితం, హర్షమయం అయిన చోటకే వెళ్తాం” – అని వారు భావించడం సహజమే కదా? ఇట్టి స్థలాలనేకం కల్పించుకొని వారు వానికి స్వర్గములని పేరు పెట్టారు. వారి బుద్ధికి అవి శాశ్వత సుఖావాసాలు. అక్కడ మనశ్శరీరాలు దృఢములు; వ్యాధిరహితాలు. పితరులతో కూడిన నివాసం; కాని తత్త్వవిచారం ప్రారంభం కావడంతోనే ఇవన్నీ అసంభవములయిన వెర్రి ఊహలని తెలిసిపోయింది. “పరిపూర్ణత్వ ముండే స్థలం” అనడంలో భావ విరుద్ధతాదోషం వుంది కదా? స్థలం ఆద్యంతరహితం; కాబట్టి ఈ భావం పరిత్యజించవలసి వచ్చింది. ఆ స్వర్గాలలోని దేవతలు ఒకప్పుడు మానవులుగా ఉండి, సత్కర్మాచరణ ఫలంగా దేవతలయ్యారనీ, దేవత్వములన్నీ వేర్వేరు స్థితులు, వేర్వేరు పదవులనీ, వేదాలలో పేర్కొనబడిన దేవతలెవ్వరూ శాశ్వతజీవులు కారనీ వారికి తెలిసింది.
ఇందుకు నిదర్శనం – ఇంద్రుడు, వరుణుడు అనే పేర్లు గల పురుషులు లేరు. అవి దిక్పాలక వర్గంలోని పదవుల పేర్లు; తొల్లిటి ఇంద్రుడు ఇప్పటి ఇంద్రుడు భిన్నులు. అప్పటి ఇంద్రుడు మరణించిన తర్వాత భూలోకంనుండి, మరొక డా పదవి నధిష్టించాడు. అట్లే దేవతలంతా; అవన్నీ అధికార పదవుల పేర్లే. దేవతాపదవి నధిరోహించే అర్హతను అర్జించిన మానవాత్మలకు, ఈ పదవులు కాలక్రమంలో లభిస్తూ ఉంటాయి. కాని ఆ దేవతలందరూ మరణించే వారే. ప్రాచీనమైన ఋగ్వేదంలో అమర శబ్దం (మృతి లేనివారు) ఈ దేవతలను గూర్చి వాడబడింది. కాని అమరత్వం దేశకాలాతీతమనే భౌతిక రూపాలకు – ఎంత సూక్ష్మాలైనా – ఇది అన్వయింపదనీ కనుగొని, ఈ శబ్దం వాడటం మానుకొన్నారు. భౌతికరూపం ఎంత సూక్ష్మమైనదిగా వున్నా అది దేశకాలాల్లోనే ఉద్భవించి వుండాలి. ఎందుకంటే రూపమేర్పడటానికి కావలసిన సామగ్రి “దేశం” లో వుంది. దేశ సంబంధంలేని రూపాన్ని ఊహించడానికి ప్రయత్నించండి. మీకది అసాధ్యం. రూప నిర్మాణానికి కావలసిన సామగ్రిలో ‘దేశ’ మొకటి అని చెప్పవచ్చు. దానిలో నిరంతర పరిణామముంది. దేశకాలాలు మాయలోనివి. ఈ భావమే “యదే వేహ తద ముత్ర” (ఇచ్చట ఏది కలదో, అచ్చటకూడ అదియే కలదు) అను శ్రుతి వాక్యంలో తెలుపబడింది. అంటే అక్కడి దేవతలుకూడ, ఇక్కడ వర్తించే ప్రకృతి ధర్మాలకు బద్ధులై ఉండాలి. మాటిమాటికి లయమొందుతూ, మళ్లీ పుడుతూ ఉండాలి. భౌతిక పదార్థానికి వివిధ రూపాలు కల్పించి, మరల రూపుమాపుతూండడమే ప్రకృతి ధర్మం. పుట్టిందంతా గిట్టవలసిందే. కాబట్టి స్వర్గాలుంటే అక్కడకూడ ఈ ధర్మం వర్తిస్తుంది.
ఈ లోకంలో సుఖాన్నెప్పుడూ దుఃఖం నీడలాగా అనుసరిస్తూ ఉంటుంది. జీవానికి నీడ మరణం. ఇవి విడదీయరానివి. ఎందుకంటే ఈ చావు బ్రదుకులు, ఈ కష్ట సుఖాలు, ఈ కీడు మేళ్లు పరస్పరవిరుద్ధం కావు. భిన్నములూ కావు. ఒకే పదార్థం యొక్క రెండు రూపాలవి. మేలు కీళ్లనేవి పరస్పర సంబంధంలేక, శాశ్వతంగా నిలిచి వుండే రెండు ప్రత్యేక వస్తువులనెడి భావం, ఏమాత్రమూ ఆదరింపదగింది కాదు. ఒకే వస్తువుయొక్క భిన్నరూపాలవి. ఆ వస్తువే ఒకసారి మేలుగాను, ఒకసారి కీడుగాను కన్పిస్తుంది. మేలు కీళ్లకు “ప్రకార” (జాతి) భేదం లేదు. “పరిమాణ” భేదం మాత్రం ఉంది. తీవ్రతా పరిమాణమందే ఆ భేదం. సుఖ దుఃఖానుభూతులను కలిగించే దొకే నరాల కూడలి కదా? ఆ నరాలు చెడిపోతే, ఏ అనుభూతీ కలుగజాలదు. సుఖానుభూతి కాజాలకపోతే దుః ఖానుభూతి కాజాలదు. అవి రెండూ భిన్నములు కాకపోవడమే ఇందుకు కారణాలు. ఒకసారి సుఖం కలిగించే వస్తువే ఇంకొకసారి దుఃఖం కలిగిస్తుంది. ఒకరికి సుఖం కలిగించే వస్తువే మరొకరికి దుఃఖం కలిగిస్తుంది. మానవునికి సుఖమిచ్చే జంతుమాంసం, ఆ జంతువుకు అపార బాధ కలిగించటం వల్లేకదా లభించింది? అన్నివిధాలా సుఖమే కలిగించే వస్తువేదీ లేదు. ఒకనికి సంతుష్టి కలిగిస్తే ఇంకొకనికి అసంతృప్తి. ఇట్లే దీని నడక. కాబట్టి లోకంలో ఇలాంటి ద్వంద్వాలు కలవను భావమే నిరాకరింపబడుతోంది. దాని ఫలమేమి? లోకంలోని క్రీడంతా నిర్మూలమై పోయి మంచిమాత్రమే మిగిలే కాలమెన్నటికీ రాజాలదని ఇంతకు ముందరి ఉపన్యాసాలలో చెప్పాను. మీలో కొందరికి ఆ మాట అసంతృప్తికరంగానూ, భయం కలిగించేదిగానూ తోచి వుండవచ్చు కాని నేనేమి చేయగలను? అది పొరపాటైతే ఒప్పుకోవడానికి నేను సంసిద్ధుణ్ణే. కాని అది పొరపాటని సకారణంగా తెలిసేంతవరకు పొరపాటు అని నాకు స్పష్టమయ్యే వరకు దాన్ని నేను మార్చుకొనజాలను.
“పరిణామక్రమంలో ఈ లోకంలో కల చెడుగంతా నశిస్తూ రాగా, కొన్ని కోట్ల సంవత్సరాలకది పూర్తిగా నశించి, మంచి మాత్రం మిగిలే కాలం వచ్చి తీరుతుంది కదా?” అని ఆక్షేపకులు వాదించవచ్చు. ఈ వాదం నిర్దుష్టంగా, బలిష్ఠంగా కనిపిస్తుంది. ఇది సత్యమైతే నేనూ ఎంతో సంతోషిస్తాను. కాని ఇందొక పొరపాటుంది. “లోకంలోని మంచి చెడుల పరిమాణం సుస్థిరంగా స్థాపింపబడి ఉంది” అనే అపోహపై ఈ వాదం ఆధారపడి ఉంది. ఒక స్థిరమైన పరిమాణంగల (నూరు అనుకుందాం) మంచి ఉందనీ, చెడు దినదినక్షయాన్ని పొంది మంచిమాత్రం మిగులు తుందనీ, ఇందు ఊహించబడుతోంది. ఈ ఊహకు ఏమైనా ఆధారం వుందా? “చెడు, దినదినాభివృద్ధి నొందుతోంది. మంచికూడ అభివృద్ధి పొందుతోంది” అని కదా ప్రపంచ చరిత్ర తెలుపుతోంది. ప్రాథమిక దశలో వున్న మానవుని తీసికొందాం. వానిది అడవిలో నివాసం. వాని సుఖానుభవ శక్తి స్వల్పం. వ్యధానుభవశక్తీ స్వల్పమే. ఈ వ్యధ (దుఃఖం) అంతా ఇంద్రియ విషయాల్లోనే. కడుపు నిండకపోతే వానికి బాధ. కడుపార అన్నంపెట్టి స్వేచ్ఛగా తిరిగి వేటాడనివ్వండి. వానికి పరమానందం. వాని సుఖక్షేత్రం ఇంద్రియాలైనట్లు దుఃఖక్షేత్రంకూడ ఇంద్రియాలే. వానికి జ్ఞానాభివృద్ధి అయితే, వాని సుఖం అధికమవుతుంది. బుద్ధి క్షేత్రంకూడ ఇప్పుడు లభించడం చేత, ఇంద్రియసుఖం, వైజ్ఞానిక సుఖంగా పరిణమించింది. మనోహర కావ్యాన్ని ఇప్పుడు చదివి ఆనందించగలడు. గణితానికి సంబంధించిన సమస్యలలో బుద్ధి నిమగ్నం కాగలదు. కాని దానితోపాటు నరాలు సున్నితం కావడంచేత వైజ్ఞానిక వ్యథాస్పర్శ వానినిప్పుడు వేధించ గలదు. పూర్వం ఆటవిక స్థితిలో, వాని కీ విషయంలో వ్యధ లేదు. ఒక చిన్న ఉదాహరణం తీసికొందాం. టిబెట్ దేశంలో వివాహాచారం లేదు. అనుమానాలు, అసూయలుకూడ లేవు. కాని వివాహస్థితి ఉత్తమమనడానికి సందేహం లేదు. సౌశీల్య సంపద కలిగించే అద్భుతానందాన్ని, పతివ్రతామణియైన భార్యవల్ల భర్తకు, ఏకపత్నీవ్రతుడైన భర్తవల్ల భార్యకు, కలిగే మహానందాన్ని టిబెట్ జను లెరుగరు. కాని భార్యాభర్తలలో ఒకరు నీతిబద్ధులై, సౌశీల్యం పాటిస్తూ వుండి, రెండవవారు అవినీతిపరులైతే కలిగే దుర్భర మనోవ్యధలు, అసూయలు, హృదయ సంతాపాలుకూడ వారికి తెలీదు. వారికొక పక్షంలో సుఖానుభూతి, ఒక పక్షంలో దుఃఖానుభూతి కలిగింది.
మీ దేశాన్ని తీసుకుందాం. అంత ధన సమృద్ధిగల దేశం జగత్తులో మరొకటి లేదు. అంత భోగపరాయణమైన దేశంకూడ లేదు. కాని అంతటి దౌర్భాగ్యం, అంతటి తీవ్ర హృదయ వేదనలు మరెక్కడైనా వున్నాయా? అక్కడ ఎందరు మతిభ్రష్టులున్నారో, అందరు ఇంకెక్కడైనా వున్నారా? మీ కోరికలు అత్యంత బలిష్ఠములు, అత్యంత తీవ్రములు కావడమే ఇందుకు కారణం. మిక్కిలి “దర్జాగా” మహావైభవంతో జీవించి తీరాలి. తన అదృష్టపు పంటగా హిందూదేశీయుడు భావించునంత అపార ద్రవ్యాన్ని మీ రీ జీవిత వైఖరికి ఒక్క సంవత్సరంలో ఖర్చుపెడతారు. అంత వైభవోపేతమైన జీవనం కాని మీ సాంఘిక ప్రమాణానికి చాలదు. అట్టి మీకు, నిరాడంబర జీవనాన్ని గూర్చిన బోధ ఎలా ఉపకరిస్తుంది? సాంఘిక రథం సాగిపోతోంది. అనాధ యువతుల కన్నీళ్లు వరదలై ప్రవహించవచ్చు. అనాధ శిశువులు గుండెలు పగిలేలా ఏడువవచ్చు. కాని దాని గమనం ఆగుతుందా? అన్నిచోట్లా ప్రపంచ స్థితి ఇదే. మీ భోగానుభవ శక్తి అభివృద్ధి చెందింది కాబట్టి, మీ సంఘం ఇతర సంఘాలకన్న ఎంతో నాగరికంగా ఉంది. మీ భోగ్యవస్తువులు అనేకం. అన్ని భోగ్యవస్తువులులేని వారికి అన్ని మనోవేదనలుకూడ ఉండవు. ఈ వాదాన్ని మీరెంత దూరమైనా సాగించవచ్చు. మీ బుద్ధిలోని గమ్యం ఉన్నత మైన కొద్దీ, మీ సుఖానుభవం అధికమవుతూ వుంటుంది. మీ దుఃఖా నుభవంకూడ తీవ్రమవుతుంది. ఈ రెండును ఒండొంటికి నీడల వంటివి. చెడు తొలగించబడుతున్న మాట నిజమే కావచ్చు. కానీ అలా అయితే, మంచికూడ నశించాలి కదా? నిజానికి చెడు అపారంగా పెరుగుతూ, మంచి తరిగిపోతోందనాలేమో? మంచి, పదింతలు పెరిగితే, చెడు నూరింతలు పెరుగుతుంది. ఇది మాయ; ఆశావాదంకాని, నిరాశావాదంకాని కాదు. ఈ లోకం కేవలం సంతాపంతో నిండిందని వేదాంతం బోధింపదు. అది అసత్యబోధ కదా? అది సుఖపూరితమనీ, అన్ని ఫలితాల్నిస్తుందని వర్ణించడంకూడ అసత్యమే మరి. కాబట్టి ఈ లోకం కేవలం సుఖమయం, అంతా పూవులు, పాలు, తేనె అని బాలురకు బోధించరాదు. అదంతా మన స్వప్న దృశ్యం. కాని ఒకడు, ఇంకొకడికన్న ఎక్కువ కష్టాలపాలై ఉన్నమాత్రాన, లోకం కేవలం వ్యధామయమనడం తప్పే. ఈ ద్వంద్వభావమే ఈ కీడు, మేళ్ల కలయికే, మనకు తెలిసిన ప్రపంచం. “ఈ కీడు మేళ్లు భిన్న వస్తువులనీ, ప్రత్యేక మూలాలున్నాయనీ భ్రమించనఖ్కర్లేదు. తరతమ భేదాలతో, వేషభేదాలతో కనిపిస్తూ, ఒకే మనసులో భిన్నానుభూతులు కలిగించే ఏకైక వస్తువని గ్రహించండి” – అని వేదాంతం బోధిస్తుంది. అంటే, వేదాంతంయొక్క ప్రథమ ప్రయత్నం ఈ బాహ్యవస్తువులలో, ఏకత్వాన్ని తెలుసుకోవడం; రూపాలు తెలుస్తున్న ఆ ఏకైక సత్యాన్ని – ఆ రూపాలు ఎంత పరస్పరభిన్నాలుగా తోచినా, వాని అన్నిటికీ మూలమైన, ఆ ఏకైక సత్యాన్ని – తెలుసుకోవడం; ఇద్దరు దేవుళ్లు – ఒక శుభుడు, ఒక అశుభుడు – కలిసి లోకాన్ని నిర్మించిరనీ, అందలి మంచి అంతా, శుభాదేవుని కార్యమనీ, చెడు అంతా అశుభాదేవుని కార్యమనీ, ప్రాచీన పారశీకుల సిద్ధాంతం. ఎంత అపరిపక్వ సిద్ధాంతం? ఇది వెర్రిభావమని ప్రత్యక్షంగానే తెలుస్తోంది. ఇది నిజమైతే, ప్రతి ప్రకృతి ధర్మంలో రెండు భాగాలుండాలి. ఒక భాగాన్ని ఒక దేవుడు తీర్చి వెళ్లిపోతాడు; తర్వాత రెండవ భాగాన్ని రెండవ దేవుడు వచ్చి తీరుస్తాడు. ఇద్దరికీ కార్యభూమి, ఒకే లోకం. ఒక భాగానికి మంచి, ఇంకొక భాగానికి చెడు చేసే ఆ దేవుళ్లిద్దరూ సామరస్యంగానే ఉంటారట! ఇది చాలా అపరిపక్వమైన భావం. ద్వంద్వభావం. ఇంతకన్న అపరిపక్వమొందజాలదు. ఇంతకన్నా ఉన్నతం, ఇంతకన్న గంచీబీరం అయిన మరొక భావం వుంది. లోకం కొంతవరకు మంచిది, కొంతవరకు చెడ్డది అనేదే ఆ భావం. ఆ భావంకూడ పై విధంగా విచారిస్తే, యుక్తియుక్తం కాదని, తేటపడుతుంది. ఇక ఐక్యధర్మభావ మొక్కటే మిగులుతుంది. మన కాహారం సమకూర్చేది అదే. అనేకులకు, ఆకస్మిక మరణాలను, ప్రమాదంవల్ల కలిగే మరణాలను సమకూర్చేదికూడ అదే.
అంటే ఈ లోకం ఆశావాదానికి ఆధారభూతమైంది కాదు; నిరాశావాదానికి ఆధారభూతమైందీ కాదు. ఆ రెండిటియొక్క కలయిక. ప్రకృతిపై మోపబడే నింద అంతా నిజానికి మనదే అని ముందుముందు తెలుస్తుంది. కానీ, వేదాంతం ఇంతటితో ఊరుకోక తప్పించుకునే మార్గాన్ని మనకు బోధిస్తుంది. ఉన్న కీడును లేదనడం దాని మార్గమే కాదు. ఉన్నదాన్ని ఏమాత్రం దాచక, ఉన్న స్థితినంతా అది ధీరతతో పరిశీలిస్తుంది. అది నిరాశను పొందేది కాదు. సత్యం బుద్ధికి అందదని జంకదు. లభించిన ప్రతిక్రియలను అది వజ్రంలా కఠినమైన పునాదిపై నిలపాలనుకొంటుంది. బిడ్డయొక్క నోటిని మూసి, ప్రస్తుత మది నమ్మి మోసపోయిన బొంకులతో దాని కన్నులుకప్పి వుంచే మార్గాన్ని వేదాంతం అవలంబింపదు. నా చిన్ననాడొక యువకుని తండ్రి మరణించాడు. అనేకులను పోషించే భారమతనిపై పడింది. ఇంట్లో ఏమీ లేదు. తండ్రి స్నేహితులేమీ ఆదుకోలేదు. ఇలాంట దుర్దశలో, అతడొక క్రైస్తవ బోధకుని దగ్గరకు వెళ్లగా “ఇదంతా మంచిదే. భగవంతుడు అంతా మన మేలుకే కల్పిస్తూంటాడు” అని ఆ బోధకుడన్నాడు. చాలాకాలం నుండి వున్న పుండును బంగారురేకుతో కప్పివుంచాలనుకునే పూర్వీకుల పద్ధతి ఇది – అసమర్ధతను, అజ్ఞతను సూచించేది. యువకు డీ హితోపదేశాన్ని విని వెళ్లిపోయాడు. ఆరు నెలల తర్వాత ఆ బోధకునికి ఒక శిశువు పుట్టింది. దేవుడు తన ఎడ చూపించిన అనుగ్రహానికి కృతజ్ఞత వెల్లడించడానికి అతడొక విందుచేసి, దాని కా యువకునికూడ ఆహ్వానించాడు. ఆ సందర్భంలో చేసిన ప్రార్థనలో “భగవంతుని అనుగ్రహంకోసం వందనాలు అర్పించండి. అనుగ్రహించే భగవంతునికి ధన్యవాదాలు సమర్పించండి” అని బోధకుడన్నాడు. అప్పు డా యువకుడు లేచి “ఆపు. ఇది అశుభ సంఘటన” అన్నాడు. “ఎలా” అని బోధకు డడుగగా, అతడిలా బదులు చెప్పాడు. “మా తండ్రి మరణించి నప్పుడు అశుభంగా కన్పించినా, అది శుభమే అన్నావు. కాబట్టి ఇప్పుడిది శుభంగా కనిపించినా నిజంగా అశుభమే –” లోకుల తాపత్రయాన్ని తీర్చడం ఇలాగా? కరుణాపరిపూర్ణచిత్తులై, నిర్భాగ్యులను ఆదుకోండి. వారి క్లేశాలను కప్పిపెట్ట, అవి లేనట్లు ప్రవర్తించకండి. ఈ లోకాన్ని చక్కబరచడం అసాధ్యం. దానికి అతీతులుకండి.
ఈ లోకం, మంచీచెడుల కలయిక. మంచి ఎక్కడున్నా, చెడు దాని వెంటనంటి ఉంటుంది. కాని ఈ వ్యక్త రూపాల కన్నిటికీ, ఈ విరుద్ధ భావలకన్నిటికీ మూలమై, ఆ ఐక్యం నిలిచి వుందని వేదాంతం కనిపెట్టింది. “చెడును త్యజించు, మంచినికూడ త్యజించు” అని దాని బోధ. అలా చేస్తే ఏం మిగులుతుంది? వాని రెంటికీ వెనుక రెంటికి మూలమై ఉండేదొకటవుంది. అది మీ సొంత వస్తువు. అదే మీ నిజమగు మీరు. ప్రతి చెడుకు, అది అతీతం. ప్రతి మంచికీకూడ అది అతీతమే. అదే మంచి చెడులుగా గోచరించేది. మొదట దాన్ని కనుక్కోండి. అప్పుడుగాని మీకు నిజమైన ఆశాస్వభావం ఏర్పడదు. ఎందుకంటే అప్పుడు అంతా మీకు లొంగుతుంది. ఈ వ్యక్త రూపాలను మొదట అదుపులోకి తెచ్చుకోండి. అప్పుడు, మీలోని సత్య వస్తువును వ్యక్తపరిచే శక్తి మీ స్వాధీనమై వుంటుంది. మొదట ఆత్మ సామ్రాజ్యాన్ని సంపాదించుకోండి. లెండు, స్వతంత్రులు కండు. ప్రకృతి ధర్మాల ఆవరణను దాటి పోండి. వారికి మీపై నిరంకుశాధికారం లేదు. అవి మీలోని అంశలే. కాబట్టి వానిని దాటడం సుసాధ్యం. మీరు మొదట గ్రహించవలసిన విషయమేమంటే, ఈ ప్రకృతికి మీరు దాసులు కారు. ఇప్పుడు కారు సరికదా, పూర్వమెన్నడూ కారు, ముందు కాబోరు. ఈ ప్రకృతి అనాది, అనంతములుగా కనిపించినా, నిజానికది కేవలం పరిమితం. మహాసముద్రంలో, ఒక నీటిబొట్టు వంటిది. మీ ఆత్మే ఆ మహాసముద్రం. సూర్య, చంద్ర నక్షత్రాలకంటే మీరు అతీతులు. మీ అనంతత్వంతో పోల్చి చూచిన అవి నీటి బుడగలవంటివి. ఈ సత్యాన్ని గ్రహించండి. మీరంతట మంచి చెడులు రెంటినీ నియమించగలరు. అప్పుడు మీ దృక్పథమంతా మారిపోతుంది. “మంచి ఎంత మనోజ్ఞం? చెడు ఎంత అద్భుతం?–” అని అప్పుడు మీరు ముక్తకంఠంతో ప్రకటిస్తారు.
ఇదే వేదాంత బోధ. వెర్రి చికిత్సలను అది చేయదు. పుండును, బంగారు రేకుతో కప్పిపెట్టి అది ఇంకా ఎక్కువైతే, మరికొంత రేకును కప్పడం దాని మార్గంకాదు. “జీవిత మనేది గాఢసమస్య. నిర్భయులై దాన్నెదుర్కొని, అది వజ్రకఠినంగా ఉన్నా, త్రోవ చేసికొని చొరబడండి. మీ ఆత్మ అంతకన్నా బలిష్ఠం అని తెలిసి వాని, ధీరతతో ప్రవర్తించండి” అని దాని బోధ. క్షుద్రులైన దేవుళ్లపై అది బాధ్యతనుంచదు. మీ అదృష్టానికి మీరే కదా కర్తలు? మీ వ్యధలకు మీరే కారకులు. మీ వ్యధలకు, మంచి చెడులను నిర్మించింది మీరే. చేతులతో కళ్ళు మూసికొని చీకటి అంటున్నారు. చేతులు తీసేయండి. వెలుగును చూడండి. మీరు స్వయంప్రకాశులు. ఇప్పటికే పరిపూర్ణులు. “నానాత్వమును చూచేవాడు, మాటి మాటికి మృత్యువాత పడుతుంటాడు” అనే శ్రుతి వాక్యం మనకప్పుడర్థమవుతుంది. అఖండ వస్తువును చూడండి. ముక్తులు కండి.
దాన్ని చూడటం ఎలా? మన మనస్సెంతో భ్రాంతము; ఎంతో బలహీనం. ఎంతో పరాధీనం. కాని అదే బలిష్ఠం కాగలదు. మరణ పరంపరలనుండి, మనల్ని రక్షించగల అజ్ఞానంయొక్క, ఆ అఖండ పదార్థంయొక్క క్షణ దర్శనాన్ని, అప్పుడది పొందగలదు. పర్వతంపై కురిసిన వర్షం కాలువలవంటి వేర్వేరు ముఖాలుగా ప్రవహించేలాగా, మీ కీ లోకాన కనిపించే శక్తులన్నీ ఆ అఖండ పదార్థంనుండి వచ్చినవే. మాయ మీదపడి, అవి నానాత్వమొందినవి. నానాత్వం దెస పరుగెత్తకండి. అఖండం దెసకు మరలండి. సచరములన్నిటిలో, పరిశుద్ధ వస్తువులన్నిటిలో అతడు న్నాడు. అతడు జగత్తులో నిండిఉన్నాడు. అతడు యజ్ఞంలో ఉన్నాడు. ఇంటికి వచ్చిన అతిథిలో వున్నాడు. మానవులలో, జలంలో, మృగాలలో, సత్యంలో ఉన్నాడు. అతడు మహాపురుషుడు, ఒక్క రూపంలో వుండే అగ్ని ఈ భూలోకంలో ప్రవేశించి, వివిధ రూపాలకు ప్రతిరూపమై ఎలా కనిపిస్తోందో, ఒక్క వాయువే ఈ భువనంలో ప్రవేశించి, వివిధ ప్రాణి రూపాలకు ప్రతి రూపమై ఎలా కనిపిస్తోందో, అట్లే సర్వ భూతాంతరాత్మ అయిన ఈ ఆత్మ ఇన్ని భిన్నరూపాలలో కనిపిస్తోంది. ఈ ఏకత్వాన్ని గ్రహించినపుడే మీ కిది సత్యమవుతుంది. అంతవరకు కాదు. అప్పుడంతా ఆశాశీలతే. అంతటా అతడే కనిపిస్తాడుకదా? ఇప్పుడొక సంశయం కలుగగలదు. “ఆ పరిశుద్ధుడు, ఆ ఆత్మ, ఆ అఖండుడు, ఈ అన్నిటిలో ప్రవేశించాడనే మాట సత్యమైతే, అతడు తాపాలపాలు కావడం ఎందుకు? దీన దశను పొందడం ఎందుకు? అపరిశుద్ధుడు కావడం ఎందుకు?” అతడలా కావడం లేదని ఉపనిషత్తు చెబుతోంది. “సర్వలోక చక్షువగు (సర్వ జీవుల చూపున కాధారమైన) సూర్యుడు జీవుల కళ్లలోగల దోషాలచే, ఎలా దోషయుక్తుడు కాడో అట్లే, ఆ సర్వ భూతాంతరాత్మ లోకమందలి దుఃఖాలచే లిప్తుడు (దోషయుక్తుడు) కాడు.” కామెర్ల రోగంవల్ల నాకు అన్ని పచ్చగా కనిపింప వచ్చు. సూర్యుడు అందువల్ల బాధింపబడతాడా? “అతడు కేవలుడు, సర్వకర్త, సర్వ నియామకుడు. తన ఏకత్వాన్ని అతడు బహుత్వం చేస్తాడు. ఏ బుద్ధిశాలులు, అతన్ని తమ ఆత్మకు ఆత్మగా చూస్తారో వాళ్లదే శాశ్వత సుఖం. మరెవ్వరిదీ కాదు. ఈ బాహ్యజగత్తులో, ఈ సూర్యులలో, ఈ చంద్రులలో, ఈ నక్షత్రాలలో అతన్ని ఎలా కనుక్కోవడం? ఆ చోటిని సూర్య చంద్ర నక్షత్రాలు వెలిగింపజాలవు. అక్కడ మెరుపుల కాంతులు భాసించవు. ఇక ఈ అగ్ని విషయం చెప్పాలా? అతని ప్రకాశాన్ననుసరించే ఇవన్నీ ప్రకాశిస్తాయి. అతని కాంతిని ఆధారం చేసికొనే ఇవి వెలుగు తున్నాయి. వాని అన్నిటి ద్వారా వెలిగేది అతడే.” మరొక మనోహరమైన ఉపమానంకూడ వుంది. హిందూదేశంలో వుండే మర్రి చెట్టును మీలో కొందరు చూచి వుంటారు. అది ఒక వేరులోనుండి పుట్టి, చుట్టు ప్రక్కలలో ఊడలతో వ్యాపిస్తుంది కదా? అట్టి బ్రహ్మమే మర్రిచెట్టు. ఈ అన్నిటికీ అతడే మూలం. అతడు వ్యాపించి, ఈ జగత్తయినాడు. ఎంతదూరం వ్యాపించినా ప్రతి కొమ్మ, ప్రతి ఊడ, పరస్పర సంబంధమున్నదే.
వేదాలలోని బ్రాహ్మణాలలో, చాలా స్వర్గాలు పేర్కొనబడ్డాయి. కాని తాత్త్విక భాగమైన, ఉపనిషత్తులలో, స్వర్గ ప్రాస్తావమే లేదు. సుఖం ఏ స్వర్గంలో వెదికినా లభించదు. అది ఉండేది ఆత్మలో మాత్రమే. ఎన్ని స్థలాలలో వెదికినా ఏమి ఉపయోగం? సత్యానుభూతి తారతమ్యాలు తెలిపే ఈ ప్రకరణాన్ని చూడండి. “స్వప్నంలో వస్తువులు కనిపించినట్లు, పితృలోకంలో సత్యం కనిపిస్తుంది.” కలలో వస్తువులెలా కొంత అస్పష్టంగా కనిపిస్తాయో, అట్లే సత్యంకూడ అక్కడ అస్పష్టంగా కనిపిస్తుంది. గంధర్వలోక మనే మరొక స్వర్గముంది. అక్కడ ఇంతకన్నా అస్పష్టత. నీటిలో కనిపించే ప్రతిబింబం లాంటిది అక్కడి సత్యానుభూతి. బ్రహ్మలోకమనేది హిందువుల స్వర్గాలన్నిటిలో అత్యుత్తమమైంది (ఉన్నతమైంది). అక్కడ సత్యం వెలుగు నీడల్లాగా చాలవరకు విస్పష్టంగా కనిపిస్తుంది. కాని అక్కడకూడ పూర్ణ స్పష్టత లేదు. పరిపూర్ణ స్పష్టతతో అది కనిపించేది, మన ఆత్మల్లో మాత్రమే. అక్కడ అది అద్దంలో ప్రతిబింబంలాగా సమగ్రమై విస్పష్టమై, తేటయై కనిపిస్తుంది. కాబట్టి అత్యున్నత స్వర్గముండేది మన ఆత్మల్లోనే. వేదాంతమత ప్రకారం, మానవాత్మతో సమానమైన దేవాలయం లేనేలేదు. అన్ని స్వర్గాలకన్న అది శ్రేష్ఠం. ఎందుకంటే, ఈ జీవితంలోలాగా, మన ఆత్మల్లో లాగా, సత్యాన్ని ఇంత విస్పష్టంగా ఏ స్వర్గంలోను, ఎక్కడా మనం గ్రహింపజాలం. స్థలముల మార్పువల్ల అధికఫలం కలుగదు. కొండగుహల్లో నివసిస్తే, అనుభూతి మిక్కిలి స్పష్టమవుతుందని నాకు హిందూదేశంలో తోచింది. అది పొరపాటని తర్వాత తెలుసుకున్నాను. తర్వాత అరణ్యవాసం స్ఫురించింది. ఆ తర్వాత కాశీలో నివాసం. కాని అంతటా ఒకే చిక్కు. మన లోకాన్ని మనమేకదా నిర్మించుకొనేది? నేను చెడ్డవాడినైతే, నాకు లోకమంతా చెడ్డదే. ఉపనిషత్తు ఇట్లే చెబుతోంది. ఈ సత్యం అన్ని లోకాలకు వర్తిస్తుంది. మరణించి స్వర్గానికి వెళ్తే, అక్కడకూడ నా స్థితి ఇట్లే ఉంటుంది. నేను పరిశుద్ధుణ్ణి అయితే తప్ప గుహలు, అడవులు, కాశి, స్వర్గలోకం ఇవేవీ ఉపకరించవు. నా అద్దాన్ని పరిశుభ్రం చేసికొంటే, ఎక్కడవున్నా ఒక్కటే. సత్యమక్కడనే సహజ స్వరూపంలో లభిస్తుంది. కాబట్టి ఇక్కడికి, అక్కడికి పరుగెత్తుతూ శక్తిని వ్యర్థంగా ఖర్చు చేయడం నిష్ప్రయోజనం. అద్దాన్ని శుభ్రపరచడంలో ఆ శక్తిని ఉపయోగిస్తే ఆదర్శం సిద్ధిస్తుంది. ఇదే భావం మళ్లీ చెప్పబడింది. “అతన్ని ఎవ్వరూ చూడజాలరు. అతని రూపం ఎవ్వరికీ దృష్టిగోచరం కాదు. మనస్సునకే విశుద్ధ మనస్సుకే అతడు కనిపిస్తాడు. అతణ్ణి చూచిన వారికి అమృతత్వం సిద్ధిస్తుంది.”
వేసవిలో నేనిచ్చిన రాజయోగోపన్యాసాలు విన్నవారు, నేనప్పుడు ఇంకొక విధమైన యోగాన్నిగూర్చి బోధించానని ఎరుగుదురు. ఇప్పటి యోగం ఇంద్రియనిగ్రహ సంబంధమైంది. ఇంద్రియాలు ఆత్మకు పూర్తిగా లొంగిపోయి మనస్సును చలింపజేసే శక్తిని కోల్పోయినప్పుడు యోగం సిద్ధించినట్లే. “హృదయంలో నెలకొని వుండే, వ్యర్థమైనకోరికలన్నీ ఎప్పుడు నశిస్తాయో, అప్పుడు మనిషి అమృతత్త్వాన్ని పొందుతాడు. ఈ శరీరం ఉండగానే బ్రహ్మైక్యాన్ని పొందుతాడు.” ఈ భూలోకంలోనే ఇది జరుగుతుంది. మరెక్కడనో కాదు.
ఈ సందర్భంలో రెండు మాటలు చెప్పవలసి ఉంది. ఈ వేదాంత మతం, మా దేశపు ఇతర తత్త్వవిద్యలు, మన ఇక్కడి కష్టసుఖాల ప్రసక్తినే పెట్టుకోక, ఎప్పుడో భవిష్యత్తులో రాబోవు విషయాలను గూర్చి విచారిస్తాయని అనేకులు చెబుతారు. ఈ భావం ఏమాత్రమూ సరికాదు. మా దేశపు వేదాంత విషయమేమీ తెలియని వారు, ఆ బోధ గ్రహింపజాలని మూఢులు చెప్పే మాట ఇది. నిజం దీనికి ప్రత్యక్ష విరుద్ధం. ఇతర లోకాలకు పోవడమనే మాటే మా వేదాంతులకు గిట్టదు. వా రా లోకాల్ని చిన్నచూపుతో చూస్తారు. అక్కడి జీవితం కేవలం మూణ్ణాళ్ళ ముచ్చట అనీ, అక్కడి నవ్వులు, ఏడ్పులు, మరణంతో అంతమొందుతుందనీ వాళ్లు చెబుతారు. బలహీనులమై ఉన్నంత వరకు, మన కీ అనుభవాలు తప్పవు. సత్యమనేదంతా ఇక్కడే వుంది. అదే మన ఆత్మ. మరొక విషయంకూడ బాగా నొక్కి చెప్పబడుతోంది. మనకు రావలసివున్న అనుభవాలను ఆత్మహత్య మూలంగా తప్పించుకో జాలం. కానీ, అనుసరించవలసిన మార్గాన్ని తెలుసుకోవడం కష్టం. మీ పాశ్చాత్యులలాగా, మా హిందువులు కూడా అభ్యాసయోగ్య మార్గాలనే చేపడతారు. కాని జీవితాన్ని గూర్చి, మన దృక్పథాలు వేర్వేరు. మంచి ఇల్లు, మంచి బట్టలు, మంచి భోజనం, మంచి వైజ్ఞానిక సంస్కృతి మొదలైనవే ఇందొకరికి పరమార్థం. జీవితమనే మాటకు ఇదే వారి అర్థం. ఇందు, అభ్యాసయోగ్యతపై దృష్టి కలదనడం నిస్సంశయం. హిందువుడికి ప్రపంచ జ్ఞానమంటే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. అలాంటి జీవితమంటే అతనికి ఆనందం. అమెరికాలో ఒక అజ్ఞేయవాది ఉండేవాడు. అతడు సజ్జనుడు. చక్కని వక్త. ఆస్తిక ధర్మజీవనం నిష్ప్రయోజనమని అతని బోధ. ఇతర లోకాలను పొందడానికై ఆరాటపడవద్దని చెబుతూ, అతడు ఈ ఉపమానం వాడేడు. “ఇక్కడ ఒక నారింజపండు ఉంది. దానిలోని రసాన్ని మనం పూర్తిగా పిండుకోవాలి.” నేనొకసారి అతనితో ఇలా అన్నాను. “మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నా దగ్గరకూడా ఒక పండు ఉంది. దాన్ని పూర్తిగా పిండుకోవడమే నా కోరికకూడ. మనకుకల భేదం పండ్లలోనే. మీరు కోరేది నారింజ. నాకు ఇష్టమైనది మామిడి. ఈ లోకంలో జీవించి, కడుపార తిని, త్రాగి, కొంచెం భౌతిక శాస్త్ర జ్ఞానం సంపాదిస్తే చాలని మీ భావం. కానీ ఆ భావం అందరికీ రుచిస్తుందనడానికి మీకేమి అధికారం ఉంది? నాకది ఏమాత్రం గిట్టదు. పండు, భూమిపై ఎలా పడుతుందో విద్యుత్తరంగం నా నరాలను ఎలా చలింపజేస్తుందో – ఇటువంటి వానిని తెలిసికోవడమే, నా పని అయితే, నేను ఆత్మహత్య చేసికొంటాను. వస్తు హృదయాంతరాళాన్ని, వస్తు మూలతత్త్వాన్ని గ్రహించాలని నా వాంఛ. మీరు గ్రహించాలనుకుంటున్నది జీవంయొక్క వ్యక్త రూపాలను, నేను గ్రహించాలనుకుంటున్నది జీవాన్నే. దాన్ని గ్రహించి, స్వర్గ నరక లోకాది పురాతన భావాలను వదిలిపెడతాను – ఈ లోకమేవిధంగా వుందో, ఆ విధంగానే అవికూడా ఉంటాయి. కాని వానిని గూర్చిన భావాలను – మనస్సు నుండి తరిమి వేయమని మా వేదాంతం నాకు బోధిస్తోంది. జీవంయొక్క హృదయాన్ని, దాని మూలసత్యాన్ని, దాని అర్థాన్ని నేను గ్రహించాలి. జీవంయొక్క వ్యాపారాలు, జీవంయొక్క వ్యక్త రూపాలు మాత్రం తెలిసిన నాకు తృప్తి లేదు. ప్రతి విషయానికి “ఏల?” అనే మూలకారణం నాకు కావాలి. “ఎట్లు” అనే దానిని బాలురు విచారించుకొందురు గాక! మీ దేశస్థుడొకడు చెప్పినట్లు ‘చుట్ట త్రాగేటప్పుడు నేనొక పుస్తకం వ్రాస్తే, అది చుట్టయొక్క శాస్త్రంగా ఉంటుంది’. భౌతికశాస్త్ర బుద్ధి ఉత్తమమైనదే, గౌరవించదగిందే. ఆ పరిశోధనలు ఫలవంతములగు గాక! ఆ పరిశోధకు లకు దైవం తోడ్పడు గాక! కాని, ‘అదే సర్వం’ అనడం మూర్ఖత్వం. జీవితంయొక్క ఉద్దేశాన్ని తెలిసికోవాలని ప్రయత్నించడం; ఈ సృష్టి తత్వాన్ని పరిశోధించటం. ఇది కదా ముఖ్యం? మీరు సేకరించిన జ్ఞానమంతా, అర్థరహితమనీ, ఆధారరహితమనీ నేను వాదింపవచ్చు. జీవంయొక్క వ్యక్త రూపాలను మీరు పరిశోధిస్తున్నారు. “కాని, జీవమనగా నేమి?” అన్న ప్రశ్నకు మీరు సమాధానమీయజాలరు. అవశ్యంగా మీ పరిశోధనలు మీరు సాగించుకోండి. నన్ను మాత్రం నా త్రోవను పోనిండు.
ఆచరణయోగ్య మార్గాన్ని అనుసరించడమే నా సంకల్పంకూడ. అందుకు సందేహంలేదు. మీ పాశ్చాత్యులదొక్కరిదే ఆచరణయోగ్య మార్గమనడం అర్థరహిత ప్రసంగం. మాదొక త్రోవ, మీదింకొక త్రోవ. అంతే భేదం. ఎన్నో రకాల మానవులున్నారు. ఎన్నో రకాల మనస్సు లున్నాయి. సత్యారాధనకై ఆజన్మం ఒంటికాలిపై నిలువవలసి వస్తే, అలా నిలిచేవారు మా దేశంలో ఉంటారు. ఎక్కడనో, ఒక అడవి మనుష్యుల దేశంలో ఒక బంగారు గని కలదని పాశ్చాత్యులకు తెలిసుంటే, అన్ని అపాయాలకు తెగించి, వేనవేల జనులు అక్కడకి పోతారు. ఆ బంగారం, ఎవరో ఒకరికే లభించడం తెలిసీ, అందరూ ఆశతో అక్కడికి వెడతారు. తమకు ఆత్మలు ఉన్నాయని వారు విన్నారు కానీ, వానిని ప్రార్న ఆలయాధికారుల సంరక్షణ క్రింద ఉంచుతారు. ప్రాచ్య దేశీయుడు అడవి మనుష్యులుండే చోటికి పోవడం అపాయకరమని మానుకొంటాడు. కాని ఒక మహాపర్వతాగ్రాన ఒక సిద్ధ పురుషుడు వున్నాడని, అతడు తనకు ఆత్మజ్ఞానం ప్రసాదించగలడని తెలిస్తే, అతడు చావుకుకూడ తెగించి అతని దగ్గరకి వెళ్లాలనుకుంటాడు. ఈ రెండు రకాల వాళ్లూ, ఆచరణయోగ్యమైన మార్గాలనే పట్టుతున్నారు. జీవితమంతా ఈ లోకంలోనే ఇమిడి వున్నట్లు భావించడమే పొరపాటు. మీది క్షణభంగురమైన ఇంద్రియభోగాసక్తి. అది కేవలం అనిత్యం. నిరంతర క్లేశమూలం. నాది శాశ్వత శాంతిమూలం.
మీ భావం తప్పు అని నేననను. తప్పక మీరు దాన్ని అనుసరించండి. దానివల్ల ఎంతో మేలు, ఎంతో సుఖం కలుగవచ్చు. కాని నా భావాన్ని తప్పు అనకండి. అదికూడ ఒక విధంగా ఆచరణయోగ్యం. మీ ఒక్కరిదే ఆచరణయోగ్య మార్గమనే వాదం యుక్తియుక్తం కాదు. మీదొక విధంగా ఆచరణయోగ్యం. నాదింకో విధంగా ఆచరణయోగ్యం. మన ఇద్దరి దృక్పథాలనుండి, ఆచరణయోగ్యమైన ఒకే మార్గాన్ని, అందరం అనుసరిస్తే ఎంత బాగుంటుంది? భౌతికశాస్త్ర మార్గంలోను, ఆధ్యాత్మిక మార్గంలోను కూడా, ఆచరణయోగ్య మార్గమవలంబించే వారు కొందరున్నారు. కాలక్రమంలో మానవులంతా, అట్లే, రెండు మార్గాలలోను సమానాభివృద్ధి చూపిస్తారని నా ఆశ. నీళ్లు సలసల కాగనారంభించినపుడు మొదట ఒక బుడగ, తర్వాత ఇంకొకటి, అటుపై మరొకటి పైకి లేస్తుంది. కొంతసేపటికి ఈ బుడగలన్నీ ఏకమై, మహాసంచలనం చూపట్టును. లోకంకూడ అట్టిదే. ప్రతి మనుష్యుడు ఒక బుడగ. జాతులు పెక్కుబుడగల వంటివి. ఈ జాతులు క్రమక్రమంగా కలుస్తున్నాయి. ఇలా జరుగుతూ పోగా, భిన్నత్వం నశించి, మనమందరం చేరబోవు ఆ ఏకత్వం గోచరించే దినం వచ్చి తీరుతుందని నా విశ్వాసం. ప్రతివాడు, భౌతికలోకంలో, ఆధ్యాత్మిక లోకంలోకూడ, ఆచరణయోగ్యమైన మార్గాన్ని అనుసరిస్తాడు. అప్పు డా ఏకత్వం, ఏకత్వ మాధుర్యం లోకమునంతా ఆవరిస్తుంది. మానవజాతి అంతా, ఒక్కుమ్మడిగా జీవన్ముక్తిని పొందుతుంది. మన పరస్పర ద్వేషంతో, అసూయతో, ప్రేమతో, సహకారంతో, ఆ గమ్యస్థానాన్ని చేరడంకోసమే మనమంతా పోరాడు తున్నాం. మహావాహిని సముద్రం దెస ప్రవహిస్తోంది. మనల నందరినీ అది ఈడ్చుకొని పోతోంది. గడ్డి పోచలలాగా, కాగితపు ముక్కలలాగ, మనం ఇటు అటు అగమ్యంగా కొట్టుకొనిపోతున్నా చివరకు, చైతన్యానందసాగరాన్ని చేరడం తథ్యం.